“అసమర్ధుని వద్ద ధనము, సుఖము, కీర్తి, ధర్మము ఏవీ నిలచి ఉండవు"

29, ఏప్రిల్ 2011, శుక్రవారం

ఆయన త్వరగా వచ్చుచున్నాడు

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న గొప్ప మూఢ నమ్మకాలలో-- ఆయన మళ్ళీ వచ్చును-- అనేది అతి గొప్ప హాస్యాస్పదమైన నమ్మకం. తాము నమ్మిన మహాత్ముడు మళ్ళీ పుడతాడని ఎదురుచూస్తూ బతకటం అందులో ప్రధానమైన అంశం. ఇదెప్పటికీ జరగదు, జరుగలేదు, జరుగబోదు అన్నది నగ్న సత్యం.

పునర్జన్మను నమ్మని సెమెటిక్ మతాలూ ఈ నమ్మకానికి మినహాయింపు కాదు. ఉదాహరణకి క్రైస్తవాన్ని చూద్దాం. వాళ్ళ నమ్మకం ప్రకారం రెండోసారి వచ్చినపుడు జీసస్ మేఘాల్లోంచి దిగివస్తాడు. మేఘాల్లోనుంచి వచ్చినా, భూమ్మీద నడుచుకుంటూ వచ్చినా, రెండోసారి రావడం మాత్రం తప్పనిసరి. ఒకసారి చేయించుకున్న పరాభవం చాలదన్నట్లు ఆయన మళ్ళీ రావాలి మనకోసం!!! మనమేమో ఈలోపల కొత్త మేకులూ సుత్తీ రెడీ చేసుకుందాం. "ఆయన త్వరగా వచ్చుచున్నాడు"-- అని రెండువేల సంవత్సరాల నుంచీ క్రైస్తవ సోదరులు మైకుల్లో అరుస్తూనే ఉన్నారు. ఎటునుంచి వస్తున్నాడో గాని, ఆయన జాడ మాత్రం కనుచూపు మేరలో ఎక్కడా కనిపించడం లేదు. రెండువేల ఏళ్లనుంచీ నడిచీ నడిచీ ఆయనకు కాళ్ళు నొప్పి పుట్టి ఎక్కడన్నా కూచున్నాడేమో తెలియదు.

ముస్లిములలో కూడా ఇలాటి నమ్మకమే ఒకటి ఉంది. మహమ్మద్ ప్రవక్త తర్వాత పన్నెండుమంది ఇమాం లు రాజులుగా పరిపాలించారు. వాళ్ళలో పన్నెండో ఇమాం (బారా ఇమాం) ఒకరోజున ఏమయ్యాడో పత్తా లేకుండా మాయమైపోయాడు. బహుశా రాజకీయ కారణాలవల్ల ఆయన రహస్య హత్యకు గురయ్యాడో, లేక రాజ్య నిర్వహణా గొడవలుభరించలేక బుద్దుడిలా రాత్రికి రాత్రే ఇల్లొదిలి పారిపోయాడో ఎవరికీ తెలియదు. వాళ్ళు మాత్రం అల్లా ఆయన్ను దాచిపెట్టాడని నమ్ముతున్నారు. సరియైన సమయంలో అల్లా ఆయన్ని రిలీజ్ చేస్తాడనీ, ఆయనొచ్చి ప్రపంచాన్ని ఇస్లాంమయంగా మారుస్తాడనీ వాళ్ళ నమ్మకం. అప్పటినుంచీ ఆయన మళ్ళీ వస్తాడని వాళ్ళంతా చకోరపక్షుల్లా ఇంకా ఎదురు చూస్తూనే ఉన్నారు. షియా ముస్లిములలో ఇదొక నమ్మకంగా ఈనాటికీ కొనసాగుతూ ఉంది. ఆయన అడ్రస్ మాత్రం కనిపించటం లేదు.

హిందువుల్లో అయితే అధర్మం బాగా పెరిగిపోయినప్పుడల్లా భగవంతుడు అవతార రూపంలో వచ్చి కాపాడతాడని నమ్మకం గట్టిగా ఉంది. మనకి మహనీయులు మహాత్ములు చాలరు. సాక్షాత్తూ భగవంతుడే దిగి వస్తే గాని మనం సాగిస్తున్న అధర్మానికి అడ్డుకట్ట వెయ్యలేడు. మన అధర్మం లెవెల్ ఆ స్థాయిలో ఉంటుంది. అందుకేనేమో స్విస్ బాంకు లో అందరికన్నా మన భారతీయుల ఖాతాలే ఎక్కువట. చెప్పేదొకటి చేసేదొకటి అనే విషయంలో పోటీ పెడితే భారతీయులే ప్రపంచం మొత్తానికీ ప్రధమస్థానం లో ఉన్నారట కూడాను.

