మనుషులంతా ఒక్కటే అని ఎవరన్నారో గాని అది శుద్ధ తప్పుమాట.పూర్తి అజ్ఞానంతో అనబడిన మాట.ఈ మాటను నేనెప్పుడూ నమ్మను.నేనేకాదు ఈ మాటను అనే సోషలిస్టులుగాని కమ్యూనిస్టులుగాని నాస్తికులుగాని ఇంకెవరైనాగాని వారుకూడా దీనిని నిజంగా నమ్మరు. ఏదో మాటవరసకు అంటారంతే.
అందరి రక్తమూ ఎర్రగానే ఉంటుంది అని వాదించే వారికికూడా రక్తంలో గ్రూపులున్నాయనీ,మళ్ళీ ఆ గ్రూపులలోకూడా సూక్ష్మమైన తేడాలుంటాయనీ తెలుసో లేదో నాకైతే తెలియదు.
ఆచరణయోగ్యం కాని అన్ని సిద్ధాంతాల లాగే,ఈ సమ(సామ్య)వాద సిద్ధాంతం కూడా మాటలు చెప్పి ఎదుటిమనిషిని మోసంతో దోచుకోవడానికే అంతిమంగా ఉపయోగపడింది. కోట్లకు పడగలెత్తిన కమ్యూనిస్టు నాయకులే దీనికి ఋజువులు.
ఏ ఇద్దరు మనుషులూ ఎన్నటికీ ఒక్కటి కారు, కాలేరు.శక్తి యుక్తులలో గాని, తెలివిలో గాని,నీతిలో గాని,బలంలో గాని,పాండిత్యంలో గాని,జ్ఞానంలో గాని, ఇతరములైన ఇంకే టాలెంట్స్ లో గాని ప్రతివ్యక్తీ ప్రత్యేకుడే.విభిన్నుడే.మనిషి మనిషికీ మధ్యన స్థాయీ భేదాలు తప్పకుండా ఉంటాయి.
భిన్నత్వమే ప్రకృతిధర్మం.అంతేగాని ఏకత్వం కాదు.అసమానతే ప్రకృతి నియమం.అంతేగాని సమత్వం కాదు.
ఈ ఉపోద్ఘాతమంతా ఎందుకు చెబుతున్నానంటే,మనుషుల్లో కూడా చాలా ప్రత్యేకమైన టాలెంట్స్ ఉన్నవారు కొందరుంటారు.అలాంటి వారి జీవితాలను గమనిస్తే చాలా విచిత్రంగా విభిన్నంగా ఉంటాయి.అలాంటివారిలో ఒకడే కాజీ నజరుల్ ఇస్లాం.ఈయన జాతకాన్ని ఇప్పుడు పరిశీలిద్దాం.
మనిషి టాలెంట్ కూ అతని జీవితం సుఖంగా జరగడానికీ ఏ సంబంధమూ లేదు.సామాన్యంగా అందరూ ఏమనుకుంటారంటే-మనం ఏదైనా సాధించగలం,అంతా మన చేతుల్లోనే ఉంది అనుకుంటారు.అది పిచ్చి భ్రమ మాత్రమే.మన చేతుల్లో ఏదీ లేదనే విషయం చాలా లేటుగా మనిషికి అర్ధమౌతుంది.అయితే,మనవల్ల చేతకాని పరిస్థితులు జీవితంలో ఎదురయ్యేదాకా ఈ విషయం చాలా మందికి అర్ధం కాదు.
ఈయన 24-5-1899 న పశ్చిమ బెంగాల్ లోని చురూలియా అనే గ్రామంలో పుట్టాడు.జనన సమయం తెలియదు.ఉదయం 10.20 అని కొందరు అంటున్నారు.అయితే దీనికి ఆధారాలు లేవు.
గురుశనుల వక్రీకరణ వల్ల లోకంతో చాలా కర్మబంధం ఉన్న జాతకం అని అర్ధమౌతున్నది.అంతేగాక చాలా కష్టజాతకం అన్న విషయం కూడా చూడగానే స్ఫురిస్తున్నది.
