“అసమర్ధజాతికి ఆత్మగౌరవ అర్హత ఉండదు"

30, మార్చి 2010, మంగళవారం

భవిష్య దర్శనం-చెన్నైలో జరిగిన కొన్ని విచిత్రాలు

యోగపరంగా ఔన్నత్యాన్ని పొందిన సాధకుడు భవిష్యత్తులోకి తొంగి చూడటం సాధ్యమే.మామూలుగా చాలామందికి ఈ స్ఫురణశక్తి సహజంగా జన్మతహా ఉంటుంది.దానిని ధ్యానాభ్యాసంతో వృద్ధి చేసుకోగలిగితే భవిష్యత్తులోకి చూడటం పెద్ద గొప్పవిషయం ఏమీకాదు. అయితే ఇటువంటి సిద్ధుల కోసం అదే పనిగా పాకులాడకూడదు. మన దారిలో మనం ముందుకు సాగుతుంటే వాటంతట అవి వస్తూ,పోతూ ఉంటాయి అని మహనీయులు చెబుతారు.

మొన్న రెండు రోజులు చెన్నైలో ఉన్నాను.అప్పుడు రెండు విచిత్ర సంఘటనలు జరిగాయి. వాటికి ఈ సబ్జెక్ట్ కు సంబంధం ఉన్నది. వాటిని నా బ్లాగు అభిమానులతో పంచుకుందామని ఈ పోస్ట్ రాస్తున్నాను.


మొదటి సంఘటన

చెన్నైలో ఒక మిత్రునితో మాట్లాడుతూ ఒక ఆఫీస్ గదిలో కూర్చుని ఉన్నాను. సంభాషణ ఆఫీస్ విషయాలపైన నడుస్తున్నది.అకస్మాత్తుగా నాకొక ఆలోచన వచ్చింది.ఆ ఆలోచనకు అప్పుడు నడుస్తున్న సంభాషణకూ ఎటువంటి సంబంధం లేదు. మన గదిలోనికి బయటనుంచి ఒక తేనెటీగో ఇంకేదో పురుగో వచ్చినటువంటి భావన కలిగింది.ఇంకొక ఉదాహరణ చెప్పాలంటే, వానాకాలంలో అకస్మాత్తుగా ఆకాశంలో మెరుపు మెరిసినట్లుగా అనిపించింది. ఇంతకీ ఆ ఆలోచన ఏమిటో కాదు. ఇప్పుడు గదిలో కరెంట్ పోతుందేమో? అనిపించింది. అప్పుడు నడుస్తున్న సంభాషణకు ఏమాత్రం సంబంధం లేని ఈ ఆలోచనకు నాకే నవ్వొచ్చింది.

సరే మళ్ళీ సంభాషణ కొనసాగిస్తున్నాను.ఒక నిముషం కూడా గడవలేదు. హఠాత్తుగా కరెంట్ పోయింది. ఈ సమయంలో ఈ కరెంట్ పోవటం ఏమిటో అని నా మిత్రుడు విసుక్కున్నాడు. నేను మౌనంగా ఉన్నాను. చాలా సేపు కరెంట్ రాలేదు. మేము లేచి బయటకు వచ్చాము.

రెండవ సంఘటన

మరుసటి రోజున చెన్నైలోనే ఒక సెంటర్లో నిలబడి ఒక మిత్రునితో మాట్లాడుతూ ఉన్నాను. వాహనాలు మనుష్యులతో రోడ్డు మహారద్దీగా ఉంది. ఇంతలో నిన్న కలిగిన ఆలోచన లాటిదే ఇంకొక ఆలోచన అకస్మాత్తుగా వచ్చింది. మాట్లాడుతూ ఉన్నవాణ్ణి ఒక్కక్షణం ఆగాను.మాట్లాడుతూ అకస్మాత్తుగా మౌనం వహించటం చూచి నా మిత్రుడు కంగారుపడి ఏమైంది అని అడిగాడు. నా ఆలోచనకు నాకే భయం వేసింది.అది నేను కావాలని చేసిన ఆలోచన కాదు.అకస్మాత్తుగా ఎవరో మన గదిలోకి చొరబడినటువండి భావన లాటిదే మనోవీధిలో కలుగుతుంది.ఇప్పుడిక్కడ ఏదన్నా ఏక్సిడెంట్ జరుగుతుందేమో? అన్న ఆలోచన మెరుపులా క్షణకాలం మెదిలింది.

మళ్లీ మామూలుగా మా సబ్జెక్ట్ మాట్లాడుకుంటున్నాము.దాదాపు ఒక నిముషంలోపే అరుపులు కేకలు వినిపించాయి.ఏమిటా అని తలతిప్పి చూచాము. ఒక సైకిలిష్టు, ఒక స్కూటరిష్టు గుద్దుకొని కిందపడ్దారు.లేచి తమిళంలో పెద్ద పెద్దగా అరుచుకుంటున్నారు.ఎవరికీ దెబ్బలు పెద్దగా తగలలేదు. కాసేపటి తర్వాత ఎవరి దారిన వాళ్లు పోయారు.

గుర్తొచ్చిన పాత జ్ఞాపకం

నా కాలేజి రోజులలో జరిగిన ఒక సంఘటన ఈ సందర్భంగా గుర్తు వస్తున్నది. అప్పుడు నాకొక సైకిలుండేది. నేను నర్సరావుపేటలోని రెడ్డి కాలేజీలో ఇంటర్ చదివాను. ఆ సైకిల్ మీద కొన్నాళ్ళు కాలేజికి పోతుండేవాణ్ణి. ఆ సైకిలుకి బాటరీతొ పనిచేసే ఒక హారన్ ను హాండిల్ దగ్గర పెట్టించాను. అది స్కూటర్ హారన్ లాగా మోగేది. సైకిలు బెల్లు కొట్టకుండా ఆ హారన్ మోగించేవాణ్ణి.

