“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

31, ఆగస్టు 2010, మంగళవారం

జ్యోతిశ్శాస్త్ర ప్రయోజనం -వేదాంత చర్చలు

రోజు సాయంత్రం తమ్ముడు చంద్రశేఖర్ ఢిల్లీనుంచి వచ్చాడు. రాత్రికి హైదరాబాద్ పోయి రేపు ఢిల్లీ వెళతాడు.కనుక మిత్రుడు గిరిజా శంకర్ గారి షాపులో అర్జంటు సమావేశమయ్యాం. మాటల మధ్యలో మంచి ఆధ్యాత్మిక సంభాషణలుజరిగాయి.వాటిలో నుంచి కొన్ని మాటలు.

గిరిజా శంక్రర్ గారు మంచి వేదాంతి. బయటకు కనపడడు కాని మాట్లాడితే ఆణిముత్యాలు దొర్లుతాయి. ఆయన నృశింహానంద భారతీ స్వామి శిష్యుడు. గుంటూరులో నృశింహానంద భారతీస్వాములవారని ఒక స్వామి ఉండేవారు. ఆయన కళ్యాణానంద బారతీస్వామి సాంప్రదాయానికి చెందిన వారు. అచ్చమైన వేదాంతి.అసలైన స్వామి.అంతేగాక మంచి జ్యోతిష్య పండితుడు కూడా.

ఆయన ఒకసారి ఇలా అన్నారట.

జ్యోతిశ్శాస్త్ర ఉపయోగం ఏమిటో తెలుసా? నీ జీవితంలో ముందు ముళ్లదారి ఉందని ఆ శాస్త్రం చెబుతుంది. చీకటిపడబోతున్నదని చెబుతుంది. ఎండ ఎక్కువగా ఉంటుందని చెబుతుంది. నీవు చెప్పులు వేసుకుంటావు.టార్చ్ లైట్దగ్గర పెట్టుకుంటావు. గొడుగు వేసుకుంటావు. అంతే దాని ఉపయోగం. కాని ముళ్ళూ తప్పవు, చీకటీ తప్పదు,ఎండాతప్పదు. ప్రారబ్దాన్ని జ్యోతిష్యం తీసివెయ్యలేదు. కాని జాగ్రత్తపడమని ముందుగా సూచిస్తుంది.

ఆయనను ఒకరు ఇలా అడిగారు.
ప్రశ్న: స్వామీ సన్యాసికి ప్రారబ్దం ఉండదు కదా?
స్వామి: ఎందుకలా అనుకుంటున్నావు?
ప్రశ్న: సన్యాసం అంటే రెండవ జన్మ కదా. అప్పుడు మొదటి జన్మ ప్రారబ్దం నశిస్తుంది కదా అందుకని అలా అడిగాను.
స్వామి: సన్యాసం తీసుకోవడం కూడా ప్రారబ్ద కర్మ ప్రకారమే జరుగుతుంది నాయనా. ఇక ప్రారబ్దం తప్పేదెక్కడ?

ఇంకొక సారి ఒకరు ఇలా అడిగారు:
ప్రశ్న: స్వామీ మీరు దండ కమండలాలు ధరించాలి కదా.వాటిని ఎందుకు వదిలేశారు?
స్వామి: అంటే నేనొక స్వామిని గురువును అని అందరికీ చాటింపు వేసుకోవాలా? ఖర్మ నాకెందుకు. అందుకే వాటినీవిసర్జించాను.

వింటున్న చంద్రశేఖర్ ఇలా అన్నాడు.
రమణమహర్షిని కూడా ఒకాయన ఇలాగే అడిగాడు."స్వామీ మీరు వివాహం ఎందుకు చేసుకోలేదు?" అని.
దానికాయన " అది నా ప్రారబ్దం కాదు కనుక చేసుకోలేదు" అని చెప్పాడు. ఇంకొకాయన అలాగే " స్వామీ మీరుసన్యాసం ఎందుకు తీసుకోలేదు" అని ఆయన్నె అడిగాడు. దానికాయన మళ్లీ అదే సమాధానం చెప్పాడు.

వింటున్న నేనిలా అన్నాను.

ఒకవేళ మహర్షి సన్యాసం తీసుకుని ఉంటె అదే ప్రశ్న అక్కడా ఎదురై ఉండేది. "స్వామీ మీరు ఆత్మ జ్ఞాని కదా మీరు సన్యాసం ఎందుకు తీసుకున్నారు. దాని ఆవశ్యకత ఏముంది?" అని. కనుక లోకుల మాటలు పట్టించుకోకుండా మన పని మనం చేయ్యటం ఉత్తమం.

సంభాషణ జప ధ్యానాల వైపు మళ్ళింది.మిత్రుడు గిరిజా శంకర్ చక్కని మాట ఒకటి చెప్పాడు.

కాయిక వాచిక మానసిక అని మూడు చెబుతారు కదా. మనసా వాచా కర్మణా అని కూడా అంటారు. మనిషికి మూడు స్థితులలోనూ ఏదో ఒక ఆధారం కావాలి.

