“నీ పనులు కావడమూ కాకపోవడమూ రెండూ దైవానుగ్రహమే"- జిల్లెళ్ళమూడి అమ్మగారు

17, ఆగస్టు 2018, శుక్రవారం

బ్లాగు భేతాళ కధలు - 5 (స్వామి ప్రత్యంగిరానంద పటాటోపి)


ఈ సంభాషణ జరిగిన తర్వాత ఒకటి రెండు నెలలపాటు సూర్య మళ్ళీ నాకు ఫోన్ చెయ్యలేదు. 'ఏం జరిగిందో ఏమోలే!' అని నేనూ అడగలేదు. ఇలా ఉండగా ఉన్నట్టుండి ఒకరోజున మళ్ళీ సూర్యనుంచి ఫోనొచ్చింది.

'ఏమైంది సూర్యా? నీ సమస్య తీరిందా? హోమం చేయించావా? మీ ముత్తాత ఇంకా అటకమీదే ఉన్నాడా వెళ్ళిపోయాడా?' అడిగాను.

'ఏమో ఎవరికి తెలుసు? ఇప్పుడాయన్ని పట్టించుకోవడం మానేశాం' అన్నాడు.

'అదేంటి మరి ఇప్పుడెవర్ని పట్టించుకుంటున్నావ్?' అడిగాను.

'అదో పెద్ద కధలే. ఈ రెండు నెలల్లో చాలా జరిగింది.' అన్నాడు.

'ఏంటో చెప్పు మరి.' అన్నాను ఉత్సాహంగా.

చెప్పడం మొదలుపెట్టాడు సూర్య.

'ఒకరోజున అర్జెంటుగా రమ్మని స్వామీజీనుంచి ఫోనొచ్చింది నాకు. ఆశ్రమానికి వెళ్లాను. అక్కడే మాతాజీ పరిచయమైంది.' అన్నాడు.

'మధ్యలో ఈమెవరు?' అడిగాను.

'స్వామీజీ తర్వాత ప్రస్తుతం నెంబర్ టు పొజిషన్ లొ ఉంది. ఈమె పేరు మాతా దివ్యభారతి' అన్నాడు.

'అదేంటి అదేదో హీరోయిన్ పేరులా ఉందే? ఆమె ఏదో యాక్సిడెంట్లో చనిపోయింది కదూ?' అడిగాను నాకున్న కొద్దో గొప్పో సినిమా నాలెడ్జి ఉపయోగిస్తూ.

'అవును. స్వామీజీగా మారకముందు ఈయన హైదరాబాద్ లో ఒక కోచింగ్ సెంటర్ నడిపేవాడు. ఆ టైంలో దివ్యభారతి అని ఒక సినిమా యాక్టర్ ఉండేది. ఈయన ఆమెకు వీరాభిమాని. అప్పట్లో దివ్యభారతి ఫాన్స్ అసోసియేషన్ కు అధ్యక్షుడిగా ఉన్నాడు కూడా. ఆమె అర్ధాంతరంగా చనిపోయింది. ఆ బాధలో ఈయన చాలాకాలం పిచ్చోడిలా హైదరాబాద్ రోడ్లమీద తిరిగాడు. అందుకని స్వామీజీగా మారాక కూడా తన అభిమాన నటిని మర్చిపోలేక తన శిష్యురాలికి ఈ పేరు పెట్టుకున్నాడు' అన్నాడు.

'పాపం ! ఆ తారంటే లవ్వు చాలా ఎక్కువగా ఉన్నట్టుందే? సన్యాసాశ్రమం స్వీకరించాక కూడా పూర్వాశ్రమాన్ని మర్చిపోలేక పోతున్నాడల్లే ఉంది.' అన్నాను.

'నాకూ అలాగే అనిపించింది.' అన్నాడు సూర్య.

'సర్లే కథలోకి రా' అన్నాను.

'నేను వెళ్లేసరికి 'ద్రౌపదీ వస్త్రాపహరణ ఘట్టాన్ని' ఎంతో రసవత్తరంగా ఒక గంటనుంచీ ఉపన్యాసం చెబుతున్నాడు స్వామీజీ' అన్నాడు సూర్య.

నేను పడీ పడీ నవ్వాను.

'ఏం? అంతసేపు వర్ణించడానికి అంతకంటే మంచి ఘట్టం ఇంకేమీ దొరకలేదా ఆయనకు?' అడిగాను.

'నవ్వకు. అది ఆయన ఫేవరేట్ ఘట్టాలలో ఒకటి. ఇంకోటి - గోపికా వస్త్రాపహరణం' అన్నాడు సూర్య.

'ఈ వస్త్రాపహరణ ఘట్టాలు తప్ప ఇంకేమీ లేవా అంతలా వర్ణించి మరీ చెప్పడానికి మన పురాణాల్లో?' అడిగాను అయోమయంగా.

'ఉన్నాయి. నీళ్ళ మధ్యలో ఉన్న పడవలోనే మత్స్యగంధికి పరాశర మహర్షి ఏ విధంగా గర్భాదానం చేశాడో కూడా రెండుగంటల పాటు బోరు కొట్టకుండా వర్ణించగలడు ఆయన' అన్నాడు సూర్య భక్తిగా గుడ్లు తేలేస్తూ.

'అదేంటి? గర్భాదానాలూ, సద్యోగర్భాలూ, ప్రసవాలూ ఇవా ఆయన చెప్పేది వీళ్ళు వినేది? దీనికంటే ఆ వస్త్రాపహరణ ఘట్టాలే నయమేమో?' అడిగాను నేను మళ్ళీ అమాయకంగా.

'ఏదో ఒకట్లే ! ఆయనలాంటి కధలే చెబుతున్నాడు. మధ్యలో నువ్వు నన్ను క్వశ్చన్ చేస్తే నేనేం చేసేది? ఆయన టేస్ట్ అది. అంతే !' అన్నాడు సూర్య విసుగ్గా.

'సరే చెప్పు' అన్నా నోటిమీద వేలేసుకుంటూ.

'ఉపన్యాసం అయిపోయింది. జనం అంతా, గొప్ప కధను వినిన తన్మయత్వంలో, జోంబీల్లా తూలుతూ ఇళ్ళకు వెళ్ళిపోతున్నారు. నేను మెల్లిగా స్వామీజీ దగ్గరకు వెళ్లాను. నన్ను చూస్తూనే స్వామీజీ కోపంగా ' ఏమండి? మేము చెప్పిన ఆదేశాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు మీరు. ఇది మీకు మంచిది కాదు. ఒక ప్రేతాత్మను అలా ఇంట్లో ఉంచుకోకండి. ముందు ముందు మీకుగాని మీ ఫేమిలీకి గాని ఏదైనా జరిగితే నేను బాధ్యున్ని కాను.' అన్నాడు.

'కొన్ని కారణాల వల్ల హోమం ప్రస్తుతం చేయించలేను స్వామీజీ. నన్నర్ధం చేసుకోండి' అన్నాను ఆయన కాళ్ళకు ప్రణామం చేస్తూ.

సాలోచనగా తల పంకించాడు స్వామీజీ.

'అర్ధమైంది. ప్రేతాత్మ శక్తి చాలా ఎక్కువగా ఉంది. అందుకే మిమ్మల్ని హోమం చెయ్యనివ్వడం లేదది. సరే. ఉపాయం చెప్తాను. చేస్తారా మరి?' అన్నాడు కోపంగా.

'చెప్పండి స్వామీ' అన్నాను నేనూ నిజంగానే భయపడుతూ.

ఆయన వెంటనే పక్కనున్న మాతా దివ్యభారతి వైపు తిరిగి ' మాతాజీ ! ఆయనకు ప్రత్యంగిరా మంత్రాన్ని ఉపదేశించండి.' అంటూ నావైపు తిరిగి - 'ఈ మంత్రాన్ని కోటిసార్లు జపం చేసి ఆ తర్వాత మళ్ళీ రండి. అప్పుడు మీరు హోమం చెయ్యగలుగుతారు.' అన్నాడు.

ఆ మాతాజీ దగ్గర ఒక కాగితాల కట్ట ఉంది. స్వామీజీ చెప్పినప్పుడల్లా ఈమె మంత్రాలను కాగితం మీద వ్రాసి జనానికి ఇస్తోంది. అలా నాకూ ఒక కాయితం ఇచ్చింది.

'అందులో ఆ మంత్రం ఉందా?' అడిగాను నేను కుతూహలంగా.

'లేదు. ఆమె ఫోన్ నంబరుంది' అన్నాడు సూర్య చాలా సీరియస్ గా.

బిత్తరపోయాన్నేను.

'అదేంటి కధ ఇలా ట్విస్ట్ అయింది. ఆమె తన ఫోన్ నంబర్ని నీకిచ్చిందా?' అన్నాను ఆశ్చర్యంగా.

'ఆ! లేకపోతే నీ ఫోన్ నంబర్ ఇస్తుందా? ముందు నేనూ నీలాగే ఆశ్చర్యపోయాను. తలెత్తి ఆమెకేసి చూశాను. 'ప్లీజ్. అర్ధం చేసుకోండి' అన్నట్లు సైగ చేసింది కళ్ళతో.' అన్నాడు సూర్య.

'మరి స్వామీజీ ఇదంతా చూడలేదా?' అడిగాను ఆశ్చర్యంగా.

'ఆయన ఇంకో కస్టమర్ తో బిజీగా ఉన్నాడు. మమ్మల్ని పట్టించుకునే పరిస్థితిలో లేడు' అన్నాడు సూర్య.

'డామిట్ ! కధ అడ్డం తిరిగినట్టుందే?' అనుకున్నా మనసులో.

(ఇంకా ఉంది)
read more " బ్లాగు భేతాళ కధలు - 5 (స్వామి ప్రత్యంగిరానంద పటాటోపి) "

15, ఆగస్టు 2018, బుధవారం

బ్లాగు భేతాళ కధలు - 4 (స్వామి ప్రత్యంగిరానంద పటాటోపి)

'ఒకరోజున ఏదో దుర్ముహూర్తంలో ఏమీ తోచక యూట్యూబ్ లొ వెదుకుతూ ఉంటే ఈ స్వామీజీ గురించి సమాచారం కనిపించింది.' అన్నాడు సూర్య.

'అలాగా' అన్నాను.

ఏమీ తోచక ఇంటర్ నెట్లో లేజీగా వెదకడమే చాలాసార్లు మనిషిని చెడగొడుతూ ఉంటుంది. నా బ్లాగు కూడా ఇలాగే చాలామందికి కనిపిస్తూ ఉంటుంది.