ఒక రోజు క్లాసులో కూర్చుని పాఠం వింటుండగా, హారన్ ఎవరన్న కొట్టేశారేమో అన్న ఆలోచన హఠాత్తుగా మనస్సులో మెదిలింది.క్లాసు అయిన తర్వాత ఇంటికి పోదామని సైకిలు షెడ్డుకు వచ్చి చూస్తే, ఎవరో సైకిల్ హారన్ కోసి తీసుకుపోయారు.ప్రిన్సిపాల్ కు కంప్లెయింట్ చేస్తే, అదే షెడ్డులో నా సైకిలే పోయింది,నీకు పోయింది సైకిల్ హారనేగా, సంతోషించు అని ఆయన సలహా ఇచ్చాడు.పైగా, సైకిల్ బెల్లు ఉండగా అటువంటి హారన్ ఎందుకు పెట్టించావు అని నన్నే మందలించాడు.


యోగశక్తితో భవిష్యత్తులోకి తొంగి చూడగలమా?

ఈ రకమైన స్ఫురణగా వచ్చే ఆలోచనలు మనం కావాలని ఊహిస్తే జరిగేవి కావు.వాటంతట అవి హఠాత్తుగా స్పురిస్తాయి.కొద్దిసేపటి తర్వాత ఆ సంఘటన జరగడం మనం చూడవచ్చు. ఇలా చాలాసార్లు జరుగుతుంది. చాలామందికి ఇటువంటి స్ఫురణశక్తి ఉంటుంది. మనం ఒక వ్యక్తి గురించి అనుకుంటాం. కొద్ది సేపటి తర్వాత ఆవ్యక్తి నుంచి ఫోన్ వస్తుంది. లేదా అనుకోకుండా ఆవ్యక్తి తారసపడటం జరుగుతుంది.

ఇటువంటి సంఘటనలు జరిగే జాతకులకు సాధారణంగా పంచమ స్థానంతోగాని,నవమస్థానంతోగాని,ద్వాదశస్థానంతోగాని కేతుసంబంధం ఉంటుంది.ఈ సంబంధం రాశి,గ్రహ,నక్షత్రపరంగా ఉండవచ్చు. ఆయా గ్రహయుతుల బలాబలాలను బట్టి ఈ శక్తి లో తేడాలుంటాయి.

సహజంగా వచ్చిన ఈశక్తిని, యోగ-ధ్యానాభ్యాసాల ద్వారా బాగా వృద్ధి చేసుకుంటే జరుగబోయే విషయాలు చాలా ముందుగానే తెలిసిపోతుంటాయి. బాగా అభ్యాసం వచ్చిన తర్వాత మనమే భవిష్యత్తులోనికి తొంగి చూడవచ్చు. ఈ ప్రక్రియ పూర్తిగా సాధ్యమే. కాకుంటే దీనికి సాధన అవసరం. రోజూ కనీసం రెండు గంటలు ధ్యానానికి వినియోగించగలిగితే ఇది సాధించటం తేలికైన విషయమే.

అయితే భవిష్యత్తులోకి తొంగి చూస్తే మనసు చాలా గజిబిజి అవుతుంది. ఈ అనుభవం స్వప్నానుభవాన్ని పోలి ఉంటుంది. భవిష్యత్తుకు సంబంధించిన చెడు సంఘటనలను చూస్తున్నప్పుడు- పీడకలలు కంటున్నప్పుడు మనకు కలిగే చికాకు,అసహనం, ఉక్కిరిబిక్కిరి అవటం వంటి అనుభూతులే ధ్యానంలోనూ కలుగుతాయి. సాధారణంగా భవిష్యదర్శనం చేస్తున్నప్పుడు మూడు విధాలైన అనుభవాలు కలుగుతాయి.

ఒకటో రకం:

మనకు కనిపించే దృశ్యంలో మనం కూడా ఒక పాత్రగా ఉంటాము. అలాంటప్పుడు, ఆ సంఘటనలోని భావోద్వేగాలు, మంచివి గాని, చెడువి గాని మనల్ని కూడా కుదిపేస్తాయి.అంటే వాటిని మనం రెండుసార్లు అనుభవించవలసి వస్తుంది. ఒకసారి ధ్యానంలో, ఒకసారి నిజ జీవితంలో. కాని జరుగబోతున్న సంగతి మనకు తెలుసు కనుక, నిజంగా జరిగినప్పుడు అంత బాధ కలుగదు. ఆనందమూ కలుగదు. సాధారణంగా ఇటువంటి పరిణతి లేని సాధకుడు ఈ స్థాయిని అందుకోలేడు.

రెండవ రకం:

ఈ దృశ్యాలలో జరుగుతున్న సంఘటనను మనం ఒక సాక్షిగా చూస్తున్నట్లు కనబడుతుంది. అప్పుడు కూడా ఆయా వ్యక్తులతో మనకున్న బాంధవ్యాన్ని బట్టి, ఆ సంఘటనలోని భయాన్ని, బాధను, సంతోషాన్ని మన మనస్సు అనుభవిస్తుంది. కాకపోతే, మొదటిరకం దృశ్యాల లాగా ఎక్కువ తాదాత్మ్యత ఉండదు. కనుక అనుభూతి స్థాయిలో కూడా తేడా ఉంటుంది.

