“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

30, ఆగస్టు 2019, శుక్రవారం

మార్షల్ ఆర్ట్స్ ఎలా అభ్యాసం చెయ్యాలి?

మార్షల్ ఆర్ట్స్ లో అనేక రకాలున్నాయి. మన దేశంలో పుట్టి అనేక దేశాలకు విస్తరించి ఇప్పుడు అక్కడి నేషనల్ స్పోర్ట్స్ గా, నేషనల్ మార్షల్ ఆర్ట్స్ గా గుర్తింపు పొందిన అనేక విద్యలు అతి ప్రాచీనకాలంలో ఇక్కడ పుట్టినవే. అయితే, మిగతా అన్ని విద్యలలాగే, ఇవి కూడా, మన నిర్లక్ష్యధోరణి వల్ల మనవి కాకుండా పోయాయి. ఇదే మనకు పట్టిన అనేక దరిద్రాలలో ఒకటి.

మార్షల్ ఆర్ట్స్ లో స్థూలంగా చూస్తే, తూర్పు దేశాల విద్యలు, పశ్చిమ దేశాల విద్యలు అని రెండు గ్రూపులుగా ఉన్నాయి. తూర్పువి - కలారిపయత్, వర్మకలై, సిలంబం, కుంగ్ ఫూ, తాయ్ ఛి, బాగ్వా, జింగ్ యి, కరాటే, టైక్వోన్ డో, హ్వరాంగ్ డో, జుజుట్సు, సుమో, జూడో, ఐకిడో, కెండో, నింజుత్సు,కాలి సిలాట్, తాయ్ బాక్సింగ్ మొదలైనవి. పశ్చిమపు విద్యలు - కుస్తీ, బాక్సింగ్, ఫెన్సింగ్ మొదలైనవి.

లోకంలో ఉన్న ఒక భ్రమ ఏంటంటే - మార్షల్ ఆర్ట్స్ చేసేవాళ్ళు చాలా ఆరోగ్యంగా ఉంటారు అని. ఇది నిరాధారమైన నమ్మకం. సినిమాలు, యాడ్స్ చూసి జనం అలా అనుకుంటూ ఉంటారు. ఇది నిజం కాదు. ఒక భ్రమ మాత్రమే.

ఉదాహరణకు బ్రూస్ లీ 33 ఏళ్ళకే అనేక రోగాలతో చనిపోయాడు. ఒయామా అరవై దాటి బ్రతికినా, లంగ్ కేన్సర్ తో పోయాడు. మహమ్మద్ అలీ పార్కిన్సన్ డిసీస్ తో పోయాడు. ఇదే విధంగా ప్రఖ్యాత  అథ్లెట్లు చాలామంది పెద్ద వయసులో అనేక రోగాల బారిన పడ్డారు. కారణాలు ఏమిటి?

కండలు పెంచడం మీద ఉన్న శ్రద్ధ ప్రాణశక్తి మీద పెట్టకపోవడమే దీనికి కారణం. నేటి జిమ్ కల్చర్ కూడా కండలనే ప్రోత్సహిస్తోంది. ఇది చాలా పొరపాటు విధానం. జిమ్ చేసేవారు దానిని మానేశాక ఒళ్ళు విపరీతంగా పెరుగుతుంది. దానిని కంట్రోల్ చెయ్యడానికి నానా అవస్థలు పడాల్సి వస్తుంది. కండలనేవి వయసులో ఉన్నపుడు మాత్రమె పెంచగలం. పెద్ద వయసులో కండలు ఉండవు. నిలబడవు. పెంచాలని ప్రయత్నిస్తే హార్ట్ ఎంలార్జ్ మెంట్ వంటి ఇతర అనేక రోగాలు రావడం ఖాయం. దీనికి కారణం కండలకు, మేల్ హార్మోన్ కు సూటి సంబంధం ఉండటమే.

ఈ హార్మోన్ కొంత వయసు వచ్చాక బాడీలో పుట్టదు. కనుక పెద్దవయసులో కండలు పెంచడం కుదరదు. కండలు పెంచాలని అనుకునే అమ్మాయి అథ్లెట్లు, బాక్సర్లు కూడా మేల్ హార్మోన్ సప్లిమెంట్లు తీసుకుంటారు. లేకుంటే వారికి కండలు పెరగవు. అలాంటి హార్మోన్స వాడకం వల్ల, వారిలో సహజమైన సౌకుమార్యం లాలిత్యం మాయమై మొగరాయుళ్ళ లాగా అసహ్యంగా కనిపిస్తూ ఉంటారు. ఇది మరో కోణం. అమెరికా దేశంలో ఇలా అబ్బాయిలలాగా అసహ్యంగా కనిపించే అమ్మాయి అధ్లెట్లను, బాడీ బిల్డర్లను చాలా మందిని చూడవచ్చు. వారు సెలబ్రిటీలు కావచ్చు. కానీ చాలా అసహ్యంగా కనిపిస్తారు.

