జ్యోతిషం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
జ్యోతిషం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

18, జులై 2026, శనివారం

O.P.Nayyar జాతకవిశ్లేషణ - 2

"తెలియనంతవరకూ బ్రహ్మవిద్య, తెలిస్తే కూసువిద్య" అన్నట్లు, లోతుపాతులు తెలియనంతవరకూ జ్యోతిషశాస్త్రం గందరగోళంగా ఉంటుంది. ఒకసారి దానిలో పట్టుచిక్కితే మాత్రం, ఆపైన నల్లేరుమీద నడకే అవుతుంది. అప్పుడు ఒక జాతకాన్ని గానీ, జీవితాన్ని గానీ చదవడం మంచినీళ్లు త్రాగినంత సులభమౌతుంది. 

నయ్యర్ జాతకంలో - సుఖస్థానమైన మకరంలో సన్యాసయోగముంది. అందులోనే నీచగురువున్నాడు. కనుక తీవ్రమైన గురుదోషం కూడా ఉంది. దానికి తోడుగా, వృశ్చికంలో విధ్వంసయోగముంది. కళలను, ప్రేమలను, భావుకతను, సృజనాత్మకతను సూచించే శుక్రుడు బుద్ధిస్థానంలో శనిక్షేత్రంలో ఉన్నాడు. శనిదృష్టి సన్యాసయోగంపైన ఉంది. కుజదృష్టి శుక్రునిపైన ఉన్నది. ధనుస్సుకు, మకరానికి అర్గళం పట్టింది. రాహువు ఏకాకిగ్రహమయ్యాడు. 

అయిపోయింది. మొత్తం జాతకాన్ని అర్ధం చేసుకోవడానికి ఇవి చాలు. ఒక మనిషిని అర్ధం చేసుకోవడానికి, అయిదునిముషాలు సరిపోయినట్లే, ఒక జాతకాన్ని అర్ధం చేసుకోవడానికి కూడా అయిదే నిముషాలు చాలు. 

ఈయన జీవితాన్ని మొత్తాన్నీ శాసించినవి ఈ గ్రహస్థితులే.

అయితే, రాశిచక్రాన్ని ఒక్కదాన్ని చూచి, మనకంతా అర్థమైందని అనుకోకూడదు. నవాంశను, ఇతర వర్గచక్రాలను సరిదిద్దాలి. షష్ట్యంశ వరకూ సరిచేయాలి. అప్పుడు మాత్రమే ఆ జాతకం సరియైనదౌతుంది. లేదంటే తప్పుదారి పట్టిస్తుంది. ఇదంతా చేయాలంటే, జననకాలసంస్కరణ ఎలా చేయాలో  తెలియాలి. దానికి స్ఫురణశక్తి (ఇంట్యూషన్) ఉండాలి. ఇన్ని ఉన్నప్పుడే ఒక జాతకాన్ని స్పష్టంగా చదవగలుగుతాము. అప్పుడే కర్మరహస్యాలు అర్ధమౌతాయి. జన్మజన్మాంతరాలలో ఆ జీవి యొక్క నడకా అర్ధమౌతుంది.

థియరీని పక్కనపెట్టి, జాతకంలోకొద్దాం.

నయ్యర్ జననసమయం ఎక్కడా దొరకడంలేదు. కొందరు వృషభలగ్నమని, కొందరు తులాలగ్నమని అంటున్నారు. ఇంకొందరేమో ఏకంగా, జననసంవత్సరం 1926 కాదు, 1927 అంటున్నారు. ఉదయం 2 గంటలని కొన్నిచోట్ల ఉన్నది. కానీ ఏదీ ఖచ్చితంగా లేదు.

ఈ గందరగోళాన్నంతా సరిదిద్ది, ఈయన జననసమయాన్ని నేను సంస్కరించాను. అంటే, రెక్టిఫై చేశాను. అది 16-1-1926 ఉదయం గం. 1.23 అయింది. ఎలాచేశానో అడక్కండి. చెప్పను. ఆ సమయానికి షష్ట్యంశచక్రం ఇలా ఉంది.

రాశిలో నీచస్థితిలో ఉన్న గురువు, ఇక్కడ ఉచ్ఛస్థితిలోకి పోయాడు. కానీ, నీచకేతుశుక్రుల అర్గళంలో చిక్కుకున్నాడు. ఇదే అర్గళం శనిచంద్రులకు కూడా వర్తిస్తుంది. నీచకేతువును రవిగురుల అర్గళం బంధించింది. రాహుకేతువులు నీచస్థితులలో ఉన్నారు. శనిచంద్రయోగం ఉన్నది. నీచబుధ, కుజయోగం ఉన్నది. సూర్యుడు బలంగా ఉన్నాడు. శుక్రుడు లగ్నంలోకి వచ్చాడు. ఇప్పుడు, రాశిచక్రంతో షష్ట్యంశను అన్వయించుకుంటే, ఈయన జాతకం అద్దంలో చూచినంత స్పష్టంగా ఉన్నది.

సింహావలోకనం

శనికుజులవల్ల నోటిదురుసూ, కోపం, స్నేహితుల నుంచి మోసపోవడం, పైల్స్ మొదలైన రోగాలు కనిపిస్తాయి. శుక్రునివల్ల ప్రేమవ్యవహారాలు, కళాతృష్ణ, గొప్పదైన టాలెంట్,  సినిమారంగంలో పేరు, సృజనాత్మకత వస్తాయి. సన్యాసయోగంవల్ల వృత్తికి, కుటుంబానికి దూరంకావడం, ఒంటరిగా జీవించడం, అలాగే మరణించడం మొదలైనవి కలుగుతాయి. బుధునివల్ల వాయిద్యాలతో నేర్పరితనం, రాగాలను పాటలను సృష్టించడం వస్తుంది. అయితే, ఈయన దుర్మార్గుడు కాదని, సంసారం దెబ్బతింటుందని, తప్పులను చేశానని గ్రహించి, వాటిని దిద్దుకునే క్రమంలో ఒంటరిజీవితాన్ని గడిపి, అనామకంగా కన్నుమూస్తాడని షష్ట్యంశచక్రం చూపిస్తోంది.

జననకాలదశ
 
నా విధానంలో జననకాలదశకు చాలా ప్రాముఖ్యత ఉంది. ఏమంటే, అది జీవితం మొత్తాన్నీ ఒక ముద్దలో పెట్టి చూపిస్తుంది. జననకాలదశ అయిన కుజ రాహు రాహు గురు శుక్రదశ - దూకుడు ప్రవర్తన, స్నేహితులతో మోసపోవడం, అక్రమసంబంధాలు, సినిమాజీవితం, గురుదోషం వల్ల చిన్నాభిన్నమై జీవితం, కళారంగంలో పేరుప్రఖ్యాతులను స్పష్టంగా చూపిస్తోంది.

కుజదశ

ధనిష్టానక్షత్రం ఒకటోపాదం కాబట్టి, జననసమయానికి 6 ఏళ్ల 6 నెలల 26 రోజుల కుజమహర్దశ మిగిలి ఉన్నది. ఆరేళ్లతర్వాత 18 ఏళ్ల రాహుమహాదశ నడిచింది. దానికి తగినట్లుగానే, ఈయనకు చదువుపైన పెద్దగా ఆసక్తి ఉండేది కాదు. దానిబదులు సంగీతమూ, సౌందర్యపోషణా ఈయన మనసును ఆక్రమించాయి. ఈ విషయాన్ని ఆయనే బాహాటంగా చెప్పాడు.

"Woman, I am of woman, by woman, for woman. Women are my inspiration.' అని  తన తర్వాతి జీవితంలో ఆయన చాలాసార్లు అంటూ ఉండేవాడు.

వీరిది సంగీతకుటుంబం కాదు. తండ్రి, మెడికల్ స్టోర్స్ లో సూపర్నెంటుగా పనిచేసేవాడు. నయ్యర్ మాత్రం చిన్నప్పటినుంచే సంగీతమంటే చెవికోసుకునేవాడు. దానికి కారణం, గర్భవతిగా ఉన్న సమయంలో ఈయన తల్లిగారు, హార్మనీ ముందేసుకుని స్వరాలను అభ్యాసం చేస్తూ ఉండటం కావచ్చు. అంతకంటే వేరే కారణమేదీ కనిపించదు.

ఈయనపైన ముగ్గురు అన్నయ్యలు, ఒక అక్కయ్య ఉన్నారు.  అక్కయ్య తప్ప మిగిలిన అన్నలందరూ, డాక్టర్లే. వారిలో ఒకన్నయ్య హైద్రాబాద్ లోనే మిలిటరీ డాక్టర్ గా ఉండేవాడు. సంగీతరంగంలో అడుగుపెట్టినప్పటికీ, చివరకు ఈయనకూడా హోమియోపతి డాక్టరే అయ్యాడు. ఇది, కుటుంబంలో ఎప్పటినుండో ఉన్న మెడికల్ జీన్స్ ను చూపిస్తోంది. ఇదెలా వచ్చిందో చూడటం మన సబ్జెక్టు కాదు కాబట్టి దానిని వివరించడం లేదు.

రాహుదశ

ఏడేళ్లవయసులో రాహుదశ మొదలైంది. నయ్యర్ సంగీతాన్ని నేర్చుకోవడం తండ్రికి ఇష్టముండేది కాదు. ఆ రంగం అంత మంచిది కాదని, అప్పట్లో అనుకునే చాలామంది సాంప్రదాయకుటుంబాలలాగే ఆయనకూడా అనుకుని, 'సంగీతం నేర్చుకుని ఏం చేస్తావ్? రోడ్లమీద పాటలు పాడుతూ అడుక్కుతింటావా?' అంటూ నయ్యర్ ను తిట్టేవాడు, కొట్టేవాడు కూడా. కానీ నయ్యర్ మనసంతా సంగీతం పైనే  ఉండేది. తండ్రిమాటను వినలేదు. కానీ చివరకు తండ్రిమాటే చాలావరకూ నిజమైంది. జీవితం ఆఖరిలో ఇతరులపైననే ఆధారపడి అనామకంగా జీవించి, చనిపోయాడు.

అయితే సంగీతాన్ని ఎవరిదగ్గరా నేర్చుకోలేదు. సొంతంగా రహస్యంగా అభ్యాసం చేసి పియానో, ధోలక్, డ్రమ్స్ వాయించడం నేర్చుకున్నాడు. ఇలా దేనినైనా సొంతంగా నేర్చుకునే ప్రజ్ఞ ఆయనలో ఉండేది. దీని సాయంతోనే, పెద్దయ్యాక, హోమియోపతిని, జ్యోతిషాన్ని కూడా స్వయం-అధ్యయనంతో నేర్చుకున్నాడు. దీనికి కారణం దశమంలోని రాహువు. ఇలాంటి జాతకులు సంప్రదాయానికి భిన్నంగా నడుస్తారు. ఒకవిధమైన మొండిగా, విప్లవాత్మకంగా ఉంటారు. నయ్యర్ కూడా అలాగే తయారయ్యాడు.

చిన్నవయసులోనే లాహోర్ ఆల్ ఇండియా రేడియోలో సింగర్ గా పనిచేస్తున్న సమయంలో, సరోజ్ అరోరా అనే డాన్సర్ తో పరిచయం ఏర్పడింది. ఆమె రచయిత్రి కూడా. ఈమె వ్రాసిన 'ప్రీతమ్ ఆన్ మిలో' అనే పాటను 19 ఏళ్ల నయ్యర్ స్వరపరచగా, Ch. Atma పాడాడు. ప్రయివేట్ ఆల్బమ్ అయినప్పటికీ, ఈ పాట పాన్ ఇండియా హిట్ అయింది. ఈ సంఘటన 1945 లో జరిగింది. అప్పుడు నయ్యర్ కు  రాహు-శుక్రదశ నడుస్తున్నది. వయసు 19 ఏళ్ళు. ఈ దశ ఏం చేస్తుందో జ్యోతిషవిద్యార్థులకు తెలిసినదే కదా !  ఈయనకు సరోజ్ అరోరాకు ప్రేమ మొదలైంది.

ఈలోపల 1947 లో దేశం మూడుముక్కలైంది. అప్పుడీయనకు రాహు-చంద్ర-రాహు గ్రహణదశ నడిచింది. వీరి కుటుంబం ఇండియాలోని అమృత్ సర్ కు మారింది. పాటియాలాలో ఉంటూ, ఒక స్కూల్లో మ్యూజిక్  టీచర్ గా పనిచేస్తూ ఉండేవాడు. 

19-5-1951 తేదీన, నయ్యర్, సరోజ్ అరోరాల పెళ్లిజరిగింది. అప్పటికి నయ్యర్ కు 25 ఏళ్ళు. సరోజ్ కు కూడా అటూఇటుగా అంతే ఉండవచ్చు. అయితే, నయ్యర్ చాలా ముక్కుసూటి మనిషి. 'నేను పక్కా స్త్రీలోలుడిని. నా జీవితంలో, అనేకమంది స్త్రీలతో నేను సంబంధాలను పెట్టుకోవచ్చు. ముందే చెబుతున్నాను. తర్వాత నీ ఇష్టం' అని పెళ్ళికి ముందే సరోజ్ తో  ఖండితంగా చెప్పేశాడు. 

దానికి ఒప్పుకున్న సరోజ్ 'సరే నీ ఇష్టం. కానీ ఇంకో పెళ్ళిమాత్రం చేసుకోకు' అని షరతు పెట్టింది. దానికి నయ్యర్ ఒప్పుకున్నాడు. ఆ ఒప్పందాలతో వీరి పెళ్లి జరిగింది. అప్పట్లోనే ఇంత విశాలదృక్పథాలతో కూడిన పెళ్లిళ్లు జరిగేవన్నమాట !

ఆనాడు నయ్యర్ జాతకంలో గురు గురు చంద్ర రాహు శుక్రదశ నడుస్తోంది. ఇందులో వ్యామోహమే ఎక్కువగా కనిపిస్తోంది. గజకేసరీయోగాన్ని కాస్తా గురువుయొక్క నీచత్వం మ్రింగేసింది. దానికింకొక కారణం గోచారశని. ఈయన కన్యలో ఉంటూ వక్రించి సింహంలోకి వస్తున్నాడు.  అంటే,అష్టమశని దశ జరుగుతోంది. అందుకే ఈ పెళ్లి చివరకు పెటాకులై పోయింది.

గురుమహర్దశ

గురుదశ నవంబర్ 1949 లో మొదలైంది. ఇది ఈయన జీవితాన్ని అనేక మలుపులు త్రిప్పింది. గురుదశలోనే గురుదత్ తో పరిచయం ఏర్పడింది. తను తీసిన సినిమాలన్నింటిలో నయ్యర్ కు ఛాన్సిచ్చాడు గురుదత్. అంతేగాక, నయ్యర్ కూడా గీతాదత్ చేత  తన పాటలన్నింటినీ పాడించేవాడు. 

1949 లోనే  బాంబేకు మకాం మార్చి 'కనీజ్' అనే సినిమాకు నేపధ్యసంగీతాన్ని అందించాడు. 1952 లో 'ఆస్మాన్' అనే సినిమాకు మొదటిసారి సంగీతదర్శకత్వాన్ని వహించాడు.

