“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

25, ఫిబ్రవరి 2019, సోమవారం

వేలం వెర్రి

మనకు సైన్సు పెరిగింది, తెలివి పెరిగింది అని విర్రవీగుతున్నాం.  కానీ   ఏం   తినాలో తెలీదు.   ఎలా తినాలో తెలీదు. ఎలా బ్రతకాలో తెలీదు. ఏం చెయ్యాలో   తెలీదు. ఏం చెయ్యకూడదో తెలీదు. ప్రతిదీ, టీవీలో  ఎవడో ఒకడు మనకు చెప్పాలి. కొన్నాళ్ళపాటు అదే వేదం. ఆ తర్వాత ఇంకొకడోస్తాడు. అప్పుడు పాతవాడు చెప్పినది నచ్చదు. ఈ క్రమంలో జనాలు మతులు పోయి, ఎవడేది చెబితే అది తినడం. ఎవడేది   చెబితే అది త్రాగడం, ఎవడేది చెబితే అది చెయ్యడం వేలంవెర్రిలా తయారైంది.

పావు లీటర్ డెట్టాల్, అరలీటరు ఫినాయిలు, కొంచెం  ఎలుకల మందు బాగా కలిపి లీటరు టాయిలెట్ క్లీనర్ లో రెండు రోజులు నానబెట్టి ప్రతిరోజూ పొద్దున్నే పరగడుపున ఒక టేబుల్ స్పూన్ త్రాగండి మీ ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉంటుంది అని    టీవీలో చెబితే చాలు, పొలోమంటూ ఎగబడేవాళ్ళు వేలల్లో లక్షల్లో కనిపిస్తున్నారు. కలికాలం అంటే ఇదేనేమో ?

మన శరీరం ఏం చెబుతున్నదో మనం గ్రహించగలిగితే బయటనుంచి  ఎవడూ మనకు ఏమీ చెప్పనక్కరలేదు. ఆ తెలివిని కోల్పోయాం గనుకనే ఎవడేది చెబితే దానిని ఫాలో అవుతున్నాం.

అంటుకొర్రలు కేజీ 350 అయినా ఎగబడి కొంటున్నారంటే కొనరూ మరి? మనుషుల్లో ఎంతగా భయభ్రాంతులు పెరిగిపోయాయో తెలియడానికి ఇంతకంటే నిదర్శనం వేరే కావాలా?

ఈ గోల అంతా చూచి వ్రాసిన కొన్ని సరదా పద్యాలు చదవండి !
--------------------------------------------------
ఆ || తిండి మానివేసి తోటకూరల మెక్కి
పండ్ల రసములన్ని పట్టి ద్రావి
బోటు తొక్కుమింక బాగుగా నదియందు
ఊయలొకటి ఎక్కి ఊగుమింక

ఆ || ఎనిమ జేసుకొమ్ము ఏమార బోకుండ
పచ్చి కూరలన్ని బాగ నములు
ఉడకబెట్టినంత ఉన్మాదమే బుట్టు
కాయగూర దినుము కడుగకుండ

ఆ || కాఫి ద్రాగువాడు కాటికే బోయేను
టీలు ద్రాగినంత తిక్క బెరుగు
మానివేయ నాకు మర్యాద కాదన్న
గ్రీను టీలు ద్రాగు గింజుకొనుచు

ఆ || మొలకలన్ని దినుచు మోమాట పడకుండ
తిండి మానివేసి దేబె వోలె
నిమ్మకాయ నీళ్ళు నీటుగా ద్రాగరా
వింత పశువువోలె వెయ్యి ఏళ్ళు

ఆ || నిమ్మకాయ నీళ్ళు నిలువెత్తు గ్లాసులో
పుట్ట తేనె గలిపి పూర్తిగాను
త్రాగుచుండవలయు తేపతేపకు నీవు
ఫ్యాటు దగ్గిపోవు నీటుగాను

ఆ || జంతువేది గాని చక్కగా ఉడికించి
తినగబోదు ఎట్టి తిండినైన
నీవు కూడ అట్లె నీరసంబుగ బ్రదికి
పశువులాగ దిరుగు పట్టి పట్టి

ఆ || ఉప్పు దినెడి పశువు ఉర్విలో లేదింక
ఉప్పు దినుట పెద్ద తప్పు గాదె?
ఉప్పు మానివేసి ఊరగాయలు రోసి
చప్పికూడు దినర చచ్చువెధవ !

ఆ || నూనె దగలనీకు న్యూలైఫు నీకందు
నూనె దినగ బెరుగు బాన పొట్ట
నూనె మానివేసి నూరేళ్ళు బ్రతకరా
నుయ్యి దూక మేలు నూనె కన్న

ఆ || ఉప్పుకారమన్న ఉరిబోసికొనినట్లు
పాలు పెరుగులన్న పాపమౌను
నూనె వాడుటన్న నూతిలో బడినట్లు
నీళ్ళు ద్రాగి బ్రతుకు నీటుగాను

అని ఒకాయన బోధిస్తాడు
-------------------------------------------------------

ఆ || ఇడ్లి పూరి యుప్మ ఇవియన్ని డేంజర్లు
తినిన యంత చచ్చి తిరిగి రావు
మాంసమొకటి బాగ మెక్కరా తిన్నంత
పగలు రాత్రి యనక పాచిపెట్టి

ఆ || ఆవనూనె దెచ్చి ఆబగా లాగించు
పొద్దుపొద్దు గానె పావుకేజి
లంచి టైములోన లిన్సీడు ఆయిల్ను
నిద్రముందు ద్రాగు నిమ్మనూనె

ఆ || నారికేళ నూనె నాటుగా లాగించు
పావుకేజి దెచ్చి పట్టుబట్టి
అర్ధరాత్రి పూట ఆముదం లాగించు
అర్ధకేజి బాగ ఆవురనుచు

ఆ || ఫిష్షు మాంసమేమొ పొద్దుపొద్దున మెక్కి
మద్దియాన్నమేమొ మటను మెక్కి
చీకటైన పిదప చికెనునే లాగించు
అర్ధరాత్రి మెక్కు అండమొకటి

ఆ || మాంసమొకటి దినగ మంచిగా బ్రతికేవు
పశువులన్ని దినును పచ్చికండ
మనిషివన్న మాట మర్చిపో నీవింక
పశువు లాగ బ్రతుకు పట్నమందు

అని ఇంకొకాయన లెక్చరిస్తాడు
--------------------------------------------------
ఆ || బియ్యమన్న మాట బెంబేలు పుట్టించు
బియ్యమన్న పెద్ద దయ్యమౌను
చిన్నగింజలన్న చేయెత్తి జైకొట్టు
చిరుల ధాన్యమందు చేవగలదు

ఆ || ఆదివారమేమొ అరికలే భుజియించి
సోమవారమేమొ సామలనుచు
కుజుని వారమందు కొర్రలే వండించి
బుధుని వారమందు ఊదలనుచు

ఆ || గురుని వారమందు గురిగింజలే వండి
శుక్రవారమేమొ సూపు ద్రాగి
మందవారమందు మోమాటమే వీడి
అంటుకొర్రలనుచు అంటకాగి

