4, అక్టోబర్ 2026, ఆదివారం

లాల్ బహదూర్ శాస్త్రి గారి అసలైన జననతేదీ మరియు మరణ రహస్యం

శాస్త్రిగారు 2-10-1904 న ముఘల్ సరాయ్ (వారణాసి దగ్గర) లో పుట్టారని నేడు అందరూ నమ్ముతున్నారు. ప్రభుత్వం కూడా అదే  చెబుతోంది. జనన సమయాలు ఉదయం 11.15 అని, 11.40 అని రెండు కనిపిస్తున్నాయి.

ఈ రెండు సమయాలనూ సమర్ధిస్తూ అనేకమంది జ్యోతిష్కులు ఎవరికివారు విశ్లేషణలు వ్రాసుకున్నారు. నా దృష్టిలో అయితే, రెండూ తప్పులే. ఏమంటే, ఆ లగ్నాలతో ఆయన జీవితంలోని ఏ ముఖ్యసంఘటనా సరిపోవడం లేదు. సరిపెట్టడం  వేరు, సరిపోవడం వేరు. అందరూ శాస్త్రిగారి జాతకాన్ని సరిపెట్టారు. అది సరిపోలేదు. 

--------------------

ప్రముఖ జ్యోతిషవేత్త K.N.Rao గారు చాలాకాలం క్రితమే ఈ  విషయం గురించి వ్రాస్తూ శాస్త్రిగారి అసలైన జననతేదీ అక్టోబర్ 9 అని  చెప్పారు. దీనికి ఆయన రెండు ఆధారాలను సూచించారు.

1. ప్రముఖజ్యోతిష్కులైన బీవీ. రామన్, హరదేవ్ శర్మ త్రివేది, సూర్యనారాయణ్ వ్యాస్ గార్లు అక్టోబర్ 9 వ తేదీని శాస్త్రిగారి అసలైన జననతేదీగా నమ్మారు. అలా నమ్మడానికి వారికి ఆధారాలున్నాయి. వారు వేసిన జాతకంలో చంద్రుడు కన్యారాశిలో ఉన్నాడు. లగ్నం ధనుస్సయింది. ఆ జాతకం ప్రకారంగా వారందరూ, 1964 ప్రాంతాలలోనే, అంటే శాస్త్రిగారు ప్రధాని అయిన సమయంలోనే, 'ఈయన ఎక్కువకాలం పాటు పదవిలో ఉండరు' అని జోస్యం చెప్పారు. అది జరిగింది.

2.   K.N.Rao గారి బంధువులలో ఒకరు లాల్ బహదూర్ శాస్త్రిగారి బంధువులలో ఒకరిని పెళ్లిచేసుకున్నారు. కనుక ఆయనకు శాస్త్రిగారి కుటుంబంతో సన్నిహిత సంబంధం ఉన్నది. వారివద్ద ఉన్న కుటుంబ రికార్డుల ప్రకారం శాస్త్రిగారు పుట్టినది అక్టోబర్ 9 వ  తేదీన ఉదయం 11. 03 నిముషాలకు మాత్రమే. కానీ ప్రచారం మాత్రం 2 వ తేదీ అని జరిగింది. దానిలోకూడా కొంతమంది వృశ్చికలగ్నమని అంటున్నారు. మరికొంతమంది ధనుర్లగ్నమని అంటున్నారు.

నేనీ జాతకాలన్నింటినీ పరిశీలించాను. అక్టోబర్ రెండవ తేదీన ఏ టైము తీసుకున్నప్పటికీ, శాస్త్రిగారి జీవితవివరాలతో అది సరిపోవడం లేదు. సరిపెట్టబడుతోంది అంతే !

----------------------- 

అక్టోబర్ 9, 1904 కి జాతకం వేస్తే, అప్పుడు శాస్త్రిగారి జీవిత సంఘటనలన్నీ సరిగ్గా సరిపోతున్నాయి. అదెలాగో వివరిస్తాను.

ముందుగా జాతకాన్ని చూద్దాం. ఆనాటి గ్రహస్థితులు ఈ విధంగా ఉన్నాయి.

జైమినీమహర్షి తన ఉపదేశసూత్రాలు రెండింటిలో బలవంతపు మరణాలను గురించి వివరించారు.

అవి,

సూ|| మందమాన్దిభ్యాం విష-సర్ప-జల-ఉద్బంధనాదిభిః || 2. 19 ||

తృతీయంలో శని మరియు మాందీ గ్రహాలున్నపుడు, విషము, పాముకాటు, నీరు, ఉరుల ద్వారా మరణం సంభవిస్తుంది.

సూ || కేతునా విషూచి-జలరోగాద్యై || 2. 20 ||

కేతువున్నపుడు, విషూచి (కలరా, స్ఫోటకం మొదలైన రోగాలు), ఒంటికి నీరుపట్టడం మొదలైన రోగాలవల్ల చావు మూడుతుంది.

ఈ సూత్రాన్ని గతంలో అనేకమంది సెలబ్రిటీల బలవంతపు చావులలో నిరూపించాను.

జైమినిసూత్రాలను లగ్నం, ఆరూఢలగ్నం, కారకాంశలగ్నాలనుండి ప్రధానంగా చూడాలి. అవసరాన్ని బట్టి ఇతర ప్రత్యేకలగ్నాలు, దశలు కూడా దానిలో వాడబడతాయి.  శాస్త్రిగారి జాతకంలో లగ్నం ధనుస్సయింది. ఆరూఢలగ్నం సింహమైంది. ఆత్మకారకుడు చంద్రుడు గనుక కారకాంశలగ్నం కూడా సింహమే అయింది. కనుక ఈ రెండింటినుంచి పరిశీలించాలి.

ధనుస్సునుండి తృతీయంలో సరిగ్గా మాందీకేతువులున్నారు. కనుక పై రెండుసూత్రాలూ సరిగ్గా సరిపోతున్నాయి. విషప్రయోగమూ, ఊపిరితిత్తులలో నీరు చేరడమూ, గుండెపోటూ స్పష్టంగా కన్పిస్తున్నాయి. 

అంతేకాదు, కేతువు, శనినే సూచిస్తున్నాడు. కనుక, మంద-మాందిభ్యాం అనే సూత్రం ఖచ్చితంగా సరిపోయింది.  పైగా, కేతువు ఛాయాగ్రహం గనుక, శాస్త్రిగారి మరణం ఎప్పటికీ బయటకురాని రహస్యంగా చీకటిలోనే ఉండిపోతుందన్న సూచన స్పష్టంగా ఉన్నది. అందుకేనేమో, నేటికీ ఈ రహస్యం రహస్యంగానే ఉండిపోయింది.

సింహంలో కుజరాహువులున్నారు. ఈ గ్రహయోగం ప్రమాదాలకూ, బలవన్మరణానికీ, దౌర్జన్యపూరితమైన కుట్రకూ, విషప్రయోగాలకూ సూచిక. రాజరికరాశి అయిన సింహంలో ఈ యోగం ఉన్నది. లగ్నం నుండి సింహం 9 వ భావమైంది. ఇది దూరదేశానికి సూచిక. స్థిరరాశిగనుక ఇంటిలోనే ఈయన చనిపోయాడు.  ఈ గ్రహస్థితుల వల్ల పాశ్చాత్యదేశాధినేతల కుట్రవల్ల ఈయన దూరదేశమైన సోవియట్ యూనియన్లో చనిపోయాడని స్పష్టంగా అర్ధమౌతున్నది.

-----------------------

ఆయన భార్య లలితాశాస్త్రిగారు చెప్పినదాని ప్రకారం, ఆయన బసచేసిన విల్లాలో మంచం ప్రక్కనే ఉంచిన మంచినీళ్ల ప్లాస్క్ లో ఏదో కలిపి ఉంటారని ఆమె అన్నది. ఆ నీళ్లను త్రాగి పడుకున్న శాస్త్రిగారు కొద్దిసేపట్లోనే విపరీతంగా దగ్గుతూ ఛాతీని పట్టుకుని లేచారని, ఆయనకు వాంతులయ్యాయని తరువాత నేలపైన పడిపోయి చనిపోయారని తెలుస్తోంది. వేరే చోట ఉన్న ఆయన యొక్క పర్సనల్ డాక్టర్ R.N. ఛుగ్ వచ్చి చూసేసరికే శాస్త్రిగారు చనిపోయి ఉన్నారు.

విచిత్రంగా, ఆ విల్లాలో ఆయనకివ్వబడిన గదిలో ఒక కాలింగ్ బెల్లు లేదు. ఫోన్ లేదు. అటెండెంట్ లేడు. ఫస్ట్ ఎయిడ్ బాక్సు లేదు. ఒక దేశప్రధానమంత్రికి, అందులోనూ యుద్ధంలో గెలిచిన దేశపు ప్రధానమంత్రికి అలాంటి ఏర్పాట్లా? అలా చేస్తారా ఎక్కడైనా? కావాలని ఆయనను చంపేసినట్లు క్లియర్ గా తెలియడం లేదూ? 

ఆయన దేహానికి పోస్ట్ మార్టం జరగలేదు. తాష్కెంట్ అప్పట్లో సోవియెట్ ఉజ్బెకిస్తాన్ లో ఉండేది. భారతప్రభుత్వం అడిగినట్లైతే పోస్ట్ మార్టం చేసి ఉండేవారు. వీరు అడగలేదా? అడిగినా ఉపయోగం ఉండదని ఊరుకున్నారా?  మనకు తెలియదు. మొత్తమ్మీద ఇదొక అధికారమార్పు కుట్ర  (regime change operation) అని అర్ధమౌతున్నది. 

శత్రుదేశాలకూ, అగ్రరాజ్యాలకూ, ఇలాంటి కుట్రలు మామూలే. మొన్నటికి మొన్న బాంగ్లాదేశ్ లో జరిగిందేమిటి? కనుక ఇది క్రొత్తేమీ కాదు. అవసరమైతే దేశాధినేతలను కూడా లేపేస్తారని దీనినిబట్టి తెలుస్తోంది. అందుకేనేమో, రష్యా, చైనా మొదలైన దేశాధినేతలు ఇలాంటి మీటింగులకు విదేశాలకు వచ్చినపుడు అక్కడి డిన్నర్లు తినరు. వాళ్ళు తెచ్చుకుని, ఒండుకుని తింటారు. పుతిన్ అయితే, సూట్కేస్ టాయిలెట్ కూడా తనవెంట తెచ్చుకుంటాడు.

మన ప్రధాని మోదీగారి మీద కూడా ఇటువంటి ప్రయత్నం ఒకటి ఈ మధ్యనే జరిగిందనీ, అయితే, ఆయనకు ముందస్తుగా ఇంటలిజెన్స్ సమాచారం ఉండటం వల్ల ఆ ప్రమాదం నుండి తప్పించుకున్నారనీ ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అందులో నిజం ఉండవచ్చని నేనుకూడా నమ్ముతున్నాను.

