“అసమర్ధుని వద్ద ధనము, సుఖము, కీర్తి, ధర్మము ఏవీ నిలచి ఉండవు"

31, మార్చి 2013, ఆదివారం

వివాహ పొంతనాలు-పెర్ఫెక్ట్ మేచింగ్

పెళ్లి ముందు ఇద్దరి జాతకాలు కలుస్తాయా లేదా చూడటం సామాన్యంగా జ్యోతిష్యాన్ని నమ్మే అన్ని దేశాలలోనూ జరుగుతుంది.ఇందులో ఎవరెవరి పద్దతులు వారికుంటాయి.జ్యోతిష్యాన్ని నమ్మేవారు వారి వారి విధానాల ప్రకారం జాతకాలు చూపిస్తారు.కుదిరితే చేసుకుంటారు.కాని ఈ విషయం తేల్చడం అనుకున్నంత తేలిక కాదు.

చూడటానికి సింపుల్ గా కనిపించే ఈ ప్రాసెస్ వెనుక చాలా చిక్కు ముళ్లుంటాయి.సాధారణ జ్యోతిష్కులకు అవి తెలియవు.అందుకని ఏవేవో మాయమాటలు చెప్పి 'నూరు అబద్దాలు చెప్పి అయినా ఒక పెళ్లి చెయ్యమన్నారు' అన్న సామెతమీద ఆధారపడి 'పరవాలేదు బాగానే ఉంది చేసుకోండి' అని చెబుతుంటారు.

సామాన్యంగా గణాలూ గుణాలూ చూచి 36 పాయింట్లకు ఎన్ని పాయింటులోచ్చాయో చూచుకుని దాని ప్రకారం కలిసిందనీ కలవలేదనీ అనుకుంటారు.ఇదే అన్ని చోట్లా అనుసరించే విధానం.కాని ఈ విదానం చాలాసార్లు బెడిసి కొడుతుంది. 

మొన్నీమధ్య ఒక తెల్సినతను రెండు జాతకాలు తెచ్చి మేచింగ్ అవుతుందో లేదో చెప్పమన్నాడు.ఇప్పటికే విజయవాడలో నలుగురు జ్యోతిష్కుల దగ్గరికి వెళితే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్పారట.అదీగాక ఈ మధ్య పర్సంటేజీ విధానంలో చెబుతున్నారట.ఒకాయనేమో 50 శాతం మేచింగ్ అయింది అన్నాడట. మిగిలిన ముగ్గురూ 60,70 ఇలా వారికి తోచిన పర్సెంటేజీలు చెప్పారట.ఇతనికి అర్ధంగాక నా దగ్గరకొచ్చాడు. 

'కేపీ సిస్టం వారిని కలవక పోయారా.వాళ్ళైతే ఈ సందిగ్ధం లేకుండా తేల్చి చెబుతారు కదా?' అడిగాను.

'అదీ అయింది. ఒక కేపీ సిస్టం జ్యోతిష్కుని వద్దకూ వెళ్ళాము.వీళ్ళ జాతకాలు అస్సలు కలవలేదు.ఈ సంబంధం కుదరదు.వీళ్ళ పెళ్లి అయితే నేను మీసం తీసేస్తాను అని ఆయన చెప్పాడు.' అన్నాడు.

'వీళ్ళ పెళ్లి అయితే ఆయన మీసం తీసేయడం ఎందుకు? దానికీ దీనికీ ఏమిటి సంబంధం?' అనడిగాను.

సామాన్యంగా కేపీ జ్యోతిష్కులలో ఎందుకో గాని ఆవేశం పాళ్ళు ఎక్కువగా ఉంటుంది.ఇలాంటి ప్రతిజ్ఞలు చాలా ఎక్కువగా వాళ్ళు చేస్తుంటారు. విషయాన్ని సింపుల్ గా సూటిగా చెప్పడానికి అంతగా ఆవేశపడవలసిన పని ఏముందో నాకైతే అర్ధం కాదు.

'పోనీ కేపీ సిస్టం లోనే సెకండ్ ఒపీనియన్ తీసుకోకపోయారా?' అడిగాను.

'అదీ అయింది సార్.ఆ రెండో కేపీ జ్యోతిష్కుడు ఇవే జాతకాలు బ్రహ్మాండంగా కుదిరాయని చెప్పాడు.'మెడ్ ఫర్ ఈచ్ అదర్' అని చెప్పాడు.అందుకే పిచ్చి పుట్టి చివరిగా ఈ జాతకాలు మీ దగ్గరకి తీసుకొచ్చాం.' అన్నాడు.

'సరే వివరాలిచ్చి రెండు రోజుల తర్వాత కలవండి.'అని చెప్పి పంపాను.

ఒక జాతకాన్ని నలుగురు జ్యోతిష్కులు చూస్తె నాలుగు రకాలుగా చెబుతారు. ఒకే రోగానికి నలుగురు డాక్టర్లు నాలుగు రకాల ట్రీట్మెంట్ లు ఇచ్చినట్లుగా ఉంటుంది.అలా కాకుండా ఎవరు చూచినా ఒకే విధంగా చెప్పగలగాలి.అదే అసలైన విద్య అని నేనంటాను. దీనికి కారణం జ్యోతిష్యం నేర్చుకునేవారికి ఒక నిర్ధారిత విధానం (standardization) అంటూ స్పష్టంగా లేకపోవడమే.

వివాహ మేళనంలో చాలామంది జ్యోతిష్కులకు తెలియని విషయం ఏమిటంటే జాతకాలు కలిసినంత మాత్రాన వారి వివాహ జీవితం సుఖంగా ఉండాలని రూలేమీ లేదు. ఈ రెండూ బొత్తిగా వేర్వేరు విషయాలు. అందుకే, వివాహ మేళనం కోసం రెండు జాతకాలు మన దగ్గరకు వచ్చినపుడు ముందుగా రెండు విషయాలు చూడాలి.

1.ఈ జాతకాలు కలిశాయా లేదా? అనేది ముందుగా చూడాలి. దీనికి అనేక పద్ధతులున్నాయి. వీటిలో కొన్ని పనిచేస్తాయి.కొన్ని థియరీ బాగుంటుంది గాని ప్రాక్టికల్ గా పనిచెయ్యవు.

2.వీరి వివాహ జీవితం ఎలా ఉంటుంది? అనేది తర్వాత చూడాలి. దీనికీ అనేక పద్ధతులున్నాయి.అవి అనుభవం మీద తెలుస్తాయి.

జాతకాలు కలిసినంత మాత్రాన వారి వివాహ జీవితం సుఖంగా ఉండాలని అనుకోవడం భ్రమ. ఇద్దరి వివాహ జీవితమూ నిత్యయుద్ధంగా ఉంటుంది అని ఇద్దరి జాతకాలూ చెబుతుంటే వారిద్దరి చార్టులూ బాగా కలిసినట్లే లెక్క. ఎందుకంటే ఒకరు తిడితే ఇంకొకరు కూడా వెంటనే తిట్లు లంకించుకోవాలి కదా.ఒకరు కొడితే రెండో వారూ తిరగబడి కొట్టాలి కదా. అంటే సమఉజ్జీలు ఐనారు గనుక ఆ రకంగా 'మెడ్ ఫర్ ఈచ్ అదర్' అన్నమాట.

అంటే 'కాకులు కాకుల గుంపులోనే చేరతాయి కొంగలు కొంగల గుంపులోనే చేరతాయి.హంసలు హంసల గుంపు లోనే చేరతాయి' అన్నట్లు రెండు చార్టులూ హంసలే అయితే అవి బాగా మేచ్ అయినట్లు అనుకోవాలి. లేదా రెండూ కాకులే అయినా అవికూడా బాగా మేచ్ అయినట్లే అనుకోవాలి.లేదా రెండూ కొంగలె అయితే కూడా బాగా మేచ్ అయినట్లే అనుకోవాలి. కాని హంసల కాపురమూ, కొంగల కాపురమూ,కాకుల కాపురమూ ఒకే విధంగా ఉండవు.హంసలు అన్యోన్యంగా సంతోషంగా ఉంటాయి.కొంగలు అప్పుడప్పుడూ తిట్టుకొని కొట్టుకున్నా మళ్ళీ కలిసి సర్దుకొని  జీవిస్తాయి. కాకులు ఎప్పుడూ గొడవలు గోలలు తిట్టుకోవడం కొట్టుకోవడం కాకిగోలతోనే సంసారం సాగిస్తూ ఉంటాయి. ఇది కూడా పర్ఫెక్ట్ మేచింగే. ఈ మూడు రకాలైన జాతకాలూ బాగా మేచ్ అయినట్లే చెప్పాలి.

ఇవి మూడూ కాక, 'మార్జాల దాంపత్యం' అంటూ ఇంకొకటి ఉంటుంది.పిల్లులు భీకరంగా ఒకదాన్నొకటి కొట్టుకుని కరిచేసుకుంటూ ఉంటాయి.మళ్ళీ వాటికి పిల్లలు పుడుతూనే ఉంటాయి. ఇలాంటి సంసారాలు కూడా కోటానుకోట్లు ఉంటాయి.వీటికి క్షణం పడదు.వీరి జీవితంలో నిత్యయుద్ధం జరుగుతూ ఉంటుంది.భౌతికంగా కూడా ఒకరిపైన ఒకరు దాడిచేసి కొట్టుకుంటూ ఉంటారు.కాని విడిపోయి ఎవరి జీవితం వారు గడపరు. దీనిని మార్జాల దాంపత్యం అంటారు.ఇదీ పర్ఫెక్ట్ మేచింగే.నాకు తెలిసిన ఒక జంట గత నలభై ఏళ్ళుగా ఇలాగే సంసారం సాగిస్తున్నారు.నేటికీ రోడ్డెక్కి భీకరంగా గొడవ పడతారు.కాని విడిపోరు.

చదువరులకు ఒక విషయం అర్ధం అయి ఉండాలి. జాతకాలు కలవడం వేరు. సంసారం అన్యోన్యంగా ఉండటం వేరు.అన్యోన్యంగా ఉండేలాగా జాతకాలు కలవడం వేరు. ఈ మూడో రకం మేచింగ్ చాలా కష్టమైనది.చాలా అరుదుగా మాత్రమే జాతకాలలో కనిపిస్తుంది.జాతకాలు కలవడం అంటే వివాహ జీవితం బాగుండటం అని అర్ధం కాదు.మంచో చెడో ఇద్దరూ ఒకే దారిలో వెళ్ళడమే జాతకాలు కలవడం అంటే అసలైన అర్ధం. చాలాసార్లు అలాగే జరుగుతుంది కూడా.

అంటే, అబ్బాయి జాతకంలో నాశనం అయ్యే యోగం ఉంటె,అమ్మాయిని చేసుకున్న తర్వాత ఇంకా త్వరగా నాశనం అయ్యేటట్లుగా అమ్మాయి జాతకం ఉంటే అది పర్ఫెక్ట్ మేచింగ్ అవుతుంది.అలా కాకుండా మంచి అమ్మాయిని తెచ్చి వీడికి కట్టబెడితే ఈ అమ్మాయి పుణ్యబలం వల్ల అతనికి మేలు ఖచ్చితంగా జరుగుతుంది.కాని అలాచేస్తే ఆ అమ్మాయికి అన్యాయం చేసినట్లే అవుతుంది.తనకు తగిన జాతకుడిని ఈ అమ్మాయి చేసుకుంటే ఆ అమ్మాయి జీవితం ఇంకా ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఆ అవకాశాన్ని ఆ అమ్మాయికి దూరం చెయ్యడం అన్యాయం చేయ్యడమేగా. అప్పుడా పాపఫలితం జ్యోతిష్కుని నెత్తిన కూచుంటుంది. 

అందుకే 'మనోనుకూలం ప్రధమం ప్రయత్నం' అని జ్యోతిష్య గ్రంధాలు చెప్పాయి.ఇరువురూ ఒకరి కొకరు మానసికంగా బాగా నచ్చితే జాతకాలు చూడనక్కరలేదు అని జాతక గ్రంధాలే చెప్పాయి.అయితే ఈ నచ్చడం అనేదాంట్లో కూడా మళ్ళీ తేడాలుంటాయి. ఈరోజు నచ్చిన వ్యక్తి రేపు నచ్చకపోవచ్చు.ఎందుకంటే కలిసి జీవించడం మొదలు పెట్టాక వారిలో మనకు నచ్చని అనేక కోణాలు బయట పడుతూ ఉంటాయి.ఈ క్షణికమైన నచ్చడం గురించి కాదు జ్యోతిష్యం చెప్పింది.ఇద్దరి మనస్సులూ సంస్కారాలూ ఒకే వేవ్ లెంగ్త్ లో నడుస్తుంటే ఇక జాతకాలు చూడనక్కర లేదని అవి చెప్పాయి.కొందరికి జాతకాలు లేకపోయినా అలాంటి మేచింగ్ జరుగుతుంది. వాళ్ళ సంసారాలు చాలా బాగా సాగుతూ ఉంటాయి. నా దగ్గరకు వచ్చినాయన చెప్పినది అదే.

కొన్నేళ్ళ క్రితం వాళ్ళబ్బాయికి వివాహం కోసం ఒక జాతకం నా వద్దకు తెచ్చారు.కానీ ఆయనిలా అన్నాడు.'సార్.మా పెళ్లి అయి ఇప్పటికి ముప్పై ఏళ్ళయింది.అప్పుడు జాతకాలు చూడలేదు.అసలు మా ఇద్దరి జనన తేదీలూ లేవు.ఎవరూ రికార్డ్ చెయ్యలేదు.స్కూల్ రికార్డులలో ఏదో ఒకటి ఉజ్జాయింపుగా రాయించారు.కనుక మా జాతకాలు లేవు.అయినా సరే ఈ ముప్పై ఏళ్ళుగా ఏ గొడవలూ లేకుండా చక్కగా సంసారం సాగుతున్నది.'

'మరైతే మీ అబ్బాయికి జాతకం చూడటం ఎందుకు? అతనికీ మీ పద్దతే అనుసరించవచ్చుకదా?' అని అడిగాను.

'ఏదో అదొక నమ్మకం.అందుకే మీ దగ్గరకి వచ్చాం' అన్నాడు ఆయన.

సరే నాకు తోచినదేదో ఆయనకు చెప్పి పంపాను.వాళ్ళబ్బాయికి పెళ్లి అయింది.ప్రస్తుతం బాగానే ఉన్నారు.ఇలాంటి వారు కొందరుంటారు.

నాకు వెంకటాద్రిగారని ఒక స్నేహితుడు ఉండేవాడు.2004 లో ఆయన చనిపోయాడు. ఆయన ఇలాంటివే భలే ప్రశ్నలు అడిగేవాడు. ఒకసారి మా చర్చలో ఇదే టాపిక్ వచ్చింది.

'ఒక అబ్బాయి జాతకంలో రెండో పెళ్లి కనిపిస్తుంటే, అమ్మాయి జాతకంలో కూడా రెండో పెళ్లి ఉంటె వాళ్లకు మేచ్ అయినట్లా? వాళ్ళ జాతకాలు కలిసినట్లు మనం చెప్పవచ్చా? లేకపోతే అటువంటి కర్మ లేని అమ్మాయి జాతకం ఇతరత్రా కొన్ని కోణాలలో కలిస్తే ఈ అబ్బాయికి మేచ్ అయినట్లు చెప్పవచ్చా? ఒకవేళ రెండో అమ్మాయిని ఇతను చేసుకుంటే అతనికి రాసిపెట్టి ఉన్న రెండో పెళ్లి తప్పిపోతుందా? 

అలాగే,ఒకమ్మాయికి వైధవ్య యోగం కనిపిస్తుంటే, మంచి ఆయుస్సు ఉన్న జాతకుడిని ఈ అమ్మాయికి మనం మేచ్ చెయ్యవచ్చా? అప్పుడు ఆ అమ్మాయికి వైధవ్యం తప్పిపోతుందా?లేకపోతే అమ్మాయి జాతకం బలంగా ఉంటె ఇతని ఆయుస్సు తగ్గిపోతుందా?ఏ విధంగా జరిగినా ఎవరిదో ఒకరి జాతకం తప్పినట్లే కదా? అసలు అలా చెయ్యగలమా? ఆ విధంగా ప్రతి కేసులోనూ మనిషి చెయ్యగలిగితే ఇక 'విధి' 'రాసిపెట్టి ఉండటం' అనే మాటలకు అర్ధాలు ఏమిటి? అసలు విధి అనేది ఉందా? ఉంటె దాని లిమిట్ ఎంతవరకు? అదెంతవరకూ పని చేస్తుంది? మన ఫ్రీ విల్ ఎంతవరకూ పనిచేస్తుంది? ఈ భేదాలు జాతకం చూచి ఎలా తెలుసుకోవాలి?

పాయింట్ ఏమిటంటే, ఇద్దరి జాతకాలలోనూ ఒకే విధమైన చెడు కనిపిస్తే వాటిని ఓకే చెయ్యవచ్చా? కుజదోషంలో అలా చేస్తున్నాము కదా? లేక ఇద్దరికీ ఆ చెడును నివారించడానికి వీరిద్దరికీ అటువంటి దోషాలు లేని వేర్వేరు సంబంధాలు చేసుకోమని చెప్పాలా? అలా చేస్తే వాళ్ళ పార్టనర్ కు అన్యాయం చేసినట్లే కదా? మేచింగ్ చెయ్యడం అంటే వీటిల్లో ఏది సరియైన విధానం? అనేది ఆయన ప్రశ్న.