మూడవది అయిన ఉదాసీన స్థితి:

దీనిలో మనకు ఎటువంటి స్పందనా ఉండదు. మనకు కనబడుతున్న దృశ్యంలో ఉన్న పాత్రలైన వ్యక్తులతో, వారు మనకు అతి సన్నిహితు లైనప్పటికీ, మనకు మానసికంగా ఎటువంటి తీవ్ర అనుబంధమూ ఉండదు. అంటే ధ్యానాభ్యాసం వల్ల భావోద్వేగాలను పూర్తిగా నియంత్రణలోకి తెచ్చుకున్న స్థితి.ఇది కొంచెం ఉన్నతస్థాయి. అటువంటప్పుడు మనకు కనిపిస్తున్న సంఘటన మన మనస్సుని ఏ రకంగానూ ప్రభావితం చెయ్యలేదు. భయంగాని, బాధగాని, సంతోషంగాని కలుగవు.మనం విడిగా నిలబడి ఒక సినిమాను చూస్తున్నట్లుగా ఉంటుంది.

ఈ మూడు స్థాయిలలో మనం ఏ స్థాయిలో ఉన్నామన్న దాన్ని బట్టి మన యౌగిక పరిణతిని మనమే అంచనా వేసుకోవచ్చు. తద్వారా ధ్యానసాధన తీవ్ర తరం చేసి ఇంకా ఉన్నత స్థాయిలను అందుకోవచ్చు. కాని ఇటువంటి స్వల్ప సిద్ధులను లక్ష్యపెట్టి వాటికోసం అదేపనిగా పాకులాడకూడదు.అప్పుడు అవి దొరుకుతాయిగాని, ఆ స్థితిని దాటి పై స్థాయిలు అందుకోలేము.వీటియందలి మన ఆసక్తే మన పురోగతికి ప్రతిబంధకంగా మారుతుంది.

మనం ఒక పనిమీద దూర ప్రదేశానికి పోతున్నపుడు,దారిలో కనిపించిన షాపు దగ్గరో,ఇంకే రోడ్డుపక్కన గారడీ దగ్గరో నిలబడిపోతే మన గమ్యం చేరలేము. లేదా బాగా ఆలస్యంగా చేరుకుంటాము. ఇది కూడా అటువంటిదే. దూరదర్శనం, దూరశ్రవణం వంటి సిద్దులు సాధనా పరిపక్వంలో వాటంతట అవే కలుగుతాయి. కాని వాటికి ప్రాధాన్యత ఇస్తే మన ప్రయాణం అక్కడితో ఆగిపోతుంది. స్వామి నందానందగారు మొదలైన నా గురువులు ఇవే మాటలు నాకు చెప్పారు.
read more " భవిష్య దర్శనం-చెన్నైలో జరిగిన కొన్ని విచిత్రాలు "

28, మార్చి 2010, ఆదివారం

శ్రీ రామచంద్రుని జాతకం- మరికొంత విశ్లేషణ


సాంప్రదాయ కుండలి

మనకు లభిస్తున్న శ్రీరామచంద్రుని జాతక కుండలి జ్యోతిష పండితులు తయారు చెసినది కాదు. అసలు దీనిని ఎవరు వ్రాసారో కూడా తెలియదు. సాంప్రదాయ బద్దంగా కొందరు అనుకుంటూ ఉన్నది అనుస్యూతంగా వస్తున్నది మాత్రమే. కనుక అది సరియైనదేనా అంటే-- సందేహమే అని చెప్పవచ్చు. సాంప్రదాయ కుండలి ఇంతకు ముందటి పోస్ట్ లో ఇచ్చాను. అసలు సంస్కృత రామాయణంలో వాల్మీకి మహర్షి ఏమి చెప్పాడో కొంచెం జాగ్రత్తగా పరిశీలిద్దాము.

వాల్మీకి రామాయణం ఏమి చెబుతున్నది?

వాల్మీకి మహర్షి "అయిదు గ్రహములు తమ స్వోచ్చ స్థితిలో ఉన్నవి" అని మాత్రమే చెప్పాడు గాని అవి గ్రహాలో చెప్పలేదు. ఇక్కడే రెండు సమస్యలు ఉన్నవి.

ఒకటి- అవి ఏఏ గ్రహములో ఆయన చెప్పలేదు.
రెండు-స్వోచ్చ అనుటలో-స్వ+ఉచ్చ అని వాడినాడు గనుక కొన్ని గ్రహములు స్వక్షేత్రములలోనూ, కొన్ని ఉచ్చ
స్థితిలోనూ ఉన్నవి అని సూచితం కావచ్చు. కాక పోవచ్చు. వాల్మీకి మహర్షి పంచ గ్రహముల స్థితిని స్పుటంగా చెప్పలేదు.

వాల్మీకి మహర్షి వాక్యాల విశ్లేషణ

"
స్వోచ్చ సంస్థేషు పంచసు గ్రహేషు " అన్న మాటల్ని స్వ+ఉచ్చ అని తీసుకుంటే సమస్య పరిష్కారం అవుతుంది అని కొందరి భావన. అయిదు గ్రహములు ఉచ్చ స్థితులలో ఉన్నవి అనేది వాల్మీకి మహర్షి ఉద్దేశం కాదు, ఆయన అసలు ఉద్దేశం ప్రకారం అయిదు గ్రహములు తమతమ స్వస్థానములలోనూ,ఉచ్చ స్థితులలోనూ ఉన్నవి అని మాత్రమే-అని కొందరంటారు. కనుక అయిదు గ్రహములలో కొన్ని స్వక్షేత్రములలోనూ, కొన్ని ఉచ్చ స్థితిలోనూ ఉండవచ్చు అని ఊహించటం సమంజసమే.

