“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

22, జులై 2013, సోమవారం

కల్యాణానంద భారతీస్వామి స్మృతులు- 10 (యక్షప్రశ్నలు-ఆఖరిభాగం)

'సరేనండి.మీ సమయం చాలా వృధా అయింది ఈరోజు' అన్నాడాయన తనుకూడా లేస్తూ.

ఒక్కసారి ఆయనవైపు చూచాను.

'వృధా అవుతోంది అనుకుంటే అసలిక్కడ కూచునేవాడినే కాను.మంచి విషయాలు మాట్లాడుకున్న సమయం వృధా ఎలా అవుతుంది?పైగా మీరు స్వచ్చమైన బ్రాహ్మణులనిపించారు.'అన్నాను.

'ఎందుకని అలా అన్నారు?'అడిగాడు నవ్వుతూ.

'అంతేమరి.మిగతా అందరిలాగా మీరుకూడా రియల్ ఎస్టేట్ గురించీ,పైరవీల గురించీ,తెల్లవారేసరికి ఎవర్ని ఎలా ముంచి కోట్లు సంపాదించాలి అన్న విషయం గురించీ,మన కులంవాడు ఏ పదవిలో ఉన్నాడు వాడిని ఎలా పట్టుకుని అడ్డమైన మన పనులన్నీ ఎలా చేయించుకోవాలి అన్న విషయం గురించీ,కుళ్ళు రాజకీయాల గురించీ ఒక్కసారి కూడా మాట్లాడలేదు కదా. పూర్తిగా స్వచ్చమైన ఆధ్యాత్మికం గురించే మీరు మాట్లాడారు.విన్నారు.కనుక మీరు నిజమైన బ్రాహ్మణులే సందేహం లేదు.' అన్నాను నవ్వుతూ.

ఆయన కూడా నవ్వేశాడు.

'ఎంత సంపాదించినా చివరికి ఏముంది శర్మగారు?మనశ్శాంతిగా బ్రతకడమేగా ప్రధానం.ఉంటానికీ తింటానికీ ఉన్నది.ఆరోగ్యం బాగానే ఉన్నది.బాధ్యతలు లేవు.ఇంకేంకావాలి చెప్పండి.తను నాకంటే ముందుగానే అమ్మను చేరుకుంది.శ్రీమాతను ధ్యానిస్తూ అమ్మనుంచి పిలుపుకోసం ఎదురుచూస్తూ నేనిలా కాలం వెళ్ళదీస్తున్నాను.ఈ జన్మకి ఇది చాలు.నేను తృప్తిగా హాయిగా ఉన్నాను.' అన్నాడాయన.

మౌనంగా తల పంకించాను.

'మనదేశపు నిజమైన సంపద ఇదేనండి.ఈ తృప్తి ఎంత ధనం సంపాదించినా రాదు.ఆత్మానందమే నిజమైన ఆనందం అని చెప్పిన ఘనత ఈ దేశపు సొంతం.ఇలా శ్రీవిద్య గురించి మాట్లాడుకుంటూ కూచుంటే తెల్లవారుతుంది కాని మన చర్చ అయిపోదు.ఇందులో విషయం అంత ఉన్నది.ఆ సంగతి అలా ఉంచండి. బయలుదేరే ముందు, నన్ను ఎప్పటినుంచో వేధిస్తున్న కొన్ని ప్రశ్నలు అడుగుతాను.మీకు తెలిస్తే చెప్పండి.లేదంటే ఆలోచించి మళ్ళీ ఈసారి నేను వచ్చినపుడు చెప్పగలరా?' అడిగాను.

'ప్రయత్నిస్తాను.అయినా మీకు కూడా సందేహాలున్నవా?' అడిగాడాయన.

'భలేవారే.నేనేమీ సర్వజ్నుడిని కాను.నాకు తెలియని విషయాలు ఎన్నో ఉన్నాయి.ఈ సందర్భంలో శ్రీరామక్రిష్ణులు ఎప్పుడూ అనేమాట ఒకటి గుర్తుకు వస్తున్నది.As long as I live,so long do I learn' అని ఆయన తరచుగా అనేవారు.అంతటి మహనీయుడే ఆమాట అంటే ఇక మనమెంత?మన జ్ఞానమెంత? సరేగాని సందేహాలు వినండి.'