'చుండూరి సోమేశ్వర్ అని ఒకాయనున్నాడు. ఆయన ఈ స్వామీజీకి వీరభక్తుడు. ఆయనొక వీడియో చేసి నెట్లో పెట్టాడు. అందులో ఈయన్ని "నడిచే శంకరాచార్య - పాకే ప్రత్యంగిరానంద" అంటూ తెగ పొగిడాడు.' అన్నాడు.

'అదేంటి? పాకే ప్రత్యంగిరానందా? అలా పెట్టాడేంటి?' అడిగాను నవ్వుతూ.

'బహుశా ప్రాసకోసం అలా పెట్టి ఉంటాడు. పైగా స్వామీజీ చేతిలో ఒక కర్రతో మెల్లిగా పాకుతున్నట్లే నడుస్తాడు' అన్నాడు సూర్య.

'సో ! ఆ వీడియో చూచి నువ్వు ఫ్లాట్ అయిపోయావన్నమాట' అన్నాను.

'ఊ! అదే మరి నా ఖర్మ! అదీగాక మా కజిన్ బాలాజీ కూడా ఈయన గురించి గొప్పగా చెప్పాడు' అన్నాడు.

'మీ కజిన్ కి ఎంతమంది స్వామీజీలతో సంబంధాలున్నాయి?' అడిగాను నవ్వుతూ.

'వాడికి చాలామంది తెలుసు.' అన్నాడు.

'సరే. ఏం చెప్పాడెంటి బాలాజీ ఈయనగురించి?' అడిగాను.

'ఈయన మహా మాంత్రికుడట. చేతబడులు వదిలిస్తాడట. దయ్యాల్ని పారద్రోలతాడట. వశీకరణం కూడా వచ్చట. పూర్వజన్మలు తెలుసట. ఇంకా ఇలాంటివే ఏవేవో చెప్పాడు' - అన్నాడు.

'అవన్నీ నువ్వు నమ్మావా?' అడిగాను.

'నమ్మలేదు. కానీ పుస్తకంలో స్వామీజీ వ్రాసుకున్నాడు. 400 ఏళ్ళ తర్వాత తను హైదరాబాద్ లో పుడతానని అప్పట్లోనే బుద్దాశ్రమంలో చెట్టుమీద ఒక కోతి మిగతా కోతులతో చెప్పిందట' అన్నాడు.

'ఈ సోది సర్లేగాని, స్వామీజీ అన్నావ్ కదా? మరి ఈ మంత్రగాడి వేషాలేంటి? సంప్రదాయ స్వామీజీలకు ఉండాల్సిన లక్షణాలు ఇవికావు కదా?' అడిగాను.

'వాళ్ళు పనికిరాని వాళ్ళనీ, తాను నిజమైన శక్తి ఉన్నవాడిననీ, స్వామీజీ అయినప్పుడు ఇతరుల బాధలు తీర్చాలనీ ఈయన అంటాడు. ఈయన చాలా మహిమలు కూడా చేశాడని ఆ బుక్కులో వ్రాశారు.' అన్నాడు.

'ఏం చేశాదేంటి మహిమలు?' అడిగాను.

'ఈయనొకసారి లేటుగా ఎయిర్ పోర్టుకు వచ్చాడట. ఈయన ఎక్కాల్సిన విమానం టేకాఫ్ అయి వెళ్ళిపోయి అప్పటికే అరగంట అయిందట. విమానం వెళ్ళిపోయిందని వాళ్ళు చెబితే ఈయన నవ్వి ప్రత్యంగిరా మంత్రాన్ని జపిస్తూ లాంజ్ లొ కూచున్నాడట. ఈలోపల, ఆకాశంలో వేల అడుగుల ఎత్తులో ఎగురుతున్న విమానం, పైలట్ పట్టు తప్పి, ఎవరో నడుపుతున్నట్లు వెనక్కి తిరిగి, రూటు మార్చుకుని, ఇదే ఎయిర్ పోర్ట్ కి వచ్చి దిగిందట. స్వామీజీ చిద్విలాసంగా నవ్వుతూ విమానం ఎక్కాక మళ్ళీ టేకాఫ్ అయిందట. ఇదంతా బుక్కులో వ్రాశారు.' అన్నాడు.

'ఈ చెత్తంతా నువ్వు నిజంగా నమ్ముతున్నావా?' అడిగాను సీరియస్ గా.

'లేదనుకో. కానీ ఆ బుక్కంతా ఇలాగే ఉంది. కాసేపు రిలాక్సేషన్ కోసం సరదాగా చదువుతూ నవ్వుకుంటున్నా అంతే! ఇంకా ఉంది విను. విమానం వెళ్ళిపోయిందని చెప్పి స్వామీజీని లోపలకు రానివ్వని ఎయిర్ పోర్ట్ స్టాఫ్ రక్తం కక్కుకుని ఈ శిష్యుల కళ్ళముందే చనిపోయిందట.' అన్నాడు.

'అదేంటి? ఆమె తప్పేముంది అందులో? ఫ్లైట్ టైముకి నువ్వు రావాలి. అంతేగాని అది వెళ్ళిపోయిన గంటకు లార్డులాగా వచ్చి తను చేసిన తప్పుకి అక్కడ స్టాఫ్ కి శాపాలు పెడతానంటే అదేమి దివ్యత్వం నా బొందలా ఉంది. ఇలాంటి చెత్త వ్రాసినవాడిని అనుకోవాలి ముందు' అన్నాను.

'ఈయన స్పీచులూ ఈయన భక్తుల వ్రాతలూ అన్నీ ఇలాగే చవకబారు మహిమలతో కూడుకుని ఉంటాయి.' అన్నాడు సూర్య.

'బాబోయ్! నేనిక భరించలేనుగాని ఆపు. ఈ కట్టుకథలు ఎలా నమ్ముతున్నారో జనం?' అడిగాను విసుగ్గా.

'నమ్మడమేంటి? మనం ఇలా మాట్లాడుతున్నామని తెలిస్తే మనల్ని రాళ్ళతో కొట్టి చంపుతారు. అంత వీరభక్తులున్నారు ఈయనకు. అంతేకాదు. ఇంకా ఉన్నాయి విను. వాజపేయిగారికి ఒక సమయంలో దయ్యం పడితే ఈయన హోమం చేసి వదిలించాదట. ఆ బుక్కులో వ్రాసుంది.' అన్నాడు సూర్య.

'వాయ్యా !' అని అరుస్తూ జుట్టు పీక్కోవాలని బలంగా అనిపించింది. ఆ చాన్స్ మనకు లేదుగనుక చేతిలో ఉన్న పేపర్ని పరపరా చించి పారేసి కసితీర్చుకున్నా.

'ఇవన్నీ చదివి కూడా మళ్ళీ ఆ స్వామీజీ దగ్గరకు వెళ్లావు చూడు! అక్కడ నీకు హాట్సాఫ్ ' అన్నా.

'ఏం చెయ్యను? ఫిట్టింగ్ పెట్టాడు కదా?' అన్నాడు నీరసంగా.

'ఏం పెట్టాడు?' అడిగాను.

'మొదటిసారి మా అబ్బాయిని తీసుకుని ఆయన బ్లెస్సింగ్స్ కోసం వెళ్ళినపుడే ఒక మాటన్నాడు.'మీ ఇంట్లో దోషం ఉంది. అందుకే మీకు చిన్నవయసులోనే షుగర్ వచ్చింది' అన్నాడు.

'అదేంటి నీకు షుగర్ ఉన్నట్టు ఆయనకెవరు చెప్పారు?' అడిగాను.

'నేనే చెప్పాను. ఏదో మాటల సందర్భంలో చెబితే ఇక దాన్ని పట్టుకుని "మీ ఇంట్లో దోషం ఉంది నేను చూడాలి" అని బ్లాక్ మెయిల్ మొదలెట్టాడు.' అన్నాడు సూర్య.

'ఏంటి కొంపదీసి మీ ఇంటికి తీసికెళ్లావా?' అడిగాను.

'అవును. అదీ అయింది ఒకరోజున.' అన్నాడు సూర్య.

'ఏమన్నాడు మీ ఇల్లు చూచాక?' అడిగాను.

'నువ్వు చెబితే ఆశ్చర్యపోతావని ఇందాక అన్నాను కదా? ఆ ఘట్టం ఇప్పుడొచ్చింది. కాస్త గట్టిగా దేన్నైనా పట్టుకుని విను పడిపోకుండా' అన్నాడు.

'సరే చెప్పు.' అన్నాను నవ్వుకుంటూ.

'మా ఇంట్లోకి అడుగు పెడుతూనే సడన్ గా కాలు వెనక్కు తీసుకుని స్టన్ అయినట్లు బయటే ఉండిపోయాడు కాసేపు. అక్కడే మాకు భయం వేసింది' అన్నాడు సూర్య.

'ఇది చాలా పాత టెక్నిక్. 'చంద్రముఖి' సినిమాలో రామచంద్ర సిద్ధాంతి ఇదే చేశాడు. చూడలేదా నువ్వు?' అడిగాను.

'నువ్వు జోకులాపు. మా గడపలో ఆయనిచ్చిన ఎక్స్ ప్రెషన్ కి మాకందరికీ చెమటలు పట్టాయి' అన్నాడు.

ఆ సీన్ ఊహించుకుంటే భలే నవ్వొచ్చింది.

'సరే ఏమైందో చెప్పు?' అన్నాను ఆత్రుతగా.

'కాసేపటికి లోపలకొచ్చి కూచున్నాడు. అప్పుడు చల్లగా ఈ విషయం చెప్పాడు. ఎప్పుడో చనిపోయిన మా ముత్తాత దయ్యమై మా ఇంట్లోనే ఉన్నాడుట. మా ఇంటి అటకలో ఆయన కూచుని ఉన్నాడని, తను లోపలకొస్తుంటే వద్దని ఉగ్రంగా అరిచాడని చెప్పాడు స్వామీజీ' అన్నాడు.

పడీ పడీ నవ్వాను.

'నీకు బాధేసి ఉండాలే చాలా దారుణంగా?' అడిగాను సింపతీ వాయిస్ పెట్టి.

'అవును. నేనూ మా ఆవిడా హాయిగా ఏసీ బెడ్రూములో డబల్ బెడ్ మీద నిద్రపోతుంటే మా ముత్తాత అలా అటకమీద కూచుని ఉంటే బాధగా ఉండక ఇంకేముంటుంది? ' అన్నాడు సూర్య ఏడుపు గొంతుతో.

'దీనికి ఇంత బాధపడాల్సినది ఏముంది? వెరీ సింపుల్' అన్నాను.

'ఎలా?' అడిగాడు.

