“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

30, జూన్ 2016, గురువారం

మా అమెరికా యాత్ర - 26 (గాంగెస్ ఆశ్రమంలో మరపురాని రోజులు) 

ఆరోజు రాత్రికి అమెరికాలోని ఇతర రాష్ట్రాలనుంచి శిష్యులందరూ వచ్చి చేరుకున్నారు.గాంగెస్ ఆశ్రమానికి దగ్గరలో 'గ్రాండ్ రాపిడ్స్' ఎయిర్ పోర్ట్ ఉంటుంది.అందరూ అక్కడ విమానాలు దిగి అక్కడనుంచి ఆశ్రమానికి వచ్చి చేరుకున్నారు.

మర్నాడు ఉదయమే యోగాభ్యాసంతో స్పిరిచ్యువల్ రిట్రీట్ మొదలైంది. నేటి చాలామంది గురువులలాగా శరీరాన్ని నిర్లక్ష్యం చెయ్యమని నేనెప్పుడూ చెప్పను.నేను ప్రాధమికంగా శ్రీరామకృష్ణుల భక్తుడినే అయినప్పటికీ, నా సాధనా విధానం, రామకృష్ణా మిషన్ వారి విధానానికి పూర్తిగా వేరుగా ఉంటుంది.నా సంబంధం అంతా సరాసరి శ్రీరామకృష్ణులతోనే గాని రామకృష్ణా మిషన్తో కాదు.

నా విధానంలో శరీరం ఒక దేవాలయం.మనం బ్రతికి ఉన్నన్నాళ్ళు దానిని ఫిట్ కండిషన్ లో ఉంచాల్సిన అవసరం చాలా ఉంది.అందుకోసం ఫిజికల్ కల్చర్ కు నేను చాలా ప్రాధాన్యత నిస్తాను.

దాదాపు ముప్పై ఏళ్ళ అనుభవంలో, నేను నాదైన ఒక ఆధ్యాత్మిక మార్గాన్ని నిర్మించాను.ఇదొక పరిపూర్ణమైన అంతరిక రహస్య సాధనామార్గం.ఇందులో అనేక లెవల్స్ ఉన్నాయి. అతిమామూలుగా నా జీవితాన్ని నేను గడుపుతూ, బయట వాళ్ళకు ఏమాత్రం తెలియకుండా నేనీ మార్గాన్ని దానిలోని లెవల్స్ నూ అర్ధం చేసుకుంటూ దానిని నిర్మించుకుంటూ వచ్చాను.ఆ లెవల్స్ నన్నింటినీ అర్హులైనవారికి దీక్షలుగా ఇప్పుడు ఉపదేశిస్తున్నాను.

నేను నా అంతరిక జీవితాన్ని ఎలా గడుపుతాను? నా చిన్నప్పటినుంచీ ఏమేం సాధనలు చేశాను? ఇప్పుడేమేం చేస్తున్నాను? అన్న విషయాలను నా స్నేహితులు, నాతోటి ఉద్యోగులే గాక, నా కుటుంబ సభ్యులు,నాతో అతి సన్నిహితంగా మెలగుతున్న వాళ్ళుకూడా - నేను చెబితే తప్ప - గ్రహించలేరు.అంత రహస్యంగా వాటిని ఈ ముప్పై ఏళ్ళుగా సాగిస్తూ వస్తున్నాను.

నా సాధనామార్గంలో అడుగుపెట్టినవారికి, మొదట్లో ఫస్ట్ లెవల్ దీక్ష ఇస్తాను. దానిని సాధన చేస్తే ఏయే అనుభవాలు కలుగుతాయో నాకు తెలుసు.దానిని బాగా సాధన చేసి అందులో అనుభవ పరిపూర్ణత పొందినవారికి,ఆ తర్వాత సెకండ్ లెవల్ దీక్ష ఇస్తాను.ఇలా మెట్టు మెట్టు ఎక్కుతూ అంతరికంగా ఎవాల్వ్ అవుతూ శిష్యులు ముందుకు ఎదుగుతారు.మధ్యలో అహంకార మమకారాలకు,అసూయా ద్వేషాలకు, ఆవేశ కావేషాలకు లోనైతే అక్కడే పడిపోతారు.ఆ లెవల్ కంటే ముందుకు ఎదగలేరు.

