“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

19, జూన్ 2016, ఆదివారం

మా అమెరికా యాత్ర - 22 (డెట్రాయిట్ లో ఆశ్రమ జీవితం)
































మళ్ళీ మన అమెరికా అనుభవాలు ముచ్చటించుకుందాం !!

మన శిష్యబృందం అంతా కలవడానికి ఒక ఆశ్రమాన్ని డెట్రాయిట్లో తాత్కాలికంగా తీసుకోవడం జరిగింది.అది ఒక లేక్ ఒడ్డున ఉన్న టూ బెడ్ రూమ్ ఇండిపెండెంట్ హౌస్.ఆ ఇల్లు మా అందరికీ తెగ నచ్చేసింది.అందులో వైబ్స్ కూడా చాలా అద్భుతంగా అమర్చబడి ఉన్నాయి.

దాదాపుగా ప్రతిరోజూ ఒక పూట అయినా అక్కడకు పోయి అందరం అక్కడ కూచుని మాట్లాడుకుంటూ కాలక్షేపం చెయ్యడం జరిగింది.అందరూ ప్రతిరోజూ రాలేరు గనుక, ఎవరికి వీలైన పూట వాళ్ళు వస్తూ ఉండేవారు.కాలక్షేపం అనే మాట ఈ సందర్భంలో సరియైనది కాదని నాకు తెలుసు.కానీ ఇంకొక పదం లేదు గనుక అదే వాడుతున్నాను.

నేను మాట్లాడుతున్నది వింటున్నపుడే చాలామందికి ధ్యానస్థితి దానంతట అది వచ్చేస్తూ ఉంటుంది గనుక ప్రత్యేకంగా కూచుని ధ్యానం చెయ్యవలసిన పని ఎవరికీ లేకపోయింది.

USA లో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన శిష్యులు ఈ ఆశ్రమంలో బస చేశారు.వారికి కూడా అది లాడ్జ్ గా ఉపయోగపడింది.

అక్కడ ప్రతిరోజూ ఒక పండుగ లాగే జరిగింది. అందరం కలసి మెలసి ఒకే కుటుంబంలా కబుర్లు చెప్పుకుంటూ, నవ్వుకుంటూ, ఎంతో ఆహ్లాదంగా రోజులు గడిచాయి.ఆరోజు వరకూ ఎవరూ ఎవరికీ పరిచయం లేదు.కానీ ఎప్పటినుంచో అందరం ఒకరికొకరు పరిచయం ఉన్నవారిలా అనిపించిందిగాని ఎవరికీ ఎవరూ కొత్తవారిలా తోచలేదు.అంతలా అందరూ కలసి పోయారు.ఏదో అర్ధంకాని ఆనందం అందరిమధ్యనా అలా ప్రవహించి అందరి హృదయాలనూ ఒకటిగా కలిపేసింది..

ఈ ఆశ్రమంలో చాలా సంభాషణలు నడిచాయి.

శ్రీవిద్యోపాసన గురించి,లలితా సహస్రనామాల రహస్యార్దాల గురించి, తంత్ర సాధనల గురించి, ఆధ్యాత్మిక జీవితపు లోతైన విషయాల గురించి,ఎన్నో మార్మికమైన అంతరిక లోకపు రహస్యాల గురించి,మా గురువుల గురించి,శ్రీ రామకృష్ణుల దివ్యత్వం గురించి,నా చిన్నప్పటి విషయాల గురించి, గంటలు గంటలు మాట్లాడాను.

ఈ ఆశ్రమంలోనే మొదటిసారి నేను నా శిష్యురాళ్ళలో ఇద్దరికి తంత్రోక్త విధానంలో శ్రీవిద్యాదీక్షను ఇచ్చాను.వాళ్ళిద్దరూ మామూలు మనుషులు కారు.అమ్మవారి అంశను తమలో కలిగి ఉన్న ధన్యాత్మలు.కానీ వాళ్ళ సంగతి వాళ్లకు తెలీదు. "మేం చాలా మామూలు మనుషులం"-అని వాళ్ళు అనుకుంటున్నారు. అటువంటి మంచి మనుషులు చాలా అరుదుగా మనకు కనిపిస్తారు.

ఇప్పటివరకూ నేను మంత్రదీక్షలను ఎవరికీ ఇవ్వలేదు.ఆ అంకానికి ఇండియా నేలమీద కాకుండా, అమెరికా గడ్డమీద బీజం పడింది.ఆ తర్వాత గాంగెస్ ఆశ్రమంలో మళ్ళీ నలుగురికి దీక్షలు ఇచ్చాను.ఆ విధంగా ఈ యాత్రలో మంత్రదీక్షా ప్రదానాలు ప్రారంభం అయ్యాయి.

ఇదే ఆశ్రమంలో ఒక రాత్రంతా నేను ఒంటరిగా ఉన్నాను.ఎవరూ లేని పెద్దపెద్ద ఇళ్ళలో ఒక్కడినే రాత్రిళ్ళు ఒంటరిగా ఉండి సాధన చెయ్యడం నాకు చాలా ఇష్టం అని గతంలో కూడా వ్రాశాను.ఆ విధంగా అక్కడ ఉన్నాను.

