“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

4, మార్చి 2013, సోమవారం

'ఆస్ట్రో కార్టోగ్రఫీ' - పాశ్చాత్య జ్యోతిశ్శాస్త్ర పరిశోధనలో మైలురాయి

'అన్నీ వేదాల్లోనే ఉన్నాయిష'- అంటూ చంకలు చరుచుకోవడం తప్ప మనలో చాలామందికి అసలా వేదాలలో ఏమున్నాయో ఏమి లేవో ఏమీ తెలీదు.వేదాలను వల్లించే వారిలో కూడా చాలామందికి వాటి అర్ధాలు తెలీవు.వాటియొక్క ప్రతిపదార్ధాలు తెలిసినవారిలో కూడా చాలామందికి వాటి అసలైన మార్మికర్దాలేమిటో తెలియవు.

ఉన్నదాన్ని గుడ్డిగా అనుసరించడం తప్ప,పరిశోధనాత్మక దృష్టితో ఒక విషయాన్ని చూద్దామని, పరిశీలిద్దామని, పరిశోధిద్దామని, నిత్యజీవితానికి దానిని వర్తింపచేసుకుని దానిని పరీక్షించి నిగ్గు తెలుద్దామని మనలో ఎవరికీ తోచదు. ఇది భారతీయుల జీన్స్ లో ఉన్న ఒక పెద్ద లోపంగా అనుకోవచ్చు.

జ్యోతిష్యశాస్త్రంలో కూడా ఇదే తంతు నడుస్తూ ఉంటుంది.ఏవో మాయ మాటలు నాలుగు నేర్చుకుని జనాన్ని మోసం చేసి డబ్బు సంపాదిద్దా మనుకునే జ్యోతిష్కులే మన సమాజంలో ఎక్కువ. అంతేగాని శాస్త్రీయ కోణంలో దీనిని పరిశోధించి ఉన్న విషయాన్ని సరిగ్గా అర్ధం చేసుకుందామని, కొత్త విషయాలను కనుక్కుందామని ప్రయత్నాలు ఈ రంగంలో పెద్దగా కనిపించవు. ఎక్కడో ఒకచోట పరిశోధనా ఫలితంగా K.P System లాంటి కొత్త కోణాలు వెలుగు చూస్తాయి.అమెరికాలో వెలుగు చూచిన 'ఆస్ట్రో కార్టోగ్రఫీ' టెక్నిక్ అలాంటిదే. 

మనం వదిలేశామని మన విద్యలు ఊరుకోవు.ఆ విత్తనాలు గాలికి ఎగిరి పోయి ఎక్కడో పడి మొలకెత్తి వృక్షాలుగా మారి మంచి పూలు పూసి మధుర ఫలాలనిస్తాయి.మనం మాత్రం 'మా తాతలు నేతులు తాగారు' అని అరుస్తూ దిక్కులు చూస్తూ ఉంటాం.మన దేశంలో పుట్టిన మార్షల్ ఆర్ట్స్ చైనా జపాన్ కొరియా థాయిలాండ్ వంటి దేశాలలో అద్భుతంగా విస్తరించి మన దేశంలో చాలావరకు అంతరించిన విషయం గమనిస్తే మన చేతగానితనం అర్ధమౌతుంది.బుద్ధమతం పరిస్తితి కూడా అంతే.

అక్కడిదాకా ఎందుకు అద్భుతమైన త్యాగరాజకీర్తనలను మనం ఒదిలేస్తే తమిళులు ఆదరించి బతికించిన విషయం మన కళ్ళముందే ఉంది.అన్నమయ్య కీర్తనలు కొన్ని వందలసంవత్సరాల పాటు ఒక గదిలో పెట్టి తాళం వేసి ఉంటె మనకు పట్టలేదు.వేటూరి ప్రభాకర శాస్త్రి గారి చలవ వల్ల అవి బయటకు వచ్చి ఈనాడు మనం పాడుకోగలుగుతున్నాం.దాదాపు చచ్చిపోయిన ఆంద్రనాట్యం నటరాజ రామకృష్ణ చలవ వల్ల బయట పడింది. శాతవాహనులకు ముందునుంచీ ఉన్న ప్రాచీనమైన ఆంధ్రా వీరవిద్యలు ఏమై పోయాయో ప్రస్తుతం ఎవరికీ తెలీదు.ఇలా చెబుతూ పోతే ఎన్నో చెప్పుకోవచ్చు.మోసాలు కుట్రలు చేసి డబ్బు సంపాదించి ఎడాపెడా బతికేయ్యడం తప్ప ఒక ఉదాత్తమైన ఆశయంతో  జీవితాన్ని ఉన్నతంగా గడపడం మనలో ఎక్కువమందికి రాదనడానికి ఎన్నో రుజువులు ఇవ్వగలను. 