ప్రకారం చూస్తే, వాల్మీకి మహర్షి "కర్కటే లగ్నే వాక్పతౌ ఇందునా సహ" అని స్పష్టంగా చెప్పటంతో చంద్రుడు స్వక్షేత్రం లో ఉన్నాడు అని తెలుస్తున్నది. రాహు కేతువులను ప్రస్తుతానికి కొంతసేపు పక్కన పెడదాం. సాధారణంగా జ్యోతిష్యంలో పంచ గ్రహములు అనగా రవి చంద్రులు కాని ఇతర, పంచ తారా గ్రహములు అని అర్థం. రవి చంద్రుడు బింబాలుగా కనిపిస్తారు. రాహు కేతువులు చాయా గ్రహములు. ఇక మిగిలిన అయిదు గ్రహములు నక్షత్రముల వలె (తారలవలె) కనిపిస్తాయి. కనుక అవి తారా గ్రహములు. అవి కుజ,బుధ,గురు,శుక్ర,శనులు మాత్రమే. వీనిలో బుధుని ఉచ్చ స్థితి కన్యారాశిలో ఉంది. ఆయన రవికి దగ్గరగా ఉండే గ్రహం కనుక బుధుడు ఉచ్చస్థితిలో ఉంటే రవి కూడా కన్యా రాశి దరి దాపులలో ఉండాలి. అటువంటి గ్రహ స్థితిలో చైత్ర మాసం రాదు. కనుక బుధుడు ఉచ్చ స్థితిలో లేడు అని చెప్పవచ్చు.

ఇక మిగిలింది కుజ గురు శుక్ర శనులు. వీరిలో వాక్పతి యగు గురువు లగ్నంలో ఉచ్చ స్తితిలో ఉన్నాడు. చైత్ర మాసంలో శుక్రుడు మీన రాశిలో ఉంటాడు కనుక అది ఆయనకు ఉచ్చ రాశి కనుక సరిపోతుంది. కుజుడు,శని తమ తమ ఉచ్చ స్తితులలో ఉండటానికి అభ్యంతరం లేదు. కనుక కుజ గురు శుక్ర శనులు ఉచ్చ స్తితిలోనూ చంద్రుడు స్వక్షేత్రమగు కర్కాటకంలోనూ ఉంటే, వాల్మీకి మహర్షి చెప్పినట్లు-"స్వోచ్చ సంస్థేషు పంచసు గ్రహేషు" అన్న వాక్యం సరిపోతుంది- ఎందుకనగా నాలుగు గ్రహములు ఉచ్చ స్తితిలోనూ, ఒక గ్రహం స్వక్షేత్రంలోనూ ఉన్నవి కాబట్టి.

అసలు సమస్య

కాని సాంప్రదాయ వాదులు వేసే కుండలి లో చూపినట్లుగా, రవి మేషంలో ఉచ్చ స్థితిలో ఉండటం సంభవం కాదు. ఎందుకనగా, ఇంతకు ముందు పోస్ట్ లో వ్రాసినట్లుగా, డిగ్రీల దూరాన్ని బట్టి, చైత్ర నవమి తిధి+పునర్వసు నక్షత్రం రావాలంటే రవి మీనరాశిలోనూ, చంద్రుడు కర్కాటక రాశిలో మొదటి పాదంలోనూ ( పునర్వసు నాలుగో పాదం) ఉన్నపుడే అది సాధ్యం అవుతుంది. కనుక రవి మీన రాశిలో ఉండటమే తార్కికం. కనుక 90-93.20 డిగ్రీలైన పునర్వసు నాలుగో పాదం నుంచి 12x8=96 డిగ్రీలు వెనక్కు పోతే రవి స్థితి వస్తుంది. అనగా మీన రాశి 27.20 నుంచి ౩౦.౦౦ డిగ్రీల లోపు రవి ఉండి ఉండ వచ్చు. రవి మీన రాశిలో ఉన్నంత మాత్రాన బలహీనుడు అని చెప్పటానికి లేదు. తన ఉచ్చ స్థితికి దగ్గిరగా ఉన్నాడు , మిత్ర క్షేత్రంలో ఉన్నాడు, మరియు తొమ్మిదో నవాంశలో ఉంటూ వర్గోత్తమాంశ అవుతుంది కనుక పూర్ణ బలవంతుడే అని చెప్పవచ్చు. కనుక శ్రీరాముడు చక్రవర్తి, సూర్య వంశములో జన్మించినవాడూ కనుక ఆయన జాతకంలో రవి ఉచ్చ స్థితిలో ఉండే తీరాలి అన్న సంప్రదాయ వాదుల వాదన, రవి మీన రాశిలో ఉన్నంతమాత్రాన బలహీనుడు కాదు అన్న రుజువుతో చక్కగా పరిష్కారం అవుతుంది. రవి మీన రాశిలో ఉండటం వలన, ఉచ్చ శుక్రునితో కలసి ఉండటం వలన, బలవంతులు,సంపన్నులూ, ధర్మాత్ములూ అయిన రఘువంశ పూర్వీకులను సూచిస్తున్నాడు. కనుక రవి మీన స్థితి సమంజసమే. పిత్రుకారకుడైన రవి ఉచ్చ శుక్రునితో కలసి ద్విస్వభావ రాశిలో ఉంటూ-తండ్రికి బహుభార్యలున్న విషయాన్ని సూచనాప్రాయంగా తెలియజేస్తుండటంతో దశరధ మహారాజు జాతక పరంగా కూడా సరిపోతున్నది.

సాప్ట్ వేర్ లు ఈ సమస్యకు పరిష్కారం చూపుతున్నాయా?

