“అసమర్ధుని వద్ద ధనము, సుఖము, కీర్తి, ధర్మము ఏవీ నిలచి ఉండవు"

30, జూన్ 2018, శనివారం

కుండలినీ ప్రేరేపణ ఎలా చెయ్యాలి?

నాకు చిరకాల మిత్రుడొకాయనున్నాడు. తనకి కూడా నేను వ్రాసిన పుస్తకాలు చదవమని ఇస్తూ ఉంటాను. కానీ వాటిని తను చదవడు. ఊరకే పక్కన పెడుతూ ఉంటాడు. తనకి నేనంటే నమ్మకం తక్కువ. ఒకరిని రోజూ చూస్తున్నపుడు అతనిలోని ప్రత్యేకతలు మనకు కన్పించవు. అతనంటే మనకు నమ్మకం కలగదు. చివరకు దేవుడైనా అంతే.

ప్రముఖ దేవాలయాలలో ఉండే పూజారులలో సరిగ్గా ఇదే జరుగుతుంది. దూరం నుంచి వచ్చే ప్రజలకు ఆ దేవుడు గొప్ప కావచ్చు. ఒక్క క్షణం ఆయన ఎదురుగా నిలబడితే చాలని వారు ఎంతో కష్టపడి ఎక్కడనుంచో వచ్చి దర్శనం చేసుకుంటూ ఉంటారు. కానీ అక్కడే నిత్యం ఉండే పూజారులకు మాత్రం ఆ దేవుడు ఒక విగ్రహం మాత్రమే. వారి దృష్టి డబ్బుమీద ఉంటుంది, భక్తుల స్టేటస్ మీద ఉంటుందిగాని ఆ దేవుని మీద ఉండదు. అందుకే ఆ దేవాలయాలలో రకరకాల రాజకీయాలు తలెత్తుతూ ఉంటాయి. నిజంగా దేవుని సమక్షంలో మనం ఉన్నామని స్పృహ వారికుంటే ఆ విభేదాలు గొడవలు ఎలా వస్తాయసలు? నేను చెప్పేది నిజం అనడానికి మన తిరుమలే ఒక క్లాసిక్ ఉదాహరణ.

పెద్దపెద్ద స్వామీజీల శిష్యులలో కూడా ఇదే జరుగుతుంది. వారు రోజూ ఆయన్ను చూస్తూ ఉంటారు గనుక ఆయన వారికి లోకువ అవుతాడు. చులకన అవుతాడు. ఎప్పుడో ఒకసారి కాసేపు వచ్చి పోయేవారికి ఆయనంటే ఏదో త్రిల్ గా ఉంటుంది గాని రోజూ చూసేవారికి ఉండదు. ఎప్పుడో వచ్చి చూచేవాళ్ళు కూడా ఒక వారం అక్కడే ఉంటే అప్పుడు వాళ్ళుకూడా చప్పబడి పోతారు. అప్పుడు ఆయనంటే వారికున్న మునుపటి గౌరవం పోతుంది. ఇదంతా మనసు చేసే మాయ. ఈ మాయలో చిక్కుకుంటే మోసపోవడమే గాని ఏమీ దక్కదు. ఈ మాయను దాటిన వారే మనిషిలోని మనిషిని చూడగలుగుతారు. మిగిలినవాళ్ళంతా బయట కనిపించేదాన్నే చూస్తారు. మోసపోతారు. 

అలాగే నా మిత్రుడికి కూడా నేను చెప్పేవాటి మీద పెద్దగా నమ్మకం లేదు. ఆ సంగతి నాకూ తెలుసు. అందుకే నేనూ తనతో సరదామాటలే మాట్లాడుతూ ఉంటానుగాని ఆధ్యాత్మిక విషయాలు మాట్లాడను. ఇదిలా ఉండగా ఉన్నట్టుండి ఈ మధ్యనే మాటల సందర్భంలో ఇలా అడిగాడు.

'నేను కుండలినిని ప్రేరేపించాలని అనుకుంటున్నాను. చెయ్యమంటావా?'

'దానిని ప్రేరేపించడం అనరు. జాగృతి అంటారు.' అన్నాను నేను నవ్వుకుంటూ.

'నాకీ మాటే బాగుంది.' అన్నాడు.

'పోనీ అలాగే అనుకో. ఉన్నట్టుండి కుండలిని మీదకు పోయిందేంటి నీ మనసు?' అడిగాను.

'ఎన్ని పూజలు చేసినా, ఎన్ని స్తోత్రాలు చదివినా, ఎన్ని గుళ్ళకు వెళ్ళినా చివరకు కుండలినిని ప్రేరేపించకపోతే ఏమీ ఉపయోగం లేదని పుస్తకాలలో చదివాను' అన్నాడు.

'అది నిజమే' అన్నాను.

'నీకు తెలుసా దానిని ఎలా ప్రేరేపించాలో?' అన్నాడు.

'తెలీదు. అది తెలిస్తే నేనిలా ఎందుకుంటాను. అది చాలా కష్టమైన పనని మాత్రం తెలుసు. దానిని మనలో మనం చెయ్యడమే చాలా కష్టం. ఇక ఇతరులలో దానిని చెయ్యాలంటే ఎవరో శ్రీరామకృష్ణుల వంటి అవతారపురుషుల వల్ల అవుతుంది గాని మామూలు మనుషుల వల్ల కాదు.' అన్నాను.

'మరి చాలామంది స్వామీజీలు గురువులు దానిని చాలా తేలికగా చేస్తామని చెబుతున్నారు కదా. ఇంటర్ నెట్లో అన్నీ అవే.' అన్నాడు.

'అవన్నీ నమ్మకు. అదంతా బోగస్. నేను నలభై ఏళ్ళ నుంచీ చూస్తున్నాను. తన కుండలినిని నిజంగా నిద్రలేపిన స్వామీజీ గాని, గురువుగాని ఇంతవరకూ నాకు కనిపించలేదు. ఇక ఇతరులలో దానిని నిద్రలేపగలిగే మొనగాడు ప్రపంచంలో ఎక్కడా ఉండడు. నెట్లో నువ్వు చూసేదంతా గ్యాస్. నమ్మకు.' అన్నాను.

మన వాడికి నా మాటమీద నమ్మకం కుదరలేదు.

'అందరూ అబద్దాలు ఎందుకు చెబుతారు? ఎక్కడో అలాంటివాడు ఉండే ఉంటాడు. అయితే ఈ స్వామీజీలకు ఎవ్వరికీ కుండలినీ ప్రేరేపణ కలగలేదంటావా?' అన్నాడు.

'లేదనే నా ఉద్దేశ్యం. ఒకవేళ అయితే వాళ్ళలో ఆ లక్షణాలు కన్పించాలి కదా? మరి కన్పించడం లేదుగా?' అన్నాను.

'ఏమో మరి? వెదుకుదాం. ఎక్కడో ఎవడో దొరక్కపోడు' అన్నాడు.

'సరే వెతుక్కో' అన్నాను నేను.

అలా కొన్ని నెలలు గడిచాక మళ్ళీ ఒకరోజున మాటల సందర్భంలో - 'ఫలానా స్వామీజీ నీకు తెలుసా?' అడిగాడు.

'తెలుసు. ఏంటి సంగతి?' అన్నాను.

'ఆయన్ను కలుద్దామని అనుకుంటున్నాను. త్వరలో హైదరాబాద్ వస్తున్నాడు. ఫోన్లో మాట్లాడాను. ఆశ్రమానికి వస్తే దర్శనం ఇస్తానన్నాడు.' అన్నాడు.

'ఏంటీ ఆయన వలలో పడ్డావ్?' అడిగాను నవ్వుతూ.

'ఆయన దగ్గర చాలా మహిమలున్నాయట. వాళ్ళ శిష్యుడు ఒకడు ఈ మధ్యనే పరిచయం అయ్యాడు. అతను చెప్పాడు.' అన్నాడు.

'ప్రతి శిష్యుడూ తన గురువు గురించి అలాగే చెబుతాడు. అవన్నీ నమ్మకు. అదంతా మార్కెటింగ్' అన్నాను.

'లేదు. నేనతన్ని అడిగాను. 'మీ గురువుగారు కుండలినిని ప్రేరేపించగలడా?' అని. దానికతను -' కుండలిని అనేది మా గురువుగారికి చాలా చిన్నపని సార్. మీకు ఏది కావాలంటే అది సునాయాసంగా ఆయన ఇవ్వగలడు' అన్నాడు.' అని చెప్పాడు మనవాడు.

'అంత సీన్ ఆయనకు లేదని నా ఉద్దేశ్యం' అన్నాను నేను నవ్వుతూ.

