“అసమర్ధజాతికి ఆత్మగౌరవ అర్హత ఉండదు"

25, డిసెంబర్ 2010, శనివారం

క్రిస్మస్

ప్రపంచమంతా డిసెంబర్ ఇరవై ఐదున క్రిస్మస్ గా జరుపుకుంటున్నారు. కాని దీనికి ఆధారాలు ఏమాత్రం లేవని, ఇది అంతకంటే ప్రాచీనమైన వైదికుల "ఉత్తరాయణ పుణ్యకాలం" అనే పండుగ అన్న చేదునిజం బయట పడితే దీనిని ప్రపంచం జీర్ణించుకోగలదా?

జీసస్ క్రీస్ట్ ఎప్పుడు పుట్టాడో ఎవరికీ తెలియదు. మనలాగా సంవత్సర, మాస, పక్ష, తిథి, వార, నక్షత్రాలను, యోగ, కరణాలను, హోరను,లగ్నం నుంచి నాడీ లగ్నం వరకూ ఉన్న సూక్ష్మ విభాగాలను లెక్కించి దాన్ని బట్టి జనన కాలాన్ని వ్రాసిపెట్టే పద్దతి అప్పట్లో ఆ దేశంలో లేదు. వారికి అంతటి జ్యోతిష్య జ్ఞానమూ లేదు. అప్పుడే కాదు, ఇప్పటికీ ఏ పాశ్చాత్యదేశంలోనూ ఇంతటి జ్యోతిష్య పరిజ్ఞానం ఎక్కడా నిజం చెప్పాలంటే, జీసస్ అనేవాడు ఎప్పుడు పుట్టాడో ఎవరికీ తెలియదు. అందరూ అనుకుంటున్న డిసెంబర్ ఇరవై అయిదు ఆయన పుట్టిన రోజు కాదు.

క్రీస్తుశకం మూడో శతాబ్దంలో ఆయన జనన సమయాన్ని నిర్ధారించి దానిని ఒక పండుగగా జరుపుకోవాలనే ప్రయత్నాలు జరిగాయి. అప్పటికి క్రైస్తవమతం ఒక రాజామోదం పొందిన మతంగా రూపు దిద్దుకోగలిగింది. యూదుల ప్రాచీన పండుగ అయిన "ఫెస్టివల్ ఆఫ్ లైట్స్" అదే సమయంలో వస్తుంది కనుక ఆ కాలపు క్రైస్తవమతాచార్యులు ఆ సమయాన్నినిర్ధారించి ఉండవచ్చు. ఈ పండుగను యూదులు తమకంటే ప్రాచీనమైన వైదిక సంస్కృతి నుంచి తీసుకుని అనుకరించసాగారు. ఎందుకంటే మన పండుగలకు, ప్రకృతికీ, సూర్య చంద్ర గమనాలకూ, అవినాభావ సంబంధం ఉన్నది. మన వైదికపండుగలు విశ్వజనీనమైనవి. ఇవి వ్యక్తులతో ముడిపడినట్టివి కావు. ఇది ఎవ్వరూ కాదనలేని సత్యం. కాబట్టి ఈ కాన్సెప్ట్ ను యూదులు మననుంచి కాపీ కొట్టి ఉండవచ్చు అని గట్టిగా చెప్పవచ్చు.

ప్రాచీన వేదకాలం నాటి పండుగలు ఏ ఒక్క మహాపురుషుని జన్మనో ఆధారంగా తీసుకుని మొదలైనవి కావు. అప్పట్లో వ్యక్తుల పుట్టినరోజులు జరుపుకునే కాన్సెప్ట్ లేదు. అప్పటి పండుగలు అన్నీ విశ్వం లో జరుగుతున్న మార్పులను బట్టి, సూర్యచంద్రుల గమనాలను బట్టి, ఋతువులను బట్టి, సూక్ష్మమైన ఖగోళ పరిశీలనను బట్టి తయారు చేసినవే.

ఈ పండుగనే అతి ప్రాచీన కాలం నుంచి మనం "ఉత్తరాయణ పుణ్య కాలం" గా పిలుస్తూ ఉన్నాం. సూర్యుడు దక్షిణం నుంచి ఉత్తరానికి ప్రయాణం చేసే సమయాన్ని, ఒంపు తిరిగే సమయాన్ని, ఉత్తరాయణ పుణ్యకాలం అంటూ అది దేవతలకు పగలుగా వేదం చెప్పింది. అది సాయన సిద్ధాంతం ప్రకారం డిసెంబర్ ఇరవై ఒకటి ప్రాంతం లో వస్తుంది. ఈ రోజు నుంచి రాత్రుళ్ళు తగ్గుతూ పగటి నిడివి పెరుగుతూ వస్తుంది. కనుక భారతీయుల ఉత్తరాయణ పుణ్యకాలాన్నే ప్రాచీనయూదులు "ఫెస్టివల్ ఆఫ్ లైట్స్" గా లెక్కించారనేది వాస్తవం.

దీనినే క్రీస్తు జనన సమయంగా తరువాతి క్రైస్తవులు నిర్ధారించారు. ఎందుకంటే ఈవిధంగా యూదులపండుగ సమయంలో క్రీస్తుజన్మదినం జరపటం మొదలుపెడితే కొన్నాళ్ళకు ప్రాచీనయూదుల పండుగలు మరుగునపడి, క్రిస్మస్ మాత్రమె సమాజంలో మిగులుతుందనే దురూహ దీన్ని మొదలుపెట్టిన వారికి ఉండిఉండవచ్చు. క్రీస్తును సిలువనెక్కించి చిత్రహింస పెట్టిన యూదుల పండుగలను సమాజంలోనుంచి చెరిపివెయ్యాలంటే ఇదొక మార్గంగా అప్పటి వారు ఊహించి ఉండవచ్చు. ప్రస్తుతం అసలైన పండుగ మరుగున పడి, వీరి ఊహే చాలావరకూ చలామణీ అవుతూ ఉండటం చూస్తున్నాం.

క్రైస్తవమతం మొదటినుంచీ ఇలాంటి దుష్టమైన పన్నాగాలతోనే వృద్ధి చెందుతూ వచ్చింది. చాపక్రింద నీరులా చల్లగా ఒక దేశంలో అడుగుపెట్టడం అక్కడి పరిస్థితులను ఆసరాగా తీసుకుని మెల్లగా కుహనా క్రైస్తవ బోధనలను మనుషులలోకి ఎ
క్కించడం దీని అలవాటు.

ప్రాచీన ఇరాన్ లో సూర్యుని "మిత్ర" అనే పేరుతొ పిలిచేవారు. వారి కాలెండర్ లోకూడా ఈ తేదీన షబే-జాఎష్- మెహర్ అనే పండుగను జరుపుకుంటారు. రోజునుంచి పగళ్ళు పెరుగుతూ వస్తాయి. రాత్రుళ్ళు తగ్గుతూ వస్తాయి. సూర్యుని వెలుగు ఎక్కువ అవుతుంది కనుక దీనిని లోకానికి శుభసూచకంగా భావించేవారు. ప్రాచీన ఇరానియన్ దేవత అయిన "మిత్రా"(సూర్యున) కు ముఖ్యమైన తేదీ కనుక తరువాతివారు క్రీస్తుజన్మదినంగా దానిని నిర్ధారించి ఉండవచ్చు. వేదం లోని "మిత్రా-వరుణులు" లేక "మైత్రా-వరుణులు" అదే పేర్లతో ప్రాచీన ఇరాన్ లోకూడా మనకు దర్శనం ఇస్తారు. తరువాత ఇస్లాం మతం వచ్చి ఇరాన్ లో పూజింపబడుతున్న వైదిక దేవతలను అందరినీ తొలగించింది అది వేరే సంగతి.