గురుచంద్రుల యోగం ఉన్నప్పటికీ గురువు వక్రత్వం వల్ల అది ఈయనకు పెద్దగా ఉపయోగపడకుండా పోతుంది.బుధశుక్రులు కలసి ఉన్నందువల్ల కవిత్వం, కళానైపుణ్యం, రచనాశక్తి, భావుకతా ఉంటాయి.శుక్రునిపైన గురుదృష్టి వల్ల ఆధ్యాత్మిక రచనా నైపుణ్యం కలుగుతుంది.రాహుకేతువుల స్థితులు రాశి నవాంశలలో తారుమారవ్వడం వల్ల ఈయన జీవితం అనేక ఆటుపోట్లకు గురౌతుంది.జీవితంలో అత్యంత వైభవాన్నీ అత్యంత దయనీయ స్థితులనూ ఈయన చవిచూస్తాడు.కుజుని నీచభంగస్థితి వల్ల అట్టడుగునుంచి తన శక్తితో జీవితంలో పైకొస్తాడని తెలుస్తున్నది.నవాంశలో రాహుచంద్రులూ గురుకేతువుల కలయిక వల్లా వారిమధ్యనున్న సమసప్తక దృష్టి వల్లా ఈయనది మంచి ఆధ్యాత్మికదృక్పథం ఉన్న జాతకమేగాక,ఒక మతానికి కట్టుబడని మనస్తత్వం అని తెలుస్తున్నది.అనేక మతాలను శ్రద్ధగా అధ్యయనం చేసే విశాలస్వభావం అనీ తెలుస్తున్నది.
ఇప్పుడు ఈయన జీవితంలోని ఘట్టాలను పరికిద్దాం.
ఈయన ఒక ముస్లిం కాజీల కుటుంబంలో జన్మించాడు.చిన్నప్పుడే మతశిక్షణ తీసుకుని మసీదులో పనిచేశాడు.ఆ సమయంలోనే సాంస్కృతిక సంఘాలతో పరిచయం పెంచుకుని నాటకం,సాహిత్యం,కవిత్వాలలో ప్రవేశం పొందాడు.కొన్నాళ్ళు బ్రిటిష్ సైన్యంలో పనిచేసి ఆ తర్వాత కలకత్తాలో జర్నలిస్ట్ గా జీవితాన్ని మొదలుపెట్టాడు.
తన రచనలద్వారా తిరుగుబాటును ప్రోత్సహించేవాడు.అందుకని బ్రిటిష్ వారు చాలాసార్లు ఈయన్ను జైల్లో పెట్టారు.'బిద్రోహీ కవి(విప్లవకవి)' అనేది ఈయన బిరుదు.బంగ్లాదేశ్ ఆవిర్భావం సమయంలో కూడా,పాకిస్తాన్ నుంచి విడిపొమ్మని,ఈయన తన రచనలతో ప్రజలని ఎంతో ప్రోత్సహించాడు.
నజరుల్ చాలా అద్భుతమైన కవి.ఈయన దాదాపు 4000 పాటలు వ్రాశాడు. అంతేకాదు వాటికి రాగాలూ సమకూర్చాడు.వీటినే నజరుల్ గీత్ అంటారు. కాళీమాతను ప్రార్ధిస్తూ కొన్నివందల గీతాలు రచించాడు.వాటిని శ్యామాకీర్తనలంటారు.బెంగాలీలో ఘజల్స్ వ్రాయడం మొదలుపెట్టింది ఈయనే.అంతేగాక కొన్ని కొత్త రాగాలనూ ఈయన సృష్టించాడు.మరుగున పడిన రాగాలను కొన్నింటిని వెలికి తీశాడు.
