“There are many who just talk, but very very few who really realize" - Self Quote

30, నవంబర్ 2011, బుధవారం

Yoga is the work of devil

మొన్న డెక్కన్ క్రానికల్ లో ఒకవార్త ప్రముఖంగా ప్రచురించబడింది. గాబ్రియేల్ అమోర్త్ అనే 80 ఏళ్ల వాటికన్ వృద్ధమాంత్రికుడు చెప్పినదాని ప్రకారం యోగా అనేది సైతానుయొక్క సృష్టిట. ఇది చదివి, నవ్వాలో ఏడవాలో అర్ధం కాలేదు. ఇంత వయసొచ్చినా ఆయనగారి జనరల్ నాలెడ్జి స్థాయి అలా ఉందంటే, ఇక ఆయనగారి IQ ఏస్థాయిలో ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు. బహుశా దానికి తగిన మాంత్రికుడి ఉద్యోగమే ఆయనకు దక్కినట్లుంది.

జీవితమంతా దయ్యాలను వదిలించేపనిలో ఉన్న ఆయనకు క్రైస్తవంకాని ప్రతీదీ సైతాన్ లాగా కనిపించడం ఆశ్చర్యం ఏమీలేదు. ఒకసారి బ్రహ్మంగారు సిద్ధయ్యను ఇలా అడిగారట. "సిద్దా, ప్రపంచం ఎలా ఉందిరా?". "మనం ఎలా చూస్తె అలా ఉంది గురువుగారు" అని సిద్దయ్య సమాధానం చెప్పాట్ట. దీన్నే మన హిందూమతంలో "యద్భావం తద్భవతి" అంటారు. ఏదైనా మన దృక్కోణాన్ని బట్టే మనకు కనిపిస్తుంది. అంటే ఇరవైనాలుగ్గంటలూ మనం దేన్నయితే తలుస్తామో అదే మనం అయి కూచుంటాం. ఈ వృద్ధమాంత్రికుడు ఎప్పుడూ సైతాన్ ధ్యానంలో ఉండటంవల్ల ఆయనకు ప్రతిదీ సైతాన్ చర్యలాగే కనిపిస్తుంది. ఇదేమీ విచిత్రం కాదు. సైతాన్ ధ్యానం మానేసి క్రీస్తును ధ్యానించడం ఈయన నేర్చుకుంటే బాగుంటుంది.

క్రైస్తవం మొదట్నించీ క్రీస్తు యొక్క బోధనలను వక్రీకరిస్తూనే వచ్చింది. అసలైన క్రీస్తుబోధనలు సెయింట్ పాల్ చేతిలో పూర్తిగా వక్రీకరించబడ్డాయి. ముఖ్యంగా క్రైస్తవాన్ని గట్టిగా ప్రోమోట్ చేసే కార్యక్రమంలో భాగంగా, క్రైస్తవం కాని ప్రతివిషయాన్నీ సైతాన్ కు అంటగట్టే ప్రయత్నం గత రెండువేలఏళ్లుగా జరిగింది. ఆ క్రమంలో భాగంగా, అనేక ఇతరమతాలనూ, వాటి జ్ఞానసంపదనూ కాలగర్భంలో కలిపింది క్రైస్తవం. క్రీస్తుపూర్వంనుంచీ ఉన్న ఎంతో జ్ఞానసంపద ఈ అజ్ఞానపూరితచర్య వల్ల నాశనమై పోయింది. ఎందఱో జ్ఞానఖనులను "విచ్చ్ హంట్" పేరుతో సజీవదహనం చేసిన ఘనచరిత్ర క్రైస్తవానిది. తనకు అర్ధంకాని ప్రతీదీ సైతానే అనుకోవడం క్రైస్తవానికీ ఇస్లాంకూ ఉన్నఅనేక దుర్లక్షణాలలో ఒకటి.

"యోగా" అనేది భారతీయ షడ్దర్శనాలలో ఒకటి. అంటే భగవంతుని చేరుకునే ఆరువిధానాలలో "యోగదర్శనం" ఒకటి అని మన హిందూమతం చెబుతుంది. ప్రపంచవ్యాప్తంగా మహనీయులైన అందరు ప్రవక్తలూ యోగులే. "యోగం" అనే మాటలోనే " కలపడం " అనే అర్ధం ఉంది. వ్యక్తిని దేవునితో కలిపేదే యోగం. వ్యష్టిని సమిష్టితో కలిపేదే యోగం. పరిమితమైన వ్యక్తిత్వాన్ని విశ్వవ్యాపకచైతన్యంతో కలిపేదే యోగం. యోగం అనేమాటకు ఉన్న అర్ధం ఇలా ఉంటె, వృద్ధమాంత్రికుడు అలా చెప్పడంలో అర్ధం ఏమిటో ఆ సైతాన్ కే తెలియాలి. బహుశా సైతానే ఆ విధంగా అతనిచేత పలికించి ఉండవచ్చు.

అసలు సైతాన్ (devil) అనేదే ఒక కల్పితజీవి. సైతాన్ అనేది అసలు లేనేలేదు. There is no devil anywhere at all. ఎందుకంటే, సెమిటిక్ మతాలు చెప్పే సైతాన్ అనేది నిజంగా ఉంటే, అది దేవుణ్ణి అపహాస్యం చెయ్యడమే అవుతుంది. సైతాను ఉన్నదీ అంటే అది దేవునికి ప్రశ్నార్ధకమే. సైతాన్ని తన సృష్టిలో అసలెందుకు ఉండనిస్తున్నాడు దేవుడు? అన్న ప్రశ్నకు ఈ మతాల వద్ద జవాబు లేదు. దీనికి మనమే జవాబు చెప్పుకుందాం. 

ఒకటి -- దేవునికంటే సైతాన్ కు ఎక్కువ శక్తి ఉండి ఉండాలి. అప్పుడే అది దేవుణ్ణి ధిక్కరిస్తూకూడా ఆయన సృష్టిలో మనుగడ సాగించగలుగుతుంది. 

రెండు -- సైతాన్ తనసృష్టిలో ఉండి మానవుల్ని హింసపెట్టడం దేవునికి ఇష్టం అయ్యి ఉండాలి. అందుకని దాని ఆగడాలని ఆయన చూచీచూడనట్లు ఊరుకుంటూ ఉండి ఉండాలి. పై ప్రశ్నలకు ఇవి రెండుతప్ప వేరే లాజికల్ కారణాలు ఉండటానికి వీల్లేదు. అయితే ఈ జవాబుల  వల్ల కొన్ని ఇబ్బందికరమైన పరిస్తితులు తలెత్తుతాయి.

మొదటి కారణం నిజమైతే, మనుషులు దేవుణ్ణి పూజించడం మానేసి సైతాన్నే పూజించడం మంచిది. ఎందుకంటే సైతాన్ తో పోలిస్తే శక్తిహీనుడైన దేవుణ్ణి పూజించి ఉపయోగం ఏముంది? సైతాన్ని ఏమీ చెయ్యలేక తన సృష్టిలో ఉండనిస్తున్న దేవుడు దాని బారినుంచి మనల్ని ఎలా కాపాడగలడు? కాపాడలేడు. కనుక దేవుని పూజించడం అనవసరం.

