నిత్యజీవితంలో ప్రతిఫలించని జ్ఞానం నిరర్ధకం

23, సెప్టెంబర్ 2017, శనివారం

ప్యూర్టో రికోలో హరికేన్ మరియా భీభత్సం - ఇదీ అమావాస్య పరిధిలోనే












అమావాస్య ప్రభావంలోనే ఇంకొక ఉపద్రవం ఇప్పుడు అట్లాంటిక్ ఫసిఫిక్ సముద్రాల మధ్యన ఉన్న దీవులను హడలెత్తిస్తోంది.  దానిపేరే హరికేన్ 'మరియా'. గత రెండు రోజులనుంచీ ఇది కరీబియన్ దీవులను, తుర్క్స్, కైకోస్ దీవులను, డొమినికన్ రిపబ్లిక్ ను వణికించింది. ఇప్పుడు ప్యూర్టో రికో పై తన విధ్వంసాన్ని చూపిస్తోంది. నిన్న ఆ ప్రాంతంలో కురిసిన వర్షాలకు రోడ్లన్నీ జలమయమయ్యాయి. దాదాపు ముప్ఫై లక్షలమంది కరెంట్ లేక చీకటిలో మగ్గుతున్నారు. కరెంట్ మళ్ళీ రావడానికి కొన్ని నెలలు పట్టవచ్చని అంటున్నారు. ఆస్పత్రులలో రోగుల పరిస్థితి పరమ దారుణంగా ఉంది.

ప్రస్తుతం కరెంట్ లేక ప్యూర్టో రికో చీకట్లో ఉంది. కమ్యూనికేషన్ నెట్ వర్క్ లు 15% శాతం మాత్రమే పనిచేస్తున్నాయి. రోడ్లన్నీ జలమయమయ్యాయి. అసలైన ప్రమాదం ఇవన్నీ కావు. ఆ అసలైన ప్రమాదంతో పోలిస్తే ఇవన్నీ చాలా చిన్నవి. అదేంటంటే - గాజతకా నది మీదున్న ఒక డ్యాం ప్రస్తుతం ఈ 'మరియా' తుఫాన్ దెబ్బకు బీటలు వారింది. ఈ డ్యాం గనుక పగిలితే జరిగే జన నష్టం ఊహలకు మించి ఉంటుంది. అందుకే హుటాహుటిన ఇప్పటికి దాదాపు 70,000 మందిని ఆ ప్రాంతమంతా ఖాళీ చేయించి బస్సులలో దూరంగా తరలిస్తున్నారు. 'Total destruction', 'Most dangerous situation' అని అధికారులు దీని గురించి అంటున్నారు.

ఇది కూడా సూర్యగ్రహణ ప్రభావమే. ఇది కూడా అమావాస్య పరిధిలోనే జరగడం గమనార్హం. సూర్య గ్రహణ "ఆస్ట్రో కార్టోగ్రాఫ్" గీతలు ఈ ప్రాంతం మీదనుంచే పోతూ ఉండటం క్లియర్ గా చూడవచ్చు.
read more " ప్యూర్టో రికోలో హరికేన్ మరియా భీభత్సం - ఇదీ అమావాస్య పరిధిలోనే "

21, సెప్టెంబర్ 2017, గురువారం

మా పుస్తకాలు - Secret of Sri Vidya E Book

పంచవటి మబ్లికేషన్స్ నుంచి ఐదో పుస్తకంగా (మూడో ఈ బుక్) Secret of Sri Vidya E Book విడుదలైంది. ఈ పుస్తకం అమెరికా నుంచి 1-6-2017 న వెలువడింది.

ఇది 'శ్రీవిద్యా రహస్యం' తెలుగు పుస్తకానికి ఇంగ్లీషు అనువాదం. అయితే తెలుగు భాషలోని ఛందోబద్ధమైన పద్యాలను ఇంగ్లీషులోకి తేవడం కష్టం గనుక, భావం ఏ మాత్రం చెడకుండా వచనంలోనే ఇంగ్లీషులోకి మార్చాము.

ఇది కూడా Google play books నుంచి, మరియు amazon.com నుంచి అందుబాటులో ఉంది.
read more " మా పుస్తకాలు - Secret of Sri Vidya E Book "

మా పుస్తకాలు - తారా స్తోత్రం E Book

పంచవటీ పబ్లికేషన్స్ నుంచి వచ్చిన నాలుగో పుస్తకంగా (రెండవ ఈ బుక్ ) -  11-5-2017 న తారా స్తోత్రం E Book రిలీజైంది. దీనిని అమెరికా నుంచి విడుదల చెయ్యడం జరిగింది.

Google play books నుంచి ఈ పుస్తకం అందుబాటులో ఉన్నది.
read more " మా పుస్తకాలు - తారా స్తోత్రం E Book "

మా పుస్తకాలు - శ్రీవిద్యా రహస్యం E Book

పాపులర్ డిమాండ్ ను బట్టి, 26-7-2016 న "శ్రీవిద్యా రహస్యం E Book" విడుదల చెయ్యబడింది. ఇందులో 61 పద్యాలతో కూడిన ఇంకొక అధ్యాయం అదనంగా చేర్చబడింది.

Google play books నుంచి ఇది అందుబాటులో ఉన్నది.
read more " మా పుస్తకాలు - శ్రీవిద్యా రహస్యం E Book "

మా పుస్తకాలు - తారా స్తోత్రం

పంచవటి పబ్లికేషన్స్ నుంచి వెలువడిన రెండవ పుస్తకం - తారా స్తోత్రం. ఈ పుస్తకం 4-6-2015 న విజయవాడలో ఆవిష్కరింపబడింది.

ఇందులో - మొత్తం 108 పాదాలతో కూడిన 27 సంస్కృత శ్లోకములు, వాటికి దాదాపు 400 తెలుగు పద్యములతో కూడిన సరళమైన తెలుగు వివరణ ఇవ్వబడింది.

ఈ పుస్తకం పేరుకు దశమహావిద్యలలో ఒకరైన తారాదేవి యొక్క స్తోత్రం అయినప్పటికీ, ఇందులో సందర్భోచితంగా అనేకములైన తంత్ర సాధనా రహస్యాలు వివరించబడినాయి.

నిజమైన తంత్ర సాధనా రహస్యాలను అర్ధం చేసుకోవాలనుకునే సాధకులకు ఈ పుస్తకం ఒక పెన్నిధి వంటిది.

ఇది కూడా త్వరలో పునర్ముద్రణకు రాబోతున్నది.

ఇది Google play books నుంచి అందుబాటులో ఉన్నది.
read more " మా పుస్తకాలు - తారా స్తోత్రం "

మా పుస్తకాలు - శ్రీవిద్యా రహస్యం

మా పంచవటి పబ్లికేషన్స్ నుంచి మొదటి పుస్తకంగా వచ్చినది -  'శ్రీవిద్యా రహస్యం'. ఈ పుస్తకం 28-12-2014 న రిలీజైంది. ఇండియాలోనూ విదేశాలలోనూ ఈ పుస్తకం ఎంతోమంది జిజ్ఞాసువులను కదిలించింది. ఆలోచింపజేసింది. మన సనాతన ధర్మాన్ని సరియైన విధానంలో గ్రహించడానికి ఈ పుస్తకం వేలాదిమందికి ఉపయోగపడింది.

ఇందులో దాదాపు 1400 తెలుగు పద్యాలు, వాటికి సులభమైన తెలుగుభాషలో వివరణా ఉంటాయి.

నిజమైన ఆధ్యాత్మికత అంటే ఏమిటి? మన ఉపనిషత్తులలో చెప్పబడిన తాత్విక సాధనా రహస్యాలేమిటి? దేవీ ఉపాసనా రహస్యాలేమిటి? వేదము, తంత్రములలో ఉన్న సాధనావిధానాలేమిటి? నిజమైన శ్రీవిద్యోపాసన ఎలా ఉంటుంది? దానిని ఎలా చెయ్యాలి? దానికి కావలసిన అర్హతలేమిటి? దానిని బోధించే గురువులు ఎలా ఉంటారు? ఎలా ఉండాలి? గురుశిష్యులకు ఉండవలసిన అర్హతలేమిటి? మొదలైన అనేక విషయాలపైన సమగ్రమైన సమాచారం ఇందులో పొందు పరచబడింది.

ప్రధమ ముద్రణను దిగ్విజయంగా ముగించుకున్న ఈ పుస్తకం ఇప్పుడు పబ్లిక్ డిమాండ్ వల్ల రెండో ముద్రణకు సిద్ధం అవుతోంది.

ఇది google play books నుంచి అందుబాటులో ఉన్నది.
read more " మా పుస్తకాలు - శ్రీవిద్యా రహస్యం "

20, సెప్టెంబర్ 2017, బుధవారం

కాలగ్రస్త యోగం - 21-8-2017 నుంచి 6-2-2018 వరకూ

కాలసర్పయోగం అనే పదం మీరు విని ఉంటారు. కానీ కాలగ్రస్తయోగం అనే పదం విని ఉండరు. ఎందుకంటే ఇది నేను కాయిన్ చేసిన పదం కాబట్టి.

అన్ని గ్రహాలూ రాహుకేతువుల మధ్యలో ఉంటే దానిని కాలసర్పయోగం అంటామని మనకు తెలుసు. కానీ అవే గ్రహాలు కేతురాహువుల మధ్యన ఉంటే దానిని సాధారణంగా అపసవ్య కాలసర్పయోగం అంటున్నారు. కొన్నేళ్ళ క్రితం నేను కూడా దీనిపైన కొన్ని పోస్టులు వ్రాశాను. కానీ ఈ పదం నాకు సమ్మతం కాదు. అందుకని నేను దీనిని కాలగ్రస్తయోగం అంటున్నాను. కారణం ఎందుకో ఈ పోస్టులో క్లుప్తంగా వివరిస్తాను.

ప్రస్తుతం ఈ యోగం అంతరిక్షంలోని గ్రహాలమధ్యన ఉన్నదని గమనించండి.

కాలసర్పయోగంలో లాగా ఈ యోగంలో, అన్ని గ్రహాలూ రాహువు నోటిలో పడే దిశగా ప్రయాణించవు. రాహుకేతువుల శరీరం మీద ఉన్నట్లుగా అవి ఉంటాయి. లేదా వాటి పొట్టలో ఉన్నట్లుగా అనిపిస్తాయి. అందుకే దీనిని కాలగ్రస్తయోగం అని నేనంటాను.

దీని ఫలితాలు కాలసర్పయోగం కంటే భిన్నమైన రీతిలో ఉంటాయి. ప్రస్తుతం 21-8-2017 నుంచి 6-2-2018 వరకూ 165 రోజులపాటు ఈ యోగం ఖగోళంలో ఉంటున్నది.

కనుక ఈ సమయంలో ప్రపంచ వ్యాప్తంగా మానవ జీవితాలలో అనేక ఊహించని మార్పులు కలుగుతాయి. అనేక కష్టనష్టాలకు ప్రజలంతా గురౌతారు. ఈ కష్టనష్టాలు ఆయా జాతకాలను బట్టి, వారివారి జాతకాలలో జరుగుతున్న దశలను బట్టి ఎవరికి వారికి విభిన్నంగా ఉంటాయి. అయితే మధ్య మధ్యలో చంద్రుడొక్కడే ఈ రాహుకేతువుల పట్టు నుంచి నెలలో పన్నెండు రోజుల పాటు బయటకు వస్తూ ఉంటాడు. అలా వచ్చినపుడు మాత్రం మళ్ళీ మామూలుగా కొంచం రిలీఫ్ గా ఉంటుంది. మళ్ళీ చంద్రుడు ఈ పట్టుయొక్క పరిధిలోకి రావడం తోనే ఈ యోగం పనిచెయ్యడం మొదలు పెడుతుంది. మళ్ళీ జనాలకు ఖర్మ కాలుతుంది.