'ఆయన పుస్తకాలు కొన్ని నేను చదివాను. తన పూర్వజన్మలు అన్నీ ఆయనకు తెలుసట. మన పూర్వజన్మలు కూడా చెబుతాడట. ఒక సీనియర్ IAS భక్తునితో - "పూర్వజన్మలో నువ్వే మైసూరు మహారాజావి. ఆ ప్యాలెస్ నీదే, ఆ జన్మలో నువ్వు రాజువి. మీ ఆవిడ రాణి. ఇప్పుడిలా పుట్టారు. వెళ్లి చూచుకోండి" అని ఈ స్వామీజీ చెబితే వాళ్ళు వెళ్లి మైసూరు ప్యాలెస్ చూచుకొని వచ్చారు.' అన్నాడు.

'ఇంకా నయం! ఆ స్వామీజీ మాటలు నమ్మి 'ఇది మా ఇల్లే ! అంటూ అక్కడే తిష్ట వేసుకుని కూచోలేదు. సంతోషం ! అలాంటి వాడు IAS గా సెలక్ట్ అవ్వడం ఉంది చూశావూ అదే ఈ దేశపు గొప్పదనం' - అన్నాను మళ్ళీ నవ్వుతూ.

'రెండు వేల సంవత్సరాల క్రితం తను ఎక్కడ పుట్టాడో కూడా ఆయన చెప్పాడు.' అన్నాడు.

'చాలా ఈజీ' అన్నాను.

'అదేంటి? అంత ఈజీ ఎలా అవుతుంది?' అడిగాడు.

'అవును. దానికి ప్రూఫ్ లేదుకదా? నేనూ చెబుతా. నాలుగు వేల ఏళ్ళ క్రితం నేనూ కృష్ణుడూ ఒకే బళ్ళో చదువుకున్నాం. కలిసి గోలీలాట ఆడుకున్నాం అని. దానికి ప్రూఫ్ ఏముంటుంది? నన్ను నమ్మేవాళ్ళు నమ్ముతారు. నమ్మని వాళ్ళు తిడతారు. తిడితే తిట్టుకోనీ. నమ్మేవాళ్లే నాతో ఉంటారుగాని నమ్మనివాళ్ళతో నాకేంటి? ఈ విధంగా మా స్వామీజీల బిజినెస్ సాగుతూ ఉంటుంది. అదంతే !' అన్నాను.

'అయితే ఈ స్వామీజీలో శక్తి లేదంటావా?' అడిగాడు అనుమానంగా.

'ఈ వయసులో ఇంకా శక్తి ఏం ఉంటుందిలే?' అన్నాను నవ్వుతూ.

'నేనడిగేది అది కాదు. నీకన్నీ జోకులే. స్పిరిట్యువల్ గా శక్తి లేదంటావా?' అడిగాడు.

'దివ్యశక్తి సంగతి డౌటేగాని, ఏదో ఒక క్షుద్రశక్తి అయితే తప్పకుండా ఉండే ఉంటుంది.' అన్నాను.

మా ఫ్రెండ్ నా మాటల్ని వింటాడుగాని తనకు నేనంటే నమ్మకం తక్కువ. మనకు కాషాయవస్త్రాలూ, శిష్యబృందమూ లేవుకదా మరి !

'ఏమో నేను స్వయంగా వెళ్లి చూస్తేగాని నీ మాటలను నమ్మలేను.' అన్నాడు.

'అలాగే కానీయ్' అన్నాను.

తర్వాత కొన్నాళ్ళకి ఒకరోజు రాత్రి ఎనిమిదిన్నరకి మళ్ళీ మావాడినుంచి ఫోనొచ్చింది.

ఫోనెత్తుతూనే - 'పోయొచ్చా ఆశ్రమానికి. ఇప్పుడే ఇంట్లోకి వస్తున్నా. ఫస్ట్ ఫోన్ నీకే.' అన్నాడు.

'చెప్పు విశేషాలు' అన్నాను.

'ఏముంది? ఏదో మామూలుగా అక్కడకు వెళ్ళా. అక్కడ దృశ్యం చూస్తే మతిపోయింది. తిరుమలలో ఉన్నంత క్యూ ఉందక్కడ.' అన్నాడు.

'మనుషులదా గొర్రెలదా?' అడిగాను.

'మనుషుల్లాంటి గొర్రెలది' అన్నాడు తనూ నవ్వుతూ.

'మరేమనుకున్నావ్? లోకంలో ఉన్న అజ్ఞానమంతా ఆ క్యూలోనే నీకు కన్పించి ఉండాలే? అప్పుడేమైంది?' అన్నాను.

'ఏం లేదు. ఆ క్యూలో నిల్చుంటే మనకు తెల్లారేలా ఉందని, నా కార్డ్ అక్కడ వాళ్లకు ఇప్పించా మా డ్రైవర్ చేత. వెంటనే అందర్నీ ఆపి నన్ను లోపలకు తీసికెళ్ళి సరాసరి స్వామీజీ ముందు నిలబెట్టారు' అన్నాడు.

'అదేమరి పవరంటే ! నువ్వేమో ప్రభుత్వంలో ఉన్నతాధికారివి. నీతో వాళ్లకు ముందుముందు చాలా పనులుంటాయి కదా! అందుకే నీకా స్పెషల్ ట్రీట్మెంట్. ఏమడిగావ్ స్వామీజీని?' అన్నాను.

'అదే ! పరిచయాలయ్యాక, కుండలిని గురించి అడిగాను. "అది తర్వాత చూద్దాం ముందు మంత్రం చెయ్యండి. మీ ఇష్టదైవం ఎవరు?" అని ఆయన అడిగాడు.

"ఇంతకుముందు చాలామంది ఉండేవారు. ప్రస్తుతం మాత్రం లలితాదేవిని ధ్యానిస్తున్నాను." అని చెప్పాను.

వెంటనే ఆయన పక్కనే ఉన్న మాతాజీ వైపు తిరిగి, ఏదో మంత్రం ఆశువుగా చెప్పేశాడు. ఆమె ఒక కాయితం మీద దాన్ని వ్రాసి నా చేతిలో పెట్టింది. 'దీన్ని జపం చెయ్యండి. కుండలిని సంగతి తర్వాత చూద్దామని అన్నాడు స్వామీజీ.' - చెప్పాడు మా ఫ్రెండ్.

'మధ్యలో ఈ మాతాజీ ఎవరు?' అడిగాను ఆశ్చర్యంగా.

'ఆయన ప్రధాన శిష్యురాలట. డాక్టరుగా మంచి ప్రాక్టీసు వదిలేసి ఈయన శిష్యురాలై సన్యాసం స్వీకరించిందట. పెన్నూ కాయితాల కట్టా తీసుకుని ఆయన పక్కనే కూచుని ఉంది. ఈయన మంత్రం చెప్పడం ఆమె వ్రాసి భక్తులకు ఇవ్వడం చకచకా జరిగిపోతున్నాయి.' అన్నాడు.

'ఆమె పేరు లలితా మాతాజీనా?' అడిగా నవ్వుతూ.

'కాదు. వేరే ఏదో పేరు చెప్పింది' అన్నాడు.

'అలాగా? ఇంతకు ముందు రోగులకు ప్రిస్క్రిప్షన్ వ్రాసేది. ఇప్పుడు మంత్రాలు వ్రాస్తోందా? మంచిదేలే. ఇదికూడా ఒకరకమైన ట్రీట్మెంటే. అది మెడికల్ ట్రీట్మెంటు. ఇది స్పిరిట్యువల్ ట్రీట్మెంట్. అయినా అదేంటి? మంత్రాలు కాయితాల మీద వ్రాసి ఇస్తున్నారా? ఉపదేశమంటే అదా? అలా చేస్తే అదేం ఉపదేశం అవుతుంది?' అన్నాను ఆశ్చర్యంగా.

'నువ్వెక్కడో ఇంకా రాతియుగంలో పూర్వజన్మ స్మృతులలో ఉన్నావ్ లాగుంది. ప్రపంచం చాలా ముందుకెళ్ళిపోతోంది. ప్రస్తుతం అంతా హైటెక్ నడుస్తోంది. అందుకే ఉపదేశాలు కూడా ఇలా హైటెక్ లో అయిపోతున్నాయ్ ' అన్నాడు.

'మరింకేం? నీ కుండలిని కూడా నెట్లోనే ప్రేరేపించబడుతుందేమో యూట్యూబ్ లో ప్రయత్నించలేదా?' అడిగాను నవ్వుతూ.

'అదెలా కుదురుతుంది? జోకులెయ్యకు' అన్నాడు.

