On the path, ego is the greatest hurdle and love is the greatest boon

7, మే 2021, శుక్రవారం

కరోనా ఎందుకొస్తోంది? ఎవరికొస్తోంది?

ప్రతిరోజూ ఎంతోమంది తెలిసినవాళ్లు పోతున్నారు. ప్రతిరోజూ ఎన్నో చావు వార్తలు వింటున్నాం. ఎక్కడ చూసినా భయం రాజ్యమేలుతోంది. రేపేం జరుగుతుందో ఎవరికీ తెలియడంలేదు. ఇదంతా చూస్తూ, "అసలు కరోనా ఎందుకొస్తోంది?" అన్న ప్రశ్న ఎవరినడిగినా ఒకటే చెబుతారు.

'వైరస్' వల్ల వస్తున్నది'

చాలామంచి జవాబు.

'మరి వైరస్ అందర్నీ  కాటేయడం లేదేంటి?'

'ఇంట్లో జాగ్రత్తగా ఉంటే రాదు'

 ఇది కూడా చాలామంచి జవాబే. 

'మరి ఇంట్లో ఉన్నవాళ్లకు కూడా చాలామందికి వస్తోంది కదా? ఇదేంటి?'

'గాలిలో వస్తోంది'

అదే గాలిని అందరూ పీలుస్తున్నారు కదా? మరి అందరికీ రావడం లేదెందుకు?

'రోగనిరోధకశక్తి లేనివాడికి వస్తోంది'

'రోగనిరోధకశక్తి ఎందుకు తగ్గుతోంది?

'తెలియదు'

ఇప్పుడు ఇంకో కోణం చూద్దాం. 

'మా మామయ్య కూరగాయలకని మార్కెట్టుకి వెళ్ళొచ్చాడు. అక్కడ సోకింది'

మరి అక్కడే ఉంటూ, రోజంతా కూరగాయలు అమ్ముతున్నవాడికి ఎందుకని రావడం లేదు?

నో ఆన్సర్

'మా బాబాయి పాలప్యాకెట్ కని బయటకెళ్ళి వైరస్ కొనితెచ్చుకున్నాడు'

'మరి రోజంతా అదే షాపులో పాలప్యాకెట్లు అమ్ముతున్నవాడికి ఎందుకని రాలేదు?'

మళ్ళీ నో ఆన్సర్

'మా నాన్న వద్దంటున్నా వినకుండా బయటకెళ్ళి మామిడిపండ్లు కొన్నాడు. అక్కడ సోకి ఉంటుంది'

'రోజంతా ఎండలో రోడ్డుపక్కన కూచుని పండ్లు అమ్ముతున్న ఆమెకు ఎందుకని కరోనా సోకలేదు?'

మళ్ళీ నో ఆన్సర్

చివరకు ఇలా జవాబు వస్తుంది.

'కాయకష్టం చేసేవాళ్లకు రోగనిరోధకశక్తి ఎక్కువగా ఉంటుంది. అందుకని వాళ్లకు రాదు'

ఏతావాతా తేలిందేమిటి? ఎవడికైతే రోగనిరోధకశక్తి ఎక్కువగా ఉంటున్నదో వాడికి కరోనాయే కాదు.  ఏ వైరసూ సోకదు. ఏ బాక్టీరియా సోకదు. ఏమీ కాదు. డా || హన్నేమాన్ ఈ మాటను రెండు వందల ఏళ్ళక్రితం చెప్పాడు. ఆయుర్వేద సృష్టికర్తలైన ఋషులు వేల ఏళ్ళనాడే ఈ మాటను చెప్పారు. అంతేగాక ఏమేం చేస్తే, ఎలా బ్రతికితే, రోగనిరోధకశక్తి బాగుంటుందో కూడా చెప్పారు. ఏం చేస్తుంటే అది క్షీణిస్తుందో కూడా చెప్పారు. వినేవారేరీ? వింటే, జనం పోగుచేసుకుంటున్న చెడుకర్మను ఎవడనుభవిస్తాడు? అందుకే మంచి చెప్పినా ఎవడూ వినడు. వినలేడు. విన్నట్టు విని వదిలేస్తాడు గాని ఆచరించలేడు. కనుక వాడి ఖర్మ వాడిని వెంటాడుతుంది. గొంతు పట్టుకుంటుంది. తీసుకుపోతుంది. అదంతే !

ఇప్పుడు విషయంలోకొద్దాం.

నేనింతవరకూ ఓవెన్ ను కొనలేదు. ఎందుకో తెలుసా? దానివల్లనే అమెరికాలో పెద్దప్రేగు కాన్సర్ వస్తున్నదని గ్రహించాను గనుక. నేనమెరికాలో ఉన్నపుడు ఒక విషయం గ్రహించాను. అమెరికాలో పొట్ట కేన్సర్లు చాలా ఎక్కువ. ఎందుకని?

వినండి మరి.

స్టోర్స్  లో ఉన్న మాంసం ఎన్నో రోజులనుంచీ డీప్ ఫ్రిజ్ లో ఉంటుంది. మైనస్ డిగ్రీలలో ఉంటుంది.  దాన్ని తెచ్చి, ఓవెన్లో పడేసి ఒకేసారి 160 ఫారెన్ హీట్ దాకా వేడిచేసెసి తింటారు. ఒకేసారి అంత టెంపరేచర్ తేడా వస్తే ఆ మాంసంలో ఏమౌతుంది? పైగా, మంటపైన, కుండలో వండితే జరిగే ప్రక్రియ వేరు. అక్కడ ఆక్సిజన్ పుష్కలంగా ఉంటుంది.  ఓవెన్ లో ఏ ఆక్సిజన్ ఉంటుంది? ఒక ఉదాహరణ చెప్తాను, వినడానికి అసహ్యంగా ఉన్నప్పటికీ ఇది నిజం. 

చనిపోయిన శవాన్ని మార్చురీలోని కోల్డ్ స్టోరేజిలో ఉంచడానికి, మాంసాన్ని, కూరగాయలను ఫ్రిజ్ లో ఉంచడానికి తేడా ఏంటి? అలాంటి శవాలను తెచ్చి, కనీసం వాటిని కట్టెలమీదకూడా ఉడికించకుండా, ఆక్సిజన్ లేని, అదసలు అవసరంలేని, మైక్రో వేవ్స్ క్రింద ఓవెన్లో ఉడికిస్తే ఏమౌతుంది? వాటిల్లో ఏయే మార్పులొస్తాయి? తినేవాడికి   కాన్సర్లు రాక ఏమౌతుంది? చెప్పండి.