అంటే జ్యోతిష్కుడనేవాడు ఊరకే తటస్థంగా మాత్రమే ఉండి కర్మ ప్రకారం జరిగేది నిమిత్త మాత్రుడిగా చూస్తూ ఉండాలా లేక ఆయా జాతకుల కర్మలలో కలిగించుకొని వారి విధిని మార్చే ప్రయత్నం చెయ్యాలా? అనేది ప్రాధమికమైన ప్రశ్నగా తేలింది.

చెడు కనిపిస్తున్నపుడు దానిని నివారించడానికే కదా జ్యోతిష్యం యొక్క ఉపయోగం? కనుక అలా నివారించకుండా ఇద్దరి జాతకాలలోనూ విడాకులు రాసిపెట్టి ఉన్నాయి కాబట్టి పర్ఫెక్ట్ మేచింగ్ అయింది. ఈ వివాహం చేసుకోవచ్చు ముందు వివాహం చేసుకొని తర్వాత విడాకులు తీసుకోండి అని చెప్పవచ్చా? చెడిపోయే వివాహం అసలు ఓకే చెయ్యడం ఎందుకు?   

ఒకవేళ వాళ్లకు అలా అనుభవించే ఖర్మ రాసిపెట్టి ఉందీ అనుకుంటే అసలు జాతకాలు చూడటం ఎందుకు? ఎవరి ఖర్మ ప్రకారం ఎవరికి తగ్గ మనుషులు వారికి దొరుకుతారు.ఇక జాతకాల పాత్ర ఏముంది? ఎవరికి నచ్చిన వారిని వారు చేసుకొని వారి వారి ఖర్మానుసారం కష్ట సుఖాలు అనుభవించ వచ్చు కదా.

జాతకాన్ని చూచినప్పుడు దానిని prove చెయ్యడానికి జ్యోతిష్కుడు ప్రయత్నించాలా? లేక disprove చెయ్యడానికి ప్రయత్నించాలా? అసలు అలా ప్రయత్నించగలమా? అలా అయితే ఏఏ కేసుల్లో మనం విధికి ఎదురు వెళ్ళగలం? ఏఏ కేసుల్లో వెళ్ళకూడదు? ఈ భేదం ఎలా తెలుస్తుంది?

ఇలాటి core matters మీద చర్చలు మా మధ్య సాగేవి. ఆ చర్చలలో నుంచి పుట్టే జవాబులు వచ్చే పరిష్కారాలూ కూడా అద్భుతంగా ఉండేవి. ఇటువంటి పరిశీలనాత్మకమైన శోధన వల్లనే లోతైన రహస్యాలు అవగతం అవుతాయి.అంతేగాని ఏదో మేరేజ్ మేచింగ్ సాఫ్ట్ వేర్ పెట్టుకుని రెండు జాతకాలూ దానికి ఫీడ్ చేసి అది చెప్పిన ప్రకారం 'జాతకాలు బ్రహ్మాండంగా కుదిరాయి' చేసుకోండి అని చెప్పిన జాతకాలు ఏడాది తిరగక ముందే  కోర్ట్ కెక్కి విడాకులు తీసుకున్నవి ఉన్నాయి.

జ్యోతిష్యంలో కూడా ప్రాక్టికల్ గా ఆలోచించాలి.అంతేగాని పుస్తకంలో ఉంది కదా అని అలాగే జరుగుతుంది అనుకోకూడదు. గోడ ఉందని చూసుకోకుండా పుస్తకంలో ఉందని ముక్కుసూటిగా పోతే ఏమౌతుందో అందరికీ తెలిసిందేగా.

మేరేజ్ మేచింగ్ అనేది పైకి కనిపించినంత సింపుల్ కానే కాదు అని చెప్పడమే ఈ వ్యాసం యొక్క ఉద్దేశ్యం.
read more " వివాహ పొంతనాలు-పెర్ఫెక్ట్ మేచింగ్ "

29, మార్చి 2013, శుక్రవారం

గుడ్ ఫ్రైడే

సాయంత్రం ఒక స్నేహితుడు కనిపిస్తే ఇలా అడిగాను.

'ఏంటి నీరసంగా ఉంది మొహం?'

'ఇవాళ గుడ్ ఫ్రైడే కదా అందుకని సాయంత్రం మూడు తర్వాత భోజనం చేశాను అందుకే కొంచం నీరసంగా ఉంది.'

తను క్రిస్టియన్.

అప్పుడు నేనిలా చెప్పాను.

'నేనూ మూడు తర్వాతే భోజనం చేశాను.అదీ చాలా మితంగా తిన్నాను.'

'అదేంటి నువ్వెందుకు అలా చెయ్యడం?' అన్నాడు.

'ఈ రోజు గుడ్ ఫ్రైడే కనుక.' చెప్పాను.

అతని ముఖంలో అనుమానం కదలాడింది.

'అదేంటి నువ్వు హిందువ్వి కదా?'

చిరునవ్వు నవ్వాను.

'నీ ప్రశ్నకు కాసేపాగి జవాబిస్తానుగాని ఒక మాటడుగుతాను చెప్పు.నీవు ఎన్నేళ్ళ నుంచి ఇది పాటిస్తున్నావు?' అడిగాను.

'దాదాపు పది పదిహేను ఏళ్ళ నుంచి'చెప్పాడు.

'అయితే విను.నాకు పదిహేనేళ్ళ వయసున్నప్పటి నుంచి నేనిది పాటిస్తున్నాను.'చెప్పాను.

అతని ముఖంలో ఆనందం కదలాడింది. 'చాలా మంచిది' అన్నాడు.

'దేనికి మంచిది?' అడిగాను.

'మంచి జరుగుతుంది' అన్నాడు తను.

'మంచి కోసం ఆశపడి నేనిది చెయ్యడం లేదు' చెప్పాను.

తను మళ్ళీ అనుమానంగా చూచాడు.

'మరెందుకు చేస్తున్నావు' అడిగాడు.

'జీసస్ అంటే నాకిష్టం కనుక చేస్తున్నాను. ఆయన ఆరుగంటల పాటు సిలువ మీద ఉండి మధ్యాన్నం మూడు గంటలకు మరణించాడని క్రైస్తవులు నమ్ముతారు.అంటే ఉదయం తొమ్మిదికి ఆయన్ను సిలువ వేస్తె సాయంత్రం మూడుకు చనిపోయాడు.కాని నేనిది నమ్మను.ఆయన శిలువ మీద మరణించలేదని తర్వాత కూడా చాలాఏళ్ళు బతికే ఉన్నాడనీ నేను నమ్ముతాను.కాని సాయంత్రం మూడు వరకు ఆయన యమయాతన పడ్డాడు.మనకిష్టమైన వాళ్ళు బాధపడుతుంటే మనం భోజనం ఎలా చెయ్యగలం? అందుకే మూడువరకూ ఏమీ తినను. ఆ తర్వాతే ఏదన్నా తింటాను.' చెప్పాను.

'నీవు బైబుల్ చదివావా? అడిగాడు.

'చదివాను.రాజమండ్రిలో ఆరో తరగతి చదివే రోజులలో మొదటిసారి మొత్తం న్యూ టెస్టమెంట్ అంతా చదివాను. ఆతర్వాత కూడా చాలాసార్లు చదివాను.ఇప్పటికీ తరచుగా రిఫర్ చేస్తూ ఉంటాను.' 

'మరి నీవు క్రైస్తవ మతం తీసుకోవచ్చు కదా?'

'వచ్చిన చిక్కేమిటంటే బైబుల్ తో బాటుగా ప్రపంచంలోని ముఖ్యమతాల అన్ని గ్రంధాలూ అంతే శ్రద్ధతో చదివాను. అందుకే బైబుల్లో నాకేమీ ప్రత్యేకత కనిపించలేదు. క్రైస్తవులు నమ్ముతున్నట్లు అదొక ప్రత్యేక దైవగ్రంధమూ కాదు. క్రీస్తు ఒక్కడే దేవుని కుమారుడూ కాదు. నన్ను క్రైస్తవం లోకి మార్చాలని పరిచయస్తులు చాలామంది ఇప్పటికే చాలాసార్లు ప్రయత్నించారు.కాని నాతో చర్చలో కూచున్న తర్వాత వాళ్ళ పూర్వీకుల మతం అయిన హిందూమతంలోకి వారే మారేప్రమాదం ఉన్నదన్న విషయం గ్రహించి ఆ ప్రయత్నం మానుకున్నారు. ' చెప్పాను.

మళ్ళీ అనుమానంగా చూచాడు.

చిరునవ్వు నవ్వి ఇలా చెప్పాను.

'నేను బైబుల్ మాత్రమె తరచుగా చదవను. భగవద్గీత కూడా తరచుగా చదువుతాను.అదికూడా పారాయణంగా కాదు.అర్ధం చేసుకుంటూ చదవడానికి ప్రయత్నిస్తాను.అలాగే ఇంకా చాలా మతాల మూలగ్రంధాలు అప్పుడప్పుడూ చదువుతాను.జీసస్ ను గౌరవిస్తాను కూడా. కాని అంతమాత్రం చేత నేను క్రైస్తవమతం పుచ్చుకోవలసిన అవసరం నాకేమీ కనిపించదు.

నేను హిందూమతంలోకి కాలక్రమంలో చొప్పించబడిన అనేక ఆచారాలను సూటిగా విమర్సిస్తాను కూడా, కానీ నేను పక్కా హిందువునే. మహనీయులైనవారు మతాలకు అతీతులని నా నమ్మకం.హిందూమతంలోని అందరు ప్రవక్తలనూ నేను గౌరవిస్తాను.కాని మతం మారడంలో నాకు నమ్మకం లేదు.అలా మారుతూ పోతే ప్రపంచంలోని అన్ని మతాలూ రోజుకొకటి చొప్పున జన్మంతా మారుతూనే ఉండాలి. నువ్వంటే నాకు గౌరవం అయినంత మాత్రాన నేను మీ ఇంటికి వచ్చి కదలకుండా తిష్ట వేసుకుని కూచోవాల్సిన పనిలేదు.నా ఇంట్లో నేనుంటూ నిన్ను అభిమానించవచ్చు.

పైగా, జీసస్ వంటి ప్రవక్తలు చెప్పినవాటిని మతపిచ్చిగాళ్ళు చాలా వక్రీకరించారని నా విశ్వాసం.ఈ నమ్మకం ఓల్డ్ టెస్టమెంటూ,న్యూ టెస్టమెంటూ,హిందూ,బౌద్ధ,ఇంకా అనేక మతగ్రంధాలు పరిశీలనగా చదివిన మీదట నాకు కలిగింది.ఈ మతాల కేంద్ర సూత్రాలలో (core concepts) ఏమీ తేడాలు లేవు.అన్నీ దాదాపుగా ఒక్క విషయాన్నే రకరకాల కోణాలలో చెబుతున్నాయి.కాకపోతే చిన్నచిన్న తేడాలున్నాయి.ఆ తేడాలు ఆయా మతాలు పుట్టిన దేశాలు,ఆయా కాలాలు,అప్పటి సామాజిక పరిస్తితుల వల్ల కలిగాయి.కాని వీటి సారం (essence) మాత్రం ఒకటే.ఈ విషయం నాకు బాగా అర్ధమైంది.కనుక ఎవరైనా సరే మతం మారడం అంటే నాకు పిచ్చిపనిగా కనిపిస్తుంది.

పైగా లోకులు పాటించే మతాలంటే నాకు అస్సలు నమ్మకం లేదు. అవి ఉత్తుత్తి పైపై వేషాలని నా నమ్మకం.అసలైన మతం వేషంలోనూ నమ్మకంలోనూ మతం మారడంలోనూ లేదు.ఆచరణలో ఉంది. జీవితంలో విలువలను ఆచరించడానికి మతంతో పనిలేదని నా ఇంకో నమ్మకం. అందుకే గుడ్ ఫ్రైడే ఉపవాసం ఉండి ఆఫీస్ లో పని చేసుకుని ఇప్పుడు ఇంటికెళ్ళి వేదోక్తంగా సాయంకాల సంధ్యోపాసన చెయ్యబోతున్నాను.' చెప్పాను.

ఈసారి అతని ముఖంలో అనుమానం కనిపించలేదు.అయోమయం కనిపించింది.

'చివరిగా ఒకమాట. నిజమైన హిందువే అన్ని మతాలను ఏమాత్రం ద్వేషభావం లేకుండా అర్ధం చేసుకోగలడు. భక్తితో శ్రీరామునీ, పరమశివునీ, శ్రీకృష్ణునీ, జగన్మాతనూ, ఇంకా మిగతా దేవతలనూ నేను పూజిస్తాను. ఇదే నిజమైన మతమనీ, ఇటువంటి ఉదార స్వభావాన్ని ఇవ్వడమే ఈదేశపు సంస్కృతి యొక్క గొప్పదనమనీ నా నమ్మకం మాత్రమె కాదు.అనుభవం కూడా' అని ముగించాను.
read more " గుడ్ ఫ్రైడే "

25, మార్చి 2013, సోమవారం

గాలి ఇటుకల కలలసౌధం

కళ్ళు తెరిస్తే నేలరాలే సుమమేగా స్వప్నం 
చూపు నిలిపితే కాలిపోయే తీపేగా మోహం 
ఈ మర్మం బాగా తెలుసుకో నేస్తం 
కోర్కెల అలలపై పడవేగా జీవితం 
మార్పుల చేర్పుల నటనేగా జీవితం 

స్వప్న సుగంధానికై జాగ్రత్తులో అన్వేషణ 
నిత్య సుఖోపలబ్దికై తీరని జంఝాటన
నూతనమైన మాటొకటి చెప్పు నేస్తం  
తీరని ఆశల కోసం తపనేగా జీవితం
అందని తీరాల వైపు పరుగేగా జీవితం   

అందిన క్షణంలో జారిపోతుంది అనుభవం 
అంచుల వరకూ వెంటాడుతుంది పాడుగతం  
మనసు పరచి తేటగా చూడు నేస్తం 
ఎండలో నీడకై వెతుకులాటేగా జీవితం 
ఏం కావాలో తెలియని అభ్యర్ధనేగా జీవితం 

ప్రతి మనిషి హృదయమూ ఒక నిప్పుల కొలిమే 
ప్రతి గుండె కోరేదీ ఒక శాశ్వత చెలిమే 
మనసును చల్లబరిచే పాటొకటి పాడు నేస్తం  
తెలియని తపనలో కాలడమేగా జీవితం
వికసించక మునుపే రాలడమేగా జీవితం  

గాలి ఇటుకల కట్టిన కలల సౌధం జీవితం 
డొల్ల ప్రేమల చెదిరిన నీటిచిత్రం జీవితం 
నీవు కాదన్నా నీ కళ్ళు చెబుతాయి నిజం
చిమ్మచీకట్లో గమ్యం తెలియని పరుగేగా జీవితం
గెలుపు సందిట్లో నవ్వే ఓటమి పిలుపేగా జీవితం..
read more " గాలి ఇటుకల కలలసౌధం "

23, మార్చి 2013, శనివారం

M.N.Roy జాతకంలో నాస్తిక - మానవతా యోగాలు

మొన్న 21 తేదీ ఎమ్మెన్ రాయ్ పుట్టినరోజు.రాడికల్ హ్యూమనిజం సిద్ధాంతాన్ని సృష్టించి నమ్మిన ఈయన అందరు కమ్యూనిస్టుల లాగే జాతకాలనూ జ్యోతిష్యాన్నీ నమ్మేవాడు కాదు.అయితే ఒకరు నమ్మినా నమ్మకున్నా విశ్వసత్యాల కొచ్చిన భంగం ఏమీలేదు. సూర్యుడినీ చంద్రుడినీ మనం నమ్మకుంటే వారికేమీ నష్టం లేదు. నమ్మినంత మాత్రాన వారికొరిగే లాభమూ లేదు. పల్లెటూళ్ళలో ఒక సామెత వినిపిస్తుంది.'చెరువు మీద అలిగి నీళ్ళు తెచ్చుకోకపోతే ఎవరికీ నష్టం?'అని.

ఈయన ఒక మేధావి అనడంలో ఎటువంటి అనుమానమూ లేదు.అయితే అందరు మేధావుల లాగే ఈయనా చాలా విషయాలలో పప్పులో కాలేశాడు. ప్రపంచంలో ఉన్న అన్ని విషయాలూ శాస్త్రాలమీద వారికి అంతా తెలిసినట్లుగా తీర్పులు తీర్చడమే చాలామంది మేధావులు చేసిన పిచ్చిపని. నాకు ఫిజిక్స్ బాగా తెలుసు కనుక ఇక ప్రపంచంలోని అన్ని సబ్జెక్టుల మీదా నేను చెప్పే తీర్పే కరెక్ట్ అని నేనంటే ( ఆ సబ్జేక్ట్లులు నేను అధ్యయనం చేసినా చెయ్యకున్నా) అదెంత హాస్యాస్పదంగా ఉంటుంది? ఈ మేధావుల వాదనా అలాగే ఉంటుంది.నేను పొలిటికల్ సైన్స్ చదివిన రోజుల్లో మిగిలిన పొలిటికల్  తత్వవేత్తల సిద్ధాంతాలతో పాటు రాయ్ యొక్క 'రాడికల్ హ్యూమనిజం' గురించి కూడా చదివాను.

