“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

31, ఆగస్టు 2012, శుక్రవారం

సింహరాశి - సింహాలూ పులులూ

మొన్న లండన్ లో సింహం తిరుగుతున్నదని వదంతి రేగి గగ్గోలు పుట్టింది. నిన్న కర్నాటకలో ఇనపగేటు దాటబోయిన పులికి చువ్వ గుచ్చుకుని  గాయపడి కదలలేక గేటుమీదే కూచుని అధికారుల చేతికి చిక్కింది. ఈ విషయాలు గమనిస్తుంటే ఒక విషయం స్ఫురించింది. 

ప్రస్తుతం సూర్యుడు సింహరాశిలో సంచరిస్తున్నాడు. కుంభంలో ఉన్న నెప్ట్యూన్ కు సమసప్తకంలో ఉన్నాడు. కనుక పులులకూ సింహాలకూ సంబంధించిన ఇలాంటి ఘటనలు జరుగుతున్నవా? అదే నిజమైతే పోయినేడాది కూడా ఇవే జరిగి ఉండాలి కదా? ఎందుకంటే నెప్ట్యూన్ ఒక రాశిలో 14 ఏళ్ళు సంచరిస్తుంది. కనుక ఒక 14 ఏళ్లపాటు ప్రతి ఏడాదీ ఆగస్టులో సూర్యుడు సింహరాశిలో సంచరించే కాలంలో నెప్ట్యూన్ కు ఎదురుగానే వస్తాడు. కనుక ఆసమయంలో పులులూ సింహాలకు సంబంధించి ఏదో ఒకవార్త ప్రముఖంగా కనపడాలి. ఇది నిజమేనా? ఇలా జరుగుతుందా? అని పరిశీలిస్తే ఆశ్చర్యకరమైన విషయాలు కనిపించాయి.


మొదటగా 2011 ను పరిశీలిద్దాం. ఆ సంవత్సరం సరిగ్గా ఆగస్ట్ 22, 2011 న సూర్యుడు నెప్ట్యూన్ కు ఎదురుగా వచ్చాడు. అదేరోజున ఒక వార్త వెలువడింది. భువనేశ్వర్ లోని ఒక జూలో ఒక పులి మరణించింది అని.
BHUBANESWAR, August 22, 2011
A tiger had died due to old age in Nandankanan Zoological Park on Sunday. The tiger christened as ‘Ashok' was 18 year old. The zoo has now 23 tigers.

ఆగస్ట్ 23 న లయన్స్ క్లబ్ ద్వారా 32 జతల కళ్ళు దానం చెయ్యబడ్డాయనీ, లయన్స్ ఆఫ్ పంజాబ్, బెంగుళూర్ వచ్చారనీ వార్తలొచ్చాయి. ఇక్కడ సింహాల గురించి కాకపోయినా ఆ పెరుతో ఒక వార్త వచ్చింది.

ఆగస్ట్ 25 న ఒక పులి చనిపోయిందని వార్త ప్రచురింపబడింది.
INDORE, August 25, 2011
A royal Bengal tiger died of ailments in the zoo here, an official said. The 11-year-old tiger was brought to the Kamala Nehru Zoo about a fortnight ago from the Aurangabad zoo in Maharashtra for breeding. The big cat died due to gangrene and septicaemia, zoo in-chagre Uttam Yadav said

అదేరోజు ఇంకొక న్యూస్ కూడా వచ్చింది.
Art comes to the rescue of India's tigers: Noted artist Rameshwar Singh explores the complex relationship between tigers and humans at his ongoing exhibition at Triveni Kala Sangam's Shridharani Gallery here.

ఆగస్ట్ 27 న ఇంకొక వార్త ప్రచురింపబడింది.

KOLHAPUR, August 27, 2011
Illegal land deal in tiger reserve:About 2,000 acres of land in 14 villages under the tiger reserve zone in Satara district is allegedly taken over by windmill companies without any legal procedure and permission of the departments concerned. In response to the complaint by rural activist Nana Khamkar, the Forest Department has started enquiry into the land deals carried out by the windmill companies. According to Mr. Khamkar's complaint, the windmill companies had not taken permission of the National Tiger Reserve Authority, Maharashtra Energy Development Authority (MEDA) and other departments.

ఇంకొక సంవత్సరం వెనక్కు వెళ్లి చూస్తే, 2010 లో ఆగస్ట్ 20 న సూర్యుడు నెప్ట్యూన్ కు ఎదురుగా వచ్చాడు.

ఆరోజున మళ్ళీ పులుల గురించి వార్త ప్రచురింపబడింది. అయితే ఈ వార్త జింకల గురించి అయినా అవి పులుల ఆహారం గా ఉద్దేశించబడినవి కావడమూ హెడ్డింగ్ కూడా 'టైగర్స్ ప్రే' అనే రావడమూ గమనార్హం.

KOLKATA, August 20, 2010
Sunderbans tigers' prey ‘die of shock'Six spotted deer from a herd of 25 that was being moved from the Bibhuti Bhushan Wildlife Sanctuary in West Bengal's North 24 Parganas district to supplement the prey base of the Sunderbans tiger died early on Thursday morning.

ఆగస్ట్ 21 న వచ్చిన ఈ వార్త చూడండి.

JAIPUR, 
August 21, 2010

Gehlot helps out forest officer mauled by tiger:Chief Minister Ashok Gehlot spared his State plane on Friday afternoon to save a forest official who was mauled badly by a tiger in Ranthambhore National Park. Mr. Gehlot was getting ready to leave for New Delhi by the plane when information on the critical condition of Daulat Singh, a Range Officer in Ranthambhore, reached him. He acted fast and despatched the aircraft to Sawai Madhopur town to fetch the officer who got mauled while trying to save a tiger from the wrath of villagers.

కనుక సింహరాశిలో సూర్యుని సంచారానికీ, పులులకూ సింహాలకూ చెందిన వార్తలకూ, సంఘటనలకూ సంబంధం ఉన్నట్లు అనిపిస్తున్నదా లేదా? విచిత్రంగా లేదూ? అదే మరి గ్రహప్రభావం అంటే. ఈ వార్తలు కూడా సూర్యుడు నెప్ట్యూన్ కు సరిగ్గా ఎదురుగా సింహరాశిలో ఉన్నప్పుడే ఒకటి రెండు రోజుల వరకూ కనిపిస్తున్నాయి. తర్వాత ఉండటం లేదు. ఏదో ఒక ఏడాది అయితే, కాకతాళీయంగా వచ్చాయిలే అని వదిలేయ్యవచ్చు. ప్రతి ఏడాదీ అదే సమయంలో ఇలాంటి వార్తలు ఎందుకొస్తాయి? కనుక మనకు స్ఫురించిన ఈ విషయం కరెక్టే అని అర్ధం అవడం లేదూ?

మనం సరిగ్గా గమనించగలిగితే, జరిగే సంఘటనలకూ, వచ్చే వార్తలకూ కూడా గ్రహాలతో సంబంధం ఉంటుంది అన్న విషయం మళ్ళీ మళ్ళీ రుజువు అవుతూనే ఉంటుంది. అయితే చాలామంది అనుకుంటారు. ఎక్కడో లక్షల కోట్ల  మైళ్ల దూరంలో ఉన్న గ్రహాలు మనల్నేమి చెయ్యగలవు అని. ఎక్కడో ఉన్న సూర్యుడు భూమిని శాసించడం లేదా? కంటికి కనిపించని వైరస్ చెట్టంత మనిషికి చావును కొనితెవడం లేదా? కంటికి కనిపించని వాయుకాలుష్యమూ శబ్దకాలుష్యమూ మనిషిని కుప్పకూల్చడం లేదూ. ఇదీ అంతే.

గ్రహ ప్రభావం మనిషిమీదే కాదు, జంతువులమీదా చెట్లమీదా కూడా ఉంటుంది. అందుకే ఆయుర్వేదంలో కొన్ని ప్రత్యెక సమయాలలోనే మూలికా సంగ్రహణ చెయ్యాలని చెప్తారు. అప్పుడే వాటి శక్తి ఇతోధికంగా ఉంటుంది. గ్రహప్రభావం భూమ్మీద ప్రతి సంఘటననూ శాసిస్తుంది. దానిని చూచే విధానంలో చూస్తే అర్ధమౌతుంది. లేకుంటే గుడ్డినమ్మకంలా కనిపిస్తుంది. మనం గమనించగలిగితే నిత్యజీవితంలోని అతి చిన్న విషయాలలో కూడా గ్రహప్రభావం చూడవచ్చు. ప్రకృతిలోని నిగూఢమైన రహస్యాలు ఇలాంటి పరిశీలన ద్వారానే అర్ధం అవుతాయి.
read more " సింహరాశి - సింహాలూ పులులూ "

29, ఆగస్టు 2012, బుధవారం

ఒమర్ ఖయ్యాం జాతకం -3 (మట్టి మనిషి)

ఒమర్ ఖయ్యాం జాతకంలోని ఇంకొన్ని విశేషాలను గమనిద్దాం.

ఇతని జాతకంలో కోణార్గళం ఉన్నది. అది కూడా భూతత్వరాశులైన వృషభం, కన్యా, మకరాలలో ఉన్నది. ఈ మూడూ శనివర్గరాశులు. కనుక ఇతని జీవితం ఎప్పుడూ ఏదో ఒక చింతలోనే గడిచింది. అన్నీ ఉన్నా ఏదో ఒక బాధ వెంటాడుతూనే ఉండటం శనివర్గ లక్షణం. వీరికి ఏ బాధా లేకపోతే ఏదో ఒక బాధను సృష్టించుకొని మరీ బాధపడతారు. ఇలాంటి మనుషులు లోకంలో చాలామంది ఉంటారు. వారిమీద శని ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. ఒంటరిగా ఉంటూ బాధపడటం వీరి స్వభావం. 'బాధే సౌఖ్యమనే భావన' వీరి సొంతంగా ఉంటుంది. ఖయ్యాంకు కవితా ధోరణి బాగా ఎక్కువ అవడంతో కవిత్వం చెప్పి మరీ బాధపడేవాడు. 

భూతత్వరాశులు బలంగా ఉన్న జాతకాలు మట్టితో సంబంధం కలిగి ఉంటాయి. వీళ్ళు నేలమీద నడిచే వ్యక్తిత్వాలు కలిగి ఉంటారు. అంటే నేల విడిచి సాము చెయ్యడాన్ని వీరు ఇష్టపడరు. ఆకాశంలో చూపు వీరికి ఉండదు. భౌతికాన్ని దాటి వారి దృష్టి పైకిపోదు. ఎప్పుడూ భౌతిక ప్రయోజనాలనే వారు ఆశిస్తారు. ఒక మహనీయుని దగ్గరగా వారున్నప్పటికీ, అతనినుంచి భౌతిక ప్రయోజనాలనే వారు కోరుకుంటారు. ఎక్కువగా భౌతికసుఖాలను కోరుకునే వారి జాతకాలలో భూతత్వరాశుల ప్రాబల్యం బలంగా ఉండటం గమనించవచ్చు.వీరి కాంక్షలు కూడా భౌతిక భూమికలోనే కేంద్రీకృతమై ఉండటాన్ని చూడవచ్చు. అందుకే, ఖయ్యాం ఎంతసేపూ తనకు అందుబాటులో ఉన్న మధువునే నమ్ముకున్నాడు.ఎప్పుడూ ప్రియురాలైన 'సాకి' సాంగత్యంలోనే పొద్దు పుచ్చేవాడు. ఆధ్యాత్మికతను కూడా మట్టిలోనే వీరు దర్శిస్తారు. వీరి వ్యక్తిత్వం అంతా మట్టివాసన నిండి ఉంటుంది. ఇది భూతత్వరాశుల బలమైన ప్రభావం.

ఖయ్యాం కవితలు కూడా 'మట్టి' చుట్టూ పరిభ్రమిస్తాయి. అన్నీ చివరికి మట్టిలో కలవక తప్పదు అంటాడు. ఇలాంటి సృష్టిని ఎందుకు చేశావు అని దేవుణ్ణి ప్రశ్నిస్తాడు. ఇంతకంటే మంచిగా సృష్టించడం నీకు చేతకాలేదా అని సృష్టికర్తను నిలదీస్తాడు.తనకే గనుక అధికారం ఉంటే ఇంతకంటే మంచి సృష్టిని నిర్మించి చూపిస్తాను అని అనుకుంటాడు. 

ఈ లోకంలో మంచివారికి కష్టాలు, దుర్మార్గులకు సుఖాలా? ఇదేమి విచిత్ర సృష్టి? అని దేవుని ప్రశ్నిస్తూ -దుష్టులకు సుఖంబు సంపదలు చొప్పడు, నింపగు నీకు బాపముల్- 'నీకు పాపాలు చేసేవారంటేనే ఇష్టంలా ఉందే, అందుకేనా వాళ్ళకే అన్ని సుఖాలూ సమకూరుస్తున్నావు?' అని దేవుని అడుగుతాడు. 

'నెలతా, దేవునికట్లు నాకును జగన్నిర్మాణ మర్మక్రియల్ 
గలవేని,దుర్విషమ ప్రచారియగు లోకంబున్ యదేచ్చామతిన్ 
జేలువంబౌనటు సంస్కరించి నవసృష్టిం గూర్తు సన్మార్గవ
ర్తులు ప్రాజ్నుల్ భువి సర్వసంపదల సంతోషంబుగన్ వర్దిలన్'

అనే పద్యంలో ఎందఱో సాధకుల మదిలో కలిగే భావాన్ని పొందుపరుస్తూ, 'ప్రేయసీ, నాకే గనక సృష్టి చేసే అధికారం ఉంటేనా ఈ లోకాన్ని మార్చి, మంచివాళ్ళకు సర్వసౌఖ్యాలు కలిగేలా చేసేవాడిని కదా?' అనుకుంటాడు. 'ఈ విషవృక్ష లోకమును నింకొక రీతిం పునః సృజింపు మంచే వినతిన్ వచింతు' నంటూ దేవునికి విన్నవిస్తాడు.
       
ఇవన్నీ కూడా, ఏమీ చెయ్యలేని నిస్సహాయతలోనుంచి ఉద్భవించిన భావాలు. తన మిత్రులు నెచ్చెలులు అందరూ ఒక్కొక్కరే తన కళ్ళెదుటే నిష్క్రమిస్తుంటే ఏమీ చెయ్యలేక ఖయ్యాం కుమిలిపోయేవాడు. సృష్టి తీరుకు ఖిన్నుడయ్యేవాడు. సున్నిత హృదయులు ఇలాగే బాధపడతారు. కవులందరూ సహజ సున్నితస్వభావులే కదా.  ప్రపంచపు బాధలను తన బాధలుగా భావించడం శని కారకత్వాలలో ఒకటి. అది ఖయ్యాం మీద కూడా అమితంగా ఉంది. దేవులపల్లి కృష్ణశాస్త్రి లోకూడా ఈ పోకడను చూడవచ్చు.

'మనమున కెక్కినట్టి యభిమానులు మిత్రులు జెల్లినారు' అనే పద్యంలో  తన ఇష్టులూ మిత్రులూ గతించారని బాధబడతాడు.'యౌవన మధుమాసమున్ కుసుమభారము రాలిచి గడచిపోయే' యౌవనం అనే మధుమాసం గతించింది. తన పూలను రాల్చి వెళ్ళిపోయింది' అని చింతిస్తూ 'జీవితంబను సరకంబునందు నడుగంటే మధూళియు' జీవితమనే పాత్రలో మధువు అడుగంటింది అని, ఆ స్త్తితిలో కూడా ప్రాణశక్తిని మధువుతో పోలుస్తూ పద్యం చెబుతాడు. 

'యే దినంబు వచ్చెనో మరి ఎప్పుడేగెనో దిసింపదు హర్ష విహంగమిప్పుడున్' ఏ రోజు వస్తున్నదో ఎప్పుడు పోతున్నదో తెలీకుండా ఉన్నది. సంతోషం అనే పక్షి ఇప్పుడు ఎగరడం మానుకున్నది కదా? అని చింతిస్తాడు. ఖయ్యాం స్నేహప్రియుడు. మనసుకు నచ్చిన స్నేహితులతో సరస సంభాషణలే కదా ఈ లోకమనే ఎడారిలో సెలయేళ్ళు? అవే లేనప్పుడు లోకం రసహీనంగా తోచక ఇంకేముంటుంది? తన మిత్రులందరూ తన కళ్ళముందే గతిస్తుంటే చూచి మౌనంగా బాధపడతాడు. అశాశ్వతమైన ఈ లోకరీతిని తలచి కుమిలిపోతాడు.   

'గతము గతంబె యన్నటికిన్ కన్నులగట్టదు, సంశయాంధ సం
వృతము భవిష్యదర్ధము, ఓ వివేకవతీ ! ఒక వర్తమానమే 
సతత మవశ్య భోగ్యమగు సంపద రమ్ము విషాదపాత్ర కీ 
మతంబున తావు లేదు క్షణమాత్ర వహింపుము పానపాత్రికన్'

అంటూ 'గతాన్ని మర్చిపో, భవిష్యత్తును ఆలోచించకు, వర్తమానాన్ని ఉపయోగించుకో, నీవు వివేకవతివి కదా, ఆనందాన్ని చేజారనివ్వకు సఖీ, మన మతంలో విషాదానికి తావులేదు. ఒక్కక్షణంపాటు పానపాత్రను చేతబట్టు' అంటాడు. 'మధువానుము మానుము తక్కుచింతలన్' అంటూ 'మధువును సేవించు ఆనందంగా ఉండు ఇతర చింతలు మాను' అని ఉద్బోదిస్తాడు.   

"దక్కని యారేపటి మాటలేటి కనుభోగ్యంబైన నేడుండగన్" - 'రేపటి చింత నీకెందుకు. నేడు నీ చేతిలో ఉన్నది. దానిని అనుభవించు'- అంటాడు.

మధువు అనేది బ్రహ్మానుభూతిలో కలిగే ఆనందానికి సూచన అని పరమహంస యోగానంద మొదలైన యోగులు వ్యాఖ్యానించారు. అది నిజమే అయినప్పటికీ, ఖయ్యాం ఈ పదాన్ని ఆ అర్ధంలో వాడినాడా అన్నది సందేహమే. ఎందుకంటే ఖయ్యాం ఎన్నడూ ధ్యానాన్ని గురించి, యోగాన్ని గురించి స్పష్టంగా చెప్పలేదు. అతని చింత అంతా 'మధువు-సాకి' ఈ రెంటి చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. కొన్నికొన్ని పద్యాలలో ఆధ్యాత్మిక అర్ధాలు గోచరించినప్పటికీ, ఎక్కువ పద్యాలు పూర్తిగా భౌతికమైన అర్ధాన్నే సూచిస్తూ  ఉన్నాయి. కనుక, ఖయ్యాం చెప్పినది లోకానికి చెందని అతీతాధ్యాత్మికమా?అన్నది సందేహాస్పదమే అని నా భావన.

'ఎరుగవే కాలవల్లి మన ఇద్దరి మృత్యువు లల్లుగోయ్యగా బెరుగు' అంటూ- 'కాలమనే లత మన ఇరువురి మృత్యువులనే గుంజలను ఆధారంగా చేసుకొని పెరుగుతుంది చెలీ గమనించు' అని ఒక గూఢమైన అర్ధాన్ని ప్రతిపాదిస్తాడు. మృత్యువు లేనిదే కాలానికి ఉనికి లేదు అనే గొప్ప సత్యం ఇక్కడ ధ్వనిస్తుంది. ఒక్కొక్క క్షణమూ కరిగిపోవడమే మృత్యువు. కళ్ళుతెరిచి దానిని చూడు అంటాడు.'జంటగాగరముల వారుణీభరిత కాంచనపాత్రిక లద్దికొన్న నద్దిర, మన చేత చిక్కువడదె చిరకాలపుసత్య మంగనా' అనే పద్యపాదంలో 'ఇద్దరం కలిసి మధుసేవలో మునిగితే అమరత్వమనే సత్యం మన చేతికి చిక్కక ఏమౌతుంది సఖీ ?' అని ప్రశ్నిస్తాడు.   