ఈరోజుల్లో, ఏ పూటకాపూట, ఏరోజు కూరగాయలను ఆరోజున వేడివేడిగా వండుకుని, ఏపూట అన్నం ఆపూట వేడిగా వండుకుని ఎవరు తింటున్నారు? చెప్పనా? రోజుకూలీలు తింటున్నారు. కాయకష్టం చేసుకునేవాళ్ళు తింటున్నారు. వాళ్ళు ఏరోజుకు ఆరోజున కూరగాయలు తెచ్చుకుంటారు. మంటమీద వండుకుని తింటారు. ఓవెన్ వాడరు. అందుకే వాళ్ళు ఆరోగ్యంగా ఉంటున్నారు. సుఖానికిపోయే సంపన్నులు, ఫ్రిజ్ లో వారాల తరబడి ఆహారాన్ని మురగబెట్టుకుని తినేవాళ్లు, ఓవెన్లు వాడేవాళ్లు రోగాల పాలౌతున్నారు. ఇన్ని సౌకర్యాలున్నప్పటికీ వంట చెయ్యదానికి బద్ధకిస్తూ, పొద్దున్నే ఒకేసారి అన్నీ వండిపారేసి, వాటినే రాత్రికి పెట్టుకుని తినేవాళ్లు రోగాలపాలౌతున్నారు.

జొమాటోలో ఆర్డర్ చేసి తెప్పించుకుని లొట్టలేసుకుంటూ మింగే తిండిలో ఏముంటుందో మీకు తెలుసా? అదెప్పటి ఆహారమో మీకు తెలుసా? ఈ రోజున మిగిలిపోయిన ఫుడ్ ని ఏ హోటలువాడూ పారెయ్యడు. రేపు, ఎల్లుండి, ఎంతవరకూ దానిని ఉంచగలిగితే అంతవరకూ ఫ్రిజ్ లో ఉంచి, ఓవెన్లో ఇన్స్టంట్ గా వేడిచేసి మీకు పంపిస్తాడు. ఆ కుళ్లిపోయిన వేడివేడి ఆహారాన్ని లొట్టలేసుకుంటూ మీరు మింగుతారు. దానికితోడు, వాడు ఫ్రీగా ఆఫర్లో పంపించే కూల్ డ్రింక్ ఉండనే ఉంటుంది. అది యాసిడ్. ఇక మీకు రోగాలు రాక ఏమౌతాయి మరి?

యాసిడ్ తో కడగాల్సింది టాయిలెట్ ని. పొట్టని కాదు. ఆఫ్కోర్స్, ఈ రోజుల్లో టాయిలెట్ కమోడ్ కీ మన పొట్టకీ పెద్ద తేడా ఉండటం లేదనుకోండి. ఇంకా చెప్పాలంటే కమోడే శుభ్రంగా ఉంటోంది. ఎప్పటికప్పుడు క్లిన్ చేస్తాం కాబట్టి.  మన పొట్టే దానికంటే అసలైన దరిద్రం !

ప్రతిరోజూ చెమటపట్టేలాగా వ్యాయామం ఎవరు చేస్తున్నారు? ఏసీ జిమ్ముల్లో అమ్మాయిలూ అబ్బాయిలూ ఒకరినొకరు చూసుకుంటూ కులుక్కుంటూ ఎగరడం కాదు. చక్కటి ఎండలో, ఆరుబైట గాలిలో ఎవరు వ్యాయామాలు చేస్తున్నారు? ఆ చేసే వ్యాయామాలు మాత్రం ఏమిటి? కండలు పెంచే జిమ్ము వ్యాయామాలు. అవి రోగనిరోదకశక్తిని పెంచగలవా? లేవు. ఏడాదిపాటు పెంచిన కండలు, ఒక్క జ్వరంతో కరిగి వేలాడటం మొదలుపెడతాయి. మరెందుకవి? మనదైన యోగాభ్యాసాన్ని శుద్ధంగా చేస్తున్నవారెందరు?

అసలు కనీస వ్యాయామమంటూ ఏదో ఒకదాన్ని ఏడుస్తున్నవారెందరు? ఎవరూ లేరు. పొద్దున్న పదింటికి నిద్ర లేవడం, ఆ సోఫాలోనో, బెడ్ మీదనో రోగిష్టిలాగా పడుకుని, టీవీనో, మొబైల్ నో చూస్తూ, ఫోన్లో సొల్లు వాగుతూ  ఉండటం, టైమైతే జొమాటో ఆర్డర్ పెట్టడం, తిని మళ్ళీ మొబైల్లోకి చూస్తూ పడుకోవడం. లేకపోతే ఆ ఫ్రిజ్ లో కుక్కిన పదిరోజులనాటి చెత్తను మింగడం.  ఇది మన దినచర్య. ఇక రోగాలు రాక మరేమొస్తాయి?

ఏదో రోగం వచ్చినపుడు కూడా ప్రకృతిసిద్ధమైన మందులు వాడకుండా, సింథటిక్ ముందులు వాడటం. అక్కడకూడా డబ్బులు పారేసి పెద్ద ఆస్పత్రిలో చేరి దేహాన్ని వారికి అప్పజెప్పడం. అదృష్టం బాగుంటే ప్రాణంతో తిరిగి రావడం, లేదా శవంగా బయటకు రావడం. దహనం కూడా ఎలక్ట్రిక్ క్రిమటేరియంలో. ఇదీ మన బ్రతుకు.

వినడానికి అసహ్యంగా ఉంటుందని ముందే చెప్పాను. ఎప్పుడైనా చూశారా మీరు? మామూలుగా దహనం చేసిన  శవం బూడిద ఎలా ఉంటుందో? తెల్లగా ఉంటుంది. ఎలక్ట్రిక్ క్రిమటేరియంలో వచ్చే బూడిదను ఎప్పుడైనా చూశారా? నల్లగా ఉంటుంది. ఆక్సిజన్ లేకుండా పెనంమీద అట్టు మాడినట్లు శవం అందులో మాడిపోతుంది. అది అసహజ ప్రక్రియ . బ్రతికున్నపుడూ అసహజంగా బ్రతకడం, చావులో కూడా అసహజమే. ఇది మానవజాతి  చేతులారా చేసుకుంటున్న ఖర్మ కాకపోతే మరేంటి? 

సినిమాలు చూసి, ఫుడ్ కంపెనీల యాడ్స్ మాయలో పడి, మోడరన్ లైఫ్ ఉచ్చులో ఇరుక్కుని మనుషులు సర్వనాశనం అవుతున్నారు. అవండి. మిమ్మల్ని ఎవడూ కాపాడలేడు.