పాశ్చాత్యులలో జ్యోతిష్యవిద్య లేదని చాలామంది అనుకుంటారు. ఇది పెద్ద పొరపాటు.వారిలో గొప్ప జ్యోతిష్కులున్నారు.అంతేకాదు జ్యోతిష్యరంగంలో మంచి పరిశోధన చేసినవాళ్ళూ ఉన్నారు. ఇప్పుడు మనదైన నిరయన విధానంలో అద్భుతమైన పరిశోధన ఇతర దేశాలలో జరుగుతున్నట్లు మన దేశంలో జరగటం లేదంటే వింతకాదు. పాశ్చాత్య దేశాలలో ముఖ్యంగా అమెరికా బ్రిటన్ జర్మనీ వంటి దేశాలలో ఈనాడు భారతీయ జ్యోతిష్యం మీద అద్భుతమైన పరిశోధన జరుగుతున్నది.ఎందఱో దీనిని ఔపోసన పడుతున్నవారున్నారు.అలాంటివాడే 'జిమ్ లూయిస్' అనే అమెరికన్. అయితే యితడు సాయన విధానానుసారుడు. అప్పటికే పాశ్చాత్య జ్యోతిష్య శాస్త్రంలో అమలులో ఉన్న జ్యోతిష్య సూత్రాలను బట్టి 'యాస్ట్రో కార్టోగ్రఫీ' అన్న కొత్త విధానాన్ని తయారు చేసి దానిని ఒక అంతర్జాతీయ వ్యాపారంగా మార్చిన ఘనత ఇతనిది.రీసెర్చ్ అంటే వారి తర్వాతే ఎవరినైనా చెప్పుకోవాలి.అయితే జ్యోతిష్యవిద్యకున్న నియమనిష్టాపరమైన లోతులు పాశ్చాత్యులకు తెలుసో లేదో నాకు అనుమానమే. 

పాత సంస్కృత గ్రంధాలను అనువాదం చేసి అదే గొప్ప పరిశోధన అని అనుకునే స్థాయికి మనం దిగజారాం.ఇక వాటిలోని విషయాలు అర్ధం చేసుకునే దెప్పుడు? ఆచరించేదేప్పుడు? పరిశోధనతో కొత్త విషయాలు కనుక్కునేదేప్పుడు? మెకాలే విద్యావిధానం వల్ల వచ్చిన చెడు ఫలితాలలో ఇదొకటి.

ప్రాధమికంగా జ్యోతిష్యం రెండు విషయాల మీద ఆధారపడి ఉంటుంది.ఒకటి కాలం.రెండు స్థలం. మనిషి కాలానికీ స్థలానికీ లోబడే ఉంటాడు. ఈ రెంటినీ కాదని మనిషి బతకలేడు.మన జీవితంలో కాలగణన చేసి ఏ 'టైం' మనకు మంచిదో ఏది కాదో అనే విషయాన్ని సూచించే దిశగా భారతీయ జ్యోతిష్యం చాలా పరిశ్రమ చేసింది. అందులో అద్భుతమైన సూత్రాలను కనుక్కుంది కూడా.ఇకపోతే 'స్థలం' లేదా 'ప్రదేశం' అనే విషయంలో కూడా మనకు కొన్ని విధానాలున్నాయి.'ఫలానా ఊరు నాకు కలిసోస్తుందా లేదా?' అన్న విషయాన్ని కనుక్కునే విధానాలు ప్రశ్న జ్యోతిష్యం లోనూ,పల్లెటూళ్ళలో ప్రచారంలో ఉన్న కొన్ని జ్యోతిష్య సూత్రాలలోనూ మనకు కనిపిస్తాయి. జిమ్ లూయిస్ కనుక్కున్న 'యాస్ట్రో కార్టోగ్రఫీ' కూడా ఇలాంటిదే.అయితే దీనికి ఒక శాస్త్రీయరూపాన్నిచ్చి రుజువు చేయదగ్గ శాస్త్రంగా దీనిని మార్చిన ఘనత మాత్రం ఇతనిదే.