ఆ || ఒక్క వారమైన ఓర్పుగా ఇట్లుండ
ప్రక్కవారమందు పిచ్చిబుట్టి
ఆసుపత్రి లోన ఐసీయులో జేరి
శవము వౌదు వీవు చక్కగాను

ఆ || వేపకాయ రసము వేన్నీళ్ళలో వేసి
కొత్తిమీర రసము కొంత గలిపి
బచ్చలాకు రసము బాగుగా దట్టించి
మెంతికూర రసము మరగబెట్టి

ఆ || గడ్డి మోపు దెచ్చి గానుగన్ ఆడించి
దురదగొండి ఆకు దూసిపోసి
అన్ని గలిపి నీవు ఆరార ద్రావంగ
దుక్కలాంటి ఒళ్ళు దక్కు నీకు

అని మూడో ఆయన ముచ్చటగా సెలవిస్తాడు
------------------------------------------------------

ఆ || కొర్రలేమొ కొనగ కొరువులై పోయేను
సామలేమొ జూడ శోష వచ్చు
అంటుకొర్రలన్న ఆకాశమంటేను
వరిగ కొందమన్న వర్రి యౌను

ఆ || తెల్ల బియ్యమేమొ తేరగా దొరికేను
అరికెలేమొ జూడ అరుదులాయె
చిన్నగింజలమ్ము షాపులంబటి జేరి
క్యూల నిల్చి జనులు కుంకలైరి

ఆ || గుడిసెలందు జనులు గుట్టుగా భుజియించు
గింజలన్ని బాగ గీరబట్టి
మోతుబరులు కూడ మోయగా లేనంత
రేటుకెక్కె; ఏమి బూటకమ్మొ ?

ఆ || సందులోన బెట్టి సద్దులే లేకుండ
మాంస మమ్మునట్టి మటను షాపు
రోడ్డు మీద కొచ్చి రోతగా నిలిచింది
వీరబోధ గాచి వెర్రి బుట్టి

ఆ || ఎవడి సోది వాడు ఎట్లైన జెప్పేను
వినెడివాడు పెద్ద వెర్రియైన
ఎంత భయములోన ఉందిరా లోకమ్ము?
ఏమి వెర్రి? ఇంత? ఏమి వింత?

ఆ || ఒళ్ళు జెప్పుమాట ఓర్పుగా వినినంత
ఎవని మాటగాని ఎందుకింక?
నీకు తగిన ఫుడ్డు నిర్ణయించెడివాడు
నీవు తప్ప లేడు నింగినైన

ఆ || ఎవని ఒళ్ళు వాడి కెన్నెన్నొ హింట్లిచ్చు
వాని బాగ వినగ వండ్రఫుల్లు
బాడి లాంగువేజి బాగుగా గానలేక
తిక్కపనుల జనులు తిరుగుచుంద్రు
-------------------------------------------------------
తనకు పడే తిండిని మితంగా తింటూ, మితంగా వ్యాయామం చేస్తూ, అల్లోపతి మందులు వాడకుండా, దురలవాట్లు లేకుండా, దురాశ లేకుండా, వేళకు తిని వేళకు నిద్రపోతూ, సంతోషంగా ఉంటూ, క్షమించడం, నవ్వుతూ బ్రతకడం నేర్చుకుంటే టీవీ బోధకులు చెప్పేవి ఏవీ అవసరం లేదు. ఈ ఆర్ట్ తెలీకనే లోకులు ఇన్ని వేషాలేస్తున్నారు. కానీ ఏమీ ఉపయోగం ఉండటం లేదు.

మనుషుల మనసులు ఉన్నతంగా మారకుండా, ఊరకే తినే తిండి మారితే ఏం ఉపయోగం? కలియుగంలో కనిపించే అనేక మాయలలో ఇదొక మాయ గామోసు !

చూద్దాం ఈ వెర్రి వేషాలు ఎన్నిరోజులో??
read more " వేలం వెర్రి "

23, ఫిబ్రవరి 2019, శనివారం

'Warrior' - Martial Arts Short Film

నేను Fight Choreography చెయ్యగా నా శిష్యుడు లెనిన్ హీరోగా నటిస్తూ నిర్మించిన Warrior short film ను ఇక్కడ చూడండి.

ఎప్పుడో మాటల సందర్భంలో ఈ స్టోరీ లైన్ ను లెనిన్ తో అన్నాను. దాన్ని పట్టుకుని, ఒక కధను అల్లి, బెంగుళూర్ నుంచి కెమెరా మెన్ ను, కెమెరాలను తీసుకొచ్చి, సినిమా తీసి, ఆ తర్వాత బెంగుళూర్ లో ఎడిటింగ్, సౌండ్ మిక్సింగ్ చేసి, కష్టపడి ఈ సినిమాను తయారు చేశాడు లెనిన్. ఇంత శ్రమపడినందుకు అతన్ని అభినందిస్తున్నాను.



ఈ చిత్రంలో నా శిష్యుడు, కుంగ్ ఫూ మాస్టర్ రమేష్ ప్రధాన పాత్ర పోషించాడు. చిత్రంలో కూడా నా ముఖ్యశిష్యుడుగా నటించి, ఆయా సన్నివేశాలలో తను చేసిన టైగర్ స్టైల్, స్నేక్ స్టైల్, వింగ్ చున్ స్టైల్, హంగ్ గార్ స్టైల్ టెక్నిక్స్  చాలా బాగా వచ్చాయి.

సినిమా ఎలా వచ్చిందని లెనిన్ నన్ను అడిగాడు. అంతగా నాకు నచ్చలేదని చెప్పాను. ఎందుకంటే, నేను ఆశించిన స్టాండర్డ్స్ ఇందులో కనిపించలేదు. కధలో పట్టు లేదు. ఒక మాస్టర్ తో పని లేకుండా, సొంతగా అన్నీ నేర్చుకోవచ్చు అనే అహంకారధోరణి ఇందులో కనిపిస్తోంది. ఇది ఒక martial arts student కి ఉండవలసిన లక్షణం కానేకాదు. సరే,   కధ మనది కాదు. ఫైట్స్ వరకూ మనం కోరియోగ్రఫీ చేద్దాం అని అంతవరకూ చేశాను.

ఇంటిదగ్గర ఏవేవో వ్యాయామాలు చేసినంత మాత్రాన, ఒక స్కూల్ లో ఒక ఆర్ట్ లో కఠోరసాధనతో రాటుదేలిన వారిని ఓడించడం అనేది జరగని పని. ఈ సినిమా స్క్రిప్ట్ లో ఈ పాయింటే చాలా పేలవంగా అసహజంగా ఉంది.

ఈ మూవీని ఇంకా బాగా తీయవచ్చు. తృప్తి అనేది ఉంటే, అది మార్షల్ ఆర్ట్స్ లో పరిపక్వత వచ్చినట్లు కాదు. మార్షల్ ఆర్ట్ కు అంతులేదు. మార్షల్ ఆర్టిస్ట్ కు తృప్తి అనేది ఉండకూడదు. డాన్స్ లాగా, ఎంత నేర్చుకున్నా ఇంకా నేర్చుకోవలసింది అందులో ఉంటూనే ఉంటుంది. అందుకే అలా చెప్పాను. కానీ మా మొదటి Martial Arts Short Film కొంతవరకూ బాగా వచ్చిందనే చెప్పాలి.