అసలు మన దేశంలో ఫ్రిజ్ ఎందుకు? అవసరమా? మనకు ఓవెన్లెందుకు? అవసరమా? మనకు జొమాటోలెందుకు? అవసరమా? అమెరికావాడి తిండి మనకెందుకు? అవసరమా? రోజంతా కదలకుండా పందుల్లాగా పడుకుని టీవీలు, మొబైళ్ళు చూడటం మనకెందుకు? అవసరమా? అర్ధరాత్రిళ్ళు, తెల్లవారుఝామున నానాచెత్త తిండి తినడం అవసరమా? ఏదీ అవసరం లేదు. ఇదేదీ సహజం కాదు. మరి ఇన్ని అసహజములైన పనులు, ప్రకృతికి వ్యతిరేకమైన పనులు ప్రతిరోజూ చేస్తూ, మన రోగనిరోధకశక్తి గట్టిగా ఉండాలంటే ఎలా ఉంటుంది?

పోనీ మనసన్నా శుద్ధంగా ఉంటున్నదా మనకు?

ఓర్వలేనితనం, కుళ్ళు, కుట్రలు, కుతంత్రాలు, కోపాలు, అహంకారాలు, గర్వాలు, ధనమదం, కులగర్వం, ఆశ, నాటకాలు, వేషాలు, పొగరు, లెక్కలేనితనం, అన్నీ నాకే తెలుసన్న మదం ఇలా చెప్పుకుంటూ పోతే  ఎన్నో ఎన్నెన్నో మన మనస్సులో ఉన్న దయ్యాలు.

ఒళ్ళూ కుళ్లిపోతూ, మనసూ కుళ్లిపోతూ, పైకిమాత్రం 'అంతా భలేబాగుంది' అనుకుంటూ  మొహానికి మాత్రం క్రీములు పూసుకుంటూ, ఒళ్ళు అందరికీ చూపించుకుంటూ బ్రతుకుతున్న  ఇలాంటి స్థితిలో కరోనా ఎందుకు? గట్టిగా ఒక చిన్న గాలివీస్తే చాలు మనం నేలకూలిపోవడానికి.

ఏవిధంగా మనం ఆరోగ్యవంతులం అసలు?

మనల్ని చంపడానికి కరోనాయే అవసరం లేదు. చిన్న సూది గుచ్చుకుంటే కూడా, కుప్పకూలిపోయి, ప్రాణాలు పోయే రోజులు ముందున్నాయి. కూచున్నవాడు కూచున్నట్టు, నుంచున్నవాడు నుంచున్నట్టు, నడుస్తున్నవాడు నడుస్తూనే చనిపోయే రోజులు ముందున్నాయి. బ్రహ్మంగారు వ్రాసినది అబద్ధం కాదు ! కాకపోతే బ్రహ్మంగారి గుడి కట్టించి పూజించేవాడు కూడా ఆయన చెప్పినట్టు బ్రతకడం లేదు. ఆయన ఏదైతే వద్దన్నాడో అదే చేస్తున్నాడు. మళ్ళీ ఆయన భక్తుడినని చెప్పుకుంటున్నాడు. అదీ అసలైన వింత !

బుద్ధి కర్మానుసారిణి. ఎవడాపగలడు? ఎవడెన్ని చెప్పినా, ఎంత మంచిని చెవిలో వినిపించినా, ఎవడూ వినడు. ఆచరించడు. పోగాలం వచ్చినపుడు ఇలా ఉండక ఇంకెలా ఉంటుంది?

కానివ్వండి. చావండి !

read more " కరోనా ఎందుకొస్తోంది? ఎవరికొస్తోంది? "

6, మే 2021, గురువారం

స్వామి నిర్మలానంద - ఒక విస్మృత మహనీయుడు -3 (జాతక విశ్లేషణ)


స్వామి జననసమయంలో చంద్ర - రవి - బుధదశ జరిగిందని అన్నాను. ఇందులో అమావాస్యయోగం, బుధాదిత్యయోగం, గృహకలహయోగం కలసి ఉన్నాయి. కనుక ఈయనకు గృహసౌఖ్యం లేదని, జీవితం కష్టాలమయమని, ఈయనకు అమితమైన తెలివితేటలున్నాయని, ఎంతో  లోకప్రసిద్ధి కలుగుతుందని, కానీ చివరకు అనామకంగా ఈయన చరిత్ర ముగుస్తుందని జననకాలదశ చెబుతోంది. ఈ విధంగా జననకాలదశ లోని యోగాలద్వారా జీవితం మొత్తాన్నీ ఒకచూపుతో సింహావలోకనం చెయ్యవచ్చు. ఇది జ్యోతిష్యశాస్త్రంలో కనుమరుగైపోయిన ఒక ప్రాచీనవిధానం.  ఎన్నో ఏళ్ల రీసెర్చిలో దీనిని నేను వెలికితీశాను. కొన్ని వందల జాతకాలలో ఇది రుజువైన సూత్రం. స్వామి జీవితం కూడా అలాగే జరగడాన్ని గమనించవచ్చు.

స్వామి జీవితంలో ఈఈ దశలు జరిగాయి.

పుట్టుకనుంచి 22 - 2 - 1864 వరకూ చంద్ర మహాదశ

22 - 2 -1864 నుంచి 22 - 2 -1871 వరకూ కుజ మహాదశ

22 - 2 - 1871 నుంచి 21 - 2 - 1889 వరకూ రాహు మహాదశ

21 - 2 - 1889 నుంచి 23 - 2 - 1905 వరకూ గురు మహాదశ

23 - 2 - 1905 నుంచి 23 - 2 - 1924 వరకూ శని మహాదశ

23 - 2 - 1924 నుంచి 23 - 2 - 1941 వరకూ బుధ మహాదశ

26-4- 1938 న బుధ - గురు - రాహుదశలో స్వామి మరణించారు.

ఇప్పుడు స్వామి జీవితంలోని ముఖ్యఘట్టాలను గమనిద్దాం.

