“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

21, ఆగస్టు 2010, శనివారం

మా జిల్లెళ్ళమూడి యాత్ర-2

ఏడో మైలురాయి దగ్గర ఆర్చ్ పడిపోయి ఉంది. పనివాళ్లు కొందరు ఆ పనిలో ఉన్నారు. వానపడి ఉందేమో ఆప్రాంతం అంతా బురదగా ఉంది.

"ఆ రోజుల్లో ఇక్కడ రెండు కుక్కలు ఎప్పుడూ కాపలా ఉండెవి అన్నగారూ. వాటి పేరు రాముడు, భీముడు.ఎవరైనా భక్తులుఇక్కడ బస్సుదిగి అర్ధ రాత్రో అపరాత్రో నడుచుకుంటూ జిల్లెళ్లమూడికి వస్తుంటె అవి తోడుగా ఊరివరకూ వచ్చి వారినిదిగబెట్టి మళ్ళీ వెనక్కు వచ్చి ఏడో మైలు రాయివద్ద కాపలాగా ఉండేవి. అవి ఎవరో, ఏ పుణ్య జీవులో, వాటికిఅమ్మకు ఏం బంధం ఉండేదో? వాటి జీవితాంతం అలా భక్తులకు సేవలందించాయి." అన్నాడు చరణ్. చరణ్‍కు ఇలాటి సంఘటనలు ఎన్నో తెలుసు. గంటలు గంటలు అలా చెబుతూనే ఉంటాడు.

నాకు వెంటనే శ్రీరామకృష్ణుని శిష్యుడైన స్వామి అద్భుతానంద జీవితంలో ఒక ఘట్టం మదిలో తళుక్కుమని మెరిసింది. శ్రీరామకృష్ణుల కాలంలో పంచవటి ఒక దట్టమైన అడవి. ఆ అడవి పక్కనే ఆనుకొని గంగానది ప్రవహిస్తూ ఉండేది.అక్కడఉన్న వటవృక్షం దగ్గర రాత్రుళ్ళు ధ్యానం చెయ్యమని శ్రీరామకృష్ణులు తన అంతరంగ శిష్యులను పంపేవారు. ఒక్కొక్కరికిఒక్కొక్క విధమైన ధ్యాన విధానాలు చెప్పి పంపేవారు. స్వామి అద్భుతానంద పేరు అప్పట్లో లాటూ అని ఉండేది. ఒకరోజునలాటూ అర్ధరాత్రి సమయంలో పంచవటిలో వటవృక్షం క్రింద ధ్యానంలో నిమగ్నుడై ఉన్నాడు. దాదాపు అయిదారు గంటలపాటు అనగా దాదాపుగా తెలతెలవారేవరకు అలా ఆయన ధ్యానంలో ఉన్నాడు. అంతసేపూ ఆయనకు కొద్ది దూరంలోనాలుగు కుక్కలు కాపలాగా మౌనంగా కూర్చోని ఉన్నాయి. అవికూడా ధ్యానంలో ఉన్నట్లు మౌనంగా కిక్కురుమనకుండాఉన్నాయి. శ్రీరామకృష్ణులు అది చూచారు. తెల్లవారిన తరువాత తన ప్రియశిష్యుని ప్రేమగా చూస్తూ, " లాటూకు ధ్యానభంగం కలుగకుండా భైరవుడు కాపలాగా ఉన్నాడు". అన్నారు.పంచవటిలోని వటవృక్షం మీద ఒక భైరవుడుఉండేవాడు. ఆయన దర్శనం తొతాపురికి కలిగింది. దత్తాత్రేయుని కాళ్లవద్ద కూడా నాలుగు కుక్కలుంటాయి. అవి నాలుగు వేదాలని అంటారు.

శరణాగత భావంతో భగవంతుని చేరాలని ప్రయత్నించేవారికి, తీవ్ర ధ్యాన సాధకులకు, ప్రకృతి శక్తులు, జంతువులు, సాయపడటం నిజమే. నా అనుభవంలో ఇది చాలా సార్లు నేనూ గమనించాను.

కారు జిల్లెళ్లమూడిలోకి ప్రవేశించి అమ్మగారి ఇంటి ఆవరణలోకి తిరిగింది. ముఖద్వారం ఆర్చి మీద పేరు చూచి పిల్లలు ఆశ్చర్యపోయారు. కారణం? దానిపైన ఇతర ఆశ్రమాలవలె రకరకాలైన పేరులు లేవు. "అందరిల్లు" అని సింపుల్ గా ఆర్చిమీద వ్రాసి ఉండటమే దానికి కారణం. అలా వ్రాసి ఉందేమిటి అని వారికి సందేహం వచ్చింది. నేను నవ్విఊరుకున్నాను. చరణ్ కూడా మాట్లాడలేదు.