లేదా రెండోకారణం నిజం అనుకుంటే, కుట్రపూరితంగా సైతాన్ని తనసృష్టిలో ఉండనిస్తూ, దాన్ని తన స్వప్రయోజనానికి వాడుకుంటూ, చెడునంతా దానిమీదకు తోసి, మంచినంతా తాను హస్తగతం చేసుకుంటున్న అటువంటి దేవుణ్ణి పూజించి ఉపయోగం ఏమిటో మనం ఆలోచించాలి. ఇటువంటి కుట్రలుచేసే దేవుడు అసలు దేవుడేకాడు. కనుక ఎలాచూచినా దేవుడికి పరువు పోవడం ఖాయం.

సైతాన్ ఉన్నదీ అంటే, అది దేవుణ్ణి తక్కువ చెయ్యడమే అవుతుంది. కనుక సైతాన్ అనేది అస్సలు లేనేలేదు. అది క్రైస్తవుల సృష్టి. అంతేకాని దేవునిసృష్టి కాదు. గేబ్రియల్ అనేవాడు మొదట దేవదూత అనీ, తర్వాత అతడు దారి తప్పి, దేవునికి ఎదురుతిరిగి , సైతాన్ గా మారాడనీ క్రైస్తవ కధనం. కాని దేవదూత అయినవాడు అసలు ఎలా దారి తప్పగలడు? దేవుని సంకల్పం లేకుండా, అతని మనసులో ఎదురుతిరగాలనే ఆ బీజం ఎలా పడింది? కనుక దేవదూత సైతాన్ గా మారడానికి దేవుడే కారణమా? అని అడిగితే వారు సమాధానం చెప్పలేరు. ఒకవేళ గాబ్రియేల్ డెవిల్ గా మారాడు అనుకున్నప్పటికీ, అతనిలోని చెడును ఖండించి వెంటనే అతన్ని మళ్ళీ దేవదూతగా దేవుడు ఎందుకు మార్చలేకపోయాడు? అంటే, దేవుడు అతని ఖర్మకు అతన్ని వదిలేశాడా? తన దూత పాడైపోతుంటే బాగుచేసుకోలేనివాడు ప్రపంచాన్ని ఎలా రక్షించగలడు? ఈ ప్రశ్నలకు బైబిల్లో ఎక్కడా జవాబులు లేవు.

జవాబు చెప్పలేని ప్రశ్నలు అడగటం మహాపాపం అని ముద్రవేసి, ఇలా ప్రశ్నించిన వారిని దైవద్రోహులుగా పరిగణిస్తే  చాలా సింపుల్ గా సమస్య పరిష్కారం అవుతుంది. కనుక ప్రశ్నించడాన్ని క్రైస్తవం మొదటినుంచీ అణగదొక్కుతూ వచ్చింది. "నోర్మూసుకుని మేము చెప్పింది నమ్ము" అన్నదే మొదట్నుచీ వారి సిద్ధాంతంగా ఉంటూ వచ్చింది. అలా నోరెత్తకుండా నమ్మేవారి దగ్గర ఎలాటి కాకమ్మకబుర్లైనా చెప్పి నమ్మించవచ్చు. ఎందుకంటే అసలు పునాదే "నమ్మకం" అయినప్పుడు, ప్రశ్నించడం "దైవద్రోహం" అయినప్పుడు నోరెత్తకుండా అలా ప్రతిదాన్నీ నమ్మేవారిదగ్గర మతప్రచారకుల ఆటలు బ్రహ్మాండంగా సాగుతాయి. కనుక రెండువేలఏళ్లనుంచీ వారిప్రచారం ఇదే పంధాలో సాగింది. చాలామంది అమాయకుల్ని మోసం చేసింది. సెమెటిక్ మతాలలో ప్రశ్నించడానికి తావు లేదు. వారు చెప్పింది గుడ్డిగా నమ్మటమే దారి. కాని హిందూమతం దీనికి పూర్తిగా వ్యతిరేకం. హిందూమతంలో ప్రశ్నించడాన్ని ప్రోత్సహిస్తారు. తర్కం అనేది భగవంతుడు మనిషికి ఇచ్చిన ఒక వరంగా భావిస్తారు.

సైన్సు కూడా సైతాన్ సృష్టే అని మధ్యయుగాలలో ఇదే క్రైస్తవప్రచారకులు చాలాకాలం ఊదరగొట్టారు. భూమి బల్లపరుపుగా ఉందని బైబిల్లో ఉంది గనుక-- " బైబిల్లో ఉన్నది అబద్దం. భూమి అలా లేదు, అది గోళాకారంలో ఉంది  మొర్రో" అని మొత్తుకున్న గెలీలియోను చిత్రహింసలు పెట్టారు. ప్రపంచానికి భూమికేంద్రంగా ఉంది అని బైబుల్ చెప్పింది గనుక -- "అది వట్టి అబద్దం. ప్రపంచానికి భూమి కేంద్రం కాదు. సూర్యుడు కేంద్రంగా  ఉంటె, అన్ని గ్రహాలు సూర్యుడి చుట్టూ తిరుగుతున్నాయి" అని చెప్పిన కోపర్నికస్ ను చిత్రహింసలు పెట్టిందీ ఈ క్రైస్తవులే. "సైన్స్ సైతాన్ సృష్టి" అని మధ్యయుగాల్లో చర్చి అధికారగణం ఎంత మొత్తుకున్నా సైన్స్ పురోగతి ఆగలేదు. అందుకని కొన్నాళ్ళు పోయాక ఆవాదన మానుకున్నారు. ఇప్పుడు హిందూమతం మీదా ఇదే ప్రచారం మొదలు పెట్టారు.

"యోగా" అనేది  ఎవరు ఆపినా ఆగకుండా ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తోంది . దాని యొక్క మహత్యాన్ని లోకమంతా ఇప్పుడు గుర్తిస్తోంది. ఇదే వాటికన్ కు దడ పుట్టిస్తున్న విషయం. ఎందుకంటే యోగాతో బాటు హిందూమతానికి చెందిన "కర్మ", "జ్ఞానం", "భక్తి", "ముక్తి"  లాంటి కొన్ని  పదాలూ అందరికీ తెలుస్తాయి. "పునర్జన్మ" వంటి కాన్సెప్టులూ తెలుస్తాయి. ఈవిధంగా మెల్లిగా హిందూమతం యొక్క పరిజ్ఞానం అందరికీ తెలుస్తుంది. హిందూమతంలో ఉన్న జ్ఞానసంపదనూ, విశాలదృక్పధాన్నీ ఒక్కసారి చవిచూచినవారు ఇక ఇతర మతాలుచెప్పే అబద్దాలు ఎంతమాత్రం నమ్మరు. అప్పుడు ఈ ప్రచారకుల ఆటలు సాగవు. కనుక ఎలాగైనా యోగాని నిరోధించాలి. నిషేధించాలి. ఎలా? దానికి ఒకటే మార్గం. యోగా అనేది సైతాను సృష్టి అని ఊదరగోడితే పని సులువుగా అవుతుంది. ఇదీ వీరి ప్లాన్.