'ఏముంది? మీ ముత్తాతని బెడ్రూంలో పడుకోబెట్టి నువ్వూ మీ ఆవిడా అటకెక్కి కూచుంటే సరి ! ప్రాబ్లం సాల్వ్' అన్నాను నవ్వుతూ.

'నేనింత బాధగా చెబుతుంటే నీకు జోకులుగా ఉందా?' అన్నాడు సూర్య కోపంగా.

'సర్లే సర్లే కోప్పడకు. ఆ తర్వాత స్వామీజీ ఏమన్నాడు?' అడిగాను.

'మీ ఇంటి నడిబొడ్డులో హోమం చెయ్యాలి. నేనే చేస్తాను. అప్పుడు అటకమీదున్న మీ ముత్తాతకు మోక్షం వచ్చేస్తుంది. అన్నాడు స్వామీజీ' చెప్పాడు సూర్య.

'పోన్లే పాపం! హోమం ఫ్రీనేగా?' అడిగాను.

'అబ్బా ! మసాలా దోశేం కాదూ? అయిదు లక్షలౌతుందని చెప్పాడు?'

'అవునా? మరి చేయించావా ఏంటి కొంపదీసి?' అడిగాను.

'అదే ఆలోచిస్తున్నాను. మా ఆవిడేమో వద్దంటోంది. నాకేమో పోనీలే చేయిద్దాం అనిపిస్తోంది.' అన్నాడు.

'అదేంటి? ఆమె అలా అంటోందా?' అడిగాను.

'అవును. మా ఆవిడకు మా వైపు వాళ్ళంటే అస్సలు పడదు. ఎప్పుడో చచ్చినవాళ్ళ గురించి ఇంత బాధేంటి? ఏమీ వద్దు. అంటోంది తను.' అన్నాడు.

'నీకంటే మీ మిసెస్సే ప్రాక్టికల్ గా ఉంది సూర్యా' అన్నాను.

'నిన్నటిదాకా నేనూ ప్రాక్టికలే. స్వామీజీ కొట్టిన ఈ సెంటిమెంట్ దెబ్బతో కూలబడ్డాను. ఇప్పుడెం చెయ్యాలో అర్ధం కావడం లేదు. ఆ అటక వైపు చూసినప్పుడల్లా భయం వేస్తోంది.' అన్నాడు సూర్య నీరసంగా.

(ఇంకా ఉంది)
read more " బ్లాగు భేతాళ కధలు - 4 (స్వామి ప్రత్యంగిరానంద పటాటోపి) "

'సెల్ ఫోన్ పోయింది' - ప్రశ్నశాస్త్రం

మీ జీవితంలో అతి ముఖ్యమైన వస్తువేది అని ఇప్పుడెవర్నైనా అడిగితే అందరూ - 'మొబైల్ ఫోన్' అంటూ ఒకేమాట చెబుతున్నారు. చాలామంది ఆడాళ్ళు కూడా, మెళ్ళో ఉన్న మంగళసూత్రం ఎక్కడైనా పెట్టి మర్చిపోయినా బాధపడటం లేదుగాని సెల్ ఫోన్ మర్చిపోతే మాత్రం తెగ గాభరా పడిపోతున్నారు. చార్జర్ మర్చిపోతే ఇంకా హైరాన పడిపోతున్నారు. అంతగా ఈ రెండూ మన జీవితాలలో ముఖ్యమైన భాగాలై పోయాయి.

13-8-2018 న మధ్యాన్నం 11-45 కి ఒకరు ఈ ప్రశ్న అడిగారు.

'కొన్ని రోజులక్రితం మా సెల్ ఫోన్ పోయింది. మాకు ఇద్దరి మీద అనుమానంగా ఉంది. వారిలో ఎవరో చెప్పగలరా?'

'చెబితే ఏం చేస్తారు?' అడిగాను.

'ప్రస్తుతం ఏమీ చెయ్యలేము. ఊరకే తెలుసుకుందామని.'

'ఊరకే తెలుసుకుని చేసేదేమీ లేదు. కనుక ఈ ప్రశ్న చూడను.' అన్నాను.

'ప్లీజ్ ప్లీజ్. కొద్దిగా చూడండి. అది దొరికినా దొరక్కపోయినా కనీసం మా మానసిక ఆందోళన అయినా తీరుతుంది.' అంటూ ఆ వ్యక్తి చాలా బ్రతిమిలాడిన మీదట తప్పక, ప్రశ్న చార్ట్ చూడటం జరిగింది.

ఆరోజు సోమవారం. శుక్రహోరలో ప్రశ్న అడుగబడింది. మొన్న కాలేజీలో కూడా ఇదే హోరలో ప్రశ్న వచ్చింది. కానీ ఆ రోజు వారం వేరు. వారం మారినా అదే హోరలో ప్రశ్న రావడానికి శుక్రుని బలమైన నీచస్థితి కారణం. దశ గమనించాను. శుక్ర-శని-శుక్రదశ జరుగుతున్నది.

'మీకు అనుమానం ఉన్న ఒక మనిషి బ్రాహ్మణకులానికి చెందినవాడు' అన్నాను చార్ట్ చూస్తూనే.

'ఎలా చెప్పారు' అడిగాడా వ్యక్తి కుతూహలంగా.

'ఎలా చెప్తే మీకెందుకు? అవునా కాదా?' అడిగాను.

'అవును' అన్నాడు.

'అతనే మీ ఇంటికొచ్చి సెల్ ఫోన్ దొంగిలించాడని మీ అనుమానం. ఇది మీ ఇంట్లోనే జరిగింది. బయట కాదు.' అన్నాను.

'నిజమే' అన్నాడు.

'మీరు అనుమాన పడుతున్న రెండోవ్యక్తి మీ పనిమనిషి. నిజమా కాదా?' అన్నాను.

అడిగిన వ్యక్తి నోరెళ్ళబెట్టాడు.

'నిజమే' అన్నాడు.

'తీసింది పనిమనిషే. మొదటివ్యక్తి కాదు.' అన్నాను.

'ఎలా చెప్పగలిగారు?' అడిగాడు.

'ఈ శాస్త్రానికి కొన్ని లాజిక్స్ ఉంటాయి. ఇందులో ప్రవేశం లేకపోతే అవి మీకు అర్ధం కావు' అన్నాను.

'అర్ధం చేసుకోడానికి ట్రై చేస్తాను. చెప్పండి.' అన్నాడు.

'షష్టాధిపతి గురువు బ్రాహ్మణుడు. అతను లగ్నంలోకొచ్చి ఉన్నాడు. అంటే దొంగ మీ ఇంటికి వచ్చి దొంగతనం చెయ్యాలి. అదే జరిగిందని మీరు అనుమానిస్తున్నారని ఇది చెబుతోంది. కానీ ఇది నిజం కాదు. ఎందుకంటే ఆరూఢలగ్నం సింహం అయింది. అక్కడనుంచి షష్టాధిపతి శనీశ్వరుడు అయ్యాడు. ఆయన పనివాళ్ళను సూచిస్తాడు. ఆయన వక్రించి మీ చతుర్ధంలోకి వస్తాడు. అంటే ఇంట్లోకి వచ్చి దొంగతనం చేస్తాడు. గురువుకు తులకంటే, శనికి వృశ్చికం చాలా ఇబ్బందికర ప్రదేశం. పైగా. సెల్ ఫోన్ అనేది కమ్యూనికేషన్ ను సూచిస్తుంది. అంటే తృతీయంతో సంబంధం ఉండాలి. తులాలగ్నం నుంచి గురువు తృతీయానికి అధిపతే. కానీ, సింహం నుంచి అయితే, తృతీయాదిపతి అయిన శుక్రుడు ద్వితీయంలో నీచలో ఉంటూ, విలువైన వస్తువులను అందులోనూ కమ్యూనికేషన్ కు పనికొచ్చే విలువైన వస్తువులు పోవడాన్ని సూచిస్తున్నాడు. ఆ శుక్రుని మీద దొంగ అయిన శనీశ్వరుని దశమ దృష్టి కూడా ఉన్నది. అంటే, మీ పనిమనిషి కన్ను ఈ సెల్ ఫోన్ మీద ఉన్నదని అర్ధం. పైగా, మనస్సుకు దాని దుర్బుద్ధికీ సూచకుడైన చంద్రుడు కూడా ఆరూఢలగ్నంలోనే ఉన్నాడు. కనుక సింహలగ్నం నుంచి సరిపోయినట్లు తులాలగ్నం సరిపోవడం లేదు. పైగా, దశాధిపతులు కూడా శనిశుక్రులే అయ్యారు. కనుక సింహలగ్నమే ఎనాలిసిస్ కు కరెక్ట్. కాబట్టి, లగ్నంలో ఉన్న గురువును బట్టి, మీ అనుమానం మొదటి వ్యక్తిమీద బలంగా ఉన్నప్పటికీ, తీసినది మాత్రం రెండో వ్యక్తే.' అన్నాను.

'ఆ ఇద్దరూ ప్రస్తుతం ఎక్కడున్నారో చెప్పగలరా?' అడిగాడు.

'ఆ బ్రాహ్మిన్ వ్యక్తి ప్రస్తుతం మీ ఇంటి దగ్గర లేడు. వెళ్ళిపోయాడు.' అన్నాను మేషంలో శనికి నీచస్థానంలో ఉన్న గురువును నవాంశలో గమనిస్తూ.

'నిజమే. వాళ్ళు ఇల్లు ఖాళీ చేసి వేరే ఊరికి వెళ్ళిపోయారు' అన్నాడు.

'మీ పనిమనిషి కూడా ఇప్పుడు మీ ఇంట్లో పని మానేసింది.' అన్నాను వక్రత్వంలో ఉన్న శనీశ్వరుడిని గమనిస్తూ.

'నిజమే. ఈ సంఘటన జరిగిన కొద్ది రోజులకే మానేసింది.' అన్నాడు.

'మరి ఇప్పుడేం చేద్దామని అనుకుంటున్నారు?' అడిగాను.

'ఏమీ చెయ్యను. కొత్త ఫోన్ వెంటనే కొనుక్కున్నాను. ఏది లేకపోయినా బ్రతగ్గలం గాని ఫోన్ లేకపోతే బ్రతకలేం కదా !' అన్నాడు.

'మంచి జీవితసత్యాన్ని గ్రహించారు. ఇకనైనా జాగ్రత్తగా ఉండండి' అన్నాడు.