అందరం దిగి ఆశ్రమంలో షెడ్డు దగ్గర ఆగాము. నా చిన్నప్పుడు అమ్మగారి దర్శనం చేసుకున్న రోజు గుర్తొచ్చింది. అదిబహుశా 1976 కావచ్చు. నేను తొమ్మిదో తరగతి చదువుతున్నాను. కొందరు మా పెద్దవాళ్లతో కలసి అమ్మగారి దర్శనానికి నేనూ వెళ్లాను. అమ్మగారు స్టేజి మీద ఇప్పుడున్న పెద్ద పొటోప్రాంతంలో ఒక పెద్ద కుర్చీలో కూర్చొని ఉన్నారు. దాదాపు ఒక రెండువందలమంది దూరంగా నిలబడి ఉన్నాము.మేమూ వారిలో ఉండి చూస్తున్నాము. మౌనంగా అందరినీ చూస్తున్నారు.ఆ చూపు ఇంకా నాకు గుర్తుంది. పూర్తిగా నిరామయంగా ఉంది ఆ చూపు. ఒక గాలి తెమ్మెర మాదిరి అందరినీ అలా స్పృశిస్తూ వెళ్ళిపోయింది.ఎవరినీ ప్రత్యేకంగా చూస్తున్నట్లుగా లేదు.కాని మా వద్దకు వచ్చినపుడు ఆ దృష్టి ఒక్క సెకను అలా ఆగినట్లు అనిపించింది. అది నా భ్రమ అయి ఉండవచ్చు అనుకున్నాను. 


జిల్లెళ్లమూడిలో అదే ప్రదేశంలో మళ్ళీ నిలబడి చూచాను. అదే సంఘటన నా కళ్లముందు మళ్ళీ ఆవిష్కృతమైంది. అప్పుడు జనంతో కిటకిట లాడేది. ప్రస్తుతం స్టేజి ఖాళీగా ఉంది. జిళ్లెళ్లమూడి కెళితే నన్ను నేను చాలా నిగ్రహించుకోవలసి వస్తుంది. కళ్ళు ధారాపాతం గా వర్షిస్తాయి. ఇది ఎందుకో నాకెప్పుడూ అర్ధంకాదు. చరణ్ పరిస్థితీ అదే. అక్కడి వాళ్లకు ఇలాటి సీన్లు మామూలే గనుక వాళ్లు పట్టించుకోరు.

అవ్యాజమైన మాతృప్రేమ అక్కడ వాతావరణంలో గూడుకట్టుకుని ఉండటం కొద్దిగా సేన్సిటివిటి ఉన్నవాళ్ళకు వెంటనే అనుభవంలోకి వస్తుంది. ఎల్లలు లేని, తప్పులు చూడని, కారణాలు అడగని మహా ప్రేమ అది. ఒక వరద లాగా అది మనల్ని ముంచెత్తుతుంది. జన్మ జన్మల మన తప్పొప్పులు మొత్తం తెలిసి కూడా వాటిని అస్సలు లెక్కించకుండా, పట్టించుకోకుండా అవ్యాజమైన మాతృప్రేమను నిష్కారణంగా మనపైన వర్షిస్తుంది. అటువంటి ప్రేమముందు కరగని రాతిగుండె ఉంటుందా?

"మిమ్మల్నందరినీ నేనే కని మీ తల్లులకు పెంచమని ఇచ్చానురా". అని అమ్మగారు అనేవారు. ఏమి ప్రేమ? అటువంటి ప్రేమతత్వాన్ని మళ్లీ శారదామాతలోనే చూస్తాము. మానవులు, యోగులు, ఋషులు, దేవతలు, పశు పక్ష్యాదులు, కీటకాలతో సహా సర్వంసృష్టి మొత్తం నా సంతానమే అని చెప్పిన ఆ ఆధ్యాత్మిక స్థాయి ప్రపంచమంతా వెతికినా ఇంకెక్కడా కనిపించదు. ఎవరిలోనూ చూడలేము.

ఆ రోజులలో అమ్మగారిని ఒకరు అడిగారట.

అమ్మా నీవు బ్రాహ్మణ కుటుంబంలో పుట్టికూడా కులాలు పాటించవెందుకూ? అని.

"గుణభేదమే లేని నాకు కులభేదమేమిటి నాన్నా?" అని అమ్మ సమాధానం.

"శుక్ల శోణితాలదే కులమో అందరిదీ అదేకులం" అన్నది అమ్మ. ఇక దానికి జవాబేముంది?