కెరీర్ ప్రారంభ దశ

ఈయన కెరీర్ లో 1949-52 మధ్య సమయాన్ని ప్రారంభదశగా చెప్పుకోవచ్చు. ఆ సమయంలో గురు-గురు, గురు-శని దశలు నడిచాయి. గోచారగురువు మకరం నీచస్థితినుండి వృషభం వరకూ సంచరించాడు. గోచారశని సింహ, కన్యలలో సంచరించాడు. అది అర్ధాష్టమశని దశ. కనుక మొదటి మూడుసినిమాలు సంగీతపరంగా అంత బాగా ఆడలేదు.

గీతాదత్ దశ

1953-56 మధ్యదశను గీతాదత్ దశగా చెప్పుకోవచ్చు.

1954 లో తన 'ఆర్ పార్' సినిమాకు గురుదత్ ఈయనను సంగీతదర్శకుడిగా ఎన్నుకున్నాడు. ఆ సమయంలో గోచారశని దశమంలో ఉచ్ఛస్థితికి వచ్చాడు. ఆ సినిమా సూపర్ హిట్  అయింది. 

దానితర్వాత 1955, 56 లలో వరుసగా గురుదత్ తీసిన మిస్టర్ అండ్ మిసెస్ - 55, సిఐడీ సినిమాలు ఘనవిజయాలను సాధించాయి. గోచారశని దశమంలో ఉచ్ఛస్థితిలో ఉన్నాడు.  అందుకే అలా జరిగింది.

అయితే, గోచారశని వృశ్చికంలోకి మారి, జననకాల శనికుజులపైకి రాగానే,  ఈయన జీవితాన్ని ధ్వంసం చేసిన ఆశాభోంస్లే పరిచయం అయింది. ఆ సమయంలో ఈయనకు గురు-బుధదశ మొదలైంది. బుధుడు నవమాధిపతి, చంద్రలగ్నాత్ కూడా 6-9 ఆధిపత్యం ఉన్నది. కనుక బలమైన గతకర్మానుసారంగా, ఈ పరిచయం ప్రేమగా మారింది.

ఆమెను తన టీమ్ లోకి తీసుకున్నాడు. అప్పటివరకూ అక్క లతా నీడలో దాగి, క్లబ్బు పాటలను పాడుకుంటున్న ఆమెను ఒక ముఖ్యగాయనిగా తీర్చిదిద్దాడు. అప్పటివరకూ తన పాటలను పాడుతున్న షంషాద్ బేగం, గీతాదత్ లను పక్కనపెట్టి ఈమెకు ఛాన్సులివ్వడం మొదలుపెట్టాడు. ఇది తన జీవితంలో చేసిన పొరపాట్లలో ఒకటని తర్వాతి కాలంలో ఒప్పుకున్నాడు.

ఆశాభోంస్లే దశ

1957-68 ను ఆశాభోంస్లే దశగా చెప్పుకోవచ్చు.  ఈ సమయంలో 20 సినిమాలకు సంగీత దర్శకత్వం వహించాడు. వాటిల్లో అన్నీ హిట్ పాటలే. 

1957 లో బీ.ఆర్.చోప్రా తీసిన  'నయా దౌర్' తో ఉత్తమ సంగీత దర్శకుడిగా ఫిల్మ్ ఫెర్ అవార్డును అందుకున్నాడు. ఆ సమయంలోనే ఒక సినిమాకు లక్షరూపాయలు పారితోషికాన్ని తీసుకునేవాడు. ఆ సమయంలో గురు-శుక్రదశ నడిచింది. వృశ్చికశని వక్రించి తులాశని ఫలితాన్నిచ్చాడు.

1958 లో వీరిద్దరూ సహజీవనం మొదలుపెట్టారు. ఆ సమయంలో గురు-శుక్రదశ నడిచింది. పంచమశుక్రుడు మళ్ళీ ప్రేమలో పడవేశాడు. అప్పుడు మొదలైన వీరి ప్రేమాయణం 14 ఏళ్లపాటు సాగి, 1972 లో ముగిసింది. 

Ek Musafir Ek Hasina (1962), Phir Wohi Dil Laya Hoon (1963), Kashmir Ki Kali (1964) ల  వరుసవిజయాలతో ప్రసిద్ధ రొమాంటిక్ మ్యూజిక్ డైరెక్టర్ గా స్థిరపడ్డాడు. ఆ సమయంలో రాహుకేతువులు మిధున-ధనుస్సులలో ఉచ్ఛస్థితులలో ఉన్నారు.

అక్టోబర్ 1964 లో గురుదత్ అర్ధాంతరంగా చనిపోవడం నయ్యర్ ను దెబ్బకొట్టింది. అది గురు-రాహు దశ. దీనిని ఛిద్రదశ అంటారు. ఇది  జీవితాలను చిదిమేస్తుంది. గురుదత్ మరణంతో నయ్యర్ కు కష్టకాలం మొదలైంది. ఆ సమయంలో నయ్యర్ కు ఏలినాటిశని రెండవపాదం నడుస్తోంది. శని కుంభంలో వక్రించి  ఉన్నాడు. గురువు వృషభంలో వక్రించాడు. కనుక, అదృష్టం వక్రించింది.

శనిమహర్దశ

1965 లో మొదలైన శనిదశతో ఈయనకు అవకాశాలు సన్నగిల్లడం మొదలైంది. దానికి కారణాలు అనేకం.  జ్యోతిషకారణం మాత్రం, శని బాధకస్థానంలో, శత్రువైన కుజునితో కలసి ఉండటం. అది దుర్ఘటనాయోగం కావడం.

ఈయనకు PR చేతకాదు. తనదగ్గరకు వచ్చిన నిర్మాతలకు మాత్రం మ్యూజిక్ చేసిపెట్టేవాడు. కానీ, పరిచయాలు పెంచుకొని, స్నేహాలు కలుపుకొని, పార్టీలిచ్చి, ఛాన్సులను సంపాదించడం ఈయనకు రాదు. పైగా, ముక్కుసూటిగా మాట్లాడేవాడు. దానికితోడు అతి డిసిప్లిన్ ఈయనతో ఉండేది. 

ఒక రికార్డింగ్ కు రెండుసార్లు పిలిచినా లతామంగేష్కర్ రాలేదని, ఆమెతో ఎప్పటికీ పనిచెయ్యనని ప్రతిజ్ఞ చేశాడు. ఆమేమో, హీరోయిన్లకు తప్ప వేరే పాత్రలకు తను పాడనంటుంది. క్రమేణా ఆమెకూడా ఈయనపైన పగబట్టి, తన చేతిలో ఉన్న మ్యూజిక్ డైరెక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడైన అనిల్ బిశ్వాస్ ద్వారా పావులు కదిపి ఈయనకు అవకాశాలు రాకుండా చేసింది. 

సమయపాలన లేకపోతే ఎంతటివాడినైనా అందరిముందూ తిట్టేసేవాడు. రఫీ, ఆశాల డ్యూయెట్స్ ను ప్రోత్సహించి, రఫీని బాగా సపోర్ట్ చేసింది ఈయనే. అలాంటిది, ఒకరోజున శంకర్ జైకిషన్ రికార్డింగ్ లో లేటై, తన రికార్డింగ్ కు ఆలస్యంగా వచ్ఛాడని మహమ్మద్ రఫీని తిట్టి పంపేసి, రెండేళ్లపాటు పాటలివ్వకుండా బహిష్కరించాడు. 

ప్రముఖ వేణువిద్వాంసుడు హరిప్రసాద్ చౌరాసియాను కూడా ఇదే కారణంతో వెనక్కు పంపించేశాడు.

తలత్ మహమూద్ మంచి గాయకుడు. కానీ, మన పీబీ శ్రీనివాస్ లాగా, ఆయనది సాఫ్ట్ మేల్ వాయిస్. గొంతును కొంచెం బొంగురుగా చేసుకోవడానికి అప్పట్లో కొంతమంది గాయకులు సిగరెట్ త్రాగేవారు. రికార్డింగ్ గ్యాప్ లో తలత్ మెహమూద్ సిగిరెట్ త్రాగుతుండటం నయ్యర్ చూచాడు. కోపంతో అతన్ని తిట్టి పంపించేశాడు. ఆ తర్వాత అతనికి  ఛాన్సులివ్వలేదు.

ఈ విధంగా, ఆర్టిస్టుల దగ్గర క్రమశిక్షణ లేకపోతే ఊరుకునేవాడు కాదు. ఆత్మాభిమానం, కోపాలు ఎక్కువ. పట్టూవిడుపూ లేకపోతే సినిమారంగంలో నెగ్గడం కష్టం. ముఖంమీద ఉమ్మేసినా తుడుచుకొని పోయేవారికే అక్కడ రాణింపు  ఉంటుంది. అది ఈయనకు చేతకాదు.

ఇలాఉండగా, ఈయన మార్కు సంగీతం క్రమేణా పాతబడిపోయింది. వెస్ట్రన్ బీట్స్ కలిసిన మ్యూజిక్ పాపులర్ అయింది. ఆర్దీ బర్మన్ వంటి క్రొత్తతరం ముందుకొచ్చింది.

ఈయన ఆశాభోంస్లే ను అమితంగా ప్రేమించాడు. కానీ ఆశా, తన అవకాశాలను, కెరీర్ ను మాత్రమే ప్రేమించింది. నయ్యర్ కు క్రమేణా ఛాన్సులు తగ్గాయి. పైగా ఈయన బాగా పొసెసివ్ గా ఉండేవాడు. ఆశా ఏ పాటను పాడాలో ఏదివద్దో ఈయనే నిర్ణయించేవాడు. ఏ సినిమా ఒప్పుకోవాలో ఏది వద్దో తనే చెప్పేవాడు. ఇదంతా అనవసరమైన నసగా ఆశాకు అనిపించింది. నయ్యర్  తన కెరీర్ కు అడ్డుగా మారాడని ఆశా భావించింది. ప్రతిదానికీ గొడవలు మొదలయ్యాయి. క్రమేణా ఈయనకు దూరమై, ఆర్దీబర్మన్ కు దగ్గరైంది. 

ఒకరోజున ఏదో చిన్నతప్పు చేసిందని, ఆశా కూతురు వర్షాభోంస్లేను అరిచి, చెయ్యెత్తి కొట్టబోయాడు. దానికి ఆశా అడ్డొచ్చింది. ఇద్దరికీ గొడవైంది. కోపంతో ఆమెను వదలి బయటకు వచ్చేశాడు.

ఆ విధంగా 5-8-1972 న ఆశాభోంస్లే తో విడిపోయాడు. అప్పటికి ఆమెతో 324 పాటలను పాడించాడు. కానీ ఆశా ఈయనను వదిలేసి ముందుకెళ్ళిపోయింది. ఈయన ఒక పిచ్చివాడిలాగా మిగిలిపోయాడు.

ఆ సమయంలో, ఈయన జాతకంలో శని-శుక్ర-రవి దశ నడిచింది. రవికేతువులు గ్రహయుద్ధంలో ఒకే డిగ్రీమీదున్నారు. పదకొండో అధిపతిగా రవి, పేరు ప్రఖ్యాతులున్న ఆశాను సూచిస్తున్నాడు. కనుక ఆ సమయంలో వీరిద్దరికీ గొడవై, విడిపోయారు. తిరిగి జీవితంలో కలుసుకోలేదు.

1972-79 కష్టాలు మొదలు

ఆశాతో విడిపోయాక, నయ్యర్ కెరీర్ బాగా తగ్గడం మొదలైంది. లతాతో పాటలు చెయ్యడానికి ఒప్పుకోడు. రఫీని దూరం పెట్టాడు. అందరితో సత్సంబంధాలు లేవు. PR లేదు. ఇక ఛాన్సులెలా వస్తాయి?

చివరకొకనాడు, తగ్గి, తనే రఫీ ఇంటికి వెళ్లి మాట్లాడాడు. రఫీ మెత్తబడ్డాడు. మళ్ళీ ఇద్దరూ కలిసిపోయారు. కానీ ఆశా దూరమైంది. ఆమె స్థానంలో వాణీజయరాం, దిల్రాజ్ కౌర్, కృష్ణా కల్లే, పుష్పా పగ్దరే, కవితాకృష్ణమూర్తి మొదలైన అప్పుడప్పుడే పైకొస్తున్న సింగర్స్ కు ఛాన్సులిచ్చి, వారిచేత పాడించాడు. కానీ వారెవరూ, ఆశా భోంస్లే మ్యాజిక్ ముందు తూగలేకపోయారు.

రఫీ మాత్రం నయ్యర్ ను బాగా సపోర్ట్ చేశాడు. కానీ మారిన సంగీతపు ట్రెండ్ లో, నయ్యర్ సంగీతం జనానికి నచ్చడం తగ్గింది. 1979 కల్లా ఛాన్సులు బాగా తగ్గిపోయాయి.

మాధురీ జోగ్లేకర్ దశ

అది శని - చంద్రదశ. 1976-77 ప్రాంతాలలో మాధురీ జోగ్లేకర్ అనే మరొక సింగర్ ఈయనకు పరిచయమైంది. ఈ దశను బట్టి వీరిది అందరూ అనుకునేటట్లుగా శృంగారసంబంధం కాదని అనిపిస్తుంది. శృంగారం కంటే ఎక్కువగా, అభిరుచులు, భావుకత, ఫిలాసఫీ మొదలైన హృదయసంబంధమైన విషయాలలో వీరికి శృతి కలిసి ఉండాలి.  ఇదే నిజమని తన తర్వాతి ఇంటర్వ్యూలలో మాధురీ చెప్పింది.

మొదట్లో, ఈయన మ్యూజిక్ ట్రూపులో కోరస్ సింగర్ గా ఈమె చేరింది.  అప్పటికే ఆమె మ్యూజిక్ లో MA చేసి ఉన్నది. ఈమెలో టాలెంట్ ను చూచిన నయ్యర్ ఈమెను దగ్గరకు తీశాడు. చర్చ్ గేట్ ఏరియాలో ఉన్న నయ్యర్ ఇంటికి ఈమె రోజూ వస్తూ ఉండేది. అప్పటికే నయ్యర్ హోమియోపతి, జ్యోతిష్యాలను బాగా అధ్యయనం చేయడం మొదలుపెట్టాడు. వాటిలో కూడా ఈమె సాయం చేస్తూ ఉండేది. చాలావరకు ఈయనకు సెక్రటరీగా పనిచేసేది. ఈయనకూడా 1976 నుంచే, బాంబే శివార్లలో వీరార్లో ఉన్న ఈమె ఇంటిలోనే ఎక్కువగా ఉంటూ ఉండేవాడు.

1974 లో (అంటే 22 ఏళ్ల వయసులోనే) ఈమె UPSC పరీక్షను క్లియర్ చేసి FCI లో ఆఫీసర్ గా చేరింది. అయినా సరే, సంగీతంపైన ఉన్న మక్కువతో, ఒకవైపు ఉద్యోగం చేస్తూ కూడా, నయ్యర్ కు సాయపడుతూ ఉండేది. క్రమేణా వీరిమధ్య రొమాంటిక్ సంబంధం ఏర్పడింది. ఈమె నయ్యర్ కంటే 26 ఏళ్ళు చిన్నది. అప్పటికి నయ్యర్ కు 50 ఏళ్ళు, ఈమెకు 24 ఏళ్ళు.