ప్రస్తుతం దొరుకుతున్న జ్యోతిష సాప్ట్ వేర్ లు ఏవీ కూడా BC 7000 ప్రాంతంలో గ్రహస్థితులను చూపే విధంగా లేవు. "ప్లానెటేరియం సాప్ట్ వేర్" నేను చూడలేదు. కనుక దాని గురించి నేను ఏమీ చెప్పలేను. సరియైన గణన సామగ్రి లేకుండా నిర్ణయాలు తీసుకోవటం సరి కాదు. ఇకపోతే, యుగాలు, మన్వంతరాల లెక్కలు తీసుకుంటే గందరగోళ స్థితిలో పడిఫోతాము. అవి లక్షల కోట్ల సంవత్స రాల వరకు వ్యాపించి ఉంటాయి. యుగంలో మన్వంతరంలో రామావతారం వచ్చింది అన్న వివరాలు ఇంకొక సబ్జెక్ట్. అది ప్రస్తుతానికి వద్దు.

అక్కరకొచ్చిన ప్రశ్న శాస్త్రం

ప్రస్తుతానికి మన సమస్య శ్రీ రామచంద్రుని జాతకంలో రవి మేషంలో ఉన్నాడా, లేక మీనంలో ఉన్నాడా అనేదే కాబట్టి, దీనికి నాకు అందుబాటులో ఉన్న ప్రశ్న శాస్త్ర సహాయం తీసుకున్నాను. మొన్న 24-3-2010 రాత్రి రైల్లో చెన్నైకి పోతూ ఇదే విషయం తీవ్రంగా ఆలోచిస్తున్నాను. సమయం రాత్రి 9-55 అయింది. రైలు కడప స్టేషనును కొంత సేపటి క్రితమె వదిలింది. శ్రీరామ క్షేత్రమైన ఒంటిమిట్ట కు దగ్గరగా పోతుండవచ్చు. ప్రశ్న సహాయం తీసుకుని చూద్దామని బలంగా అనిపించింది. బలమైన ఇచ్చ కలిగినప్పుడు చూచిన ప్రశ్న మాత్రమే సత్పలితాలను ఇస్తుంది అని ప్రొ|| కృష్ణమూర్తిగారు చెప్పారు. వెంటనే మనసులో తల్లితండ్రులను, గురువులను,నవగ్రహాలను, గాయత్రీ మాతను,పరమేశ్వరుని, శ్రీరామచంద్రుని స్మరించి, అప్పటి రూలింగ్ ప్లానెట్స్ ను గమనించాను.

లగ్నం-0.35 వృశ్చికం -- లగ్నాధిపతి కుజుడు
లగ్న నక్షత్రాధిపతి: విశాఖ - గురువు
చంద్ర రాశి-మిధునం-బుధుడు
చంద్ర నక్షత్రాధిపతి- 25.47 -పునర్వసు-గురువు
వారాధిపతి-బుధ వారం -బుధుడు
హోరాధిపతి-చంద్ర హోర-చంద్రుడు.

ప్రశ్న విధానంలో రూలింగ్ ప్లానెట్స్ విశ్లేషణ

లగ్నం సున్నా డిగ్రీలలో లగ్న సంధిలో పడి- మామూలుగా జనులు అనుకుంటున్నది తప్పు అన్న సూచన ఇస్తున్నది. రూలింగ్ ప్లానెట్స్ గా బుధుడు, గురువు వచాయి. బుధ రాశులలోని గురు నక్షత్రాలు గాని , గురు రాసులలోని బుధ నక్షత్రాలు గాని రవి ఉన్న ప్రాంతాలు కావాలి. రవి బుధ రాశులైన మిధున, కన్యలలో ఉండే పరిస్తితి లేదు. ఇక మిగిలిన గురు రాశి అయిన ధనుస్సులో అవకాశం లేదు ఎందుకనగా చైత్రమాస పరిధిలోనికి ధనూరాశి రాదు. పోతే మిగిలిన మీన రాశిలోని బుధ నక్షత్రం అయిన రేవతిలో రవి ఉండి ఉండవచ్చు. మన పై లెక్క ప్రకారం మీనరాశి చివరి నవాంశ అయిన 357.20 నుంచి 360.00 లోపు రేవతి నక్షత్రం నాలుగో పాదం అవుతుంది. కనుక ఇక్కడ రవి ఉండి ఉండవచ్చు అని ప్రశ్న శాస్త్రమ్ చెబుతున్నది. లగ్నం సున్నా డిగ్రీలలో ఉండటమూ, కుజ రాశి అవడమూ-రవి స్థితి కుజ రాశి సున్నా డిగ్రీల దగ్గరలో ఉండి ఉండవచ్చు అని ఇంకొక సూచనను ఇస్తున్నది. పరిస్థితికూడా మీన రాశి చివరి డిగ్రీలనే సూచిస్తున్నాయి. కనుక పైన ఇచ్చిన రేవతి నక్షత్రం నాలుగో పాదం లో రవి ఉన్నాడు అన్న విషయం రూఢిగా తేలుతున్నది. చంద్రుడు ప్రశ్న సమయంలో కూడా పునర్వసు నక్షత్రంలోనే ఉండటం ఒక విచిత్రం. శ్రీరామచంద్రుని నక్షత్రం పునర్వసు అని దీనివల్ల రూడిగా తెలుస్తున్నది. పునర్వసు నక్షత్రం జరుగుతున్నపుడే ప్రశ్న నా మనసులో బలంగా తలెత్తడం చూస్తే జ్యోతిష-యోగ-తంత్ర సాధకుల మీద నక్షత్ర ప్రభావాలు బలంగా ఉంటాయి అన్నవిషయం మళ్ళీ రుజువైంది. విధంగా చాలా సార్లు జరగడం గమనించాను. అదలా ఉంచితే, రవి డిగ్రీలలో ఉంటే, చైత్ర మాసం- నవమి తిధి- పునర్వసు నక్షత్రం- అవడానికి ఎటువంటి అభ్యంతరం లేదు.

