“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

30, ఏప్రిల్ 2010, శుక్రవారం

మంత్రాలయ మఠం- రేణుకాదేవి ఆగ్రహం


నిన్న సాయంత్రం మంత్రాలయ రాఘవేంద్ర స్వామి దర్శనం చేసుకున్నాను. మఠమూ, ఊరూ మునిగిపోయిన తర్వాత ఇదే నేను మంత్రాలయం దర్శించడం. ఊరికి చాలా ముందుగానే దారిపొడుగునా చెట్లకు ఎండుగడ్డి వేలాడుతూ కనిపించింది. అంటే వరదకు కొట్టుకొచ్చిన గడ్డి చెట్లకు పట్టుకుని వరద తీసిన తర్వాత అలా వేలాడుతూ ఉండిపోయిందన్నమాట. నీరు మేటవేసిన మేరకు గీత గీసినట్లు, ఊరిలో కూడా చాలా ఇళ్ళకు గుర్తులు ఉండిపోయాయి.

దర్శనం అంతా బాగానే జరిగింది. గురువారం అయినా భక్తులు పెద్దగా లేరు. బుధవారం రాత్రికి కర్ణాటక భక్తులు వచ్చి చేరుకుంటారు. గురువారం తెల్లవారుఝామున దర్శనం చేసుకుని మధ్యాహ్నానికి వెనక్కు బయలు దేరి వెళతారు. ఊరు పూర్తిగా ధ్వంసం అయింది. గ్రౌండ్ ఫ్లోర్ వరకూ అన్ని ఇళ్ళూ, షాపులూ మునిగి పోయాయి. ఒండ్రు మట్టిలో ఊరు మేట వేసింది. ఒండ్రుమట్టి ఎండకు ఎండుతున్నపుడు భయంకరమైన దుర్వాసన ఊరంతా వ్యాపించిందని చెప్పారు. ఇప్పుడిప్పుడే తిరిగి షాపులూ, వ్యాపారమూ అవీ తిరిగి పుంజుకుంటున్నాయి.

ఆలయం కూడా సన్ షేడ్ లెవెల్ వరకూ మునిగింది. ఆలయం నిండా పాములు, తేళ్ళు, ఇతర కీటకాలు కుప్పలుగా కొట్టుకొచ్చాయిట. ఎన్ని రకాల పాములనో చూచామని ఆలయ పూజారులు చెప్పారు. పాము కాట్లకు కూడా కొందరు మరణించారట. మేటవేసిన ఒండ్రు మట్టిలో యాసిడ్ లక్షణాలుండి, క్లీన్ చేసిన పనివాళ్ళ కాలి వేళ్ళను చేతివేళ్ళను తినేశాయిట. మొత్తం ఆలయం శుభ్రం చెయ్యటానికి దాదాపు నెలరోజులపైగా పట్టిందిట.

తుంగభద్రానది విశ్వరూపం దాల్చి ఇంత విధ్వంసం సృష్టించడానికి కారణాలు ఏవై ఉంటాయా అని నేను రకరకాలైన కోణాల్లో ఆలోచించాను. జ్యోతిష్య పరంగా కొంత పరిశోధన కూడా చేశాను. కారణాలు అలా ఉంచితే, నిన్న నాకు ఒక విచిత్రమైన విషయం తెలిసింది. ఆలయ ప్రముఖుడొకరు విషయాన్ని నా చెవిన వేశారు.

మంత్రాలయ మఠం పక్కనే గ్రామదేవత మంచాలమ్మ ఆలయం ఉంటుంది. సందర్శకులు ముందుగా మంచాలమ్మను పూజించి తరువాత రాఘవేంద్ర స్వామిని దర్శిస్తారు. అసలీ గ్రామం పేరు మంచాల. గ్రామ దేవత మంచాలమ్మ. అంటే రేణుకాదేవి. చాలా చోట్ల ఉండే విగ్రహం లాగానే, ఒక దేవీ మూర్తి శిరస్సు మాత్రం మంటలతో ఆవరింపబడిన కిరీటం తో కూడి ఉంటుంది. ఈమె చాలా ఉగ్ర మూర్తి అని అంటారు. భారత దేశం మొత్తం మీద ఎక్కడైనా సరే, గ్రామదేవతగా పూజించబడుతున్నది రేణుకాదేవి మాత్రమే అని కొందరి భావన. ఈమెను దుర్గాదేవిగా, కాళిగా కూడా కొందరు పూజిస్తారు. ఉత్తర భారతంలో జ్వాలాముఖి అనే పేరుతో అర్చింపబడుతుంది. ఎక్కడైనా సరే, ఒక ముఖం మాత్రమే ఉన్న దేవీ విగ్రహం ఉంటే, అది రేణుకాదేవి విగ్రహమే అని నేను నమ్ముతాను.

రేణుక పరశురామ జనని. ఒక అవతార మూర్తి జనని మామూలు మనిషి అయి ఉండే అవకాశం లేదు. అందులోనూ పరశురామావతారం ఉగ్రమైనది. మహత్తరమైన వీరవిద్యలకు ఆద్యుడు పరశురాముడు. పరశురాముడు ఖండించిన శిరస్సు రూపంలో రేణుకాదేవి నేటికీ అలాగే పూజలందుకుంటూ ఉన్నది. దశమహావిద్యలలో- తన తలను తానే ఖండించుకునే రూపంలో దర్శనం ఇచ్చే, ఛిన్నమస్త ఈమే అని గణపతి ముని (నాయన) అంటారు. యోగమార్గంలో సిద్ధిదాత్రి అయిన కుండలిని శక్తి, రేణుకాదేవి ఒక్కరే అని తాంత్రికులు యోగులు చెబుతారు. రేణువుల రూపంలో భూమిని చేరుతున్న విశ్వ శక్తియే (Cosmic Energy) రేణుక అని యోగుల భావన.

రేణుకాదేవి ఆలయం ఎందువల్లనో ఒక ఏడాది క్రితం నుంచీ నిర్లక్ష్యానికి గురై, సరిగా పట్టించుకోబడకుండా పోయిందనీ, పాత ఆలయం స్థానంలో కొత్తగా ఒక ఆలయం కడుతూ, పాత విగ్రహాన్ని కదిలించి పక్కన ఉంచి, సరియైన పూజాపునస్కారాలు లేకుండా ఏడాది నుంచీ ఉంచారనీ అందువల్లనే ఆమె తన ఉగ్ర రూపాన్ని చూపిందని, అందువల్లనే తుంగభద్ర పొంగి ఆలయాన్ని ముంచిందనీ ఆయన చెప్పాడు. మరి ప్రస్తుతం ఏం చేస్తున్నారు అని అడిగాను. కారణం తెలుసుకున్న తరువాత ఇప్పుడు జాగ్రత్తగా పూజలు చేస్తున్నామని ఆయన చెప్పాడు.