మొత్తంమీద క్రైస్తవుల కుట్ర ఫలితంగా జీసస్ ను స్మరించుకుంటూ చేసుకునే ఒక పండుగగా క్రిస్మస్ నిలిచిపోయింది. దానికి డిసెంబర్ ఇరవై అయిదు ఖాయం చెయ్యబడింది. అదే ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతూ వస్తున్నది. కాని దీనికి మూలం మన పంచాంగంలోని "ఉత్తరాయణ పుణ్యకాలం" అన్న సంగతి, ఇది సూర్య గమనానికి సంబంధించిన పండుగ అనీ, జ్యోతిష్య విజ్ఞానం ఇచ్చిన పండుగ అనీ, ఇదే జీసస్ జనన దినంగా జరుపుకోబడుతున్నదనీ, ఖగోళ పరమైన ఆధారాలు తప్ప దీనికి క్రైస్తవపరమైన ఆధారాలు అస్సలులేవన్న సంగతీ చాలా మందికి తెలియదు.

అసలు జీసస్ ఎప్పుడు పుట్టాడో ఎవరికీ తెలియదు దానికి
బైబిల్ లో
ఎక్కడా రికార్డులు లేవు. భారతీయుల "ఉత్తరాయణ పుణ్యకాలమే" క్రిస్మస్ గా మారి అందరిచేతా ఈపేరుతొ జరుపుకొబడుతున్నది. ప్రపంచం అజ్ఞానమయం అనడానికి, దానిని సత్యం నడపదు, గుడ్డి నమ్మకమే నడుపుతుంది అనడానికి ఇదొక రుజువు. ఈ నమ్మకం మీద కొన్ని వందల కోట్ల డాలర్ల వ్యాపారం ప్రపంచ వ్యాప్తం గా జరుగుతున్నది. కాని ఆ నమ్మకానికే అసలు ఆధారాలు లేవు అన్నది చేదునిజం.

నిజాలు అర్ధమయ్యే కొద్దీ "మాయా ప్రపంచం తమ్ముడూ..." అనీ, It is the devil that carries the Bible అనీ నమ్మక తప్పదేమో మరి.
read more " క్రిస్మస్ "

16, డిసెంబర్ 2010, గురువారం

ముక్కోటి ఏకాదశి

రేపే ముక్కోటి ఏకాదశి.

సనాతన ధర్మం అనబడే హిందూమతంలో మహోన్నతమైన రహస్యాలు దాగున్నాయి. మన గుడ్డిగా చేస్తున్న వ్రతాలు-పూజలకూ, ఖగోళ గమనానికీ, జ్యోతిష్యసూత్రాలకూ, యోగసాధనకూ సంబంధాలున్నాయి. హిందూ మతంలోని అతి గొప్పదైన విషయం ఇదే. పిండాండానికీ-బ్రహ్మాండానికీ, దీనిలో-దానిలో ఉన్న అన్నింటికీ మన మతంలో సమన్వయం కనిపిస్తుంది.

విశ్వంతో పోలిస్తే మానవుడు ఒక అణువైనప్పటికీ, ఈ అణువులోనే మళ్లీ ఆ విశ్వం అంతా దాగుంది. ఎలా దాగుంది అన్న రహస్యాన్ని మన గ్రంధాలు విప్పిచెప్పటమేగాక, ఏం చేస్తే రెంటికీ చక్కని సమన్వయం సాధించవచ్చో వివరించాయి. మానవుడు బాహ్య-అంతరిక స్థాయిలలో సమన్వయాన్ని సాధించగలిగితే అతని జీవిత గమ్యాన్ని చేరుకోగలుగుతాడు. కాని అందరూ అంతరిక సాధన చెయ్యగలరా? అంటే, అర్హత అంత త్వరగా అందరికీ రాదు అనే చెప్పాల్సి వస్తుంది.

అంతరిక యోగసాధన చెయ్యలేనివారు నామజపం చెయ్యవచ్చు. లేదా బాహ్యపూజ చెయ్యవచ్చు. సరిగ్గా చేస్తే అన్నీ ఒకే ఫలితానికి దారి తీస్తాయి. కారణమ్? అంతరికం బాహ్యం ఒకే మూలంపైన ఆధారపడిఉన్నాయి అన్నదే ఇక్కడి రహస్యం. బాహ్యం అంతరికాన్ని ప్రభావితం చేస్తుంది. అంతరికం బాహ్యానికి ఆధారాన్ని కల్పిస్తుంది. చివరకు, రెండూ వేరువేరుకావు ఒకటే అన్న సత్యస్ఫూర్తి కలుగుతుంది.

రేపు ఉపవాసం ఉండి విష్ణుపూజ,స్మరణ చెయ్యాలని మన పురాణాలు చెబుతున్నాయి. రేపు వైకుంఠ ద్వారం తెరుచుకుంటుందని దానిద్వారా వెళ్ళడం ద్వారా మానవునికి విష్ణు దర్శనం కలిగి తద్వారా మోక్షం కలుగుతుందని చెబుతూ దీనిని మోక్ష- ఏకాదశి అని పిలిచాయి. దీనినే ఉత్తర ద్వార దర్శనం అనికూడా అంటారు.

తిరుమల ఏడుకొండలలోని ఏడవకొండమీద శ్రీనివాసుడు కొలువై ఉన్నాడు. మనలోపల ఉన్న సప్త చక్రాలలో ఏడవదైన సహస్రదళపద్మం మీద ఆయన నారాయణునిగా శయనించి ఉన్నాడు. యోగపరిభాషలో మానవుని తలభాగం ఉత్తరం, కాళ్ళవైపు భాగం దక్షిణం. భౌగోళిక ఉత్తరంలో అయస్కాంత దక్షిణ ధృవం ఉంది. అందుకే ఉత్తరం వైపు తలపెట్టి పడుకోవద్దని అంటారు.

ఈరోజున ఉత్తరద్వారం తెరుచుకుంటుంది అంటే అర్ధం- సహస్రదళపద్మానికి వెళ్ళేదారి సునాయాసంగా తెరుచుకుంటుంది అని. రోజున నారాయణుడు ఉత్తరద్వారాన్ని తెరిచి తన ద్వారపాలకులైన జయవిజయులను లోనికి అనుమతించాడని పురాణాలు చెబుతాయి.

జయవిజయులంటే ఇడా పింగళానాడులు. సామాన్యంగా రెండూ భ్రూమధ్యంలో ఉన్న ద్విదళ ఆజ్ఞాపద్మం వరకే వెళతాయి. ఇవి గుమ్మంవరకూ వెళ్లగలవుగాని సహస్ర దళ పద్మంలోనికి వెళ్ళలేవు. కనుకనే వీటిని ద్వారపాలకులు అని యోగపరిభాషలో అంటారు. ఇడానాడి చంద్రనాడి ఇది చంద్రునికి సూచిక. పింగళానాడి సూర్యనాడి ఇది సూర్యునికి సూచిక. కనుక అగ్నిస్వరూపమైన సుషుమ్నలోనికి రెండూ లయించిన స్థితినే జయవిజయులను ఉత్తరద్వారంగుండా నారాయణుడు లోనికి రానిచ్చాడని మార్మికభాషలో చెప్పారు. ఏకాదశి రోజున అది జరిగింది. అప్పుడు వైకుంఠం అనే స్థితి కలుగుతుంది. కుంఠితము కానిది వైకుంఠం. అంటే నిశ్చలము, స్థిరము, నాశనములేనిది అయిన స్థితి. ఉచ్చ్వాస నిశ్వాసములతో నిత్యం చంచలంగా ఉండే మనస్సు పరబ్రహ్మానుసంధానంద్వారా నిశ్చలత్వాన్ని పొంది అఖండ సచ్చిదానంద స్థితిలో లీనంకావడమే ఇడాపింగళా రూపులైన జయవిజయులు ఉత్తరద్వారం గుండా వైకుంఠప్రవేశం చెయ్యటం అంటే అర్ధం. అంటే రోజున సాధనకు అనువైన స్పందనలు, ఈ స్థితిని సులభంగా ఇవ్వగల ప్రభావాలు ప్రకృతిలో అధికంగా ఉంటాయి. దైవస్వరూపమైన గ్రహాలు-ప్రకృతీ కూడా రోజున భగవద్దర్శనానికి బాగా సహాయపడతాయి.