కనుక సూర్య గ్రహం, శ్రీరామ చంద్రుని జాతకంలో మేష రాశిలో లేడు, మీన రాశిలోనే ఉన్నాడు- కాని రాశి సంధికి
దగ్గరలో ఉండి ఉండవచ్చు అని ప్రశ్నను బట్టి నేను నమ్ముతున్నాను. ఇక మిగిలిన గ్రహాల విషయం-అనగా రాహు కేతు గ్రహాల విషయం- ఈ గ్రహాలు ప్రస్తుతం వరుసగా ధనుస్సు, మిధున రాశులలో ఉన్నాయి. కనుక శ్రీ రామ చంద్రుని జాతకంలో కూడా ఇదె స్థితిలో ఉన్నాయా? ఎందుకనగా చాలాసార్లు గ్రహ స్థితులు ప్రశ్న -జనన కుండలులలో ఒకే విధంగా ఉండటం గమనించిన విషయం. పైగా, సాంప్రదాయ కుండలిలో ఈ గ్రహాలు ఇదే స్తితిలో, అనగా ధనుస్సు-మిథునాలలోనే కనిపిస్తున్నాయి. కాని ఈ విషయంలో త్వరపడి ఒక నిర్ణయానికి రాకూడదు. ఇంకొంత పరిశోధన అవసరమ్ అని నా అభిప్రాయం.
read more " శ్రీ రామచంద్రుని జాతకం- మరికొంత విశ్లేషణ "

శ్రీ రామచంద్రుని జాతకం-వివాదాస్పద అంశాలు

శ్రీ రామచంద్రుని జాతక చక్రం మీద కొన్ని జ్యోతిష పరమైన వివాదాలు ఉన్నాయి. అందులో ముఖ్యమైన దాన్ని ఇప్పుడు పరిశీలిద్దాము.

రవి మేషరాశిలోనూ చంద్రుడు పునర్వసు నక్షత్రంలోనూ ఉండగా నవమి తిధి రాదు అనే వివాదం చాలా పాతవిషయం. విషయాన్ని కొందరు జ్యోతిష పరిశోధకులు మొదటిసారిగా ఎస్ట్రలాజికల్ మేగజైన్ లో నలభై ఏళ్ళ క్రితంరాశారు.

రవికి మేషరాశిలో 10 డిగ్రీలు పరమోచ్చ. ఒక తిధికి 12 డిగ్రీలు. ఎనిమిది తిధులు పూర్తి అయితే 96 డిగ్రీల దూరం రవిచంద్రులమధ్యన ఉంటుంది. రవి తన పరమోచ్చ బిందువులో ఉంటే వీరు చెప్పినట్లు 10+96= 106 డిగ్రీ అవుతుంది. ఇది పుష్యమి నక్షత్రం ఒకటో పాదంలో పడుతుంది. కనుక ఇది సాధ్యం కాదు.

రామాయణ కాలం కొన్ని వేల సంవత్సరాల క్రితం గడిచింది. అప్పటికి ఇప్పటికి కాల గమనంలో మార్పులు వచ్చాయి. ఋతువుల సమయాలు మారాయి. విషయాలు మనం రామాయణంలోని ఋతువర్ణనలు అప్పటి గ్రహస్థితులనుగమనిస్తె తెలుస్తుంది. దీనిమీద Dr Vartak గారి రీసెర్చి ఇక్కడ చూడవచ్చు. డాక్టర్ వర్తక్ గారు చాలా పరిశోధన చెసి 4-12-7323 BC శ్రీరాముని జనన తేదిగా నిర్ధారించారు. ఆ రోజున రవి మేష రాశిలో రెండు డిగ్రీలలో ఉన్నాడు. కనుక చైత్ర నవమి తిధి సంభవమే.

ప్రస్తుత గ్రహ గతులను స్థితులను బట్టి చూస్తే వాల్మీకి మహర్షి ఇచ్చిన చైత్ర నవమి తిథి అసంభవం అని తోచినా, రామాయణ కాలం నాటి గ్రహస్తితులని గమనిస్తే అది అసంభవం కాకపోవచ్చు.

తరువాత, ఇంకొక విషయం ఏమనగా, నేడు మనం కంప్యూటర్ ద్వారా వేస్తున్న జాతకచక్రాలు దృగ్గణిత రీత్యా గణిస్తున్నాము. ఈ విధానం ఈ మధ్యన వచ్చిన విధానం. ఇది రాక ముందు మన దేశంలో వాక్య పంచాంగముల ఆధారంగా గ్రహ గణితం చేసేవారు. నాడీ గ్రంధాలు అన్నీ వాక్య పంచాంగం ఆధారితములే. అందుకే వారిచ్చె కుండలికీ, కంప్యూటర్ కుండలికీ ముఖ్యంగా బుధుని విషయంలో తేడాలుంటాయి. మహర్షి వాల్మీకి కాలానికి వాక్య పంచాంగముల రీత్యా గణితం జరిగి ఉండవచ్చు. దాన్ని బట్టి ఈ గ్రహస్తితి సాధ్యం కావచ్చు.

