29, జనవరి 2021, శుక్రవారం
మదనపల్లి మర్డర్స్ - లోకం నేర్చుకోవాల్సింది ఏమిటి?
26, జనవరి 2021, మంగళవారం
మదనపల్లి జంట హత్యలు - ఇదా హిందూధర్మం?
పౌర్ణమి ఛాయ !
ఆదివారం సాయంత్రం మదనపల్లిలో, ఎదిగిన తన ఇద్దరు కూతుళ్ళని, తల్లే హత్య చేసిందిట. తండ్రి చూస్తూ ఉన్నాట్ట. ఆ చంపడం కూడా ఒకమ్మాయిని శూలంతో పొడిచి, ఇంకొకమ్మాయిని డంబెల్ లో కొట్టి చంపేసిందట ఆ తల్లి.
ఆమెకి పిచ్చెక్కిందో? లేక దయ్యం పట్టిందో? అమ్మాయిలకు 27, 22 ఏళ్ళు. ఇద్దరూ బాగా చదువుకుంటున్నవాళ్ళే. తల్లిదండ్రులిద్దరూ ఉపాధ్యాయవృత్తిలో పిల్లలకు పాఠాలు చెబుతున్న వాళ్ళే. తండ్రయితే ఏకంగా ఉమెన్స్ కాలేజీ ప్రిన్సిపాల్ అట. ఇదేంటో మరి !
ఇంట్లో వాతావరణం చూస్తే క్షుద్రపూజలు చేస్తున్నట్లుగా ఉందని పోలీసులన్నారు. తల్లిదండ్రుల కొలీగ్సు, చుట్టుపక్కలవాళ్ళు మాత్రం ఈ కుటుంబం మంచిదని, గొడవలకు పోరని, చదువుకున్న వారని మంచిగానే చెబుతున్నారు. తల్లీ తండ్రీ ఎంతో బాలెన్స్ గా ఉంటారని, అందరికీ సలహాలిస్తారని కూడా చెబుతున్నారు.
అయితే, వీళ్ళకు మతపిచ్చి ఉందని కొంతమంది యూట్యూబ్ లో అంటున్నారు. వీళ్ళు షిరిడీ సాయిబాబా భక్తులట. తరచూ షిరిడీ వెళ్తారట. మెహర్ బాబా, ఓషో పుస్తకాలు చదువుతారట. జగ్గీ వాసుదేవ్ కి వీరభక్తులట. ఇదంతా కొలీగ్స్ చెబుతున్నారు.
అంతేకాదు, మూడ్రోజులుగా బయటి మనుషులెవరో వచ్చి రాత్రీపగళ్ళూ పూజలు చేస్తున్నారట. నగ్నపూజలు కూడా చేశారట. 'మా అమ్మాయిలను కదిలించకండి. వాళ్ళు రేపు బ్రతుకుతారు. ఈ రోజు రాత్రితో కలియుగం అయిపోతుంది. రేపట్నించీ సత్యయుగం వస్తుంది. అది రాగానే వాళ్ళు బ్రతుకుతారు. చంపమని మాకు దేవుడు చెప్పాడు' ఈ విధంగా పిచ్చిపిచ్చిగా ఆ తల్లీతండ్రీ మాట్లాడుతున్నారని పోలీసులు చెబుతున్నారు.
'మీరెందుకు మధ్యలో వచ్చి ప్రాసెస్ చెడగొట్టారు? మీరు మధ్యలో రాబట్టే మా కూతుళ్లు బ్రతకలేదు. ఈ ఒక్కరోజు శవాలని కదల్చకుండా అలాగే ఉంచండి. వాళ్ళు మళ్ళీ బ్రతుకుతారు' అని పద్మజ (తల్లి), పోలీసు అధికారులతో వాదిస్తున్న వీడియో చూస్తే ఏమనిపిస్తోంది? హిస్టీరియా పరాకాష్ట కనిపించడం లేదూ?
సరే, పోలీస్ విచారణ జరుగుతోంది గనుక, నిజానిజాలు బయటపడతాయని ఆశిద్దాం. ప్రస్తుతానికి మతకోణం ఏముందో కొంచం చూద్దాం.
సమాజంలో ఎక్కడచూచినా, దొంగజ్యోతిష్కులు, సిద్ధాంతులు, దొంగ స్వామీజీలు, దొంగ గురువులు సందుకొకడు, గొందికొకడు తయారయ్యారు. ఏదేదో చెప్పి అమాయకులను బురిడీ కొట్టిస్తున్నారు. విద్యావంతులై, ఉపాధ్యాయులైన వీళ్ళే ఇన్ని మూఢనమ్మకాలతో కూరుకుపోతే, ఇక పల్లెటూరి ప్రజలు ఎంత ఆటబొమ్మలైపోతారో ఆలోచించండి.
ఇది అసలైన హిందూమతం కాదు, కాదు, కాదు.
షిరిడీసాయి భక్తులలో స్వార్ధం పాళ్ళు చాలా ఎక్కువని, వాళ్ళు చాలా చవకబారుగా ఉంటారని, అహంకారులని, నేను పదేళ్లనుంచీ చెబుతున్నాను. నా చిన్నప్పటినుంచీ నేను గమనిస్తూ వస్తున్న నిజం ఇది. మొక్కులు మొక్కుకోవడం, కోరికలు కోరుకోవడం, తేరగా పనులు కావడం, అప్పనంగా వరాలు రావడమే వీరికి ప్రధానంగాని, అసలైన ఆధ్యాత్మికత వీరికి తెలియదు. సాయిబాబాను నేనేమీ అనడం లేదు. ఆయన్ను అలా తయారుచేసి కూచోబెట్టిన దొంగగురువులను దొంగభక్తులను అంటున్నాను.
వీళ్ళు మెహర్ బాబా ఆశ్రమానికి వెళ్ళొచ్చామని చెప్పుకోవడం సిగ్గుమాలిన పని. ఆయనది శుద్ధమైన ప్రేమతత్వం. ఆచారాలు, పూజలు వీటిని ఆయన ఒప్పుకోలేదు. శుద్ధమైన భగవత్ప్రేమకు ఆయన ప్రాధాన్యతనిచ్చాడు. సాటిమనిషిలో, జంతువులలో, పక్షులలో, అన్ని జీవులలో దైవాన్ని చూస్తూ వాటిని ప్రేమిస్తూ సేవచెయ్యమని ఆయన బోధించాడు. Mastery in Servitude అన్నది ఆయన సిద్ధాంతం. వీళ్ళు మెహర్ బాబా భక్తులా? ఆయన పేరును ఉఛ్చరించడానికి కూడా వీరికి అర్హత లేదు.
ఓషో పుస్తకాలను కూడా వీళ్ళు బాగా చదువుతారని కొందరంటున్నారు. ఓషోను అనుసరించేవారిలో నిజంగా ఆధ్యాత్మికంగా ఎదిగినవారిని ఒక్కరంటే ఒక్కరిని గత నలభై ఏళ్లలో నేను చూడలేదు. నా దృష్టిలో ఓషో ఒక కంప్లీట్ ఫెయిల్యూర్. ఆధ్యాత్మిక ప్రపంచానికి ఈయన వల్ల జరిగిన నష్టం ఇంతాఅంతా కాదు. ఈయన తానూ బాగుపడలేదు. తనను నమ్మినవారినీ ఉద్ధరించలేదు. రెంటికి చెడ్డ రేవడి అంటే ఈయనే.
ఇకపోతే మిగిలింది ఓషోకి కాపీక్యాట్ అయిన జగ్గీ వాసుదేవ్. లోకంలోని ప్రతి విషయంపైనా మంచి ఇంగిలీషులో లాజికల్గా మాట్లాడతాడని ఈయనకు పేరుంది. కానీ ఆయనైనా సరే, ఇలాంటి క్షుద్రపూజలను, హింసను ఒప్పుకుంటాడంటే నేను నమ్మలేను. ఆయనే కాదు, నిజమైన ఏ గురువూ ఇవి ఒప్పుకోడు. బోధించడు. ఇలాంటివి బోధిస్తే వాడసలు గురువే కాదు. కానీ ఈయన శిష్యులలో ఇలాంటి పోకడలు కొన్నున్నాయి. వాటిని నేను చూచాను.
మా మిత్రులలో ఈయన వీరశిష్యులు కొంతమందున్నారు. వారిలో ఒకరింటికి గతంలో నేను వెళ్లాను. ఆయన ఇచ్చిన 'లింగభైరవి' అనే ఒక విగ్రహాన్ని వాళ్ళింట్లో చూచాను. అదొక గ్రానైట్ బండలో చెక్కబడిన యంత్రం+విగ్రహం. చాలా బరువుంది. అప్పట్లోనే దాని వెల 5 లక్షలని చెప్పారు. లారీలో దానిని ఆయన ఛిష్యులే తెచ్చి వీళ్ళింట్లో దించి ప్రతిష్టించి వెళ్లారట. దానికి నన్ను నమస్కారం చెయ్యమన్నారు. నాకేమీ ఆ వైబ్రేషన్స్ రుచించలేదు. అందుకని నేను నమస్కారం చెయ్యలేదు.
'మీకు కుండలిని లేచిందా?' అని ఆ మిత్రుడు నన్నడిగాడు.
'లేచి మళ్ళీ పడుకుంది' అని సీరియస్ గా సమాధానం చెప్పాను.
'అదేంటి? మా గురువుగారు నెత్తిన చెయ్యి పెడితే కుండలిని వెంటనే లేస్తుంది. ఇక పడుకోదు' అని మిత్రుడన్నాడు.
'అలా అయితే చాలా కష్టం కదా ! మరి దానిని పడుకోబెట్టాలంటే ఏం చెయ్యాలి?' అనడిగాను.
'అందుకే 'లింగభైరవి' విగ్రహాన్ని మీ ఇంట్లో పెట్టుకుని పూజలు చేస్తుంటే లేచిన కుండలిని మళ్ళీ పడుకుంటుంది' అన్నాడు మిత్రుడు.
'నా దగ్గర అన్ని డబ్బుల్లేవు. 5 లక్షలిచ్చి గ్రానైట్ బండను కొనుక్కునేంత స్తోమత నాకొద్దు. అసలు దాన్ని లేపడం ఎందుకు? మళ్ళీ పడుకోబెట్టడం ఎందుకు?' అని నేనడిగాను.
'లేకపోతే మీకు మోక్షం రాదు కదా' అన్నాడు మిత్రుడు.
'ఏం రాకపోతే? అలా డబ్బులిచ్చి కొనుక్కునే మోక్షం నాకొద్దులే' అని నేను జవాబిచ్చాను. అసలైన ఆధ్యాత్మికత అంటే ఏమిటో చెప్పినా వినేటట్లు ఆ మిత్రుడు లేడు. ఏదో పూనకంలో ఉన్నట్లు మాట్లాడాడు. నేనూ వదిలేశాను.
ఆ ప్రహసనం అంతటితో ముగిసింది. ఇలాంటి పోకడలు ఈయన శిష్యులలో కొన్ని ఉన్నాయన్నది నిజమే.
అప్పుడు, జిల్లెళ్ళమూడి అమ్మగారి జీవితంలో జరిగిన ఒక సంఘటన నాకు గుర్తొచ్చింది.
ఒక బుద్ధిలేని పెద్దమనిషి అమ్మను ఇలా అడిగాడు.