ప్రసిద్ధ ఆధ్లెట్లూ, బాక్సర్లూ, మార్షల్ ఆర్ట్ రింగ్ యోధులూ, వస్తాదులూ, బాడీ బిల్డర్లూ 35 కి సాధారణంగా రిటైర్ అవుతూ ఉంటారు. కారణం ఇదే. శరీరాన్ని విపరీతంగా కష్టపెట్టే వ్యాయామాలు కొన్నేళ్లు చేస్తే ఆ తర్వాత చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. వీటిని వారు తప్పుకోలేరు. ఉదాహరణకు సల్మాన్ ఖాన్ వంటి హిందీ నటులు వయసులో ఉన్నప్పుడు కండలు బాగా పెంచారు. కానీ ఒక వయసు వచ్చాక అవి నిలబడవు. జారిపోతాయి. అప్పుడు వాటిని ఫామ్ లో ఉంచడం వారికి గగనం అవుతుంది. నటులకే కాదు అధ్లెట్స్ కి మార్షల్ ఆర్టిస్టులకీ కూడా అంతే అవుతుంది. అప్పుడు నానా హార్మోన్లు వాడి ఒళ్ళు గుల్ల చేసుకుంటారు. లివరూ, హార్టూ, కిడ్నీలూ పాడౌతాయి.

మార్షల్ ఆర్ట్స్ లో థాయ్ బాక్సింగ్ చాలా భయంకరమైన ఆర్ట్. వాళ్ళు పడీపడీ వ్యాయామాలు చేస్తారు. రాక్షసుల లాగా ఒంటిని రాటు దేలుస్తారు. కానీ వాళ్ళు కూడా 35 తర్వాత రిటైర్ అవుతారు. ఇది ఎవరికైనా తప్పదు. ఆ తర్వాత, మునుపు చేసినట్లు వాళ్ళు వ్యాయామాలు చెయ్యలేరు. అది శరీర ధర్మం అంతే.

ఇదంతా ఎందుకు జరుగుతుంది? కండలు పెంచడం ఒక్కదాని మీదనే దృష్టి పెట్టడం వల్ల ఇది జరుగుతుంది. బ్రూస్లీ కూడా ఇదే అలవాటుకు బలై పోయాడు. 'ఎంటర్ ది  డ్రాగన్' సినిమా సరిగ్గా చూస్తే, ముఖ్యంగా, హాన్ ద్వీపంలో జరిగే చివరి ఫైట్స్ లో, బ్రూస్లీ ఎంత అనారోగ్యంగా ఉన్నాడో తెలుస్తుంది. తనను ఎటాక్ చేయబోయిన ఒకడిని త్రో చేయబోయి బ్రూస్లీ బాలెన్స్ తప్పి తూలడం ఒక సీన్ లో స్పష్టంగా కనిపిస్తుంది. ఆ తర్వాత అతి త్వరలో అతను బ్రెయిన్ ఎడీమా తో చనిపోయాడు.

ప్రాణశక్తి అనేదాన్ని నిర్లక్ష్యం చేసి ఉత్త కండల మీద దృష్టి పెట్టడం వల్లనే ఇది జరుగుతుంది. నేటి సినిమా హీరోలు కూడా కండలు పెంచడం మీద మాత్రమే దృష్టి పెడుతున్నారు. ఇది హాలీవుడ్ హీరోలను చూసి మనవాళ్ళు కాపీ కొట్టడం వల్ల వచ్చిన దరిద్రం. వీళ్ళందరూ ముందు ముందు చాలా అవస్థలు పడతారు.

అందుకనే, భయంకరంగా కండలు పెంచి రింగ్ ఫైట్స్ చేసే యోధుల కంటే, యోగా, తాయ్ ఛీ, బాగ్వా వంటి ప్రాణశక్తి అభ్యాసాలు శ్రద్ధగా చేసేవారు ఆరోగ్యంగా ఎక్కువకాలం బ్రతుకుతారు.

మార్షల్ ఆర్ట్స్ లోని సాఫ్ట్ స్టైల్స్ అన్నీ ప్రాణశక్తి మీదనే దృష్టి పెడతాయి. అందుకనే వాటిని Internal Martial Arts అంటారు. ఈ విద్యలు అభ్యాసం చేసేవారికి బాడీ బిల్డర్స్ లాగా, బాక్సర్ల లాగా కండలు ఉండవు. కానీ వారి ప్రాణశక్తి మంచి స్థితిలో ఉంటుంది. 90 ఏళ్ళు వచ్చినా అది వారిని ఆరోగ్యంగా ఉంచుతుంది. వారిలో జీవశక్తి ఉట్టిపడుతూ ఉంటుంది.

ఈ సూత్రం బాగా అర్థమైంది గనుకనే, షావోలిన్ టెంపుల్ లో, మధ్యవయసు వరకూ హార్డ్ స్టైల్ కుంగ్ ఫు, ఆ తర్వాత సాఫ్ట్ స్టైల్ కుంగ్ ఫు అభ్యాసం చేసేవారు. ఆరోగ్యంగా ఉండేవారు.