ముందు ముందు మేము తియ్యబోయే షార్ట్ ఫిలింలు ఇంకా మంచి కథలతో, ఇంకా మంచి కొరియోగ్రఫీతో తీస్తామని చెప్పడానికి సంతోషిస్తున్నాను.

మా మొదటి Martial Arts Short Film ను చూడండి మరి !!
read more " 'Warrior' - Martial Arts Short Film "

21, ఫిబ్రవరి 2019, గురువారం

యురేనస్ గోచార ప్రభావం - మార్చ్ 2019

యురేనస్ అనే గ్రహం 1781 లో సర్ విలియం హెర్షెల్ అనే శాస్త్రజ్ఞుడి చేత కనుక్కోబడింది. అతని పేరుమీద చాలారోజులు దీనిని 'హెర్షెల్' అనే పిలిచేవారు. తరువాత గ్రీక్ పురాణాలలో ఆకాశానికి అధిపతి అయిన 'యురేనస్' పేరు పెట్టారు.

యురేనస్ అనే గ్రహం మనకు మహాభారతకాలానికే తెలుసని వాదనలున్నాయి. వాటికి రుజువులుగా, మహాభారతంలోని యుద్ధపర్వాల నుంచి కొన్ని శ్లోకాలను ఉదాహరిస్తూ ఉంటారు. వాటిల్లో శ్వేత, ధూమ, ఉపకేతు మొదలైన పేర్లతో యురేనస్, నెప్ట్యూన్, ప్లూటో మొదలైన గ్రహాలను పిలిచారని అంటారు. ఆయా వాదనలను అలా ఉంచి, ప్రస్తుత యురేనస్ పరిస్థితి ప్రపంచానికి ముఖ్యంగా మన దేశానికి ఏం చేస్తుందో గమనిద్దాం.

రాశిచక్రాన్ని ఒకసారి చుట్టిరావడానికి యురేనస్ 84 సంవత్సరాలు తీసుకుంటుంది. ఒక మనిషి జీవితకాలంలో ఇది రాశిచక్రపు ఒక పరిభ్రమణాన్ని పూర్తి చేస్తుంది. అంటే, ఒక రాశిలో ఈ గ్రహం 7 ఏళ్ళు ఉంటుంది. గతంలో, మార్చి 2011 లో ఈ గ్రహం మీనరాశినుండి మేషరాశికి మారింది. 

సాయనసిద్ధాంత రీత్యా 6-3-2019 న యురేనస్ తన వక్రగమనాన్ని, మేషరాశిలో తన సంచారాన్ని వదలి, మళ్ళీ వృషభరాశిలోకి ప్రవేశిస్తుంది. సాయన సిద్ధాంతం కూడా చక్కని ఫలితాలను, ముఖ్యంగా, దేశగోచారంలోనూ, సామూహిక పరిస్తితుల పరంగానూ ఇస్తుంది.

యురేనస్ అనేది ఈ క్రింది విషయాలపైన అదుపును కలిగి ఉంటుందని అనుభవ పరిశీలన చూపిస్తోంది.

1. ప్రజాసమూహాలలో అకస్మాత్తు మార్పులు

2.విప్లవకార్యక్రమాలు, సైనికచర్యలు, యుద్ధాలు, బాంబు దాడులు వగైరా.

3. సైన్స్ పరంగా కొత్త కొత్త మార్పులు. నూతన ఆవిష్కరణలు.

4. ప్రభుత్వాలు కూలడం, వ్యవస్థలు మారడం వగైరాలు.

ఇక, వృషభరాశి లక్షణాలు.

1. భౌతికజీవితపు విలాసాలు, సరదాలు.

2. ధనంమీద మోజు.

3. చాందస ధోరణులు, మారలేని మనస్తత్వం, బద్ధకం.

4.తను మారకుండా, ఉన్నదానిని ఉన్నట్లు ఎంజాయ్ చెయ్యాలనే ధోరణి.

5. దేశ ఆర్ధికరంగం.

6. భారతదేశానికి సూచిక.

యురేనస్ యొక్క ఈ లక్షణాలను వృషభరాశి లక్షణాలతో అనుసంధానం చేసి పరికిస్తే మనకు ఈ క్రింది సూచనలు కనిపిస్తాయి.

>> ప్రజాజీవితంలో సంఘర్షణ, ప్రభుత్వాలు కూలడం, పాత వ్యవస్థ పోయి కొత్త వ్యవస్థ రావడం.

>> సైన్స్ పరంగా, కమ్యూనికేషన్ పరంగా క్రొత్త మార్పులు.

>> ఉగ్రవాద చర్యలు. యురేనస్, పాకిస్తాన్ కు సూచిక అయిన మేషరాశిని విడచి, ఇండియాకు సూచిక అయిన వృషభరాశిలోకి అడుగుపెడుతున్న సమయంలోనే పుల్వామా ఎటాక్ జరిగింది. గమనించాలి.

>> ఆర్ధిక రంగంలో మార్పులు.

కొద్ది నెలల్లో మనదేశంలో రాబోతున్న ఎన్నికలనూ, ఈ యురేనస్ గోచారాన్నీ కలుపుకుని చూస్తుంటే, ఇండియాలో ఇప్పుడు అధికారంలో ఉన్న ప్రభుత్వాలకు గడ్డుకాలం ముందున్నదన్న విషయం స్పష్టంగా కనిపిస్తోంది.

అంతేగాక, మార్చ్ 6 తేదీన అమావాస్య అయింది, 7 న రాహుకేతువులు వారివారి రాశులు మారుతున్నారు (నిరయన సిద్ధాంతరీత్యా). గతంలో యురేనస్ ఈ విధంగా రాశులు మారిన ప్రతిసారీ ప్రపంచవ్యాప్తంగా అనేక పెనుమార్పులు - భూకంపాలు, సునామీలు, రేడియేషన్ ప్రమాదాలు మొదలైనవి - జరిగాయి.

ఉదాహరణకు - 11-3-2011 న యురేనస్ మీనరాశిలో నుంచి మేషరాశికి మారింది. అదే రోజున జపాన్ లో తొహోకు అనే ప్రదేశంలో పెద్ద భూకంపం, సునామీ వచ్చాయి. జపాన్ లో 'ఫుకుషిమా నూక్లియర్ డిజాస్టర్' అదే రోజున జరిగింది. ఇది కాకతాళీయం అని చెప్పలేము.

అయితే, మీనం నుంచి మేషానికి యురేనస్ మారడం 84 ఏళ్ళకు ఒకసారి జరిగే ఒక మేజర్ సంఘటన. ప్రస్తుతం, వచ్చేనెల 7 న జరుగుతున్నది అంత మేజర్ సంఘటన కాదు. కానీ, అదే సమయంలో వస్తున్న అమావాస్య, రాహుకేతువుల గోచారాల వల్ల దాని ప్రభావం ఖచ్చితంగా బలంగానే ఉంటుంది. అంతేగాక, ప్రపంచదేశాలమీదా, ప్రజాజీవితాల మీదా, కొన్ని దీర్ఘకాలిక ప్రభావాలు దీనివల్ల తప్పకుండా ఉంటాయి. ముఖ్యంగా మన దేశం మీద ఇంకా బలంగా ఉంటాయి.

