“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

17, అక్టోబర్ 2019, గురువారం

Wooden Dummy Practice - 1

Wooden Dummy మీద కొన్ని రకాల పంచెస్ అభ్యాసం చేయడాన్ని ఇక్కడ చూడండి.


read more " Wooden Dummy Practice - 1 "

Mosquito Kung Fu

చెట్ల మధ్యన ప్రాక్టిస్ చేసే సమయంలో చెట్ల దోమలు మనల్ని కుడుతూ ఉంటాయి. వాటినుంచి కాచుకుంటూ డమ్మీ ప్రాక్టిస్ చెయ్యడమే 'మస్కిటో కుంగ్ ఫూ'. సరదాగా చేసిన ఈ క్లిప్ ను చూడండి. 'మస్కిటో కుంగ్ ఫూ' ఎలా ఉంటుందో తెలుసుకోండి !


read more " Mosquito Kung Fu "

13, అక్టోబర్ 2019, ఆదివారం

Making of Wooden Dummy

హైదరాబాద్ కు వచ్చాక ప్రతి ఆదివారమూ మా ఇంట్లో యోగసాధన జరుగుతోంది. ఆ తర్వాత కాసేపు మాట్లాడుకుని టీ త్రాగి ఎవరిదారిన వారు వెళ్లడం జరుగుతోంది. కానీ ఈ రోజు మాత్రం యోగా తర్వాత Martial Arts practice కోసం Wooden Dummy ని తయారు చేసే కార్యక్రమం పెట్టుకున్నాం. దానికోసం తోటలో ఒకచోట పడిపోయి ఉన్న చెట్టును సేకరించి దానిని చక్కగా రెండుముక్కలుగా నరికి ఒక చక్కని స్థలంలో దానిని పాతాము. ఆ తర్వాత దానికి కావలసిన పాడింగ్ చుట్టి కొద్దిసేపు దానిమీద పంచెస్ ప్రాక్టీస్ చెయ్యడం జరిగింది. Iron body training లో ఇదొక ముఖ్యమైన అంశం. ఆ ఫోటోలను ఇక్కడ చూడండి. read more " Making of Wooden Dummy "

7, అక్టోబర్ 2019, సోమవారం

బాసర సరస్వతీ అమ్మవారిని దర్శించాను

ఒకరోజున బాసర స్టేషన్ తనిఖీకి వెళ్లాను. అక్కడి స్టాఫ్ ని అడిగితే ఉదయం నాలుగున్నరకే ఆలయం తెరుస్తారని చెప్పారు. ఉద్యోగానికి సంబంధించిన పని అయిపోయాక తెల్లవారు ఝామున నాలుగున్నరకు బయల్దేరి పది నిముషాలలో ఆలయం దగ్గరకు చేరుకున్నాను. అక్కడ చడీచప్పుడూ ఏమీ లేదు. షాపులూ, ఆలయం కౌంటర్లూ అన్నీ మూసేసి ఉన్నాయి. జోగుతున్న సెక్యూరిటీ వారిని అడిగితే ఆరుగంటలకు మాత్రమే లోనికి వదుల్తామనీ, ఈలోపల అమ్మవారికి అలంకారం చేస్తుంటారనీ అన్నారు.

ఒక గంటసేపు ఆ బజార్లు అన్నీ తనిఖీ చేశాను. ఎక్కడా శుచీ శుభ్రతా లేదు. వానలు బాగా పడుతున్నాయేమో రోడ్లన్నీ తడిగా బురదగా ఉన్నాయి. దానికి తోడు, యాత్రికులు, హోటలు వాళ్ళు రోడ్డుమీదే పారేసిన చెత్త ఎక్కడబడితే అక్కడ కనిపిస్తోంది. దేశమంతా స్వచ్చభారత్ పాటిస్తోంది. ఇక్కడ మాత్రం చెత్త భారత్ కనిపించింది. బాధ కలిగింది.

మన పౌరుల దగ్గరా, అందులోనూ భక్తుల దగ్గరా సివిక్ సెన్స్ ఆశించడం అనేది ఒక పెద్ద పొరపాటనే విషయం నాకు బాగా తెలుసు. అసలు భక్తులనేవాళ్ళే పెద్ద దొంగలు. స్వార్ధపూరితమైన కోరికలతో మాత్రమే వాళ్ళు గుళ్ళూగోపురాలూ తిరుగుతూ ఉంటారు. అలాంటి స్వార్ధపూరిత మనస్తత్వాలు ఉన్నవాళ్ళు పర్యావరణం గురించి, శుభ్రత గురించి, సివిక్ సెన్స్ గురించి ఎందుకు ఆలోచిస్తారు? అందుకే మన యాత్రాస్థలాలన్నీ చెత్త కుప్పలుగా ఉంటుంటాయి. అందుకే, నేను అసహ్యించుకునే వారిలో సోకాల్డ్ భక్తులు మొదటి వరుసలో ఉంటారు.