ముస్లింగా పుట్టినా ఈయన ఒక ఉదారవాది.కాళీమాత భక్తుడు. అన్నిమతాలూ చెప్పినది మంచే అని భావించేవాడు.మతాలు ముఖ్యంకాదు మానవత్వం ముఖ్యం అనీ, ఆ మతాలకోసం కొట్టుకుచావడం కాదు,వాటిలోని సారాన్ని అర్ధం చేసుకుని ఆచరించాలనీ లేకపోతే ప్రయోజనం లేదనీ భావించేవాడు.ఈయన శ్రీరామకృష్ణ వివేకానందులను,వారు బోధించిన వేదాంత తంత్రభావాలనూ అమితంగా ఆరాధించేవాడు.
'శ్మశానే జాగిచే శ్యామా మా(అమ్మా కాళీ! నీవు శ్మశానంలో జాగృతురాలవై ఉన్నావు...)' అంటూ భక్తితో ఈయన వ్రాసిన శ్యామాకీర్తన నేడు బెంగాల్లో హిందువులందరి నోళ్ళలోనూ నానుతూ ఉంటుంది.ఇది ఒక చిన్న ఉదాహరణ మాత్రమే.ఇలాంటి భక్తి కీర్తనలు కొన్ని వందలు ఆయన రచించాడు.
1930 ప్రాంతాలలో ఈయన తను వ్రాసిన 800 పాటలను ప్రచురించాడు. వాటిల్లో దాదాపు 600 గీతాలు సాంప్రదాయ రాగాల ఆధారంగా వ్రాయబడినవే.ఈయన వ్రాసిన పాటలలో దాదాపు రెండువేల పాటలు కనుమరుగై పోయాయి.దొరకడం లేదు.ఈయన ఎక్కువగా భైరవీ రాగంలో తన పాటలను వ్రాసేవాడు.అప్పట్లో కొన్ని సినిమాలకు సంగీతదర్శకత్వం కూడా వహించాడు.1939 లో కలకత్తా రేడియోలో ఉద్యోగం చేస్తూ,సంగీతం మీద చాలా రీసెర్చ్ చేసి ఎన్నో మంచి ప్రోగ్రాములు అందించాడు.
ఈయన జాతకంలో ఇదంతా బుధశుక్రుల కలయికవల్లా వారిమీద ఉన్న గురుచంద్రుల దృష్టి వల్లా సూచింపబడుతున్నది.
ఇకపోతే ఈయన జీవితంలోని కష్టాలను గమనిద్దాం.
ఈయన శుక్లచతుర్దశి రోజున జన్మించాడు.పౌర్ణమి దగ్గరలో జన్మించిన వారి వివాహ జీవితాలు బాగుండవని నా రీసెర్చిలో కనిపెట్టిన జ్యోతిష్యసూత్రం ఈయన జీవితంలో కూడా అక్షరాలా నిజం కావడం గమనించండి.మన జన్మతిధిని బట్టి మన జీవితంలో జరిగే సంఘటనలు చాలావరకూ తెలుస్తాయి.దీనికీ శ్రీవిద్యోపాసనకూ సంబంధం ఉన్నది.
ఈయన మొదట్లో ఒక ముస్లిం అమ్మాయిని చేసుకుందామనుకున్నాడు.కానీ అభిప్రాయ భేదాలవల్ల నిశ్చితార్ధం సమయంలోనే ఆమెతో విడిపోయాడు.ఆ తర్వాత ప్రమీలాదేవి అనే తన అభిమానిని వివాహం చేసుకున్నాడు.కానీ వీరిద్దరి జీవితాలూ చాలా విషాదంతో ముగిశాయి.
1939 లో ప్రమీలాదేవికి నడుమునుంచి క్రింది భాగమంతా పక్షవాతం వచ్చి చచ్చుబడిపోయింది.1941 లో రవీంద్రనాథ్ టాగోర్ మరణం ఈయన్ను బాగా కృంగదీసింది.ఆ తర్వాత కొద్దినెలలకే ఈయన ఆరోగ్యం కూడా బాగా దిగజారింది.మనస్సు యొక్క స్థితి అనేది శరీరంమీద ఎంత ప్రభావం చూపిస్తుందో అనడానికి ఇదే ఉదాహరణ.