అప్పటివరకూ నయ్యర్ ప్రేమాయణాలను ఓపికగా భరిస్తూ వచ్చిన భార్యాపిల్లలు దీనికి అభ్యంతరం చెప్పడం మొదలుపెట్టారు. నయ్యర్ పిల్లలుకూడా పాతికేళ్ళవయసులోకి వచ్చారు. ఎన్నాళ్ళని ఈయన వేషాలను భరిస్తారు? వాళ్ళనుండి తీవ్రమైన ప్రతిఘటన ఎదురయ్యేసరికి నయ్యర్ కోపం తెచ్చుకున్నాడు. ఒకవైపు ఛాన్సులు తగ్గిపోయాయి. ఇంకోవైపు తను అమితంగా ప్రేమించిన సంగీతరంగం వెక్కిరిస్తోంది. ఆశా ఇచ్చిన షాకు చాలా గట్టిగా తగిలింది. ఇప్పుడు కుటుంబసభ్యులు ఎదిరించేసరికి తట్టుకోలేక, వారిని ఇంట్లోనుంచి వెళ్లిపొమ్మని గద్దించాడు. గట్టిగా నిలబడిన వాళ్ళు, ఆస్తిలో వాటాకోసం కోర్టులో కేసువేశారు. తెగేవరకూ లాగవద్దని, కోర్టుబయట ఒప్పందమే మంచిదని లీగల్ నిపుణులు ఈయనకు సలహా ఇచ్చారు. ఇంటిని, ఆస్తిని వారికి రాసేసి, నయ్యర్ కట్టుబట్టలతో ఇంటినుండి బయటకు వచ్చేశాడు. ఇదంతా 1979 లో జరిగింది.

తనవైపునుండి తాను కరెక్ట్ కావచ్చు. కానీ ఎదుటివారినుండి, అందులోనూ కుటుంబసభ్యులనుండి కూడా ఆలోచించాలి. భౌతికసంబంధాలు లేకుండా, గాలికి ఎగిరిపోతూ, భావప్రపంచాల్లో ఎప్పుడూ విహరిస్తూ ఉండే ఇటువంటి కళాత్మకమనస్తత్వాలు, జీవితవిధానాలు ఉన్నవాళ్లు పెళ్లిళ్లు చేసుకోకూడదు.

'నేనింతే' అని పెళ్ళికి ముందే చెప్పాడు కాబట్టి నయ్యర్ కరెక్టే అనడమే అసలు కరెక్ట్ కాదు. 'నేనింతే, నేను పెళ్ళికి పనికిరాను. మన పెళ్లి ఒద్దు. నాతో నువ్వు సుఖపడలేవు. నువ్వేకాదు, నాతో ఎవ్వరూ సుఖపడలేరు. నా దారి వేరు.' అని చెప్పాలి. అలా చెప్పకపోవడం నయ్యర్ చేసిన తప్పు. నయ్యర్ చెప్పినప్పటికీ సరోజ్ ఒప్పుకోవడం ఆమె తప్పు. వెరసి ఇద్దరిఖర్మా అలా ఉంది. పాపం, వాళ్ళు మాత్రం ఏం చేయగలరు? 

ఆ విధంగా, 1979 లో కుటుంబంతో విడిపోయి  విలాసవంతమైన తన చర్చ్ గేట్ ఇల్లును వదిలిపెట్టాడు. ఆ సమయంలో శని-రాహుదశ నడిచింది. ఇది శపితదశ అని గతంలో ఎన్నో జాతకాలలో నిరూపించాను. ఈ దశ ఏం చేస్తుందో కూడా వందలాది జాతకాలలో వివరించాను. ఈయన్ని కూడా ఈ దశ చావుదెబ్బ కొట్టింది.

ఇంటినుండి బయటకు వచ్చి, కుటుంబంతో తెగతెంపులు చేసుకుని, బాంబే శివార్లలో ఉన్న వీరార్ లో మాధురీతో కలసి ఆమె ఇంటిలో ఉండటం మొదలుపెట్టాడు. వీరి సహజీవనం 1976 నుండి 1996 వరకూ 20  ఏళ్లపాటు సాగింది. అయినా సరే, మధ్యమధ్యలో అప్పుడపుడు కొన్ని సినిమాలకు సంగీతాన్నిస్తూ ఉండేవాడు.

(ఇంకా ఉంది)

read more " O.P.Nayyar జాతకవిశ్లేషణ - 2 "

15, జులై 2026, బుధవారం

O. P. Nayyar జాతకవిశ్లేషణ - 1

పాతతరం హిందీ మధురగీతాలను ఇష్టపడేవారిలో ఓపీ నయ్యర్ పేరును తెలియనివారు ఉండరు. ఈయన అభిమానులందరూ తమను తాము OPiums అని పిలుచుకుంటారు.

ఈయన పూర్తిపేరు ఓంకార్ ప్రసాద్ నయ్యర్.  ఈయనపుట్టి ఇప్పటికి నూరేళ్లు దాటింది. అయినా సరే, నేటికీ ఈయన స్వరపరచిన పాటలను ఇష్టపడేవారు కోట్లలో ఉన్నారు.  

ఈయన తెలుగులో కూడా 'నీరాజనం' అని ఒక సినిమాను చేశారు. అది 1989 లో విడుదలైంది. అందులోని పాటలు కూడా ఆపాతమధురాలే. ఈయన ట్యూన్స్ ను తెలుగులోకి కూడా కాపీ కొట్టారు. ఉదాహరణకు "ఒ లేకే పెహలా పెహలా ప్యార్"  అనే పాటరాగాన్ని తెలుగులో "ఓహో బస్తీ దొరసానీ" అనే పాటకు తీసుకున్నారు.

అయితే, పాతతరం హిందీసినిమా దర్శకులలో అత్యధిక మొత్తాన్ని ఫీజుగా తీసుకున్న ఈయన, తన జీవితం రెండవభాగంలో సంగీతంవైపూ, సినీఫీల్డ్ వైపూ తిరిగి చూడకుండా, వాటిని పూర్తిగా వదిలేసి, ఒక హోమియోపతి వైద్యునిగా, ఒక జ్యోతిష్కునిగా మంచిప్రజ్ఞను సంపాదించి, పదేళ్లపైగా బాంబే స్లం ఏరియాలలోని పేదవారికి నిస్వార్థమైన సేవలందించి, చివరకు తన కుటుంబానికి దూరంగా, ఒంటరిగా కన్నుమూశాడు.

తన కుటుంబసభ్యులు కానీ, సినిమాజీవులుకానీ, విలేఖరులుగానీ, టీవీ జనాలు గానీ,  ఎవరూ తన అంత్యక్రియలకు రాకూడదని, కనీసం తన శవాన్ని తాకడానికి కూడా వీల్లేదని విల్లు వ్రాసిపెట్టి మరీ కన్నుమూశాడు. తన అంత్యక్రియలు కూడా అతినిరాడంబరంగా జరగాలని, ఆ తరువాత సంస్మరణసభలు పెట్టకూడదని గట్టిగా హెచ్చరించి వెళ్ళిపోయాడు.

ఈయన సంగీతాన్ని నేర్చుకోలేదు. కానీ సంగీతదర్శకుడయ్యాడు. నూరేళ్ళతర్వాత కూడా ప్రపంచం మరచిపోలేని స్వరాలందించాడు. కేవలం 19 ఏళ్ల వయసులో "ప్రీతమ్ ఆన్ మిలో" అనే  సూపర్ హిట్ పాటను స్వరపరచాడు. దీనిని ఈయన స్నేహితుడైన Ch. ఆత్మా పాడాడు. 80 ఏళ్ల తర్వాత ఈనాటికి కూడా ఈ పాట ఆపాతమధురమే.

ఈయన వైద్యశాస్త్రాన్ని చదవలేదు. కానీ, ముంబాయికి చెందిన ప్రముఖ హోమియోవైద్యుడు డా. ఎస్సార్ పాఠక్ దగ్గర హోమియోపతిని నేర్చుకుని, వైద్యుడయ్యాడు. వేలాదిమంది పేదరోగులకు ఉచితంగా మందులిచ్చి సేవచేశాడు. ముంబాయ్, కలకత్తా, హైదరాబాద్ లలో ఉచితహోమియో క్లినిక్స్ నడిపాడు. అలా పేదవారికి సేవను చేయడంలో ఆనందాన్ని పొందాడు. 

జ్యోతిషాన్ని ఎవరిదగ్గరా నేర్చుకోలేదు. కానీ, సొంతంగా దానిని నేర్చుకుని దానిలో మంచిప్రజ్ఞను సంపాదించాడు. ఎంతోమంది సినీ ప్రముఖులకు, ఇతరులకు జోస్యాన్ని కరెక్ట్ గా చెప్పాడు. తను పుట్టిననెలలోనే మధుబాల చనిపోతుందని చెప్పాడు. ఆమె అలాగే చనిపోయింది. చివరకు తన మరణాన్ని కూడా తనే కరెక్టుగా జోస్యం చెప్పుకున్నాడు. అదేవిధంగా చనిపోయాడు. 

ఎన్ని చేసినా తన 81 ఏళ్ల సుదీర్ఘజీవితంలో ఆత్మాభిమానాన్ని మాత్రం వదులుకోలేదు. జీవితపు ప్రతిమలుపులోనూ తలెత్తుకునే బ్రతికాడు. అత్యంతవిలాసాలనూ, సాధారణజీవితాన్నీ రెండింటినీ చూశాడు. చివరలో ఒక ఋషిలా బ్రతికి, ఒక అనామకుడుగా చనిపోయాడు.

ఈయనలో ఒక కళాతపస్వి, ఒక ప్రేమపిపాసి, ఒక భావుకుడు, ఒక తాత్వికుడు, ఒక క్రమశిక్షణను కలిగిన రూల్ మాస్టర్, ఒక మొండివాడు, ఒక నోటిదురుసు మనిషి, ఒక నిస్వార్ధహృదయుడు, ఒక నిరాడంబరజీవి  అందరూ కలిసి ఉన్నారు.

ఈయన 16-1-1926 న లాహోర్ లో ఒక బ్రాహ్మణకుటుంబంలో పుట్టాడు. 2007 లో 81 ఏళ్లవయసులో గుండెపోటుతో థానేలో  చనిపోయాడు. 1957 లోనే ఒక సినిమాకు లక్షరూపాయలు పారితోషికాన్ని తీసుకునేవాడు. అప్పట్లోనే బాంబే మొత్తమ్మీద 'కాడిలాక్' కార్లున్న ఇద్దరిలో ఈయనొకడు. కానీ విలాసవంతమైన అటువంటి జీవితాన్ని వదిలిపెట్టి బాంబే స్లంలో ఒక చిన్నగదిలో ఒక లోయర్ మిడిల్ క్లాస్ కుటుంబంతో పేయింగ్ గెస్ట్ గా ఉండేవాడు.చివరకు అక్కడే కన్నుమూశాడు.

తన కెరీర్ మొత్తంలో 500 పైన పాటలను సృష్టించినా, లతామంగేష్కర్ తో ఒక్కపాటను కూడా పాడించలేదు. వాళ్లిద్దరి మధ్యా గొడవలుండేవి. కానీ 1950-60 మధ్యలో హిందీసినిమా సంగీతాన్ని ఏలాడు. 'రిథమ్ కింగ్' అనే బిరుదును సంపాదించాడు. 

1990 లో తనకు డబ్బు ఇబ్బందులున్న రోజులలో కూడా, లతామంగేష్కర్ అవార్డు క్రింద లక్షరూపాయలను తనకు ఇస్తామంటే, ' ఆమెపేరుతో పెట్టిన అవార్డు నాకేంటి? నాన్సెన్స్ !' అని దానిని తిరస్కరించాడు. అలాంటి మొండివాడు. ఆత్మాభిమాని.

అందుకే ఈయనది చాలా విచిత్రమైన జీవితమని అంటాను.  ఈయన జాతకాన్ని చూద్దాం ! 

అంతకుముందుగా,  ఈయన స్వరపరచిన 500+ పాటలనుంచి కొన్ని ప్రముఖపాటలు :

1. ప్రీతమ్ ఆన్ మిలో - ప్రయివేట్ ఆల్బమ్ - 1945

2. మాంగ్ కె సాత్ తుమారా -  నయా దౌర్ -1957

3. బాబూజీ ధీరే చల్నా - ఆర్ పార్ -1954

4. ఆవో హుజూర్ తుమ్కో - కిస్మత్ -1968

5. పుకార్తా చలా హు మై - మేరే సనమ్ -1965

6. యే దిల్ హై ముషికిల్  జీనా యహా - CID 1956

7. దీవానా హువా బాదల్ - కశ్మీర్ కీ కలీ -1964

8. లేకే పెహలా పెహలా ప్యార్ - CID 1956

9. కజరా మొహబ్బత్ వాలా - కిస్మత్ 1968

10. ఇషారో ఇషారో మె - కశ్మీర్ కీ కలీ -1964

11. జాయియే ఆప్ కహా జాయేంగే - మేరె సనమ్ -1965

12. తారీఫ్ కరూ క్యా ఉస్కీ - కశ్మీర్ కీ కలీ -1964

13. జానే కహా మేరా జిగర్ గయా జీ - Mr Mrs 55 - 1955

14. ఆయియే మెహర్ బాన్ - హౌరా బ్రిడ్జ్ - 1958

15. జరా హౌలే హౌలే చలో మేరే సాజ్నా - సావన్ కీ ఘటా -1966

16. ఆఖో హి ఆఖో మే ఇషారా హోగయా - CID -1956

17. యూ తో హంనే లాఖ్ హసీ దేఖే హై - తుంసా నహీ దేఖా - 1957

18. తుం జో హుయే మేరే హంసఫర్ - (12 O'Clock) - 1958

19. యే హై రేష్మీ జ్యూల్పోన్ క అంధేరా - మేరె సనమ్ - 1965

20. ఆప్ యూహీ అగర్ హం సే మిల్తే రహే - ఏక్ ముసాఫిర్ ఏక్ హసీనా -1962 

21. చైన్ సే హంకో కభీ - ప్రాణ్ జాయే పర్ వచన్ న జాయే - 1974

22. ఉడే జబ్ జబ్ జుల్పే తేరీ - నయా దౌర్ -1957

23  మేరా నామ్ చిన్ చిన్ చిన్ - హౌరా బ్రిడ్జ్ -1958

24. ఏక్ పరదేశి మేరా దిల్ లేగయా - ఫాగున్ - 1958

25. కభీ ఆర్ కభీ పార్ - ఆర్ పార్ - 1953

26. సున్ సున్ సున్ జాలిమా - ఆర్ పార్ -1953

27. పియా పియా పియా మేరా జియా పుకారే - బాప్ రే బాప్ -1955

28. సర్ పర్ టోపీ లాల్ దుపట్టా - తుంసా నహి దేఖా -1957

29. తూ ప్యార్ కా సాగర్ హై - సీమా -1955

30. దిల్ కి ఆవాజ్ భి సున్ - హం సాయా -1968

31. రేష్మి సల్వార్ కుర్తా జాలీ కా - నయా దౌర్ - 1957

32. మై ప్యార్ కా రాహీ హూ - ఏక్ ముసాఫిర్ ఏక్ హసీనా -1962

33. లాఖో హై నిగాహ్ మే - ఫిర్  ఓహీ దిల్ లాయా హు. - 1963  

(ఇంకా ఉంది )
read more " O. P. Nayyar జాతకవిశ్లేషణ - 1 "

30, జూన్ 2026, మంగళవారం

రామమందిర చందాచోరీ వివాదం

అయోధ్య రామమందిరం మొదలవడమే గొడవలతో మొదలైంది. 

మొదలుపెట్టి రెండేళ్లు కూడా కాకముందే పెద్ద వివాదంలో చిక్కుకుంది. భక్తులిచ్చిన చందాలు దొంగిలించబడటం చాలా బాధాకరం. దేశం మొత్తంమీద హిందువుల నమ్మకం తీవ్రంగా దెబ్బతిన్నది.