చీకటి రాత్రి.

చడీ చప్పుడు లేని వాతావరణం.పూర్తి ఏకాంతం. అప్పుడప్పుడూ ఒక కారు అలా రోడ్డు మీదగా పోతూ ఉంటుంది.ఆ ఇంట్లో లైట్లన్నీ ఆపేసి ఒక్కడినే హాల్లో దయ్యంలాగా కూచుని ఆ గ్లాస్ విండో లోనుంచి బయట చీకట్లో జుట్టు విరబోసుకున్న దయ్యాల్లా కనిపిస్తున్న పెద్దపెద్ద చెట్లను చూస్తూ మంత్రజపం చేస్తుంటే భలేగా అనిపించింది ఆ రాత్రంతా.

ఆ రాత్రి కొన్ని మరపురాని అనుభవాలు కలిగాయి.అయితే వాటిని ఇక్కడ వ్రాయబోవడం లేదు.

ఆశ్రమంలోని ఒక కిటికీ లోనుంచి బయటకు చూస్తే మాత్రం, ఇంటి చుట్టూ ఉన్న చెట్లలో ఒక చెట్టు - అమరావతి శివాలయంలోని శివలింగంలాగా అనిపించింది.దానికి కూడా ఒక ఫోటో తీసి భద్రపరచాను.

అక్కడ పక్కనే ఉన్న లేక్ కు అప్పుడప్పుడూ వ్యాహ్యాళిగా నడచుకుంటూ వెళ్ళేవాళ్ళం. ఆ చెట్లలో ఆ వాతావరణంలో అలా నడుస్తూ వెళుతుంటే చాలా అద్భుతంగా అనిపిస్తుంది. ధ్యానం బాగా అలవాటున్న వాళ్లకు అది స్వర్గమే అని అనిపిస్తుంది.

మొదటిసారిగా జనం నివసించే ప్రాంతాలలో ఉన్న లేక్ లో హంసలను చూచాము. చాలా హంసలు అక్కడ లేక్ లో చక్కగా ఈత కొడుతూ ఉన్నాయి.కొన్నైతే నీటి మీద తేలుతూ హాయిగా నిద్రపోతున్నాయి.హంస ఎక్కడైతే ఉన్నదో అక్కడ స్వచ్చత ఉన్నట్లు లెక్క.మురికిగా ఉన్నచోట్లలో హంస ఉండలేదు. ఉండబోదు కూడా.

ఇదే ఆశ్రమంలో ఒకరోజు సాయంత్రం అందరం అలా మాట్లాడుకుంటూ కూచున్నప్పుడు పద్మజ, డాక్టర్ పద్మిని ఇద్దరూ లోతైన ధ్యానస్థితిలోకి వెళ్ళిపోయి దాదాపు ఒక గంటన్నర సేపు బయటకు రాలేదు.వారిని చూచి మిగతావాళ్ళు కూడా అలాగే ధ్యానస్థితిలోకి వెళ్ళారు.చివరకు వారిని ఆ స్థితిలోనుంచి బలవంతంగా బయటకు తేవలసి వచ్చింది.

ఒకరోజున లేక్ ఒడ్డుకు వ్యాహ్యాళికి వెళ్ళినపుడు అందరం అక్కడ చెక్కమెట్ల మీద కూచుని ఆ నీళ్ళను చూస్తున్నాం.అప్పుడు వాళ్లకు ఓల్డ్ హిందీ మెలోడీ సాంగ్స్ చాలా పాడి వినిపించాను.

ఆ ఆశ్రమంలో గడపిన ప్రతిరోజూ చాలా ఆనందంగా గడిచింది. అందరం అన్నీ మర్చిపోయి ఏదో ఆనందలోకంలో విహరిస్తున్నట్లుగా ఉంది.ఆ కొద్ది రోజులూ ఎవరికీ వాళ్ళ వాళ్ళ జీవితాలు, వాటిల్లో బాధలూ, సమస్యలూ, ఏవీ గుర్తు రాలేదు.

అన్ని సమస్యలూ మరచిపోయి, హాయిగా అడవిలో పక్షులలాగా, కొలనులో హంసలలాగా,ఆనందంగా విహరిస్తూ ఉన్నట్లు అందరికీ ఏదో తెలియని ఆనందం కలిగింది.ఎప్పటినుంచో ఆ నేలతో ఏదో అనుబంధం ఉన్నట్లు,గతంలో అక్కడ మేం నివసించినట్లు ఒక విధమైన 'డె-జావూ' ఫీలింగ్ కలిగింది.చివరి రోజున ఆ ఇల్లు వదిలేసి వెనక్కు వస్తున్నపుడు కూడా ఏదో తెలియని బాధ కలిగింది.

ఇప్పుడు వెనక్కు తిరిగి చూస్తే,ఆ ఫీలింగ్స్ అన్నీ ఏమిటో, ఎందుకలా అనిపించిందో,అలా అనిపించడానికి కారణాలేమిటో, ఎవరికీ ఏమీ అర్ధం కావడం లేదు.

(ఇంకా ఉంది)