ఈరోజుల్లో అనేకమంది గురువులు బోధిస్తున్న అనేక సాధనలన్నీ, ఉదాహరణకు శాంభవీ మహాముద్ర గానీ, సుదర్శన క్రియగానీ,క్రియాయోగం లోని అనేక క్రియలు గానీ నా మార్గంలో అంతర్భాగాలుగా ఆయా లెవల్స్ లో వచ్చేస్తాయి.ఇవిగాక,నేటి గురువులకు తెలియని ఇంకా ఎన్నో యోగ తంత్ర మంత్ర రహస్యాలు నాకు తెలుసు.అసలైన శ్రీవిద్యోపాసనలోని సమయాచార రహస్యాలు నాకు తెలుసు.అవన్నీ నాకు నచ్చిన, నేను మెచ్చిన శిష్యులకు అమ్మ ఆజ్ఞానుసారంగా, దీక్షాప్రదానం గావిస్తాను. అంతేగాని అర్హత లేనివారికి,అహంకారులకు,ఎట్టి పరిస్థితుల లోనూ ఈ రహస్యాలను చెప్పను. వెల్లడి చెయ్యను. 

ప్రపంచంలో ఇప్పుడున్న అన్ని సాధనామార్గాల లోకీ నా మార్గం పరిపూర్ణమైన మార్గం. ఇందులో లేనిది ఇంకెక్కడా లేదు. అందుకనే నా మార్గంలో అడుగుపెట్టి ఒక్కసారి దీనిని రుచి చూచినవారికి ఇక ఏ ఇతర మార్గమూ నచ్చదు,

ఉదయం 6.30 నుంచి దాదాపు 9.30 వరకూ యోగాభ్యాస, ప్రాణాయామ పూర్వక సాధన జరిగింది. ఈ రిట్రీట్ కు హాజరైన వారికి అందరికీ నా సాధనామార్గంలో ఫస్ట్ లెవల్ దీక్షను ఇచ్చాను.బయట వాతావరణం చాలా చలిగా ఉండి, రాత్రంతా జల్లు పడుతూ,లాన్స్ అన్నీ తడితడిగా ఉండటంతో, ఆరుబయట సాధన చేద్దామన్న మా ఆలోచన సాగలేదు. అందుకని గ్రౌండ్ ఫ్లోర్ లోనే ఫర్నిచర్ కొంచం పక్కకు జరిపి అక్కడే అందరం సాధన చేశాం.

ఆ తర్వాత అందరం ఫస్ట్ ఫ్లోర్ లోని హాల్లో కూచుని ఉపాహారం సేవిస్తూ ఉండగా, స్వామి ఆత్మలోకానంద మా వద్దకు వచ్చారు.

ఈయనొక అమెరికన్ సాధువు.చిన్న వయసులోనే సన్యాసదీక్ష స్వీకరించి దాదాపు ముప్ఫై ఏళ్ళనుంచి రామకృష్ణా మిషన్ లో సన్యాసిగా ఉన్నారు. ప్రస్తుతం గౌరీమా అధ్వర్యంలో నడుస్తున్న మదర్స్ ట్రస్ట్ ఆశ్రమంలో ఉంటూ గౌరీమా పర్యవేక్షణలో ఆశ్రమ బాధ్యతలను చూచుకుంటూ ఉంటారు.అక్కడందరూ ఆయన్ను 'బాబా' అని ప్రేమగా పిలుస్తూ ఉంటారు.