రాయ్ ఇలా అన్నారు."జాతకాల మీద నాకు నమ్మకం లేదు. ఒకవేళ మార్క్స్ తనంతట తాను జాతకం చెప్పినా నేను నమ్మను".ఆయన నమ్మకాలు ఆయన వ్యక్తిగతమైనవి.నమ్మకం అనేది అనుభవం నుంచీ పరిశీలన నుంచీ కలగాలి.ఒక సబ్జెక్టులో ఈ రెండూ లేనప్పుడు దానిమీద నమ్మకాలూ అభిప్రాయాలూ ఏలా ఏర్పడతాయో నాకెప్పటికీ అర్ధం కాదు. మనకొక విషయం మీద పరిశీలనా అనుభవమూ లేనప్పుడు దానిపట్ల ఏ భావమూ లేకుండా తటస్తంగా ఉండటమే నిజమైన మేధావి లక్షణం.

సరే ఆ విషయం  అలా ఉంచి, ఆయనకున్న కమ్యూనిస్ట్ భావాల గురించి,మత వ్యతిరేక భావాల గురించి ఒక్కసారి ఆయన జాతకం ఏమంటున్నదో చూద్దాం.ఎందుకంటే ఆయన నమ్మినా నమ్మకున్నా జ్యోతిష్యవిజ్ఞానం అబద్దం చెప్పదు. ఆ విషయం న్యూయార్క్ లైబ్రరీలో కూచుని ఆయన చదివిన పాశ్చాత్యగ్రంధాలవల్ల ఆయనకు తెలిసి ఉండకపోవచ్చు.అది ఆయన తప్పు కాదు.

ఈయన జనన సమయం తెలియలేదు.అయినా పరవాలేదు.జనన తేదీ తెలుసు.ఈయన 21-3-1887 న కలకత్తా దగ్గర లోని అర్బెలియా అనే ఊళ్ళో ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాడు. కొన్ని ప్రత్యెక సింపుల్ విధానాలు ఉపయోగించి ఈయన జాతకాన్ని ఒక్కసారి పైపైన పరిశీలిద్దాం.
  • ఈయన జాతకంలో ఆత్మకారకుడు శని అయ్యాడు. కారకాంశ మేషం అయింది.అక్కణ్ణించి గురువు సప్తమంలో ఉన్నాడు.కనుక ఈయనకు సాంప్రదాయ మతం అంటే గిట్టదని క్లియర్గా కనిపిస్తున్నది.
  • ఈయన జాతకంలో 'ఏకాకి గ్రహం' (lonely planet) శని అయ్యాడు.అంటే ఈయన బాగా లోతైన చింతనాపరుడన్న విషయం కనిపిస్తున్నది.అంతేగాక ఈయన సామాన్యజనం గురించిన ఆలోచన లోనే జీవితమంతా గడుపుతాడు అని సూచన కూడా ఉన్నది.
  • ఈయన జాతకంలో గురువు బుధుడు వక్రించి ఉన్నారు.అంటే మతానికి ఈయన దూరం అని ఇంకొక సూచన ఉన్నది.అలాగే ఈయన మేధావి అయినప్పటికీ ఆ తెలివితేటలు పెద్దగా ఎవరికీ ఉపయోగపడవు(కనీసం ఆయనక్కూడా)అనీ సూచన ఉన్నది.అందుకే ఈయన కమ్యూనిష్టులలో కూడా మైనార్టీ అయ్యాడు.వారిలో కూడా స్టాలిన్ వంటి వారితో ఈయనకు శత్రుత్వం ఉన్నది.కమ్యూనిజం కూడా కేంద్రీకృత అధికారంతో ఇంకొక రాచరికవ్యవస్థగా మారడాన్ని ఈయన వ్యతిరేకించాడు.కాని చాలా కమ్యూనిష్టు పార్టీలలోనూ దేశాలలోనూ అదే జరిగింది.కమ్యూనిజం అయినా ఇంకే 'ఇజం' అయినా ప్రాధమికంగా మానవ మనస్తత్వంలో మార్పెలా వస్తుంది?దానికి నిజమైన మతమే మార్గం.
  • రవిబుధులిద్దరూ చాలా దగ్గరగా ఇద్దరూ శనినక్షత్రంలో ఉండటం వల్లా,ఆశని నవాంశలో నీచస్తితిలో ఉండటం వల్లా ఒక విషయం గోచరిస్తున్నది.ఈయన తెలివితేటలను సామాన్యజనం కోసమే వెచ్చిస్తాడు. కాని ఈ వ్యవహారం వల్ల చివరికి ఈయనకు ఏమీ ఉపయోగం ఉండదు అన్న విషయం తెలుస్తున్నది.ఇతనికి జనసందోహంతో తీరని కర్మ చాలా ఉన్నది. అందుకే జీవితమంతా జనాన్ని గురించి ఆలోచిస్తూ గడిపాడు.
  • రవి బుధులకు తోడుగా కుజుడు ఉండటం వల్ల ఈయన వాదనలోనూ తర్కంలోనూ చాలా మొండిమనిషి అనీ,తనకు దొరికిన కుందేలుకు రెండే కాళ్ళని గట్టిగా వాదిస్తాడని తెలుస్తున్నది.
  • నీచస్థితిలో ఉన్న వక్రబుధునితో కుజుని కలయిక నాస్తిక యోగాన్నిస్తుంది.ఈ యోగం ఈయన జాతకంలో ఉండటం క్లియర్ గా చూడవచ్చు. ఈ యోగం ఉన్నవారు వారికి తెలిసిన కొద్ది సమాచారాన్ని జెనరలైజ్ చేసుకుని దానికి కుతర్కాన్ని జోడించి అభిప్రాయాలు ఏర్పరచుకుంటారు.వీరికి వక్రగురువు అష్టమంలో ఉండటం ఈ యోగానికి ఇంకా బలాన్నిచ్చింది.
  • వక్ర గురువు నవాంశలో నీచస్తితిలో ఉండటం వల్ల కూడా సాంప్రదాయ మతం అంటే ఈయనకు గిట్టదని అర్ధం అవుతున్నది. 
  • చంద్రుడు కేతువుతో కలిసి శనిరాశిలో ఉండటం వల్ల మానవతా వాదమైన రాడికల్ హ్యూమనిజాన్ని స్థాపించాడని కనిపిస్తున్నది.దీనికి కారణం ఆయన వయసులో ఉన్నపుడు ఆయన్ను ప్రభావితం చేసిన  వివేకానంద,అరవిందుల భావాలే.
  • ఒక మనిషికి మతం అంటే పడక పోవచ్చు.కాని మానవత్వం అనేదానిని అతను ప్రేమించవచ్చు.వివేకానందుడు దీనినే అసలైన మతం అన్నాడు.ఈయన జాతకంలో చంద్ర కేతువులూ శనీ ప్రభావం వల్ల ఈయన ఒక మానవతావాదిగా మారాడు.నిజమైన మతంలో మానవతావాదం అంతర్లీనంగా ఉండాలి.అది లేని మతం ఆ పేరుకు తగదు.
  • ఉదాహరణకి,చాదస్తపు మతవాదులన్నా పురోహితులన్నా నాకూ పడదు.అయితే ఆ పడకపోవడానికి కారణాలు మతపరమైనవి కావు. వారిలో మానవత్వం లేకపోవడం,అహంకారం ఎక్కువగా ఉండటం మాత్రమే వారంటే నాకు అసహ్యాన్ని కలిగిస్తుంది.అంతమాత్రం చేత నేను నాస్తికుణ్ణి ఎలా అవుతాను? 
  • మానవత్వం అనే పునాది మీదనే నిజమైన మతం కట్టబడాలి అని నేనూ నమ్ముతాను.అహంకారంతో నిండిన ఒక పురోహితుడిని నేను దూరంగా ఉంచుతాను.అదే అహంకారం లేకుంటే ఒక సామాన్యుడిని కూడా నేను స్నేహితుడిగా అంగీకరిస్తాను.ఇదే నిజమైన మతం అని రాయ్ నమ్మినట్లైతే నా దృష్టిలో రాయ్ నిజమైన మతవాదే. 
  • ఈయన ఎప్పుడూ నమ్మని జ్యోతిష్య శాస్త్రం ఈయన జీవితాన్ని సరిగ్గా బొమ్మ గీసినట్లు చూపించడమే ఒక విచిత్రం.దీనివల్ల ఆయన నమ్మకం గురించి ఏమి రుజువౌతున్నదో నేను మళ్ళీ విశదీకరించడం అనవసరం అనిపిస్తున్నది.
  • పామును నేను నమ్మను అని ఒకరన్నంత మాత్రాన అతనిమీద పాము విషం పనిచెయ్యకుండా ఆగిపోదు.ఔషధాన్ని నమ్మని వారికి కూడా సేవించిన ఔషధం పనిచేస్తుంది.ఆ రోగాన్ని నయం చేస్తుంది.అలాగే జ్యోతిషాన్ని నమ్మని వారి జాతకంలో కూడా వారి మనస్తత్వమూ నమ్మకమూ చక్కగా కనిపిస్తూ ఉంటుంది.ఆబ్జెక్టివ్ సత్యాలకూ మనం అనేక కారణాలవల్ల ఏర్పరచుకునే సబ్జెక్టివ్ అభిప్రాయాలకూ చాలాసార్లు పొంతన ఉండదు.
  • కమ్యూనిష్టులలో కూడా ప్రజలను మోసం చేసి ఆస్తులు కూడబెట్టిన దొంగ కమ్యూనిష్టులున్నట్లే జ్యోతిష్కులలో కూడా మోసగాళ్ళు ఉండవచ్చు.కాని జ్యోతిష్య శాస్త్రం అబద్దం కాదు.దీనిని అధ్యయనం చేస్తే ఈ విషయం తెలుస్తుంది.
సత్యానికీ నమ్మకానికీ సంబంధం లేదు.మన నమ్మకం సత్యాధారం కావచ్చు కాకపోవచ్చు.కానీ మన నమ్మకంలోనే లొసుగు ఉన్నప్పుడు ఆ నమ్మకమే వేదం అంటే మాత్రం హాస్యాస్పదం గా ఉంటుంది.
read more " M.N.Roy జాతకంలో నాస్తిక - మానవతా యోగాలు "

21, మార్చి 2013, గురువారం

సంగీతం-జ్యోతిషం-2 (ఎమ్మెస్ సుబ్బులక్ష్మి జాతకం)

సంగీత ప్రపంచంలో ముందుగా కొందరు గాయనీమణుల జాతకాలు చూచి తర్వాత గాయకుల వద్దకు వద్దాం.సంగీత సామ్రాజ్యంలో  ఎమ్మెస్ సుబ్బులక్ష్మి గానానికీ గాత్రానికీ ఒక ప్రత్యేకత ఉన్నది. లతామంగేష్కర్ కూడా ఆమె గానాన్ని అభిమానించేదంటే ఆ గాత్రమాధుర్యం ఎలాంటిదో అర్ధం చేసుకోవచ్చు.కర్నాటక సంగీతంలో ముగ్గురు ప్రసిద్ధ మహిళా గాయనీ మణులలో సుబ్బులక్ష్మి పేరు ప్రధమంగా చెప్పుకోవాలి.మిగతా ఇద్దరు-డీ.కే.పట్టమ్మాళ్,ఎమ్మెల్ వసంత కుమారి. వీరి ముగ్గురి జాతకాలూ వరుసగా పరిశీలిద్దాం.

అదృష్టవశాత్తూ మిగతావారిలా కాకుండా ఎమ్మెస్ జననసమయం మనకు  లభిస్తున్నది. ఈమె 16-9-1916 న 9.30 కు మదురై లో జన్మించారు. జాతక చక్రం ఇక్కడ చూడవచ్చు.

ఈమె భరణీ నక్షత్రంలో జన్మించారు. గురుచంద్ర సంయోగం వల్ల గజకేసరీయోగం ఈమె జాతకంలో ఉన్నది.కాని గురువు వక్రస్తితివల్ల ఈమెకు ధార్మికరంగంలో ఎంతో కర్మ బాకీ ఉండిపోయిందని చెప్పాలి.కనుకనే జీవితమంతా భక్తిపరమైన ధార్మికమైన సంగీతం ఆలపించినా దానిమీద ఆమె సంపాదించినది పెద్దగా లేదు. ఒకవేళ సంపాదించినా అక్కడికక్కడే ఏదో దానధర్మాలకు ఆ డబ్బును ఇచ్చివేసేది.ధనమ్మీద పెద్దగా ఆశలేకపోవడం వల్లనే పాడే సమయంలో ఆమెలో నిశ్చలనిమగ్నతా ఆ గళంలో ఏదో అలౌకికమైన మహత్తూ కనిపించాయేమో అనిపిస్తుంది.

చంద్రలగ్నాత్ తృతీయాదిపతి అయిన బుధుడు ఆరింట ఉచ్చస్తితిలో ఉండటం చూడవచ్చు. ఆత్మకారకుడు కూడా ఈమె జాతకంలో బుదుడే అయి ఉన్నాడు.బుధుని ఉచ్చ స్తితివల్లె ఆమెకు అపారమైన సంగీతప్రతిభ సహజంగా కలిగింది.బుధదశ మొదలు కావడంతోనే ఆమెను 'భారతరత్న' అవార్డ్ వరించింది. వాక్ స్తానాధిపతి అయిన శుక్రుడు విద్యాస్తానంలో శని కేతువులతో కలిసి ఉండటంవల్ల ఈమె సాధారణ గాయకురాలు కాదనీ నిజమైన ఆధ్యాత్మిక నిమగ్నత కలిగిన గాయకురాలనీ అర్ధమౌతుంది. అందుకే ఆమె గానం చేస్తున్నపుడు నిశ్చలమైన ధ్యానస్తితిలో ఉండి పాడటం గమనించవచ్చు. 

సూర్యుని రాశిసంధి స్తితివల్ల ఆమె తనయొక్క స్వచ్చమైన గాన నైపుణ్యానికీ వృత్తికీ మధ్య సంఘర్షణ అనుభవించినదని అర్ధమౌతుంది.తన గాన ప్రావీణ్యానికి తగిన అధికారపదవులు ఆమెను వరించలేదు.దీనికి కారణం సూర్యుని రాశిసంధి స్తితి.బహుశా ఆమెకూడా వాటిని కోరుకొని ఉండదు. చంద్రలగ్నాధిపతి అంగారకుడు నవాంశలో ఉచ్ఛస్తితివల్ల,ఆయనకూ గురువుకూ ఉన్న పరస్పర దృష్టివల్ల ధార్మికంగా చాలా పట్టుదలా నియమనిష్టలూ కలిగిన వ్యక్తి అని తెలుస్తుంది.అలాగే శని శుక్రులు కేతువుతో సంయోగం చెందటంవల్ల,మెరుపులతో కూడిన కళారంగంలో ఉంటూ కూడా నిర్లిప్తతతో కూడిన విరాగాన్ని ఆమె కలిగి ఉండేదన్న విషయం చూడవచ్చు.

లగ్నాత్ ద్వితీయాదిపతి లగ్నంలో ఉంటూ తృతీయాధిపతి అయిన గురువు చేతా,దశమాదిపతి అయిన పూర్ణచంద్రుని చేతా చూడబడటం ఒక గొప్ప యోగం.ఈ యోగం ఈమెకు మంచి సంగీత ప్రజ్ఞను కట్టబెట్టింది. అంతేగాక సంగీతాన్ని ఆమె వృత్తిగా చేసుకున్నదనీ అందులో ఆమెకు గొప్ప పేరు ప్రఖ్యాతులు వస్తాయనీ సూచన ఉన్నది.

ఈమె జనన సమయంలో శుక్ర/బుధ/శుక్ర దశ జరుగుతూ ఉండటం గమనిస్తే  ఈమెకు సంగీత సరస్వతీ కటాక్షం పుట్టుకనుంచే ఎంత బలంగా ఉన్నదో అర్ధమౌతుంది.అంతేగాక గత వ్యాసంలో నేను చెప్పినట్లు కళారంగానికీ ముఖ్యంగా సంగీతానికీ బుధశుక్రుల అనుగ్రహం తప్పకుండా ఉండాలి అన్న సూత్రం ఇక్కడ అక్షరాలా రుజువు కావడం గమనించవచ్చు.గతజన్మలో ఎంతో సాధనా పుణ్యబలమూ ఉంటేనే ఈ జన్మలో చిన్నప్పటినుంచే ఇంతటి ప్రతిభ అలవడుతుంది.లేకుంటే ఇలాంటి గ్రహస్తితులు ఉండటం దుర్లభం. ఇలాంటి ప్రతిభ కూడా అసాధ్యమే.

