Be proud that you are a Hindu, for you inherit the wealth of 'Eternal Religion'

16, జనవరి 2022, ఆదివారం

బికనీర్ ఎక్స్ ప్రెస్ ఘోరప్రమాదం - గ్రహాల పాత్ర ఏమిటి?

క్రొత్త సంవత్సరం రైలుప్రమాదంతో మొదలైంది. 13-1-2022 గురువారం సాయంత్రం 5 గంటలకు ఒక ఘోర రైలు ప్రమాదం జరిగింది. రాజస్థాన్ లోని బికనీర్ నుండి అస్సాం లోని గౌహతికి వెళుతున్న ఎక్స్ ప్రెస్ రైలు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో జల్పాయిగురి జిల్లాలో ఉన్న మైనగురి అనే ఊరి దగ్గర పట్టాలు తప్పింది. రైల్లో 18 పెట్టెలుంటే వాటిలో 12 పట్టాలు తప్పి చిందరవందర అయ్యాయి. S - 5 మరియు S - 6 పెట్టెలు ఒకదానిపైకి ఒకటి ఎక్కాయి. తొమ్మిదిమంది చనిపోయారు. 36 మంది గాయాలపాలయ్యారు. యధావిధిగా రైల్వే మంత్రిగారు, ఇతర అధికారులు వచ్చారు. చూచారు. రైలు ఇంజన్లో లోపం ఉందన్న ప్రాధమిక సమాచారాన్ని రైల్వేమంత్రిగారే స్వయంగా వెల్లడించారు. బాధితులకు  నష్టపరిహారం ప్రకటించారు. ఎంక్వైరీ వేశారు. విచారణ జరుగుతోంది.

గ్రహాలేమంటున్నాయి?

భారతదేశానికి సూచికైన మకరరాశిలో శని బుధులు మూడు డిగ్రీల తేడాలో ఉన్నారు.  బుధుడు వేగంగా శనిని సమీపిస్తున్నాడు. వీరిద్దరికీ సూర్య గురువుల ద్వారా అర్గలదోషం పట్టింది.  శుక్రునికి గల వక్రత్వం వల్ల వృశ్చికంలోకి పోతున్నాడు. కనుక అర్గలదోషంలో ఈయన పాత్ర లేదు. శనిబుధులపైన హటాత్తు సంఘటనలకు విద్రోహచర్యలకు కారకుడైన యురేనస్  ఖచ్చితమైన డిగ్రీ కేంద్రదృష్టి ఉన్నది. కనుక ఈ కోణాన్ని కాదనలేము. వీరిపైన రాహుచంద్రుల కోణదృష్టి కూడా ఉన్నది. రాహుచంద్రులు కూడా విద్రోహచర్యలను సూచిస్తారు. కనుక ఈ అనుమానానికి బలం ఏర్పడుతున్నది. కానీ రైల్వేమంత్రిగారు మాత్రం, ఇంజన్ లోని భాగాలలో లోపమున్నదని అంటున్నారు. మకరరాశిలో శనిబుధుల డిగ్రీ స్థితి, వాయవ్యదిక్కును సూచిస్తున్నది. కానీ ప్రమాదం జరిగింది ఈశాన్యదిక్కులో. కనుక మకరరాశిని కేంద్రంగా చేసుకున్న ఈ విశ్లేషణ కరెక్ట్ కాకపోవచ్చు.

