“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

12, జూన్ 2016, ఆదివారం

చంద్రశేఖర సరస్వతి -4 (అద్భుతమైన జీవితాలు)

చంద్రశేఖర్ చెప్పడం సాగించాడు.

'హిమాలయాలలో ఏదో ఉంది అన్నగారు.అదేంటో మనకు తెలీదు.కానీ ఏదో ఉంది.అక్కడ ఏవో మనకు అర్ధంకాని వైబ్రేషన్స్ ఉన్నాయి.ఏదో ఒక విధమైన అతీతమైన ప్రశాంతత అక్కడ ఉన్నది.బహుశా అనేక వేల ఏళ్ళ నుంచి లక్షలాదిమంది ఋషులు మహానుభావులు అక్కడ ఉండి అక్కడే చనిపోవడం వల్ల ఆ హై ఎనర్జీ వైబ్రేషన్స్ అక్కడ ఇంకా ఉన్నాయని నా భావన.

ఇప్పటికీ అక్కడ అనేక మంది మహానుభావులున్నారు.నేను చూచాను.అయితే కాషాయం కట్టిన ప్రతివాడూ జినైన్ సాధువు కాదు.నూటికి తొంభైమంది ఫ్రాడ్ కావచ్చు.కానీ మిగిలిన పది మందీ మాత్రం మహోన్నతమైన వాళ్ళున్నారు.ఇప్పటికీ ఉన్నారు.అలాంటి మనుషులు మనకు భూమ్మీద ఎక్కడా దొరకరు.అలాంటి జాతి వజ్రాలు వాళ్ళు.

హిమాలయాలలో ఎన్నో గొప్పగొప్ప ప్రదేశాలున్నాయి.కానీ రెండు ప్రదేశాలు మాత్రం చాలా అద్భుతమైన వైబ్రేషన్స్ తో ఉన్నాయి.ఒకటి గంగోత్రి. రెండు బదరీనాద్ నుంచి కేదారనాద్ వెళ్ళే దారిలో ఒక ప్రదేశం వస్తుంది.అది. నేను సీనిక్ బ్యూటీ గురించి చెప్పడం లేదు.భౌతిక సౌందర్యం మనల్ని ఆకర్షించలేదన్నగారు.అక్కడ ఉన్న ఆధ్యాత్మిక తరంగాల గురించి నేను అంటున్నాను. చాలా హై లెవల్ ఎనెర్జీ వైబ్స్ అక్కడ ఉన్నాయి.అక్కడున్నంత సేపూ మనకసలు బయట ప్రపంచం గుర్తు రాదు.

మన మైసూరు స్వామీజీ ఏభై ఏళ్ళ క్రితం IAS ఆఫీసరు.ముప్పై ఏళ్ళ వయసులో జాబ్ రిజైన్ చేసి ఉత్తరకాశీలో నలభై ఏళ్ళు తపస్సులో గడిపాడాయన. అక్కడ ఉష్ణోగ్రత మైనస్ లో ఉంటుంది.వింటర్ లో అయితే మైనస్ 17 దాకా వెళ్ళిపోతుంది. అంతా మంచు మయం. ప్రాణాల మీద ఆశ ఉన్నవాడు ఎవడూ ఆ వాతావరణంలో ఏ విధమైన మెడికల్ సహాయమూ లేకుండా ఉండలేడు. ఈశ్వరుని మీద అచంచలమైన విశ్వాసంతో మాత్రమే వాళ్ళు అక్కడ ఉంటారు. అంతే !!

గంగోత్రిలో నాకు ఒక విశిష్టమైన సాధువు పరిచయం అయ్యాడు.ఆయన పేరు విజయ చైతన్య.అందరూ విజయ్ జీ అంటారు.ఆయన మన తెలుగువాడే.ముప్ఫై ఏళ్ళ క్రితం ఆయన IOC లో మంచి ఉద్యోగంలో ఉన్నాడు. ఈ ప్రపంచ జీవితం మీద విరక్తి పుట్టి ఉద్యోగానికి రిజైన్ చేసి అప్పటినుంచీ గంగోత్రిలో ఉంటూ తపస్సు చేస్తున్నాడు.ఆయన రూమ్ పక్క రూమ్ లోనే నేను ఈ మూడు నెలలూ ఉన్నాను. అబ్బా ! ఏం మనిషన్నగారు !!