'అయితే చివరకు నీ కుండలిని ప్రేరేపణ కలగానే మిగిలిపోయిందన్న మాట! నువ్వొక దానికోసం వెళితే ఆయన ఇంకొకటి అంటగట్టి పంపాడన్నమాట. ఇదంతా చిల్లరకొట్టు బేరంలా ఉంది. అసలు ఆ స్వామీజీకైనా అయిందా కుండలినీ ప్రేరేపణ?' అడిగాను నవ్వుతూ.

'ఏమో మరి? తెలీదు. కాకపోతే అంత గొప్పవాడు ఎలా అవుతాడు?' అన్నాడు మావాడు ఆలోచనగా.

'గొప్పవాడిని మీరు చేశారా? ఆయన అయ్యాడా?' అడిగాను కుతూహలంగా.

'ఏమోలే అదంతా నాకెందుకు గాని? ఆయనిచ్చిన మంత్రం రోజుకు పదివేలసార్లు జపించడమే ప్రస్తుతం నా కర్తవ్యం' అన్నాడు.

'అలాచేస్తే కుండలిని లేస్తుందని చెప్పాడా ఆయన?' అన్నాను.

'అవును. అన్నీ మంత్రబలంతోనే జరుగుతాయని, మంత్రాలతో అన్నీ సాధ్యమే అనీ ఆయనన్నాడు.'

'సరే నీ ఓపిక. చేసుకో. ఒక సంగతి చెప్పు. అక్కడ క్యూలో ఉన్నవారిలో నిజమైన ఆధ్యాత్మికత కోసం వచ్చినవాళ్ళు ఎవరైనా ఉన్నారా అసలు?' అలా ఉండరని నాకు ముందే తెలిసినా అడిగాను.

'ఎవ్వరూ లేరు. నేను కొంతమందికి కదిలించాను. మీరెందుకొచ్చారు? అని. ఒకాయనకేదో తీరని రోగం ఉందట. బహుశా ఎయిడ్స్ ఏమో తెలీదు. స్వామీజీ తన మంత్రశక్తితో దాన్ని తగ్గిస్తాడని ఆ భక్తుడు వచ్చాడట.' అన్నాడు.

'అవును. మాతాజీ డాక్టరేగా. ఆమెదగ్గర మెడికల్ ట్రీట్మెంట్ కోసం వచ్చుంటాడు. రోగంతో బాధపడేవాడికి మంత్రదీక్ష ఎందుకు? దానికోసం వచ్చుండడు. నువ్వు సరిగ్గా వినలేదేమో?' అన్నాను.

'లేదు. నేను సరిగానే విన్నాను. క్యూలో ఉన్న ఒకాయన, జగిత్యాలలో చాలా సీరియస్ కండిషన్లో ఉన్న ఒక పేషంట్ ను అర్జెంట్ గా అంబులెన్స్ లో స్వామీజీ దగ్గరకు తెమ్మని ఫోన్లో వాళ్ళవాళ్ళతో చెబుతూ ఉండగా నేను విన్నాను. అందరూ రకరకాల పనులు కావడంకోసం వచ్చినవాళ్ళే. వాళ్ళలో ఆధ్యాత్మికం ఎక్కడా లేదు. ఇంకోటి చెప్పనా? స్వామీజీ ముందు ఒక పెద్ద పళ్ళెం ఉంది. క్యూలో వస్తున్నవాళ్ళంతా ఆ పళ్ళెంలో డబ్బులేస్తున్నారు. అందులో అన్నీ రెండువేలు, ఐదొందల నోట్లే ఉన్నాయి. ఎవరైనా వందనోటు వేస్తే వెంటనే అక్కడున్న అసిస్టెంట్ ఆ వందనోటు లోపల దాచేస్తోంది.' అన్నాడు.

'అవున్లే ! ప్రస్తుతం మార్కెట్లో వంద నోట్లు దొరకడం లేదు కదా? అందుకని "సమాజ శ్రేయస్సు" కోసం వెంటనే దాన్ని తీసి మార్కెట్ సర్కులేషన్ లోకి పంపిస్తోందన్న మాట' అన్నాను.

'అది కాదు. ఆ పళ్ళెంలో వంద నోటు కన్పిస్తే క్యూలో వెనక వచ్చేవాడు కూడా వందే వేస్తాడు కదా? అలా కాకుండా అన్నీ పెద్ద నోట్లే ఉంచితే ఆ వెనుక వాడు కూడా పెద్ద నోట్లే వేస్తాడన్నది మార్కెటింగ్ రహస్యం' అన్నాడు తను.

'మరి నువ్వేం చేశావ్? ఆ పళ్ళెంలో ఉన్న రెండువేల నోట్లు ఒక పది జేబులో వేసుకుని రాకపోయావా? మంది సొమ్మేగదా? పళ్ళెంలో పదివేలు తగ్గితే స్వామీజీ నష్టపోయేది ఏముంటుంది?' అన్నా నేను నవ్వుతూ.

'అదే చేద్దామని ముందు అనుకున్నా. మళ్ళీ అలా చేస్తే మన స్టేటస్ కి బాగోదని చెయ్యలేదు' అన్నాడు తనూ నవ్వుతూ.

'మరి నీ కుండలిని సంగతేంటి?' అడిగాను.

'ఏమో? ఆయన చెప్పినట్లు చేస్తాను. అయితే అవుతుంది. లేకపోతే లేదు. అవ్వకపోతే మళ్ళీ ఇంకో గురువును నెట్లో వెదుకుతా' అన్నాడు.

'అలా కాదు. ఒకవేళ స్వామీజీ ఫెయిలయితే, నెక్స్ట్ మాతాజీ దగ్గర ఉపదేశం తీసుకో. అప్పుడు నీ కుండలినిలో కదలిక తప్పకుండా వస్తుందని నా నమ్మకం.' అన్నాను సీరియస్ గా.

'ఏమో తెలీదు. అయినా స్వామీజీ దగ్గర లేని పవర్ మాతాజీ దగ్గర ఉందంటావా?' అడిగాడు అనుమానంగా.

'ఏమో? ప్రయత్నించు. అయితే కుండలినిలో కదలిక వస్తుంది. లేకుంటే నీకు యూట్యూబ్ ఎలాగూ ఉండనే ఉంది. గుడ్ లక్' అన్నా.

తనకు కొంచం విసుగొచ్చింది.

'ఇదంతా ఎందుకు? అసలు నువ్వే స్వామీజీగా మారచ్చుకదా ! నీకున్న నాలెడ్జినంతా ఇలా వృధా చేసుకోకపోతే?' అన్నాడు.

'దానికి టైముంది. ఒక రెండేళ్ళు ఆగు. నీ కోరిక తీరుతుంది. కానీ ఒక్క షరతు. నీ విజిటింగ్ కార్డ్ చూపిస్తే నిన్ను డైరెక్ట్ గా నా దగ్గరకు రానివ్వను. నువ్వెంత ఉన్నతాధికారివైనా సరే, నా దగ్గర క్యూలో బుద్ధిగా రావాల్సిందే.' అన్నాను.

'ఎందుకు? నేను నీ పక్కనే కూచుని నువ్వు చెప్పే మంత్రాలను ప్రిస్క్రిప్షన్ వ్రాస్తాను. ఆపనిని నాకివ్వు.' అన్నాడు.

'నేనలా చెయ్యను. మన విధానాలు డిఫరెంట్ గా ఉంటాయి. పనుల కోసం వచ్చేవారిని నేనసలు దగ్గరకే రానివ్వను. నీకు తెలుసుగా మన సంగతి?' అడిగాను నవ్వుతూ.

'అలా అయితే నీదగ్గరకెవరొస్తారు? నీ దగ్గర అస్సలు క్యూనే ఉండదు. తాపీగా నడుచుకుంటూ స్ట్రెయిట్ గా నీ దగ్గరకు రావచ్చు. పోనీలే నాకు ప్రిస్క్రిప్షన్ రాసే పని తప్పింది.' అన్నాడు నవ్వుతూ.

'పనులకోసం వచ్చేవాళ్ళు నాకెందుకు? నిజమైన తత్త్వచింతన ఉండి, ఆధ్యాత్మికంగా నిజంగా ఎదగాలని చూచేవాళ్ళు నాదగ్గరుంటారు. అయినా నిన్ను నా అసిస్టెంట్ గా ఎందుకు పెట్టుకుంటాను? ఎవరైనా మంచి లేడీడాక్టర్ని చూచి పెట్టుకుంటాగాని?' అన్నా నేనూ నవ్వుతూ.