'అమ్మా ! మీకు కుండలిని నిద్ర లేచిందా?'
దానికి అమ్మ చమత్కారంగా ఇలా అన్నారు.
'నీకు నిద్రలేస్తే ఈ ప్రశ్నను నువ్వడగవు'
ఆ ప్రబుద్ధుడికి అమ్మమాట అర్ధం కాలేదని వేరే చెప్పనవసరం లేదుకదా !
'నీకు యవ్వనం వచ్చిందా?' అని ఒకరిని అడగవలసిన అవసరముందా? మనకు కళ్ళు సరిగ్గా ఉంటే, మనకే కన్పిస్తుంది ఎదుటిమనిషికి యవ్వనం వచ్చిందో లేదో. అడుగుతున్నామంటే మనకు కళ్ళు కనపడటం లేదని అర్ధం. అలా ఉంటుంది వీళ్ళ గోల!
ఏదేమైనప్పటికీ మదనపల్లి సంఘటన చాలా బాధాకరం. ఇది పిచ్చి, మానసికరోగాలు, క్షుద్రపూజల ప్రభావమేనా? లేక ఇందులో ఆస్తి తగాదాలు, పరువుహత్య మొదలైన ఇతర కోణాలున్నాయేమో పోలీసులు తేలుస్తారు.
కానీ తల్లిని చూస్తే పిచ్చిదానిలాగే ఉన్నది. ఆమె తండ్రి కూడా ఈ మధ్యనే మానసికరోగంతో చనిపోయాడట. ఆమె మేనత్తకో ఎవరికో ఇదే మానసికపరిస్థితి ఉన్నదట. ఈమె ముఖమూ, వాగుడూ చూస్తే మెంటల్లీ రిటార్డెడ్ లాగా కనిపిస్తోంది. పిచ్చికి తోడు భక్తిపిచ్చి ముదిరిందన్నమాట.
మనం చాలామందిని చూస్తూ ఉంటాం. 'నాకు అమ్మవారు కనిపించారు. నాకు ఇలా జరుగుతుందని ముందే చెప్పారు. నాకు శివుడు కలలో దర్శనమిచ్చాడు. ఒళ్ళంతా బురదపూసుకుని మట్టిలో దొర్లమన్నాడు. నువ్విది చెయ్యి నీకు మంచి జరుగుతుంది. అది చెయ్యి నీకు పెళ్లవుతుంది. పిల్లలు పుడతారు' - ఇలాంటి సొల్లు చెప్పేవాళ్ళు చాలామంది మన సొసైటీలో ఉన్నారు. వీళ్లంతా సైకియాట్రీ వార్డుల్లో ఉండాల్సిన పిచ్చోళ్ళు, హిస్టీరియా పేషంట్లు. ఈ పోకడ పిచ్చిలో మొదటిస్టేజి. ముందుముందు ఇలాంటివాళ్లకు ఖచ్చితంగా పిచ్చెక్కుతుంది.
చాలామంది నాలుగు పుస్తకాలు చదివేసి అదే ఆధ్యాత్మికం అనుకుంటారు. అదొక పిచ్చి భ్రమ. పుస్తకాలు చదివితే ఆధ్యాత్మికం రాదు. పూజలు చేస్తే రాదు. అదొక దారి. ఆ దారిలో త్రికరణశుద్ధిగా నడవాలి. ఆ పనిని నూటికో కోటికో ఒకరు మాత్రమే చేయగలుగుతారు. మిగతా అందరూ పుస్తకాలు చదువుతూ, పూజలు చేసుకుంటూ, ఎవరెవరో గురువులను ఫాలో అవుతూ, ఎదుటివారికి మాటలు చెబుతూ, అదే ఆధ్యాత్మికమన్న భ్రమల్లో కూరుకుపోయి ఉంటారు. అది సత్యమైన ఆధ్యాత్మికమార్గం కాదు.
సామాన్యంగా, అమాయకులు, పిచ్చివాళ్ళు, మంచివాళ్ళు మాత్రమే ఆధ్యాత్మికంలోకి అడుగుపెడతారు. మోసగాళ్లు, దుర్మార్గులు ఇందులోకి రాలేరు. వచ్చినా ఎక్కువరోజులు ఉండలేరు. పై కేటగిరీ లో, పిచ్చివాళ్లను నార్మల్ మనుషులుగా మార్చవలసిన పని ఆ గురువుకు ఉంటుంది. ఆ గురువే మోసగాడైతే, వీళ్ళను పట్టించుకోడు. ఆ కుహనా ఆధ్యాత్మిక పిచ్చిలో పడి ఈ పిచ్చివాళ్ళు మరీ పిచ్చివాళ్లవుతారు. అప్పుడు వాళ్ళేం చేస్తున్నారో వాళ్ళకే తెలీకుండా పోతుంది. అదే ఈమె కేసులో, ఈమె కుటుంబం కేసులో జరిగింది.
ఒకమనిషి ఎప్పుడూకూడా తలుపులేసుకుని రోజుల తరబడి ఒంటరిగా ఉండకూడదు. మనుషులలో కలుస్తూ తిరుగుతూ ఉండాలి. హెల్తీ కంపెనీ ఉండాలి. లేకపోతే ఇలాగే పిచ్చి ముదురుతుంది. చాలామంది డిప్రెషన్లో పడి, ఆత్మహత్య కూడా చేసుకుంటారు. ధ్యానశక్తి ఉన్న యోగులు మాత్రమే నెలలతరబడి ఒంటరిగా ఉన్నప్పటికీ శారీరక, మానసిక సమతుల్యతతో ఆరోగ్యంగా ఉండగలుగుతారు. మామూలు మనుషులు అలా ఉండలేరు. వాళ్లకు పిచ్చెక్కుతుంది. కరోనా వచ్చి ఇదే విధంగా చాలామందిని పిచ్చోళ్లను చేసిందన్నది నిజం. లాక్ డౌన్ ఎఫెక్ట్ కూడా ఇందులో ఉంది.
మంగోలిజం, OCD, ADHD, Autism మొదలైన రోగాలు జన్యువులలో పిల్లలకు కూడా వస్తాయి. పుట్టుకతోనే అందరికీ రాకపోవచ్చు. కొన్నాళ్ళు పోయాక, సరియైన పరిస్థితులు వచ్చినపుడు అవి బయటపడతాయి. అదే విధంగా ఈమె కూతుళ్ళకు కూడా మానసికపరిస్థితి సరిగ్గా లేదు. ఉంటె, అలాంటి అనవసరమైన భయాలు, పిచ్చి నమ్మకాలు, వాళ్లలో ఎందుకుంటాయి?
భక్తి వేరు. అక్కల్ట్ వేరు. లిమిట్ లో ఉన్నంతవరకూ భక్తి మంచిదే. లిమిట్ దాటితే భక్తికూడా మంచిది కాదు. కానీ అక్కల్ట్ మొదలుకే మంచిది కాదు. అక్కల్ట్ చాలావరకూ మోసమే. ఒకవేళ మోసం కాకపోయినా అది ప్రమాదకరమైన లోకం. రహస్యపూజలు, దయ్యాలు, భూతాలూ, ఆత్మలు, మంత్రతంత్రాలు, దేవతలు, శక్తులు, ఇలాంటివాటి జోలికి పోవడం అస్సలు మంచిది కాదు. దాని ఫలితాలు ఇలాగే ఉంటాయి.
సరే ఆ తల్లిదండ్రులకు బుద్ధి లేదు. వాళ్ళు అలా చంపుతుంటే, ఎదిగిన ఆ కూతుళ్లు ఎలా చంపించుకున్నారో? ఎదురు తిరిగి వాళ్లనే ఏదైనా చేసి ఉన్నా సెల్ఫ్ డిఫెన్స్ పరంగా తప్పుండేది కాదు. కానీ ఎదురు తిరగలేదంటే, వాళ్ళూ ఈ రిచువల్ లో పాత్రధారులే అన్నది అర్థమౌతోంది. అదే రోజున ఇంస్టాగ్రామ్ లో అలేఖ్య అనే పెద్దకూతురు (చనిపోయినవారిలో ఒకమ్మాయి), "Shiva will come, Work is done" అని మెసేజి పెట్టింది. జగ్గీ వాసుదేవ్ ది "శివా కల్ట్" అన్నది అందరికీ తెలుసు. 'ఆదియోగి శివా' అంటూ కోయంబత్తూరు కొండల్లో ఆయన పెద్ద విగ్రహమే పెట్టాడు. బహుశా జగ్గీ కల్ట్ లోనే ఈ మూఢనమ్మకాల బురదను వీళ్ళు అంటించుకుని ఉండవచ్చు. అవకాశాలు బలంగా ఉన్నాయి.
'అయామ్ శివా ! కరోనాను నేనే నానుంచి పుట్టించి లోకాన్ని నాశనం చెయ్యమని వదిలాను. నాకే టెస్టు అవసరం లేదు' అంటూ అరుస్తున్న ఆ తల్లిని చూస్తుంటే, పిచ్చి స్పష్టంగా కనిపిస్తోంది.
షిరిడీసాయిబాబా భక్తులు క్షుద్రపూజల జోలికి పోరు. వారు బాబాను అంతగా నమ్ముతారు. ఇక మెహర్ బాబా తత్త్వం అణుమాత్రం అర్థమైనా వీళ్ళిలాంటి పనులు చెయ్యరు. ఓషో పిచ్చి బాగా తలకెక్కి పెడగా తయారయ్యారు. ఇకపోతే మిగిలింది జగ్గీ. ఆయన ఆశ్రమంలో ఇలాంటి అక్కల్ట్ పోకడలు కొన్ని ఉన్నాయి గనుక అనుమానం అటే చూపిస్తోంది. లేదా లోకల్ మంత్రగాళ్ళు ఎవరైనా వచ్చి వీళ్లచేత ఇలాంటి పూజలు చేయించి ఉండవచ్చు. అదే నిజమైతే, షిరిడీసాయిబాబాను వీళ్ళు సరిగ్గా నమ్మలేదన్నది చక్కగా రుజువౌతుంది. వీళ్ళింటికి పెద్దపెద్ద అక్షరాలతో 'షిరిడీసాయి నిలయం' అని బోర్డు పెట్టించుకుని, ఇంట్లోనేమో మంత్రగాళ్ళని పిలిచి క్షుద్రపూజలేమిటో మరి? బాబా ఉన్నపుడు మంత్రగాళ్ళెందుకు?
చిత్తూరు జిల్లాలో కమ్మవారిని నాయుళ్లంటారు. అక్కడ, వారు చాలా బలమైన రాజకీయ వర్గమన్నది అందరికీ తెలిసిన విషయమే. పైగా వీరు చాలా ధనవంతులు. జగ్గీకి రాజకీయ అండదండలు పుష్కలంగా ఉన్నాయి. కులమూ, ధనమూ, రాజకీయబలమూ అన్నీ ఉన్నపుడు 'మేమే ఈ హత్యలు చేశామ్' అంటూ కోర్టులో ఎలుగెత్తి అరిచినా కూడా, వీళ్లకు ఎలాంటి శిక్షా పడదని గట్టిగా చెప్పవచ్చు.