అక్కడకు వచ్చిన వారిలో చాలామంది అమ్మ సమక్షంలోకి రాగానే ధారాపాతంగా ఏడ్చేవారు.అమ్మ మౌనంగా చూస్తూ ఉండేది. "ఎందుకమ్మా వాళ్ళు అలా నిష్కారణంగా ఎక్కిళ్ళు పెట్టి ఏడుస్తున్నారు? "అని పక్కన ఉన్నవారు అడిగితే నవ్వి " వాళ్ళు ఏడవటానికే వచ్చారురా ఏడవనివ్వు" అనేది కాని కారణాలు చెప్పేది కాదు.

శ్రీరామకృష్ణుని ప్రత్యక్ష శిష్యులూ నాకు పరమ గురువులూ అయిన స్వామి శివానంద మహరాజ్ గారి జీవితంలో (అప్పట్లో ఆయన పేరు తారక్) ఒకసారి ఇలాటి సన్నివేశం జరిగింది. తారక్ యువకునిగా ఉన్నపుడు శ్రీరామకృష్ణుని సన్నిదికి చేరాడు. వివేకానంద స్వామితో సహా చాలామంది అలాగే వచ్చారు. తారక్ ఒక రోజున పంచవటిలో ధ్యాననిమగ్నుడై ఉన్నాడు.శ్రీరామకృష్ణులు ఆ దారిగా వెళుతూ తారక్ ను చూచి ఆగారు. వెంటనే తారక్‍కు ఒళ్లంతా కరింట్ షాక్ కొట్టినట్లుగా జలదరించి దు:ఖం పొర్లుకొచ్చి ధారగా ఏడుస్తున్నాడు అలా ఒక గంట సేపు గడిచాక శ్రీరామకృష్ణులు మౌనంగా అక్కడ నుంచి వెళ్లిపోయారు. ఆ రోజున తారక్‍కు చాలా అగాధమైన ధ్యానస్థితి కలిగింది. తరువాత చాలా సేపటికి ధ్యానం ముగించుకొని తారక్ శ్రీరామకృష్ణుల గదికి వచ్చి నమస్కరించి కూర్చున్నాడు. శ్రీరామకృష్ణులు ప్రేమగా ఆయనతో "చూడు తారక్. భగవంతుని స్మరిస్తున్నపుడు, ధ్యానంలోనూ. కన్నీరు ధారగా రావడం చాలా మంచి సూచన. దానివల్ల పూర్వ జన్మల పాపాలు కడిగివేయబడతాయి.అంతరంగం శుద్దమౌతుంది. అటువంటి వారిని భగవంతుడు అమితంగా ప్రేమిస్తాడు" అన్నారు.

అయితే అది బలవంతాన తెప్పించుకొని ఏడవడం కాకూడదు. కొందరు ఆడవారు ఇలా కూడా చేస్తారు. పాపం అది కూడా మంచిదే.

చైతన్య మహాప్రభు జీవితంలో ఒక సంఘటన జరిగింది. ఆయన భక్తులకు సంకీర్తనా సమయంలో పారవశ్య స్థితులు కలగటం,కళ్లవెంట నీళ్ళు ధారలు కట్టడం, సమాధి నిమగ్నత, దివ్య దర్శనాలు సర్వ సాధారణంగా ఉండేవి. కాని ఒకనికి మాత్రం కనీసం ఏడుపుకూడా వచ్చేది కాదు. అతను సిగ్గుతో "నేనెంత పాపాత్ముణ్ణై ఉండాలి? వీరందరికీ ఇటువంటి స్థితులు కలుగుతున్నాయి. నాకు ఏ అనుభూతీ కలగటం లేదు. ఇటువంటి మహనీయుని సమక్షంలో కూడా కరగని నా గుండె ఎంత రాతిబండో కదా" అనుకుని కన్నీరు రావడం కోసం కళ్లలో కారం పెట్టుకున్నాడు. అది చూచి చైతన్యమహాప్రభు ఆ భక్తుని కౌగలించుకొని "ఈ పని చెయ్యటానికి ఎంతటి మానసిక క్షోభ అనుబవించావో కదా నీవు. భగవంతునిపై నీ కెంతటి ప్రేమ లేకపోతే ఈ పని చేస్తావు?" అంటూ పారవశ్యంలో సమాధి స్థితిని పొందాడు.

ఇలా ఆలోచిస్తూ, ఏదో లోకంలో ఉన్నవాళ్ళలాగా అమ్మ ఆలయానికి దారి తీశాము. నా పరిస్థితి తెలుసు కనుక మా కుటుంబ సభ్యులూ, చరణూ, నన్ను పలుకరించకుండా మౌనంగా వాళ్ల లోకంలో వాళ్ళు ఉన్నారు.

(ఇంకా ఉంది)