'తెలుసు. అందుకే నా బాధ ! ఇలా లేట్ చేస్తూ ఉంటే నువ్వెప్పుడు ఎదుగుతావో ఏంటో? త్వరగా నీ అవతారం మార్చు. అంతవరకూ నేనీ స్వామీజీ చెప్పిన మంత్రాన్ని జపిస్తూ ఉంటా. సరేమరి. జపానికి టైమౌతోంది. జై కుండలినీ !' అంటూ తను ఫోన్ పెట్టేశాడు.
read more " కుండలినీ ప్రేరేపణ ఎలా చెయ్యాలి? "

26, జూన్ 2018, మంగళవారం

మా దేవుడే నిన్ను రక్షించాడు

మూడు నెలల మెడికల్ రెస్ట్ తర్వాత మళ్ళీ ఉద్యోగంలో చేరాను. యధావిధిగా అందరూ వచ్చి పలకరించడం గట్రాలు అన్నీ అయ్యాయి. కానీ ఈ పరిస్థితిని కూడా క్యాష్ చేసుకుందామని చూచేవాళ్ళు కొందరు ఉండటం, నాకు మనుషుల మనస్తత్వాలంటే ఇప్పటికే ఉన్న అసహ్యాన్ని మరింతగా పెంచింది.

మా కొలీగ్ ఒకాయన నన్ను పలకరిద్దామని వచ్చాడు.

ఆ మాటా ఈ మాటా అయ్యాక, ' జీసస్ దయవల్ల మీరు మళ్ళీ బ్రతికారు' అన్నాడు.

అంటే, ఈ పరిస్థితిని సాకుగా తీసుకుని ఏదో ఒక రకంగా నన్ను కన్వర్ట్ చేద్దామని ఈయన ప్రయత్నం. కాసేపుంటే అక్కడే మోకాటి తండా వేసి ప్రేయర్ మొదలుపెట్టేలా ఉన్నాడు.

మనం ఊరుకోం కదా !

'అదేంటి? మధ్యలో ఆయనెందుకు?' అన్నాను.

'మీ పాపాల కోసం ఆయన చనిపోయాడు. అందుకే మీరు యాక్సిడెంట్ లోంచి బ్రతికి బయట పడ్డారు' అన్నాడు.

'అవునా? నేనలా అనుకోవడం లేదు. నువ్వు చేసిన పాపాలకే నాకు యాక్సిడెంట్ అయ్యింది.' అన్నాను.

అతను అవాక్కయ్యాడు.

'అదేంటండి? నా పాపాలకు మీకెందుకు యాక్సిడెంట్ అవుతుంది? ' అన్నాడు.

'మరి, నేనిప్పుడు చేసిన పాపాలకు జీసస్ ఎప్పుడో రెండువేల ఏళ్ళ క్రితం చనిపోవడం ఏంటి?' అన్నాను.

'అలా అని బైబిల్లో వ్రాసుంది' అన్నాడు.

'ఆ వ్రాసినవాడిని నా దగ్గరకు తీసుకురా. అలాంటి అబద్దాలు వ్రాసినందుకు వాడిని మళ్ళీ శిలువ వేస్తాను' అన్నాను.

'తప్పు సార్. అలా అనకండి.' అన్నాడు ఏదో పాపం చేసినవాడిలాగా తను కుమిలిపోతూ.

'నువ్వెందుకు బాబూ అంత బాధపడుతున్నావు? మీ జీసస్ ది చాలా పెద్దకంపెనీ గనుక లోకంలో అందరి పాపాలను గ్లోబల్ గా తీసుకుంటున్నాడు. నాది చిన్న కంపెనీ గనుక మీ అందరి పాపాలకు లోకల్ గా నేను శిక్ష అనుభవిస్తున్నాను. నీ పాపాలకు ఈ యాక్సిడెంట్ రూపంలో నాకు శిక్ష పడింది.' అన్నాను.

'ఊరుకోండి సార్ ! భలే జోకులేస్తారు మీరు !' అన్నాడు.

'నువ్వు కూడా బాగా జోకులేస్తావు. ఇలాంటి జోకులు నా దగ్గర చెప్పకు.' అన్నాను.

అతను లేచి వెళ్ళిపోయాడు.

ఇంకొక కొలీగ్ కూడా ఇలాగే కుశలప్రశ్నలు అయ్యాక ఇలా అన్నాడు.

'మొన్ననే దశావతార వెంకటేశ్వరస్వామి ఆలయం మనకు దగ్గరలోనే కట్టారు. వెళదాం వస్తారా?'

'ఎందుకు?' అన్నాను.

'ఏం లేదు. మళ్ళీ జాయినయ్యారు కదా. ఏదైనా చీడా పీడా ఉంటే పోతుందని. ఈ వెంకటేశ్వరస్వామి చాలా పవర్ ఫుల్. ఈయనలో పది అవతారాలున్నాయి.' అన్నాడు.

'ఏంటీ? పవర్ ఫుల్లా? అంటే, అందరు వెంకటేశ్వర స్వాములకూ బాక్సింగ్ మ్యాచ్ పెడితే అందులో ఈయన గెలిచాడా? ఇప్పటిదాకా అన్ని వెంకటేశ్వరస్వాములలోకీ పిట్స్ బర్గాయనే పవర్ ఫుల్ అని ఒకాయన చెబుతూ ఉంటాడు.  అలాంటి క్షుద్ర స్వామీజీ ఎవరైనా ఇలా చెప్పాడేంటి నీకు?' అడిగాను సీరియస్ గా.

'తప్పు సార్ ! అలా అనకండి. చెంపలేసుకోండి' అన్నాడు.

'కావాలంటే నీ చెంపలు వాయిస్తా దగ్గరికి రా.' అన్నాను.

అన్నట్టు, చీడా పీడా అంటే ఒక విషయం గుర్తొచ్చింది.

నాకు యాక్సిడెంట్ అయిన కొత్తల్లో నా శిష్యురాలు ఒకమ్మాయి నన్ను చూట్టానికి వస్తూ ఒక దిష్టిబొమ్మను తెచ్చింది.

'ఏంటిది?' అడిగాను.

'మీకు చాలా నరదృష్టి ఉంది. మీ మీద ఎందరి చూపో ఉంది. కనుకనే మీకు ఇలా యాక్సిడెంట్ అయింది. ఈ దిష్టిబొమ్మను మన ఇంటి గుమ్మంలో కడతాను. దాంతో మీకున్న చీడా పీడా పోతుంది.' అంది.

'ఒక పని చెబుతా చేస్తావా?' అడిగాను.

'చెప్పండి' అంది.

'ఈ దిష్టిబొమ్మను నీ మెడలో కట్టుకోని తిరుగుతూ ఉండు.  ఎట్టి పరిస్థితిలోనూ దీన్ని తియ్యకు. ముందు నీకున్న మెంటల్ తగ్గుతుంది. ఆ తర్వాత, జన్మజన్మల నుంచీ నీకున్న చీడాపీడా అంతా పోతుంది.' అన్నాను.

అంతటితో ఆ అమ్మాయి ఇంకేమీ రెట్టించలేదు. ఆ సంగతి ఇప్పుడు గుర్తొచ్చింది.

ఆలోచనలో ఉన్న నన్ను ఇవతలకు తెస్తూ - 'ఏమంటారు సార్ ! పోదామా?' అన్నాడు దశావతార భక్తుడు.

'అమ్మో మీ స్వామిలో అంత పవరుందా? ఆయన దగ్గరకు వచ్చేంత పవర్ నా దగ్గర లేదులే. నేను రాలేను.' అన్నాను.

'అలా అనకండి. మన సీ.ఎం. గారొచ్చారు. రాజకీయ నాయకులు ఎందఱో వచ్చారు. ఫలానా స్వామీజీ స్వయానా సంప్రోక్షణ చేశారు. ఒక్కసారి వెళదాం రండి' అన్నాడు.

'అలాగైతే అస్సలు రాను. రాజకీయ నాయకులూ, వారితో సంబంధం ఉన్న స్వామీజీలూ అక్కడకు వచ్చారంటేనే అర్ధమౌతోంది. అలాంటి 'పవిత్రమైన చోట్ల' నా అపవిత్రపాదం పెట్టి వాటిని పాడుచెయ్యలేను.' అన్నాను.

'పది అవతారాలూ ఒకేచోట ఉన్నాయి' అన్నాడు.

'మిగతా అవతారాలు వదిలేశారేం?' అడిగాను.

'మనకున్నవి పది అవతారాలేగా?' అన్నాడు.

'దైవానికి అనంతమైన అవతారాలున్నాయని శ్రీమద్భాగవతం చెబుతోంది. మరి వాటి సంగతేంటి?' అడిగాను.

'ఏమో నాకా సంగతి తెలీదు. భాగవతం అలా చెప్పిందా?' అడిగాడు.