గౌరీమా ఒక జర్మన్ యూదు వనిత. ఆమె కూడా 23 ఏళ్ళ వయసులోనే ఆధ్యాత్మిక మార్గానికి ఆకర్షితురాలై సన్యాసం స్వీకరించి దాదాపు నలభై ఏళ్ళుగా వేదాంత యోగ మార్గంలో నడుస్తున్న మహనీయురాలు.ప్రస్తుతం ఆమెకు 63 ఏళ్ళు. ఆమె గురించి తర్వాత పోస్ట్ లో వ్రాస్తాను.

ఆశ్రమంలో పనంతా చూచుకుంటూ ఉండాలి గనుక,పైగా చలిచలిగా ఉంది గనుక దానికి తగినట్లుగా పాంట్ షర్ట్ లోనే స్వామి ఆత్మలోకానంద ఉన్నారు.కానీ ఒక కాషాయ వస్త్రాన్ని భుజం మీద వేసుకుని ఉన్నారు.కాషాయవస్త్రం అనేది ఏదో విధంగా కొంతైనా ఒంటిమీద ఎప్పుడూ ఉండాలి.అది సన్యాసజీవిత ధర్మం.

ఆయన్ను చూస్తూనే నేను ఎదురువెళ్ళి ఆయనకు పాదాభివందనం చేశాను.మిగతా అందరినీ అలాగే చెయ్యమని సూచించాను.అందరం ఆయన ఆశీస్సులు తీసుకుని నేలమీద ఆయన ఎదురుగా ఆసీనులయ్యాము.

'నమస్తే స్వామీజీ' అని నేను అంటే 'నమస్తే గురూజీ' అని ఆయన ప్రతినమస్కారం చేశారు.

నేను ఆశ్చర్యపోయాను.

'స్వామీజీ.దయచేసి నన్ను అలా పిలవకండి.నేను నా శిష్యులకు గురువును కావచ్చు.కానీ మీకు కాదు.నా పేరుతో నన్ను పిలవండి.' అని మర్యాదగా సూచించాను.

ఆయన వినలేదు.

'గౌరీమా మిమ్మల్ని ఇలాగే పిలవమని అన్నారు.కనుక నేను ఇలాగే పిలుస్తాను' - అని ఆయన సున్నితంగానూ అదే సమయంలో దృఢం గానూ అన్నారు.

అప్పటిదాకా నేను గౌరీమాను చూడలేదు.కనుక మాట్లాడకుండా ఊరుకున్నాను.

మాటల మధ్యలో, ఆయన శ్రీమత్ స్వామి వీరేశ్వరానందగారి శిష్యులని తెలిసింది.దీనితో ఆయనంటే నాకు గౌరవం ఇనుమడించింది.ఈరోజుల్లో ఎవరు బడితే వారు 'జగద్గురువు' 'సద్గురువు' అని వాళ్లకు వాళ్ళే పేర్లు పెట్టేసుకుంటున్నారు. కానీ నిజమైన అసలైన జగద్గురువులు సద్గురువులు ఎవరూ అంటే - శ్రీమత్ స్వామి వీరేశ్వరానందజీ లాంటివారే అసలైన జగద్గురువులు,అసలైన సద్గురువులు.

నేడు బ్రతికున్న చాలామంది సోకాల్డ్ జగద్గురువులు, సద్గురువులు, ఆధ్యాత్మిక ఔన్నత్యంలో స్వామి వీరేశ్వరానందగారి కాలిగోటికి కూడా సరిపోరు.అంతటి మహనీయుడాయన.జీవితమంతా పరిపూర్ణ బ్రహ్మచర్యంతో, పరిపూర్ణ నిస్వార్ధంతో, తనకోసం కాకుండా ఇతరుల కష్టాలను తీర్చడం కోసం, దైవంకోసం బ్రతికిన ఇలాంటి ధన్యులు కాకుంటే ఇంకెవరు - మహనీయులు, జగద్గురువులు, సద్గురువులు అన్న పదానికి అర్హులు?