తిరుమలలో ఇదే జరిగింది. పట్టుకున్న S.I హత్యకు గురయ్యాడు. ఇప్పుడు అయోధ్యలోనూ అదే నేరం జరిగింది. పద్మనాభస్వామి ఆలయంలో వేరేరకంగా ఇదే జరిగింది. మొత్తానికి, దేవుడంటే భక్తులకు భక్తి ఉన్నప్పటికీ, ఆలయంలో పనిచేసేవాళ్లకు  మాత్రం ఏదీ ఉండదని తేలిపోయింది.

ఆలయాలలో అవినీతి, దొంగతనాలు,  జరగడం. అదికూడా భక్తులు చేయడం చాలా బాధాకరం. 'మిశ్రా, శుక్లా, పాండే' అనేపేర్లు బ్రాహ్మణులు. 'బన్సాల్' అంటే వైశ్యులు. యాదవ్ అంటే తెలిసినదే. వీళ్ళే ఇలాంటిపనులు చేస్తే ఇక ఎవర్ని ఏమనుకోవాలి? మేనేజ్మెంట్ లో వేరే కులాలు మతాలవాళ్ళు ఉన్నపుడు వారిని అనుకున్నాం గతంలో. ఇప్పుడు చేసిందెవరు? ఎవర్ని అనాలి? ఏమనాలి?

మేనేజ్ మెంట్ అంటే ఇదేనా? అందులోనూ అయోధ్యరామాలయం వంటి సంస్థను ఇలాగేనా నడిపేది? పైగా, ఉన్నవాళ్ళందరూ పెద్దపెద్దవాళ్లు?

చిన్నదొంగలను పట్టిచ్చి. లేదా పట్టుకున్నవారిని లేపేసి, సినిమాటిగ్గా పెద్దదొంగలు తప్పించుకుంటారని గతంలో చాలావాటిలో రుజువైంది. ఇప్పుడేమౌతుందో చూడాలి.

---------------------

ఎప్పుడూ ఎదురుగా కనిపిస్తుంటే దేవుడు కూడా చీపై పోతాడు. అందుకే, దూరాన్నించి దర్శనంకోసం వచ్చిన భక్తులకున్న భక్తి, అక్కడున్న పూజారికి ఉండదు. హుండీ డబ్బులు లెక్కించేవారికి అసలే ఉండకపోవచ్చు.

ఎదురుగా ఊరిస్తున్న డబ్బూ బంగారాలు ముఖ్యంగాని, గుళ్లో ఉన్న రాతిబొమ్మ మనకెందుకు? మనం పెడితేనేగా దానికి తిండి? అయినా తినేది దేవుడు కాదుగా, మనమే. కనుక మనకు మనమే ముఖ్యం, దేవుడు కాదు.

దేవుడికి కూడా డబ్బుతోనే విలువ. ఇంకా చెప్పాలంటే, అసలు విలువ డబ్బుకే గాని, దేవుడికి  కాదు.

నిజానికి, డబ్బు సంపాదించడానికి దేవుడొక ఆధారం. ఇది వాస్తవం.

ఇదే వాస్తవం !

అదంతా అలా ఉంచితే, జ్యోతిషం ఏమంటున్నదో చూద్దాం.

------------------------

ప్రాణప్రతిష్ఠ 22 జనవరి 2024 న మధ్యాన్నం 12. 30 కు జరిగింది.

అప్పట్లోనే పుష్యమాసం ముహూర్తం మంచిది కాదని చాలామంది అన్నారు. ఎవరూ వినలేదు. అది శూన్యమాసం. ఫలితం స్పష్టంగా కనిపిస్తోంది.

దేవాలయ శిఖరం, కలశం పూర్తి కాకుండానే ప్రాణప్రతిష్ట చేయడం మంచిది కాదని కూడా చాలామంది అన్నారు. కానీ చేసేవారు చేశారు. ఇప్పుడిలా అయింది.

ఆనాటి గ్రహస్థితులు ఇలా ఉన్నాయి.

ఉచ్ఛచంద్రుడు ఎదురులేని ప్రజాభిప్రాయాన్ని సూచిస్తున్నాడు. కనుక దేశంలోని హిందువులందరి మద్దతుతో ఆలయం నిర్మాణమైంది.

అష్టమంలో కుజ బుధ శుక్రులున్నారు. శుక్రుడు ఇంటిదొంగలకు సూచకుడు. బుధుడు కుటుంబసభ్యులకు, అనుచరులకు సూచకుడు. కుజుడు రహస్యశత్రువులకు సూచకుడు. ఈ ముగ్గురూ కలసి నష్టానికి సూచికైన అష్టమంలో ఉన్నారు. ప్రస్తుతం జరిగింది అదే !

ప్రస్తుతం నడుస్తున్న దశ -- కుజ శుక్ర చంద్ర దశ. కుజశుక్రులిద్దరూ పెద్దనష్టాన్ని సూచిస్తున్న అష్టమంలో ఉండటాన్ని చూడవచ్చు. ఈ దశ మార్చి 2026 నుండి ఏప్రియల్ 2027 వరకూ ఉంది. మార్చిలోనే ఈ గొడవంతా బయటపడటం మొదలుపెట్టింది.

అధికారయంత్రాగాన్ని సూచించే సూర్యుడు మతసంబంధమైన నవమంలో పాపార్గళంలో చిక్కుకుపోయాడు. కనుక అధికారులూ యంత్రాంగమూ ఇరుకున పడ్డారు. సూర్యవిదశ సరిగ్గా మే - జూన్ నెలలలోనే నడిచింది.

దశమాధిపతి శని దశమంలో ఉన్నప్పటికీ, పాపార్గళంలో చిక్కుకున్నాడు. లాభస్థానంలోని గురుఛండాలయోగం నీతిలేని అనుచరులను (ఆలయ సిబ్బందిని) సూచిస్తున్నది. వీరివల్ల ఆలయమర్యాదకు ఘోరమైన కళంకం చుట్టుకుంది.

కుజదశ మార్చి 2028 వరకు ఉన్నది. అంతవరకూ పరిస్థితి బాగుపడదు.

ఆ పైన వచ్చే రాహుదశ 2046 వరకూ ఉంటుంది. అప్పుడూ, గురుఛండాలయోగం వల్ల ఏదో ఒక వివాదం ఉంటూనే ఉంటుంది.

ఇంతకంటే ముందుకు ప్రస్తుతం చూడనవసరం లేదు.

-------------------------

బయటనుండి వచ్చి దేవాలయాలను కొల్లగొట్టారని, కూలగొట్టారని రాక్షసులమాదిరిగా ప్రవర్తించారని తురకలను అనుకోవడం దేనికి? ఇంటిదొంగల సాయం లేకుండా వాళ్ళు ఆపనులు చేయగలిగేవారా? ఇప్పుడు మనవాళ్ళు చేస్తున్నదేమిటి?

ఇప్పుడు దోషులు కూడా ఇంటిదొంగలే. హిందూమతం ముఖ్యంగా దృష్టి పెట్టాల్సింది ఇంటిదొంగలమీదనే.

మన దేవుళ్ళపైన దేవాలయాలపైన మనకే గౌరవం లేదు. ఇక బయటవాళ్ళకెలా ఉంటుంది?

దేవుడికే ద్రోహం చేసేవాళ్ళు, మనుషులను ఒదులుతారనుకోవడం వెర్రితనం ! కాకపోతే, నీతికి మారుపేరుగా నిలవాల్సిన వాళ్ళే ఇలా చేస్తే, ఇక ఎవర్ని నమ్మగలం? అందులోనూ VHP, RSS కార్యకర్తలా? కోట్లాది హిందువుల హృదయాలు గాయపడ్డాయి.

వచ్చిన చెడ్డపేరు పోవడం చాలా కష్టం.

ముహూర్తసమయంలో నవాంశలో గురువు ఉచ్ఛస్థితిలో ఉన్నాడు. ఇప్పుడు రాశిలోనే ఉన్నాడు. గురువు అనుగ్రహిస్తే కష్టాలనుండి తేలికగా బయటపడవచ్చు.  కానీ, ఆ అనుగ్రహానికి తగిన అర్హత మనలో ఉండాలి. అప్పుడే అది మనకు లభిస్తుంది. ఊరకే మాత్రం రాదు. 

ఈ మొత్తం వ్యవహారంలో యోగి ఆదిత్యనాథ్ ఒక్కడే నిజాయితీగా, ధైర్యంగా నిలబడ్డాడు.

చూద్దాం దీనినెలా పరిష్కరిస్తారో? పోయిన పరువునెలా తిరిగి రాబట్టుకుంటారో?

read more " రామమందిర చందాచోరీ వివాదం "

10, జూన్ 2026, బుధవారం

రాజ్ కిరణ్ కు ఏమయ్యింది? జననకాల సంస్కరణ - ప్రశ్నజాతక నిర్ధారణ !


ఇతను 5-2-1949 న ముంబై లో జన్మించాడు. ఆరోజు శనివారం. అశ్వని 3-4 పాదాలు, భరణీ నక్షత్రం-1 పాదం ఆరోజు నడిచాయి. సమయం తెలియదు గనుక లగ్నం తెలియదు. జననకాల సంస్కరణ చేద్దాం.

ఇతను సినిమానటుడు గనుక, వృత్తివల్లనే ఇతనికి పేరుప్రఖ్యాతులు వచ్చాయి గనుక, ఈ విశ్లేషణలో దశాంశకు ప్రాధాన్యత ఉంటుంది.

దశాంశలో ఆ రోజున మిధునంనుండి కన్యవరకు నాలుగు నవాంశలు నడుస్తాయి. ఇతని ఆకారాన్ని బట్టి, నిండైన ముఖాన్ని బట్టి, కర్కాటకరాశి సరిపోతుంది. అప్పుడు 10  లో ఉచ్ఛసూర్యుడు, 4 లో ఉచ్చ శని, 11 లో శుక్రక్షేత్రంలో ఉచ్చరాహువులతో సినిమా కెరీర్ బ్రహ్మాండంగా ఉంటుంది.  కనుక,ఇతని దశాంశచంద్రుడు కర్కాటకంలో ఉండాలి. అలాంటపుడు, జననసమయం, 7. 22 am - 12. 18 pm మధ్యలో ఉంటుంది.

ఇతని కెరీర్ 1970 - 1980 మధ్యలో బ్రహ్మాండంగా నడిచింది. అప్పుడు ఇతనికి చంద్ర మహర్దశ జరిగింది. దశమంలో ఉన్న ఉచ్చసూర్యుడు, చతుర్దంలో ఉన్న ఉచ్ఛశని, లాభస్థానంలో ఉన్న ఉచ్చరాహువుల వల్ల ఇతను పట్టుకున్నది ఆ టైములో బంగారం అయింది.  ఇతని సినిమాలు ఈ క్రింది తేదీలలో విడుదల అయ్యాయి. ఈ తేదీలను, ఇతని జీవితపు  ఇతర ముఖ్యఘట్టాలను ఆధారాలుగా తీసుకొని సంస్కరణ చేయగా, ఇతని జననసమయం మధ్యాన్నం 12. 18 గా తేలుతున్నది.

1-1-1975 న ఇతని మొదటి సినిమా 'కాగజ్ కె నావ్' విడుదల అయింది. ఆ రోజున ఇతనికి చంద్ర-చంద్ర-చంద్ర దశ నడిచింది. అంటే, అప్పుడే చంద్రదశ మొదలైంది. దశాంశను పరిశీలిస్తే ఇది ఎందుకు జరిగిందో అర్ధమౌతుంది. చంద్రుని నుండి 10-4 ఇరుసులో ఉచ్చ శని సూర్యులు, లాభంలో ఉచ్ఛరాహువు కారకులు. 

11 -6- 1980 న, బాక్సాఫీసును బ్రద్దలు కొట్టిన 'కర్జ్' సినిమా విడుదలైంది. ఆ రోజున చంద్ర-శని-రాహు దశ నడిచింది. శనిరాహువులు దశాంశ చక్రంలో ఉచ్ఛస్థితిలో ఉండటాన్ని గమనించాలి.

3-12-1982 న, మరపురాని కథతో, సంగీతంతో, సందేశంతో తీయబడిన 'అర్ద్' సినిమా విడుదల అయింది. మహేష్ భట్ తీసిన చిత్రాలన్నింటిలోకీ ఇది మరపురాని చిత్రంగా  ఈనాటికి కూడా నిలిచిపోయింది. ఆ రోజున ఇతని జాతకంలో చంద్ర-శుక్ర-రవి దశ నడిచింది. చతుర్థంలో స్వస్థానంలో ఉన్న శుక్రుడిని దశమంనుండి  ఉచ్చ రవి వీక్షిస్తూ ఉండటం గమనించండి.

కానీ 1984 లో కుజ మహర్ధశ మొదలు కావడం తోనే ఇతనికి చెడుకాలం మొదలైంది. దీనికి కారణం కుజుడు అష్టమంలో శత్రుస్థానంలో పడిపోవడమే. రాశిచక్రంలో చూస్తే, లగ్నాధిపతిగా కుజుడు లాభంలో ఉన్నప్పటికీ, అది శత్రుక్షేత్రం కావడం, సింహంనుండి బాధకుడైన వక్ర శనియొక్క దృష్టికి లోనవ్వడం వల్ల ఆ దశ కలిసిరాలేదు.   ఆ సమయంలో క్రమేణా ఇతనికి సినిమాలు తగ్గిపోయాయి. అదే సమయంలో కుటుంబసమస్యలు కూడా ఎక్కువయ్యాయి.

1991 లో మొదలైన రాహుదశ ఇతన్ని నానా బాధలు పెట్టింది. కెరీర్ దెబ్బతినడం, కుటుంబసమస్యలు ఇతన్ని డిప్రెషన్ లో పడేశాయి. మందులు వాడుతూనే ధ్యానం చేయడం మొదలుపెట్టాడు. ఇతని ఖర్మకాలి సత్యసాయికి భక్తుడయ్యాడు. ఇతని వింశాంశ చక్రాన్ని గమనిస్తే, సరియైన ఆధ్యాత్మిక మార్గం దొరకాలంటే కూడా జాతకంలో పుణ్యబలం ఉండాలని నేను ఎప్పుడూ చెబుతున్న విషయం ఎంత కరెక్టో తెలుస్తుంది.

ఇతని వింశాంశచక్రంలో చంద్రుడు నీచస్థితిలో ఉన్నాడు. బుధుడు వక్రించి నీచస్థితిలో ఉన్నాడు. అక్కడనుండి పంచమమైన కర్కాటకంలో ఐదుగ్రహాలు ఉన్నాయి. కనుక మతిభ్రమించడం, భ్రమలతో కూడిన ధ్యానాలు మొదలైనవి కనిపిస్తున్నాయి. కుజుని ఉచ్ఛత్వం కూడా మొండితనాన్ని, పిచ్చిని సూచిస్తున్నది. ఉఛ్చ కుజునికి, నీచ చంద్రునికి మధ్యలో చిక్కుకుపోయిన గురువు, తన సంస్థకు తానే బందీ అయిపోయిన సత్యసాయిబాబాను స్పష్టంగా సూచిస్తున్నాడు. ఈ కర్మసంబంధం వల్లనే ఇతను సత్యసాయికి భక్తుడయ్యాడు. కానీ ఆయన వల్ల ఇతనికేమీ మేలు జరుగకపోగా, దాడికి గురై, జైల్లో పెట్టబడ్డాడు. పిచ్చి ఇంకా ఎక్కువైపోయింది.