శ్రీమంతులైన ఒక క్షత్రియ కుటుంబంలో అయిదుగురు అన్నలకు  తమ్ముడిగా స్వామి జన్మించాడు. తల్లిదండ్రులు దేవనాధదత్, తారకామణిదేవి. దేవనాధదత్ గారికి నాడీవిజ్ఞానం తెలుసు. దీర్ఘరోగాలతో బాధపడుతున్న రోగి నాడిని పరీక్షించి అతను  ఇంకా ఎన్నాళ్లు బ్రతుకుతాడో, ఎప్పుడు చనిపోతాడో ఆయన ఖచ్చితంగా చెప్పగలిగేవాడు. అప్పట్లో చాలామంది గంగానదీతీరంలో చనిపోవాలని కోరుకునేవారు. కనుక చివరిఘడియలలో అక్కడకు వెళ్లి నివసించేవారు. అలాంటివారికి దేవనాధ్ దత్త ఒక  దేవుడిలాగా కనిపించేవాడు. ఆయన సూచించిన సమయానికి కాశీకి వెళ్లి అక్కడే వారు తృప్తిగా కన్నుమూసేయారు. ఈ విద్యతో ఆయన చాలా ధనం ఆర్జించాడు. ఆస్తులు సంపాదించాడు. అంతేగాక, ఆముదం మిల్లు, పిండి మిల్లు, లక్క మిల్లు, సల్ఫ్యూరిక్ యాసిడ్ పేక్టరీలు పెట్టి శ్రీమంతుడయ్యాడు. దశమాధిపతి కుజుడు నీచభంగరాహువుతో పంచమంలో ఉండటం వల్ల ఈయన తండ్రిగారికి ఒక విచిత్రవిద్య తెలిసి ఉంటుందన్న సూచన స్వామి జాతకంలో ఉన్నది.

పితృకారకుడైన రవి బుధునితో కలసి సహజనవమస్థానమైన ధనుస్సులో ఉండటం తల్లిదండ్రులకున్న ఆధ్యాత్మిక చింతనను సూచిస్తున్నది. స్వామి పూర్వీకులు కృష్ణభక్తులు. రాధాకృష్ణులను వీరు కులదేవతలుగా ఆరాధించేవారు. అంతేగాక దుర్గాదేవిని కూడా ఆరాధించేవారు. బెంగాల్లో కృష్ణభక్తీ, దేవీభక్తి అధికం. అదే వీరి కుటుంబంలో కూడా ఉండేది. స్వామి జాతకంలో లాభస్థానంలో రెండు గ్రహాలున్నాయి. వృశ్చికంనుంచి రాహుకుజులు చూస్తున్నారు. తృతీయంనుంచి శని చూస్తున్నాడు. మొత్తం అయిదు గ్రహాల ప్రభావం ఏకాదశం మీదున్నది. అందుకే అయిదుగురు అన్నల తర్వాత తమ్ముడిగా స్వామి జన్మించాడు.

వీరికి కలకత్తాలోనే గాక, కాశీలో కూడా ఇల్లుండేది. ఏడాదిలో కొన్ని నెలలు అందరూ కాశీలో నివసిస్తూ  ఉండేవారు. స్వామి చిన్నపుడు బలహీనంగా ఉండేవాడు. ఆరోగ్యం అంత గట్టిది కాదు. కనుక పదకొండేళ్ళవరకూ ఆయన స్కూలుకు పోలేదు. ఇంటిలోనే  చదువుకున్నాడు. సంస్కృతాన్ని కూడా ఇంటిలోనే నేర్చుకున్నాడు. ఈ ప్రజ్ఞతోనే సంస్కృతంలో ఆయన చక్కగా మాట్లాడగలిగేవాడు. అంతేగాక సంస్కృతంలో ఉన్న ఉపనిషత్తులను, బ్రహ్మసూత్రాది వేదాంత మూలగ్రంధాలను ఆయన చదివి ఆకళింపు చేసుకున్నాడు. ఈ జ్ఞానంతోనే, తర్వాత ఏళ్లలో బేలూర్ మఠంలోని బ్రహ్మచారులకు, స్వాములకు  బ్రహ్మసూత్రములు, ఉపనిషత్తులను ఆయన బోధించాడు. దీనికి సూచికగా నవమాధిపతి మరియు సాంప్రదాయ జ్ఞానానికి కారకుడూ అయిన గురువు సొంత ఇంటిని సూచించే చతుర్దంలో శుక్రునితో కలసి ఉన్నాడు. శుక్రుని కలయిక ఇంటిలో ఉంటూ సొంతంగా చదువుకునే రాక్షసప్రవృత్తిని సూచిస్తుంది. అలా కాకపోతే, ఇంకో యోగం ఉన్నట్లయితే, గురుకులంలోనే ఆయన విద్య సాగి ఉండేది.

ఒకానొక సందర్భంలో ఆ విధంగా కాశీలో ఉన్న సమయంలోనే, 30-12-1873 నాడు స్వామి తల్లిగారు కాశీలోనే మరణించారు. అప్పుడు స్వామి జాతకంలో కుజ మహాదశ అయిపోయి రాహు మహాదశ మొదలైంది. అది రాహు - గురు - గురుదశ. ఇది గురుఛండాలయోగపు దశ. చతుర్ధం నుంచి నీచరాహువు, ద్వితీయ మారకస్థానంలో మారకుడైన కుజుని ఇంటిలో కుజునితో కలసి బలంగా ఉన్నాడు. గురువు రోగస్థానాధిపతిగా లగ్నంలోనే ఉన్నాడు. ఇది ఖచ్చితంగా తల్లిగారికి మారకదశ. కనుక తల్లిగారు చనిపోయారు. లగ్నంలో గురుశుక్రుల ప్రభావంవల్ల కాశీవంటి గొప్ప పుణ్యక్షేత్రంలో ఆవిడ మరణం సంభవించింది. అదేవిధంగా,  చంద్రలగ్నాత్ గమనిస్తే - సప్తమ మారకస్థానంలో ఉన్న నీచరాహువు, రోగస్థానంలో ఉన్న గురువు, గురుఛండాలదశలు కనిపిస్తున్నాయి. అలాంటి చెడుదశలో ఆమెకు మరణం రాక మరేమౌతుంది?

మరుసటి సంవత్సరం అక్కడి బెంగాలీ తోలా హైస్కూల్లో సరాసరి ఆయనకు అడ్మిషన్ దొరికింది. అక్కడ హరిప్రసన్న అనే అబ్బాయితో స్నేహం ఏర్పడింది. ఈ హరిప్రసన్న అనే అబ్బాయి తర్వాతికాలంలో శ్రీ రామకృష్ణుల పరమభక్తుడై స్వామి విజ్ఞానానందగా ప్రసిద్ధి గాంచాడు. సివిల్ ఇంజనీర్ గా ప్రభుత్వంలో  ఉన్నతమైన స్థానంలో పనిచేసిన ఆయనే బేలూర్ మఠంలోని శ్రీరామకృష్ణ దేవాలయాన్ని ప్లాన్ గీసి, దగ్గరుండి కట్టించింది. మా గురువుగారైన స్వామి నందానందగారు , స్వామి విజ్ఞానానందగారి శిష్యులే.