శాస్త్రీయ సంగీతంలో మాత్రమె గాక భజనలు పాడటంలోనూ మామూలు పాటల్లోనూ కూడా ఈమె సిద్ధగాత్రం కల్గిన విదుషీమణి. ఈమె గానానికి ముగ్దులవని వారు ఉండరు అంటే అతిశయోక్తి కాదు.అన్ని భాషలలో ఆ ఉచ్చారణ సరిగ్గా సరిపోయేటట్లు ఆమె ఎలా పాడగలిగిందా అని ఆలోచిస్తే అబ్బురం అనిపిస్తుంది.

ఈమె జీవితంలో ముఖ్య ఘట్టాలను జాతకపరంగా పరిశీలిద్దాం.


1926 లో పదేళ్ళ వయసులో చంద్రదశ మొదలవ్వడంతోనే ఆమెకు కీర్తిప్రతిష్టలు రావడం మొదలైంది. అదే సమయంలో ప్రధమంగా హైస్కూల్ లో జరిగిన ఒక కార్యక్రమంలో ఒక మరాటీ పాట పాడింది.అదే ఏడు తన మొదటి రికార్డింగ్ కూడా జరిగింది.సహవాయిద్యంగా  తల్లిగారైన షణ్ముగవడివు వీణానాదం తోడైంది.

సభాముఖంగా తన మొదటి కచ్చేరి పదకొండేళ్ళ వయసులో తిరిచినాపల్లిలో ఇచ్చింది.ఇదీ చంద్ర దశ మొదట్లోనే జరిగింది. 

1929 లో పదమూడేళ్ళ వయసులోనే ప్రతిష్టాత్మక మద్రాస్ మ్యూజిక్ అకాడెమీ లో ఆమె మొదటి సంగీత కచ్చేరి చేసింది.అప్పుడు చంద్ర/గురు దశ ఆమెకు జరిగింది. అప్పటివరకూ అక్కడ ఆడవారిని పాడనిచ్చేవారు కారు.గురు అనుగ్రహం వల్ల ఈ ఖ్యాతి ఆమెకు దక్కింది.

ఆమె చాలా చిన్నవయసులోనే సంగీత సాధన మొదలుపెట్టింది.కర్నాటక సంగీతాన్ని సెమ్మంగుడి శ్రీనివాసయ్యర్ దగ్గరా,హిందూస్తానీ సంగీతాన్ని పండిత నారాయణరావ్ వ్యాస్ దగ్గరా నేర్చుకున్నది.సంస్కృతాన్నీ తెలుగునూ నేదునూరి కృష్ణమూర్తి వద్ద అభ్యసించింది.అందుకే ఆమె ఉచ్చారణ అంత స్పష్టంగా ఉత్తరాది బెంగాలీ గుజరాతీ గాయకులలో ఉండే ఉచ్చారణా లోపాలు లేకుండా ఉండేది. అపభ్రంశ శబ్దాలు లేకుండా అర్ధానికి తగినట్లు పదాలను స్పష్టంగా పలకడం బహుశా ఆమెకు సంస్కృతమూ తెలుగూ నేర్చుకున్నందువల్లనే వచ్చి ఉండవచ్చు. 

1938 లో 'సేవాసదనం' అనే తమిళ సినిమాలో నటించింది.అప్పుడామెకు కుజ/గురు దశ జరిగింది.1941 లో 'సావిత్రి' అనే సినిమాలో నారదునిగా నటించింది.అప్పుడు కుజ/శుక్ర దశ జరిగింది.1945 లో 'భక్త మీరా' అనే సినిమాలో ఆమె నటించి పాడిన భజనలు ఆమెకు ఎంతో ఖ్యాతిని తెచ్చి పెట్టాయి.ఈ సినిమా 1947 లో హిందీలో తీయబడింది.మొదటి రెండు సినిమాలు ఆమెకు ప్రాంతీయంగా పేరును తెస్తే చివరి రెండు సినిమాలు ఆమెకు జాతీయ ఖ్యాతిని ఆర్జించి పెట్టాయి.అప్పుడామెకు కుజదశ అంతమై,రాహుదశ మొదలైంది.రాహువు శనీశ్వరుని సూచిస్తూ తులా లగ్నానికి యోగకారకుడౌతున్నాడు. హిందీ 'మీరా' సినిమా విడుదలైనప్పుడు ఆమెకు రాహు/గురు దశ జరిగింది.ఈ విధంగా గురు అనుగ్రహం ఆమెకు ప్రతిసారీ కలుగుతూనే వచ్చింది.

1954 లో పద్మభూషణ్ అవార్డ్ ఆమెను వరించింది.అప్పుడామెకు రాహు/శుక్ర దశ జరిగింది.1956 లో కూడా ఇదే దశ జరుగుతూ ఉన్నపుడు సంగీత నాటక అకాడెమి అవార్డ్ ఆమెకు ప్రదానం చెయ్యబడింది. 

రాహుదశ తర్వాత జరిగిన గురుదశ ఆమె ఖ్యాతిని అత్యున్నత శిఖరాలకు చేర్చింది.ఈమె జాతకంలో రాహువు కేంద్ర స్తితిలో ఉండటం వల్లనూ,శని ప్రతినిధి కావడం వల్లనూ యోగాన్నిచ్చాడు.గురువు గజకేసరీ యోగంలో ఉన్నాడు. కనుక రెండు దశలూ ఆమెకు యోగించాయి.

1966 లో గురు/బుధ దశలో యునైటెడ్ నేషన్స్ లో కచేరి ఇచ్చి ప్రపంచ దేశాల ప్రశంశలను అందుకున్నది.గురు బుధుల యోగాలను ముందే అనుకున్నాం.

1968 లో గురు/కేతు దశ జరిగినప్పుడు మద్రాస్ మ్యూజిక్ అకాడెమీ ఇచ్చే అత్యున్నత బిరుదైన 'సంగీత కళానిధి' అవార్డ్ ఆమెను వరించింది.ఈ అవార్డ్ పొందిన మొట్టమొదటి మహిళ ఈమె.కేతువు కేంద్ర స్తితీ,శని శుక్రులతో కలిసి ఉండటమూ దీనికి కారణాలు.

1974 లో గురు/కుజ దశ జరిగినప్పుడు రామన్ మెగసెసే అవార్డ్ ఆమెను వరించింది.లగ్న సప్తమ రాశుల యోగంవల్ల ఈ ఔన్నత్యం కలిగింది.

1975 లో గురు/రాహు దశ జరిగినప్పుడు 'పద్మవిభూషణ్' బిరుదు ప్రదానం చెయ్యబడింది.గురు రాహువుల స్తితులు ముందే అనుకున్నాం.అయితే ఇది దశాఛిద్రకాలం కనుక ఈ సమయంలో ఆమెకు కుటుంబంలో కష్టాలు మొదలయ్యాయని ఊహించవచ్చు.కాని ఆ కోణాలు ప్రస్తుతం మనకు అనవసరం గనుక వాటిపై మనం వ్యాఖ్యానించడం తగదు. 

కాని అన్నమాచార్య కీర్తనలను వెలుగులోకి తెచ్చే ఒక సంఘటన ఈ సమయంలో జరిగింది. అది మాత్రం చూద్దాం.ఎంతటి గొప్పవారికైనా ఏదో ఒక సమయంలో కష్టాలు తప్పవు. ఎంతటి మంచి చేసే గ్రహాలైనా ఏదో ఒక దశలో బాధలు పెట్టక మానవు.అలాగే సుబ్బులక్ష్మి జీవితంలో కూడా జరిగింది. 1979 లో ఆమె భర్త సదాశివన్ తన కల్కి పత్రికలో నష్టాలవల్ల తమ ఇంటిని అమ్మేసి మద్రాస్లో వల్లువార్ కొట్టం అనే ఒక మారుమూల ప్రాంతంలో అద్దె ఇంటికి మారవలసి వచ్చింది.ఆ సమయంలో సరిగ్గా ఎమ్మెస్ జాతకంలో శని మహాదశ మొదలైంది.శని/శని జరుగుతున్న సమయంలో వాళ్ళు డబ్బుకు చాలా ఇబ్బందులు పడ్డారు.దేశాధినేతల సత్కారాలందుకున్న ఆమె అలాంటి పరిస్తితిని ఎదుర్కొనవలసి రావటం చూస్తె విధి అనేది ఎంత బలీయమో కదా అనిపించకమానదు.ఆ దంపతులు మానధనులు.ఎవరినీ చేయి చాచి అడగకపోగా,ఊరకనే ఎవరైనా ఇచ్చినా తీసుకోరు. 

ఈ పరిస్తితిలో,ఎలా వీరికి సహాయం చేయాలా అని అనేకమంది మహనీయులు ఆలోచించి చివరికి తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో గా ఉన్న పీవీ ఆర్కే ప్రసాద్ గారిద్వారా మరుగున పడిన అన్నమాచార్య కీర్తనలను వెలుగు లోకి తేవాలన్న సదుద్దేశ్యానికి ఈ పరిస్తితిని జోడించి 'బాలాజీ పంచరత్నమాల' రికార్డులను చెయ్యడమూ దాని రాయల్టీని ఆమెకు  చేతికి ఇవ్వకుండా బ్యాంక్ లో వేసి ఆ వడ్డీని ఆమెకు వచ్చేలా చెయ్యడమూ జరిగాయి.ఎందుకంటే చేతికిస్తే తనకంటూ ఏమీ ఉంచుకోకుండా వెంటనే ఎవరికో దాన ధర్మాలకు ఇచ్చేసే మనస్తత్వం ఆమెది.లగ్నాత్ యోగకారకుడైన శని,చంద్ర లగ్నాత్ బాధకుడు కావడం దీనికి కారణం.గోచార రీత్యా అప్పుడు వక్రిగా ఉన్న శని ఆ స్తితిని వదల్చుకొని అతిచారముతో వేగంగా కన్యారాశిలో ప్రవేశిస్తున్నాడు.కన్య లగ్నాత్ ద్వాదశం కావడంతో బాధలు పెట్టాడు.కాని శని/బుధ అంతర్దశ మొదలు కావడం తోనే పరిస్తితి మెరుగుపడి దైవానుగ్రహం ఆమెపైన వర్షించింది. కారణం ఇంతకు ముందు చెప్పినట్లు ఆత్మకారకుడైన బుధుడు ఉచ్ఛస్తితిలో ఉండటమే. బుధునికి అధిదేవత విష్ణువని గుర్తుంచుకుంటే ఈ సమయంలో వేంకటేశ్వరుని కటాక్షంతో వారి బాధలు తీరిన వైనం ఎంత చక్కగా సరిపోయిందో అర్ధమై గ్రహప్రభావం ఎంత ఖచ్చితమో తెలుస్తుంది.

1988 లో శని/చంద్ర దశ జరిగినప్పుడు మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చే 'కాళిదాస్ సమ్మాన్' అవార్డ్ ఆమెను వరించింది.తులా లగ్నానికి శని యోగ కారకుడు.దశమంలో ఉంటూ వృత్తిపరమైన గౌరవాన్ని సూచిస్తున్నాడు.చంద్రుడు దశమాధిపతిగా గజకేసరీ యోగంలో ఉన్నాడు. 

1990 లో శని/రాహు జరిగినప్పుడు ఆమెకు ఇందిరా గాంధీ అవార్డ్(జాతీయ సమైక్యతకు) ప్రదానం చెయ్యబడింది.రాహువు మకరంలో ఉంటూ శనిని సూచిస్తున్నాడు.

1998 లో ఆమె జాతకంలో బుధదశ ప్రారంభం అయింది.బుధ/బుధ దశ జరిగినప్పుడు భారతదేశ అత్యున్నత బిరుదైన 'భారతరత్న' ఆమె సొంతం అయింది.ఆత్మకారకుడైన బుధుడు ఆమె జాతకంలో ఉచ్చస్తితిలో ఉన్న ప్రభావం అది.

ఎన్ని ప్రదర్శనలిచ్చినా ఎన్ని బిరుదులు సొంతం చేసుకున్నా ఆమెలో ఒక్క విశిష్ట గుణం కనిపించేది. తన ప్రదర్శనల వల్ల వచ్చిన ధనంలో సింహభాగం ఆమె దానధర్మాలకూ, వివిధ సంస్థలకు (ఫండ్ రైసింగ్ కార్యక్రమాలకూ)  అక్కడికక్కడే ఇచ్చి వేసేది. లోకమంతా జేజేలు పలుకుతూ ఆమె ప్రతిభను గౌరవించినా కూడా ఆమెలో కించిత్తు గర్వంగానీ అహంకారంగానీ కనిపించేది కాదు. పైపెచ్చు వినమ్రతతో కూడిన సంస్కారం ఆమె ముఖంలో తొంగి చూచేది. లతామంగేష్కర్ అన్నట్లుగా సుబ్బులక్ష్మి ఒక 'తపస్విని' గానే జీవితమంతా బ్రతికినట్లు కనిపిస్తుంది.

లతా మంగేష్కర్ ఆమెను 'తపస్విని'అని పిలిచింది. ప్రఖ్యాత హిందూస్తానీ గాయకుడు బడెగులాం ఆలీఖాన్ ఆమె పేరు సుబ్బులక్ష్మి కాదు 'సుస్వరలక్ష్మి' అన్నాడు.కిశోరీ అమోంకర్ అయితే ఆమెను 'ఆట్ట్వా సుర్' (ఎనిమిదో స్వరం) అన్నాడు.సరోజినీ నాయుడు ఆమెను 'గానకోకిల' అని పిలిచింది. ఎవరెన్ని రకాలుగా ప్రశంసించినా ఆమె అదంతా దైవం యొక్క,తన గురువైన కంచి పరమాచార్యుల యొక్క అనుగ్రహంగానే భావించేది. 

ఆమె కంచి పరమాచార్యుల శిష్యురాలు.ఆయనంటే ఆమెకు విపరీతమైన భక్తి  ఉండేది. ఆ భక్తి చాలామంది మనుషులు తమ గురువుల పట్ల చూపించే దొంగభక్తి కాకుండా త్రికరణశుద్ధి తో కూడిన భక్తిగా ఉండింది.అందుకే ఆమె గురు అనుగ్రహాన్ని అంతగా చూరగొనగలిగింది.స్వామికి కూడా తన శిష్యురాలైన ఎమ్మెస్ అంటే అమితమైన వాత్సల్యం ఉండేది. 

ఆమె సంగీతసాధనతో దైవాన్ని చేరుకుందో లేదో మనకు తెలియదు గాని ఆమె పాడిన భజగోవింద శ్లోకాలనూ,విష్ణు సహస్రనామాలనూ, మీరా భజనలనూ,అన్నమయ్య,త్యాగయ్య,ఇంకా అనేక ఇతర మహనీయుల కీర్తనలనూ వింటుంటే మనకే కళ్ళముందు భగవంతుడు నిలిచినంత అనుభూతి కలుగుతుంది. సంగీతం నిజంగా దైవాన్ని చేర్చే సాధనమే అన్న సత్యం ఇలాంటి గాయనీమణులను చూచినప్పుడు మనకు రూడిగా అర్ధమౌతుంది.

ఈ విధంగా,ఈమె జాతకంలో చంద్రుడూ, కుజుడూ, రాహుకేతువులూ, గురువూ,శనీ,బుధుడూ అందరూ ఆమెను అమితంగా అనుగ్రహించారు. సూర్యుడు ప్రాపంచికం కంటే కూడా ఆధ్యాత్మికమైన వరాలను ఈమెకు ఇచ్చినట్లు తోస్తుంది.ఇంతకుముందు నేను వ్రాసినట్లుగా,నిజమైన సంగీత సరస్వతీ కటాక్షం కావాలంటే నవగ్రహాలూ కరుణించక తప్పదు అన్న విషయం సుబ్బులక్ష్మి జీవితం గమనిస్తే నిజమే అని ఎవరికైనా అనిపించక మానదు.


ఆమెకు సంతానం లేని విషయాన్నీ, భర్తకు రెండో భార్య కావడాన్నీ జ్యోతిష్య పరంగా విశ్లేషించలేదు. ఎందుకంటే ఆమె జాతకంలోని అన్ని కోణాలు స్పర్శించడం ఈ వ్యాసం ఉద్దేశ్యం కాదు.సంగీతం వరకే నేను చూచాను.కాని ఆ కోణాలు కూడా కావలసిన వారికి పై చక్రంలో వాటిని దర్శించడం పెద్ద కష్టమేమీ కాదు. సంతాన కారకుడైన గురువు వక్రస్తితీ,దానికి తోడు  పంచమాధి పతి శనికేతు గ్రస్తుడవడమూ,భావ చక్రంలో నవమం శనికేతువులతో కూడి యుండటమూ గమనిస్తే సంతాన విషయం తెలుస్తుంది.ఇకపోతే, వివాహవిషయం ఇక్కడ వ్రాయడం భావ్యం కాదు గనుక వ్రాయడం లేదు.చివరిగా ఒక కొసమెరుపు. రాశిచక్రం కంటే భావ చక్రంలో ఎమ్మెస్ జాతకం ఇంకా స్పష్టంగా కనిపిస్తుంది.రాశులిచ్చే ఫలితాలకు రాశిచక్రాన్నీ భావాలిచ్చే ఫలితాలకు భావచక్రాన్నీ చూడాలి. భావపరులైన జాతకులకు భావచక్రాన్నే చూడవలసి ఉంటుంది.ఇది ఎలా తెలుసుకోవాలి?అంటే అనుభవం మీద అంతా తెలుస్తుంది అనే జవాబు వస్తుంది.ఔత్సాహిక జ్యోతిష్కుల సౌకర్యార్ధం భావచక్రాన్ని కూడా ఇక్కడ పొందుపరుస్తున్నాను.