బాహ్యంగా ఏదో ఒక విగ్రహం యొక్క ఆసరా కావాలి. వాక్కుకు స్తోత్రమో మంత్రమో ఏదో ఒకటి ఆసరాగా కావాలి. మనస్సుకు ఏదో ఒక ఆలంబన ధ్యానానికి కావాలి. మూడూ అధిగమిస్తే ఇక నిరాకారమే, నిరాధారమే.అటువంటి వానికి ఆసరా అక్కరలేదు. నిరాకార, నిశ్చల, నిరంజన స్థితి అంటే అదే.

త్యాగరాజు ఒక కీర్తనలో ఇలా అన్నారు. "మనసు స్వాధీనమైన మంత్ర తంత్రములేల?" ఆయన ఇంకా ఇలా అన్నారు."గ్రహబలమేమి రామానుగ్రహ బలముగాని".

ఇలా సంభాషణ చాలాసేపు జరిగింది.

చంద్రశేఖర్ ఇలా అన్నాడు.
అన్నగారూ నాకొకటి అనిపిస్తున్నది. ఆధ్యాత్మికంగా ఒక మనిషి ఎదిగాడా లేదా అని ఎలా చెప్పగలం అని చాలారోజులనుంచి నాకొక సందేహం ఉండేది. మధ్యనే నాకు జవాబు దొరికింది. మనిషికి ఎంతగా దేహస్పృహ (Body identification) తగ్గుతుందో అంతగా ఆధ్యాత్మికంగా ఎదిగినట్లు అని నా భావన. మీరేమంటారు?

నేను నిజమే అన్నట్లు తలాడించాను.

మనిషికి దేహవాసన,లోకవాసన, శాస్త్రవాసన అని మూడు ప్రతిబంధకాలుంటాయి. వీటిని ఎంతగా తగ్గించుకుంటే అంతగా అంతరిక జీవితంలో ముందుకు పోగలుగుతాడు. తన దేహాన్ని, తన చుట్టూ ఉన్న లోకాన్ని, తనదనుకునే జ్ఞానాన్ని మరచిపోగలిగినవాడు నిజంగా మహాత్ముడే. అట్టివాడే ఆత్మజ్ఞుడు.

మళ్లీ కలుద్దామని సమావేశం ముగించాము.
read more " జ్యోతిశ్శాస్త్ర ప్రయోజనం -వేదాంత చర్చలు "

25, ఆగస్టు 2010, బుధవారం

పౌర్ణమి ప్రభావం- విమాన ప్రమాదాలు

నేను ఇంతకు ముందు అనేక పోస్ట్ లలో వ్రాసిన మేదినీ జ్యోతిషసూత్రం మళ్ళీ పనిచేసింది.

నిన్న శ్రావణ పౌర్ణమి.

శుక్ర కుజ గ్రహాలు మళ్లీ డిగ్రీ కంజక్షన్ లో చాలా దగ్గరగా బుధునిదైన కన్యా రాశిలో ఉన్నాయి. శుక్రునకు ఇది నీచ రాశి. గురువూ బుధుడూ వక్ర స్థితిలో ఉన్నారు. బుధుడు, కుజ శుక్రుల కలయిక జరిగిన కన్యారాశికి అధిపతి.

ఈ గ్రహస్థితుల వల్ల ఏం జరిగిందో చూద్దామా?

నిన్న మంగళవారం నాడు విమానాలు కూలి చైనాలో 42 మంది, నేపాల్
లో14 మంది చనిపోయారు. చైనాలోని ఇచువాన్ ప్రావిన్స్ లోనూ నేపాల్లోని ఖాట్మండులోనూ ఆ సమయాలలో రవి హోర జరుగుతున్నది. రవి కేతు నక్షత్రంలో గ్రహణం పట్టి ఉన్నాడు. శని రవియొక్క ఉత్తరా నక్షత్రంలో ఉన్నాడు.

ఈ రోజున మళ్లీ తుఫాన్ వాతావరణాలు చాలా చోట్ల కనిపిస్తున్నాయి.

కనుక ఈ సూత్రం ఎప్పుడైనా వర్క్ అవుట్ అవుతుంది.

కాని ఏ ప్రదేశంలో ఈ ఘటనలు జరుగుతాయి అనేది ఒక్క విషయం కనుక కనుక్కోగలిగితే అప్పుడు కరెక్ట్ గా చెప్పగలగటం సాధ్యం అవుతుంది. గ్రహాల కో-ఆర్డినేట్స్ కు, ఏ ప్రాంతాల కో ఆర్డినేట్స్ సరిపోతాయో అక్కడ ఈ ఘటనలు జరుగుతున్నాయి. ఈ దిశలో నేను చేస్తున్న పరిశోధన లో కొన్ని లీడ్స్ ఇప్పటికే నాకు కనిపిస్తున్నాయి. ఇంకొంత కాలం లో ఈ సూత్రాలను కూడా అర్ధం చేసుకోగలం అని గట్టిగా భావిస్తున్నాను.