--------------------------

పోతే, శాస్త్రిగారి మృతదేహాన్ని మనదేశానికి తెచ్చి పాలం విమానాశ్రయంలో విమానం  దింపినపుడు, దేహం మొత్తం నీలంరంగులోకి మారిపోయి ఉందని, కణతలదగ్గర మాత్రం తెల్లని మచ్చలున్నాయని, దగ్గరనుండి చూచిన బంధువులు, కొడుకులు, చెబుతున్నారు. కనుక ఆయన విషప్రయోగంతోనే చనిపోయి ఉండాలి.

అంతేకాదు, ఆయన యొక్క వ్యక్తిగత వైద్యుడైన Dr. R.N. Chugh, ఈ సంఘటన జరిగిన కొద్దికాలం తర్వాత ఒక రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. లేదా చంపబడ్డాడు. శాస్త్రిగారి మరణం పైన వేసిన ఎంక్వైరీ కమిషన్ ముందు తన వాంగ్మూలం ఇవ్వడానికి వెళుతున్న సమయంలో ఆయనకు రోడ్డు యాక్సిడెంట్ అయింది. చనిపోయాడు. ఆయనతోబాటు, ఆయన కుటుంబసభ్యులందరూ ఆ ప్రమాదంలో చంపబడ్డారు.

ఇంకా, శాస్త్రిగారి వ్యక్తిగత సేవకుడైన రాంనాధ్ కూడా అదేసమయంలో ఒక రోడ్డు యాక్సిడెంటులో తీవ్రంగా గాయపడ్డాడు. ప్రాణాలతో బయటపడినప్పటికీ, తలకు తగిలిన బలమైన గాయాలవల్ల, మతిస్థిమితాన్ని, జ్ఞాపకశక్తినీ కోల్పోయాడు. తరువాత బ్రతికినన్నాళ్ళు జీవచ్ఛవంలా బ్రతికాడు.

శాస్త్రిగారి దగ్గర ఒక రెడ్ డైరీ ఉండేది. ముఖ్యమైన విషయాలను దానిలో వ్రాసుకునేవాడాయన. విచిత్రంగా, ఆ డైరీ కూడా మాయమై పోయింది. అదేమై పోయిందో ఎవరికీ తెలియదు.

వీటన్నిటినీ బట్టి ఇదొక కుట్రని, దీనివెనుక ఇండియాలోని నేతలు కూడా ఉన్నారని, విదేశీహస్తం కూడా ఉందని, ఇద్దరూ కలిసే ఈ పనిని చేశారని. చిన్నపిల్లలైనా చెబుతారు. శాస్త్రిగారి జాతకం కూడా దీనినే స్పష్టంగా చెబుతోంది.

------------------------

శాస్త్రిగారి జాతకంలో జరిగిన కొన్ని ముఖ్యమైన సంఘటనలను జాతకపరంగా చూద్దాం.

ప్రధాని కావడం

27-5-1964 న నెహ్రూగారు చనిపోయాడు. 13 రోజులపాటు గుల్జారీలాల్ నందా గారు తాత్కాలిక ప్రధానిగా ఉన్నారు. 9-6-1964 న లాల్ బహదూర్ శాస్త్రి గారు ప్రధాని అయ్యారు. ఆ సమయంలో ఆయనకు బుధ బుధ రాహుదశ నడిచింది.

లగ్నం నుండి దశమంలో బుధుడు ఉచ్ఛస్థితిలో ఉండటాన్ని గమనించవచ్చు. కనుక బుధ దశ మొదలుకావడంతోనే ఆయన ప్రధాని అయ్యాడు. ఇది ఇందిరాగాంధీకి ఇష్టంలేదని చాలామంది అంటారు. తన తండ్రి తర్వాత తానే ప్రధాని కావాలని ఆమె అనుకుంది. కానీ అప్పట్లో ఆమెకంత అనుభవమూ లేదు, పేరూ లేదు. కనుక కాలేకపోయింది.

చంద్రలగ్నం నుండి కూడా, బుధుడు దశమాధిపతిగా లగ్నకేంద్రంలో ఉచ్ఛస్థితిలో ఉన్నాడు. ఇది ఖచ్చితంగా మహారాజయోగమే. ఈ యోగం అక్టోబర్ 2 వ  జాతకంలో రాదు. కనుక ఆ తేదీ  కరెక్ట్ కాదని తెలుస్తోంది.

9-6-1964 న గోచారాన్ని గమనిద్దాం.

శాస్త్రిగారి చంద్రరాశి అయిన కన్యనుండి 9 వ భావంలో అయిదు గ్రహాలున్నాయి. కనుక భాగ్యభావం బలంగా ఉంది. చంద్రునికి ఉచ్ఛరాహుకేతువులతో శుభార్గళం ఉన్నది. ఈ కారణాలు దశాప్రభావాన్ని సపోర్ట్ చేశాయి. కనుక ప్రధాని అయ్యాడు.

అయితే, ఆరోజు అమావాస్యకు ఒకరోజు ముందు కావడం, అమావాస్య కూడా భాగ్యభావంలోనే పడటం, నవాంశలో రాహుకేతువులు రివర్స్ అయ్యి, నీచస్థితులలోకి రావడం, మొదలైన కారణాలవల్ల ఒకటిన్నర ఏడాది మాత్రమే ఆయన ప్రధానిగా ఉండగలిగాడు. ఇలా జరుగుతుందని అప్పటి ప్రముఖ జ్యోతిష్కులు చెప్పారు.  వారు కూడా అక్టోబరు 9 వ తేదీ జాతకాన్ని బట్టే ఈ విషయాన్ని చెప్పగలిగారు.

మరణం 

11-1-1966 న ఆయనకు బుధ కేతు శని దశ నడిచింది. బుధుని రాజయోగం ఉన్నప్పటికీ, శనికేతువుల ప్రభావం విషప్రయోగానికి దారితీసింది. జైమిని మహర్షి సూత్రం ప్రకారం ఇది ఖచ్చితంగా కేతువు-శనుల దశలోనే జరగడాన్ని గమనించండి.

పైన చెప్పినట్లుగా, కేతువు శనిని సూచిస్తున్నాడు. మాందితో కలసి ఆయుస్థానంలో ఉండటంవల్ల విషప్రయోగం ద్వారా మరణం సంభవించింది. గోచారాన్ని గమనిద్దాం.

ఆనాడు గ్రహస్థితి ఈ విధంగా ఉన్నది.

కన్యనుండి 9 వ భావంలో గురుఛండాలయోగం ఉండటాన్ని చూడవచ్చు. ఇది దూరదేశంలో జరిగిన విద్రోహపూరిత కుట్రకు సూచిక. రాహుకేతువులు 3-9 ఇరుసులో ఉచ్ఛస్థితిలో ఉండటం మంచిదేకాని, గురుఛండాలయోగం మంచిది కాదు. కనుక, అధికారిక పర్యటనలో విషప్రయోగం జరిగింది. నవమాధిపతి శుక్రుడు 4 వ భావంలో రవిబుధులతో కలసి ఉన్నాడు. ఇది విదేశాలలోని ఇంటికి (ఈయన బసచేసిన విల్లాకు) సూచిక. రవిబుధశుక్రులకు బలమైన పాపార్గళం ఉన్నది. ఇది,  ఆ విల్లా మొత్తం సీక్రెట్ ఏజంట్ల పర్యవేక్షణలో ఉన్న విషయాన్ని చూపిస్తున్నది.

అంతేకాదు, మరొక ముఖ్యమైన సూచిక ! విద్రోహచర్యలకు సూచకుడైన యురేనస్, మరణానికి కారకుడైన ఫ్లూటోతో కలసి సింహంలో, మనఃకారకుడైన చంద్రునితో కలసి ఉంటూ, ధనుస్సులోని సూర్యుని చాలా దగ్గరగా వీక్షిస్తున్నారు. సింహానికి అధిపతీ, దేశాధినేతలకు అధిపతీ సూర్యుడే. ఇదంతాకూడా దేశాధినేతల ప్రోద్బలంతో జరిగిన కుట్రను స్పష్టంగా సూచిస్తున్నది.

భారతరత్న ప్రదానం

1966 లోనే ఆయనకు భారతరత్న ఇవ్వబడింది. ఇది బుధ శుక్రదశలో జరిగింది. శుక్రుడు నవమాధిపతిగా స్వస్థానంలో ఉండటాన్ని, నవాంశలో ఉచ్ఛస్థితిలో ఉండటాన్ని గమనించవచ్చు. అయితే చంద్రునినుండి లగ్న దశమాధిపతి అయిన బుధుడు అదే నవాంశలో నీచస్థితిలో ఉండటాన్ని బట్టి, ప్లాన్ ప్రకారం ఆయనను చంపేసి భారతరత్న ఇచ్చారని అర్థమౌతోంది.

పై మూడు సంఘటనలూ అక్టోబరు 9 జాతకానికి మాత్రమే కరెక్ట్ గా సరిపోతున్నాయి. అక్టోబరు 2 జాతకానికి సరిపెట్టబడుతున్నాయి గాని సరిపోవడం లేదు.

ఈ విశ్లేషణను బట్టి రెండు విషయాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. 

ఒకటి - శాస్త్రిగారి జననతేదీ అక్టోబర్ 2 కాదు. అక్టోబర్ 9. 

రెండు - ఆయన విషప్రయోగంతో చంపబడ్డాడు.

ఈ రెండూ చరిత్రలో సమాధి చేయబడ్డాయి.

అయితే, మనుషులు తమ తప్పులను కప్పిపెట్టుకోవచ్చు. మంచివాళ్ళుగా నటించవచ్చు. కర్మ మాత్రం ఎవరినీ వదలదు. ఎవరి లాజిక్స్ వారికుండవచ్చు. కానీ, తమ కర్మకు మూల్యం చెల్లించక మాత్రం ఎవరికీ తప్పదు. దీనికి మాత్రం ఎంతటివారికీ మినహాయింపు లేదు. 

ఆ సమయంలో ఉన్న నాయకులూ, దేశాధినేతలూ, ఆ తరువాత ఏమయ్యారో గమనిద్దాం.