ఈ ముప్పై ఏళ్ళలో ఆయన కుటుంబం ఏమైందో ఆయనకు తెలీదు.ఎవరితోనూ సంబంధాలు లేవు.ఈయన చనిపోయాడనే అందరూ  అనుకున్నారు.ఈ మధ్య వాళ్ళ తమ్ముడు ఒకాయన బదరీనాథ్ వెళ్ళినపుడు అనుకోకుండా ఈయన్ను కలిశాడు. అప్పుడు -'అన్నయ్యా బ్రతికే ఉన్నావా? అమ్మా నాన్నా అందరూ చనిపోయారు.' అని చెప్పాడుట.

హిమాలయాలు మొత్తం కాలినడకన ఈయన తిరిగాడు.టిబెట్ నుంచి హరిద్వార్ వరకూ ఎక్కడ ఏముందో ఆయనకు తెలుసు.సామాన్యంగా గంగోత్రిలో వింటర్ ఆర్నెల్లు ఎవరూ ఉండరు.టెంపరేచర్ మైనస్ 17 కు పడిపోతుంది. అందరూ ఖాళీ చేసి వచ్చేస్తారు.కానీ విజయ్ జీ మాత్రం ఇంకొక ఇద్దరు ముగ్గురు తీవ్ర సాధకులతో కలసి ఏకధాటిగా 14 ఏళ్ళు అక్కడే ఉన్నాడు.వాళ్లకు స్వెట్టర్లు లేవు.కాళ్ళకు చెప్పులు కూడా లేవు.ఏ రోగం వచ్చినా ఆ ఉత్త కాళ్ళతో ఆ మంచులో నడుస్తూ దాదాపు 22 మైళ్ళు వస్తే గాని కనీస వైద్య సహాయం దొరకదు.

వింటర్లో అక్కడ ఉండాలి అనుకునేవారికి ఒకటే రూల్. రోగం వచ్చినపుడు,దానంతట అది తగ్గితే తగ్గుతుంది.లేకుంటే ప్రాణం పోతుంది.ప్రాణం ఉన్నా పోయినా వాళ్లకు ఒకటే. ప్రతిరోజూ చనిపోవడానికి వాళ్ళు సిద్ధంగానే ఉంటారు. దైవధ్యానంలో అలా ఉంటూ ఉంటారు. అంతే !! అంత తీవ్ర వైరాగ్యం వారిది.ఇక వాళ్లకు ప్రపంచ వ్యామోహాలు ఏముంటాయి అన్నగారు?

"ఔషధం జాహ్నవీ తోయం వైద్యో నారాయణో హరి:"

వారికి ఉన్న ఏకైక మందు గంగాజలం.

ఏ రోగం వచ్చినా దైవాన్నిస్మరిస్తూ గంగాజలం త్రాగుతారు.

వారిని రక్షించే ఒకే ఒక్క వైద్యుడు భగవంతుడు.

ఆయన ఇచ్చ అయితే ప్రాణం ఉంటుంది.లేకుంటే పోతుంది. అంతే !!

అలాంటి అచంచల విశ్వాసంతో,పరిపూర్ణ శరణాగతితో,నిష్ఠతో తపస్సులో ఉన్నవాళ్ళు ఎంతో మంది హిమాలయాలలో ఈనాటికీ ఉన్నారు. వాళ్ళవల్లనే ఈ దేశంలో ఇంకా ధర్మం మిగిలి ఉన్నది అన్నగారు.

ఒకసారి విజయ్ జీ హిమాలయాలలో నడుస్తూ పోతున్నాడు.వాళ్ళు బస్సులు కార్లు ఎక్కరు. భగవధ్యానంలో అలా నడుస్తూ పోతుంటారు.ఎవరైనా ఏదైనా పెడితే తింటారు.లేకుంటే అలా పోతూ ఉంటారు.అంతే.

దేహభ్రాంతిని పోగొట్టుకోవడానికి ఇలాంటి సాధనలు వాళ్లకు చాలా సాయపడతాయి.దైవం మీద శరణాగతి బలపడటానికీ అచంచలమైన విశ్వాసం లోలోపల కలగడానికీ అవి ఉపయోగ పడతాయి.పొద్దున్న లేచిన దగ్గరనుంచీ టైముకు కాఫీ అందకపోతే ఇంట్లో వాళ్ళను తిట్టి నానా రచ్చ చేసే మనలాంటి క్షుద్రులకూ అల్పులకూ వాళ్ళ స్థాయి అసలు ఊహకు కూడా అందదు అన్నగారు. నిజమైన జీవితం అంటే అది !!

అలా నడుస్తూ పొతున్నపుడు, రెండురోజులనుంచీ ఆయనకు తిండి దొరకలేదు.కానీ అలా ఆ అడవిలో మంచులో ఈశ్వరధ్యానంలో అలా నడుచుకుంటూ పోతూనే ఉన్నాడు.ఇక పడిపోయే స్థితి వచ్చిందట. "పోతే పోనీ ప్రాణం"- అని దైవధ్యానం వదలకుండా అలా ఈడ్చుకుంటూ పోతున్నాడు.