ఈ 165 రోజుల సమయంలో తమతమ పూర్వపు చెడుకర్మలను ప్రజలందరూ రకరకాలుగా అనుభవించే ముఖ్యమైన సమయాలను (ఈ రోజునుంచి ముందుకు) ఇక్కడ ఇస్తున్నాను. గమనించండి.

25-9-17 to 26-9-17

30-9-17 to 31-9-17

9-10-17 to 10-10-17

13-10-17 to 14-10-17

17-10-17 to 20-10-17

22-10-17 to 28-10-17

26-10-17 to 28-11-17 -- ఈ మొత్తం కాలవ్యవధిలో 33 రోజుల ఈ కాలం చాలా గడ్డుకాలం. మళ్ళీ ఇందులో ముఖ్యమైన సమయాలు. 7-11-17 to 10-11-17 మళ్ళీ 16-11-17 to 26-11-17.

5-12-2017 to 8-12-2017

16-12-17 to 20-12-17

1-1-18 to 4-1-18

12-1-18 to 16-1-18

28-1-18 to 1-2-18

ఈ టైంలో, ఊహించని ఉపద్రవాలను ప్రజలు ఎదుర్కొంటారు. అదంతా వారివారి పూర్వకర్మననుసరించి ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా జరుగుతుంది. ఈ సమయాలలో నేను చెప్పినవి జరుగుతాయో లేదో మీమీ జీవితాలలో, మీమీ జాతకాలలో మీరే గమనించుకోండి మరి !!
read more " కాలగ్రస్త యోగం - 21-8-2017 నుంచి 6-2-2018 వరకూ "

Mexico Earth Quake - మళ్ళీ రుజువైన అమావాస్య ప్రభావం






ఈరోజు అమావాస్య. నిన్న సెంట్రల్ మెక్సికోలో 7.1 స్థాయిలో భూకంపం వచ్చింది. దాదాపు 250 మంది చనిపోయారని, వందలాది ఇళ్ళు పేకమేడల్లా నేలకూలిపోయాయని అంటున్నారు. ఇంకా చాలామంది శిధిలాల క్రింద చిక్కుకుని ఉండవచ్చని అంచనా. సహాయకార్యక్రమాలు జరుగుతున్నాయి.

ఈ విధంగా అమావాస్య ప్రభావం మళ్ళీ నిజమైంది. 

ఈ ప్రదేశం 21-8-2017 న వచ్చిన సూర్యగ్రహణ సమయంలో  వేసిన 'ఆస్ట్రో కార్టో గ్రాఫ్'  లోని కుజుని రేఖకు దగ్గరలో ఉండటం గమనార్హం. కుజ శనుల ప్రభావం వల్లనే భూకంపాలు వస్తాయని ఇంతకు ముందు చాలాసార్లు చాలా పోస్టులలో ఉదాహరణలతో సహా నిరూపించాను.

సూర్యగ్రహణ ప్రభావం గురించి మేము పోస్ట్ వ్రాసినప్పుడు చాలామంది పెదవి విరిచారు. ఇలాంటి గ్రహణాలు చాలా వచ్చాయి పోయాయి. ఇవన్నీ జరుగుతాయా?పెడతాయా? అని. కానీ ఆ తర్వాత కొద్ది సమయంలోనే హార్వే, ఇర్మా తుఫానులు వచ్చాయి. అమెరికాలో కొన్ని రాష్ట్రాలు అతలాకుతలం అయ్యాయి. మళ్ళీ ఇప్పుడు ఈ భూకంపం వచ్చింది. తీవ్రంగా జననష్టమూ ఆస్తినష్టమూ జరిగాయి. ఇవన్నీ ఖచ్చితంగా సంపూర్ణ సూర్యగ్రహణం ప్రభావమే అనిపించడం లేదా?

అమెరికాలో హరికేన్లు మామూలే. ఇందులో విచిత్రం ఏముంది? అని మీరనవచ్చు. ఇవి మామూలు తుఫానులు కావు. 2005 లో వచ్చిన విల్మా తుఫాన్ తర్వాత హార్వే అంత భీకర తుఫాన్ ఈ పన్నెండేళ్ళలో రాలేదు. గురువుగారు రాశిచక్రాన్ని చుట్టి రావడానికి 12 ఏళ్ళు పడుతుందన్న విషయం గుర్తుంటే దీని వెనుక ఉన్న సైకిల్ అర్ధమౌతుంది.

ఇర్మా తుఫాన్ కూడా 2005 లో వచ్చిన కత్రినా తర్వాత అంతటి ఘోరమైన తుఫాన్. ఇది కూడా దాదాపుగా 12 ఏళ్ళ తేడాతో వచ్చింది మరి.

సెప్టెంబర్ 7 న వచ్చిన భూకంపం తర్వాత రెండు వారాల వ్యవధిలో మెక్సికోలో ఇది రెండో భూకంపం. గమనించండి.

Solar eclips2.jpg

25-4-2017 న నేను అమెరికాలో ఉన్నప్పుడు పోస్ట్ చేసిన "సంపూర్ణ సూర్యగ్రహణం - 2017 ఫలితాలు ఎలా ఉండవచ్చు?" అనే పోస్ట్ లో ఇలా వ్రాశాము.

ఈ రేఖమీద కుజుడు గనుక ఉంటె, అది రాజకీయ యుద్ధాలను సూచిస్తుంది. అంతేగాక అగ్నిప్రమాదాలు, పేలుళ్లు, భూకంపాలు, పెద్ద పెద్ద యాక్సిడెంట్లు, ప్రముఖుల మరణాలు, సైనిక చర్యలు, మాస్ కిల్లింగ్స్ ను సూచిస్తుంది.

సరిగ్గా ఇప్పుడు భూకంపం వచ్చిన ప్రదేశమూ, మొన్నటికి మొన్న రెండు తుఫానులు అమెరికా దక్షిణ రాష్ట్రాలను ఊపిన ప్రదేశమూ, ఈ గ్రాఫ్ లో కుజ, రాహు రేఖలు పోతున్న ప్రాంతంగా ఉన్నది చూడండి.

అంతేగాక - "నెప్ట్యూన్ మరియు చతుర్ధం పసిఫిక్ ప్రాంతంలో పడుతున్నది ఇందువల్ల ఈ ప్రాంతలో భూకంపాలు రావచ్చు. Pacific ring of fire మీద పడుతున్న ఈ గ్రహణపు నీడ వల్ల ఆ ప్రాంతంలో భూకంపాలు రావచ్చని సూచిస్తున్నది. ఈ ప్రాంతం భూకంపాలకు పెట్టింది పేరని గుర్తుంచుకోవాలి" అని అప్పుడు వ్రాసిన విషయాన్నీ గమనించాలి.

ఇంకా గమనించండి.

"సెప్టెంబర్ మొదటి వారంలో కుజుడు ఈ గ్రహణ డిగ్రీని దాటుతాడు. కనుక ఆ సమయంలో అనేక సంఘటనలు జరుగుతాయి" అంటూ వ్రాసినది ఎలా ఖచ్చితంగా జరిగిందో చూడండి. సెప్టెంబర్ మొదటి వారంలోనే 'ఇర్మా ' తుఫాన్ అమెరికా దక్షిణ ప్రాంతాన్ని ఒక ఊపు ఊపింది. ఇదే సమయంలో మెక్సికోలో 8.1 స్థాయిలో భూకంపం వచ్చింది.

ఈ సూర్యగ్రహణ ప్రభావం అప్పుడే అయిపోలేదు. ఇంకా మరికొన్ని మిగిలి ఉన్నాయి. వేచి చూడండి మరి.
read more " Mexico Earth Quake - మళ్ళీ రుజువైన అమావాస్య ప్రభావం "

19, సెప్టెంబర్ 2017, మంగళవారం

ఛిన్నమస్తా సాధన - 9 (యోగతంత్ర రహస్యాలు)

బెంగాల్లో ప్రచారంలో ఉన్నట్టి శాక్త మహాభాగవతంలో ఛిన్నమస్తా దేవి తూర్పు దిక్కుకు అధిదేవత అని ఉన్నది. తన చుట్టూ దశ దిశలలో సతీదేవి ప్రత్యక్షమైనప్పుడు, ఈ పదిమంది శక్తులు ఎవరని సతీదేవిని శివుడు ప్రశ్నిస్తాడు. దానికి ఆమె జవాబు చెబుతూ  తూర్పుదిక్కున ఉన్న భయంకర శక్తి ఛిన్నమస్త అంటూ మిగతా దిక్కులలో ఎవరెవరున్నారో చెబుతుంది. మనకు ప్రస్తుతం అవి అవసరం లేదుగాని తూర్పు దిక్కుకు ఛిన్నమస్త అధిపతి యని తెలుస్తున్నది.

తూర్పుదిక్కున ఉన్న దేవతకు 'ఉష' అని వేదాలలో  పేరున్నది.ఈమె సూర్యుని కంటే ముందు ఉదయించే వెలుగు. ఈ వెలుగుతోనే లోకం మేలుకోవడం మొదలౌతుంది. కానీ సాయంత్రానికి సూర్యునితో బాటే ఈమె అస్తమిస్తుంది. సూర్యునితో కలసి నడుస్తుంది గనుక ఈమెకు సూర్యదేవుని భార్య అని ఇంకొక పేరున్నది. ఈ రకంగా ఈమె ప్రతిరోజూ ఉదయిస్తూ (జన్మిస్తూ), అస్తమిస్తూ (మరణిస్తూ) ఉంటుంది. కనుక పుట్టుక చావులనేవి ఈమెకు ఒక ఆట వంటివి. ఎందుకంటే ఈమె ప్రతిరోజూ ఈ స్థితులలో నడుస్తూ ఉంటుంది.


అలాగే ఛిన్నమస్తా దేవత కూడా జీవనానికీ మరణానికీ అధిదేవతగా తంత్రాలలో ఆరాధింపబడుతూ ఉన్నది. ఈమె అనుక్షణం మరణిస్తూ ఉంటుంది కానీ అనుక్షణం జీవించే ఉంటుంది. అలాగే ఈమెను ఆరాధించే యోగులు తాంత్రికులు కూడా ప్రతిరోజూ మరణిస్తూ మళ్ళీ జీవిస్తూ ఉంటారు. ఇది తమాషాకు చెప్పడం లేదు. ఇది వాస్తవం. సమాధిస్థితిని అందుకోవడం అంటే మరణించడమే. అది ఒకరకమైన చావే. దానిలోనుంచి బయటకు రావడం అంటే మళ్ళీ జీవించడమే. కనుక సమాధి స్థితిని అందుకున్న ఉపాసకులు చచ్చి బ్రతికిన వారే. రోజూ చస్తూ బ్రతికేది వీరే. బ్రతికి ఉండగానే చావడమే సమాధి. ఇదే జీవన్ముక్తి అంటే అసలైన అర్ధం.

ఈ కోణంలో చూస్తే ఈ దేవతకూ వేదాలలో చెప్పబడిన 'ఉషా' అనే దేవతకూ పోలికలున్నాయి.

ఇకపోతే,గుహ్యాతిగుహ్య తంత్రం లోనూ,తోడల తంత్రంలోనూ, ఈమె విష్ణువు యొక్క దశావతారాలలోని నరసింహావతారంతో పోల్చబడింది. విష్ణు అవతారాలలో నరసింహావతారం చాలా ప్రాచీనమైనది. శాక్తతంత్రాలు రాకమునుపే నరసింహావతారం గురించి గాధలు మన దేశంలో ఉన్నాయి. అవతారాలలో చాలా శక్తివంతమైనదీ, అతి తక్కువ కాలం భూమ్మీద ఉన్నదీ నరసింహావతారమే. కనుక ఛిన్నమస్తాదేవికీ, నరసింహస్వామికీ ఉన్నట్టి ఈ పోలిక కూడా సమంజసమే అని తోస్తుంది.