మొత్తం మీద మార్చి 6, 7, 8 తేదీలలో ప్రపంచవ్యాప్తంగానూ, మనుషుల వ్యక్తిగత జీవితాలలోనూ అకస్మాత్తుగా చెడుమార్పులు కలిగే సూచన బలంగా ఉంది. మనుషుల జీవితాలలో అయితే, ఈ ప్రభావం అనేది, యాక్సిడెంట్లు, రోగాలు, దుర్ఘటనల రూపంలో జరుగుతుంది. ఈ మూడు రోజులలో, మనుషులు చాలా డిస్టర్బ్ అవుతారు. పిచ్చిపనులు చేసి ప్రమాదాలలో పడతారు. మాటామాటా పెరిగి అనవసరమైన గొడవలు రేగుతాయి. ఉద్రేకాలకు, పట్టింపులకు పోయి నష్టపోతారు.

ముందే చెబుతున్నా ! జాగ్రత్త వహించండి మరి !
read more " యురేనస్ గోచార ప్రభావం - మార్చ్ 2019 "

జిల్లెళ్ళమూడి స్మృతులు - 33 (తిన్న మెతుకులు)

మానవజాతే అసలు చాలా విచిత్రమైనది. అది స్వార్ధం, అపనమ్మకం, మాటలు మార్చడం, క్రమశిక్షణా రాహిత్యం అనే దినుసులతో తయారు చెయ్యబడింది. కనుక మానవులనుంచి ఏవో గొప్ప ప్రవర్తనలను ఆశించడమే చాలాసార్లు పెద్ద పొరపాటు అవుతూ ఉంటుంది. సోకాల్డ్ ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నవాళ్ళు కూడా దీనికేమీ మినహాయింపులు కారు.

ప్రవక్తలు చెప్పినదానిని  వాళ్ళ అనుయాయులే చాలావరకూ ఆచరించరు. ఆచరించకపోగా, ఆ బోధనలను తప్పుదారి పట్టిస్తూ, తప్పుగా వ్యాఖ్యానిస్తూ, తమకు కావలసినట్లుగా వాటిని మలచుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇది ప్రపంచవ్యాప్తంగా అన్నిమతాలలోనూ కొన్ని వేల ఏళ్ళనుంచీ జరుగుతోంది.

కొంతమంది జిల్లెళ్లమూడి అమ్మగారి భక్తులు నాతో ఈ మాటను చాలాసార్లు అన్నారు.

'జిల్లెళ్ళమూడిలోని అన్నపూర్ణాలయంలో మనం తినే ప్రతి మెతుకూ  మనకు ఒక జన్మను తగ్గిస్తుంది'

ఈ మాట విన్నప్పుడల్లా నాకు చాలా నవ్వొస్తూ ఉంటుంది.

'ఈ మాట ఎవరన్నారు? అమ్మ అలా చెప్పినట్లు నేనెక్కడా చదవలేదే?' అన్నాను.

'ఎవరో కొంతమంది భక్తులు అన్నట్లున్నారు'  అన్నాడు చెప్పినాయన.

ఆ మాట నన్ను ఆలోచనలో పడేసింది.

ఈ సోకాల్డ్ భక్తులకు వేరే పనీ పాటా ఏమీ ఉండదు. మహనీయులు చెప్పిన మాటలను ఆచరణలో పెట్టె పని మానేసి, వాటికి వీళ్ళ ఇష్టం వచ్చిన వ్యాఖ్యానాలు చేసుకుంటూ ఉండటమే వీళ్ళు చేస్తూ ఉంటారు. ఎందుకంటే, వాటిని ఆచరించాలంటే ఈ భక్తులు చాలా త్యాగాలు చెయ్యవలసి వస్తుంది. ఆ క్రమంలో వాళ్ళ ఈగోలు కూడా చాలా దెబ్బతింటాయి. కానీ ఆ మాటలకు ఏవేవో వీరికి  తోచిన పిచ్చి వ్యాఖ్యానాలు చెయ్యడం చాలా తేలిక, దీనివల్ల వాళ్ళ ఈగోలు బలపడటమేగాక ఏ రకమైన త్యాగాలూ చెయ్యవలసిన పని ఉండదు. కానీ ఈ  క్రమంలో ఆ మహానీయుల అసలైన బోధనలు కాలక్రమంలో వక్రీకరించబడి, కొంతకాలానికి వాళ్ళు అసలేమి చెప్పారో కూడా అర్ధంకాని స్థితికి చేరుకుంటాయి. ఇలా జరగడానికి  ఆయా  శిష్యులే ప్రధాన కారకులౌతూ ఉంటారు.

బుద్ధుని బోధనలకూ, ఇతర మహనీయుల బోధనలకూ మన దేశంలో ఇదే గతి పట్టింది. ఇక విదేశీ మతాలలో అయితే చెప్పనే అక్కర్లేదు.

అతనితో ఇలా చెప్పాను.

'నువ్వు చెబుతున్నది కరెక్ట్ కాదు. జన్మలు తగ్గడం అనేది అలా జరగదు. మనం తిన్న మెతుకుల వల్ల జన్మలు తగ్గవు. మనం ఇతరులకు పెట్టిన మెతుకుల వల్ల  జరిగితే జరగవచ్చునేమో ! అప్పుడు కూడా జన్మలేమీ తగ్గవు. మనకున్న చెడుకర్మ ఏదైనా తగ్గవచ్చు. కొంత మంచి ఏదైనా  మనకు జరగవచ్చు.  అంతేగాని జన్మలు ఎలా తగ్గుతాయి? దాని ప్రాసెస్ వేరే ఉంది. మనం అన్నం తిన్నంత మాత్రాన, అది ఎంత గొప్ప ప్రసాదమైనా సరే, జన్మలు తగ్గవు.

పైగా దీనిలో ఇంకో విషయం ఉన్నది. జిల్లెళ్ళమూడి అమ్మగారు జన్మలను ఒప్పుకోలేదు. జన్మలు లేవని ఆమె అన్నారు. ఈ విషయంలో ఎందఱో పండితులు, సాంప్రదాయవాదులు ఆమెను విమర్శించారు కూడా. అయినా సరే, ఆమె తన మాటను మార్చుకోలేదు. కనుక,అసలు  జన్మలే లేవని అమ్మ అంటుంటే, జిల్లెళ్ళమూడిలో తిన్న అన్నంలో ఉన్న మెతుకులు జన్మలను తగ్గిస్తాయని అనడం ఎంత సబబుగా ఉంటుంది? నా ఉద్దేశ్యం ఏమంటే, ఈమాటను అన్న భక్తుడికి, అమ్మ తత్త్వం అస్సలు అర్ధం కాకపోగా, మితిమించిన ఎమోషనల్ భక్తిలో ఈ మాట అన్నాడని నాకర్ధమైంది.