దాదాపు ముప్పైఏళ్ళ క్రితం ఒకసారి బాసర వచ్చాను. కానీ నేను వెళ్ళిన సమయంలో ఆలయం మూసేసి ఉంది. తలుపులు వేసున్నా తీసున్నా మనకు పెద్ద తేడా ఉండదు గనుక, బయటనుంచే దణ్ణం పెట్టుకుని తిరిగి వచ్చేశాను. తర్వాత మళ్ళీ ఇన్నేళ్ళకు కుదురుతోంది.

బాసరలో అప్పటికీ ఇప్పటికీ చాలా మార్పు ఉంది. అప్పట్లో దేవాలయం చాలా చిన్నగా ఉండేది. వాతావరణం ఒక కుగ్రామంలా ఉండేది. షాపులు ఇన్ని ఉండేవి కావు. ఇప్పుడు చుట్టూ చాలా హంగులు వచ్చాయి. వ్యాపారం పెరిగింది. మనుషుల సందడితో, వ్యాపారాలతో వచ్చే దరిద్రపు 'ఆరా' ఎక్కువైంది. ప్రకృతి సహజమైన ఆధ్యాత్మిక ఆరా తగ్గింది. ఈ ఆలయాన్ని కూడా ఒక పర్యాటకస్థలంగా వృద్ధి చేద్దామనే ప్రభుత్వతపన స్పష్టంగా కనిపిస్తోంది. ఈ క్రమంలో అసలైన ఆధ్యాత్మికత గంగలో కలుస్తోంది. అప్పటికీ ఇప్పటికీ, ఇదే నాకు కనిపించిన పెద్ద తేడా.

బయట ఉన్న వ్యాసుని ఆలయం వద్ద కాసేపు కూచున్నాను. 'ఇక్కడ గోదావరి నది ఉన్నది గనుక ఆయన కొన్నాళ్ళు ఈ కొండమీది గుహలో ఉంటూ తపస్సు చేశాడన్నమాట. ఏం చెయ్యాలన్నా తిండీ నీరూ ఉండాలి. అవి లేకుంటే తపస్సు కూడా సాగదు! కనీసం వ్యాసమహర్షి ఎందుకు ఇక్కడ తపస్సు చేశాడు? అని కూడా ఎవరూ ఆలోచించడం లేదు! అయితే అక్షరాభ్యాసం, లేకపోతే పర్యాటకం. ఇదీ జనానికి అర్ధమైన విషయం !' అనుకున్నాను.

టైం ఆరయింది. కౌంటర్లు తెరిచారు. దర్శనానికి కదిలాను. అప్పటికే లోపల ఒక పదిమంది ఉన్నారు. పెద్ద సందడి లేదు. అమ్మ దర్శనం చేసుకుని, కొండపైన ఉన్న వ్యాసగుహకు వెళ్లాను. అక్కడైతే, నేను తప్ప ఎవరూ లేరు. అక్కడికి వెళ్ళే దారిలో షాపులన్నీ మూసేసి ఉన్నాయి. గుహకు అడ్డంగా ఇనుప రెయిలింగ్ ఉన్నది. గుహకు వెళ్ళే దారిలో భక్తులూ షాపుల వాళ్ళూ పారేసిన గార్బేజ్ చూస్తె రెండోసారి అక్కడకు రావాలనిపించలేదు. అంతగా వాడేసిన పూజాసామగ్రీ, దండలూ, చెత్తా చెదారమూ ఎక్కడ బడితే అక్కడ గుట్టలుగా వేసి ఉన్నాయి.

గుహనుంచి తిరిగి వస్తుంటే అప్పుడే షాపులు తెరుస్తున్నారు. ఏం చెబుతాడో చూద్దామని, 'ఆ గుహలో ఏముంటుంది?' అని ఒకాయన్ని అడిగాను. 'అమ్మవారు ఆక్కడే మొదటగా పుట్టింది' అన్నాడు. చచ్చే నవ్వొచ్చింది. ' మీ వ్యాపారాల కోసం ఎన్నెన్ని అబద్దాలు చెబుతార్రా మీరు? అమ్మవారు ఇక్కడ పుట్టిందని నిజంగా మీరనుకుంటే ఈ ప్రదేశాన్ని ఇంత దరిద్రంగా ఎలా ఉంచుతారు?' అనుకున్నా.