కాని వీరికి తెలియని విషయం ఒకటుంది. ప్రాచీన కాలంలో ఎవరిదేశంలో ఎవరిమతంలో వారుండేవారు. కారణమేమంటే అప్పుడు కమ్యూనికేషన్ ఇంతగా లేదు. లోకంలో ఎన్ని దేశాలున్నాయో, ఎన్ని మతాలున్నాయో చాలామందికి అప్పుడు తెలియదు. కాని ఇప్పుడలా కాదు. ఇప్పుడు ప్రపంచం ఒక గ్లోబల్ విలేజ్ అయిపోయింది. ఇతర మతాలను గురించి తెలుసుకోవాలంటే ఇప్పుడు చాలా తేలిక. అలాటి తులనాత్మక అధ్యయనం చేసేవారికి అనేక  కొత్త విషయాలు తెలుస్తాయి. ఇప్పటివరకూ వారు ఎంత భ్రమల్లో ఉన్నారో తెలుస్తుంది. ఇతర మతాలకు పట్టుకున్న భయం అదే. హిందూమతంలో ఉన్న అద్భుతమైన సత్యాలను తెలుసుకునేవారి మానసికపరిధి క్రమేణా విస్తృతం అవుతున్నది. అందులో ఉన్న యోగావంటి ఆచరణాత్మక విషయాలు ప్రపంచదృష్టిని విపరీతంగా  ఆకర్షిస్తున్నాయి. ఈ ట్రెండ్ ను నివారించడానికి గాబ్రిఎల్ అమోర్త్ లాంటివారు అప్పుడప్పుడూ ఇలాటి హాస్యాస్పద వ్యాఖ్యలుచేస్తూ నవ్వుల పాలౌతుంటారు. తెలియనివారు ఈ మాటలు నమ్మవచ్చు. కాని స్వల్పంగానైనా జెనెరల్ నాలెడ్జి ఉన్నవారు ఇటువంటి ప్రచారం ఎంతమాత్రమూ నమ్మరు.

యోగా అనేది దేవుడు మనిషికిచ్చిన అద్భుతమైన వరం. మానవుడు దేవతగా మారడానికి "యోగా" రాజమార్గం. ప్రపంచానికి మనదేశం ఇచ్చిన అనేక బహుమతుల్లో యోగా ఒకటి. అంతెందుకు జీసస్ క్రీస్ట్ కూడా భారతదేశంలో నివసించి ఉన్నతమైన యోగసాధనలు నేర్చుకున్నవాడే. దాని ద్వారా సిద్దుడైనవాడే. దీనికి చాలా ఆధారాలున్నాయి. అయితే ఈసంగతి క్రైస్తవులు ఒప్పుకోరు. ఒక విషయాన్ని మనం ఒప్పుకోనంత మాత్రాన అది అబద్దం అయిపోదు. అది వేరే విషయం. కనుక, సంకుచిత దృక్పథాన్ని వీడి, యోగాభ్యాసం చేస్తే ఏమి జరుగుతుందో వృద్ధమాంత్రికుడు తెలుసుకోవాలి. తెలుసుకోవడమే కాదు. ఆచరించి చూడాలి. అప్పుడు ఇలాటివాళ్ళు తమ అభిప్రాయాన్ని తప్పక మార్చుకుంటారు. అప్పుడు మాత్రమె యోగా అనేది సైతాన్ సృష్టి కాదనీ, దేవుడు మానవాళికిచ్చిన అద్భుతమైన వరాలలో "యోగా" ఒకటి అనీ తెలుస్తుంది.

క్రైస్తవాన్ని ఇతరులకు బోధించడం కాదు. ముందుగా దానిని ఆచరించడం క్రైస్తవులు నేర్చుకోవాలి. Judge not, so that you shall not be judged. అని కొండమీద చేసిన ప్రసంగం(Sermon on the mount)లో క్రీస్తు చెప్పాడు. దానిని ఆచరిస్తే, ఎదుటివారిమీద బురదజల్లుడు కార్యక్రమం    ఆటోమేటిక్ గా ఆగిపోతుంది. క్రీస్తుయొక్క ఇలాటి నిజమైన బోధనలను "ఆచరించే" మంచిబుద్ధిని గాబ్రిఎల్ అమోర్త్ లాటి   కుహనా క్రైస్తవులకు ఈశ్వరుడు ప్రసాదించుగాక.
read more " Yoga is the work of devil "

27, నవంబర్ 2011, ఆదివారం

తిరుపతి ప్రయాణంలో -2

మర్నాడు ఉదయమే లేచి VIP break లో దర్శనం చేసుకోవడం జరిగింది. దేవాలయంలోనుంచి బయటకు వచ్చి, పడుతున్న వాన తుంపరలో నడుస్తూ,పిల్లలు అడిగిన కొన్ని సందేహాలకు సమాధానాలు చెప్తూ,గెస్ట్ హౌస్ కు చేరుకున్నాం. 

"నాన్నా. రామానుజులు విశిష్టాద్వైత సిద్ధాంతప్రవర్తకుడు అని నిన్న చెప్పావు కదా. అసలు త్రిమతాలైన ద్వైతాద్వైత విశిష్టాద్వైత సిద్ధాంతాల యొక్క మౌలిక బోధనలు ఏమిటి? అసలు ఇన్ని రకాల సాంప్రదాయాలు ఎందుకు?"అని పిల్లలు అడిగారు. వారి వయసుకు మించిన జిజ్ఞాసకు ముచ్చట అనిపించింది.

" చెప్తాను. శ్రద్ధగా విని అర్ధం చేసుకోండి" అంటూ ఇలా చెప్పాను.

"వేదాంతము ముఖ్యంగా జీవుడు, జగత్తు, బ్రహ్మము అనే మూడు విషయాలను చర్చిస్తుంది. ఈ మూడింటి మధ్య ఉన్న సంబంధాన్ని త్రిమతాచార్యులు దర్శించిన భేదాలవల్ల ఆయా సిద్ధాంతాలు ఒకదానికొకటి భిన్నములుగా దర్శనం ఇస్తాయి.

జీవుడు అంటే జీవాత్మ. ఈ జీవాత్మలు కోటానుకోట్లు ఉన్నాయి. పెద్ద అగ్నిగుండం లోనుంచి బయటకు వచ్చే నిప్పురవ్వలలాగా ఇవి ఉంటాయి. జగత్తు అంటే మనకు కనిపించే ప్రపంచం. వేదాంతంలో చెప్పబడే బ్రహ్మాన్నే మనం భగవంతుడు అనీ, దేవుడు అనీ, సామాన్యభాషలో పిలుస్తాం.

జీవుడూ, జగత్తూ, బ్రహ్మమూ వేరువేరుగా అనాదిగా ఉంటున్నాయి. ఇవి మూడూ ఎప్పటికీ విడివిడిగానే ఉంటాయి. వీటికి మూడింటికీ ఎప్పటికీ నాశనం లేదు. జీవుడు ఈ జగత్తులో భక్తిభావంతో ఉంటూ పూజ, అర్చన, జప తపాదులద్వారా బ్రహ్మాన్ని ఉపాసించాలి. ఇది ద్వైతవాదం. దీన్ని మధ్వాచార్యులు ప్రతిపాదించారు. పాపులర్ హిందూమతం అంతా ఈ స్థాయికి చెందినదే. అంతేకాక దాదాపుగా సామాన్యజనాలు అనుసరించే  అన్ని మతాలూ, ఆచరణలూ, ఈ స్థాయిలోనో ఇంకా తక్కువ స్థాయిలోనూ  ఉంటాయి. 