ఎందరి సమస్యలనో తీరుస్తున్న రాఘవేంద్రస్వామి, తన ఆలయం మునిగిపోతుంటే ఎందుకని ఊరుకున్నారు? అని మా అమ్మాయి అడిగింది. నేను సమాధానం చెప్పలేదు. అది నాకూ తెలియదు. ఏది ఊహించినా అది మన ఊహ మాత్రమే. ఊహ కొంత నిజం కావచ్చు. కొంత కాకపోవచ్చు. అసలు కారణాలు మనకేం తెలుసు? అందుకే నేను ఏమీ చెప్పలేదు. కాని "మునిగిపోవటం కూడా ఆయన సంకల్పమే కావచ్చు" అని ఒక్కమాట మాత్రం చెప్పాను. "అన్నం పరబ్రహ్మ స్వరూపమైతే, మరి అశుద్ధమో?" అన్న జిల్లెళ్ళమూడి అమ్మగారి మాట నాకు హఠాత్తుగా గుర్తొచ్చింది. "మంచి జరగడం మాత్రమే దేవుని కరుణ కాదు, చెడు కూడా వాడి కరుణే " అని ఆమె ఎప్పుడూ అనేవారు.

ఒకసారి దక్షిణేశ్వర్ కాళికాలయంలో దొంగలు పడి శ్రీకృష్ణుని నగలు దోచుకుని పోతారు. అప్పుడు రాణి రాసమణి అల్లుడైన మధురానాధ్ కోపంతో " నీ నగలు కాపాడుకోలేని నువ్వేం దేవుడివి" అని అంటాడు. అది విని శ్రీరామకృష్ణులు ఆతన్ని బాగా చీవాట్లు పెడతారు. " నీ దృష్టిలో నగలు గొప్పవి
కావచ్చు. కాని భగవంతుని దృష్టిలో అవి మట్టితో సమానం. సర్వ సంపదలకూ మూలం అయిన మహా లక్ష్మి ఆయన పాదాల వద్ద ఉంటుంది. అది గ్రహించి మాట్లాడితే మంచిది" అని ఆయన మధురానాధ్ కి సలహా ఇస్తారు. ఘటన నాకు గుర్తోచ్చింది.

పైగా ఇటువంటి ఘటనలకు చాలా సూక్ష్మ కారణాలుంటాయి. యాత్రా స్థలాలు క్రమేణ
పవిత్రతను కోల్పోవటం, రాజకీయ జోక్యాలు మితిమీరటం, విలాసాలు విందులు ఎక్కువ కావటం, నిర్వహణాధికారులలో నిర్లక్ష్యం, అవినీతి, ఊరిలో కూడా అపవిత్రత పెరగటం వంటి అనేక కారణాలుంటాయి. మన ఇల్లు కంపు కొడుతుంటే మనం ఏం చేస్తాం? నీళ్ళతో శుభ్రంగా కడుక్కుంటాం. అలాగే ఊరు ఊరంతా ఒక్క సారి కడగబడినట్లుగా అలా జరిగింది.

ఈ సారి నేను గమనించిన ఇంకో విచిత్రం. రాఘవేంద్ర స్వామి సమాధి పక్కనే ఇంకొక స్వామి సమాధి ఉంటుంది. మేము వెళ్ళేసరికి అక్కడ ఉన్న అర్చక స్వామి రుద్ర పారాయణ చేస్తున్నాడు. నాకు ఆశ్చర్యం కలిగింది. మధ్వ సాంప్రదాయులు శివ స్మరణ అస్సలు చెయ్యరు. శివ స్తోత్రాలు పఠించరు. అలాటిది ఆయన పెద్ద గొంతుతో రుద్రపారాయణ చెయ్యటం నాకు చాలా వింతగొలిపింది.

ఏది ఎమైనా, ఈ వరదల తర్వాత, అక్కడ ప్రజలలో కొంత భయ భక్తులు మళ్ళీ కనిపిస్తున్నాయి. ఇంతకు ముందు ఉన్న పొగరు, నిర్లక్ష్యం, మితిమీరిన విచ్చలవిడి తనం తగ్గాయి. ప్రకృతి వైపరీత్యాలు జరగడం వల్ల మానవులలో నీతి నియమాలు పెరిగితే బహుశా వైపరీత్యాల ఉద్దేశ్యం చాలావరకు నెరవేరినట్లేనేమో? పర్యావరణ సమతుల్యం మాత్రమే గాక, మానసిక నైతిక సమతుల్యం కూడా తద్వారా సాధింపబడితే ప్రకృతి యొక్క ప్రయోజనం ఫలించినట్లేనా? ప్రకృతికి వర్తించే ఈ సూత్రం మనిషి జీవితానికి కూడా వర్తిస్తుందా? అదే నిజమైతే, మనిషి జీవితంలో చెడు సంఘటనలు జరిగితే, అవి అతన్ని ప్రక్షాళన చెయ్యడానికి భగవంతునిచే / ప్రకృతిచే జరపబడుతున్న కార్యక్రమంగా అనుకోవచ్చా?

కొన్ని ప్రశ్నలకు జవాబులుండవు మరి.
read more " మంత్రాలయ మఠం- రేణుకాదేవి ఆగ్రహం "

25, ఏప్రిల్ 2010, ఆదివారం

బుద్ధుని అసలైన జనన సంవత్సరం


నేను అమితంగా అభిమానించి, అనుసరించే అవతారమూర్తులలో శ్రీకృష్ణుడు, బుద్ధుడు ప్రముఖ స్థానాలు ఆక్రమిస్తారు. అంటే మిగిలిన అవతార పురుషులంటే నాకు ఇష్టం లేదని అర్ధం కాదు. ఒక్కొక్కరిలోని కొన్ని కొన్ని దివ్యగుణాలు నన్ను ఎక్కువగా స్పందింపచేస్తాయి. శ్రీరామచంద్రుని లోని ధార్మికత, పరశురామునిలోని వీరత్వం, నన్ను ఎక్కువగా ప్రభావితం చేస్తాయి.అదే కోణంలో, మానవ పరిధిలోకి దిగివచ్చిన పరిపూర్ణమైన దివ్య మూర్తిగా శ్రీకృష్ణుని, ఎంతో దూర దృష్టి కలిగిన జ్ఞానమూర్తిగా బుద్ధుని ఆరాధిస్తాను.

బుద్ధుని జాతకం చూద్దామని చాలా ప్రయత్నం చేశాను. బీ వీ రామన్ వంటి ఉద్దండులు ఆయన జాతకం వేశారు. కాని వారు తీసుకున్న జనన తేదీ సరియైనది కాదు. ఇంగ్లీషువారు నిర్ధారించి ఇచ్చిపోయిన తేదీనే సరియైనది అని ఆయన అనుకొని దానికి జాతకం వేశాడు. పైగా తనకు నచ్చిన రామన్ అయనాంశ వాడాడు. అందుకే "నోటబుల్ హోరోస్కోప్స్" లో ఆయన ఇచ్చిన జాతకమూ విశ్లేషనా ఏదో అతికినట్లుగా ఉంటుంది కాని పూర్తి సంతృప్తిని ఇవ్వలేదు. జనన సంవత్సరం మీద అనేక వాద వివాదాలుండటం వల్ల బుద్ధుని సరియైన జాతకం ఇంతవరకూ దొరకలేదు.