Internal Martial Arts కూ యోగాభ్యాసానికీ పెద్ద తేడా లేదు. ఆహార నియమాలు పాటిస్తూ, ఆసన ప్రాణాయామాలు సరిగ్గా చేస్తే మాత్రమే అన్ని రకాలుగా ఆరోగ్యం బాగుంటుంది. ఎక్కువకాలం హాయిగా బ్రతకడమూ జరుగుతుంది. అంతేగాని, లాంగ్ రన్ లో హార్డ్ ఎక్సర్ సైజులు మంచివి కావు.

బాడీ బిల్డింగ్, కుస్తీ, రన్నింగ్, మొదలైన హార్డ్ వ్యాయామాలు ఒక విధంగా భూతాల వంటివి. మనం ఒకసారి వాటి జోలికి పోతే, ఆ తరువాత మనం వాటిని వదిలినా, అవి మనల్ని వదలవు. బలవంతంగా వదిలించుకుంటే, సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. కనుక వాటి జోలికి పోకుండా ఉండటం మంచిది.

బుద్ధుడు తన అష్టాంగ మార్గంలో 'సమ్యక్ వ్యాయామం' అని ఒక దానిని చెబుతాడు. సరియైన వ్యాయామం చెయ్యమని దాని అర్ధం. పెద్దవయసు వరకూ మనలని రక్షించే వ్యాయామాలే మనం చెయ్యాలి గాని, ఇప్పటికిప్పుడు కండలు పెరుగుతున్నాయని చెప్పి, ఒక వయసు దాటాక సమస్యలు తెచ్చేవాటిని చెయ్యకూడదు.

ఈ స్పృహతో మార్షల్ ఆర్ట్స్ అభ్యాసం చెయ్యడం సరియైన విధానం. అప్పుడే ఆయుస్సూ, ఆరోగ్యమూ రెండూ బాగుంటాయి. ఇవి ఉన్నప్పుడు ఆనందంగా బ్రతకడం సాధ్యం అవుతుంది.
read more " మార్షల్ ఆర్ట్స్ ఎలా అభ్యాసం చెయ్యాలి? "

29, ఆగస్టు 2019, గురువారం

ప్రస్తుతం నేను హైదరాబాద్ వాసిని

ఉద్యోగం హైదరాబాద్ కు మారడంతో, ఒక నెలనుంచీ నా నివాసం కూడా హైదరాబాద్ లోనే. తార్నాక దగ్గరలోనే ఉంటున్నాను. ఉద్యోగమూ, కుటుంబమూ, మిగతా విషయాలూ ఎలా ఉన్నప్పటికీ, ఈ మార్పుతో నా జీవితంలోనూ, మా సంస్థలోనూ ముఖ్యమైన అనుబంధ మార్పులు కొన్ని జరుగబోతున్నాయి.

నా హైదరాబాద్ శిష్యులూ అభిమానులూ కొన్నేళ్ల నుంచీ నన్ను హైదరాబాద్ రమ్మని కోరుతున్నారు. అది ఇప్పటికి జరిగింది. ఎందుకంటే, నేను పెడుతున్న స్పిరిట్యువల్ రిట్రీట్లూ, యాస్ట్రో వర్క్ షాపులూ, యోగా కేంపులూ,  హోమియో క్లాసులూ, మార్షల్ ఆర్ట్స్ క్లాసులూ అన్నీ హైద్రాబాద్ లోనే పెడుతున్నాను. దానికోసం నేను గుంటూరు నుంచి రావడం జరుగుతోంది. మాటమాటకీ అలా రావడం కుదరడం లేదు. ప్రస్తుతం ఇక్కడే ఉంటున్నాను గనుక ఇకమీద  ప్రతి వీకెండూ ఒక సమ్మేళనమే. ఈ మార్పువల్ల ఇక్కడ ఉన్న నా శిష్యులకూ నాకూ చాలా అనుకూలంగా ఉంటుంది. అందుకే 'పంచవటి' లో నూతన అధ్యాయం మొదలైందని అంటున్నాను.

మా సాధనా సమ్మేళనాలు ఇకమీద ప్రతివారమూ మా ఇంటిలోనే జరుగుతాయి. నిజంగా సాధన చేయాలనుకునేవారికి ఇది సువర్ణావకాశం. అందుకున్నవారికి అందుకున్నంత ఇస్తాను. తెలుసుకోవాలనుకునేవారికి వారు కోరినంత చెబుతాను. నాతో నడిస్తే, చెయ్యి పట్టి నడిపిస్తాను. నాతో కలసి ఎక్కువకాలం గడపాలని, జ్యోతిష్య - యోగ - తంత్ర రహస్యాలను తెలుసుకోవాలని, వాటిలో సాధన చెయ్యాలని అనుకునేవారికి ఇది మళ్ళీమళ్ళీ రాని అవకాశం. మినిమమ్ ఒక ఏడాది నేను ఇక్కడే ఉంటాను. అందుకే నా హైదరాబాద్ శిష్యులు ప్రస్తుతం మహా ఉత్సాహంగా ఉన్నారు.