----------------------

దేశాధినేతల దుర్మరణాలు

ఆ సమయంలో పాకిస్తాన్ అధ్యక్షునిగా మహమ్మద్ అయూబ్ ఖాన్ ఉన్నాడు. శాస్త్రిగారి పాడెను కూడా ఆయన మోశాడు. 1966 లో శాస్త్రిగారు చంపబడ్డారు. 1966 లోనే అయూబ్ ఖాన్ కు తీవ్రమైన గుండెజబ్బు మొదలైంది. దానితో 8 ఏళ్ళు బాధపడి చివరకు 1974 లో 66 ఏళ్ల వయసులో  గుండెపోటుతోనే ఆయన కూడా చనిపోయాడు. 1969 లో ఆయన పదవి పోయింది. అప్పటినుండి అయిదేళ్లపాటు పాకిస్తాన్లో తన విల్లాలోనే ఉంటూ చివరకు హార్ట్ ఎటాక్ తో పోయాడు.

రష్యా ప్రధానిగా అలెక్సీ కొసిగిన్ ఉన్నాడు. ఈయనకు కూడా త్వరలోనే గుండెజబ్బు మొదలైంది. దానితో చాలా ఏళ్ళు బాధపడి 1980 లో 76 ఏళ్ల వయసులో హార్ట్ ఎటాక్ తోనే ఈయనకూడా చనిపోయాడు.

రష్యా కమ్యూనిస్ట్ పార్టీ సెక్రటరీగా లియోనిడ్ బ్రెజ్నెవ్ ఉన్నాడు. ఈయన కూడా హార్ట్ ఎటాక్ తోనే 1982 లో చనిపోయాడు. అంతకు ముందు ఆరేళ్లనుంచి, అంటే 1976 నుంచే ఆయనకు గుండెజబ్బు మొదలైంది. ఆరేళ్లలో ఆయన ఆరోగ్యం వేగంగా క్షీణిస్తూ  వచ్చింది. ఒక సమయంలో ఆయన జీవచ్ఛవం (క్లినికల్లీ డెడ్) అయిపోయాడు. తన చుట్టూ పరిసరాలను, మనుషులను గుర్తించలేకపోయేవాడు. అటువంటి దీనస్థితిలో ఈయన కూడా చనిపోయాడు.

అమెరికా అధ్యక్షునిగా లిండన్ జాన్సన్ ఉన్నాడు. 1973 లో 64 ఏళ్ల వయసులో ఈయనకూడా హార్ట్ ఎటాక్ తోనే చనిపోయాడు. అంతకుముందు ఇరవై ఏళ్లుగా ఈయన గుండెజబ్బుతో బాధపడ్డాడు. ఈయనకు చెయిన్ స్మోకింగ్ అలవాటుండేది. దానితో మొట్టమొదటి హార్ట్ ఎటాక్ 1955 లో 46 ఏళ్ల వయసులోనే వచ్చింది. డాక్టర్లు హెచ్చరించినా తన స్మోకింగ్ అలవాటును మానుకోలేదు. 1969 లో ఈయన టర్మ్ అయిపోయి వైట్ హౌస్ ను వదిలిపెట్టాడు. ఆ తరువాత టెక్సాస్ లో ఉంటూ ఉండేవాడు. 1973 లో హార్ట్ ఎటాక్ వచ్చినపుడు, దగ్గర ఎవరూ లేకపోతే, హార్ట్ ఎటాక్ వచ్చి గిలగిలా కొట్టుకుంటూ కూడా, తన సీక్రెట్ సర్వీస్ వారికి తనే ఫోన్ చేశాడు. అయితే, వాళ్ళు వచ్చేలోపే చనిపోయాడు. 

అప్పట్లో CIA అధినేతగా విలియం రాబోర్న్ జూనియర్ ఉన్నాడు. జూన్ 1966 లో ఈయన పదవిని అర్ధాంతరంగా కోల్పోయాడు. 1990 లో 84 ఏళ్ల వయసులో ఈయన కూడా హార్ట్ ఎటాక్ తోనే చనిపోయాడు.

చైనా అధినేతగా మావో జెడాంగ్ ఉన్నాడు. 1970 లలో ఈయనకు తీవ్రమైన గుండెజబ్బు మొదలైంది. అప్పటినుంచీ ఈయన ఆరోగ్యం వేగంగా క్షీణిస్తూ వచ్చింది. ఊపిరితిత్తులు కూడా పాడయ్యాయి. పార్కిన్ సన్ వ్యాధి వచ్చింది. 1976 లో రెండు తీవ్రమైన హార్ట్ ఎటాక్స్ వచ్చాయి. రెండవదానితో ఈయన చనిపోయాడు.

నెహ్రూగారి మరణం తర్వాత, శాస్త్రిగారి స్థానంలో ప్రధాని పదవిని ఆశించిన వారిలో ఇందిరాగాంధీ కూడా ఉన్నది. ఆ తరువాత, తను అనుకున్నట్లుగా ప్రధాని అయి, దేశాన్ని చాలా ఏళ్ళు పరిపాలించినప్పటికీ, చివరకు తన బాడీగార్డ్స్ చేతులలోనే ఈమె కాల్చి చంపబడింది. ఈమె కొడుకులిద్దరూ కూడా దుర్మరణాల పాలయ్యారు.

జనవరి 1966 లో శాస్త్రిగారు చనిపోయిన సమయంలో ఉన్న లీడర్స్ వీళ్ళే. వీరందరూ ఎలా చనిపోయారో అన్న విషయాన్నీ, అప్పటి రాజకీయ సమీకరణాలనూ గమనిస్తే శాస్త్రిగారి దుర్మరణానికి ఎవరు లేదా ఎంతమంది కారకులో తేలికగా అర్ధమౌతుంది.

-------------------------

కారకులెవరు?

మరికొంత లోతైన జ్యోతిషవిశ్లేషణతో వారెవరో నేను చెప్పగలను. నాకు తెలుసు, కానీ చెప్పను. ఉబుసుపోని జనాల ఉత్సాహం కోసం నేనా పనిని చేయనవసరం లేదు. ప్రభుత్వానికి  అన్నీ తెలుసు. తెలిసీ దాచిపెట్టాలని ప్రభుత్వమే అనుకుంటున్నపుడు నేనెందుకు బయటపెట్టాలి?

శాస్త్రిగారు అక్టోబరు 2 న పుట్టారనీ, తాష్కెంట్ లో సహజంగానే చనిపోయారనీ లోకం నమ్ముతున్నది. సరే, అలాగే నమ్మనిద్దాం. 

కానీ, ఈ రెండూ అబద్దాలే, నిజాలు కావు. ఇంకా చెప్పాలంటే, నేటి ప్రపంచంలో ఏదీ నిజం కాదు. ప్రేమలూ, పెళ్ళిళ్ళూ, కుటుంబాలూ, సంసారాలూ, రాజకీయాలూ, ఆధ్యాత్మికగురువులూ, ఆశ్రమాలూ, విద్యా, వైద్యమూ, చావూ, పుట్టుకా, వ్యాపారాలూ, వ్యవహారాలూ,   ఏవీ నిజాలు కావు. ఎక్కడైనా సరే, జరిగేవి  వేరు. ప్రచారాలు వేరు. లోకం ప్రచారాన్నే నమ్ముతుంది. నిజాలను మాత్రం నమ్మదు. 

నేడు మనిషిజీవితమే ఒక నాటకమైపోయింది. అబద్దపు ప్రచారాల ముసుగులలోనే ప్రపంచమంతా నడుస్తోంది. నిజాల పైన ఆధారపడి మాత్రం నడవడం లేదు.

అసలూ, నేటి సమాజంలో నిజాలెవరిక్కావాలి?

read more " లాల్ బహదూర్ శాస్త్రి గారి అసలైన జననతేదీ మరియు మరణ రహస్యం "

3, అక్టోబర్ 2026, శనివారం

లాల్ బహదూర్ శాస్త్రి గారి 122 వ జన్మదినం

నిన్న లాల్ బహదూర్ శాస్త్రి గారి 122 వ జన్మదినం. అక్టోబర్ 2 న గాంధీగారు,  శాస్త్రిగారు, ఇద్దరూ పుట్టారు. కానీ, పిచ్చిజనం గాంధీగారిని గుర్తుచేసుకున్నంతగా ఈయనను చేసుకోరు. మన వ్యక్తిత్వస్థాయినిబట్టే మనకు నచ్చే మనుషులుగాని, నాయకులుగాని ఉంటారు మరి !

ఈ సందర్భంగా ఆయన జాతకంలోని ముఖ్యమైన విషయం ఒకదానిని, అదే, మరణరహస్యాన్ని జ్యోతిషపరంగా పరిశీలిద్దాం. దానికంటే ముందుగా ఆయనయొక్క నీతీనిజాయితీలకు నిదర్శనాలుగా చెప్పుకునే రెండు సంఘటనలను గుర్తుచేసుకోవాలి.

ఒకటి - నెహ్రూగారి మంత్రిమండలిలో శాస్త్రిగారు రైల్వేమంత్రిగా పనిచేశారు. ఒక రైలు ప్రమాదం జరిగిందని, దానికి బాధ్యత వహిస్తూ, రైల్వేమంత్రి పదవికి శాస్త్రిగారు రాజీనామా చేశారు. ఇది 1956 లో జరిగింది. నెహ్రూగారు ఒప్పుకోకపోయినా తన రాజీనామాను వెనక్కు తీసుకోలేదు. చివరకు నెహ్రూయే తగ్గక తప్పలేదు.

నిజానికి 1956 లో రెండు పెద్ద రైలు ప్రమాదాలు జరిగాయి. మొదటిది మన రైల్వేలోనే మహబూబ్ నగర్ జడ్చర్లల మధ్యలో ఒక రైల్వేబ్రిడ్జి కూలిపోయి రైలు నదిలో పడిపోయింది. అందులో 125  మంది పైనే చనిపోయారు. ఇది సెప్టెంబర్లో జరిగితే, రెండవ ప్రమాదం నవంబర్లో తమిళనాడులోని అరియలూర్ లో జరిగింది. ఇందులో కూడా భారీవర్షాలకు రైల్వే బ్రిడ్జి కూలిపోయి రైలు నదిలో పడిపోయింది. దీనిలో 250 మంది పైనే చనిపోయారు. మహబూబ్ నగర్ ప్రమాదం జరిగినపుడు కూడా శాస్త్రిగారు రాజీనామా ఇచ్చారు. కానీ నెహ్రూగారు ఒప్పుకోలేదు. రెండవది జరిగినపుడు ఇచ్చిన రాజీనామాను శాస్త్రిగారు వెనక్కు తీసుకోలేదు. నైతిక బాధ్యత వహించారు.

అప్పటికి సౌత్ సెంట్రల్ రైల్వే రాలేదు. ఆంధ్రా తెలంగాణాలోని ప్రాంతాలన్నీ సదరన్ రైల్వే, సెంట్రల్ రైల్వే పరిధులలో ఉండేవి.