అదే సమయంలో ఫిబ్రవరి 16, 1996 న ఇతనికి ఏలినాటి శని మొదలైంది. ఆరోజునుంచీ ఇతని జీవితంలో నిజమైన కష్టాలు మొదలయ్యాయి. అదే సమయంలో గురుఛండాలదశ ఇతని జాతకంలో వచ్చింది. ఇక అలాంటి వాళ్ళ కష్టాలు ఎలా ఉంటాయో చెప్పనక్కరలేదు కదా?

ఈ సమయంలోనే ఇతని జీవితంలో ఒక ముఖ్యమైన సంఘటన జరిగింది.

అది 5, జూన్ 1996. ఇతని జాతకంలో రాహు-గురు-రాహుదశ నడుస్తున్నది. ఇది గురుఛండాలదశ. ఆ రోజున ఇతను పుట్టపర్తిలో ఉన్నాడు. అంతకుముందు కొన్ని రోజులనుంచీ అక్కడ ఉంటూ, ధ్యానంలో కాలం గడిపేవాడు. గంటలు గంటలు ధ్యానంలో ఉంటూ ఉండేవాడు. ఆ రోజున ధ్యానంలో అతనికేం అనిపించిందో తెలియదు. 

"సాయిబాబా పెద్ద ప్రమాదంలో ఉన్నాడు, నేనాయనను ఎలాగైనా కలవాలి, ఆయనను కాపాడాలి" అంటూ లోపలికి పోబోయాడు. సెక్యూరిటీవాళ్ళు అడ్డుకున్నారు.

అసలు, ప్రతివాడూ ధ్యానం చెయ్యకూడదు. అందులోనూ, డిప్రెషన్, పిచ్చిధోరణి మొదలైనవి ఉన్నవాళ్ళు దానిజోలికి అస్సలు పోకూడదు. ఎందుకంటే, ధ్యానం వికటిస్తే, మామూలు మనిషికే పిచ్చెక్కుతుంది. ఇక పిచ్చోడికి ఏమౌతుంది? అందుకే, నేటి ఆశ్రమాలలో మామూలు మనుషులకంటే పిచ్చోళ్ళే మనకు ఎక్కువగా   కనిపిస్తారు.

మనమేమో వాళ్ళు పిచ్చోళ్ళని అనుకుంటాం. వాళ్ళేమో, చూసేవాళ్ళకే పిచ్చని అనుకుంటారు. ఈ పిచ్సిగోలలో, ఎవరికి పిచ్చో, ఎవరికి కాదో ఏ పిచ్చివాడు తేల్చాలి?

సరే, సాయంత్రం వరకూ ఏదోవిధంగా ఆగిన అతను, చీకటి పడుతున్న సమయంలో ఎవరిదో ట్రాక్టర్ మాట్లాడుకుని, ప్రహారీగోడ పక్కగా దానిని ఉంచి, దానిపైన ఒక నిచ్చెన వేసుకుని గోడ ఎక్కి ప్రశాంతినిలయంలోకి దూకబోయాడు. సెక్యూరిటీ వాళ్ళు పట్టుకున్నారు. సత్యసాయిని చంపడానికి ఇతను ప్రయత్నిస్తున్నాడని ఆరోపించారు. అందరూ నమ్మేశారు. అతన్ని కొట్టారో లేదో మనకు తెలియదు.  అక్కడున్నదంతా పూనకపు మూర్ఖభక్తులే గనుక ఇతనిపైన దాడి  చేసే ఉంటారని మనం అనుకోవాలి.

ఇతన్ని అరెస్టు చేసి లోకల్ పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు. తరువాత బెంగుళూరు సెంట్రల్ జైలుకు తరలించారు. ఇతని తండ్రి బాంబే నుండి వచ్చి, కొడుకును విడిపించుకుని, ఆస్పత్రిలో చేర్చడము, తర్వాత బాంబేకు తీసుకువెళ్లి అక్కడ బైకుల్లా లోని మసీనా ఆస్పత్రిలో చేర్చడము జరిగిపోయాయి.

అదే సమయంలో, అంటే 10 జూన్ 1996 న ఇతనికి రాహు - శనిదశ మొదలైంది. ఇది శపితదశ. ఇక అక్కడినుంచి అసలైన కష్టాలు మొదలయ్యాయి. 

ఇతను మసీనా ఆస్పత్రిలో ఉన్నపుడే, విషయం తెలిసిన మహేష్ భట్ వెళ్లి పలకరించి  వచ్చాడు. అప్పటికే బాగా పిచ్చిలో ఉన్న రాజ్ కిరణ్ తనతో పెద్దగా మాట్లాడలేదని ఆయనన్నాడు.

గురుఛండాలదశ, శపితదశ, ఏలినాటిశనులు కలసి ఈ విధంగా ఇతని జీవితాన్ని చిన్నాభిన్నం చేశాయి.

మరింత మంచివైద్యం చేయించడం కోసం, అక్కడనుండి, ఇతని అన్నయ్య ఇతనిని అమెరికాకు తీసుకెళ్లాడు. అక్కడ న్యూయార్క్ సిటీలో ఉంటూ, పిచ్చికి వైద్యం తీసుకుంటూ ఉండేవాడు. కొన్నినెలల తర్వాత ఉన్నట్టుండి ఆ ఇంటినుండి ఎక్కడికో మాయమైపోయాడు. ఆ సమయంలో రాహు-శని-కేతుదశ నడిచింది. ఆ తరువాత ఇప్పటివరకూ ఇతనెక్కడున్నాడో ఎవరికీ తెలియదు. అసలు బ్రతికున్నాడో లేదో కూడా తెలియదు.

సరిగ్గా ఇప్పుడు జ్యోతిశ్శాస్త్రం రంగప్రవేశం చేస్తున్నది !

ఇతని ఆయుష్షును లెక్కించి చూద్దాం.

ఆయుర్దాయవిధానాలు స్థూలంగా మూడున్నాయి. ఒకటి నైసర్గిక ఆయుర్దాయం, రెండు పిండాయుర్దాయం, మూడు అంశాయుర్దాయం. ఇవిగాక, జైమినిపద్ధతిలో మరొక విలక్షణమైన విధానం ఉన్నది. వీటిలో అంశాయువు, జైమినివిధానాలే చాలావరకు సరియైన ఫలితాలనిస్తాయని పండితులంటారు. అనుభవం కూడా ఇదే చెబుతోంది.

జైమినిపద్ధతి ప్రకారం చూడగా,

లగ్నాధిపతి+అష్టమాధిపతి, లగ్నము+చంద్రలగ్నము, లగ్నము+హోరాలగ్నము ఈ మూడు జతలూ చర, స్థిర, ద్విస్వభావరాశులలో ఉండేదాన్ని బట్టి ఆ జాతకుడు పూర్ణాయుష్కుడా (99-66 మధ్య), మధ్యాయుష్కుడా (66-33 మధ్య), అల్పాయుష్కుడా (33-8 మధ్య) అనేది  తెలుస్తుంది.  

లగ్నాధిపతి, అష్టమాధిపతి ఇద్దరూ కుజుడే అయ్యాడు. ఇతడు స్థిరరాశిలో ఉన్నాడు గనుక పూర్ణాయువైంది. లగ్న, చంద్రులిద్దరూ మేషంలోనే ఉన్నారు, అది చరరాశి గనుక మళ్ళీ పూర్ణాయువైంది. లగ్నమైన మేషం చరరాశి, హోరాలగ్నమైన మిధునం ద్విస్వభావరాశి గనుక అల్పాయువైంది. రెండు పూర్ణాయువులు, ఒకటి అల్పాయువు వచ్చింది గనుక సరాసరిగా మధ్యాయువౌతుంది. అంటే 33 - 66 ఏళ్ల మధ్యలో ఇతను మరణిస్తాడు.  

అంశాయుర్దాయ విధానాన్ని బట్టి లెక్కించగా ఇతనికి  47 ఏళ్ల ఆయుష్షు వస్తున్నది.  ఇతను పుట్టింది 1949 లో గనుక 47 కలిపితే 1996 అవుతుంది. సరిగ్గా ఇదే సంవత్సరంలో పుట్టపర్తి సంఘటన, బెంగుళూరు జైలు, బాంబే పిచ్చాసుపత్రి, అమెరికా వెళ్లడం ఇవన్నీ జరిగాయని ఇతని జీవితం చెబుతోంది. కనుక, అమెరికా వెళ్లిన కొద్దినెలలకు ఇతను ఇంట్లోంచి వెళ్ళిపోయిన తర్వాత, ఏదో ఒక దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయాడని చెప్పవలసి వస్తున్నది. 

పోనీ 66 వరకూ ఇతని ఆయుష్షు ఉందేమో అని పరిశీలించగా, మార్చి 1999 తో రాహు-శనిదశ అయిపోయింది. రాహు-బుధదశ 1999-2001 మధ్యలో నడిచింది. బుధుని వక్రత్వం వల్ల, ఆర్గలదోషాలవల్ల ఆ సమయంలో పిచ్చి బాగా ముదిరి ఉండాలి. వెంటనే వచ్చిన రాహు-కేతుదశ 2001-2002 మధ్యలో నడిచింది. అప్పుడుగాని, ఆ తరువాత వచ్చిన రాహు-శుక్ర దశ (2002-2005) లో గాని, ఎక్కువలో ఎక్కువగా ఇతను చనిపోయి ఉండాలి. ఏమంటే, శుక్రుడు ఈ లగ్నానికి మారకుడు.

ఇప్పుడు ప్రశ్నవిధానాన్ని ఉపయోగించి చూద్దాం.

ఈ ప్రశ్నజాతకం నిన్న ఉదయం 9 గంటలకు వేసినది. లగ్నాధిపతి చంద్రుడు 9 వ భావంలో, రాహుకుజులతో ఆర్గళానికి లోనై, మారకుడైన శనితో కలసి ఉంటూ, ఈ జాతకుడు దూరదేశంలో ఒక దుర్ఘటనలో మరణించాడని చెబుతున్నాడు. 

ప్రశ్నదశ గురు రాహు బుధదశ వచ్చింది. ఇది గురుదోషంవల్ల మతిభ్రమించడాన్ని సూచిస్తుంది. ఉచ్చగురువు 9 వ అధిపతిగా దూరదేశాన్ని, 6 వ అధిపతిగా తీవ్రమైన గురుదోషాన్ని సూచిస్తున్నాడు. బాధకుడైన శుక్రునితో కలసి ఉన్నాడు. ఇది భార్యతో గొడవలను సూచిస్తున్నది. కుటుంబస్థానంలోని కేతువు కుటుంబసభ్యులతో వియోగాన్ని సూచిస్తున్నాడు. ప్రశ్నజాతకం కాలగ్రస్తయోగంలో చిక్కుకుని ఉంటూ, తీవ్రమైన గతకర్మను సూచిస్తున్నది.

కనుక, రాహు-బుధ దశలో (1999-2001) ఇతను చనిపోయి ఉండాలి.

కనుక, రిషికపూర్ చెప్పినది, దీప్తి నావల్ చెప్పినది రెండూ కరెక్ట్ కావు. సోమీ అలీ వంటి కొందరు, రాజ్ కిరణ్ కోసం ఈనాటికీ వెదుకుతూ ఉండటం వృధాప్రయాస అని, ఇతను చనిపోయి చాలాకాలమైనదని నేను చెబుతున్నాను.

అమెరికా అన్నికోణాలలోనూ అంతమంచి దేశమేమీ కాదు. మొన్నటికి మొన్న మాయమైన నాన్సీ గుత్రీనే ఇంతవరకూ ఏమైందో అమెరికా పోలీసులే  పట్టుకోలేకపోయారు. ఇక దేశంగాని దేశంలో, అదికూడా 30 ఏళ్ల క్రితం తప్పిపోయిన మనిషిని ఇండియానుండి ఎవరు పట్టుకోగలుగుతారు? అది జరిగే పని కాదు.

అతను మంచివాడే కావచ్చు. వేసిన పాత్రలు కూడా మంచిపాత్రలే కావచ్చు. అతనిని ఎరిగిన మనుషులు అతన్నింకా మర్చిపోలేకపోతూ ఉండవచ్చు కూడా. కానీ కర్మను ఎవరూ తప్పించలేరు. ఇప్పటి మంచితనానికీ, గతకర్మకూ సంబంధం లేదు. అతనిని వెదకడం అనవసరం !

ఇది జ్యోతిషశాస్త్రపు తీర్పు !

డబ్బు చేతిలో ఉండి సుఖంగా కాలం గడుస్తూ ఉంటే అంతా బాగానే ఉందని అనుకుంటే పప్పులో కాలేసినట్లే. దశ మారిందంటే ఏం జరుగుతుందో ఎవ్వరూ చెప్పలేరు. జాతకం సరిగ్గా లేకపోతే జీవితం మొత్తం తల్లక్రిందులు కావడానికి ఒక్క రోజు చాలు.

అందుకే, ఈరోజు మన చేతిలో డబ్బు ఉందని విర్రవీగటం ఎప్పుడూ కరెక్ట్ కాదు.ఎందుకంటే రేపు ఏమౌతుందో ఎవరికీ తెలియదు.విధి వక్రిస్తే, మన విర్రవీగుడు మొత్తం మాయం కావడానికి ఒక్క క్షణం చాలు.

పెద్దవయసులో ఏ విధమైన కష్టమూ లేకుండా మనల్ని చక్కగా చూచుకునేవారు ఉండటమే అసలైన అదృష్టం.వయసులో ఉన్నపుడూ చేతిలో డబ్బు ఉన్నపుడూ అందరూ వెంటబడతారు ప్రేమలు కురిపిస్తారు. అది నిజం కాదు పెద్ద భ్రమ.వయసు మళ్ళి, చేతిలో డబ్బు లేనప్పుడే మేమున్నామని మనల్ని చూచుకునేవారు ఉండాలి. అదే అసలైన వరం.

వయసులో ఉన్నపుడు ఎన్ని సుఖాలు అనుభవించినా, చివరకు పెద్దవయసులో పడ్డప్పుడు ఎవరూ తోడులేని దిక్కులేని జీవితం గడపడం కంటే దుర్భరం ఇంకోటి ఉండదు మరి.

పెద్ద స్టార్ గా ఒక వెలుగు వెలిగి వేలాదిమంది అభిమానులను సంపాదించుకున్న అదృష్టవంతులకు ఇలాంటి దుస్థితి పట్టడం, ఎక్కడున్నాడో ఏం చేస్తున్నాడో ఎవరికీ తెలియని గతి పట్టడం, ఖర్మ కాకపోతే ఇంకేమిటి మరి?

2017 లో వ్రాసిన ఈ జాతకవిశ్లేషణ మొదటిభాగాన్ని ఇక్కడ చూడండి.
read more " రాజ్ కిరణ్ కు ఏమయ్యింది? జననకాల సంస్కరణ - ప్రశ్నజాతక నిర్ధారణ ! "

18, ఏప్రిల్ 2026, శనివారం

ఆశా భోంస్లే జాతకం - కొన్ని ఆలోచనలు

కొంతమంది జాతకాలలో ఒక చిక్కుముడి ఉంటుంది. వృత్తిలో ఎంతగా విజయాలను సాధిస్తారో, జీవితంలో అంతగా అపజయాలను ఎదుర్కొంటారు. ఒక విజయం వస్తే, ప్రక్కనే ఒక అపజయం పొంచి ఉంటుంది. కర్మసూత్రాలు అర్ధమైతే ఈ జీవితాలు ఎందుకిలా ఉన్నాయో అర్ధం చేసుకోవచ్చు. ఆశాభోంస్లే జాతకంలో ఇది స్పష్టంగా కనిపిస్తుంది.