'ఎలా ఉంది హైదరాబాద్?' అని మిత్రులు అడిగారు. 'ఎలా ఉంటుంది? ఎప్పటిలాగానే ఉంది. హైదరాబాద్ నాకేమీ కొత్త కాదు.  నలభై ఏళ్ల నించీ తెలుసు' అని చెప్పాను. అయితే అప్పటికీ ఇప్పటికీ వాతావరణం బాగా పాడయింది. గాలిలో దుమ్మూ, పొగా పెరిగాయి. ఎండలో వేడి పెరిగింది. జీవితాలలో వేగం పెరిగింది. మానవ సంబంధాలు తగ్గిపోయి జీవితాలు యాంత్రికం అయిపోయాయి. ఉరుకులు పరుగులు ఎక్కువయ్యాయి. బాంధవ్యాలు ప్రేమలు ఉన్నా, మనుషులు ఒకరినొకరు కలవలేని పరిస్థితి. జీవనపోరాటం ప్రధమస్థానాన్ని ఆక్రమించింది. అన్నింటికంటే డబ్బే ముఖ్యం అయిపోయింది. ఇంతే అప్పటికీ ఇప్పటికీ మార్పు' - అని చెప్పాను.

అదంతా ఎలా ఉన్నప్పటికీ, నాకేమీ సంబంధం లేదు. అది గుంటూరైనా, హైదరాబాద్  అయినా, ఇండియా అయినా అమెరికా అయినా - నా జీవనవిధానం ఒక్కలాగానే ఉంటుంది.  ఏమీ తేడా ఉండదు. సమాజంతోనూ దానిలో వస్తున్న మార్పులతోనూ నాకు సంబంధం ఉండదు. నాలోకం నాది గనుక ఇబ్బంది లేదు.

అటూ ఇటూ మారడంతో గత నెలరోజులుగా వెనుక పడిన నా కార్యక్రమాలు, వ్రాతలు, ఉపన్యాసాలు, పాటలు, అభ్యాసాలు ఇక మళ్ళీ మునుపటి కంటే వేగంగా మొదలు కాబోతున్నాయి. వచ్ఛే వారం నుంచీ వీక్లీ రిట్రీట్స్ మొదలు కాబోతున్నాయి. వాటిల్లో నా శిష్యులను అనేక విద్యలలో ప్రాక్టికల్ గా గైడ్ చేయబోతున్నాను. నాతో కలసి ప్రతిరోజూ ధ్యానం చేసే అవకాశం వారికిప్పుడు లభిస్తున్నది. నాతో యోగా చేసే అవకాశమూ, మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్ చేసే అవకాశమూ లభిస్తున్నాయి. నా ఆధ్యాత్మిక పయనం ఇప్పుడు మరింత రాకెట్ స్పీడుతో ముందుకు పోబోతోంది. అందుకే 'పంచవటిలో ఇది కొత్త అధ్యాయం' అంటున్నాను. కొంతమంది ఇన్నర్ సర్కిల్ శిష్యులు ఇప్పటికే నన్ను రెగ్యులర్ గా కలుస్తున్నారు.

ఈ ప్రయాణంలో నాతో కలసి నడిచే ధైర్యమూ తెగింపూ ఉన్న నా మిగతా శిష్యులకు కూడా బ్లాగుముఖంగా స్వాగతం పలుకుతున్నాను. నేను హైదరాబాద్ వచ్చాక జరిగే మన మొదటి సమ్మేళనం త్వరలో ఉంటుంది. గమనించండి.
read more " ప్రస్తుతం నేను హైదరాబాద్ వాసిని "

16, ఆగస్టు 2019, శుక్రవారం

ఇండియా ప్రధాన శత్రువులు ఇంటిదొంగలే

ఇది ఈనాడు కొత్తగా జరుగుతున్నది కాదు. చరిత్ర మొదటినుంచీ మనదేశంలో ఇదే తంతు. మొదటినుంచీ మన దేశానికి ప్రధానమైన శత్రువులు ఇంటిదొంగలే. కృష్ణుడి కాలంలో గ్రీకులకు రోమన్లకు ఉప్పు అందించి మన గుట్టుమట్లు చెప్పి, రహస్య మార్గాలు ఎక్కడున్నాయో చెప్పి శత్రువులకు రాచమార్గాలు వేసింది ఇంటిదొంగలే. వారిలో కొంతమంది రాజులూ ఉండేవారు. పక్కరాజును మనం గెలవలేమని అనుకున్నప్పుడు విదేశీయులను ఆహ్వానించి వారిచేత సాటి రాజును ఓడించేవారు. ఆ తర్వాత ఆ విదేశీరాజు వీడిని కూడా చితక్కొట్టి చెవులు మూసేవాడు. ఇలా చరిత్రలో ఎన్నో సార్లు జరిగింది. అయినా మనవాళ్లకు బుద్ధి రాదు. ఎంతసేపూ 'నా కులం నా ఊరు' తప్ప జాతీయతాభావం రాదు.