రెండు - శాస్త్రిగారు అర్ధాంతరంగా చనిపోయిన తర్వాత ఆయనకు మిగిలిన ఆస్తి ఒక ఫియట్ కారుకోసం తీసుకున్న లోను మాత్రమే. అప్పట్లో దాని ఖరీదు 12 వేల రూపాయలు. దానిని కొనడానికి ఆయన సేవింగ్స్ లో 7 వేలుమాత్రమే ఉన్నాయి. అందుకని మిగతా డబ్బుకు పంజాబ్ నేషనల్ బ్యాంకు నుండి లోను తీసుకున్నారాయన. శాస్త్రిగారి మరణం తర్వాత ఆ అప్పును మాఫీ చేస్తామని ప్రభుత్వం ముందుకొచ్చినప్పటికీ, ఆ ప్రతిపాదనను శాస్త్రిగారి సతీమణి లలితాశాస్త్రిగారు తిరస్కరించారు. తనకొచ్చే పెన్షన్ నుండి ఆ అప్పును విడతలవారీగా తీర్చారామె. 

ఆ మనుషులు వేరు, ఆ విలువలు వేరు ! ఇదే తరహాకు చెందిన మరొక నాయకుడు P.V. నరసింహారావుగారు. ఆయనకూడా ప్రధానమంత్రిగా చేసినప్పటికీ, తనకోసమంటూ సంపాదించుకున్న అవినీతిసొమ్ము ఏమీ లేదు.

నేటికాలంలో వార్డుకౌన్సిలర్లు తేలికగా కోట్లు సంపాదిస్తున్నారు. ఎమ్మెల్యే, ఎంపీలుగా పోటీ చెయ్యాలంటే 100 కోట్ల పైనే ఖర్చుపెట్టాలని బాహాటంగా చెబుతున్నారు. అదీ శాస్త్రిగారికీ, నేటి రాజకీయులకూ తేడా !

అటువంటి వ్యక్తిని స్మరించకుండా, దేశాన్ని సమస్యల వలయంలోకి నెట్టిపోయిన గాంధీగారిని స్మరిస్తూ, సంస్మరణ సభలు నిర్వహిస్తున్నారు జనం ! అవున్నిజమే ! శాస్త్రిగారిని గుర్తుంచుకుంటే దేశం బాగుపడిపోదూ మరి !

'శాస్త్రి' అనే పేరుందని ఆయన బ్రాహ్మణుడని అందుకనే నేనాయనను సపోర్ట్ చేస్తున్నానని అనుకోకండి. ఆయన అసలు పేరు లాల్ బహదూర్ శ్రీవాస్తవ. వాళ్ళు కాయస్థులు. అంటే, క్షత్రియులలో ఒక తెగకు చెందినవారు. వివేకానందస్వామి, అరవింద్రఘోష్ లు కూడా కాయస్థులే. కాశీవిద్యాపీఠం నుండి 'శాస్త్రి' పరీక్ష పాసై, పట్టా పొందినందుకు ఆయన 'శాస్త్రి' అయ్యారు. నేటితరంలో  చాలామందికి ఇదికూడా తెలియదు.

చాలా నిజాయితీపరుడూ, నిరాడంబరుడూ అయిన ఆయన, ధైర్యానికి మాత్రం పెట్టింది పేరు. 1965 లో జరిగిన ఇండియా పాకిస్తాన్ యుద్ధంలో, అంతర్జాతీయ సరిహద్దులను దాటి పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్లి ఎటాక్ చెయ్యడానికి మన సైన్యానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఆయనే. ఈ చర్యతో ప్రపంచం బిత్తరపోయింది. అంతర్జాతీయ నిబంధనల ప్రకారం సరిహద్దులను దాటకూడదు. కానీ పాకిస్తాన్ కాశ్మీర్లోకి చొరబడి నానా దురాగతాలను చేస్తుంటే మనమెందుకు చేతులు కట్టుకొని కూచోవాలి? 2016 లో మనం పాకిస్తాన్ పైన చేసిన సర్జికల్ స్ట్రైక్ కు ఇది మాతృకగా చెప్పుకోవచ్చు. ఆ ఆదేశంతో ఇండియన్ ఆర్మీ లాహోర్ వరకూ దూసుకుపోయింది.

తాష్కెంట్ ఒప్పందం జరిగినది 10-1-1966 న. శాస్త్రిగారు చనిపోయినది మర్నాడు 11-1-1966 న. ఒప్పందం సంతకం పెట్టిన కొన్ని గంటలలోనే ఆయన హార్ట్ ఎటాక్ తో తాష్కెంట్ లోనే చనిపోయారు. సుభాష్ చంద్రబోసు మరణంలాగే ఇదికూడా వీడని మిస్టరీగా మిగిలిపోయింది. ఈ కోణాన్ని జ్యోతిష పరంగా ఇప్పుడు పరిశీలిద్దాం.

(ఇంకా ఉంది)

read more " లాల్ బహదూర్ శాస్త్రి గారి 122 వ జన్మదినం "

28, సెప్టెంబర్ 2026, సోమవారం

సెప్టెంబరు - 2026 సాధనాసమ్మేళనం విజయవంతం














గత మూడురోజులుగా ఆశ్రమంలో జరిగిన సెప్టెంబరు 2026 సాధనాసమ్మేళనం (retreat) విజయవంతంగా ముగిసింది. దీనికి హైద్రాబాదు, బెంగుళూరు, చెన్నై, నెల్లూరు, విజయవాడ, ఖమ్మం, దుబాయ్, USA ల నుండి శిష్యులు హాజరయ్యారు. ఆ సందర్భంగా తీసిన ఫోటోలలో కొన్నింటిని ఇక్కడ చూడవచ్చు.

25 వ తేదీన అనంత పద్మనాభవ్రతం వచ్చింది. అది మా అమ్మగారు పుట్టినరోజు. తల్లిని మించిన దైవం లేదు గనుకా, లేదా, దైవమే తల్లిరూపంలో ప్రత్యక్షమౌతుంది గనుకా, ప్రతి ఏడాదీ ఆ రోజునుండి మూడురోజులపాటు మా ఆశ్రమంలో సాధనాసమ్మేళనం జరుగుతుంది. ఈ ఏడాదికూడా జరిగింది. అన్ని పండుగలలోకీ అదే మాకు ముఖ్యమైన పండుగ.

రాశి కంటే వాసికే ప్రాధాన్యతనిచ్చే మా విధానంలో, కులమత వర్గ విభేదాలను పక్కనపెట్టి, మానవత్వాన్ని పెంపొందిస్తూ, మనుషులను మనుషులుగా తీర్చిదిద్దుతూ, దైవత్వాన్ని అందుకునే సాధనామార్గాన్ని నేర్పిస్తూ, ఈ సమ్మేళనం జరిగింది. ఈ సందర్భంగా కొన్ని తంత్రసాధనా ప్రక్రియలను శిష్యులకు ఉపదేశించడం జరిగింది.

శిష్యులు ఆశ్రమానికి వచ్చినపుడు ఉండటానికై కట్టించిన 'సాధనా నివాస్' భవనం ఈ సందర్భంగా ప్రారంభించబడింది. ఈ భవనంతో ఆశ్రమానికి క్రొత్త నిండుదనం వచ్చింది.

రాబోయే నెలలలో, హైదరాబాద్, విజయవాడ, తిరుపతి బుక్ ఫెస్టివల్స్ లో పెట్టబోయే పంచవటి స్టాల్లో శిష్యులందరూ కలుసుకోవడం జరుగుతుంది. ఆ తరువాత, మార్చిలో జరుగబోయే వేసవి విషువత్ సాధనా సమ్మేళనంలో మళ్ళీ ఆశ్రమంలో అందరం కలుసుకుందామన్న సంకల్పంతో ఈ కార్యక్రమం ముగిసింది.

read more " సెప్టెంబరు - 2026 సాధనాసమ్మేళనం విజయవంతం "

4, సెప్టెంబర్ 2026, శుక్రవారం

కృష్ణ కృష్ణా !

ఇవాళ కృష్ణాష్టమి.

మరి తెలుగురాష్ట్రాలలో చడీచప్పుడూ లేదేంటి?

హిందువుల ఇళ్లూ, గుళ్ళూ అన్నీ మౌనంగా ఉన్నాయేంటి?

ఓ సారీ ! మర్చేపోయాను.

మనకు పొరుగింటి పుల్లకూరే రుచి కదా !


అయినా  నా పిచ్చిగానీ,

సాయిబాబాలకూ, బోయబాబాలకూ, పీర్లకూ, ఫకీర్లకూ అభిషేకాలూ, పూజలూ చేసేవాళ్లకు పరిపూర్ణావతారమైన శ్రీకృష్ణుడెలా నచ్చుతాడు? అసంభవం ! 

మహా అయితే ఆయననొక ద్వారపాలకుడిగా పెట్టేద్దాం !

అప్పయ్యస్వామి ఆధార్ కార్డునే.  తెలుగునాడుకు మార్చేసి, ఆ నీడన చక్కని వ్యాపారాలు చేసుకుంటున్నవాళ్లకు శ్రీకృష్ణుడెలా నచ్చుతాడు? నిజమే సుమీ ! 

కేరళం కంటే గుజరాత్ ఇంకా దూరం కదా ! మరి గురువాయూర్ని మర్చిపోయారేంటో?

ఛిన్నమస్త చిన్నబోయినచోట, ప్రత్యంగిర పట్టించుకోని వేళ, రాధాదేవి మాత్రమే రక్షిస్తుంది. ఆ క్షణానికి ఆమె కావలసి వస్తుంది. మరుక్షణమే ఆమె పనికిరాకుండా పోతుంది. మళ్ళీ భయంకర హోమదేవతలే మనకు కావాలి. అవున్లే రాధాదేవి మన వ్యాపారానికి పనికిరాదు కదా !

మన బ్రతుకులింతే !

వ్రేలాడే శవమంటే వేలంవెర్రిగా పరిగెత్తేవాళ్లకు, జగన్మోహనుడైన శ్రీకృష్ణుడెలా నచ్చుతాడు? నిజమే. 

ఆయనేమీ బిర్యానీ పెట్టి, ఖర్చులకు డబ్బులివ్వడు కదా ! రాత్రిపూట కూడికలూ, తీసివేతలూ నేర్పించడు కదా !  

గుండు సాధువులనూ, బండస్వాములనూ, 'ళ' కీ, 'ల' కీ తేడా తెలియని మహాయోగులనూ పూజించేవాళ్లకు శ్రీకృష్ణుడెలా నచ్చుతాడు? సహజమే కదా ! 

ఆయనేమీ వీళ్ళలాగా నైటీ వేసుకోడుగా !