'సరే. థాంక్సండి.' అంటూ అతను వెళ్ళిపోయాడు.
read more " 'సెల్ ఫోన్ పోయింది' - ప్రశ్నశాస్త్రం "

14, ఆగస్టు 2018, మంగళవారం

Dil Aisa Kisine Mera Toda - Kishore Kumar


Dil Aisa Kisine Mera Toda - Barbadi Ki Taraf Aisa Moda

అంటూ కిషోర్ కుమార్ అధ్బుతంగా ఆలపించిన ఈ గీతం 1975 లో వచ్చిన Amanush అనే చిత్రంలోనిది. ఈ గీతానికి బెంగాలీ సంగీత దర్శకుడు Shyamal Mitra గుండెల్ని పిండేసే రాగాన్ని సమకూర్చాడు. కిషోర్ ఎంతో భావయుక్తంగా దీనిని పాడాడు. ఈ పాటలో ఉత్తమ్ కుమార్, షర్మిలా టాగోర్ నటించారు. ఉత్తమ్ కుమార్ ఈ పాటలో అతి తక్కువ కదలికలలో ఎంతో చక్కని భావాన్ని పలికించాడు.

ఇదే రాగాన్ని తీసుకుని 'ఎదురీత' అనే తెలుగు చిత్రంలో ' ఎదురీతకు అంతం లేదా, నా మదిలో రేగే గాయం మానిపోదా' అంటూ ఒక పాట చేశారు. అదీ మంచి గీతమే. తెలుగులో బాల సుబ్రహ్మణ్యం పాడారు.

1975 ప్రాంతంలో ఈ పాటను విని ఏడవని భావుకులు లేరంటే అతిశయోక్తి కాదు. ఈ సుమధుర పాథోస్ రొమాంటిక్ గీతాన్ని నా స్వరంలో కూడా వినండి మరి !

Movie:-- Amanush (1975)
Lyrics:--Indeevar
Music:--Shyamal Mitra
Singer:--Kishore Kumar
Karaoke Singer:--Satya Narayana Sarma
Enjoy
---------------------------------------------
Humming...
Dil Aisa kisine mera toda – Barbadi ki taraf aisa moda
Dil Aisa kisine mera toda – Barbadi ki taraf aisa moda
Ek bhale manush ko – Amanush banake choda
Dil Aisa kisine mera toda – Barbadi ki taraf aisa moda

Sagar kitna mere paas hai – Mere jeevan me phir bhi pyas hai
Sagar kitna mere paas hai – Mere jeevan me phir bhi pyas hai
Hai pyas badi jeevan toda – Amanush banake choda
Dil Aisa kisine mera toda – Barbadi ki taraf aisa moda

Kehte hai ye duniya ke raaste – Koi manzil nahi tere vaste
Kehte hai ye duniya ke raaste – Koi manzil nahi tere vaste
Nakaamiyon se naata mere joda – Amanush banake choda
Dil Aisa kisine mera toda – Barbadi ki taraf aisa moda

Dooba suraj phirse nikle – Rehta nahi hai andhera
Mera suraj aisa rutha – Dekha na manina savera
Ujalon ne saath mera choda - Amanush banake choda
Dil Aisa kisine mera toda – Barbadi ki taraf aisa moda
Ek bhale manush ko – Amanush banake choda
Dil Aisa kisine mera toda – Barbadi ki taraf aisa moda-2
Barbadi ki taraf aisa moda

Meaning

Some one has broken my heart
and pushed me towards utter ruin
I was a good human being
but her rejection made me an unhuman

I have an ocean around me
even then, my life is full of thirst
Thirst is more, life is less
Her rejection made me an unhuman

The paths of this world tell me
that I have no resting place here
My companion thought that I was useless
and left me in the lurch

The Sun who sets, rises again
Darkness is not forever
However, my Sun was so unhappy with me
I never saw a dawn till now
Lights have left my company
Her rejection made me an unhuman

Some one has broken my heart
and pushed me towards utter ruin
I was a good human being
but her rejection made me an unhuman

తెలుగు స్వేచ్చానువాదం

ఎవరో నా గుండెను గాయపరచారు
నాశనం వైపుగా నన్ను నెట్టేశారు
ఒక మంచి మనిషిని
మానవత్వం లేనివాడుగా మార్చేశారు

నాతో ఒక సముద్రమే ఉంది
కానీ నా జీవితం అంతా దాహమే
దాహం పెద్దదిగా జీవితం చిన్నదిగా ఉంది
మానవత్వం లేనివాడుగా నన్ను మార్చేశారు

నీకొక గమ్యమంటూ లేదని
జీవితపు దారులు నాతో అంటున్నాయి
నేనొక పనికిమాలిన వాడినని తలచి
ఎవరో నాకు దూరమైపోయారు

అస్తమించిన సూర్యుడు తిరిగి ఉదయిస్తాడు
చీకటి ఎల్లకాలం ఉండదు
కానీ నా సూర్యుడికి నేనంటే కోపం వచ్చింది
ఉదయాన్ని ఇంతవరకూ నేను చూడలేదు
వెలుగులు నన్ను వదలి వేశాయి

ఎవరో నా గుండెను గాయపరచారు
నాశనం వైపుగా నన్ను నెట్టేశారు
ఒక మంచి మనిషిని
మానవత్వం లేనివాడుగా మార్చేశారు...
read more " Dil Aisa Kisine Mera Toda - Kishore Kumar "

13, ఆగస్టు 2018, సోమవారం

బ్లాగు భేతాళ కధలు - 3 (స్వామి ప్రత్యంగిరానంద పటాటోపి)

'స్వామి ప్రత్యంగిరానంద గురించి విన్నావా?' పొద్దున్నే ఫోన్ చేశాడు సూర్య.

'నా చిన్నప్పటినుంచీ తెలుసు ఆయన గోల. ఏంటి ఈ మధ్య ఆయన ఆశ్రమానికి వెళుతున్నావా?' అడిగాను విసుగ్గా.

'అవును.' అన్నాడు.

'ఏంటి సంగతులు? ఏమైనా కొత్త కొత్త విశేషాలు తెలిశాయా?' అడిగాను.

'చాలా తెలిసినై. చెప్తే నువ్వు ఆశ్చర్యపోతావ్" అన్నాడు.

'ఆశ్చర్యపోతానో లేదో తర్వాతగాని ముందు సంగతులు చెప్పు. అసలాయనతో నీకు పరిచయం ఎలా కలిగింది?' అన్నా.

'మా అబ్బాయిని డిల్లీలో I.S.B లో చేర్పిస్తున్నా కదా. ఒకసారి వాడి జాతకం ఎలా ఉందొ చూపిద్దామని ప్రత్యంగిరా టెంపుల్ కి వెళ్ళా. అక్కడొక పూజారి జాతకాలు బాగా చెప్తాడని మా కొలీగ్ చెప్పాడు' అన్నాడు.

'హైదరాబాద్ లో ప్రత్యంగిరా టెంపుల్ ఉందా?' అడిగాను.

'ఉంది. ఎక్కడున్నావ్ నువ్వు? నీకు జెనరల్ నాలెడ్జి బొత్తిగా తక్కువై పోయిందీ మధ్య. నీ శిష్యురాళ్ళను తప్ప ఇంకెవరినీ పట్టించుకోవడం మానేశావ్ ' అన్నాడు సూర్య.

'త్వరగా స్వామీజీ అవతారం ఎత్తమని నువ్వేగా పోరు పెడుతున్నావ్? అందుకే ముందు శిష్యురాళ్ళను పోగేసుకుంటున్నా. మా స్వామీజీల ఆశ్రమాలకు మూలస్థంభాలు వాళ్ళేగా?' అన్నాను నవ్వుతూ.

'అబ్బో ! ఏంటి? మా స్వామీజీలం అంటున్నావ్ అప్పుడే?' అన్నాడు.

'అంతే ! నాకేం తక్కువ? కాషాయమే కదా! అదెంతసేపు కట్టుకోవడం?  అయినా నువ్విలా మాట్లాడావంటే రేపు నిన్ను నా ఆశ్రమం చాయలకు కూడా రానివ్వను.' అన్నా వార్నింగ్ ఇస్తూ.

'బాబ్బాబు. అంతపని చెయ్యకు. రేపు రిటైర్ అయ్యాక నీ ఆశ్రమంలో ఏదో ఒక పోస్ట్ లో చేరదామని అనుకుంటుంటే ఇదేంటి ఇలా అంటున్నావ్? సారీ సారీ !' అన్నాడు నవ్వుతూ.

'సరే ! ప్రస్తుతానికి క్షమిస్తున్నా ! ఇక విషయంలోకి రా. మీ అబ్బాయి జాతకం చూచి పూజారి ఏమన్నాడు?' - అన్నాను.

'జాతకం చూడలేదు. నక్షత్రం ఏంటని అడిగాడు. చెప్పాను. వెంటనే - 'మీ అబ్బాయికి గత ఆరునెలల నుంచీ పిరుడు బాలేదు' అన్నాడు.

'వీడి బొంద ఇంగ్లీషూ వీడూనూ ! పూజారిగాడికి ఇంగ్లీషు ముక్కలు ఎందుకు? పిరుడు ఏంటి వాడి బొంద ! పీరియడ్ అనాలి. ఇంకా నయం 'పురుడు పోస్తా' అనలేదు. దశ అంటే చక్కగా ఉండేది కదా?' అన్నాను.

'ఏమోలే వాడి ఇంగ్లీషు గురించి నాకెందుకు? అయినా మా అబ్బాయికి అలాంటి బ్యాడ్ పీరియడ్ ఏమీ లేదు. అంతా బాగానే ఉందని చెప్పా. ఎందుకైనా మంచిది పూజ చేయించుకోండి అన్నాడు. మావాడి పేరుమీద గుళ్ళో పూజ చేయించా. ఆ తర్వాత పూజారి ఒక సలహా ఇచ్చాడు. అక్కడే నాకు శని పట్టింది.' అన్నాడు.

'ఏంటా సలహా? రెండు లక్షలిస్తే హోమం చేస్తానన్నాడా?' అడిగా నవ్వుతూ.

'దాదాపుగా అలాంటిదే. లక్ష చాలన్నాడు. నావల్ల కాదని చెప్పాను. సరే అయితే పైన గదిలో స్వామీజీ ఉన్నారు. ఆయన్ను కలిసి బ్లెస్సింగ్స్ తీసుకోండి అన్నాడు. వెళ్లి స్వామీజీని కలిశాం.' అన్నాడు సూర్య.

'ఆయనేమన్నాడు?' అడిగా.

'మీవాడికి పిరుడు బాలేదని కింద పూజారి చెప్పాడు కదా !' - అని ఆయనడిగాడు. దాంతో మా ఆవిడ ఆయనకు ఇన్స్టంట్ భక్తురాలుగా మారిపోయింది. 'ఎందుకే అంత తొందరపడతావ్?' అనంటే - 'క్రింద పూజారి అడిగింది ఈయనకెలా తెలిసింది? ఈయనకేవో శక్తులున్నాయి' - అంటుంది. అంతా నా ఖర్మలా ఉంది' అన్నాడు సూర్య.