'నీవూ నేనను తారతమ్య మిహమందే గాని భూగర్భ రత్నావాసంబున లేదు' - అని చెబుతూ, 'నీవూ నేనూ అన్న భేదాలు ఈలోకంలోనే గాని భూగర్భంలో మనం విశ్రాంతి తీసుకునే సమయంలో ఆ భేదాలు ఏమీ ఉండవు' అంటాడు. ఆలోకంలో 'దుర్జనుఁడు పుణ్యాత్ముండు భిక్షార్దియున్ శ్రీవాల్లభ్య దురంధరుండు నొకటే శ్రేణిన్ సుఖాసీనులై యావిందున్ భుజియింతు రంతగనలే మా మృత్తికన్ భేదముల్' అని వక్కాణిస్తూ- 'మట్టిలో భేదం లేదు. మట్టిలో కలిసినప్పుడు చెడ్డవాడూ మంచివాడూ, బిచ్చగాడూ ధనికుడూ అందరూ అక్కడ ఒకటే వరుసలో కూచుని ఆ చాపకూడు భుజించాలి. ఇది తెలుసుకో'- అంటాడు.   

'జీవితము వాతూలంబులో దివ్వె, చెచ్చెర గానిమ్ము గతించు ప్రాయంబదిగో శీఘ్రంబుగం బ్రేయసీ', మన జీవితము సుడిగాలిలో దీపంలాంటిది. ఏ క్షణానైనా ఆరిపోవచ్చు. ఆయువు త్వరగా తరుగుతున్నది. కనుక 'పరిశుష్కంబగు జీవనంబు రససంపంన్నంబు గావించు నిర్జర పానీయము వారుణీరసము బాత్రన్నింపి యందిమ్మ యాతురదీరం జవిగొందు' శుష్కమైన ఈ జీవితాన్ని రససంపన్నం చెయ్యడానికి ఆ మధువును పాత్రలో నింపి నాకు అందివ్వవా ?ఆత్రంగా తాగి నా దాహాన్ని చల్లర్చుకొంటాను.' అని సాకిని అర్దిస్తాడు.

ఖయ్యాం తన కవితలలో తాను చెప్పాలనుకున్న భావాలను స్పష్టంగా చెప్పాడు. అతని దగ్గర నటన లేదు. సమాజంకోసం మంచివాడిలా నటించే కుళ్ళు అతనిలో లేదు. ఈ లక్షణమే అతన్ని ఉన్నతంగా నిలబెడుతుంది. లోకానికి తాను చెప్పేది నచ్చదని తెలిసి కూడా, తన భావాలను తాను చెబుతాడు.మార్మికుల ధోరణి ఇలాగె ఉంటుంది. వాళ్ళు లోకాన్ని లేక్కచేయ్యరు. లోకం ఏమనుకుంటుందో అని ఊరుకుంటే సిద్ధార్ధుడు ఇల్లు  వదలి పోయేవాడా? లోకానికి జడిస్తే నరేంద్రుడు వివేకానందుడిగా మారేవాడా?  

అసలు లోకుల తీరే విచిత్రమైనది. వాళ్ళు చేసేవేవీ కూడా లోకంకోసం ఆపుకోరు. కాని ఒక మార్మికుడు తన భావాలను వెల్లడిస్తే వాడికి తాటాకులు కడతారు. లోకులు పచ్చి స్వార్ధపరులు. లోకం అంతా దొంగలగుంపు. ఒకరినొకరు దోచుకోవాలని ఎదురుచూస్తూ మళ్లీ అందరూ కలిసి జీవించే దొంగలు వీళ్ళు. లోకాన్ని దాటి ఆలోచించేవారు వారికి నచ్చరు. మార్మికులు లోకతీరును మెచ్చరు గనుక లోకులకు మార్మికులు నచ్చరు. వీరి ఆలోచనలు వేర్వేరు లోకాలలో పరిభ్రమిస్తూ ఉంటాయి. ఒకే లోకంలో ఉంటూ రెండు భిన్నమైన లోకాలలో బ్రతికే జీవులు వీరు. 

ఖయ్యాం ఒకరోజు కుమ్మరివీధిలో నడుస్తున్నాడు. అక్కడ ఒక కుమ్మరి కుండలు చేస్తూ ఉండగా ఖయాం చూచాడు. ఆ కుండలు మానవభాషలో అతనితో మాట్లాడాయి. వాటివాటి చరిత్రను చెప్పుకోన్నాయి. రసస్ఫూర్తితో నిండిన కవి హృదయానికి జడం కూడా చైతన్యవంతంగానే తోస్తుంది. మట్టి అతనికి ఎన్నో ఊసులు చెబుతుంది. రాళ్ళూ రప్పలూ కూడా అతనికి తత్వబోధ గావిస్తాయి. చూచే దృష్టి ఉంటే ప్రపంచంలో సమస్తమూ చైతన్యవంతంగానే కనిపిస్తుంది. మనిషిని మనిషిగా చూడలేని నేటి జడమానవులకు,వస్తువులు మాట్లాడటం అంటే ఏమిటో అర్ధంకాదు. అలాంటి వారికి ఖయాం వంటి మార్మికకవి జల్సారాయుడిగా కనిపించడం వింతేముంది? 

కుమ్మరి ఒక మట్టిముద్దను కాళ్ళకింద వేసి తొక్కుతూ ఉండగా ఖయాం చూచాడు. అప్పుడా మట్టి కుమ్మరితో ఇలా అన్నదట.  

'మెల్లగ నల్ల దోక్కుమోయన్న, ఎరుంగవె నను, నొకప్పుడు నీవలె నందగాడనే' ఓయీ కుమ్మరి. మెల్లగా తొక్కు. నేనెవరో గుర్తించలేదా? బతికున్న రోజులలో నేను కూడా నీవలె అందగాడినే సుమా -- అంటూ ఆ మట్టి ఒక గొప్ప సత్యాన్ని మన కళ్ళముందు ఉంచుతుంది. మన కాళ్ళక్రింది మట్టిలో ఎందరెందరు మహారాజులు ఉన్నారో ఎవరికి తెలుసు?

ఖయాం ఇంకా ఇలా అంటాడు.'ఓయీ కుమ్మరి. ఎంతకాలం ఇలా మానవ మృత్తికను తెచ్చి కుండలు ముంతలు చేస్తావయ్యా? నీకు తెలియక నిజాన్ని చూడలేకపోతున్నావు. ఆ మట్టిలో దరిబెసి చెయ్యి దగ్గరే ఫరీదూను శిరస్సు కనిపిస్తున్నది చూడవయ్యా.' అంటాడు. దరిబెసి అనేవాడు ఒక నిరుపేద. ఫరీదూన్ అనేవాడు ఒక సంపన్నుడు. ఇప్పుడు ఇద్దరూ ఒకే మట్టిలో కలిసి ముంతలు కుండలుగా మారారు. అని గొప్ప సత్యాన్ని చెబుతాడు. 'ఫరీదూను శిరంబు గాంచును యదో దరిబెసి కరంబు దగ్గరన్' అన్న చక్కని పదాన్ని పలుకుతాడు.

కుమ్మరి ఇంటిలోనుండి కొన్ని కుండలు ఖయ్యాంను ఇలా ప్రశ్నిస్తాయి.' మమ్మల్ని తయారుచేసి బజారులో అమ్మిన కుమ్మరులు, ఇప్పుడు ఎక్కడున్నారయ్యా ఖయ్యాం? నీకేదైనా వార్త తెలిస్తే చెప్పవా?' ఈ పద్యంలో మనిషి అహంకారానికి చావు దెబ్బను మర్మగర్భంగా కొడతాడు. ప్రతి మనిషి ఎంతో విర్రవీగుతాడు. కానీ అతని జీవితం క్షణికం. అశాశ్వతం. అతను తయారు చేసిన వస్తువులు ఉంటాయి, అతను వాడిన వస్తువులు అతని తర్వాత వందల ఏళ్లు ఉంటాయి. కాని అతను ఉండడు. అయినా సరే, తాను శాశ్వతం అన్నట్లు ప్రతివాడూ విర్ర వీగుతాడు. అదే ఈ లోకపు విచిత్రాలలో ఒకటి. 

బాగులేనని తనను కొనకుండా పోతున్న ఒకణ్ణిచూచి ఒక ముంత ఇలా అన్నదట ' ఏమయ్యా నన్ను కొనకుండా పోతున్నావు? తప్పు నాది కాదు. నన్నిలా చేసిన కుమ్మరి ఉన్నాడే అతనిది తప్పు. నన్ను తీరుస్తున్న సమయంలో తాగినమత్తులో కుమ్మరి చెయ్యి వణికి ఉంటుంది. అందుకే నేను ఇలా తయారయ్యాను. తప్పు నాదేలా అవుతుంది? ' 

మనుషుల తప్పులకు వారు బాధ్యులు కారనీ, దైవానిదే ఆ బాధ్యత అనీ గొప్ప వేదాంతాన్ని ఆ ముంత ఖయాంకు బోధిస్తుంది. జన్మకు కర్మ కారణం అని వాదించే వేదాంతులు కూడా మొదటి జన్మకు కారణం ఏమిటి? అంటే జవాబు చెప్పలేరు. ఆ జన్మకు దైవ సంకల్పమేగా కారణం? కనుక నేనిలా ఉంటే తప్పు నాది కాదు. ఆ దైవానిదే అంటుంది ముంత. ఒక ప్రాణం లేని ముంత చేత మనిషి మనస్సులోని నిగూఢమైన ఆలోచనను ఖయాం పలికిస్తాడు.

కుమ్మరి సృష్టికర్త. కుండలూ ముంతలూ మానవులు. మానవునిలో లోపం ఉంటే ఆదోషం ఎవరిదీ? సృష్టికర్తదేగా? ఎందుకంటే, కుండలకు ఏమి స్వాతంత్ర్యం ఉన్నది గనుక? కుమ్మరి ఎలా చేస్తే అలా అవి తయారవుతాయి. కనుక సృష్టిలోని లోపాలకు బాధ్యత దేవునిదే గాని మానవునిది కాదని ఖయ్యాం భావిస్తాడు. ఇవన్నీ ఇస్లాంమతానికి మహాపాపాలుగా తోచే విప్లవభావాలు. ఈ కవితలు వినికూడా, మూర్ఖులైన ముస్లిం చాందసులు ఖయ్యాంను ఎలా బ్రతుకనిచ్చారో ఆ దేవునికే ఎరుక.

తన చివరిక్షణాలలో కూడా ఖయాం సరస సంభాషణను మానలేదు. 'నాకు పిలుపు వచ్చిందయ్యా. పోతున్నాను. నా మట్టితో పానపాత్రలు కూజాలు జాడీలు చేసి పానశాల వద్ద వాటిని అమ్మవయ్యా. మధుస్పర్శతో మళ్లీ జీవించి సత్యాన్ని లోకులకు బోధిస్తాను' అని కుమ్మరితో తన చివరి కోరికను చెబుతాడు. అద్భుతమైన ఒక పద్యాన్ని మనముందు ఆవిష్కరిస్తాడు.

ఓరీ కుమ్మరి, పిల్పు వచ్చే, వినుమా యొక్కింత నా కోర్కె. నా 
గోరీ మృత్తిక బానపాత్ర లిటికల్ కూజాలు జాడీలు సొం
పారం దీరిచి యమ్మవోయి మదిరాపణ్యంబులం గోస్తనీ 
సార స్పర్శన్ బునః ప్రబోదితుండనై సత్యంబు జాటించెదన్     

తాను అమరత్వాన్ని ఎలా పొందబోతున్నదీ కూడా ఖయ్యాం ముందే చెబుతాడు.

కడుగుడు నా శవంబు దడిగా మధుధారల, ద్రాక్షపుల్లలుం 
బుడకలు పెట్టె యల్లి నను బూడిచి పెట్టుడు శీదుబిందులన్
వడిసెడి నాదు మృత్తికల వాసన గుర్తగు మీకు, రేపు నన్
బడయుదు రాసవాలయము వాకిటనో చెలి కాలిధూళినో.

అనే పద్యంలో హృదయాన్ని కదిలించే ఒక భావాన్ని మన ముందు నిల్పుతాడు. తనను ఎలా సాగనంపాలో చెబుతూ, 'నా శవాన్ని మధుధారలలో బాగా కడిగి,ద్రాక్ష కొమ్మలతో అల్లిన పెట్టెలో ఉంచి పూడ్చి పెట్టండి. మరణించిన తర్వాత నేను మీకు రెండుచోట్ల మాత్రమే కనిపిస్తాను. ఒకటి పానశాల వాకిట్లో మట్టిగానో, లేక నా చెలి కాలికి ఉన్న ధూళిగానో ఉంటాను. ఈ రెండుచోట్ల మాత్రమె మీరు నన్ను చూడవచ్చు. ఆ మట్టి వెదజల్లే మధువాసన బట్టి నన్ను మీరు గుర్తించవచ్చు.' అంటాడు. మరణం తర్వాత కూడా  మధువునూ ప్రియురాలినీ వదలలేనని అంటూ ఒక రసస్ఫూర్తితో కూడిన అమరభావాన్ని మనకు అందిస్తాడు. 

అమరత్వాన్ని పొందడం కూడా, ఆత్మగా కాక, మట్టిగా పొందాలని తపిస్తాడు. అందుకే ఖయ్యాంను మట్టిమనిషి అంటే చాలా సమంజసంగా ఉంటుంది. అతనూ సంతోషిస్తాడు. అడుగో ! ఈ మాటన్నందుకు నా ఎదురుగా ఎలా నవ్వుతున్నాడో !! 
read more " ఒమర్ ఖయ్యాం జాతకం -3 (మట్టి మనిషి) "

28, ఆగస్టు 2012, మంగళవారం

నిత్యజీవితంలో ప్రశ్నశాస్త్రం - నోట్ బుక్ వస్తుందా?

ఉదయం 9.40 కి 'పంచవటి' సభ్యురాలు ఒకామె ఫోన్లో ప్రశ్నించింది.

'ఎవరిదో నోట్ బుక్ కంప్యూటర్ చెడిపోతే రిపేర్ చేయించమని నాకు ఒప్పచేప్పారు. నాకు తెలిసిన ఒకాయనకు అది ఇచ్చాను. దాన్ని రిపేర్ చేసి ఈరోజు ఉదయం 9.30 కి ఇస్తానని చెప్పాడు. నేను వేచి ఉన్నాను. అతనేమో ఇంకా రాలేదు. అతనికి ఫోన్ చేస్తే స్విచ్చాఫ్ అని వస్తున్నది. ఆ ఫోన్ నంబర్ తప్ప అతన్ని కాంటాక్ట్ చెయ్యడానికి ప్రస్తుతం నావద్ద ఏమీ ఆధారం లేదు. అతను వస్తాడా రాడా? అసలు నోట్ బుక్ వస్తుందా రాదా?'

ఆమె గొంతులో ఆందోళన వినిపించింది.

నేనా సమయంలో ఒక మీటింగ్ కి రెడీ అవుతూ బిజీగా ఉన్నాను. అదీగాక, సామాన్యంగా ఇలాంటి ప్రశ్నలు నేనంతగా పట్టించుకోను. కాని ఎవరిదో పని నెత్తిన పెట్టుకుని ఈ అమ్మాయి మధ్యలో ఇరుక్కుంది. పాపం దీనిలో తన స్వలాభం ఏమీ లేదు. సరే చూద్దామని, ఒక్క క్షణం ఆగి ఆ సమయంలో గ్రహస్తితిని గమనించాను. విషయం అర్ధం అయింది.

'పదినిముషాలలో అతను వచ్చి కలుస్తాడు. కంగారుపడకు.' అని చెప్పి ఫోన్ కట్ చేశాను. తర్వాత నా పనిలో పడి ఆ విషయం మర్చిపోయాను.

సరిగ్గా 10.10 కి మళ్లీ ఆ అమ్మాయి దగ్గర నుండి ఫోనొచ్చింది.

'సక్సెస్. మీరు చెప్పినట్లే అతనొచ్చాడు. ధాంక్స్' అంటూ అవతలనుంచి ఆమె గొంతు వినిపించింది. ఇంతకు ముందున్న ఆందోళన ఆమె గొంతులో మాయమై ఆనందం వినిపించింది.

'మంచిది' అంటూ ఫోన్ కట్ చేశాను. ఒకరి ఆనందానికి మనం కారకులమైతే  అంతకంటే మనకు ఇంకేం కావాలి?

ప్రశ్నశాస్త్రం నిజంగా పనిచేస్తుంది. కాని అడిగే మనిషి వెనుక నిజమైన ఆకాంక్ష ఉండాలి. ప్రశ్న పెద్దదా లేక చిన్నదా, లోకం దృష్టిలో అది ముఖ్యమైనదా లేదా అనేది అప్రస్తుతం. అడిగే మనిషి దృష్టిలో అది ముఖ్యమైంది అయితే చాలు. దానివెనుక నిజమైన ఆదుర్దా ఉంటే చాలు. జవాబు కరెక్ట్ గా వస్తుంది. 

ఇంతకీ ఈ ప్రశ్న ఎలా చెప్పగలిగాను? అన్న విషయం చూద్దాం.

ఆ సమయంలో బుధహోర నడుస్తున్నది. బుధుడు చంద్రరాశిలో ఉండి ప్రశ్నలో గల ఆదుర్దాను సూచిస్తున్నాడు. బుధుని వెనుక శుక్రుడు ఉండి బలాన్ని ఇస్తున్నాడు.బుధశుక్రులిద్దరూ శీఘ్రగ్రహాలు.కనుక పని త్వరగా  జరుగుతుంది.

లగ్నం తులా 5 డిగ్రీ అయింది. దీనివెనుక యోగకారకుడైన ఉచ్ఛశని ఉండి సపోర్ట్ చేస్తున్నాడు. కనుక కొంచం ఆలస్యం అయినట్లు అనిపించినా పని జరుగుతుంది. లగ్నాధిపతి శుక్రుడు నవమస్థానంలో ఉండి కోణద్రుష్టితో లగ్నాన్ని చూస్తున్నాడు.లగ్నానికి తృతీయంలో బలంగా ఉన్న ఆరోహణాచంద్రుడు ఉండి కార్యలాభాన్ని సూచిస్తున్నాడు.లాభాదిపతి సూర్యుడు లాభంలో ఉండి కార్యసాఫల్యతను సూచిస్తున్నాడు. కనుక పని త్వరగా జరుగుతుంది.

నిమిత్తాలను కూడా ప్రశ్నలో గమనించాలి. నేను ఫోన్ లో మాట్లాడుతున్న సమయంలోనే మీటింగ్ కి కావలసిన సమాచారం తెచ్చి నా అసిస్టెంట్  ఎదురుగా టేబిల్ మీద పెట్టాడు. దానికోసం నేను కొద్దిసేపటినుంచీ ఎదురుచూస్తున్నాను. కనుక ఆమె ఎదురుచూస్తున్న మనిషి కూడా త్వరలో వస్తాడు అని అర్ధమైంది.