చాలామందికి ఇది అనుభవంలో ఉంటుంది.ఉన్న ఊరు వదిలి వేరే ఊరికి పోయిన తర్వాత బాగా కలిసొచ్చి ధనికులైన వాళ్ళు చాలామంది ఉంటారు.అలాగే దీనికి వ్యతిరేకంగా ఊరు మారిన తర్వాత అన్నీ పోగొట్టుకుని బికారులైనవాళ్ళూ ఉంటారు. ఇతర దేశాలు పోయి బాగా ఎదిగిన వాళ్ళూ ఉంటారు.అలాగే ఆశించినంత ఎదగలేక అల్లాడుతున్న వారూ ఉంటారు.కొంతమందిని కొన్ని ఊళ్లు వదిలిపెట్టవు.వారు అనుకున్నా ఎంత ప్రయత్నించినా ఆ ఊరు వదలలేరు. కొందరు ఎక్కడా స్తిరంగా నిలవలేరు. మాటమాటకీ ఊళ్లు మారుతూ ఉంటారు. ఇదంతా స్థల మహిమ.కొన్ని ఊళ్లు ఎప్పుడూ ఏడుస్తూ ఉన్నట్లు ఉంటాయి.అక్కడ ఉన్నవాళ్ళు కూడా ఎదుగూ బొదుగూ లేకుండా ఉంటారు.ఇంకొన్ని ఊళ్లు తీవ్రమైన వేగజీవితాన్ని కలిగి ఉంటాయి.అక్కడ ఉండేవాళ్ళు ప్రశాంతంగా ఉందామన్నా ఉండలేరు.ఎప్పుడూ ఉరుకులు పరుగులతో(పడిపోయేటంతవరకూ) పరిగెత్తుతూనే ఉంటారు. మహానగరాలన్నీ అలాంటివే. 

ప్రతిమనిషికీ భూమ్మీద బాగా కలిసొచ్చే ప్రదేశాలు ఒకటో కొన్నో ఉంటాయి.అలాగే కొన్ని కొన్ని రంగాలకు కొన్ని కొన్ని దేశాలూ ఊళ్లూ బాగా కలిసొస్తాయి.భట్టిప్రోలుకీ బాంబేకీ ఉన్న తేడా గమనిస్తే ఇది అర్ధమౌతుంది. ప్రతి మనిషి జాతకంలోనూ దీనికి సూచనలుంటాయి.ఈ సూత్రం ఆధారంగా ఇతను తయారు చేసిన 'గ్రాఫ్' నే 'ఏ-సి-జీ'(ఆస్ట్రో కార్టో గ్రఫీ)  చార్ట్ అంటారు. దీనివల్ల భూగోళంలో మన అదృష్టప్రాంతం ఎక్కడుందో స్పష్టంగా ఖచ్చితంగా తెలుసుకోవచ్చు.అక్కడికి పోయి సెటిల్ అయితే చాలు.జీవితం అనూహ్యంగా మారిపోతుంది.ఇది చాలామంది జీవితాలలో రుజువైన నిగ్గుతేలిన సత్యం. బికారులుగా ఈ చార్ట్ సూచించిన ప్రాంతాలలోని ఊరిలో అడుగుపెట్టి మిలియనీర్లుగా తేలినవాళ్ళు చాలామంది ఉన్నారు.అమెరికా ప్రెసిడెంట్స్, ఇంకా ఇతర దేశాధినేతల చాలామంది జాతకాలలో ముఖ్యమైన సంఘటనలను ఈ చార్ట్ లు చాలా ఖచ్చితంగా సూచించాయి.దీనిగురించి చెప్పే అఫిషియల్ వెబ్ సైట్స్ చాలానే ఉన్నాయి,వాటిలో పూర్తి వివరాలు దొరుకుతాయి కనుక నేను ఆ టెక్నిక్ గురించి ఇంతకంటే ఎక్కువ వ్రాయను. ఇతని జాతకాన్ని మాత్రం ప్రస్తుతం స్థూలంగా పరిశీలిద్దాం.

ఇతను 5-6-1941 న 9.30 కు న్యూయార్క్ లో పుట్టాడు.ఇతని జాతకాన్ని 'ఏసీజీ' కోణంలో మాత్రమె చూద్దాం.మిగతా జీవిత వివరాల జోలికి కావాలనే పోవడం లేదు.