అర్ధరాత్రిళ్ళు క్షుద్రదేవతలకు బొగ్గులూ ఎండుమిర్చిలతో హోమాలు చేసే క్షుద్రులకు చిన్నికృష్ణుని చిరునవ్వులెలా నచ్చుతాయి? అర్ధం చేసుకోగలం ! 

90 వచ్చినా, మాకింకా వయసుడిగి పోలేదుగా? కోరికలు చావలేదుగా? చిన్నికృష్ణుడిని పూజించడానికి?

మళ్ళీ నోరుతెరిస్తే అందరూ చెప్పేది భగవద్గీతా శ్లోకాలే ! కానీ శ్రీకృష్ణుడెవరికీ అక్కర్లేదు.

ఆయన ఎనిమిదేళ్ల వయసులోనే రాసలీలలు చేశాడంట ! గోపికలు స్నానాలు చేస్తుంటే బట్టలు కాజేసి చెట్టుపైన కూర్చున్నాడంట ! ఇదొక్కటే మనకు కనిపిస్తుంది. మనకు కావలసింది కూడా అదే కదా !

మనం చెయ్యాలనుకుంటూ, చేయలేకపోతున్న పనులన్నీ ఆయనెప్పుడో అయిదువేల ఏళ్ళక్రితమే చేసేశాడు. లక్కీ ఫెలో ! దీన్నే 'అసూయ' అంటారేమో? సర్లే ఏదో ఒకటి !

కానీ, అంతకు ముందే, గోవర్ధన పర్వతాన్ని చిటికెనవ్రేలితో ఎత్తి తనవారిని కాపాడాడు. నెలలపిల్లవాడుగా ఉన్నపుడే ఎంతోమంది రాక్షసులను సంహరించి, లోకపీడను వదిలించాడు. బోసినోటిలో విశ్వాన్ని చూపించాడు. అవెలా చేశాడు? మనకనవసరం ! అవన్నీ యశోదాదేవి భ్రమలు !

ఆ తర్వాత ఎన్నో మానవాతీతపు పనులను కూడా చేశాడు. రాజ్యాలేలాడు. రాజకీయాలు చేశాడు. మహాభారతయుద్ధాన్ని కూడా నడిపించాడు. 

ఆగండాగండి ! ఈ పాయింట్ మాకు బాగా నచ్చింది.

మేము కూడా మా ఆశ్రమం పై ఫ్లోరులో, అమ్మాయిలతో అర్ధరాత్రి, శివరాత్రి, డాన్సులెయ్యచ్చు. మేమూ కృష్ణుని అంశలమే. వాళ్లేమో గోపికల అంశలతో పుట్టారు.

మేముకూడా రాజకీయులతో పొత్తులు పెట్టుకుని వాళ్ళ బ్లాక్ మనీని మా భూగృహాలలో దాచిపెట్టి, రాజకీయం చెయ్యవచ్చు. మేమూ కృష్ణుని అంశలమే. కాకపోతే మా తర్వాత లారీలలో ఆ బంగారమంతా ఎక్కడికో తరలిపోతుంది. పోతేపోనీ. బ్రతికున్నన్నాళ్లు మా పబ్బం గడిచిందిగా !

మేముకూడా విద్యార్థులను స్థంభాలకు కట్టేసి కాల్చిపారెయ్యొచ్చు. మేమూ  కృష్ణుని అంశలమే. కేసులేమీ ఉండవు. ఏం? భారతయుద్ధాన్ని దగ్గరుండి నడిపించిన కృష్ణుడిపైన ఉన్నాయా?

కృష్ణుడు శివుడిని ఆరాధించాడట. మేముకూడా చేస్తాం. మాటమాటకూ 'షివా షివా' అంటాం. లేదా 'చెంబో చెంబో' అంటాం. కానీ ఆ చెంబెక్కడుందో మాకైతే తెలీదు. కైలాసయాత్రకని పోయి, దారితప్పి సరాసరి కైలాసానికే పోతాం. లేదా 'కైలాస' అని ఒక ద్వీపాన్నే కొనేస్తాం. దానికి మా ప్రధానగోపికని, సారీ శిష్యురాలిని, ప్రధానమంత్రిగా చేసేస్తాం. కృష్ణుడెప్పుడైనా ఇలాంటి పనులు చేశాడా? చేయగలిగాడా? కనుక ఆయనకంటే మేమే గొప్పవాళ్ళం.

'కృష్ణుడు సాక్షాత్తూ భగవంతుడే' అని మా శాస్త్రాలంటున్నాయి. కానీ మేమాయనను పూజించము. మాకు భగవంతుడెందుకు? ఈరోజు మందుకెవడు డబ్బులిస్తే వాడే మా దేవుడు.

ఆయన మాకర్ధం కాడు. 

గౌడీయమఠానికీ, ఇస్కానుకే ఆయన అర్ధం కాలేదు. ఇక మాకెలా అవుతాడు?

అయినా మా పూజామందిరాలూ, పందిళ్ళూ ఖాళీగా లేవు. వాటిల్లో ఎక్కడ చూసినా పీర్లూ, ఫకీర్లూ, వ్రేలాడుతున్న శవాలూ, క్షుద్రదేవతలూ, గుండుగురువులూ, బండబాబాలూ, గడ్డం స్వాములూ, అజ్ఞాతసిద్ధులూ, విదేశీదేవుళ్ళూ, గురువులూ ఉంటారు. 

మా టేబిల్ మీదా, హాల్లోనూ, ప్రతిరాత్రీ యముడితో డిన్నర్ చేసి, మార్కింగ్ బ్రేక్ ఫాస్ట్ హిమాలయ బాబాజీతో చేసి, సాయంత్రానికి సిద్ధాశ్రమం దొడ్లో రెస్టు తీసుకునే పిరమిడ్లూ,  క్రియాయోగ గృహిణులూ, కళ్ళు మూసుకుంటే లోకలోకాలు తిరిగే NRI మహిళలూ, కాళికాదేవితో కబుర్లు చెప్పేవాళ్ళూ, లలితాదేవితో లంచ్ చేసేవాళ్ళూ, సహజయోగంతో మిమ్మల్ని అసహజంగా మార్చేసేవాళ్లూ, ఆ మిషనూ, ఈ మిషనూ అంటూ మిషన్లతో మిమ్మల్ని కుట్టేసేవాళ్ళూ, ఆత్మలతో మాట్లాడేవాళ్లూ, యక్షిణీలను ఎదుటకు రప్పించేవాళ్లూ, వీళ్ళ ఫొటోలే ఉంటాయి.

వీరి మధ్య కృష్ణుడికి చోటేది?

ఆయన పరిపూర్ణ అవతారమైతే మాకేంటి? కాకపోతే మాకేంటి? వితంతువులకూ, అనాదులకూ డబ్బులిస్తాడా లేదా? నిద్రపోతున్న మా కుండలినిని అయిదే అయిదునిమిషాలలో లేపుతాడా లేదా? మా మతవ్యాపారానికి పనికొస్తాడా లేదా? అది చెప్పండి !

మనల్ని ఆ శ్రీకృష్ణుడే రక్షించాలి. మనల్నే  కాదు. భూమి మొత్తాన్నీ ఆయనే రక్షించాలి.

రక్షిస్తాడా? మనలాంటి వాళ్ళని? ఒకవేళ ఏదైనా బలహీనక్షణంలో ఆయన ముందుకొస్తే మాత్రం, మనం రక్షించనిస్తామా?

ఏమో నాకైతే సందేహమే !

read more " కృష్ణ కృష్ణా ! "

31, ఆగస్టు 2026, సోమవారం

నేపాల్ దుర్ఘటన - నేర్చుకోని నిజాలు

నేపాల్ దుర్ఘటన జరిగింది.

850+ మంది చనిపోయారు. 2500+ మంది ఆచూకీ లేరు. 

నిత్య, నైమిత్తిక ప్రళయాలకు ఇదొక ఉదాహరణ. 

కాకపోతే, ఇంటర్నెట్ గురువులెవ్వరికీ ఈ విషయం చూచాయగా కూడా ముందస్తుగా తెలియలేదు.

----------------------

వీరిలో ప్రతిరాత్రీ శంభలాకు చెంబుతీసుకొని పోయి వచ్చేవాళ్ళున్నారు. 

సిద్ధాశ్రమంలోనే పుట్టిపెరిగామని చెప్పుకునే హిమాలయయోగులున్నారు. 

కైలాసపర్వతంలో వారంవారం జరిగే సీక్రెట్ మీటింగులకు హాజరయ్యేవాళ్లున్నారు.

సాక్షాత్తూ శివుడితోనే సరాసరి హాట్ లైన్లో మాట్లాడేవాళ్లున్నారు. 

శివుడి భుజాలపైనే ఎప్పుడూ కూర్చుని ఉండే సద్గురువులున్నారు. 

మాటమాటకీ 'షివా షివా' అని 'షో' చేసేవాళ్లున్నారు. 

అతీతలోకాలన్నీ అలా అలా సరదాగా ధ్యానంలో తిరిగొచ్చే యో/రోగులున్నారు.

కుండలినిని అలా లేపి ఇలా పడుకోబెట్టే సిద్ధులున్నారు.

గడ్డాలు పెంచినవాళ్ళూ, పెంచనివాళ్ళూ, గుండు చేయించుకున్నవాళ్లూ, జుట్టు పెంచినవాళ్ళూ, కొప్పు కట్టుకున్న వాళ్ళూ, విప్పుకున్నవాళ్ళూ, ఇలా రకరకాల వేషాలతో ఎంతో వినోదాన్ని పంచుతున్నవారున్నారు.

అతితెలివితేటల ఉపన్యాసాలతో, చర్చలతో, గొఱ్ఱెప్రజలకు "గ్నానాన్ని" పంచుతూ  అదరగొట్టేవాళ్లున్నారు.

సినీనటుల అక్రమసంబంధాల దగ్గరనుంచీ, వాళ్ళ కాపురాలు నిలుస్తాయా లేదా అన్నదానివరకూ ప్రతిదానినీ చెప్పే కమెడియన్ జ్యోతిష్కులున్నారు.

ఇంకా ఎంతోమంది ఆన్లైన్ విదూషకులున్నారు.

ఎవరికీ ఈ ప్రమాదం గురించిన ముందస్తు సూచన కొంచెం కూడా లేదు.

ఎన్నో లోకాలలో ఏమి జరుగుతోందో చూడగలిగే జ్ఞానులకు, ఈ లోకంలో ఇంకాసేపట్లో ఏం జరుగుతుందో తెలీదు !