మన దేవాలయాల కంటే, చర్చిలూ మసీదులూ చాలా శుభ్రంగా, పద్దతిగా ఉంటాయి. దేవుడు అక్కడ ఉన్నాడని వాళ్ళు నమ్ముతారు గనుక వాటిని ఎంతో శుభ్రంగా ఉంచుతారు. మనకేమో ఆ స్పృహే ఉండదు. మన దేవాలయాలన్నీ మురికికూపాలు. అక్కడ దేవుడున్నాడని మనం అనుకుంటే అక్కడ చెత్తా చెదారం ఎలా పారేస్తాం? అక్కడే నానా రాజకీయాలూ మాట్లాడుకుంటూ అరుచుకుంటూ ఒకరినొకరు తోసుకుంటూ ఎలా ఉంటాం? అందుకే పాపులర్ హిందూమతమంతా పెద్ద డొల్ల అని నేనెప్పుడూ అంటాను. 

బయటకొచ్చాను. ఆటోలు లేవు. ఉన్న ఒకడూ 'ఒక్కరికైతే నేను రాను' అన్నాడు. 'సరే, మార్నింగ్ వాక్ చేసినట్లు ఉంటుంది' అనుకుంటూ రెండు కి.మీ. దూరంలో ఉన్న స్టేషన్ కు నడక సాగించాను. దారిలో అన్ని కులాల సత్రాలూ దండిగా దర్శనమిచ్చాయి. 'అకులా సమయాంతస్థా సమయాచార తత్పరా' అనే లలితానామం గుర్తొచ్చింది. నవ్వుకున్నాను. 

ప్రభుత్వమూ, ప్రజలూ కలసి ఈ క్షేత్రంలో పిల్లల అక్షరాభ్యాసానికి ఎక్కువగా ప్రాధాన్యతను పెంచుతున్నారు. మిగతా వాళ్ళు, ఏవేవో గొంతెమ్మ కోరికలతో ఇక్కడకు వస్తున్నారు. కులసత్రాలు కడుతున్నారు. పూజారులేమో వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళు చేస్తున్నారు. అంతేగాని, సరస్వతీదేవి అసలైన తత్వాన్ని ఎవరూ గమనిస్తున్నట్లు నాకు అనిపించలేదు. ఉపాసకులనేవాళ్ళు ఎక్కడా లేరు. ఇది తపోభూమి అన్న విషయం కూడా ఎవరికీ గుర్తు లేదు. 'తారాస్తోత్రం' లో అమ్మవారిమీద నేను వ్రాసిన కొన్ని శ్లోకాలూ పద్యాలూ గుర్తొచ్చాయి. ప్రపంచమంతా ఇంతే ! చక్రవర్తి దర్బార్ లో నిలబడి పుచ్చు వంకాయలు కోరుతున్నారు మనుషులు ! తపోభూమిని షాపింగ్ కాంప్లెక్స్ గా మారుస్తున్నారు. ఛీ ! అని అసహ్యం వేసింది.

'ఈ చౌకబారు మనుషులని ఎలా భరిస్తున్నావమ్మా?' అని మనసులో అనుకుంటూ స్టేషన్ కు నడక సాగించాను.
read more " బాసర సరస్వతీ అమ్మవారిని దర్శించాను "

6, అక్టోబర్ 2019, ఆదివారం

లంబస్తనీం వికృతాక్షీం.....

'లంబస్తనీం వికృతాక్షీం
ఘోరరూపాం మహాబలాం
ప్రేతాసన సమారూడాం
జోగులాంబాం నమామ్యహమ్'

(పెద్ద పాలిండ్లు కలిగి, వికృతమైన కన్నులతో, ఘోరమైన రూపంతో, మహాబలశాలియై, శవంమీద కూర్చొని ఉన్న జోగులాంబను ధ్యానిస్తున్నాను)

ఆలంపురం జోగులాంబ ధ్యానశ్లోకం ఇది.

మొన్న ఒకరోజున కర్నూల్ టౌన్ ఆలంపురం మధ్యలో అర్ధరాత్రి తనిఖీకి వెళ్ళవలసి వచ్చింది. అది కూడా నవరాత్రుల మధ్యలో.