ఒక్కటి మాత్రం నిజం. గ్రహస్థితులు భూమిమీద., మానవ జీవితాల మీద ఖచ్చితంగా ప్రభావం చూపిస్తాయి. ఇందులో ఎంతమాత్రం అనుమానం అవసరం లేదు.
read more " పౌర్ణమి ప్రభావం- విమాన ప్రమాదాలు "

21, ఆగస్టు 2010, శనివారం

మా జిల్లెళ్ళమూడి యాత్ర-2

ఏడో మైలురాయి దగ్గర ఆర్చ్ పడిపోయి ఉంది. పనివాళ్లు కొందరు ఆ పనిలో ఉన్నారు. వానపడి ఉందేమో ఆప్రాంతం అంతా బురదగా ఉంది.

"ఆ రోజుల్లో ఇక్కడ రెండు కుక్కలు ఎప్పుడూ కాపలా ఉండెవి అన్నగారూ. వాటి పేరు రాముడు, భీముడు.ఎవరైనా భక్తులుఇక్కడ బస్సుదిగి అర్ధ రాత్రో అపరాత్రో నడుచుకుంటూ జిల్లెళ్లమూడికి వస్తుంటె అవి తోడుగా ఊరివరకూ వచ్చి వారినిదిగబెట్టి మళ్ళీ వెనక్కు వచ్చి ఏడో మైలు రాయివద్ద కాపలాగా ఉండేవి. అవి ఎవరో, ఏ పుణ్య జీవులో, వాటికిఅమ్మకు ఏం బంధం ఉండేదో? వాటి జీవితాంతం అలా భక్తులకు సేవలందించాయి." అన్నాడు చరణ్. చరణ్‍కు ఇలాటి సంఘటనలు ఎన్నో తెలుసు. గంటలు గంటలు అలా చెబుతూనే ఉంటాడు.

నాకు వెంటనే శ్రీరామకృష్ణుని శిష్యుడైన స్వామి అద్భుతానంద జీవితంలో ఒక ఘట్టం మదిలో తళుక్కుమని మెరిసింది. శ్రీరామకృష్ణుల కాలంలో పంచవటి ఒక దట్టమైన అడవి. ఆ అడవి పక్కనే ఆనుకొని గంగానది ప్రవహిస్తూ ఉండేది.అక్కడఉన్న వటవృక్షం దగ్గర రాత్రుళ్ళు ధ్యానం చెయ్యమని శ్రీరామకృష్ణులు తన అంతరంగ శిష్యులను పంపేవారు. ఒక్కొక్కరికిఒక్కొక్క విధమైన ధ్యాన విధానాలు చెప్పి పంపేవారు. స్వామి అద్భుతానంద పేరు అప్పట్లో లాటూ అని ఉండేది. ఒకరోజునలాటూ అర్ధరాత్రి సమయంలో పంచవటిలో వటవృక్షం క్రింద ధ్యానంలో నిమగ్నుడై ఉన్నాడు. దాదాపు అయిదారు గంటలపాటు అనగా దాదాపుగా తెలతెలవారేవరకు అలా ఆయన ధ్యానంలో ఉన్నాడు. అంతసేపూ ఆయనకు కొద్ది దూరంలోనాలుగు కుక్కలు కాపలాగా మౌనంగా కూర్చోని ఉన్నాయి. అవికూడా ధ్యానంలో ఉన్నట్లు మౌనంగా కిక్కురుమనకుండాఉన్నాయి. శ్రీరామకృష్ణులు అది చూచారు. తెల్లవారిన తరువాత తన ప్రియశిష్యుని ప్రేమగా చూస్తూ, " లాటూకు ధ్యానభంగం కలుగకుండా భైరవుడు కాపలాగా ఉన్నాడు". అన్నారు.పంచవటిలోని వటవృక్షం మీద ఒక భైరవుడుఉండేవాడు. ఆయన దర్శనం తొతాపురికి కలిగింది. దత్తాత్రేయుని కాళ్లవద్ద కూడా నాలుగు కుక్కలుంటాయి. అవి నాలుగు వేదాలని అంటారు.

శరణాగత భావంతో భగవంతుని చేరాలని ప్రయత్నించేవారికి, తీవ్ర ధ్యాన సాధకులకు, ప్రకృతి శక్తులు, జంతువులు, సాయపడటం నిజమే. నా అనుభవంలో ఇది చాలా సార్లు నేనూ గమనించాను.

కారు జిల్లెళ్లమూడిలోకి ప్రవేశించి అమ్మగారి ఇంటి ఆవరణలోకి తిరిగింది. ముఖద్వారం ఆర్చి మీద పేరు చూచి పిల్లలు ఆశ్చర్యపోయారు. కారణం? దానిపైన ఇతర ఆశ్రమాలవలె రకరకాలైన పేరులు లేవు. "అందరిల్లు" అని సింపుల్ గా ఆర్చిమీద వ్రాసి ఉండటమే దానికి కారణం. అలా వ్రాసి ఉందేమిటి అని వారికి సందేహం వచ్చింది. నేను నవ్విఊరుకున్నాను. చరణ్ కూడా మాట్లాడలేదు.