ఇదంతా ఊహాగానం అని చెప్పలేము. ఎందుకనగా, మహర్షులు అసత్య వాదులు కారు. కనుక వారి మాటలను బట్టి మన లెక్కలు సవరించుకోవడం సరి అవుతుంది గాని తద్విరుద్ధం సరి కాదు.
read more " శ్రీ రామచంద్రుని జాతకం-వివాదాస్పద అంశాలు "

24, మార్చి 2010, బుధవారం

శ్రీ రామ చంద్రుని దివ్య జాతకం



ఒక జాతకాన్ని చూడటంతోనే అది దివ్య జాతకమా లేక మానవ జాతకమా చెప్పటానికి కొన్ని నియమాలు ఉన్నాయి. పశు స్థాయికి చెందిన వారి జాతకాలు ఒక విధంగా ఉంటాయి. మామూలు మనుషుల జాతకాలు ఇంకొక రకంగా,కొంత మెరుగ్గా ఉంటాయి. మహా పురుషుల జాతకాలు దీనికి భిన్నమైన యోగాలతో, ఉన్నతంగా ఉంటాయి. అవతార మూర్తుల జాతకాలు ఇంకా మహోన్నతమైన యోగాలతో కూడి ఉంటాయి. ఇటువంటి అవతార మూర్తుల కోవకి చెందినదే మన దేశపు ఆరాధ్య దైవం అయిన శ్రీరామచంద్ర ప్రభుని జాతకం. జ్యోతిర్విజ్ఞానం ఏమాత్రం ఉన్నవారైనా జాతకాన్ని చూడటంతోనే ఒకే మాట చెప్పగలరు--" ఇది ఒక మహత్తరమైన దివ్యపురుషుని జాతకం గాని మామూలు మనిషి జాతకం కాదు".

మహర్షి వాల్మీకి కి ప్రపంచం ఎంతగా ఋణపడి ఉన్నదో ఊహించటం కష్టం. అనన్య సామాన్యమైన శ్రీమద్రామాయణ రచన చెయ్యటమే గాక, రామాయణంలో ఆయా సంఘటనలు జరిగినప్పుడు ఆకాశంలో ఉన్నటువంటి గ్రహస్థితులను, నక్షత్ర స్థితులను ఆయన వివరంగా వర్ణించాడు. ఆయా గ్రహస్థితులు కొన్ని వేల వత్సరాలకు గాని రానివి కొన్ని ఉన్నాయి. దానిని బట్టి రామాయణ కాలం దాదాపు క్రీ పూ 7300 అని కొందరు జ్యొతిష్య పరిశోధకులు నిర్ణయించారు. ప్రతి విషయానికీ ఉన్నట్లే, విషయంలో కూడా వాద ప్రతివాదాలున్నాయి. వివరాలు మళ్ళీ చర్చిద్దాం. ప్రస్తుతానికి శ్రీ రామచంద్రుని దివ్య జాతకంలో ఉన్న విశేషాలు మాత్రం చూద్దాం.

వాల్మీకి మహర్షి శ్రీమద్రామాయణ మహాకావ్యంలో శ్రీరామచంద్రుని జన్మ సమయాన్ని ఇలా వర్ణించాడు. బాలకాండ 18 అధ్యాయంలో 8,9,10,11 శ్లోకములు చూద్దాము.

శ్లో|| తతో యజ్ఞే సమాప్తే తు ఋతూనాం షట్ సమాత్యాయు:||
తతశ్చ ద్వాదశే మాసే, చైత్రే,నావమికే తిథౌ ||

నక్షత్రే2దితి దైవత్యే, స్వోచ్చ సంస్థేషు పంచషు||
గ్రహేషు, కర్కటే లగ్నే వాక్పతా ఇందునా సహా ||

ప్రోద్యమానే జగన్నాధమ్, సర్వలోక నమస్కృతమ్||
కౌసల్యా జనయద్రామమ్, సర్వలక్షణ సంయుతమ్ ||

విష్ణోరర్ధమ్ మహాభాగమ్ పుత్రమైక్ష్వాకు నందనమ్ ||
లోహితాక్షమ్ మహాబాహుమ్ రక్తోష్టమ్ దుందుభి స్వనమ్ ||

అర్థము:
యజ్జము సమాప్తి అయ్యిన తదుపరి ఆరు ఋతువులు గడిచాయి. అప్పుడు పన్నెండో మాసమున, చైత్ర నవమి తిథి రోజున, అదితి దేవత అధిపతి అయిన పునర్వసు నక్షత్రమున, అయిదు గ్రహములు తమతమ ఉచ్చ స్థానములలో ఉండగా, కర్కాటక లగ్నమున, వాక్ పతి చంద్రునితో కలసి ఉండగా,జగత్తులకు నాధుడు, సర్వలోకములచే నమస్కరింపబడువాడును, సర్వ శుభ లక్షణ సంయుతుడును, విష్ణువు యొక్క అవతారమైనవాడును, మహనీయుడును, ఇక్ష్వాకు కులమునకు ఆనందకరుడును, ఎర్రని కన్నులు కలవాడును,గొప్ప బాహువులు కలవాడును, ఎర్రని పెదవులు కలవాడును, మంచి కంఠధ్వని కలవాడును అగు రామునకు కౌసల్యాసతి జన్మ ఇచ్చినది.

చిన్న శ్లోకములో వాల్మీకి మహర్షి మహత్తరమైన జ్యోతిష వివరాలనే గాక, సాముద్రిక వివరాలను, ఇస్తూ తద్వారా శ్రీరాముని దివ్యమైన వ్యక్తిత్వాన్ని మనకు చూపిస్తున్నాడు.