'చదవండి. తెలుస్తుంది. మన గ్రంధాలలో ఏముందో మనకే తెలీదు. అందుకే మన హిందూమతం ఇలా తయారైంది. అనంతమైన విభూతులను ఒక విగ్రహంలోకి ఎలా తెస్తారసలు? అది సాధ్యం కాదు. ఒకటిలో అనంతాన్ని చూస్తారా? లేక అనంతాన్ని ఒకదాంట్లోకి మలుస్తారా? ఏది కరెక్ట్? అసలలా మలచగలరా ఎవరైనా? మీకు తోచిన విధంగా మీరా విగ్రహాన్ని తయారుచేశారు. చూసుకోండి. నేను రాను. ప్రస్తుతం ఏ గుడికీ పోవాలని నాకనిపించడం లేదు. ఈ గుడికి అసలే రాను.' అన్నాను.

'ఎందుకలా?' అడిగాడు కుతూహలంగా.

'నిగ్రహం కోసమే విగ్రహం' అని జిల్లెళ్ళమూడి అమ్మగారన్నారు. నాకు నిగ్రహం బాగానే ఉంది. కనుక ప్రస్తుతం ఏ విగ్రహమూ నాకవసరం లేదు. అందులోనూ అన్ని అవతారాలతో తయారు చేసిన విగ్రహం అసలు అవసరం లేదు. నేను రాను. నన్ను రమ్మని బలవంతం చెయ్యద్దు. నీక్కావాలంటే నువ్వు వెళ్లి చూడు. అక్కడనుంచి వెనక్కు రావాలని అనిపించకపోతే ఎల్లకాలం అక్కడే ఉండు. నాకేమీ అభ్యంతరం లేదు. నన్ను మాత్రం ప్రేరేపించకు.' అని ముగించాను.

మనుషుల అజ్ఞానానికి అంతం లేదనే నా సూక్తి నిజమా కాదా?
read more " మా దేవుడే నిన్ను రక్షించాడు "

25, జూన్ 2018, సోమవారం

Patta Patta Boota Boota - Lata Mangeshkar, Mohammad Rafi


Patta Patta Boota Boota Haal Hamara Jane Hai...

అంటూ లతా మంగేష్కర్, మహమ్మద్ రఫీలు మధురాతి మధురంగా ఆలపించిన ఈ గీతం 1972 లో వచ్చిన Ek Nazar అనే చిత్రంలోనిది. ఇది కూడా ఆపాత మధురాలలో ఒకటే. ఈ ట్రాక్ లో లతాజీ స్వరం అలాగే ఉంది. రఫీ బదులు నేను ఆలపించాను.

ఈ పాటకు మాతృక ఒక ఘజల్. ఆ ఘజల్ ను మెహదీ హసన్ ఆలపించాడు. గులాం అలీకూడా ఆలపించాడు. దాని నుంచి ఈ పాట వచ్చింది. కానీ ఇది కూడా చాలా మధురగీతమే

నా స్వరంలో కూడా ఈ మధురగీతాన్ని వినండి మరి.

Movie:-- Ek Nazar (1972)
Lyrics:--Majrooh SultanPuri
Music:-- Laxmikant Pyarelal
Singers:-- Lata Mangeshkar, Mohammad Rafi
Karaoke Singer:-- Satya Narayana Sarma
Enjoy
-------------------------------------------------
Patta patta boota boota haal hamara jane hai
Patta patta boota boota haal hamara jane hai
Patta patta
Jane na jane gul hi na jane baat to sara jane hai
Patta patta

Koi kisee ko chahe to kyun gunaa samajhte hai log
Koi kisiki khatir tarse agar tho haste hai log
Began aalam hai sara - yaha tho koi hamara
Dard nahi pehchane hai
Patta patta boota botta haal hamara jane hai
Patta patta

Chahat ke gul khilenge - chalte rahe hazaar andhiyaa
Ham tho kisi chaman me – Bandhenge pyar kaa aashiya
Ye duniya bijili giraye – ye duniya kate bhi chaye
Ishq magar kab maane hai
Patta patta boota boota Haal hamara jane hai
patta patta


Meaning

Every leaf and every bush
knows our condition very well
When the entire garden knows
how can a rose cannot know?

When someone loves another
why the world considers it as a crime?
when someone intensely longs for another
why people mock at them?
This world is a strange place
Here, nobody is your own
and none understands our agony

The rose of love shall bloom
in spite of a thousand darknesses
We shall build a nest of love
in some garden somewhere
Let the world hurl lightening at us
Let the world throw thorns at us
Why should love care for all this?

Every leaf and every bush
knows our condition very well
When the entire garden knows
how can a rose cannot know?

తెలుగు స్వేచ్చానువాదం

ఇక్కడ ప్రతి ఆకుకూ ప్రతి పొదకూ
మన సంగతి తెలుసు
తోట మొత్తానికీ తెలిసినప్పుడు
ఒక పువ్వుకు తెలియదా?

ఒకరు ఇంకొకరిని ప్రేమిస్తే
దాన్నొక నేరంగా
ఈలోకం ఎందుకనుకుంటుంది?
ఒకరు ఇంకొకరికోసం తపిస్తుంటే
అందరూ ఎందుకు వెక్కిరిస్తారు?
ఈ ప్రపంచం విచిత్రమైనది
ఇక్కడ మనవారు ఎవరూ లేరు
మన బాధను అర్ధం చేసుకునే వారూ లేరు

వెయ్యి చీకట్లు కమ్ముకొచ్చినా
ప్రేమ అనే గులాబీ విరబూస్తుంది
ఇక్కడ కాకుంటే ఏదో ఒక తోటలో
మన ప్రేమ గూడు కట్టుకుందాం
ప్రపంచం పిడుగులను కురిపించనీ
మనమీద ముళ్ళను విసిరెయ్యనీ
ప్రేమ వీటన్నిటినీ ఎందుకు లెక్కచేస్తుంది?

ఇక్కడ ప్రతి ఆకుకూ ప్రతి పొదకూ
మన సంగతి తెలుసు
తోట మొత్తానికీ తెలిసినప్పుడు
ఒక పువ్వుకు తెలియదా?...
read more " Patta Patta Boota Boota - Lata Mangeshkar, Mohammad Rafi "

24, జూన్ 2018, ఆదివారం

Mujhko Apne Gale Laga Lo - Mubarak Begum, Mohammad Rafi.


Mubarak Begum, Shankar, Mohammad Rafi
Mukhko Apne Gale Laga Lo...

అంటూ ముబారక్ బేగం, మహమ్మద్ రఫీలు మధురాతి మధురంగా ఆలపించిన ఈ గీతం 1963 లో వచ్చిన Hamrahi అనే చిత్రం లోనిది. ఇది కూడా ఆపాత మధురాలలో ఒకటే.

కొన్ని పాటలు చూస్తే బాగుండవు. వింటేనే బాగుంటాయి. అలాంటి పాటల్లో ఇదీ ఒకటి.

ముబారక్ బేగం స్వరం చాలా మధురమైనది. కానీ ఆమె దురదృష్టవంతురాలు. పెద్దగా సంపాదించుకోలేక పోయింది. సినిమా రాజకీయాల ముందు ఆమె మధురస్వరం నిలబడలేకపోయింది. సరియైన ఆధారం లేక ఈ రకంగా ఎందఱో మధుర గాయకులు సినిమారంగంలో నుంచి కనుమరుగైపోయారు. దానికి అనేక కారణాలు.

నా స్వరంలో కూడా ఈ మధుర గీతాన్ని వినండి మరి. ఇది డ్యూయెట్ అయినప్పటికీ రెండు చరణాలూ నేనే ఆలపించాను.