నాకు చచ్చేంత నవ్వొచింది.

'ఇది చాలా చీప్ ట్రిక్. అలా అడగమని పూజారికి ట్రెయినింగ్ ఇస్తారు. అదే మాటను స్వామీజీ మళ్ళీ అడుగుతాడు. అది చూచి మీ ఆవిడలాంటి వాళ్ళు పడిపోతూ ఉంటారు. మా స్వామీజీల ట్రిక్స్ ఇలాగే ఉంటాయి !' అన్నాను.

'మధ్యలో నిన్ను కలుపుకుంటావ్ ఏంటి?' అన్నాడు.

'ఎన్ని చెప్పినా మేమంతా ఒకటే. పాపం ఏదోలే పిచ్చిస్వామీజీ ఒదిలెయ్. విషయం చెప్పు.' అన్నా నవ్వుతూ.

'మా వాడికి అంతా బానే ఉందని డిల్లీలో చదువుకోడానికి వెళ్ళబోతున్నాడని చెప్పాను. సరే, ఒక యంత్రం ఇస్తాను వాడి మెడలో వెయ్యండి. రక్షణగా ఉంటుందని చెప్పి ఒక రాగిరేకు ఇచ్చాడు.' అన్నాడు.

'ఏంటి? దాన్ని మీవాడి మెడలో కట్టావా ఏంటి కొంపదీసి? మూర్చరోగి అనుకుంటారు చూసినవాళ్ళు. అసలే హై సర్కిల్స్ లోకి వెళుతున్నాడు. బాగోదు.' అన్నాను.

'నేనంత పిచ్చోడిని కాన్లే. క్రిందకొచ్చాక ఆ రాగిరేకును చెత్తకుండీలో పడేశా. కాకపోతే తన పుస్తకం ఒకటి అంటగట్టాడు స్వామీజీ. అది చదువుతున్నా ప్రస్తుతం.' అన్నాడు సూర్య.

'ఏంటి దాని పేరు?' అనడిగా.

'బుద్ధాశ్రమ కోతులు' అన్నాడు.

మళ్ళీ చచ్చే నవ్వొచ్చింది.

'అదేం పేరు? ఏముంది ఆ పుస్తకంలో?' అడిగాను.

'400 ఏళ్ళ క్రితం అదే ఆశ్రమంలో చెట్టుమీద ఒక కోతిగా ఈయన ఉండేవాడట. అదంతా అందులో వ్రాశాడు.' అన్నాడు.

నవ్వుతో నాకు పొలమారింది. నవ్వలేక పొట్ట పట్టుకుని ఇలా అడిగాను.

'ఇంతకీ ఆ ఆశ్రమం ఎక్కడుంది?'

'అది హిమాలయాల్లో ఉందిట ఇప్పటికీ. కానీ మనలాంటి పాపులకు కనిపించదట. స్వామీజీ లాంటి పుణ్యాత్ములకు మాత్రం కనిపిస్తుందట. ఆయన ప్రతిరోజూ రాత్రి అక్కడకు వెళ్లి తెల్లవారేసరికి మళ్ళీ ఆశ్రమానికి వస్తూ ఉంటాట్ట.' అన్నాడు సూర్య.

'అలాగా ! అంటే కలలోనా?' అడిగాను.

'కలలో కాదు. ఇలలోనే అని ఆయన శిష్యులు చెప్పారు.' అన్నాడు.

'వాళ్ళు కూడా డిల్లీ I.S.B లో M.B.A చదివారా ఏంటి కొంపదీసి?మార్కెటింగ్ అద్భుతంగా చేస్తున్నారు?' అడిగాను.

సూర్య కూడా నవ్వేశాడు.

'ఏమో అలాగే ఉంది వాళ్ళ వాలకాలు చూస్తుంటే. సరే మన కధలోకి వద్దాం. ఆ పుస్తకం చదువుతుంటే ఇక వేరే పోర్నోగ్రఫీ చానల్ ఏదీ చూడనక్కర్లేదు. అంత ఘోరంగా ఉంది' అన్నాడు.

నేను బిత్తరపోయాను.

'అదేంటి? స్వామీజీ అలా వ్రాశాడా?' అడిగాను.

'అవును. తను పూర్వజన్మలో ఏదో సిద్ధుడుట' అన్నాడు.

'అదేంటి? ఇప్పుడే కదా చెట్టుమీద కోతి అన్నావ్. ఇంతలోనే సిద్దుడెలా అయ్యాడు?'

'ముందుగా ఒక జన్మంతా ఆశ్రమంలో చెట్టుమీద కోతిలా  ఉండాలిట. ఆ తర్వాత జన్మలో అదే ఆశ్రమంలో సిద్దుడిగా పుట్టే అర్హత వస్తుందని ఆ పుస్తకంలో వ్రాశాడు.' అన్నాడు.

'ఏడ్చినట్టుంది ! ఆశ్రమంలో సిద్దుడిగా పుట్టడం ఏంటి? ఎవరికి పుడతాడు? అంటే ఆశ్రమంలో ఆడాళ్ళు కూడా ఉన్నారా? ఒకవేళ ఉన్నారని అనుకున్నా, ఆశ్రమంలో ఉండేవాళ్లకు గర్భం ఎలా వస్తుంది?' అడిగాను అయోమయంగా.

'భలే పాయింట్ పట్టావ్ ! నాకీ పాయింట్ తట్టలేదు. ఏంటో అలా వ్రాశాడు మరి !' అన్నాడు సూర్య కూడా అయోమయంగా.

'సర్లే ఏదో ఒకటి ! ఎలా వస్తే మనకెందుకు? ఆ తర్వాతేమైందో చెప్పు' అన్నాను.

'ఇలా ఉండగా, ఆ ఆశ్రమానికి కొంతమంది సామాన్యభక్తులు వస్తూ పోతూ ఉండేవారట. వాళ్లకి ఈయన దీక్షలు ఇచ్చాడట. వాళ్ళే తర్వాత జన్మల్లో రామకృష్ణ పరమహంస గానూ, రమణ మహర్షిగానూ పుట్టారని వ్రాశాడు.' అన్నాడు.

అరికాలి మంట నషాళానికి ఎక్కింది నాకు.

'ఇంకా నయం ! వెంకటేశ్వర స్వామి, శీశైల మల్లన్న, బెజవాడ కనకదుర్గమ్మా కూడా అదే ఆశ్రమంలో తన శిష్యులుగా ఉండేవారని చెప్పలేదు. సంతోషం!' అన్నాను.

'అలా చెప్పలేదుగాని దాదాపుగా అదే చెప్పాడు. వాళ్ళందరూ ఈనాటికీ రోజూ తనతో కబుర్లు చెబుతూ ఉంటారని వ్రాశాడు.' అన్నాడు.

'వాట్సప్ లోనా, ఇంస్టాగ్రాం లోనా? దురహంకారం మరీ తలకెక్కినట్టుంది ఈయనకు? ఈయన్ని అనుసరించే వాళ్ళు ఎలా ఉన్నారు?' అడిగాను.

'ఇంటలిజెన్స్ లెవల్స్ మరీ సబ్ స్టాండర్డ్ గా ఉన్నాయి వాళ్లకు. మళ్ళీ అందరూ చదువుకుని మంచి పొజిషన్స్  లో ఉన్నవాళ్ళే. కానీ నేలబారుగా ఆయనేది చెబితే దాన్ని నమ్మేస్తున్నారు. వాళ్ళని కూచోబెట్టి నానా అబద్దాలూ కధలూ నోటికొచ్చినట్టు చెప్పేస్తున్నాడు. వాళ్లేమో గుడ్డిగా నమ్మేస్తున్నారు. ఐ రియల్లీ పిటీ దెం. ఎడ్యుకేటెడ్ ఫూల్స్ లా ఉన్నారు' అన్నాడు సూర్య.

'ఏం అబద్దాలు చెబుతున్నాడు?' అడిగాను.

'ఈ మధ్యనే రాక్షసులకూ వానరసైన్యానికీ ఒక యుద్ధం ఆకాశంలో జరిగిందట. ఆ యుద్ధంలో సింగరాయకొండ ఆంజనేయస్వామి కళ్ళుతిరిగి పడిపోతే కసాపురం ఆంజనేయస్వామి వచ్చి కాపాడాడని, తను పక్కనే ఉండి చూశాననీ చెప్పాడు ఒక ఉపన్యాసంలో.' అన్నాడు.

పదినిముషాలు ఆగకుండా నవ్వుతూనే ఉన్నా నేను.

'వింటున్న భక్తులేం చేశారు?' అడిగాను తేరుకుని.

'భక్తిగా తలలూపుతూ చొంగ కారుస్తున్నారు' చెప్పాడు.

'నేనింక నవ్వలేనుగాని, అసలు నీకీ స్వామీజీ గురించీ, ఆ ప్రత్యంగిరా టెంపుల్ గురించీ ఎలా తెలిసింది? ఆ కధంతా వివరించుము' అన్నాను.

చెప్పడం మొదలు పెట్టాడు సూర్య.

(ఇంకా ఉంది)
read more " బ్లాగు భేతాళ కధలు - 3 (స్వామి ప్రత్యంగిరానంద పటాటోపి) "

బ్లాగు భేతాళ కధలు - 2 (వాళ్ళిద్దరి అభిరుచులూ ఒకటే)

మొన్నొకరోజున సీరియస్ గా యోగాభ్యాసం చేస్తూ ఉండగా ఫోన్ మ్రోగింది.

శీర్షాసనంలోనే ఉండి ఫోన్ తీసుకుని 'హలో' అన్నా.

'నేను సూర్యని' అన్నాడు.

'ఊ! చెప్పు. ఏంటి కొత్త కధ?' అన్నాను.

'ఏంటి వాయిస్ ఎక్కడో బావిలోనించి వస్తున్నట్టుంది?' అన్నాడు.

'అవును. బావిలో శీర్షాసనం వేస్తున్నా. అందుకే అలా ఉంది వాయిస్' అన్నాను.

'నీకు జోకులు మరీ ఎక్కువయ్యాయి. సర్లేగాని, నాకొక ధర్మసందేహం వచ్చింది. నువ్వు ఆన్సర్ చెయ్యాలి' అన్నాడు.

'ఆన్సర్ చెప్పకపోతే నీ తల వెయ్యి వక్కలౌతుంది అని శాపం పెడతావా ఏంటి?' అన్నా.