జీవునిలో బ్రహ్మముయొక్క అంశ ఉంటుంది. జగత్తుకూడా బ్రహ్మము యొక్క అంశమే. బ్రహ్మము చేత సృష్టించబడిన ఈ జగత్తులో, జీవుడు శరణాగతతత్వంతో భక్తిమార్గంలో నడుస్తూ, చివరకు బ్రహ్మములోని ఒకఅంశముగా మారాలి.ఇది విశిష్టాద్వైత తత్త్వం. ఇది రామానుజాచార్యుల మతం.   

జగత్తు అనేది నిజానికి ఒక భ్రమ. అది ఎప్పుడూ లేదు. జీవుడూ బ్రహ్మమూ ఒకదానికొకటి వేరువేరు కాదు. జగత్తు ఉంది అనుకోవడమూ,జీవుడూ బ్రహ్మమూ వేరు అనుకోవడమూ మాయ. సాధనవల్ల ఈ మాయ తొలగినప్పుడు  సత్యం బోధపడుతుంది. ఇది అద్వైతవాదం. దీనిని శంకరాచార్యులు ప్రతిపాదించారు.

కొన్ని శతాబ్దాలుగా వీరి అనుచరుల మధ్య, ఈ సిద్ధాంతాల మీద రాద్ధాంతాలు జరుగుతున్నాయి. ఒకరిని చూస్తె ఒకరికి పడకపోవడమూ, ఒకరి కుటుంబాలలో ఇంకొకరు పెళ్ళిళ్ళు చేసుకోకపోవడమూ, బంధుత్వాలు ఉండకపోవడమూ ఇత్యాదులు తరతరాలుగా ఉంటున్నాయి. నా దృష్టిలో ఇదొక పనికిమాలిన పిచ్చితనం. 

ఈ సిద్ధాంతాలలో ద్వైతం అనేది చాలా సులభంగా అందరికీ అర్ధం అవుతుంది. అనుసరించడానికి కూడా సులభంగా ఉంటుంది. ఎందుకంటే, దేవుడు సర్వశక్తివంతుడు.మనిషి అల్పుడు.మన కష్టాలు తీర్చమని మనం దేవుణ్ణి ప్రార్దిస్తాం. వరాల కోసం అర్దిస్తాం. పూజా పునస్కారాలు చేస్తాం. ద్వైతం ఇంతవరకే అర్ధం చేసుకుంటుంది. మామూలుస్థాయిలో ఉండే సామాన్యజనానికి ద్వైతం బాగా నప్పుతుంది. నిజానికి ప్రపంచంలో ఉన్న అన్నిమతాలూ, అవి దేవుణ్ణి నమ్మేవైతే, ద్వైతసిద్ధాంతం క్రిందకే వస్తాయి. దీనికంటే ఇంకొంచం పైది విశిష్టాద్వైతం. ఇందులో జీవుడు భగవంతుని అంశగా మారగలడు అని భావిస్తారు. ఇదీ చాలామందికి బాగానే నచ్చుతుంది. శరణాగత భావంతో, భగవత్ ప్రసాదంగా ప్రపంచాన్ని అనుభవించవచ్చు అని వీరు భావిస్తారు. ఇదీ మంచిదే. ఇకపోతే అద్వైతం ఇంతకంటే పై స్థాయికి చెందినది. అందులో జీవుడూ దేవుడూ అన్న భేదానికి తావే లేదు. జగత్తుకు అసలు ఉనికే లేదు. ఇది చాలా కష్టసాధ్యం. ఊహక్కూడా దుర్లభం. అందుకే ఈ స్థాయిని అందరూ అందుకోలేరు. అద్వైతులమని చెప్పుకునేవారుకూడా ఈ స్థాయిని అందుకోలేరు. కాని ఇది అత్యున్నతమైన ఒక అనుభవస్తితిని ప్రతిపాదిస్తున్నది. కనుక ఇదీ సత్యమే.

నిజంగా చూస్తే, ఈ మతానుయాయుల మధ్యన ఉన్న స్పర్ధలు అసలు అనవసరమైనవి. వీరితో వచ్చిన చిక్కేమిటంటే వీరిలో ప్రతిఒక్కరూ వారి సిద్ధాంతమే అంతిమసత్యం అనుకున్నారు. జీవుడు దేవునితో ఏ నాటికీ సమానుడు కాలేడని మొదటి రెండు వర్గాలూ భావిస్తాయి. అసలు అలా భావించడమే మహాతప్పుగా వారు తలుస్తారు. అద్వైతంలో అలాటి అపరాధభావన ఏమీ ఉండదు. జీవబ్రహ్మైక్యాన్ని తెలుసుకోవడమే సార్ధకత అని వారు తలుస్తారు.

శ్రీరామకృష్ణులు ఈ మూడుమతాల మధ్యనా ఉన్న గొడవలను చాలా సులభంగా పరిష్కరించారు. ఇవి మూడూ సాధనామార్గంలో మూడుమెట్లని ఆయన చెప్పారు. ఇవి మూడూ పాక్షికసత్యాలే. ఏ మెట్టులో ఉన్నవారికి ఆ మెట్టే చివరిమెట్టుగా అనిపిస్తుంది. కాని నిజానికి ప్రయాణంలో అదొక మజిలీ మాత్రమే. ఈ మూడుస్తాయిలే కాకుండా వీటిని మించిన ఇంకా అనేక పై స్తాయిలున్నాయని శ్రీరామకృష్ణులు చెప్పారు. నిజానికి ఈ మూడు సిద్ధాంతాలూ, వాదాలకు ప్రతివాదాలకు పనికొచ్చే సిద్ధాంతచర్చా విషయాలు కానేకావు. ఇవి సాధనలో అనుభవంలోకి తెచ్చుకోవలసిన విషయాలు. సాధన చేసేవారికి ఇవి అనుభవంలోకి వస్తాయి. అలాకాకుండా ఊరకే సిద్ధాంతాలు చదివి, చర్చలు చేసి, గొడవలు పడే పండితులకు ఉత్త అహంకారమే మిగులుతుంది. 

ఉన్నతమైన అద్వైతస్తితిలో ఒక మనిషి ఎల్లకాలమూ ఉండటం అందరికీ సాధ్యం కాదు. కనుక అద్వైతానుభవాన్ని పొందినతర్వాత కూడా చాలామంది మానవులు క్రిందిస్తాయిలలోకి దిగివచ్చి విశిష్టాద్వైత స్తాయిలోనో, లేక ద్వైతస్తాయిలోనో ఉంటూ ఈ జగత్తు తోనూ అందులోని జీవులతోనూ వ్యవహరించాల్సి వస్తుంది. ఇంతకంటే వేరే మార్గం ఉండదు. కాని అద్వైతానుభవాన్ని నిత్యజీవితంలో అనుసంధానం చేసుకుంటూ వ్యవహరించే స్తితి  చాలా పరిపక్వస్థితి. దీనిలో, ఈ మూడుస్తాయిలలోని పరిపూర్ణజ్ఞానం అనుభవరూపంలో ఆవ్యక్తిలో ఉంటుంది. దీనినే శ్రీ రామకృష్ణులు "విజ్ఞానం" అన్నారు. భక్తునిస్తితి కంటే, జ్ఞానిస్తితి కంటే, ఈ విజ్ఞానిస్తితి చాలా గొప్పది. పరిపక్వమైనది.

ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఇదీ శ్రీరామక్రిష్ణులు చెప్పినదే. ఒక మనిషి ఇంటిలో, డాబామీదకు వెళ్ళడానికి మెట్లుంటాయి. ఆ మెట్లు ద్వైతం విశిష్టాద్వైతం అనుకోవచ్చు. డాబా మీది కప్పుని అద్వైతం అనుకోవచ్చు. మనిషి మెట్లమీదుగా పైకెక్కి కప్పుమీదకి చేరుతాడు. కాని డాబామీదికెక్కిన తర్వాత ఎల్లకాలం అక్కడే ఉండలేడు. కాసేపు అక్కడఉండి, తర్వాత కిందికిదిగి, ఇంటిలోకి రావలసిందే. కాని కొందరుమాత్రం, ఎప్పుడూ డాబా మీదే ఉండిపోతారు. ఇక కిందికి రారు. వారు ప్రపంచపు వాసన సోకని నిత్యసిద్ధులు. సనక సనందనాది మహర్షులు ఈ కోవకు చెందినవారు. వారు ఎప్పుడూ ఈ ప్రపంచానికి అతీతమైన భూమికలో ఉండే మహనీయులు. 

మనిషి మెట్లెక్కి ఇంటిమీదకి చేరాలి. మళ్ళీ మెట్లు దిగి ఇంటిలోకి రావాలి. ఒకసారి పైకెక్కి దిగిన తర్వాత ఇంతకు ముందున్న మానసిక స్తితి అతనికి ఉండదు. కారణమేమిటంటే పై కప్పుమీద నుంచి చూస్తే, ఇంతకు ముందు తనకు తెలియని ఎన్నో కొత్తవిషయాలు అతను చూస్తాడు, గ్రహిస్తాడు. కనుక అతని మనస్తత్వమూ స్వభావమూ తదనుగుణంగా మారిపోతాయి. అతని దృక్కోణంలో మౌలికమైన అనేక మార్పులు చోటుచేసుకుంటాయి. కప్పు ఏ పదార్ధంతో తయారైందో మెట్లూ ఇల్లూ కూడా అదే పదార్ధంతో నిండి ఉన్నాయని అతడు గ్రహిస్తాడు. తనకు వివిధమెట్లమీదా, పైకప్పుమీదా కలిగిన అనుభవాలదృష్ట్యా ఇప్పుడతని ప్రవర్తన ఉంటుంది. అందుకే ఆ అనుభవాలు లేని లోకులకు అతని భావాలూ ప్రవర్తనా అర్ధం కావు".

"ఈ ప్రపంచంలో ఎవరైనా సరే ఈ దారిలో నడవక తప్పదు. ఈ రోజు కాకపోతే రేపైనా, ప్రతివారూ ఈ దారిలో నడవాలి. ఇది ప్రకృతినియమం. దీనికి ఎవ్వరూ మినహాయింపు కారు. అందుకే ప్రతిమనిషికి అంతర్లీనంగా ఏదో సాధించాలన్న తపన ఉంటుంది. కాని తెలీక, దాన్ని భౌతికరంగాలలో ఉపయోగిస్తాడు. లోకంలో ఎంతో సంపాదించాననీ, ఎన్నో విజయాలు సాధించానని అనుకుంటాడు. ఎన్ని సాధించినా జీవితచరమాంకంలో వెనక్కి తిరిగి చూచుకుని తానేమీ సాధించలేదని, జీవితం వృధాగా గడిపాననీ గ్రహిస్తాడు. ఎందుకంటే జీవుడు, జగత్తు, బ్రహ్మము అనే మూడూ అతి మౌలికమైన సమస్యలు. వీటిని తెలుసుకోకుండా మనిషి జీవితంలో ఎన్నటికీ అంతిమమైన తృప్తి కలగదు. ఎన్ని బాహ్యవస్తువులు పొందినా అవి అంతరికమైన ఈ మౌలిక విషయాలను స్పర్శించలేవు కనుక అంతిమతృప్తి అనేది మనిషికి ఎన్నటికీ కలుగదు. లోపల వెలితి అలాగే మిగిలిపోతుంది.

జగత్తును తెలుసుకుందామని సైన్సు ప్రయత్నం చేస్తున్నది. (సైకాలజీ మనస్సును తెలుసుకుందామని ప్రయత్నిస్తున్నది) పేరాసైకాలజీ ఆత్మను గురించి తెలుసుకుందామని ప్రయత్నం సాగిస్తున్నది. సాధకులు దైవాన్ని తెలుసుకుందామని చూస్తున్నారు. కాని ఎవరైతే ఈ మూడింటినీ పూర్తిగా సమగ్రంగా తెలుసుకుంటారో వారి జీవితమే ధన్యం. లేకపోతే ఆ జీవితం వ్యర్ధం. మనిషి ఎంత సంపాదించినా చివరకు అది వ్యర్థమే. అది ఏమాత్రమూ లెక్కలోకి రాదు. అంతిమమైన సంతృప్తిని ఇవ్వలేదు. ఈ మౌలిక సమస్యలను సాల్వ్ చెయ్యగలిగిన వారి జీవితం మాత్రమే ధన్యం అవుతుంది. లేకపోతే మానవజన్మ వ్యర్ధమే.

"ఒకరు ఈ సమస్యలను సాల్వ్ చేస్తే అది అందరికీ ఉపయోగపడదా? ఎందుకంటే సైన్స్ లో ఒక ఆవిష్కరణ జరిగితే అది అందరికీ అందుబాటులోకి వస్తుంది కదా? అలాగే ఈ రంగంలో కూడా జరగడానికి ఆస్కారం లేదా?" మా అమ్మాయి అడిగింది.

నాకు నవ్వొచ్చింది.

"అలా కుదరదమ్మా.అంతరిక జీవితంలో ఎవరి ఆవిష్కరణ వారిదే. కాకపోతే నేను నడిచినదారిని మీకు చూపించగలను. మార్గంలో ఎత్తుపల్లాలు ఎక్కడున్నాయో చెప్పగలను. ఏ ఏ జాగ్రత్తలు తీసుకోవాలో చెప్పగలను. కాని మిమ్మల్ని భుజాలపైన ఎత్తుకొని నేను నడవలేను. ఆ దారిలో నడక మాత్రం మీరు నడవాల్సిందే. మీ అనుభవం మీదే. ఇంకొకరి అనుభవం మనకు అంతవరకే ఉపయోగపడుతుంది. 

సైన్స్ కూ ఆధ్యాత్మికతకూ ఉన్న భేదం గురించి చెప్తాను విను. సైన్స్ అనేది ఆబ్జెక్టివ్ ప్రయోగం. అది బయట వస్తువులతో చేసేది. అక్కడ ప్రయోగం చేసేవాని సబ్జెక్టివ్ స్తితితో, అతను చేసే ప్రయోగానికి సంబంధం ఉండదు. కాని సాధన అలా కాదు. ఇది పూర్తిగా సబ్జెక్టివ్ వ్యవహారం. ఇక్కడ ప్రయోగశాలా తనే. ప్రయోగమూ తనమీదే. చేసేదీ తానే. కనుక కలిగే అనుభవమూ తనతోనే ఉంటుంది. దాని ఛాయ కొంతవరకూ బయటకి కనిపిస్తుంది. కాని పూర్తిగా బయటివారికి అర్ధంకాదు. అదీ తేడా." అని చెప్పాను.