'జరుగుతుంది' అన్నవిషయం ఇన్నికోణాల నుంచి గట్టిగా తెలిసింది కనుక, 'ఎప్పుడు జరుగుతుంది?' అన్న విషయం ఇక చూడాలి. 

కంప్యూటర్లకు కుజుడూ రాహువూ కారకులు. లగ్నానికి దగ్గరలోనే కుజుడున్నాడు. లగ్నానికి కుజునికి దాదాపు 5 డిగ్రీలు భేదం ఉన్నది. అంటే లగ్నం ఇంకొక ఇరవై నిముషాలలో కుజుడిని కలుస్తుంది. కనుక దాదాపు  ఇరవై నిముషాలలో అనుకున్న పని జరగాలి. మా మాటల్లో కొంత సమయం గడిచింది. కనుక ఇంకో పది నిముషాలలో అతనొస్తాడు అని చెప్పాను. 

ఈ ఎనాలిసిస్ కరెక్టే. అనుకున్నట్లే అతనా సమయానికే వచ్చాడు. మళ్లీ కొద్ది సేపట్లో వచ్చిన ఆమె ఫోన్ ను బట్టి ఈ విషయం రుజువైంది..

ఎలా వాడుకోవాలో తెలిస్తే, ప్రశ్నశాస్త్రం నిత్యజీవితంలో అనునిత్యమూ ఉపయోగపడి మన ఆదుర్ధాను తగ్గిస్తుంది, అయోమయంగా ఉన్నపుడు  ఆసరాను ఇస్తుంది అనడానికి ఇలాంటి ఎన్నో ఉదాహరణలు ఇవ్వవచ్చు.
read more " నిత్యజీవితంలో ప్రశ్నశాస్త్రం - నోట్ బుక్ వస్తుందా? "

26, ఆగస్టు 2012, ఆదివారం

జిల్లెళ్ళమూడి స్మృతులు -4

'వింటుంటే ఆనందం గానే ఉన్నది గాని జిజ్ఞాస మాత్రం పోవడం లేదక్కయ్యా? అడిగాడు చరణ్.

'ఎందుకు నాయనా నీకు జిజ్ఞాస?' అడిగింది అక్కయ్య.

'తెలీదక్కయ్యా. ఏవేవో అనుమానాలు వస్తుంటాయి. నేను సరైన దారిలో నడుస్తున్నానా లేదా అని చాలాసార్లు అనిపిస్తుంటుంది. ఒక్కొక్కసారి అన్నగార్ని అడుగుతుంటాను. కాని ఆయన అన్నిసార్లు అందుబాటులో ఉండరు కదా.' అన్నాడు చరణ్.

'నీవు సరియైనదారిలోనే ఉన్నావు. భయపడకు. అయినా ఇంకా నీకేందుకు నాయనా జిజ్ఞాస? నీవు అమ్మను చూడక ముందు ఆ మాట అంటే ఒక అర్ధం ఉండేది. చూడకముందు జిజ్ఞాస ఉండాలి. అమ్మను చూచావు. అమ్మతో కొన్నాళ్ళు ఇక్కడే ఉన్నావు. అమ్మే నీకు బ్రహ్మోపదేశం చేసింది. ఇంకా నీకు జిజ్ఞాస ఏమిటి? నీకు ప్రస్తుతం ఉండాల్సింది శరణాగతిగాని జిజ్ఞాస కాదు.' తేల్చి చెప్పింది అక్కయ్య.

నేను మౌనంగా ఇదంతా వింటున్నాను.

చరణ్ కళ్ళవెంట నీళ్ళు కారిపోతున్నాయి. నమస్కార ముద్రలో అక్కయ్య పాదాల దగ్గర కూచుని ఆమె ముఖంలోకే చూస్తున్నాడు.

నా మనస్సు ఉపనిషదృషుల కాలంలోకి వెళ్ళిపోయింది. అదొక అడవి. మేమందరం ఒక ఆశ్రమంలో ఉన్నాం. బ్రహ్మజ్ఞాన సంపన్నురాలైన ఒక బ్రహ్మవాదిని సమక్షంలో కూచుని ఉన్నాం. వాతావరణం ఎంతో ప్రశాంతంగా ఉంది. జిజ్ఞాసువైన శిష్యుడు అడిగే ప్రశ్నలకు జ్ఞానమూర్తిగా ఆమె జవాబులిస్తున్నది. ఎవరన్నారు మన దేశంలో మహనీయులు లేరని? ఎవరన్నారు ఆధ్యాత్మికత అడుగంటి పోయిందని? జీవితాన్ని ఆధ్యాత్మికమార్గంలో పునీతం చేసుకున్నవారు ఇప్పటికీ మన దేశంలో ఎందఱో ఉన్నారు. వారు మన మధ్యనే ఉన్నారు. మన చుట్టూనే ఉన్నారు. మన కళ్ళకు కట్టుకున్న గంతలు తొలగించి చూస్తే కనిపిస్తారు. అహంకారంతో మనం చూడలేకపోతే ఆ తప్పు మనదే గాని వారిది కాదు. ఏవేవో భావాలు మన మనసులో అడ్డు తగులుతుంటే వారిని మనం గమనించలేకపోతే ఆ తప్పు వారిదేలా అవుతుంది? మనం ఊహల్లో విహరించడం ఆపి కళ్ళు తెరిచి చూస్తే వారు ఇక్కడే కనిపిస్తారు.

రామకృష్ణుల భక్తురాలైన 'గోపాలేర్ మా' పవిత్ర జీవితం నాకు హటాత్తుగా గుర్తొచ్చింది.  అతి నిరాడంబర జీవితాన్ని ఆమె గంగానది ఒడ్డున గల ఒక చిన్న గదిలో గడిపింది. ఆమె గతించిన రోజున ఆమెగదిలో దొరికిన ఆమె ఆస్తి రెండో మూడో వస్తువులు మాత్రమే. జపమాల,చాప,ఒక రాగిచెంబు,ఒక పుస్తకం ఇవీ ఆమె ఆస్తి. నిరంతర సాధనతో ఆమె చిన్నకృష్ణుని నిరంతరమూ తన కళ్ళెదుట చూచేది. బాలకృష్ణుడు ఆమెతో ఆడుకునేవాడు. ఆమెను విసిగించేవాడు. అల్లరి చేసేవాడు. అతనికి బువ్వ పెట్టి నిద్రపుచ్చేది. కనపడకుండా ఎక్కడో దాక్కుని విసిగిస్తుంటే బెత్తం తీసుకుని ఎక్కడున్నాడా అని వెదికేది. ఒక్కొక్కసారి కృష్ణుని అల్లరి భరించలేక బెత్తంతో ఆ పిల్లవాని వీపుమీద రెండు దెబ్బలు వేసేది. అలా చేసినందుకు మళ్ళీ ఏడుస్తూ చిన్నికృష్ణుని దగ్గరకు తీసుకుని లాలించేది. ఇవన్నీ ఆమెకు జాగ్రదావస్థలోనే కళ్ళముందే జరిగేవి. ధ్యానంలో కాదు. వారుకదా నిజమైన మహనీయులు? అటువంటి వారు నడయాడినందువల్లనే ఈ దేశానికి ధన్యత కలిగింది? ఈమట్టి పవిత్రతను సంతరించుకున్నది అలాంటివారి పాదస్పర్శతోనే కదా? ఎందరు రాజులు చక్రవర్తులు పుట్టి నిరర్ధకజీవితాలు గడిపి,ఎందరి కర్మనో మూటగట్టుకుని పోలేదు? సాధువుల నిరాడంబర పవిత్రజీవనం ముందు వారి విలాసపూరిత జీవితాలు ఎందుకు పనికొస్తాయి? అక్కయ్య జీవితాన్ని చూస్తే నాకు 'గోపాలేర్ మా' గుర్తొచ్చింది.  

మౌనంగా వింటున్న నావైపు తిరిగింది అక్కయ్య.

'నాకు మాత్రం,ఇప్పుడేదో లేదని,ఇంకేదో కావాలని ఏమీ అనిపించదు నాయనా. అనుక్షణం అమ్మ గుర్తొస్తూనే  ఉంటుంది. ఏ మాట విన్నా ఏ సంఘటన జరిగినా, ఇలాంటి సంఘటన జరిగినప్పుడు 'అమ్మ ఇలా అన్నది కదా' అని అమ్మ మాటలూ అప్పటి సంఘటనలే నిత్యమూ గుర్తొస్తూ ఉంటాయి. ఆ విధంగా అమ్మ ధ్యానమే నిరంతరమూ సాగుతూ ఉంటుంది. మనసెప్పుడూ అమ్మతోనే ఉంటుంది. ఒకటి లేదనీ అనిపించదు. ఇంకోటి కావాలనీ అనిపించదు. అమ్మ ఉంది తను చూచుకుంటుంది. ఇక మనకెందుకు చింత అనిపిస్తుంది.' అన్నది.

ఆమె స్థాయిని చూస్తే, నాకు ఎంతో సంతోషం అనిపించింది. ఆ మారుమూల కుగ్రామంలో, రెండుగదుల ఇంట్లో, అతి నిరాడంబర స్తితిలో, నిరంతర ధ్యానమగ్నతలో, ఏ పటాటోపమూ  లేని జీవితాన్ని గడుపుతూ, పండిన పండులా, నిండుగా కనిపిస్తున్న ఆ స్త్రీమూర్తి ఎంతటి ఉన్నతమైన జీవితాన్ని గడుపుతున్నదో కదా అనిపించింది. అంతటి నిరాడంబరతలో కూడా నిశ్చింత అనేది ఆమె ముఖంలో ప్రతిఫలిస్తున్నది. నిరంతరం పరుగులూ, ఆశలూ, అసూయలూ, కల్మషపు కుళ్ళుతో కూడిన మన డోల్లబారిన జీవితాలు ఆమె నిర్మలమైన భక్తిపూరిత జీవితం ముందు వెలవెలా బోతున్నాయనిపించింది. 

అద్భుతం ! ఇదే కదా నిజమైన భారతదేశం ! ఇదేకదా మన మహోన్నత సంస్కృతి ! అనిపించింది. మనిషిని ఈ స్తితికి చేర్చేదే నిజమైన హిందూమతం. ఇదే నిజమైన ఆధ్యాత్మికత. పరిపూర్ణ శరణాగతి అంటే ఇదేకదా. జీవితానికి ధన్యత్వం అంటే ఇదే కదా అనిపించింది. మనస్సు ఎంతో ఎత్తుకు లేచి ఈ ప్రపంచానికి అతీతం అయినట్లు అనిపించింది. మనస్సులోనే మౌనంగా ఆమెకు ప్రణామం చేశాను.

సంభాషణ ముగించి ఇక బయలుదేరుదామని లేచాం. అక్కయ్యకు నమస్కరించి, ఆఫీసుకు వచ్చి, అక్కడున్న దినకర్ గారు ఇంకా ఇతరులవద్ద సెలవు తీసుకొని,మనస్సులో అమ్మకు నమస్కరించి, తిరుగు ప్రయాణాన్ని మొదలుపెట్టాం.

దారిలో బాపట్ల దాటేవరకూ ఎవరూ ఏమీ మాట్లాడలేదు. మాట్లాడే స్తితిలో మనసులు లేవు. ఏదో ట్రాన్స్ లో ఉన్నట్లుగా ఉంది పరిస్తితి.

మౌనాన్ని చెదరగొడుతూ 'మీరన్నది నిజమే అన్నగారు. నాకివాళ అన్ని సందేహాలూ తీరిపోయాయి' అన్నాడు చరణ్.

నేను తలపంకించి చిరునవ్వు నవ్వాను.

'మన మనస్సే మనకు పెద్ద అడ్డంకి తమ్ముడూ. వేరే అడ్డంకులు ఏమీ లేవు. మన ఆలోచనా ధోరణే మనకు ప్రతిబంధకం. చాలాసార్లు దానివల్లే మనం మహనీయులను గుర్తించలేం. గుర్తించినా వారు చెప్పినది సరిగ్గా అర్ధం చేసుకోలేం.ఒకవేళ అర్ధం చేసుకున్నా ఆచరించలేం. వీటన్నిటికీ కారణం, ఎన్నో ఏళ్లనుంచీ మనం ఏర్పరచుకున్న మన భావజాలం. మనం ఒకవిధంగా ఆలోచించడానికి అలవాటు పడిఉంటాం. ఆ అలవాటే మనకు సత్యాన్ని దూరం చేస్తుంది. మన కళ్ళకు గంతల్లా ఆవరిస్తుంది. అది తొలగించుకుంటే చాలు. అంతా చక్కగా కనిపిస్తుంది. అదే శరణాగతి. 

కాని దానిని ఎందరు చెయ్యగలరు? తన మనస్సే తనకు ప్రధమశత్రువని ఎవరు ఒప్పుకుంటారు?తన ఆలోచనాధోరణే తనకు అడ్డు అని ఎవరు గుర్తిస్తారు? అలా ఒప్పుకోవాలంటే అహం అడ్డు వస్తుంది. తనను తాను మార్చుకోవడానికి ఎవరు సాహసిస్తారు? ఎవరూ ఆ పనికి ముందుకు రారు. పెద్దమాటలు మాత్రం అందరూ చెబుతారు. మనం మాటల్లో హీరోలం. కాని ఆచరణలో జీరోలం. సముద్రాన్ని లంఘిస్తామని బీరాలు పలుకుతాం. కాని లేచి ఒక్కడుగు వెయ్యలేం. ఇదే మనతో వచ్చిన పెద్ద చిక్కు. ఇక్కడే అందరమూ ఫెయిల్ అవుతాం.' అన్నాను.

చరణ్ నవ్వాడు.'నిజమే అన్నగారు. ఈరోజు అక్కయ్య చెప్పిన మాటలతో నాకు కళ్ళకు పట్టిన పొరలు ఊడిపోయినట్లు అయింది. నిజమే. అమ్మను నేను చూచాను ఆమె అనుగ్రహాన్ని పొందాను. ఇంకా నాకెందుకు సందేహాలు? జిజ్ఞాసలు?' అన్నాడు.

'తమ్ముడూ ఒకమాట చెప్పనా? ఆద్యాత్మిక జీవితాన్ని చాలా తేలికగా చెప్పవచ్చు. మూడే మెట్లలో దాన్ని దాటవచ్చు.మూడు అడుగుల్లోనే దానిని పూర్తి చెయ్యవచ్చు.' అన్నాను.

'చెప్పండి అన్నగారు' ఉత్సుకత చరణ్ లో తొంగిచూచింది.

'మొదటి మెట్టు అజ్ఞానం. రెండవది జిజ్ఞాస. మూడవది శరణాగతి. ఆధ్యాత్మికత అంటే ఇంతే తమ్ముడూ. ఎవరి జీవితమైనా ఈ మూడు మెట్లే. ఇంకేమీ లేదు.' అన్నాను.

చరణ్ ముఖం వెలిగిపోయింది.'ఎంత బాగా చెప్పారన్నగారు?' అన్నాడు.

'నే చెప్పలేదు తమ్ముడూ.అమ్మ చెప్పించింది' అంటూ నవ్వాను. 'ఎవరైనా మనం ఏ మెట్టులో ఉన్నామో చూచుకోవాలి. పై మెట్ట్టుకు ఎదగాలి. ఆ ఎదుగుదల సహజంగా మనస్పూర్తిగా జరగాలి. ఒకరిమెప్పుకోసమో, అహంతృప్తి కోసమో కాకుండా నిజమైన తపనతో అది జరగాలి.సరళమైన హృదయం ఉంటే ఇది చాలా సులభం. అలా కాకుండా లోపల నానా కల్మషం ఉంటే ఇదే చాలా కష్టం. అంతే తమ్ముడూ' అన్నాను.

చరణ్ ఏమీ మాట్లాడలేదు. మాట్లాడటానికి ఇంకేమీ లేదన్నట్లు అతని ముఖం చెబుతోంది. అందరమూ మౌనంగా ఉన్నాం.

కారు మెత్తగా ముందుకు సాగుతోంది. గుంటూరు దగ్గర పడుతోంది. అందరి హృదయాలూ ఆనందభారంతో బరువెక్కి తేలిపోతున్నాయి.
read more " జిల్లెళ్ళమూడి స్మృతులు -4 "

25, ఆగస్టు 2012, శనివారం

జిల్లెళ్ళమూడి స్మృతులు - 3

'వ' దగ్గర కొంచంసేపు కూచుందాము పదండి' అంటూ అందరమూ పక్కనే ఉన్న అక్కయ్య ఇంటికి దారితీశాము. మేము వెళ్లేసరికి అక్కయ్య ఒక చెక్కమంచం మీద శాంతంగా కూచుని ఉంది. చరణ్ను ఆమె వెంటనే గుర్తుపడుతుంది. నేను ఒకటి రెండుసార్లు మాత్రమే ఆమె దగ్గరకు వెళ్ళాను గనుక అంతగా గుర్తులేను. మమ్మల్ని చూచి 'రండి నాయనా'అంటూ ప్రేమగా ఆహ్వానించింది.

చరణ్ సరాసరి వెళ్లి నేలమీద ఆమె కాళ్ళదగ్గర కూచున్నాడు. మేము కొంచం దూరంగా కూచున్నాం. పైన కుర్చీల్లో కూచోమని ఆమె వారించిందిగాని, ఆమె ముందు కుర్చీలో కూచోవడం ఏమిటని కిందే కూచున్నాం. క్షేమసమాచారాలు అయిన తర్వాత అసలు చర్చ మొదలైంది.

'అన్నగారు ! మీ సందేహం అడగండి.' అన్నాడు చరణ్.

'మీరు అమ్మతో చాలా చనువుగా మెసిలేవారు కదా. ఎంతో కాలం అమ్మకు సేవలు కూడా చేశారు కదా. అతీతలోకాల గురించి, పునర్జన్మల గురించి అమ్మ ఎప్పుడైనా సందర్భావశాత్తూ మాట్లాడిందా? చరణేమో అమ్మ అలా చెప్పి ఉండదు అంటున్నాడు.' అన్నా నేను.

అక్కయ్య సాలోచనగా చూచింది.

'అమ్మ ఎప్పుడూ అందరికీ ఒకే మాట చెప్పలేదు నాయనా. మనిషిని బట్టి అతని స్థాయిని బట్టి అమ్మ మాట్లాడేది. ఒకరికి వచ్చిన సందేహం ఇంకొకరికి రాదుకదా. అలాగే, అమ్మ సమాధానం కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా చెప్పేది. జన్మల గురించి కూడా అప్పుడప్పుడూ చెప్పేది. అయితే బాగా వివరించేది కాదు. చాలాసార్లు అమ్మ ఏదో లోకంలో ఉన్నట్లు ఉండేది. అప్పుడు ఆమె ముఖం మారిపోయేది. మన స్పృహలో ఉండేది కాదు. మేము కూడా అలాంటి సమయంలో ఆమెను పలకరించేవాళ్ళం కాదు. దూరంగా మౌనంగా ఉండేవాళ్ళం. అల్లాంటి సమయాల్లో ఒక్కొక్కసారి ఎవరితోనో మాట్లాడేది. ఏదో భాషలో మాట్లాడేది. గోణుగుతున్నట్లు ఒక్కొక్కసారి మనకు కనిపించని ఎవరితోనో ఏదో చెప్పేది. మనకు అర్ధం అయ్యేది కాదు. 

మామూలుగా ఉన్నప్పుడు మాత్రం 'జన్మలేందుకు నాన్నా. సముద్రంలో అలలవంటివి జన్మలు. ఒక అల ఇంకో అలకు కారణం అవుతుంది. వాటికి అంతేక్కడుంది. ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉంటాయి. నిన్నఏమి తిన్నామో ఈరోజు మనకు గుర్తుండదు. పాత జన్మల సంగతి ఎందుకు నాన్నా?' అనేది.