ఇది అంతరిక విషయం. ఇక బాహ్యంగా కనిపించే సూర్యచంద్రుల విషయం గమనిద్ధామా? ఎందుకంటే బాహ్యంగా ఉన్నదే అంతరికంగా ఉన్నదన్న సూత్రం మీదనే యోగమూ-తంత్రమూ నిర్మితమైనాయి మరి.

సూర్యుడు నిరయన ధనురాశిలో సంచరించే సమయంలో ఏకాదశి వస్తుంది. సమయంలో సూర్యుడు మూలా నక్షత్రంలో ఉంటాడు. మూలా నక్షత్రం గాలాక్టిక్ సెంటర్ కు దగ్గరగా ఉన్న నక్షత్రమండలం. దీనినే విష్ణునాభి అని పిలుస్తారు. నాభిలోనుంచే సృష్టికర్త అయిన బ్రహ్మ జన్మించాడని మన పురాణాలు చెపుతున్నాయి. ఇదంతా మార్మికపరిభాష. దీన్ని కొంచం అర్ధం చేసుకుందాం.

నిరవధికశూన్యంలోనుంచి మొదటగా సృష్టి జరిగిన ప్రదేశం మూలా నక్షత్రమండల ప్రాంతంలోనే ఉంది. కనుకనే దీనిని విష్ణునాభి అంటూ, ఇది సృష్టికర్త అయిన బ్రహ్మదేవుని స్థానంగా అలంకారిక మార్మికభాషలో చెప్పారు. మన గ్రహమండలానికి సూర్యుడే శక్తిప్రదాత. సూర్యుడు ఇక్కడినుంచి పుట్టినవాడే. కనుక, సూర్యుడు తనకు శక్తినిస్తున్న మరియు తాను పుట్టిన విష్ణునాభి అనే మహాశక్తికేంద్రం ఉన్నటువంటి మూలానక్షత్రమండల ప్రాంతం మీదుగా ప్రతి ఏడాదీ ఇదే సమయంలో సంచరిస్తాడు. వెలుగును శక్తిని ఇచ్చేటటువంటి సూర్యుడు సమయంలో మూలశక్తియైనటువంటి మూలానక్షత్రప్రాంతంలో సంచరిస్తూ లోకానికి శుభంకరమైన ధర్మస్వరూపమైన ఆధ్యాత్మిక వెలుగును ఇస్తాడు.

మాసంలో ఏకాదశినాడు, సూర్య చంద్రులు ఒకరికొకరు పంచమ నవమ స్థానాలలో ఉంటారు. ఇవి కోణస్థానాలు కనుక అత్యంత శుభప్రదమైనవి. ఇక చంద్రుని స్తితి చూద్దాం. రాశులలో మొదటిదైన మేషంలో చంద్రుడూ, ధర్మ స్వరూపమైన నవమ స్థానంలో నారాయణ స్వరూపుడైన సూర్యుడూ ఉంటారు. మేషం తలకు సూచిక కనుక తలలో ఉన్న సహస్రదళపద్మం సూచింపబడుతున్నది. తెల్లని పాలవంటి శుక్లపక్ష ఏకాధశినాటి చంద్రునికి సూచికగా పాలసముద్రంమీద శయనించి ఉన్న మహావిష్ణువు ( సర్వవ్యాపకమైన మహాశక్తిస్వరూపం ) సూచింపబడుతున్నాడు. రోజున సూర్యుడు మూలశక్తిస్థానంలో ఉంటాడు. చంద్రుడు దానికి పంచమ కోణంలో ఉండి కోణదృష్టితో ఆయన్ను చూస్తుంటాడు. అంటే మనస్సుకు సూచిక అయిన చంద్రుని దృష్టి ఈరోజున మూలానక్షత్రస్థితుడైన ఆత్మసూర్యునిపైన ఉండటం వల్ల, ఏం సూచింపబడుతున్నది? మానవుని యొక్క మనస్సు రోజున సమస్త చరాచరసృష్టికర్త అయిన దైవంమీద సులభంగా నిమగ్నం కాగలదు అన్న ప్రకృతిమాతయొక్క వరం మనకు దర్శనమిస్తున్నది. అంతేకాదు. సూర్యుని కోణ దృష్టికూడా చంద్రునిపైన ఉండటంవల్ల మూలానక్షత్రప్రాంతపు మహాశక్తి సూర్యుని వేడిమిద్వారా వచ్చి అది చంద్రునిపైబడుతున్నది. అంటే భగవంతుని ప్రసన్నదృష్టి కూడా ఈ రోజున అత్యంత దయాపూరితంగా మానవుల అందరిమీదా ప్రసరిస్తుంది. దీనినే వైకుంఠపు ఉత్తరద్వారం తెరుచుకోవటం, నారాయణుని దర్శనం కలగటం అని మార్మికభాషలో చెప్పారు.

ఆత్మకారకుడైన సూర్యనారాయణుడు ధర్మస్థానంలో స్వస్థానంలో ఉన్నాడు. మన: కారకుడైన చంద్రుడు శిరోస్థానమైన మేషంలో ఉండి సూర్యుని చూస్తున్నాడు. ఇది సమయంలో ప్రకృతిలో జరిగే ఒక అమరిక. అంతరికంగా ఇది ఒక అత్యంతమార్మికసూచన. దీని అంతరార్ధం యోగులకు విదితమే.

ఖగోళంలో జరిగే అమరికవల్ల మానవునిలోపల కూడా రొజున విష్ణుసాన్నిధ్యాన్ని సులభంగా పొందగలిగే స్పందనలు ఉంటాయి. మానవుని సాధనకు విశ్వంలోని వాతావరణం ఈరోజున చాలా అనుకూలంగా ఉంటుంది. మనస్సు తేలికగా భగవధ్యానంలో నిమగ్నం కాగలుగుతుంది. కనుక యోగులైనవారు రోజున సాధనను తీవ్రతరం చేస్తే అనుకూలంగా ఉన్న గ్రహ అయస్కాంత ప్రభావంవల్ల ఉత్తరద్వారం అనబడే అజ్ఞా-సహస్రదళపద్మముల మధ్యనున్న రహస్య ద్వారం తెరుచుకొని కుండలిని సహస్ర దళ పద్మం అనబడే వైకుంఠాన్ని చేరగలుగుతుంది. ఇదే మోక్షం పొందటం అంటే.

మూలాధారం నుంచి సహస్రదళం వరకూ వ్యాపించి యున్న కుండలినీ శక్తిమీద పవళించి ఉన్న మహాశక్తి స్వరూపాన్నే మన పురాణాలు-- ఆదిశేషుడనబడే మహాసర్పంపైన శయనించి ఉన్న మహావిష్ణువుగా మార్మికభాషలో చెప్పాయి. ఆ సర్వేశ్వరుని కరుణ ఈ రోజున ఇతోధికంగా మానవులకు లభించగలదు. ఇదే ముక్కోటి ఏకాదశి యొక్క రహస్య ప్రాశస్త్యం. మరి రేపటిని ఎలా ఉపయోగించుకోవాలి అన్నది ఇక మనమీద అధారపడి ఉంది.

read more " ముక్కోటి ఏకాదశి "

5, డిసెంబర్ 2010, ఆదివారం

ఇప్ మాన్ - ది లెజెండ్

మొన్న " ఇప్ మాన్ ది లెజెండ్" చూచాను. దాన్ని తెలుగులో డబ్ చేసి " కుంగ్ ఫూ ఫైటర్" అన్న పేరుతొ వదిలారు. వాల్ పోస్టర్లమీద సబ్ టైటిల్ మాత్రం "అమ్మతోడు అడ్డంగా నరికేస్తా" అని పెట్టారు. అది చూచి చచ్చేంత నవ్వొచ్చింది. నేటి సినిమాలలో దర్శనమిస్తున్న అసభ్యభాషకు ఇది ఒక మచ్చుతునక. గుంటూరులో ఒక టూరింగ్ టాకీస్ లాటి హాల్లోకొచ్చింది. కుంగ్ ఫూ విద్య మీదున్న అభిమానంతో హాలు లోని అశుభ్రతనూ, దోమల్నీ, సౌండ్ సిస్టంనూ భరిస్తూ సినిమా చూచాను.