ఇంగ్లేషువాళ్ళు మన చరిత్రని వ్రాయడానికి తీసుకున్న మైలురాళ్ళలో ముఖ్యమైనది అలెగ్జాండర్ దండయాత్ర. అదెప్పుడు జరిగిందో వాళ్ళకు తెలుసు గనుక దానిని ప్రామాణికంగా తీసుకున్నారు. అది క్రీపూ 327 లో జరిగింది. దానికి అనుసంధానం చేసి మన చరిత్ర మొత్తాన్నీ పునర్నిర్మించామని వాళ్ళు తలపోశారు. తరువాత, అశోకుని రాతి శాసనాలను, ఖరవేలుని శాసనాలను,పోల్చి చూచి వాళ్ళకు తోచిన చరిత్రను వాళ్ళు వ్రాశారు. కాని ఇంగ్లీషువాళ్ళ జాత్యహంకార ధోరణి వల్ల, ప్రక్రియ మొత్తం పూర్తి ఒంటెద్దు పోకడలతో సాగింది.

బైబిల్
లో చెప్పబడిన రీత్యా, మానవ సృష్టి మొత్తం క్రీస్తు పూర్వం నాలుగువేల సంవత్సరాల క్రితం మాత్రమే మొదలైంది అన్న భ్రమలో మునిగి, వాళ్ళు మన చరిత్రని మొత్తాన్ని మేరకు కుదించి పారేశారు. వక్ర చరిత్రను వ్రాశిన యూరోపియన్ స్కాలర్స్ లో ఫాదర్ హేరాస్ మొదలైన వీర క్రైస్తవాభిమానులు ఉన్నారు. కనుక వారు తమతమ శక్తిమేరకు మన దేశ చరిత్రను చక్కగా వక్రీకరించి, కుదించి వ్రాసి, మన ముఖాన పడేసి పోయారు. మనం కూడా చరిత్రనే గుడ్డిగా నమ్ముతూ పాఠ్యపుస్తకాలలో చదువుతూ వచ్చాము.

మతపిచ్చి బాగా ఉన్నటువంటి క్ర్రైస్తవ జాత్యహంకార చరిత్ర కారులు చేసిన ఒక పెద్ద తప్పు ఏమిటంటే, మన పురాణాలను కాకమ్మ కధల కింద కొట్టిపారేయటం. నిజానికి, పురాణాలలో మత విషయాలే గాక, అనేక ఇతర విషయాలు దర్శనం ఇస్తాయి. రోజుల నాటి సామాజిక, ఆర్ధిక పరిస్థితులు, ఆహారపుటలవాట్లు,నాగరికత, వేషధారణ, సంచార సాధనాలు మొ|| అనేక ఇతర విషయాలు వాటిలో దర్శనం ఇస్తాయి. వీటితో బాటుగా, రాజవంశాలు వాటి చరిత్ర, ఎందరు రాజులు వరుసగా ఎంతకాలం పాటు పరిపాలించారు, వాళ్ళ పేరులు ఏమిటి అన్న విషయాలు కూడా వంశవృక్షాలతో సహా వాటిలో చర్చించబడ్డాయి. ఇటువంటి వంశ చరిత్రలు మనకు హరివంశము మొదలైన కావ్యాలలోనూ, భవిష్యపురాణము, బ్రహ్మ వైవర్త పురాణము మొదలైన కొన్ని పురాణ గ్రంధాలలో దొరుకుతున్నాయి. వీటిని చరిత్ర కారులు ప్రామాణికంగా తీసుకోలేదు.

దీనికి మన తప్పు కూడా కొంత లేక పోలేదు. మన వాళ్ళలో సంస్కృతం బాగా వచ్చిన ప్రతి పండితుడూ కొన్ని కొన్ని శ్లోకాలను రచించి పురాణాలలో అక్కడక్కడా పిట్టకథలుగా, అసందర్భ ఘట్టాలుగా ప్రక్షిప్తం చేసి పారేశాడు. పురాణాలలో ఉన్న కొన్ని కొన్ని విషయాలు కూడా మనకే అసంబద్దం అనిపిస్తాయి. ఉదాహరణకు దశరధుడు డెబ్బై వేల సంవత్సరాలు రాజ్యం చేశాడనీ, ఇలాటి కొన్ని విషయాలు అబద్దాలు అని మనకే తెలిసి పోతుంటుంది. ఇటువంటి వ్రాతలను చూచి యూరోపియన్ చరిత్ర కారులు మన పురాణాలు మొత్తాన్నీ కల్పనలుగా కొట్టిపారేశారు. పని చేయటానికి వారి మత దురభిమానం అగ్నికి ఆజ్యం పోసింది.

కొందరు చెప్పిన ప్రకారం, దశరధుడు డెబ్భై ఏళ్ళు మాత్రమే రాజ్యం చేశాడు. కాని దాన్ని డెబ్బై వేల ఏళ్ళుగా అర్ధం చేసుకోడానికి కారణం-సంస్కృత భాషలో ఒక పదానికి అనేక అర్ధాలు ఉండటం ఒక కారణం కావచ్చు. ఇదే విధంగా యుగాల లెక్కలు కూడా అర్ధం చేసుకోవాలి. ఇంకొందరు చెప్పేదాని ప్రకారం-ఉద్దేశ పూర్వకంగా మన చరిత్రను కుదించడానికి ఇంగ్లీషువాళ్ళే కొందరు పండితులకు డబ్బులిచ్చి ప్రక్షిప్త శ్లోకాలను మధ్య మధ్యలో రాయించారు. ఇది నిజమో కాదో మనకు తెలియదు కాని వారి జాత్యహంకార ధోరణి మటుకు నిజమే.

చరిత్రలో ఒకే పేరుతో అనేక వ్యక్తులు ఉంటారు. పేరుమీద అభిమానంతో తరువాత తరాల వాళ్ళూ కూడా అదే పేరును పెట్టుకోవటం మన దేశంలోనే కాదు. ప్రపంచం మొత్తంమీద కనిపిస్తుంది. కాకపోతే వాళ్ళు సీజర్- అనీ సీజర్- అనీ పెట్టుకుంటే మనవాళ్ళూ మాత్రం అలా చెయ్యకుండా అశోక అనో సముద్రగుప్త అనో శంకర అనో అదే పేరు పెట్టుకునే వారు. మొదటి శంకరాచార్య క్రీ పూ రెండవ శతాబ్ది వాడైతే, రెండవ శంకరాచార్య క్రీ ఎనిమిదో శతాబ్ది వాడైతే- ఇంగ్లీషు వాడు రెండవ తేదీనే ప్రామాణికంగా తీసుకున్నాడు. దానితో మధ్యలోని వెయ్యి సంవత్సరాలు గాలికి కొట్టుకుపోయాయి.