అమ్మ ట్రాన్స్ లో ఉన్నపుడు అందరం ఆమెను సమీపించడానికి భయపడేవాళ్ళం. ఆ సమయంలో ఏవేవో మాట్లాడేది. ఎన్నో విచిత్రాలు జరిగేవి. నాకు బాగా గుర్తున్న ఒక సంఘటన చెప్తా వినండి. ఆ రోజు 14-6-1962 ఆ రోజు అమ్మ బావి దగ్గరకెళ్ళి వరుసగా బక్కెట్లు తోడి పోసుకుంటూనే ఉంది. ఎంతసేపు అలా స్నానం చేసిందో తెలీదు. తర్వాత మమ్మల్ని తోడి పోయ్యమంది. మేమూ చాలాసేపు నీళ్ళు అలా తోడి పోస్తూనే ఉన్నాం. ఆ తర్వాత తినడానికి ఏమున్నాయని అడిగింది. అమ్మ ఎప్పుడూ అలా అడగదు. అసలు అమ్మ మనలాగా అన్నం తినడమే మేము చూడలేదు. ఏదన్న వండి ఆమె ఎదుటకు తెస్తే కొంచం మాత్రం తన చేత్తో తిని మిగతాది ప్రసాదంగా అందరికీ పెట్టేది. అప్పుడప్పుడూ కాఫీ తాగేది. అలాంటి అమ్మ ఆరోజు అలా అడగడం మాకు విచిత్రం అనిపించింది. ఇంట్లో వెదికితే 16 మామిడిపండ్లు మాత్రం కనిపించాయి. సరే ఆ సంగతే అమ్మతో చెప్పాం. ఆ పండ్లు అన్నీ ముక్కలు కోసి తెమ్మని చెప్పి ఒక్క ముక్కా వదలకుండా ఎవరికీ పెట్టకుండా అన్నీ తానే తినేసింది. 'అడివిలో శ్యామల ఆకలితో ఉందమ్మా' అన్నట్లుగా ఏదో గొణిగింది. లేకుంటే 'వాళ్ళు అడివిలో తపస్సులో ఉన్నారు. వారికేవరు తిండి పెడతారు?' అనేది. ఇలా మనకు అర్ధం కాని ఏవేవో మాటలు కొద్దిగా అనేది. అప్పుడు మాకు అర్ధం అయేది కాదు. తర్వాత ఎప్పుడో తెలిసేది. ఎక్కడో ఎవరో ఆకలితో అలమటిస్తూ ఉంటే, తాను ఇక్కడ తిని వారి ఆకలి తీర్చేది అని. ఇలాంటివి మహనీయుల జీవితాలలో చదివాం. కుండలో మిగిలిన ఒక్క మెతుకు కృష్ణుడు తిని శిష్యులతో సహా భోజనానికి వచ్చిన దుర్వాసుని ఆకలి తీర్చాడని చదివాం. కాని మేము కళ్ళారా అమ్మను చూచాం. ఇలాంటి సంఘటనలు నిజంగా జరిగేవి.

కొంతమందికి అతీతలోకాల గురించి చెప్పేది. కాని అందరికీ చెప్పేది కాదు. కొందరితోనేమో 'వాటి గురించి ఎందుకు నాన్నా? నీవోచ్చిన పని చూచుకో' అనేది. ఇలా మనిషిని బట్టి అమ్మ సంభాషణ ఉండేది.

ఎందఱో ఎన్నో సమస్యలతో వచ్చేవారు. కొందరు చెప్పేవి శ్రద్దగా విన్నట్లు కనిపించేది. కొందరు చెప్పేవి విననట్లుగా అన్యమనస్కంగా ఉండేది. వారికి అనుమానం వచ్చేది. అసలు అమ్మ మనం చెబుతున్నది వింటూన్నదా లేదా అని. కాని వారు తిరిగి ఇంటికి వెళ్లేసరికి వారి సమస్య తీరిపోయి ఉండేది. అలా మాట్లాడకుండానే అమ్మ అన్నీ చేసేది. ఒక్కొక్కసారి మాట్లాడేది. ఒక్కొక్కసారి మౌనంగా ఉండేది. మన ఊహలకు అతీతంగా అమ్మ వ్యవహారం ఉండేది. 'నేను మాటలమ్మను కాను మూటలమ్మను'. అనేది. మాటలతో పని లేదు. అనుకుంటే ఇచ్చేసేది. అంతే.

చాగంటి వెంకట్రావు గారని ఒక రిటైర్ అయిన డీఎస్పీ ఉండేవాడు. ఒకజు అమ్మతో ' అమ్మా నాకు సినిమాలలో నటించాలని ఉందమ్మా' అని ప్రార్ధించాడు. అమ్మ మౌనంగా విననట్లుగా ఉంది. తర్వాత కొంతకాలానికి   దర్శకుడు బాలచందర్ తనంత తానే ఇతన్ని పిలిచి 'కోకిలమ్మ' సినిమాలో ఒక వేషం ఇచ్చాడు. అలా జరిగేవి.

చిన్నచిన్న మాటల్లోనే జీవితసత్యాలు చెప్పేది. ఉపదేశాలూ అలాగే ఉండేవి. ఉదాహరణకు అమ్మ ప్రసిద్ధ వాక్యం 'నీకున్నది తృప్తిగా తిని ఇతరులకు ఆదరణగా పెట్టుకో' తెలుసుగా. ప్రస్తుతం ఎవరికీ తృప్తి ఉన్నదో చెప్పు నాయనా? అందరికీ అత్యాసే కదా. ఇకపోతే ఇతర్లకు ఆదరణగా ఎవరు పెడుతున్నారు? ఏడుస్తూనో, లేదా ఏదో ఆశించో మాత్రమె ఇతరులకు మనం ఏదైనా చేస్తాం. అది కూడదు. ఇప్పుడు మనం తినేదే తృప్తిగా తినలేకపోతున్నాం. అప్పుడు కూడా ఏదో ఆలోచనలే. ఎవరో ఏదో సంపాదిస్తున్నారు, మనకులేదు అన్న చింతలే.ఇలాంటివి వినడానికి చిన్న ఉపదేశాలలాగే కనిపిస్తాయి. కాని ఆచరించగలిగితే అంతకంటే మానవజన్మలో చెయ్యగలిగేది ఇంకేమీ ఉండదు. అమ్మ ఉపదేశాలు అలా ఉండేవి. అవి మహావాక్యాలు.

అమ్మకు శుభ్రత చాలా ఎక్కువ. సర్దినదే మళ్ళీ సర్దమనేది. తుడిచినదే మళ్ళీ తుడవమనేది.నా వెనుకే నిలబడి గమనిస్తూ అన్నీ శుభ్రం చేయించేది. ఏ పనినీ మధ్యలో వదిలేయ్యడమూ, అరకొరగా చెయ్యడమూ అమ్మకు నచ్చదు. వస్తువులు ఎక్కడ తీసినవి మళ్ళీ అక్కడే ఉంచాలి అనేది. చీపురు కూడా అది ఉండాల్సిన చోట ఉండాల్సిందే. 

'వ' ఇలా చెబుతుంటే నాకు శారదామాత జీవితం గుర్తొచ్చింది. అమ్మ కూడా ఇలాగె ఉండేది. ఒకసారి ఒక శిష్యురాలు చీపిరితో ఇల్లు చిమ్మిన తర్వాత దానిని ఒక మూలకు విసిరి కొట్టింది. అది చూచి అమ్మ ' ప్రతి వస్తువునూ గౌరవించడం నేర్చుకో. దాని విలువ దానికి ఇవ్వాలి. అలా విసిరే బదులు, దానిని చక్కగా ఆ మూల ఉంచితే నీకు ఏమి పోతుంది. పని తీరంటే ఇది కాదు' అంటూ మందలించింది. ఒకసారి బేలూర్ నుంచి ఒక సన్యాసి అమ్మ దర్శనానికి వచ్చాడు. అతను కూచుని అమ్మతో మాట్లాడుతుండగా ఒక శిష్యురాలు అదే గదిలో పక్కనించి నడుస్తూ వెళ్ళింది. ఆమె చీరకొంగు ఆ స్వామికి తగిలింది. దానికి అమ్మ ఆమెను చీవాట్లు పెడుతూ, ' వాళ్ళు అన్నింటినీ పరిత్యజించిన సన్యాసులు.వారితో ఇలాగేనా మేలిగేది? చూచుకుని నడువు.నీ నిర్లక్ష్యంవల్ల నీకే చెడుజరిగే ప్రమాదం ఉన్నది' అని హెచ్చరించింది. మహానీయులతో జీవనం అంటే మాటలు కాదు. చాలా కష్టం. వారి పరిశీలన చాలా సూక్ష్మంగా ఉంటుంది. అనుక్షణం ప్రతిపనిలో పరిపూర్ణతను వారు ఆశిస్తారు.

'వ' తన మాటలు కొనసాగించింది.

'అమ్మకు ఎందరి బాధలో తెలిసేవి. దూరం ఉన్నా సరే వారి ఆవేదన అమ్మకు తెలిసిపోయేది. అందుకే తన ఆరోగ్యం బాగాలేకున్నా సరే అరుణాచలం వెళ్లి చలాన్ని సౌరిస్ ని కలిసి పలకరించి వచ్చింది. అక్కడే జేమ్స్ ఉన్నాడు. అమ్మ అతని కళ్ళలోకి రెండు క్షణాలు చూచింది. అంతే. మేము మా యాత్ర ముగించుకుని వచ్చేసరికి జేమ్స్ జిల్లెల్లమూడికి వచ్చి చేరుకున్నాడు. వచ్చినవాడు మళ్ళీ వెనక్కు పోనేలేదు. 

అమ్మ ఎన్ని మహత్యాలు అద్భుతాలు చేసిందో లెక్కే లేదు. తను చిన్నపిల్లగా ఉన్నప్పుడు నగలు పెట్టుకుని బాపట్ల సముద్రతీరంలో తిరుగుతుంటే ఒక చేపలు పట్టేవాడు ఆ నగలు కాజెయ్యాలని అమ్మను సముద్రంలోకి తోసేశాడు. కాసేపటికి రక్షించమని కేకలు వేస్తూ సముద్రంలో అతనే మునిగిపోతున్నాడు. అమ్మ ఒడ్డున నిలబడి ఉంది. అతన్ని రక్షించి బయటకు తెచ్చారు. 'ఈ నగల కోసమా ఇదంతా? అడిగితే నేనే ఇచ్చేదాన్ని కదా నాయనా. తీసుకో' అంటూ వాటిని వొలిచి అతనికి ఇచ్చేసింది ఆ చిన్నపిల్ల. చిన్నప్పుడే అంత దివ్యత్వాన్ని ప్రదర్శించింది.

ఒకసారి నక్సలైట్లు ఆశ్రమంమీద దాడిచేసి అంతా దోచుకుపోయారు. పోలీసులు వారిని వెతికి పట్టుకొచ్చారు. ఆ దొంగలకు భోజనం పెట్టి, కొత్త బట్టలు పెట్టి పంపింది అమ్మ. వాళ్ళూ తన పిల్లలే అంటుంది. ఆ ప్రేమకు అంతు లేదు.

అమ్మ చిన్నపిల్లగా ఉన్నప్పుడు వాళ్ళ నాన్నతో కలిసి రమణాశ్రమం వెళ్లి రమణ మహర్షిని దర్శించింది. అప్పుడు మహర్షి అమ్మను చూచి ' మాతృశ్రీ వచ్చింది' అన్నారు. తర్వాత రోజుల్లో చలాన్ని చూడటానికి అమ్మ రమణాశ్రమం వెళ్లి అక్కణ్ణించి కంచికి వెళ్ళింది. మేమూ ఆ బృందంలో ఉన్నాం. కంచి పరమాచార్యులు అమ్మను చూచి ముద్రాసహితంగా అమ్మకు నమస్కరిస్తూ ఇరవైనిముషాలు అలా నిలబడే ఉన్నారు.' మనం ఇక్కడ ఉన్నంతవరకూ ఆయన అలా నిలబడే ఉంటారు. పదండి పోదాం' అంటూ అమ్మే బయలుదేరింది. అమ్మెవరో అలాంటి మహనీయులు గ్రహించగలిగే వారు. మనకు తెలిసేది కాదు.

నాకొకసారి మోకాళ్ళు అరిగిపోయి ఆపరేషన్ చెయ్యాలన్నారు.అప్పట్లో ఇంతగా సర్జరీ లేదు. లేవలేక నెలల తరబడి మంచంలో ఉన్నాను. అమ్మ మదనపల్లిలో ఉన్నది. అమ్మ లేకుండా నేను ఆపరేషన్ చేయించుకోను అని చెప్పాను. సరే నన్నే అక్కడికి తీసుకు వెళ్లారు. అప్పట్లో అందరికీ అభిమానాలు ప్రేమలు ఉండేవి.ఎవరికి ఏమొచ్చినా అందరూ కదిలి వచ్చేవారు. ఇప్పుడవన్నీ పోయాయి. ఇప్పటి కాలపు మనుషులకు ప్రేమలు లేవు. ఒకవేళ పోతే ఓహో పోయిందా అంటారు. మర్నాటికి మర్చిపోతారు. లేదా పేపర్లో ఒక వ్యాసం వ్రాస్తారు. అంతే.

సరే, నేను మదనపల్లి వెళ్ళాను. అమ్మ నన్ను చూచింది. ఏమీ మాట్లాడలేదు. తనతో ఉండమంది. మర్నాడు వేరే ఊరికి బయలుదేరుతూ, నన్ను లేచి నడవమంది. నా వల్ల కాదని చెప్పాను.లేవాలని ప్రయత్నం చేస్తే యమబాధ పుడుతున్నది. అయినా సరే అమ్మ వినలేదు.అలాగే లేచి కారు వరకూ కుంటుతూ వచ్చి కారేక్కాను. అడుగు వేస్తుంటే ప్రాణం పోయినంత బాధ పుట్టింది. అక్కణ్ణించి తనతోనే రోజంతా తిప్పింది సాయంత్రానికి మామూలుగా నడువగలిగాను. తర్వాత మళ్ళీ పరీక్షలు చేయిస్తే మోకాళ్ళు మామూలుగా ఉన్నట్లు వచ్చింది. ఇది నాకే జరిగింది. పరీక్షలు చేసిన డాక్టర్లు ఆశ్చర్యపోయారు.

ఒకసారి ఒకాయనకు కేన్సర్ వచ్చింది. ఆపరేషన్ చేస్తామన్నారు. ఆయన అమ్మ భక్తుడు. అమ్మ దగ్గరకి వెళ్లి వస్తానని అంటే డాక్టర్ ఎగతాళిగా నవ్వాడు. ఇలాటి అమ్మలవల్ల బాబాలవల్ల ఏమౌతుంది అంటూ. అయినా వినకుండా అతను అమ్మ దగ్గరికి వచ్చాడు. అతను ఏదో మాట్లాడుతుంటే అవేమీ వినకుండా తనకు అన్నీ తెలిసినట్లు అతనికి ఎక్కడ బాధ ఉందొ ఆ ప్రదేశంలో చెయ్యి వేసి నిమిరింది. తర్వాత అతను వెనక్కు వెళ్లి మళ్ళీ పరీక్ష చేయిస్తే రోగం ఏమీ లేదు. ఆ డాక్టర్ బిత్తరపోయి పరిగెత్తుకుంటూ జిల్లెళ్ళమూడి వచ్చాడు.  ఇలాంటివి చాలా జరిగాయి.

అంతెందుకు ఒకసారి అమ్మకే కేన్సర్ అనుకున్నారు. లోపల గడ్డలాంటిది ఏదో వచ్చి పరీక్ష చేయిస్తే మేలిగ్నేంట్ అని రిపోర్ట్ వచ్చింది. దినకర్ అన్నయ్యా, రామక్రిష్ణ అన్నయ్యా ఈ వార్త విని ఏడుస్తూ సాయంత్రం వరకూ కనపడకుండా ఎక్కడో తిరుగుతున్నారు. అమ్మకు అన్నీ తెలుసు. కానీ తెలియనట్లు నటిస్తుంది. నన్ను పిలిచి ' ఏమే. వీళ్ళేక్కడికి పోయారు. ఏమైంది?' అని అడిగింది. ' ఏమో అమ్మా నాకేం తెలుసు?' అని జవాబు చెప్పాను. 'నీకు తెలియకుండా ఎందుకుంటుంది? చెప్పు.' అంది. 'నాకు తెలీదమ్మా వాళ్ళేక్కడున్నారో? అని చెప్పాను. సాయంత్రానికి వాళ్ళోచ్చి అమ్మ దగ్గర కూచొని,  చెప్పలేక చెప్పలేక విషయం చెప్పారు. అంతా విని ' ఇందుకా మీరు ఇలా చేస్తున్నారు. ఆ రోగం నాకెందుకుంటుంది నాన్నా. ఉండదు. మళ్ళీ ఇప్పుడు చూడండి' అన్నది. మళ్ళీ పరీక్ష చేయిస్తే ఏమీ లేదని వచ్చింది. ఇలా ఎన్నో జరిగాయి.

అమ్మ అంతరంగాన్ని తెలుసుకోలేం. అతీతలోకాలు, జన్మలు ఉన్నాయని కొన్నిసార్లు చెప్పేది. కాని కొన్నిసార్లు చెప్పకుండా మాట దాటవేసేది. అంతా అడిగేవారి స్థాయిని బట్టి, వారి తపనను బట్టి ఉండేది.

అంటూ వ'ము'గించింది.

(సశేషం)
read more " జిల్లెళ్ళమూడి స్మృతులు - 3 "

24, ఆగస్టు 2012, శుక్రవారం

ఒమర్ ఖయ్యాం జాతకం-2 (జీవితపు అనిత్యత్వం)

ఒమర్ ఖయ్యాం జాతకంలో కొన్ని విచిత్రాలున్నాయి. అవేమిటో,వాటివల్ల అతని మనస్తితి, పరస్పర విరుద్ధ విషయాలతో, ఎలా విచిత్రంగా ఉండేదో చూద్దాం.

లగ్న పంచమ నవమాలలో వరుసగా రవిబుధశుక్రులు, రాహువు, శనిగురువులు ఉండటం ఒక నిగూఢమైన గ్రహయోగం. మంత్ర స్థానంలో ఉన్న రాహుద్రుష్టి నీచగురువు మీద ఉండి, ఆ గురువు మళ్లీ లగ్నంలో ఉన్న మూడు గ్రహాలను చూస్తున్నాడు. గురుద్రుష్టికి, శనిద్రుష్టి కూడా తోడైంది.దీనివల్ల అతనిలో రకరకాల భావాలు కలిసిన మార్మికచింతన కలిగింది.ఉద్యోగాన్ని నిరసించి,తన సమయాన్ని గ్రంధావలోకనంలోనూ, సాఖీ సాంగత్యంలోనూ, ఏకాంతలోకంలో మార్మికకవితా వ్యాసంగంలోనూ, మిత్రగోష్టులలోనూ గడిపే అభిరుచిని ఈ యోగం ఇచ్చింది. 

