“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

6, మార్చి 2010, శనివారం

గురుచండాల యోగం- కొన్ని ఆలోచనలు

గురు గ్రహం (బృహస్పతి) రాహు నక్షత్రాలలో సంచారం చేసినపుడు నక్షత్ర పరంగా సంబంధం కలుగుతుంది. గురువు రాశి చక్రాన్ని చుట్టిరావటానికి పన్నెండు సంవత్సరాలు పడుతుంది. అంటే ఆయన ఒక్కొక్క రాశిలో దాదాపుగా ఏడాది పాటు ఉంటాడు.

రాహు నక్షత్రాలు ఆర్ద్ర, స్వాతి మరియు శతభిషం. ఇందులో ఆర్ద్ర నక్షత్రం బుధుని రాశి అయిన మిథునంలోనూ, స్వాతీ నక్షత్రం శుక్రునిదైన తులా రాశిలోనూ, శతభిషా నక్షత్రం శనిదైన కుంభరాశిలోనూ ఉన్నాయి.

ఆయా నక్షత్రాలలో సంచారం చెయ్యటంవల్ల కలిగే గురు చండాలయోగం ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి రావాలి. మూడు నక్షత్రాలనూ లెక్కలోకి తీసుకుంటే ప్రతి నాలుగేళ్ళకు ఒకసారి రావాలి. మరి ప్రతి నాలుగేళ్ళకూ మతపరమైన చండాలాలు బయట పడాలి. అలా జరుగుతున్నవా? ఇది కాక ప్రతి పన్నెండేళ్ళకూ ఒకసారి గురువు నీచ రాశి అయిన మకరంలో ఏడాది పాటు ఉంటాడు. అప్పుడేం జరుగుతున్నది?

ఈ మూడు నక్షత్రాలూ సమానమైన రాహు ప్రభావం కలిగి ఉంటాయా? అంటే ఉండవు అనిపిస్తుంది. ఆర్ద్ర పైన బుధుని ప్రభావం, స్వాతి మీద శుక్రుని ప్రభావం, శతతార మీద శని ప్రభావం ఉంటాయి. అదీగాక స్వతహాగా ఈ మూడు నక్షత్ర మండలాలూ విభిన్నమైన లక్షణాలు కలిగినటువంటివి. అంటే గురువు ఈ మూడు నక్షత్రాలలోనూ సంచారం చెసినపుడు ఇన్ని రకాల మిశ్రమ ప్రభావాలకు లోనవుతాడు. కనుక ప్రతిసారీ ఒకే రకమైన సంఘటనలు జరుగవు. ఇది గాక, ఆయా సమయాలకు గురుని మీద మిగతా గ్రహాల దృష్టి ప్రభావాలు అయా ఫలితాలను మార్పు చెస్తాయి. గ్రహాల పరిభ్రమణ కాలం లోని తేడాల వల్ల ప్రతి పన్నెండేళ్లకు గ్రహాలు మళ్ళీ అదే స్థితిలో ఉండవు. కనుక అదే గ్రహ స్థితి తిరిగి రాదు. కనుక అవే ఫలితాలు కూడా రావు. కాని ఇన్ని రకాల మిశ్రమ ప్రభావాల వల్ల, రకరకాలైన సంఘటనలు జరుగవచ్చు.

ఇంతకు ముందు జరిగిన కొన్ని మతపరమైన సంఘటనలను, తేదీలతో సహా ఒక పట్టికగా తయారు చెసుకోగలిగితే, ఆయా సమయాలలో ఆయా గ్రహాల నక్షత్రాల స్థితిగతులను పరిశీలించి, కొన్ని నిర్దుష్ట సూత్రాలు రాబట్టవచ్చు. దానిని బట్టి ముందు ముందు జరుగబోయే సంఘటనలు అంచనా వెయ్యవచ్చు. రీసెర్చి పరంగా ఇది ఒక మంచి కోణం. పాఠకులెవరైనా ఇటువంటి సంఘటనలు+ తేదీలతో కూడిన టేబుల్ తయారు చేసి ఇవ్వగలిగితే ఈ విషయంలో రీసెర్చి చెయ్యవచ్చు.జ్యోతిషపరంగా దీనికి తగిన డేటా నేను కూర్పు చేస్తాను.

జ్యోతిష విజ్ఞానం నిజమా కాదా అన్న సందేహాలు, వాదాలు, తర్కాలతో కామెంట్స్ రాసే మిత్రులు దీన్ని ఒక ప్రాజెక్ట్ వర్క్ గా తీసుకోని చూడవచ్చు. నా సహకారం అందిస్తాను. ఉత్సాహం ఉన్నవారు ప్రయత్నం చెయ్యవచ్చు.