మరొక్క కోణం నుంచి పరిశీలిద్దాం.  భారతదేశాన్ని సూచించే వృషభరాశి నుంచి చూద్దాం.
  • లగ్నము సూర్యుడూ ఒకే డిగ్రీమీదుంటూ ఈ చక్రంలో సూర్యుని పాత్రను స్పష్టంగా సూచిస్తున్నారు.
  • హోరాధిపతి శుక్రుడయ్యాడు. కనుక ధనుస్సుకు ప్రాముఖ్యత ఏర్పడుతూ ఇదే విశ్లేషణకు కేంద్రమని చూపిస్తున్నది.
  • యాక్సిడెంట్ ను సూచించే అష్టమంలో ఉన్న సూర్యుడికి పాపార్గలం పట్టింది. డిగ్రీ పరంగా సూర్యుడు ఈశాన్యదిక్కును సూచిస్తూ అస్సాం ప్రాంతంలో జరుగబోతున్న యాక్సిడెంట్ ను ఖచ్చితంగా సూచిస్తున్నాడు.
  • నవమంలో ఉన్న శనిబుధులపైన ఉన్న యురేనస్ దృష్టిని బట్టి ఇందులో దూరదేశపు విద్రోహకోణం ఉన్నట్లు, ధనుస్సు నుండి కుటుంబస్థానము కావడంతో ఇంటిదొంగల పాత్ర కూడా ఉందని అనుమానించవలసి వస్తున్నది.
  • సూర్యుడంటే శరీరానికి గుండెకాయ. రైలుకైతే ఇంజన్. కనుక ఇంజన్లో లోపం నిజమే కావచ్చు. అయితే, ఆ లోపం ఏర్పడటానికి కారణమేంటనేది అసలు ప్రశ్న. 
  • అర్గల గ్రహాలను పరిశీలిద్దాం. శనిబుధుల వలన పాతబడిపోయిన వైర్లు, లింకులు, ఇంజన్లోని స్టీలుపార్టులు సూచింపబడుతున్నాయి. వృశ్చికంలోని కుజకేతువుల యుతివల్ల, చేయవలసిన దానికంటే ఎక్కువకాలం పాటు ఓవర్ లోడై పనిచేసిన ఇంజన్ విడిభాగాలు, అవికూడా ఇంజన్లో బయటగా కాకుండా బాగా లోపలగా ఉన్న భాగాలు సూచింపబడుతున్నాయి. ఈ రెండు కారణాలవల్ల, ఇంజన్ లో లోపం ఏర్పడినట్లు కనిపిస్తున్నది.
అలాంటప్పుడు, భారతీయ రైల్వేలలో ఇంజన్లకు జరుగవలసిన మెయింటెనెన్స్ సరిగా జరగడంలేదా? కనీసం ఈ ఇంజన్ కు జరగలేదా? అన్న అనుమానం తలెత్తుతుంది. ఈ అనుమానాన్ని నివృత్తిచేయవలసింది శాఖాపరమైన విచారణ మాత్రమే.

అయితే, విచారణలో ఏమి తేలినప్పటికీ, పోయిన ప్రాణాలు తిరిగొస్తాయా? నష్టపరిహారంగా ఇచ్చిన ఎక్స్ గ్రేషియా, వ్యక్తుల లోటును పూడుస్తుందా? బాధ్యులకు శిక్షలు పడతాయా? లోపభూయిష్టమైన మన వ్యవస్థలో తిరిగి ఇవే తప్పులు జరుగకుండా ఉంటాయా? అన్న ప్రశ్నలు మాత్రం  జవాబులు లేని శేషప్రశ్నలు గానే మిగిలిపోతాయి.
read more " బికనీర్ ఎక్స్ ప్రెస్ ఘోరప్రమాదం - గ్రహాల పాత్ర ఏమిటి? "

13, జనవరి 2022, గురువారం

పంచవటి చిహ్నం

చాలా రోజులనుంచీ పంచవటి చిహ్నాన్ని మా పుస్తకాలమీద మీరు చూస్తున్నారు. ఈమధ్య దానిని మరింత అందంగా తీర్చిదిద్దాము., కానీ దాని వెనుక ఉన్న అర్ధాలు మీకు తెలిసి ఉండక పోవచ్చు. అందుకే ఈ పోస్ట్.

ఈ చిహ్నం చుట్టూ ఆవరించి ఉన్న మూడు వలయాలు త్రిగుణములకు సూచికలు. సత్త్వ, రజో, తమోగుణముల పట్టులోనే ఏ మనిషి జీవితమైనా ఉంటుంది, నడుస్తుంది, ముగుస్తుంది. భూమ్మీద ఉన్న జీవులలో ఎవరూ వీటిని దాటి లేరు.

ఈ వలయాల లోపల పంచభూతములున్నాయి. అవి, పృధివి (నేల), ఆపస్సు (నీరు), తేజస్సు (అగ్ని), వాయువు (గాలి), ఆకాశము (నింగి). ఈ చిత్రంలోని చెట్టుకు ఆధారంగా భూమి ఉంది. పంచవటి అక్షరాలున్న నీలపు ప్రదేశం నీరు. ఆకాశంలో ఉన్న సూర్యకాంతి అగ్ని. ఎగురుతున్న పక్షులు గాలికి సూచికలు. ఆకాశం కనిపిస్తూనే ఉంది. ఈ పంచభూతాలే మనిషి జీవనానికి ఆధారాలు. వీటిలో, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, పంచ తన్మాత్రలు ఇమిడి ఉన్నాయి. ఈ 20 తత్త్వములూ శరీరస్థాయిలో ఉంటాయి. ఇది మా సాధనామార్గంలో బాహ్యాధారం.