అంతేగాక, సాంప్రదాయానికి భిన్నమైన ఆలోచనాధోరణినీ, నిర్మొహమాటంగా మాట్లాడే తత్వాన్నీ,రసికప్రియత్వాన్నీ, సాకీ సాంగత్యాన్నీ  కూడా ఇదే యోగం ఇచ్చింది. అదే సమయంలో అతనిలో తీవ్రమైన వైరాగ్యమూ కనిపిస్తుంది. ఇదొక విచిత్రమైన మనస్తత్వం. అందుకే ఖయ్యాం కవితలలో ఎక్కువగా ఒకవిధమైన నిరాశావాదం ఉంటుంది. దానిని నిరాశావాదం అని ఖచ్చితంగా అనలేము. జీవితం క్షణభంగురం కనుక ఆలస్యం చెయ్యకుండా ఆనందాన్ని అనుభవించమన్న సందేశం ఖయ్యాం కవితలలో అనుస్యూతంగా కనిపిస్తుంది.

ప్రపంచం మూన్నాళ్ళముచ్చట అన్న విషయం ప్రతిపంక్తిలోనూ ఖయ్యాం నొక్కి చెప్తాడు. ఇక్కడ ఏదీ శాశ్వతం కాదనీ, ప్రతి క్షణమూ జీవితం నీ చేతిలోనుంచి జారిపోతున్నదనీ గుర్తు చేస్తాడు. ఒకరోజు గడిస్తే చావుకి మనం దగ్గరౌతున్నామన్న సత్యాన్ని మాటిమాటికీ వదలకుండా చెబుతాడు. ఇక్కడెవరూ శాశ్వతం కాదనీ, మహారాజులూ, చక్రవర్తులే దిక్కులేకుండా పోయారనీ ఇక మనమెంత అంటూ అనవసర కాలక్షేపాలు మానమని ఉద్బోదిస్తాడు.

అంతము లేని ఈ భువనమంత పురాతన పాంధశాల, వి 
శ్రాంతి గృహమ్ము, నందు నిరుసంజలు రంగుల వాకిళుల్, ధరా 
క్రాన్తులు పాదుషాలు బహారాం జమిషీడులు వేనవేలుగా 
గొంత సుఖించి పోయిరెటకో పెరవారికి చోటోసంగుచున్      

ఈ ప్రపంచం ఒక పురాతన విశ్రాంతిగృహం. ఇది నీకు ఎన్నటికీ శాశ్వతం కాదు. శాశ్వతం అనుకుంటే అది నీ పిచ్చి భ్రమ. ఇరుసంజలూ రెండు వాకిళ్ళు. వీటిలోనుంచి ఎందఱో రాజులు చక్రవర్తుల వేలాదిమంది వచ్చి కొన్నాళ్ళు ఇక్కడ సుఖాలు పొంది ఎక్కడికో వెళ్ళిపోయారు. వారి స్థానంలో ఎవరెవరో మళ్లీ కొత్తవారొచ్చారు. రాజులే పోతే ఇక సామాన్యుల సంగతి చెప్పేందుకు ఏముంది? ప్రతి సంధ్యా వచ్చిపోతూ నీ జీవితాన్ని నిత్యమూ హరిస్తున్నదని సూచనాత్మకంగా చెప్పాడు. 

ఈ లోకంలో, రంగస్థల నేపధ్యం మారవచ్చు, పాత్రధారులు మారవచ్చు, కాని పాత్రలు మాత్రం అవేఅవే ఉంటాయి. సన్నివేశాలూ అవే ఉంటాయి. ఇక్కడ కొత్త నాటకం ఎప్పుడూ జరగదు. ఎప్పుడూ 'జీవితము-మృత్యువు' అనే పాతబడిన నాటకమే ప్రదర్శింపబడుతూ ఉంటుంది. ఈ రంగస్థలానికి ఇరుసంజెలు అనే రెండు వాకిళ్ళున్నాయి. ఒకటి రాక,ఒకటి పోక. ఎందఱో నటులు ఈ రంగస్థలం మీదకు ఒకవాకిలి గుండా వచ్చి వారివారి పాత్రలు నటించి ఇంకొక వాకిలిగుండా నిష్క్రమించారు. నీకూ ఒకరోజు నిష్క్రమణ తప్పదు సుమా. దీనిని మరువబోకు.

చెలులను బంధులన్ మధురశీధువు నామని తోట వీడి యూ 
హలు నెగబ్రాక జాలని రహస్యపు జోటికి బోదువీవు, నే
బలికెద తెల్పరాని యొకభావము, సంధ్యలం దూళి రాలు పూ       
వులు కృశియించుగాని విరబూయవు క్రమ్మర, నమ్ముమో సఖీ 

నీ చెలులను బంధువులనూ,మధువునూ,పూలతోటలనూ వదలి, అన్నింటికీ అందరికీ దూరంగా, నీవు ఊహించలేని ఒక రహస్యమైన చోటికి నీవు పోవలసి వస్తుంది. ఒక్క మాట విను. రాలిన పూలు వాడి నశిస్తాయి గాని, తిరిగి విరబూయవు. మనిషి జీవితంకూడా ఇంతే సఖీ, ఈ సత్యాన్ని తెలుసుకో -- అంటాడు.

మనిషి జీవితం కూడా రాలిన సుమం వంటిదే. అది క్షణక్షణమూ వాడిపోతూ ఉంటుంది గాని వికసించదు. క్షణక్షణం ఆయుస్సు తరగడం అంటే వాడిపోవటం కాక వికసించడం ఎలా అవుతుంది?

కవుల ఊహల్లో తమదైన ఒక స్వప్నసుందరి ఎప్పుడూ ఉంటుంది. కవులు స్వప్నాలలో విహరిస్తారు. ఊహల్లో జీవిస్తారు. పరమ సాంప్రదాయవాది అయిన విశ్వనాధ సత్యనారాయణగారే, 'కిన్నెరసాని' అంటూ కలవరించాడు. నండూరివారి 'ఎంకి', బాపిరాజుగారి 'శశికళ'  తెలియనిదెవరికి? ఇక నిరంతర స్వాప్నికుడూ సుఖప్రియుడూ అయిన ఒమర్ ఖయ్యాం మాట చెప్పాలా? ఆయన 'సాకి' అన్న తన ప్రియురాలిని ఉద్దేశించి అనేక పద్యాలు చెప్పాడు. ఈ పదమే తెలుగులో 'సఖి' అయి ఉండవచ్చు. 

ఈ 'సాకి' అనేక సందర్భాలలో చిన్తాక్రాంతుడైన ఖయ్యాంకు మదిరాపాత్రను అందిస్తుంది. ప్రపంచపు అనిత్యత్వాన్ని ధ్యానిస్తూ బాధపడే అతన్ని ఓదారుస్తుంది. బాధను మరచి మధుసేవలో తరించమని పిలుస్తుంది. తన ప్రేమమయ పరిష్వంగంలో అతన్ని సేదదీరుస్తుంది. ఒక్కొక్కసారి 'సాకి' అన్యమనస్కంగా విచారంగా ఉంటే ఖయ్యాం ఆమెను ఓదార్చడమూ మనం చూస్తాం.

కాలమహర్నిశంబనేడు కత్తెరతో భవదాయురంబర 
శ్రీల హరించు, మోముపయి జిల్కును దుమ్ముదుమార, మేలోకో 
జాలి పడంగ? నీ క్షణము సంతసమందుము నీవు వోదు, వీ 
రేలుబవళ్ళు మున్నటు చరించు నిరంతర మండలాకృతిన్   

కాలమనేది తన చేతనున్న 'రేయి-పగలు' అనే కత్తెరతో నిరంతరమూ నీ ఆయువును కత్తిరిస్తున్నది. చివరకు నీ ముఖాన దుమ్ము జల్లుతుంది. దీనికి జాలిపడాలా? ఈ క్షణం నీది. సంతోషంగా ఉండు. ఒకరోజు నీవు పోక తప్పదు. కాని ఆ తరువాత కూడా ఈ రేయిపగళ్ళు నిరంతరమూ చక్రంలా నడుస్తూనే ఉంటాయి -- అంటాడు. ఖయ్యాం వృత్తిరీత్యా గుడారాలు కుట్టే కుటుంబంలో పుట్టాడు. అందుకే ఇలా ఒక పద్యం చెప్పాడు.        

అల బహరాము గోరి మధువానిన సుందర భోగమందిరం 
బుల మృగరాజు నేడు భయమున్విడి క్రుమ్మరు, జంబుకంబు పి
ల్లల గను, వన్యరాసభముల మృగయారతి బట్టినట్టి భూ 
తలపతి గోరి పట్టువడే దానొక గోరి, నెరుంగుదే చెలీ

ఒకనాడు బహారాం అనే రాజు చక్కగా తాగి తందనాలాడిన రాజభవనం ఉన్న స్థానంలో నేడు సింహాలు పులులూ తిరుగుతున్నాయి. అదే చోట నక్క పిల్లలను కంటున్నది.అంటే ఒకనాటి రాజభవనం ఈనాడు అడవిగా మారిపోయింది అని అర్ధం. వేటలో వినోదంగా మృగాలను పట్టిన రాజు ఈరోజు తానె ఒక సమాధిలో పట్టుబడ్డాడు. ఆ సమాధి చుట్టూ అవే మృగాలు తిరుగుతున్నాయి. చూడు చెలీ -- అంటూ ఒక చిత్రాన్ని మనముందు ఆవిష్కరిస్తాడు.

ఒకనాడు మహారాజు తిరిగినచోట నేడు మృగరాజు తిరుగుతున్నది. ఒకనాడు కుట్రలు కుతంత్రాలతో మంత్రాంగాలు చేసిన చోట నేడు కుయుక్తులకు పేరుగన్న నక్కలు నివసిస్తున్నాయి. అంటే రాజులు సింహాలుగానూ మంత్రులు నక్కలుగానూ పుడతారని ఖయ్యాం భావమా? కాకపోవచ్చు.ఎందుకంటే అతనికి పునర్జన్మ మీద నమ్మకాలు లేవు. కాకుంటే సింహం రాజనీ, నక్క మంత్రనీ కధలున్నాయి దానికి అనుగుణంగా ఈ పద్యం చెప్పి ఉండవచ్చు.       

'నేడు విహారభూమి శోభామయమైన ఈ గరిక పచ్చగిలుంగద రేపు నీపయిన్' - అంటూ నీవు హాయిగా ఏ పచ్చిక మీద అయితే ఈరోజు విహరిస్తున్నావో, రేపు అదే పచ్చిక నీ సమాదిమీదో, లేక నీవు బూడిదగా మారి మట్టిలో కలిస్తే ఆ మట్టిమీదో, మొలకలేత్తుతుంది కదా అంటాడు.

ఖయ్యాం కు ఆత్మమీద నమ్మకం లేదు. అందుకే పునర్జన్మను నమ్మలేదు. కాని మట్టిలోనుంచి పుట్టిన జీవులు మళ్లీ మట్టిలో కలుస్తాయని నమ్మాడు. అదే మట్టి మళ్లీ అనేక రూపాలు ధరిస్తుందని తెలుసు గనుక ఈ రకమైన  భౌతిక చక్రభ్రమణాన్ని ఊహించాడు. ఒక నిరంతర వలయాన్ని ప్రకృతిలో అతను దర్శించాడు. ఈరోజు మన కాళ్ళక్రింద నలిగే పచ్చిక రేపు మనమీద మొలవవచ్చు. ఈ రోజు నీవు ద్వేషించిన మనిషి చేతుల్లోని కూజాగా రేపు నీవే ఉండవచ్చు. లేదా అతని కాలిక్రింది మట్టిగా నీవే మారవచ్చు. చెప్పలేం.

సాధారణంగా మనం అశుభం అంటూ ఆలోచించటానికి కూడా ఇష్టపడని విషయాలను ఖయ్యాం మాటమాటకీ గుర్తుచేసి ప్రపంచపు అనిత్యత్వాన్ని కళ్ళ ముందు అనుక్షణమూ సాక్షాత్కరింప చేస్తాడు. ప్రపంచం అనిత్యం కాదు. అదెప్పుడూ ఉంటుంది. నీవే దీనిని వీడి పోవలసి వస్తుంది, నీవే అనిత్యం అన్న సత్యాన్ని గ్రహించు -- అంటాడు.   

బౌద్ధంలో కూడా ఇలాంటి అశుభవిషయాల మీద ధ్యానం నిర్దేశింపబడింది. ఈ అభ్యాసంవల్ల మనిషికి సహజమైన మోహం నశిస్తుంది.అహం అడుగంటుతుంది. కాని ఖయ్యాం ఒకవైపు ప్రపంచపు అనిత్యత్వాన్ని గురించి బాధపడుతూనే, ఇంకొకవైపు సాధ్యమైనంత ఎక్కువ సుఖాన్ని పొందమని ఉద్బోదిస్తాడు. సాంప్రదాయ యోగులలో ఉండే విషయ విముఖత్వమూ, వైరాగ్యమూ ఇతనిలో కనిపించవు. మధుసేవనమూ, సాకి సాంగత్యాలే ఇతని యోగసాధనలు. అవిచ్చే ఆనందమే ఇతని సర్వస్వం. వాటికోసం అనిత్యమైన ప్రపంచాన్ని తృణీకరిస్తాడు. అనిత్యంలో నిత్యాన్ని వెదకడమే ఇతని మతం.    

ద్వాదశ చంద్రుడు కేతునక్షత్రంలో ఉండటమూ. మీనంలోని కేతువుమీద వక్రశనిదృష్టి ఉండటమూ అతనికి తీవ్రవైరాగ్యాన్ని ఇచ్చింది. అందుకే మరణాన్ని నిరంతరం ధ్యానించాడు. సుఖవిలాస లాలసను ఇచ్చే వృషభరాశి లగ్నం కావడమూ అందులో రవి బుధ శుక్రులూ, పైగా బుధ శుక్రులు ఒకే డిగ్రీ పైన ఉండటమూ ఇతనికి ఈ కులాసా పోకడలను ఇచ్చాయి. అందుకే ఈవిధమైన పరస్పర విరుద్ధభావనలు ఇతనిలో మనకు కనిపిస్తాయి.

(సశేషం)
read more " ఒమర్ ఖయ్యాం జాతకం-2 (జీవితపు అనిత్యత్వం) "

22, ఆగస్టు 2012, బుధవారం

కాలజ్ఞానం - 11

రాబోయే అష్టమి కష్టాలను తెస్తుంది 
ప్రముఖుల కొందరిని ప్రయాణం కట్టిస్తుంది 
రాజకీయ రణరంగం రంగులీనబోతుంది  
కుట్రదారులకు చక్కని ఉపాయాలనిస్తుంది 

గాలీనీరూ కలిసి నిప్పు రాజుకుంటుంది 
అభద్రతా భావాలను పైకిలాగి తెస్తుంది  
ఆకతాయిలతో భలే ఆటలాడుకుంటుంది 
ఆరోగ్యాలనేమో అటకనెక్కమంటుంది

మునుగీత తెలిస్తే ముచ్చటగా చూస్తుంది 
మేఘాలను దాటితేను మెచ్చుకోలు నిస్తుంది
పాతాళపులోకంలో పాము నిద్రలేస్తుంది
రాతలేనివారి పట్ల రాక్షసిగా మారుతుంది
read more " కాలజ్ఞానం - 11 "

21, ఆగస్టు 2012, మంగళవారం

శనికుజుల యుతి - తగ్గుతున్న ప్రభావం

కుజుడు శనిని వదలి దూరంగా పోతున్నకొద్దీ ప్రపంచవ్యాప్తంగా గత నాలుగు రోజులుగా వారు చూపిన దుష్ప్రభావాలు తగ్గిపోతున్నాయి. అలాగే అమావాస్య ప్రభావం కూడా తగ్గిపోయింది. కనుక ఇప్పుడు ఎక్కడా అన్నన్ని ఘటనలు జరగడంలేదు.చెదురుమదురుగా ఒక్కొక్కటి జరుగుతున్నాయి.ఈ శీర్షికను ముగించబోయే ముందు  అవేమిటో ఒక్కసారి చూద్దాం.

సుడాన్ లో హెలికాప్టర్ కూలి అందులో ఉన్న 32 మంది మరణించారు. అందులో ఒక మంత్రి, ఒక రాజకీయ ప్రముఖుడూ, ఇద్దరు ఆర్మీ జేనేరల్స్, మీడియా వారూ ఉన్నారు.

జమ్మూ సరిహద్దులో పాకిస్తాన్ సైన్యానికీ మనకూ మధ్య కాల్పులు జరుగుతున్నాయి. ఇవి ఎప్పుడూ జరుగుతూనే ఉంటాయి అనకండి. ఈ సమయం లోనే ఇవి ఎందుకు తలెత్తాలి? ఎందుకు ఉధృతం అవ్వాలి?

హిమాచల్ ప్రదేశ్ లో భారీవర్షాలకు లాండ్ స్లైడ్ జరిగి కులూమనాలీ ప్రాంతంలో చాలా భాగాలు మూసుకుపోయాయి.

అస్సాం, అరుణాచల్ ప్రదేశ్ లలో 5.0 స్థాయి భూకంపం వచ్చింది.

పైసంఘటనలు గమనిస్తే,గత మూడురోజులుగా కనిపిస్తున్న దుస్సంఘటనలు తీవ్రతలో క్రమంగా తగ్గిపోతున్నట్లు, దానిస్థానంలో చిన్న స్థాయి సంఘటనలు అక్కడక్కడా మాత్రమె జరుగుతున్నట్లు మనం గమనించవచ్చు. గ్రహప్రభావం భూమిమీద ఎలా ఉంటుందో గత నాలుగురోజులుగా జరుగుతున్న సంఘటనలు గమనిస్తే మనకు అర్ధమౌతుంది.
read more " శనికుజుల యుతి - తగ్గుతున్న ప్రభావం "

20, ఆగస్టు 2012, సోమవారం

ఒమర్ ఖయ్యాం జాతకం - ప్రేమతత్త్వం

ఒమర్ ఖయ్యాం 'రుబాయత్' నేను బాగా ఇష్టపడే కవితలలో ఒకటి. దీనిలోని కొన్ని మంచి పద్యాలను 'కవికోకిల' దువ్వూరి రామిరెడ్డి గారు 'పానశాల' పేరుతో అనువాదం చేశారు. అందులో బట్టీ పట్టదగిన పద్యాలు చాలా ఉన్నాయి.చాలా పద్యాలు నాకు నోటికి వొచ్చు. దానికి కారకులు నా మిత్రుడు వెంకటాద్రిగారు. ఆయన మా నాన్న సమకాలికుడు. కాని నాకు మంచి మిత్రుడు. ప్రస్తుతం ఆయన గతించాడు. 'పానశాల' పుస్తకాన్ని ఆయనే నాకు బహూకరించాడు. ఒమర్ ఖయ్యాం తత్వాన్ని మేము గంటలు గంటలు చర్చించేవాళ్ళం. ఆయన కూడా అందులోంచి అనేక పద్యాలు గడగడా చెప్పగలిగేవాడు. ఆయన్ని చూచి నేను కూడా కొన్ని మంచిపద్యాలను కంఠస్తం చేసాను.  

పరమహంస యోగానందగారు 'రుబాయత్' కు క్రియాయోగపరంగా చేసిన వ్యాఖ్యానం కూడా ఆయనదగ్గర ఉండేది. అమెరికాలో ఉన్న తన సోదరునితో చెప్పి అక్కణ్ణించి దాన్నితెప్పించాడు. చదవమని నాకూ ఇచ్చాడు. కాని అది నాకు నచ్చలేదు.యోగానందగారు ఉమర్ ఖయ్యాం పద్యాలను చీల్చి చెండాడి క్రియాయోగానికి వాటిని అతకాలని ప్రయత్నం చెయ్యడం అందులో నాకు స్పష్టంగా కనిపించింది. కొందరు భావించినట్లుగా ఒమర్ ఖయ్యాం మార్మిక సూఫీ కావచ్చు. కాని 'రుబాయత్' లో ప్రతి పదాన్నీ క్రియాయోగానికి అతకాలని యోగానందగారు చేసిన ప్రయత్నం మాత్రం సఫలీకృతం కాలేదు. అదే మాట వెంకటాద్రిగారితో చెప్పాను. ఆయనకూ ఆ పుస్తకం చదివితే అదే అభిప్రాయం కలిగింది. ఇదంతా పదేళ్ళ క్రితం జరిగింది. సరే ఆ విషయాన్ని అలా ఉంచుదాం.