ప్రపంచంలోని మతాలలో జరిగిన డామేజి అయినా, హింస అయినా, వాటివాటి ఎమోషనల్ ఫాలోయర్స్ వల్లే జరిగింది. అంతేగాని శాంతంగా వాటి బోధలను అర్ధం చేసుకుని ఆచరిద్దామని ప్రయత్నించినవారి వల్ల లోకానికిగాని ఆయా మతాలకుగాని ఎటువంటి చెడూ జరుగలేదు.

'ఎమోషనల్ భక్తి చాలాసార్లు ఎందుకూ పనిచెయ్యకపోగా, ఆధ్యాత్మికంగా చాలా తప్పుదారి పట్టిస్తుంది. ఉన్న విషయాన్ని ఉన్నట్లు అర్ధం చేసుకుని ఆచరించాలి గాని, ఊరకే ఎమోషనల్ గా ఉంటే  ఏమీ ఉపయోగం లేదు. ఇది నా మాటగా ఆ మాట అన్న వ్యక్తితో చెప్పు' అని ముగించాను.

మనం పొందినవాటివల్ల మనకేమీ మేలు జరుగదు. నిస్వార్ధంగా ఇతరులకు మనం పెట్టినదానివల్లే మనకు మంచి జరుగుతుంది. అదే మన అదృష్టంగా రూపొందుతుంది. ఇది నామాట కాదు. మన సనాతనధర్మం చెబుతున్న మాట.

చెప్పిన మాటలు సరిగా అర్ధం  చేసుకోకుండా, ఆచరించకుండా, వాటికి తప్పుడు వ్యాఖ్యానాలు చేస్తూ, మళ్ళీ తమను వదలకుండా పీడించే భక్తులతో మహనీయులకు ఎంత నరకమో కదా ! బహుశా అదేనేమో వారి అనంతమైన సహనానికి, కరుణకు సంకేతం !

భక్తులలో చాలామంది ఇంతే, మైకుపెట్టి చెవిలో అరుస్తున్నా కూడా చెబుతున్నది అర్ధం చేసుకోరు. ఆధ్యాత్మికలోకంలో కూడా ఎంత అజ్ఞానం ఉందిరా దేవుడా? అనుకున్నాను.

లోకంమీదా, లోకులమీదా, అజ్ఞానపు పట్టు అంత గట్టిగా ఉంది మరి !
read more " జిల్లెళ్ళమూడి స్మృతులు - 33 (తిన్న మెతుకులు) "

17, ఫిబ్రవరి 2019, ఆదివారం

అబ్బాయి తిరిగి వస్తాడా? - ప్రశ్నశాస్త్రం

ఈరోజు మధ్యాన్నం 12-22 కి ఒకరు ఈ ప్రశ్నను అడిగారు.

'మాకు తెలిసినవాళ్ళ అబ్బాయి వేరే ఇంటికి తీసుకెళ్లబడ్డాడు. అతను తిరిగి వస్తాడా?'

ప్రశ్నచక్రాన్ని గమనించగా - లగ్నాధిపతి శుక్రుడు బాధకుడైన శనితో కలసి అష్టమంలో ఉన్నాడు. కనుక 'ఇప్పట్లో రాడు' అని చెప్పడం జరిగింది. హోరాదిపతి గురువై ఉన్నాడు. అతనే అష్టమాధిపతిగా సప్తమంలో రహస్యస్థానమైన వృశ్చికంలో ఉంటూ లగ్నాన్ని చూస్తున్నాడు. కనుక ఈమె భర్త హస్తం కూడా దీనిలో ఉందని స్పష్టంగా తెలుస్తోంది. అతనికి ఈ అబ్బాయి ఇంటికి రావడం ఇష్టం లేదనీ తెలుస్తోంది.

విషయం ఏమిటని ప్రశ్నించగా - ఈ అబ్బాయిని పదహారేళ్ళుగా పెంచుకున్నారని, ఇన్నాళ్ళ తర్వాత పెంపుడుతండ్రి ఇష్టపడకపోవడంతో, అసలు తల్లిదండ్రులు ఆ అబ్బాయిని వెనక్కు తీసికెళ్ళారనీ, పెంచిన ప్రేమను తట్టుకోలేక ఈ తల్లి అలమటిస్తోందనీ తెలిసింది.

మన:కారకుడైన చంద్రుడు రాహువుతో డిగ్రీ కంజంక్షన్ లో ఉండటం ఈమె యొక్క మనోవేదనను స్పష్టంగా చూపిస్తోంది. అదే విధంగా కర్కాటకం తృతీయం అవుతూ ఈమె చెల్లెలిని సూచిస్తూ, మకరం చెల్లెలి భర్తను సూచిస్తూ అక్కడ కేతువు శనిని సూచిస్తూ ఉండటము, లగ్నాధిపతి అయిన శుక్రునికి కేతు గురులతో అర్గలం పట్టి ఉండటము గమనించగా, ఈమె భర్తతో ఈమె చెల్లెలి భర్తకూడా తోడై ఈ అబ్బాయిని వెనక్కు పంపడంలో ప్రధానపాత్ర పోషించారని అర్ధమైంది. విచారించగా అది నిజమే అని తెలిసింది. రాహుకేతువుల వర్గోత్తమ స్థితి వల్ల, ఈమె చెల్లెలి భర్త దీనిలో చాలా గట్టి పాత్ర పోషిస్తున్నాడని చెప్పాను. అవునని అడిగిన వ్యక్తి అన్నాడు.

విషయం అర్ధమైంది గనుక ఇప్పుడు ఆ అబ్బాయి వెనక్కు వచ్చే అవకాశం ఎప్పుడుంది అన్న విషయం చూడాలి.

దశలు గమనించగా, ప్రశ్నగురు మహాదశ ఇంకా వారం రోజులుంది. ప్రస్తుతం గురు-కుజ-సూర్యదశ నడుస్తున్నది. గురువు పాత్ర చాలా గట్టిగా ఉన్నది. కుజుడు సప్తమాదిపతిగా భర్తను సూచిస్తూ ద్వాదశ స్థానసంబంధం వల్ల భర్తయొక్క రహస్య కుట్రను స్పష్టంగా చెబుతున్నాడు. సూర్యుడు చతుర్దాదిపతియై, దశమంలో, కొడుకును సూచిస్తున్న బుదునితో కలసి ఉండి, చతుర్ధాన్ని చూస్తున్నాడు. కనుక ఆ అబ్బాయికి రావాలని ఉన్నప్పటికీ రాలేని స్థితి ఉన్నదని తెలుస్తోంది.

వారం తర్వాత 57 రోజులపాటు నడిచే ప్రశ్నశని దశలో కూడా ఈ అబ్బాయి వెనక్కు రాడు. ఈమెకు మనోవేదన తప్పదు. తర్వాత 51 రోజులపాటు నడిచే బుధదశలో సాధ్యం కావచ్చు అని చెప్పాను. అంటే, ఏదైనా సరే, ఇంకొక రెండు నెలలలోపు అబ్బాయి తిరిగి వచ్చే అవకాశం లేదని చెప్పడం జరిగింది.