ఇంతలో ఒక టూరిస్ట్ బస్సు ఆ దారిలో పోతూ ఉన్నదట. అందులోనుంచి ఎవరో ఒకామె - 'స్వామీజీ ! రోటీ ఖావో !' అని అరుస్తూ ఒక రొట్టెల పార్సిల్ విసిరేసిందట. ఆ వేగానికి అది పోయి, ఆ లోయలో కొంచం దిగువగా పడిపోయిందట.వాళ్లకు వచ్చే పరీక్షలు అలా ఉంటాయి.

ఆ లోయలు కళ్ళు తిరిగేంత లోతుగా ఉంటాయి.పడితే ఎముకలు కూడా మిగలవు. ఆ పార్సిలేమో చేతికి అందేటట్లు లేదు.ఏం చెయ్యాలి? ఒక పక్కన కళ్ళు తిరిగి పడిపోయే స్థితి. తన వంటిమీద ఉన్న పంచెను విప్పి, దానిని ఒక చెట్టుకు కట్టి, దిసమొలతో ఆ పంచెను పట్టుకుని లోయలోకి దిగి ఆ చపాతీల పొట్లాన్ని తీసుకుని మళ్ళీ పైకెక్కి, పంచె కట్టుకుని, ఆ చపాతీలు తిని నీళ్ళు త్రాగి కాస్త ఓపిక వచ్చాక మళ్ళీ నడక సాగించి ఒక మఠానికి చేరుకున్నాడట.

పంచె సాయంతో లోయలోకి దిగేటప్పుడూ ఎక్కేటప్పుడూ అది ఏమాత్రం చిరిగినా పోయి ఎక్కడ పడతాడో కూడా తెలియదు.ఒంట్లో ఒక్క ఎముక కూడా మిగలదు.అంత లోతుగా ఉన్నదట ఆ లోయ !!

అలాంటి సంఘటనలు ఎన్నో ఆయన జీవితంలో జరిగాయి.

'ఈశ్వరుడు ఎప్పుడూ మనల్ని రక్షిస్తాడు చంద్రశేఖర్!! యోగీశ్వరుడైన ఆయనే మనకు రక్షకుడు.' అని ఆయన నాతో అన్నాడు. 

'ఆయన పేరేంటి తమ్ముడూ అలా ఉంది.అది బ్రహ్మచారి నామమే గాని సన్యాస నామం కాదే?' అడిగాను.

'అవునన్నగారు.అక్కడ రెండు సంప్రదాయాలున్నాయి.ఒకటి సన్యాస సాంప్రదాయం.ఇంకొకటి నైష్టిక బ్రహ్మచర్య సాంప్రదాయం. ఈ రెండో వారు కూడా సన్యాసుల వలెనె బ్రతుకుంటూ ఉంటారు.వీరు సన్యాసం కూడా తీసుకోరు.అది మాకు అక్కర్లేదు అని వారంటారు.అంటే సన్యాసాన్ని కూడా త్యాగం చేస్తారన్నమాట.వీరిని కూడా సన్యాసుల లాగే గౌరవిస్తారు.

అవధూత అఖాడా అని అవధూతల మండలి అక్కడ ఒకటి ఉన్నది.దానికి ఈయన్ను నేతగా ఉండమని చాలాసార్లు ఈయనకు ఆఫర్ వచ్చింది.కానీ తిరస్కరించాడు.

ఈయన నాతో ఇలా అన్నాడు అన్నగారు.

'చంద్రశేఖర్ !! సాధువన్నవాడు పక్షిలా బ్రతకాలి.పక్షి గాలిలో ఎగురుతుంది.కానీ తన అడుగుజాడలను ఎక్కడా వదలదు. మనమూ అలా ఉండాలి.ప్రపంచంలో మనం దేనికీ బానిసలం కారాదు.మన అడుగులు ఎక్కడా పడకూడదు. మనం ఈ లోకం నుంచి వెళ్ళిపోయిన మరుక్షణం మన గుర్తులు ఏవీ ఇక్కడ ఉండకూడదు.ఆ విధంగా మనం నిష్క్రమించాలి.

'మీరు ముప్పై ఏళ్ళ నుంచి ఇలాంటి పరిపూర్ణ వైరాగ్య జీవితం గడుపుతున్నారు కదా.ఇంకా మీరు సన్యాసం తీసుకోకపోవడం ఏమిటి?' అని నేను అడిగాను.