శ్రీమత్ స్వామి వీరేశ్వరానందజీ (యువకునిగా)

శ్రీమత్ స్వామి వీరేశ్వరానందజీ (మధ్య వయసులో}

శ్రీమత్ స్వామి వీరేశ్వరానందజీ (పెద్ద వయసులో)

శ్రీమత్ స్వామి వీరేశ్వరానంద గారు శ్రీరామకృష్ణ మఠం, మరియు మిషన్ లకు పదవ సర్వాధ్యక్షులుగా 1966 నుంచి 1985 వరకూ దాదాపు 20 ఏళ్ళు ఉన్నారు.ఎంతో ఔన్నత్యమూ, ఆధ్యాత్మికసిద్ధీ, పరిపూర్ణతా,అన్నింటినీ మించి మహాదృష్టమూ ఉంటేగాని ఇది సాధ్యంకాని విషయం.వారివద్ద నేను దీక్ష తీసుకుందామని ఎంతో అనుకున్నాను.కానీ అప్పటికి నేను చిన్నపిల్లవాడిని కావడంతో అది సాధ్యం కాలేదు.కానీ ఆయన్ను నా గురువులలో ఒకరుగానే నేను భావిస్తాను.ఈ విషయం స్వామి ఆత్మలోకానంద గారితో చెప్పాను.

ఆయనిలా అన్నారు.

'అవును గురూజీ ! 1975 ప్రాంతాలలో దాదాపు మూడేళ్ళు నేను ఇండియాలో ఉన్నాను.ఆసమయంలో మా గురువుగారికి నేను వ్యక్తిగత సేవకునిగా ఉంటూ సౌత్ ఇండియా అంతా తిరిగాను.మద్రాస్, ఊటీ, మాంగలూర్,కొచ్చిన్ ఈ ప్రదేశాలన్నీ నేను తిరిగాను.'

ఆరోజులను గుర్తు తెచ్చుకుంటుంటే ఆయన స్వరం అదో విధమైన మంద్రంగా మారిపోయింది.ఆనాటి ధన్యములైన రోజులను మళ్ళీ ఆయన ఆస్వాదిస్తున్నట్లు నాకర్ధమైంది.

'ఆయనొక అద్భుతమైన మహనీయుడు.చూడటానికి చాలా పిట్టమనిషిలా ఉండేవారు. కానీ ఆయన అరచేతులు మాత్రం ఆయన సైజుకు మించి పెద్దవిగా ఉండేవి. ఎంతో శాంత సౌమ్య స్వభావుడు.'

అప్పుడు నేనిలా అన్నాను.

'స్వామీజీ. మీ గురువర్యులైన శ్రీమత్ స్వామి వీరేశ్వరానంద గారు సాక్షాత్తు జగజ్జనని అయిన శారదామాత శిష్యులు.ఆయన చేతులతో అమ్మ పాదాలను ఆయన స్పర్శించారు.శ్రీమత్ స్వామి బ్రహ్మానందగారి చేతులమీదుగా ఆయన సన్యాసదీక్షను పొందారు.ఆయన మామూలు మనిషి కాదు.సాక్షాత్తూ మనిషి రూపంలో ఉన్న ఎవరో ఒక దేవతే. అలాంటి వారికి మీరు సేవ చేశారు.మీ చేతులతో ఆయన పాదాలను మీరు తాకారు.కనుక మిమ్మల్ని తాకితే మేము సాక్షాత్తు శారదామాత పాదాలను స్పర్శించినట్లే'

ఇలా అంటూ ఆయన అరచేతులను నా నొసటికి ఆనించుకుని మనస్సులో అమ్మకు ప్రణామం గావించాను.

నా  ఫీలింగ్స్ ను అర్ధం చేసుకున్నట్లుగా ఆయన తల పంకించాడు.