వైష్ణవంలో యోగసాధనకు నరసింహస్వామి అధిదేవత. యోగనరసింహుడు అనే అవతారం ఉన్నదని మనకు తెలుసు. నవనారసింహులలో యోగనరసింహుడు ఒకరు. తిరుమలలో కూడా ఈయన దేవాలయాన్ని ప్రధాన దేవాలయానికి ఎడమ వైపున మనం చూడవచ్చు. అలాగే తంత్రమార్గంలో యోగసాధనకు ఛిన్నమస్తాదేవి అధిదేవత. ఇదొక్కటే గాక వీరిద్దరికీ ఇంకా చాలా పోలికలున్నాయి.

నరసింహస్వామి - సంధ్యాదేవతకు ఒక ప్రతిరూపం. ఎలాగంటే - ఆయనలో పశుత్వమూ దైవత్వమూ కలసి ఉన్నాయి. ఆయన ఉద్భవించింది కూడా పగలూ,రాత్రీ కాని సంధ్యా సమయంలోనే. అలాగే హిరణ్యకశిపుడిని సంహరించింది కూడా ఇంటా బయటా కాని గడప మీదే. కనుక ఆయన కూడా ఇటు జీవితానికీ అటు మరణానికీ, ఇటు లౌకికానికీ అటు ఆధ్యాత్మికానికీ మధ్యన ఉన్న సరిహద్దులో వెలిగే దేవతగా మనం స్వీకరించవచ్చు. ఛిన్నమస్తా రూపం కూడా అదే. కనుక నరసింహ స్వామికీ ఈమెకూ దగ్గర పోలికలున్నట్లు మనకు తెలుస్తున్నది.

వీరిద్దరి జననతిధులు కూడా వైశాఖ శుక్ల చతుర్దశులే కావడం గమనార్హం.

'ముహూర్త చింతామణి' ననుసరించి ఈ తిధికి 'పరమశివుడు (రుద్రుడు)' అధిదేవత. ఉగ్రకర్మలైన - యుద్ధం, హింసతో శత్రువులను జయించడం, ఆయుధాలు తయారీ, విషప్రయోగం, గెరిల్లా యుద్ధం మొదలైనవి ఈ సమయంలో జయాన్నిస్తాయి. అదే విధంగా మోక్షసాధనలైన ధ్యానం,యోగం మొదలైనవి కూడా ఈ సమయంలో త్వరితంగా ఫలిస్తాయి.


వరాహ మిహిరాచార్యుని 'బృహత్సంహిత', ముహూర్త గ్రంధమైన 'పూర్వకాలామృతా'లను బట్టి ఈ తిధికి 'కాళికాదేవి' అధినాయిక. ఈమెకూడా ఉగ్రస్వరూపిణిగా ఉంటుంది. సాధకునిలోని తక్కువ బుద్దులూ, బద్ధకం, సోమరితనం, నాటకాలు ఆడే స్వభావం, రుజువర్తన లేకపోవడం మొదలైన చెడులక్షణాలంటే ఈమెకు మహా ఉగ్రమైన కోపం ఉంటుంది. ఉపాసకునిలోని ఇలాంటి నడవడికలను ఆమె ఒకే ఒక్క ఖడ్గప్రహారంతో సంహరించి పారేస్తుంది. కాళికాదేవికి ఆలస్యం చెయ్యడం తెలియదు. జాగు అనేది ఆమెకు ఇష్టం ఉండదు. ఒకే ఒక్క క్షణంలో రాక్షస సంహారం జరగాల్సిందే. అది ఆమె తత్త్వం.

జ్యోతిశ్శాస్తాన్ని బట్టి చతుర్దశి తిధి అనేది 'రిక్త' తిధులలోకి వస్తుంది. వీటికి శనీశ్వరుడు అధిదేవత. శనీశ్వరుడు కూడా కాళికాదేవికీ శివునకూ ప్రతిరూపమే. ఈయన కూడా కాళికాదేవిలాగే నల్లగా ఉంటాడు. ఈయనకు 'యముడు' అని పేరున్నది. అంటే సంహారతత్త్వం ఈయన అధీనంలో ఉంటుంది. రుద్రతత్వం కూడా అదే కదా !!

తిధులు - నంద, భద్ర, జయ, రిక్త, పూర్ణ - అనే పేర్లతో అయిదు విభాగాలుగా పాడ్యమి నుంచి వరుసగా ఉంటాయి. వీటి లక్షణాలను క్లుప్తంగా ఇక్కడ ఇస్తున్నాను.

నంద తిధులు - పాడ్యమి, షష్టి, ఏకాదశి (1,6,11)
భద్ర తిధులు - విదియ,సప్తమి,ద్వాదశి (2,7,12)
జయ తిధులు - తదియ,అష్టమి,త్రయోదశి (3,8,13)
రిక్త తిధులు -చవితి,నవమి,చతుర్దశి (4,9,14)
పూర్ణ తిధులు -  పంచమి, దశమి, పూర్ణిమ/అమావాస్య (5,10,15)

నందతిధులు ఆనందాన్నీ, భద్రతిధులు రక్షణనూ, జయ తిధులు విజయాన్నీ, రిక్తతిధులు క్రూరత్వాన్నీ, ఆధ్యాత్మిక సాధననూ, పూర్ణతిథులు పూర్ణత్వాన్నీ ఇస్తాయి.

కాళికాదేవి, రుద్రుని స్త్రీరూపం అని మనం భావించవచ్చు. ఇద్దరూ 'ఉగ్రత్వానికీ, నాశనానికీ' అధిదేవతలే. అంటే, లౌకికవాంఛలు పూర్తిగా నశించి దైవత్వంలోకి మేల్కొనడమనే ప్రక్రియకు వీరిద్దరూ అధిదేవతలుగా ఉంటారు. హిరణ్యకశిపుడు కూడా మితిమీరిన ఆశకూ, దౌర్జన్యానికీ ప్రతిరూపమే కదా. అతని ఆగడాలు మితిమీరినందువల్లనే నరసింహస్వామి ఆయన్ను సంహరించాడు. శైవంలో రుద్రుని సంహారశక్తినే వైష్ణవంలో నరసింహస్వామిగా ఆరాధిస్తారు. వీరిద్దరిలో ఆకారం వేరైనా లోపలున్న తత్త్వం ఒక్కటే.

నరసింహస్వామి, కుమారస్వామి, ఆంజనేయస్వామి, పరశురాముడు - వీరందరూ వేర్వేరుగా మనుషులు అనుకున్నప్పటికీ,  ఈ నలుగురిలో పనిచేసే శక్తి ఒక్కటే అని వాసిష్ఠ గణపతిముని భావించారు. ఈ భావన వినడానికి విచిత్రంగా ఉండవచ్చు. మామూలుగా మనుషులు భావించే భావనలకూ, తాంత్రికులూ, సిద్ధులకు తెలిసిన మార్మిక భావనలకూ ఇంత భేదం ఉంటుంది మరి !!

ఇందుకనే - శుక్లచతుర్దశి అనేది ఛిన్నమస్తాదేవికీ, నరసింహస్వామికీ కూడా జననతిధి ఆయింది. పశుత్వం మీద దైవత్వపు గెలుపుకీ, చీకటి మీద వెలుగు యొక్క విజయానికీ వీరిద్దరూ సంకేతాలు.

ఇప్పుడు ఛిన్నమస్తాదేవికి చెందిన యోగపరమైన అర్ధాలను తెలుసుకుందాం.

బౌద్ధ తంత్రాలలో లాలన, రసన, అవధూతి అనబడే నాడులను హిందూ యోగతంత్రాలలో ఇడా, పింగళా, సుషుమ్నా అనే పేర్లతో పిలిచారని ఇంతకు ముందు చెప్పాను. బౌద్ధ తంత్రాలలో వజ్రయోగినీ దేవతను సర్వబుద్ధ డాకిని అనీ, ఆమెకు అటూ ఇటూ ఉన్న దేవతలను వజ్ర వైరోచని, వజ్రవర్ణిని అనీ పిలిచారు. 'ఛిన్నమస్తాకల్పం' వంటి హిందూ తంత్రాలలో అయితే వీరిని డాకిని, వర్ణిని, సర్వబుద్ధి అనే పేర్లతో పిలిచారు.

తాంత్రిక యోగపరంగా చూస్తే, ఈ ముగ్గురు దేవతలూ ఇడా, పింగళా సుషుమ్నా నాడులకు సూచకులు. ఈ ముగ్గురూ త్రాగుతున్న రక్తం, కుండలినీ శక్తి సహస్రారానికి చేరినప్పుడు సాధకుని దేహంలో కురిసే అమృతవర్షానికి ప్రతిరూపం. ఈ అమృతరసం అనేది శరీరంలోనుంచి బయటకు పోదు. అది ఉపాసకుని శరీరంలోని ఈ మూడునాడులలోనే చక్రాకారంగా ప్రవహిస్తూ ఉంటుంది. దానినే, ఛిన్నమస్తా రక్తాన్ని ఈ ముగ్గురూ కలసి త్రాగుతున్నట్లుగా చిత్రించారు. ఇదొక అంతరికంగా జరిగే ప్రక్రియ మాత్రమేగాని భౌతికంగా జరిగే శిరచ్చేదం కాదు. శిరచ్చేదం అనేది, గొంతులో ఉన్న విశుద్ధచక్రాన్ని కుండలిని భేదించి ఆపైన ఉన్నట్టి ఆజ్ఞా సహస్రార చక్రాలకు చేరడానికి సంకేతమై ఉన్నది. దీనినే గొంతు తెగిపోవడంగా చిత్రంచారు. యోగపరంగా శిరచ్చేదం అంటే ఇదే.

ఈ విధంగా, తంత్రశాస్త్రంలో ఈ ఛిన్నమస్తా సాధన ఒక మహావిద్యగా చూడబడి, మాయామోహాలనుంచీ, పశుప్రవృత్తి నుంచీ మనిషికి విముక్తిని ప్రసాదించి అద్భుతమైన అమృత సిద్ధిని కలిగించే రహస్యసాధనగా ఉంటే, అజ్ఞానులైన లోకులేమో - అయితే ఇదేదో భేతాళ సాధన అనీ - లేకుంటే అతీత శక్తులు సిద్ధులను ఇచ్చే ఏదో సాధన అనీ - రకరకాలుగా అనుకుంటూ భ్రమల్లో ఉంటున్నారు.

లోకం ఇలా అనుకోవడమే నిజమైన తాంత్రికులకు కావలసింది. ఎందుకంటే తాంత్రికలోకంలో అడుగు పెట్టగలిగినవారు అవసరమైతే దేన్నైనా వదలిపెట్టగలిగే ధీరులై ఉండాలి గానీ, కాలక్షేపం కోసం ఆధ్యాత్మిక కబుర్లు చెప్పుకునే మామూలు మనుషులై ఉండకూడదు. ఎందుకంటే - తంత్ర ప్రపంచంలో ఇలాంటి వాళ్ళు ఏమాత్రం పనికిరారు. నిజమైన తంత్రసాధన చేయాలంటే మనిషికి గొప్పవైన అర్హతలుండాలి. తంత్రసాధన అనేది ఊరకే మాటలు చెబితే జరిగే పని  కాదు. కనుక కాలక్షేప ఆధ్యాత్మికులు తంత్రలోకానికి దూరంగా ఉండటమే నిజమైన తాన్త్రికుల కోరిక. అందుకోసమే ఆ రహస్యాలను వారు ఇలాంటి భయంకరమైన చిత్రాలతో కూడిన 'సంధ్యా భాష' లోనే ఎప్పటికీ ఉంచుతారు. ఆ సాధనా రహస్యాలను కూడా అర్హులు కానివారికి వారు ఎన్నటికీ వెల్లడి చెయ్యరు.

ఆ రహస్యాలను అర్ధం చేసుకుని ఆచరించి, ఆ దారిలో నడచి, వాటిలో సిద్ధిని పొందే అర్హతలున్నవారు పుట్టేవరకూ ఈ తంత్ర గ్రంధాలు ఓపికగా వేచి చూస్తూనే ఉంటాయి - ఎన్ని వేల ఏళ్ళైనా సరే !!