ఇటువంటి నిర్దుష్టమైన జ్యోతిష్య సూత్రాలు స్ఫురించాలంటే జాతకంలో కొన్ని ప్రత్యెకయోగాలుండాలి. అంతేగాక వాటిని క్రోడీకరించి ఒక నిర్దిష్టమైన రూపాన్నిచ్చి ఒక ఖచ్చితమైన బిజినెస్ గా దానిని మార్చాలంటే కూడా కొన్ని యోగాలుండాలి.అవేమిటో మాత్రమె పరిశీలిద్దాం.
  • తృతీయంలో గల లగ్నాధిప రాహువుల (బుదాదిత్య యోగచ్చాయ) వల్ల జ్యోతిష్యపరమైన ఉపన్యాసాలతో విశ్లేషనలతో లోకంతో అనుసంధానం అవుతాడన్న సూచన ఉంది. 
  • లాభస్తానంలో ఉన్న గురు సూర్య యురేనస్ ల యోగం ఇతని జాతకంలో ఒక సిగ్నేచర్.వీరి దృష్టి పంచమం మీద ఉండటం వల్ల ఇతనికి స్ఫురణశక్తితో కూడిన జ్యోతిష్యజ్ఞానం అబ్బింది.వీరిలో గురువూ యురేనసూ సూర్యనక్షత్రంలో ఉండటం చూడొచ్చు.సాయన జ్యోతిష్కులకు సూర్యబలం ప్రధానం.
  • నవమకేతువు వల్ల ఇతనికి ఆధ్యాత్మికచింతన ఉన్నప్పటికీ దానికి పట్టిన పాపార్గళం వల్ల అది పక్కదారులు పట్టి దారిలో ఇంకిపోయిన కాలువలాగా అవుతుంది గాని గమ్యం చేరలేదు.
  • జ్యోతిష్య విద్యా కారకుడైన బుధుడు రాహునక్షత్రంలో ఉంటూ స్ఫురణ శక్తిని సూచిస్తున్నాడు.అనేక ప్రాంతాలు తిరిగి దానిని ఒక బిజినెస్ గా మార్చే సూచన కూడా ఇస్తున్నాడు.
  • ఆత్మకారకుడైన శని దశమంలో నీచలో ఉంటూ ఇతనికి గల చెడుకర్మ బరువును సూచిస్తున్నాడు.జ్యోతిష్యాన్ని వృత్తిగా మార్చుకున్న ఇతను సామాన్యంగా జ్యోతిష్కులు పాటించవలసిన నియమాలు మాత్రం  పాటించలేదని దీనివల్ల అర్ధమౌతుంది.అందువల్లే,ఇతను ఒక గొప్ప టెక్నిక్ ను కనుక్కోగలిగినప్పటికీ వ్యక్తిగత జీవితంలో దెబ్బతిన్నాడని  కూడా తెలుస్తుంది.
  • లగ్నం నుంచి చూచినా చంద్ర లగ్నం నుంచి చూచినా ఇతని జాతకంలో ఒక విచిత్రయోగం ఉన్నది.పంచమాదిపతి అష్టమంలో ఉండటం.ఆ ఇద్దరూ క్రూరగ్రహాలై ఉండటం.అంటే ఈ జ్యోతిష్యవిద్య ఇతనికి  మార్మిక సంబంధమైన సాధన వల్ల(అది గతజన్మలది కావడానికి అవకాశం ఎక్కువ)వచ్చింది అని తెలుస్తోంది.అయితే దీనివల్ల ఇతనికి మంచి జరుగకపోగా అరిష్టం ఉందని సూచన వస్తుంది. ఆ అరిష్టం ఎలా వచ్చిందో చూద్దాం.
  • లగ్నంలో పంచమ,నవమ,లాభ ఆరూడాలు కలిసి ఉండటం వల్ల అక్కల్ట్ విద్య అయిన జ్యోతిషం వల్ల లాభం సూచితం.అయితే అక్కడే మాంది గుళికుల స్తితి వల్ల అరిష్టం కూడా సూచితం.
  • లగ్నంలోని ప్లూటో వల్ల గతానికి భవిష్యత్తులోని ఆశలకు మధ్య తీవ్ర ఘర్షణ, లోతైన మానసిక సంఘర్షణ సూచితం.అయితే ఇదే గ్రహస్తితివల్ల స్ఫురణ శక్తి కలుగుతుంది.
  • చాలామంది జీవితంలో పీటముళ్లుంటాయి.అవి జాతకాలలో ప్రతి ఫలిస్తాయి.ఇతని జాతకంలో కూడా ఉన్నాయి.వాటిలో ఒకదాన్ని చూద్దాం.వీటి ఫలితంగా ఒక రంగంలో ఎదిగితే జీవితంలో ఇంకో రంగంలో ఘోరమైన నష్టం జరుగుతుంది.ఇది చాలామందికి అనుభవమే. ఇటువంటి ఉదాహరణలు అనేకమంది జీవితాలలోనుంచి  కోకొల్లలుగా ఇవ్వగలను.
  • చంద్రలగ్నాత్ దశమంలో బుధ శుక్రులు లగ్న/దశమ,ధన/నవమాదిపతులుగా కలసి ఉండటం ఒక గొప్ప ధన/రాజయోగం. వారిని పంచమాధిపతిగా శని వీక్షిస్తూ ఉండటం వల్ల జ్యోతిష్యాన్ని వృత్తిగా మార్చుకొని శ్రీమంతుడౌతాడన్న సూచన ఉన్నది.అయితే శని నీచత్వం వల్ల,షష్టాదిపత్యం వల్ల వృత్తిలో ఎదుగుదలకు తోడుతోడుగా అనారోగ్యం కూడా పెరుగుతుంది అన్న సూచనా ఉన్నది. ఇతని జీవితంలో ఇదే ఖచ్చితంగా జరిగింది.
  • ఇతని జీవితంలో ఇదే పెద్ద పీటముడి.పూర్వకర్మ ఇలాంటి చిక్కుముళ్ళను ఏర్పాటు చేస్తుంది.వీటిని విప్పాలంటే ఉత్త జ్యోతిష్య జ్ఞానం చాలదు.తంత్ర శాస్త్రం తెలిసి ఉండాలి.    
ఆస్ట్రో కార్టోగ్రఫీ విధానాన్ని కనుక్కున్నందుకు జ్యోతిష్య రంగంలో ఆస్కార్ అవార్డ్ అనబడిన 'రెగులస్ ప్రైజ్'  1992 లో న్యూయార్క్ లో జరిగిన ఒక సమావేశంలో అందుకున్నాడు. ఆ సమయంలో ఇతని జాతకంలో అష్టోత్తరీ గురు/గురు దశ జరిగింది.ఇతనికి జ్యోతిష్య జ్ఞానాన్ని ఇవ్వడంలో గురువు యొక్క పాత్రను పైన చర్చించాను.