ఈషా భక్తబృందమైతే అదేదో ఎపాయింట్ మెంట్ తీసుకున్నట్టు సరిగ్గా పదినిముషాల  ముందు ఠంచన్ గా అక్కడకు చేరుకొని 'రామ్మా ! వరదా ! వచ్చి  మమ్మల్ని ముంచెయ్యి' అన్నట్టు సామాన్లు సర్దుకొని మరీ రెడీగా ఉంది.

కాబట్టి వాళ్ళకొక్కరికే, కైలాసం నుండి కరెక్ట్ గా ముందస్తు సమాచారం ఉందని నేననుమానిస్తున్నాను. లేకపోతే సరిగ్గా పదినిమిషాల ముందుగా అక్కడికెలా చేరుకుంటారు వాళ్ళు?

ఇప్పుడంతా అయిపోయాక,  మళ్ళీ వేరే రకం 'షో' లు, "షివా షివా" అంటూ షంతాప షభలు, విశ్లేషణలు, సమర్ధింపులు, నాటకాలు.

-------------------

వైకుంఠద్వారం టికెట్ల త్రొక్కిసలాటలో పడి సరాసరి వైకుంఠానికే పోయారు గతంలో కొందరు.

ఇప్పుడు కైలాసయాత్ర చేసొస్తూ, కైలాసానికే డైరెక్ట్ గా చేరుకున్నారు మరికొందరు.

బ్రహ్మలోకానికి మాత్రం ఎవరూ పోవడం లేదు ! పాపం ఆయనని పూజించేవారు లేరుకదా !

పిచ్చిభక్తులు నిజంగా వైకుంఠానికీ, కైలాసానికీ పోతున్నారో లేదో తెలియదు గానీ, వీళ్ళ డబ్బులు మాత్రం చేరవలసినవారికి చేరుతున్నాయి.

రెలిజియస్ వ్యాపారాలూ, రెలిజియస్ టూరిజం వ్యాపారాలూ బ్రహ్మాండంగా నడుస్తున్నాయి.

---------------------

అసలూ, హిమాలయాలతో మనకెందుకు?

ఎవరుండవలసిన చోట వాళ్ళుండాలి.

మనకు దూరంగా ఎక్కడో ఉన్న మంచుకొండలలోకి మనం పోయి, అక్కడ మన చెత్తా చెదారమూ, సారాసీసాలూ, ప్లాస్టిక్ జంకూ పడేసి కాలుష్యం నింపడం అవసరమా?

అక్కడెవరో పాపం ముక్కులు మూసుకుని, గోచీలు పెట్టుకుని కూర్చుని ఉంటే, మనం పోయి, వాళ్ళనింకా లోతట్టు కొండల్లోకి తరిమికొట్టడం అవసరమా?

స్వచ్ఛమైన హిమాలయాలను టూరిస్టు సెంటర్లుగా మార్చేసి, హోటళ్లు, రెస్టారెంట్లు, బార్లు, క్లబ్బులు, పబ్బులు కట్టి, మబ్బుచాటు వ్యాపారాలు చెయ్యడం అవసరమా?

అక్కడకూడా డ్యాములు, బ్రిడ్జీలు కట్టి, కొండలను తొలిచి సొరంగాలు త్రవ్వడం అవసరమా?

ప్రకృతిని ఈ విధంగా పాడు చెయ్యడం అసలంటూ అవసరమా?

చేస్తే, అది చూస్తూ ఊరుకుంటుందా?

---------------------

గత మూణ్నెళ్లుగా వర్షాలెందుకు లేవు?

ఎక్కడచూచినా ఈ వేడీ, ఉడకా, కొనసాగుతున్న ఈ వేసవీ ఏమిటి?

యూరప్ లో ఎండవేడికి వేలాదిమంది చావడమేమిటి?

ఉత్తర అమెరికాలో కూడా పెరుగుతున్న ఉష్టోగ్రతలేమిటి?

ఇవన్నీ ఎందుకో, గ్లేషియర్లు కరగడమూ అందుకే.

కానీ, మనుషులేమీ నేర్చుకోరు. నేర్చుకోకండి. ఇలాగే ఉండండి.

---------------------------- 

సర్లే, ఈ న్యూసు ఇప్పటికే పాతబడిపోయింది.

బోరుకొడుతోంది. ఇంకో క్రొత్త న్యూసు రాదేంటి?

ఎవరైనా ఒక రేపో, ఒక మర్డరో, ఇంకొకటో, ఇంకొకటో కాస్త వెరైటీగా చెయ్యండ్రా బాబూ !

ఇంకెన్ని రోజులీ నేపాల్ గోల?

ఇవన్నీ చూస్తుంటే గతంలో వ్రాసుకున్న ఒక కవిత గుర్తుకొస్తోంది.

------------------------

కొందరు బాధాపీడితులు
కొందరు మాయామోహితులు.

కొందరు మాయగాళ్లు.
కొందరాశ్చర్య చకితులు.

కొందరు ఆపకుండా వాగేవాళ్ళు
కొందరు లేవకుండా వినేవాళ్ళు

కొందరు  నాటకాలేసేవాళ్ళు
కొందరు నవ్వుకుంటూ చూసేవాళ్ళు

కొందరు తీర్పులు తీర్చేవాళ్ళు
కొందరు తిరిగిరాకుండా పోయేవాళ్లు.

చివరికందరూ,
ఎవరు తీసుకున్న గోతిలో వారే పడేవాళ్లు !

ఓ జీవితమా ! అర్థంకాని నీ ఆట జరుగుతూనే ఉంటుంది !
ఓ విశ్వమా ! అంతులేని నీ పయనం సాగుతూనే ఉంటుంది !!
read more " నేపాల్ దుర్ఘటన - నేర్చుకోని నిజాలు "

9, ఆగస్టు 2026, ఆదివారం

గడపలో దీపం

మొన్నామధ్యన కాలేజీరోజుల నాటి ఒక స్నేహితుడు ఆశ్రమానికి వచ్చాడు.

కుశలప్రశ్నలయ్యాక, "ఆశ్రమం నిర్మించావని తెలిసింది. చూద్దామని వచ్చాను" అన్నాడు.

"మంచిది. చూడు" అన్నాను.

"నీ ఇంటర్వ్యూ తీసుకుని మా ఛానల్లో వేస్తాము. అందుకని కెమెరాలతో సహా వచ్చాను. కార్లో ఉన్నాయి. నువ్వు సరేనంటే మొదలుపడదాం." అన్నాడు.

"అవసరం లేదు" అన్నాను.

ఆశ్చర్యంగా చూచాడు.

"పబ్లిసిటీ అవుతుంది. ఇంకా చాలామంది వస్తారప్పుడు" అన్నాడు.

"ఏం చేస్తారు చాలామంది వచ్చి?" అడిగాను.

"ఏవో బాధలుంటాయిగా వాళ్లకు" అన్నాడు.

"వాళ్ళ బాధలను తీరుస్తూ, నాకు బాధలను సృష్టించుకోమంటావా?" అడిగాను. 

"మరి బ్లాగు, బుక్సు, ఆన్లైన్ మీటింగ్స్ ఇవన్నీ చేస్తున్నావుగా" అడిగాడు.

"అవి లోకుల కష్టాలను తీర్చడంకోసం కాదు. జనం పెరిగితే గోలతప్ప ఇంకేదీ ఉండదు. లోకపు కర్మబరువును మొయ్యడం అవతారపురుషులకే సాధ్యం కాలేదు. మనమెంత? ఛానల్స్ చూసేవాళ్ళు కాలక్షేపానికి మాత్రమే ఆ పని చేస్తారని నీకూ తెలుసు. నాకూ తెలుసు. ఎందుకలాంటి వాళ్లంతా ఇక్కడికొచ్చేది? " అన్నాను.

"మరి ఇదంతా ఎందుకు?" అడిగాడు చుట్టూ చూస్తూ. 

"దీపాన్ని వెలిగించి గడపలో ఉంచాను. నాలుగురోడ్ల కూడలిలో ఉంచవలసిన పని లేదు" అన్నాను.

సాయంత్రం వరకూ ఉండి, అదీఇదీ మాట్లాడి, సెలవు తీసుకున్నాడు.

కారులోని కెమెరాలు  కారుతోబాటే వెళ్లిపోయాయి.

గడపలో దీపం వెలుగుతూనే ఉంది.

read more " గడపలో దీపం "

5, ఆగస్టు 2026, బుధవారం

మా 80 వ పుస్తకం "వెలుగుదారులు - రెండవభాగం" విడుదల

ఇవాళ నా 63 వ పుట్టినరోజు. 63 పూర్తై 64 లోకి అడుగుపెడుతున్నాను.

ఈ సందర్భంగా, నా కలం నుండి వెలువడుతున్న 80 వ పుస్తకంగా "వెలుగుదారులు" రెండవభాగాన్ని నేడు విడుదలచేస్తున్నాము.

ఇది "మ్యూజింగ్స్ - II" కు తెలుగు అనువాదం. "ఈ-బుక్" కనుక ఒకే పుస్తకంగా విడుదలౌతోంది. ప్రింట్ లో  రెండు పుస్తకాలుగా వస్తుంది.

ఇందులోకూడా 360 ఆధ్యాత్మిక టాపిక్స్ మీద నేను చెప్పిన విషయాలు, సంభాషణలు, సన్నివేశాలు ఉన్నాయి. దీనిని, దీని మొదటిభాగాన్ని దగ్గర ఉంచుకుని వీటిలో ఉన్న 720 టాపిక్స్ ను చదువుతూ ఉంటే, ఆధ్యాత్మికప్రపంచంలో మీకొచ్చే ఎటువంటి సందేహమైనా పటాపంచలైపోతుందని నేను  చెప్పగలను. 

పంచవటి శిష్యులకు "వెలుగుదారులు", ఒక భగవద్గీత వంటిదని చెప్పడం అతిశయోక్తి కాబోదు.

మొదటిభాగంలాగే ఇదికూడా జిజ్ఞాసువులకు అభిమానపాత్రమౌతుందని భావిస్తున్నాము.

ప్రచురణలో పాలు పంచుకున్న అందరికీ ఆశీస్సులందిస్తున్నాను.

ఈ పుస్తకం ఇక్కడ లభిస్తుంది.

read more " మా 80 వ పుస్తకం "వెలుగుదారులు - రెండవభాగం" విడుదల "

2, ఆగస్టు 2026, ఆదివారం

దేవుడిని తిడతారా జంతువుల్లారా?

75 ఏళ్ల వయసున్న తననూ, చనిపోయిన తన తల్లిగారినీ బూతులు తిట్టిన పదిహేనూ ఇరవైఏళ్ల జాంబీలను క్షమిస్తూ మోదీగారు ప్రకటన చేశారు. వారు దారితప్పిన పిల్లలని, వారిని సరిదిద్దటమే చేయాలిగాని, శిక్షించడం సరికాదని అన్నారు. అది ఆయనలోని మానవత్వాన్ని, దైవత్వాన్ని చూపిస్తున్నది. 