మధ్యయుగాలలో తురుష్కులు అరబ్బులు మొఘలులు మన దేశం మీదకు దండెత్తి వఛ్చినపుడు కూడా మనవాళ్ళు ఇదే విధంగా హీనంగా ప్రవర్తించి, మన గుట్టుమట్లన్నీ వారికీ అందించి, మాతృదేశానికి తీరని ద్రోహం చేశారు. మాలిక్ కాఫర్ ఢిల్లీ నుంచి బయల్దేరి కాకతీయ సామ్రాజ్యాన్ని చిన్నాభిన్నం చేసి, మదురై వరకూ ఊచకోత కోస్తూ సాగిపోయాడంటే అర్ధం ఏమిటి? ఇంటిదొంగలు అతనికి సాయం చేసి తలుపులు బార్లా తెరవడమే దానికి కారణం.

ఇంతమంది రాజులు, సైన్యాలు ఉన్న మన దేశాన్ని ఇంగిలీషు వాళ్ళు తేలికగా ఎలా గెలవగలిగారు? ముఖ్యకారణాలు ఎన్నున్నా వాటికి సహాయపడిన మనుషులు ఇంటిదొంగలే. స్వతంత్ర పోరాటం ముగిసి మనకు గెలుపు వఛ్చినపుడు కూడా మనవాళ్ళు ఇదే విధంగా చేశారు. కనీసం ఈ డెబ్బై ఏళ్లలోనూ వారికి దేశభక్తి రాకపోగా ప్రస్తుతం బాహాటంగా శత్రుదేశాలను సమర్ధించే కార్యక్రమం ఎక్కువై పోయింది. బయటనుంచి వఛ్చి ఇక్కడ స్థిరపడిన వాళ్ళు మన దేశాన్ని  సమర్ధించాలి గాని బయట దేశాలను కాదు. వాళ్ళు ఏ మతం వారైనా సరే, ఇండియాలో ఉంటున్నప్పుడు ఇండియానే సమర్ధించాలి. ఇది బేసిక్ రూల్.

కానీ మన దేశంలో చాలా విచిత్రమైన జాతులున్నాయి. తినేది ఇక్కడి తిండి, పీల్చేది ఇక్కడి గాలి, తాగేది ఇక్కడి నీళ్లు, వంత పాడేది మాత్రం శత్రుదేశాలకు. ఇదీ మనవాళ్ళు అని మనం అనుకుంటున్న వాళ్ళ వరస.

పాకిస్తానూ, చైనా కలసి కాశ్మీర్ విషయాన్ని రచ్చ చెయ్యాలని చూస్తున్నాయంటే ఒక అర్ధం ఉంది.  కానీ మన దేశంలో కొన్ని పార్టీలూ, ఒవైసీ లాంటి నాయకులూ, కాశ్మీర్ విషయంలో పాకిస్తాన్ కు వంత పాడటం చూస్తుంటే వాళ్లకు సిగ్గు లేకపోయినా మనకు సిగ్గేస్తోంది. ఇలాంటి విషయాలలో దేశంలో అన్ని పార్టీలూ ఒక్కటిగా నిలబడాలి. లేకపోతే కాలక్రమంలో వాళ్ళ మనుగడనే కోల్పోవాల్సి వస్తుంది.

ఈనాడు ఒవైసీ వంటి నాయకులూ, పాకిస్తాన్ నాయకులూ కాశ్మీర్లో మానవహక్కుల గురించి మాట్లాడుతున్నారు. మరి 1990 ప్రాంతాలలో పది లక్షలమంది కాశ్మీర్ పండిట్లు వాళ్ళ ఇళ్ళూ వాకిళ్ళూ వదలిపెట్టి ఇండియాలోని ప్రతి రాష్ట్రానికీ పారిపోయి వచ్చి రోడ్ల పక్కన బ్రతకవలసిన పరిస్థితి ఎందుకొచ్చింది? ఈ మానవ హక్కులు వాళ్లకు లేవా? అప్పుడు వీళ్ళందరూ ఎందుకు మాట్లాడలేదు? ఆ గొడవలతో ఎన్నెన్ని కాశ్మీర్ పండిట్ల కుటుంబాలు పాకిస్తాన్ అనుకూలవాద వర్గాల బుల్లెట్లకు బలై పోయాయి? ఆ లెక్కలు కూడా తియ్యండి మరి. కాశ్మీర్లో ఉన్న ముస్మీములే మనుషులా? హిందువులు కారా? వాళ్ళ గురించి ఎవరూ మాట్లాడరెందుకు?

ఈనాడు రాహుల్ గాంధీగారు, నేను కాశ్మీర్ వఛ్చి చూస్తా చూస్తా అంటూ ప్రతిరోజూ అరుస్తున్నాడు. మరి 1990 లలో కాశ్మీర్ లోని హిందూ కుటుంబాలను ఎక్కడికక్కడ చంపేస్తూ ఉంటె, ఇదే రాహుల్ గాంధీగారి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండి ఏమి చేసింది? ఆనాడు కాశ్మీర్ పండిట్ల గోడు ఎవరూ పట్టించుకోలేదు ఎందుకని? ఈనాడు ఈ మొసలి కన్నీళ్లు ఎవరికోసం? ముస్లిం ఓట్ల కోసమా? ఇంకా అదే కార్డా? కాలం మారింది కాస్తన్నా మారండయ్యా కాంగ్రెస్ బాబులూ !