పచ్చని పంచవటి వృక్షం ప్రాణశక్తికి సూచిక. శ్రీ రామకృష్ణుల వారు సాధనలు చేసిన పంచవటి వృక్షానికి ఇది నమూనా. ప్రాణంలోనే మనస్సు ఇమిడిపోయి ఉంటుంది. ప్రాణము మనస్సులు మా సాధనామార్గంలోని అంతరిక ఆధారాలు.

దేహము, ప్రాణము, మనస్సు - ఈ మూడింటినీ మా మార్గంలో నేర్పించబడే అనేక సాధనాప్రక్రియల ద్వారా స్థిరపరచి, శుద్దీకరణ చేసి, ఈశ్వరుని వెలుగును శక్తిని వాటిలో ప్రతిక్షేపించే సాధనలను మేము అనుసరిస్తాము.

వీటినెలా చేస్తాము?

శరీరస్థాయి

ఆసనములు, ఇంకా ఇతర హఠయోగ వ్యాయామములను క్రమం తప్పకుండా అభ్యాసం చేస్తాము. ఆహారనియమాన్ని పాటిస్తూ, జీవితాన్ని ప్రకృతి సూత్రాలకనుగుణంగా దిద్దుకుంటాము. మా మార్గంలో దేహాన్ని నిర్లక్ష్యం చేయడం ఎంతమాత్రమూ జరుగదు. 

ప్రాణస్థాయి

తొమ్మిది విధములైన ప్రాణాయామ ప్రక్రియలను అనుసరించడం ద్వారా ప్రాణాన్ని స్థిరపరచి, శుద్దీకరించి, అదుపులోకి తెచ్చుకోవడం ఈ స్థాయిలో జరుగుతుంది. ఈ తొమ్మిది ప్రక్రియలూ, వాటి వాటి కాంబినేషన్లతో కూడి లెక్కలేనన్ని ప్రక్రియలౌతాయి. ఒ మనిషి దేహతత్వాన్ని బట్టి అతనికి మాత్రమే సరిపోయే విధానాలను ఉపదేశించడం జరుగుతుంది. కుండలినీ యోగసాధనలు ఈ స్థాయిలో అంతర్భాగాలుగా ఉంటాయి. 

మానసికస్థాయి

ఈ స్థాయిలో వేదాంత, బౌద్ధ, యోగ, తంత్రమార్గాలకు చెందిన ఎన్నో ధ్యానవిధానాలను అభ్యాసం చేస్తాము. ఇవి కూడా మనిషిని బట్టి మారిపోతూ ఉంటాయి. ఎవరికి సరిపోయే ధ్యానవిధానం వారికి ఉపదేశింపబడుతుంది. అందరినీ ఒకే క్లాసులో కూచోబెట్టడం జరుగదు. వీటివల్ల, మనస్సులోని చేతన, ఉపచేతన, అంతచ్చేతనా స్థాయిలు శుభ్రమై, వెలుగుతో నింపబడతాయి.

వీటిని చేయడం వల్ల ఏం జరుగుతుంది?

ఈ సాధనలవల్ల మనిషి జీవితం మొత్తం మారిపోతుంది. ఎంతో ఔన్నత్యాన్ని, దైవత్వాన్ని సంతరించుకుంటుంది. ఈ సాధనామార్గం ఎంతో గొప్పదైన తృప్తిని మీకు అందిస్తుంది. ఈ తృప్తి మీకు డబ్బు వల్ల రాదు, విలాసాల వల్ల, పదవుల వల్ల, ఇంకా మిగతా దేనివల్లా రాదు. మీ జీవితంలో మీరెంతో సాధించి ఉండవచ్చు. కానీ ఈ సాధనామార్గంలో నడవడం ద్వారా కలిగే తృప్తితో పోల్చుకుంటే, మీరు సాధించిన లౌకికవిజయాలు ఏ మూలకూ సరిపోవు.

చివరగా ఈ చిహ్నంలో మీరు 'ఓం'కారమును చూడవచ్చు. ప్రాణము, మనస్సులలో నిండిన దైవశక్తికి ఇది సూచిక. పరిమితదృష్టితో చూచినప్పుడు ఇది జీవాత్మ అవుతుంది. అపరిమితమైన దృష్టితో చూచినప్పుడు ఇదే ఓంకారము పరబ్రహ్మమౌతుంది. సగుణబ్రహ్మానికీ (రూపంతో ఉన్న దేవునికి), నిర్గుణబ్రహ్మానికీ (రూపం లేని దేవునికి) ఇదే సూచిక. రకరకాల మతాలు రకరకాల దేవుళ్ళ పేర్లతో పూజిస్తూ ఉన్నది దీనినే.