అన్ని చారిత్రిక సినిమాల లాగే దీన్నీ కొంత యదార్ధమూ కొంత కల్పనా కలగలిపి తీశారు. అలా తియ్యకపోతే అది డాక్యుమెంటరీ అయ్యే ప్రమాదం ఉంది కదామరి. సినిమా అన్నాక ప్రజలకు నచ్చే విషయాలు కొన్ని చేర్చాల్సి వస్తుంది. సెంటిమెంట్ కూడా చేర్చాల్సి వస్తుంది. 1937 లో జపాన్ తమను ఓడించిన సంఘటన చైనా వారికి ఒక పెద్ద సెంటిమెంట్. ఆ కాలంలో జపాన్ కరాతే వీరులకు చైనా కుంగ్ ఫూ మాస్టర్లకూ మధ్య జరిగిన చాలెంజ్ ఫైట్స్ ఆధారంగా అనేక సినిమాలొచ్చాయి. దీంట్లో కూడా అదే ధీమ్ ను వాడుకున్నారు. జపనీస్ బ్రూటాలిటీని హైలైట్ చేసి చూపారు. కాకపోతే ఇప్ మాన్ జీవితానికి ఈ సెంటిమెంట్ కూ లంకె పెట్టి కధ నడిపారు.

నిజమైన మార్షల్ ఆర్ట్స్ మాస్టర్లకు గొప్ప కల్చర్ ఉంటుంది.నిజాయితీ కలిగిన ప్రవర్తన, ఆత్మగౌరవం, హుందాతనం, ధర్మాన్ని అనుసరించే జీవితం ఇవన్నీ వారికుంటాయి. ఇదే కోణాన్ని మాస్టర్ ఇప్ మాన్ జీవితంలో హైలైట్ చేసి చూపించారు. ఉదాత్తమైన ఆయన వ్యక్తిత్వాన్ని చూపటంలో దర్శకుడు కృతకృత్యుడైనాడు. అయితే మాస్టర్ ఇప్ మాన్ కు నల్లమందు అలవాటుందని ప్రచారం ఉంది. దాన్ని మాత్రం చూపించలేదు. బాగుండదు కదా.

మార్షల్ ఆర్ట్స్ కొరియోగ్రఫీ బాగా చేశారు. వింగ్చున్ మాస్టర్ అయిన ఇప్ మాన్ తో ఇతర కుంగ్ఫూ స్టైల్స్ అయిన నార్తరన్ షావోలిన్ స్టైల్, డ్రాగన్ బాక్సింగ్, చొయ్-లే-ఫట్ మొదలైన వివిధ రకాల ప్రత్యర్ది మాస్టర్ల ఫైట్స్ బాగా కొరియోగ్రఫీ చేశారు. ఈ రకరకాల స్టైల్స్ లోని తేడాలు తెలిస్తే ఆ ఫైట్స్ ను బాగా ఎంజాయ్ చెయ్యవచ్చు. ఈ ఫైట్స్ లో భాగంగా ఆయాస్టైల్స్ లోని ప్రత్యేక టెక్నిక్స్ ను సమర్ధవంతంగా చూపించగలిగారు. చివరి ఫైట్ లో జపనీస్ కరాతే కూ, వింగ్ చున్ కూ ఉన్న తేడాను బాగా చూపించారు.

ఉదాహరణకు-- వింగ్ చున్ కుంగ్ ఫూ ప్రత్యేకతలైన వుడెన్ డమ్మీ టెక్నిక్స్, ట్రాపింగ్ హాండ్స్, స్విచ్చింగ్ హాండ్స్, హాంటింగ్ హాండ్స్, ఎకానమీ ఆఫ్ మూమెంట్, సెంటర్ లైన్ పంచింగ్, లా ఆఫ్ ఇంటర్సెప్షన్, లాంగ్ పోల్ రొటీన్ మొదలైన అన్నింటినీ ఫైట్స్ లో ఇమిడ్చి చూపగలిగారు. అలాగే నార్దరన్ కుంగ్ ఫూ టెక్నిక్స్ లో విండ్ మిల్ పంచెస్, సర్కులర్ పంచెస్, హైకిక్స్, లెగ్ స్వీపింగ్ టెక్నిక్స్, వాటర్ ఫాల్ పంచింగ్ టెక్నిక్, స్పిన్ కిక్స్, విరల్ విండ్ కిక్స్ మొదలైన వాటిని బాగా కొరియోగ్రాఫ్ చెయ్యగలిగారు. అయితే మామూలు ప్రేక్షకుడికి ఇవన్నీ అర్ధం కావు. మార్షల్ ఆర్ట్స్ లో లోతైన టెక్నికల్ నాలెడ్జి ఉన్నవారు అయితే బాగా ఎంజాయ్ చెయ్యగలుగుతారు.

డానీ యెన్ చాలా హుందాగా మాస్టర్ ఇప్ మాన్ పాత్రలో ఒదిగిపోయాడు. ఆ పాత్రకు ఆయన చాలా న్యాయం చేశాడు. అనవసర డైలాగ్స్ లేకుండా, చక్కని సన్నివేశాలు పెట్టి, సెంటిమెంట్ కలగలిపి చక్కటి సినిమాను తియ్యగలిగారు. ఒక ధీరోదాత్తుడైన కుంగ్ ఫూ మాస్టర్ గా డానీయన్ చాలా బాగా నటించాడు.

నిజజీవితంలో మాస్టర్ ఇప్-మాన్ ఒక పోలీస్ ఆఫీసర్. కాని సినిమాలో ఆయనను ఒక మాస్టర్ గా మాత్రమే చూపించారు. సినిమాకు కావలసిన మార్పులు చేర్పులు చేసి ఆయన జీవితాన్ని మార్చి చూపారు. జపనీస్ వారిని మాత్రం విలన్లుగా నరరూపరాక్షసులుగా చూపించారు. కమ్యూనిష్టులు చైనాను ఆక్రమించిన తర్వాత యిప్-మాన్ అక్కడ ఉండలేక హాంగ్ కాంగ్ కు వెళ్ళి స్థిరపడ్డాడు. ఆ విషయాన్ని మాత్రం సూచన ప్రాయంగా చెప్పి వదిలేశారు. కమ్యూనిశ్ట్ రివల్యూషన్ని ఏమన్నా కామెంట్ చేస్తే మళ్లీ చైనా ప్రభుత్వానికి కోపం వస్తుంది కదా. ఎంతైనా సినిమాకదా ఆడాలి. నాలుగు డబ్బులు రావాలి.

సినిమా చూచి వస్తుంటే మాకొక సందేహం వచ్చింది. సైనో-జపనీస్ వార్ లో జపాన్ చైనాను ఆక్రమించింది గాబట్టి ఈసినిమాలో జపనీస్ ను విలన్లుగా చూపారు. రేపు టిబెట్ వాళ్ళు ఏదైనా సినిమా తీస్తే దాంట్లో చైనావాళ్లను పరమ కిరాతకులుగా రాక్షసులుగా చూపించక మానరు. అని నవ్వొచ్చింది.