Movie:-- Hamrahi (1963)
Lyrics:-- Hasrat Jaipuri
Music:-- Shankar Jaikishan
Singers:-- Mohammad Rafi, Mubarak Begum
Karaoke Singer:-- Satya Narayana Sarma
Enjoy
------------------------------------------
Mujhko apne gale lagalo E mere hamrahi-2
Tumko kya batlaavu main ke tumse kitna pyar hai
Mujhko apne gale lagalo E mere hamrahi
Tumko kya batlaavu main ke tumse kitna pyar hai                     
Mujhko apne gale lagalo

Jab tum mujhse door rehte ho – Jiya mera ghabrata hai
Neend akhon se ud jaati hai – Chand agan barsata hai
Dono pehlu jal jate hai – Aag me aag lagata hai
Jaise tadpe bina jal machli – Pyar mujhe tadpata hai
Pyar mukhe tadpata hai
Is uljhan se mujhko bachalo – E mere hamrahi
Tumko kya batlaavu main ke tumse kitna pyar hai
Mujhko apne gale lagalo E mere hamrahi
Tumko kya batlaavu main ke tumse kitna pyar hai
Mujhko apne gale lagalo

Jin raaho par haske chalo tum – Phul vaha khil jata hai
Dam lene ko jaha ruko tum – Madhushale ban jathe hai
Tumko chukar pavan jhakore – Khushbu lekar jate hai
Lekin humko dekhke surat - Dil thame reh jate – hai
Dil thame reh jate hai
Dilse dilka taar milalo – E mere hamraahee
Tumko kya batlaavu main ke tumse kitna pyar hai

Mujhko apne gale lagalo - E mere hamraahee
Tumko kya batlaavu main ke tumse kitna pyar hai
Mujhko apne gale lagalo

Meaning

Take me into your embrace
O my companion
How can I tell you
how much love I have for you?
Take me into your embrace

When you stay away from me
my innocent heart becomes restless
Sleep flees from my eyes
The Moon rains fire
Everywhere I find only heat
Like a fish out of water
My soul suffers for want of love
Rescue me from this tangle, O my companion !
How can I tell you
how much love I have for you?
Take me into your embrace

On every path you tread with a smile
Flowers bloom instantly
Wherever you halt for taking a breath
There spring up many wine taverns
By touching you, the restless wind
becomes suffused with perfume
On seeing all this, my heart stands still
Join the strings of your heart with mine
O my companion !
How can I tell you
how much love I have for you?
Take me into your embrace

తెలుగు స్వేచ్చానువాదం

నన్ను నీ కౌగిట్లోకి తీసుకో
ఓ సహచరీ
నువ్వంటే నాకెంత ప్రేముందో
నీకెలా చెప్పేది?

నువ్వు నానుంచి దూరంగా ఉంటే
నా పిచ్చి హృదయం తల్లడిల్లుతుంది
నిద్ర నా కన్నులకు దూరమౌతుంది
వెన్నెల కూడా వేడిగా ఉంటుంది
ఎక్కడ చూచినా నాకు శాంతి ఉండదు
నీటికోసం చేప తపించినట్లు
నా ఆత్మ ప్రేమకోసం తపిస్తోంది
ఈ సంకటస్థితి నుంచి నన్ను రక్షించు
ఓ సహచరీ
నువ్వంటే నాకెంత ప్రేముందో
నీకెలా చెప్పేది?
నన్ను నీ కౌగిట్లోకి తీసుకో

చిరునవ్వుతో నువ్వు నడచిన ప్రతిదారిలోనూ
పూవులు విరబూశాయి
ఊపిరి తీసుకోవడం కోసం నువ్వాగితే
అక్కడికక్కడే మధుశాలలు పుట్టుకొచ్చాయి
నిన్ను తాకి అల్లరి గాలి
సుగంధాన్ని తనలో నింపుకుంది
ఇదంతా చూచిన నా హృదయం
నిస్తేజమై పోయింది
నీ హృదయపు తీగలను
నా హృదయంతో కలుపు
ఓ సహచరీ
నువ్వంటే నాకెంత ప్రేముందో
నీకెలా చెప్పేది?
నన్ను నీ కౌగిట్లోకి తీసుకో...
read more " Mujhko Apne Gale Laga Lo - Mubarak Begum, Mohammad Rafi. "

23, జూన్ 2018, శనివారం

ఆధ్యాత్మికం అంటే ఏమిటి?

ఆధ్యాత్మికం అంటే ఏమిటి?
అని నన్నడిగింది ఒకమ్మాయి
"ప్రేమించడం, ప్రేమలో మునిగి మరణించడం"
అన్నాను.

లోకంలో అందరూ ప్రేమిస్తున్నారుగా?
మరి వాళ్ళంతా ఆధ్యాత్మికులేనా?
అడిగింది తను.

లోకంలో కనిపించే ప్రేమ, ప్రేమ కాదు
ఆ పేరుకు అది తగదు 
నేను చెప్పే ప్రేమకు అదొక సుదూరపు ఛాయ
నేను చెప్పే ప్రేమ సత్యం. లోకప్రేమ మాయ
అన్నాను.

దానిని పొందాలంటే ఏం చెయ్యాలి?
అడిగింది.
నిన్ను బంధించిన సంకెళ్ళను త్రెంచుకోవాలి
దానిలోకి అడుగుపెట్టాలి.
దానిలో కరిగిపోవాలి.
చెప్పాను.

నా వాళ్ళను నేను వదలలేను.
నా జీవితాన్ని నేను వదలలేను.
అన్నది.
వదలమని ఎవరు చెప్పారు?
అన్నాను.

మరి బంధాలను త్రెంచాలన్నావుగా?
అడిగింది అమాయకంగా.
బంధాలంటే నీ బయట నిన్ను పట్టుకున్నవి కావు.
నిన్ను నువ్వే కట్టుకున్నవి.
నీలోపల నువ్వే అల్లుకున్నవి.
అన్నాను.

'పూజలు సరిపోవా?' అడిగింది.
'పూజలకూ దీనికీ సంబంధం లేదు.
పూజలు చేస్తుంటే పుచ్చిపోతావు గాని పండవు.'
అన్నాను.

'అర్ధం కాలేదు' అంది.
'ఇది అర్ధం చేసుకునేది కాదు. అనుభవించేది' అన్నాను.
'ఎలా?' అంది.
'ముందుకు అడుగెయ్యి తెలుస్తుంది' అన్నాను.
'వెయ్యలేను.' అంది.
'నీ ఖర్మ! పడు.' అన్నాను.
read more " ఆధ్యాత్మికం అంటే ఏమిటి? "

22, జూన్ 2018, శుక్రవారం

Zindagi Pyar Ki Do Char Ghadi Hoti Hai - Hemanth Kumar


Zindgi Pyar Ki Do Char Ghadi Hoti Hai...

అంటూ హేమంత్ కుమార్ మధురాతి మధురంగా ఆలపించిన ఈ గీతం 1953 లో వచ్చిన Anarkali అనే చిత్రంలోనిది. దీనికి ఎంతో చక్కని స్వరాన్ని అందించాడు సంగీత దర్శకుడు C.Ramachandra. హేమంత్ కుమార్ అంతకంటే మధురంగా దీనిని పాడాడు.

దీనిని ప్రదీప్ కుమార్, బినా రాయ్ ల మీద చిత్రీకరించారు.

నా స్వరంలో కూడా ఈ మధురగీతాన్ని వినండి మరి.

Movie:-- Anarkali (1953)
Lyrics:--Rajendra Krishan
Music:--C.Ramachandra
Singer:-- Hemanth Kumar
Karaoke Singer:-- Satya Narayana Sarma.
Enjoy
----------------------------------------

Zindagi pyar ki do char ghadi hoti hai – 2
Chahe thodibhi hoye Umr badi hoti hai – 2
Zindagi pyar ki do char ghadi hoti hai

Taaj yaa takhth ya doulat Ho jamane bharki – 2
Kaun si cheez mohabbat se badi hoti hai -2
Zindagi pyar ki do char ghadi hoti hai
Chahe todibhi hoye Umr badi hoti hai – 2
Zindagi pyar ki do char ghadi hoti hai

Do mohabbat bhare dil saath Dhadak teho jahaan -2
Sabse achchee vo mohabbat ki ghadi hoti hai – 2
Zindagi pyar ki do char ghadi hoti hai
Chahe thodibhi hoye Umr badi hoti hai – 2
Zindagi pyar ki do char ghadi hoti hai - 2

Meaning

Life is nothing
but a few moments spent in love
Let those moments be small
but they are the real moments in life

Let it be the crown, or the kingly throne
or wealth and prosperity
All these are just nothing
when compared to love

When two hearts full of love
vibrate together
Compared to those moments of love
What is greater in life?

Life is nothing
but a few moments spent in love
Let those moments be small
but they are the real moments in life

తెలుగు స్వేచ్చానువాదం

జీవితమంటే
ప్రేమలో బ్రతికిన రెండు క్షణాలే
అవి చాలా చిన్నవే కావచ్చు
కానీ అవే జీవితంలో అన్నిటికంటే విలువైనవి

కిరీటమైనా,
సింహాసనమైనా,
సంపదైనా,
ఇవన్నీ ప్రేమకంటే ఎక్కువైనవి కావు

ప్రేమతో నిండిన రెండు హృదయాలు
ఒకే శ్రుతిలో నిలిచినప్పుడు
ఆ క్షణాలకంటే విలువైనవి
జీవితంలో ఇంకేముంటాయి?

