“అసమర్ధుని వద్ద ధనము, సుఖము, కీర్తి, ధర్మము ఏవీ నిలచి ఉండవు"

10, మార్చి 2013, ఆదివారం

త్యాగయ్య నాదోపాసన - 4 (రామమంత్ర రహస్యం)

త్యాగరాజు తనకీర్తనలలో చెప్పని విషయం లేదు.భక్తి జ్ఞాన వివేక వైరాగ్య యోగ యాగ మంత్ర రహస్యాలను సూక్ష్మముగా వివరించాడు.అర్ధం చేసుకున్నవారికి అర్ధం చేసుకున్నంత. ఆచరించిన వారికి ఆచరించినంత. ఊరకే పాడుకునే వారికి పాటవరకే అందుతుంది.ఏదైనా పాత్రతను బట్టి గదా ప్రాప్తం..

దేవామృతవర్షిణి రాగంలో పాడిన 'ఎవరని నిర్ణయించిరిరా' అనే కీర్తనలో రామమంత్ర రహస్యాన్ని సద్గురు త్యాగరాజు వివరించాడు.

ఎవరని నిర్ణయించిరిరా నిన్నేట్లారాధించిరిరా నరవరు ||లెవరని||  
శివుడనో మాధవుడనో కమలభవుడనో పరం బ్రహ్మమనో   ||ఎవరని||

శివమంత్రమునకు మజీవము మా 
ధవ మంత్రమునకు రాజీవము ఈ 
వివరము దెలిసిన ఘనులకు మ్రొక్కెద  
వితరణ గుణ త్యాగరాజ నుత ని                       || న్నెవరని ||

నమశ్శివాయ యను శివపంచాక్షరీ మంత్రమునకు 'మ' అనే అక్షరము జీవాక్షరము. అది లేకున్న 'న శివాయ' అగును.అనగా అమంగళము అని అర్ధము వచ్చును.పూర్తిగా మంత్రార్ధమే చెడిపోవును. శుభమునిచ్చెడు మంత్రము అశుభము నిచ్చునది యగును. అట్లే నారాయణాయ అనే అష్టాక్షరీ మంత్రంలో 'రా' యను అక్షరము జీవాక్షరము.అది ఒక్కటి లోపించినచో 'నా అయనాయ' అగును.అది కూడా అశుభమైన అర్ధమునే ఇచ్చును. కనుక ఈ రెండు మంత్రములలోనూ ఈ రెండు అక్షరములే జీవాక్షరములు. ఈ రా,మ అను రెండు జీవాక్షరముల కలయికయే 'రామ' మంత్రము. 

రామనామము ఇట్టి మహత్తరమైన శక్తిస్వరూపమై శివవిష్ణుశక్తుల సమాగమరూపమై వెలుగుతున్నది.అనగా శివశక్తుల సమ్మిలిత స్వరూపమని చెప్పవచ్చును.ఎందుకనగా విష్ణుతత్వము శక్తితత్వము సమానార్ధకములే.కనుక వేదప్రతిపాదితమైన ప్రణవమునకు,తంత్ర ప్రతి పాదితమైన తాంత్రికప్రణవమునకు 'రామ' శబ్దము సమాన శక్తి సంయుతమై పురాణప్రణవ మనబడుచున్నది.

'రా' అను అక్షరము అగ్నిబీజమగుట జేసి పరబ్రహ్మవాచకము.'మ' యనే అక్షరము మాయాసూచకము.కనుక అజ్ఞానమనే చీకటి యనబడు మాయను ధ్వంసమొనర్చి పరతత్వజ్ఞానమనే వెలుగును సాధకుని హృదయమున నింపగల మహత్తరమైన మంత్రమే రామమంత్రము.    

ఇట్టి రామనామము ఐహిక భోగేచ్చాపరులకు ధర్మ సంయుతమైన ఐహికమును,ముముక్షువులకు పరంబ్రహ్మానుభవమను ఆముష్మికమును ప్రసాదించగల శివకేశవ శక్తిస్వరూపమై భాసిస్తూ ఉన్నది. అందుకనే ఈ మంత్రమును తారకమంత్రము,అనగా సంసార సాగరమునుండి తరింప చేయగల శక్తి స్వరూపము అన్నారు.కనుక ఇది వేదాత్మకమైనట్టిది.ఈ కారణమున బ్రహ్మస్వరూపము కూడా అగుచున్నది.

రామనామము బ్రహ్మవిష్ణుశివస్వరూపము గనుక ఇది పరబ్రహ్మవాచకము. 'తస్యవాచక ప్రణవ:'అని యోగసూత్రములంటాయి. అనగా మనోవాచామ గోచరమగు పరబ్రహ్మము యొక్క నామమే ప్రణవము. రామ శబ్దము కూడా అట్టి ప్రణవమునకు సమాన శక్తివంతమే. కనుక త్యాగయ్య రాముని శివుడనో మాధవుడనో కమలభవుడనో అంతేగాక ఈ మువ్వురి కతీతమగు పరమబ్రహ్మము కూడా అని సూక్ష్మముగా ఈ కీర్తనలో బోధించాడు. 

ఇటువంటి రామనామము యొక్క శబ్దార్ధమే గాక తత్వార్ధము కూడా తెలిసి ఉపాసించి పరతత్వానుభవము నొందిన మహనీయులకు నేను మ్రొక్కెదనని సద్గురు త్యాగరాజు వినమ్ర భావముతో ఒక సరళమైన కీర్తనలో ఇంత రహస్యార్ధమును పొదిగి గానం చేశాడు.