శ్రీరామచంద్రుని జాతకమున, అయిదు గ్రహములు-అనగా-రవి,కుజ,శుక్ర,గురు,శని గ్రహములు- ఉచ్చ స్తితిలొ ఉన్నాయి. లగ్నమున లగ్నాధిపతియగు చంద్రునితో కలసి గురువు ఉచ్చ స్తితిలో ఉండి గజకేసరీ యోగాన్ని ఇస్తున్నాడు. ఇతర స్వల్ప యోగములను అటు ఉంచితే, కుజుడు, గురువు, శనులు వరుసగా ఇచ్చేటటువంటి రుచక, హంస,శశ మహాపురుష యోగాలను జాతకంలో చూడవచ్చు. వీటిలో ఒక్కటి ఉంటే జాతకుడు గొప్పవాడు అని చెప్పవచ్చు. అటువంటి మూడు మహాపురుష యోగాలు కలసి ఇక్కడ ఉన్నాయి. అయిదు గ్రహాలు ఉచ్చ స్తితిలో ఉన్నాయి. ఒక్క రాహు కేతువులు మాత్రం ఒక సిద్ధాంతం ప్రకారం నీచలో ఉన్నాయి. బహుశా అందువల్లనే ఆయన జీవితం కష్టాల పరంపరలో గడిచింది.

లగ్నంలోని హంస గజకేసరీ యోగాలవల్ల, మహాపురుషుడును, మంచి ఖ్యాతి గలవాడు,మంచి మనస్సు, మంచి వాక్కు,మంచి ప్రవర్తన కలవాడు జాతకుడు అని సూచిస్తున్నాయి.

నాలుగింట శని ఉచ్చ స్థితివల్ల,మంచి ధార్మికమైన మనస్సు, నీతి నియమ పూర్వక ప్రవర్తన కలవాడని తెలుస్తున్నది. ధర్మపరమైన సుఖాలను మాత్రమే అనుభవించువాడు అని సూచితం. తల్లికి భోగ భాగ్యాలతో కూడిన జీవితం ఉన్నప్పటికీ మనశ్శాంతి మాత్రం ఉండదు అని తెలుస్తున్నది.

ఏడింట ఉచ్చ యోగకారక కుజునివల్ల, బలవంతులైన శత్రువులు, పతివ్రత యగు మహా సాధ్వి భార్యగా లభించుట, వివాహ జీవితంలో సుఖం లోపించుట కలిగాయి.

పదింట ఉచ్చ రవి వల్ల ధర్మ పరిపాలన చేసే న్యాయమూర్తి అని, రాచ కుటుంబానికి చెందినవాడని, సూర్య వంశమనీ సూచింపబడుతున్నది.

తొమ్మిదింట ఉచ్చ శుక్రునివల్ల, ఆయన మీద లగ్న గురుని దృష్టివల్ల, ధర్మంతో కూడిన భోగ జీవితం గడపిన గొప్ప పూర్వీకులు కలిగినవాడని, దాన ధర్మాదుల యందు ఆసక్తి కలిగిన ఉదార స్వభావుడని, ధార్మిక జీవితం గడుపుతాడని, అవతార మూర్తి యని సూచింపబడుతున్నది.

మహర్షి వాల్మీకి తన శ్లోకాలలో, కొన్ని సాముద్రిక లక్షణాలను చెప్పి ఉన్నాడు. శరీర లక్షణాలను బట్టి మనస్తత్వాన్ని, భవిష్యత్తునూ అంచనా వేసే శాస్త్రమే సాముద్రిక శాస్త్రం. ఎర్రని కండ్లు,ఎర్రని పెదవులు,మంచి కంఠధ్వని ఈ మూడూ మంచి రక్తపుష్టికి, మంచి ఆరోగ్యానికి, చక్కని శరీర ధాతువులకు సూచికలు. గొప్ప బాహువులు అని చెప్పటంలో ఆజానుబాహువులు అని అర్థం కావచ్చు. ఎందుకనగా చిన్నపిల్లవానికి వీరులకుండే గొప్ప బాహువులు ఉండవు. ఆజానుబాహువులు గొప్ప కార్య శూరత్వానికి సూచికలు. కోతుల సాయంతో మహా రాక్షసులచేత రక్షింపబడుతున్న వైభవ పూరిత లంకా నగరాన్ని జయించటం కార్య శూరత్వం కాక మరేమిటి?

రామాయణంలోని జ్యోతిష సూచనలను, ఆయా ఘట్టాలను, శ్రీరాముని జీవితంలోని దశలను తులనాత్మక పరిశీలన చేస్తూ ఒక గ్రంధమే వ్రాయవచ్చు.

అవతార మూర్తులను సూచించే గ్రహస్థితులు, యోగాలు శ్రీరాముని జాతకంలోనూ, శ్రీ కృష్ణుని జాతకంలోనూ, శ్రీ రామకృష్ణుని జాతకంలోనూ మాత్రమే నేను పరిశీలించగలిగాను. మిగిలిన మహాపురుషుల జాతకాలలో గొప్ప యోగాలు ఉన్నాయి కాని, అవతార పురుషుల జాతకాల స్థాయిలో లేవు.

జ్యోతిష విజ్ఞాన రీత్యా, నేడు భగవంతుని అవతారాలుగా కొలవబడుతున్న మహనీయులు చాలామంది నిజానికి మహనీయులే కాని అవతార మూర్తులు కారు అని చెప్పటం సాహసం అనిపించుకోదు. కనుక వారిని మహాపురుషులని అనవచ్చు గాని అవతార మూర్తులని అనకూడదు.

ఇంకా కొన్ని వివరాలు వచ్చె వ్యాసంలో చూద్దాము.
read more " శ్రీ రామ చంద్రుని దివ్య జాతకం "