హాల్లో ఆడియన్స్ చాలా పలచగా ఉన్నారు. చవకబారు తెలుగు సినిమాలు అలవాటుపడ్డ నేటి ఆంధ్రాజనానికి ఇలాటి క్లాసిక్స్ నచ్చవు. మన సినిమాలు కధాపరంగా, యాక్షన్ పరంగా, హాలీఉడ్ స్ఠాయిని అందుకోలేక పోతే మానె, కనీసం ఈ స్థాయిని ఎప్పుడు అందుకుంటాయో కదా అని బాధ కలిగింది.

ఈ సందర్భంగా ఒక సంగతి గుర్తొచ్చింది. 1992 ప్రాంతాల్లో "సైలెన్స్ఆఫ్ ది లాంబ్స్" అని ఒక సినిమా విజయవాడ లీలామహల్లో చూశాను. చాలా మంచి సినిమా. చాలా అవార్డులు గెలుచుకుంది. కానీ విజయవాడలో ఒకే ఒక్కరోజు ఆడింది. మన జనాలకు అలాటి సినిమాలు ఎక్కవు కదా అని అప్పట్లో అనుకుని నవ్వుకున్నాం. ఇరవై ఏళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడూ అదే మాట అనుకోవలసి వచ్చింది. అప్పటికీ ఇప్పటికీ మనవాళ్ల టేస్ట్ ఇంకా చాలా చీప్ గా మారిందని -దిగజారిందని- నేడు వస్తున్న సినిమాలు చూస్తే అనిపిస్తుంది.


మొత్తం మీద నేటి మన తెలుగు సినిమాలు చవకబారువని ఒప్పుకోక తప్పదు. తెలుగు ప్రేక్షకులకు మంచి టేస్టూ, ఉన్నతమైన కల్చరూ లేదనీ ఒప్పుకోక తప్పదు. చైనా వాళ్ళు హాలీఉడ్ స్థాయిలో- కధా, స్క్రీన్ ప్లే, ఎడిటింగూ, నటనా, డైలాగ్సూ కలిపి వెకిలితనం ఏమాత్రం లేని సినిమాలు తియ్యగలుగుతున్నారు. మనం మాత్రం వెకిలి పాటలు, వెర్రి డాన్సులు, డోకు హాస్యం, హింసా, కాపీ కధలూ, కాపీ ఫైట్లతో నిండిన అర్ధం పర్ధం లేని సినిమాలు -తీస్తూ- చూస్తూ- పరమ చీప్ టేస్ట్ లో పడి ఉన్నాం. ఈ పరిస్థితి ఎప్పుడు మారుతుందో మాత్రం తెలియదు.
read more " ఇప్ మాన్ - ది లెజెండ్ "

3, డిసెంబర్ 2010, శుక్రవారం

ముఖ్య మంత్రి ప్రమాణ స్వీకార ముహూర్తం - విశ్లేషణ

25-11-2010 మధ్యాన్నం 12-14 నిముషాలకు కొత్త ముఖ్య మంత్రి కిరణ్ కుమార్ రెడ్డిగారు ప్రమాణ స్వీకారం చేశారు. ముహూర్తాన్ని విశ్లేషణ చేద్దామా?

ముహూర్తం ఎవరు పెట్టారో గాని ఉన్నదాంట్లో చక్కని ముహూర్తమే పెట్టారు. స్థిర లగ్నమైన కుంభాన్ని తీసుకోవడం అందులో గురువు ఉండటం మంచిదే. అన్ని దోషాలు పోగొట్టగలదు అని చెప్పబడే అభిజిత్ ముహూర్తాన్ని ఎంపిక చేసి తద్వారా సమయానికి ఉన్న కొన్ని దోషాలు నివారణ చేసే ప్రయత్నం చేసారు.


లగ్నం
లోని గురువు పంచమాన్ని నవమాన్ని చూస్తాడు కనుక వాటిని కాపాడతాడు. మంత్రాంగం భాగ్య స్తానం బాగుంటాయి. అంటే ప్లానింగ్ మరియు ఫైనాన్స్ రంగాలు రక్షింపబడతాయి. తొమ్మిదింట శుక్రుడు స్వస్తానంలో ఉండటం దీనికి దోహదం చేస్తుంది. అదృష్ట స్థానాన్ని స్త్రీ గ్రహమైన శుక్రుడు కాపాడుతూ ఉండటం ఈయనకు సోనియా ఆశీస్సులు పుష్కలంగా ఉండటాన్ని సూచిస్తున్నది. గురువు లగ్నం లో ఉండటాన్ని బట్టి ఈయనకు కాంగ్రెస్స్ పెద్దల ఆశీస్సులు కూడా దండిగా ఉన్నాయని అర్ధం అవుతున్నది. సప్తమం మీద గురువు దృష్టి వల్ల శత్రువులు నిగ్రహింపబడతారు. ఇతరులతో సంబందాలు నిజాయితీగా ఉంటాయి.

పదింట
రవి- కుజ- బుదులుండటం కూడా మంచిదే. ఇది స్థిర రాశి కావటం వల్ల, రవి కుజులవల్ల హోం శాఖా, వ్యవసాయ రంగం, పరిపాలనా బాగుంటాయి. బుధుని వల్ల వ్యాపారం బాగుండాలని ఈ ముహూర్తం పెట్టారు. ఏకాదశం లో రాహువూ మంచిదే. దీనివల్ల కేంద్రంతో సంబంధాలు బాగుంటాయి. తాగుడు మొదలైన రంగాలవల్ల ఆదాయం బాగుంటుంది. ఇంతవరకూ చక్కని ముహూర్తమే పెట్టారు.

కాని ముహూర్తమైనా నూటికి నూరుపాళ్ళు సర్వలక్షణ సంపన్నంగా ఉండదు. కారణమేమంటే కాలం ఎవ్వరినీ సంపూర్తిగా కరుణించదు. ఏదో ఒక పక్కన కొన్ని బాధలు తప్పకుండా ఉంటాయి. అదే జీవితంలోని విచిత్రం. ఇప్పుడు ముహూర్తం లో గల దోషాలు చూద్దాం.

పంచమం లో చంద్ర కేతువులవల్ల ఎప్పుడూ ఏదో ఒక తలనెప్పి తప్పదు. సమస్యలు హటాత్తుగా తలెత్తుతూ ఉంటాయి. మనశ్శాంతి ఉండదు. ఎంతసేపూ ఎత్తులు పైఎత్తులే సరిపోతుంది. మంత్రివర్గంలోని స్త్రీలవల్ల, మహిళారంగంవల్ల విరోధాలు పెరగటం ఉంటుంది. చంద్రునికి షష్టాదిపత్యం రావటం దీనికి సూచన. హోరాధిపతి అయిన చంద్రుడు పంచమంలో కేతుగ్రస్తుడవటం మంచి సూచన కాదు. కాకపోతే దూరంగా ఉన్నాడు గనుక పరవాలేదు.

లగ్నాధిపతి శని అష్టమంలో ఉండటం ఇంకొక చెడు సూచన. దీనివల్ల ఏం చేసినా అనుకున్నంత లాభం ఉండకపోవచ్చు. మిత్రులకోసం తను నష్టపోయే నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. కాని గుడ్డిలో మెల్ల ఏమంటే ఆయన మిత్రస్థానంలో ఉండటం వల్ల చివరికి సామరస్యంగా పనులు పూర్తి అవుతాయి. అక్కణ్ణించి ఆయన దశమ స్థానంలో ఉన్న మూడు గ్రహాలను చూస్తున్నందువల్ల, తన పదవికి భంగం కలుగకుండా ఉండేవిధంగా మంత్రివర్గాన్ని నియంత్రిస్తూ ముందుకు వెళ్లటం జరుగుతుంది. అంటే నిరంతర ఎత్తులు పైఎత్తులు మార్పులు- చేర్పులు- సర్దుబాట్లు తప్పవు.