స్వామి విజ్ఞానానందగారు రామాయణకాలంలోని జాంబవంతుడు. రామావతార సమయంలో ఈయన రాములవారికి ఎంతో సేవ చేశాడు. రామసేతువుని నిర్మించడంలో ప్రముఖపాత్ర పోషించాడు.  వానరసైన్యంలోని నలుడు, నీలుడు, జాంబవంతుడు సివిల్ ఇంజనీరింగ్ తెల్సినవారు.  అందుకే 13 వేల ఏళ్ళక్రితమే సముద్రం మీద వారధి కట్టగలిగారు. అదే  జాంబవంతుడు ఈ జన్మలో విజ్ఞానానందస్వామిగా పుట్టి సివిల్ ఇంజనీరింగ్ లో ప్రవీణుడై, బేలూర్ మఠంలోని శ్రీరామకృష్ణ దేవాలయం ప్లాన్ ను తానే గీచి, దగ్గరుండి దానిని అద్భుతంగా నిర్మించాడు.

కృష్ణావతారసమయంలో జాంబవంతుడు కృష్ణునితో కుస్తీ పట్టాడు. శ్రీరామకృష్ణుల అవతారసమయంలో ఒకనాడు శ్రీరామకృష్ణులు హరిప్రసన్నను ఇలా అడిగారు 'ఏరా ! నాతో కుస్తీ పట్టగలవా?' ఆయన అప్పటికే నడివయసులో ఉన్నారు. హరిప్రసన్న యువకుడు, ఆరడుగుల ఎత్తుతో మంచి బలంగా ఉండేవాడు. 'ఈయన నాతో ఏమి గెలవగలడులే?' అని లోలోపల అనుకున్నప్పటికీ, ఆయన ఎందుకడిగారో అర్ధంకాని హరిప్రసన్న సరేనన్నాడు.  ఐదడుగుల విగ్రహంతో బలహీనంగా ఉన్న రామకృష్ణులు బలిష్ఠుడైన హరిప్రసన్నను సునాయాసంగా గోడకు అదిమిపెట్టేశారు. ఆయన్ను తాకడంతోనే శరీరంలోని శక్తంతా ఉడిగిపోయి కుప్పకూలినట్లుగా అయిపోయాడు హరిప్రసన్న. 'ఇప్పుడేమంటావ్?' అంటూ నవ్వుతూ శ్రీరామకృష్ణులు అతన్ని వదిలేశారు.

శ్రీరామునితో యుద్ధం చెయ్యాలన్న కోరికను ఒక సందర్భంలో వెలిబుచ్చుతాడు జాంబవంతుడు. 'ఇప్పుడు కాదు, వచ్చే అవతారంలో నీ కోరిక తీరుస్తానని' వరమిస్తాడు శ్రీరాముడు. అది కృష్ణావతారంలో నెరవేరింది. అది పూర్తిగా తీరలేదేమో? లేక, గతాన్ని మరొక్కసారి గుర్తు చేద్దామని అనుకున్నారేమో శ్రీరామకృష్ణులు. ఆ విధంగా హరిప్రసన్నతో సరదాగా కుస్తీ పట్టి, అతన్ని గోడకు నొక్కిపట్టారు. అలాంటి హరిప్రసన్న, తులసీచరణ్ కు కాశీలో క్లాసుమేటయ్యాడు. భవిష్యత్తులో తులసి కార్యరంగంకూడా దక్షిణభారతమే కావడం గమనార్హం. కనుక స్వామి కూడా గతజన్మలో వానరసైన్యం లోనివాడేనా? అందుకేనా, దక్షిణభారతదేశంలోనే ఆయన  దాదాపు 30 ఏళ్ళపాటు తన రక్తాన్ని ధారపోసి శ్రీ రామకృష్ణులు చూపిన మార్గంలో దీనులకోసం, ఆర్తులకోసం, సమాజంలో ఆధ్యాత్మిక చైతన్యాన్ని రగల్చడం కోడం  పనిచేశాడు?

అంతేకాదు. స్వామి ఎప్పుడు త్రివేండ్రం వెళ్లినా కన్యాకుమారికి వెళ్లి జగన్మాత దర్శనం చేసుకుని, కొన్నాళ్ళు అక్కడ ఉండి తిరిగివస్తూ ఉండేవాడు. బహుశా వానరసైన్యంలో ఉన్నపుడు అక్కడి సముద్రతీరంలో తాము చేసినపని గుర్తుకురావడం వల్లనేనా స్వామి అలా చేసేవాడు? ఎవరికి తెలుసు? ఒకవేళ అవన్నీ గుర్తుకొచ్చినా కూడా, వాళ్ళెవరూ ఆ విషయాలు బయటకు చెప్పేవారు కారు. 

స్వామివిజ్ఞానానంద గారికి పూర్వజన్మలో తాను జాంబవంతుడినన్న విషయం బాగా తెలుసు. ఆయన రామభక్తుడు. శ్రీరామకృష్ణులవారిలో శ్రీరాముడిని ఆయన ధ్యానించేవాడు. తన చివరిదశలో అలహాబాద్ (నేటి ప్రయాగరాజ్) రామకృష్ణమఠంలో ఉంటూ ఆయన వాల్మీకి రామాయణాన్ని  అనువాదం చేస్తూ కాలం గడిపారు. మొదటి రెండు కాండాలను అనువాదం చేసిన ఆయన 1938 లో అక్కడే కన్నుమూశారు. ఆ సమయంలో ఆయనకు అనుక్షణం కళ్ళెదురుగా సీతారాములు, ఆంజనేయుల దర్శనం నిరంతరం కలిగేదని నాకు స్వయానా నందానందస్వాముల వారే చెప్పారు. ఆయననోట నేనీ విషయాన్ని స్వయంగా విన్నాను. అంతటి రామభక్తితత్పరుడాయన !

అంతేకాదు, విజ్ఞానానందస్వామికి, నిర్మలానందస్వామికి ఉన్న అనుబంధంలో ఇంకొక్క విచిత్ర విషయం  వినండి. వీరిద్దరూ 1938 లో ఒకే ఒక్కరోజు తేడాతో చనిపోయారు. విజ్ఞానానందస్వామి శ్రీరామకృష్ణ మఠం మిషన్ల సర్వాధ్యక్షునిగా 25-4-1938 న ప్రయాగలో చనిపోతే, చిన్నప్పుడు ఆయన క్లాసుమేటూ, తర్వాతికాలంలో సోదరభక్తుడూ, సోదరస్వామీ అయిన నిర్మలానందస్వామి 26-4-1938 న కేరళలోని ఒట్టపాలెం ఆశ్రమంలో చనిపోయారు. ఒకే ఒక్క రోజు తేడా ! అంతే !