వచ్చే వ్యాసంలో మిగిలిన ఇద్దరు గాయనీమణుల జాతకాలు పరిశీలిద్దాం.
read more " సంగీతం-జ్యోతిషం-2 (ఎమ్మెస్ సుబ్బులక్ష్మి జాతకం) "

18, మార్చి 2013, సోమవారం

నిత్య జీవితంలో ప్రశ్న శాస్త్రం -- లాటరీ తగులుతుందా?


నిన్న సాయంత్రం అయిదు గంటలకు ఒక వ్యక్తి నన్ను ఇలా ప్రశ్నించారు.

"నేను ముప్ఫై లాటరీ టికెట్లు కొన్నాను.ఈ రోజు రాత్రి తొమ్మిది గంటలకు లాటరీ తీస్తున్నారు. పదిహేను ప్రైజులున్నాయి. వాటిలో ఏదైనా నాకు తగులుతుందా?"

వెంటనే మనోఫలకం మీద ప్రశ్నచక్రాన్ని పరిశీలించాను.
  • ప్రశ్న సమయానికి సింహ లగ్నం ఉదయిస్తున్నది.
  • స్పెక్యులేషన్ కారకుడైన బుధుడు లగ్నానికి ఎదురుగా సమసప్తకంలో వక్ర స్తితిలో ఉన్నాడు.యితడు లాభాధిపతి కూడా అయ్యాడు.
  • లగ్నాధిపతి సూర్యుడు అష్టమంలో ఉంటూ పృచ్చకుని ఆశనూ,లాటరీకి సంబంధించిన ప్రశ్న అనీ సూచిస్తున్నాడు. అయితే ఇది జరగదు అని కూడా అష్టమం వల్ల సూచన వచ్చింది.
  • దశమాదిపతి శుక్రుడు సున్నా డిగ్రీలలో రాశి సంధిలో ఉన్నాడు. 
  • శ్రీ లగ్నం ద్వాదశ స్థానంలో పడింది.
ఇక ఎక్కువగా చూడటం అనవసరం అనుకోని, "తగలదు" అని చెప్పాను.

రాత్రి పది గంటలకు లాటరీలోని పదిహేను ప్రైజులలో ఒక్కటి కూడా అడిగిన వ్యక్తికి తగలలేదని తెలిసింది.
read more " నిత్య జీవితంలో ప్రశ్న శాస్త్రం -- లాటరీ తగులుతుందా? "

14, మార్చి 2013, గురువారం

సంగీతం-జ్యోతిషం-1

ప్రపంచంలో ఉన్న ఏ రంగాన్నైనా జ్యోతిశ్శాస్త్ర కోణంలో పరిశీలించి అర్ధం చేసుకోవచ్చు.అది ఈ శాస్త్రపు మహాత్యాలలో ఒకటి.సంగీతం దీనికి మినహాయింపు కాదు.

అసలు, సంగీతానికి జ్యోతిశ్శాస్త్రానికి యోగశాస్త్రానికి అవినాభావ సంబంధం ఉన్నది అని నేనంటాను.సప్తస్వరాలకూ సప్తగ్రహాలకూ సప్తచక్రాలకూ ఉన్న సంబంధం సంగీతయోగపు లోతులు తెలిసినవారికి విదితమే.

సంగీతం ఒక యోగం.దాని పరమ ప్రయోజనం గాయకుని ఆత్మను కరిగించి దైవానుభూతిని అతనికి కలిగించడం.వినేవారి మనస్సులను మానవ లోకపు వ్యధార్తసీమల నుంచి దాటించి అనిర్వచనీయమైన దివ్యానుభూతినిచ్చే ఎత్తులకు చేర్చడమే అసలైన సంగీత ప్రయోజనం. అటువంటి ప్రభావం చూపాలంటే ఆ గాయకునిలో ఆర్తి ఉండాలి.సాధన ఉండాలి. అతనికి హృదయపవిత్రత ఉండాలి.అతనిలో కృతకమైన ప్రజ్ఞ మాత్రమె కాక స్వచ్చమైన భావనాబలమూ, కల్మషరహితమైన మనస్సూ ఉండాలి.పాడుతున్న పాటలో లీనమై ఆ పాట సూచిస్తున్న భావంలో నిమగ్నమైన చిత్తంతో గానం చెయ్యాలి. ఒక్క మాటలో చెప్పాలంటే తాను మాయం కావాలి.రాగమే తనను ఉపకరణంగా చేసుకొని తనద్వారా బాహ్యానికి ప్రసరించాలి.తనద్వారా వ్యక్తమౌతున్న రాగానికి ఏఅడ్డూ కల్పించకుండా తాను తన స్వరాన్ని మాత్రమే రాగానికి అరువిచ్చి అక్కణ్ణించి తప్పుకోవాలి. తన గానాన్ని తానే ఒక శ్రోతగా వినాలి.అదీ అసలైన గానం. అప్పుడే  లోకాతీతమైన ఒకానొక దివ్యప్రభావం అతని గానంలో ప్రస్ఫుటమౌతుంది.ఈ లోకానికి చెందని ఒక సువాసన ఆ గానంద్వారా చుట్టూ వ్యాపిస్తుంది. అప్పుడు వినేవారిలోనూ దాని ప్రభావం కనిపిస్తుంది.వారి హృదయాలు వెంటనే ఏదో మాయ కమ్మినట్లుగా అయిపోతాయి.స్వామిహరిదాస్, తాన్సేన్, బైజూబావరా, త్యాగయ్య, శ్యామశాస్త్రి, ముత్తుస్వామి దీక్షితుల వంటి గాయకులలో ఆ ప్రజ్ఞ ఉండేది. 

పాతతరం సినీ గాయకులలో జేసుదాస్ గాత్రం కొంతవరకూ ఆ ప్రభావాన్ని కలిగి ఉంటుంది.అలాగే,నేటి గాయకులలో శంకర్ మహాదేవన్ గొంతులో కూడా ఆ ప్రభావం కొంత కనిపిస్తుంది.ఇక పాతతరపు దిగ్గజాలైనా,నేటితరపు గాయకులైనా శాస్త్రీయగాయకులలో చాలామందిలో అటువంటి గాత్రం ఉన్నదనే చెప్పాలి. వారి పేర్లు వ్రాసుకుంటూ పోతే పెద్ద లిస్టు తయారౌతుంది.

ఆ విషయాలు అలా ఉంచితే,ప్రస్తుతానికి మాత్రం ఒక జాతకుడు సంగీతంలో మంచి ప్రతిభను పొందాలంటే ఏ ఏ అంశాలు కారణాలౌతాయో జ్యోతిశ్శాస్త్ర పరంగా మాత్రమే పరిశీలిద్దాం.

వాక్ స్థానం ద్వితీయం కనుక ఆ భావమూ భావాదిపతీ జాతకంలో బలంగా ఉండాలి.సహజ వాక్ స్తానాధిపతి అయిన శుక్రుడు కూడా బలంగా ఉండాలి. భారతీయసంగీతం మనోధర్మసంగీతం కనుక, పాడుతున్న పాటయొక్క భావాన్ని మనసుకు అందించడానికి చంద్రుడూ, ఆభావం బుద్ధిలో ప్రతిఫలించడానికి బుదుడూ బలంగా ఉండాలి.నలుగురిలో పాడేటప్పుడు భయం లేకుండా వణుకు రాకుండా పాడటానికి కుజుడు బలంగా ఉండాలి.శాస్త్రీయ సంగీతం భక్తిప్రధానమైనది కనుక గురువు బలంగా ఉండాలి.ఆత్మశక్తికీ సంగీతరంగంలో విజయాలు సొంతం చేసుకోవడానికీ సూర్యుని బలం ఉండాలి. అది వృత్తిగా చేసుకున్నవారికి దశమ స్థానం బలంగా ఉండాలి. దశమాదిపతి మంచి స్తితిలో ఉండాలి.సహజ దశమాదిపతి శని కూడా బలంగానే ఉండాలి.ఇలా చూస్తె సప్తగ్రహాలూ వచ్చేశాయి.ఇక మిగిలిన రాహుకేతువులు కలిసి రాకపోతే గాయకుడు ఏమీ చెయ్యలేడు.కనుక వారూ అనుగ్రహించాలి.ఈ రకంగా నవగ్రహాలు అన్నీ ఏదో ఒక రకంగా కరుణించనిదే శాస్త్రీయ సంగీతం పట్టుబడదు.

ఇకపోతే గానం చెయ్యడానికి మంచి లంగ్ పవర్ ఉండాలి.అంటే ఊపిరి కుంభించి పాడగలిగే శక్తి ఉండాలి.కనుక వాయుతత్వ రాశులైన మిధునమూ,తులా,కుంభమూ కూడా జాతకంలో బలంగా ఉండాలి.ఆ రాశుల అధిపతులైన బుధుడూ శుక్రుడూ శనీ అనుగ్రహించాలి.వీరిలో ముఖ్యంగా బుధశుక్రుల అనుగ్రహం తప్పనిసరిగా గాయకునికి ఉండి తీరాలి.ఎందుకంటే లలిత కళలకు వీరే అధిష్టాన గ్రహములు గనుక.

సహజ రాశిచక్రంలో వీరిద్దరూ వాక్కుకూ, గానానికీ,వాయుతత్వానికీ అధిపతులు అవుతున్నారు.కనుక ఆ రకంగా చూచినా వీరి అనుగ్రహం గాయకులకు తప్పనిసరిగా ఉండాలి.అంటే లక్ష్మీ నారాయణుల అనుగ్రహమో లేక శివశక్తుల అనుగ్రహమో ఉంటే తప్ప ఎవరూ మంచి శాస్త్రీయ గాయకులు కాలేరు అన్నది నిర్వివాదాంశం.గాయకుల జాతకాలలో బుధ శుక్రుల స్తితులు బలంగా ఉండాలి.ఈ మధ్య మరణించిన పినాకపాణి గారు కూడా ఈ రెండు గ్రహాలూ నెప్ట్యూన్ తో మింగబడినప్పుడే మరణించారన్నది మన కళ్ళెదుట కనిపించిన వాస్తవం.

ఇకపోతే, నేటి లల్లాయి పాటల గురించి,అవి పాడుతున్న కోతి గాయకుల గురించీ అసలు మాట్లాడుకోకపోవడమే మంచిది.నా దృష్టిలో నేటి సినిమా సంగీతం అసలు సంగీతమే కాదు.పిల్లికూతలూ,జంతువుల అరుపులూ,వెకిలి కేకలతో కూడిన నేటి సినిమా సంగీతం, అసలు సంగీతమనే పేరుకు ఏ మాత్రం తగదని నా నమ్మకం.సినిమా గాయకుల చండాలం గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది.

ప్రకృతి శక్తులను కదిలించగలిగే ప్రజ్ఞ ఉన్నవాడే అసలైన సంగీత తపస్వి అని నేను విశ్వసిస్తాను. అంటే, అతను గానం చేస్తుంటే ఖాళీ ఊయల దానంతట అది కదిలి ఊగాలి. ఒక చెట్టు కింద అతను కూచుని గానం చేస్తే ఆ చెట్టు తన పూలను అతనిపైన వర్షంలా రాల్చాలి.కాలం కాని కాలంలో మేఘాలు కమ్మి వర్షం కురవాలి. ప్రమిదలో దీపాలు వాటంతట అవి వెలగాలి. మోడులై పోయిన చెట్లు చిగురించాలి. గానంతో అతను శాసిస్తే రోగాలు పోవాలి. తుఫానులు మొదలైన ప్రకృతి భీభత్సాలు ఆగాలి. పాము వంటి విష జంతువులు అతని ముందు తలవంచి వెనుదిరగాలి.ఇలాంటి అద్భుతాలు తమ గానంతో ఎవరైనా చెయ్యగలిగితే వారు పరవాలేదని, ఒక స్థాయి వరకూ ఎదిగిన సంగీతజ్ఞులని నేనంటాను.ఒక స్థాయికి అని ఎందుకన్నానంటే, దీనికంటే ఉన్నత స్థాయిలు సంగీతయోగంలో ఇంకా చాలా ఉన్నాయి. ఇక నేను పైన చెప్పిన స్థాయితో పోలిస్తే  మిగిలిన మామూలు గాయకులు నా దృష్టిలో ఇంకా ఎంతో సాధన చెయ్యవలసిన ఉన్నవారే. వారు ఇంకా సంగీత ప్రపంచపు ప్రహరీ గోడ బయట ఆడుకుంటున్న వారని నా ఉద్దేశ్యం.లోపల ఉన్న అద్భుతాలు వారికి ఏమీ తెలియవు.

ఒక వ్యక్తి లోకంలో గొప్ప సంగీత కళాకారునిగా ఖ్యాతి బడయవచ్చు.ఎన్నో బిరుదులూ ఎంతో ధనమూ సంపాదించవచ్చు.కాని తన గానంతో ప్రకృతి శక్తులను కదిలించలేక పోతే అతని సంగీతం అంత గొప్ప సంగీతం కాదు అని నేను ఖచ్చితంగా చెప్పగలను. మానవులిచ్చే బిరుదులకు నా దృష్టిలో ఎటువంటి విలువా లేదు. తామే అజ్ఞానంలో పడి కొట్టుకుంటున్న మానవులకు ఇతరులకు బిరుదులు ఇచ్చే స్థాయి ఎలా వస్తుంది? కనుక మానవులు చేసే సత్కారాలూ ఇచ్చే బిరుదులూ నా దృష్టిలో ఏ మాత్రం విలువ లేని గడ్డిపోచలు.ఇక సంగీతాన్ని ఉపయోగించి డబ్బు సంపాదించడాన్ని నేనొక గొప్ప విషయంగా పరిగణించను.అలా సంపాదించడానికి అదృష్టం ఉంటే చాలు. అంతమాత్రాన ఆ వ్యక్తి ఒక గొప్ప గాయకుడంటే నాకు నవ్వొస్తుంది.ఒక వ్యక్తి యొక్క నిజమైన గొప్పతనం ఆ వ్యక్తి సంపాదించిన డబ్బును చూచి  లెక్కించడం ఎప్పుడూ తప్పే అని నేను విశ్వసిస్తాను.

పాతకాలంలో సంగీత సాధన చాలా నిష్టగా ఉండేది.'దీపక్' రాగాన్ని తన వశం చేసుకోవాలంటే ఎదురుగా ప్రమిదలో నూనె పోసి వత్తి ఉంచి,దాని ఎదురుగా కూచుని దీక్షగా పాడుతూ, ఆ దీపం దానంతట అదే వెలిగే వరకూ సాధన చెయ్యాలి. అప్పుడే ఆ రాగం తనకు వశమైనట్లు లెక్క. అలాగే 'మేఘమల్హార్' రాగం కూడా. ఆ రాగం పాడితే కాలం గాని కాలమైనా సరే,మేఘాలు కమ్మి వర్షం కురవవలసిందే.అప్పుడే ఆ రాగంలో ప్రజ్ఞ లభించినట్లు లెక్క. బైరవీ రాగాన్ని గానం చేస్తే ఎదురుగా భైరవీరూపం అతనికి సాక్షాత్కారించాలి. అప్పుడే ఆ రాగం సిద్ధించినట్లు లెక్క. ఎన్నేళ్ళు పట్టినా ఆ సిద్ధి కలిగేవరకూ పట్టుగా సాధన చేసేవారు.అదీ అసలైన సంగీతం అంటే.అంతేగాని నేటి గాయకుల వలె,ఒక మూడునెలలు ఏదో మొక్కుబడిగా నేర్చుకుని వేదికలెక్కి ప్రదర్శనలిచ్చేవారు కారు.

తన గురువు ఆఖరి కోరికను తీర్చడానికి, ఆయన చితిని మామూలు నిప్పుతో గాక 'దీపక్' రాగాన్ని పాడి తాన్సేన్ వెలిగించాడని అంటారు.అంత అగ్నిని తన ప్రాణశక్తితో రగిల్చినందుకు ప్రతిఫలంగా అతని వళ్ళంతా మంటలు పుట్టి కొన్ని నెలలకు అతనూ చనిపోయాడని చెబుతారు.  