' నేను ఆయన్ను దర్శించే సమయానికే,స్వామి వీరేశ్వరానందజీ చాలా పెద్దవారయ్యారు.రోజులో ఎక్కువభాగం ఆయన మౌనంగా కూచుని ఉండేవారు.ఆయన ధ్యానసమాధి లో ఉన్నారో, లేక మామూలు స్పృహలో ఉన్నారో మాకు తెలిసేది కాదు.కానీ అలా ఉంటూ కూడా, అంత పెద్ద అంతర్జాతీయ సంస్థను 20 ఏళ్ళపాటు ఆయన ఎంతో సమర్ధవంతంగా నడిపారు.ఆయన హయాం లోనే రామకృష్ణా మిషన్ ఎంతో వృద్ధిచెందింది.

నేను ఆయనకు పర్సనల్ సేవకునిగా చాలాకాలం ఉన్నాను.ఆ సమయంలో కొన్ని విచిత్రమైన సంఘటనలను నేను గమనించాను.

రాత్రిపూట ఉన్నట్టుండి ఆయన పక్కమీద లేచి కూచునేవారు.ఆయన దగ్గర ఒక చిన్నడబ్బీ ఉండేది.దానిలో శారదామాత చితాభస్మం కొంత ఉండేది. ప్రతిరోజూ దానిని తెరచి తన కళ్ళకు అద్దుకుని మళ్ళీ దాని మూతపెట్టి భద్రంగా దాచుకునేవారు.ఆయన దగ్గర చాలా చిన్న మీనియేచర్ ఫోల్డర్ కూడా ఒకటి ఉండేది.అందులో శ్రీరామకృష్ణులు,శారదామాత, వివేకానందుల ఫోటోలు ఉండేవి.పెద్దవయసులో ఆయనకు కళ్ళు సరిగా కనిపించేవి కావు. అలా రాత్రిపూట లేచి కూచుని ఆ ఫోల్డర్ తెరచి దానిని కళ్ళదగ్గరగా పెట్టుకుని దానివంక తదేకంగా చూస్తూ కొన్ని గంటలు గడిపేవారాయన.ఆ తర్వాత మళ్ళీ నిద్రపోయేవారు.

ఆ రోజులలో స్వామి నిర్వాణానంద గారని ఒక స్వామీజీ బేలూర్ మఠంలో ఉండేవారు.ఆయనకూడా బాగా వృద్ధుడు.వీరందరూ శారదామాతను దర్శించి అమ్మదగ్గరా, లేకపోతే,స్వామి బ్రహ్మానంద,స్వామి శివానంద,స్వామి అఖండానంద వంటి శ్రీరామకృష్ణుల డైరెక్ట్ శిష్యుల దగ్గరా దీక్షలు తీసుకున్న మహనీయులు.

స్వామి నిర్వాణానందగారు బ్రహ్మజ్ఞాని యని బేలూర్ మఠంలో చాలామందికి తెలుసు.అందుకే ఆయనతో ఎంతో గౌరవంగా భయభక్తులతో మెలిగేవారు. స్వామి నిర్వాణానంద గారు బాగా వృద్ధుడు కావడంతో తనగది నుంచి ఎక్కడికీ కదిలేవారు కారు. ఒకరోజున మాత్రం,తనొచ్చి ప్రెసిడెంట్ స్వామీజీ అయిన స్వామి వీరేశ్వరానంద గారిని ఆయన ఉండే క్వార్టర్స్ లో దర్శిస్తానని ఆయన చెప్పారు. ప్రెసిడెంట్ మహరాజ్ గారి క్వార్టర్, బేలూర్ మఠం నుంచి గంగానది వైపుగా పోయే దారిలో, శారదామాతను, వివేకానంద స్వామిని,ఇంకా శ్రీరామకృష్ణుల మిగతా ప్రత్యక్ష శిష్యులను దహనం చేసిన ప్రదేశం దగ్గరగా ఒక పక్కగా ఉంటుంది.ఆ ఇంటికి వచ్చి స్వామి దర్శనం చేసుకుంటానని బ్రహ్మజ్ఞానిగా పేరొందిన స్వామి నిర్వాణానందగారు కబురు చేశారు.