'అంత శక్తి నాకు లేదులేగాని, ఇద్దరి అభిరుచులూ చక్కగా కలిశాయని అబ్బాయీ అమ్మాయీ మురిసిపోతూ పెళ్లి చేసుకోవడం మీద నీ అభిప్రాయం ఏమిటి?' అడిగాడు.

'అదంతా ట్రాష్. అలాంటివి ఏవీ ఉండవు.' అన్నాను.

'హుమ్,,,' అని మూలిగాడు సూర్య.

'ఏంటి అంతలా మూలిగావ్? ఏమైంది?' అడిగాను శీర్షాసనం నుంచి దిగుతూ.

'ఏమీ కాలేదు. బానే ఉన్నాను. నువ్వు చెప్పిన ఆన్సర్ కి నీరసం వచ్చింది.' అన్నాడు.

'ఎందుకంత నీరసం? ఇంతకీ నువ్వడిగిన ప్రశ్న నీ కపోల కల్పితమా?  లేక వేరేవాళ్ళ కపాల లిఖితమా?' అడిగాను.

'రెండోదే. చెప్తా విను. మా అమ్మాయి అమెరికాలో ఉందని నీకు తెలుసు కదా ! దానికి ఇద్దరు అమెరికా ఫ్రెండ్స్ ఉన్నారు, ఒకబ్బాయి ఒకమ్మాయి. వాళ్ళిద్దరి అభిరుచులూ ఒకటే. ఇద్దరి అభిమాన హీరోలూ ఒకరే. ఇద్దరూ  ఇష్టపడే కార్ల బ్రాండూ, హోటలూ, తిండీ,  డ్రస్సులూ, చివరకు పిక్నిక్ స్పాట్లూ, టీవీ చానల్సూ అన్నీ ఒక్కటే. అంతలా వాళ్ళ అభిరుచులు కలసి పోయాయి. అందుకని ఒకరినొకరు బాగా ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు.' అన్నాడు సూర్య.

విపరీతమైన నవ్వొచ్చింది నాకు.'  'హహ్హహ్హ...' అంటూ పెద్దగా నవ్వేశాను. 

'ఎందుకలా విలన్లా నవ్వుతున్నావ్? నవ్వకు. అసలే యోగా చేస్తున్నావ్. కొరబోతుంది.' అన్నాడు సూర్య.

'ఏం పోదులే గాని. తర్వాతేమైఁదో  నేను చెప్తా విను. నాలుగేళ్ళు తిరిగీ తిరక్కుండానే వాళ్ళు డైవోర్స్ తీసుకున్నారు.' అన్నా చక్రాసనం వెయ్యడానికి రెడీ అవుతూ.

కెవ్వ్ మని కేక వినిపించింది అటువైపు నుంచి.

నాకు భయం వేసింది.

'ఏమైంది సూర్యా ! ఎందుకలా అరిచావ్ ?' అడిగాను కంగారుగా.

'ఏం కాలేదు. ఇంత కరెక్ట్ గా ఎలా చెప్పావ్? నీకేవో శక్తులున్నాయని నాకు మొదట్నించీ అనుమానం. అదిప్పుడు నిజమౌతోంది. నువ్వన్నట్టుగానే వాళ్ళు సరిగ్గా నాలుగేళ్ళకి విడిపోయారు.' అన్నాడు.

'పోతే పోయార్లే ! కలిసి ఉండలేనప్పుడు విడిపోవడమే మంచిది. ఎవరి బ్రతుకు వాళ్ళు హాయిగా బ్రతకొచ్చు. ఈ మాత్రం చెప్పడానికి శక్తులు అక్కర్లేదు. సైకాలజీ తెలిస్తే చాలు. సర్లేగాని, వేరే టాపిక్ ఏమీ లేదా మనం మాట్లాడుకోడానికి?' అడిగాను చక్రాసనంలో నడుమును బాగా వంచుతూ.

'ముందు నా సందేహానికి సమాధానం చెప్తే ఇంకో టాపిక్ లోకి వెళతా' అన్నాడు.

తను  ఏం అడగబోతున్నాడో అర్ధమైనా తెలీనట్టు ' ఏంటి నీ సందేహం?' అన్నాను.

'అదే ! అంత ఇష్టపడి, ఒకరి అభిరుచులు ఒకరికి బాగా కలిసి పెళ్లి చేసుకున్న వాళ్ళు నాలుగేళ్ళలో ఎందుకు విడిపోయారు? దీనికి సమాధానం తెలిసికూడా చెప్పకపోయావో నీ యోగా షెడ్యూల్ చెడిపోతుంది.' అన్నాడు సూర్య నవ్వుతూ.

'చాలా సింపుల్ సూర్యా ! నీ ప్రశ్నలోనే జవాబుంది. అంతగా ఒకరి  అభిరుచులను ఒకరు ఇష్టపడి చేసుకున్నారు గనుకనే విడిపోయారు' అన్నాను.

'అదేంటి? నీ జవాబు ఏదో కన్ఫ్యూజింగ్ గా ఉంది. కొంచం వివరించుము' అన్నాడు సూర్య.

'ఇందులో కన్ఫ్యూజింగ్ ఏమీ లేదు. సరిగ్గా  అర్ధం చేసుకుంటే చాలా సింపుల్. వాళ్ళు ఇష్టపడినది అభిరుచులని. అంతేగాని ఒకరినొకరు ఇష్టపడలేదు. కనుకనే విడిపోయారు. అభిరుచులు ఈరోజున్నట్లు రేపుండవు. మారుతూ  ఉంటాయి. కానీ మనుషులు ఒక్కలాగే ఉంటారు. వ్యక్తిని ఇష్టపడాలి గానీ రంగును, అందాన్ని, ఆస్తిని, హాబీలను, అభిరుచులను కాదు. ఇవన్నీ కొన్నాళ్ళకు మారిపోతాయి. కానీ మౌలికంగా ఆ మనిషి మారడు. ఆ మౌలికత్వాన్ని, అంటే, essential person ను ఇష్టపడితే ఈ బాధ ఉండదు. అప్పుడు జీవితాంతం కలిసే ఉంటారు.

ఇంకో సంగతి చెబుతా విను. పెళ్లి కాకముందు ఒకరినొకరు ఎంత అర్ధం చేసుకున్నాం అనుకున్నా అది భ్రమ మాత్రమే. ఎందుకంటే, బయటకు కనిపించే మనిషి వేరు. లోపల ఉండే మనిషి వేరు. బయటకు కనిపించే హాబీలు అభిరుచులలో ఆ లోపల మనిషి కనిపించడు. పెళ్ళయ్యాక రోజులు గడిచే కొద్దీ ఆ నిజస్వరూపాలు కనిపించడం మొదలౌతాయి. క్రమేణా ఒకరంటే  ఒకరికి మునుపటి ఆసక్తీ ఆకర్షణా పోయి విసుగూ విరక్తీ వచ్చేస్తాయి. ఈ క్రమంలో పిల్లలు ఎలాగూ పుట్టేస్తారు కదా. పిల్లలకోసమో, పరువు కోసమో ఇష్టం లేకున్నా కలిసి ఉంటారు. కానీ తమకు నచ్చిన ఇంకొకరిని వెదుకుతూనే ఉంటారు. ఇప్పుడైతే extra marital affairs ఇండియాలో కూడా ఎక్కడ బడితే అక్కడ కనిపిస్తున్నాయి. దానికి soul mate అని కొత్త నామకరణం చేశారు. అదొక గోల !

అమెరికాలో ఇలాంటి హిపోక్రసీ లేదు కదా !  వాళ్లకు నచ్చకపోతే విడిపోతారు. అంతే ! నువ్వు చెబుతున్నవాళ్ళు అదే చేశారు. నా దృష్టిలో అలా విడిపోవడం మంచిదే ! ఒకరికొకరు నచ్చనప్పుడు కొట్టుకుంటూ తిట్టుకుంటూ ఒకే కప్పు క్రింద బ్రతకడం కంటే, విడివిడిగా ఎవరి బ్రతుకు వాళ్ళు బ్రతకడమే మంచిది.

నేను చెప్పిన essential person  ను ప్రేమించే కిటుకు తెలిస్తే ఏ బాధా లేదు. ప్రతివారిలోనూ కొన్ని లోపాలుంటాయి. మనకు నచ్చని కొన్ని కోణాలు తప్పకుండా   ఉంటాయి. వాటిని అర్ధం చేసుకుని సర్దుకుపోవడమే జీవితం. మరీ ఇక తట్టుకోలేనంత విభేదాలున్నపుడు విడిపోక తప్పదనుకో! కానీ హాబీలు కలవలేదనో, ఒకరికి కాఫీ ఇష్టమైతే ఇంకొకరికి టీ ఇష్టమనో, ఒకరికి వంకాయ ఇష్టమైతే ఇంకొకరికి బెండకాయ ఇష్టమనో, ఇలాంటి సిల్లీ విషయాలకు విడిపోవడం అమెరికాలో సహజమే కదా ! మనకు అలా ఉండదు.   మనకు సర్దుకుపోవడం ఎక్కువ. అమెరికాలో రిజిడిటీ ఎక్కువ. అందుకనే వాళ్ళు విడిపోయారు.

వాళ్ళ అభిరుచులను ఇష్టపడటం కాకుండా ఒకరినొకరు ఇష్టపడి ఉంటే వాళ్ళు కలిసే ఉండేవారు. ఎందుకంటే 'అభిరుచి' అంటేనే expectation కదా! అంటే, "నేననుకున్నట్టు ఎదుటి మనిషి ఉండాలి" అనుకోవడమే కదా హాబీలు అభిరుచులు కలవడం అంటే. అన్ని expectation లూ జీవితాంతం మారకుండా అలాగే ఎక్కడా ఉండవు. అవి మారినప్పుడు, ఆ ఎదుటివ్యక్తి కూడా మనకనుగుణంగా మారాలని ఆశించడమే అసలైన తప్పు.  అలా జరగనప్పుడు ఒకరంటే ఒకరికి    విసుగు పుట్టడం సహజమే. వీళ్ళ కేస్ లో అదే జరిగింది. అమెరికన్స్ గనుక విడిపోయారు. అంతే ! వెరీ సింపుల్ !" అన్నాను.

'అయితే, హాబీలు నచ్చడం ముఖ్యం కాదు. ఒకరినొకరు అర్ధం చేసుకోవడం, సర్దుకోవడం ముఖ్యం అంటావ్" అన్నాడు.

'అంతే ! రుచులూ అభిరుచులూ కలిస్తే సరిపోదు. మనసులు కలవాలి. అదే ముఖ్యం.' అన్నాను శవాసనంలోకి మారుతూ.

'అంత మానసిక పరిణతి ఇప్పటి కుర్రకారుకు ఎలా వస్తుంది? రాదుకదా?' అన్నాడు.