వింటున్న వారి ముఖాలలో సంభ్రమంతో కూడిన ఏదో ఆనందం కనిపించింది. జీవితంలో మౌలికసమస్యల  పరిష్కారం కనుగొన్న బుద్ధుని ముఖంలో కనిపించే నిర్మలత్వం వారిముఖాలలో చూచాయగా దర్శనమిచ్చింది.

తర్వాత ప్రయాణం మామూలుగానే సాగింది. కొండ కిందకు దిగి, తిరుపతిలో పద్మావతీ అమ్మవారి ఆలయమూ, కపిల తీర్ధమూ దర్శించి, కొద్దిపాటి విశ్రాంతి తర్వాత, సాయంత్రానికి బండెక్కి ఊరికి చేరాము. ప్రయాణమంతా వింటున్న ఈవిషయాలు మౌనంగా నెమరు వేసుకుంటున్నట్లుగా దారిలో పిల్లలముఖాలు చూస్తే నాకనిపించింది.
read more " తిరుపతి ప్రయాణంలో -2 "

19, నవంబర్ 2011, శనివారం

హస్తసాముద్రికం -- అద్భుతశాస్త్రం

హస్తసాముద్రికం అనేది ఒక అద్భుతమైన శాస్త్రం. దీని గురించి కొంత మాట్లాడుకుందాం. చేతిలో గీతలు అందరికీ ఒకే విధంగా ఉంటాయని తెలియనివాళ్ళు అనుకుంటారు. కాని అలా ఉండవు. చూట్టానికి ఒకేరకంగా ఉన్న మనుషుల్ల్లో కూడా హస్తరేఖలు ఒకేలా ఉండవు. వేళ్ళ అమరికలోనూ, ఆకారంలోనూ, చర్మపుతీరులోనూ, గోళ్ళ తీరులోనూ, కణుపుల తీరులోనూ మనిషికీ మనిషికీ చాలా తేడాలుంటాయి. ఇక గ్రహస్థానాలు, రేఖలు, ప్రత్యెకమైన గుర్తులు ఇలా ప్రతి విషయంలోనూ తేడాలుంటాయి. 

తల్లి గర్భంలో ఉన్నప్పుడు శిశువు పిడికిలి బిగించి చేతులు ముడుచుకుని ఉంటుంది కనుక ఆ గీతలు ఏర్పడతాయని హేతువాదులూ నాస్తికులవంటి అజ్ఞానులు టీవీలలో చెబుతుంటారు. అందరూ శిశువులూ తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఒకేలా పిడికిలి బిగించుకుని ఉంటారు. కాని హస్తరేఖలు ఏ ఇద్దరు శిశువులకూ ఒకేలా ఉండవు. అంతే  కాదు, ఒకే శిశువులోనే కుడిచేతిరేఖలకూ ఎడమచేతిరేఖలకూ తేడాలుంటాయి. దీనికి ఎవ్వరూ వివరణ ఇవ్వలేరు. 

అసలు విషయం అది కాదు.నాడీశాస్త్రం ప్రకారం శరీరంలోని నాడులన్నీ అరచేతిలోనూ అరికాళ్ళలోనూ కేంద్రీకరించబడతాయి. ఆక్యుపంచర్, ఆక్యుప్రెజర్ విద్యలు కూడా ఈ నిజాన్ని గ్రహించినవే. కనుకనే చేతిలోనూ కాళ్ళలోనూ ఉన్ననాడులను మాసేజ్ చెయ్యడం ద్వారా చాలా రోగాలను తగ్గించవచ్చు. మార్షల్ ఆర్ట్స్ లో శరీరంలోని మర్మకేంద్రాల జ్ఞానంకూడా ఇలాగే ఉంటుంది. మనిషి ఒంటిలో ఎక్కడ ఏరకంగా కొడితే స్పృహ తప్పించడం నుంచి, పక్షవాతం వంటి స్తితులు వచ్చేట్టు చెయ్యడం లేదా స్పాట్లో ప్రాణం తియ్యగల ప్రమాదకరమైన దెబ్బల వంటివి అన్నీ మర్మవిద్యలో ఉన్నాయి. అదే వేరే సబ్జెక్టు గనుక ప్రస్తుతం మన విషయానికి వద్దాం.

Face is the index of the mind. అన్న సామెత బాగా వాడుకలో ఉన్నదే. కాని ముఖం ఒక్కటే కాదు. మనిషి శరీరంలోని ప్రతి అవయవమూ మనిషి యొక్క మనస్తత్వాన్నీ, ఆలోచనా సరళినీ, అలవాట్లనూ పట్టిస్తుంది. అలాగే హస్తరేఖలు కూడా మనిషిని గురించి సమస్తమూ వెల్లడిస్తాయి. జాతకచక్రం ఎంతో మనిషి అరచెయ్యి యొక్క ప్రింటూ అంతే. ఇవి రెండూ రెండు రకాల భాషలు అనుకుంటే, అవి చెప్పే విషయం మాత్రం ఒకటే ఉంటుంది. మనిషి ఆలోచనల ప్రభావం నాడుల ద్వారా హస్త రేఖలను మారుస్తూ ఉంటుంది.

మనిషి ఆలోచనలు అతని శరీరాన్ని ప్రభావితం చేస్తాయి. అలాగే, చేతి రేఖలనూ ప్రభావితం చేస్తాయి. అందుకే మన ఆలోచనా ధోరణి మారుతున్న వయస్సులో చేతి రేఖలూ మారుతాయి. పాతరేఖలు మాయం అవుతాయి. కొన్ని కొత్తరేఖలు పుట్టుకొస్తాయి. ఇది ఎవరి చేతిలో వారే గమనించుకోవచ్చు. అప్పుడు నేను చెబుతున్నది నిజమే అని ఎవరికి వారికే అర్ధం అవుతుంది. ఈ విషయాన్ని మన ప్రాచీన ఋషులు ఎప్పుడో గమనించారు. గమనించడమే కాదు, ఈ శాస్త్రాన్ని చాలా లోతుగా రీసెర్చి చేసి అనేక సూత్రాలను వ్రాసిపెట్టారు. ఆయా సూత్రాలను ఉపయోగించి చూస్తే, అవి చాలావరకూ నిజం కావడం మనం చూడవచ్చు.

మనిషి చేతిలో గ్రహాలను దర్శించవచ్చు. జాతక చక్రాన్ని మనిషి చేతిలో చూడవచ్చు. చేతిని చూచి మనిషి యొక్క జాతకాన్ని ఖచ్చితంగా వ్రాసే విద్య మన దేశంలో ఉంది. అలా వ్రాయగలిగిన వాళ్ళు ఇప్పటికీ ఉన్నారు. వారు గీసిన జాతకచక్రం, మన జనన సమయానికి పంచాగంతో మనం గుణించిన జాతకచక్రం ఒకేలా వస్తాయి. గ్రహాల పోజిషన్స్ అన్నీ ఒకేలా సరిపోతాయి. చాలా మందికి జనన సమయం ఉండదు. అనేక కారణాలవల్ల తల్లితండ్రులు ఆ సమయాన్ని గుర్తుంచుకోక పోవచ్చు. ఒకవేళ గుర్తున్నా, అన్ని కుటుంబాలలోనూ జాతకాలు వ్రాయించే అలవాటు ఉండదు. కనుక అటువంటి వారికి ఈ విధానం ద్వారా జాతక చక్రాన్ని రాబట్టవచ్చు. దాన్ని బట్టి జననతేదీని నిర్ధారణ చెయ్యవచ్చు. అంటే చేతిని చూచి ఒక వ్యక్తి యొక్క date of birth చెప్పడం సాధ్యమే అన్నమాట. ఇదెంత అద్భుతమో చూడండి. అంటే మనిషి ఒక రకంగా తన జాతకాన్ని ఎప్పుడూ తన చేతిలోనే మోస్తూ తిరుగుతున్నాడు.