వీళ్లకు శిక్ష పడితే న్యాయం గెలుస్తుంది. అయినా ఉపయోగం ఏమీ లేదు. జరగాల్సిన అన్యాయం ఇప్పటికే జరిగిపోయింది. ఒకవేళ మానసికకారణాలతో వీరికి శిక్ష పడకపోతే, ఆ భక్తి మత్తులోనుంచి బయటకు వచ్చాక, మిగతా జీవితం నరకమౌతుంది. ఎలాచూసినా వీళ్ళ జీవితాలు ఆల్రెడీ సర్వనాశనం అయిపోయాయి.
95% సోకాల్డ్ ఆధ్యాత్మికులకు కావలసింది సైకియాట్రీ ట్రీట్మెంట్ మాత్రమే. వీరిలో ఒక్క 5% మాత్రమే నిజమైన సాధకులు, జిజ్ఞాసువులు ఉంటారు. మిగతావాళ్లందరూ ఏదో ఒక రకంగా మానసిక రోగులన్నది నిజం !
శ్రీరామకృష్ణులు,వివేకానందస్వామి, రమణమహర్షి, జిల్లెళ్ళమూడి అమ్మగారు మొదలైన శుద్ధమైన మహాత్ములను వదలిపెట్టి, పూజారులు, జ్యోతిష్కులు, దొంగగురువులు, వాస్తుసిద్ధాంతులు, మంత్రగాళ్ళు, ఇలాంటివాళ్ళ మాయలో పడితే ఇలాగే జరుగుతుంది మరి !
ఇలాంటి పిచ్చివాళ్లకు సరియైన దారిని చూపాల్సిన అవసరం ఉందా లేదా? వీరి వెనుక ఉండి, వీరిచేత ఈ పనిని చేయించిన వాళ్ళను, ప్రోత్సహించిన వాళ్ళను గాలికి వదిలెయ్యడం సరియైన పనేనా? వీరికి శిక్ష పడుతుంది సరే, వీరిని తప్పుదారి పట్టించిన గురువులకు ఏ శిక్ష పడాలో?
ఇదా హిందూధర్మం?
24, జనవరి 2021, ఆదివారం
Master CVV జాతక విశ్లేషణ - 5 (భౌతిక నిత్యత్వం ఎలా రావచ్చు?)
రామలింగయోగి ఏమయ్యేడో మనకు తెలియదు కానీ ఆ తరువాత, సీవీవీగారు, అరవిందులు చాలాకాలం జీవించి ఉన్నారు. వీరిద్దరూ భౌతిక అమరత్వాన్ని సాధించాలని ప్రయత్నించారు. కానీ మధ్యలోనే ఈ లోకంనుంచి నిష్క్రమించారు. అంతవరకే నిజం. ఆ తర్వాత వారి అనుయాయులు చెబుతున్నది నిజం కాకపోవచ్చు. ఎందుకంటే అవి వారి ఊహలు మాత్రమే. నిజానిజాలు ఎవరికీ తెలియవు.
భౌతిక అమరత్వాన్ని సాధించే పనిలో వీరిద్దరూ ఎక్కడో విఫలులయ్యారు. అదేమీ అనుకున్నంత తేలికైన పనేమీ కాదు. దీనిలో ఒక్క జన్మలోనే విజయాన్ని సాధించడం ఎవరివల్లా కాదు. అదే వీరికీ జరిగింది. అయితే, భక్తిపిచ్చి బాగా తలకెక్కిన వీరి భక్తులు మాత్రం, ఏవేవో నమ్మకాలతో మునిగితేలుతూ సత్యానికి దూరంగా పోతున్నారు.
సీవీవీగారు సూక్ష్మశరీరంలో హిమాలయాలలో ఉన్నారని, ఇప్పుడు చనిపోతున్న ఆయన భక్తులందరూ అక్కడకు చేరుకొని అక్కడ కొన్నాళ్ళు రెస్ట్ తీసుకుని, ఆయన పుట్టేటప్పుడు వీళ్ళుకూడా ఆయనతో బాటుగా మళ్ళీ అవే ఆకారాలతో, అవే శరీరాలతో పుడతారని వీరు నమ్ముతున్నారు. క్రీస్తు మళ్ళీ వస్తాడని రెండువేల ఏళ్లుగా ఎదురుచూస్తున్న క్రైస్తవుల భ్రమలాంటిదే ఇదికూడా. అది జరిగేపని కాదు.
అదేవిధంగా, సూక్ష్మలోకాలలో అరవిందులు వేచిఉన్నారని భూమి సిద్ధమైనప్పుడు అతిమానసదేహంతో ఆయన భూమిపైన అవతరిస్తారని నమ్ముతున్నారు ఆయన భక్తులు. ఇదికూడా పైన చెప్పిన నమ్మకం లాంటి ఉత్తనమ్మకమేగాని ఇందులో నిజమెంతో ఎవరూ చెప్పలేరు.
వీరిద్దరూ భౌతికఅమరత్వసాధన చేసినది నిజమే. అర్ధాంతరంగా పోయినది నిజమే. అంతవరకే నిజం. ఆ తరువాతది అంతా ఊహా, నమ్మకమూ మాత్రమే.
మరి భౌతికఅమరత్వం ఎప్పటికీ రాదా? అంటే వస్తుందనే నేనంటాను. ఎప్పుడొస్తుంది ఎలా వస్తుంది అనేవి చూద్దాం.
వస్తే గిస్తే ఇది సైన్స్ ద్వారానే రావాలిగాని ఆధ్యాత్మికంగా చూస్తే మాత్రం, రాబోయే 10,000 ఏళ్లలో సాధ్యం కాదని నా విశ్వాసం. ఎలాగో చెప్తా వినండి.
ఈజిప్టు లోనూ చైనా లోను మానవజాతి చరిత్రను క్రీ పూ 8000 ఏళ్ల నుంచీ రికార్డ్ చేసి ఉంచారు. అంటే పదివేల ఏళ్ల చరిత్ర మనకు లభ్యమౌతున్నది. ఇన్నేళ్ల నాగరికత తర్వాత ఇప్పుడు మనమున్న స్థితిలో ఉన్నాం. ఇంకో పదివేల ఏళ్లకు ఇంకా ఎంతో ప్రగతి సాధించవచ్చు. సైన్స్ బాగా ఎక్కువైపోయి అట్లాంటిస్ ద్వీపం లాగా సర్వనాశనం కావచ్చు. మళ్ళీ అడవిమనుషుల స్టేజి నుంచి చరిత్ర మొదలు కావచ్చు. ఈ విధంగా గతంలో చాలాసార్లు జరిగింది. అంతేగాని, భౌతికంగా అమరత్వం మాత్రం అంత తొందరగా వచ్చేపని కాదు.
కొన్నివందల ఏళ్ళక్రితం దూరశ్రవణం దూరదర్శనం అనేవి యోగసిద్ధులకు మాత్రమే ఉండే శక్తులు. ఇప్పుడో, డబ్బులున్న ప్రతివాడికీ ఆ శక్తులున్నాయి. అంతర్జాతీయ ఆడియోకాల్సేమో దూరశ్రవణం. వీడియోకాల్సేమో దూరదర్శనం. విమానప్రయాణమేమో ఆకాశయానం. ఇంకొన్నాళ్ళు పోతే సూక్ష్మదేహంతో దూరప్రయాణం కూడా వస్తుంది. అంటే ఇక్కడ మాయమై అక్కడ ప్రత్యక్షం కావడం. కాకపోతే, సైన్స్ పరంగా వచ్చే దూరప్రయాణం (టెలి పోర్టేషన్) లో ఇక్కడ మాయం కావడం ఉండదు. ఇక్కడే ఉంటూ ఎక్కడ కావాలంటే అక్కడ 3-D హోలోగ్రాం లాగా ప్రత్యక్షమై మాట్లాడే టెక్నాలజీ త్వరలోనే వస్తుంది. ఇది ఎంతోదూరంలో లేదు.
1900 ప్రాంతంలో మనిషి సగటు ఆయుష్షు 35-40 మధ్యలో ఉండేది. చాలామంది యవ్వనాన్ని చూడకుండానే కన్నుమూస్తుండేవారు. దానికి ముఖ్యమైన కారణాలు - సరియైన మందులు లేకపోవడం, యూరప్ నుంచి మిడిల్ ఈస్ట్ నుంచి అనేక రోగాలు మనకు సరఫరా కావడం. 1950 ప్రాంతానికి 50-60 మధ్యలో ఉన్న మనిషియొక్క సగటు ఆయుప్రమాణం 2000 నాటికి 70-75 మధ్యకు పెరిగింది. ఇప్పుడు 80-85 వరకూ చాలామంది జీవిస్తున్నారు. ఇదే విధంగా పోతే 2050 నాటికి మనిషి హాయిగా 100 ఏళ్ళు బ్రతుకుతాడు. ఆఫ్కోర్స్ రోగాలుంటాయి, మందులూ ఉంటాయి. మందులు మింగుతూ బ్రతుకుతూ ఉంటాడు.
జీవరసాయన శాస్త్రంలో, వైద్యశాస్త్రంలో నేడు జరుగుతున్న పరిశోధనలు మీలో చాలామందికి తెలియవు. అవేంటో వింటే మీరు ఆశ్చర్యపోతారు.
హ్యూమన్ సెల్ లెవల్ లో బ్రహ్మాండమైన రీసెర్చి నేడు జరుగుతోంది. హ్యూమన్ సెల్ అనేది కాలంతో అసలెందుకు బలహీనమౌతుంది? ఆయుష్షును నియంత్రించే జీన్ ఏమిటి? వయసుతో బాటు సెల్ అనేది ఎందుకు క్షీణిస్తుంది? సెల్ క్షీణించకుండా, బలహీనపడకుండా, మరణించకుండా ఆపడం ఎలా? జీన్ కోడ్ ను ఎలా మార్చాలి? మొదలైన రంగాలలో సామాన్యుడు ఊహించలేని రీసెర్చి రహస్యంగా జరుగుతోంది. దీనిమీద కోట్లాది డాలర్ల పెట్టుబడి పెట్టబడింది. ఈ రీసెర్చి గనుక సక్సెస్ అయితే, హ్యూమన్ సెల్ జీవితకాలాన్ని ఎంతవరకైనా పొడిగిస్తూ పోవచ్చు.. సెల్ ఫోన్ బ్యాటరీ అయిపోతే మళ్ళీ రీఛార్జ్ చేసుకున్నట్లు, సిం కార్డు బాలెన్స్ అయిపోతే మళ్ళీ వేసుకున్నట్లు, హ్యూమన్ సెల్ లెవల్లో రీఛార్జ్ చేసుకునే టెక్నాలజీ ఎంతో దూరంలో లేదు. కనీసం ఇంకో మూడొందల ఏళ్లలో ఇది అందుబాటులోకి రావచ్చు. అదే విధంగా ఆర్టిఫీషియల్ ఆర్గాన్ ఉత్పత్తి, ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ మొదలైన రంగాలలో మనం ఊహించలేనంత రీసెర్చి జరుగుతోంది.
కొన్నాళ్ళు పోయాక పెట్రోల్ బంకుల్లాగా, రీఛార్జ్ షాపులలాగా, ఆయుష్షు రీచార్జి సెంటర్స్ రావచ్చు. ఒకడి ఆయుస్సు అయిపోతుంటే, సిగ్నల్ వస్తుంది. వెంటనే షాపుకెళ్లి, తనదగ్గరున్న డబ్బులని బట్టి పదేళ్ళో ఇరవై ఏళ్ళో ఆయుష్షు రీచార్జి చేసుకొవచ్చు.