మరి
పరమ అద్వైతి అయిన మొదటి శంకరులు, భక్తి స్పోరకంగ వివిధ దేవతల పైన కుప్పలు తెప్పలుగా అనేక స్తోత్రాలు ఎలా వ్రాశారు? అదెలా సాధ్యం?
అన్న సందేహం వాళ్ళకు కలగలేదు. కనుక అదేపేరుగల భక్తి పరుడైన ఇంకొక శంకరుడు ఉండి ఉండవచ్చు అన్న ఆలోచనా వాళ్ళకు కలగలేదు. కంచి మఠంలో భద్రపరుచబడి, రెండువేల సంవత్సరాలనుంచీ వరుసగా వస్తున్న పీఠాధిపతుల క్రమాన్ని వాళ్ళ పేర్లనూ పరిశీలిద్దామన్న ఆలోచన కూడా వాళ్ళకు కలగలేదు. మరి ఈ విషయం నిజమైతే, ఆది శంకరుల వద్ద మొదలైన కంచి పీఠ ఆచార్యుల వివరాలు గత రెండు వేల ఏళ్ళ వివరాలతో సహా కంచి మఠంలో మన కళ్లఎదురుగా ఆర్కైవ్స్ గా కనిపిస్తుంటే, ఆదిశంకరులు ఎనిమిదో శతాబ్ది లో ఉండటం చరిత్ర పుస్తకాలలో మనం చదువుతున్నది ఎలా నిజం అవుతుంది అన్న సంగతీ ఎవరికీ తోచదు. విచిత్రమంటే ఇదే మరి.

అంటే క్రీస్తునూ, యూదు మతాన్నీ గొప్ప చెయ్యటం కోసం మిగిలిన ప్రాచీన మతాల చరిత్రను వక్రీకరించడానికి వాళ్ళు తెగబడినట్లేగా. ఇటువంటి వాళ్ళు, సత్యం గురించీ, అహింస గురించీ, నిర్మలత్వం గురించీ వేదికలెక్కి మనకు ఉపన్యాసాలు దంచటం చూస్తుంటే వారిది మరి దైవమతమా లేక సైతాన్ మతమా తెలియక మనకు బుర్ర గిర్రున తిరగటం లేదూ?

అలాగే, చరిత్రలో ఇద్దరు అశోకులు ఉన్న విషయాలను కూడా వారు విస్మరించారు. ఇటువంటి తప్పులతో తయారైన చరిత్రను మనకు అందించి పోయారు. కాని ప్రపంచవ్యాప్తంగా బయటపడుతున్న అనేక నిదర్శనాలు వైదిక నాగరికత యొక్క ప్రాచీనతను నిరూపిస్తున్నాయి. చివరకు వారిలో వారే కొందరు-- యూరోపియన్లు వ్రాశిన భారత చరిత్ర అంతా తప్పు, అసలైన చరిత్ర ఇది అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కోట వెంకటాచలం గారు ప్రయత్నాన్ని క్రిందటి తరంలో చేశారు గాని అనేక విమర్శలకు గురయ్యారు. విమర్శలు చేసింది కూడా మన వాళ్ళే. మనకు మన వాళ్ళంటే చులకన మాత్రమె గాక తెల్ల తోలంటే మహా గౌరవం అయి చచ్చింది మరి.

తరంలో పి. ఎన్. ఓక్ గారు, స్టీఫెన్ నాప్ అని అసలైన నామధేయం కలిగి తరువాత భారతీయ వైదిక మతాన్ని, వైష్ణవాన్ని లోతుగా అధ్యయనం చేసి, ముగ్దుడై, "నందనందన దాస" అని పేరు మార్చుకుని వైష్ణవ మతావలంబియైన ఒక విదేశీయుడు చేస్తున్న కృషీ చూచి అన్నా మనకు కళ్ళు తెరుచుకుంటాయో లేదో మరి. అనుమానమే.

స్టీఫెన్ నాప్ గారు పిలక పెట్టుకుని, పంచె కట్టుకుని,తులసి మాల ధరించి, నామాలు పెట్టుకుని దేశంలోని అన్ని వైష్ణవ క్షేత్రాలు దర్శించాడు. చాలా గుళ్ళలో విదేశీయుడనే సాకుతో ఈయన్ని లోపలికి రానివ్వలేదుట. ఆ విషయం రెండేళ్ళక్రితం గుంటూరులోని బృందావన్ గార్డెన్స్ లో జరిగిన ఒక సభలో ఆయనే స్వయంగా చెప్పాడు. మన ఖర్మ అలా ఉంది మరి. నేను ఆయన ఉపన్యాసం విని ముగ్దుణ్ణైనాను.

స్టీఫెన్ నాప్ గారి వెబ్ సైట్ మరియు మన మతాన్ని వివరిస్తూ సమర్ధిస్తూ ఆయన వ్రాసిన అనేక వ్యాసాలు ఇక్కడ చూడండి.

బుద్ధుని జనన సంవత్సరం గురించి మరికొంత వెలుగును ప్రసరింపచేసే లింక్ ఇక్కడ చూడవచ్చు. ఈ లాజిక్ ను బట్టి, బుద్ధుడు క్రీ పూ పద్దెనిమిది వందల ఎనభై ఏడులో పుట్టినట్లు స్పష్టమౌతున్నది.

వివరాల ఆధారంగా నేను తయారు చేసిన బుద్ధుని అసలైన జాతకం ముందు పోస్ట్ లో చూద్ధాము.
read more " బుద్ధుని అసలైన జనన సంవత్సరం "

18, ఏప్రిల్ 2010, ఆదివారం

ఆదోని కొండ- ఒక సాయంత్రపు ఏకాంతవాసంనిన్న సాయంత్రం నుంచి రాత్రి వరకూ ఆదోని కొండ పైన ఏకాంత వాసం. ఏకాంతంగా, మౌనంగా, కొండల్లో ధ్యానం చెయ్యటం గొప్ప అనుభూతిని ఇస్తుంది.

దీనికి కొన్ని కారణాలు కనిపిస్తాయి.

ఒకటి:- చుట్టూ మైళ్ళ వరకూ జనసంచారం లేకపోవటం ఒక విధమైన ఏకాకి తనాన్ని ఇస్తుంది. మానసికంగా మనిషి ఎప్పటికైనా ఏకాకే అన్న సత్యం మనస్సుకు హత్తుకున్నట్లు కనిపిస్తుంది.

రెండు:- ఆత్మావలోకనానికి జన సమ్మర్దం ఉన్న ప్రదేశాలు, వాతావరణాలు సరిపోవు. దానికి ఏకాంత ప్రదేశాలు, విశాల ప్రకృతి ఒడిలో ఒంటరిగా ఉండే ప్రదేశాలు బాగా దోహదం చేస్తాయి.

మూడు:- ఎప్పుడూ మనుషుల మధ్య ఉండటం వల్ల ఒక విధమైన ఫాల్స్ సెక్యూరిటీ మనకు అలవాటు అవుతుంది. ఇలాటి ఏకాంత ప్రదేశాలలో ఉండటం వల్ల అది తొలగి పోతుంది.

నాలుగు:- ఇలాటి ప్రదేశాలలో ప్రకృతి యొక్క విశాలత్వం, మానవుని అల్పత్వం కొట్టొచ్చినట్లు కనిపిస్తాయి. పైన కప్పులా పరుచుకున్న విశాలాకాశం మరియు చుట్టూ నిర్మానుష్య ప్రదేశాలు మనస్సును సహజంగా అంతర్ముఖం చేస్తాయి.