ఈ విధంగా, మన ఇంట్లో మనం కూర్చుని, ముక్కూ ముఖం తెలియని వారి కుటుంబం గురించి, కుటుంబ విషయాలను గురించి, ప్రశ్నశాస్త్ర సహాయంతో ఎలా తెలుసుకోవచ్చో చెప్పడానికి ఈ ప్రశ్నజాతకమే ఒక ఉదాహరణ.

(ఆ కుటుంబం యొక్క కొన్ని వ్యక్తిగత విషయాలను దాచిపెట్టడం జరిగింది)
read more " అబ్బాయి తిరిగి వస్తాడా? - ప్రశ్నశాస్త్రం "

16, ఫిబ్రవరి 2019, శనివారం

పుల్వామా టెర్రర్ ఎటాక్ - రాహుకేతువుల ప్రభావం

నేను టీవీ చూచి, న్యూస్ పేపర్ చూచి ఎన్నో నెలలైపోయింది. ఏడాది కూడా దాటి ఉండవచ్చు. అన్నీ అబద్దాలు చెప్పే చెత్త మీడియా మాయాజాలానికి మనం ఎందుకు దాసోహం అనాలనిపించి, మీడియా అంటే అసహ్యం పుట్టి, ఆ రెండూ చూడటం పూర్తిగా మానేశాను. ఈరోజు ఉదయం ఆఫీస్ లో మా కొలీగ్స్ చెప్పుకుంటుంటే ఈ విషయం తెలిసింది.

రెండు రోజుల క్రితం జమ్మూ లోని పుల్వామాలో ఇస్లాం రాక్షసుల ఆత్మాహుతి దాడిలో 40 మంది భారత సైనికులు ప్రాణాలు కోల్పోవడం చాలా బాధను కలిగించే సంఘటన. పాకిస్తాన్ దీనిని ఒక విజయంగా చిత్రీకరించుకోవచ్చు. విజయగర్వంతో పొంగిపోవచ్చు. కానీ ఇస్లాం చెబుతున్నదేమిటి? వీళ్ళు చేస్తున్నదేమిటి? అని ఆలోచిస్తే మహమ్మద్ ప్రవక్త కూడా వీళ్ళను చూచి సిగ్గుతో తలదించుకోవలసి వస్తుంది. వీళ్ళు చేస్తున్న దురాగతాలలో పాపాలలో ఆయన కూడా భాగం పంచుకోవలసి వస్తుంది.

ఎక్కడో మధ్యప్రాచ్యం నుండి దోపిడీదారులుగా మన దేశానికి వచ్చి, దౌర్జన్యంతో ఆక్రమించి, వందలాది ఏళ్ళపాటు దోచుకుని, ఇక్కడి సంస్కృతినీ శిల్పసంపదనూ ధ్వంసం చేసి, చివరకు దేశాన్ని మూడు ముక్కలుగా చేసిన తర్వాత కూడా ఇంకా ద్వేషం చల్లారక కొట్టుకుంటున్న వాళ్ళు 'ఇస్లాం' అంటూ వెధవనీతులు చెబుతుంటే దెయ్యాలు పురాణాలు వల్లించినట్లు ఉంది.

పాకిస్తాన్ అనేది భూగోళానికే ఒక శాపం. మానవజాతికే కళంకం. అది సైతాన్ కు ప్రతిరూపం. దానిని ఈ భూమినుంచి లేకుండా చేసినప్పుడే మానవజాతి శాంతిగా ఉండగలుగుతుంది. అది త్వరగా జరగాలని దేవుడిని ప్రార్ధిద్దాం.

ఈలోపల రాహుకేతువుల ఈ గోచారం ఈ టెర్రరిస్ట్ ఎటాక్ కు ఎలా కారణం అయిందో ఒక్కసారి చూద్దాం.

పాకిస్తాన్ లగ్నం మేషం. కనుక మేషరాశికి నేను వ్రాసిన ఫలితాలు దీనికి బాగా వర్తిస్తాయి. వీరికి విక్రమస్థానంలోకి ఉచ్చరాహువు వస్తున్నాడు. అందుకే వీళ్ళకు అతి ఉత్సాహం ఉన్నట్టుండి ఎక్కువైంది. ఈ ఎటాక్ ప్లాన్ చేశారు. జయప్రదంగా నిర్వహించారు.

భారతదేశపు లగ్నం వృషభం. ఇది ధర్మానికి చిహ్నం. పడ్డవాడు చెడ్డవాడు కాడు. మనకు శక్తీ యుక్తీ పుష్కలంగా ఉన్నాయి. గత కాంగ్రెస్ ప్రభుత్వం పాకిస్తాన్ కు 'మోస్ట్ ఫేవర్డ్ నేషన్' హోదా ఇచ్చి నెత్తికెక్కించుకుంది. మనలని చావగోడుతూ మన సైనికుల్ని చంపుతూ ఉన్నందుకేమో అలాంటి హోదా ఇచ్చింది? మోడీ ప్రభుత్వం అలా కాదు. అది దెబ్బకు దెబ్బ తీస్తుంది. తియ్యాలి కూడా. అప్పుడే నీచ పాకిస్తాన్ కు బుద్ధి వస్తుంది. మనం బలంగా ఉంటేనే శత్రువు మనల్ని చూచి భయపడతాడు. లేదంటే మనకు తాటాకులు కడతాడు.

మనకు ద్వితీయంలోకి రాహువు వస్తున్నాడు. కనుక నష్టపోయినప్పటికీ అంతర్జాతీయ వేదికలమీద మన వాదనను స్పష్టంగా వినిపించగలుగుతాం. ప్రపంచదేశాల సింపతీని పొందగలుగుతాం. చివరకు విజయాన్ని సొంతం చేసుకోగలుగుతాం. రహస్యస్థానమైన అష్టమంలోకి ఉచ్చకేతువు వస్తున్నందున, మోడీ ప్రభుత్వం చేతులు ముడుచుకుని కూర్చోదు. రహస్య ప్లాన్ తో ముందుకు వెళుతుంది. దెబ్బకు దెబ్బ తీస్తుంది. ఇంతకు పదింతలు పాకిస్తాన్ కు నష్టం జరుగుతుంది. ఇది తప్పదు.

శుక్రవారంనాడు పాకిస్తాన్లోని గడ్డంగాళ్ళు చేసే దొంగప్రార్ధనలు ఏమాత్రం సరిపోవు. అవి వాళ్ళను ఏమాత్రమూ కాపాడవు. నిత్యజీవితంలో నీతిగా బ్రతకాలి. అది లేకుండా అల్లా అల్లా అంటూ అరిస్తే అల్లాడుకుంటూ రావడానికి వాడేం పిచ్చోడు కాదు. చెప్పేవి నీతులు చేసేవి తప్పుడు పనులు అనే సామెత నీచ పాకిస్తాన్ కు కరెక్ట్ గా వర్తిస్తుంది కదూ !

