“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

21, జూన్ 2017, బుధవారం

Exit the Dragon - కుంగ్ ఫూ - తాయ్ ఛీల పని అయిపోయిందా??


ఫాంటసీ కి రియాలిటీ కి పోటీ జరిగితే ఎలా ఉంటుందో చూద్దామా?

ఏప్రిల్ నెలలో ఒక మార్షల్ ఆర్ట్స్ పోటీ జరిగింది. అది చైనాలోని చెంగ్ డు నగరంలో జరిగింది. అది ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఎందుకంటే - అందులో పాల్గొన్నది చిత్తుగా ఓడిపోయినదీ చైనాలో టాప్ టెన్ మార్షల్ ఆర్ట్స్ మాస్టర్స్ లో ఒకడుగా పేరు పొందిన వీలీ కావడం. పోనీ ఓడిపొయినది ఎవరిచేతిలో అంటే, ఒక అనామక MMA ఫైటర్ చేతిలో. అతని పేరు జు జియావో డాంగ్.

ఈ ఫైట్ పదే పది సెకన్లు నడిచింది. ఇందులో అందరూ ఆశించినట్లు తైఛీ మాస్టర్ ఏదో గొప్ప గొప్ప టెక్నిక్స్ ఏమీ ప్రదర్శించలేదు. అసలు అతనా విధంగా చెయ్యడానికి అవకాశమే ఇవ్వలేదు జు. వరుస పంచ్ లతో అతన్ని దిమ్మెరపోయేటట్లు చేసి నేలకూల్చేశాడు. ఈ వీడియోలో ఇతను వాడిన టెక్నిక్ ను MMA లో ground and pound అంటారు.

ఈ వీడియో చూచి చైనా మొత్తం గడగడలాడి పోయింది. కుంగ్ ఫూ ప్రపంచం మొత్తం కోపంతో రగిలిపోతున్నది. ఎందుకంటే ఈ మ్యాచ్ గెలిచిన తర్వాత 'జు' అనేక సంచలనాత్మక ప్రకటనలు చేశాడు.

అసలు కుంగ్ ఫూ, తైచీలు దొంగ విద్యలనీ, అవి ప్రాక్టికల్ గా పని చెయ్యవనీ, గత 500 ల ఏళ్ళుగా చైనా వీటి పేరు చెప్పి ప్రపంచాన్ని మోసం చేస్తున్నదనీ అతను బాహాటంగా చెప్పాడు. చైనాలో జరిగే మార్షల్ ఆర్ట్స్ కాంపిటీషన్ మ్యాచ్ లన్నీ మ్యాచ్ ఫిక్సింగులేననీ, ఎవరు గెలవాలో అంతా ముందే డిసైడ్ అయి ఉంటుందనీ చెప్పేశాడు. ఇదంతా పెద్ద మాఫియా వ్యాపారమనీ, రియాలిటీకి దూరంగా ఉండే మాయ టెక్నిక్కు లతో కుంగ్ ఫూ సినిమాలు తీసి ప్రపంచవ్యాప్తంగా చైనా పెద్ద వ్యాపారం చేస్తున్నదనీ, అసలు కుంగ్ ఫూ, తాయ్ ఛీ లు డెమోలు ఇవ్వడానికి తప్ప రియల్ ఫైట్ లో ఏమాత్రం పని చెయ్యవనీ తేల్చి పారేశాడు.

చాలా ఓపన్ గా మాట్లాడిన అతని ఇంటర్వ్యూ ఇక్కడ చూడండి.

https://www.youtube.com/watch?v=cQxxt0H8DJM

ఈ మ్యాచ్ అయ్యాక చైనాలో అందరూ అతన్ని ఎటాక్ చెయ్యడం మొదలు పెట్టారు. చైనా వాడివయ్యుండీ అంతర్జాతీయంగా చైనా పరువు తీశావంటూ అతన్ని తిట్టడం మొదలుపెట్టారు. చివరకు చైనా ప్రభుత్వం కూడా అతన్ని టార్గెట్ చెయ్యసాగింది. ఈ దాడులు భరించలేక అతను ఇప్పుడు అండర్ గ్రౌండ్ కు వెళ్ళిపోయాడు. ఏమయ్యాడో తెలియడం లేదు. చైనా అతన్ని చంపేసినా చంపేసి ఉండవచ్చని ఊహాగానాలు సాగుతున్నాయి. కానీ ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు. చైనాను వదిలేసి అమెరికాకు వచ్చి సెటిలై పొమ్మని అనేకమంది అమెరికన్స్ అతన్ని కోరుతున్నారు.

ఈ మ్యాచ్ చూడాలని ఉంటె ఈ క్రింది లింకులు చూడండి.


ఈ వీడియో క్రింద ఉన్న కామెంట్స్ అన్నీ చదవండి. కడుపుబ్బా నవ్వుకోవచ్చు.