అయిదు:- ఇటువంటి ప్రదేశాలలో, కొద్దిపాటి ఏకాగ్రత ఉంటే, హమ్మింగ్ ధ్వనిలా వినిపించే ఓంకారనాదాన్ని వినవచ్చు. ముఖ్యంగా ఇది అర్ధరాత్రి దాటిన తర్వాత బాగా స్ఫుటంగా వినిపిస్తుంది.

చుట్టూ మైళ్ళ తరబడి జన సంచారం లేని ఏకాంత ప్రదేశాలలో రాత్రిళ్ళు ఒంటరిగా గడపటం, ప్రకృతిలో వినిపించే సహజ ధ్వనులను వింటూ మౌన ధ్యానంలో ఉండటం నాకు బాగా ఇష్టం. అటువంటి ప్రదేశాలలో, ముఖ్యంగా, అర్ధరాత్రి దాటిన తర్వాత తెల్లవారే వరకు ఉండే వాతావరణం చాలా బాగుంటుంది. అయితే, దయ్యాల భయం గాని, లేదా దొంగల భయం గాని మనసులో ఉంటే ఇలా ఉండటం చాలా కష్టం అవుతుంది.

నువ్వు ఇలా ఏకాంత వాసం చేస్తున్నపుడు ఎవరైనా దొంగలు నిన్ను ఎటాక్ చేస్తే నీ గతి ఏమిటి అని ఒక మిత్రుడు అడిగాడు.నాకు నవ్వొచ్చింది. వీర విద్యలలో చిన్నప్పటి నుంచి సాధన, ప్రావీణ్యత నాకు ఉన్న విషయం, మరియు మల్టిపుల్ స్పారింగ్ నా స్పెషలైజేషన్ అన్న విషయం అతనికి తెలియదు. "ఎటాక్ చెయ్యటం వరకు ఓకే, కాని తరువాత వాళ్ళ గతి ఏమౌతుందో మాత్రం చెప్పలేను. ఎందుకంటే వాళ్ళ శవాలను అన్ని అడుగుల ఎత్తు నుంచి కిందకు తరలించటం నిజంగానే సమస్య అవుతుంది" అని జవాబిచ్చాను. కేరళలో మాస్టర్ గోవిందకుట్టి నాయర్ గురుక్కళ్ దగ్గర నేర్చుకున్న "మర్మ అడి" విద్యలోని ఒక చిన్నఆయుధం నా దగ్గిర ఉంటుంది. అది జేబులో ఇమిడి పోతుంది. మర్మ స్థానాలలో (Vital nerve centers) దానితో ఎటాక్ చెయ్యటం ద్వారా అవసరమైతే మనిషి ప్రాణాలు సెకండ్లలో తీయవచ్చు.

సామాన్యంగా ఇలా వెళ్ళేటప్పుడు ఎవరినీ తోడు తీసుకెళ్ళను. ఎందుకంటే చాలామంది మౌనాన్ని భరించలెరు. మౌనంగా ఉండలేరు. అనవసరంగా ఏదేదో మాట్లాడుతుంటారు. అది నాకు విసుగు పుట్టిస్తుంది. పైగా కనీస వసతులు కూడా అటువంటి చోట్ల ఉండవు.వెంట తీసుకెళ్ళకపోతే ఒక్కొక్కసారి మంచినీళ్ళు కూడా దొరకవు. కాని ఈసారి మా అబ్బాయి నాతో వస్తానన్నాడు. సరే అని నాతో పాటు తీసుకెళ్ళాను.తను నా మానసిక స్థితి బాగా అర్థం చేసుకోగలడు. ఇటువంటి సందర్భాలలో అవసరం అయితే తప్ప మాట్లాడడు.

కొండ ఎక్కుతున్నప్పుడు, మధ్య మధ్యలో కూర్చున్నప్పుడు, అక్కడక్కడా ఆధ్యాత్మిక విషయాలు చర్చకు వచ్చాయి. మా వాడికొక ఆలోచన వచ్చింది. దీన్నంతా ఒక వీడియోగా తీస్తానని ఉత్సాహ పడ్డాడు. సరే కానీమన్నాను. ఆ సందర్భంగా తీసిన ఒక చిన్న వీడియోను ఈ పోస్ట్ తో చూడవచ్చు.

దాదాపు ఇరవై ఏళ్ళ క్రితం ఇదే కొండను నా గురుతుల్యులైన స్వామి నందానందగారితో కలసి ఎక్కాను. కొండ కొమ్మున రణమండల ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుంది. అది వ్యాస రాయల ప్రతిష్ట అని ఎవరో చెప్పారు. ఆయన విజయనగర రాజుల రాజ గురువు. రాయలసీమలో ఆంజనేయ విగ్రహాలు అన్నీ ఎక్కువగా ఆయనే ప్రతిష్ట చేశారు.

అదలా ఉంచితే, అప్పుడు నాకు ఇరవై ఆరేళ్ళు. స్వామికి దాదాపు అరవై దాటి ఉంటాయి. కొండనెక్కుతుండగా స్వామి అనేక విషయాలు చెప్పారు. ఆయన జన్మత: కన్నడిగుడు. తెలుగు కంటే ఇంగ్లీషు చక్కగా మాట్లాడేవారు. దాదాపుగా అరవై ఏళ్ళ క్రితమే ఆయన గ్రాడ్యుయేట్. కొండ సగానికి ఎక్కిన తర్వాత పైకి చూస్తూ, " కొండ కొమ్ముకు చేరాలంటే ఇంకా చాలా మెట్లు ఎక్కాలి స్వామీజీ" అని రొప్పుతూ అన్నాను నేను. దానికి ఆయన నవ్వుతూ ఒక మాటన్నారు. "ఇంకా ఎన్ని మెట్లెక్కాలో అని ఎప్పుడూ అనుకోకు. తల వంచుకొని మెట్లెక్కుతూ ఉండు. కొంతసేపటికి చూస్తే నీవు కొండ కొమ్మున ఉంటావు." లోతుగా ఆలోచిస్తే ఇది జీవితానికి, ఆధ్యాత్మిక సాధనకు కూడా చక్కగా అన్వయిస్తుందేమో అని నాకెప్పుడూ అనిపిస్తుంది. అదే జ్ఞాపకాన్ని మా అబ్బాయికి చెప్పాను. దాన్ని తను వీడియో తీసాడు.

దాదాపు రాత్రి తొమ్మిది వరకు కొండపైన ధ్యానంలో గడిపాము. నల్లని ఆకాశం క్రింద, నక్షత్రాల వెలుగులో కూర్చుని, క్రియాయోగానికి, కుండలినీ యోగానికి సంబంధించిన లోతైన మూలరహస్యాలు కొన్ని మావాడికి వివరించి చెప్పాను. యుగాలు, వాటి నిడివి, అయనాంశ విలువ, ప్రెసెషన్ ఆఫ్ ఈక్వినాక్సెస్, సాయన నిరయన విధానాల మధ్యన గల భేదాలు, ఇతర జ్యోతిష రహస్యాలు, వీటికీ యోగానికి ఉన్న సంబంధాలు, సూక్ష్మ శరీరం, ఆత్మలు మొదలైన విషయాలు చాలా దొర్లాయి. చిన్నప్పటినుంచి ఇటువంటి విషయాలు వినటం అలవాటు అయినందువల్ల తను కూడా చాలా శ్రద్దగా విన్నాడు. తరువాత నెమ్మదిగా కొండ దిగి నడక ప్రారంభించాము.