అదలా ఉంచితే, అధర్మం పెరిగినప్పుడల్లా దేవుడే వచ్చి దాన్ని అంతం చేస్తాడు అనే నమ్మకానికి భగవద్గీతా శ్లోకం ఒకటి ఆధారంగా ఉంది. అంటే, భగవంతుని అవతారం రావాలంటే మనవంతుగా మనం అధర్మాన్ని గట్టిగా పెంచి పోషించాలన్నమాట. రకంగా చూస్తే, మన సమాజం సరియైన దారిలోనే సాగుతున్నట్లు కనిపిస్తున్నది. పైగా దీంట్లో ఇంకొక వెసులుబాటు కూడా ఉంది. అధర్మాన్ని అంతం చెయ్యటం మన పని కానే కాదు. అది భగవంతుడి పని. దాన్ని బాగా పెంచి పెంచి తీవ్ర స్థాయికి చేర్చడమే మన పని. తరువాత విషయం చూసుకోటానికి దేవుడెలాగూ ఉన్నాడు. మనం పెంచే అధర్మాన్ని తుంచటం తప్ప ఆయనకీ వేరే పనీ పాటా ఏముంది గనక.

భగవంతునికి
తన భక్తులకన్నా, విరోదులంటేనే ఎక్కువ ఇష్టమట. రావణుడు, హిరణ్యాక్ష, హిరణ్యకశ్యపుల వంటి మహా రాక్షసులు వైరభక్తితో ఆయన్ను కలలో కూడా మరిచిపోకుండా నిత్యం స్మరిస్తూ ఆయన సాన్నిధ్యాన్ని మామూలు సాదాసీదా భక్తులకంటే త్వరగా చేరుకున్నారట. బైబిల్లోని ప్రాడిగల్ సన్ కధకూడా ఇదే పాయింటుని నొక్కి చెబుతుంది. అంటే, నేడు వార్తల్లోని ప్రముఖ అవినీతిపుంగవులూ, నేరచరిత్రాఘనులూ అందరూ భగవంతుని ప్రియ భక్తులని, ఋషులనీ మనం అర్ధం చేసుకోవాలి. మన అజ్ఞానంవల్ల , వాళ్ళ బృహత్ ప్రణాళిక మన బుర్రకు ఎక్కటం లేదు. అధర్మాన్ని బాగా పెంచడం ద్వారా భగవంతుని రాకడకు సర్వం సిద్ధం చేస్తున్న మహర్షులు వీరంతా అని మనం నమ్మాలి.

పాపం, బౌద్ధులు కూడా దీనికి అతీతులు కారు. బౌద్ధం అనాత్మవాదం. వారు ఆత్మ ఉన్నదని నమ్మరు. కాని పునర్జన్మను నమ్ముతారు. అదేమి వింతో తెలియదు. ఆత్మ లేనప్పుడు మరి పుట్టేదేమిటి అంటే, వారివద్ద సమాధానం లేదు. " మైత్రేయ " అనే అవతారంగా బుద్ధుడు మళ్ళీ పుడతాడని గత రెండువేల అయిదువందల సంవత్సరాలనుంచీ (?) బౌద్ధులు ఎదురు చూస్తూనే ఉన్నారు. ఆయన జాడా జవాబూ మాత్రం ఇంతవరకూ ఎక్కడా లేదు.

కల్కి అవతారం వస్తుందని హిందువుల నమ్మకం. ఆయన గుర్రాన్నేక్కి కత్తి ఝుళిపిస్తూ వస్తాడని ఒక నమ్మకం. విమానాలూ, రాకెట్లూ, గైడెడ్ మిస్సైళ్ళూ, ఆటం బాంబులూ ఉన్న ఈ కాలంలో గుర్రమెక్కి కత్తిచేత బట్టుకొని వస్తే ఏం ఉపయోగం ఉంటుంది? ఇదంతా పురాణకాలంలో వాళ్ళు ఊహించుకున్న కల్పన అనీ, ఆ కాలానికి గుర్రమూ కత్తీ గొప్ప ఆయుధాలు గనక అలా ఊహించారు, కాని అది నిజం కాదు అన్న వాస్తవం మనం ఎప్పుడు గ్రహిస్తామో ఏమో? అదలా ఉంచితే -- ఈ లోపల, సందట్లో సడేమియా అంటూ, కల్కి అవతారం నేనే అని చెప్పి కొందరు స్వాములు చక్కగా కోట్లు వెనకేసుకోవడం మాత్రం స్పీడుగా జరిగిపోయింది.

ఒకసారి పోయిన వ్యక్తి మళ్ళీ రావడం అసాధ్యం అని జనాలందరూ ఎప్పుడు అర్ధం చేసుకుంటారో భగవంతునికే తెలియాలి. ఒకవేళ వచ్చినా అదే వేషంలో రావటం అసంభవం. ఇప్పటివరకూ అలాటి దాఖలాలు ఎక్కడా లేవు. వచ్చిన వ్యక్తిని ఆయన పాత భక్తులు గుర్తు పట్టటమూ అసంభవమే. చాలా సార్లు కొత్త వ్యక్తి తన పాత భక్తుల చేతిలోనే పరాభవానికి గురవడం జరుగుతుంది. అదే సృష్టి వింతల్లో ఒకటి.

జనాన్ని ఉద్దరించాలనుకోవటం మహనీయుల గ్రహచారం. మహనీయుడు మళ్ళీ మళ్ళీ పుట్టాలని కోరుకోవటం జనాల అజ్ఞానం. పిచ్చి లోకాన్ని దేవుడే మళ్ళీ మళ్ళీ పుడుతూ ఉద్దరిస్తూ ఉండాలి.