న్యూయార్క్ టైమ్స్ లో దీనిపైన వచ్చిన న్యూస్ ఇక్కడ చదవండి.ప్రపంచ వ్యాప్తంగా కుంగ్ ఫూ,  తాయ్ ఛీల మీద కోట్లాది డాలర్ల వ్యాపారాలు జరుగుతున్నాయి. అవన్నీ ఇప్పుడు కుప్పకూలే పరిస్థితి ఒక్క వీడియోతో వచ్చేసింది. ఒక్క అమెరికాలోనే వేలాది కుంగ్ ఫూ స్కూల్స్ ఉన్నాయి. వాటిని ఇప్పుడు అందరూ ఎగతాళి చేస్తున్నారు. కుంగ్ ఫూలో అంతా షో బిజినెస్ ఎక్కువనేది నిజమే. పనికిరాని ఫ్లవరీ మూమెంట్స్ దానిలో ఎన్నో ఉంటాయి. అవన్నీ స్ట్రీట్ ఫైట్ లో ఎందుకూ పనికిరావు. మన స్కూళ్ళలో కాలేజీలలో నేర్పే కరాటే కుంగ్ ఫూలు కూడా ఇంతే. మన పిల్లలకు ఏవో నాలుగు మూమెంట్స్ నేర్పి వాళ్లకు కరాటే మొత్తం వచ్చేసింది ఇక వాళ్ళు తమను తాము డిఫెండ్ చేసుకోగలరు అనుకోవడం పెద్ద భ్రమ. ఇదేమాట నేను కొన్నేళ్ళ క్రితమే వ్రాశాను.

అమెరికాలో కూడా వీటిమీద మంచి బిజినెస్ సాగుతున్నది. ఈ మధ్యనే నేను ఒక తెలిసిన వాళ్ళ అబ్బాయిని కలిశాను. మాటల మధ్యలో అతను కరాటే లో బ్లాక్ బెల్ట్ నని అన్నాడు. నాకు జాలేసింది. అతన్ని చూస్తే ఆ ఫిట్నెస్ ఏమాత్రం కనిపించకపోగా, గాలి గట్టిగా వీస్తే ఎగిరి పదిచోట్ల పడేటట్లు ఉన్నాడు. అమెరికాలో కూడా డబ్బులిస్తే బెల్టులిచ్చే  ఫేక్ మాస్టర్లున్నారని నాకర్ధమైంది.

1970 ప్రాంతాలలోనే బ్రూస్ లీ ఇదే మాట అన్నాడు. మార్షల్ ఆర్ట్స్ అనేవి అనవసరమైన కటాస్, లేదా ఫామ్స్ తో నిండిపోయి ప్రాక్టికాలిటీకి దూరం అయిపోయాయని, ఈ ధోరణి మారవలసిన అవసరం ఉన్నదనీ అతను అప్పుడే అనేవాడు. అందుకే పనికొచ్చే అన్ని స్టైల్స్ లో నుంచీ టెక్నిక్స్ ను కలపాలనీ, ఎవరి పర్సనల్ స్టైల్ వాళ్ళు తయారు చేసుకోవాలనీ అతను అనేవాడు.అతను మొదలు పెట్టిన జీత్ కునే డో కూడా ఒక రకమైన MMA నే.

MMA (mixed martial arts) కు అందుకే బ్రూస్ లీని ఆద్యునిగా భావిస్తారు చాలామంది.

ఇప్పుడు మార్షల్ ఆర్ట్స్ ప్రపంచాన్ని ఊపుతున్న మాట MMA. అమెరికాలో ఇది శరవేగంతో పుంజుకుంటోంది. MMA లో ఒక స్టైల్ అయిన బ్రెజిలియన్ జుజుట్సు (BJJ) చాలా ఫాస్ట్ గా పుంజుకుంటోంది. పాతకాలం నుంచీ ఉన్న కుంగ్ ఫూ తైచీ స్కూల్స్ మూతపడుతున్నాయి. హాంగ్ కాంగ్ లోనే కుంగ్ ఫూ ఎవరూ నేర్చుకోవడం లేదంటే పరిస్థితి ఎలా ఉందో ఆలోచించవచ్చు.

నిజానికి నా అభిప్రాయం ఏమంటే - కుంగ్ ఫూ ఫామ్స్ చక్కగా చేసినంత మాత్రాన గొప్ప ఫైటర్ కావడం సాధ్యం కాదు.కటాస్ వచ్చినంత మాత్రాన ఫైటింగ్ రాదు. ఈ రెండూ రెండు వేర్వేరు పనులు. అలాగే తైచీ కూడా, తైచీ అనేది ప్రాక్టికల్ ఫైట్స్ కు పనికిరాదనేది వాస్తవం. అది ఉత్త హెల్త్ ఎక్సర్ సైజ్ మాత్రమే. దానిని రియల్ ఫైట్ లో వాడాలంటే ఎన్నో ఏళ్ళ అనుభవం ఉండాలి, ఇంకా, ఇతర స్టైల్స్ లోనుంచి కొన్ని టెక్నిక్స్ కలపాలి. అప్పుడే అది రియల్ ఫైట్ లో ఉపయోగపడుతుంది. లేకుంటే కుదరదు.

'ఎంటర్ ది డ్రాగన్ ' తో ఒక చైనీయుడు ప్రపంచాన్ని ఒక ఊపు ఊపితే, ఈ వీడియోతో మరొక చైనీయుడు 'ఎక్జిట్ ది డ్రాగన్' అంటూ, చైనీస్ ట్రెడిషనల్ మార్షల్ ఆర్ట్స్ మీద ఉన్న మాయా దుప్పటిని తీసి పారేశాడు.

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఈ రెండు విద్యల అభిమానులు ఇప్పుడు ఏం చేస్తారో చూడాలి మరి.