ఆశాభోంస్లే 12-4-2026 న చనిపోయింది. ఆమె 20 భాషలలో 12 వేల పాటలను పాడింది. ఎన్నో అవార్డులందుకుంది. కానీ అదేసమయంలో జీవితంలో చాలాకష్టాలను పడింది. కష్టాలు అందరికీ ఉంటాయి. కానీ ఈమె పడిన కష్టాలూ తీవ్రమైనవే. ఆమె అందుకున్న విజయాలూ గొప్పవే. అందుకే ఈమె జాతకం ఒక బాలీవుడ్ సినిమా లాంటిదే అని నేననుకుంటాను.

తన సోదరి లతామంగేష్కర్ లాగానే ఈమెకూడా 92 ఏళ్ళు బ్రతికింది. కనుక, వీరి జీన్స్ గట్టివే. అయితే వీరి తండ్రి దీనానాధ్ మంగేష్కర్ మాత్రం 41 ఏళ్లకే చనిపోయాడు.  కనుక తల్లిగారి జీన్స్ బలమైనవి కావచ్చు. తల్లిగారు శేవంతి 90 ఏళ్ళు బ్రతికారు కాబట్టి లెక్క సరిపోతున్నది.

ఈమె 8-9-1933 న సాంగ్లీ లో పుట్టింది. జననసమయం 9. 30 pm అని  ఉంది. దీనిని నేను  9. 28 కి సవరించాను. జాతకాన్ని ఇక్కడ చూడవచ్చు.

2 మరియు 3 భావాలకు అధిపతులుగా ఈమె జీవితంలోని సంగీతవిజయాలకు బుధశుక్రులే కారకులు. వీరు లలితకళలకు కారకులు కూడా. అయితే, ఈమె పడిన కష్టాలకు కూడా వీరే కారకులయ్యారు. రవిబుధులు సింహంలో ఉండటం బుధాదిత్యయోగం. అయితే, బుధుడు అస్తంగతుడయ్యాడు. కనుక కష్టసుఖాలు కలగలసి ఈమె జీవితంలో వచ్చాయి.

4 వ అధిపతియైన చంద్రునికి, 5 వ అధిపతియైన రవికి ఏర్పడిన కోణదృష్టి రాజయోగాన్నిచ్చింది. 

విజయాలు

12-12-2001 న దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును అందుకుంది. అప్పుడు గురు రాహు శుక్ర బుధ  దశ నడిచింది. గురువు పూర్వపుణ్యాధిపతి. రాహువు కర్మాధిపతి. అయితే, శనికి సూచకుడు. కనుక శపితయోగం  ఉంది. బుధశుక్రులు దోషులు, కానీ యోగకారకులయ్యారు. 

5-5-2008 న పద్మవిభూషణ్ అవార్డు ఈమెను వరించింది. ఆనాడు శని కేతు చంద్ర శని దశ నడిచింది. శని కర్మస్థానాధిపతిగా పూర్వపుణ్య స్థానంలోకి వస్తున్నాడు. కేతువు బుధాదిత్యయోగంలో ఉన్నాడు. చంద్రుడు సుఖస్థానాధిపతిగా బలంగా ఉన్నాడు.

అయిదుదేశాలలో, ముఖ్యంగా దుబాయ్, కువైట్ లలో Asha's అనే చైన్ రెస్టారెంట్లను పెట్టింది. అవి బాగా నడుస్తున్నాయి. 10 వ భావంలో ఉన్న వక్రశని, ఆయనపైన ఉన్న గురుశుక్ర దృష్టులు ఈ విజయాలకు కారణాలు. శుక్రుడు 2 వ భావాధిపతిగా ఎలైట్ డైనింగ్ ను సూచిస్తాడు.

జీవితంలో ఎగుడుదిగుళ్లు

1949 లో లతామంగేష్కర్ యొక్క సెక్రటరీ అయిన గణపత్ రావ్ భోంస్లేను ఈమె పెళ్ళిచేసుకుని ఇంట్లోంచి వెళ్ళిపోయింది. అప్పటికి ఆమెకు 16 ఏళ్ళు, గణపత్ కు 31 ఏళ్ళు. ఆ సమయంలో అర్ధాష్టమశని నడిచింది. దశగా రవి గురుదశ నడిచింది. పంచమరవి ప్రేమవ్యవహారాలకు, 7వ అధిపతితో కలసి ఉన్న గురువు పెళ్ళికి సూచకులు. నీచశుక్రుడు సాంప్రదాయవ్యతిరేక వివాహాన్ని సూచిస్తున్నాడు.

7 వ అధిపతియైన శుక్రుడు, 9 వ అధిపతి గురువుతో కలసి కర్మస్థానంలో నీచలో ఉండటంతో, తనకంటే 15 ఏళ్ళు పెద్దవాడైన గణపత్ రావ్ భోంస్లేను పెళ్లి చేసుకోవలసివచ్చింది. తరువాత తనకంటే ఆరేళ్ళు చిన్నవాడైన R. D. బర్మన్ ను రెండవవివాహం చేసుకుంది. గురువు ధనుస్సు 6 వ డిగ్రీలో ఉండటం చూడవచ్చు. దీనికి తగినట్లుగా, R. D. బర్మన్ ఈమెకంటే 6 ఏళ్ళు చిన్నవాడు.

1960 లో గణపత్ తో విడిపోయింది. అప్పుడు చంద్ర-కేతుదశ నడిచింది. దానికి కారణం సంగీతదర్శకుడు O.P.Nayyar తో ఆమెకున్న ప్రేమసంబంధం కూడా. గణపత్ రావ్ పెడుతున్న హింసను తట్టుకోలేక నయ్యర్ కు దగ్గరైంది. చంద్రకేతుదశ గ్రహణదశ. 7 వ భావం దెబ్బతినడం, దానిపైనున్న శనిగురువుల ప్రభావాలు దీనికి కారణాలు. పంచమకేతువువల్ల ప్రేమవియోగం సూచితమౌతున్నది. అప్పటికి వారికి ముగ్గురుపిల్లలు. పంచమభావంలో మూడు గ్రహాలుండటం చూడవచ్చు. 

అప్పటినుండి, తన ముగ్గురు పిల్లలనూ పెంచుకుంటూ, సినిమాలలో పాటలు పాడుతూ కాలం గడిపింది. 

1980 లో తనకంటే ఆరేళ్ళు చిన్నవాడైన సంగీతదర్శకుడు R. D. బర్మన్ ను రెండవపెళ్లి చేసుకుంది. అప్పడు రాహు-కేతుదశ నడిచింది. కొన్ని వందలజాతకాలలో రుజువైన ఈ సూత్రం ఇక్కడ మళ్ళీ రుజువైంది.

కష్టాలు

తండ్రి దీనానాథ్ మంగేష్కర్ 24-4-1942 న తన 41 వ ఏట చనిపోయాడు. అప్పటికి ఆశాకు 8 ఏళ్ళు మాత్రమే. ఆ సమయంలో ఆమెకు శుక్ర శని కుజ దశ నడిచింది. దశమమైన మకరం నుండి, శని 12 వ భావంలోకి పోవడం, శుక్రుడు మరణాన్ని సూచించే 9 వ భావంలో నీచస్థితిలో ఉండటం, కుజుడు బాధకునిగా దశమం నుండి సుఖస్థానాన్ని చూడటం కారణాలు.  

ఈమెయొక్క  రెండవసంతానమైన వర్షా భోంస్లే, 8-10-2012 న తుపాకీతో తలను షూట్ చేసుకుని ఆత్మహత్య చేసుకుంది. డిప్రెషన్ కారణమన్నారు. అప్పుడు ఆశాకు శని రవి బుధ దశ నడిచింది. తులనుండి, యోగకారకుడైన శనికి భ్రష్టత్వం కలగడం, రవి కేతుగ్రస్తుడవడం, బుధునికి అస్తంగత్వం పట్టడం కారణాలు.  ఆనాడు, తులకు 2/8 ఇరుసులో నీచరాహుకేతువులున్నాయి. రాహువుతో కలసి కుజుడున్నాడు. కనుక, డిప్రెషన్లో, దూకుడునిర్ణయం తీసుకుని కాల్చుకుని చనిపోయింది. 

ఈమెయొక్క  మొదటిసంతానమైన హేమంత్ భోంస్లే 26-9-2015 న కేన్సర్ వ్యాధితో చనిపోయాడు. అప్పుడీమెకు శని రాహు రాహు దశ నడిచింది. సింహం నుండి, శని రోగాధిపతి అవుతాడు. రాహువు మారకస్థానంలో ఉన్నాడు. శపితదశ నడిచింది. పంచమభావం దెబ్బతిని ఉన్నది. కనుక మొదటికుమారుడు దీర్ఘవ్యాధితో చనిపోయాడు.

ముగింపు

చివరకు 12-4-2026 న 92 వ ఏట తను చనిపోయింది. అప్పుడు బుధ శుక్ర శని దశ నడిచింది. ఈ ముగ్గురూ ఈ లగ్నానికి మారకులే కావడం గమనించవచ్చు.

1937-44 మధ్యలో మొదటిసారి, 1967-74 మధ్య రెండవసారి, 1997-2004 మధ్య మూడవసారి, ఇప్పుడు 2026 లో నాలుగవసారి ఏలినాటిశని వచ్చింది. అవి అనేక కష్టాలనిచ్చినప్పటికీ, 92 ఏళ్ల పూర్ణాయుష్షు నిచ్చాయి. దీనికి కారణం లగ్నాష్టమాధిపతి కుజుడు సప్తమకేంద్రంలో ఉండటం.

సంగీతరంగంలో, కళారంగంలో ఉన్నవారికి జీవితాలు బాగుండవని, సంతృప్తిగా ముగియవని, ఏదో ఒక వెలితి వారికి ఉంటుందని, అంటారు. అది చాలావరకూ నిజమే అనిపిస్తుంది, 

ఈ విధంగా, సుఖదుఃఖాలనేవి పడుగుపేకలలాగా పేనుకుని ఉండటం ఆశాభోంస్లే జాతకంలో గమనించవచ్చు. ఇది ఈమె జాతకంలోని ఒక విలక్షణమైన యోగం. 

read more " ఆశా భోంస్లే జాతకం - కొన్ని ఆలోచనలు "

10, ఏప్రిల్ 2026, శుక్రవారం

విజయపత్ సింఘానియా జాతకం - గురుదోషం

విజయపత్ సింఘానియా 4 అక్టోబర్ 1938 న కాన్పూర్ లో  పుట్టాడు. రేమాండ్స్ సంస్థ అధినేతగా బిజినెస్ సర్కిల్స్ లో ఈయన అందరికీ తెలిసిన వ్యక్తి. ఈయన మార్చి 28 న ఒక అద్దెఇంటిలో చనిపోయాడు. వేలకోట్ల ఆస్తులకు అధిపతి అయినప్పటికీ చివరకు ఈయన జీవితం విషాదాంతం అయింది.  దానికి కారణం గురుదోషం. ఈయన జాతకాన్ని చూద్దాం.

అయితే, ఈయన జననసమయం దొరకడం లేదు. కనుక సవరణ చేద్దాం. దీనిని చాలా తేలికగా చేయవచ్చు. 

ఈయన తండ్రి L. K. సింఘానియా చాలా ధనవంతుడు మరియు వ్యాపారవేత్త. కనుక 3.01 pm తర్వాత ఇతను పుట్టి ఉండాలి. అప్పుడు మకరలగ్నం మేషనవాంశ అవుతుంది. 4.00 లోపు మేషంనుండి కన్యవరకూ నవాంశలు నడుస్తాయి. వీటిలో మేషనవాంశ అయినప్పుడే జీవిత సంఘటనలు సరిపోతున్నాయి. అందులోనూ 3. 01 pm అయితేనే ఇవన్నీ సరిపోతాయి.

కొన్ని ముఖ్య సంఘటనలను చూద్దాం.

1980 - రేమాండ్స్ గ్రూపుకు చైర్మన్ అయ్యాడు. అప్పుడు గురు రాహుదశ నడిచింది. రాహుకేతువులు నవాంశచక్రంలో ఉచ్ఛస్థితిలో ఉండటాన్ని చూడవచ్చు.

2000 - ఈ సంవత్సరంలో రేమాండ్స్ సంస్థ పగ్గాలను మూడవ సంతానమైన గౌతమ్ సింఘానియాకు అప్పగించాడు. బుధ బుధ దశ నడిచింది. 9 వ భావమైన కన్యలో 8 వ భావాధిపతి సూర్యునితో కలసి ఉచ్చ బుధుఁడున్నాడు. కనుక అధికారమూ సంపదా రెండూ తనచేతినుంచి జారిపోయాయి. భావాద్భావ సూత్రాన్ని బట్టి 9 వ స్థానం కూడా సంతానభావమే.

20 మార్చి 2006 - పద్మభూషణ్ అవార్డు వచ్చింది. ముంబాయి మేయర్ అయ్యాడు. బుధ రవి కేతు దశ నడిచింది. ఉచ్ఛస్థితిలో ఉన్న బుధునితో రవి కలసి నవమస్థానంలో ఉన్నాడు. కేతువు నవాంశలో ఉచ్ఛస్థితిలో ఉన్నాడు.

2015 లో రేమాండ్స్ సంస్థలో తన వాటా (37%) ను కూడా కొడుక్కి ఇచ్చేశాడు. అక్కడే లీగల్ గొడవలు మొదలైపోయాయి. అప్పుడు బుధ శని కుజ దశ నడిచింది. ఈ దశలో మానసికచింత, గొడవలు సహజమే.

87 ఏళ్ల వయసులో 28 మార్ఛి 2026 న చనిపోయాడు. ఆ రోజున శుక్ర రవి రాహు గురుదశ నడిచింది. పెద్దవయసులో వచ్చేవి తప్ప చెప్పుకోదగ్గ జబ్బులేమీ లేవు. దశలు సరిపోతున్నాయి. కనుక, ఇదే ఈయన జననసమయంగా అనుకోవచ్చు.

ఈయన జాతకంలో ఉన్న బలమైన గురుదోషం వల్ల కొడుకులతో, వారి పిల్లలతో, గొడవలు, కోర్టుకేసులు, మనోవ్యధ కలిగాయి. తన ఇంటినుండి గెంటివేయబడ్డాడు. ఏ ముంబాయికైతే తను మేయర్ గా పనిచేశాడో, ఎక్కడైతే ఒక మహాసామ్రాజ్యాన్ని స్థాపించాడో, అదే ముంబాయిలో ఒక అద్దెఇంటిలో ఉంటూ చనిపోయాడు. An Incomplete Life అనే ఆత్మకథను పుస్తకంగా వ్రాసి అసంతృప్తితో కన్నుమూశాడు.

12,000 కోట్లు సంపాదించి ఒక కార్పొరేట్ సామ్రాజ్యాన్ని స్థాపించిన వ్యక్తి కూడా చివరకు అసంతృప్తితో కుటుంబపు గొడవలతో చనిపోయాడంటే, ఇతని జాతకంలో గురుదోషం ఎంత బలంగా ఉన్నదో అర్ధం చేసుకోవచ్చు.