అంగుష్ఠవిద్య అని దీనిలో సూపర్ స్పెషలైజేషన్ ఒకటుంది. అందులో అయితే చేతిరేఖలను కూడా పరిశీలించరు. ఒక్క బొటనవేలి మీద ఉన్న గీతలనుబట్టి ఆ వ్యక్తి యొక్క జీవితం మొత్తాన్నే చదివేస్తారు. ఈ విద్యలో రావణుడు అఖండమైన ప్రజ్ఞాశక్తి కలిగినవాడని అంటారు. ఆయన వ్రాసిన 'రావణసంహిత' అనే గ్రంధంలో ఈ వివరాలు ఉన్నాయి. ఇలా అనేకానేక అద్భుత విద్యలు మన దేశంలో ఉండేవి. అవన్నీ కాలక్రమేణా కనుమరుగు అయ్యాయి. ఇప్పుడిప్పుడే మళ్ళీ ఇవన్నీ పునరుజ్జీవనాన్ని చవిచూస్తున్నాయి. దీనికి కారకులు మన వాళ్ళే కాదు , అమెరికా, యూరోప్ లోని అనేకమంది పాశ్చాత్యులు ఈ విద్యల గొప్పతనాన్ని గుర్తించి వాటిమీద అనేక సంవత్సరాలుగా రీసెర్చి చేస్తున్నారు. నేడు మన జ్యోతిష్యం గురించి మనకు తెలియని అనేక విషయాలను మనమే బిత్తరపోయేలా చెప్పగల అనేకమంది పాశ్చాత్యులు ఉన్నారంటే వింతగా ఉన్నా ఇది నిజం. దానికి కారణాలు -- ఒకపక్క  మన చేతగానితనమూ, మన ప్రాచీన విద్యలను మనమే ఎగతాళి చేసుకుని, అదొక ఫేషన్ అనుకునే భావదారిద్ర్యమూ, సూడో సైంటిఫిక్ వాదమూ, కమ్యూనిస్టువాదమూ వగైరా వగైరాలు. 

పాతతరంలో కీరోవంటి మేధావులు మనవిద్యలను నేర్చుకుని ప్రపంచ ప్రఖ్యాతులయ్యారు. ఈ తరంలో కూడా మన జ్యోతిష్యాది విద్యలను లోతుగా అధ్యయనం చెయ్యడంలో అనేకమంది పాశ్చాత్యులు పరిశ్రమ చేస్తున్నారు.  

బహుశా తెల్లవాళ్ళు చెబితేగాని మన సంస్కృతి ఎంత గొప్పదో మనకు తెలియదేమో. దీన్నంతా చూస్తుంటే, మన ప్రాచీనవిద్యల గొప్పతనాన్ని గురించి పాశ్చాత్యులు వివరిస్తుంటే నోరెళ్ళబెట్టి మనం వినేరోజు దగ్గరలోనే ఉంది అనిపిస్తోంది. అప్పటికైనా మనకు పట్టిన భావదరిద్రం వదులుతుందా?
read more " హస్తసాముద్రికం -- అద్భుతశాస్త్రం "

14, నవంబర్ 2011, సోమవారం

కీరో జాతకంలో మంత్రసాధనాయోగాలు

పాశ్చాత్యజోస్యులలో చెప్పుకోదగ్గ ప్రముఖుడు కీరో. ఈయన 1 -11 -1866 న ఐర్లెండ్ లోని డబ్లిన్ దగ్గరలో జన్మించాడు. (ఈయన జనన తేదీమీద భిన్నాభిప్రాయాలున్నాయి). ఈయన అసలు పేరు "విలియం జాన్ వార్నర్". అయితే తానుగా "కౌంట్ లూయీ హేమన్" అనే పేరును స్వీకరించాడు. హస్తసాముద్రికాన్ని "కీరోమాన్సీ" అనే పేరుతో పిలుస్తారు. ఆ విద్యలో ఈయనకున్న అద్భుతపాండిత్యంవల్ల ఈయనకు "కీరో" అనే పేరు స్తిరపడింది.  తన జీవితకాలంలో ఈయన కొన్ని వేలమందికి ఖచ్చితమైన రీడింగ్స్ ఇచ్చాడు. వారిలో ప్రపంచప్రముఖుల నుంచి సామాన్యులవరకూ అన్ని రకాలవారూ ఉన్నారు. 69 సంవత్సరాల వయసులో అక్టోబర్ 8,1936 న హాలీవుడ్ లో మరణించాడు. ఆరోజులలోని అనేకమంది యూరోపియన్ ప్రముఖులకూ, రాజులకూ, రాణులకూ, ప్రపంచ ప్రఖ్యాతులకూ  చెయ్యిచూసి వారి జీవితవిశేషాలను అచ్చు గుద్దినట్లుగా చెప్పడమేకాక జరగబోయే విశేషాలను కూడా ఖచ్చితంగా చెప్పాడు. ఆయా సంఘటనలు ఆయన చెప్పినట్లుగానే జరిగినప్పుడు లోకమంతా నివ్వెరపోయింది. ఇవన్నీ రికార్డ్ చెయ్యబడిన నిజాలు. ఈయన జాతకంలోని కొన్ని ముఖ్య విశేషాలను చూద్దాం.


ఈయన వ్రాసిన జ్ఞాపకాలలో, తానీ విద్యను భారతదేశంలో నేర్చుకున్నట్లుగా చెప్పాడు. తన టీనేజిలో బాంబేలో తాను కలుసుకున్న ఒక కొంకన్ బ్రాహ్మణుడు తనను మహారాష్ట్రలోని వారి గ్రామానికి తీసుకు వెళ్లి, తన శిష్యునిగా అంగీకరించి, వారివద్ద తరతరాలుగా వస్తున్న సాముద్రికగ్రంధాలను పరిశీలించే అవకాశాన్ని ఇచ్చాడనీ, వారివద్ద తాను రెండేళ్ళపాటు శిష్యరికంచేసి ఈవిద్యను నేర్చుకున్నట్లుగా చెప్పాడు. 

జ్యోతిష్యశాస్త్రం కంటే హస్తసాముద్రికానికి కీరో ఎక్కువ ప్రాధాన్యత నిచ్చాడు. సామాన్యంగా హస్తసాముద్రికులకు కొన్ని మంత్రాలసాధన కూడా తప్పకుండా తోడుగా ఉంటుంది. అప్పుడే వారు ఆశ్చర్యకరమైన ఫలితాలు చెప్పగలుగుతారు. కీరో కూడా కర్ణపిశాచినీ మంత్రాన్ని సాధన చేసినట్లుగా ఆధారాలు ఉన్నాయి. అతని చేతికి ఆ మంత్ర సంబంధితమైన ఒక తాయెత్తు ఉండేదనీ ఆ తాయెత్తును ఆయనకా విద్య నేర్పించిన గురువు కట్టాడనీ, అది ఉన్నంతవరకూ కీరో చెప్పింది చెప్పినట్లుగా జరిగిందనీ, పెద్దవయస్సులో ఆ తాయెత్తును  కీరో పోగొట్టుకున్న తర్వాత ఆయన జోస్యాలు కొంత మేర తప్పాయనీ కొందరు అంటారు. ఈ మేరకు కీరోభార్య వ్రాసిన ఉత్తరం ఒకటి బీ.వీ.రామన్ గారికి చేరిందని రామన్ గారు తన ఆత్మకధలో వ్రాశారు. 