(సమాప్తం)
read more " ఛిన్నమస్తా సాధన - 9 (యోగతంత్ర రహస్యాలు) "

14, సెప్టెంబర్ 2017, గురువారం

ఛిన్నమస్తా సాధన - 8 (ఎల్లమ్మ తల్లి)

తంత్ర/ పురాణయుగంలో హిందూ, బౌద్ధ, జైన తంత్రాలు అటూ ఇటూగా కలిసే ఉద్భవించాయని ఇంతకు ముందు చెప్పాను. కనుక వీటిలో ఏది ముందు ఏది తర్వాత అనే విషయాన్ని నిర్దారించడం అంత సులువు కాకపోగా, ఆ ప్రయత్నం కూడా అంత అర్ధవంతం కాదు. ఎవరు ముందైనా, ఎవరు వెనుకైనా, ఆ తంత్రగ్రంధాలలో చెప్పబడిన సాధనలు చేసి సిద్ధి పొందటం అనేది ముఖ్యంగాని ముందు వెనుకలు నిర్ణయించడం కాదు. కాకుంటే వాటిల్లో వాడబడిన కొన్నికొన్ని పదాల వల్ల అప్పుడప్పుడు ఆయా తంత్రాల మూలాలు మనకు అర్ధమౌతూ ఉంటాయి.

హిందూతంత్రాలలో చిన్నమస్తా దేవతకు సంబంధించిన గాధలు మనకు కొన్నిచోట్ల ముఖ్యంగా దర్శనమిస్తాయి. ఒకటి దేవీభాగవత పురాణం, రెండు ప్రానతోషిణి తంత్రం, మూడు ముండమాలా తంత్రం, నాలుగు గుహ్యాతిగుహ్య తంత్రం,అయిదు తోడల తంత్రం. వీటన్నిటిలోనూ ఈమె అమ్మవారి వివిధ రూపాలైన దశమహావిద్యలలో ఒకరుగా భావించబడింది.

కాళీ, తారా, షోడశీ, భువనేశ్వరి, భైరవి, ఛిన్నమస్త, ధూమవతి, బగళాముఖి, మాతంగి, కమలాత్మిక -  అనే పదిమంది, తంత్ర ప్రసిద్ధలైన దశమహావిద్యలని అందరికీ తెలిసినదే కదా !!

దేవీ భాగవతంలో అయితే ఈమెకధ సతీదేవి కధతో ముడిపడి ఉంటుంది. తన తండ్రియైన దక్షుడు చేస్తున్న యజ్ఞానికి, పిలవకపోయినా సరే, తానూ వెళతానని సతీదేవి శివుణ్ణి అనుమతి అడుగుతుంది. కానీ పిలవని పేరంటానికి ఎందుకని పరమేశ్వరుడు వద్దంటాడు. ఆయన్ను ఒప్పించడానికి ఆయన ఎటు పోతే అటు సతీదేవి ఒక్కొక్క రూపంతో ప్రత్యక్షమై దశదిశలలో (ఎనిమిది దిక్కులు, పైన, క్రింద వెరసి పది దిక్కులు) ఆయన్ను ఆటంకపరుస్తుంది. ఈ రూపాలే దశమహావిద్యలయ్యాయని ఒక గాధ ఈ పురాణంలో ఉన్నది.

ఛిన్నమస్తా స్వరూపం భయంకరంగా ఉన్నప్పటికీ దానిలో చాలా నిగూఢమైన అర్ధాలున్నాయని ఇంతకు ముందే చెప్పాను. తన తలను తాను ఖండించుకోవడం త్యాగానికి చిహ్నం. అలాంటి అత్యున్నతమైన త్యాగం లేనిదే ఎవరూ తంత్రమార్గంలో సిద్ధిని పొందలేరు. సరదాగా సాధన చేసినవారికి దురదే మిగులుతుంది గాని అసలైన సిద్ది దక్కదు. దానికి తన సర్వస్వాన్నీ పణంగా పెట్టగలిగిన ధీరత్వం ఉండాలని చెప్పడమే ఈ తల నరుక్కోవడంలోని అర్ధం.

దైవం కోసం తన సమస్త సుఖాలనూ చివరకు తన ప్రాణాన్ని కూడా త్యాగం చెయ్యడమనే రహస్యార్ధం ఇందులో ఇమిడి ఉన్నది. అయితే తన తలను ఖండించుకున్నప్పటికీ ఆమె చనిపోలేదు. ఆమె శవం కాదు. శక్తి స్వరూపమైన దేవత. కనుక, తల లేకున్నప్పటికీ ఆమె సజీవంగానే ఉన్నది. దీనికి తార్కాణంగానే ఖండింపబడిన ఆమె తల ఆమె చేతిలోనే నవ్వుతూ మనకు కనిపిస్తుంది. అంటే యోగసమాధిలో స్వచ్చందంగా శరీరాన్ని వదిలేసే ప్రక్రియకు ఈమె సంకేతంగా నిలుస్తున్నది. కానీ అది ఆత్మహత్యా కాదు, అందరికీ తెలిసిన మామూలు మరణమూ కాదు. మామూలు మనుషులకు మరణం వస్తుంది. కానీ యోగసమాధిలో దేహత్యాగం చేసే యోగులది మరణం కాదు. వాళ్ళు కర్మబద్ధులైన మామూలు మనుషుల లాగా నరకానికి పోరు. వారిదైన ఆత్మస్థితిలో వారు వెలుగులోనే నిలిచి ఉంటారు.

తన రక్తాన్ని తానే త్రాగడంలో కూడా అంతరార్ధం ఉన్నది. మన సనాతనధర్మం ప్రకారం ఈ సృష్టి అంతా దైవంచే సృష్టించబడింది. ఇతర మతాలు కూడా ఇదే చెబుతాయి. కానీ మనకూ వారికీ ప్రధానమైన భేదం ఏమంటే - దేవుడు ఎక్కడో మేఘాల చాటున కూచుని కుమ్మరి కుండలు చేసినట్లు ఈ సృష్టి చేసి ఆ తర్వాత హాయిగా రెస్టు తీసుకుంటున్నాడని అవి అంటాయి. బుర్రలేని ఎడారి మతాలకు అంతకంటే ఏం అర్ధమౌతుంది?

మనం ఏం చెప్తామంటే - సృష్టి చేసిందీ దైవమే. సృష్టి కూడా దైవమే - అంటాం. సృష్టిని తననుంచే దైవం చేసింది. తానే సృష్టిగా రూపాంతరం చెందింది. - అని మనమంటాం.

తైత్తిరీయ ఉపనిషత్తును చూడండి.

ఇదం సర్వమసృజత|| యదిదం కించ || తత్సృష్ట్వా తదేవానుప్రావిశత్ || తదనుప్రవిశ్య || సచ్చత్యచ్చాభవత్ ||

దైవం ఈ సర్వాన్నీ సృష్టించి ఆ సృష్టిలో తానే ప్రవేశించిందని వేదం ఇక్కడ అంటున్నది. సృష్టి వేరు దైవం వేరు అని వేదం చెప్పలేదు. సృష్టే దైవస్వరూపమని వేదం ఉపదేశించింది.నేడు మన ధర్మాన్ని విమర్శించే పరాయి దోపిడీ మతాలన్నీ ఈ భావన దరిదాపుల్లోకి కూడా రాలేవు.

సృష్టి చేసిన దేవుడు ఆ సృష్టిని దోచుకొమ్మని కొందరికి ప్రత్యేక అధికారాలిచ్చాడని అబద్దాలు చెబుతూ క్రైస్తవం, ఇస్లాం వంటి ఎడారి మతాలు బలహీనులను, శాంతిగా ఉండేవారిని దశాబ్దాల పాటు యధేచ్చగా దోచుకున్నాయి. భూమిని రక్తంతో తడిపాయి. కానీ అదే సృష్టిగా దేవుడే ఉన్నాడని నమ్మిన మనం ఎవరినీ మతహింసకు గురిచేయ్యలేదు. మత మార్పిడులూ చెయ్యలేదు. మతం పేరుతో ఎవరినీ దోచుకోలేదు. 'శాంతి శాంతి' అని చెబుతూ ఈ రెండు మతాలూ చేసినట్టు అరాచకాలూ చెయ్యలేదు.

సృష్టిని దేవుడు చేసి విడిగా ఎక్కడో ఉన్నాడు అని గుడ్డిగా నమ్మడానికీ, సృష్టే దేవుడు అన్న సత్యాన్ని గ్రహించడానికీ మధ్యన ఇంత భేదం  ఉంది మరి !! 

జిల్లెళ్ళమూడి అమ్మగారు కూడా ఇదే మాటను ఎన్నో సార్లు తేలిక మాటల్లో చెప్పారు.

'చీమలో దోమలో కూడా దేవుడున్నాడామ్మా?' అన్న ప్రశ్నకు అమ్మ ఇలా జవాబిచ్చారు.

'చీమలో దోమలో కాదు నాన్నా, చీమగా దోమగా ఉన్నాడు' అని అమ్మ ఎంతో గొప్ప అర్ధాన్ని చిన్న మాటల్లో ఇమిడ్చి చెప్పారు.

ఇకపోతే ఇదే ఉపనిషత్తు, సృష్టి మొత్తం ఆహారమే అంటుంది. ఈ సృష్టిలో ఒకటి ఇంకొకదానికి ఆహారమౌతున్నది. ప్రతి ప్రాణీ ఇంకొక ప్రాణికి ఆహారం అయిపోతున్నది. అలా ఇంకొక జీవికి ఆహారంగా మారని ప్రాణి అంటూ ఏదీ లేదు. ఉండదు కూడా. అలాగని అన్ని ప్రాణులూ మిగతా అన్ని ప్రాణులనూ తినొచ్చని ఉద్దేశ్యం కాదు. బుద్ధిలేని జంతువులు చేసే పనిని బుద్ధి ఉన్న మనిషి చెయ్యకూడదు. అలా చేస్తే ఆ జంతువులకూ మనిషికీ తేడా ఉండదు. జంతువుకు చాయిస్ లేదు కనుక దానికి దొరికిన జంతువును అది తింటుంది. ఏదైనా జంతువుకు చాయిస్ ఉన్నప్పుడు అది వాటిల్లో ఉత్తమమైన ఆహారాన్నే తింటుంది గాని అధమమైన ఆహారాన్ని తినదు. ఈ విషయం జంతు పరిశోధకులకు తెలుసు.

కానీ మనిషికి అలా కాదు. వాడికి బోలెడంత చాయిస్ ఉన్నది. కనుక అతను విచక్షణను ఉపయోగించాలి. మనిషి శరీర తత్వానికి సరిపోయే తిండిని అతను తినాలి. కానీ నేటి మనిషి బలం బలం అంటూ నానా జంతువుల మాంసాలూ తిని చివరికి కేన్సర్ తెచ్చుకుని అఘోరిస్తున్నాడు. లేదా మితిమీరిన కొవ్వుతో రక్తనాళాలు మూసుకుని పోయి గుండెజబ్బులకు గురౌతున్నాడు. ప్రోటీన్ కావాలంటే శాకాహారంలో కూడా అది ఉంది. దానికోసం ఆవుల్నీ, ఎద్దుల్నీ, కుక్కల్నీ, నక్కల్నీ, పందుల్నీ, అడ్డమైన గడ్డినీ తినాల్సిన పని లేదు. ఈ విషయమై ఇంకో ప్రత్యేక పోస్టు వ్రాస్తాను.