క్రమేణా ఈయనకు మతిమరుపు ఎక్కువైంది.మాటమీద అదుపు తప్పింది. ప్రవర్తన విచిత్రంగా మారింది.చివరకు 1942 లో ఈయన ఒక పిచ్చాసుపత్రిలో చేర్చబడ్డాడు.జీవితం అగమ్యగోచరంగా తయారైంది.చేతిలో డబ్బు అయిపోయింది.భార్యాభర్తలిద్దరూ నిస్సహాయ స్థితిలో ఉండిపోయారు. అలా కొన్ని సంవత్సరాలు దుర్భర పేదరికంలో,అనారోగ్యంలో జీవితం గడిచింది.
చివరకు కొందరు అభిమానులూ ముఖ్యంగా 'శ్యాంప్రసాద్ ముఖర్జీ' చొరవతో ఇద్దరినీ మంచి ట్రీట్మెంట్ కోసం లండన్ కూ ఆ తర్వాత వియెన్నా కూ 1952 లో పంపారు.ఇద్దరికీ సరియైన ట్రీట్మెంట్ ఇవ్వబడలేదని అక్కడి వైద్యులు తేల్చారు.ఈరోగాలు తగ్గేవి కావనీ,మరణించేవరకూ ఇలా బాధపడుతూ ఉండటమే తప్ప వీటికి విరుగుడు లేదనీ తేలింది.1953 లో ఇద్దరూ తిరిగి ఇండియాకు తీసుకురాబడ్డారు.
ఈయనకు పిట్స్ డిసీస్ అనేది వచ్చిందని వైద్యులు తేల్చారు.ఈ రోగంలో మెదడులోని నరాల కణాలు క్రమేణా క్షీణించిపోతాయి.దీనివల్ల విపరీతమైన ప్రవర్తన రోగిలో కనిపిస్తుంది.జ్ఞాపకశక్తి క్షీణిస్తుంది.ఆలోచనలు అదుపు తప్పుతాయి.మాట స్వాధీనంలో ఉండదు.అతిబద్ధకం నుంచి అతిప్రవర్తన వరకూ అన్ని స్థితులూ వేగంగా వీరిలో మారిపోతూ ఉంటాయి.సామాన్యంగా ఈ రోగం వంశపారంపర్యంగా జీన్స్ లో వస్తూ ఉంటుంది.
1962 దాకా అలాగే అనారోగ్యంతో బాధపడి ప్రమీలాదేవి చనిపోయింది.1972 దాకా నజరుల్ ఇంటెన్సివ్ కేర్ లోనే ఉన్నాడు.అప్పట్లో ఏర్పడిన బంగ్లాదేశ్ ప్రభుత్వం ఈయన్ను జాతీయకవిగా గుర్తిస్తూ డాకాకు ఈయన్ను ఆహ్వానించింది.1974 లో ఈయన కుమారుడు కాజీ అనిరుద్ద్ తన కనుల ఎదుటే చనిపోయాడు.ఇన్ని ఎత్తుపల్లాలనూ వైరుద్ధ్యాలనూ విషాదాలనూ తన జీవితంలో చవిచూచిన కాజీ నజరుల్ ఇస్లాం 1976 లో తన 77 వ ఏట కన్నుమూశాడు.ఆయన సమాధి బంగ్లాదేశ్ లో ఉన్నది.
మొత్తం మీద 1939 నుంచీ ఈయన జీవితం మలుపు తిరిగింది.అక్కడనుంచీ కష్టాలు ఈయన్ను వెంటాడటం మొదలైంది.ఆ తర్వాత దాదాపు 36 ఏళ్ళ పాటు నానాబాధలు పడ్డాడు.శనిగురువులు వక్రించిన జాతకాలలో పెద్దవయసు దుర్భరంగా గడుస్తుందని చెప్పే నాడీజ్యోతిష్య సూత్రం ఈ జాతకంలో అక్షరాలా నిజం కావడం గమనించవచ్చు.