కీరో జాతకాన్ని మనం పరిశీలిస్తే, మంత్రసాధనను సూచించే కొన్ని విచిత్రమైన యోగాలు కనిపిస్తాయి. కీరో మఖానక్షత్రంలో వృశ్చికలగ్నంలో జన్మించాడు. ఇతనికి మూడింట గురువూ తొమ్మిదింట కుజుడూ ఎదురెదురుగా ఉండటం ఒక విచిత్రయోగం. ఇది ఇతనికి పూర్వజన్మ నుంచీ భారతదేశంతో ఉన్న సంబంధాన్ని సూచిస్తోంది. మకరలగ్నంతో సంబంధం ఉన్నవారికి మనదేశంతో తప్పక కర్మానుబంధం ఉంటుంది. అది ఏ రకమైన సంబంధమో ఆయాజాతకాల ద్వారా పరిశీలించి తెలుసుకోవాలి. చంద్రలగ్నాత్ మకరం షష్ఠస్థానం అయ్యింది. కటకం ద్వాదశం అయ్యింది. 

ఈయన జాతకంలోని ఇంకొక ముఖ్యయోగం -- లగ్నాత్ ద్వాదశంలో తులారాశిలో శనిసూర్యుల కలయిక. ఈ స్థానం శనికి ఉచ్చస్తితినీ సూర్యునికి నీచస్తితినీ ఇస్తుంది. ఒకేచోట రెండు పరస్పర విరుద్ధగ్రహాలు ఒకటి చాలాబలంగా ఇంకొకటి చాలాబలహీనంగా ఉండటం వెనుక ఎన్నో మార్మికమైన అర్ధాలున్నాయి. చంద్రునినుంచి ఈస్థానం తృతీయం అవుతుంది అన్నవిషయం కూడా గమనించాలి. ఇప్పుడు రాహుకేతువుల స్తితిని పరిశీలిస్తే,  పంచమలో కేతువూ, లాభంలో రాహువూ దర్శనమిస్తారు. వీరు చంద్రలగ్నాత్ అష్టమ, ద్వితీయస్థానాలలో కనిపిస్తారు.

ఈ మూడు ముఖ్యమైన యోగాలను గుర్తించాం గనుక ఇక వీటిని విశ్లేషిద్దాం. 

అష్టమాదిపతి అయిన బుధుడు జ్యోతిర్విద్యా కారకుడు. ఇతను లగ్నంలో ఉండటం వల్ల ఈయనకు మార్మిక సంబంధమైన జ్యోతిర్విద్య పట్టుబడింది. అయితే ఇది హస్త సాముద్రికం అయ్యింది. కారణం ఏమంటే చేతులకు సూచకమైన తృతీయంలో గురువు నీచలో ఉండటం. పంచమంలో కేతువు ఉండటం, నవమంలో కుజుడు నీచలో ఉండటాలవల్ల మంత్ర సంబంధమైన ప్రజ్ఞాపాటవాలు ఇతనికి ఖచ్చితంగా ఉన్నట్లు మనం చూడవచ్చు.

ఇక్కడ ఒక రహస్యం దాగుంది. కేతువున్న పంచమ స్థానాధిపతి అయిన గురువు విక్రమస్థానంలో నీచలో ఉండటం వల్ల, ఈయన ఒక క్షుద్రమంత్రాన్ని ఆరాధించాడన్న  సంగతి సూచనగా తెలుస్తున్నది. కనుక కర్ణపిశాచినీ మంత్రసిద్ధి ఈయనకు ఉందన్న విషయం నిజమే కావచ్చు. లేకుంటే అంత ఖచ్చితంగా కొన్నివేల మందికి భవిష్యత్తును నిర్ధారణగా చెప్పటం సాధ్యం కాదు.

హస్త సాముద్రికంలో కీరో ప్రజ్ఞాపాటవాల గురించి అనేక కధలు ప్రచారంలో ఉన్నాయి. ఒకసారి కీరోవద్ద చెయ్యి చూపించుకోడానికి వచ్చిన ఒకవ్యక్తి ఒక షరతు విధించాడట. తాను ఒక తెరచాటున కూచుని, తన అరచేతిని మాత్రమే ఆ తెర వెనుకనుంచి బయటకు చాచి చూపిస్తాననీ, తెరకు అవతల పక్కన కీరో కూచుని ఆ చేతిని మాత్రమే పరిశీలించి తనవివరాలు చెప్పాలనీ చాలెంజ్ చేసాడు. సరేనని ఒప్పుకున్న కీరో ఆచేతిని పరిశీలించిన మీదట, అవతల వ్యక్తిని ఒక యూరోపియన్ రాచకుటుంబీకునిగా గుర్తించి దానికి తగిన గౌరవసంబోధనతో ఆవ్యక్తిని పలకరించి అతన్ని ఆశ్చర్యచకితుణ్ణి చేసాడట. జ్యోతిషాన్ని ఏమాత్రమూ నమ్మని  ప్రముఖరచయిత "మార్క్ ట్వేయిన్" కూడా కీరోతో తన జాతకాన్ని చెప్పించుకుని ఆశ్చర్యచకితుడవడమే కాక ఆ విషయాన్ని ఒప్పుకుంటూ కీరోవద్ద ఉన్న గెస్ట్ బుక్ లో వ్రాసి సంతకం కూడా చేసాడు.  

విక్టోరియారాణి మరణ తేదీనీ, కింగ్ ఎడ్వర్డ్ చనిపోయే నెలనీ సంవత్సరాన్నీ, రష్యా జార్ చక్రవర్తికి పొంచిఉన్న ఆపదనీ, ఇటలీ రాజు హంబర్ట్ హత్య చెయ్యబడతాడనీ, ఇలా ఎన్నెన్నో కరెక్ట్ గా జరిగిన సంఘటనలను కీరో ఖచ్చితంగా ముందే ఊహించి చెప్పాడు. ఈ జ్ఞానాన్ని "విస్మరించబడిన హిందువుల విజ్ఞానం" (forgotten wisdom of the Hindus) అన్న పేరుతో  అతను పిలిచాడు.


ఒకచోట కీరో ఇలా అంటాడు. 

There are many such treasures in Hindustan; but all are so jealously guarded by the Brahmans that neither money, art, nor power will ever release such pledges of the past.


కీరో  చెప్పిన  పైమాటలకు నావంతుగా నేను ఈ మాటల్ని కలుపుతాను.

However, such treasures are certainly, if not easily, accessible to one who possesses sincerity and humility, an urge to know the mysteries of the spirit, and a heart that bows in reverence before that ancient and mighty wisdom of Rishis.


కీరో జాతకంలోని విచిత్రయోగాలను వివరంగా వచ్చే  పోస్టులో చూద్దాం.
read more " కీరో జాతకంలో మంత్రసాధనాయోగాలు "