ఒమర్ ఖయ్యాం మీద ఫిట్జెరాల్డ్ నుంచి ఇప్పటిదాకా చాలామంది రీసెర్చి చేసారు. వారు చెప్పిన ప్రకారం ఆయన 18-5-1048 న ఉదయం 4-41 కి ఇరాన్ లోని నిషాపూర్ లో పుట్టాడు. ఆయన జాతకచక్రం పైన ఇచ్చాను. దానిని బట్టి ఆయన జీవిత వివరాలు చూద్దాం.

ఇక్కడ ఒక మాట చెప్పాలి. చాలామంది నాతో అంటుంటారు. 'మీరెంతసేపూ చచ్చినవాళ్ళ జాతకాలే చూస్తున్నారు. దానికి బదులు బతికున్నవారివి చూడొచ్చు కదా, వాళ్ళకూ కొంచం ఉపయోగం ఉంటుంది' అని. బతికున్నవారి జాతకాలు కూడా నేను చూస్తాను. కాని అందరివీ చూడను. నాకిష్టమొచ్చిన జాతకాలే నేను చూస్తాను. జాతకాలు చెప్పి లోకులని ఉద్ధరించాలని, స్వార్ధపరుల కర్మ నా నెత్తికెత్తుకోవాలని నాకేమీ తపన లేదు. ప్రతిదాన్నీ బిజినెస్ ధోరణిలో చూడటం నా పద్దతి కాదు.

మహనీయుల జాతకాలు చూస్తే, వాళ్ళ జీవితాలు అధ్యయనం చేస్తే, వాళ్ళ  భావపరంపర మనలో ప్రవేశిస్తుంది. భావౌన్నత్యం కలుగుతుంది. దానికి విరుద్ధంగా స్వార్ధపరులైన మామూలు మనుషుల జాతకాలు చూస్తే వాళ్ళ కుళ్ళు మనకంటుకుంటుంది. ప్రతిదీ ఒకరకమైన ధ్యానమే. దాని ఫలితం అదిస్తుంది. అందుకే నేను అందరి జాతకాలూ చూడను. వారి గురించి ఆలోచించను. విశ్వాత్మగారు కూడా ఇదేమాట అనేవారు. ఇది నిజం కూడా. 

లోకులు చేసుకున్న ఖర్మను మనం ఎందుకు తొలగించాలి? అందరి కర్మనూ తీరుద్దామని జ్యోతిష్యజ్ఞానం ఉన్నవారు ప్రయత్నించరాదు. ముఖ్యంగా ఆధ్యాత్మిక పురోగతి ఆశించేవారు ఆ పని ఎన్నటికీ చెయ్యకూడదు. నిజంగా పశ్చాత్తాపం ఉండి కర్మను బాగుచేసుకుందాం అనుకున్న వారికి 'మాత్రమే'  సాయం చెయ్యొచ్చు. అంతేగాని అందరి జాతకాలూ చెప్పకూడదు. వారెలాంటివారో మీకెలా తెలుస్తుంది? అని అనుమానం రావచ్చు. ఆ మాత్రం తెలియకపోతే ఇక జాతకాన్ని దానిలోని లోతుల్ని ఎలా అర్ధం చేసుకోగలం? మెతుకు పట్టుకుంటే అన్నం ఉడికిందీ లేనిదీ ఇట్టే తెలిసిపోతుంది. అందుకే కాలక్షేపానికో, సరదాగానో, లేకపోతే వీడేమి చెబుతాడో చూద్దాం అనో, అడిగే ప్రశ్నలకు జవాబు చెప్పరాదని జ్యోతిష్యశాస్త్రం నిర్దేశించింది.అహంకారులకూ స్వార్ధపరులకూ జ్యోతిశ్శాస్త్రం సాయం చెయ్యదు.

ఇక విషయంలోకొద్దాం.

ఉమర్ ఖయ్యాం జాతకంలో ముఖ్యంగా కనిపించేది లగ్నంలో బుధశుక్రుల డిగ్రీ కంజంక్షన్. దానివల్ల ఇతర విషయాలకు తోడూ, ఆయనలో కవితాశక్తి ఎక్కువగా ఉంది. బుధుని వక్రతవల్లా పంచమాదిపత్యం వల్లా అది ఆధ్యాత్మికత వైపు దారితీసింది. అయితే శుక్రుని వక్రత తోడవడంవల్లా, పంచమంలో రాహువుస్తితివల్లా అది సూటిగా కాకుండా మార్మికభాషలో చెప్పబడింది. 

పంచమరాహువు వల్ల ఆయన ఇస్లాంని కూడా చాందసంగా పాటించేవాడు కాదు. అప్పటి సమాజానికి పొసగని ఆధునికధోరణి ఆయనలో ఉండేది. సామాన్యంగా ముస్లిములకుండే మతపిచ్చి ఆయనకుండేది కాదు. ఇందువల్ల ఆయన చాందస ముస్లిములకు విరోధి అయ్యాడు. ఒకసారి ఆయన సరదాగా మసీదుకు పోయాడు. ఎప్పుడూ రాని వ్యక్తీ, అందులో ఖయాం వంటి ప్రసిద్ధవ్యక్తి అక్కడకు వచ్చేసరికి వారికి ఆనందం కలిగింది.కాని ఆయన తానెందుకోచ్చినదీ చెప్పినది విన్నతర్వాత, వారికి నవ్వాలో ఏడవాలో అర్ధం కాలేదు.

మునుపు మసీదు వాకిటను ముచ్చెలు దొంగిలిపోతి బ్రాతవై 
చినిగెను, నేడునున్ మరల జెప్పుల కోసము వచ్చినాడ, నె
మ్మనము సెడగ నియ్యెడ నమాజొనరింపగరాదు, నీవు చ 
చ్చినయెడ వీడిపోయెదవు చెప్పులు వోలె నమాజు సైతమున్ 

'మునుపెన్నడో చెప్పులు దొంగతనంచెయ్యడం కోసం మసీదుకు వచ్చాను. ఇప్పుడవి పాతబడి చినిగిపోయాయి. అందుకే ఇంకో జతకోసం మళ్ళీ ఇప్పుడొచ్చాను. ఇక్కడ నమాజు చెయ్యడం ఎందుకు దండగ? మసీదు బయట చెప్పులు వదలినట్లే, నీవు చచ్చినపుడు నీ కపట ప్రార్ధనలు కూడా నిన్ను వదిలిపోతాయి'- అంటూ ఒక నిగూడార్ధాన్ని ఈ పద్యంలో పొందుపరచాడు. కపట మతాచారాలను ఖయ్యాం నిరసించాడు. నిత్యజీవితంలో ఆచరణలేని ఉత్తసూక్తులను ఆయన అసహ్యించుకున్నాడు. పటాటోపంతో కూడిన మతవేషాలను, ప్రేమరాహిత్య మతాచారాలను ఆయన అనుసరించేవాడు కాదు.

అందుకే 

'దేవ ! నీవు లేని గుడిని ప్రార్ధించుకంటె 
పానశాలను సత్యము పలుక మేలు' అంటాడు.

'దేవాలయంలో చేరి గొప్ప భక్తులలాగా అబద్దపువేషాలు వేసి నటించడం కంటే, సారాయికొట్టులో కూర్చొని సత్యాన్ని చెప్పడం మేలుకదా' అన్న విప్లవాత్మక భావాన్ని ఈ పంక్తులలో నిక్షేపించాడు.

ప్రత్యర్ధులైన తీవ్రవాదుల బాధ తట్టుకోలేక, ఇష్టం లేకున్నప్పటికీ, ఆయన ఒకసారి మక్కాయాత్ర చేసి వచ్చాడు. హాజీ అనిపించుకుంటే ప్రత్యర్ధులు కొంచం శాంతంగా బతకనిస్తారేమో అని. కాని మక్కాలో ఆయనకు ఏమీ దైవానుభూతి కలుగలేదు. అందుకే ఆ యాత్ర తరువాత ఈ పద్యం చెప్పాడు.

కలపయు మట్టి రాల నిడి కట్టిన దేవళమందు నీకు నే
ఫలము లభించు? ప్రేమరస భావయుతుండవ యేని కామినిన్ 
వలవుము ప్రాణహీనమగు బండలు వేయిటి కన్న శ్రేష్టమై 
యలరు గదా మనుష్య హృదయము ప్రతి ప్రణయానురక్తులన్  

'మట్టి, చెక్క, బండలు- వీటితో కట్టిన గుడిలో ఏముంది? నీవు ప్రేమను  కోరుకుంటే నీ ప్రేయసిని ప్రేమించు. ప్రాణంలేని బండ నీతో మాట్లాడదు. దానిబదులు నీ ప్రేమకు బదులిచ్చే మనుష్యహృదయం రాయికంటే వేయిరేట్లు మేలైనది  కదా' అంటాడు.

సూఫీలు ప్రేమాన్వేషకులు. దైవాన్ని ప్రేమగా వారు భావిస్తారు. వారు ప్రేమపూజారులు. భక్తి మార్గంలో ఉండే మాధుర్యభావం వారి మార్గం. దైవం అంటే ప్రేమయే అని వారి మతం. మనుష్యహృదయంలో ప్రేమగా దైవం ఈలోకంలో ఉన్నాడని వారి విశ్వాసం. ప్రేమే దైవం అని వారు నమ్ముతారు.

వివేకానందుడు కూడా ఇదే భావాన్ని చెబుతూ 'If you want to worship God, worship him in man. Where can you find a better temple to worship God, other than a human being? అంటాడు.

(సశేషం)
read more " ఒమర్ ఖయ్యాం జాతకం - ప్రేమతత్త్వం "

19, ఆగస్టు 2012, ఆదివారం

శనికుజయోగం - ఇంకొన్ని ఫలితాలు

ఊహించినట్లే గత రెండురోజుల నుండీ ఈ గ్రహయోగం అనేక ప్రమాదాలనూ, విధ్వంసాన్నీ ప్రపంచవ్యాప్తంగా కలిగిస్తున్నది. అవేమిటో కొంచం చూద్దాం.

పాకిస్తాన్ లోని కామ్రా ఎయిర్ బెస్ మీద తీవ్రవాదుల దాడి జరిగింది. అక్కడ అణ్వాయుధాలు కూడా స్టాక్ చేసి ఉన్నాయని అంటున్నారు. లాడెన్ హత్యకు ప్రతీకారంగానే ఈపని చేసామని వాళ్ళంటున్నారు. ఒకవేళ అవి తీవ్రవాదుల చేతికి చిక్కితే మొదట గురిపెట్టేది మన దేశం మీదనే. అప్పుడు మరో హిరోషిమా నాగసాకిలను మన దేశంలోనే ఎంచక్కా చూడొచ్చు. ఈ ముప్పు ఈరోజు కాకున్నా ఏదో ఒకరోజున మన దేశానికి తప్పదు.

అదే పాకిస్తాన్ లో సున్నీలు షియాల మధ్యన కొట్లాటలో జనం మిడతల్లాగా చంపబడుతున్నారు. ఇది పవిత్ర రంజాన్ మాసం కనుక ఏ విధ్వంసం జరిగినా ఏ దౌర్జన్యం జరిగినా దానిని పవిత్రంగానే భావించాలి. లేకుంటే మన మనస్సులే అపవిత్రాలని అన్నా మనం ఆశ్చర్యపోకూడదు. 

లక్నోలో శుక్రవారం ప్రార్ధనల అనంతరం జరిగిన అల్లర్లలో బుద్ధ విగ్రహం ధ్వంసం అయింది. ప్రార్ధనల అనంతరం 'దైవావేశం' లో మసీదునుంచి బయటకు వచ్చిన అల్లరి మూకలు చివరికి టూరిస్ట్ లనూ మీడియావారినీ కూడా వదిలిపెట్టకుండా దేహశుద్ధి చేసాయి. బహుశా వీరిద్దరిలో వారికి సైతాన్ కనిపించి ఉంటుంది. అందుకే అలా దేహశుద్ధి చేసి వదిలారు. కాని బుద్ధ విగ్రహం ఏం చేసింది పాపం? అందులో కూడా సైతాన్ కనిపిస్తే అది బయట ఎక్కడా లేదు, వారి మనస్సులలో ఉన్నట్లే లెక్క. ఇలాంటి వారిని ఏమీ చెయ్యకుండా వదిలేస్తుండబట్టే మన 'లా అండ్ ఆర్డర్' పరిస్తితి ఇలా ఉంది. బుజ్జగింపులకైనా ఒక హద్దుండాలి.

సౌత్ ఆఫ్రికాలో తమ హక్కుల కోసం డిమాండ్ చేసిన గని కార్మికుల్ని వరుసగా నిలబెట్టి పిట్టల్లా కాల్చేశారు.ప్రపంచ దేశాలు అడుగుతున్నా చేసినవారు నోరు మెదపడం లేదు.గని కార్మికులు శనికారకత్వాన్ని సూటిగా ప్రతిబింబిస్తారు.

ఆఫ్ఘనిస్తాన్ లో నాటో హేలికాప్టర్ ను తీవ్రవాదులు పేల్చేశారు. అందులో ఉన్న సైనికులు అందరూ పరలోక ప్రయాణం కట్టారు.

నార్త్ సిరియాలో బాంబు దాడులలో జనం మిడతల్లా  చస్తున్నారు.

ఇరాక్ లో తీవ్రవాదుల దాడులలో కారు బాంబు పేలుడులో కనీసం ఏభై మంది హరీమన్నారు. 

మన దేశంలో ఈశాన్య సంక్షోభం ఇంకా కొనసాగుతూనే ఉంది. పుకార్లతో జనం భయభ్రాంతులై తిరణాలలాగా అస్సాం కు వెళ్ళిపోతున్నారు.

కేరళలో కొత్తమంగళంలో లాండ్ స్లైడ్ జరిగి దాదాపు పది ఇళ్లను మొత్తం తుడిచి పెట్టేసింది. కనీసం  ఆరుగురు ఆ రాళ్ళూమట్టి ప్రవాహంలో ఇరుక్కుని భూసమాది అయ్యారు. ఫైర్ డిపార్ట్ మేంటూ, నేవీ బృందమూ సహాయక చర్యలలో ఉన్నారు.

ఫిలిప్పైన్స్ లో విమానం ఒకటి సముద్రంలో కూలిపోయింది. అందులో ఉన్న అందరూ జలసమాధి అయ్యారు.

ఇక రోడ్ ఏక్సిడెంట్లు, చిన్నచిన్న ప్రమాదాలూ లెక్కే లేదు. ఈ రెండురోజుల్లో లోకల్ గా రోడ్ ప్రమాదాలలో చాలామంది అక్కడక్కడా చనిపోయారు. కనుక వాటిగురించి వ్రాయడం లేదు. మనుషుల జీవితాలలో కూడా హటాత్ గా గందరగోళ సన్నివేశాలు తెరమీదకు వస్తున్నాయి.గాబరాను సృష్టిస్తున్నాయి. గమనించుకుంటే ఎవరికీ వారికే అర్ధమౌతాయి. 

ఈ ఘోరాలూ విధ్వంసాలూ చికాకులూ అన్నీ ఈ గ్రహస్తితి ప్రభావమే. శనికుజుల యుతి ఇంతటి ప్రమాదాలను సృష్టించగలదా? అని అనుమానించే వారు ఇప్పుడు ఒకసారి పునరాలోచించుకోవాలేమో? ఈ త్రెడ్ లో పాత పోస్ట్ లు ఒకసారి చదవండి ఈ గ్రహప్రభావం ఎలా ఉంటుందో మీకే అర్ధమౌతుంది.
read more " శనికుజయోగం - ఇంకొన్ని ఫలితాలు "

16, ఆగస్టు 2012, గురువారం

శనికుజుల కలయిక - జరుగుతున్న ప్రమాదాలు

నిన్న ఆగస్ట్ 15 తేదీన శని కుజులు తులా రాశి 0 డిగ్రీలలో చిత్తా నక్షత్రంలో ఖచ్చితమైన డిగ్రీ కన్జంక్షన్లోకి వచ్చారు. రేపు అమావాస్య. అంటే అమావాస్యకు మూడురోజుల సమీపంలోనే ఈ గ్రహయుతి జరిగింది. దీని ఫలితంగా ఏం జరిగిందో, ఏం జరుగుతున్నదో ఒక్కసారి చూద్దాం.

>>విలాస్ రావ్ దేశముఖ్ మరణించాడు. ప్రముఖుల మరణాన్ని ఇంతకు  ముందు దేవానంద్, రాజేష్ ఖన్నా ల గురించి వ్రాసిన పోస్ట్ లో సూచించాను. లివర్ వ్యాధితో బాధపడుతూ ట్రాన్స్ ప్లాంట్ చెయ్యడానికి లివర్ దొరక్క ఆయన చనిపోయాడు. గురువు కాలేయానికీ జీర్ణక్రియకూ సూచకుడనీ ప్రస్తుతం గోచారరీత్యా గురుని కేత్రుగ్రస్త స్తితివల్ల ఇది జరిగిందనీ గ్రహించాలి. గ్రహ ప్రభావం ప్రతికూలిస్తే ఎంత ధనవంతులైనా ఆ సమయానికి అందవలసిన సాయం దొరకదని గ్రహించాలి.

>>షాద్ నగర్ స్టీల్ యూనిట్లో  అగ్నిప్రమాదం జరిగింది. కరిగిన ఇనుము పేలి మనుషులమీద పడింది. ఇనుము శనికీ, పేలుడు కుజునికీ వీరిద్దరి కలయిక విస్ఫోటనానికీ సూచికలు. ప్రస్తుతం వీరిద్దరూ కుజనక్షత్రంలో ఉన్నారనీ అందువల్ల అగ్నిప్రమాదాలు జరుగుతాయనీ,  నవాంశలో కూడా శని తులారాశిలోనే ఉండి కుజునితో సమానబలంతో ఉన్నాడనీ గ్రహిస్తే విషయం బాగా అర్ధమౌతుంది.

>>ఈ రెండురోజుల్లో ఎన్నో అగ్నిప్రమాదాలు రోడ్ ఏక్సిడెంట్ లూ జరిగాయి. ఇంకో మూడు రోజులు జరుగుతూనే ఉంటాయి.

>>ఈశాన్య భారతంలో గొడవలు ఎక్కువయ్యాయి. బెంగుళూరు నుంచి వేలమంది కార్మికులు భయభ్రాంతులై అస్సాం, బెంగాల్, గౌహతీలకు పయనం కడుతున్నారు. ఈశాన్యదిక్కు గురువు అధీనంలో ఉందన్న విషయం గుర్తించాలి.

>>మంత్రి 'ధర్మాన' హటాత్తుగా సంకటస్తితిలో పడ్డాడు. ధర్మం అనేది గురుగ్రహం అధీనంలో ఉంటుంది. అంతేగాక గురువు ఉన్నత అధికారులకు సూచకుడు. ఇది ప్రస్తుత గురుకేతువుల సంయోగం ఫలితమే.  పేరులో ఉన్న ఈ సామ్యం వల్ల అలా జరుగదుగాని, ప్రస్తుత గ్రహస్తితికి సరిపోవడం మాత్రం విచిత్రంగా ఉన్నది.ఉన్నత స్తితిలో ఉన్న అధికారులు హటాత్తుగా పతనం కావడంగా దీనిని గ్రహించాలి.