త్వరలోనే పాకిస్తాన్ కు సరియైన శాస్తి జరగాలని భారతదేశ పౌరులుగా ఆశిద్దాం ! అంతేకాదు పరమేశ్వరుడిని ప్రార్ధిద్దాం కూడా !
read more " పుల్వామా టెర్రర్ ఎటాక్ - రాహుకేతువుల ప్రభావం "

14, ఫిబ్రవరి 2019, గురువారం

రాహుకేతువుల రాశి మార్పు - 2019 - ఫలితాలు

మార్చి 7 వ తేదీన రాహుకేతువులు రాశులు మారుతున్నారు. ఇప్పటివరకూ కర్కాటకం - మకరంలో ఉన్న వీరు మిథునం - ధనుస్సులలోకి మారుతూ 18 ఏళ్ళ తర్వాత ఉచ్చస్థితిలోకి వస్తున్నారు. ఈ స్థితిలో వీరు ఏడాదిన్నర పాటు ఉంటారు.

రాశుల మధ్య ఉన్న Twilight zone ప్రభావం వల్ల గతవారం నుంచే వీరి ప్రభావం అనేకమంది జీవితాలలో, అనేక రంగాలలో కనిపించడం మొదలైపోయింది. జాగ్రత్తగా గమనించుకుంటే ఆయా మార్పులను మీమీ జీవితాలలో మీరే చూచుకోవచ్చు. ద్వాదశ రాశుల వారికి ఈ మార్పు ఏయే ఫలితాలను ఇస్తుందో క్రింద చదవండి.

మేషరాశి 

ఆత్మవిశ్వాసం అమితంగా పెరిగిపోతుంది. కమ్యూనికేషన్ స్కిల్స్ మెరుగు పడతాయి. మంచివార్తలు వింటారు. ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న పనులలో కదలిక వస్తుంది. ఆధ్యాత్మిక చింతన ఎక్కువౌతుంది. తండ్రికి మంచికాలం మొదలౌతుంది. దూరపు సంబంధాలు కుదురుతాయి. దూరప్రయాణాలు చేస్తారు. విదేశాలకు వెళతారు.

వృషభరాశి

మాట దూకుడు ఎక్కువౌతుంది. కుటుంబంలో మంచి జరుగుతుంది. ఆస్తి కలసి వస్తుంది. విందులు వినోదాలు ఎక్కువౌతాయి. మాటల్లో ఆధ్యాత్మికం ఎక్కువగా కనిపిస్తుంది. ఉపన్యాసాలు ఇస్తారు. సంతానానికి మంచి సమయం మొదలౌతుంది. కొందరికి దీర్ఘవ్యాధులు ఉద్రేకిస్తాయి. కొందరి పెద్దలకు ప్రాణగండం ఉంటుంది.

మిధునరాశి

మనసుకు సంతోషం కలుగుతుంది. ఎంతోకాలం నుంచీ ఎదురుచూస్తున్న వ్యక్తులు ఎదురౌతారు. కుటుంబంలో సంతోషం నిండుతుంది. జీవితభాగస్వామికి ఒక చెడు, ఒక మంచి జరుగుతాయి. కొన్ని విషయాలలో కుటుంబంలో మనస్పర్ధలు వస్తాయి. కానీ త్వరలోనే సర్దుకుంటాయి.

కర్కాటక రాశి

విదేశీప్రయాణం జరుగుతుంది. విదేశీ సంబంధాలు కుదురుతాయి. కుటుంబ సమస్యలు ఒక కొలిక్కి వస్తాయి. కోర్టుకేసులు గెలుస్తారు. శత్రువులపైన విజయం సాధిస్తారు. హోదాలు బాధ్యతలు పెరుగుతాయి. రహస్యసంబంధాలు సమాలోచనలు ఎక్కువౌతాయి. తెలివితేటలను ప్రక్కదారిలో వాడతారు.

సింహరాశి

కుటుంబం మరియు సంతానం దూరమౌతుంది. అయితే అదొక మంచిపనికోసమే జరుగుతుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. చెడుస్నేహితులు ఎక్కువౌతారు. అక్రమసంపాదన ఎక్కువౌతుంది. దానితోబాటే దీర్ఘరోగాలు కూడా ఎక్కువౌతాయి. అన్నయ్యలకు అక్కయ్యలకు మంచి జరుగుతుంది. దైవభక్తి, ఇతరులకు సహాయపడే తత్త్వం ఉన్నవారికి మేలు జరుగుతుంది.

కన్యారాశి

ఉద్యోగంలో ప్రమోషన్లు వస్తాయి. హోదా పెరుగుతుంది. అధికారం వృద్ధి అవుతుంది. అయితే, దానికి సమాంతరంగా ఇంటిలో మాత్రం సంతోషం ఉండదు. ఇంటివిషయాలలో మనశ్శాంతి లోపిస్తుంది. ఈ రెంటి మధ్యన మనస్సు సంఘర్షణకు గురౌతుంది.

తులారాశి

దూరప్రాంతాలకు వెళతారు. పుణ్యక్షేత్రాలు దర్శిస్తారు. విదేశీయానం సఫలం అవుతుంది. ధైర్యం పెరుగుతుంది. కాలం కలసి వస్తుంది. అయితే, తొందరపాటుతో మాట జారడం వల్ల గొడవలు వస్తాయి. ఎదురుదెబ్బలు తగులుతాయి. తండ్రికి గురువులకు మంచి సమయం. తమ్ముళ్ళకు చెల్లెళ్ళకు కూడా మంచి జరుగుతుంది. కానీ వారికి జరిగే మంచిలో కొంత చెడు కలసి ఉంటుంది.

వృశ్చిక రాశి

సాంప్రదాయపరమైన దైవచింతన పెరుగుతుంది. కుటుంబంలో ఎడబాట్లు ఉంటాయి. మాట తడబడుతుంది. మాటదూకుడు వల్ల సేవకులు దూరమౌతారు. సరదాలు విలాసాలు ఎక్కువౌతాయి. రహస్యవిద్యల మీద ఆసక్తి పెరుగుతుంది. దీర్ఘవ్యాదులు ఉద్రేకిస్తాయి. కొందరికి ప్రాణగండం కూడా ఉన్నది.

ధనూరాశి

కాలం కలసి వస్తుంది. అయితే, మొదట్లో అంతా బాగున్నట్లు అనిపించినప్పటికీ, క్రమేణా జీవితభాగస్వామి నుంచీ, వ్యాపార భాగస్తులనుంచీ గొడవలు ఎదురౌతాయి. కొంతమందికి కుటుంబంలో దౌర్జన్యపూరిత సంఘటనలు చోటు చేసుకుంటాయి. దీర్ఘవ్యాదులు తలెత్తుతాయి. యాక్సిడెంట్లు  అవుతాయి. ఆస్పత్రిని సందర్శిస్తారు.

మకరరాశి

ఉన్నట్టుండి కాలం కలసివస్తుంది. కుటుంబంలో మంచి జరుగుతుంది. శత్రువులను జయిస్తారు. చాలాకాలం నుంచీ ఇబ్బంది పెడుతున్న సంఘటనలు మాయమౌతాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దూరప్రదేశాలలో మిత్రులు ఏర్పడతారు. విదేశీ ప్రయాణాలు ప్లాన్ చేస్తారు. నూతనోత్సాహం వెల్లివిరుస్తుంది. ఉద్యోగంలో ఉన్నతి కలుగుతుంది.