పాకిస్తాన్ కు స్వతంత్రం వఛ్చినపుడు అక్కడున్న హిందువుల శాతం 22. అది నేడు రెండు శాతానికి ఎలా పడిపోయింది? వారంతా ఏమై పోయారు? ఎందుకు వాళ్ళ శాతం అలా తగ్గింది? వాళ్ళను అంతగా భయభ్రాంతులకు గురిచేసింది ఎవరు? బడి నుంచి గుడి వరకూ వారిని వెంటాడి వేధించి చివరకు ప్రాణభయంతో  దేశాన్ని వదలి పారిపోయేలా చేసింది ఎవరు? అదే సమయంలో ఇక్కడ మన దేశంలో ముస్లింజనాభా ఎంత పెరిగింది? ఎందుకు పెరిగింది? మానవహక్కులూ రక్షణా లేని దేశంలో ఇంతలా వారి జనాభా ఎలా పెరుగుతుంది? ఈ లెక్కలన్నీ తియ్యాలి మరి !

పిచ్చివాగుడు వాగుతున్నాడని మనం తరిమేసిన జాకీర్ నాయక్ మలేషియాలో ఉంటూ అక్కడి చైనీయుల మీద భారతీయుల మీద ఇష్టం వఛ్చినట్లు వాగుతూ ఉంటె అతన్ని అక్కడనుంచి కూడా బయటకు పంపిస్తామని వాళ్లంటున్నారు. కానీ మన దేశంలో ఉంటూ మన దేశాన్ని విమర్శించడమే గాక, బాహాటంగా వ్యతిరేకిస్తూ మాట్లాడుతున్న వాళ్ళను మనమేం చెయ్యడం లేదు. అది మన విజ్ఞత కావచ్చు. లేదా హిందువులకు సహజమైన మానవతాధోరణి కావచ్చు.  అది వారికి అర్ధం కావడం లేదు. దీన్నేమనాలి మరి? 

నిన్నటికి నిన్న లండన్లో మన స్వతంత్ర దినోత్సవం జరుపుకుంటున్న భారతీయుల మీద పాకిస్తాన్ అనుకూల వర్గాలు రాళ్ళేసి గోల చేశాయంటే, అదికూడా బ్రిటిష్ పోలీసుల సమక్షంలో జరిగిందంటే, దీన్నేమనాలి? కాశ్మీర్లో ఏదో జరిగిపోతోంది అంటూ గోల చేసే అంతర్జాతీయ టీవీలు ఈ ఈవెంట్ ని ఎందుకు కవర్ చెయ్యలేదో మరి?

టెర్రరిస్తాన్ మనకు నీతులు చెప్పడం ఎలా ఉందంటే సైతాన్ ఖురాన్ వల్లించినట్లు ఉంది.

మనం బలహీనంగా నంగినంగిగా ఉన్నంతవరకూ ప్రతివాడూ మన నెత్తికెక్కి తాండవం చెయ్యాలనే చూస్తాడు. ప్రపంచ దేశాల దృష్టిలో అందుకే మనం ఇలా ఉన్నాం. మనం గట్టిగా ఉండవలసిన సమయం వచ్చ్చేసింది. గట్టి చర్యలతో బయట దేశాలకు ఎలాంటి మెసేజి పంపుతున్నామో, ఇంటి దొంగల విషయంలో, వారు వ్యక్తులైనా, పార్టీలైనా, అంతే గట్టిగా ప్రవర్తించవలసిన అవసరం ఎంతైనా ఉంది. అప్పుడే ప్రపంచ దేశాల దృష్టిలో మన పరువు కాస్తైనా నిలబడుతుంది మరి !
read more " ఇండియా ప్రధాన శత్రువులు ఇంటిదొంగలే "

9, ఆగస్టు 2019, శుక్రవారం

దేశానికి నిజమైన స్వతంత్రం ఇప్పటికి వచ్చింది

గాంధీ నెహ్రూలు చేసిన చారిత్రాత్మక తప్పిదం 72 ఏళ్ళ తర్వాత మోడీ, అమిత్ షాల చేత సరిచెయ్యబడింది. గాంధీ నెహ్రూలు చేసిన ఈ తప్పు వల్ల కాశ్మీర్ లో ఇన్నేళ్ళలో దాదాపు 50,000 మంది దారుణంగా చనిపోయారు. ఈ లెక్క ఇంకా ఎక్కువే కావచ్చు.

ప్రాచీన కాలంలో ఆఫ్ఘనిస్తాన్ వరకూ భారతదేశంలోనే ఉండేది. శ్రీరాముని కుమారుడు లవుడు స్థాపించినదే లవహోర్ లేదా లాహోర్. లక్ష్మణుడు స్థాపించినదే లక్నో. భరతుడు స్థాపించినది మధుర. ఇవన్నీ అప్పట్లో అడవులుగా ఉంటె, వాటిని కొట్టించి జనపదాలుగా మార్చారు వీళ్ళు. అలాగే నేటి కాశ్మీర్ కూడా భారతదేశంలో భాగమే.