చుట్టూ చిమ్మ చీకటి. శుద్ధ తదియ కావటంతో చంద్రుడు సన్నగా కనిపిస్తున్నాడు. సన్నని నెలవంక, నక్షత్రాల వెలుతురులో, ప్రాచీన శిధిల కట్టడాలు, మశీదులు, గుడులు, రాజుల కాలం నాటి కోట బురుజుల మధ్యగా కొండ దిగి క్రిందికి వస్తుంటే, కీచు రాళ్ళ అరుపులు మా అడుగుల చప్పుళ్ళె తప్ప ఎక్కడా శబ్దమనేది లేదు. అప్పుడప్పుడు ఆ శిధిలాల దారుల పక్కగా పాము జరజర పాకుతూ పోతున్న శబ్దం వినిపించేది.

ఒక గంట తర్వాత కొండ దిగి ఊరిలోకి వచ్చాము. మహాయోగిని లక్ష్మమ్మ గారి సమాధి మందిరంలో కొద్దిసేపు ధ్యానంలో గడిపి అర్ధరాత్రి దాటిన తర్వాత ఇంటికి చేరాము. నేటి సామాజిక భాషలో చెప్పాలంటే ఈమె ఒక చదువు రాని దళిత మహిళ. దాదాపు అరవై డెభ్భై ఏళ్ల క్రితం ఆదోని పట్టణంలో ఒక పిచ్చిదానిలాగా తిరుగుతూ ఉండేది. ఈమె అనేక యోగసిద్ధులు కలిగిన ఒక అవధూత అని చెప్తారు.

రాత్రిళ్ళు గస్తీ తిరుగుతున్న పోలీసులకు ఈమె కాళ్ళూ చేతులూ ఒక్కొక్క వీధిలో ఒక్కొక్కటి పడి కనిపించేవిట. తిరి
గి తెల్లవారిన తర్వాత ఈమె మామూలుగా ఊరిలో తిరుగుతూ ఉండేది అని చెబుతారు. దీన్ని ఖండయోగం అంటారు. దీనిని సాయిబాబా గారు కూడా చేసినట్లు చెబుతారు. ఇలాటి మహిమలు ఆమె చాలా చేసింది అని అంటారు. ప్రస్తుతం ఈమె సమాధిమందిరం నగర నడి బొడ్డున ఉంది. భూగర్భంలో ఆమె సమాధి, దాని పైన నేల బారుగా దేవాలయం ఉంటాయి. సమాధి మందిరం ధ్యానానికి బాగా అనుకూలంగా ఉంటుంది. రాయలసీమలో ఇటువంటి యోగులు,సూఫీలు,మహాత్ములు చాలామంది ఉంటారు. నేను ఆదోని పట్టణానికి వస్తే, లక్షమ్మగారి సమాధిని దర్శించకుండా సామాన్యంగా తిరిగి వెళ్లను.

నిన్న సాయంత్రం అలా గడిచింది.

read more " ఆదోని కొండ- ఒక సాయంత్రపు ఏకాంతవాసం "

14, ఏప్రిల్ 2010, బుధవారం

అపర ధన్వంతరి - శామ్యూల్ హన్నేమన్


తర తరమ్ముల నంటి తరుము వ్యాధుల
మూల మెరుగంగ తపియించే నే తపస్వి
సారూప్య సిద్ధాంత సంస్థాప నార్ధమ్ము
త్యాగాగ్ని దూకేనే ధర్మ యోద్ధ
ఆత్మ శోదిత పదార్దానుభూత
జ్ఞాన సంపద నిచ్చెనే శాస్త్ర వేత్త

హోమియో వైద్య విధాన సృష్టికర్త అయిన డా || హానెమాన్ గారి పైన పొన్నూరు వాస్తవ్యులు డా|| పీ. వీ గోపాల రావుగారు వ్రాశిన పద్యం ఇలా సాగుతుంది. మొన్న పదవ తేది డా|| శామ్యూఎల్ హాన్నేమాన్ గారి జన్మ దినం. సందర్భంగా మహనీయుని తలచుకోవటం ఒక హోమియో వైద్యునిగా, హానెమాన్ అభిమానిగా నా కర్తవ్యం కూడా.

ఒక ఆలోచన


వ్యక్తిగతంగా నా కొక ఆలోచన ఉన్నది. ప్రాచీన కాలంలో మన దేశంలో ప్రతి సబ్జెక్ట్ లోనూ విపరీతమైన రీసెర్చి జరిగింది. అయితే అదంతా కాలగర్భంలో కలిసిపోయింది. తిరిగి దాన్ని ఉద్దరించాలంటే గడచిన తరాలలో మన దేశంలో అనువైన పరిస్తితులు లేవు. అందుకని ఆయా శాస్త్రవేత్తలు, రుషులు యూరోపియన్ దేశాలలో పుట్టి ఆయా విజ్ఞానాన్ని పునరుద్ధరించారని నా అభిప్రాయం. హోమియో వైద్యం కూడా అటువంటి అద్భుత విజ్ఞానమే గనుక డా|| హాన్నెమాన్ ఒక భారతీయ ఋషిపుంగవుడే అని, ప్రాచీన ఆయుర్వేద ఋషియో విధంగా జెర్మనీలో పుట్టి ఉంటాడనీ నా నమ్మకం. హోమియో వైద్యానికి మన వేదాంతానికీ ఉన్న సంబంధమూ, వైద్యాన్ని మన దేశం గొప్పగా ఆదరించి వెంటనే అక్కున చేర్చుకోవడమూ, శ్రీ రామకృష్ణుడు, జిల్లెళ్ళమూడి అమ్మగారు వంటి మహనీయులు విధానాన్ని వాడటమూ మెచ్చుకోవడమూ, కూడా నమ్మకానికి ఆధారాలు.

హోమియో శాస్త్రానికి- యోగ సంబంధం

యోగం మానవుణ్ణి దేవునిగా చెయ్యగలదు. యాత్రా క్రమంలో మానవుని తరతరాల కర్మను ప్రక్షాళన చేసే శక్తి యోగానికి ఉన్నది. ప్రక్షాళన ఎలా జరుగుతుంది అనే విషయం ప్రస్తుతం అవుసరం లేదు గనుక దాని జోలికి పోను. హోమియో వైద్య విధానంలో కూడా కర్మ ప్రక్షాళన జరుగుతుంది. ముఖ్యంగా హయ్యర్ పొటెన్సీలు వాడినప్పుడు మానవుని శరీరంలోని అంతర్గత కల్మషాలు బయటపడి ప్రక్షాళన కాబడతాయి. ఉన్నత పొటెన్సీలు వాడినప్పుడు కర్మ ప్రక్షాళన జరుగుతుంది అని డా|| రుడాల్ఫ్ స్టీనర్ మొదలైన వారుకూడా నమ్మేవారు. క్రమంలో మానవునికి రోగం తగ్గటమే గాక, అతని మానసిక, ప్రాణిక స్థాయిలలో గొప్ప వైన మార్పులు కలుగుతాయి. అతని అలవాట్లు మారుతాయి. తరతరాలనుంచి వెంటాడుతున్న రోగాలు,అలవాట్లు,దోషాలు పోతాయి. ఇదంతా నెను కళ్ళారా చూచాను కనుక అధికారికంగా వ్రాయగలుగుతున్నాను.