ఏం నమ్మడానికి కష్టంగా ఉందా?
నేడు మనం వాడుతున్న టెక్నాలజీ ఒక నూరేళ్లక్రితం ఊహించడానికి కూడా అసాధ్యమే. అలా ఊహించి పుస్తకాలు వ్రాసినవారిని సైన్స్ ఫిక్షన్ రచయితలన్నారు. ఇప్పుడవన్నీ నిజాలవుతున్నాయి. నేడు మనం మొబైల్ ఫోన్ తో చేస్తున్న అద్భుతాలు, యాప్స్ తో జరుగుతున్న పనులు, ఒక రెండొందల ఏళ్ల క్రితం ఎవరైనా వ్రాసి ఉన్నట్లయితే వాడిని సైతాన్ భక్తుడని ముద్రవేసి సజీవదహనం చేసి ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడవన్నీ మనం చేస్తున్నాం. అలాగే నేను వ్రాసిన 'సెల్ లెవల్ రీచార్జ్' అనేది కూడా భవిష్యత్తులో నిజం అవుతుంది. అప్పుడు మనిషి ఎన్నాళ్లు కావాలంటే అన్నాళ్ళు ఇదే దేహంతో బ్రతుకుతాడు. సైన్స్ మాత్రమే దీనిని సామాజికంగా సామూహికంగా సుసాధ్యం చేస్తుందిగాని ఏ యోగమూ చెయ్యలేదు.
యోగమనేది వ్యక్తిగతం. మహా అయితే ఒక గ్రూపు వరకూ పరిమితం. గతంలో వచ్చిన ఏ మహాపురుషుడైనా తాను పొందినదానిని ఒక పదిమంది వరకూ పంచగలిగాడు. అంతే ! మిగతావాళ్ళు ఆయనపోయిన తర్వాత ఆయన ఫోటో పెట్టుకుని వ్యాపారాలు చేసుకుంటున్నారు. అంతేగాని, మందికందరికీ తాను పొందిన సిద్ధిని ఏ మహాత్ముడూ పంచలేకపోయాడు. అదసలు జరిగే పని కాదు.
కనుక యోగంద్వారా భౌతిక అమరత్వం రావాలంటే చాలా కష్టం. ఇంకో పదివేల ఏళ్లకు కూడా ఇది సాధ్యం కాకపోవచ్చు.. కానీ సైన్స్ ద్వారా ఇంకో 500 ఏళ్లలో ఇది సాధ్యం అవుతుంది.
నేను ఊహించి చెప్పడం లేదు. ప్రాక్టికల్ గా జరుగుతున్న విషయాలు చెబుతున్నా. వినండి !
మొన్నీ మధ్యన నా అమెరికా శిష్యుడొకాయన ఇంటర్నేషనల్ టెక్నాలజీ కాన్ఫరెన్స్ ఒకదానికి ఆహ్వానితునిగా వెళ్ళాడు. అందులో దాదాపు 1200 MNC లు వివిధరంగాలలో తాము చేస్తున్న రీసెర్చిని ఒకరితో ఒకరు పంచుకున్నాయి. అందులో కొన్నింటి గురించి చెబుతాను. నోరెళ్లబెట్టకండి !
మనకు వచ్ఛే అనారోగ్యాలన్నీ మనం ఊపిరిని పీల్చే విధానాన్ని బట్టి వస్తాయనేది ఒక నమ్మలేని నిజం. ప్రపంచ జనాభాలోని 750 కోట్లమంది 750 కోట్ల విధాలుగా ఊపిరిపీల్చి వదులుతూ ఉంటారు. ఫింగర్ ప్రింట్స్ లాగా ఇందులోకూడా ఎవరి ప్రత్యేకత వారిదే. కనుక ఎవరి రోగం వాడిదే. ఎవరి ఆయుష్షు వాడిదే. ఈ రహస్యాన్ని వేలాది ఏళ్ళనాడే గ్రహించిన యోగులు ప్రాణాయామవిద్యను కనిపెట్టి, దానిలో రీసెర్చి చేసి, కోడిఫై చేసి, మనకు బోధించారు. కానీ దీనిని అందరూ చెయ్యలేరు. సరియైన గురువులు దొరకరు. దొరికినా మన బద్ధకం మనల్ని వదలదు. సాధనను స్థిరంగా సక్రమంగా చేయనివ్వదు. కనుక ప్రాణాయామమనేది కొన్ని వేల ఏళ్లుగా మనకు తెలిసినా , నేటికీ దానిని శ్రద్ధగా చేస్తున్నది 0.05 శాతం మనుషులు మాత్రమే. కనుక కష్టపడటం, సుఖాలను వదులుకోవడం, సాధన చెయ్యడం, ఎవరికీ ఇష్టం ఉండదు. కడుపులో చల్లకదలకుండా ఎవడైనా మనబదులు ఆ సాధనలో గట్రాలో చేసి ఫలితం మనకు ధారపోస్తే అప్పుడు తీసుకుంటాం ! ఈలోపల వాడి ధార ఆగిపోతుందనుకోండి. అది వేరే విషయం ! అయినా మనకనవసరం ! మనకోసం ఆహుతి కావడానికి కాకపోతే వాడసలు గురువని బోర్డు పెట్టుకున్నది ఎందుకంటా?
ఇప్పుడొక MNC, ఒక యాప్ ను తయారుచేస్తోంది. దానికి మనం కనెక్ట్ అయితే, మనం ఊపిరిని సరిగ్గా పీల్చి వదులుతున్నామా లేదా అది అనుక్షణం కనిపెట్టి చూస్తూ మనకు సలహాలిస్తూ, మన శ్వాసను మానిటర్ చేస్తూ ఉంటుంది. సరిగ్గా పీల్చకపోతే గదుముతుంది. సరిగా వదలకపోతే హెచ్చరిస్తుంది. ఆ విధంగా మనచేత ప్రాణాయామం చేయించి మన ఆరోగ్యాన్ని మంచి కండిషన్ లో ఉంచుతుంది. మరి ఆ యాప్ కొనుక్కోవాలన్నా, కనెక్ట్ అవ్వాలన్నా డబ్బులు వదుల్తాయి. ఒక్కసారిగా కాదు. జీవితాంతం నెలకింతని ఆ కంపెనీకి మనం డబ్బులు కడుతూ ఉండాలి. నో ఫ్రీ సర్వీస్ ప్లీజ్ !
ఆశ్చర్యపోతున్నారా ! అంత పోకండి ! దీని బాబులాంటిది ఇంకోటుంది దానిసంగతి వినండి !
ఇంకో MNC ఇంకో దిమ్మతిరిగిపోయే రీసెర్చి చేస్తోంది. అది సెంట్రల్ నెర్వస్ సిస్టం, బ్రెయిన్ల గురించి. మన అనుభూతులన్నింటినీ ఈ రెండే నియంత్రిస్తాయన్నది ఏ సైన్స్ స్టూడెంట్ కైనా తెలుస్తుంది. మనకు కోపమొచ్చినా, తాపమొచ్చినా, కామక్రోధాది ఆరింటిలో ఏదొచ్చినా మన బ్రెయిన్ వేవ్స్ మారిపోతాయి. ఒక్కొక్క ఆలోచనా, ఒక్కొక్క ఎమోషనూ ఒక్కొక్క విధమైన బ్రెయిన్ వేవ్ ను సృష్టిస్తాయి. ఏ ఎమోషన్ కలిగినప్పుడు బ్రెయిన్ ఏ తరంగాలను వెదజల్లుతోందో వీళ్ళు ముందుగా రికార్డ్ చేశారు. దీనికోసం కొన్నివేలమందిమీద పిల్లలు, పెద్దలు, ఆడా, మగా ఇలా రకరకాల గ్రూపులమీద రీసెర్చి చేసి ఇదంతా రికార్డ్ చేసేశారు. ఇప్పుడు బ్రెయిన్ కి సెన్సార్లు అమర్చి, అవే బ్రెయిన్ సెంటర్స్ ని కృత్రిమంగా మైల్డ్ ఎలక్ట్రిక్ సప్లైద్వారా యాక్టివేట్ చేస్తే, అవే అనుభూతులు ఆ మనిషికి కలుగుతాయి.
ఏ అనుభూతిని కావాలంటే ఆ అనుభూతిని అనుకున్న క్షణంలో పొందటం ధ్యానికి సాధ్యమౌతుందని ధమ్మపదంలో బుద్ధుడన్నాడు. అంటే, తన ఎదురుగా ఒక వస్తువుగాని మనిషిగాని లేకపోయినా, అవి బ్రెయిన్లో ఏయే సెంటర్స్ ని కదిలిస్తాయో, వాటిని ధ్యానియైనవాడు తన ధ్యానశక్తితో కదిలిస్తాడు. అప్పుడా అనుభూతులను తన లోలోపల ధ్యానంలో పొందుతాడు. ఇది యోగులకు తెలిసిన విద్యే. అంటే, అనుభూతులపరంగా రివర్స్ ఇంజనీరింగ్ అన్నమాట ! సైన్స్ పరంగా ఇది త్వరలో సక్సెస్ అవబోతోంది. అప్పుడేమౌతుందో తెలుసా ?
ఒకసారి ఈ టెక్నాలజీ అందుబాటులోకి వస్తే మానవజీవితం మొత్తం తారుమారై పోతుంది. వెధవ మొబైల్ ఫోన్ వచ్చి మన జీవితాల్ని ఎంత సుఖంగా, ఎంత దరిద్రంగా మార్చిందో మనం చూస్తున్నాము. ఇక, నేను చెబుతున్న టెక్నాలజీ అందరికీ అందుబాటులోకి వస్తే ఏమౌతుందో చెబుతా వినండి !
ఆకర్షణలు, డేటింగ్ లు, ప్రేమలు, పెళ్లిళ్లు, సహజీవనాలు ఇవన్నీ ఒక్కసారిగా మాయమైపోతాయి. అమ్మాయికి అబ్బాయీ అవసరం లేదు. అబ్బాయికి అమ్మాయీ అవసరం లేదు. ఎవరికివారు యాప్ కి కనెక్ట్ అయిపోవడం, సెన్సార్లున్న హెడ్ ఫోన్స్ తగిలించుకోవడం, రిమోట్ చేతులో పట్టుకుని దుప్పటి ముసుగేసుకుంటే చాలు. పార్ట్ నర్ తో సంబంధం లేకుండా ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు ఆర్గాజం పొందవచ్చు.. అంతా రిమోట్ చేస్తుంది. ఇక ఒకరితో ఒకరికి పనేముంటుంది? ఎవరి ముఖం ఎవరు చూస్తారు?
అలకలు, తృప్తి లేదంటూ విసుక్కోడాలు, చాలలేదని విడాకులు కోరడాలు, ఎక్స్ట్రా మ్యారిటల్ ఎఫైర్లు, స్పెషలిస్టుల చుట్టూ తిరగటాలు, ఇవేవీ ఉండవు.
బ్యూటీ ప్రాడక్ట్స్ అన్నీ మూతపడతాయి. జిమ్ములు మూతపడతాయి. యాఫ్రో డీసియాక్ ఇండస్ట్రీ మొత్తం కుప్పకూలుతుంది. ఎవరూ యోగా చేయనవసరం లేదు. ఎవరెలా ఉన్నా ఎవరికీ అవసరం ఉండదు. ఎవరి ముఖమూ ఎవరూ చూడరు. లవ్వులూ కొవ్వులూ అన్నీ మాయమౌతాయి. అసలు పెళ్లే అవసరం లేదు. యాప్ ఉంటె చాలు. దానితో కనెక్ట్ అయితే చాలు. కావలసినన్ని డబ్బులుంటే చాలు.