ఇదంతా చూస్తే ఏమనిపిస్తుంది? గతజన్మలలో విజ్ఞానానందస్వామి జాంబవంతుడని రామకృష్ణభక్తులలో అందరికీ తెలిసిన విషయమే. మరి నిర్మలానందస్వామి కూడా వానరసైన్యంలోని వాడేనని నా విశ్వాసం. బహుశా ఆయన, జాంబవంతునికి మంచి స్నేహితుడైన నీలుడై ఉంటాడని నా ఊహ. ఎందుకంటే, నిర్మలానందస్వామి ఎన్నోఏళ్ళు కేరళలోని ఏ నదీతీరంలో నివసించారో, ఆ 'భారత్ పులా' నదికి ఉన్న ప్రాచీన నామం నీలానది ! నీలానదీ తీరాన్నే ఆయన తన ఆశ్రమస్థాపనకు ఎంచుకున్నాడు. చివరకు అక్కడే శ్రీ రామకృష్ణ నిరంజన ఆశ్రమంలో కన్నుమూశాడు.

అంతేకాదు, యువకునిగా ఉన్న రోజులలో అసలైన సన్యాసిగా దేశాటనం చేస్తూ, డబ్బును తాకకుండా, మధుకరంతో జీవిస్తూ, కప్పుకింద నిద్రించకుండా ఆకాశమే కప్పుగా జీవిస్తూ, నిరంతరధ్యానంలో ఏళ్లకేళ్ళు గడిపిన నిర్మలానందస్వామి  ఒకసమయంలో హిమాలయ అడవులలో దారితప్పి ఒక రాత్రంతా దట్టమైన అడవిలో చెట్టుక్రింద ఉండవలసి వఛ్చినపుడు ఒక అడవి కోతుల గుంపు ఆయనకు ఆతిధ్యం  ఇచ్చి , తినడానికి పండ్లు తెచ్చిచ్చి, ఆయన ఎదురుగా చితుకులతో మంటను రాజేసి, రాత్రంతా ఆయనకు కాపలాగా ఉండి ఆయనకు రక్షణగా నిలిచాయన్న అద్భుత సంఘటన మీకు తెలుసా? ఇది నిజంగా జరిగింది. ఎప్పుడు జరిగిందో ఎలా జరిగిందో ముందు ముందు వివరిస్తాను.

ఆయన గతజన్మలో వానరసైన్యంలోని నీలుడు కాకపోతే, శ్రీరామునికి నమ్మినబంటు కాకపోతే, శ్రీ రామకృష్ణుల అనుగ్రహానికి ఎలా పాత్రుడౌతాడు? ఆయనతోబాటుగా ఈ భూమికి ఎందుకొస్తాడు? కోతుల గుంపు హిమాలయ అడవులలో ఆయననెందుకు రక్షించి, తినడానికి తిండి పెట్టి, రాత్రంతా కాపలా కాచి రక్షించాయి? చెప్పండి మరి !

(ఇంకా ఉంది)

read more " స్వామి నిర్మలానంద - ఒక విస్మృత మహనీయుడు -3 (జాతక విశ్లేషణ) "

5, మే 2021, బుధవారం

అసలు నిజం

అనగనగా ఒక భూమి  దాని జనాభా రోజురోజుకీ పెరిగిపోతున్నది. వనరులేమో రోజురోజుకీ తగ్గిపోతున్నాయి. వాతావరణంలో వేడి పెరిగిపోతోంది. జనాభా ఎక్కువైన దేశాలనుంచి జనం వలసలుపోయి ఇతర దేశాలను ఆక్రమిస్తున్నారు. అక్కడ వీళ్ళ జనాభా పెరిగిపోయి గొడవలు జరుగుతున్నాయి. ఏం చెయ్యాలో ఎవరికీ  పాలుపోవడం లేదు. మేధావులు గోలపెడుతున్నారు.

ఇలాంటి పరిస్థితిలో, ఉన్నట్టుండి ఇద్దరు ప్రపంచమేధావులకు భలే ఆలోచనొచ్చింది. వాళ్లిద్దరూ ప్రపంచంలోనే పెద్ద పెట్టుబడిదారులు. అయితే రెండు వేర్వేరు దేశాలకు, వర్గాలకు చెందినవాళ్లు. అయితేనేం? ఇలాంటప్పుడు బాగా కలుస్తారు.

'నువ్వు వైరస్ తయారు చెయ్యి. నేను వాక్సిన్ తయారు చేస్తాను. మనవరకూ జాగ్రత్తలు తీసుకుందాం. వైరస్ సృష్టించేది మనమే గనుక దానికి ఏమేం చెయ్యాలో మనకు తెలుసు. కనుక మీవాళ్ళకూ మా వాళ్లకూ ఢోకా లేదు. మిగతా వాళ్ళు పోతారు. పోతే పోనీ ! జనాభా తగ్గి భూమి బాగుపడుతుంది. ఒకపక్కన జనాభా తగ్గుతుంది. పోయినవాళ్లు పోగా ఉన్నవాళ్లు వాక్సిన్ కొంటారు కాబట్టి ఇంకోపక్కన డబ్బులొస్తాయి. ఎటు చూసినా మనకే లాభం'' అనుకున్నారిద్దరూ. 

ప్లాన్ని అమలుచేశారు. అనుకున్నట్లే అంతా జరుగుతోంది. కోట్లల్లో జనం చస్తున్నారు. కోట్లల్లో డబ్బులొస్తున్నాయి. కానీ వీళ్ళ ప్లాన్ కొంత బెడిసికొట్టింది. ఈ లోపల కొన్ని దేశాలు వాళ్లకు వాళ్ళే వాక్సిన్ తయారు చేసుకున్నాయి. వీళ్ళ బిజినెస్  కుంటుపడుతోంది. అందుకని కొత్త వ్యూహం మొదలుపెట్టారు.

'ఆ వాక్సిన్ మంచిది కాదు. అది వాడవద్దు. మా వాక్సిన్ ఒక్కటే మంచిది. ఇదొక్కటే వాడండి' అనేదే ఆ వాదన. ఈ వాదనకు తోడుగా ఆయా దేశాలలో ఉన్న మీడియాని కొనేసి, సాధ్యమైనంతగా దుష్ప్రచారం చెయ్యమని, భయభ్రాంతులు సృష్టించమని, పురమాయించారు.

ఇక మీడియా రంగంలోకి దిగింది. చూపినదె చూపిస్తూ, చెప్పినదే చెబుతూ జనాన్ని భయపెట్టడం మొదలుపెట్టింది. విసుగుపుట్టి చాలామంది టీవీలు చూడటం మానేశారు. వాళ్ళ ఆరోగ్యాలు మాత్రం బాగుంటున్నాయి.