దీనికంతటికీ కారణం, మూడవకొడుకు గౌతమ్ సింఘానియాతో ఉన్న ఆస్తిగొడవలు. మూడవ కొడుకును సూచించే 9 వ భావంలో ఉచ్చబుధుడు, రవి ఉన్నారు. రాహుకుజులతో శనికేతువులతో ఆర్గళంలో ఉంటూ, చాలా తెలివైన సంతానాన్ని, అదేసమయంలో బలమైన సంతానదోషాన్ని సూచిస్తున్నారు.అందుకే, ఆస్తిని కంపెనీని అన్నింటినీ మూడవకొడుకుకు రాసిచ్చేయగానే ఈయన రోడ్డున పడ్డాడు. పద్మభూషణ్ అవార్డును అందుకుని, అంతర్జాతీయస్థాయిలో ఒక వెలుగు వెలిగిన రేమాండ్స్ దిగ్గజం చివరకు అద్దెఇంటిలో దిక్కులేకుండా చనిపోయాడు.

గురుదోషం అంటే ఇలా ఉంటుంది !

మరి అన్నిదోషాలనూ పిచ్చిపిచ్చి హోమాలతో, పిచ్చిపిచ్చి రెమెడీలతో బాగుచేస్తామని డప్పు కొట్టుకునే జ్యోతిష్కులు పాపం ఈయనకు అందుబాటులో లేరా? ఉన్నా, ఈ గురుదోషాన్ని తొలగించడం వారివల్ల కాలేదా? లేక ఈయన దగ్గరున్న పన్నెండువేలకోట్లు ఆ దోషాన్ని పోగొట్టడానికి సరిపోలేదా?

దీనివల్ల రెండు విషయాలు స్పష్టంగా కనిపిస్తున్నాయా లేదా?

ఒకటి - జాతకదోషాలు అంత తేలికగా పోవు. మామూలు జ్యోతిష్కులకు అర్ధంకాని లోతులు దీనివెనుక ఉంటాయి.

రెండు - డబ్బులు పారేసి చేసే రెమెడీలతో అవి అస్సలు లొంగవు. మీ అవినీతిసొమ్ము జ్యోతిష్కుడికి చేరడం తప్ప దీనివల్ల జరిగేది ఇంకేమీ ఉండదు.

జాతకదోషాలను పోగొడతాని, పోగొట్టగలనని, ఏ జ్యోతిష్కుడైనా డప్పు కొట్టుకుంటుంటే, ఆ మాటలు నమ్మారంటే, మీరు మోసపోతున్నట్లే. జ్యోతిష్యశాస్త్రపు లోతుపాతులు అతనికి తెలీకనైనా ఉండాలి. లేదా మిమ్మల్ని అతను మోసం చేస్తూనైనా ఉండాలి. రెండూ కూడా కావచ్చు.

మీరు పెట్టుకునే ఉంగరాలవల్ల, చేసే దొంగపూజలవల్ల, తిరిగే గుళ్ళవల్ల మీ జాతకదోషాలు ఎక్కడికీ పోవు. మీరు దేనినైనా మోసం చేయవచ్చుగాని, మీ కర్మను మోసం చేయలేరు. 

ఈ జాతకం చూచాక కూడా అర్ధం కాలేదా?

అయితే మీ కర్మ !

read more " విజయపత్ సింఘానియా జాతకం - గురుదోషం "

3, ఏప్రిల్ 2026, శుక్రవారం

చక్ నారిస్ మరణం గురించి గ్రహాలేమంటున్నాయి?

ప్రపంచ ప్రఖ్యాత కరాటే ఛాంపియన్ చక్ నారిస్ గురించి తెలియనివారు మార్షల్ ఆర్ట్స్ సర్కిల్లో ఉండరు. The Way Of The Dragon అనే సినిమాలో బ్రూస్ లీ తో ఇతను చేసిన ఫైట్ చాలా పాపులర్ అయింది. ఈ సినిమా పేరును తరువాత Return Of The Dragon గా మార్చారు.

ఇతను మొన్న మార్చి 19 న అమెరికాలో చనిపోయాడు. ఆ సమయానికి ఇతనికి 86 ఏళ్ళు. చివరిక్షణాలలో ఇతని హెల్త్ గురించి ఏ విధమైన సమాచారమూ మీడియాలో అందటం లేదు. గ్రహాలేమంటున్నాయో చూద్దాం.

ఇతను 10 మార్చి 1940 న ఒక్లహామా లోని ర్యాన్ అనేచోట పుట్టాడు. సమయం ఉదయం 3 గంటలు. ఇతని జాతకచక్రాన్ని ఇక్కడ చూడవచ్చు.

మార్చి 19 వ తేదీన ఇతని జాతకంలో రాహు శుక్ర బుధ బుధ బుధ దశ నడిచింది. రాహువు ఉచ్ఛబుధుని సూచిస్తున్నాడు. ఈ జాతకానికి బుధశుక్రులు మారకులు. బుధునికి వచ్చిన 4/7 భావాధిపత్యాల వల్ల ఇది గుండె సంబంధిత సమస్య అని అర్ధమౌతున్నది.

బుధుడు నీచస్థితిలో గ్రహయుద్ధంలో వక్రించి ఉన్నాడు. వక్రతవల్ల కుంభంలో ఉన్న సూర్యుడిని కలుస్తాడు. ఇదికూడా గుండెసంబంధిత సమస్యకు సూచికయే. పైగా, ప్రస్తుతం ఇతనికి ఏలినాటిశని మధ్యభాగం నడుస్తున్నది.

గతంలో 2017 లో జూలై 16, 17 తేదీలలో ఇతనికి రెండు హార్ట్ ఎటాక్స్ వచ్చాయని ఒక పుకారుంది. ఇతను ప్రపంచ సెలబ్రిటీ గనుక, ఇతనికున్న ఇమేజి దృష్ట్యా వివరాలను గోప్యంగా ఉంచారు. ఆ రోజులలో ఏం జరిగిందో, గ్రహాలేమంటున్నాయో చూద్దాం.

ఆ రోజులలో ఇతనికి రాహు గురు శుక్ర శుక్ర శుక్ర దశ నడిచింది.

బుధశుక్రుల ప్రభావం మళ్ళీ స్పష్టంగా కనిపిస్తున్నది. అంతర్దశలో లగ్న, చంద్రలగ్నాలకు అధిపతి అయిన గురువున్నప్పటికీ, నవాంశలో నీచస్థితిలో ఉండటంతో ఇతనికి గురుదోషం ఉన్నది. కనుక ఆ రోజునకూడా ఇతనికి హార్ట్ ఎటాక్స్ వచ్చినది నిజమే అని తెలుస్తున్నది. గురువు పాత్ర వల్ల పార్టీలు,  వేళతప్పి  ఎక్కువగా తినడం మొదలైన పొరపాట్లు జరిగి ఉండవచ్చు.

సూర్యునిపైన రాహుకేతువుల ప్రతికూల దృష్టులు, మరియు యురేనస్ యొక్క అనుకూలదృష్టి ఉన్నాయి. కనుక, గుండెసంబంధిత సమస్యకు గురైనప్పటికీ, సమయానికి సరియైన వైద్యసహాయం అందటంతో బ్రతికి బయటపడ్డాడు. పైగా ఆనాడు గోచారశని 9 వ భావమైన తులలో వక్రించి, 8వ భావం ఆయుష్యస్థానంలో ఉచ్ఛస్థితిలో ఉన్నాడు.  అందుకని బ్రతికించాడు. ఇప్పుడు ఏలినాటిశని గనుక తీసుకుపోయాడు.

మీడియాలో లీక్ చేయకపోయినా, ఇతను చనిపోయినది గుండె సంబంధిత సమస్యతోనే అని దీనిని బట్టి అర్ధమౌతున్నది.

read more " చక్ నారిస్ మరణం గురించి గ్రహాలేమంటున్నాయి? "

16, జనవరి 2026, శుక్రవారం

PSLV - C 62 విఫలం కావడానికి ముహూర్తం కారణమా?

మొన్న 12 వ తేదీన ప్రయోగించిన PSLV - C 62 రాకెట్ విఫలమైంది. 

టెక్నికల్ కారణాలు ఏవైనా ఉండవచ్చు గాక ! జ్యోతిష్య కారణాలు మాత్రం చాలా స్పష్టంగా ఉన్నాయి. 

ఆ రోజున ఉదయం 10. 12 కి గ్రహస్థితిని నేను పరిశీలించాను. ఇంతకంటే పనికిరాని ముహూర్తం ఇంకెక్కడా ఉండదు. ఇది విఫలం కావడానికి పెట్టిన ముహూర్తంలాగా ఉంది గాని, సక్సెస్ కు పెట్టిన ముహూర్తంలాగా లేదు.

జ్యోతిష్యశాస్త్రాన్ని వారు లెక్కిస్తారో లేదో నాకు తెలియదు. కానీ, జరిగిన నష్టంతో పోల్చుకుంటే, నమ్మకం అంత ముఖ్యం కాదన్న చిన్నవిషయం వాళ్ళ లాజిక్ కు తట్టి ఉండాలి.

లేదా, సోకాల్డ్ సెలబ్రిటీ జ్యోతిష్కుల మాయలోనన్నా వాళ్ళు పడి ఉండాలి. అది అసాధ్యమేమీ కాదు.

లేదా, వివేకానందుని పుట్టినరోజు కాబట్టి మంచిరోజని భావించారా? 1863 లో వివేకానందస్వామి పుట్టినపుడు జనవరి 12 న ఉన్న గ్రహస్థితులు వేరు. 2026 లో అలా ఉండవు. ఉత్త తేదీలను మాత్రమే లెక్కలోకి తీసుకుంటే వచ్చే ఇబ్బందులు ఇవే మరి !

పైగా, లౌకికంగా చూస్తే, వివేకానందస్వామిది అంత అదృష్టజాతకమేమీ కాదు. ఆ విధంగా చూచినా, ఆ తేదీని రాకెట్ ప్రయోగానికి ఎంచుకోకూడదు.   

అయినా, PSLV రాకెట్ల ప్రయోగంలో అంత అనుభవం ఉన్న ఇస్రో, మూడవదశ ఇగ్నిషన్ లో ఎలా విఫలమౌతుంది? అన్నది అసలైన ప్రశ్న. ఇది ప్రయోగాత్మకదశ కాదుగా ! రాకెట్ టెక్నాలజీని ఇప్పుడు క్రొత్తగా ఇస్రో నేర్చుకోవడం లేదుగా ! PSLV ప్రయోగం ఇస్రోకు క్రొత్త కాదు కూడా !

తప్పులనుంచి నేర్చుకోవడం మంచిదే. కానీ నిర్లక్ష్యంవల్ల ఆ తప్పులు మాటిమాటికీ జరుగకూడదు. ప్రజాధనం విలువలేనిది కాదుగా !

నమ్మకమా? నష్టమా? అనిన ప్రశ్న వచ్చినపుడు, ఒక చిన్న నమ్మకాన్ని పాటించి నష్టాన్ని తప్పుకోవడం తెలివైనవారి లక్షణం కాదా?

read more " PSLV - C 62 విఫలం కావడానికి ముహూర్తం కారణమా? "

26, డిసెంబర్ 2025, శుక్రవారం

బాంగ్లాదేశ్ సంక్షోభం - జ్యోతిషశాస్త్రం ఏమంటున్నది?

గతంలో యురేనస్ చారం గురించి వ్రాస్తూ, రాబోయే మూడేళ్లు భారత ఉపఖండానికి అతి గడ్డుకాలమని, సంక్షోభాలు, కుట్రలు, విప్లవాలు, యుద్ధవాతావరణం ఉంటాయని వ్రాశాను. పరిస్థితులు ఏ విధంగా నానాటికీ మారుతున్నాయో గమనిస్తే నేను వ్రాసినది జరుగుతున్నదా లేదా అర్ధమౌతుంది.

బాంగ్లాదేశ్ లో సంక్షోభాన్ని సృష్టించి, ఇస్లామిక్ తీవ్రవాదరాజ్యాన్ని స్థాపించి, ఒకవైపు పాకిస్తాన్ ఒకవైపు బాంగ్లాదేశ్ కలసి ఇండియాను చక్రబంధంలో ఇరికించి దాడిచేయాలని ప్రయత్నాలు ఊపందుకుంటున్నాయి.

సౌదీ అరేబియాతో పాకిస్తాన్ దోస్తీ, ఆసిమ్ మునీర్ ను సర్వసైన్యాధిపతిని చేయడం, కోర్టుపరిధినుండి అతడిని జీవితకాలంపాటు తప్పించడం ఇవన్నీ ఈ ప్లాన్ లోనే భాగాలు. పాకిస్తాన్ లో ఇమ్రాన్ ఖాన్ ను, బాంగ్లాదేశ్ లో హసీనాను దిక్కులేనివాళ్లుగా చేయడం కూడా ఈ కుట్రలో భాగమే. వీరిద్దరూ ఇండియా చెప్పినట్లు వినేవాళ్ళు. అందుకే వీరిద్దరినీ తప్పించారు. ఇమ్రాన్ ఖాన్ దొరికిపోయి జైలుపాలయ్యాడు. హసీనా పారిపోయి ఇండియాకు వచ్చి తలదాచుకున్నది.

పాకిస్తాన్ కేంద్రంగా, ఇండియాపై దాడిచేసే కుట్ర వేగంగా రూపుదిద్దుకుంటున్నది. సమీకరణాలు వేగంగా మారుతున్నాయి.

ఇప్పుడు మరొక భారతద్వేషి తారిక్ రహమాన్ రంగప్రవేశం చేశాడు. ఇతను గత 17 ఏళ్లుగా ఎక్కడెక్కడో ఉండి ఇప్పుడు ఎన్నికల ముందు దేశానికి తిరిగి వచ్చాడు. ఎందుకిదంతా అనేది చిన్నపిల్లలకి కూడా అర్థమౌతుంది.

ఈ నేపథ్యంలో బాంగ్లాదేశ్ జాతకచక్రం ఏమంటున్నదో చూద్దాం.

దీనికి 16-12-1971 న స్వతంత్రం వచ్చింది. సమయం సాయంత్రం 5 గంటలు. ఆ సమయానికి ఢాకాలో వేసిన జాతకచక్రం ఇలా ఉంటుంది.

శనిచంద్రులు నీచస్థితిలో ఉన్నారు. ధనుస్సు మరియు మిధునరాశులు తీవ్రమైన ఆర్గళానికి గురయ్యాయి. సూర్యుడు సున్నాడిగ్రీలలో ఉన్నాడు.

ఈ దేశానికి ప్రత్యేకమైన వ్యక్తిత్వం ఏమీ ఉండదని, మిడిల్ ఈస్ట్, అమెరికాల చేతులలో కీలుబొమ్మగా మారి వాటికి తందానతాన అనే విధంగా తయారౌతుందని దీనిని బట్టి అర్ధమౌతుంది. 

ఈ దేశానికి చంద్రమహర్దశ 2023 లో మొదలైంది. అప్పుడే అక్కడ కుట్రలు ఊపందుకున్నాయి. ప్రస్తుతం చంద్ర-రాహుదశ ఏప్రియల్ 2025 నుండి సెప్టెంబర్ 2026 వరకూ ఉన్నది. ఇది గ్రహణదశ. చంద్రుడు నీచస్థితిలో ఉన్నాడు. రాహువు శపితయోగంలో ఉన్నాడు.  దీనివల్ల ఈ దేశానికి తీవ్రమైన గ్రహణం పడుతుంది. ప్రస్తుతపరిస్థితి సరిగ్గా ఇదే. అయితే, ఇది అసలు డ్రామాకు మొదలు మాత్రమే. అసలైన కధ 2026-29 మధ్యలో ఉంటుంది.