ఈ రకంగా విచక్షణను మరచి, పశువులా అన్నింటినీ తినే మనిషి చివరకు తానే పంచభూతాలకు ఆహారమౌతున్నాడు. అయితే మట్టిలో కలుస్తున్నాడు. లేదా అగ్నికి ఆహుతౌతున్నాడు. లేదా జలంలో అర్పణమై జలచరాలకు ఆహారంగా మారుతున్నాడు. లేదా పార్శీల వంటి కొన్ని జాతులలో లాగా 'దఖ్మా' అనే చోట పక్షులకు ఆహారంగా మారుతున్నాడు. కనుక సృష్టి అంతా అన్నమే అంటుంది వేదం. కనుకనే అన్నం పరబ్రహ్మ స్వరూపమయ్యింది. అన్నం అంటే బియ్యంతో వండిన 'అన్నం' అనే అర్ధం గాకుండా, ఆహారం అనే విస్తృతార్ధంలో తీసుకోవాలి.

అన్నం గురించి ఇదే ఉపనిషత్తు ఏమంటున్నదో తెలుసుకుందాం.

అన్నాద్వై ప్రజా ప్రజాయన్తే || యా: కాశ్చ పృధివీం శ్రితా: || అధో అన్నేనైవ జీవంతి || అధైనదపి యంత్యంతత: || అన్నం హి భూతానాం జ్యేష్టం || తస్మాత్ సర్వౌషధముచ్యతే || సర్వం వై తేన్నమాప్నువంతి || యేన్నం బ్రహ్మోపాసతే || అన్నం హి భూతానాం జేష్టం|| తస్మాత్ సర్వౌషధముచ్యతే || అన్నాద్భూతాని జాయన్తే || జాతాన్యన్నేన వర్ధంతే || అధ్యతేత్తి చ భూతాని|| తస్మాదన్నం తదుచ్యత ఇతి ||

"సమస్త జీవులకూ అన్నమే మూలం. జీవులన్నీ అన్నంవల్లనే పుట్టి, అన్నంతోనే పెరిగి చివరకు అన్నంగానే మారుతున్నవి. అందులోనే లయమౌతున్నవి.కనుక అన్నమునే బ్రహ్మముగా ఉపాసించు". అంటుంది వేదం ఇక్కడ.

కనుక సృష్టి అంతా చూస్తే, 'తినడం' అన్న ప్రక్రియ తప్ప ఇంకోటి లేదు. ప్రతి అనుభవమూ ఒక విధమైన 'తినడమే'.ఒక విధంగా ఆహారాన్ని స్వీకరించడమే. ఒక విధమైన తృప్తిని పొందటమే. ప్రాణులన్నీ ప్రాణులను తింటున్నాయి. కాలమేమో అన్ని ప్రాణులనూ అది తింటోంది. విశ్వమంతా ఈ రకమైన 'ఫుడ్ సైకిల్' గా, వేదఋషులకు కనిపించింది. దీనినే దైవం యొక్క ఒక స్వరూపంగా వారు దర్శించారు. ఈ భావననే ఈ మంత్రాలలో వారు చెప్పారు.

అంటే - తినేది తినబడేది అన్నీ దైవమే అనిన అద్వైత భావన ఇక్కడ మనకు కనిపిస్తుంది. అంటే దైవం అన్నీ తానే అయింది గనుక, తనను తానే తింటున్నది, తన రక్తాన్ని తానే త్రాగుతున్నది. కానీ సజీవంగానే ఉంటున్నది. అనుక్షణం మరణిస్తున్నప్పటికీ, అనుక్షణం సజీవంగానే నిలుస్తున్నది. అంతేగాక అన్నింటినీ తానే పోషిస్తున్నది కూడా. ప్రకృతిలో జరుగుతున్న నిరంతర ప్రక్రియ ఇదే. ఇదే ప్రకృతిలోని సృష్టి స్థితి లయాత్మకమైన దైవత్వం. ఈ భావం ఉపనిషత్తులలో మనకు దర్శనమిస్తుంది. ఛిన్నమస్తా రూపం కూడా ఇదే భావనను ఒక చిత్రరూపంలో మనకు గోచరింపజేస్తున్నది. తను మరణించి కూడా సజీవంగా ఉండటమూ, తనవారిని పోషించడమూ, జననం నుంచి మరణానికీ మళ్ళీ దానినుంచి జననానికీ అనుక్షణం రీసైకిల్ అవుతూ ఉండటమూ అనే స్థితులు ఈ దేవతా చిత్రంలో మనకు కనిపిస్తాయి.

అంటే సృష్టి, స్థితి, లయమూ - మూడూ తానే అన్నది ఈ చిత్రం యొక్క మార్మికార్ధం. ఈ చిత్రంలో మీరు లయమూ స్థితీ చెప్పారు. మరి సృష్టి ఎక్కడుంది? అని మీకు అనుమానం రావచ్చు. ఈ దేవత కాళ్ళక్రింద సృష్టికార్యంలో ఉన్న రతీమన్మధులు ఏమిటనుకున్నారు? అది సృష్టికి సంకేతం !! తన చెలికత్తెలకు రక్తాన్ని ధారపోయ్యడం స్థితికి సంకేతం. శిరచ్చేదం లయానికి సంకేతం. అయినా బ్రతికి ఉండటం దైవం యొక్క నిత్యత్వానికి సంకేతం. వెరసి దైవం యొక్క పరిపూర్ణ శక్తికి ఈ దేవత ప్రతిరూపం !!

తంత్రాలకు సంబంధించిన ప్రతిదీ ఇలాగే రహస్య భాషలో ఉంటుంది. దీనిని "సంధ్యా భాష" అంటారు. అంటే - సంధ్యా సమయం ఎలాగైతే ఇటు పగలూ కాకుండా అటు రాత్రీ కాకుండా, స్పష్టత లేకుండా, సందిగ్ధంగా ఉంటుందో, అలాగే ఈ తంత్రాల భాష కూడా మార్మికంగా, సంధ్యా సమయంలాగా, అస్పష్టంగా ఉంటుంది. దానిని అర్ధం చేసుకునే అంతర్ద్రుష్టి మనకుంటే గాని అది అర్ధం కాదు.

వేదాలు కూడా ఇంతే. అవి చాలా లోతైన మార్మిక భాషలో ఉంటాయి. అంతర్ద్రుష్టి లేకుంటే అవి అర్ధం కావు.

తంత్రాలకు వేదాలకు సంబంధం లేదని కొందరి భావన. ఈ భావన సరి కాదు. అన్నింటికీ వేదాలలోనే మూలాలున్నాయి. ఇందులో అనుమానం లేదు. అయితే - అన్నీ వేదాలలోనే విస్పష్టంగా చెప్పబడలేదు. మార్మిక భాషలో చెప్పబడ్డాయి. వాటిని సరిగ్గా అర్ధం చేసుకుంటే అవి అర్ధమౌతాయి. వేదాలను అర్ధం చేసుకోవాలంటే తపశ్శక్తి అవసరం. ఊరకే సంస్కృత వ్యాకరణం తెలిస్తే చాలదు. ఈ తపశ్శక్తి లేకుంటే వేదాలకు సరియైన భాష్యం వ్రాయలేరు.ఎందుకంటే వేదాలలో ఉన్నట్టివి ఉత్త శ్లోకాలు కావు. అవి మంత్రాలు. శ్లోకాలకూ మంత్రాలకూ చాలా భేదం ఉంటుంది. శ్లోకార్ధం తెలియాలంటే వ్యాకరణం తెలిస్తే చాలు. మంత్రార్ధం తెలియాలంటే తపస్సు అవసరమౌతుంది. తపస్సు లేకుంటే మంత్రార్ధం ఎప్పటికీ అవగతం కాదు.

ఈ కారణంగానే, వేదాలను తెలుగులోకి తెచ్చిన దాశరధి రంగాచార్యగారు కూడా వాటి మార్మికార్ధాలను వివరించలేక, ఉత్త వ్యాకరణార్దాలను మాత్రమే అచ్చులోకి తేగలిగారు. వేదాలకు ఆయన చేసిన తెలుగు అనువాదం నన్ను చాలా నిరాశ పరచింది. అటువంటి పండితుని నుంచి అలాంటి పేలవమైన వ్యాఖ్యానాన్ని నేను ఊహించలేకపోయాను. కానీ ఏం చేస్తాం? తపస్వులు తపస్వులే, పండితులు పండితులే. తపశ్శక్తి వేరు, పాండిత్యం వేరు.రెంటికీ హస్తిమశకాంతరం ఉంటుంది మరి !!

సరే ఆ సంగతిని ప్రస్తుతానికి అలా ఉంచుదాం !!

శాక్తతంత్రాలేగాక ఈ తంత్ర/పురాణ కాలమైన 3 నుంచి 8 శతాబ్దాల మధ్యకాలంలో శైవ తంత్రాలు, వైష్ణవ తంత్రాలు కూడా పుంఖాను పుంఖాలుగా వచ్చాయి. ఇవి ఒకదానినొకటి ప్రభావితం గావించుకున్నాయి.వైష్ణవపరమైన దశావతారాలకు, శాక్త పరమైన దశమహావిద్యలకు ఉన్న సూక్ష్మమైన సంబంధాలను గురించి కూడా వివరణలు ఆనాడే ఇవ్వబడ్డాయి.

ఉదాహరణకు, ముండమాలా తంత్రం ఏమంటున్నదో చూద్దాం.

శ్లో|| కృష్ణస్తు కాళికా సాక్షాత్ - రామమూర్తిశ్చ తారిణీ
వారాహీ భువనా ప్రోక్తా - నృసింహీ భైరవీశ్వరీ
ధూమవతీ వామన: స్యాచ్చిన్నా భృగుకులోద్భవ:
కమలా మస్త్యరూపస్యాత్ - కూర్మస్తు బగలాముఖీ
మాతంగీ బౌద్ధ: ఇత్యేషా షోడశీ కల్కిరూపిణీ

అనే ముండమాలా తంత్రశ్లోకాన్ని బట్టి....

కృష్ణావతారం - కాళిక,
రామావతారం - తార,
వరాహావతారం-భువనేశ్వరి,
నృసింహావతారం-భైరవి,
వామనావతారం-ధూమవతి,
పరశురామావతారం-ఛిన్నమస్త,
మత్స్యావతారం-కమలాత్మిక,
కూర్మావతారం - బగళ,
బుద్ధావతారం - మాతంగి,
కల్క్యావతారం - షోడశి

అనే సామ్యం మనకు కనిపిస్తున్నది. 

ఈ దశావతారాలలో ఇతర అవతారాలను మనం ప్రస్తుతం స్పృశించడం లేదు. ఎందుకంటే మన ప్రస్తుత విషయం అది కాదు గనుక. కానీ ఈ పట్టిక ప్రకారం - చిన్నమస్తాదేవి పరశురామునితో పోల్చబడింది. ఈ వివరాన్ని కొంచం గమనించాలి.

ఎల్లమ్మ తల్లి (రేణుకా దేవి)
పరశురాముని తల్లి రేణుకాదేవి కూడా తన సుతుని చేతిలోనే శిరచ్చేదానికి గురైంది. కానీ మరలా తన భర్తయైన జమదగ్ని మహర్షి తపశ్శక్తి చేత బ్రతికింపబడింది. పరశురాముని ఆయుధమైన గండ్రగొడ్డలి కూడా తలలు నరికినదే. కనుక ఈ 'శిరచ్చేదం' అనే కాన్సెప్ట్ లో ఛిన్నమస్తా దేవికీ, రేణుకాదేవికీ పోలికలున్నాయి. ఈ రేణుకాదేవినే ఎల్లమ్మ తల్లి అని మన తెలుగునాట కొన్ని ప్రాంతాలలో ఆరాధిస్తూ ఉంటారు. 'ఎల్లమ్మ' అనే పేరుకున్న అర్ధమేంటో ఇప్పుడు వివరిస్తాను.

'ఎల్ల' అంటే సరిహద్దు, పొలిమేర అని అర్దాలు. అంటే - జీవితం, మరణం అనే స్థితుల మధ్యన పొలిమేరలో సరిహద్దులో ఉండే దేవత అని అర్ధం. ఈ స్థితినే BARDO అని టిబెటన్ భాషలో పిలుస్తారు. అంటే చావూ బ్రతుకూ కాని ఊగిసలాట అన్నమాట.