నిజంగా ఉద్దరించబడాలని తపన ఉన్నవాడు ఏదో అవతారం వస్తుందనో, మహనీయులు మళ్ళీ పుడతారనో ఎదురుచూస్తూ సమయాన్ని వ్యర్ధం చెయ్యడు. తాను వచ్చిన పని మౌనంగా పూర్తి చేసుకుంటాడు. ఇప్పటికే టన్నుల కొద్దీ ధార్మిక బోధలు ప్రపంచమంతా ఉన్నాయి. వాటిలో కొన్నైనా అనుసరిస్తే చాలు. ఏ మహానీయుడూ అవసరం లేదు. కాని నిజాలు ఎవరిక్కావాలి? మన పిచ్చి నమ్మకాలే మనకు శ్రీరామరక్ష.

సత్య సాయి పోయీ పోక ముందే అక్కడెక్కడో ఇద్దరు పిల్లలు పుట్టారని, వాళ్ళ రూపంలో ఆయనే మళ్ళీ పుట్టాడని, ఆ పిల్లలకు పూజలు మొదలు పెట్టారట. ఈ భయానక పిచ్చికి అంతం లేదేమో అనిపిస్తుంది. ఇక్కడేమో ఆకాశంలో చంద్రుడు కనిపించాడని భక్తులు గుడ్డలు చించుకుంటున్నారు. చంద్రుడు ఆకాశంలో కనిపించక, నేలమీద కనిపిస్తాడా? చాలా సార్లు పగలు కూడా చంద్రుడు ఆకాశంలో ఉంటాడు. కనిపిస్తాడు. అదేమీ ప్రపంచ వింత కాదు.

ఓ మహానీయుల్లారా. వింటున్నారా? త్వరగా పుట్టండి మరి. మీ భక్తులు మీకోసం సుత్తీ మేకులూ పట్టుకొని ఎదురు చూస్తున్నారు. ఏంటీ? మమ్మల్ని చూస్తె మీకు భయమేస్తోందా? ఈ పాడు లోకానికి రావాలని లేదా? అదా అసలు సంగతి. డామిట్. కధ అడ్డం తిరిగిందే. ఇప్పుడెలా?
read more " ఆయన త్వరగా వచ్చుచున్నాడు "

19, ఏప్రిల్ 2011, మంగళవారం

శని కుజుల ప్రభావం - తప్పిన దేశాల అంచనా- పునరాలోచన

ఏప్రిల్ ఏడవ తేదీన వ్రాసిన పోస్ట్ ప్రకారం,15 నుంచి 18 తేదీల లోపు ప్రకృతి విలయాలు, దుర్ఘటనలు జరగాలి. గత మూడు రోజుల నుంచి జరుగుతున్న సంఘటనలు చూస్తె ఇది నిజమైందని తేలుతుంది. కాని ప్రదేశాల గురించి చేసిన ఊహ మాత్రం ఘోరంగా గురి తప్పింది. అమెరికాలో తోర్నడోలు ( సుడిగాలులు) సృష్టించిన విలయం, ప్రస్తుతం టెక్సాస్ లో లక్షల ఎకరాలు అగ్నిలో తగలబడుతున్న వైనం, ఇంకా ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న అగ్ని ప్రమాదాలూ చూస్తే, "టైం విండో" వరకూ జోస్యం నిజమైన విధానం తెలుస్తుంది. ఇవే కాక మన దేశంలో చూద్దామంటే, గుంటూరులో కోల్డ్ స్టోరేజి తగలబడి కూలిపోయిన ఘటనా, ముంబై-ధిల్లీ రాజధాని ఎక్స్ప్రెస్ లో అగ్నిరగిలి మూడు బోగీలు కాలిపోవటం, భీమ్లీలో అగ్ని ప్రమాదం ఇలాటి చిన్న చిన్న సంఘటనలు ( అంటే నా ఉద్దేశం ఇవి చిన్న సంఘటనలు అని కాదు, అంతర్జాతీయంగా ప్రభావం చూపనివి అని మాత్రమె నా భావన) చాలా జరిగాయి. ఘటనలన్నింటి లోనూ వాయువు, అగ్ను పాత్ర స్పష్టంగా కనిపిస్తుంది. జ్యోతిష్య పరంగా శని కుజుల సమసప్తక స్థితివల్ల ఎంత విధ్వంసం జరుగవచ్చో, గ్రహస్థితుల వల్ల భూమ్మీద ఎలాంటి విలయాలు జరుగవచ్చో, సంఘటనలు అద్దం పడుతున్నాయి.

మేదినీ జ్యోతిష్యం లో స్థూలంగా రెండు అంశాలు ప్రధాన పాత్ర వహిస్తాయి. ఒకటి - ఆయా సంఘటనలు ఎప్పుడు జరుగుతాయో ఊహించటం. రెండు- అవి ఎక్కడ జరుగవచ్చో ఊహించడం. ఒకటి టైం విండో. రెండవది లొకేషన్ విండో. రెంటిలో, సమయాన్ని చాలా సార్లు ఖచ్చితంగా ఊహించగలిగినా, ప్రదేశాన్ని ఊహించడంలో మాత్రం చాలాసార్లు నాకు గురి తప్పింది. అయినా పరవాలేదు. ఎడిసన్ బల్బును కనుక్కోవడానికి వేలసార్లు ప్రయత్నించి చివరికి విజయం సాధించాడు. అలాగే ప్రయత్నంలో కూడా చివరకు గెలుపు దక్కక మానదు. ఏ రీసెర్చి అయినా ఇలాగే సాగుతుంది. ఓడిపోయిన ప్రతిసారీ ఓటమికి కారణాలను విశ్లేషించడం, వాటి సాయంతో తిరిగి ముందుకు పురోగమించడమే ఎందులోనైనా విజయం సాధించడానికి మార్గం. అప్పుడే విజయంలోని తీపి, అనుభవం లోకి వస్తుంది.