ముప్పై ఏళ్ల క్రితం నేను ఆదోనిలో ఉన్నప్పుడే తంత్రసాధన చేస్తూ ఉండేవాడిని. అక్కణ్ణించి వయా కర్నూల్ రూట్లో వస్తే అలంపురం దగ్గరే గనుక, అలంపురం వెళదామని అనుకున్నాను. కానీ అవలేదు. ఇప్పటికి ఆ అవకాశం వచ్చింది. ఖడ్గమాలలో చెప్పబడిన యోగినుల ఆలయాలు ఇక్కడ ఉండేవని నేను విన్నాను.

కర్నూల్ లో దిగి ఆలంపురం దగ్గరకు చేరేసరికి సరిగ్గా రాత్రి పన్నెండున్నర అయింది. వచ్చిన పని ముగించుకుని తిరుగు ప్రయాణంలో ఉండగా, 'సార్. గుడికి పోనిమ్మంటారా' అని డ్రైవర్ అడిగాడు.

'ఒద్దు. ఈ టైం లో గుడి మూసేసి ఉంటుంది కదా ! ఇంకోసారి వద్దాం. కానీ ఇక్కడే కాసేపు ఆపు' అన్నాను.

కారాగింది.

బయటకు దిగి, ఆలయం ఉన్న దిక్కుగా చూస్తూ అక్కడే చీకట్లో కాసేపు నిలుచున్నాను. చుట్టూ చీకటి, పొలాలు, వర్షపునీటికి కప్పల బెకబెకలు తప్ప ఇంకేమీ వినిపించడం లేదు. 'సార్ చీకట్లో అలా నిలబడకండి. పాములుంటాయి'. అన్నాడు డ్రైవర్.

నవ్వాను.

కాసేపు అక్కడ ఉన్న తర్వాత కారెక్కి 'పోనీ' అన్నా. కారు కర్నూల్ చేరింది.

నవరాత్రులలో అర్ధరాత్రి పూట అక్కడకు వచ్చిన పని పూర్తయింది.

ఈ ఆలయం ఏడో శతాబ్దం నాటిది. అంటే తంత్రయుగానికి చెందినది. ఇక్కడ అమ్మవారి అసలు విగ్రహం భయంకరంగా ఉంటుంది. జోగులాంబ అంటే యోగుల అమ్మ అని అర్ధం. అంటే జగన్మాత అన్నమాట. ఇది జమదగ్ని మహర్షి, రేణుకాదేవులు నివసించిన ప్రదేశం అని ఒక స్థలపురాణం చెబుతున్నది. శివుని కోసం బ్రహ్మ తపస్సు చేసిన ప్రదేశం అని ఇంకో పురాణం అంటుంది. ఈ కధలు నిజమైనా కాకపోయినా, దాదాపు పన్నెండు వందల ఏళ్ళ క్రితమే ఇది ప్రసిద్ధి చెందిన తాంత్రికక్షేత్రం అన్నది వాస్తవం. అక్కడ నాకు కలిగిన అనుభవం దీనినే రూడి చేస్తున్నది. తంత్రం పుట్టుక గురించి నా పాత వ్యాసాలు 'ఛిన్నమస్తా సాధన' అనే సీరీస్ లో చదవండి.

బెంగాల్ ప్రాంతంలో ఎనిమిదో శతాబ్దంలో పుట్టిన తంత్రం అక్కణ్ణించి హిందూమతంలోనూ, బౌద్ధంలోనూ ప్రవేశించింది. శైవ, శాక్త, వైష్ణవ సాంప్రదాయాలలో అది వేళ్ళూనుకున్నప్పటికీ, శైవం లోనూ, శాక్తమ్ లోనూ బాగా నిలదొక్కుకున్నది. వజ్రయానంగా టిబెటన్ బౌద్ధంలో ప్రవేశించింది. మహాయానాన్ని ప్రభావితం చేసింది. కాలక్రమేణా అసలు తంత్రం కనుమరుగై, పనులు కావడం కోసం పూజలు చేసే క్షుద్రతంత్రం అక్కడక్కడా మిగిలి పోయింది.  ఆ ఆలయాలన్నీ తమతమ రూపురేఖలు మార్చుకుని, వైదిక సాంప్రదాయం ప్రకారం మార్చబడి, ప్రాంతీయంగా ఉన్న అమ్మతల్లుల పూజలతో కలసిపోయి, నేడు ఈ రూపంలో మనకు కనిపిస్తున్నాయి. ముస్లిం దండయాత్రలలో ఈ ఆలయం పూర్తిగా నేలమట్టం చెయ్యబడింది. ఆ తర్వాత కొన్ని వందల ఏళ్లకు దీనిని మళ్ళీ కట్టారు. ఇప్పుడు ఆలయం ఉన్న స్థలం అసలైన స్థలం కాదు.