'పిల్లలకోసమైనా పెళ్లి కావాలికదా' అంటారేమో? అసలు పిల్లలెందుకు? వాళ్ళని పెంచడం,చదివించడం,పెళ్లిళ్లు చెయ్యడం, వాళ్ళ తిట్లూ చీదరింపులూ భరించడం, చివర్లో ఏడుస్తూ ఓల్డేజి హోములో చేరడం, ఆ గోలలూ గొడవలూ ఎందుకిదంతా? అసలు పెళ్ళెందుకు? 'సోలో లైఫే సో బెటర్' అనే ఫిలాసఫీ ఇప్పటికే మనమధ్యకు వచ్చేసింది. ఈ మాట ఇప్పటికే కొన్ని వేలమంది అంటున్నారు. మొన్నీ మధ్యన ఒక రీసెర్చిలో ఏమ్ తేల్చారంటే, 'మాకసలు పెళ్ళొద్దు' అనే అమ్మాయిలూ అబ్బాయిలూ ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా లక్షలలో ఉన్నారట ! ఇలాంటి యాప్స్ వచ్చేస్తే ఇక సొసైటీ ఏమౌతుందో ఆలోచించండి ! ఇప్పటివరకూ మనిషికి తెలిసిన వ్యసనాలైన త్రాగుడు, డ్రగ్స్ మొదలైనవి దీనిముందు ఎందుకూ పనికిరావు. అదంత వ్యసనమై కూచుంటుంది. ఆ యాప్ కోసం మనిషి ఏం చెయ్యమన్నా చెయ్యడానికి సిద్ధమౌతాడు.
ఏంటండీ ఏదో ఆధ్యాత్మికం చెబుతారనుకుంటే ఇంకేదో చెబుతున్నారు? ఏంటీ బూతుపురాణం? అంటారేమో, కాస్తాగండి. వినండి !
ఇదే రీసెర్చిని ఇంకొంచం ముందుకు తీసుకెళ్తే ఏం జరుగుతుందో చెప్తా వినండి.
ధ్యానంలో, సమాధిస్థితులలో ఉన్నపుడు బ్రెయిన్ వేవ్స్ ఎలా ఉంటాయో మ్యాపింగ్ చెయ్యడం ఇప్పటికే అయిపొయింది. ధ్యానసమాధి స్థితులలో ఒక యోగి ఉన్నపుడు అతని బ్రెయిన్ వేవ్స్, ఆల్ఫా, బీటా, తీటా, డెల్టా, గామా స్పెక్ట్రంలో ఎంతెంత ఫ్రీక్వెన్సీ లో ఉంటాయో రికార్డ్ చెయ్యడం ఇప్పటికే అయిపొయింది. ఆయా సమాధిస్థితులలో బ్రెయిన్ లోని ఏయే కేంద్రాలు యాక్టివేట్ అవుతున్నాయో రికార్డ్ చేసి పెట్టడం ఇప్పటికే జరిగిపోయింది. ఆర్టిఫీషియల్ స్టిములేషన్ ద్వారా, అవే బ్రెయిన్ సెంటర్స్ ను యాక్టివేట్ చేస్తే, అవే తరంగాలను పుట్టించేలా బ్రెయిన్ ను ఆజ్ఞాపిస్తే, ఆయా సమాధిస్థితులు ఎవరికైనా వస్తాయి. ఎప్పుడు కావాలంటే అప్పుడొస్తాయి. కాకపోతే, చేతుల్లో కావలసినంత డబ్బులుంటే చాలు.
అంటే సైన్స్ దెబ్బకు సాధనంతా అరచేతి రిమోట్ లోకి వచ్చి నిలుస్తుందన్న మాట !
అప్పుడేం జరుగుతుంది?
ఆశ్రమాలన్నీ మూతపడతాయి. స్వామీజీలకు పనే ఉండదు. వాళ్ళ స్పీచులు ఎవరూ వినరు. వాళ్ళను ప్రోమోట్ చేస్తున్న టీవీ ఛానల్సన్నీ మూతపడతాయి. ప్రజలు స్వామీజీల చుట్టూ తిరగడం మానేస్తారు. రాజకీయనాయకులు స్వామీజీల చుట్టూ తిరగడం మానేస్తారు. స్వాముల శిష్యులందరూ వాళ్ళనొదిలేసి హాయిగా హెడ్ ఫోన్స్ కొనుక్కుని యాప్ కు కనెక్ట్ అయిపోయి పద్మాసనంలో కూచుని ఏ సమాధి కావాలంటే ఆ సమాధిలోకి తేలికగా వెళ్ళిపోతారు. కొండొకచో, రీఛార్జ్ సెంటర్లో స్వామీజీ ఆయన శిష్యుడూ ఒకే క్యూలో ఒకరికొకరు ఎదురైనా ఆశ్చర్యపోనవసరం లేదు.
లేదా ఆ కంపెనీకి కాల్ చేస్తే ఒకమ్మాయి గొంతు కులుక్కుంటూ ఇలా వినిపిస్తుంది.
"సవికల్పసమాధి కావాలంటే ఒకటి నొక్కండి. నిర్వికల్పసమాధి కావాలంటే రెండు నొక్కండి. జీవన్ముక్తి కావాలంటే మూడు నొక్కండి. నిర్వాణా కావాలంటే నాలుగు నొక్కండి. లేదా భౌతికఅమరత్వం కావాలంటే మీ శరీరపు సెల్స్ రీఛార్జికోసం మీ దగ్గర్లో ఉన్న రీచార్జి సెంటర్ కు రండి !"
ఇదంతా అతి త్వరలో జరుగబోతోంది. నేను చెబుతున్నది నిజం. మీరే చూస్తారు! ఒకవేళ మీరు కాకపోయినా మీ మనవళ్ళో, మునిమనవళ్ళో ఖచ్చితంగా చూస్తారు !
నేను చెప్పినది ఉత్త రెండు యాప్స్ గురించి మాత్రమే ! ఇలాంటివి 1200 పైన రీసెర్చులు జరుగుతున్నాయి. అవన్నీ వస్తే మనిషి బ్రతుకు ఏమౌతుందో ఒక్కసారి ఆలోచించండి ! తల గిర్రున తిరుగుతుందా? పక్కన దేన్నైనా పట్టుకోండి లేదంటే క్రింద పడతారు !
(ఇంకా ఉంది)
కొందరు
భయంతో కొందరు బాధతో కొందరు
కుళ్లుతో కొందరు కుట్రతో కొందరు
నన్ననుసరించేవారే అందరూ
ప్రేమతో కొందరు పెంకితనంతో కొందరు
విప్పారిన కళ్ళతో కొందరు
విరబూసిన మనసుతో కొందరు
నను చూస్తూనే ఉంటారందరూ
విసుగుతో కొందరు విరక్తితో కొందరు
వాదనతో కొందరు వేధిస్తూ కొందరు
సాధిస్తూ కొందరు రోదిస్తూ కొందరు
నాతోనే ఉంటారందరూ
మౌనంగా కొందరు మమేకమై కొందరు
కయ్యాలతో కొందరు కలహాలతో కొందరు
నెయ్యంతో కొందరు నేర్పరులై కొందరు
నాతో జీవించేవారే అందరూ
నవ్వుతూ కొందరు నాటకాలతో కొందరు
కుతూహలంతో కొందరు కుళ్ళుమనసుతో కొందరు
నేర్చుకోవాలని కొందరు నేర్పించాలని కొందరు
నాతో నడిచేవారే అందరూ
వెనుకగా కొందరు వెన్నుపోట్లతో కొందరు
అహంతో కొందరు అతిశయంతో కొందరు
అమాయకంగా కొందరు ఆడంబరంగా కొందరు
నను చేరవచ్చేవారే అందరూ
నవ్వుతూ కొందరు నటిస్తూ కొందరు
అలిగేవారు కొందరు అల్లాడేవారు కొందరు
ఆట్లాడేవారు కొందరు పోట్లాడేవారు కొందరు
నాతోనే ఆడుకుంటారందరూ
మానవుల్లా కొందరు మరోరకంగా కొందరు
దగ్గరగా కొందరు దూరంగా కొందరు
మనసులో కొందరు మాటల్లో కొందరు
నను వీడిపోలేరెవ్వరూ
పోషిస్తూ కొందరు ద్వేషిస్తూ కొందరు...
14, జనవరి 2021, గురువారం
Master CVV జాతక విశ్లేషణ - 2 ( భౌతిక నిత్యత్వం)
ఆధ్యాత్మిక కోణంలో, మనుషులను మూడు రకాలుగా విభజించవచ్చు.
ఒకటి - భూమ్మీద హాయిగా బ్రతకాలనుకునే వారు.
రెండు - భూమిని వదలి ఆకాశంలోకి పోవాలనుకునేవారు.
మూడు- ఆకాశాన్ని భూమికి దించాలనుకునేవారు.
మొదటివారు లౌకికులు. కావలసినంత సంపాదించుకుని హాయిగా బ్రతకడమే
వీరికి ముఖ్యం. అంతకంటే ఉన్నతమైన గమ్యాలేవీ వీరికుండవు.
రెండవవారు పాతతరం ఆధ్యాత్మికులు. శరీరం ఎలాగూ నశిస్తుంది గనుక, లౌకికజీవితాన్ని ఆధ్యాత్మిక సిద్ధికోసం
ఉపయోగించాలని వీరి భావన. మూడవవారు కూడా ఆధ్యాత్మికులే. కాకపోతే వీళ్ళు ఇదే శరీరంతో ఎప్పటికీ ఈ
భూమిమీద ఇలాగే ఉండాలన్న గమ్యంతో సాధన చేసేవారు. వినడానికి విచిత్రంగా ఉంది కదూ !
ఈ మూడవరకం వారు, పాత యోగమార్గాలను పరిపూర్ణమార్గాలు కావంటారు. మాదే అసలైన
యోగమార్గమంటారు. వీరి మాటలు వినడానికి చదవడానికి చాలా సంభ్రమాన్ని గొలిపేవిగా
ఉంటాయి. నిజమేనేమో అనిపిస్తాయి. కానీ దానిలో సిద్ధిని పొందినవారు మాత్రం ఇప్పటిదాకా ఎవరూ లేరు !
నవీనకాలంలో ఈ మార్గాన్ని అనుసరించిన వారు రామలింగస్వామి.
అరవిందులు. మాస్టర్ సీవీవీ గారు. ముగ్గురూ వారి సాధనలో విఫలులయ్యారు. అదేంటోగాని దేహంతో శాశ్వతంగా ఇక్కడే ఉండాలన్న ఈ పిచ్చి దక్షిణభారత దేశంలోనే ఎక్కువగా
కనిపిస్తుంది. ఉత్తరభారతంలో ఇలాంటి యోగమార్గాలను అనుసరించిన వారు ఎవరూ కనిపించరు.