దేశాలను, ప్రదేశాలను ఊహించడంలో, మన జోస్యంలో ఎక్కడ పొరపాటు జరిగిందో విశ్లేషిద్దాం.

శని కుజులున్న కన్యా మీన రాశులను ప్రాతిపదికగా తీసుకుని అవి సూచిస్తున్న దేశాలలో దుర్ఘటనలు జరుగవచ్చు అనుకున్న ఊహ తప్పు అని తేలింది. రెండు సమానమైన, విధ్వంసకర శక్తి గల గ్రహాలు ( ప్రస్తుత స్థితిలో శని కుజులు) పరస్పరం ఎదురెదురుగా ఉన్నపుడు వాటి ప్రభావం రెండు రాశులు సూచిస్తున్న ప్రదేశాల పైన ఉండదు, కారణం ఏమంటే శక్తి పరస్పరం వెనక్కు తిప్పికొట్ట బడుతుంది. మరి విధ్వంశకరశక్తి ఎక్కడికి పోతుంది అని చూస్తే ఒక కొత్త సూత్రం కనిపిస్తున్నది. శని యొక్క దశమ దృష్టీ, కుజుని చతుర్ధ దృష్టీ కలిసి ఒకేసారి మిధున రాశి పైన పడుతున్నది. మిధున రాశి అమెరికాకు సూచిక అని జ్యోతిష్కులకు తెలిసిన విషయమే. కనుకనే దారి మళ్ళించబడిన శక్తివల్ల కన్యా రాశికి చెందిన దేశాలూ, మీన రాశికి చెందిన దేశాలూ రక్షించబడి, దాని ప్రభావం వల్ల మిధున రాశికి సూచికలైన నార్త్ అమెరికాలో సుడిగాలులు, టెక్సాస్ లో భీకర అగ్ని ప్రమాదం జరిగాయి అన్న కొత్త విషయం వెలుగు చూస్తున్నది. సూత్రాన్ని ముందుముందు చెప్పబోయే మేదినీజోస్యాలలో ఉపయోగించుకోవడం జరుగుతుంది.

ఇకపోతే ఇదే సమయంలో, మన దేశంలో మతాచార్యులకు సంబంధించి ఒక దుర్ఘటన జరుగవచ్చు, దానివల్ల ప్రజల మనస్సులకు బాధ కలుగవచ్చు అనుకున్నాం. అలాగే, పదిహేనోతెదీన వచ్చిన ఒక పత్రికాకధనం వల్ల సత్య సాయి భక్తులందరూ తీవ్ర మనోవేదనకు గురవడం జరిగింది. దాని ఫలితంగా గందరగోళం ఏర్పడి ప్రభుత్వ చర్యలూ, స్వచ్చంద సంస్థల వ్యాజ్యాలూ మొదలు కావడం అయిదు రోజులుగా గమనిస్తున్నాం. ఈ సంఘటనలు కూడా ముందే మనం ఊహించిన సమయంలోనే జరగడం గమనార్హం.

ఇకపోతే, కొన్ని వివరాల ప్రకారం 4 -10 -1929 అనేది బుక్కపట్నం స్కూల్ రికార్డ్ ప్రకారం బాబాగారి పుట్టిన తేదీ. ఈ తేదీకి ఆయన లగ్నం కన్య అవుతుంది. సమయానికి ఆయన జాతకంలో రవి 17 , బుధుడు 26 డిగ్రీలలో ఉన్నారు. దీని ప్రకారం , తేదీ గనక ఆయన నిజమైన జనన తేదీ అయితే, ఏప్రియల్ 22 -26 మధ్య ఆయనకు ప్రమాద కాలం అని కనిపిస్తున్నది. సమయంలో ఆయన ఆరోగ్య పరిస్తితి దిగజారే అవకాశాలున్నాయి.

read more " శని కుజుల ప్రభావం - తప్పిన దేశాల అంచనా- పునరాలోచన "

9, ఏప్రిల్ 2011, శనివారం

అవినీతి వ్యతిరేక ఉద్యమం

ఇండియాలో అవినీతి వ్యతిరేక ఉద్యమమా? ట్రాష్. ఇట్ విల్ నెవర్ సక్సీడ్.

ఒక విదేశీమిత్రుడు నిన్న చాట్ లో నాతో అన్నమాటలివి. విదేశీయులకు మనదేశ వ్యవస్థ మీద ఎంత గొప్ప అభిప్రాయం ఉందో ఈ మాట కళ్ళకు కడుతోంది. ఒకరకంగా అది నిజమేనేమో అనిపిస్తున్నది. మన దేశంలో అవినీతి అన్ని స్థాయిలలో పాతుకుపోయింది. ప్రస్తుత సమాజంలో "నీతి"- "అవినీతి" అన్న పదాలకు అర్ధాలు లేవు. ఏదో విధంగా పని అయితే చాలు. అడ్డగోలుగా సంపాదిస్తే చాలు. అలాటివాడే మొనగాడు అన్న భావన సమాజంలో జీర్ణించుకుపోయింది. ఈ భావనకు చదువురానివాళ్ళూ, చదువొచ్చినవాళ్ళూ అన్న తేడా లేదు. వ్యాపారులూ, ఉద్యోగులూ అన్న భేదం లేదు. సామాన్యులూ, ధనికులూ అన్న విఛక్షణ లేదు. అంతలా సమాజంలోని అన్ని స్థాయిలలోనూ అనివీతి విస్తరించింది.