అంతేకాదు, వాళ్ళు మాట్లాడిన మాటల్నిబట్టి, ఆ పిల్లలు అసలెలా పెరుగుతున్నారో, ఆ తల్లిదండ్రులు వారినెలా పెంచుతున్నారో  కూడా కనిపిస్తున్నది. అసలంటూ వాళ్లకు తల్లిదండ్రులున్నారా అని నాకు సందేహం తలెత్తుతున్నది. బహుశా గాలికి పుట్టి, గాలికి పెరిగిన రకాలై ఉంటారు. లేదా, డ్రగ్స్ మత్తులో ఉన్నారని ఈజీగా అర్థమవుతున్నది.

Gen Z అంటే ఏమిటా? అని ఇన్నాళ్ళూ అనుకునేవాడిని. ఇప్పుడు సందేహం తీరిపోయింది. జనరేషన్ జాంబీ అని అర్థమైపోయింది.

'వాళ్ళేం చేస్తున్నారో వాళ్లకు తెలియదు. వాళ్ళను క్షమించు' అని జీసస్ ప్రార్ధించాడని, కనుక ఆయనలో దైవత్వం ఉన్నదని అందరూ అంటుంటారు. అదేనిజమైతే, మోదీగారిలో కూడా అదే దైవత్వం ఉన్నది. ఒక ప్రధానమంత్రి తలచుకుంటే, ఈ బచ్చాలందరూ ఏమై పోతారసలు? ఊహకికూడా అందదు.

కానీ ఆయన క్షమించారు. అది ఆయనలోని దైవత్వం !

ఇంకా చెప్పాలంటే, ఆ టైములో జీసస్ నిస్సహాయుడు. శిలువ వేయబడుతున్నాడు. ఎంతగా మొరపెట్టుకున్నా తన దేవుడు కూడా  తనను పట్టించుకోలేదు. ఆ సమయంలో, ప్రార్ధించడం తప్ప జీసస్ ఇంకేం చేయగలడు? అయినా, కోప్పడకుండా క్షమించాడు. అంతవరకూ గొప్పవిషయమే !

కానీ మోదీగారు నిస్సహాయుడు కాదు. యంత్రాంగమంతా ఆయన చేతులలో ఉన్నది. ఒక కనుసైగ చేస్తే చాలు, ఏది జరగాలో అది జరుగుతుంది. కానీ ఆయనలా చేయలేదు. ఓర్పువహించాడు. క్షమించాడు. కనుక, నా దృష్టిలో జీసస్ కంటే మోదీగారే గొప్పవాడు.   

ఆయన దేశానికి క్షమార్పణ చెప్పాలట ! ఇదొక డిమాండా అసలు? దీనినొక ఇష్యూ చేస్తున్నాడు పప్పు. తన ముందున్న మైకు స్విచ్చి ఆన్ చేసుకోకుండా, మైకు కట్ చేశారని గోల చేస్తున్నాడు. అందుకే పప్పు అనేది !

క్షమార్పణ ఆయన చెప్పడమేంట్రా దరిద్రుల్లారా ! మనందరి చర్మాలతో ఆయనకు చెప్పులు కుట్టించినా, ఆయన ఋణాన్ని ఈ దేశం తీర్చుకోలేదురా  దేశద్రోహుల్లారా !

---------------------

పార్లమెంటు సమావేశాలను ముందుకు పోనివ్వకుండా, బిల్లులు పాసు కానివ్వకుండా  మన ఎంపీలు చేస్తున్న అల్లరీ గోలా ప్రజలలో అసహ్యాన్ని పుట్టిస్తున్నది. 

వీళ్లా మన MP లు? అని సిగ్గుపడవలసి వస్తున్నది. ఏదో రోడ్లమీద అరిచే జంతువులలాగా 'ఓ...' అని MP లు పార్లమెంటులో అరుస్తున్నారంటే, మన దేశానికి ప్రజాస్వామ్యం ఏమాత్రమూ సరిపోదని నేనెప్పుడూ అనేమాట నిజమేనని రుజువౌతున్నది. ఎంత డబ్బులుపెట్టి ఓట్లు కొనుక్కుని గెలిస్తే మాత్రం, కాస్త డీసెన్సీ డెకోరం ఉండద్దూ ! మేన్యుఫేక్చరింగ్ డిఫెక్టా?

----------------------

గతపదేళ్లలో మన దేశం ఎన్నో మైలురాళ్లను దాటింది. ఎన్నో దేశాలను దాటేసి ముందుకొచ్చేసింది. మోదీగారు సాధించిన విజయాలను, దాటిన మైలురాళ్లను వ్రాయాలంటే వందకు పైన ఉన్నాయి. 

దేశం బాగుపడిపోతున్నది. అన్ని రంగాలలో ముందుకు దూసుకుపోతున్నది. ఎక్కడా ఎలాంటి గొడవలూ లేవు. పెడదామన్నా వీలుకావడం లేదు. ఇంకోసారి మోదీగారి ప్రభుత్వం వస్తే ఇక మనం దుకాణాలు మూసుకోవలసిందే, అన్న తీవ్రమైన భయానికి కాంగ్రెసు, కమ్యూనిస్టులు, ఇస్లామిక్ పార్టీలు, ఇతర కొమ్ముపార్టీలు లోనయ్యాయి. వాటికి మనచుట్టూ పొంచి ఉన్న శత్రుదేశాలు కాపుకాశాయి. ఎగదోశాయి. సరే, వీళ్లకు ఫండింగ్ చేసే దొంగలెలాగూ ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. బొద్దింకలు పుట్టుకొచ్చాయి. 

సరే, వాటికి కూడా వాళ్ళ నిరసనను వ్యక్తం చేయడానికి అవకాశం ఇవ్వబడింది. దానిని సాకుగా తీసుకొని 'చలో పార్లమెంట్' అని పార్లమెంట్ వైపు పోబోయాయి. వేటు పడింది. అదికూడా లైట్ గా పడింది.

దానిని హైలైట్ చేసి, FCRA వంటి ముఖ్యమైన బిల్లులు పాసవ్వకుండా చెయ్యాలని విపక్షాలు పార్లమెంట్ సమావేశాలలో నానా అల్లరీ చేస్తున్నాయి. కానీ వాటి దేశద్రోహపోకడలను దేశం గమనిస్తూనే ఉంది. వీళ్ళవెనుక ఎవరున్నారో, ఫండింగ్ ఎక్కడనుంచి వస్తున్నదో, పార్లమెంట్లో చర్చలకు ఎందుకిలా అడ్డుపడుతున్నారో, నేడు అందరికీ తెలుసు.

విపక్షాల ఎజెండా ఒకటే. ఏదోరకంగా గొడవలు లేవనెత్తి, నేపాల్, శ్రీలంక, బాంగ్లాదేశ్ లలో జరిగినట్టు ప్రభుత్వాన్ని కూలద్రోయాలని కంకణం కట్టుకున్నాయి. మనదేశం బాగుపడకూడదు. అగ్రరాజ్యంగా అవతరించకూడదు. మిగతాదేశాలతో సమానంగా తలెత్తుకుని గర్వంగా నిలబడకూడదు. నాశనం కావాలి. ఇదే వీళ్ళ ఆశయం.

పేపర్ లీకు జరిగింది. దానిని గుర్తించి తగిన చర్యలన్నీ వెంటవెంటనే తీసుకున్నారు. ఇంకేం కావాలి? ధర్మేంద్రప్రదాన్ రాజీనామా చేయవలసిన అవసరం ఏముంది? సరే, నైతికకోణంలో చేశాడు. ఇప్పుడు అమిత్ షాను, మోదీగారిని కూడా చేయమంటున్నారు. తర్వాత దేశం దేశద్రోహపార్టీల చేతులలోకి వెళ్ళిపోతుంది. చైనా, పాకిస్తాన్, బాంగ్లాదేశ్ ఇంకా ఇతరశత్రుదేశాల చేతులలోకి వెళ్ళిపోతుంది. ఐదారేళ్లలో సర్వనాశనమై పోతుంది. అదేగా వీళ్లకు కావలసింది?

దీనిని మనమెందుకు జరగనివ్వాలి? మా డిమాండ్లు మాకూ ఉన్నాయ్ !

FCRA బిల్లు పాసవ్వాలి. మతమార్పిడి మాఫియాలు అంతం కావాలి. దేశద్రోహపార్టీలు అంతం కావాలి. అల్లర్లు ఆగడాలు, కుట్రలు అంతం కావాలి. ఆ దిశగా ఏమేం చెయ్యాలో అన్నీ చెయ్యాలి.  అంతేగాని, ప్రభుత్వం వెనుకకు తగ్గడానికి వీల్లేదు. ఇదే మా డిమాండ్.

ఈ ప్రశ్నలకు జవాబులు చెప్పడం మీవల్ల అవుతుందా?

---------------------

శాంతియుతంగా నిరసన చెయ్యవలసిన విద్యార్థులు విధ్వంసానికి దిగవచ్చా?

నిరసనలో పాల్గొన్నవారికి పాకిస్తాన్ నుంచి, బాంగ్లాదేశ్ నుండి ఫుడ్ ఆర్దర్లు ఎలా జరిగాయి?

నిరసనకారులు మాట్లాడిన మాటలేంటి? చేసిన నినాదాలేంటి?

పోలీసులను కొట్టటమేంటి? మహిళా జర్నలిస్టులను అల్లరి చేయడమేంటి?

ఇవన్నీ మంచిపనులేనా? శాంతియుతం అంటే ఇదేనా?  

పెల్లెట్ గన్స్ వాడారని గోలచేస్తున్న కమ్యూనిస్టులు, మీ చైనాలో జరిగిన తియానన్ మెన్ స్క్వేర్ సంఘటనకు ఏమంటారు?

పోలీసుచర్య అంటూ గోలచేస్తున్న కాంగ్రెస్, ఎమర్జెన్సీని గురించి ఏమి జవాబు చెబుతుంది?

ఇతర రాష్ట్రాలలో పేపరులీకులైనపుడు, విద్యాశాఖామంత్రులు ఎందుకు దిగిపోవడం లేదు?

సరే, శాంతియుతంగా నిరసన చేసినవారిపైన కేసులుండవు. మరి, విధ్వంసకారులను, ఆ గుంపులో దూరిపోయిన నేరస్తులను, పాతకేడీలను కూడా వదిలేయాలా? ఏ చట్టప్రకారం?