అటువంటి గాయకులు అసలు ఉంటారా అని అనుమానం రావచ్చు. ఉంటారు.ఉన్నారు.కాని వారిలో చాలామంది లోకం దృష్టిలోకి రారు.లోకవాసన సోకకుండానే వారి జీవితాలు ముగుస్తూ ఉంటాయి. వారికి మన బిరుదులూ సన్మానాలూ సత్కారాలూ అవసరం లేదు. వీటిని చూచి వారు నవ్వుతారు.వారి గానానికి ప్రయోజనాలు వేరుగా ఉంటాయి. వారు మనుషులకోసం పాడరు.వారు పాడితే వినవలసిన శక్తులు,వ్యక్తులు వేరే ఉంటారు.అలాంటి సంగీతపు చాయలు కొంచం కాకపోతే కొంచమైనా తమ తమ గానాలలో ప్రతిఫలించే గాయకులూ గాయనీమణులూ మనకు తెలిసిన వారిలో కూడా కొందరున్నారు.అలాంటి వారి జాతకాలు కొన్ని ముందు పోస్ట్ లలో పరిశీలిద్దాం.
read more " సంగీతం-జ్యోతిషం-1 "

కాలజ్ఞానం - 19

ఊహించని కొత్త మార్పు
ఒక్కసారి కుదుపుతుంది
అదుపులేని శక్తంతా
వెల్లువగా ఉరుముతుంది

ప్రమాదాల అగ్నులలో
మానవులే  మిడతలు
మారణహోమాలలోన
మాడిపోవు సమిధలు

మతోన్మాద రక్కసికి
మళ్ళీ బలమొస్తుంది
వింతయైన ధ్వంసరచన
కళ్ళెదుటే జరుగుతుంది

మిడిసిపడే సీమలోన
మిత్తి నృత్యమాడేను
మానవులా దుర్బుద్ధికి
కన్నులెర్ర చేసేను 

విప్లవాల అగ్నిలోన
రాజ్యమొకటి ఉడికేను
అధికారము చెల్లదనుచు
అట్టహాస మెగసేను

ఏకాదశి సమయంమున
ఇంతకింత జరిగేను
ఎవ్వరెవరి ఖర్మంబులు
వారి నంటి తిరిగేను
read more " కాలజ్ఞానం - 19 "

12, మార్చి 2013, మంగళవారం

శ్రీపాద పినాకపాణి -నందన మాఘ అమావాస్య కుండలి

నందన మాఘ అమావాస్య కుండలిని పరిశీలిద్దాం. పాశ్చాత్య జ్యోతిష్యంలో దేశజాతకం చూచేటప్పుడు సన్ ఇంగ్రెస్ చార్టులకు తోడు న్యూమూన్, ఫుల్ మూన్ చార్టులకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది.

ఆరోజున 10-3-2013 ఆదివారం అమావాస్య శతభిష నక్షత్రం అయింది. కనుక ఒక ప్రముఖుని మరణం సూచింపబడుతున్నది.

లగ్నం దేశలగ్నం నుంచి అష్టమంలో ఉంటూ నష్టాన్ని సూచిస్తున్నది. ఇకపోతే అమావాస్య రాశి దేశలగ్నానికి దశమంలో పడి, ఒక ప్రసిద్ధ వ్యక్తికి కీడు మూడిందని సూచిస్తున్నది.ఇదే సమయంలో ఆకాశంలో "పాన్-స్టార్స్" తోకచుక్క దర్శనం ఇచ్చింది. తోకచుక్కలు కనిపించినప్పుడు దేశాదినేతలో ప్రసిద్ధవ్యక్తులో నేలరాలి పోతారన్నది అతి ప్రాచీనకాలం నుంచి రుజువౌతూ వస్తున్న సత్యం.

ఈసారి ఈ గ్రహగతులవల్ల 'సంగీత కళానిధి' శ్రీపాద పినాకపాణి పరలోక ప్రయాణం కట్టారు. డబ్బుకూ అధికారానికీ మాత్రమె విలువిచ్చే ఈలోకం దృష్టిలో ఈయన గొప్పవాడు కాకపోవచ్చు.కాని కర్నాటక సంగీత ప్రియులకు ఆయన విలువ తెలుసు.శాస్త్రీయసంగీతపు విలువ తెలియని ఆంధ్రదేశంలో ఉంటూ దాని విలువను అందరికీ తెలియచెయ్యాలని తపించిన సంగీతతపస్వి ఆయన.

నిండు నూరేళ్ళు బ్రతికిన పినాకపాణిగారు అమావాస్య పరిధిలోనే పరలోకానికి పయనించారు."అన్నీ తెలిసినవాడు అమావాస్యనాడు పోతాడు"-- అనే సామెత మళ్ళీ రుజువైంది.

ఇదిలా ఉంటె, సరిగ్గా సోమవారం అంటే నిన్న ఉదయం గుంటూరు నుంచి వడ్లమూడిలో ఉన్న విజ్ఞాన్ యూనివర్సిటీకి విద్యార్ధులను ఎక్కించుకొని వెళుతున్న ఒక ఆటో దానికంటే ముందు వెళుతున్న ఇంకో వాహనాన్ని ఓవర్ టేక్  చెయ్యబోయి తిరగబడి అందులో ఉన్న బీటెక్ విద్యార్ధులు అందరూ తీవ్రగాయాల పాలయ్యారు.ఇద్దరికి కాళ్ళు విరిగాయి.అందులో ఒకరికి కాలు తొలగించవలసిన పరిస్తితి వచ్చింది.ఇద్దరికేమో తలకు బలమైన దెబ్బలు తగిలాయి.వాళ్ళ పరిస్తితి ఇంకా ప్రమాదకరంగానే ఉన్నది.ఇంకో ఇద్దరికి మాత్రం ముఖానికీ కాళ్ళూ చేతులకూ బాగా దెబ్బలు తగిలి కొట్టుకుపోయాయి గాని ఎముకలు విరగలేదు.ఆ ఇద్దరిలో ఒకడు నా స్నేహితుని కొడుకు కావడమూ, సమయానికి స్నేహితుడు నల్లగొండలో ఉండటంతో నాకు ఫోన్ చేశాడు.వెంటనే బయల్దేరి అప్పటికే 108 లో ఆస్పత్రికి చేరిన అబ్బాయి దగ్గరకెళ్ళి ఎక్స్ రేలూ స్కానింగ్ లూ తీయించి బెడ్ లో చేర్పించి మధ్యాన్నం దాకా ఉండి వచ్చాను.అదృష్టవశాత్తూ పైపైన దెబ్బలే తగిలాయి గనుక ఒకరోజు పరిశీలనలో ఉంచి పంపిస్తామన్నారు.

అమావాస్యా పౌర్ణములు,మానవ జీవితం మీద ఖచ్చితమైన ప్రభావం చూపిస్తాయి.ఇందులో ఏ మాత్రం సందేహం ఉండే అవసరం లేదు.ఆయా ప్రభావాలు, ఒక్కొక్కరి జాతకాన్ని బట్టి ఒక్కొక్క రకంగా ఉంటాయి. ఖర్మ చాలక,చెడు దశలు జరుగుతుంటే చావే మూడుతుంది.ఇది ఎంతోమంది జాతకాలలో గమనించడం జరిగింది.అందుకే పాతకాలంలో పెద్దవాళ్ళు 'అమావాస్య పౌర్ణములలో ప్రయాణాలు వద్దని,దుడుకుపనులు చెయ్యొద్దని' అనేవారు.దీనికి రుజువులు జీవితంలో అనునిత్యమూ కనిపిస్తూనే ఉంటాయి.గమనించే చూపు మనకు ఉంటే చాలు.

మొత్తం మీద ఈ అమావాస్య "సంగీతకళానిధి"ని తీసుకుపోయింది. ఆయనకు శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను.
read more " శ్రీపాద పినాకపాణి -నందన మాఘ అమావాస్య కుండలి "

10, మార్చి 2013, ఆదివారం

త్యాగయ్య నాదోపాసన - 4 (రామమంత్ర రహస్యం)

త్యాగరాజు తనకీర్తనలలో చెప్పని విషయం లేదు.భక్తి జ్ఞాన వివేక వైరాగ్య యోగ యాగ మంత్ర రహస్యాలను సూక్ష్మముగా వివరించాడు.అర్ధం చేసుకున్నవారికి అర్ధం చేసుకున్నంత. ఆచరించిన వారికి ఆచరించినంత. ఊరకే పాడుకునే వారికి పాటవరకే అందుతుంది.ఏదైనా పాత్రతను బట్టి గదా ప్రాప్తం..

దేవామృతవర్షిణి రాగంలో పాడిన 'ఎవరని నిర్ణయించిరిరా' అనే కీర్తనలో రామమంత్ర రహస్యాన్ని సద్గురు త్యాగరాజు వివరించాడు.

ఎవరని నిర్ణయించిరిరా నిన్నేట్లారాధించిరిరా నరవరు ||లెవరని||  
శివుడనో మాధవుడనో కమలభవుడనో పరం బ్రహ్మమనో   ||ఎవరని||

శివమంత్రమునకు మజీవము మా 
ధవ మంత్రమునకు రాజీవము ఈ 
వివరము దెలిసిన ఘనులకు మ్రొక్కెద  
వితరణ గుణ త్యాగరాజ నుత ని                       || న్నెవరని ||

నమశ్శివాయ యను శివపంచాక్షరీ మంత్రమునకు 'మ' అనే అక్షరము జీవాక్షరము. అది లేకున్న 'న శివాయ' అగును.అనగా అమంగళము అని అర్ధము వచ్చును.పూర్తిగా మంత్రార్ధమే చెడిపోవును. శుభమునిచ్చెడు మంత్రము అశుభము నిచ్చునది యగును. అట్లే నారాయణాయ అనే అష్టాక్షరీ మంత్రంలో 'రా' యను అక్షరము జీవాక్షరము.అది ఒక్కటి లోపించినచో 'నా అయనాయ' అగును.అది కూడా అశుభమైన అర్ధమునే ఇచ్చును. కనుక ఈ రెండు మంత్రములలోనూ ఈ రెండు అక్షరములే జీవాక్షరములు. ఈ రా,మ అను రెండు జీవాక్షరముల కలయికయే 'రామ' మంత్రము. 

రామనామము ఇట్టి మహత్తరమైన శక్తిస్వరూపమై శివవిష్ణుశక్తుల సమాగమరూపమై వెలుగుతున్నది.అనగా శివశక్తుల సమ్మిలిత స్వరూపమని చెప్పవచ్చును.ఎందుకనగా విష్ణుతత్వము శక్తితత్వము సమానార్ధకములే.కనుక వేదప్రతిపాదితమైన ప్రణవమునకు,తంత్ర ప్రతి పాదితమైన తాంత్రికప్రణవమునకు 'రామ' శబ్దము సమాన శక్తి సంయుతమై పురాణప్రణవ మనబడుచున్నది.

'రా' అను అక్షరము అగ్నిబీజమగుట జేసి పరబ్రహ్మవాచకము.'మ' యనే అక్షరము మాయాసూచకము.కనుక అజ్ఞానమనే చీకటి యనబడు మాయను ధ్వంసమొనర్చి పరతత్వజ్ఞానమనే వెలుగును సాధకుని హృదయమున నింపగల మహత్తరమైన మంత్రమే రామమంత్రము.    

ఇట్టి రామనామము ఐహిక భోగేచ్చాపరులకు ధర్మ సంయుతమైన ఐహికమును,ముముక్షువులకు పరంబ్రహ్మానుభవమను ఆముష్మికమును ప్రసాదించగల శివకేశవ శక్తిస్వరూపమై భాసిస్తూ ఉన్నది. అందుకనే ఈ మంత్రమును తారకమంత్రము,అనగా సంసార సాగరమునుండి తరింప చేయగల శక్తి స్వరూపము అన్నారు.కనుక ఇది వేదాత్మకమైనట్టిది.ఈ కారణమున బ్రహ్మస్వరూపము కూడా అగుచున్నది.

రామనామము బ్రహ్మవిష్ణుశివస్వరూపము గనుక ఇది పరబ్రహ్మవాచకము. 'తస్యవాచక ప్రణవ:'అని యోగసూత్రములంటాయి. అనగా మనోవాచామ గోచరమగు పరబ్రహ్మము యొక్క నామమే ప్రణవము. రామ శబ్దము కూడా అట్టి ప్రణవమునకు సమాన శక్తివంతమే. కనుక త్యాగయ్య రాముని శివుడనో మాధవుడనో కమలభవుడనో అంతేగాక ఈ మువ్వురి కతీతమగు పరమబ్రహ్మము కూడా అని సూక్ష్మముగా ఈ కీర్తనలో బోధించాడు. 

ఇటువంటి రామనామము యొక్క శబ్దార్ధమే గాక తత్వార్ధము కూడా తెలిసి ఉపాసించి పరతత్వానుభవము నొందిన మహనీయులకు నేను మ్రొక్కెదనని సద్గురు త్యాగరాజు వినమ్ర భావముతో ఒక సరళమైన కీర్తనలో ఇంత రహస్యార్ధమును పొదిగి గానం చేశాడు.
read more " త్యాగయ్య నాదోపాసన - 4 (రామమంత్ర రహస్యం) "

4, మార్చి 2013, సోమవారం

'ఆస్ట్రో కార్టోగ్రఫీ' - పాశ్చాత్య జ్యోతిశ్శాస్త్ర పరిశోధనలో మైలురాయి

'అన్నీ వేదాల్లోనే ఉన్నాయిష'- అంటూ చంకలు చరుచుకోవడం తప్ప మనలో చాలామందికి అసలా వేదాలలో ఏమున్నాయో ఏమి లేవో ఏమీ తెలీదు.వేదాలను వల్లించే వారిలో కూడా చాలామందికి వాటి అర్ధాలు తెలీవు.వాటియొక్క ప్రతిపదార్ధాలు తెలిసినవారిలో కూడా చాలామందికి వాటి అసలైన మార్మికర్దాలేమిటో తెలియవు.

ఉన్నదాన్ని గుడ్డిగా అనుసరించడం తప్ప,పరిశోధనాత్మక దృష్టితో ఒక విషయాన్ని చూద్దామని, పరిశీలిద్దామని, పరిశోధిద్దామని, నిత్యజీవితానికి దానిని వర్తింపచేసుకుని దానిని పరీక్షించి నిగ్గు తెలుద్దామని మనలో ఎవరికీ తోచదు. ఇది భారతీయుల జీన్స్ లో ఉన్న ఒక పెద్ద లోపంగా అనుకోవచ్చు.

జ్యోతిష్యశాస్త్రంలో కూడా ఇదే తంతు నడుస్తూ ఉంటుంది.ఏవో మాయ మాటలు నాలుగు నేర్చుకుని జనాన్ని మోసం చేసి డబ్బు సంపాదిద్దా మనుకునే జ్యోతిష్కులే మన సమాజంలో ఎక్కువ. అంతేగాని శాస్త్రీయ కోణంలో దీనిని పరిశోధించి ఉన్న విషయాన్ని సరిగ్గా అర్ధం చేసుకుందామని, కొత్త విషయాలను కనుక్కుందామని ప్రయత్నాలు ఈ రంగంలో పెద్దగా కనిపించవు. ఎక్కడో ఒకచోట పరిశోధనా ఫలితంగా K.P System లాంటి కొత్త కోణాలు వెలుగు చూస్తాయి.అమెరికాలో వెలుగు చూచిన 'ఆస్ట్రో కార్టోగ్రఫీ' టెక్నిక్ అలాంటిదే. 

మనం వదిలేశామని మన విద్యలు ఊరుకోవు.ఆ విత్తనాలు గాలికి ఎగిరి పోయి ఎక్కడో పడి మొలకెత్తి వృక్షాలుగా మారి మంచి పూలు పూసి మధుర ఫలాలనిస్తాయి.మనం మాత్రం 'మా తాతలు నేతులు తాగారు' అని అరుస్తూ దిక్కులు చూస్తూ ఉంటాం.మన దేశంలో పుట్టిన మార్షల్ ఆర్ట్స్ చైనా జపాన్ కొరియా థాయిలాండ్ వంటి దేశాలలో అద్భుతంగా విస్తరించి మన దేశంలో చాలావరకు అంతరించిన విషయం గమనిస్తే మన చేతగానితనం అర్ధమౌతుంది.బుద్ధమతం పరిస్తితి కూడా అంతే.

అక్కడిదాకా ఎందుకు అద్భుతమైన త్యాగరాజకీర్తనలను మనం ఒదిలేస్తే తమిళులు ఆదరించి బతికించిన విషయం మన కళ్ళముందే ఉంది.అన్నమయ్య కీర్తనలు కొన్ని వందలసంవత్సరాల పాటు ఒక గదిలో పెట్టి తాళం వేసి ఉంటె మనకు పట్టలేదు.వేటూరి ప్రభాకర శాస్త్రి గారి చలవ వల్ల అవి బయటకు వచ్చి ఈనాడు మనం పాడుకోగలుగుతున్నాం.దాదాపు చచ్చిపోయిన ఆంద్రనాట్యం నటరాజ రామకృష్ణ చలవ వల్ల బయట పడింది. శాతవాహనులకు ముందునుంచీ ఉన్న ప్రాచీనమైన ఆంధ్రా వీరవిద్యలు ఏమై పోయాయో ప్రస్తుతం ఎవరికీ తెలీదు.ఇలా చెబుతూ పోతే ఎన్నో చెప్పుకోవచ్చు.మోసాలు కుట్రలు చేసి డబ్బు సంపాదించి ఎడాపెడా బతికేయ్యడం తప్ప ఒక ఉదాత్తమైన ఆశయంతో  జీవితాన్ని ఉన్నతంగా గడపడం మనలో ఎక్కువమందికి రాదనడానికి ఎన్నో రుజువులు ఇవ్వగలను. 