దేవతా పరంగా చూస్తే, ఈమె జీవనానికీ మరణానికీ మధ్యలో ఉన్నది కనుక అటు జీవనరంగంలోనూ కాలుపెట్టగలదు, లేదా ఇటు మరణపు ఛాయలోనూ నర్తించగలదు.అంటే ఇహలోకానికీ, పరలోకానికీ ఈమె అధిదేవత అన్నమాట. అదే, మరణించిన జీవుడి స్థితిని తీసుకుంటే అతడు నిస్సహాయ స్థితిలో ఊగిసలాడుతూ ఉంటాడు. సహాయం కోసం ఏడుస్తూ ఉంటాడు. కనుక ఇలాంటి జీవులకు కూడా ఆమె సహాయం చెయ్యగలదు. అంటే, బ్రతికున్న జీవులకూ, చనిపోయిన జీవులకూ కూడా ఈమే రక్షాదాయిని. ఇదే 'ఎల్లమ్మతల్లి' అనే మాటలోని రహస్యార్ధం.

అలాగే రెండు ఊర్ల మధ్యన కూడా పొలిమేర ఉంటుంది. అందుకే ఈ పొలిమేర దగ్గరలో 'గ్రామదేవత', 'పొలిమేర దేవత', 'పోలమ్మతల్లి', 'పోలేరమ్మ' అనే పేర్లతో దేవతా విగ్రహాలుంటాయి. వీరందరూ 'ఎల్లమ్మతల్లి' ప్రతిరూపాలే.

ఇలాగే,  ఏవైనా రెండు స్థితుల (two states of being) మధ్యన కూడా 'సంధ్య' (transition) ఉంటుంది. ఇలాంటి no man's land లేదా అయోమయ స్థితిలో ఉన్న మనిషిని రక్షించి వాడికి సరియైన దారిని తన త్యాగం ద్వారా చూపే దేవతకే 'ఎల్లమ్మతల్లి' అని పేరు. ఈమెనే వేదాలలో 'సంధ్యా దేవత' అన్నారు. ఈమె అనుగ్రహం కోసమే సంధ్యావందనం అనే ఉపాసనను ప్రతిరోజూ ద్విజులైనవారు ఆచరించవలసి ఉన్నది.

ఈ దేవత చిత్రాలలో, విగ్రహాలలో గనుక మనం గమనిస్తే ఈమెకు తల ఒక్కటే ఉంటుంది. కొన్నిచోట్ల ఆ తలచుట్టూ అగ్నిజ్వాల ఆవరించి ఉంటుంది. ఇది ఆమెయొక్క త్యాగానికి, దివ్యత్వానికి సూచిక. చాలామందికి ముఖ్యంగా కోయలు, చెంచులు మొదలైన అటవీజాతులకు, గ్రామీణ ప్రాంత ప్రజలకు ఈమె ముఖ్యమైన రక్షణదేవతగా ఉంటుంది. అదీ గాక చాలా గ్రామాలలో రకరకాలైన 'అమ్మతల్లుల' పేర్లతో ఆరాధింపబడే దేవత కూడా ఈమెయే.

పరశురామ జనని యైన రేణుకాదేవియే, తంత్రమహాదేవత ఐన ఛిన్నమస్త అని వాసిష్ట గణపతి ముని కూడా అన్నారు. ఆయన శిష్య ప్రశిష్యులు కూడా ఇదే నమ్ముతూ ఉంటారు.

అయితే, ఈమెకు అనేక మంత్రభేదాలున్నప్పటికీ, ఈమె యొక్క ప్రధానమైనట్టి మంత్రంలో ఉన్నట్టి ' వజ్ర వైరోచనీయే' అనే పదం బౌద్ధ తంత్రమైన వజ్రయానంలో ఉన్న 'వజ్ర' అనే పదం యొక్క సామ్యంతో, ఈమె ప్రధానంగా బౌద్ధ తంత్ర దేవతయైన వజ్రవారాహి యని కొందరు పండితులు ముఖ్యంగా ప్రొ. బినయ్ తోష్ భట్టాచార్య వంటివారు అభిప్రాయ పడ్డారు. ఎందుకంటే ఈ 'వజ్ర' అనే పదం, హిందూమతంలో ముఖ్యంగా హిందూ తంత్రాలలో తరచుగా వాడబడిన పదం కాదు. ఇంద్రుని ఆయుధం వజ్రాయుధమని ఉన్నప్పటికీ ఆ పదానికి ప్రతి దేవత ముందూ ఉంచబడిన ప్రాముఖ్యత, బౌద్ధ గ్రంధాలలో ఉన్నంతగా మన గ్రంధాలలో లేదు. కానీ - బౌద్ధ గ్రంధాలను వ్రాసినది కూడా బౌద్దులుగా మారిన వైదికులే గనుక, ఏ పదాలు ఎక్కడున్నా పెద్ద తేడా రాదు.

నేను కావాలనే 'హిందువులు' అనే పదాన్ని వాడటం లేదు. ఎందుకంటే ఇది ఆ తర్వాత కాలంలో విదేశీయులచేత మనమీద రుద్దబడిన మాట. కనుక వైదికులు అనే పదాన్నే నేను వాడుతున్నాను. మనం వేదానుసారులమే గనుక వైదికులమే అవుతాము.

ఈ 'వజ్ర' అనే పేరు ఈమె మంత్రంలో ఉండబట్టే, నాకు ఫోన్ చేసిన వజ్రాల వేటగాడి లాంటి పనికి మాలిన వాళ్ళు, ఈ దేవత అనుగ్రహం ఉంటే వజ్ర వైడూర్యాలతో కూడిన నిధులు బయటకు తీసే శక్తి ఆమె ఉపాసకులకు వస్తుందని మూర్ఖంగా నమ్ముతూ ఉంటారు. చక్రవర్తి దగ్గరకు పోయి కూడా పుచ్చు వంకాయలు కోరే బాపతు కదా ఈ మనుషులు? మనసులో పుచ్చు ఉన్నప్పుడు వాళ్ళు మాత్రం అంతకంటే ఇంకేం చెయ్యగలరు? ఈ ప్రపంచంలో ఎవడి గోల వాడిది !!

నిజానికి ఈ 'వజ్ర' అనే పదం - మూడు కాలాలలో ఎట్టి మార్పూ లేనట్టి అజేయమైన ఆత్మస్థితికి సూచిక. ఎందుకంటే వజ్రానికి తుప్పు పట్టదు, అది అభేద్యం కూడా. ఆత్మస్థితి కూడా అంతేకదా మరి !!

'విశేషేణ రోచతి (ఎక్కువ కాంతితో కూడిన మిరుమిట్లు గొలిపే శక్తి) ఇతి విరోచన:' అనే సూత్రాన్ని బట్టి, విరోచన, వైరోచన అనే పదాలు ఒకటే గాబట్టి - ఈ శక్తి మెరుపులు, ఉరుములు, పిడుగులలో దాగి ఉన్నట్టి ప్రచండమైన విద్యుచ్చక్తిగా తాంత్రికులు భావిస్తారు. అందుకే ఈమెకు "ప్రచండ చండిక" అని మరో పేరున్నది. మూడు వందల సంస్కృత శ్లోకాలలో గణపతి ముని ఈమెను స్తుతిస్తూ "ప్రచండ చండీత్రిశతి" అనే స్తోత్రాన్ని రచించారు. ఆ స్తుతిలో ఈమెను యోగసిద్ధిదాయిని యైన కుండలినీ శక్తిగా భావించి ప్రార్ధించారు. కుండలినీ శక్తి కూడా విద్యుచ్చక్తియే. అయితే ఈమె మానవ శరీరాలలో ఉన్న బయో ఎలక్ట్రికల్ ఎనర్జీ. మళ్ళీ ఈమెయే అంతరిక్షంలో ఉద్భవించే మెరుపులలో ఉన్న కోట్లాది వోల్టుల విద్యుచ్చక్తి కూడా.

వెన్నెముకలో కుండలినీ శక్తి సంచారం జరిగినప్పుడు కరెంట్ షాక్ కొట్టినట్లూ, విద్యుల్లతలు (మెరుపులు) వెన్నులో ప్రాకినట్లూ ఉండటం యోగులకు అనుభవైకవేద్యమే కదా !!

(ఇంకా ఉంది)
read more " ఛిన్నమస్తా సాధన - 8 (ఎల్లమ్మ తల్లి) "

12, సెప్టెంబర్ 2017, మంగళవారం

గురువుగారి తులా రాశి ప్రవేశం - ఫలితాలు

ఏడాది నుంచీ తానుంటున్న కన్యారాశి నుంచి నిన్న రాత్రి గురువుగారు తులా రాశిలోకి ప్రవేశించారు. ఈ రాశిలో కూడా ఏడాది పాటు ఉంటారు. కనుక ఒక వారం నుంచే అందరి జీవితాలలో మార్పులు కనిపిస్తూ ఉంటాయి. గమనించుకోండి. ముఖ్యంగా నిన్నా మొన్నలలో ఖచ్చితమైన మార్పులు కొన్ని మీమీ జీవితాలలో జరిగి ఉంటాయి చూచుకోండి.

ఈ గురుగోచారం వల్ల సామూహికంగా అందరి జీవితాలలో కనిపించే (General ) మార్పులు ఇలా ఉంటాయి.

మానవ సంబంధాలు విస్తృతం అవుతాయి. బాధ్యతలు పెరుగుతాయి. కొత్తవాళ్ళతో మాట్లాడతారు. దూరప్రాంతాలకు వెళతారు. వివాహం వాయిదా పడుతూ వస్తున్నవారికి వివాహం జరుగుతుంది. బేలన్స్ తో కూడిన ఆలోచన పెరుగుతుంది. కొత్త వ్యాపారాలు మొదలు పెడతారు. లేదా కొత్త వెంచర్స్ చేస్తారు.

ఇప్పుడు రాశి ఫలితాలు చూద్దాం.
-----------------------------------

ఈ ఫలితాలను లగ్నం/చంద్రరాశి/సూర్యరాశి మూడింటి నుంచి కలిపి చూచుకోవాలి. అప్పుడు స్పష్టత ఎక్కువగా ఉంటుంది. అంతేకాక, ఇంతకు ముందు వ్రాసిన రాహుకేతు గోచార ఫలితాలు కూడా కలుపుకుంటే కరెక్ట్ గా సరిపోతుంది.

మేషరాశి

సోషల్ రిలేషన్స్ పెరుగుతాయి. పెళ్లి అవుతుంది. బిజినెస్ పెరుగుతుంది లేదా కొత్త పుంతలు తొక్కుతుంది. కమ్యూనికేషన్ పెరుగుతుంది. దూరప్రాంతాలకు వెళ్ళవలసి వస్తుంది.

వృషభరాశి

శత్రువులు పెరుగుతారు. అధికారులతో విరోధాలు వస్తాయి. అనవసరమైన గొడవలు తలెత్తుతాయి. పొత్తికడుపుకు, జీర్ణక్రియకు సంబంధించిన రోగాలు బాధిస్తాయి.

మిథునరాశి

ఆలోచన పెరుగుతుంది. ఆధ్యాత్మిక చింతన ఎక్కువౌతుంది.చదువులో ముందుకెళతారు. ఉన్నత విద్య మొదలౌతుంది. సంతానానికి మంచి జరుగుతుంది. మంచి ఆలోచనలు చేస్తారు. షేర్ మార్కెట్లో లాభాలొస్తాయి.

కర్కాటక రాశి

ఇంట్లో మంచి వాతావరణం అభివృద్ధి అవుతుంది. చదువులో రాణిస్తారు. వృత్తిలో ఉద్యోగంలో వెలుగు కనిపిస్తుంది. వాహనాలు కొంటారు. చికాకులు శాంతిస్తాయి.