ఆత్మకారకుడైన శనీశ్వరుడు జ్యేష్టానక్షత్రంలో వక్రించి ఉంటూ రోహిణీ నక్షత్రంలో ఉన్న సూర్యునితో దృష్టిని కలిగి ఉండటం అనే యోగంవల్ల పెద్ద వయస్సులో ఇన్ని కష్టాలు కలిగాయి.వక్రీకరణ వల్ల చంద్రునితో కలసిన శనీశ్వరుడు కూడా అనేక కష్టాలను ప్రసాదించాడు.ఈ యోగం వల్ల ఆధ్యాత్మిక చైతన్యం కూడా మనిషికి ఇవ్వబడుతుందని గమనించాలి.జీవితంలో కష్టాలు ఎక్కువగా ఉన్నవారే ఆధ్యాత్మికం వైపు చూస్తారు.హాయిగా సుఖంగా జీవితాలు గడపేవారు ఆధ్యాత్మికం వైపు రావడం చాలా కష్టం.ఈ విచిత్రం కూడా జాతకాలలో ప్రతిబింబిస్తూ ఉంటుంది.
ఒక విచిత్ర విషయాన్ని ఇక్కడ మనం చూడవచ్చు.Normal పరిధిని దాటనిదే ఎవడూ ఏ ప్రత్యేకతనూ పొందలేడు.మిగిలిన వారికంటే కొంత abnormality లేకుంటే ఎవరిలోనూ టాలెంట్స్ అనేవి వికసించవు.కానీ ఆ abnormality కూడా కొన్ని పరిధులలోనే ఉండాలి.ఆ పరిధులు కూడా దాటినప్పుడు అదే పిచ్చిగా మారుతుంది.అయితే పిచ్చివాడికి తనకు పిచ్చి అని తెలియదు.వాడికి అది సహజంగానే తోస్తుంది.
లిమిట్స్ లో ఉన్న abnormality ని టాలెంట్ అంటున్నాం.మరీ ఎక్కువైపోయి ఆ లిమిట్స్ కూడా దాటితే దానినే పిచ్చి అంటున్నాం.
కాజీ నజరుల్ ఇస్లాం జీవితమే దీనికి ఉదాహరణ.
నజరుల్ కూ,ఇతని భార్యకూ కూడా, నయంకాని అసాధ్య రోగాలు రావడమూ అది కూడా నరాలకు సంబంధించినవే కావడమూ చాలా విచిత్రం.ఈయన ప్రజలను స్వాత్రంత్ర్యం కోసం రెచ్చగొడుతున్నాడని గమనించిన బ్రిటిష్ వారు జైల్లో పెట్టి విషప్రయోగం చేశారనీ అందుకనే అప్పటినుంచీ ఈయనకు ఈ రోగం సంక్రమించిందనీ ఒక వాదన ఉన్నది.అందులో నిజం ఉందేమో మనకు తెలియదు.ఓషోకు కూడా అమెరికన్స్ విషప్రయోగం చేశారని ఒక వాదన ఉన్నది.అది కూడా నిజమో కాదో మనకు తెలియదు.
ఒక మనిషిలో టాలెంట్స్ మనకు నచ్చనపుడు అసూయతో విషప్రయోగం చేసి అతని జీవితాన్ని దుర్భరం చెయ్యడం పాతకాలంలో ప్రత్యర్ధుల కుట్రలో భాగంగా ఉండేది.ఒక వ్యక్తి మంచి గాయకుడైతే అతన్ని ఏ విందుకో ఆహ్వానించి మెచ్చుకుని గంగసిందూరాన్ని అతని ఆహారంలో కలిపి తినిపిస్తే అతని గొంతు పాడైపోయి జీర వచ్చేసి అతను చివరకు పాడలేని పరిస్థితికి రావడం జరిగేది.ఇలాంటి పనులు పాతకాలంలో చేసేవారు.