--------------------------

మోదీగారు మనిషి కాదురా దరిద్రుల్లారా ! ఆయన దైవాంశసంభూతుడు. మన దేశాన్ని రక్షించడానికి పుట్టిన దేవుడు. ఆయనే లేకపోతే, నేడు మనమందరమూ మనదేశంలోనే బానిసబ్రతుకులు బ్రతుకుతూ ఉండేవాళ్ళం. అలాంటి దేవుడిని అలా తిడుతున్నారా? మీరసలు మనుషులేనా?

పెద్దమనసుతో మీరు క్షమించినా, ఈ దేశద్రోహులను మేము క్షమించలేము. చిన్నపిల్లలైనా సరే, వీళ్లకు తీవ్రమైన శిక్షలు పడాల్సిందే. వీళ్ళనిలా వదిలేస్తే, కొన్నేళ్ళకు వీళ్ళే తీవ్రవాదులు, నేరస్తులు, సమాజానికి చీడపురుగులు అవుతారు. వీళ్ళను వదిలెయ్యడానికి వీల్లేదని మేము డిమాండ్ చేస్తున్నాం !

------------------

FCRA బిల్లు రావాలి. మతమార్పిడులు పూర్తిగా ఆగాలి. రిజర్వేషన్ అంతం కావాలి. మెరిట్ కు గుర్తింపు రావాలి. అవినీతి అంతం  కావాలి. రాజ్యాంగాన్ని మార్చాలి. డెమోక్రసీని తొలగించి, ఉదారవాద నియంతృత్వం రావాలి. 

ఇవి మా డిమాండ్స్.

----------------------------

మన దేశానికి ప్రజాస్వామ్యం పనికిరాదు. ఉదారవాద నియంతృత్వం (Benevolent Dictatorship) ఒక్కటే మనకు సరైనది. నేడుకాకపోయినా, భవిష్యత్తులోనైనా ఇదే నిజమౌతుంది. అమ్మాబాబూ అని ఒళ్ళో కూచోబెట్టుకుంటే మనదేశంలో ఎవడూ మాటవినడు. తొక్కి నారతీస్తేనే మంచిగా ఉంటారు.

దేశద్రోహులనెవరినీ క్షమించకూడదు. వాళ్ళు ప్రజలైనా సరే ! పార్లమెంటులో లేకిగా ప్రవర్తిస్తున్న నాయకులైనా సరే ! వాళ్ళను సపోర్ట్ చేస్తున్న పార్టీలైనా సరే. ఎవరినీ వదలడానికి వీల్లేదు.

మన దేవుడైన మోదీగారిని దూషించేవాళ్లను ఆయన క్షమించినా, మనం క్షమించకూడదు. అలాంటివాళ్ళందరినీ క్షమిస్తూ కూచుంటే, దేశద్రోహుల కుట్రలకు బలై, దేశం అధోగతి పాలవుతుంది. నిజాయితీపరులు, దేశభక్తులు, కాస్తైనా ఆలోచన ఉన్నవారందరూ కళ్లుతెరవాలి. మారుమాటలేకుండా మోదీగారిని, బీజేపీని సపోర్ట్ చేయాలి. దేశద్రోహుల పనిపట్టాలి.

దేశద్రోహుల ప్రచారాలను త్రిప్పికొట్టండి. మీమీ స్థాయిలలో ప్రతిఘటించండి. న్యాయాన్ని ధర్మాన్ని రక్షించండి.

బాగా గుర్తుంచుకోండి !

ధర్మం మౌనంగా ఉంటే, అధర్మానికి వంతపాడినట్లే అవుతుంది ! 

read more " దేవుడిని తిడతారా జంతువుల్లారా? "

30, జులై 2026, గురువారం

సత్యం - అసత్యం

దూరపు ఊళ్లలో ఉన్న శిష్యులను గురుపూర్ణిమ కోసం ఆశ్రమానికి రావద్దనే నేను చెబుతాను. ఈ ఇంటర్నెట్ యుగంలో అసలెక్కడికీ పోనవసరం లేదు. ఎక్కడవాళ్ళు అక్కడే ఉండి, అన్నీ చేయవచ్చు.

ఇక్కడున్నా, ఎక్కడున్నా, ఉండవలసిన విధంగా ఉంటే అన్నీ జరుగుతాయి. అది లేనప్పుడు, ఎక్కడికొచ్చినా ఏమీ ఒరగదు.

కానీ, దగ్గర ఊళ్లలో ఉన్న శిష్యులు కొంతమంది, వద్దన్నా వస్తూ ఉంటారు. భౌతికంగా వచ్చి ఇక్కడ కాసేపైనా ఉంటే, వాళ్లకు బాగుంటుంది. అదేవిధంగా, విజయవాడ, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు, హైదరాబాదులనుండి కొంతమంది నిన్న ఆశ్రమానికి వచ్చారు.

మాటలసందర్భంలో, ఒక శిష్యురాలు ఇలా అన్నది. 

'ఒంగోలు నుండి వస్తుంటే దారిపొడుగూతా  పందిళ్లు, బాబా కటౌట్లు. రోడ్డుపక్కన పందిళ్ళేసి గురుపౌర్ణమంటూ భోజనాలు చేస్తున్నారు. చాలా జాలేసింది వాళ్ళని చూస్తుంటే'.

నవ్వాను.

'కానీ నాకు మాత్రం, బాబా కటౌట్ చూసిన ప్రతిసారీ మీరే గుర్తుకు వచ్చారు' అన్నది.

'మంచిదేగా. అలాగైనా ఒక మంచిపని జరిగింది బాబావల్ల' అన్నాడొక శిష్యుడు.

అందరూ నవ్వేశారు.

'అంతే ! అసత్యాన్ని చూచినా సత్యం గుర్తుకురావడమే హిందూమతవిధానం' అన్నాను.

'వాళ్లకూ మాకూ తేడా ఏమిటి?' అని ఒక శిష్యుడడిగాడు.

'సత్యమేదో ఆసత్యమేదో తెలుసుకోలేని స్థితిలో వాళ్ళున్నారు, సత్యాన్ని సత్యంగా గుర్తించగలిగే స్థితిలో మీరున్నారు. అదే తేడా' అన్నాను.

ఆర్భాటాలకు, అన్నసంతర్పణలకు, అతిచేష్టలకు, అనవసరపుగోలకు అతీతంగా, అసలైన గురుపౌర్ణమి వేడుక మా ఆశ్రమంలో అద్భుతంగా జరిగింది.

read more " సత్యం - అసత్యం "

29, జులై 2026, బుధవారం

గురుపూర్ణిమ సందర్భంగా మా 79 వ పుస్తకం MUSINGS - Part II విడుదల

2021 లో నా కలంనుండి MUSINGS - Part I అనే పుస్తకం విడుదలైంది. అది వెయ్యిపేజీల పుస్తకం. దానిలో 360 టాపిక్స్ చర్చించబడ్డాయి. అది విడుదలై నేటికి ఐదేళ్లు గడిచాయి. ఆ పుస్తకం ఎంతో పాఠకాదరణను పొందింది.

ప్రపంచవ్యాప్తంగా అనేకమంది జిజ్ఞాసువులను కదిలించింది. ఆలోచింపజేసింది. చాలామంది జీవితాలను మార్చివేసింది.

తరువాత దాని తెలుగు అనువాదం 'వెలుగుదారులు' అనే పేరుతో విడుదలై, తనపేరును సార్ధకం చేసుకుంటూ, ఎంతోమందికి వెలుగుదారులను చూపించింది.

ఈ ఐదేళ్లలో ఎన్నో జరిగాయి. ఆశ్రమాన్ని స్థాపించడం జరిగింది. పంచవటిని విస్తృతపరచడం జరిగింది. నేను చూపిస్తున్న సాధనామార్గాన్ని ఎంతోమందికి పరిచయం చెయ్యడం జరిగింది. ఈ మధ్యలో అనేకమంది జ్ఞానార్థులు, శిష్యులు, సందర్శకులు, ఔత్సాహికులతో ఎన్నో విషయాలపైన నేను మాట్లాడాను. వారి ప్రశ్నలకు సమాధానాలిచ్చాను. ఆ సంభాషణలలో నుండి ఇంకొక 360 టాపిక్స్ ను ఏర్చికూర్చి ఇప్పుడు గురుపూర్ణిమ సందర్భంగా ఈ పుస్తకం యొక్క  రెండవభాగంగా విడుదల చేస్తున్నాము. ఇదికూడా వెయ్యిపేజీల పుస్తకమే.

మొదటిభాగంలోలాగే ఇందులోకూడా, అన్నీ నిత్యజీవితంలో జరిగిన సంఘటనలనుండి, ఇతరులు అడిగిన ప్రశ్నలనుండి  తీసుకున్నవే. ఊహించి వ్రాసినది ఒక్కటికూడా లేదు. కనుక, మీ జీవితంలో జరుగుతున్న అనేకవిషయాలకు, మీకొస్తున్న అనేక ఆధ్యాత్మికసందేహాలకు ఈ  పుస్తకం అద్దాన్ని పడుతుంది. వాటికి స్పష్టములైన జవాబులనిస్తుంది.

ఒక్కవారంలో రాబోతున్న నా 63 వ పుట్టినరోజు సందర్భంగా దీని తెలుగు అనువాదం "వెలుగుదారులు-రెండవభాగం" గా విడుదల అవుతుంది. అనువాదం ఇప్పటికే పూర్తయింది. అదికూడా వెయ్యిపీజీలను దాటిపోయింది. దానిని ఒకే పుస్తకంగా ముద్రించడం కష్టం కనుక,  రెండుభాగాలుగా ముద్రించి, 'వెలుగుదారులు' - 3 మరియు 4 భాగాలుగా, డిసెంబర్లో జరుగబోయే హైదరాబాద్ పుస్తకప్రదర్శన నాటికి మీకు అందుబాటులోకి తెస్తాము.

అజ్ఞానంలో పడి, ఎవరేది చెబితే దాన్ని నిజమని నమ్ముతూ, నానారకాల గురువులతో, గుడులతో, దేవుళ్లతో, దీక్షలతో, మతవ్యాపారాలతో దిక్కుతెలియకుండా పోతున్న నేటి హిందువులకు జ్ఞానజ్యోతిని చూపిస్తూ, సరియైనదారిలో వారిని నడిపించేదిశగా మేము చేస్తున్న ఈ జ్ఞానయజ్ఞాన్ని సఫలం చేయమని, సమస్తసృష్టికీ పరమగురువైన పరమేశ్వరుని ప్రార్ధిస్తూ ఈ ఉద్గ్రంధాన్ని నేడు విడుదల చేస్తున్నాను.

ఈ పుస్తకం ఇక్కడ లభిస్తుంది.

read more " గురుపూర్ణిమ సందర్భంగా మా 79 వ పుస్తకం MUSINGS - Part II విడుదల "