“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

14, నవంబర్ 2011, సోమవారం

కీరో జాతకంలో మంత్రసాధనాయోగాలు

పాశ్చాత్యజోస్యులలో చెప్పుకోదగ్గ ప్రముఖుడు కీరో. ఈయన 1 -11 -1866 న ఐర్లెండ్ లోని డబ్లిన్ దగ్గరలో జన్మించాడు. (ఈయన జనన తేదీమీద భిన్నాభిప్రాయాలున్నాయి). ఈయన అసలు పేరు "విలియం జాన్ వార్నర్". అయితే తానుగా "కౌంట్ లూయీ హేమన్" అనే పేరును స్వీకరించాడు. హస్తసాముద్రికాన్ని "కీరోమాన్సీ" అనే పేరుతో పిలుస్తారు. ఆ విద్యలో ఈయనకున్న అద్భుతపాండిత్యంవల్ల ఈయనకు "కీరో" అనే పేరు స్తిరపడింది.  తన జీవితకాలంలో ఈయన కొన్ని వేలమందికి ఖచ్చితమైన రీడింగ్స్ ఇచ్చాడు. వారిలో ప్రపంచప్రముఖుల నుంచి సామాన్యులవరకూ అన్ని రకాలవారూ ఉన్నారు. 69 సంవత్సరాల వయసులో అక్టోబర్ 8,1936 న హాలీవుడ్ లో మరణించాడు. ఆరోజులలోని అనేకమంది యూరోపియన్ ప్రముఖులకూ, రాజులకూ, రాణులకూ, ప్రపంచ ప్రఖ్యాతులకూ  చెయ్యిచూసి వారి జీవితవిశేషాలను అచ్చు గుద్దినట్లుగా చెప్పడమేకాక జరగబోయే విశేషాలను కూడా ఖచ్చితంగా చెప్పాడు. ఆయా సంఘటనలు ఆయన చెప్పినట్లుగానే జరిగినప్పుడు లోకమంతా నివ్వెరపోయింది. ఇవన్నీ రికార్డ్ చెయ్యబడిన నిజాలు. ఈయన జాతకంలోని కొన్ని ముఖ్య విశేషాలను చూద్దాం.


ఈయన వ్రాసిన జ్ఞాపకాలలో, తానీ విద్యను భారతదేశంలో నేర్చుకున్నట్లుగా చెప్పాడు. తన టీనేజిలో బాంబేలో తాను కలుసుకున్న ఒక కొంకన్ బ్రాహ్మణుడు తనను మహారాష్ట్రలోని వారి గ్రామానికి తీసుకు వెళ్లి, తన శిష్యునిగా అంగీకరించి, వారివద్ద తరతరాలుగా వస్తున్న సాముద్రికగ్రంధాలను పరిశీలించే అవకాశాన్ని ఇచ్చాడనీ, వారివద్ద తాను రెండేళ్ళపాటు శిష్యరికంచేసి ఈవిద్యను నేర్చుకున్నట్లుగా చెప్పాడు. 

జ్యోతిష్యశాస్త్రం కంటే హస్తసాముద్రికానికి కీరో ఎక్కువ ప్రాధాన్యత నిచ్చాడు. సామాన్యంగా హస్తసాముద్రికులకు కొన్ని మంత్రాలసాధన కూడా తప్పకుండా తోడుగా ఉంటుంది. అప్పుడే వారు ఆశ్చర్యకరమైన ఫలితాలు చెప్పగలుగుతారు. కీరో కూడా కర్ణపిశాచినీ మంత్రాన్ని సాధన చేసినట్లుగా ఆధారాలు ఉన్నాయి. అతని చేతికి ఆ మంత్ర సంబంధితమైన ఒక తాయెత్తు ఉండేదనీ ఆ తాయెత్తును ఆయనకా విద్య నేర్పించిన గురువు కట్టాడనీ, అది ఉన్నంతవరకూ కీరో చెప్పింది చెప్పినట్లుగా జరిగిందనీ, పెద్దవయస్సులో ఆ తాయెత్తును  కీరో పోగొట్టుకున్న తర్వాత ఆయన జోస్యాలు కొంత మేర తప్పాయనీ కొందరు అంటారు. ఈ మేరకు కీరోభార్య వ్రాసిన ఉత్తరం ఒకటి బీ.వీ.రామన్ గారికి చేరిందని రామన్ గారు తన ఆత్మకధలో వ్రాశారు. 

కీరో జాతకాన్ని మనం పరిశీలిస్తే, మంత్రసాధనను సూచించే కొన్ని విచిత్రమైన యోగాలు కనిపిస్తాయి. కీరో మఖానక్షత్రంలో వృశ్చికలగ్నంలో జన్మించాడు. ఇతనికి మూడింట గురువూ తొమ్మిదింట కుజుడూ ఎదురెదురుగా ఉండటం ఒక విచిత్రయోగం. ఇది ఇతనికి పూర్వజన్మ నుంచీ భారతదేశంతో ఉన్న సంబంధాన్ని సూచిస్తోంది. మకరలగ్నంతో సంబంధం ఉన్నవారికి మనదేశంతో తప్పక కర్మానుబంధం ఉంటుంది. అది ఏ రకమైన సంబంధమో ఆయాజాతకాల ద్వారా పరిశీలించి తెలుసుకోవాలి. చంద్రలగ్నాత్ మకరం షష్ఠస్థానం అయ్యింది. కటకం ద్వాదశం అయ్యింది. 