పాశ్చాత్యులలో జ్యోతిష్యవిద్య లేదని చాలామంది అనుకుంటారు. ఇది పెద్ద పొరపాటు.వారిలో గొప్ప జ్యోతిష్కులున్నారు.అంతేకాదు జ్యోతిష్యరంగంలో మంచి పరిశోధన చేసినవాళ్ళూ ఉన్నారు. ఇప్పుడు మనదైన నిరయన విధానంలో అద్భుతమైన పరిశోధన ఇతర దేశాలలో జరుగుతున్నట్లు మన దేశంలో జరగటం లేదంటే వింతకాదు. పాశ్చాత్య దేశాలలో ముఖ్యంగా అమెరికా బ్రిటన్ జర్మనీ వంటి దేశాలలో ఈనాడు భారతీయ జ్యోతిష్యం మీద అద్భుతమైన పరిశోధన జరుగుతున్నది.ఎందఱో దీనిని ఔపోసన పడుతున్నవారున్నారు.అలాంటివాడే 'జిమ్ లూయిస్' అనే అమెరికన్. అయితే యితడు సాయన విధానానుసారుడు. అప్పటికే పాశ్చాత్య జ్యోతిష్య శాస్త్రంలో అమలులో ఉన్న జ్యోతిష్య సూత్రాలను బట్టి 'యాస్ట్రో కార్టోగ్రఫీ' అన్న కొత్త విధానాన్ని తయారు చేసి దానిని ఒక అంతర్జాతీయ వ్యాపారంగా మార్చిన ఘనత ఇతనిది.రీసెర్చ్ అంటే వారి తర్వాతే ఎవరినైనా చెప్పుకోవాలి.అయితే జ్యోతిష్యవిద్యకున్న నియమనిష్టాపరమైన లోతులు పాశ్చాత్యులకు తెలుసో లేదో నాకు అనుమానమే. 

పాత సంస్కృత గ్రంధాలను అనువాదం చేసి అదే గొప్ప పరిశోధన అని అనుకునే స్థాయికి మనం దిగజారాం.ఇక వాటిలోని విషయాలు అర్ధం చేసుకునే దెప్పుడు? ఆచరించేదేప్పుడు? పరిశోధనతో కొత్త విషయాలు కనుక్కునేదేప్పుడు? మెకాలే విద్యావిధానం వల్ల వచ్చిన చెడు ఫలితాలలో ఇదొకటి.

ప్రాధమికంగా జ్యోతిష్యం రెండు విషయాల మీద ఆధారపడి ఉంటుంది.ఒకటి కాలం.రెండు స్థలం. మనిషి కాలానికీ స్థలానికీ లోబడే ఉంటాడు. ఈ రెంటినీ కాదని మనిషి బతకలేడు.మన జీవితంలో కాలగణన చేసి ఏ 'టైం' మనకు మంచిదో ఏది కాదో అనే విషయాన్ని సూచించే దిశగా భారతీయ జ్యోతిష్యం చాలా పరిశ్రమ చేసింది. అందులో అద్భుతమైన సూత్రాలను కనుక్కుంది కూడా.ఇకపోతే 'స్థలం' లేదా 'ప్రదేశం' అనే విషయంలో కూడా మనకు కొన్ని విధానాలున్నాయి.'ఫలానా ఊరు నాకు కలిసోస్తుందా లేదా?' అన్న విషయాన్ని కనుక్కునే విధానాలు ప్రశ్న జ్యోతిష్యం లోనూ,పల్లెటూళ్ళలో ప్రచారంలో ఉన్న కొన్ని జ్యోతిష్య సూత్రాలలోనూ మనకు కనిపిస్తాయి. జిమ్ లూయిస్ కనుక్కున్న 'యాస్ట్రో కార్టోగ్రఫీ' కూడా ఇలాంటిదే.అయితే దీనికి ఒక శాస్త్రీయరూపాన్నిచ్చి రుజువు చేయదగ్గ శాస్త్రంగా దీనిని మార్చిన ఘనత మాత్రం ఇతనిదే.

చాలామందికి ఇది అనుభవంలో ఉంటుంది.ఉన్న ఊరు వదిలి వేరే ఊరికి పోయిన తర్వాత బాగా కలిసొచ్చి ధనికులైన వాళ్ళు చాలామంది ఉంటారు.అలాగే దీనికి వ్యతిరేకంగా ఊరు మారిన తర్వాత అన్నీ పోగొట్టుకుని బికారులైనవాళ్ళూ ఉంటారు. ఇతర దేశాలు పోయి బాగా ఎదిగిన వాళ్ళూ ఉంటారు.అలాగే ఆశించినంత ఎదగలేక అల్లాడుతున్న వారూ ఉంటారు.కొంతమందిని కొన్ని ఊళ్లు వదిలిపెట్టవు.వారు అనుకున్నా ఎంత ప్రయత్నించినా ఆ ఊరు వదలలేరు. కొందరు ఎక్కడా స్తిరంగా నిలవలేరు. మాటమాటకీ ఊళ్లు మారుతూ ఉంటారు. ఇదంతా స్థల మహిమ.కొన్ని ఊళ్లు ఎప్పుడూ ఏడుస్తూ ఉన్నట్లు ఉంటాయి.అక్కడ ఉన్నవాళ్ళు కూడా ఎదుగూ బొదుగూ లేకుండా ఉంటారు.ఇంకొన్ని ఊళ్లు తీవ్రమైన వేగజీవితాన్ని కలిగి ఉంటాయి.అక్కడ ఉండేవాళ్ళు ప్రశాంతంగా ఉందామన్నా ఉండలేరు.ఎప్పుడూ ఉరుకులు పరుగులతో(పడిపోయేటంతవరకూ) పరిగెత్తుతూనే ఉంటారు. మహానగరాలన్నీ అలాంటివే. 

ప్రతిమనిషికీ భూమ్మీద బాగా కలిసొచ్చే ప్రదేశాలు ఒకటో కొన్నో ఉంటాయి.అలాగే కొన్ని కొన్ని రంగాలకు కొన్ని కొన్ని దేశాలూ ఊళ్లూ బాగా కలిసొస్తాయి.భట్టిప్రోలుకీ బాంబేకీ ఉన్న తేడా గమనిస్తే ఇది అర్ధమౌతుంది. ప్రతి మనిషి జాతకంలోనూ దీనికి సూచనలుంటాయి.ఈ సూత్రం ఆధారంగా ఇతను తయారు చేసిన 'గ్రాఫ్' నే 'ఏ-సి-జీ'(ఆస్ట్రో కార్టో గ్రఫీ)  చార్ట్ అంటారు. దీనివల్ల భూగోళంలో మన అదృష్టప్రాంతం ఎక్కడుందో స్పష్టంగా ఖచ్చితంగా తెలుసుకోవచ్చు.అక్కడికి పోయి సెటిల్ అయితే చాలు.జీవితం అనూహ్యంగా మారిపోతుంది.ఇది చాలామంది జీవితాలలో రుజువైన నిగ్గుతేలిన సత్యం. బికారులుగా ఈ చార్ట్ సూచించిన ప్రాంతాలలోని ఊరిలో అడుగుపెట్టి మిలియనీర్లుగా తేలినవాళ్ళు చాలామంది ఉన్నారు.అమెరికా ప్రెసిడెంట్స్, ఇంకా ఇతర దేశాధినేతల చాలామంది జాతకాలలో ముఖ్యమైన సంఘటనలను ఈ చార్ట్ లు చాలా ఖచ్చితంగా సూచించాయి.దీనిగురించి చెప్పే అఫిషియల్ వెబ్ సైట్స్ చాలానే ఉన్నాయి,వాటిలో పూర్తి వివరాలు దొరుకుతాయి కనుక నేను ఆ టెక్నిక్ గురించి ఇంతకంటే ఎక్కువ వ్రాయను. ఇతని జాతకాన్ని మాత్రం ప్రస్తుతం స్థూలంగా పరిశీలిద్దాం.

ఇతను 5-6-1941 న 9.30 కు న్యూయార్క్ లో పుట్టాడు.ఇతని జాతకాన్ని 'ఏసీజీ' కోణంలో మాత్రమె చూద్దాం.మిగతా జీవిత వివరాల జోలికి కావాలనే పోవడం లేదు.

ఇటువంటి నిర్దుష్టమైన జ్యోతిష్య సూత్రాలు స్ఫురించాలంటే జాతకంలో కొన్ని ప్రత్యెకయోగాలుండాలి. అంతేగాక వాటిని క్రోడీకరించి ఒక నిర్దిష్టమైన రూపాన్నిచ్చి ఒక ఖచ్చితమైన బిజినెస్ గా దానిని మార్చాలంటే కూడా కొన్ని యోగాలుండాలి.అవేమిటో మాత్రమె పరిశీలిద్దాం.
  • తృతీయంలో గల లగ్నాధిప రాహువుల (బుదాదిత్య యోగచ్చాయ) వల్ల జ్యోతిష్యపరమైన ఉపన్యాసాలతో విశ్లేషనలతో లోకంతో అనుసంధానం అవుతాడన్న సూచన ఉంది. 
  • లాభస్తానంలో ఉన్న గురు సూర్య యురేనస్ ల యోగం ఇతని జాతకంలో ఒక సిగ్నేచర్.వీరి దృష్టి పంచమం మీద ఉండటం వల్ల ఇతనికి స్ఫురణశక్తితో కూడిన జ్యోతిష్యజ్ఞానం అబ్బింది.వీరిలో గురువూ యురేనసూ సూర్యనక్షత్రంలో ఉండటం చూడొచ్చు.సాయన జ్యోతిష్కులకు సూర్యబలం ప్రధానం.
  • నవమకేతువు వల్ల ఇతనికి ఆధ్యాత్మికచింతన ఉన్నప్పటికీ దానికి పట్టిన పాపార్గళం వల్ల అది పక్కదారులు పట్టి దారిలో ఇంకిపోయిన కాలువలాగా అవుతుంది గాని గమ్యం చేరలేదు.
  • జ్యోతిష్య విద్యా కారకుడైన బుధుడు రాహునక్షత్రంలో ఉంటూ స్ఫురణ శక్తిని సూచిస్తున్నాడు.అనేక ప్రాంతాలు తిరిగి దానిని ఒక బిజినెస్ గా మార్చే సూచన కూడా ఇస్తున్నాడు.
  • ఆత్మకారకుడైన శని దశమంలో నీచలో ఉంటూ ఇతనికి గల చెడుకర్మ బరువును సూచిస్తున్నాడు.జ్యోతిష్యాన్ని వృత్తిగా మార్చుకున్న ఇతను సామాన్యంగా జ్యోతిష్కులు పాటించవలసిన నియమాలు మాత్రం  పాటించలేదని దీనివల్ల అర్ధమౌతుంది.అందువల్లే,ఇతను ఒక గొప్ప టెక్నిక్ ను కనుక్కోగలిగినప్పటికీ వ్యక్తిగత జీవితంలో దెబ్బతిన్నాడని  కూడా తెలుస్తుంది.
  • లగ్నం నుంచి చూచినా చంద్ర లగ్నం నుంచి చూచినా ఇతని జాతకంలో ఒక విచిత్రయోగం ఉన్నది.పంచమాదిపతి అష్టమంలో ఉండటం.ఆ ఇద్దరూ క్రూరగ్రహాలై ఉండటం.అంటే ఈ జ్యోతిష్యవిద్య ఇతనికి  మార్మిక సంబంధమైన సాధన వల్ల(అది గతజన్మలది కావడానికి అవకాశం ఎక్కువ)వచ్చింది అని తెలుస్తోంది.అయితే దీనివల్ల ఇతనికి మంచి జరుగకపోగా అరిష్టం ఉందని సూచన వస్తుంది. ఆ అరిష్టం ఎలా వచ్చిందో చూద్దాం.
  • లగ్నంలో పంచమ,నవమ,లాభ ఆరూడాలు కలిసి ఉండటం వల్ల అక్కల్ట్ విద్య అయిన జ్యోతిషం వల్ల లాభం సూచితం.అయితే అక్కడే మాంది గుళికుల స్తితి వల్ల అరిష్టం కూడా సూచితం.
  • లగ్నంలోని ప్లూటో వల్ల గతానికి భవిష్యత్తులోని ఆశలకు మధ్య తీవ్ర ఘర్షణ, లోతైన మానసిక సంఘర్షణ సూచితం.అయితే ఇదే గ్రహస్తితివల్ల స్ఫురణ శక్తి కలుగుతుంది.
  • చాలామంది జీవితంలో పీటముళ్లుంటాయి.అవి జాతకాలలో ప్రతి ఫలిస్తాయి.ఇతని జాతకంలో కూడా ఉన్నాయి.వాటిలో ఒకదాన్ని చూద్దాం.వీటి ఫలితంగా ఒక రంగంలో ఎదిగితే జీవితంలో ఇంకో రంగంలో ఘోరమైన నష్టం జరుగుతుంది.ఇది చాలామందికి అనుభవమే. ఇటువంటి ఉదాహరణలు అనేకమంది జీవితాలలోనుంచి  కోకొల్లలుగా ఇవ్వగలను.
  • చంద్రలగ్నాత్ దశమంలో బుధ శుక్రులు లగ్న/దశమ,ధన/నవమాదిపతులుగా కలసి ఉండటం ఒక గొప్ప ధన/రాజయోగం. వారిని పంచమాధిపతిగా శని వీక్షిస్తూ ఉండటం వల్ల జ్యోతిష్యాన్ని వృత్తిగా మార్చుకొని శ్రీమంతుడౌతాడన్న సూచన ఉన్నది.అయితే శని నీచత్వం వల్ల,షష్టాదిపత్యం వల్ల వృత్తిలో ఎదుగుదలకు తోడుతోడుగా అనారోగ్యం కూడా పెరుగుతుంది అన్న సూచనా ఉన్నది. ఇతని జీవితంలో ఇదే ఖచ్చితంగా జరిగింది.
  • ఇతని జీవితంలో ఇదే పెద్ద పీటముడి.పూర్వకర్మ ఇలాంటి చిక్కుముళ్ళను ఏర్పాటు చేస్తుంది.వీటిని విప్పాలంటే ఉత్త జ్యోతిష్య జ్ఞానం చాలదు.తంత్ర శాస్త్రం తెలిసి ఉండాలి.    
ఆస్ట్రో కార్టోగ్రఫీ విధానాన్ని కనుక్కున్నందుకు జ్యోతిష్య రంగంలో ఆస్కార్ అవార్డ్ అనబడిన 'రెగులస్ ప్రైజ్'  1992 లో న్యూయార్క్ లో జరిగిన ఒక సమావేశంలో అందుకున్నాడు. ఆ సమయంలో ఇతని జాతకంలో అష్టోత్తరీ గురు/గురు దశ జరిగింది.ఇతనికి జ్యోతిష్య జ్ఞానాన్ని ఇవ్వడంలో గురువు యొక్క పాత్రను పైన చర్చించాను.

సప్తమాధిపతి శని నీచలో ఉండటం వల్ల లగ్నాధిపతి చంద్రునితో 6/8 దృష్టి వల్లా ఇతను 'సాన్ ప్రాంసిస్కో గే కమ్యూనిటీ' లో మెంబర్ గా ఉండేవాడు. అయితే ప్రస్తుత వ్యాసోద్దేశ్యం ఈ కోణాన్ని పరిశీలించడం కాదు గనుక దాని జోలికి పోవడంలేదు.

1980 లో ఇతను ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్నపుడు ఒక రోడ్డు దాటుతూ ఉండగా స్పీడ్ గా వస్తున్న ట్రక్ గుద్దుకొని రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. అప్పుడు జాతకంలో గురుదశ అంతమై శనిదశ మొదలై శనిలో/శని దశ జరుగుతున్నది.శని దశమంలో నీచలో ఉంటూ వాహనాలను సూచించే చతుర్ధాన్ని చూడటం గమనించాలి.ఈ లగ్నానికి శని మారకుడని గమనించాలి.

54 ఏళ్ళ చిన్న వయసులో ఇతను బ్రెయిన్ ట్యూమర్ తో మరణించాడు.అప్పుడు జాతకంలో శని/రాహువు నడిచింది.ఇది శపితయోగం అన్న విషయం నా బ్లాగ్ వదలకుండా చదివే వారికి చెప్పనవసరం లేదు.తలను సూచించే మేషరాశిలో శని నీచ స్తితిలో ఉంటూ ఆయు స్థానంలో ఉన్న రాహువుతో షష్ఠ-అష్టక స్తితిలో ఉండటం చూడవచ్చు.