శనిదృష్టి పంచమంలోని చంద్ర కేతువులమీద ఉన్నందువల్ల ఎప్పుడూ ఆత్మరక్షణ వ్యూహాలే సరిపోతాయి. మంత్రులను కంట్రొల్ చెయ్యటానికి చాలా ప్రయత్నాలు చెయ్యటం నిత్యకృత్యం అవుతుంది. ఫైనాన్స్ రంగం అంతగా రాణించదు. ధరలు అదుపులో ఉండవు. నవాంశలో వ్యాపారకారకుడైన బుధుడు నీచలో ఉండటం దీన్ని బలపరుస్తున్నది. శని రాహువులు కలిసి ఉండటం వల్ల బలమైన రహస్యశత్రుబాధ మిక్కుటంగా ఉంటుంది.

ఇంటా బయటా సమస్యలను ఎదుర్కొంటూ ప్రతిరోజూ ఎత్తులతో పరిపాలన సాగవలసిందే అని ముహూర్తం చెబుతున్నది.

ప్రస్తుతం గురువులో శని దశ 2013 వరకూ జరుగుతున్నది. ఇది మంచి దశ కాదు. గురు శనులిద్దరూ షష్టాష్టకంలోఉన్నారు. ఇలాటి సమయంలో పరిపాలన మొదలు కాబోతున్నది. ఇది అంతగా మంచి సూచన కాదు. అనుకున్న అన్ని పనులూ చెయ్యటం సాధ్యం కాదు. ఇచ్చిన మాటలు నిలబెట్టుకోటమూ కష్టమే. కష్టం ఎక్కువ ఫలితం తక్కువా అన్నట్లు పరిపాలన సాగుతుంది. ఉన్నంతలో ఇంతకంటే మంచి ముహూర్తము దొరకటమూ కష్టమే. ఏంచేస్తాం మన రాష్ట్ర పరిస్థితికి ఈ ముహూర్తం అద్దం పడుతున్నది.
read more " ముఖ్య మంత్రి ప్రమాణ స్వీకార ముహూర్తం - విశ్లేషణ "

27, నవంబర్ 2010, శనివారం

మనం మానవులమేనా?

నదులు, చెట్లు, కొండలు మన భూమికి సంపదలు. నదులు జీవజలంతో మనల్ని పోషిస్తున్నాయి. పంటలు పండిస్తున్నాయి. మనల్ని బ్రతికిస్తున్నాయి. చెట్లు మనకు ఆక్సిజన్ ఇచ్చి కాపాడుతున్నాయి. కళ్లకు ఇంపుగా చక్కటి వాతావరణాన్నిస్తున్నాయి. నీడనిస్తున్నాయి. పూలను కాయలను ఇస్తున్నాయి. వర్షాన్ని ఆకర్షిస్తున్నాయి. కొండలు పర్యావరణాన్ని రక్షిస్తున్నాయి. మేఘాల్ని అడ్డుకుని వర్షాన్ని కురిపిస్తున్నాయి. ఇవన్నీ కలిసి మానవుని జీవనానికి సహాయపడుతున్నాయి.

మరి మనమేం చేస్తున్నాం? చెట్లను కొట్టేస్తున్నాం. జీవనదుల్ని పబ్లిక్ టాయిలెట్లుగా మారుస్తున్నాం. కొండలు లీజుకిచ్చి తవ్విస్తున్నాం. చివరికి ఇసుకను కూడా అమ్ముకుంటూ దానికోసం కొట్టుకుంటున్నాం. ధనదాహంతో, దురాశతో, కృతజ్ఞతాలేమితో మనల్ని తల్లిలాగా పోషిస్తున్న ప్రకృతిమాత పట్ల రాక్షసులలాగా ప్రవర్తిస్తున్నాం. ఇదీ మన నిర్వాకం.

జీవనదుల్ని సిగ్గులేకుండా పాడు చెయ్యటంలో ప్రపంచం మొత్తంమీద తెలుగువారికి ప్రధమ బహుమతి వస్తుంది. విజయవాడ దగ్గర కృష్ణానదిని ఉదయాన్నే గనక చూస్తే దానికంటే పబ్లిక్ టాయిలెట్ కాస్త మెరుగు అనిపిస్తుంది. దీనికంటే గోదావరి కాస్త నయం. గోదావరి తీర వాసులు కృష్ణా తీరవాసుల కంటే ఈ విషయంలో కాస్త మెరుగు.

అయ్యప్ప సీజన్ లో శబరిమల వద్ద పంపానదిని చూస్తే వాంతికొస్తుంది. అంత చండాలం చేస్తారు ఈ సోకాల్డ్ అయ్యప్ప భక్తులు. పూరీలు, పులిహోర, చపాతీలు, బజ్జీలు, దద్ధోజనం ఇంకా నానా అడ్డమైన తిండీ తెగతిన్న ఈ భక్తులు, ప్రపంచం నలుమూలల్నించీ అక్కడికిచేరి, ఎక్కడో కొండల్లో పవిత్రంగా పారుతున్న ఆ నది ఒడ్డునే మలమూత్ర విసర్జన చేసి. అడ్డమైన బట్టలూ అందులోనే ఉతికి, పంపానదిని పరమ దరిద్రంగా మారుస్తుంటారు. వీళ్ళు చేసివచ్చిన దరిద్రాన్ని వదిలించుకోటానికి ప్రకృతికి మళ్ళీ ఏడాది పడుతుంది.

పుణ్యక్షేత్రాలలో కూడా ఈ చండాలపు అలవాట్లు మనల్ని వదలవు. తిరుపతిలోని కపిల తీర్ధం పవిత్ర క్షేత్రం కదా. అందులో విడిచిన డ్రాయర్లను, పంచెలను, ఇతర గుడ్డల్ని సబ్బేసి ఉతుక్కుంటున్న ప్రబుద్దుల్ని చూసి నాకు ఏమనాలో తోచక నోరు మూసుకున్నాను. కనీసం పక్కనే అదే నీళ్ళలో ఇతరులు స్నానం చేస్తున్నారన్న జ్ఞానం కూడా వారికి ఉండదు. అదేం భక్తో నాకర్ధం కాదు.

మహానందిలోని స్నానగుండం స్పటికం లాంటి స్వచ్చమైన నీళ్ళతో ఎప్పుడూ పారుతుంటుంది. అక్కడా ఇదే తంతు. విడిచిన బట్టలు ఉతకటం, సబ్బులతో స్నానాలు చెయ్యటం, అందులోనే ఉమ్మెయ్యటం ఇలాటి దరిద్రపు పనులు భక్తులే చేస్తుంటారు.

నేను అలహాబాద్ లోని త్రివేణీ సంగమానికి వెళ్ళినపుడు నాతో పాటు పడవలో వచ్చిన కొందరు తెలుగువాళ్ళు సంగమస్థానంలో కిళ్లీ నములుతూ వెకిలి భాష మాట్లాడుకుంటూ అదే నీళ్లలో ఉమ్మెయ్యటం చూచి నాకు వాళ్ళను పడవలోంచి నదిలోకి తోసి చంపేద్దామన్నంత కసి పుట్టింది. చివరికి ఆ పడవ నడిపేవాడుకూడా వీళ్లని చూచి చీదరించుకున్నాడు.


ఇతర రాష్ట్రాల భారతీయులు మనకంటే ఇందులో ఎంతో మెరుగు. కేరళ రాష్ట్రంలో ప్రవహిస్తున్న "భారత్ పుళ" నది పొడుగూతా ఎక్కడ చూచినా మలమూత్ర విసర్జన కనిపించనే కనిపించదు. మనలాగా విడిచిన గుడ్డలు అందులో ఉతకటం కూడా కనిపించదు. ఇక ఉత్తరభారతంలో గంగా నదిని ఎంత పవిత్రంగా చూస్తారో మనకు తెలిసిందే. హరిద్వార్ ఋషీకేశ్ లలో ప్రతిరోజూ గంగానదికి వేలాదిమంది హారతి ఇస్తారు. పొరపాటున మనం "గంగా" అని సంబోధిస్తే అక్కడివారు వెంటనే, "గంగా నహీ, గంగామా బోలో" అని సరిదిద్దుతారు. ఆ నది అంటే అంతటి గౌరవం ఉంది వాళ్లకు.