బహుశా దానిక్కారణం ఉత్తర భారతమంతా ముస్లిముల దండయాత్రలకు, వాళ్ళు చేసిన అరాచకాలకు బలైపోతూ అతలాకుతలమై పోతూ వెయ్యి సంవత్సరాలపాటు నానాబాధలు పడటమే కావచ్చు. దక్షిణభారతంలో అలాంటి బాధ లేదు. ఎప్పుడో ఏ మలిక్కాఫరో వచ్చి
చావగొట్టటమే కానీ, ఉత్తరభారతం వారు పడిన బాధలు వీళ్ళు పడలేదు. ఉత్తరాదివారితో పోల్చుకుంటే వీళ్ళ జీవితం చాలా హాయిగా గడిచింది. అందుకే వీరికి ఇలాంటి విచిత్రపు ఆలోచనలు
పుట్టాయేమో అనిపిస్తుంది. మనిషికి తీరిక లేకపోతే జీవనపోరాటమే సరిపోతుంది. తీరిక
ఎక్కువైతే ఇలాంటి విచిత్రబుద్ధులు పుడతాయి.
ఇంకా విచిత్రంగా ఈ ముగ్గురూ తమిళనాడులోనే ఈ యోగమార్గాలను నడిపారు. అరవ్వాళ్ళకు పిచ్చి కొంచం జాస్తని ఊరకే అనలేదు. అయితే ఈ ముగ్గురూ అరవ్వాళ్లు కారు. రామలింగస్వామి అరవాయనే. అరవిందులు బెంగాలీ. సీవీవీ గారు తెలుగునాడు నుంచి అరవదేశానికి పోయి స్థిరపడిన కుటుంబం వారు.
రామలింగస్వామి అనే యోగి 5-10-1823 న తమిళనాడు లోని చిదంబరం దగ్గ్గర్లోని మరుదూరులో పుట్టి 30-1-1874 తేదీన ఎవరికీ కనపడకుండా, ఏమైపోయాడో తెలీకుండా మాయమయ్యాడు. ఆ రోజున ఒక గదిలో కెళ్ళి తలుపులేసుకుని ఉండిపోయాడు. ఎన్నిరోజులకూ బయటకు రాకపోతుంటే, మే నెలలో ఒకరోజున ప్రభుత్వాధికారులూ, ప్రజలూ, శిష్యులూ కలసి తలుపులు పగలగొట్టి చూస్తే ఆయన అందులో లేడు.
బయటకు పోయే వేరే దారంటూ ఏదీ ఆ గదికి లేదు. కనుక ఆయన సశరీరంగా శూన్యంలో కలసిపోయాడని, లేదా జ్యోతిలో లీనమయ్యాడని ఆయన
భక్తులు భావించారు. ఆయన ఎదురుగా ఒక వెలుగుతున్న ప్రమిదను ఉంచుకునేవాడు. అందుకని ఆయనకు జ్యోతి రామలింగస్వామి అని పేరొచ్చింది. ఆ జ్యోతిలోనే ఆయన లీనమయ్యాడని అందరూ భావించారు. కానీ, లోతుగా పరిశోధన చేసిన కొంతమంది చరిత్ర పరిశోధకులేమో వేరేగా భావించారు. ఆయనకున్న - సర్వజన సమానత్వం, కులమతరాహిత్యం, సాంప్రదాయ పూజలను నిరసించడం, భౌతిక నిత్యత్వ సాధన - ఇలాంటి భావనలవల్ల
ఆయనకు బలమైన శత్రువర్గం చాలా ఉండేదని, వాళ్ళే ఆయనను రహస్యంగా చంపేసి, శవాన్ని ఎక్కడో పారేసి, మళ్ళీ గప్ చుప్ గా తలుపులు తాళాలు వేశారని, అది తెలీని వెర్రిశిష్యులు భక్తులు ఆయన బొందితోనే
స్వర్గానికి వెళ్లిపోయాడని లేదా జ్యోతిలో లీనమయ్యాడని భావించారని, రియలిస్టిక్ హిస్టారియన్లు భావించారు. కనుక బొందితోనే శాశ్వతత్త్వం
అనేదానిని ఆయన పొందాలని ప్రయత్నించినప్పటికీ దానినాయన పొందలేదన్నది వాస్తవం.
పొందితే, ఆయన ఇప్పటికీ మనకు కనిపించాలి కదా ! కానీ అప్పటినుంచీ ఆయన దేహం ఎక్కడా లభించలేదు. ఈనాటికీ ఆయన అడ్రస్ ఎవరికీ తెలీదు. కనుక ఆయన
హత్య చేయబడ్డాడనేది వాస్తవమని నేనూ నమ్ముతాను. నా నమ్మకానికి ఆధారం ఆయన జాతకమే.
చూడండి మరి !
ఈయనది చిత్తా నక్షత్రం. తులలోని బుధ చంద్రుల వల్ల ఈయనకు
విప్లవాత్మకములైన ఆధ్యాత్మిక భావాలున్నాయని స్పష్టంగా తెలుస్తున్నది. ఈయనకు చాలా శత్రువర్గం ఉంటుందని, వాళ్లలో చాలా నీచపుబుద్ధి ఉన్న వాళ్లుంటారని సప్తమంలో ఉన్న నీచశని
చెబుతున్నాడు. వాళ్ళవల్ల ఈయనకు ప్రమాదం ఉందని, వాళ్ళే ఈయన్ను హఠాత్తుగా చంపేశారని, శవాన్ని కనపడకుండా మాయం చేశారని దశమంలో ఉన్న
నీచకుజుడు, చంద్రుడిని సూచిస్తున్న కేతువు, రాహుకేతువులతో పాపార్గళం పట్టిన చంద్రబుధులూ చెబుతున్నారు. కనుక, ఆకాలంలోనే సంఘసంస్కర్తగా, మతసంస్కర్తగా, ఆధ్యాత్మికనూతనవాదిగా పేరుపొందిన ఈయన్ను హత్యచేసి, ఆయన బొందితో స్వర్గానికి వెళ్లిపోయాడని
నమ్మించారు. ఇది సత్యమని ఆయన జాతకమే చెబుతున్నది. లోకం మాత్రం తమకు సౌకర్యంగా ఉండే
మూఢనమ్మకాల ఊబిలో కూరుకునిపోయి, ఆయన పటం పెట్టుకుని పూజలు చేసుకుంటూ ఆనందంగా ఉంటున్నది.
రామలింగస్వామి చనిపోయిన
రోజున గ్రహస్థితి ఇలా ఉంది. ఆ సమయంలో ఈయన జాతకం లోని జననకాల చంద్రుడు గోచార రాహుకేతువులు చేత కొట్టబడ్డాడు. సప్తమంలో
ఉన్న రాహువు కుజుడిని సూచిస్తూ ఆయనపైన జరిగిన హింసాపూరితమైన దాడిని
సూచిస్తున్నాడు. ఈ గ్రహస్థితి దేనిని సూచిస్తున్నదో, అక్కడ ఏం జరిగి ఉంటుందో నేను ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు కదా !
చైతన్య మహాప్రభువు కూడా
ఇట్లాగే, పూరీ జగన్నాధస్వామి విగ్రహంలో శరీరంతో సహా
లీనమైపోయాడని ఆయన భక్తులు భావిస్తారు. కానీ చరిత్ర పరిశోధకులేమో పూరీ ఆలయంలోనే
ఆయన్ను హత్య చేసి గుండిచా ఆలయం దగ్గర్లో ఆయన్ను పూడ్చిపెట్టారని ఆధారాలతో సహా
నిరూపిస్తున్నారు.
బయటకు బహుసుందరంగా కనిపించే మతాల సమాధులలో ఎన్ని కుళ్లిపోయిన
అస్థిపంజరాలో? అసలు నిజాలు ఇలాగే వినడానికి చాలా వింతగా, విడ్డూరంగా ఉంటాయి.
ఇదే పోకడతో నడచినవారు బెంగాల్ నుంచి వచ్చి తమిళనాడులో స్థిరపడిన
అరవిందయోగి. దేహంతో నిత్యత్వాన్ని పొందాలన్న ప్రయత్నం చేస్తూనే ఆయన కూడా
కన్నుమూశారు. ఆయన ఆశయమూ నెరవేరలేదు. మనకు స్వాతంత్రం వచ్చిన రోజున ఆయన ఆశ్రమం మీద
తమిళ లోకల్ గూండాలు కొందరు దాడి చేశారు. ఆ దాడిలో ఆయన పర్సనల్ సేవకుడు
స్పాట్లో చనిపోయాడు. అతన్ని అరవిందులు తన యోగశక్తితో కాపాడలేకపోయారు. ఆయన శిష్యులేమో మొదటి/రెండవ
ప్రపంచయుద్ధాలను ఆయన పాండిచ్చేరిలో కూచుని తన యోగశక్తితో కంట్రోల్ చేశాడని
కాకమ్మకబుర్లు చెబుతూ మనలని నమ్మమంటారు. మహామాయకు ఎన్ని రూపాలో ! ఆయన మీద వేరే సీరీస్ ను
వ్రాస్తున్నందున ఇక్కడ ఎక్కువగా వ్రాయను. కానీ భౌతికనిత్యత్వాన్ని ఆయనకూడా
సాధించలేకపోయారు. ఈయన సమాధే దీనికి సాక్ష్యం.
ఇక మూడవవారు - మాస్టర్ సీవీవీ. ఈయన పరిస్థితి ఇంకో విధంగా
అయిపోయింది. ఆయన యోగాన్ని మొదలుపెట్టిన అసలు ఉద్దేశ్యం నెరవేరకపోగా, ఆయన ఒద్దని నిషేధించిన కోర్సులనే ఈనాటి సోకాల్డ్
శిష్యులు చేస్తూ, దానికి థియోసఫీ మాయాపదజాలాన్ని జోడించి, మాస్టర్లని, ఏంజిల్సని, యాస్ట్రల్ లోకాలని, రెక్టిఫికేషన్లని, అడ్జస్ట్మెంట్లని, ఉన్నవీ లేనివీ చెబుతూ, ఎవరి కుంపట్లు వారు పెట్టుకుని, వ్యాపారాలు చేసుకుంటూ కాలం గడుపుతున్నారు. కుండలినీజాగృతి పేరుతో
రకరకాల డాన్సులు చెయ్యడం,
వర్కింగు, ఎడ్జస్ట్మెంట్, రెక్టిఫైకేషన్ మొదలైన ఇంగిలీషు పదాల చాటున పబ్బం గడుపుకుంటున్నారు. రోగాలు తగ్గడం, ఉద్యోగాలు రావడం, వ్యాపారాలు కలసిరావడం, పెళ్లిళ్లు కావడం, పనులు కావడం మొదలైనవి మాత్రమే వీరి పరమప్రయోజనాలుగాని సాధన కాదు. ఈ యోగపు అసలు ఉద్దేశ్యమేమిటో, సీవీవీగారు అసలెందుకు ఈ యోగాన్ని మొదలుపెట్టారో
వారి శిష్యులలో ఎవరికీ నేడు గుర్తు లేదు. ఆ మార్గంలో
ప్రయత్నిస్తున్న వారు కూడా ఎవరూ లేరు.
వీరి శిష్యులలో ఒక్కొక్కరు ఎవరికీ వారే 'మాస్టర్' అని పేరు పెట్టుకుని, ఎవరి భావాలను వారు ఈయన యోగంగా ప్రచారం చేసుకుంటూ, ధనార్జన చేస్తూ, ఈయన వద్దన్నసాధనలను చేస్తూ, వద్దన్న నాడీగ్రంధాలనే ప్రామాణికంగా తీసుకుంటూ ఈయన బోధించిన అసలు సాధనను గంగలో కలిపేస్తున్నారు. ఈయన జాతకంలో ఇవన్నీ స్పష్టంగా కన్పిస్తున్నాయి.