>>రాజస్థాన్ లోని క్రిష్ణగంజ్ లో ఫుట్ బాల్ మాచ్ లో తలెత్తిన గొడవలో లాటీ చార్జీ, టియర్ గ్యాస్ ప్రయోగమూ జరిగి, అప్పటికీ ఉద్రేకాలు కంట్రోల్ కాక చివరికి  కర్ఫ్యూ విధించే పరిస్తితికి దారితీసింది. క్రీడలు కుజుని ఆధీనంలో ఉంటాయని గమనించాలి.

>>ఈశాన్యరాష్ట్రమైన మణిపూర్లో స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా వరుస  బాంబులు పేలి ప్రజలు గాయపడ్డారు.

>> మనుషుల మధ్యన మళ్లీ చిన్న విషయాలకే మనస్పర్ధలు గొడవలు అవుతున్నాయి. మాటా మాటా అనుకోవడం జరుగుతున్నది.ఆఫీసులలో ఇళ్లలో ప్రతి చోటా దీనిని గమనించవచ్చు. ఇదంతా ఈ గ్రహ ప్రభావమే. 

మనుషుల మీద గ్రహప్రభావం ఖచ్చితంగా ఉంటుంది అని ఈ సంఘటనలు మళ్లీ మళ్లీ నిరూపిస్తున్నాయి.అంతేగాక ప్రాచీనులు ఎంతో దూరదృష్టితో ఏర్పరచిన గ్రహ కారకత్వాలనూ ఈ సంఘటనలు మళ్లీ నిరూపిస్తున్నాయి.
read more " శనికుజుల కలయిక - జరుగుతున్న ప్రమాదాలు "

14, ఆగస్టు 2012, మంగళవారం

రాధా తత్త్వం

ప్రేమ అన్న పదాన్ని నిర్వచించమని ఎవరైనా అడిగితే  జవాబుగా "రాధ"  అన్న ఒకేఒక్క పదాన్ని మాత్రమే నేను చెబుతాను. ప్రేమకు దీనిని మించిన నిర్వచనం ప్రపంచంలోనే లేదు.ప్రేమంటేనే రాధ. రాధంటేనే ప్రేమ.అప్పటికీ ఇప్పటికీ ప్రపంచంలో ప్రేమ అంటే తెలిసిన ఒకేఒక్క స్త్రీమూర్తి రాధ.ఇంకెవ్వరికీ ప్రేమంటే తెలియదు.తెలుసని అనుకుంటారు భ్రమిస్తారు.అంతే.

లోకంలో ఉన్నవి  కామమూ స్వార్ధమూ మాత్రమే. ప్రేమనేది ఈలోకంలో లేనేలేదు.లోకులకెవ్వరికీ ప్రేమ అనేది  తెలియనే తెలియదు.తెలుసనుకుంటే అది పిచ్చిభ్రమ మాత్రమె.

కొంతమంది స్నేహాన్ని ప్రేమనుకుంటారు.కొందరు కోరికను ప్రేమనుకుంటారు. మరి కొంతమంది అభిమానాన్ని ప్రేమనుకుంటారు.ఇంకొందరు మోహాన్ని ప్రేమగా భ్రమిస్తారు.అవసరాన్ని ప్రేమనుకునేవారు ఎందఱో ఉంటారు. ఎక్కువమంది కామాన్ని ప్రేమగా భావించి మోసపోతారు.నిజానికి వీటన్నిటి వెనుకా ఉండేది మాత్రం స్వార్ధమే.

లోకంలో ఉన్న ఈ ప్రేమలన్నీ స్వార్ధంతో నిండినవే. బృహదారణ్యక ఉపనిషత్ లో యాజ్ఞవల్క్య మహర్షి ఇదేమాటను తన భార్య అయిన మైత్రేయితో చెబుతాడు.మైత్రేయి సామాన్యవనిత కాదు.ఆమె మహాపండితురాలు, బ్రహ్మవాదిని. ఆమెతో యాజ్ఞవల్క్యుడు ఈ సత్యాన్ని చెబుతాడు. 

"లోకంలో భర్తను ప్రేమించేది భర్తకోసం కాదు. ఆత్మ కోసమే. భార్యను ప్రేమించేది భార్యకోసం కాదు. ఆత్మకోసమె. సంతానాన్ని ప్రేమించేది సంతానంకోసం కాదు. ఆత్మ కోసమే." ఈ విధంగా ఇంకా చాలా సంభాషణ సాగుతుంది.ఈ సంభాషణ ద్వారా ఆయన ఆత్మతత్వాన్ని భార్యకు ఉపదేశిస్తాడు.ఈ సంభాషణకు లోతైన వేదాంతార్ధాలున్నాయి. 

వాటిని అలా ఉంచితే, సామాన్యార్ధంలో చూచినా కూడా 'ఎవరు దేనిని ప్రేమించినా తన సుఖం కోసమే ఆ పని చేస్తారు కాని ఎదుటివారి సుఖం కోసం కాదు.ఆ వ్యక్తైనా వస్తువైనా తనకు ఇచ్చే సుఖాన్ని బట్టి ఆ వ్యక్తి అన్నా వస్తువన్నా తాత్కాలికంగా ఇష్టం కలుగుతుంది.కనుక ప్రతి మనిషీ నిజానికి తన సుఖాన్నే తాను ప్రేమిస్తున్నాడు గాని ఇతరులను కాదు-అని తేలుతుంది. మనకు నచ్చని అనేక చేదునిజాలలో ఇదొక చేదునిజం. అందుకే అవసరం ఉన్నంతవరకే మనుషుల మధ్యన సోకాల్డ్ 'ప్రేమ' అనేది ఉంటుంది. అవసరం తీరిన తరువాత ఉన్నట్టుండి మాయం అవుతుంది.ఇది నిజమైన ప్రేమ కాదు.అసలు ఇది ప్రేమే కాదు.ఇది అవసరార్ధ ఏర్పాటు మాత్రమే.దీనిని మానవులు ప్రేమగా భ్రమిస్తారు.ఇది స్వార్ధమే కాని ప్రేమ కానేకాదు.

లోకంలో నడుస్తున్న సంసారాలు,కాపురాలు అన్నీ 'అవసరం' అన్నదానిమీదే నడుస్తున్నాయి గాని 'ప్రేమ' అనేదాని మీద ఆధారపడి కాదు.నా మాటను మీరు ఒప్పుకోకపోవచ్చు.కాని మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా సత్యం మారదు.

రాధ ప్రేమ ఇలాంటిది కాదు.స్వార్ధాన్ని దాటిన ప్రేమ ఆమె సొంతం.నిజానికి స్వార్ధాన్ని దాటినదే నిజమైన ప్రేమ అవుతుంది.తన ఆనందాన్ని ఆశించే ప్రేమ ఆమెది కాదు.ప్రియతముని ఆనందాన్ని మాత్రమే ఆశించిన ప్రేమ ఆమె సొంతం.తన ఆత్మనే అర్పించగలిగిన ప్రేమ ఆమె సొంతం.రాధయొక్క ప్రేమస్థాయిని మానవమాత్రులు ఎన్నటికీ అర్ధం చేసుకోలేరు.సంపూర్ణ స్వార్ధరహిత స్థితిని అందుకున్నవారే ఆ ప్రేమను కొద్దిగా అర్ధం చేసుకోగలరు. తనను తాను సంపూర్ణంగా అర్పించి తానే పూర్తిగా అదృశ్యం కాగలిగిన వారికే ఆ ప్రేమ అందుతుంది.దేవతలకి కూడా అందని ఈ స్థితి ఆమె సొంతం అంటే ఇక మామూలు మానవుల మాట చెప్పేదేముంది?ఎందుకంటే దేవతలు కూడా ఆత్మార్పణ చేసి శూన్యులుగా మారడానికి భయపడతారు.రాధ ఆ భయాన్ని కూడా అధిగమించింది.

అంతటి పరమోత్కృష్ట ప్రేమోన్మత్త స్థితి ఆమెది.అందుకే ఆ ప్రేమ ఆమెను రసరాణిని చేసింది.సర్వదేవతాశిరోమణిని చేసింది.సకలలోకసామ్రాజ్ఞిని చేసింది.మహత్తర ప్రేమస్వరూపిణిగా భక్తబృంద పెన్నిధిగా ఆమె ప్రతినిత్యం విరాజిల్లుతూ ఉన్నది.ఆమె తన ప్రేమతో దేవాధిదేవుడైన కృష్ణుని బందీని చేసింది.కృష్ణుడు నిరంతరమూ రాధానామాన్ని జపిస్తూ ఉంటాడని,రాధనే నిరంతరమూ ధ్యానిస్తూ ఉంటాడని కొన్ని పురాణాలు చెబుతాయి.అంతగా అతడు రాధాదాసుడయ్యాడు.యోగేశ్వరుడైన కృష్ణుడు రాధాదాసుడా? కృష్ణుడు నిరంతరమూ రాధను ధ్యానిస్తాడా?ఇదెలా సంభవం?ప్రేమతో సమస్తమూ సాధ్యమే.సమస్తమూ సంభవమే.ప్రేమకు కట్టుబడినట్లు భగవానుడు ఇక దేనికీ కట్టుబడడు.

రాధ, వయసులో కృష్ణుని కంటే పెద్దది అని పురాణాలు చెబుతున్నాయి. ఆమె కృష్ణునికి వరసకు మేనత్త అవుతుంది అనికూడా కొన్ని చోట్ల వ్రాయబడి ఉన్నది.ఆమెకు భర్తకూడా ఉన్నాడని కొన్ని పురాణాలు అంటాయి.కాని ఈ తేడాలన్నీ వారి ప్రేమకు ఏమాత్రం అడ్డురాలేదు.శ్రీకృష్ణుని మనోహరరూపాన్ని చూచి అందరూ ముగ్దులవుతారు.ఆ దివ్యమంగళ ప్రేమమూర్తిని చూచి మైమరచని ప్రాణి ఎక్కడుంటుంది?కృష్ణుని సమ్మోహనకరమైన చిరునవ్వులోని మహత్యానికి దాసోహం అనని జీవి  ఉండటానికి వీల్లేదు. అలాగే బృందావన గోపికలూ అయ్యారు.ఆయన మురళీగానాన్ని విని వారందరూ మైమరిచారు.

బృందావనంలో,యమునాతీరంలో,వెన్నెలరాత్రులలో,మదనమోహనుని మృదుమధుర మురళీరవాన్ని విని పులకరించి తమతమ కుటుంబాలనూ,పిల్లలనూ కుటుంబసభ్యులనూ,చేస్తున్న పనులనూ ఎక్కడివారిని అక్కడ వదలి మంత్రముగ్దలలాగా ఆ మురళీనాదం వినవస్తున్న వైపు గోపికలందరూ పరుగులెత్తారు.ఒంటిమీద దుస్తులు ఉన్నాయో లేవో వారికి ధ్యాస లేదు.కాళ్ళకు ముళ్ళు గుచ్సుకుంటున్న సంగతి కూడా వారికి తెలీదు.దారిలో పాములను తొక్కుకుంటూ వెళుతున్నారో లేదో స్పృహే లేదు. తమతమ కుటుంబాలు ఉన్నాయో,ఏమయ్యాయో వారికి చింతే లేదు. వారందరూ జీవులు ఆయన జీవేశ్వరుడు.ఇనుపముక్కలు అయస్కాతం వైపు ఆకర్షింపబడినట్లు వారి హృదయాలు కృష్ణుని వైపు లాగబడ్డాయి. 

అక్కడ లతానికుంజం మధ్యలో పూర్ణచంద్రుని లాగా చిరునవ్వుమోముతో ప్రకాశిస్తున్న కృష్ణుని చూచి వారు తమను తాము పూర్తిగా మరిచారు. దేహభ్రాంతికి అతీతులయ్యారు.కృష్ణుని దివ్యప్రేమలో వారి వ్యక్తిత్వాలు కరిగి మాయమయ్యాయి.వారికి మాయామోహాలు పటాపంచలయ్యాయి. దేహభ్రాంతి వారిని ఒక్కసారిగా ఒదిలిపెట్ట్టింది.కృష్ణుని దివ్యమంగళరూపమే వారికి కనిపించసాగింది.ప్రపంచాన్నే వారు మరచిపోయారు. మహాయోగులకు కూడా అందనట్టి ప్రేమపూర్వక భావోన్మత్తస్థితి వారికి కరతలామలకమైంది. కృష్ణుని అలా చూస్తూ ఆ మహాప్రేమలో మైమరచారు.ఆ ఆనందస్థితిలో ప్రపంచాన్నే మరిచిపోయారు.దివ్యమైన సమాధిస్థితిలో కరిగిపోయారు. ప్రేమయోగంలో తరించారు.

కాని వారుకూడా తమతమ ఆనందం కోసమే కృష్ణుని ప్రేమించారు.కృష్ణుని సాన్నిధ్యం ఇచ్చేటటువంటి దివ్యమైన ఆనందస్థితిని వారు ఆశించారు.ఆ ఆనందాన్ని ఆస్వాదిస్తూ ఎల్లప్పుడూ సమాధిస్థితిలో ఉండాలని వారు కోరుకున్నారు.అదే మిగిలిన గోపికలకూ రాధకూ ప్రధానమైన భేదం.రాధ ఈ స్థాయిని కూడా అధిగమించింది.రాధ తన ఆనందాన్ని ఆశించలేదు.ఆమె కృష్ణుని ఆనందాన్ని ఆశించింది.కృష్ణుడు ఆనందంగా ఉండటం కోసం తాను ఏమి చెయ్యగలదు?అనే ఆమె ఎప్పుడూ తపించేది.తన ప్రియతముని ఆనందం కోసం తన జీవితాన్ని తన సర్వస్వాన్ని ఆమె తృణప్రాయంగా వదిలిపెట్టింది.తన ఆత్మనే అర్పించి తానొక అనాధగా మిగిలింది.లోకం అర్ధం చేసుకోలేని అతీతస్తితి గోపికలది అయితే, గోపికలను మించిన స్థితి రాధది. దైవానందం కోసం లోకాన్ని లెక్కచెయ్యని స్తితి గోపికలది అయితే,ఆ ఆనందాన్ని కూడా తృణీకరించి పూర్తిగా దైవానికి అర్పణ అయిన స్థితి రాధది.

తన స్థితిని చూచి లోకులు ఏమనుకుంటారో అన్న భయం ఆమెనుంచి దూరమైంది.ఈ బంధాన్ని సమాజం హర్షించదేమో అన్న శంక ఆమె మదిలో లేశమాత్రం కూడా తలెత్తలేదు.తన ప్రియతముని ముందు సమస్త ప్రపంచమూ ఆమెకు తృణప్రాయంగా కనిపించింది.రాధ మనస్సులో కృష్ణుడు తప్ప ఇతర చింత లేనేలేదు. పగలూ రాత్రీ తన ప్రియతముని ధ్యానంలో ఆమె మునిగి ఉండేది. తన వ్యక్తిత్వం ఆ క్రమంలో ఎలా అదృశ్యం అయిందో ఆమెకే తెలీదు.లోకులకు అత్యంత ప్రియమైన దేహంకూడా ఆమె స్మృతిలోనుంచి తప్పుకుంది.ఎల్లప్పుడూ కృష్ణుని ధ్యాసతో ఆమె పరవశించేది."తాను రాధను"- అన్న స్పృహకూడా ఆమెను వదలి వెళ్ళిపోయింది.

ఈ ప్రేమధ్యానంలో పడి సమస్త లోకబంధాలకూ ఆమె అతిసులువుగా అతి సహజంగా అతీతురాలైంది.ప్రేమమహిమ వల్ల విషయవాంఛలు ఆమెలో అదృశ్యమయ్యాయి.తన శరీరాన్నే తాను మరచింది.తన మనస్సునే అధిగమించింది.తన ఆత్మనే కృష్ణునికి నైవేద్యం పెట్టింది.కృష్ణప్రేమలో మునిగిపోయింది.తను వేరు కృష్ణుడు వేరు అన్న భావనకు అతీతురాలైంది. తానే కృష్ణునిగా మారింది.అంతగా తన వ్యక్తిత్వాన్ని ఆమె కృష్ణునిలో లయం చెయ్యగలిగింది.ఆమె ప్రేమకు యోగేశ్వరుడైన కృష్ణుడు కూడా  చలించాడు. మహర్షుల కఠోరతపస్సుకు ఏ మాత్రమూ చలించని దేవదేవుడు విచలితుడైనాడు.రాధ ప్రేమలో కృష్ణుడు పిచ్చివాడయ్యాడు.ఆమెకు పరిపూర్ణ బందీ అయిపోయాడు.జీవితాంతం కఠోరమైన నియమనిష్టలు పాటిస్తూ సాధన చేసే యోగులకు కూడా దక్కని సంపద ఆమె సొంతం అయింది.భగవంతుడే ఆమెకు దాసానుదాసుడయ్యాడు.కృష్ణుడు రాధకు ఎంతగా దాసుడయ్యాడంటే,ఆమె అనుజ్ఞ లేనిదే ఆయన ఎవరికీ దర్శనం ఇవ్వడు, ఎవరితోనూ మాట్లాడడు.అంతగా ఆయన రాధకు బందీ అయిపోయాడు. తన నిష్కల్మషమైన పరిపూర్ణమైన ప్రేమతో రాధ భగవంతుని తనవాడిగా చేసుకుంది.రాధ  ప్రేమ అంత గొప్పది.అది మానవుల ఊహకు అందనిది. దేవతలకే దుర్లభమైన స్తితి రాధ సొంతం అయ్యింది.


రాధాకృష్ణులు యమునా తీరంలో విహరించని చోటు లేదు.ఒకరి సాన్నిధ్యంలో ఒకరు కరిగిపోతూ ఊసులాడుకోని పొదరిల్లు లేదు.ఒకరి కళ్ళలోకి ఒకరు చూస్తూ ప్రపంచాన్ని మరువని రోజులేదు.బృందావనం వారి ప్రేమకు మూగసాక్షిగా మిగిలింది.ప్రకృతి వారి ప్రేమకు పరవశించింది.వారి పాదాల స్పర్శకు పచ్చిక పులకరించేది. యమునానది పరవళ్ళు తోక్కేది.అక్కడ నిత్యమూ వసంత ఋతువే. నిత్యమూ కోకిలల గానాలు అక్కడ ప్రతిధ్వనించేవి. అక్కడ చెట్లు ఎప్పుడూ చిగురిస్తూనే ఉండేవి.మధుర సువాసనలు ఆ ప్రాంతాన్ని ఆవరించి ఉండేవి.నెమళ్ళు ఆనందనాట్యం చేస్తూనే ఉండేవి. భూమిమీద స్వర్గం దిగి వచ్చినట్లు ఉండేది.దేవతలు ఎల్లప్పుడూ వారి సూక్ష్మరూపాలలో అక్కడ కొలువై రాసలీలను వీక్షిస్తూ ఉండేవారు.అదొక ఆనంద ధామం. అదొక అంతులేని నిత్యోత్సవం.