నీటిలో ఉమ్మివేయటాన్ని మహా పాపంగా మనువు తన " మనుస్మృతి" లో పరిగణించాడు. ఇక జీవనదులలో మలమూత్ర విసర్జన చెయ్యటం ఎంతటి మహాపాపమో ఊహించలేము. రోజూ స్నాన సమయంలో "గంగేచ యమునేచైవ గోదావరి సరస్వతి నర్మదే్ సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు" అని సప్త నదులను స్మరించటం భారతీయులుగా మన కర్తవ్యం.

మనల్ని పోషిస్తున్న జీవనదులను భగవంతుని రూపాలుగా, మన తల్లులుగా, భావించి వాటిని జాగ్రత్తగా కాపాడుకోమని వేదం చెప్పింది. జలాధిదేవత అయిన వరుణుని "ఇమం మే వరుణ శృధీ......" అంటూ బ్రహ్మంగా భావించింది వేదం. ఆ వేదాలను అనుసరిస్తున్నాం అని చెప్పుకునే మనం జీవనదులకు నానా భ్రష్టత్వమూ పట్టిస్తున్నాం. మానవ వ్యర్ధాలనూ, ఫేక్టరీ వ్యర్ధాలనూ, సమస్త దుర్గంధాన్నీ వాటిలోకి వదిలి నిస్సిగ్గుగా ప్రవర్తిస్తున్నాం. ఇంకో పక్కన దేవుళ్లకు దొంగ పూజలు చేస్తూనే ఉంటాం. కనీసం పుణ్య క్షేత్రాలలోనైనా శుచీ శుభ్రతా పాటించం. మనం అచ్చమైన హిందువులమని ఎలా చెప్పుకోగలం?

ప్రకృతి శక్తులను భగవంతుని రూపాలుగా చూచి వాటిని గౌరవంగా కృతజ్ఞతగా వాడుకోమని వేదం ఎన్నోచోట్ల చెప్పింది. అలా చేసినప్పుడే ప్రకృతిలో భాగమైన మనిషి కలకాలం చక్కగా మనుగడ సాగించగలడు. అలాకాక ఇష్టానుసారం వాటిని పాడు ఛేస్తుంటే చివరికి మన ఉనికికే ప్రమాదం ముంచుకొస్తుంది.

చాలామంది దారిన పోతూ చెట్ల ఆకుల్ని తెంపటం, కొమ్మలు విరవటం చేస్తుంటారు. పక్కనే ఉన్న తల్లిదండ్రులు, స్నేహితులు కనీసం మందలించడం కూడా చెయ్యరు. అదేం రాక్షసానందమో అర్ధం కాదు. ఇంకొందరు చెట్ల పైన పేర్లు చెక్కడం, పిచ్చి రాతలు రాయటం, వాటికి మేకులు కొట్టటం చేస్తుంటారు. తాను కూచున్న కొమ్మను తానే నరుక్కున్న కాళిదాసు కధలా ఉంది మన కధ. ఆయనకు జగన్మాత అనుగ్రహం కలిగింది. మనకు మాత్రం జగన్మాత ఆగ్రహం మిగులుతుంది.

విచక్షణా రహితంగా చెట్లను కొట్టేయటం, వాహనాల పొగ వదలటం వల్ల ఇప్పటికే సిటీలలో ఆస్మా మొదలైన ఊపిరితిత్తుల వ్యాధులు భయానకంగా విజృంభిస్తున్నాయి. సిటీలలోని రోగాలకు సగం కారణం అక్కడున్న మనుషులకు సరిపడా చెట్లు లేకపోవటమే. ఇక కొండల్ని కూడా వదలకుండా తవ్వేసి కంకరగా మార్చి అమ్ముకుంటూ ఆనందిస్తున్నాం గాని, దానివల్ల పర్యావరణానికి ఎంతటి చేటు వాటిల్లుతోందో మనం ఊహించడం లేదు.

నదుల్ని, చెట్లను, కొండల్ని మనం ఇలాగే నిర్లజ్జగా పాడుచేసుకుంటూ నాశనం చేసుకుంటూ పోతుంటే కొంతకాలానికి భయానకమైన పరిస్తితుల్ని ప్రకృతినుంచి ఎదుర్కొనక తప్పదు. ఇప్పటికే నీళ్ళుకొనుక్కుని తాగుతున్నాం. ముందుముందు ఇంకా ఎన్నున్నాయో? మనం ఎప్పటికి తెలివి తెచ్చుకుంటామో ?
read more " మనం మానవులమేనా? "

22, నవంబర్ 2010, సోమవారం

కార్తీక సోమవారం శ్రీశైల యాత్ర










మనం
అనుకోని ఏదైనా చేస్తే అది మన సంకల్ప ఫలితం. అనుకోకుండా ఒక పని చెయ్యవలసి వస్తే అది భగవత్సంకల్పం. అనుకోని వ్యక్తులు తటస్థ పడటం అద్భుతం. గమనించే ప్రజ్ఞ ఉంటే అద్భుతాలు ప్రతిరోజూ కనిపిస్తాయి.

అలాటి సంఘటన ఈ మధ్యన జరిగింది.

మొన్న పదిహేనో తేదీన ఒక వీవీఐపీ గారితో కలిసి శ్రీశైలం సందర్శించే అవకాశం పరమేశ్వరుడే కల్పించాడు. ఆదివారమే అడ్వాన్స్ పార్టీగా అక్కడకు చేరి అన్ని ఏర్పాట్లూ సరిగ్గా ఉన్నాయా లేదా పరిశీలించాము. మధ్యాహ్న సమయంలోపరమేశ్వరీ పరమేశ్వరుల దర్శనం చేసుకొని రాత్రివరకూ అక్కడి ఆహ్లాదకర అటవీ వాతావరణాన్ని ఆధ్యాత్మికస్పందనలనూ ఆస్వాదిస్తూ గడిపాను. పాతాలేశ్వర సదన్ లో బస చేశాను. ఆది పాతాళ గంగకు వెళ్ళే దారిలో రోప్ వె దగ్గరగా ఉన్నది. ఆ రెండు రోజులూ మబ్బులు పట్టి సన్నటి చినుకులు పడుతూ వాతావరణం మంచి ఆహ్లాదకరంగా ఉంది.

సాయంత్రానికి మందీ మార్బలంతో వారందరూ రావడం, హడావుడి, దర్శనాలు చేసుకోవటం అన్నీ జరిగిపోయాయి. మర్నాడు సోమవారం తెల్లవారు జామునే లేచి మళ్ళీ దర్శనాలు, అభిషేకాలు, చండీ హోమం ఇత్యాదులు చకచకా జరిగిపోయాయి. నేను మాత్రం హాయిగా కాటేజీలో మౌనంగా ధ్యానంలో గడిపాను. రెండో సారి వారితో దర్శనానికి వెళ్ళలేదు. ఆరోజున దాదాపు డెబ్బై వేలమంది దర్శనార్ధమై వచ్చి ఉన్నారు. ఒకటే తోక్కిడిగా ఉంది. క్రితం రోజే స్వామి దర్శనం చేసుకున్నాను గనుక సోమవారం నాడు నేను మళ్ళీ వెళ్ళలేదు. కార్తీక సోమవారం నాడు శ్రీశైలం లో ఉండీ శివదర్శనానికి వెళ్ళని నన్ను వింతగా చూస్తూ మా గ్రూప్ లో వాళ్ళు దేవాలయానికి వెళ్ళారు. నేను మౌనంగా కళ్ళు మూసుకొని నా లోకంలో ప్రవేశించాను. ఆలయంలో దర్శనం కంటే గొప్పదైన అనుభవాన్ని నాకు నా గదిలోనే పరమేశ్వరుడు అనుగ్రహించాడు.