(ఇంకా ఉంది)
12, జనవరి 2021, మంగళవారం
Master CVV - జాతక విశ్లేషణ - 1 (నిజాలు - భ్రమలు)
ఇప్పటికి ఎందరో వారి శిష్యులు, సోకాల్డ్ 'మాస్టర్లు' జ్యోతిష్యశాస్త్రంలో ఉద్దండులమని చెప్పుకునేవాళ్ళు ఈయన జాతకాన్ని వివరించే ప్రయత్నం చేశారు. వీరిలో ఎక్కువమంది సాయనసిద్దాంతానుసారులు. పురాణకధలతో, థియోసఫీ మాయాపదజాలంతో, ఇంకా ఏవేవో కల్పిత విషయాలతో, కాకమ్మ పిచ్చికమ్మ కబుర్లతో వీరి విశ్లేషణలు సాగినవి.
మాస్టర్ సీవీవీ గారు తమ యోగమార్గాన్ని సైన్టిఫిక్ యోగా అన్నారు. కానీ వారి శిష్యుల విశ్లేషణలన్నీ వారంటే ఉన్న భక్తికి తార్కాణములుగా మాత్రమే ఉన్నాయి గాని, వాటిలో శాస్త్రీయత పాళ్ళు లోపించినాయి. ఏ మహాపురుషుని నమ్మినవారైనా, వారిని ఏదో దేవుని అవతారమని చెప్పుకోవడం కద్దు. ఎందుకంటే, అలా చెప్పుకోనిదే వారికి తృప్తీ నమ్మకమూ రెండూ కలగవు. కానీ ఇలాంటి భావనల వెనుక సత్యంకంటే డొల్లనమ్మకము, అసత్య ప్రచారములే ఆధారములుగా ఉంటున్నాయి. ఇటువంటి కుహనాభక్తి పూరితములైన నిరాధారపు ప్రచారములను దూరము పెట్టి వీరి జాతకచక్రం ఏమంటున్నదో నిస్పాక్షికమైన దృష్టితో చూద్దాం.
మంత్రస్థానాధిపతి, కర్మకారకుడు అయిన శని తృతీయ ఉపచయస్థానంలో ఉంటూ నవమాన్ని, రవిబుధులను చూస్తున్నాడు. లగ్నాధిపతి బుధుడు పదకొండులో రవితో కలసి ఉంటూ శనిని చూస్తున్నాడు. శని దృష్టి ద్వాదశంలో ఉన్న రాహువుమీద ఉంది. వీటివల్ల లోతైన యోగసాధన, తపస్సు, దయాహృదయములు గోచరిస్తున్నాయి. చతుర్ధం మనస్సు, ద్వాదశం రహస్యసాధన గనుక, ఈ శపితయోగప్రభావం వల్ల లోకపుబాధలను తనమీద వేసుకొని పరిష్కారం చెయ్యాలని ప్రయత్నించే సాధన కనిపిస్తున్నది. వీరు కనిపెట్టిన భృక్తరహిత తారకరాజయోగం అలాంటిదే.
నవమాధిపతి శుక్రుడు దశమంనుంచి నవమంలోకి వస్తూ శనివీక్షణకు గురౌతున్నాడు. కనుక ఈయనది సన్యాసమార్గం కాదని, అన్ని భోగాల మధ్యన ఉంటూనే చేసే సాధన యని తెలుస్తున్నది.
లాభాధిపతి అయిన పూర్ణచంద్రుడు మంత్రస్థానంలో ఉంటూ శనిదృష్టికి గురవడం లోతైన ఆధ్యాత్మికచింతనకు సూచనగా ఉంది. అదే చంద్రునిపైన ఉన్న సూర్యబుధదృష్టి వల్ల వివాహజీవితంలో చికాకులు, భార్య వల్ల ఇబ్బందులు కనిపిస్తున్నాయి. సప్తమంలో వక్రించి ఉన్న సప్తమాధిపతి గురువు వల్ల భగ్నమైన వివాహజీవితం సూచింపబడుతున్నది. ఈయన మొదటి భార్య గతించగా రెండవ వివాహం చేసుకున్నారు. రెండవభార్య వల్ల ఈయన సాధనలో చాలా చిక్కులు ఎదుర్కొన్నట్లు, మొదట్లో ఆమె చాలా మొండిగా చెప్పినమాట అర్ధం చేసుకోకుండా ఉన్నట్లు తెలుస్తున్నది. దారాకారకుడైన బుధుడు రాశిసంధిలో ఉండటం దీనిని బలపరుస్తున్నది.
ఈయన పౌర్ణమి ఛాయలో జన్మించాడు. కనుక వివాహజీవితం బాగుండదు. ఇది నిజమే అని ఈయన జీవితాన్ని ఈయన డైరీలను చదివితే అర్ధమౌతుంది.
సాంప్రదాయగ్రహమైన గురువు వక్రించి షష్ఠంలోకి వచ్చి శనిని సూచిస్తున్న కేతువుతో కలవడం వల్ల సాంప్రదాయవిరోధియైన ఒక విచిత్రసాంప్రదాయాన్ని అనుసరించడం కనిపిస్తున్నాయి. కేతువుకు ధూమకేతువని పేరుంది. 1910 లో భూమికి దగ్గరగా వచ్చిన హేలీ తోకచుక్క ప్రభావం వల్లనే ఈయన సాధన పురోగమించిందని అంటారు. దీనిలోని నిజానిజాలు దేవునికెరుక. దీనిని ఈయన జాతకంలోని గురుకేతు సంయోగం, సంప్రదాయవిరుద్ధమైన ఒక ఖగోళసంఘటనతో ఈయన సాధన ముడిపడినదని రుజువు చేస్తున్నది. కానీ ఇది ఆరవఇంటిలో జరగడం వల్ల, ఇది పూర్వకర్మ ఫలితమే గాని, దీని పరిణామాలు చివరకు సఫలం కావన్న సూచన బలంగా ఉన్నది.
ఈయన యోగం యొక్క ముఖ్యోద్దేశ్యమైన 'ఎటర్నిటీ' లేదా 'భౌతికశరీరంతో శాశ్వతత్వం పొందటం' అనే గమ్యం ఎంతవరకు నెరవేరిందో చూద్దాం.
మృతసంజీవనికి కారకుడు శుక్రుడు. ఈ జాతకంలో వక్రించి ఉన్నాడు. లగ్నాధిపతి బుధుడు బలహీనుడుగా రాశిసంధిలో ఉన్నాడు. దేహస్థిరత్వానికి కారకుడైన కుజుడు కూడా అతిబాల్యావస్థలో బలహీనుడుగా ఉన్నాడు. కుజబుధుల మధ్యన స్నేహపూరిత సంబంధం లేదు. వారికి బలములూ లేవు. అందువల్ల ఈ జాతకంలో మృతసంజీవనీ యోగం లేదు.
కుజుడూ శుక్రుడు కలసి ఉండటం నిత్యయవ్వనానికి సూచిక. కానీ ఈ యోగం బలంగా లేదు. శుక్రుడు వక్రించి కుజుడిని వదిలేసి వృషభంలోకి పోతున్నాడు. ఈ యోగం విడిపోతున్నది.
అయితే, శని, శుక్ర, రాహు, కేతువులు పరస్పర కేంద్రస్థానాలలో ఉంటూ మిస్టిక్ క్రాస్ ను ఏర్పాటు చేస్తున్నారు. వీరి సాధనలో శని, శుక్రుల రెగులేషన్ చాలా ముఖ్యమైనది. శనంటే స్థిరత్వం. వీరి భాషలో చెప్పాలంటే స్టెబిలిటీ. శుక్రుడంటే భౌతికరూపంతో సుందరంగా ఉన్న సృష్టి లేదా దేహం. రాహుకేతువులంటే కుండలినీ శక్తి. ఈ మిస్టిక్ క్రాస్ అనేది కుండలినీశక్తి జాగృతి ద్వారా భౌతిక దేహానికి స్థిరత్వాన్ని లేదా శాశ్వతత్వాన్ని తెచ్చే ప్రక్రియ. కనుక భౌతికనిత్యత్వ గమ్యపు దారిలో శనిశుక్రులను సాధించడం లేదా రెగులేట్ చేయడం తప్పనిసరి. కనుక వీరి సాధన ఈ దారిలోనే సాగినప్పటికీ, దాని గమ్యాన్ని చేరడంలో మాత్రం ఈయన విఫలమైనాడని చెప్పక తప్పదు. దానికి కారణం శుక్రుని వక్రత్వం. అంటే ఈ సాధనకు దేహప్రకృతి సహకరించకపోవడం. అందుకనే చనిపోతున్న రోజున 'ప్రాణాన్ని దేహం స్వీకరిస్తున్నది కానీ అది నిలబడటం లేద'ని ఆయనన్నాడు. గ్రహాలన్నింటిలోకి శుక్రుడు లొంగడం చాలా కష్టమని కూడా ఆయనన్నాడు.
భౌతిక అమరత్వాన్ని పొందాలని ప్రాచీనకాలంలో ఎందరో ప్రయత్నించినట్లు గాధలున్నప్పటికీ వాటి సాధించినట్లుగా ఆధారాలు మాత్రం లేవు. అలా బ్రతికి ఉన్నవారెవరూ కనిపించడం లేదు. చిరంజీవులు కూడా ఎక్కడో అడవులలో హిమాలయాలలో ఉన్నారని నమ్మడమేగాని వారిని చూచినవారు లేరు. నవీనకాలంలో అరవిందులు కూడా తమ యోగం ద్వారా దీనిని సాధించాలని ప్రయత్నించారు కానీ విఫలమయ్యారు. అరవిందుల మార్గాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లారని చెప్పబడుతున్న మదర్ మీరా కూడా ఈ గమ్యాన్ని సాధించడంలో విఫలమయ్యారు. పాండిచ్చేరి ఆశ్రమంలోని వీరిద్దరి సమాధి వారి భౌతికనిత్యత్వ గమ్యాన్ని వెక్కిరిస్తూ ఈనాటికీ మనకు కన్పిస్తోంది.
ప్రపంచంలోని అన్ని మతాలలోనూ, వారివారి ప్రవక్తలు, దేవుళ్ళు మళ్ళీ వస్తారని, ఆకాశం నుంచి ఊడిపడతారని నమ్మకాలున్నాయి. కానీ వేలాది ఏళ్ళు గడచినా, ఆ ప్రవక్తలు దేవుళ్ళు దిగివస్తున్న జాడా జవాబూ ఎక్కడా లేదు. కానీ వాళ్ళొస్తారని జనాన్నినమ్మిస్తూ మాయచేస్తూ జరుగుతున్న గ్లోబల్ వ్యాపారాలు మాత్రం జోరుగా సాగుతున్నాయి. మతాలన్నీ అవే ! భౌతిక అమరత్వ భావన కూడా ఇలాంటి బూటకమే. దీనిలో ఎవరూ విజయాన్ని సాధించలేదు.