జీవితమంటే
ప్రేమలో బ్రతికిన రెండు క్షణాలే
అవి చాలా చిన్నవే కావచ్చు
కానీ అవే జీవితంలో అన్నిటికంటే విలువైనవి
read more " Zindagi Pyar Ki Do Char Ghadi Hoti Hai - Hemanth Kumar "

యోగా చేస్తే అహంకారం పెరుగుతుందా?

జర్మనీలో ఒక యూనివర్సిటీలో జరిగిన పరిశోధనలలో యోగా చేసేవారిలో అహంకారం పెరుగుతున్నట్లు గమనించారని పేపర్లలో వార్తలొచ్చాయి. ఈ వార్తలు కూడా నిన్న అంతర్జాతీయ యోగా దినోత్సవం అనగా మొన్న వచ్చాయి. అంటే ఏమిటి? అందరూ యోగా చేస్తున్నారన్న భయంతో ఇలాంటి దుష్ప్రచారం చేసి యోగాను అడ్డుకోవాలన్న క్రైస్తవ లాబీ (వాటికన్) కుట్రా ఇది? కావచ్చు. ఎందుకంటే, భారతీయతను పెంపొందించే ఏదైనా ఈ లాబీలకు నచ్చదు. మన ధర్మం, మన సంస్కృతి ఎప్పటికీ అట్టడుగున ఉండాలన్నదే వారి ఊహ. వారి ప్రయత్నాలు కూడా ఆ దిశగానే సాగుతూ ఉంటాయి.

అహంకారం పెరగాలంటే దానికి యోగానే చెయ్యనక్కరలేదు. ఏం చేసినా అది పెరుగుతూనే ఉంటుంది. చాలాసార్లు ఏమీ చెయ్యకపోయినా అది పెరుగుతూనే ఉంటుంది. అహంకారం అనేది డబ్బున్నవాడికే కాదు, అడుక్కునేవాడికి కూడా ఉంటుంది. ఒక్కొక్కసారి అడుక్కునేవాడికే అది ఎక్కువగా ఉంటుంది.

మనలో ఏదైనా ఒక ప్రత్యేకత ఉన్నప్పుడు అది అహంకారంగా మారే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంటుంది. జిమ్ చేసేవారిలో వారికి మంచి కండలున్నాయన్న అహం పెరుగుతుంది. ఆ కండలు కొద్దిగా లూజైతే అదే అహం భయంగా మారుతుంది. ఇక ఆ ఫిట్నెస్ ను అలాగే ఉంచుకోవాలని నానా ప్రయత్నాలూ చేస్తూ భయం భయంగా బ్రతుకుతూ ఉంటారు. ఎక్కువగా సినిమా తారల్లో ఈ భయం కనిపిస్తూ ఉంటుంది.

అధ్లేట్స్ పరిస్తితీ అంతే. వాళ్ళకీ అహంకారం ఉంటుంది. బాక్సర్లకీ ఉంటుంది. బాడీ బిల్డర్లకూ ఉంటుంది. అందగత్తెలకూ ఉంటుంది. ప్రతివారికీ అహంకారం ఉంటుంది. మిగతావారికంటే నేను డిఫరెంట్ అనే ఫీల్ ఉన్నప్పుడు అహంకారం తప్పకుండా ఉంటుంది. ఈ కాలపు చదువులూ ఉద్యోగాలూ వ్యవహారాలూ అన్నీ అహంకారాన్ని ఇంకా ఇంకా పెంచే దిశగానే పోతున్నాయి గాని దానిని తగ్గించే దిశగా పోవడం లేదు.

అసలు అహం ఎందుకు తగ్గాలీ అంటే, అహం ఎక్కువైతే నువ్వు దైవానికి దూరం అవుతావు. అహం ఎంత తగ్గితే దైవానికి అంత దగ్గరౌతావు. అహం అసలు లేకుంటే నువ్వు దైవంలోనే ఉంటావు. కనుక, మనలో ఎన్ని ప్రత్యేకతలున్నప్పటికీ అహంకారం లేకుండా ఒక మామూలు మనిషిగా ఉండటమే అసలైన ప్రత్యేకత !

యోగాను ఒక శరీరవ్యాయామంగా మాత్రమే చేస్తే అది తప్పకుండా అహాన్ని పెంచుతుంది. కానీ అదే యోగాకు, నిజమైన యోగా తోడైతే అప్పుడు మాత్రమే అహం అనేది పూర్తిగా తగ్గిపోతుంది. నిజమైన యోగా అంటే ఏమిటి?

ఇంద్రియ నిగ్రహం, మనోనిగ్రహం, ధ్యానం మొదలైన అంతరిక ప్రక్రియల లోతులు అనుభవంలో తెలిస్తే అప్పుడు మాత్రమే 'అహం' అనేది పోతుంది. అంతేగాని ఊరకే కొన్ని ఆసనాలు నేర్చుకుని దానినే 'యోగా' అనుకుంటే అది పొరపాటు. ఆసనాల వల్ల ఆరోగ్యం వస్తుంది, చాలాసార్లు అహమూ పెరుగుతుంది.

యోగా మీద అధికారిక గ్రంధం అయిన హఠయోగ ప్రదీపికలో స్వాత్మారామ యోగీంద్రులు ఇలా అంటారు.

||ప్రణమ్య శ్రీగురుం నాథం స్వాత్మారామేణ యోగినా
కేవలం రాజయోగాయ హఠ విద్యోపదిష్యతే ||

నా గురువుకు ప్రణామం గావిస్తూ స్వాత్మారామ యోగినైన నేను, కేవలం రాజయోగాన్ని సాధించే నిమిత్తమై, హఠవిద్యను ఉపదేశిస్తున్నాను.

||పీఠాని కుంభకాశ్చిత్రా దివ్యాని కరణాని చ
సర్వాణ్యపి హఠాభ్యాసే రాజయోగ ఫలావధి: ||

ఆసనములు, ప్రాణాయామము, క్రియలు మొదలైన అన్ని హఠయోగ అభ్యాసములకూ రాజయోగమే పరమగమ్యం.

కనుక శరీరంతో చేసే యోగమైన హఠయోగం యొక్క ఉద్దేశ్యం మనస్సుతో చేసే రాజయోగాన్ని అందుకోవడమే అని ప్రాచీన గ్రంధాలు స్పష్టంగా చెబుతున్నాయి. అలా కానప్పుడు ఈ ఆసనాలూ గట్రా ఉత్త ఫిజికల్ ఎక్సర్ సైజులు మాత్రమే అవుతాయి.

రాజయోగ మహిమ ఘేరండ సంహితలోని ఈ శ్లోకంలో ఇలా చెప్పబడింది.

|| రాజయోగ మజానంత కేవల హఠకర్మణ:
ఏతానభ్యాసినో మన్యే అభ్యాస ఫల వర్జితాన్ ||

"రాజయోగాన్ని తెలియకుండా కేవలం హఠయోగం మాత్రమే అభ్యాసం చేసేవారు, ఒకపని కోసం ఎంతో కష్టపడి పనిచేసి, చివరకు దాని ఫలితాన్ని మాత్రం అందుకోలేని మనుషుల వంటి వారు" - అంటుంది ఈ శ్లోకం.

కనుక ఆసన, ప్రాణాయామాది సాధనల పరమగమ్యం ఇంద్రియనిగ్రహం, ధ్యానం, సమాధులతో కూడిన రాజయోగాన్ని సిద్ధింపజేసుకోవడమేగాని, నేడు చాలామంది చెబుతున్నట్లు ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడం కాదు. అయితే, ఆసనాల బై ప్రాడక్ట్ గా ఆరోగ్యం వస్తుంది. అంతటితోనే మాకు చాలు అంటే, యోగంలోని ఉన్నత స్థాయులు మనకు ఎప్పటికీ అందవు. అవి మాకు అవసరం లేదు. మాకు ఆరోగ్యం చాలు అని మీరనుకుంటే అది మీ ఖర్మ !

'అహం' నాశనమే సమాధి. సమాధే యోగగమ్యం. మరి యోగా వల్ల అహం పెరుగుతూ ఉంటే, ఆ సాధన సరియైన దిశలో సాగుతున్నట్లా, లేనట్లా? యోగా చేస్తూ అహంకారంతో నిండి ఉండటం కంటే, యోగా చెయ్యకపోయినా అహం లేకుండా ఉండటం శ్రేయస్కరం.

ఇంద్రియాల పరిధిని నువ్వు దాటాలి అని యోగం చెబుతుంటే, అదే యోగం చెయ్యడం ద్వారా ఇంద్రియభోగాలను ఇంకా ఎక్కువగా అనుభవించేలా మేం తయారౌతాం, అందుకోసమే మేం యోగా చేస్తున్నాం, ఈ ఫిజికల్ ఫిట్నెస్ ను మేం అందుకే వాడతాం అని యోగాభ్యాసపరులు అనుకుంటే, అసలు వాళ్ళు ఏం చేస్తున్నట్లు, ఎక్కడికి పోతున్నట్లు?