యోగసాధనలో కూడా ఇదంతా జరుగుతుంది. కుండలినీ యోగాన్ని సాధించిన వ్యక్తి శరీరంలొ గొప్ప మార్పులు కలుగుతాయి. అతని జీన్ లెవెల్ లొ అనూహ్య మార్పులు చోటు చేసుకుంటాయి. తరతరాల నుండి వస్తున్న జన్యు దోషాలు, అలవాట్లు విసర్జింపబడతాయి. శరీరంలోనే గ్రహ పరమైన రెమెడీలు జరుగుతాయి. తద్వారా జాతకంలో ఉన్న చెడు యోగాలు సరిచేయబడతాయి. దోషాలు నివారణ అవుతాయి. ఇదంతా నిజంగానే జరుగుతుంది. నేను తమాషాకి వ్రాయడం లేదు. ఎవరికి వారు స్వానుభవంలో పరిశీలించి తెలుసుకోవచ్చు.

అయితే, యోగానికి, హొమియో వైద్యవిధానానికి కొన్ని భేదాలు కూడా ఉన్నాయి. యోగంలో ఉన్నత స్తరాలు చేరటం కష్ట సాధ్యం. అది అందరికీ సాధ్యమయ్యే పని కాదు. దానితో పోలిస్తే హోమియోలో ఉన్నత పొటెన్సీ వాడకం సులువు. మరియు అందరికీ అందుబాటులో ఉంటుంది. కాని ఇక్కడకూడా, రోగం పూర్తిగా శరీరంలోనుంచి బయటకు ప్రక్షాళన అయ్యేవరకూ వేచి చూడగలిగే వారు చాలా అరుదుగా ఉంటారు. కర్మ మనిషిని వేచి చూడనివ్వదు. ట్రీట్ మెంట్ మధ్యలో ఆపి వేరే వైద్య విధానాలకు మారటం చాలా సార్లు చేయిస్తుంది.

ఇదంతా కర్మ ఫలితం.
అనుభవించవలసిన బలీయ మైన కర్మ ఉన్నపుడు హోమియో లో తత్వ పరమైన చికిత్స (కాన్ స్టిట్యూషనల్ ట్రీట్ మెంట్ ను) తీసుకోనివ్వదు. అనేక కారణాలు చెప్పి రోగి చికిత్సను మధ్యలోనె ఆపివెయ్యటం జరుగుతుంది. లేదా అనెక అవాంతరాలు ఎదురై చికిత్స మధ్యలో ఆపడం జరుగుతుంది. ఇతర మందులు వాడడం, లేదా సర్జరీలు చేయించుకోవడం జరుగుతుంది. విచిత్రాన్ని కూడా చాలా సార్లు గమనించాను.

ఇతర వైద్య విధానాలు

ఇతర వైద్య విధానాలకు హోమియో విధానానికి ఉన్న ముఖ్యమైన భేదం ఏమనగా- హోమియోలో రోగి లోపలనుంచి బయటకు రోగం నెట్టివేయబడుతుంది. అందుకే రోగం తగ్గినతరువాత అతనికి చాలా హాయిగా తేలికగా ఉంటుంది. ఏదో పెద్ద బరువు ఒంటిలో నుంచి మాయం అయ్యినట్లు గా ఉంటుంది. మానసిక స్థాయిలో ప్రాణిక స్థాయిలో చాలా హాయిగా అనిపిస్తుంది.

ఇతర విధానాలలో అయితే -- రోగం బయటనుంచి లోపలకు అణగగోట్ట బడుతుంది. చూడటానికి రోగం తగ్గినట్లే కనిపిస్తుంది. రోగ లక్షణాలు మాయం అవవచ్చు. కాని రోగం శరీరంలోనుంచి బయటకు పోదు. అందుకే రోగ లక్షణాలు తగ్గినట్లు అనిపించినా, రోగికి హాయిగా ఉండదు. విపరీతమైన నీరసంగా ఉంటుంది. రోగం ఒక అవయవం నుంచి ఇంకొక అవయవం మీదకు నెట్టబడుతుంది. మానసికంగా చిరచిర, చికాకు, విసుగు, బీపీ ఎక్కువ అవుతాయి.

ఉదాహరణకు-నూటికి తొంభై కేసులలో- అణచబడిన ఇతర రోగాలవల్లే డయాబెటీస్ అనబడే షుగర్ వ్యాధి కలుగుతుంది. ఇది నా అనుభవంలో చాలా సార్లు గమనించాను. బహుశా శరీరంలోని గుండె, మెదడు,కిడ్నీలు మొదలైన ఇతర అంతర్గత అవయవాలతో పోలిస్తే పాంక్రియాస్ అంత ముఖ్యమైనది కాదు అని అనిపిస్తుంది. కనుక వ్యాధి అణచివేత అనివార్యం అయినప్పుడు, తత్వ పరమైన లోతైన చికిత్స జరుగకుండా బలీయమైన పూర్వకర్మ ఆడ్డుపడుతున్నపుడు ,శరీరం తన లోని
ఏదొ ఒక అంత ముఖ్యం కాని అవయవాన్ని త్యాగం చేసి మిగతా సిస్టం ను కాపాడుకుంటుంది. క్రమంలో భాగంగా, ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీలో అంత ముఖ్యం కాని పాంక్రియాస్ ను రోగానికి అప్పజెప్పి మిగతా ప్రాణాధార అవయవాలను శరీరం కాపాడుతుంది.

అందువల్లనే నేటి సమాజంలో డయాబెటీస్ అంత ఎక్కువగా ఉన్నది. దీనికి కారణం బ్రాడ్ స్పెక్ట్రమ్ ఏంటీ బయోటిక్స్ వాడకం వల్ల జరుగుతున్న రోగ అణచివేత మాత్రమే అని నా అభిప్రాయం. శరీర శ్రమ లేక పోవడం ఒక్కటే షుగరు వ్యాధికి పూర్తి కారణం కాదు అని నేను నమ్ముతాను. ఇది నా పరిశీలనలో తేలిన నిజం.

శుద్ధ ఆయుర్వేదం

ఆయుర్వేదాన్ని శుద్ధంగా ఆచరించగలిగితే, అది కూడా చాలా ప్రభావ వంతంగా పనిచెయ్యగలదు. కాని అలా చెయ్యగల వైద్యులు నేడు చాలా అరుదుగా ఉన్నారు. ఆయుర్వేదంలో ఎమ్. డీ చేసిన అనేక మంది వైద్యులు కనీసం రోగి యొక్క నాడి పరిశీలన చెయ్యకుండా అతని శరీర తత్వం ఏమిటో తెలుసుకోకుండా
మందులివ్వటం నాకు తెలుసు.