పాలకులు నీతిమంతులై ఉండాలి. ధర్మపరంగా ప్రజలను పాలించాలి. ఇది ప్రాచీన రాజ్యాలకాలపు నియమం. లేదా కనీసం ప్రజలన్నా నీతిమంతులై ఉండాలి. ఇక నవీన ప్రజాస్వామ్య దేశాలలో ప్రజలే పాలకులు కనుక ప్రజలకు అక్షరాస్యతా, సామాజిక స్పృహా, దేశ భక్తీ, నిజాయితీలు ఉండాలి. మనదేశంలో ఇవేవీ లేవు. ఎక్కడో ఒక "అన్నా హజారే" లాటివాళ్ళు గళం విప్ఫుతూ అప్పుడపుడూ కనిపిస్తారు. వారికి వత్తాసుగా ఒక అయిదుగురో పదిమందో ఉంటారు. సముద్రమంత నీటిలో పది పాలచుక్కలుంటే సరిపోతుందా? ఆ నీటి ఉప్పదనం పోతుందా? అసంభవం. అన్నా హజారే ఉద్యమానికి అవినీతి పార్టీలూ, నాయకులూ, బడా వ్యాపారవేత్తలూ, అధికారులూ కూడా లోపల్లోపల ఏడుస్తూ బయటకు తెచ్చి పెట్టుకున్న నవ్వు నవ్వుతూ మద్దతు పలకడం వింతల్లో వింత. ఆయనకు వత్తాసుగా ప్రతిజ్ఝలు చేస్తున్నవారంతా నిజంగా అవినీతివ్యతిరేకులే అనుకోవడం, చిరంజీవి సభలకు వచ్చిన జనమంతా ఓట్లేస్తారనుకున్నట్లు ఉంటుంది.

ఏదైనా విపత్తు ఎదురైనప్పుడు నాయకులు టీవీల్లో కొచ్చి " మీరంతా త్యాగాలు చెయ్యడానికి సిద్ధంగా ఉండాలి" అని ప్రజలకు గొప్ప సందేశం ఇస్తూ ఉంటారు. దీన్ని మించిన జోక్ ఇంకోటి ఉండదు. ప్రజలేమో త్యాగాలు చేస్తూ ఉండాలి. అధికారులూ, నాయకులూ ప్రజాధనంతో జల్సాలు చేస్తూ ఉంటారు. త్యాగాలు ప్రజల వంతు. భోగాలు నాయకుల వంతు. చాలా బాగుంది. అందుకే ప్రజలు కూడా బాగా గారడీ నేర్చుకున్నారు. యధారాజా తధాప్రజా అని ఊరకే అనలేదు. నేడు ప్రజలలో ఎవరూ త్యాగాలు చెయ్యడానికి సిద్ధంగా లేరు. ఆదర్శాలకు పోయి అలా చేసినందువల్ల నష్టపోయేది మనమే అన్న స్పృహే దానికి కారణం. పక్కవాడు అవినీతితో ఎడాపెడా సంపాదిస్తూ, పలుకుబడి పెంచుకుంటూ, సమాజంలో దర్జాగా తిరుగుతుంటే, మనం ఆదర్శాలకు పోతే చేతికి మిగిలేది చిప్పే అని ఎవరినడిగినా చెప్తారు. ఇది చేదునిజం. ఈ పరిస్థితి వాంచనీయం కాకున్నా, మనం ఏమీ చేయలేని స్థితికి సమాజంలో అవినీతి పెరిగిపోయింది అన్నది వాస్తవం. ప్రతివాడూ, తానుతప్ప అందరూ నీతిగా ఉండాలని భావించడం వల్లా, నాయకులు ఎడాపెడా అవినీతిని ప్రోత్సహించడం వల్లా, అవినీతి సంపాదనకు సమాజం గౌరవం ఇవ్వడం వల్లా, ఈ అద్వాన్నస్థితి వచ్చింది.

పాలకుల నీతిని చూచీ , చట్టానికి భయపడీ , సామాన్య ప్రజలు నీతిని అనుసరిస్తారు. ఇది ప్రకృతి సహజం. కాని మన దేశంలో, కొద్దోగొప్పో సామాజిక స్పృహ మిగిలిఉన్న ప్రజలు, అవినీతి పాలకులకు బుద్ది చెప్పే దిశగా ఉద్యమిస్తూ ఉండటం, "బండి గుర్రాన్ని లాగుతోంది" అన్న సామెతకు అద్దం పడుతోంది. మొన్నీ మధ్యన ఒక ప్రజాప్రతినిధిని మర్యాదపూర్వకంగా నేను కలవాల్సి వచ్చింది. మాట్లాడిన అరగంటసేపూ, ఆయన ఆలోచనలూ మాటలూ " వ్యాపారం" దానివల్ల వచ్చే "లాభం" అన్న ఈ రెండు అయిడియాల మధ్యనే తిరుగుతూ ఉండటం చూచి నాకు నిస్పృహ అనిపించింది. ప్రజాసమస్యలపట్ల ఆయనకు ఇసుమంత కూడా ఆలోచన లేకపోవడం ఆశ్చర్యాన్ని కలిగించింది.

