పంచవటి ఆశ్రమం మొదలై అప్పుడే ఏడాది గడచిపోయింది. చూస్తూ ఉండగానే ఆశ్రమవాసం ఒక ఏడాది పూర్తయింది. అందుకని మొన్న 22, 23, 24 తేదీలలో (శుక్ర శని ఆదివారాలలో) ఆశ్రమం మొదటి వార్షికోత్సవం మరియు 5 వ సాధనా సమ్మేళనాలను జరుపుకున్నాము.
ఆశ్రమసభ్యులలో కొంతమంది ఇతరదేశాలలో ఉన్నారు. వారిలో కొంతమంది దీనికోసమే ఇండియాకు వచ్చి, ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అందరూ కలసి మూడురోజులపాటు ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు.
మా గ్రూపు చిన్నదే. కానీ గట్టిది. ఓటివారు జారిపోగా, గట్టివారు మాత్రం మిగిలారు. నాకు నచ్చకపోతే నేనే తీసేస్తుంటాను. వాళ్లకు నచ్చకపోతే వాళ్ళే వెళ్లిపోతుంటారు.
ఏమంటే, మాకు రాశి కంటే వాసిమీదే నమ్మకం ఎక్కువ. మాకు ప్రచారాలు, ప్రసాదాల కంటే ప్రసారమే ముఖ్యం. వేషాలకంటే కావేషాల తగ్గుదలే మాకు ప్రాధాన్యం. ఆర్భాటం కంటే ఆచరణే మాకు ముఖ్యం. రోదన కంటే సాధనే మాకు ఇష్టం.
మాదైన విధానంలో యోగాభ్యాసం, ధ్యానం. ఉపదేశాలు, ఉపన్యాసాలు, కర్మయోగం, సమిష్టిజీవనం, సందేహాలు సమాధానాలు, అభిప్రాయాల కలబోతలతో మూడురోజుల రిట్రీట్ చిటికెలో గడిచిపోయింది.
దూరప్రాంతాలనుండి మాటమాటకూ ఆశ్రమానికి రాలేకపోతున్న సభ్యులకోసం జ్యోతిషశాస్త్రం, హోమియోపతి ఆన్లైన్ క్లాసులను త్వరలో మొదలుపెట్టాలన్న నిర్ణయంతో, డిసెంబర్ జనవరి నెలలలో హైద్రాబాద్, విజయవాడలలో జరుగబోయే బుక్ ఎగ్జిబిషన్లలో పంచవటి స్టాల్లో కలుసుకుందామన్న నిశ్చయంతో ఈ రిట్రీట్ విజయవంతంగా ముగిసింది.
ఈ సందర్భంగా తీసిన కొన్ని ఫోటోలను మాత్రం ఇక్కడ చూడవచ్చు.