సప్తమాధిపతి శని నీచలో ఉండటం వల్ల లగ్నాధిపతి చంద్రునితో 6/8 దృష్టి వల్లా ఇతను 'సాన్ ప్రాంసిస్కో గే కమ్యూనిటీ' లో మెంబర్ గా ఉండేవాడు. అయితే ప్రస్తుత వ్యాసోద్దేశ్యం ఈ కోణాన్ని పరిశీలించడం కాదు గనుక దాని జోలికి పోవడంలేదు.

1980 లో ఇతను ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్నపుడు ఒక రోడ్డు దాటుతూ ఉండగా స్పీడ్ గా వస్తున్న ట్రక్ గుద్దుకొని రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. అప్పుడు జాతకంలో గురుదశ అంతమై శనిదశ మొదలై శనిలో/శని దశ జరుగుతున్నది.శని దశమంలో నీచలో ఉంటూ వాహనాలను సూచించే చతుర్ధాన్ని చూడటం గమనించాలి.ఈ లగ్నానికి శని మారకుడని గమనించాలి.

54 ఏళ్ళ చిన్న వయసులో ఇతను బ్రెయిన్ ట్యూమర్ తో మరణించాడు.అప్పుడు జాతకంలో శని/రాహువు నడిచింది.ఇది శపితయోగం అన్న విషయం నా బ్లాగ్ వదలకుండా చదివే వారికి చెప్పనవసరం లేదు.తలను సూచించే మేషరాశిలో శని నీచ స్తితిలో ఉంటూ ఆయు స్థానంలో ఉన్న రాహువుతో షష్ఠ-అష్టక స్తితిలో ఉండటం చూడవచ్చు.