ఆ సమయంలో గోచారయురేనస్ సరిగ్గా రోహిణీనక్షత్రం పైన సంచరిస్తాడు. భారత ఉపఖండానికి తీవ్రమైన గడ్డుకాలం అదే కాబోతున్నది.

ఆ సమయంలో బాంగ్లాదేశ్ జాతకంలో చంద్ర - గురు, చంద్ర - శనిదశలు జరుగుతాయి. ఇవి దృఢకర్మదశలు గనుక, ఆ దేశం ఇంకా తీవ్రమైన సంక్షోభంలో పడుతుంది. దానివెనుక పాకిస్తాన్ హస్తం ఉంటుంది. పాకిస్తాన్ వెనుక చైనా, టర్కీ, ఖతార్ మొదలైన దేశాలుంటాయి. ఇండియా చక్రబంధంలో ఇరుక్కుపోతుంది. వెరసి మనదేశంలో కూడా తీవ్రమైన గడ్డుపరిస్థితులు ఉంటాయి. మొత్తం భారతఉపఖండంలో యుద్ధవాతావరణం, అల్లర్లు, జననష్టం భారీస్థాయిలో ఉంటాయి. వీటి ప్రభావం షేర్ మార్కెట్లతో సహా అన్ని రంగాలపైనా పడుతుంది. ఇండియా అతలాకుతలమయ్యే ప్రమాదం గట్టిగా ఉన్నది.

తీవ్రవాదఇస్లాం చేతిలో చిక్కుకున్న దేశాలకు సర్వనాశనం తప్ప వేరేదారి అంటూ ఏదీ ఉండదు. అది బాంగ్లాదేశ్, పాకిస్థాన్ల విషయంలో మళ్ళీమళ్ళీ ఋజువౌతున్నది, ఈ దేశాలతో సరిహద్దులున్నందుకు ఈ కర్మను మనం కూడా పడవలసి వస్తున్నది.

దీనిని తప్పించడం అసాధ్యం. రాబోయే మూడేళ్లు చరిత్రలో గుర్తుంచుకోదగిన రోజులుగా మిగలబోతున్నాయి.

మీరే చూడండి ముందుముందు ఏం జరుగనున్నదో !

read more " బాంగ్లాదేశ్ సంక్షోభం - జ్యోతిషశాస్త్రం ఏమంటున్నది? "

16, మే 2025, శుక్రవారం

గురుగోచారం - మే 2025

నిన్న, గురుగ్రహం వృషభం నుండి మిధునం లోకి మారింది. తెలిసినవారికి వారి జీవితాలలో అనేక మార్పులు కనిపిస్తాయి. తెలీనివారికి ఏ బాధా లేదు.

గతంలో లాగా, రాశిఫలాలు వ్రాయదలుచుకోలేదు. కానీ ఈ గోచారాన్ని నిర్లక్ష్యం చేయలేము కూడా. అందుకే ఈ పోస్టు. దేశఫలాలు చూద్దాం.

మిధునంలో జీవకారకుని సంచారం కదా ! అమెరికాకు నూతనోత్సాహం వచ్చింది. అందుకేనేమో, 'యుద్ధాన్ని ఆపింది నేనే' అంటోంది. అంతేకాదు. ఇప్పటివరకూ టెర్రరిస్టులుగా తనే ముద్రవేసిన వాళ్ల దగ్గరకే వచ్చి మరీ గ్రూప్ ఫోటోలు దిగుతోంది. ఇప్పటిదాకా గ్లోబల్ టెర్రరిస్టులైనవాళ్లు ఉన్నట్టుండి రాత్రికి రాత్రే చాలా మంచివాళ్లై పోయారు. ఇదేం వింతో మరి?

అంతేకాదు. 'ఇండియాలో యాపిల్ ఫోన్లు తయారు చేయొద్దు' అని యాపిల్ సంస్థకు అమెరికా చెప్పింది. ఆఫ్కోర్స్ ! టిం కుక్ ఈ మాటను పట్టించుకోలేదనుకోండి. అది వేరే సంగతి ! ట్రంప్ మనల్నీ, రోగ్ దేశం పాకిస్తాన్ని ఒకే గాటన కట్టి మాట్లాడుతున్నాడు.

ట్రంప్ పక్కా వ్యాపారవేత్త. మనదేశం నుండి వేలాదికోట్ల డిఫెన్స్ డీల్స్ ఏవైనా అమెరికాకు దొరికితే హఠాత్తుగా ఇండియా ఎంతో మంచిదైపోతుంది. ప్రస్తుతం అది లేదుకదా ! అందుకని ఇప్పుడు మనం కనిపించం మరి. సహజమే !

మేషం నుండి మూడోభావంలో గురుసంచారం కదా ! పాకిస్తాన్ కు ధైర్యం తగ్గిపోతుంది. అయితే, త్వరలో రాహువు కుంభంలో లాభస్థానంలోకి వస్తాడు. అప్పటినుంచీ మళ్ళీ కుట్రలు ఊపందుకుంటాయి.  IMF (Islamic Mujahideen Fund) డబ్బులొస్తున్నాయి కదా ! వాటిని టెర్రరిస్టులకు పంచి, మళ్ళీ మన దేశంపైకి  వాళ్ళను ఉసిగొల్పుతుంది. పాకిస్తాన్ తో గట్టిగా వ్యవహరించడం ఒక్కటే దీనికి మార్గం. పొరపాటున కూడా పాకిస్తాన్ ను, బాంగ్లాదేశ్ ను నమ్మకూడదు. నమ్మితేమాత్రం వెన్నుపోటే. విశ్వాసం అనేది ఆ రక్తంలో ఉండదు. 

మకరం నుండి శత్రుభావంలో గురుసంచారం గనుక, మనకు శత్రుబాధ ఉన్నప్పటికీ అది బాగా అదుపులో ఉంటుంది. మోదీగారి సమర్ధవంతమైన నాయకత్వమే దీనికి కారణం. మోడీవంటి కళంకం లేని దేశభక్తుడు మనకు PM గా ఉండటం మన అదృష్టం అన్నది ఎంతమంది గ్రహిస్తారో మరి !

బయట చూద్దామంటే టర్కీ, చైనా, పిల్లదేశం అజర్ బైజాన్ లు మాత్రమే మనకు శత్రువులు. కానీ దేశజనాభాలో దాదాపు 40 శాతం మన శత్రువులే. బయటివారికంటే లోపలివాళ్లే చాలా ప్రమాదం. మన దేశంలో ఉంటూ 'జై పాకిస్తాన్' అన్నాడంటే వాడిని వెంటనే మోసుకెళ్లి పాకిస్తాన్ బార్డర్లో పారెయ్యాలంతే. పోలీసులు, కోర్టులు ఏవీ ఈ విషయంలో కల్పించుకోకూడదు.  లేదంటే ప్రస్తుత ఇజ్రాయెల్ పరిస్థితి ముందుముందు మనకు కూడా వస్తుంది.

గుంటనక్క టర్కీని ఆర్ధికరంగంలో బహిష్కరించడం చాలా మంచిపని. వీలైతే చైనాను కూడా అదే చెయాలి. ఆర్ధికరంగంలో దెబ్బ కొడితేనే ఎవడైనా మాట వినేది. మంచిమాటలు ఇలాంటివాళ్ల దగ్గర పనిచేయవు.

లేకపోతే, అతిమంచితనం చేతగానితనం అవుతుంది. విశ్వాసం లేని కుక్కలకు మంచితనం ఎందుకు చూపించాలి? దేశంకంటే ఏదీ ఎక్కువ కాదు కదా !

read more " గురుగోచారం - మే 2025 "

11, ఏప్రిల్ 2025, శుక్రవారం

చెప్పేది చెయ్యకు

మెదడుకు శస్త్రచికిత్స చేయించుకున్న గురువుగారు

ఆరోగ్యసూత్రాలు చెబుతున్నారు

అణువులు గంతులేస్తున్నారు


యోగాను భక్తులకు బోధించే ఇంకో గురువుగారు

తనేమో జిమ్ము చేస్తున్నారు

పరమాణువులు పల్టీలు కొడుతున్నారు


చెప్పేది చెయ్యమని శాస్త్రంచెబుతోంది

చెప్పేది చెయ్యక్కర్లేదని  వీరంటున్నారు

కలియుగంలో ఇలాగే ఉంటుందని నేనంటున్నాను

అణువులూ పరమాణువులూ వర్ధిల్లండి !

read more " చెప్పేది చెయ్యకు "

24, ఆగస్టు 2024, శనివారం

మా 67 వ పుస్తకం 'భారతీయ జ్యోతిష్య సంఖ్యా శాస్త్రము' విడుదల

మా 67 వ పుస్తకంగా 'భారతీయ జ్యోతిష్య సంఖ్యాశాస్త్రము' నేడు విడుదల అవుతున్నది. ఇది నా జ్యోతిష్యశాస్త్ర పరిశోధనలో వెలుగుచూచిన న్యూమరాలజీ విధానం.

'సంఖ్యాజ్యోతిష్యం' అంటే బాగుంటుంది కదా? అని కొందరు సందేహం వెలిబుచ్చారు. అనడానికి, వినడానికి బాగానే ఉంటుంది. కానీ, జ్యోతిష్యశాస్త్రం లేకుండా సంఖ్యాశాస్త్రం లేదు. గ్రహాలతో ముడిపెట్టకుండా ఉత్త అంకెలు మిమ్మల్ని ఎంతోదూరం తీసుకుపోలేవు. జ్యోతిష్యశాస్త్రం ముందు, సంఖ్యాశాస్త్రం తరువాత.  అందుకే 'జ్యోతిష్య సంఖ్యాశాస్త్రము' అని పేరుపెట్టాను. 

నా 61 వ పుట్టినరోజు సందర్భంగా జూలై నెలాఖరులో మా ఆశ్రమంలో జరిగిన సాధనాసమ్మేళనంలో ఈ విధానాన్ని శిష్యులకు వివరించాను. ఆ తరువాత ఈ విధానాన్ని గ్రంధస్థం చేయాలన్న సంకల్పంతో, కేవలం రెండువారాలలో ఈ పుస్తకాన్ని వ్రాసి విడుదల చేస్తున్నాను. ఇందులో నాదైన న్యూమరాలజీ విధానం వివరించబడింది. దీనిని 'భారతీయ జ్యోతిష్య సంఖ్యాశాస్త్ర పధ్ధతి' లేదా క్లుప్తంగా 'BJS పద్ధతి' అని పిలుచుకోవచ్చు.

వెస్టర్న్ న్యూమరాలజీ మీద మార్కెట్లో వేలాది పుస్తకాలున్నాయి. అవన్నీ తప్పుల తడికలేనని నేనంటాను. నేనిలా అనడానికి తర్కబద్ధమైన కారణాలున్నాయి.

అంకెలను ఏ బీ సీ డీ లతో పోల్చి మీ నేమ్ నంబర్ రాబట్టడం, లేదా మీ జననతేదీతో పోల్చి మీ డెస్టినీ నంబర్ రాబట్టడాలు సరియైన విధానాలు కావు. కారణం? ఇవన్నీ నిన్నగాక మొన్న మనం కృత్రిమంగా ఏర్పరచుకున్న గ్రెగోరియన్ కాలెండర్ ను అనుసరిస్తూ ఉంటాయి.

లౌకికమైన లావాదేవీలకు తప్ప మీ 'డేట్ ఆఫ్ బర్త్'  కు ప్రకృతిపరంగా ఎటువంటి విలువా లేదు. అదే విధంగా, ప్రకృతికీ గ్రెగోరియన్ కాలెండర్ కూ ఎటువంటి సంబంధమూ లేదు. కాబట్టి దాని ఆధారంగా లెక్కించబడే వెస్టర్న్ న్యూమరాలజీకి తర్కబద్ధత లేదు. అది సత్యాన్ని ప్రతిబింబించదు. దీనికి పూర్తిగా విభిన్నమైనది  మన భారతీయ సంఖ్యాశాస్త్రము. ఇది ప్రకృతిపైన, నవగ్రహాలపైన ఆధారపడినది. కనుక సత్యమైన ఫలితాలనిస్తుంది.

నా పరిశోధనలో వెలుగుచూచిన ఈ సులభమైన విధానాన్ని 52 మంది ప్రముఖుల జాతకాల సహాయంతో తేలికగా సోదాహరణంగా ఈ పుస్తకంలో వివరించాను.

రామకృష్ణ పరమహంస, వివేకానందస్వామి, సిస్టర్ నివేదిత, పరమహంస యోగానంద, రమణ మహర్షి, జిల్లెళ్లమూడి అమ్మ, మెహర్ బాబా, అరవిందయోగి, ఓషో, జిడ్డు కృష్ణమూర్తి, యూజీ కృష్ణమూర్తి, ఆనందమయి మా వంటి మతప్రముఖుల జాతకాలతో బాటు, సుభాష్ చంద్ర బోస్, మోహన్ దాస్ గాంధీ, నాధూరాం గాడ్సే, జవహర్ లాల్ నెహ్రు, సర్దార్ పటేల్, ఇందిరా గాంధీ, పీవీ నరసింహారావు, ఎన్టీ రామారావు, నరేంద్రమోదీ, యోగి ఆదిత్యనాథ్, బెంజమిన్ నెతన్యాహు, రాజా రామ్మోహన్ రాయ్, కందుకూరి వీరేశలింగం పంతులు, విక్రమ్ సారాభాయ్, హరగోబింద్ ఖోరానా, సత్యేన్ద్రనాథ్ బోస్, యల్లాప్రగడ సుబ్బారావు, శ్రీనివాస రామానుజం, ఎలాన్ మస్క్, బిల్ గేట్స్, బ్రునీ సుల్తాన్, ముకేశ్ అంబానీ, గౌతమ్ అదానీ, వెంపటి చినసత్యం, శ్రీపాద పినాకపాణి, మంగళంపల్లి బాలమురళీకృష్ణ, హరిప్రసాద్ చౌరాసియా, పండిట్ రవిశంకర్, ఎమ్మెస్ సుబ్బులక్ష్మి, లతా మంగేష్కర్, కిషోర్ కుమార్, మహమ్మద్ రఫీ, తిరుమలై కృష్ణమాచార్య, బీకేఎస్ అయ్యంగార్, కృష్ణ పట్టాభి జాయిస్, కోడి రామ్మూర్తినాయుడు, దారాసింగ్, బ్రూస్ లీ, మాస్ ఒయామా, మైక్ టైసన్ మొదలైన సెలబ్రిటీల జాతకాలను ఈ సంఖ్యాశాస్త్ర పరంగా విశ్లేషించి చూపించాను.

ఈ విధానాన్ని అనుసరిస్తే, మీ జాతకాన్ని మీరే తేలికగా అర్ధం చేసుకోగలుగుతారు.

ఈ పుస్తకం వ్రాయడంలో నాకు సహాయపడిన నా శ్రీమతి సరళాదేవి, శిష్యులు అఖిల, లలిత, ప్రవీణ్, చావలి శ్రీనివాస్, మూర్తి, సంధ్యలకు నా ఆశీస్సులు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.

మా ఇతర పుస్తకాలలాగే ఈ పుస్తకం కూడా ఇక్కడ లభిస్తుంది.

చదివి చూడండి మీకే అర్ధమౌతుంది.

read more " మా 67 వ పుస్తకం 'భారతీయ జ్యోతిష్య సంఖ్యా శాస్త్రము' విడుదల "