అందరం దిగి ఆశ్రమంలో షెడ్డు దగ్గర ఆగాము. నా చిన్నప్పుడు అమ్మగారి దర్శనం చేసుకున్న రోజు గుర్తొచ్చింది. అదిబహుశా 1976 కావచ్చు. నేను తొమ్మిదో తరగతి చదువుతున్నాను. కొందరు మా పెద్దవాళ్లతో కలసి అమ్మగారి దర్శనానికి నేనూ వెళ్లాను. అమ్మగారు స్టేజి మీద ఇప్పుడున్న పెద్ద పొటోప్రాంతంలో ఒక పెద్ద కుర్చీలో కూర్చొని ఉన్నారు. దాదాపు ఒక రెండువందలమంది దూరంగా నిలబడి ఉన్నాము.మేమూ వారిలో ఉండి చూస్తున్నాము. మౌనంగా అందరినీ చూస్తున్నారు.ఆ చూపు ఇంకా నాకు గుర్తుంది. పూర్తిగా నిరామయంగా ఉంది ఆ చూపు. ఒక గాలి తెమ్మెర మాదిరి అందరినీ అలా స్పృశిస్తూ వెళ్ళిపోయింది.ఎవరినీ ప్రత్యేకంగా చూస్తున్నట్లుగా లేదు.కాని మా వద్దకు వచ్చినపుడు ఆ దృష్టి ఒక్క సెకను అలా ఆగినట్లు అనిపించింది. అది నా భ్రమ అయి ఉండవచ్చు అనుకున్నాను. 


జిల్లెళ్లమూడిలో అదే ప్రదేశంలో మళ్ళీ నిలబడి చూచాను. అదే సంఘటన నా కళ్లముందు మళ్ళీ ఆవిష్కృతమైంది. అప్పుడు జనంతో కిటకిట లాడేది. ప్రస్తుతం స్టేజి ఖాళీగా ఉంది. జిళ్లెళ్లమూడి కెళితే నన్ను నేను చాలా నిగ్రహించుకోవలసి వస్తుంది. కళ్ళు ధారాపాతం గా వర్షిస్తాయి. ఇది ఎందుకో నాకెప్పుడూ అర్ధంకాదు. చరణ్ పరిస్థితీ అదే. అక్కడి వాళ్లకు ఇలాటి సీన్లు మామూలే గనుక వాళ్లు పట్టించుకోరు.

అవ్యాజమైన మాతృప్రేమ అక్కడ వాతావరణంలో గూడుకట్టుకుని ఉండటం కొద్దిగా సేన్సిటివిటి ఉన్నవాళ్ళకు వెంటనే అనుభవంలోకి వస్తుంది. ఎల్లలు లేని, తప్పులు చూడని, కారణాలు అడగని మహా ప్రేమ అది. ఒక వరద లాగా అది మనల్ని ముంచెత్తుతుంది. జన్మ జన్మల మన తప్పొప్పులు మొత్తం తెలిసి కూడా వాటిని అస్సలు లెక్కించకుండా, పట్టించుకోకుండా అవ్యాజమైన మాతృప్రేమను నిష్కారణంగా మనపైన వర్షిస్తుంది. అటువంటి ప్రేమముందు కరగని రాతిగుండె ఉంటుందా?

"మిమ్మల్నందరినీ నేనే కని మీ తల్లులకు పెంచమని ఇచ్చానురా". అని అమ్మగారు అనేవారు. ఏమి ప్రేమ? అటువంటి ప్రేమతత్వాన్ని మళ్లీ శారదామాతలోనే చూస్తాము. మానవులు, యోగులు, ఋషులు, దేవతలు, పశు పక్ష్యాదులు, కీటకాలతో సహా సర్వంసృష్టి మొత్తం నా సంతానమే అని చెప్పిన ఆ ఆధ్యాత్మిక స్థాయి ప్రపంచమంతా వెతికినా ఇంకెక్కడా కనిపించదు. ఎవరిలోనూ చూడలేము.

ఆ రోజులలో అమ్మగారిని ఒకరు అడిగారట.

అమ్మా నీవు బ్రాహ్మణ కుటుంబంలో పుట్టికూడా కులాలు పాటించవెందుకూ? అని.

"గుణభేదమే లేని నాకు కులభేదమేమిటి నాన్నా?" అని అమ్మ సమాధానం.

"శుక్ల శోణితాలదే కులమో అందరిదీ అదేకులం" అన్నది అమ్మ. ఇక దానికి జవాబేముంది?