'రాదు కాబట్టే, నూటికి ఏభై పెళ్ళిళ్ళు ఫెయిల్ అవుతున్నాయి ప్రస్తుతం' అన్నాను.

"మరి దీనికేంటి పరిష్కారం?' అన్నాడు.

'వెరీ సింపుల్! రోజూ నాలా యోగా చెయ్యడమే' అన్నాను నవ్వుతూ.

'మళ్ళీ మొదలుపెట్టావా నీ జోకులు?' అన్నాడు సీరియస్ గా.

'పోనీ ఇంకో ఆల్టర్నేటివ్ ఉంది.  వాళ్ళిద్దర్నీ నా శిష్యులుగా మారమని చెప్పు. అప్పుడు కరెక్ట్ గా ఎలా బ్రతకాలో వాళ్లకు ట్రెయినింగ్ ఇస్తాను. నీకీ మధ్యవర్తిత్వం బాధా తప్పుతుంది.' అన్నాను.

'రెండూ జరిగే పనులు కావులే గాని. నువ్వు  యోగా చేసుకో. నాకు వేరే పనుంది.' అన్నాడు.

'నాకూ పనుంది. నువ్వు ఫోన్ పెట్టేయ్' అంటూ నేను ప్రాణాయామం మొదలుపెట్టాను.

సూర్య ఫోన్ కట్ చేశాడు.
read more " బ్లాగు భేతాళ కధలు - 2 (వాళ్ళిద్దరి అభిరుచులూ ఒకటే) "

11, ఆగస్టు 2018, శనివారం

'మా అబ్బాయి ఎక్కడున్నాడు?' - ప్రశ్నశాస్త్రం

పెరిచెర్లలో ఒక కాలేజీలో జరుగుతున్న స్టాఫ్ సెలక్షన్ ఎగ్జాంకు అబ్జర్వర్ గా మొన్న తొమ్మిదో తేదీన వెళ్ళవలసి వచ్చింది. ఆ సందర్భంగా జరిగిన సంఘటన ఇది.

టైము సాయంత్రం 4.00 అయ్యింది. పరీక్ష మూడో షిఫ్ట్ మొదలైంది. కాండిడేట్స్ అందరూ ఆన్లైన్ పరీక్ష రాస్తున్నారు. మాల్ ప్రాక్టీస్ ఏదీ జరక్కుండా మేము గమనిస్తున్నాము. టీ టైం కదా? ఇంతలో ఆ కాలేజీలో ఉండే సపోర్ట్ స్టాఫ్ అనుకుంటాను ఒకామె నాకు టీ తెచ్చి ఇచ్చింది. పల్లెటూరి మనిషిలాగా ఉంది.

టీ కప్పు నా టేబిల్ మీద పెడుతూ - 'సార్ మీరు రైల్వేనా?' అడిగింది.

'అవును' అన్నాను.

'మీరు పోలీసు అధికారా?' అడిగింది.

'కాదు' అన్నాను.

'మరి మీతో పోలీసులు వచ్చారు ఎందుకు?' అడిగింది.

'ఎగ్జాంకు సెక్యూరిటీగా మాతో వచ్చారు. ఏం కావాలి మీకు?' అన్నాను.

'మా అబ్బాయి ఇంట్లోనుంచి వెళ్ళిపోయాడు. రెండేళ్ళు అయింది. మీ రైల్వే పోలీసులకు ఏమైనా తెలుస్తుందా వాడెటు పోయాడో?' అడిగింది.

'వాళ్ళకెలా తెలుస్తుంది? సివిల్ పోలీసులకు కంప్లెయింట్ చెయ్యండి' అన్నాను.

'ఎక్కడికైనా పారిపోవాలంటే రైలెక్కుతాడు కదా? అప్పుడు చూసి ఉంటారేమో?' అడిగింది.

ఆమెది అమాయకత్వమో లేక అతితెలివో అర్ధం కాలేదు. కొంతమంది ఇలా అమాయకత్వం నటించి మనల్ని ఆడుకునేవాళ్ళను ఇంతకుముందు చూశాను. ఎందుకైనా మంచిది మన జాగ్రత్తలో మనం ఉండాలని అనుకుంటూ - 'ఎంత వయసులో ఇంట్లోంచి పారిపోయాడు?' అడిగాను.

'పందొమ్మిది ఉంటాయి' చెప్పింది.

ఎగ్జాం అయిపోవడానికి ఇంకా గంట టైముంది. ఈమెను చూస్తే దిగాలుగా ఉంది. పేదరాలులాగా కనిపించింది. ప్రశ్నచార్ట్ చూచి ఈమెకు జవాబు చెబుదాం అని నాకే ఒక ఆలోచన వచ్చింది. ఆ రోజు గ్రహస్థితి మనకు తెలుసు గనుక, లగ్నాన్ని గమనించాను. ధనుర్లగ్నం అయింది.

పంచమాధిపతి కుజుడు లగ్నంలోకి వచ్చి ఉన్నాడు. అతనే ద్వాదశాధిపతి కూడా అయ్యాడు. దూరప్రాంతాన్ని సూచిస్తూ సప్తమంలో ఉన్న చంద్రుని దృష్టి లగ్నంమీద ఉంది. కనుక కొడుకు తప్పిపోయాడని అడుగుతోంది. లగ్నంలో శనిదృష్టి చంద్రుడి మీద ఉంది, కనుక ఈమె అబద్దం చెప్పడం లేదు. నిజంగానే బాధపడుతోంది.

ఆమె ముఖంలోకి చూచాను. దిగాలుగా కళ్ళక్రింద వలయాలతో ఉంది. మనిషి నల్లగా ఉండి శనిని సూచిస్తోంది.

కుటుంబ స్థానాధిపతి శని ద్వాదశంలోకి పోతున్నాడు. బుధుడు చంద్రునితో కలిసి సప్తమంలో ఉంటూ లగ్నాన్ని చూస్తున్నాడు. ఆ సప్తమం సహజ తృతీయం అవుతూ మాటామాటా పెరగడాన్నీ, గొడవలనూ సూచిస్తోంది. కనుక వీళ్ళ కుటుంబంలో గొడవలు తారాస్థాయిలో జరిగి ఉండాలి.

నా ఆలోచనకు నాకే నవ్వొచ్చింది. గొడవలు జరగకపోతే ఇంట్లోనుంచి ఎవరైనా ఎందుకు పారిపోతారు?

'అదలా ఉంచుదాం. వీళ్ళ కుటుంబంలో ఏం గొడవలు జరిగి ఉంటాయి?' అని ఆలోచిస్తూ దశమం వైపు దృష్టి సారించాను. ఏ జాతకంలోనైనా దశమం బలమైన స్థానం. అక్కడ నీచ శుక్రుడున్నాడు. పైగా హోరాధిపతి కూడా శుక్రుడే అయ్యాడు. కనుక ఆయన హోరలో మనకు ఇలాంటి సంఘటనలే ఎదురవ్వాలి. ద్వితీయంలో బలంగా ఉన్న కుజునితో కోణదృష్టిలో శుక్రుడున్నాడు. పంచమాధిపతిగా కుజుడు ఈమె కొడుకును సూచిస్తున్నాడు. అంటే అమ్మాయిల వ్యవహారాలన్న మాట ! లేబర్ కుటుంబాలలో ఇలాంటివి మామూలుగా జరుగుతాయి. పైగా అబ్బాయికి 19 అంటోంది. వాడి వయసు కూడా సరిపోయింది. లవ్వు ముదిరి చంపుకునే వరకూ వచ్చి ఉంటుంది. అందుకని వీడు ఇంట్లోంచి జంప్ అయి ఉంటాడు.

'మీ వాడికి ఆ వయసులోనే అమ్మాయిల వ్యవహారాలెందుకమ్మా?' అడిగాను టీ సిప్ చేస్తూ.

ఆమె ఏడ్చినంత పని చేసింది.

'మా ఖర్మ సార్ ! ఏం చెప్పమంటారు?' అంది ఎవరైనా వింటున్నారేమో అని చుట్టూ చూస్తూ.

'మీకు తెలిసిన అమ్మాయే కదా? ఆ అమ్మాయి ప్రస్తుతం బాగానే ఉంది. మీవాడు మాత్రం ఇంట్లోనుంచి వెళ్ళిపోయాడు' అన్నాను టీని ఇంకో గుక్క త్రాగి, చతుర్ధం మీద ఉన్న శుక్రుని దృష్టిని, నవాంశలో అతని ఉచ్చస్థితిని గమనిస్తూ.

'అవును సార్ ! మాకు తెలిసిన వాళ్ళే! ఆ అమ్మాయి అంత మంచిది కాదు. ఇప్పుడు ఇంకోడితో హాయిగా ఉంది. ఈ గొడవ జరిగాక మావాడు మాత్రం ఎటో వెళ్ళిపోయాడు.' అంది.

'అలాగా!' అన్నాను నీచలో ఉన్న శుక్రుడిని, ఉచ్చలో ఉన్న కుజుడిని వాళ్ళమధ్యన కోణదృష్టినీ మనోనేత్రంతో గమనిస్తూ.

ఇన్ని గొడవలు జరుగుతుంటే వీళ్ళాయన అనబడే శాల్తీ ఏమయ్యాడా అని అనుమానం వచ్చింది. అటువైపు దృష్టి సారించాను.

సప్తమాధిపతి బుధుడు అష్టమంలో సూర్యునికి చాలా దగ్గరగా ఉండి పూర్తిగా అస్తంగతుడయ్యాడు. అంటే వీళ్ళాయన చనిపోయి ఉండాలి. లేదా అతని వల్ల వీళ్ళకు ఏమీ ఉపయోగం లేదని అర్ధం. అష్టమాధిపతి చంద్రుడు సప్తమంలో ఉన్నాడు. అమావాస్యకు చాలా దగ్గరలో ఉన్నాం. చంద్రుడు జలగ్రహం. అంటే వీళ్ళాయన ఏదో జలప్రమాదంలో చనిపోయి ఉండాలి.

ఆమె ముఖంలోకి మళ్ళీ ఒకసారి చూచాను. బొట్టు లేదు. కానీ, క్రిష్టియన్స్ కూడా బొట్టు పెట్టుకోరు. ఈమెను చూస్తే క్రిస్టియన్ లాగే కనిపిస్తోంది. పైగా ఈ కాలేజీ కూడా కేథలిక్ మిషన్ వాళ్ళదే. ఈ సెన్సిటివ్ విషయాన్ని ఎలా అడగాలా అని కొంచం సంశయించి - 'మీ ఆయన?' అని అర్ధోక్తిలో ఆపేశాను.