ఇతను 21-2-1995 న చనిపోయాడు. ఇతని కున్న స్ఫురణ శక్తి వల్ల తన జ్యోతిష్య అధ్యయనానికీ,తను కనిపెట్టిన  టెక్నిక్ కు పేటెంట్లు తీసుకోవడం, ప్రత్యర్ధులతో లీగల్ యుద్ధాలు చెయ్యడం, లెక్చర్ టూర్లు మొదలైన ఎడతెగని పనుల వల్ల తన ఆరోగ్యం దెబ్బ తింటున్నదని భావించేవాడు. ఇందులో నిజం లేకపోలేదు. అయితే అసలు నిజం అతనికి అర్ధం కాలేదని నా భావన.జ్యోతిష్యవిద్య చాలా ప్రమాదకరమైనది.అక్కల్ట్ తో ఆటలు పనికిరావు.అది ప్రాణాలను పణంగా పెట్టి అతీతశక్తులతో చెలగాటం ఆడటం అవుతుంది.ఆ విషయం ప్రస్తుతానికి అలా ఉంచి, ఆనాటి విచిత్ర గ్రహస్తితులు ఎలా ఉన్నవో ఒకసారి చూద్దాం. 
  • ఇతని లగ్నం కటకం 25 డిగ్రీలు. ఆ రోజున వక్ర కుజుడు నీచలో సరిగ్గా ఇదే డిగ్రీ పైన సంచరించాడు. 
  • రాహు చంద్రులు తులలో ఇతని జనన శనికి సరిగ్గా ఎదురుగా వచ్చారు.వీరిలో చంద్రుడు సరిగా శనితో డిగ్రీ ఆపోజిషన్ లోకి వచ్చాడు.
  • ఇతని జననకాల కుజుడు కుంభరాశిలో 20 డిగ్రీలో ఉన్నాడు.గోచార శని సరిగ్గా కుంభం 19 డిగ్రీ మీద మరణ దినాన సంచరించాడు.
  • గోచార గురువు జనన సూర్యునికి సరిగ్గా ఎదురుగా వచ్చి వృశ్చికంలో 19 డిగ్రీ మీదున్నాడు.కుంభంలో ఉన్న కుజునితో సరిగ్గా కేంద్ర దృష్టిలోకి వచ్చి ఉన్నాడు. 
  • ఈ గ్రహయోగాలవల్ల ఇతని మరణం కర్మమరణం అని తెలుస్తున్నది. అనేక వేలమంది జీవితాలను తన టెక్నిక్ తో మార్చిన ఇతను మరి ఆ శాస్త్రానికి తగిన జీవనవిధానాన్ని కూడా అనుసరించి ఉండవలసింది. అయితే లగ్నంలోని ప్లూటో, అష్టమంలోని కుజుడూ, దశమంలోని నీచ శనీ అతన్నలా చెయ్యనిస్తే ఇక కర్మ ప్రభావం ఏముంటుంది? ప్రతి మనిషీ తాను చెయ్యాలనుకున్న పనులు వెంటనే చేసేసి ఉండేవాడు.కాని మనిషి జీవితంలో అలా జరగదు కదా.
  • జ్యోతిష్య శాస్త్రాన్ని అధ్యయనం చెయ్యాలనుకునే వారు దానికి చెందిన మార్మిక నియమాలు పాటించకపోతే,ఆ రంగంలో గొప్ప విజయాలు సాధించినప్పటికీ,చివరకు ఏమి జరుగుతుందో బహుశా ఈయన జాతకం ఒక హెచ్చరిక కావచ్చు.
  • భారతీయ జ్యోతిష్యంలోని పరిహారక్రియలు ఇతనికి తెలిసిఉంటే ఈ దోషాన్ని తప్పుకోగలిగి ఉండేవాడు.కాని దానికి కూడా యోగం ఉండాలి.అది లేకుంటే పక్కనే ఉన్నప్పటికీ ఏదీ అందదు.
లోకాన్ని ఉద్దరించిన వ్యక్తి తన జాతకంలోని గ్రహదోషాలను తాను సరిచేసుకోలేక పోతే ఉపయోగం ఏముంటుంది? డబ్బు ఒక్కటే జీవితంలోని సక్సెస్ కు కొలబద్ద అనుకోవడం ఎంతవరకు సమంజసం?

ఇతని జీవితాన్ని చదివినమీదట నాకు బైబుల్ లోని ఒక కొటేషన్ గుర్తు కొస్తున్నది. బైబుల్ లో మాధ్యూ 16.26 లో ఇలా ఉంటుంది."ఒకడు ప్రపంచం మొత్తాన్నీ సంపాదించినప్పటికీ తన ఆత్మను పోగొట్టుకుంటే ప్రయోజనం ఏముంది? ఎందుకంటే ఆత్మను మించిన విలువైనది ప్రపంచంలో ఏముంది గనుక?"