ఇటువంటి నాయకులు లోక్ పాల్ బిల్లును తూట్లు పొడవకుండా బతకనిస్తారా? అన్నది అనుమానమే. ఎందుకంటే, ఇంతకు ముందొచ్చిన కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్టూ, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్టూ పెద్దగా సక్సెస్ అయినట్లు కనిపించవు. కుళ్ళిపోయిన ఈ వ్యవస్థను బాగుచేసుకునే క్రమంలో ఇంకా మంచిమంచి యాక్టుల్ని సాధ్యమైనంత "పిల్ఫర్ ప్రూఫ్" గా తయారుచేసుకోవడంలో ప్రయత్నాలు చేసుకుంటూ పురోగమించడమే ప్రస్తుతానికి మన గతి.

పెరుగుట విరుగుట కొరకే అన్న సామెత అవినీతికి కూడా వర్తిస్తుంది. చాలా దేశాల్లో అలా జరిగింది. మన దేశంలో అయితే, స్వాతంత్ర్యం వచ్చిన దగ్గర్నుంచీ అవినీతి కాలక్రమేణా పెరిగిపోతూ నేడు విశ్వరూపం దాల్చి భరించలేనంత స్థాయికి పెరిగింది. అందుకే సర్వత్రా నిరసన వ్యక్తం అవుతున్నది. అయితే మన సమాజంలో, నిరంతర జాగరూకతతో ఒక ప్రక్షాళనప్రక్రియను చాలాకాలం కొనసాగించిన దాఖలాలు ఇప్పటిదాకా లేవు. మనది ఆరంభశూరత్వం మాత్రమేననీ, మాటలు చెప్పినంత శ్రద్ధ మన వాళ్లకు చేతల్లో ఉండదనీ , గతం లో ఎన్నోసార్లు రుజువైంది.

అటువంటి నిరంతరజాగరూకతను పెంపొందించుకోనంతవరకూ, వ్యక్తిగత జీవితంలో త్యాగాలకు సిద్ధపడి, అవినీతిని అన్ని స్థాయిలలోనూ ప్రతివారూ ప్రతిఘటించనంతవరకూ, ఇటువంటి బిల్లులు ఎన్నొచ్చినా ఉపయోగం ఉండదు. ఎన్ని పదునైనకత్తులు తయారుచేసి చేతికిచ్చినా, కత్తిని వాడాలి అన్న స్పృహ రానంతవరకూ, ఎలావాడాలో తెలియనంతవరకూ, ఉపయోగం ఉండదు. ఆలోచనావైఖరిలోనూ, ఆదర్శాలస్థాయిలోనూ ఔన్నత్యం లేనంతవరకూ సమాజం మారదు. ప్రజలలో అవినీతి అనేది "యాక్సెప్టెడ్ ఐడియాలజీ" అవుతున్నప్పుడు ఎవరేం చేయగలరు?
read more " అవినీతి వ్యతిరేక ఉద్యమం "

7, ఏప్రిల్ 2011, గురువారం

ఏప్రిల్ 17

ఏప్రిల్ 17 పౌర్ణమి ఘడియలు ప్రవేశిస్తున్నాయి. పౌర్ణమీ అమావాస్యలు ప్రతి నెలా వస్తూనే ఉంటాయి.అందులో వింతేముంది. ప్రతిసారీ విశేషాలు జరగవు కదా అనుకోవచ్చు. అది నిజమే. కాని సారి కొన్ని దుర్ఘటనలు జరుగవచ్చు అనడానికి కొన్ని సూచనలు బలంగా కనిపిస్తున్నాయి.

>
>>ఏప్రిల్ పదిహేనో తేదీన రవి మేష రాశిలోకి ప్రవేశిస్తున్నాడు.
>
>>పదిహేడో తేదీన ధనూరాహువు మేషసూర్యునితో ఖచ్చితమైన పంచమ కోణదృష్టి కలిగి ఉన్నాడు.
>>> పదిహేను
నుంచి పద్దెనిమిది మధ్యలో, నవాంశ చక్రంలో రవి రాహువులు, చంద్ర కేతువులు కలిసి ఉన్నారు.
>>> పదిహేడో తేదీన
వక్ర శనికి చంద్రుడు రెండు డిగ్రీల దూరంలో కన్యా రాశిలో ఉన్నాడు.
>>> అదే రోజున కుజుడు మీనరాశినుంచి, కన్యా రాశిలోనున్న శనికి ఖచ్చితమైన సమసప్తకం లో ఉన్నాడు.

కనుక సమయంలో దుర్ఘటనలు జరగడానికి అవకాశం బలంగా ఉంది. అవి రకంగా ఉండవచ్చు? అనే విషయం కొంత ఊహిద్దాం. కుజుడు అగ్నితత్వ గ్రహం, కనుక జల తత్వ రాశి అయిన మీనంలో అతనికి సుఖంగా ఉండదు. కనుక సముద్రంలో అలజడి కలుగవచ్చు. భూతత్వ రాశి అయిన కన్యలో, వాయు తత్వ గ్రహమైన శనీ, జల తత్వగ్రహమైన చంద్రుడూ అతి దగ్గరగా ఉండటం వల్ల, సముద్రంలో తుఫాను సూచితం అవుతున్నది. లేదా భూకంపాలు, అగ్ని ప్రమాదాలు, జల వాయుయాన ప్రమాదాలు కూడా సూచితములే. శని సామాన్యజనానికి, చంద్రుడు సెంటిమెంట్ కూ, కుజుడు గొడవలకూ కారకులు గనుక ప్రజా ప్రతిఘటనలూ, తిరుగుబాట్లూ కూడా జరుగవచ్చు.