అక్కడకు వచ్చిన వారిలో చాలామంది అమ్మ సమక్షంలోకి రాగానే ధారాపాతంగా ఏడ్చేవారు.అమ్మ మౌనంగా చూస్తూ ఉండేది. "ఎందుకమ్మా వాళ్ళు అలా నిష్కారణంగా ఎక్కిళ్ళు పెట్టి ఏడుస్తున్నారు? "అని పక్కన ఉన్నవారు అడిగితే నవ్వి " వాళ్ళు ఏడవటానికే వచ్చారురా ఏడవనివ్వు" అనేది కాని కారణాలు చెప్పేది కాదు.

శ్రీరామకృష్ణుని ప్రత్యక్ష శిష్యులూ నాకు పరమ గురువులూ అయిన స్వామి శివానంద మహరాజ్ గారి జీవితంలో (అప్పట్లో ఆయన పేరు తారక్) ఒకసారి ఇలాటి సన్నివేశం జరిగింది. తారక్ యువకునిగా ఉన్నపుడు శ్రీరామకృష్ణుని సన్నిదికి చేరాడు. వివేకానంద స్వామితో సహా చాలామంది అలాగే వచ్చారు. తారక్ ఒక రోజున పంచవటిలో ధ్యాననిమగ్నుడై ఉన్నాడు.శ్రీరామకృష్ణులు ఆ దారిగా వెళుతూ తారక్ ను చూచి ఆగారు. వెంటనే తారక్‍కు ఒళ్లంతా కరింట్ షాక్ కొట్టినట్లుగా జలదరించి దు:ఖం పొర్లుకొచ్చి ధారగా ఏడుస్తున్నాడు అలా ఒక గంట సేపు గడిచాక శ్రీరామకృష్ణులు మౌనంగా అక్కడ నుంచి వెళ్లిపోయారు. ఆ రోజున తారక్‍కు చాలా అగాధమైన ధ్యానస్థితి కలిగింది. తరువాత చాలా సేపటికి ధ్యానం ముగించుకొని తారక్ శ్రీరామకృష్ణుల గదికి వచ్చి నమస్కరించి కూర్చున్నాడు. శ్రీరామకృష్ణులు ప్రేమగా ఆయనతో "చూడు తారక్. భగవంతుని స్మరిస్తున్నపుడు, ధ్యానంలోనూ. కన్నీరు ధారగా రావడం చాలా మంచి సూచన. దానివల్ల పూర్వ జన్మల పాపాలు కడిగివేయబడతాయి.అంతరంగం శుద్దమౌతుంది. అటువంటి వారిని భగవంతుడు అమితంగా ప్రేమిస్తాడు" అన్నారు.

అయితే అది బలవంతాన తెప్పించుకొని ఏడవడం కాకూడదు. కొందరు ఆడవారు ఇలా కూడా చేస్తారు. పాపం అది కూడా మంచిదే.

చైతన్య మహాప్రభు జీవితంలో ఒక సంఘటన జరిగింది. ఆయన భక్తులకు సంకీర్తనా సమయంలో పారవశ్య స్థితులు కలగటం,కళ్లవెంట నీళ్ళు ధారలు కట్టడం, సమాధి నిమగ్నత, దివ్య దర్శనాలు సర్వ సాధారణంగా ఉండేవి. కాని ఒకనికి మాత్రం కనీసం ఏడుపుకూడా వచ్చేది కాదు. అతను సిగ్గుతో "నేనెంత పాపాత్ముణ్ణై ఉండాలి? వీరందరికీ ఇటువంటి స్థితులు కలుగుతున్నాయి. నాకు ఏ అనుభూతీ కలగటం లేదు. ఇటువంటి మహనీయుని సమక్షంలో కూడా కరగని నా గుండె ఎంత రాతిబండో కదా" అనుకుని కన్నీరు రావడం కోసం కళ్లలో కారం పెట్టుకున్నాడు. అది చూచి చైతన్యమహాప్రభు ఆ భక్తుని కౌగలించుకొని "ఈ పని చెయ్యటానికి ఎంతటి మానసిక క్షోభ అనుబవించావో కదా నీవు. భగవంతునిపై నీ కెంతటి ప్రేమ లేకపోతే ఈ పని చేస్తావు?" అంటూ పారవశ్యంలో సమాధి స్థితిని పొందాడు.

ఇలా ఆలోచిస్తూ, ఏదో లోకంలో ఉన్నవాళ్ళలాగా అమ్మ ఆలయానికి దారి తీశాము. నా పరిస్థితి తెలుసు కనుక మా కుటుంబ సభ్యులూ, చరణూ, నన్ను పలుకరించకుండా మౌనంగా వాళ్ల లోకంలో వాళ్ళు ఉన్నారు.

(ఇంకా ఉంది)

read more " మా జిల్లెళ్ళమూడి యాత్ర-2 "

15, ఆగస్టు 2010, ఆదివారం

నిజమైన స్వాతంత్ర్యం

ఈ రోజుతో మనం స్వాతంత్ర్యాన్ని పొంది 63 ఏళ్ళు గడిచాయి. దేశానికి రాజకీయ స్వాతంత్ర్యం వచ్చింది. కాని ఎన్నోరకాలైన ఇతర స్వాతంత్ర్యాలు ఇంకా రాలేదు. ఇది లౌకికజీవిత నిజం.