స్వతంత్రం వచ్చిన సమయంలో గట్టిగా నిలబడకుండా, ఎవరేది చెబితే దానికి తలలూపడం గాంధీ నెహ్రూలు చేసిన పెద్దతప్పు. అసలు నెహ్రూను రాజకీయాలలో ప్రోమోట్ చెయ్యడం గాంధీ చేసిన ఘోరాతిఘోరమైన తప్పు. నెహ్రూకి ఉన్న అమ్మాయిలపిచ్చి లాంటి బలహీనతలను చక్కగా వాడుకుని బ్రిటిష్ వాళ్ళూ, మహమ్మదాలీ జిన్నా, షేక్ అబ్దుల్లాలు భారతదేశాన్ని ముక్కలు ముక్కలు చేశారు. నిజానికి, నెహ్రూ, జిన్నా, షేక్ అబ్దుల్లాలు అన్నదమ్ములని గట్టి ఆధారాలున్నాయి. నిజానికి నెహ్రూలో ఉన్నది ముస్లిం రక్తమే. అందుకే వాళ్లకు వత్తాసుగా మాట్లాడి, కాశ్మీరుకు స్వతంత్ర ప్రతిపత్తి కట్టబెట్టాడు. ఏడు దశాబ్దాలుగా రావణకాష్టంలా మండుతున్న కాశ్మీర్ సమస్యను మన నెత్తిన పెట్టి పోయాడు.

భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 370 ని రూపొందించడం అతి పెద్ద తప్పు. అంబేద్కర్ కూడా దీనికి ఒప్పుకోలేదు. ఇది పాస్ చేసిన రోజున సమావేశానికి ఆయన హాజరు కాలేదు. పటేల్ దీనిని ఒప్పుకోలేదు. ఈ విధంగా చాలామంది దేశభక్తులు దీనిని ఒప్పుకోలేదు. కాశ్మీరులో 70 ఏళ్ళ మారణహోమానికి అదే కారణం అయింది. కాశ్మీరుకు ఫండ్స్ ఇచ్చేది మనం. అనుభవిస్తున్నది షేక్ అబ్దుల్లా కుటుంబం ఇంకా పాకిస్తాన్ అనుకూలవాద హురియత్ వర్గాలు. అక్కడి ప్రజలు మాత్రం దరిద్రంలోనూ, నిరక్షరాస్యత లోనూ 70 ఏళ్ళుగా మగ్గిపోతున్నారు. టూరిజం పుణ్యమాని దాని అనుబంధ వ్యాపారాలు చేసుకుంటూ కొన్నేళ్ళు నెట్టుకొచ్చారు. కానీ తీవ్రవాద మూకల పుణ్యమా అంటూ టూరిజం కాస్తా కూలబడింది. కాశ్మీర్ ప్రజలకు బ్రతుకు తెరువు లేదు. చదువు లేదు. భయంకరమైన ఇస్లాం చట్టాలు అమల్లో ఉన్నాయి. స్త్రీలకు ఏ హక్కులూ లేవు. ఇదీ కాశ్మీర్ పరిస్థితి.

కాశ్మీర్ పండిట్స్ ను ఎక్కడికక్కడ ఊచకోత కోస్తూ దారుణంగా చంపుతుంటే భయపడి వాళ్ళందరూ వాళ్ళ ఇల్లూ వాకిళ్ళూ వదిలిపెట్టి కట్టుబట్టలతో పారిపోయి వచ్చి డిల్లీలోనూ ఇంకా ఇతర రాష్ట్రాలలోనూ స్థిరపడి ఏవేవో పనులు చేసుకుంటూ బ్రతుకుతున్నారు. 

ఇది చాలదన్నట్టు మన భూభాగాన్ని కొంత ఆక్రమించిన పాకిస్తాన్ దాన్ని POK గా మార్చింది. అందులో కొంత భాగాన్ని తెలివిగా చైనాకు ధారాదత్తం చేసింది. అదొక పీటముడిగా తయారైంది. కాశ్మీర్ తమదే అన్నట్టు పాకిస్తాన్ మాటమాటకీ అందులో జోక్యం చేసుకుంటూ ఉగ్రవాదాన్ని ఎగదోస్తూ ఉంటుంది. దీన్ని కాంగ్రెస్ ప్రభుత్వం చూసీ చూడనట్టు ఊరుకుంటూ ఉంటుంది. మనం కడుతున్న టాక్స్ మాత్రం స్పెషల్ ఫండ్ రూపంలో వందలు వేల కోట్లు కాశ్మీర్ కు చేరుతూ ఉంటుంది. కానీ కాశ్మీర్ భారత్ లో అంతర్భాగం కాదు. ఇదీ గత 70 ఏళ్ళుగా జరిగిన తంతు.