మీనరాశి దేశాలను సూచిస్తుంది:--Egypt, Normandy, North Africa, Portugal, Samoa, Scandinavia

కన్యారాశి దేశాలను సూచిస్తుంది:--Brazil, Greece, Switzerland, Turkey, Crete, Uruguay, West Indies.

కనుక, శని కుజుల సమసప్తక స్థితి వల్ల, దేశాలలో గొడవలు, ప్రమాదాలు, దుర్ఘటనలు జరిగే అవకాశం ఉంది. వీటిలో కూడా ఈజిప్ట్, పోర్చుగల్, బ్రెజిల్, గ్రీస్, టర్కీ, వెస్ట్ ఇండీస్ లలో సంఘటనలు జరుగవచ్చు.

ఇక పొతే, భారతదేశపు రాశి అయిన మకరం నుంచి ధర్మాచార్యులను సూచిస్తున్న నవమం అయిన కన్యలో శని చంద్రుల స్థితి కలుగుతున్నందున, అదీ మనకు స్వాతంత్రం వచ్చిన వృషభ రాశికి పంచమం లో ఉన్నందున, మన దేశంలో మతాచార్యులకు సంబంధించి ప్రజలకు మనో వేదన కలిగించే ఒక దుర్ఘటన జరుగవచ్చు. సంఘటనలు ఏప్రియల్ 15 నుంచి 18 లోపు జరిగే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి.
read more " ఏప్రిల్ 17 "

6, ఏప్రిల్ 2011, బుధవారం

సత్యసాయి భక్తులూ విమర్శకులూ దొందూ దొందే

సత్యసాయిబాబా అనారోగ్యంతో ఐసీయూలో ఉన్న సమయంలో ఆయన భక్తులూ విమర్శకులూ చేసిన చేష్టలతో వీరిద్దరి స్థాయీ ఒకరికంటే ఒకరికి పెద్ద తేడాగా ఏమీ లేదని స్పష్టమైంది. భక్తులేమో ఆయన ఆరోగ్యం బాగుపడాలని నవగ్రహ హోమాలూ, సర్వదేవతా పూజలూ, యాగాలూ నిర్వహించారు. నవగ్రహాల కంటే, దేవతలకంటే ఆయన అధికుడని, దేవుడని ఇప్పటిదాకా భావించినవారే, మరి ప్రస్తుతస్తితిలో మళ్ళీ అదే గ్రహాలను, దేవతలను, ప్రార్ధించటం ఏదోగా ఉంది. అంటే ఆయన మీద ఆయన భక్తులకే విశ్వాసంలేదన్నమాట. ఇక విమర్శకుల స్తితి చూద్దాం. శరీరం దాల్చిన తర్వాత ఎంతటి మహానుభావుడైనా సరే అనారోగ్యాలు బాధలు తప్పవు. రామ,కృష్ణాది అవతారమూర్తులే అనేక బాధలు పడ్డారు. బాధలు పడినంత మాత్రాన వాళ్ళ స్థాయికి భంగం ఏమీ రాదు. ఇక సత్యసాయికి అయితే, జనం అనుకుంటున్నంత స్థాయి లేదని చాలామంది అంటారు. ఇంత చిన్న విషయం మర్చిపోయి, ఆయన దేవుడైతే ఇలా ఆస్పత్రి పాలుకావడం ఏమిటి అని విమర్శించటంఅవగాహనా రాహిత్యాన్ని చూపిస్తున్నది. మొత్తమ్మీద, భక్తులకు విశ్వాసమూ లేదువిమర్శకులకు ఆధ్యాత్మిక అవగాహనా లేదు-- ఈ ఇద్దరూ ఒకగూటి పక్షులే-- అన్న సంగతి స్పష్టం.
read more " సత్యసాయి భక్తులూ విమర్శకులూ దొందూ దొందే "

4, ఏప్రిల్ 2011, సోమవారం

ఉగాది గ్రహస్తితులు-2011

పోయినేడాది వికృతి నామ సంవత్సరంలో ప్రకృతి వికృతిగా మారిఅల్లకల్లోలాలు సృష్టించింది. ఇప్పుడు ఖరనామ సంవత్సర ఉగాది వచ్చింది. ఏడాది ఖర నామ సంవత్సరంలో అందరివీ గాడిదబతుకులూ గాడిదచాకిరీ అవబోతున్నది. ప్రాచీనులు పేర్లను ఎంతపరిశీలనతో ఎంత రీసేర్చితో పెట్టారో ఆలోచిస్తే ఆశ్చర్యం కలుగుతుంది. మొత్తం మీద పేర్లు సంవత్సరం లో జరుగబోయే సంఘటనలను సూచిస్తూ ఉంటాయి. ఇది చాలా సార్లు నిజం కావటం చూడవచ్చు.