సింహరాశి

ఉత్సాహం పెరుగుతుంది. ఏదో చెయ్యాలన్న తపన ఎక్కువౌతుంది. కమ్యూనికేషన్ స్కిల్స్ పెరుగుతాయి. ధైర్యం వస్తుంది. ప్రయాణాలు ఎక్కువౌతాయి.

కన్యారాశి

మాటలో సౌమ్యత వస్తుంది. పలుకుబడి పెరుగుతుంది. ఆదాయం బాగుంటుంది. చదువు రాణిస్తుంది.

తులారాశి

ఆలోచనలలో పరిపక్వత వస్తుంది. బేలన్స్ గా ఉంటారు. మధ్యవర్తులుగా ఉండి తీర్పులు తీరుస్తారు. ధనాదాయం ఉంటుంది.

వృశ్చికరాశి

మానసిక మధనం ఎక్కువౌతుంది. అనుకోని ఖర్చులు పెరుగుతాయి. దూరప్రయాణాలు చేస్తారు. విదేశాలకు వెళతారు. స్త్రీలకు నెలసరి సమస్యలు ఉద్దృతం అవుతాయి. రోగంతో ఆస్పత్రి సందర్శనం జరుగుతుంది. నష్టాలు ఉంటాయి.

ధనూరాశి

అన్నింటా వెలుగు కనిపిస్తుంది. అనుకోని సహాయాలు అందుతాయి. లాభాలు కలుగుతాయి. ఆదాయం పెరుగుతుంది. మిత్రులు పెరుగుతారు. గ్యాస్ ట్రబుల్ మొదలైన జీర్ణాశయ బాధలు పెరుగుతాయి.

మకరరాశి

ఉద్యోగంలో బాధ్యతలు పెరుగుతాయి. కానీ మాట చెల్లుబాటు కాదు. ఇంట్లో పరిస్థితులు మెరుగు అవుతాయి. వస్తువులు మారుస్తారు లేదా రిపేర్ చేయిస్తారు. వాయిదా అవుతున్న పనులు కదులుతాయి. చదువులో రాణింపు ఉంటుంది. స్టాక్ మార్కెట్లో రాణిస్తారు.

కుంభరాశి

ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ధార్మిక ఆలోచనలు వృద్ధి అవుతాయి. పుణ్యక్షేత్రాలు గుడులు దర్శిస్తారు. ఆధ్యాత్మిక సాహిత్యం చదువుతారు. పెద్దలంటే గౌరవం పెరుగుతుంది. పెద్దలను జాగ్రత్తగా చూచుకుంటారు.

మీనరాశి

మానసిక చింత ఎక్కువౌతుంది. భయం పెరుగుతుంది. డబ్బు ఖర్చు ఎక్కువౌతుంది. మాటను ఎవరూ వినరు. జీర్ణశక్తి మందగిస్తుంది. జననేంద్రియ రోగాలు తలెత్తుతాయి. అతికి పోకుండా గుట్టుగా ఉంటే మంచిది. ఆటంకాలను ఆధ్యాత్మిక సోపానాలుగా మార్చుకుంటే మంచిది.
read more " గురువుగారి తులా రాశి ప్రవేశం - ఫలితాలు "

11, సెప్టెంబర్ 2017, సోమవారం

సమాజ సేవ

'డబ్బుతో ఆనందం రాదు. ప్రేమతో రాదు. విలాసాలతో రాదు. విహార యాత్రలతో రాదు. సేవ చెయ్యడంతోనే ఆనందం వస్తుంది. అందుకని ఇతరులకు సేవ చెయ్యి.' అని మదర్ తెరెసా అందని మొన్న నాతో ఎవరో అన్నారు. నాకు నవ్వొచ్చింది. 'మాయమాటలూ, అబద్దాలూ చెప్పి మతాలు మారిస్తే వొస్తుందా?' అనిపించింది.

'సేవ చెయ్యాలా? ఎవరికీ? ఎందుకూ? ఎలా?' అన్నాను.

అన్ని నీతులలాగే ఈ మాటలు కూడా పైపైన వినడానికి చాలా బాగున్నట్లు అనిపిస్తాయి. కానీ వీటిలో నిజం లేదు. ఒకప్పుడు, అంటే, వందా రెండు వందల ఏళ్ళ క్రితం ఈ మాటల్లో నిజం ఉందేమో? ఎందుకంటే అప్పటి మనుషులలో నిజాయితీ ఎక్కువ పాపభీతి ఎక్కువ. మంచితనం ఎక్కువ. అప్పటి సమాజంలో దరిద్రమూ ఎక్కువే, బాధలూ ఎక్కువే.కనుక అప్పట్లో 'సేవ' అనే పదానికి ఒక అర్ధమూ పరమార్ధమూ ఉండేవి. కానీ ఇప్పుడు కాదు.

అప్పట్లో తినడానికి తిండి ఉండేది కాదు. రోగాలొస్తే మందులకు డబ్బులుండేవి కావు. ఆడపిల్లలకు పెళ్ళిళ్ళు అయ్యేవి కావు. ఉద్యోగాలు దొరికేవి కావు. బ్రతకడానికి ఇప్పుడున్నన్ని అవకాశాలూ అప్పుడు లేవు. అవీ అప్పటి సమస్యలు. మరి ఇప్పుడో?

సెల్ ఫోన్ చార్జర్ మర్చిపోయా. చార్జ్ అయిపోతోంది. అవతల బాయ్ ఫ్రెండ్ / గరల్ ఫ్రెండ్ తో చాటింగ్ లో ఉన్నా. ఎలా? అనేది ఇప్పటి అతి పెద్ద సమస్య. ఇప్పుడు అమ్మాయిలే అబ్బాయిలను తిరస్కరిస్తున్నారు. ప్రతి బిరియానీ హోటలూ కళకళ లాడుతోంది. ప్రతి బారూ వెలిగిపోతోంది. ప్రతి షాపింగ్ మాలూ జనంతో క్రిక్కిరిసి ఉంటోంది. అవసరం ఉన్నదానికంటే ఎక్కువ మందులే ప్రతివారూ వాడి పారేస్తున్నారు. రోడ్డు పక్కన బజ్జీలు వేసుకునే వాడు కూడా నెలకు లక్ష సంపాదిస్తున్నాడు.

ఇప్పుడు మనుషులలో నిజాయితీ లేదు, స్వచ్చత లేదు, పాపభీతి లేదు, విశ్వాసం లేదు, కృతజ్ఞత లేదు, ఏ మంచి లక్షణమూ లేదు. ఇప్పుడున్నది ఒకటే - అవసరం. ఇంకా చెప్పాలంటే అవసరం కూడా కాదు, దురాశ. ఎవరికి నచ్చినా నచ్చకపోయినా ఇది చేదునిజం.

వాడుకున్నంత కాలం ఎదుటి మనిషిని వాడుకోవడం ఆ తర్వాత ఎంగిలి విస్తరాకులా విసరి అవతల పారెయ్యడం. ఇదే ప్రస్తుతం ఏ రంగంలోనైనా జరుగుతున్న అసలైన కధ. ఈ క్రమంలో ప్రేమా, దోమా, నమ్మకమూ, బొమ్మకమూ, విశ్వాసమూ, బొశ్వాసమూ ఈ పదాలన్నీ అర్ధాలను కోల్పోయాయి.

జిల్లెళ్ళమూడి అమ్మగారు ఇదే మాటను తరచుగా అనేవారు. ఆమెదంతా వాస్తవిక భావనలే గాని ఊహలు కావు. 'ప్రపంచంలో ఉన్నది అవసరం ఒక్కటేరా' అని ఆమె ఎన్నోసార్లు అన్నారు. ఇది అక్షర సత్యం.

అవసరం లేకపోతే ఈ లోకంలో ఎవరూ ఎవరినీ కనీసం పలకరించను కూడా పలకరించరు. ఏదో ఒక పని ఉంటేనే ఎవరైనా ఇంకొకరితో స్నేహంగానీ ప్రేమగానీ ఇంకేదైనా గానీ నటిస్తారు. ఆ అవసరం తీరాక 'నువ్వెవరు?' అన్నట్లు ముఖం పెడతారు. ఇది అనుభవం.

'అవసరం' - అనే బంధం లేకపోతే భార్యాభార్తలు కావచ్చు, ప్రేమికులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, బంధువులు కావచ్చు,ఇరుగూ పొరుగూ కావచ్చు - ఎవరూ కనీసం మాట్లాడుకోను కూడా మాట్లాడుకోరు. ఇలాంటి పరిస్థితులలో 'సేవ' అనే పదానికి అర్ధం ఎక్కడుంది? సేవ ఎవరికీ? ఎందుకూ?

విచిత్రమేమంటే - ఆధ్యాత్మిక ప్రపంచంలో కూడా ఇదే జరుగుతూ ఉంటుది. సామాన్యంగా మనం ఏమనుకుంటామంటే, ఆధ్యాత్మికం అంటే ఏదో ఉన్నతంగా, మానవ నీచత్వాలకు అతీతంగా ఉంటుందని, అక్కడంతా చాలా స్వచ్చంగా ఉంటుందని భావిస్తాం. కానీ అది నిజం కాదు. ఇక్కడున్నంత మురికి అక్కడా ఉంటుంది. ఇక్కడున్నన్ని నాటకాలు అక్కడా ఉంటాయి. కాకపోతే దానికి 'దైవత్వం' అని ఒక ముసుగు వేస్తారు అంతే.

'నువ్వే నా గురువ్వి. నువ్వు దైవంతో సమానం. నీ మాట నాకు వేదవాక్కు. నా తల్లీతండ్రీ అన్నీ నీవే. నువ్వేం చెబితే అదే సత్యం. నీ పాదపద్మాలే నాకు శరణ్యం' ఇలాంటి మాయమాటలు ఎవరైనా చెబుతున్నారూ అంటే అతి త్వరలోనే ఆ వ్యక్తి ఆ గురువుకు ఘోరమైన వెన్నుపోటు పొడవబోతున్నాడని అర్ధం. అంతేకాదు - అతని లోపల్లోపల ఆ గురువంటే అమితమైన ద్వేషమూ, అసూయా, కోపమూ నిండి ఉన్నాయన్నది యోగిక్ సైకాలజీ చెప్పే పచ్చి నిజం.

నిజమైన ప్రేమా విశ్వాసమూ నమ్మకమూ ఉన్నవాళ్ళు మాటల్లో చెప్పరు. చెప్పవలసిన అవసరం లేదు. వాళ్ళు ఆ విధంగా ఉంటారు. అంతే. మాటల్లో అతిగా చెబుతున్నారంటే, అదంతా పెద్ద మాయ అని అర్ధం.

ఒకడు తన భార్యతోనో ప్రియురాలితోనో I love you, I love you అని రోజుకు వందసార్లు అంటుంటే అర్ధమేమిటంటే - నిజానికి ఆ ప్రేమ అక్కడ ఏమాత్రమూ లేదని. తనలో ఆ ప్రేమ ఉందో లేదో తెలియని సందిగ్దతలో తన self assurance కోసం, తనకు తాను బూటకపు నమ్మింపు కోసం ఆ మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఇది పచ్చి నిజం.

అలాగే - ఇతరులకు 'సేవ' చెయ్యడంలోనే ఆనందం ఉంది అని చెప్పేవాళ్ళూ ఇంతే. వాళ్లకు లోపల్లోపల ఘోరమైన self guilt ఉంటుంది. ఆ guilt ను కప్పి పుచ్చుకోవడం కోసం 'సేవ' అనే నాటకం ఆడుతూ ఉంటారు. మదర్ తెరెసా అభిమానికి కూడా ఇదే మాట చెప్పాను.