ఇదంతా పనికిరాదని, కాశ్మీర్ భారతదేశంలో భాగం కావాలని తపించి, గాంధీ నెహ్రూల కుట్రలను బయటపెట్టిన అకలంక దేశభక్తుడు డా || శ్యాంప్రసాద్ ముఖర్జీ విషప్రయోగం చెయ్యబడి కన్నుమూశాడు. ఇంకా చెప్పాలంటే నెహ్రూ షేక్ అబ్దుల్లాలు కలసి ఆయన్ను చంపేశారు. ఆయన కలమాత్రం అలాగే ఉండిపోయింది. ఇన్నాళ్ళకు మోడీ, అమిత్ షా ల పుణ్యమా అని ఆ కల నిజమైంది.

ఆనాడు సర్దార్ వల్లభభాయ్ పటేల్ పూనుకొని మిలిటరీ యాక్షన్ తీసుకోక పోయి ఉంటే, నేడు తెలంగాణా మొత్తం పాకిస్తాన్ అధీనంలో ఉండి ఉండేది. నేడు మోడీ, అమిత్ షాలు పూనుకోక పోతే కొంతకాలానికి కాశ్మీర్ కూడా పాకిస్తాన్ కబంధ హస్తాలలోకి వెళ్ళిపోతుంది.

భారతదేశం ఇన్నాళ్ళూ సూపర్ పవర్స్ కి భయపడుతూ బ్రతుకుతూ వచ్చింది. ఇప్పుడు చైనా కూడా సూపర్ పవర్ అయింది. ఒకవైపున అరుణాచల ప్రదేశ్ తమదే అంటోంది. ఇంకోవైపున నేపాల్ లో పాగా వేసింది. భూటాన్ ను మింగాలని చూస్తోంది. పాకిస్తాన్ కు ఓపెన్ గా సహాయం చేస్తోంది. ఇప్పుడు కూడా శాంతివచనాలు చెబుతూ కళ్ళు మూసుకుని కూచుంటే కాశ్మీర్ మన చేతిలోనుంచి జారిపోవడం ఖాయం. అదే జరిగితే ఉత్తరాఖండ్ వరకూ పాకిస్తాన్ చైనాలు వచ్చేస్తాయి. మన దేశపు ఉనికే ప్రమాదంలో పడుతుంది. ఇదంతా గమనించే మోడీ అమిత్ షాలు ఈ తెలివైన పని చేశారని నా ఊహ.

ఆర్టికల్ 370 ని రద్దు చేయించడంలో వీరిద్దరి పాత్ర అమోఘం. ఇంతకంటే దేశభక్తికి రుజువు ఇంకేమీ అవసరం లేదు. నన్నడిగితే ఇంకో 30 ఏళ్ళపాటు మోడీనే మనకు ప్రధానిగా ఉండాలంటాను. స్వతంత్రం వచ్చాక నీతీ నిజాయితీ, చిత్తశుద్ది, గుండెధైర్యం ఉన్న ప్రధాని ఇప్పటివరకూ ఆయనొక్కడే అనిపించాడు మరి !!

అయితే, ప్రస్తుతం కాశ్మీర్ అంతా కర్ఫ్యూలో ఉంది. దాన్ని ఎత్తేసిన తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందో అనుమానమే. పాకిస్తాన్ చేత ఎగదోయ్యబడే అక్కడి ఉగ్రమూకలను తట్టుకోవాలి, ఇంకో పక్కన అంతర్జాతీయ ఒత్తిళ్లను తట్టుకోవాలి. ముందు ముందు పాకిస్తాన్ ఎగదోసే రోజువారీ కుట్రలను అల్లర్లను ఎదుర్కోవాలి. మోడీ ప్రభుత్వానికి చాలా సవాళ్లు ఎదురుగా ఉన్నాయి. ఎన్ని సవాళ్లు సమస్యలు ఉన్నా సరే, సరిచెయ్వవలసిన తప్పును ధైర్యంగా సరిచేశారు. రాజ్యాంగ రూపకర్తలు చేసి, మనకు అంటించిపోయిన, దారుణమైన తప్పును ఇంకా ఇంకా ఆలస్యం చేసి ముదరబెట్టుకోకుండా ధైర్యంగా పరిష్కారం చేశారు.

ఈ సాహసోపేతమైన చర్యకు మోడీని, అమిత్ షాను భారత ప్రజలందరూ నెత్తిన పెట్టుకోవాలి. అలా చెయ్యనివారందరూ నా దృష్టిలో దేశద్రోహుల క్రిందే లెక్క.
read more " దేశానికి నిజమైన స్వతంత్రం ఇప్పటికి వచ్చింది "

1, ఆగస్టు 2019, గురువారం

కాలం ఆగింది......

మండే వేసవి మధ్యాహ్నం 
విసిరేసిన ఓ కుగ్రామం 
ఊరంతా నిర్మానుష్యం

ప్రకృతంతా మౌనంగా ఉంది 
మొండి గోడ ధ్యానంలో ఉంది
దానిపై కుక్క నిద్రలో ఉంది  
మనసు శూన్యంలోకి చూస్తోంది

కాలం ఆగింది......
read more " కాలం ఆగింది...... "