భ్రమరాంబికా ఆలయంలోని వరండాలో లోపాముద్రా దేవి విగ్రహం ఉంటుంది. నేను ఎప్పుడు శ్రీశైలం వెళ్ళినా అక్కడ కొంతసేపు మౌనంగా కూచుంటాను. ఆమె అగస్త్య మహాముని పత్ని. లలితా సహస్ర నామాలను ప్రచారం లోకి తీసుకొచ్చిన మహా యోగిని. శ్రీవిద్యోపాసనలో ఆమె ఉపాసించిన విధానాన్ని చాలామంది నేటికీ అనుసరిస్తున్నారు. తంత్ర సాధకులకు ఆమె పరమ గురువు అని చెప్పవచ్చు. "లోపాముద్రార్చిత లీలాక్లుప్త బ్రహ్మాండ మండలా"--అని లలితా సాహస్రం ఆమహాతల్లికి సముచిత స్థానాన్ని ఇచ్చింది.

శ్రీశైల మహాక్షేత్రం సిద్ధులకు ముఖ్యంగా రససిద్ధులకు నిలయం. ఇనుమును రాగిని ఆకుపసరులతో బంగారంగా మార్చగల సిద్ధులు అక్కడ ఎందఱో ఉండేవారు. ఇప్పటికీ ఉన్నారు. కాని సామాన్యుల దృష్టికి అడుక్కునే వాళ్ళలాగా కనిపిస్తారు. మన వద్దఒక రూపాయికోసం చేయి చాచే వాని వద్ద ఇలాటి అద్భుత శక్తి ఉన్నదని అందరూ గ్రహించలేరు. నేను అక్కడ తిరుగుతూఉన్న సమయంలో అలాటి ఒక సిద్ధుడు నాకెదురు పడ్డాడు.

ఏదో ఆలోచనలో ఉండి నడుస్తున్న నేను " బాబూ ధర్మం" అన్న మాటతో ఈ లోకం లోకి వచ్చి ఎదురుగా చాచిన చేతివైపు యదాలాపంగా చూచాను. ఒక్కసారి ఉలిక్కిపడ్డాను. కారణం !!! బిచ్చగాళ్ళ చేతులు ఒక విధంగా ఉంటాయి. వాటి రేఖలూ ప్రత్యేకంగా ఉంటాయి. చూడగానే వాటిని గుర్తించవచ్చు. అందుకు భిన్నంగా నా ఎదురుగా చాచిన చేయిలో
పరుసవేది రేఖ (line of alchemy) కనిపించింది. అలాటి రేఖ కోట్లాది మందిలో ఒకరికి కూడా ఉండదు. తలెత్తి అతని ముఖం లోకి పరిశీలనగా చూచాను. సామాన్య దృష్టికి మామూలు బిచ్చగానివలేనే ఉన్నప్పటికీ అతని ముఖంలోని నిర్లిప్తతా, ముఖ్యంగా అతని కళ్ళలో ఉన్న ఈలోకానికి అతీతమైన మెరుపు లాంటిది అతనెవరో నాకుతెలియ చెప్పింది. అతని కళ్ళలోకి లోతుగా చూచేసరికి అతనూ నన్ను గుర్తించాడు. నిగూఢమైన చిరునవ్వుతో నన్ను పలకరించాడు. నేనూ చిరునవ్వు నవ్వి మనస్సులోనే ఆయనకు నమస్కరించి నా దారినసాగిపోయాను. క్షుద్ర లోహాన్ని బంగారంగా మార్చగల మనిషి బిచ్చగాడిలా అడుక్కుంటున్నాడు. జగన్మాత లీలకు మనస్సులోనే ఆశ్చర్య పడ్డాను.

యోగం కూడా పరుసవేదివిద్యయే. పరుసవేది ఇనుమును బంగారంగా మారుస్తుంది. పశు స్థాయిలోఉన్న మనిషిని దేవతగా యోగం మార్చగలదు. రెండూ అక్కచెల్లెళ్ళవంటివే. ఈ కోణంలో దీనిని అంతర్గత పరుసవేది విద్య (Inner Alchemy) అని చెప్పవచ్చు. పరుసవేది విద్య కోటిమందిలో ఒకరికి కూడా లభించదు. నిజమైన యోగం కూడా అంతే.

శ్రీరామకృష్ణుల అద్వైతవేదాంత గురువైన తోతాపురికి ఈ విద్య తెలుసు. వారి మఠంలో కొన్ని వందల సాధువులుండేవారు. వారు నగ్న సాధువులు కనుక బయట ప్రపంచంలోకి రారు. ఎవరినీ ఏమీ అడగరు. ఎవరితోనూ సంబందాలు ఉండవు. కాని వారికి కావలసిన సరుకులు, వస్తువుల విషయంలో వారికి ఎలాటి కొరతా ఉండేది కాదు. వారికి కావలసినంతవరకూ ఇనుమును, రాగిని, ఇంకా చెప్పాలంటే మట్టిని కూడా బంగారంగా మార్చుకొని దానితో వారి నిరాడంబర జీవితానికి కావలసిన రొట్టెలో ఇంకేవో వారు సమకూర్చుకునేవారు.

శ్రీ శైలానికి పదహారు మైళ్ళ దూరంలో అక్కమహాదేవి గుహలున్నాయి. ఆమె పదకొండో శతాబ్దానికి చెందిన గొప్ప శివభక్తురాలు. మహా యోగిని. దాదాపు ఎనిమిది వందల సంవత్సరాల క్రితం కన్నడ దేశాన్నుంచి శ్రీశైలానికి వచ్చి ఇక్కడికీకారణ్యంలో కొండగుహలలో ఒక్కతే ఉంటూ ఆరేళ్ళు తపస్సు చేసింది. శివ సాయుజ్యాన్ని పొందిన ధన్యాత్మురాలనిచెబుతారు. పండితారాధ్యులు కూడా ఇక్కడ నివసించారు. ఆయన ఆశ్రమం అమ్మవారి ఆలయానికి పోయే దారిలోనేఉంటుంది. ఎందరో మహాయోగులు ఇప్పటికీ ఉన్న మహా క్షేత్రమిది.

సోమవారం సాయంత్రానికి బయలుదేరి తిరుగు ప్రయాణం అయ్యాము. దారిలో వస్తుంటే శ్రీశైల శిఖరంకనిపించింది. ఆ శిఖరాన్ని దర్శిస్తే మళ్ళీ జన్మ ఉండదని అంటారు నిజమేనా? అని నాతొ ఉన్న ఒకరు అడిగారు. కావచ్చుఅని క్లుప్తంగా అన్నాను. "శ్రీశైల శిఖరం దృష్ట్వా పునర్జన్మ న విద్యతే" అన్న శ్లోకం గుర్తుకొచ్చింది.
శ్రీశైల శిఖరం అంటే యోగిక అర్ధం ఉంది. శ్రీ శైలం అంటే సంపదలతో నిండి ఉన్న కొండ. మన శరీరం సమస్త దేవతా నివాసమైన ఒక అద్భుతం. శరీరమే శ్రీశైలం. ఇందులో దేవతా శక్తుల రూపంలో సమస్త సంపదలూ ఉన్నాయి. దీని శిఖరం అత్యద్భుతమైన రంగులలో వెలుగుతూ ఉండే సహస్ర దళ పద్మం. శ్రీశైల శిఖరం దర్శించటం అంటే సహస్రార చక్రాన్ని చేరుకోవటం. దానిని ధ్యానంలో అందుకున్నసాధకునికి పునర్జన్మ ఉండదు. ఇదే అర్ధం ఈ శ్లోకంలో రహస్యంగా ఇమిడ్చి చెప్పారు. సమస్త దేవతలూ యోగికి తన దేహంలోనే దర్శనం ఇస్తారు.
నిజమే. గమనించగలిగితే అద్బుతాలు అడుగడుగునా కనిపిస్తాయి.
read more " కార్తీక సోమవారం శ్రీశైల యాత్ర "