సంవత్సరం
నిపిస్తున్న కొన్ని గ్రహయోగాలు ఏమంటే, మొదటగా, లగ్న దశమాధిపతి గా గురువు లగ్నంలో ఉన్నప్పటికీనవాంశలో నీచస్తితిలో ఉండటం వల్ల పాలకులు రుజుస్వభావంతో న్నట్లు కనిపించినప్పటికీ నిజానికి అలా ఉండరు. వారి అజెండావేరుగా ఉంటుంది.

రెండవది , కేంద్రాలన్నీ పాపాక్రాంతములు కావటం వల్ల సమాజంలోధర్మం అనేది అతి క్షీణ స్థాయిలో ఉంటుంది. ప్రతివారూ చెప్పేదొకటిచేసేదొకటిగా వ్యవహారం నడుస్తుంది. అవినీతి తారాస్తాయికి చేరుతుంది. చెప్పేవి శ్రీరంగ నీతులు దూరేవి ఏవో గుడిసెలు అన్నట్లు ప్రజల ప్రవర్తనఉంటుంది. దేవుడు మన చేతిలో కీలుబొమ్మ, నిత్య జీవితంలో మన ప్రవర్తనలు ఎలాఉన్నా పరవాలేదు, శనివారంనాడు దీపం పెట్టి కొబ్బరికాయ కొడితే చాలు అన్న అజ్ఞానధోరణి ప్రజల్లో ప్రబలుతుంది. కలిధర్మం విశ్వరూపం దాలుస్తుంది.

మూడవది, చతుర్ధ సప్తమాదిపతిగా బుధుని నీచ స్తితి వల్ల సుఖ సంతోషాలు లోపిస్తాయి. కాని శుక్రుని ద్వాదశస్తితివల్ల అక్రమార్జనలు, రహస్య ఆస్తులు, అక్రమ సంబంధాలు ఊపందుకుంటాయి.

నవమాధిపతి కుజుని లగ్నస్తితివల్లా, నవాంశలో బుధ క్షేత్రం లో ఉన్నందువల్లా, మతసంబంధ విషయాలలో వితండ వాదాలు, మోసపూరిత ప్రవర్తనలు ఉంటాయి. గుళ్ళూ, చర్చిలూ, మసీదులూ కిటకిట లాడుతుంటాయి. కాని ఎవ్వరిలోనూ నీతి అనేది ఉండదు. వ్యక్తిగతజీవితానికీ నిజమైనమతానికీ మధ్యన అగాధం ఏర్పడుతుంది.

మొత్తం మీద చెప్పుకోటానికి పెద్ద గొప్పగా ఏమీ లేదు. పాలకులూ ప్రజలూ దొందూ దొందే "మేడ్ ఫర్ ఈచ్ అదర్" అన్నట్లుగా పరిస్తితి ఉంది.
read more " ఉగాది గ్రహస్తితులు-2011 "

3, ఏప్రిల్ 2011, ఆదివారం

గ్రీస్ దగ్గరలో భూకంపం

రోజు అమావాస్య.

మొన్న శుక్రవారం సాయంత్రం దాదాపు ఆరున్నర ప్రాంతంలో గ్రీస్ దగ్గరగా క్రీట్ ద్వీప పరిధిలో 6+ స్థాయిలో భూకంపంవచ్చింది. నేను ఎప్పుడూ చెబుతున్న రూల్ ను ఇది మళ్ళీ రుజువు చేస్తున్నది. ఎన్నో సార్లు రుజువౌతున్నందున రూల్ ను స్టాండర్డ్ రూల్ గా తీసుకోవచ్చు.

రిచర్డ్ నాల్ వ్రాసిన ప్రెడిక్షన్ ఏమంటున్నదో చూద్దామా........

These lesser windows include March 1-7 (surrounding the new moon on the 4th), March 23-26 (bracketing the lunar south declination peak on the 25th), and from late on the 31st on into early April.


వక్ర శని, గురువుల సంపూర్ణ సమసప్తకం కూడా దీనిని ఉత్తేజపరిచిన ఒక కారణం అని చెప్పవచ్చు. ఎక్కువ గ్రహాలుజలతత్వ రాశి అయిన మీనంలో గుమిగూడినందువల్ల సముద్రపు లోతుల్లో ప్రకంపనలు వచ్చాయని అనుకోవచ్చు. రూల్ రుజువైంది కనుక, ఇక దీనిని బట్టి ప్రాంతాలలో ప్రకృతి ప్రమాదాలు జరిగే అవకాశం ఉందొ ఏస్ట్రో మాపింగ్ విధానం ద్వారా కనిపెట్టే ప్రయత్నాలు చేస్తే బాగుంటుంది.

ప్రభుత్వాలు కూడా దీనిని ఆషామాషీగా తీసుకోకుండా, మేదినీ జ్యోతిష్య శాస్త్రాన్ని కూడా లెక్కలోకి తీసుకొని, దానినిసైన్సు కు జత చేసి, మరింత ఖచ్చితమైన ఫలితాలు రాబట్టే దిశగా ప్రయత్నాలు చేస్తే బాగుంటుంది. జ్యోతిష్యం సైన్సు కాదుఅన్న మూఢ విశ్వాసాన్ని శాస్త్రవేత్తలు, ప్రభుత్వాలు వదిలించుకోవలసిన అవసరం ఉంది.
read more " గ్రీస్ దగ్గరలో భూకంపం "