వీరిద్దరూ దాదాపు ఒకే వయసు వారు.ఒకే సమయంలో మఠంలో బ్రహ్మచారులుగా చేరారు.ఒకరికొకరు మంచి స్నేహితులు.కానీ ప్రెసిడెంట్ మహరాజ్ కావడంతో స్వామి వీరేశ్వరానంద గారిని స్వామి నిర్వాణానంద గారు అమితంగా గౌరవించేవారు.

ఇద్దరు మహనీయుల మధ్య సమావేశం ఎలా జరుగుతుందో చూద్దామని మేమంతా ఎంతో ఉత్సుకతతో ఉన్నాం.

అప్పుడు స్వామి వీరేశ్వరానంద గారు మమ్మల్ని పిలిచి ఇలా అన్నారు.

'చూడండి. ఆయన వస్తున్నారు. ఆయన బాగా పెద్దవాడై పోయాడు కనుక చాలా రోగాలు ఆయన దేహాన్ని బాధిస్తున్నాయి. అందుకని ఆయన మీదనుంచి వచ్చే గాలి నాకు సోకకుండా ఒక టేబుల్ ఫ్యాన్ ను నా వైపునుంచి ఆయనవైపుకు గాలి తోలేటట్లు పెట్టండి.'

ఇంకేదో ప్రత్యేక ఏర్పాట్లు చేయ్యమంటారని ఆశించిన మేము ఇది విని చాలా ఆశ్చర్యపోయాము.కానీ మహనీయులు ఎలా ప్రవర్తిస్తారో ఎవరూ ఊహించలేరు కదా.అందుకని అలాగే ఒక టేబుల్ ఫ్యాన్ ను ఏర్పాటు చేశాము.

అనుకున్నట్లుగా, ఆ రోజు రానే వచ్చింది. చెప్పిన సమయానికి స్వామి నిర్వాణానంద గారు వచ్చారు.ఎవరు ఎవరికి నమస్కరిస్తారో అని మేము ఉత్కంతగా ఎదురు చూస్తున్నాము.

వస్తూనే ఏ నమస్కారమూ చెయ్యకుండా పెద్ద గొంతుతో ఆయన ఇలా అన్నారు.

'ఏం ప్రభూ ! ఎలా ఉన్నావ్?'

సన్యాసం తీసుకోక ముందు స్వామి వీరేశ్వరానందగారి అసలు పేరు 'పాండురంగ ప్రభు'. అందుకని ఆయన్ను 'ప్రభూ' అని సంబోధించారు స్వామి నిర్వాణానంద గారు.

'బాగానే ఉన్నాను.నువ్వెలా ఉన్నావ్' అని ఈయనడిగారు.

'నేనూ బానే ఉన్నాను' అని కాసేపు కూచుని వెనక్కు తిరిగి వెళ్లిపోయారాయన.

అంతకు మించి వాళ్ళు ఏమీ మాట్లాడుకోలేదు.

మహనీయుల ప్రవర్తనలు చాలా విచిత్రంగా ఉంటాయి. ఈ విషయాన్ని ఆరోజుల్లో నేను ప్రత్యక్షంగా చూచాను. 

వింటున్న నేను ఇలా అన్నాను.

'స్వామీజీ. మీరు చాలా అదృష్టవంతులు. అలాంటి మహనీయునికి మీరు సేవ చేసే భాగ్యాన్ని పొందారు.ఇండియాలో ఉన్న మేమే ఆ అదృష్టానికి నోచుకోలేదు.కానీ ఎక్కడో అమెరికాలో పుట్టిన మీకు ఆ భాగ్యం పట్టింది.ఇదే అమ్మలీల అంటే.మీరు ఏదో జన్మలో ఇండియావారే.అందుకే అమెరికాలాంటి భోగభూమిలో పుట్టినా మీలో ఇంత లోతైన ఆధ్యాత్మిక సంస్కారాలున్నాయి.'

నిజమే అన్నట్లుగా నవ్వారాయన.

(ఇంకా ఉంది)
read more " మా అమెరికా యాత్ర - 26 (గాంగెస్ ఆశ్రమంలో మరపురాని రోజులు) "