కానీ,ఎంత గొప్ప ఆనందమైనా ఒకనాటికి సమాప్తంకాక తప్పదుకదా.అలాగే ఒకనాడు బృందావనలీల అయిపొయింది.కృష్ణుడు లోకంలో చెయ్యవలసిన పనులు చాలా మిగిలి ఉన్నాయి.వాటిని పూర్తి చెయ్యడం కోసం ఆయన అక్రూరునితో కలిసి బయలుదేరాడు.ఆ పోవడం పోవడం మళ్ళీ గోకులానికి రానేలేదు.మహారాజు అయ్యాడు.రాజ్యాలు నడిపాడు. యుద్ధాలు చేశాడు. చేయించాడు.జీవితమంతా ఎన్నెన్నో పనులలో తలమునకలుగా ఉన్నాడు. ఎనిమిదిమంది రాజకుమార్తెలను పెళ్లి చేసుకున్నాడు.రాజభవనాలలో నివసించాడు. విలాసజీవితం గడిపాడు.

తన చిన్ననాటి ప్రేయసి రాధను మరచిపోయాడా?బృందావన గోపికల అమాయకమైన, నిష్కల్మషమైన ప్రేమను విస్మరించాడా?మహారాజు అయిన తర్వాత విలాసినుల వగలకు లోబడి పల్లెపడుచుల స్వచ్చమైన ప్రేమకు దూరమయ్యాడా?మనకు తెలియదు.ఆయన అంతరంగం ఆయనకే తెలియాలి.అగాధమైన ఆయన అంతరంగాన్ని ఎవరు శోధించగలరు? మాయా మానుష విగ్రహుని మనసు లోతుపాతులను ఎవరు గ్రహించగలరు?

కాని అమాయకులైన గోపికలు కృష్ణుని మరువలేదు.ఆయన ప్రేమే వారిని నడిపించింది. ఆయన ధ్యానమే వారికి ఊపిరైంది.వారి నాయిక రాధ,కృష్ణుని అసలే మరువలేదు.ఆమె జీవితమంతా కృష్ణుని కోసం ఎదురుచూచింది. కృష్ణప్రేమలో నిరంతరం రగిలిపోయింది.మౌనవేదనలో తన జీవితాన్నే విరహాగ్నిలో వ్రేల్చింది.నిరంతర ధ్యాననిమగ్నతలో,ప్రేమవిహ్వలతలో తపించింది.

ఆ తపనే మహా తపస్సైంది.ఆ నిరంతర తపోఫలంగా లోకమంతా ఆమెకు కృష్ణస్వరూపంగా దర్శనమిచ్చింది.నెమలిపించం రంగు ఆమెకు తన ప్రియతముని గుర్తుకు తెచ్చింది.నెమలిని దగ్గరకు తీసుకుని దాని మెడను ముద్దాడింది.నీలమేఘం ఆమెకు కృష్ణుని దర్శనాన్ని ఇచ్చింది. తనను తాను మరచి ఆ మేఘం వెంట ఆమె పరిగెత్తింది.నీలాకాశం ఆమెకు శ్యామసుందరుని ఎదురుగా నిలిపింది.చేతులు చాచి ఆకాశాన్ని ఆమె కౌగిలించుకుంది.ప్రకృతిలో ప్రియతముని చూస్తూ మౌనంగా కన్నీరు కార్చింది.లోకులకు రాధ పిచ్చిదానిగా తోచింది. ఆమె చేష్టలు పిచ్చిచేష్టలుగా వారికి తోచాయి. కాని ఆమెకు ఏదీ పట్టదు. దేహభ్రాంతే లేని ఆమెకు లోకభ్రాంతి మాత్రం ఎక్కడిది?లోకులను చూచి ఆమె నవ్వింది.లోకులే ఆమెకు పిచ్చివారిలా తోచారు.ఇంద్రియమోహాలలో పడి ప్రేమమూర్తి అయిన భగవంతునికి దూరం అవుతున్న వారిని చూచి ఆమె పిచ్చిదానిలా నవ్వింది.

నిరంతరం ఆమెకు కన్నీళ్లు ధారలు కట్టేవి. సజలనేత్రాలతో ఆమె ఎప్పుడూ పొంగి పొర్లుతున్న పవిత్ర గంగానదిలా తోచేది. విరహవేదనతో ఆమెకు ఒళ్ళు మంటలు పుట్టేది.ఆ వేడికి ఆమెను తాకిన చెలికత్తెల దేహాలు కాగిపోయేవి. ఆమె చెట్టు కింద కూచుంటే ఆ చెట్టు ఆకులు మాడిపోయేవి. ఆమె కూచున్న నేల కాలి నల్లగా అయేది.అంతటి విరహతాపం ఆమెలో తీవ్రయోగాగ్నిని సృష్టించింది.నీళ్ళతో కలిపి ఆమెకు అద్దిన చందనం వెంటనే ఎండిపోయి పొడిపొడిగా రాలిపోయేది.నిరంతరమూ ప్రపంచాన్ని మరచి ఆమె కృష్ణధ్యానంలో తన్మయురాలయ్యేది. తన శరీరస్పృహ ఎప్పుడో కాని ఆమెకు ఉండేది కాదు.మహత్తరమైన సమాధిస్తితులు ఆమెకు సునాయాసంగా కలిగేవి.దివ్యమైన సువర్ణకాంతి ఆమె దేహంనుండి వెలువడి చుట్టుపక్కల ఆవరించేది.దివ్య సుగంధపరిమళాలు ఆమెను ఆవరించి ఉండేవి.ఆమె ముఖంలోని దేవతాకళను చూచినవారు సంభ్రమానికి గురయ్యేవారు. అప్రయత్నంగా చేతులెత్తి నమస్కరించేవారు.

ఈ విధమైన నిరంతరధ్యానంతో రాధ తానే కృష్ణునిగా మారింది. తన వ్యక్తిత్వం కరిగిపోయింది. తాను రాధను అన్న విషయం పూర్తిగా మరచింది.తానే కృష్ణుణ్ణి అన్న అనుభవాన్ని పొందింది.

ఇదిలా ఉండగా ఒకరోజున ద్వారకలో అష్టభార్యలకూ కృష్ణుని జాడ కనిపించలేదు. ఉన్నట్టుండి ఆయన మాయమై ఎక్కడికి పోయాడో తెలియడం లేదు.అంతటా వెదికారు. ఎక్కడా ఆయన కనిపించడు. వారికి తామే కృష్ణుని అంతరంగ సఖులమని గర్వం ఉండేది. తాము ఇంతగా ప్రేమించే కృష్ణుడు తమను వదిలి ఎక్కడికి పోయాడా అని వారికి అనుమానమూ భయమూ కోపమూ కలిగాయి. అప్పుడు వారి బాధను చూడలేక, మహోన్నతభక్తుడైన నారదమహర్షి కరుణతో వారికి దర్శనమిచ్చి బృందావనం వెళ్లి చూడమని సలహా చెప్పాడు. 

ఆయన సూచన మేరకు అక్కడకు వెళ్ళిన వారికి ఒక మనోహరమైన దృశ్యం కనిపించింది.

పున్నమివెన్నెలలో,చల్లని యమునాతీరంలో, మనోహరమైన పూలపొదరిండ్ల మధ్యన పుష్పసుగంధభరిత మనోహరనికుంజమధ్యంలో తన సఖుల మధ్యన రాధాసమేతుడై మృదుమధుర మురళీనాదాన్ని వెదజల్లుతూ తేజోమూర్తిగా వెలుగుతున్న కృష్ణుడు దర్శనమిచ్చాడు. ఆ ప్రదేశమంతా ఆనందప్రవాహం ముంచెత్తుతూ ఉన్నది. అక్కడ చెట్లూ ఆకులూ పూలూ అన్నీ ఏదో కాంతితో మెరిసిపోతున్నాయి. గోపికలూ,రాధా,కృష్ణుడూ అప్పటివరకూ వారికి తెలిసిన దేహధారులైన మనుషులలాగా కనిపించడం లేదు. దేవతాస్వరూపాల వలె వెలుగుతూ ఉన్నారు. ఆ మహత్తర దివ్యదర్శనాన్ని చూచి నోట మాటరాక అప్రతిభులైన వారినిచూచి చిరునవ్వు చిందిస్తూ నల్లనయ్య ఇలా అన్నాడు.

'ప్రియతములారా. మీరందరూ నన్ను ప్రేమించారు.నిజమే!!కాని ప్రేమలోని ఆనందాన్ని కోరి నన్ను మీరందరూ ప్రేమించారు. నాకోసం నన్ను మీరు ప్రేమించలేదు. నా సాన్నిధ్యంలో ఆనందంకోసం మీరు నన్ను కోరుకున్నారు. మీకు నేను ముఖ్యమే. కాదనను.కాని అంతకంటే మీ ఆనందమే మీకు ముఖ్యం.

రాధ అలాకాక నన్ను నన్నుగా ప్రేమించింది.తన ఆనందం కోసం నన్ను ప్రేమించలేదు.నా సంతోషాన్ని నిత్యమూ ఆశించింది.దానికోసం తన వ్యక్తిత్వాన్ని నాకు సమర్పించి తానొక శూన్యంగా మిగిలింది. తానే అదృశ్యమై తన ఆత్మను నాకు పూర్ణంగా అర్పించింది. తానే నేనుగా మారింది. అందుకే ఆమె ప్రేమ మీ అందరి ప్రేమకంటే అత్యున్నతమైనది. నేను ఆమె దాసుడను. ఇటువంటి  ప్రేమను మీరూ కలిగి ఉన్నప్పుడు మాత్రమె నేను మీవాడిని అవుతాను. నేను రాధను వదలి రాలేను. ఆమె ప్రేమకు నేను బందీని. కనుక మీకు నేను కావాలంటే రాధను ప్రార్ధించండి. ఆమె ఒప్పుకుంటే నేను మీతో వస్తాను. లేకపోతే రాలేను.మీరందరూ నా భార్యలు మాత్రమే కాని రాధ నాకు అత్యంత ప్రియతమురాలు.ఆమె నా ప్రేయసి.నా హృదయంలో ఆమె స్థానం చాలా ఉన్నతమైనది.'

అందరూ ఆయన మాటలు విన్నారు. రాధ పొందిన ప్రేమను అందుకోవాలంటే, రాధ చేరుకున్న స్థితిని పొందాలంటే ఈజన్మలో తమవల్ల కాదని వారికి అర్ధమైంది.అప్పుడు వారంతా ప్రేమమయి రాధకు ప్రణమిల్లి 'ఓ మనోజ్ఞా, అద్భుతమైన నీ ప్రేమతో భగవంతుడినే నీ ప్రేమికునిగా చేసుకున్నావు. ఎవరికోసం లోకం అంతా పరితపిస్తున్నదో ఆ దేవదేవుడు నిన్ను వదలి ఎటూ పోలేనంటున్నాడు. భార్యలమైన మాతో రానంటున్నాడు. రాజభవనాలను, అప్సరసల వంటి భార్యలను వదలి, ఈ నదీతీరంలో ఈ చెట్లమధ్యన నీతోనే ఉంటానని అంటున్నాడు. నీ ప్రేమ ఎంత గొప్పది? కనీసం దానిలో ఒక్క కణం మాకు దక్కితే చాలుకదా మా జన్మలు ధన్యములు అవడానికి? తల్లీ. నీ స్థాయిని మేము ఎన్నటికీ అందుకోలేము.దయుంచి కృష్ణుని మాతో పంపించు' అని ప్రార్ధించారు.

దానికి రాధాదేవి చిరునవ్వుతో 'సరే అలాగే కానివ్వండి.కృష్ణుని మీరు తీసుకువెళ్ళండి. అతను మీతో తప్పక వస్తాడు. కాని అతను ఇక్కడకూడా ఉంటాడు. అంతే కాదు ఎప్పటికీ ఇక్కడే ఉంటాడు. నాతోనే నాలోనే నిత్యమూ నివసిస్తాడు.యోగేశ్వరుడూ సర్వేశ్వరుడూ అయిన కృష్ణునికి అది అసాధ్యం కాదు. ఎందుకంటే నిజానికి కృష్ణుడు నన్ను వదలి ఉండలేడు. నేనూ అతన్ని వదలి ఉండలేను. అతనూ నేనూ వేర్వేరు కాదు. మేమిద్దరమూ ఒక్కరమే. కాని లోకలీల కోసం మీతో వస్తాడు. ఇది మీకు అర్ధంకాని దివ్యలీల. మహామహులైన యోగులకు కూడా ప్రేమయొక్క రుచి తెలియనిదే ఈ లీల అర్ధం కాదు.' అని కృష్ణుని వైపు చూచి మనోహరమైన చిరునవ్వు నవ్వింది. అప్పుడు కృష్ణుడు మారు మాట్లాడకుండా వారితో కలిసి ద్వారకకు పయనమయ్యాడు.

వారందరూ కలిసి కనుచూపు మేరకు వెళ్లి వెనుకకు తిరిగి చూడగా, అంతకు ముందు వారు చూచిన రీతిలోనే, మళ్ళీ గోపికలు రాధతో కృష్ణుడు వారికి యమునాతీరంలో యధావిధిగా రాసలీలలో దర్శనం ఇచ్చాడు.పక్కకు తిరిగిచూడగా కృష్ణుడు నవ్వుతూ మళ్ళీ వారితోనే ఉన్నాడు. అప్పుడు వారికి సత్యమేమిటో అర్ధమౌతుంది.

బృందావన రాసలీల నిత్యమూ సాగుతూనే ఉంటుంది. అక్కడ మహత్తరమైన ప్రేమప్రవాహం నిత్యం ప్రవహిస్తూనే ఉంటుంది. లోకవాసనలు అందుకోలేని స్వచ్చమైన ప్రేమమూర్తులుగా రాదాకృష్ణులు అక్కడ ఎప్పుడూ విరాజిల్లుతూనే ఉంటారు. రాసలీల ఆ దివ్యభూమిలో నిత్యమూ జరుగుతూనే ఉంటుంది.ఇది ఇప్పటికీ ఉంది.చూడగలిగిన వారికి కనిపిస్తుంది.ఆస్వాదించే శక్తి ఉంటే అందుబాటులోకి వస్తుంది.

నిజానికి కృష్ణుడు బృందావనాన్ని వదిలి ఎక్కడికీ పోలేదు. అతని ఛాయ మాత్రమే గోపికలను వదిలి వెళ్లి లోకలీలను నడిపింది. ప్రేమమూర్తి అయిన కృష్ణుడు వారిని వదిలి ఎక్కడికి పోగలడు? అతను వారి ప్రేమకు కట్టుబడ్డాడు. నిత్యమూ రాసలీలలో అతను అక్కడే ఉంటాడు. వారి ప్రేమ కాలానికి అతీతంగా అలా వెలుగుతూనే ఉంటుంది.   

అట్టి ప్రేమను పొందగలిగిన జీవితాలే నిజమైన జీవితాలు. ఆ ప్రేమ లేశమాత్రం తాకిన హృదయాలే ధన్యములు. రాధానుగ్రహం అనే ప్రేమసముద్రంలో ఒక బిందువు తాగితే చాలు మనిషి దేవతగా మారుతాడు. అతని వంశం మొత్తం ధన్యం అవుతుంది. అతని పూర్వీకులు అందరూ ఉత్తమగతిని పొందుతారు. మహోన్నతమైన ప్రేమతత్వంలో తనను తానే మరచి దివ్యప్రేమలో ఓలలాడుతూ అతడు ఉండిపోతాడు.యోగులకూ తపస్వులకూ అందని మహత్తర దివ్యభూమిక  అతనికి అందుతుంది. అతను పిలిస్తే భగవంతుడు పలుకుతాడు. ఎదురుగా కనిపిస్తాడు. మాట్లాడతాడు. 

ఆ మహత్తరమైన ప్రేమముందు లోకం తుచ్చంగా కనిపించదూ? ఈ ప్రేమ ముందు  స్వార్ధపూరిత జీవితాలు అల్పాతి అల్పములుగా అనిపించవూ? అటువంటి ప్రేమను పొందని ఈ జన్మలెందుకు?క్రిమికీటకాలుగా బతికి చివరికి మట్టిలో కలిసే ఈ జీవితాలేందుకు?ప్రేమను ఆస్వాదించని మనిషి జన్మ ఎందుకు?

నిత్యానందసీమలో ప్రియతముని మోమును వీక్షిస్తూ కాలాన్ని మరచి కరిగిపోని ఈ భ్రాంతిమయ బానిస బ్రతుకులెందుకు?

తనను మరచి తన ప్రియతముని ధ్యానంలో కరిగి పోవడమే రాధాతత్త్వం. తన వ్యక్తిత్వాన్ని కరిగించి తాను తన ప్రియునిగా మారడమే రాధాతత్త్వం. తన ఆనందాన్ని కాక ప్రియుని ఆనందాన్ని ఆశించడమే రాదాతత్వం. సంపూర్ణ ఆత్మార్పణే ఈ సాధనారహస్యం.ఆ మహోన్నత అర్పణలోనే దైవాన్ని కదిలించగల కరిగించగల మహత్తరమైన శక్తి ఉన్నది.ఆ ప్రేమకే దైవం కట్టుబడుతుంది. దీనికి తక్కువైన ఇతరములైన ఏ సాధనలకూ దేవదేవుడు లొంగడు.

అందుకే రాధాతత్వం సర్వోత్తమం. రసరమ్యం. మహత్తర ప్రేమనిలయ రాధ. దేవదేవుడైన కృష్ణుడు ఆమె హృదయంలో నిత్యమూ వెలుగుతూ ఉంటాడు. అందుకే సమస్త దేవతలూ రాధానుగ్రహం కోసం తపిస్తూ ఆమెను ప్రార్ధిస్తూ ఉంటారు.ఆమె అనుగ్రహం లేనిదే ఎంతటి వారైనా ప్రేమమూర్తి అయిన కృష్ణదర్శనం పొందలేరు.ప్రేమను అందుకోలేని వారు జీవన సాఫల్యతను పొందలేరు.దానికి రాధానుగ్రహం తప్పనిసరి. ఎందుకంటే ఒక్క రాధ మాత్రమె తన సంపూర్ణ ఆత్మార్పణతో కృష్ణుని చేరుకోగలదు. దైవాన్ని చేరడానికి ఇది తప్ప వేరే దారి లేదు.

శ్రీరామకృష్ణులకు కూడా,మొదటగా రాధాదేవి దర్శనం అయిన తర్వాతనే కృష్ణదర్శనం కలిగింది.రాధాదేవి ఆయన ఎదుట ప్రత్యక్షమై ఆయన శరీరంలో లీనమైంది.తత్ఫలితంగా రాధాదేవి పొందిన ప్రేమసమాధిని ఆయన రుచి చూడగలిగారు.ఆ తర్వాతనే ఆయనకు కృష్ణ సాక్షాత్కారం కలిగింది.ఆ కృష్ణుడు కూడా ఆయనలోనే లీనమయ్యాడు.ఆవిధంగా రాధాకృష్ణులు ఆయనలోనే ఉన్నారు.అందుకే ఆయన ముఖం ఎప్పుడూ అంత ఆనందంతో వెలుగుతూ ఉండేది.

రాధానుగ్రహమే కృష్ణదర్శనానికి దారి.రాధాదేవి పొందిన స్థితిని పొందనిదే కృష్ణుడు కనికరించడు.కనిపించడు.రాధాదేవి కరుణించి అనుజ్ఞ ఇస్తేనే ఆయన మనకు కనిపిస్తాడు.రాధాదేవిని దాటుకునే మనం కృష్ణుని చేరుకోవలసి ఉంటుంది.అంటే,ప్రేమోన్మత్త పూరితమైన ఆత్మార్పణమే కృష్ణ దర్శనానికి దారి.ఆ స్థితే రాధ.

ఇదే రాధాతత్త్వం.
read more " రాధా తత్త్వం "