ప్రతిదాన్నీ, చివరకు ఆధ్యాత్మికతను కూడా మాకు అవసరమైనంత వరకే మేం వాడుకుంటాం, నిజానికి అది ఏం చెబుతోందో మాకు అవసరం లేదని అన్నప్పుడు అలాంటి ఆధ్యాత్మికత మనకెందుకు? అలాంటి యోగాను అసలు చేస్తేనేం? చెయ్యకపోతేనేం?
read more " యోగా చేస్తే అహంకారం పెరుగుతుందా? "

21, జూన్ 2018, గురువారం

జిల్లెళ్ళమూడి స్మృతులు - 19 (వాళ్ళ గురువు ఒక వేస్ట్ ఫెలో)












వెనక్కు తిరిగి మెల్లిగా నడుచుకుంటూ అక్కయ్య దగ్గరకు వచ్చి, ఆమె దగ్గర సెలవు తీసుకుని కారెక్కి తిరుగు ప్రయాణం మొదలు పెట్టాం.

చాలాసేపు కార్లో అందరం మౌనంగా ఉన్నాం. కారు ఏడో మైలురాయిని దాటి రోడ్డెక్కి పెదనందిపాడు వైపు సాగిపోతోంది.

'అక్కణ్ణించి బయల్దేరి వస్తుంటే మీకేమైనా అనిపించిందా అన్నగారు?' అని చరణ్ అడిగాడు.

'ఎందుకనిపించదు? అనిపించింది' అన్నాను.

'ఏమనిపించింది' అడిగాడు.

'అక్కణ్ణించి బయల్దేరి వస్తున్నామనిపించింది' చెప్పాను.

వింటున్నవారంతా నవ్వారు.

'మీకేమనిపించింది మూర్తిగారు' అడిగాడు చరణ్.

'మీరే చెప్పారు కదా ! నాది అన్నప్రాశన స్టేజి అని. నాకు రుచి చూడటమే గాని దాన్ని బయటకు చెప్పడం ఇంకా రాదు' అని మూర్తి జవాబిచ్చాడు.

'నాకు మాత్రం, ఇక్కడ నేనెందుకు శాశ్వతంగా ఉండలేకపోతున్నాను? అనిపించింది' - అన్నాడు చరణ్.

మేమెవరం మాట్లాడలేదు.

'మీకేమనిపించిది నాగమణి గారు?' అడిగాడు చరణ్.

'మా గురువుగారు తరచుగా ఒక మాట చెప్తారండి' అంది నాగమణి.

'ఏమిటి?' అన్నాడు చరణ్.

'దూరంతో పని లేదు. ఎక్కడైనా ఒక్కటే ఉంటుంది. మనం ఫీల్ కాగలిగితే' అని చెప్తూ ఉంటారు" - అన్నది.

'అది ఆయన స్థాయి మాట. మనకు వర్తించదు. మీకేమనిపించిందో చెప్పండి' అన్నాడు.

'మా గురువుగారి మాటే నా మాట' అంది నాగమణి.

వింటున్న నేను కల్పించుకుని ఇలా అన్నాను.

'మీ గురువుగారు చెప్పినది నాక్కూడా నచ్చలేదు నాగమణి ! ఆయన స్థాయిలో ఆయన మాట్లాడితే ఎలా? మనలాంటి సామాన్యులను దృష్టిలో ఉంచుకుని ఆయన చెప్పాలిగాని ఎంతసేపూ తనకోణం లోనుంచే అన్నీ చెబితే ఎలా?' అన్నాను.

అందరం నవ్వుకున్నాం.

ఇదంతా వింటున్న మా శ్రీమతి ఇలా అడిగింది.

'నాగమణి గురువుగారి గురించి నీ అభిప్రాయం ఏమిటి చరణ్?'

చరణ్ ఏదో చెప్పే ముందే నేనందుకుని - 'ఆ ! ఏముంది? వాడొక వేస్ట్ ఫెలో' అన్నాను.

మళ్ళీ నవ్వులు విరబూశాయి. వెంటనే నిశ్శబ్దం అలముకుంది. అందరూ మౌనంగా ఉండిపోయారు.

ఆలోచనలు మొదలయ్యాయి.

'మనకు ఇష్టమైన ప్రదేశం నుంచో, ఇష్టమైన మనుషుల నుంచో దూరం అయ్యేటప్పుడు బాధగానే ఉంటుంది. కానీ ఆ బాధనేది ఒక మాయ. ఎందుకంటే అదికూడా క్షణికమే. ఆ తర్వాత క్రమేణా అదీ సర్దుకుంటుంది. మనం జిల్లెల్లమూడిలోనే ఉండిపోయినప్పటికీ ఆ తృప్తి కూడా శాశ్వతం కాదు. ఏదో ఒకరోజున జిల్లెల్లమూడిని కూడా వదలిపెట్టి, ఈ శరీరాన్నే వదిలిపెట్టి వెళ్ళవలసి వస్తుంది. అమ్మ వెళ్లిపోలేదా? ఆ తర్వాత ఎందరు వెళ్ళిపోలేదు? మనకు ఇష్టమైన మనుషులైనా సరే, ఎంతకాలం మనం వారితో ఉంటాం? వారు మనతో ఉంటారు? ఏదైనా కొంతకాలమే. ఆ తర్వాత ఏంటి? మన శాశ్వత గమ్యస్థానం ఏమిటి? అదెక్కడుంది? అసలంటూ అదొకటి ఉందా? ఈరోజు ఉన్న ఇష్టం రేపుంటుందా? ఈరోజు మనల్ని ఇష్టపడినవాళ్ళు రేపు కూడా అదే రకంగా ఇష్టపడతారా? ఎప్పటికీ అలాగే ఉంటారా? మనంకూడా వాళ్ళతో అలాగే ఉండగలమా? ఇవన్నీ జరిగే పనులేనా? చెదిరిపోని శాంతి, తరిగిపోని ప్రేమ అనేవి ఈలోకంలో ఉన్నాయా? మనకు దొరుకుతాయా?

వసుంధరక్కయ్య చెప్పిన మాట గుర్తొచ్చింది.

'ఈ క్షణానికి ఇది సత్యం. అంతే. మరుక్షణం అది గతం.'

అంటే, ఈ సృష్టిలోగాని, మన జీవితంలోగాని శాశ్వతత్వం ఏదీ లేదు. ఏదీ ఎల్లకాలం మనతో ఉండదు. ఎవరూ మనవాళ్ళు కారు. మనమూ ఎవరి వాళ్ళమూ కాము. ఈ క్షణానికి ఇక్కడున్నాం. రేపెక్కడో ఎవరికీ తెలీదు. ప్రతి ప్రయాణమూ ఒక జీవితమే. ప్రతి ప్రయాణానికీ మనం పెట్టుకున్న ఒక గమ్యం ఉంటుంది. మరి ఈ జీవిత పయనంలో చివరికి మనం చేరేది ఎక్కడికి? ఈ పయనంలో చివరకు మిగిలేది ఏమిటి?

మనస్సు లోలోపలకు వెళ్ళిపోతోంది. ఆలోచనలు ఆగిపోయాయి.

ఏదో ఒక స్థితి ఉవ్వెత్తున లేచి మనసంతా నిండిపోయినట్లు అయింది. అది నిరాశా కాదు. నిస్సత్తువా కాదు. వేదనా కాదు. బాధా కాదు. అందులో ఎదురుచూపూ లేదు. భగ్నత్వమూ లేదు. గతం ఏమీ గుర్తురావడం లేదు. ముందుముందు ఏమౌతుందో అన్న చింతనా లేదు. పోనీ అది శూన్యమా అంటే అదీ కాదు. పోనీ అందులో ఏదో ఉందా అంటే ఏమీ లేదు.

ఆ స్థితిలో, కిటికీలోనుంచి బయట కనిపిస్తున్న చీకటిని చూస్తూ ఉండిపోయాను.

కారు పోతోంది. ఎక్కడికో తెలీని అనంతత్వంలోకి అన్నట్లు ప్రయాణం సాగుతోంది. అందరం అలా ఉన్నాం అంతే.

ఈ క్షణానికి ఇదే సత్యం.

(అయిపోయింది)
read more " జిల్లెళ్ళమూడి స్మృతులు - 19 (వాళ్ళ గురువు ఒక వేస్ట్ ఫెలో) "