ఇదే విధంగా మాస్టర్ సీవీవీ కూడా విఫలమయ్యారు. ఆయన 12.5.1922 తేదీన చనిపోవడమే దీనికి రుజువు. కొందరు శిష్యులు మాత్రం, ఆయన యొక్క సూక్ష్మశరీరానికి నిత్యత్వాన్ని తెచ్చారని సమర్థిస్తారు. ఎవరు చూచారు? కానీ ఆయన వ్రాతలలో ఉన్నది అది కాదు. భౌతికశరీరం రోగం లేకుండా, కృంగుబాటు లేకుండా, చావు లేకుండా ఉండాలన్నదే ఈయన యోగగమ్యం. దానిని ఆయన సాధించలేదు. అంతేకాదు, ఆయన శిష్యులలో కూడా ఎవరూ సాధించలేదు.
యోగంతో రోగాలు తగ్గించడం పెద్దవిషయం కాదు. యోగసాధనలో కొద్దిగా పురోగమించినవారు ఇలాంటివి చాలా తేలికగా చేయగలుగుతారు. కానీ, మరణించిన వారిని కూడా బ్రతికించారని అనేక కధలను వీరి శిష్యులు చెబుతారు. కానీ ఆ బ్రతికినవారు కొంతకాలానికి మళ్ళీ చనిపోయారని కూడా చెబుతారు. కనుక ఆ బ్రతికించడం ఎందుకు? ఎప్పటికైనా చనిపోవలసినవాడు మరికొద్దికాలం బ్రతికితేనేమి, బ్రతకకపోతేనేమి? అసలా చనిపోయారని చెప్పబడుతున్నవారు నిజంగా చనిపోయారా? లేక కోమా వంటి స్థితిలో ఉండి మళ్ళీ తెలివిలోకి వచ్చారా? అనేది ఎవరూ చెప్పలేరు. నిస్పాక్షికంగా గమనించి రికార్డ్ చేసినవారు ఎవరూ లేనందున, భారతీయులకు సహజమైన మూఢభక్తి శిష్యులలో ఉండటం సహజం అయినందున, ఈ కధలన్నీ నిజాలని మనం నమ్మలేం.
మాస్టర్ సీవీవీ గారు ఇలా వ్రాశారని రికార్డ్ చేయబడి ఉన్నది - 'చనిపోయినవానిని "లేచిరా" అని పిలిస్తే వాడు లేచి రావడం మన యోగమార్గంలో చాలా చిన్నపని'. చెప్పడానికి బాగానే ఉంది. కధలు బాగానే ఉన్నాయి. కానీ రుజువులేవి? ఆ చెప్పినవారే మరణానికి లొంగిపోయారు. వారి శరీరాలు చనిపోయాయి. అలా బ్రతికింపబడ్డారని చెప్పబడినవారూ కొంతకాలానికి చనిపోయారు. ఏమిటిది? ఎందుకిదంతా? ఇవి ఉత్తమాటలా? నిజాలా?
20-8-1917 న ఇవ్వబడిన పిల్లర్ టెస్ట్ ప్రకారం - 'నశ్వరమైన మానవదేహం చావకుండా ఉండదు. నశిస్తుంది. కానీ, దానికి సరియైన శిక్షణనివ్వడం ద్వారా దానిని నేను చావు లేనిదిగా చేస్తా' నని ఆయనన్నారు. కానీ, అది జరుగలేదు. నిజం కాలేదు.
11, జనవరి 2021, సోమవారం
సిద్ధుల గుట్ట
నాకెందుకో చిన్నప్పటినుంచీ నిజామాబాద్ అనే పేరు విన్నప్పుడల్లా అది బాగా తెలిసిన ఊరని, ఆ ఊరితో ఏదో అనుబంధమున్నట్లుగా అనిపించేది. ఎందుకో తెలియదు. నేనెప్పుడూ ఇటువైపు రాకపోయినా కూడా అలా అనిపిస్తూ ఉండేది. ఇప్పటికిక్కడికి రావడం ఈ ప్రాంతాలలో తిరగడం అయింది. కానీ ఖర్మేమిటంటే, ఇంత పెద్ద టౌన్లో శాకాహార హోటల్ కోసం ఆటోలో ఎక్కి గంటసేపు వెదుకులాడవలసి వచ్చింది. ఎక్కడ చూచినా చికెన్ హోటళ్లు తప్ప, శుద్ధమైన శాకాహార హోటలే లేదు. విచారించగా, హైదరాబాద్ రోడ్డులో కపిల్ అనే హోటలొక్కటే శాకాహార హోటలని చెప్పారు. భలే విచిత్రమనిపించింది.
గతంలో అయితే, మాంసాహార హోటలు కావాలంటే వెదుక్కోవలసి వచ్చేది. ఎక్కడో సందులో గొందిలో ఉండేది. సారాయి షాపులు కూడా అంతే. ఇప్పుడో, మొత్తం తారుమారైంది. అవన్నీ రోడ్లమీదకొచ్చాయి. శాకాహారహోటళ్లు ఎక్కడా కనిపించడం లేదు. నేను నిజామాబాద్లో ఉన్న రెండురోజులు టిఫిన్ మాత్రమే తిని ఉన్నాను. అప్పుడపుడు అరటిపండ్లు తిన్నాను. రెండవరోజున ఒక పెరుగు కప్పు కోసం ఊరిలో గంటసేపు వెతకవలసి వచ్చింది. ఎక్కడో ఓల్డ్ బజార్లో ఒక డెయిరీ ఉందని అక్కడికెళ్ళమని చెప్పారు. భలే విచిత్రమనిపించింది. జనమంతా కోళ్ళమీద పడి బ్రతుకుతున్నట్లే తోచింది. సామాన్యంగా తోడేళ్ళు, నక్కలు, అడవికుక్కలు, పిల్లులు మొదలైన జంతువులు మాత్రమే కోళ్లను తింటూ ఉంటాయి. అందుకేనేమో, నేటి జనంలో కూడా వాటి మనస్తత్వాలే దర్శనమిస్తున్నాయి.
తినే తిండిని బట్టే కదా మనసు ఏర్పడేది ! మాంసం తింటున్నంత వరకూ శుద్ధమైన శరీరధాతువులు ఉండవు. ధాతుశుద్ధి లేనంతవరకూ ఆధ్యాత్మికమార్గం అందదు. మాంసం తినడం మానలేనివారు యోగసాధనకు అనర్హులు. వారిలోకి దైవశక్తి దిగిరావడం జరిగేపని కాదు. ఈ విధంగా మనం తినే తిండికీ, సాధనకూ సూటి సంబంధం ఉంటుంది.
ఆ సందర్భంగా ఆర్మూర్ దగ్గర్లోనే ఉన్న సిద్ధులగుట్టకు వెళ్ళొచ్చాను. దీనిని నవనాధక్షేత్రమని పిలుస్తున్నారు. ఈ ఊరికి చుట్టూ తొమ్మిది కొండలున్నందుకు దీనికి ఆరు-మూరు అని పేరొచ్చిందట. నవనాధులు ఇక్కడకు వచ్చారని నమ్ముతున్నారు. నిజానికి నాధప్రోక్తమైన 'సిద్ధసిద్ధాంత పద్ధతి' పుస్తకాన్ని ఈ గుట్టమీదే విడుదల చేద్దామని అనుకున్నాను. కానీ దైవఘటన వేరుగా ఉన్నది. ఈనాటికీ స్థలదర్శనం అయింది.
ఆర్మూర్ ఊరిలోనుంచి ఈ కొండమీదకు కాలినడకన మెట్లున్నాయి. ఈ మెట్లను గ్రామస్తుల సహకారంతో హరిదాస్ మహారాజ్ అనే సాధువు ఏర్పాటు చేయించాడు. ఆయన 1920 ప్రాంతాలలో హిమాలయాలకు వెళ్లి 18 ఏళ్ళు తపస్సు చేసి అక్కడనుంచి తిరిగివచ్చి ఈ కొండపైనున్న గుహలలో ఉంటూ ఇక్కడే సమాధి అయినాడు. కొండమీదున్న గుహలో జువ్విచెట్టు వేర్ల అడుగుభాగంలో ఈయన జీవసమాధి ఉన్నది. సమాధి సమీపంలోనే నవనాధుల చిత్రపటం ఉన్నది.
ప్రస్తుతం కారుబాట కూడా వేయబడుతున్నందున మేము కార్లోనే సరాసరి గుట్టమీదకు ఎక్కినాము. అది ఒక పర్యాటకస్థలంగా రూపుదిద్దుకుంటున్న సూచనలు గోచరించాయి. పిల్లలు చాలామంది అక్కడున్న ఆటస్థలంలో ఆడుకుంటూ కనిపించారు.
గుట్టనిండా నల్లగుండురాళ్ళు లెక్కలేనన్ని కనిపించాయి. అన్ని గుండురాళ్లను ఒకే కొండమీద మరెక్కడా నేను చూడలేదు. ఈ గుట్టమీద గుహల సమీపంలో పాతకాలపు శివాలయం, రామాలయం ఉన్నాయి. అయ్యప్ప ఆలయం నిర్మాణంలో ఉన్నది.
గుహలోకి వెళ్లే ద్వారం మన నడుము ఎత్తులో ఉంటుంది కనుక నిలబడి నడుస్తూ దానిలోకి పోలేము. వంగి లోపలకు దూరవలసి వస్తుంది. ఆలోపల పాముమెలికలలాగా సహజసిద్ధంగా బండరాళ్ల క్రింద ఏర్పడి ఉన్న దారులు,ఖాళీ స్థలాలే ఆ గుహలు. లోపల చాలాచోటలకు పాక్కుంటూ పోవలసి వస్తుంది. అహంకరించి లేచి నిలబడితే పైనున్న బండరాయి శఠగోపం పెడుతుంది.
ఆ బండరాళ్ల పైన ఒక పెద్ద జువ్విచెట్టు ఉన్నది. దానివ్రేళ్లు ఆ బండ్ల క్రిందదాకా ఉన్నాయి. ఆ వ్రేళ్ళ మధ్యనే హరిదాస్ మహారాజ్ గారి సమాధి ఉన్నది. పాతకాలంలో కరెంటు లేని రోజుల్లో కూడా ఆయన అదే గుహలలో రాత్రనక పగలనక ఉంటూ ఉండేవాడట. ప్రస్తుతం గుహలోపల కూడా కరెంటు దీపాలున్నాయి. అయితే మనతో బాటు కోతులు కూడా లోపలకు వస్తూ పోతూ ఉంటాయి. ప్రమాదం ఏమీ లేనప్పటికీ, ఒంటరిగా గుహలలోనికి వెళ్లడం మంచిది కాదు.
ఆ భూగర్భగుహలలో మెలికలు మెలికలుగా తిరుగుతూ పోతే రామాలయం దగ్గర ఇంకొక ద్వారం నుంచి బయటకు తేలుతాము. భూగర్భగుహలలో దుర్గాదేవి, దత్తాత్రేయుడు, మూడ్నాలుగు శివలింగాలున్నాయి. లోపల చీమ చిటుక్కుమంటే వినపడేంత నిశ్శబ్దం ఉన్నది. చాలా చల్లగా ఉన్నది. తపస్సుకు చాలా అనువైన స్థలమని తోచింది.
శిష్యబృందంతో ఒకసారి ఇక్కడకు రావాలన్న సంకల్పంతో కొండ క్రిందకు దిగి నిజామాబాద్ దారి పట్టాము.