అంతరిక జీవితంలో కూడా స్వాతంత్ర్యమే అత్యున్నత ఆదర్శం. దీన్నే ముక్తి లేదా మోక్షం అని మన ప్రాచీనులు చెప్పారు. ముక్తి గురించి తెలియాలంటే దేనిచేత బంధింపబడి ఉన్నామో ముందుగా తెలుసుకోవాలి. అప్పుడే ఆ బంధం నుంచి ముక్తి ఎలా సాధ్యమో తెలుసుకోవచ్చు. దానికి తగిన ప్రయత్నం చెయ్యవచ్చు.

బాహ్యంగా ప్రతివాడూ స్వతంత్రుడననే భావించవచ్చు గాక. కాని అంతరికముగా ప్రతివాడూ బానిసే. అతడు రాజు కావచ్చు. పేద కావచ్చు. విద్యావంతుడు కావచ్చు. నిరక్షరాస్యుడు కావచ్చు. ఉన్నత పదవులలో ఉండి భోగభాగ్యాల మధ్యన విలాస జీవితం గడిపేవాడు కావచ్చు. తిండికి లేక కటిక దరిద్రంలో బతుకు వెళ్ల దీస్తున్నవాడు కావచ్చు. వీరందరూ అంతరిక జీవితంలో కట్టు బానిసలే. గానుగెద్దులకూ వీరికీ ఏమీ భేదం లేదు.

ఏ విధంగా మనం బానిసలమో తెలుసుకుందామా?

మొదటి రకం: మనం ఎదుటివారి ఊహలకు బానిసలం. మన జీవితంలో ఎక్కువభాగం ఎదుటివారిని మెప్పించడానికే సరిపోతున్నది. మనం బట్టలు వేసుకొనేది మన కోసం కాదు. ఎదుటివారు ఏమైనా అనుకుంటారేమో అని మంచి బట్టలు ధరిస్తాం. ఎదుటివారి దృష్టిలో మంచిగా కనపడాలని లేని మంచిని నటిస్తాం. ఎదుటివాని హంగులు చూచి మనకు అవసరం లేకున్నా వాటిని అనుకరిస్తాం. వారివద్ద ఉన్న వస్తువులు మనమూ సంపాదించడానికి అమూల్య జీవితాన్ని, సమయాన్ని ఆహుతి చేసుకుంటాం. వారు అనే ఆహా ఓహో ల కోసం మన అమూల్యమైన జీవితాన్ని వృధా వ్యాపకాలలో వెచ్చిస్తున్నాం. ఎదుటివారికి గొప్ప ఉపన్యాసాలిచ్చి వారి మెచ్చుకోళ్ల కోసం అర్రులు చాస్తూ అదే గొప్ప పాండిత్యం అనుకుంటున్నాం. మనకేమి కావాలో మనకు తెలియదు. మన జీవితం ఎటుపోతున్నదో మనకు తెలియదు. ఎదుటివాని చేతిలో మనం కీలుబొమ్మలం. పరాయివారి మెప్పుకోసం బతికే జీతగాళ్లం. సమాజం చేతిలో మనం కీలుబొమ్మలం. ఇది స్వాతంత్ర్యం ఎలా అవుతుంది?

ఇక రెండవ రకం: మన ఇంద్రియాలకు మనం బానిసలం. పంచేద్రియాలు మన స్వాధీనం లో లేవు. వాటి ఆధీనంలో మనం ఉన్నాం. అవి చెప్పినట్లు మనం ఆడుతున్నాం. ఒక మంచి సుందరమైన దృశ్యమో, మనిషో కనిపిస్తె చూడకుండా ఉండలేం. మంచి మసాలా వాసన వస్తే నోటిలో నీళ్ళు మనకు తెలీకుండానే ఊరుతుంటాయి. ఒక వస్తువు కనిపిస్తే కొనకుండా ఉండలేము. ఆకలిని ఆపుకోలేము, దాహాన్ని ఆపుకోలేము. నిద్రను ఆపుకోలేము, కోరికలను ఆపుకోలేము. ఆవేశాలను ఆపుకోలేము. వెరసి మన ఇంద్రియాలకు మనం బానిసలం. అవి నడిపినట్లు మనం నడుస్తున్నాం. అవి ఈడ్చుకుపోయిన చోటికి మనం పోతున్నాం. ఇది స్వాతంత్ర్యం ఎలా అవుతుంది?

ఇక మూడవ రకం: మన మనస్సుకు మనం బానిసలం. మనస్సు మనం చెప్పినట్లుగా వినదు. అది చెప్పినట్లు మనం ఆడుతున్నాం. ఒక్క క్షణం కదలకుండా ఉండు అంటే ఆ క్షణంలోనే ఎక్కడలేని అనవసర విషయాలన్నీ నాకే కావాలి అంటుంది మనసు. ఆలోచన మనలను లాక్కుపోతున్నది కాని మనం ఆలోచనను నడిపించడం లేదు. మన ఆలోచనలు మన స్వాధీనంలో లేవు. మనసు మన స్వాధీనంలో లేదు. ఇది స్వాతంత్యం ఎలా అవుతుంది?