ఈయన జాతకంలోని ఇంకొక ముఖ్యయోగం -- లగ్నాత్ ద్వాదశంలో తులారాశిలో శనిసూర్యుల కలయిక. ఈ స్థానం శనికి ఉచ్చస్తితినీ సూర్యునికి నీచస్తితినీ ఇస్తుంది. ఒకేచోట రెండు పరస్పర విరుద్ధగ్రహాలు ఒకటి చాలాబలంగా ఇంకొకటి చాలాబలహీనంగా ఉండటం వెనుక ఎన్నో మార్మికమైన అర్ధాలున్నాయి. చంద్రునినుంచి ఈస్థానం తృతీయం అవుతుంది అన్నవిషయం కూడా గమనించాలి. ఇప్పుడు రాహుకేతువుల స్తితిని పరిశీలిస్తే,  పంచమలో కేతువూ, లాభంలో రాహువూ దర్శనమిస్తారు. వీరు చంద్రలగ్నాత్ అష్టమ, ద్వితీయస్థానాలలో కనిపిస్తారు.

ఈ మూడు ముఖ్యమైన యోగాలను గుర్తించాం గనుక ఇక వీటిని విశ్లేషిద్దాం. 

అష్టమాదిపతి అయిన బుధుడు జ్యోతిర్విద్యా కారకుడు. ఇతను లగ్నంలో ఉండటం వల్ల ఈయనకు మార్మిక సంబంధమైన జ్యోతిర్విద్య పట్టుబడింది. అయితే ఇది హస్త సాముద్రికం అయ్యింది. కారణం ఏమంటే చేతులకు సూచకమైన తృతీయంలో గురువు నీచలో ఉండటం. పంచమంలో కేతువు ఉండటం, నవమంలో కుజుడు నీచలో ఉండటాలవల్ల మంత్ర సంబంధమైన ప్రజ్ఞాపాటవాలు ఇతనికి ఖచ్చితంగా ఉన్నట్లు మనం చూడవచ్చు.

ఇక్కడ ఒక రహస్యం దాగుంది. కేతువున్న పంచమ స్థానాధిపతి అయిన గురువు విక్రమస్థానంలో నీచలో ఉండటం వల్ల, ఈయన ఒక క్షుద్రమంత్రాన్ని ఆరాధించాడన్న  సంగతి సూచనగా తెలుస్తున్నది. కనుక కర్ణపిశాచినీ మంత్రసిద్ధి ఈయనకు ఉందన్న విషయం నిజమే కావచ్చు. లేకుంటే అంత ఖచ్చితంగా కొన్నివేల మందికి భవిష్యత్తును నిర్ధారణగా చెప్పటం సాధ్యం కాదు.

హస్త సాముద్రికంలో కీరో ప్రజ్ఞాపాటవాల గురించి అనేక కధలు ప్రచారంలో ఉన్నాయి. ఒకసారి కీరోవద్ద చెయ్యి చూపించుకోడానికి వచ్చిన ఒకవ్యక్తి ఒక షరతు విధించాడట. తాను ఒక తెరచాటున కూచుని, తన అరచేతిని మాత్రమే ఆ తెర వెనుకనుంచి బయటకు చాచి చూపిస్తాననీ, తెరకు అవతల పక్కన కీరో కూచుని ఆ చేతిని మాత్రమే పరిశీలించి తనవివరాలు చెప్పాలనీ చాలెంజ్ చేసాడు. సరేనని ఒప్పుకున్న కీరో ఆచేతిని పరిశీలించిన మీదట, అవతల వ్యక్తిని ఒక యూరోపియన్ రాచకుటుంబీకునిగా గుర్తించి దానికి తగిన గౌరవసంబోధనతో ఆవ్యక్తిని పలకరించి అతన్ని ఆశ్చర్యచకితుణ్ణి చేసాడట. జ్యోతిషాన్ని ఏమాత్రమూ నమ్మని  ప్రముఖరచయిత "మార్క్ ట్వేయిన్" కూడా కీరోతో తన జాతకాన్ని చెప్పించుకుని ఆశ్చర్యచకితుడవడమే కాక ఆ విషయాన్ని ఒప్పుకుంటూ కీరోవద్ద ఉన్న గెస్ట్ బుక్ లో వ్రాసి సంతకం కూడా చేసాడు.  

విక్టోరియారాణి మరణ తేదీనీ, కింగ్ ఎడ్వర్డ్ చనిపోయే నెలనీ సంవత్సరాన్నీ, రష్యా జార్ చక్రవర్తికి పొంచిఉన్న ఆపదనీ, ఇటలీ రాజు హంబర్ట్ హత్య చెయ్యబడతాడనీ, ఇలా ఎన్నెన్నో కరెక్ట్ గా జరిగిన సంఘటనలను కీరో ఖచ్చితంగా ముందే ఊహించి చెప్పాడు. ఈ జ్ఞానాన్ని "విస్మరించబడిన హిందువుల విజ్ఞానం" (forgotten wisdom of the Hindus) అన్న పేరుతో  అతను పిలిచాడు.


ఒకచోట కీరో ఇలా అంటాడు. 

There are many such treasures in Hindustan; but all are so jealously guarded by the Brahmans that neither money, art, nor power will ever release such pledges of the past.


కీరో  చెప్పిన  పైమాటలకు నావంతుగా నేను ఈ మాటల్ని కలుపుతాను.

However, such treasures are certainly, if not easily, accessible to one who possesses sincerity and humility, an urge to know the mysteries of the spirit, and a heart that bows in reverence before that ancient and mighty wisdom of Rishis.


కీరో జాతకంలోని విచిత్రయోగాలను వివరంగా వచ్చే  పోస్టులో చూద్దాం.