జోగులాంబ అమ్మవారి జుట్టులో బల్లి, గుడ్లగూబ, తేలు ఉంటాయి. ధ్యానశ్లోకం ప్రకారం ఆమె మూర్తి చాలా భయంకరం. కాళీమాతకు ఒక రూపం ఈమె. శ్మశానకాళిక అని ఈమెను అనుకోవచ్చు. పిచ్చిలోకులు ఈమెను గృహదోషాలు పోగొట్టే దేవతగా ఆరాధిస్తున్నారు. కానీ, మార్మిక సంకేతాలతో కూడిన ఈమె రూపం అత్యంత ఉన్నతమైన పరిపూర్ణ యోగసిద్ధిని కలిగించే దేవతారూపం అన్న సంగతి తాంత్రికయోగులు మాత్రమే గ్రహించగలరు. లోకులకు భయాన్ని కలిగించే తల్లి రూపం, వారికి అత్యంత ప్రేమను పుట్టిస్తుంది.

'లంబస్తని' అనేది జీవులకు పాలిచ్చి పోషించాలనే అత్యంత ప్రేమకు, మెత్తని హృదయానికి సంకేతపదం. 'వికృతాక్షి' అంటే, ఇంద్రియలోలత పైన అమితమైన కోపానికి, జాగృతమైన మూడవకంటికి సూచన. విరూపాక్ష అనే పదమూ, వికృతాక్షి అనే పదమూ సమానార్థకాలే. వికసించిన ఆజ్ఞాచక్రానికి ఇవి సూచికలు. 'ఘోరరూపా' అంటే, ప్రపంచపు డొల్ల కట్టుబాట్లను లెక్కచెయ్యని విశృంఖలత్వమూ, ఆత్మచైతన్యమూ అని అర్ధాలు. 'మహాబలా' అనేది అమితమైన వీర్యశక్తికి, ప్రాణశక్తికి సూచిక. 'ప్రేతాసన సమారూడా' అనేపదం సమాధిస్థితిలో జాగృతమైజడత్వాన్ని అధిరోహించిన దివ్యచైతన్యశక్తికి మార్మిక సూచన. ఈ మార్మికకోణాలలో దర్శిస్తే ఆమె భయంకరరూపం అత్యంత సౌమ్యంగా, ప్రేమమయంగా కనిపిస్తుంది.  

దేహమే ఆత్మకు గృహం. గృహదోషాలంటే మనం ఉండే ఇంటిదోషాలు కావు. జన్మజన్మాన్తరాలలో దేహాన్ని పట్టుకుని ఉన్న సంస్కార దోషాలు. వాటిని పోగొట్టడం అంటే, సంస్కార నాశనం చేసి కర్మపరంపర అనబడే పొలిమేరను దాటించడం. ఎల్లలను దాటిస్తుంది గనుక ఎల్లమ్మ అయింది. కుండలినీ శక్తికి ఈమె ప్రతిరూపం. పొలిమేరలు దాటించే దేవతను, పొలిమేరల లోపల ఉండే సుఖాల కోసం పూజిస్తున్నారు పిచ్చి లోకులు !

ఛిన్నమస్త, రేణుక, భైరవి, ఎల్లమ్మ - ఇవన్నీ ఈమె పేర్లు. తెలంగాణా ప్రాంతానికి ఈమె అధిష్టానదేవతగా అనేక వేల ఏళ్ళనుంచి కొలువై ఉంది. శ్రీవత్సగోత్రం వారికి ఈమె కులదేవత అవుతుంది. వారిలో ఆమె రక్తమే ప్రవహిస్తున్నది. సరియైన సిద్ధుల వద్ద గ్రహించి ఈమె ఉపాసన గావిస్తే, మహత్తరమైన యోగసిద్ధిని అచిరకాలంలో కలిగించి, మానవజీవితపు పొలిమేరలు దాటిస్తుంది.

ఈ విధంగా, నవరాత్రులలో, అర్ధరాత్రిపూట చీకట్లో, అలంపురం దగ్గర పొలాలలో, ఈ దేవతను దర్శించాను.
read more " లంబస్తనీం వికృతాక్షీం..... "