అసలైన నిజం ఏమంటే - లోకం నుంచి గతజన్మలలో మనం ఎంతో దోపిడీ చేసి ఉంటే తప్ప ఈ జన్మలో దానికి 'సేవ' చెయ్యాలని మనకు అనిపించదు. నిజం చెప్పాలంటే - ఒక జన్మలో దోచుకున్నవారే ఈ జన్మలో 'సేవ' చేస్తారు. అలా చేసి ఆ ఋణం తీర్చుకుంటారు. వారికా విషయం తెలీక, మేమేదో గొప్ప సేవ చేస్తున్నాం అన్న భ్రమముసుగులో బ్రతుకుతూ self glorify చేసుకుంటూ ఉంటారు.

ఒకసారి ఒక వివేకానందస్వామి భక్తునితో కూడా ఇదే వాదన జరిగింది.

'స్వామి, సేవకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు. మీరు ఆయన అభిమానియై ఉండి ఇలా మాట్లాడతారేమిటి? అన్నాడు ఒక మిత్రుడు.

'ఏమన్నావ్? నేను ఆయన అభిమానినా? ఏం వాగుతున్నావ్? నాకెందుకా ఖర్మ?' అన్నాను.

అతను బిత్తరపోయాడు.

'అదేంటి అలా అంటున్నావ్?' అన్నాడు.

'అవును. అభిమాని అనే పదం ఏమిటి? ఆయనేమన్నా సినిమా నటుడా నేనాయన అభిమానిని కావడానికి? ఆయన నా దైవం. అభిమానం అనేది చాలా తక్కువ మాట. మాటలు సరిగ్గా వాడు' అన్నాను.

'ఓకే. ఆయన నీ దైవం అయినప్పుడు మరి ఆయన చెప్పిన సేవ అనే కాన్సెప్ట్ ను నువ్వెలా విమర్శిస్తున్నావ్?' అడిగాడు.

'ఒక సీక్రెట్ చెప్తా విను.' గొంతు తగ్గించి చిన్నగా అన్నా.

'ఏంటి?' అన్నాడు తనూ గుసగుసగా.

'నువ్వు నా ఫ్రెండ్ కాబట్టి నీకు ఈ రహస్యం చెబుతున్నా. ఎవరికీ చెప్పకు' అన్నా.

'ప్రామిస్. చెప్పను.' అన్నాడు చేతిలో చెయ్యి వేస్తూ.

'వారానికొకసారి వివేకానందస్వామి నాతో టెలీ కాన్ఫరెన్స్ లోకి వస్తూ ఉంటాడు. ఆయనే ఈ మాట చెప్పాడు.' అన్నాను.

అతని మొఖంలో భావం మారిపోయింది. అయోమయంగా చూశాడు.

'నమ్మలేవా? నీ ఖర్మ. అంటే ఫోన్లో కాదు. కలలో వచ్చి నాతో మాట్లాడి పోతూ ఉంటాడు. మొన్నోకసారి తనే ఇలా చెప్పాడు. "నేను బ్రతికి ఉన్నప్పుడు సేవ అనేది చాలా గొప్పది అనుకునేవాడిని. కానీ నా జీవితం చివరి దశలో నాకా నమ్మకం పోయింది. రెండో సారి అమెరికా యూరప్ అంతా తిరిగి వచ్చాక నా భావాలు చాలా మారిపోయాయి. ప్రపంచమంతా కుళ్ళు తప్ప ఇంకేమీ లేదని నేను నిశ్చయానికి వచ్చాను. ఈ కుళ్ళును ఎంత కడిగినా అది తగ్గదు. పోదు. కనుక మనకనవసరం అని నమ్మాను. ఈ విషయాన్నే నా సోదర శిష్యులతో నా చివరి దశలో చెప్పాను కూడా. వాళ్ళూ అదే మాటను నాతో అన్నారు.' అని నాతో పర్శనల్ గా ఆయనే చెప్పాడు అన్నాను కళ్ళు పెద్దవి చేస్తూ.    

'నేన్నమ్మను' అన్నాడు సీరియస్ గా.

'నువ్వు నమ్మితే ఎంత? నమ్మకపోతే ఎంత? అది నా కల. అది మా మధ్యన నడిచిన సంభాషణ. నేన్నమ్ముతాను. అది చాలు నాకు. పైగా చూశావా? నిజం చెబితే నువ్వే నమ్మటం లేదు. ఇంక లోకం ఎలా నమ్ముతుంది? కనుక ఆయన చెప్పింది నిజమే. లోకానికి అబద్దాలే కావాలి గాని నిజాలు కావు. లోకులంతా అబద్దపు బ్రతుకులే బ్రతుకుతున్నారనీ, వాళ్ళను మార్చడం అసాధ్యమనీ ఆయన చెప్పింది నీ కేసులోనే రుజువైంది. కనుక ఆయన చెప్పింది నిజమే.నా కొచ్చే కలలు కూడా నిజమే.' అన్నాను.

'అయితే లోకానికి సేవ చెయ్యడం అక్కరలేదా?" అన్నాడు.

'అస్సలక్కర్లేదు. మనది మనం కడుక్కుంటే చాలు' అన్నా మోటుగా.

'ఏంటో నీ గోల !! ఒకసారేమో సేవే గొప్పదంటావు. ఇంకోసారి సేవ వేస్ట్ అంటావు. అంతా అయోమయంగా ఉంది నీ తీరు.' అన్నాడు.

'నేను ఎప్పుడేది చెబితే అప్పటికదే నిజం. నా మాటలు వినాలంటే అలా ఉంటేనే వీలౌతుంది. నీ మనసును నువ్వు ఫాలో అవుతూ నన్ను కూడా ఫాలో అవ్వాలంటే కుదరని పని. ఎందుకంటే నా మనసును నేనే నమ్మను. కనుక నన్ను నమ్మాలంటే నీ మనసునూ నువ్వు నమ్మకూడదు. అంతేకాదు నేను చెప్పేవి కూడా పర్మనెంట్ గా నమ్మకూడదు. నేనో కొత్తది చెప్పేవరకూ పాతది నమ్మాలి. అదికూడా ఇంకో కొత్తది చెప్పనంతవరకే. ఆ తర్వాత దాన్నీ మర్చిపోవాలి. ఇలా పాతవి వదిలేస్తూ కొత్తవి ఒప్పుకుంటూ మళ్ళీ అవీ వదిలేస్తూ ఏదో తెలియని గమ్యం వైపు నాతో ప్రయాణించాలి. నాతో వ్యవహారం ఇలాగే ఉంటుంది.

నేను నీలా మురికిగుంటను కాను, ఒకటే నమ్మకం పెట్టుకుని పట్టుకుని కూచోడానికి. పారే నదిని. పారే నదిలో పాతనీరు పోతూ ఉంటుంది. కొత్త నీరు వస్తూ ఉంటుంది. అలాగే నా మాటలు కూడా మారిపోతూ ఉంటాయి. కానీ నువ్వు అర్ధం చేసుకోగలిగితే వాటిల్లో ఒకే రుచి ఉంటుంది. నీటి రుచి లాగే.' అన్నా సీరియస్ గా.

'నాయనా నీకో దణ్ణం. వస్తా.' అని వెళ్ళిపోయాడు వాడు.

'మోసమందు ఆధ్యాత్మిక మోసం వేరయా' - అన్నట్లుగా ఇదంతా  ఉంటుంది.

మొన్నీ మధ్యన ఇలాగే ఏవో మేగజైన్స్ కొని ఒక బుక్ స్టాల్ నుంచి బయటకు వస్తున్నా. సైకాలజీ బాగా తెలిసిన ఒక కుర్ర అయ్యప్ప వేషధారి ఎక్కడనుంచో సరాసరి నా ముందుకొచ్చి నిలబడి తన భుజం మీదున్న నల్ల కండువాను నా ముందు జోలెలాగా పట్టాడు. నా చేతిలో ఉన్న మేగజైన్స్ చూసి, 'అబ్బో చాలా కొన్నాడు. మనక్కూడా బాగా ఇస్తాడు' అనుకోని ఉంటాడు.

నేను సీరియస్ గా ఆ జోలి వైపు చూసి ' ఏంటి?' అన్నా.

'డబ్బులు' అన్నాడు నిర్లక్ష్యంగా.

వాడి మెడ మీద ఒక్క రౌండ్ హౌస్ కిక్ ఇద్దామని కాలు దానంతట అదే లేవబోయింది. కానీ రోడ్డుమీద ఒక అయ్యప్ప వేషంలో ఉన్నవాడిని తంతే బాగుండదని చాలా కంట్రోల్ చేసుకున్నా.

'ఎందుకు?' అన్నా.

'సేవ చేసుకోండి. పుణ్యం వస్తుంది' అన్నాడు వాడూ అంతే నిర్లక్ష్యంగా.

'నీ దగ్గర పుణ్యం అంత పుచ్చిపోతే రోడ్డుమీద ఎందుకు అడుక్కుంటున్నావ్?' అడిగా.

వాడు హర్ట్ అయ్యాడు.

'పోనీ ఒక రూపాయన్నా వెయ్యి' అన్నాడు ఏక వచనంలోకి దిగుతూ. ఇంతా చేస్తే వాడికి ఇరవై ఏళ్ళు కూడా ఉండవ్. స్టూడెంట్ లాగా ఉన్నాడు.

'పైసా కూడా ఇవ్వను. దొబ్బెయ్.' అన్నా సీరియస్ గా.

వాడు నావైపు చాలా సీరియస్ గా చూచి వెళ్ళిపోయాడు.

'సేవ' అనే పేరుతో మనిషి వీక్నెస్ ని బ్లాక్ మెయిల్ చెయ్యడం ఈ రోజుల్లో బాగా ఎక్కువైపోయింది. అసలు సేవ అనేది ఎవరికి కావాలి? ఈ రోజుల్లో డబ్బు లేనివాడు ఎవడున్నాడు అసలు?

సేవ అనేది ఎవరికి? ఎందుకు? అవసరం లేదు. లోకంలో జరిగే నాటకాలలో ఇదొక నాటకం అంతే. మనం ఎవరినీ నమ్మవలసిన పని లేదు. ఎవరికీ సేవ చెయ్యవలసిన పని లేదు. మన సేవ మనం చేసుకుంటే చాలు.

ఈ లోకంలో ఏదీ 'అన్యాయం' కాదు. ఇక్కడ ఎవరి ఖర్మ ప్రకారం వారికి జరుగుతూ ఉంటుంది. ఇంతకు ముందు నవ్వుతూ అహంకారంతో కళ్ళు పొరలు కమ్మి చేసుకున్నవాడు నేడు ఏడుస్తూ అనుభవిస్తూ ఉంటాడు. అది వాడి ఖర్మ. వాడి ఖర్మలో జోక్యం చేసుకునే పని మనకు లేదు. ఉండకూడదు అంతే.

ఏదో మనసులో పెట్టుకుని 'పిల్లా గడ్డికొస్తావా?' అన్నట్లుగానే, ఏవేవో మనసులో ఉంచుకుని 'మేం సేవ చేస్తున్నాం' అనుకోవడం కూడా ఉంటుంది.

నువ్వే ఒక కోతివి. ఒక కోతి, కోతుల సమూహానికి ఏం సేవ చెయ్యగలదు? దాని చాంచల్యాన్ని వదల్చుకుని ముందు అదొక మనిషిగా మారటమే అది చెయ్యవలసిన అతి ముఖ్యమైన పని.

ఒకడు కోతులకు అన్న సంతర్పణ చేద్దామని మొక్కుకున్నాడట. కోతులకు అన్న సంతర్పణా? అవి సక్రమంగా తింటాయా తిననిస్తాయా? మనుషులే బుద్ధిగా మౌనంగా కూచుని తినడం లేదు. ఇక కోతులు బుద్ధిగా తింటాయా? 

తనను తను ఉన్నతంగా మార్చుకుని ఇవాల్వ్ అయ్యే అసలైన పనిని వాయిదా వెయ్యడానికి ఉన్న అనేకమైన కుంటిసాకులలో 'సేవ' అనేది ఒక కుంటిసాకు. అంతే !!

ఇదే అసలైన ఆధ్యాత్మిక సత్యం.
read more " సమాజ సేవ "