వైరస్ సోకినప్పటికీ, ఇంట్లో ఉంటూ జాగ్రత్తలు తీసుకునేవాళ్ళు బానే ఉన్నారు. ఆస్పత్రిలో చేరినవాళ్లు పోతున్నారు. డాక్టర్లు తప్పుడు వైద్యం చేస్తున్నారని, మొదట్లోనే ఇవ్వాల్సిన మందులను  రోగం బాగా ముదిరిన తర్వాత ఇస్తున్నారని అప్పుడు ఉపయోగం ఉండదని మరికొందరు మేధావులు గగ్గోలు పెడుతున్నారు. ముదిరాకే మా దగ్గరకొస్తున్నారు మేమేం చెయ్యాలని డాక్టర్లు అంటున్నారు.

కానీ, మీడియా చేస్తున్న భయభ్రాంత ప్రచారం వల్ల మంచే జరిగింది. జనం భయపడి ఇంకా ఎక్కువగా జాగ్రత్తలు తీసుకోవడం మొదలుపెట్ట్టారు. వైరస్ అదుపులోకి వస్తున్నది.

ఈ లోపల డాక్టర్లు, మందుల షాపులు, ఆక్సిజన్ సిలండర్లు అమ్మేవాళ్ళ దందా మొదలైంది. రోజుకి నూరు రూపాయల వైద్యం సరిపోయేచోట లక్షలు వసూలు చెయ్యడం మొదలైంది. బెడ్లతో సహా అన్నింటినీ బ్లాకులో అమ్మడం మొదలైపోయింది. 'ఎవడెలాపోతే నాకెందుకు? అవకాశాన్ని సొమ్ము చేసుకుందాం' అనే ధోరణి మొదలైపోయింది. చచ్చేవాడు చస్తున్నాడు. బ్రతికేవాడు బ్రతుకుతున్నాడు. ఎవడి ఖర్మ వాడిది. ఎవడి ధైర్యం వాడిది. ఎవడి అవకాశం వాడిది. ఎవడి చావు వాడిది. ఎవడి బ్రతుకు వాడిది.

కోట్లుమూలుగుతున్నవాడు దిక్కులేకుండా చస్తున్నాడు. వాడి శవాన్ని అనాధశవంలాగా అంత్యక్రియలు చేస్తున్నారు. అమెరికాలో పిల్లలున్నా రాలేని పరిస్థితి. అక్కణ్ణించే వాళ్ళు 'టాటా మమ్మీ, టాటా డాడీ' అంటూ చేతులూపుతున్నారు. చేతులు దులుపుకుంటున్నారు. అప్పటిదాకా ఎంతో ఆప్యాయతలు కురిపించినవాళ్లు అవసరానికి ముఖం చాటేస్తున్నారు. ఎవరికీ వాళ్ళు బిక్కుబిక్కుమంటూ ఎప్పుడు పిలుపొస్తుందో అంటూ బ్రతుకుతున్నారు.

ఇదంతా చూస్తూ ప్రపంచమేధావులు నవ్వుకుంటున్నారు. ఈ వైరస్ నుంచి లోకం బయటపడుతుందా? ఒకవేళ పడితే పడనీయ్.  దీని బాబులాంటివి ఇంకా బోలెడన్ని వైరస్ లు వాళ్ళ దగ్గర రెడీగా ఉన్నాయి. కోట్ల డాలర్లు పెట్టి ల్యాబుల్లో రీసెర్చి చేయించి మరీ కొత్త కొత్త వైరస్ లను సృష్టించి ఆల్రెడీ దగ్గర పెట్టుకున్నారు. ఒకదాని తర్వాత మరొకటి లోకంమీదకి వదుల్తారు. ఎవడేమై పోతే వాళ్ళకెందుకు? వాళ్ళ దందా ప్రస్తుతం నడుస్తోంది. వాళ్ళాడే చదరంగంలో దేశాలు, మనుషులు పావులు. ఈ గ్లోబల్ వ్యాపారంలో మనుషులే వస్తువులు. ప్రాణాలే పెట్టుబడులు.

కానీ ఎలాంటి ఆటగాడి ఆట్టైనా కూడా కొన్నాళ్ళకి ముగుస్తుంది. పులిమీద స్వారీ చేసేవాడిని కూడా పులి ఒకరోజున మింగుతుంది. సాగినంత కాలం సాగుతుంది ఎవడిదైనా ఆట. ఆ తర్వాత ఆడేవాడూ ఉండడు, పావులూ ఉండవు. అనంత కాలగమనంలో ఇలాంటి ఆటగాళ్లు ఎంతమంది కనుమరుగైపోయారో? ఎన్ని పావులు మట్టిలో కలసిపోయాయో?

ఇంతకీ, ఈ మొత్తం ప్రహసనంలో అసలు నిజమేంటి?

అన్నీ తన చేతిలోనే ఉన్నాయని అనుకుంటున్నంతవరకూ మనిషి బ్రతుకింతే. ఇప్పటికి కనిపిస్తున్నదే నిజమని అనుకుంటూ ఉన్నంతకాలం మనిషి బ్రతుకింతే. ఏది శాశ్వతమో ఏది కాదో తెలీనంతవరకూ మనిషి బ్రతుకింతే. స్వార్ధమే పరమార్థమనుకుంటున్నంత వరకూ మనిషి బ్రతుకింతే.

ఎలా బ్రతకాలో తెలీనంతవరకూ ఏదో ఒకటి మనల్ని భయపెడుతూనే ఉంటుంది. ఎలా బ్రతకాలో తెలిస్తే, చావు కూడా మనల్ని భయపెట్టదు. కానీ, చావు ఎదురైనప్పుడు కాదు నేర్చుకోవలసింది ఎలా బ్రతకాలో. అది ఇంకా ఎంతో దూరంలో ఉన్నప్పుడే ఆ విద్యను నేర్చుకోవాలి. అలా బ్రతకాలి.

ఈ నిజాన్ని ఇంకా సమయం ఉన్నపుడే గ్రహించినవాడే అసలు మనిషి. వాడిదే అసలైన బ్రదుకు. వాడిదే అసలైన చావు. వాడికి ఉన్నా ఒకటే పోయినా ఒకటే. మిగతావాళ్ళు నిరర్ధకజీవులు. వాళ్ళు ఉన్నా ఒకటే పోయినా ఒకటే.