ఔషధాన్ని సొంతంగా తయారు చేసి ఇవ్వగల ఆయుర్వేద వైద్యులు కూడా నేడు చాలా అరుదుగా ఉన్నారు. చాలా మందికి మూలికా సంగ్రహణ విధానాలు తెలియవు. జ్యోతిర్విజ్ఞానం చాలామందికి బొత్తిగా
లేదు.ఆయుర్వేద కంపెనీలు తయారు చేసిన మందులు వాడిస్తూ రోగులతో ఆటలాడటంలో ఇంగ్లీషువైద్యులతో వారు పోటీపడుతున్నారు.మరి వారు అనుసరిస్తున్న విధానం ఆయుర్వేద వైద్యం అంటారో ఇంకేమంటారో వారికే ఎరుక.

ఎవరో చెప్పినట్లు, డాక్టర్ అవటం చాలాతేలిక. ఎందుకంటే రోగం ఏమిటో రోగి చెబుతాడు. దానికి మందేమిటో మెడికల్ రిప్రజెంటేటివ్ చెబుతాడు. మేచింగ్ చెయ్యటమేగా డాక్టర్ పని అని అన్నాడట ఒకాయన. విషయం అలా ఉంటుంది. నాకు తెలిసినంత వరకు, ఆయుర్వేదాన్ని శుద్దంగా ఆచరిస్తున్న వైద్యులు నేడు లేరు అని చెప్పవచ్చు.

మరి హోమియో వైద్యం మాటేమిటి?

హోమియో మాత్రలిచ్చిన ప్రతి వైద్యుడూ హోమియో వైద్యం చేస్తున్నట్లు కానే కాదు. డా|| హానెమన్ ప్రతిపాదించిన సూత్రాలకనుగుణంగా వైద్యాన్ని చేసినవాడే హోమియో వైద్యం చేస్తున్నట్లు లెక్క. చాలామంది అనేక మందులు ఒకేసారి కలిపి ఇస్తుంటారు. ఇంకొందరు హోమియో ఔషధాలతో పాటు, ద్వాదశ లవణాలు ఇస్తారు. ఇంకొందరు ఇంగ్లీషు మందులు హోమియో మందులూ ఒకేసారి ఇస్తారు. ఇంకొందరు పది మాత్రలు వేసుకున్నా, ఒక మాత్ర వేసుకున్నా ఒకటే-చేతికి ఎన్ని మాత్రలోస్తే అన్ని వేసుకోవచ్చు అంటారు. ఇవన్నీ తప్పులే. రకమైన వైద్యం హానెమాన్ ప్రతిపాదించిన హోమియో వైద్యం కాదు. అందుకే అటువంటి వైద్యంతో అద్భుత మైన ఫలితాలు కనిపించవు. నిజమైన హోమియో వైద్యం చేస్తున్న వైద్యులు కూడా నేడు చాలా అరుదుగా ఉన్నారు.

కుహనా గురువుల దగ్గర నిజమైన యోగ శాస్త్రం దొరకనట్లే, కుహనా వైద్యుల దగ్గర కూడా
నిజమైన వైద్యం దొరకదు. ఇక్కడ కుహనా వైద్యులు అంటే నా అభిప్రాయం-డిగ్రీలు లేని క్వాక్ లు అని కాదు. డిగ్రీలు ఉండికూడా అసలైన వైద్య సిద్ధాంతాలను అనుసరించని వారు అందరూ కుహనా వైద్యులే అని నా అభిప్రాయం. ఈనాడు హోమియో వైద్యంలో ఎమ్. డీ లు చాలామంది చేస్తున్నది హోమియో వైద్యం కాదు. వ్యాపార వైద్యం మాత్రమే. హోమియో వైద్యాన్ని పదేళ్ళపాటు పరిశోధించి నేను తెలుసుకున్న నిజం ఇది. విచిత్ర మేమిటంటే చాలామంది రోగులు కూడా కుహనా వైద్యులను నమ్మినట్లు శుద్దంగా వైద్య విధానాన్ని అనుసరించే వైద్యుల మాట నమ్మరు.

ఉన్నత మైన ఆశయాలతో, ఆలోచనలతో ఒక వినూత్న వైద్య విధానాన్ని ఆవిష్కరించిన హానెమాన్ ఆత్మ నేడు తన పేరిట జరుగుతున్న మోసపూరిత వైద్యాన్ని గమనించి ఎంతగా క్షోభిస్తున్నదో తలుచుకుంటే బాధ కలుగుతుంది. హోమియో షాపులు కూడా పచారీ కొట్ల వలె కనిపిస్తూ కంపెనీ ప్రాడక్టులతో షెల్ఫులు నిండి, హోమియో టూత్ పేష్టులు, హోమియో సబ్బులు, హోమియో హెయిర్ ఆయిల్సు, హోమియో వక్కపొడి..... ఇదంతా చూస్తుంటే కొంతకాలానికి హో్మియో కాఫీపొడి, హోమియో టీ పొడి కూడా అమ్ముతారేమో షాపులలో అని నవ్వొస్తుంది.

సత్యాన్ని గ్రహించి అనుసరించే సున్నితత్వాన్నిప్రపంచం కోల్పోతున్నదా?

ఏదేమైనప్పటికీ, ప్రపంచం డా|| హానెమాన్ కు ఇవ్వవలసిన విలువను ఇవ్వలేకపోయింది. కనీసం నేటికీ ఆయన సిధ్ధాంతాలను సరిగ్గ అర్ధం చేసుకోలేక పోయింది అని గట్టిగా చెప్పవచ్చు. బహుశా అందరు మహనీయులకు స్వార్ధపూరిత ప్రపంచం లో ఇదే గతి పట్టక తప్పదేమో? ఎవరేమి ఆవిష్కరించినా మానవ జాతికి తెలిసింది మాత్రం వ్యాపారం ఒక్కటేనేమో? ఏదో రకంగా డబ్బుని విపరీతంగా సంపాదించడమే జీవిత గమ్యం అని తలుస్తున్న నేటి ఆలోచనా ధోరణి మారనంత వరకూ ఎంతమంది హానెమాన్ లు వచ్చినా ప్రపంచానికి కొత్త వ్యాపార దారులు తెరవడం తప్ప ఉపయోగం పెద్దగా లేదు.

ఎన్ని
కొత్త యోగ విధానాలు వచ్చినా అవి చివరకు వ్యాపారంగా మారటం ఒక్కటే మనకు కనిపిస్తున్న నిజం. కర్మ క్షాళన అనేది పూర్తిగా వ్యక్తిగతమైన వ్యవహారం. అంతే గాని మొత్తం సమాజం అంతటికీ దీన్ని వర్తింపచెయ్యటం అసాధ్యం అనీ, కుదరని పని అనీ, ప్రకృతి ప్రణాలికకు ఇది పూర్తిగా విరుద్దం అనీ నా నమ్మకం. హోమియో లో తత్వ పరమైన లోతైన చికిత్స తీసుకోగలగాలంటే అతనికి కర్మ తీరే సమయం దగ్గర పడాలి. జాతకంలో మంచి దశలు రావాలి అప్పుడే అది సాధ్యపడుతుంది లేకుంటే సాధ్యం కాదు అని నా అనుభవం చెబుతోంది.
read more " అపర ధన్వంతరి - శామ్యూల్ హన్నేమన్ "