ఇక నాలుగవ రకం: మన అహానికి మనం బానిసలం. నేను ప్రతివానికన్నా భిన్నంగా కనపడాలి. నేను అందరికంటే అధికుణ్ణి. నేను అందరికంటే ముందుండాలి. నేను చెప్పినట్లు ఇతరులు వినాలి. నా ప్రత్యేకతను నేను కాపాడుకోవాలి. నేను సుఖంగా ఉండాలి. దానికోసం ఎందరు ఏమై పోయినా పరవాలేదు. నా పని నాకు ముఖ్యం. ఇలా నా, నా, నా అనుకుంటూ నా అహానికి నేను బానిసగా మిగులుతున్నాను. నా అహం తృప్తి పడటం కోసం నేను ఏపనైనా చేస్తున్నాను. జీవితమంతా దాస్యం చేయించుకున్న ఈ అహం మరణంలో ఏమౌతుంది. ఎక్కడికి పోతుంది. అన్న ఆలోచన మనకు రాదు. ఒక్కసారిగా పేలిపోయి అదృశ్యమై పోయే ఒక నీటి బుడగకోసం నా జీవితమంతా దానికి దాసోహం అంటూ ఊడిగం చేస్తున్నానా? నన్ను నేను తెలుసుకునే అవకాశం ఇచ్చిన ఈ జన్మను వృధాగా గడిపి పరీక్షలో ఓడిపోయినవానిగా నిష్క్రమిస్తున్నానా? ఏమిటీ విచిత్రం? ఏమిటీ బానిసత్వం? అన్న ఆలోచన మనకు రాదు.

మనకు స్వాతంత్ర్యం వచ్చిందా? ఎక్కడొచ్చింది? రాజకీయ స్వాతంత్ర్యం దేశానికి వచ్చి ఉండవచ్చు. సమాజాన్ని దోచుకునే వారికి వచ్చి ఉండవచ్చు. రాజకీయ స్వాతంత్ర్యం మన ఆశయం కాదు. మన జీవిత గమ్యం ఇది కాదు.

ఎదుటివారికీ, వారి ఆలోచనలకూ, నేను చేస్తున్న ఊడిగం నుంచి బయట పడినప్పుడే అది నిజమైన స్వాతంత్ర్యం.

నా ఆలోచనలకూ, నా అహానికీ కట్టుబడి ఉన్న నా బానిసత్వం నుండి నేను బయటపడి నప్పుడే నిజమైన స్వాతంత్ర్యం.

ఇంద్రియాలకూ, ప్రకృతికీ నేను చేస్తున్న ఊడిగం నుంచి నేను బయటపడినప్పుడే నిజమైన స్వాతంత్ర్యం.

ఇటువంటి స్వాతంత్ర్యాన్ని పొందటమే ముక్తి, అదే మోక్షం. ఈ ముక్తి అనేది ఎవరినుంచో నాకు వచ్చేది కాదు. నన్నెవరూ బంధించలేదు. ఇది నేను నా చుట్టూ నిర్మించుకున్న బోను. దీనినుంచి నేనే బయట పడాలి. ఇది నానుంచి నాకు మోక్షం. ప్రకృతినుంచి నాకు మోక్షం. జన్మ జన్మల నుంచీ నన్ను వెంటాడుతున్న సంస్కారాలనుంచి, కర్మ బంధాలనుంచి, జనన మరణాలనుంచి నాకు కలిగే మోక్షం.

ఇటువంటి స్వాతంత్ర్యమే యోగులకు అభిమతం. దీనికి తక్కువ దైన ఏ స్వాతంత్ర్యమైనా వారికి అవసరం లేదు. దానిని వారు ఉత్తమమైన స్వాతంత్ర్యంగా పరిగణించరు.

దీనిని పొందాలంటే అచంచలమైన, అకుంఠితమైన దీక్ష కావాలి. సాధన కావాలి. నాయమాత్మా బలహీనేన లభ్య: ఆత్మానుభవం బలహీనులకు లభించదు అన్న ఉపనిషద్వాణి మనలను తట్టి లేపటం లేదా? మన పూర్వీకులైన మహర్షుల ఉత్తేజపూరిత సందేశాన్ని మనం వినలేక పోతున్నామా? చేతకాని వాళ్లలా జీవితాన్ని ముగించడం అభిలషణీయమేనా?

మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 63 ఏళ్ళు అయింది అంటున్నాం. ఎన్ని వేల జన్మల నుంచి మన ప్రయాణం సాగుతున్నదో మనకు తెలుసా? ఎన్ని కాలాలలో, ఎన్ని దేశాలలో, ఎన్ని ప్రాంతాలలో, ఎన్ని వేషాలు ఇప్ప’టికి ఈ జీవుడు వేశాడో మనకు తెలుసా? స్వాతంత్ర్యం రాకుండా ఎన్ని వేల సంవత్సరాలు గడిచాయో మనకు జ్ఞాపకం ఉన్నదా?

ఆలోచించండి. మన పూర్వీకులైన మహర్షులు మనలను చూచి ఇటువంటివారా మా వారసులు" అని సిగ్గుపడుతున్నారు గమనించండి. సాధనా పరులు కండి. మహత్తరమైన యోగాన్ని అనుష్టించండి. జన్మ జన్మల కర్మ బందాల నుంచి విముక్తి కలిగించే భరతదేశపు దివ్యసంపద అయిన యోగాన్ని ఈ రోజునుంచే ప్రారంభించండి.

అప్పుడే స్వాతంత్ర్య దినోత్సవం నిజంగా జరుపుకున్నట్లు లెక్క. లేకపోతే అన్ని పార్టీల లాగే ఇదీ ఒక పార్టీ. ఒక గెట్ టుగెదర్. అంతే.

read more " నిజమైన స్వాతంత్ర్యం "

4, ఆగస్టు 2010, బుధవారం

చెడు రోజులు

ప్రస్తుతం కుజ శనుల కలయిక వల్ల జరుగుతున్న దుష్ఫలితాలు చూస్తున్నారు కదా. ప్రపంచ వ్యాప్తంగా ఉన్నట్లుండిఅనేక హింసాత్మక సంఘటనలు, ఉత్పాతాలు, రక్తపాతాలు జరుగుతున్నాయి.

ఎలక్త్రికల్ ఎలక్ట్రానిక్ పరికరాలు రిపేర్ వస్తాయి అని ముందుగానే వ్రాశాను. అలాగే జరుగబోతున్నది.

ఇప్పుడు పులిమీద పుట్ర లాగా ఇంకొక చెడు సూచన ముందున్నది.

శుక్రుడు 8-8-2010 తేదీన శనితొ సరిగ్గా డిగ్రీ కలయికలోకి వస్తున్నాడు.9-8-2010 అమావాస్య వస్తున్నది. కనుకమళ్ళీ చెడుకాలం సూచితం అవుతున్నది. అప్పటినుంచి 20-8-2010 వరకు శుక్రుడు- శని,కుజుల మధ్యన బందీ అవుతాడు. దీనిని జ్యోతిష పరిభాషలో పాపార్గళం అంటారు. పైగా కన్యారాశి లో శుక్రునకు నీచ స్థితి గా ఉంటుంది. అమావాస్య రోజుకు ముందుగానే, అనగా రేపటినుంచే సూచనా సంఘటనలు మొదలు అవుతాయి. గమనించండి.

వీటి ఫలితాలు ఎలా ఉంటాయి?

స్త్రీలు, విలాస భవనాలు, విలాస వంతమైన వస్తువులు మరియు వాహనాలు, సినిమా రంగం, జలప్రవాహాలు, షేర్ మార్కట్, వెండి బంగారాలు మొదలైనవి శుక్రుని అధీనం లో ఉంటాయి. కనుక ఆయా రంగాలలో చెడు సంఘటనలు తప్పక జరుగుతాయి.

స్త్రీల హత్యలు, ఆత్మ హత్యలు, ఆడపిల్లల కిడ్నాపులు, స్త్రీలకు ఒళ్ళు కాలడం, విలాస భవనాలు పడిపోవడాలు, విలువైన వస్తువులు నాశనం కావడం, వాహనాలు ధ్వంసం కావడం, సినిమా (కళా) రంగంలో ప్రముఖుల మరణం, సినీ, నాటక, కళా రంగాలలో ఉన్నవారికి ప్రమాదాలు జరగటం, జల ప్రమాదాలు ఉప్పెనలు, వంతెనలు తెగటం, షేర్ మార్కెట్ పతనం, బంగారం వెండి ధరలు తగ్గటం మొదలైన సంఘటనలు జరుగుతాయి. బాంబు దాడులలో విలాసయుతమైన భవనాలు ధ్వంసం కావటం జరుగవచ్చు. ఈ సంఘటన వెనుక ఉగ్రవాదుల కుట్ర ఉండవచ్చు. ఈ మూడుగ్రహాల కలయిక దక్షిణాన్ని సూచించే కన్యలో జరుగుతున్నందున ఈ ఘటనలు కూడా ఆ దిక్కుననే ఎక్కువగా జరుగవచ్చు. లేదా శుక్రుని దిక్కు అయిన ఆగ్నేయం లో జరుగుతాయి.

చెడుకాలంలో దైవ స్మరణే ఉపాయం. తెలివైన వారు ఆ పని చేస్తూ సాహస కార్యాలకు దూరంగా ఉండి జాగరూకతతో ప్రమాదాలనుంచి తప్పుకోవచ్చు.
read more " చెడు రోజులు "