ఈ సాధనామార్గంలో నడవడం మనిషిని జీవన్ముక్తునిగా, సిద్ధునిగా చేస్తుంది. ఇది సనాతన భారతీయ సాధనా మార్గం. దీనికి వేదోపనిషత్తుల ఆధారమూ, ప్రామాణికతా  ఉన్నాయి. మంత్ర, తంత్ర శాస్త్రముల ఆధారం మా సాధనామార్గానికి ఉన్నది. ఇదే మానవజీవితానికి ఉన్న అసలైన గమ్యం. దీనిని అందుకోలేకపోతే, మీరెన్ని సాధించినప్పటికీ, చివరకు మీ జీవితం ఖచ్చితంగా వృధా అవుతుంది. అసంతృప్తితో ముగుస్తుంది.

మా పుస్తకాలపైనా, మా ఫేస్ బుక్ పేజీలోనూ, వెబ్ సైట్లలోనూ ఇదే చిహ్నాన్ని మీరు చూడబోతున్నారు. మా ఆశ్రమంలో ఎగురబోయే జెండా పైన కూడా ఇదే చిహ్నాన్ని మీరు త్వరలో చూస్తారు. పంచవటి సభ్యుల సాధనావిధానాన్ని, జీవనవిధానాన్ని ఈ చిహ్నం క్లుప్తంగా మీకు విశదపరుస్తుంది.

దీనిని అర్ధం చేసుకోవడం ద్వారా మా మార్గం మొత్తం మీకు సులభంగా అర్ధమౌతుంది.
read more " పంచవటి చిహ్నం "

5, జనవరి 2022, బుధవారం

న్యూస్ లో పంచవటి - 1

ప్రజలలోకి మరింతగా చొచ్చుకు పోయే కార్యక్రమంలో భాగంగా 'పంచవటి స్పిరిట్యువల్ ఫౌండేషన్' చురుకుగా అడుగులు వేస్తోంది. మా కార్యక్రమాలు ముమ్మరం అయ్యేకొద్దీ మీడియా ద్వారా మరింతగా ప్రజలకు చేరువ కావడం జరుగుతుంది. పంచవటి అందించే జ్ఞానసంపదను, ఆచరణాత్మక ఆధ్యాత్మిక విజ్ణానాన్నీ అందిపుచ్చుకునేవారికోసం సోషల్ మీడియాను కూడా బాగా ఉపయోగించడం జరుగుతుంది. ఈ దిశగా 'పంచవటి ఎగ్జిక్యుటివ్ బోర్డు కమిటీ' లో నిర్ణయాలను తీసుకోవడం జరిగింది.

దీనిలో భాగంగా ఈరోజు 'ఆంద్రప్రభ' దినపత్రికలో వచ్చిన ఈ న్యూస్ ఐటం ను చూడండి.

read more " న్యూస్ లో పంచవటి - 1 "

3, జనవరి 2022, సోమవారం

విజయవాడ బుక్ ఎగ్జిబిషన్ లో 'పంచవటి' పుస్తకాలు

విజయవాడ బుక్ ఎగ్జిబిషన్ లో 'పంచవటి' పుస్తకాలు లభిస్తున్నాయి. ఈ ఎగ్జిబిషన్ 1 వ తేదీ నుండి 11 వ తేదీ వరకు ఉంటుంది.

2022 వ సంవత్సరంలో 'పంచవటి స్పిరిట్యువల్ ఫౌండేషన్' వేస్తున్న అడుగులలో మొదటిది, బుక్ ఎగ్జిబిషన్ లో మా పుస్తకాలను ప్రదర్శించడం. ప్రస్తుతానికి స్టాల్ నంబర్ 103, 104 (భారతీయ గ్రంథమాల) లో మా పుస్తకాలు లభిస్తాయి. ఆసక్తి గలవారు ఈ అవకాశాన్ని వినియోగించుకుంటారని ఆశిస్తున్నాం.

బుక్ ఎగ్జిబిషన్ లో మా పుస్తకాల స్టాల్ కోసం చాలామంది మెయిల్స్ ఇస్తున్నారు. అందుకని ఈ ఏడాదికి తాత్కాలికమైన ఈ ఏర్పాటును చేస్తున్నాం. వచ్చే ఏడాదినుంచీ విజయవాడ, హైదరాబాద్ బుక్ ఎగ్జిబిషన్లలో ప్రత్యేకంగా మా స్టాల్ ను పెట్టడం జరుగుతుంది. 

గమనించండి !read more " విజయవాడ బుక్ ఎగ్జిబిషన్ లో 'పంచవటి' పుస్తకాలు "