కుంభరాశి

ఆధ్యాత్మిక చింతన బాగా ఎక్కువౌతుంది. అలౌకిక అనుభవాలను పొందుతారు. సంతానానికి మంచి సమయం మొదలౌతుంది. అన్నయ్యలకు, అక్కయ్యలకు మంచీ చెడూ రెండూ ఎక్కువౌతాయి. ఉద్యోగంలో రాణింపు ఉంటుంది. ఇతరులకు సహాయం చేసే తత్త్వం ఎక్కువౌతుంది. అలాగే, తనకు సహాయపడేవారు కూడా ఎదురుపడతారు.

మీనరాశి

కుటుంబసౌఖ్యం వృద్ధి అవుతుంది. సంతోషకరమైన మార్పులను చూస్తారు. సంబంధాలు కుదురుతాయి. బిజినెస్ వృద్ధి అవుతుంది. ఉద్యోగంలో ప్రొమోషన్ వస్తుంది. ఆదాయం వృద్ధి అవుతుంది. అయితే, దీనితో బాటు స్థానచలనం కూడా ఉంటుంది. చాలాకాలం నుంచీ ఉన్న మిత్రులు సేవకులు దూరమౌతారు. ఆధ్యాత్మిక చింతన ఎక్కువౌతుంది.

ఈ ఫలితాలను, లగ్నం నుంచి, చంద్రుని నుంచి కూడా కలుపుకుని చూడాలి. అప్పుడు ఫలితాలలో ఎక్కువగా స్పష్టత వస్తుంది. ఒక్కసారి 18 ఏళ్ళ వెనుకకు చూచుకుంటే చిన్నచిన్న తేడాలతో దాదాపుగా ఇవే ఫలితాలు మీమీ జీవితాలలో వచ్చినట్లుగా గమనించవచ్చు.
read more " రాహుకేతువుల రాశి మార్పు - 2019 - ఫలితాలు "

4, ఫిబ్రవరి 2019, సోమవారం

పర్సు పోయింది . దొరుకుతుందా లేదా?

ఈరోజు మధ్యాన్నం ఒకాయన ఫోన్లో ఈ ప్రశ్నను అడిగాడు.

'నిన్న నా పర్సు పోయింది. అందులో విలువైన కార్డులున్నాయి. దొరుకుతుందా లేదా? అన్నిచోట్లా వెదికాము. దొరకలేదు. ఎక్కడ పోయి ఉంటుంది?'

ఈ రోజు అమావాస్య. అమావాస్య నీడలో మరుపు రావడం, ఉద్రేకాలు పెచ్చరిల్లడం, ఆ గొడవలో పడి ముఖ్యమైన విషయాలు మర్చిపోవడం మామూలే అనుకుంటూ ప్రశ్నచక్రం వేసి చూచాను.

ఆ సమయానికి వేసిన ప్రశ్నచక్రం ఇలా ఉంది.

లగ్నాధిపతి శుక్రుడు అష్టమంలో శత్రుక్షేత్రంలో బాధకుడైన శనితో కలసి ఉన్నాడు. అష్టమాధిపతి గురువు సప్తమంలో రహస్య ప్రదేశమైన వృశ్చికంలో ఉండి లగ్నాన్ని చూస్తున్నాడు. వృశ్చికం సహజ అష్టమస్థానం. హోరాదిపతి కూడా శుక్రుడే అవుతూ అష్టమంలో ఉంటూ, విలువైన వస్తువులు పోవడాన్ని సూచిస్తున్నాడు.

కనుక పర్సు దొరకదని చెప్పాను.

ఎక్కడ పోయి ఉంటుంది? అన్న ప్రశ్నను ఇప్పుడు చూడాలి. విలువైన వస్తువులను ద్వితీయం సూచిస్తుంది. ద్వితీయాధిపతి బుధుడు చరరాశియైన నవమంలో బాధకస్థానంలో తీవ్ర అస్తంగతుడై ఉన్నాడు. అమావాస్య యోగంలో ఉన్నాడు. కేతువుతో కూడి ఉన్నాడు. ఆ కేతువు బాధకుడైన శనిని సూచిస్తున్నాడు. ఆ నవమం సహజ దశమం అయింది.

కనుక, తన ఆఫీసు పనిమీద దూర ప్రాంతానికి పోయినప్పుడు అక్కడ ఈ పర్సు పోయిందని చెప్పాను. స్నేహితులను సూచిస్తున్న లాభాధిపతి గురువు సప్తమంలో ఉంటూ లగ్నాన్ని చూస్తున్నందున, ఆ పర్సు పోయిన సమయంలో నీ స్నేహితులు కూడా నీ పక్కనే ఉన్నారని, నీ పర్సు పోయిన విషయాన్ని వాళ్ళు కూడా గమనించారని చెప్పాను.

అప్పుడతను ఇంకా వివరంగా ఇలా చెప్పాడు.

నిన్న ఏదో ఆఫీసు పనిమీద అదే ఊరిలో దూరంగా ఉన్న ప్రాంతానికి పోయినప్పుడు అక్కడ ఒక రెస్టారెంట్ లో స్నేహితులతో కలసి భోజనం చేశామని, బిల్లు కడదామని చూసుకుంటే పర్సు కనిపించలేదని, పర్సు పోయిన విషయం అక్కడే తను మొదటిసారిగా గమనించానని అతను నాతో చెప్పాడు.

అప్పుడు ఇంకా ఇలా చెప్పాను.

అదే రెస్టారెంట్ లో వీళ్ళ దగ్గరగా కూచున్న కొందరు అమ్మాయిలను వీళ్ళు గమనిస్తూ, వాళ్ళమీద కామెంట్లు విసురుతూ నవ్వుతూ ఉన్న సమయంలో వీళ్ళ అజాగ్రత్తను గమనించి ఎవడో ఇతని పర్సు కొట్టేశాడని, ఆ రెస్టారెంట్ చాలామంది కస్టమర్స్ తో సందడిగా ఉందనీ చెప్పాను.

అతను చాలా ఆశ్చర్యపోయాడు.

'ఎలా చెప్తున్నారు?' అడిగాడు ఆశ్చర్యంగా.

'అది నీకెందుకు? నిజమా కాదా?' అడిగాను. అష్టమంలో కలసి ఉండి అర్గలం పట్టి, ఒకవైపు నాలుగు గ్రహాలతో, ఇంకో వైపు ఒక గ్రహంతో అప్పచ్చి అయిపోయి వాక్స్థానాన్ని చూస్తున్న శనిశుక్రులను గమనిస్తూ.

'నిజమేనండి ! మా టేబుల్ పక్కనే కూచున్న అమ్మాయిలను చూస్తూ కామెంట్లు చేస్తూ సరదాగా భోజనం చేశాము. తర్వాత చూసుకుంటే జేబులో పర్సు లేదు. ఇది కూడా ఎలా చెప్పారు?' అన్నాడు.

'ఎలాగోలా చెప్పాలే గాని, నీ పర్సు మీద ఆశలు వదిలేయ్ బాబూ. అది దొరకదు.' అని చెప్పాను.

మనం చూడని విషయాలను కూడా ఈ విధంగా జ్యోతిష్యజ్ఞానం మనకు చూపిస్తుంది మరి !
read more " పర్సు పోయింది . దొరుకుతుందా లేదా? "