ఇతను 21-2-1995 న చనిపోయాడు. ఇతని కున్న స్ఫురణ శక్తి వల్ల తన జ్యోతిష్య అధ్యయనానికీ,తను కనిపెట్టిన  టెక్నిక్ కు పేటెంట్లు తీసుకోవడం, ప్రత్యర్ధులతో లీగల్ యుద్ధాలు చెయ్యడం, లెక్చర్ టూర్లు మొదలైన ఎడతెగని పనుల వల్ల తన ఆరోగ్యం దెబ్బ తింటున్నదని భావించేవాడు. ఇందులో నిజం లేకపోలేదు. అయితే అసలు నిజం అతనికి అర్ధం కాలేదని నా భావన.జ్యోతిష్యవిద్య చాలా ప్రమాదకరమైనది.అక్కల్ట్ తో ఆటలు పనికిరావు.అది ప్రాణాలను పణంగా పెట్టి అతీతశక్తులతో చెలగాటం ఆడటం అవుతుంది.ఆ విషయం ప్రస్తుతానికి అలా ఉంచి, ఆనాటి విచిత్ర గ్రహస్తితులు ఎలా ఉన్నవో ఒకసారి చూద్దాం. 
  • ఇతని లగ్నం కటకం 25 డిగ్రీలు. ఆ రోజున వక్ర కుజుడు నీచలో సరిగ్గా ఇదే డిగ్రీ పైన సంచరించాడు. 
  • రాహు చంద్రులు తులలో ఇతని జనన శనికి సరిగ్గా ఎదురుగా వచ్చారు.వీరిలో చంద్రుడు సరిగా శనితో డిగ్రీ ఆపోజిషన్ లోకి వచ్చాడు.
  • ఇతని జననకాల కుజుడు కుంభరాశిలో 20 డిగ్రీలో ఉన్నాడు.గోచార శని సరిగ్గా కుంభం 19 డిగ్రీ మీద మరణ దినాన సంచరించాడు.
  • గోచార గురువు జనన సూర్యునికి సరిగ్గా ఎదురుగా వచ్చి వృశ్చికంలో 19 డిగ్రీ మీదున్నాడు.కుంభంలో ఉన్న కుజునితో సరిగ్గా కేంద్ర దృష్టిలోకి వచ్చి ఉన్నాడు. 
  • ఈ గ్రహయోగాలవల్ల ఇతని మరణం కర్మమరణం అని తెలుస్తున్నది. అనేక వేలమంది జీవితాలను తన టెక్నిక్ తో మార్చిన ఇతను మరి ఆ శాస్త్రానికి తగిన జీవనవిధానాన్ని కూడా అనుసరించి ఉండవలసింది. అయితే లగ్నంలోని ప్లూటో, అష్టమంలోని కుజుడూ, దశమంలోని నీచ శనీ అతన్నలా చెయ్యనిస్తే ఇక కర్మ ప్రభావం ఏముంటుంది? ప్రతి మనిషీ తాను చెయ్యాలనుకున్న పనులు వెంటనే చేసేసి ఉండేవాడు.కాని మనిషి జీవితంలో అలా జరగదు కదా.
  • జ్యోతిష్య శాస్త్రాన్ని అధ్యయనం చెయ్యాలనుకునే వారు దానికి చెందిన మార్మిక నియమాలు పాటించకపోతే,ఆ రంగంలో గొప్ప విజయాలు సాధించినప్పటికీ,చివరకు ఏమి జరుగుతుందో బహుశా ఈయన జాతకం ఒక హెచ్చరిక కావచ్చు.
  • భారతీయ జ్యోతిష్యంలోని పరిహారక్రియలు ఇతనికి తెలిసిఉంటే ఈ దోషాన్ని తప్పుకోగలిగి ఉండేవాడు.కాని దానికి కూడా యోగం ఉండాలి.అది లేకుంటే పక్కనే ఉన్నప్పటికీ ఏదీ అందదు.
లోకాన్ని ఉద్దరించిన వ్యక్తి తన జాతకంలోని గ్రహదోషాలను తాను సరిచేసుకోలేక పోతే ఉపయోగం ఏముంటుంది? డబ్బు ఒక్కటే జీవితంలోని సక్సెస్ కు కొలబద్ద అనుకోవడం ఎంతవరకు సమంజసం?

ఇతని జీవితాన్ని చదివినమీదట నాకు బైబుల్ లోని ఒక కొటేషన్ గుర్తు కొస్తున్నది. బైబుల్ లో మాధ్యూ 16.26 లో ఇలా ఉంటుంది."ఒకడు ప్రపంచం మొత్తాన్నీ సంపాదించినప్పటికీ తన ఆత్మను పోగొట్టుకుంటే ప్రయోజనం ఏముంది? ఎందుకంటే ఆత్మను మించిన విలువైనది ప్రపంచంలో ఏముంది గనుక?"
read more " 'ఆస్ట్రో కార్టోగ్రఫీ' - పాశ్చాత్య జ్యోతిశ్శాస్త్ర పరిశోధనలో మైలురాయి "

2, మార్చి 2013, శనివారం

చెదిరిన స్వప్నం - జిమ్ జోన్స్ జాతక పరిశీలన

జిమ్ జోన్స్ పేరు అమెరికా చరిత్రలో నిలిచిపోయే పేర్లలో ఒకటి.కొందరు మంచిగా గుర్తుండిపోతారు.కొందరు చెడుగా చరిత్రలో మిగిలి పోతారు. ఇంకొందరు చెడు చేసినా మంచిగా మిగులుతారు.మరికొందరు మంచి చేసినా చెడ్డవారిగా ముద్రింప బడతారు.వీరిలో జిమ్ జోన్స్ ఏ కోవలోకొస్తాడో నేను నిర్ణయించను. చదువరులకే వదిలేస్తున్నాను.

దాదాపు వెయ్యిమంది ఇతని మాటలు నమ్మి ఒకేసారిగా విషంతాగి సామూహిక ఆత్మహత్యకు పాల్పడ్డారంటే ఇతనికి ఎంత సమ్మోహనశక్తి ఉన్నదో అర్ధం చేసుకోవచ్చు.లేదా ఆ చనిపోయినవారు ఎంత బలహీనమనస్కులో అర్ధం చేసుకోవచ్చు.నాయకుల మాటలు ప్రసంగాలు విని ఓట్లు గుడ్డిగా వేసే మన భారతప్రజలకూ వీరికీ నాదృష్టిలో పెద్దతేడా లేదు.అమెరికా అయినా ఇండియా అయినా మనుషుల్లో గొర్రెలు ఎక్కువగా ఉంటారని,వారు నక్క నాయకుల మాటలే నమ్ముతారని ఈసంఘటనలు నిరూపిస్తున్నాయి. మనిషి చెడువైపు ఆకర్షింపబడినంతగా మంచివైపు ఆకర్షింపబడడు.

9/11 సంఘటనకు ముందు ఇదే అమెరికాచరిత్రలో అతిపెద్ద సామూహిక మరణం.ఇవి ఆత్మహత్యలా లేక హత్యలా అనే విషయం మనకు అప్రస్తుతం. గ్రహస్తితులను మాత్రమె మనం పరిశీలిద్దాం.

ఇతను 13-5-1931 న ఇండియానా స్టేట్ లోని లిన్ అనే ఊళ్ళో రాత్రి పది గంటలకు పుట్టాడు.అతని జాతకం ఇక్కడ చూడొచ్చు.ఇతని జీవితంలో ముఖ్య సంఘటనలు మాత్రమె గమనిద్దాం.
  • ఇతని తండ్రికి కు-క్లక్స్-క్లాన్ తో సంబంధాలున్నాయని అంటారు. దీనికి  నిదర్శనాలు ఇతని జాతకంలో కనిపిస్తాయి.
  • సూర్యుడు ఉచ్చ స్తితిలో ఉన్నప్పటికీ 29 డిగ్రీలో ఉండటం.
  • నవాంశలో సూర్యుడు రాహుచంద్రులతో కలిసి చాందస భావాలను సూచించే ధనుస్సులో ఉండటం. 
  • పితృకారకుడైన చంద్రుడు రాహువుతో డిగ్రీ సంయుతి లో ఉండటం. 
  • చిన్నతనంలోనే తండ్రి చనిపోవడాన్నీ ఈ గ్రహయుతులే సూచిస్తాయి.

రాశి నవాంశ విమ్శాంశలలో శుక్రుడు ఉచ్చస్తితిలో ఉండటం చూస్తె మత పరంగా ఇతనికి గల సమ్మోహనశక్తిని,తన వాగ్దాటితో ప్రజలను సమ్మోహితులను చెయ్యడాన్ని,ఇతనికున్న వ్యక్తిగత అయస్కాంతశక్తిని గమనించవచ్చు.

జూన్ 1956 లో ఇతను ఒక పెద్ద మతపరమైన మీటింగ్ ను విజయవంతంగా ఏర్పాటు చేసాడు.ఆ సమయంలో శుక్ర/చంద్ర దశ జరిగింది.పంచమ భావాన్ని గమనిస్తే ఇదెంత సరిగ్గా ఉన్నదో ఋజువౌతుంది.

లగ్నాధిపతి ధర్మస్తానంలో నీచ స్తితిలో ఉండటం చూస్తె ఇతని యొక్క మతపరమైన క్రియాకలాపాలు అర్ధమౌతాయి. మెథడిస్ట్ చర్చ్ లో సభ్యుడైన ఇతను అందులోనుంచి చీలిపోయి తన స్వంతకుంపటి పెట్టుకున్నాడు. ఇతనికి కొన్ని విచిత్రమైన దృఢమైన నమ్మకాలుండేవి.మనలో కూడా కొందరు కలియుగాంతం వస్తున్నదని నమ్మి పుస్తకాలు వ్రాసి ప్రజలను భయపెట్టినవాళ్ళున్నారు.ఇతనూ అలాంటి వాడే.త్వరలో న్యూక్లియర్  హోలోకాస్ట్ జరిగి ప్రపంచం మొత్తం బూడిదవుతుందని నమ్మి తనవాల్లందర్నీ బ్రెజిల్ కు తరలించాడు.కాని ఏమీ జరుగలేదు.ఇది 1962 ఏప్రెల్ లో శుక్ర/గురు దశలో జరిగింది.ఉచ్చ శుక్రునివల్ల ఇతని మాటలు నమ్మి వారందరూ వచ్చినప్పటికీ,అష్టమ గురువు వల్ల ఇతని ఊహ తప్పని తేలిపోయింది.

అదే సమయంలో ఇతను గుయానాను దర్శించాడు.అక్కడ ఒక ఆశ్రమం లాంటిది పెట్టాలని భావించాడు.ఆ సమయంలో అదే దశ జరుగు తున్నది.కనుక ఆ నిర్ణయం ముందుముందు ఒక భయంకర విషాద సంఘటనకు దారి తీసింది.   

ఉచ్చసూర్యుని వల్ల ఇతనికి క్రమేణా రాజకీయనాయకులతో ప్రముఖులతో సంబంధాలు ఏర్పడ్డాయి.క్రమేనా వారితో గొడవల వల్ల ఇతని స్థావరాన్ని గుయానా లోని జోన్స్ టౌన్ కు మార్చాడు. అక్కడ 'పీపుల్స్ టెంపుల్' అని ఒక సంస్థను మొదలెట్టాడు.1970 లో శుక్ర/బుధ, కేతు దశలు జరిగినప్పుడే జోన్స్ టౌన్ ను నిర్మించడం మొదలుపెట్టాడు.అక్కడకు చేరిన తర్వాత, ఏదో ఒకనాడు తన అనుచరులందరితో కలసి మరణించి,అందరూ వేరే ఏదో గ్రహానికి తరలిపోయి అక్కడ హాయిగా జీవించవచ్చని నమ్మేవాడు.బహుశా తన అనుయాయులకు కూడా ఇదే నూరిపోశాడు.

తర్వాత అనేక గొడవలు లుకులుకల మధ్య ఇతని మీద రాజకీయ,మీడియా నీడలు కమ్ముకున్నాయి.నవంబర్ 1978 లో కాంగ్రెస్ సభ్యుడు 'లియో ర్యాన్' బృందం వీరి వ్యవహారాన్ని పరిశీలించడానికి జోన్స్ టౌన్ కు వచ్చింది.నవంబర్ 18 తేదీన వీరిమీద ఇతని 'రెడ్ బ్రిగేడ్' సైనికులు జరిపిన కాల్పులలో లియో ర్యాన్ బృందంలోని అయిదుగురూ దగ్గరలోని ఏయిర్ స్ట్రిప్ లో చనిపోయారు.ప్రభుత్వం తమపైన చర్య తీసుకుంటుందని భయపడిన ఇతను అందర్నీ ఆత్మహత్య చేసుకొమ్మని ప్రేరేపించాడు.తత్ఫలితంగా ఇతని కమ్యూన్ లోని 303 మంది పిల్లలూ 606 మంది పెద్దవాళ్ళూ సామూహికంగా సైనేడ్ మింగి అదేరోజున చనిపోయారు.

ఇలాంటి 'మాస్ సూయిసైడ్' చాల విచిత్రమైన సంఘటన. ఆరోజు గ్రహస్తితి పరిశీలిద్దాం.

ఆరోజు ఇతని జాతకంలో చంద్ర/కుజ/కుజ/శని దశ జరిగింది. నేనేన్నో సార్లు నా వ్యాసాలలో సూచించాను.కుజ,శనుల కలయిక భయంకరమైన సంఘటనలను ప్రేరేపిస్తుంది అని. ఇతని జాతకంలో గల చంద్ర,కుజ,శని గ్రహముల స్తితులను గమనిస్తే ఈ సంఘటన ఎంత ఖచ్చితంగా జరిగిందో అర్ధమౌతుంది.

ఇతని జాతకంలోని లోతైన విషయాలు బ్లాగుముఖంగా నేను చర్చించ దలుచుకోలేదు.అలాంటి చర్చలకు 'పంచవటి' గ్రూప్ ఎలాగూ ఉన్నది.కాని మచ్చుకు ఒక్కటి మాత్రం చెప్తాను.తృతీయంలో బలంగా ఉన్న వక్రశని (communicative skills)కి ఎదురుగా నవమంలో ఉన్న నీచకుజుని (religious accident) వల్ల ఇతని మాటలు నమ్మి మతపరంగా అనుసరించిన వారికి భయంకరమైన చావు రాసిపెట్టి ఉందన్న 'యాస్ట్రో సిగ్నేచర్' ఇతని జాతకంలో చూడగానే కనిపిస్తుంది.  

ఇతని జాతకంలో గల గ్రహస్తితుల వల్ల అష్టోత్తరీ దశ వర్తిస్తుంది అనుకున్నా కూడా అందులో ఆరోజున చంద్ర/సూర్య/చంద్ర/బుధ దశ జరిగింది.ఇది కూడా ఈ సంఘటనను నిరూపిస్తూనే ఉన్నది. ఇకపోతే ఆరోజున గ్రహస్తితి ఎలా ఉందొ గమనిద్దాం.
  • గోచర చంద్రుడు జననచంద్రునితో డిగ్రీ కేంద్ర దృష్టి.
  • గోచార రాహువు జనన సూర్యునితో డిగ్రీ కోణ దృష్టి.
  • గోచార బుధుడు జనన యురేనస్ తో డిగ్రీ కోణ దృష్టి
  • గోచార బుధుడు జనన గురువుతో డిగ్రీ 6/8 దృష్టి
  • గోచార కుజుడు జనన చంద్రునితో డిగ్రీ కోణ దృష్టి
  • గోచార కుజుడు జనన రాహువుతో డిగ్రీ కేంద్ర దృష్టి 
  • జనన గురువు,యురేనస్ లు- గోచార యురేనస్,నెప్ట్యూన్,ప్లూటో ల మధ్య ఖచ్చితమైన దృష్టులు.
  • అంతేగాక యురేనస్ నెప్ట్యూన్ ప్లూటో లు వరుసగా కన్యా తులా వృశ్చికాలలో దాదాపు ఒకే డిగ్రీ పైన సంచరించారు.
  • గోచార శని జనన రాహుచంద్రులతో డిగ్రీ 6/8 దృష్టి
  • గోచారంలో శపితయోగం నడుస్తున్నది. నవాంశలో రాహువు కుజుడు కలసి మతపిచ్చిని సూచించే ధనుస్సులో ఉన్నారు.
  • గోచార గురువు ఉచ్చస్తితిలో ఉన్నాడు.
  • ఇన్ని విచిత్రమైన గ్రహస్తితులు ఆరోజున ఉండబట్టే దాదాపు వెయ్యిమంది ఇతను చెప్పిన ఒక్క మాటతో సామూహిక ఆత్మహత్యలకు పాల్పడ్డారు.
జ్యోతిష్యజ్ఞానం ఉన్నవారికి పై కుండలులు చాలా ఆసక్తికరమైన విషయాలను వెల్లడిస్తాయి.ఇతని లైంగిక కార్యకలాపాలు,డ్రగ్స్ వాడకం,కమ్యూన్ లోని ఇతర గొడవలు వంటి వివాదాస్పద అంశాల జోలికి నేను కావాలనే పోలేదు.పరిశీలిస్తే అవికూడా పై చార్ట్ లలో స్పష్టంగా కనిపిస్తాయి.

ఓషో కమ్యూన్ కూడా అనేక కారణాల వల్ల ఇలాగే ధ్వంసం చెయ్యబడింది. కాని దానిలో ఇలాంటి సామూహిక (ఆత్మ)హత్యలు జరగలేదు.అందులో కూడా చెదురుమదురుగా కొన్ని సంఘటనలు జరిగినట్లు దాఖలాలు న్నాయని కొందరంటారు. 

ఇతని జీవితం మీదా,ఇలాంటి విషయాల మీదా చర్చలు ఎలా ఉన్నప్పటికీ, జ్యోతిష్య సూత్రాలనేవి ఎంత ఖచ్చితంగా పని చేస్తాయో ఇతని జీవితం చూస్తె మరొక్క సారి అర్ధమౌతుంది.
read more " చెదిరిన స్వప్నం - జిమ్ జోన్స్ జాతక పరిశీలన "