'దానికి ఇంకా నాకు అర్హత రాలేదు.' అని ఆయన అన్నాడు.

నాకు మతి పోయింది.

'మీకే రాకపోతే ఇంకెవరికి అది వస్తుంది?' అని నేను అడిగాను.

'నీకర్ధం కాదు చంద్రా! దానికి ఇంకా చాలా అర్హతలు కావాలి' అని ఆయన బదులిచ్చాడు.

అలాంటి మనుషులు హిమాలయాలలో  ఉన్నారన్నగారు !!

అవధూతలను చాలా మందిని నేను చూచాను.

వాళ్ళు పిచ్చివాళ్ళలాగా కనిపిస్తారు.వారిని మామూలుగా చూస్తె, వారిలో దైవత్వం ఏదీ మనకు కనిపించదు.కానీ వాళ్లకు మనం నచ్చితే అప్పుడు వారి శక్తి ఏమిటో మనకు చూపిస్తారు.

విజయ జీ నాతో ఇంకా ఇలా అన్నారు.

'నిజమైన అవధూత లక్షణం ఏమిటో తెలుసా? అతని సమక్షంలో నువ్వు ఏమీ చెయ్యకుండా ఊరకే కూచుంటే, నీ మనసు గనక నిశ్చలం అయిపోయి, ఏదో తెలియని ప్రశాంతత నిన్ను ఆవరిస్తే, ఆ కాసేపూ బయట ప్రపంచం నీకు గుర్తురాకపోతే, ఏదో తెలియని ఆనందం నీకు లోలోపల కలిగితే - అతన్ని నిజమైన అవధూతగా గుర్తించు.'

అతని బాహ్యవేషం చూచి మోసపోకు. అవధూతలు లోకానికి తెలియబడరు.వారు రకరకాలుగా ఉంటారు.కొందరు పిచ్చివాళ్ళలా ఉంటారు.కొందరు నగ్నంగా తిరుగుతూ ఉంటారు.కొందరు మామూలు సాధువేషంలోనే ఉంటారు. కొందరైతే ఏ ప్రత్యేకతా లేకుండా అతి సామాన్యంగా ఉంటారు. కానీ నిజమైన అవధూత సమక్షంలో నేను చెప్పినవన్నీ జరుగుతాయి.అదే నీకు అసలైన గీటురాయి.'

అటువంటి అవధూత మండలికి ఈయన్ను నాయకుడిగా ఉండమంటే ఈయన తిరస్కరించాడు. ఇక ఈయన ఎలాంటి వాడో చూడండి అన్నగారు !!

వణికించే చలిలో 14 ఏళ్ళు ఏకధాటిగా ఆయన గంగోత్రిలో ఉంటూ సాధన చేశాడు.ఆ సమయంలో ఆయన దగ్గర ఏమీ లేదు.డబ్బు లేదు.తిండి లేదు.మందులు లేవు.కట్టుకోడానికి సరైన బట్టలు కూడా లేవు.దొరికితే తింటారు.లేకుంటే పస్తులుంటారు.ఒంటిమీద బట్టలు చిరిగిపోతే, ఎవరైనా ఇస్తే కట్టుకుంటారు.లేకుంటే మొండిమొలతో అలాగే తిరుగుతారు. దేహభ్రాంతిని ఏమాత్రం లెక్క చెయ్యరు.కానీ దైవధ్యానం మాత్రం మానరు.అలా ఉంటుంది వారి జీవితం.

ఆ 14 ఏళ్ళూ ఆయన గదిలో ఒకే ఒక్క ఫోటో ఉన్నది అన్నగారు.అదేమిటో తెలుసా? శారదామాత ఫోటో. రామకృష్ణ వివేకానంద  ఫోటోలు కూడా ఆయన పెట్టుకోలేదు.ఒక్క శారదామాత ఫోటో మాత్రమే ఆయనతో ఆ 14 ఏళ్ళూ తోడుగా ఉన్నది.జగన్మాతను ధ్యానిస్తూ ఆయన ఆ విధంగా గంగోత్రిలో అన్నేళ్ళు ఉన్నాడు.

మన ఊహకైనా అందుతారా అన్నగారు ఇలాంటి మనుషులు?' - అడిగాడు చంద్రశేఖర్.

మాకందరికీ కళ్ళలో నీళ్ళు కారిపోతున్నాయి. అలా షాపు బయట కూచుని అందరం అలా ఏడుస్తుంటే దారిన పోతున్నవాళ్ళు విచిత్రంగా చూచుకుంటూ పోతున్నారు.

(ఇంకా ఉంది)