ఇదే అసలు నిజం.

read more " అసలు నిజం "

4, మే 2021, మంగళవారం

మెక్సికో సిటీ మెట్రో రైలు ప్రమాదం - జ్యోతిష్య విశ్లేషణ

3-5-2021 సోమవారం రాత్రి పదిన్నర ప్రాంతంలో (అంటే ఏడుగంటల క్రితం) మెక్సికో దేశంలోని మెక్సికో సిటీలో ఒక మెట్రో రైల్ ప్రమాదం జరిగింది. మెట్రో రైలు నడవడం కోసం వేసిన బ్రిడ్జిని 'ఓవర్ పాస్' అంటారు. దాని సంభాలలో ఒకటి విరిగిపోయి, మెట్రో ఓవర్ పాస్ కూలిపోయింది. మెట్రో రైలు రెండుముక్కలై రోడ్డును తాకింది.  23 మంది పోయారని 70 కి పైగా గాయాల పాలయ్యారని అంటున్నారు. ఈ లెక్క క్షణక్షణానికీ పెరుగుతోంది. ఇంతపెద్ద ఘోరప్రమాదం పెపంచంలో జరిగాక మనం రంగంలోకి  దిగకపోతే ఎలా? బావుంటుందా అసలు? ఏమైందో చూద్దాం !

శని, సూర్యుడు, రాహువు ఈ సంఘటన వెనుక ఉన్న ముఖ్య గ్రహాలు. శని సూర్యులమధ్యన ఖచ్చితమైన కేంద్రదృష్టి ఉన్నది. ఇది ఘోరప్రమాదాలను సృష్టించే శక్తిని కలిగి ఉంటుంది. ఇకపోతే, శనిరాహువులమధ్యన ఖచ్చితమైన కోణదృష్టి ఉన్నది. ఇది బలమైన శపితయోగాన్ని రేకెత్తిస్తుంది. హఠాత్ సంఘటనలకు, విద్రోహచర్యలకు కారకుడైన యురేనస్ సూర్యుడికి చాలా దగ్గరగా ఉన్నాడు.

యాక్సిడెంట్ జరిగినపుడు మెక్సికో సిటీలో ధనుర్లగ్నం ఉదయిస్తున్నది. యాక్సిడెంట్లకు సూచికగా ఉన్న ఆరవ ఇల్లు వృషభంలో ఉచ్చరాహువు, బుధుడు ఉన్నారు. బుధుడు దశమాధిపతిగా ఆరవ ఇంటిలో ఉంటూ యాక్సిడెంట్ ను సూచిస్తున్నాడు.

దేశాలకు, రాశులకు ముడిపెట్టాలని చాలా పాతకాలం నుంచీ జ్యోతిష్కులు ప్రయత్నించారు. రకరకాల జ్యోతిష్కులు రకరకాలుగా వీటిని చెప్పారు. వీరిలో ఎక్కువమంది పాశ్చాత్య జ్యోతిష్కులున్నారు. కానీ వీరిలో ఏకాభిప్రాయం లేదు. వీరిని గౌరవిస్తూనే, నా లాజిక్ ను కొంత వివరిస్తాను.

మిథునరాశి అనేది అమెరికాకు సూచికని చాలామంది జ్యోతిష్కులు ఒప్పుకున్న విషయం ! దీనిని ఆధారాలు కూడా ఉన్నాయి. అలాంటప్పుడు, అమెరికాకు దక్షిణాన ఉన్న మెక్సికో వృషభం అవ్వాలి. ప్రస్తుతం రాహు బుధులున్నది వృషభరాశిలోనే గనుక నా లాజిక్ దీనికి సరిపోతోంది. పైగా, భారతదేశం యొక్క రాశి మకరమని కూడా ఏకాభిప్రాయమున్నది. భారతదేశమూ, మెక్సికో రెండూ ప్రపంచపటంలో దక్షిణాదిలోనే ఉంటాయి గనుక, మకరానికి కోణరాశియైన వృషభం మెక్సికో రాశి కావడం సమంజసంగానే ఉంటుంది.

యాక్సిడెంట్ జరిగిన సమయంలో గురుహోర జరుగుతున్నది. గురువు దశమంలో ఉండాలంటే అది వృషభమే అవ్వాలి. కనుక మెక్సికో దేశపు రాశి వృషభమని నేను భావిస్తున్నాను. అయితే ఇది అంతిమభావన కాదు. ఇంతకంటే మెరుగైన లాజిక్ దొరికేవరకూ దీనిని మనం అనుసరిద్దాం.

వృషభలగ్నం నుంచే చూచినప్పుడు ప్రయాణాలకు సూచకుడైన చంద్రుడు దూరప్రయాణాలకు సూచికైన మకరంలో బాధకుడైన శనితో కలసి ఉండటం రవాణా ప్రమాదాన్ని సూచిస్తున్నది. అంతేగాక వీరిద్దరి దృష్టి కర్కాటకం పైన ఉన్నది.

ప్రమాదసమయంలో కుజ - రాహు - శనిదశ జరిగింది. ఇది చాలా ప్రమాదకరమైన దశ అనే విషయం నా వ్రాతలు చదివేవారికి బాగా తెలుసు. వృషభం నుంచి చూస్తే, రెండింట ఉన్న కుజుడు స్వదేశంలో ప్రమాదాన్ని సూచిస్తున్నాడు. లగ్నంలోనే ఉన్న రాహువు రవాణా ప్రమాదాన్ని సూచిస్తున్నాడు. నవమంలో ఉంటూ తృతీయాన్ని చూస్తున్న శని మళ్ళీ రవాణా ప్రమాదాన్ని సూచిస్తున్నాడు. చంద్రలగ్నం నుంచి చూస్తే - ఆరవయింట్లో ఉన్న కుజుడు ప్రమాదాన్ని సూచిస్తున్నాడు. రాహువుతో ఆరవ అధిపతి బుధుడు కలసి ఉన్నాడు. శని చంద్రునితోనే ఉంటూ ఏడుపును సూచిస్తున్నాడు. నవాంశలో మిథునంలో కలసి ఉన్న శనిరాహువులు భయంకరమైన యోగాన్ని సృష్టిస్తూ సహజతృతీయ రాశి అయిన మిథునం ద్వారా రవాణాప్రమాదాన్ని సూచిస్తున్నారు.

అష్టమి ఘడియలలో ఈ ప్రమాదం జరిగింది. కొన్ని కొన్ని తిధులు ఇలాంటి సంఘటనలకు చాలా బాగా పనిచేస్తాయన్నది మనకు తెలిసిన విషయమే. అలాంటి వాటిల్లో అష్టమి ఒకటి. అదీ సరిపోయింది.

అదన్నమాట సంగతి !

read more " మెక్సికో సిటీ మెట్రో రైలు ప్రమాదం - జ్యోతిష్య విశ్లేషణ "