'ఈ గొడవ జరగక ముందు ఇక్కడ దగ్గరలోనే క్వారీలో పడి చనిపోయాడు సార్ ! వానలు పడి బాగా నీళ్ళు నిండి ఉన్నాయి వాటిల్లో. అందులో దూకి చనిపోయాడు.' అంది.

నాకనుమానం వచ్చింది.

లగ్నాధిపతి గురువు లాభస్థానంలో ఉన్నాడు. అంటే ఈమె ఫ్రెండ్స్ ని సూచిస్తున్నాడు. అతని దృష్టి సప్తమంలో ఉన్న చంద్రునిపైన ఉన్నది. కుటుంబస్థానాధిపతి అయిన శని దృష్టి కూడా సప్తమంలో ఉన్న చంద్రుని పైన ఉన్నది. చంద్రుడు అమావాస్యకు దగ్గరలో ఉన్నాడు. చంద్రస్థానంలో రాహువున్నాడు. అంటే, ఏవో కుటుంబ గొడవలలో ఈమె భర్త చంపబడి ఉండాలి. చంపినవాళ్లు ఎవరో ఈమెకు బాగా తెలిసే ఉండాలి.

'తనే దూకి చనిపోయాడా? లేక ఏవైనా గొడవలు జరిగాయా?' అడిగాను.

ఆమె కొంచం తటపటాయించింది.

'ఏదో అంటారు సార్ ! నాకూ ఎక్కువగా తెలీదు. సావాసగాళ్ళతో తాగిన గొడవల్లో వాళ్ళే ఏదో చేశారని అంటారు. ఏం జరిగిందో మాకూ తెలీదు' అంది నేలచూపులు చూస్తూ చిన్న గొంతుతో.

ఆమె బాడీ లాంగ్వేజి చూశాక నా అనుమానం బలపడింది.

'తెలిసినా నువ్వెందుకు చెబుతావులే?' అనుకున్నా లోలోపల. మామూలుగా లేబర్ కుటుంబాలలో ఇలాంటి కధలు జరుగుతూనే ఉంటాయి.

'సర్లే అదంతా మనకెందుకులే' అనుకుని - 'మీవాడు ప్రస్తుతం క్షేమంగానే ఉన్నాడు. బాధపడకు. ఎంతో దూరం పోలేదు. దక్షిణాన ఇక్కడికి దగ్గర ఊర్లోనే ఉన్నాడు. త్వరలోనే ఇంటికి తిరిగి వస్తాడు.' అని ఆమెతో చెప్పాను లగ్నంలోకి వస్తున్న కుజుని వక్రత్వాన్ని గమనిస్తూ.

'మీరు చల్లగా ఉండాలి సార్ ! మీ మాటే నిజమైతే మీ కాళ్ళకి మొక్కుతాను' అందామె పల్లెటూరి సహజమైన యాసతో.

'అంతపని చెయ్యకు తల్లీ ! సాటి మనిషిగా ఏదో నాకు తోచినమాట చెప్పాను. అంతే !' అన్నాను.

టీకప్పు తీసుకుని ఆమె వెళ్ళిపోయింది.

సాయంత్రానికి పరీక్ష ముగించుకుని అక్కడనుంచి వచ్చేశాము. ఆ విధంగా ప్రశ్నశాస్త్రం ఉపయోగించి, మనకు ఏ మాత్రం పరిచయం లేని వ్యక్తి కుటుంబం గురించి వివరాలను తెలుసుకొని, ఆమెకు కొంత ఓదార్పును ఇవ్వడం జరిగింది.
read more " 'మా అబ్బాయి ఎక్కడున్నాడు?' - ప్రశ్నశాస్త్రం "

6, ఆగస్టు 2018, సోమవారం

Pyar Manga Hai Tumhi Se - Kishore Kumar


Pyar Manga Hai Tumhi Se - Na Inkar Karo...

అంటూ కిషోర్ కుమార్ మధురంగా ఆలపించిన ఈ రొమాంటిక్ గీతం 1978 లో వచ్చిన College Girl అనే చిత్రంలోనిది. ఈ పాటను నేనిప్పుడు పాడటం వెనుక ఒక కధుంది. అదేంటో చెప్తా వినండి !

మొన్న నాలుగో తేదీన రిట్రీట్ ముగించుకుని ఇంటికొచ్చి నిద్రపోదామని పడుకున్నా. కలలోకి కిషోర్ కుమార్ వచ్చాడు.

'గురూజీ బాగున్నారా ?' అడిగాడు నవ్వుతూ.

'అదేంటి దాదా ! నేను నీకు గురూజీని ఎప్పుడయ్యాను?" అన్నా ఆశ్చర్యాన్ని నటిస్తూ.

'ఎందుకు కారు గురూజీ ! పొద్దుట్నించీ మీ రిట్రీట్లో నేనూ ఉన్నాను.' అన్నాడు కిషోర్.

'అదేంటి దాదా? నువ్వు స్వర్గంలో కదా ఉన్నది? ఎందుకలా భూమ్మీదకు వచ్చావ్?' అడిగా తెలిసినా తెలీనట్లు.

'మరీ నటించకు గురూజీ. ఇవాళ నీ పుట్టినరోజే కాదు. నా పుట్టిన రోజుకూడా. నేను పుట్టింది కూడా ఆగస్ట్ నాలుగునే. నీదేమో తిధుల ప్రకారం. నాది డేట్ ప్రకారం. మనిద్దరి పుట్టినరోజులూ అలా కలిశాయి ఈ రోజున.' అన్నాడు కిషోర్.

'ఓ అదా సంగతి? సరే, ఏం చెయ్యమంటావ్ చెప్పు దాదా?' అన్నా నవ్వుతూ.

'మామూలు రోజుల్లో నా పాటలు పాడేస్తున్నావ్ జోరుగా. ఇవాళ పాడవా?' అన్నాడు కిషోర్.

'చూస్తున్నావుగా. పొద్దుట్నించీ రిట్రీట్లో ఉన్నా' అన్నాను.

'అదే చూస్తున్నా. నువ్వెలా ఉన్నావో అని చూద్దామని వచ్చా. సరే వచ్చాకదా అని రిట్రీట్లో నేనూ కాసేపు కూచున్నా. చూశావుగా నువ్వు?' అడిగాడు నవ్వుతూ.

'చూశాలే దాదా. నిన్నక్కడ పలకరిస్తే మావాళ్ళందరూ భయపడతారని ఊరుకున్నా. సరే ఏ పాట పాడమంటావో చెప్పు.' అన్నాను.

'ముజే ప్యార్ కరో' అన్నాడు నవ్వుతూ.

'నువ్వంటే నాకు చాలా ఇష్టం దాదా. మనిద్దరమూ ఠాకూర్ భక్తులమే కదా?' అన్నా నేనూ నవ్వుతూ.

'అవును. జై ఠాకూర్ ! ముజే ప్యార్ కరో, ముజే ప్యార్ కరో' అని అంటూ మాయమై పోయాడు కిషోర్.

'అదేంటి అలా అన్నాడు? అని ఒక్కసారి ఆలోచించే సరికి అర్ధమైపోయింది తను ఏ పాట పాడమంటున్నాడో !'

అలా వచ్చింది ఈ పాట ! అందుకే కొంచం లేటైనా ఈరోజు పాడుతున్నానన్నమాట ! పాపం స్వర్గం నుంచి దిగివచ్చి మరీ అడిగాడు కదా పాడకపోతే ఎలా?

ఈ మధుర రొమాంటిక్ గీతాన్ని నా స్వరంలో కూడా వినండి మరి.

Movie:--College Girl (1978)
Lyrics:-- Shiv Kumar Saroj
Music:--Bappi Lahiri
Singer:--Kishor Kumar
Karaoke Singer:--Satya Narayana Sarma
Enjoy
-----------------------------------------------
Humming..
Pyar manga hai tumhi se na inkar karo-2
Paas baith zaraaj tho Ikrar karo
Mujhe pyar karo-2
Pyar manga hai tumhi se - na inkar karo

Kitni hasee hai raat – dulhan banee hai raat-2
Machle.huve jag baat – baat zara honedo
Mujhe pyar karo-2
Pyar manga hai tumhee se na inkar karo

Pehle bhi tumhe dekha – pehle bhi tumhe chaha -2
Itna haseen paya - saath hasi honedo
Mujhe pyar karo-2
Pyar manga hai tumhee se na inkar karo

Kitna madhur safar hai – too mera hamsafar hai-2
Beete.huve vo din – zara yaad karo
Mujhe pyar karo-2
Pyar manga hai tumhee se na inkar karo
Paas baitho zaraaj tho Ikrar karo
Pyar manga hai tumhee se na inkar karo
Humming...

Meaning

I just asked your love , don't refuse me
Today just sit with me and give me a promise
Just love me...

How beautiful and lovely the night is?
like a bride
Our emotions are persisting
Let there be some talk
Just love me

I had seen you earlier and loved you earlier too
You were always beautiful and lovely
Let this togetherness be lovely too
Just love me

How sweet is this journey
with you as my companion
Just remember the days
we spent together in the past
Just love me

I just asked your love, don't refuse me
Today just sit with me and give me a promise
Just love me...Just love me

తెలుగు స్వేచ్చానువాదం

నీ ప్రేమనే నేను కోరాను
నన్ను నీనుంచి దూరం చెయ్యకు
నాపక్కన కాసేపు కూర్చో
నాకొక్క వాగ్దానం చెయ్యి
ఊరకే నన్ను ప్రేమించు
చాలు...

ఈ రాత్రి ఒక నవవధువులా
ఎంత మనోహరంగా ఉంది?
మన హృదయగత భావాలు కూడా
మొండికేస్తున్నాయి
మన మధ్య కొన్ని మాటలను దొర్లనీ

గతంలో కూడా నువ్వు నాకు తెలుసు
గతంలో కూడా నేను నిన్ను ప్రేమించాను
నువ్వెప్పుడూ ఇలా అందంగానే ఉన్నావు
ఇప్పటి మన సాంగత్యాన్ని కూడా
ఇలా ఎప్పటికీ మధురంగానే ఉండనీ

నువ్వు నాతోడుగా ఉంటే
ఈ ప్రయాణం ఎంత హాయిగా ఉంది?
గతంలో మనం కలసి గడిపిన
మధురక్షణాలను గుర్తు తెచ్చుకో

నీ ప్రేమనే నేను కోరాను
నన్ను నీనుంచి దూరం చెయ్యకు
నాపక్కన కాసేపు కూర్చో
నాకొక్క వాగ్దానం చెయ్యి
ఊరకే నన్ను ప్రేమించు
చాలు...
read more " Pyar Manga Hai Tumhi Se - Kishore Kumar "