అంతదాకా ఎందుకు? "నువ్వు బాంబే చిత్రసీమలో పాడవద్దు.ఇక్కడ అడుగు పెట్టావంటే తేడాలోస్తాయి జాగ్రత్త"- అంటూ జేసుదాస్ కు ఇవ్వబడిన వార్నింగ్ చాలదూ మనుషులలో అసూయ ఎలా పనిచేస్తుందో గ్రహించడానికి?
అదే విధంగా-మొదటి భార్య తరఫు వారు చేయించిన క్షుద్ర ప్రయోగం వల్లనే ఈయన గతీ ఈయన భార్య గతీ ఇలా అయిందని కూడా ఒక వాదన ఉన్నది.ఇదెంత నిజమో కూడా మనకు తెలియదు.
ఒకవేళ ఈ జనన సమయం కరెక్టే అనుకుంటే -- అప్పుడు ఈ లగ్నానికి ఆధిపత్య రీత్యా పాపి అయిన శనీశ్వరుడు ఆరింట రోగస్థానంలో ఉండటం ఒక అసాధ్య దీర్ఘ రోగానికి సూచనే.అలాగే వక్రరీత్యా లగ్నాధిపతి తో కలుస్తూ మనస్సుకు సూచిక అయిన చతుర్దంలో ఉంటూ దశమస్థానంలో ఉన్న మరొక ఇద్దరు పాపులైన బుధశుక్రులను చూడటం ఈయన పడిన బాధలన్నిటికీ సూచిక.బుధశుక్రులిద్దరూ లలితకళలకూ,సంగీత సాహిత్యాలకూ కారకులన్న విషయం మనకు తెలిసినదే.అందుకే ఆ బుదునికీ శనికీ సంబందించిన నరాల రోగమే ఈయనకు వచ్చింది.
లగ్నాన్ని ఆవహించి ఉన్న పంచమాధిపతి నీచకుజుడు కూడా మతి భ్రమణానికి సంబంధించిన ఒక అసాధ్య రోగాన్నే సూచిస్తున్నాడు.
కళాకారులకు జీవిత చరమాంకంలో మెదడుకూ నరాలకూ సంబంధించిన రోగాలు రావడం మనం గమనించవచ్చు.ఉదాహరణకు ప్రఖ్యాత సంగీత దర్శకులు సాలూరి రాజేశ్వరరావు పక్షవాతంతో బాధపడ్డారు.అలాగే కేవీ మహాదేవన్ కూడా చివరలో మతిభ్రమణం(dementia) తో బాధపడ్డారు.
అయితే మహా సంగీతజ్ఞులైన త్యాగరాజు,శ్యామాశాస్త్రి,ముత్తుస్వామి దీక్షితులు మొదలైనవారికి చివరిలో ఇలాంటి మతిభ్రమణ రోగాలు,నరాల రోగాలు రాలేదు.దానికి కారణం వారికున్న భక్తి కవచం,ఉపాసనాబలం వారిని కాపాడటమే కావచ్చు.
జీవితంలో మనం ఏ అవయవాన్ని ఎక్కువగా వాడతామో దానికి చెందిన రోగమే వస్తుందనేది ఒక సామాన్య సూత్రం.అయితే ఇది ఎల్లప్పుడూ నిజం కాకపోవచ్చు.అసలు వాడని అవయవాలు కూడా క్రమేణా క్షీణించి వాటికి సంబంధించిన రోగాలు కూడా రావచ్చు.ఇదికూడా ఎల్లవేళలా నిజం కాకపోవచ్చు.ఎందుకంటే ప్రతి ప్రకృతి నియమానికీ ఒక వెసులుబాటు కూడా ఉంటుంది.
ఏదేమైనా--ఒక గొప్పకవీ,ఉదారవాదీ,భావుకుడూ,సున్నిత మనస్కుడూ, బహుముఖ ప్రజ్ఞాశాలీ అయిన ఒక మనిషి జీవితం ఇలా దుర్భర విషాదాంతం కావడం జీర్ణించుకోలేని విషయం.మనిషి ఎంతటివాడైనా చివరకు కర్మకు బద్దుడే అనడానికి ఇలాంటి జీవితాలే ఉదాహరణలు.
(సశేషం)