 • బిందువు శివుడని తంత్రాలలో కొన్నిచోట్ల ఉన్నది.అదే బిందువు లలితా పరమేశ్వరి అనికూడా తంత్రాలలో కొన్నిచోట్ల ఉన్నది.ఏది కరెక్ట్? ఇద్దరూ ఒకటే అనిమాత్రం నాకు చెప్పకండి.ఆ విషయం నాకు తెలుసు.ఇద్దరూ ఒకటే అయితే ఒకచోట ఒకరనీ ఇంకొకచోట ఇంకొకరనీ ఎందుకు చెప్పబడింది?
 • శ్రీచక్రం గీచే విధానం ఒక్కొక్కచోట ఒక్కొక్క విధంగా ఉన్నది.ఆయా చక్రాలలో రేఖలూ కోణాలూ తేడాలుగా ఉంటాయి.ఈ తేడాలు ఎందుకు వచ్చాయి?
 • సృష్టి సంహార చక్రాల భావనలో ఆకారాలలో రకరకాల భేదాలు ఎందుకు వచ్చాయి?వాటి అర్ధాలు ఏమిటి?త్రికోణాలు ఉండే తీరునుబట్టి కొందరు ఈ భేదాలు గ్రహిస్తారు.చక్రాన్ని గీచే తీరును బట్టి ఇంకొందరు ఈ భేదాన్ని గ్రహిస్తారు.వీటిలో ఏది నిజం?
 • యోగసంప్రదాయంలో స్వాదిష్టానం జలతత్వం అంటారు.శంకరులు సౌందర్య లహరిలో 'మహీం మూలాధారే కమపి మణిపురే..'అన్న శ్లోకంలో 'హుతవహం స్థితం స్వాధిష్టానే',-- అంటే స్వాధిష్టానం అగ్నితత్వం అన్నారు.ఈ రెంటిలో ఏది కరెక్ట్? ఈ భేదం ఎందుచేత వచ్చింది?మహాద్వైతి అయిన శంకరులకు యోగసంప్రదాయం తెలియదని అనుకోలేము.మరి యోగులకు శ్రీవిద్యా సాంప్రదాయం తెలియదని అనుకోవాలా?
 • శ్రీవిద్యకు ఆదిగురువు మన్మధుడని హయగ్రీవుడని దక్షిణామూర్తి అని రకరకాల పుస్తకాలలో రకరకాలుగా చెబుతారు.ఏది సరైనది?
 • పరశురామ కల్పసూత్రం చెప్పిన పరశురాముణ్ణి శ్రీవిద్యా ప్రవర్తకులైన పన్నెండుమందిలో ఒకనిగా ఎందుకు లెక్కించలేదు?అంటే కల్పసూత్రం నిజమైనది కాదా?కాని దానిని చదివితే అలా అనిపించదు. పరశురాముడు అవతారమూర్తి కూడా అయ్యాడు.మరి ఆయన్ను శ్రీవిద్యోపాసకులలో ఎందుకు చేర్చలేదు?
 • శ్రీచక్రదళాలలో బీజాక్షరాలు ఉండాలని కొందరూ,ఉండకూడదని కొందరూ అంటారు.ఉంటే ఏమిటి? ఉండకపోతే ఏమిటి?ఈ భేదాలు ఎందుచేత వచ్చాయి?
 • ఒకటే అయిన శ్రీవిద్యా సాంప్రదాయంలో గురువుకూ గురువుకూ భిన్న పద్ధతులు ఎందుకు ఉన్నాయి? వీరిలో ఎవరు సరియైనవారు? ఎవరు కాదు?
 • అన్ని కులాలవారికీ వర్ణాలవారికీ తంత్రాన్ని ఉపదేశం చెయ్యవచ్చు కదా. వేదాధ్యయనార్హత అందరికీ లేదు గనుకనే తంత్రములు అందుకోసం అందరి కోసం పుట్టాయి.మరి శ్రీవిద్యాతంత్రాన్ని కూడా మళ్ళీ కులాలవారీగా ఎవరు విభజించారు?ఎందుకు విభజించారు?
 • పంచదశీ షోడశీ మంత్రాలను కులంతో సంబంధం లేకుండా అందరికీ ఉపదేశం ఇవ్వవచ్చునా? ఇవ్వకూడదా? దీనికి ఏదైనా మూలప్రమాణం ఉన్నదా?
 • షోడశీ మంత్రంలో చివరలో చేర్చే పదహారవ బీజాక్షరంలో సంప్రదాయాన్ని అనుసరించి భేదాలున్నాయి కదా?ఈ భేదాలు ఎందుకు వచ్చాయి?వీటిలో ఏది సరియైనది?
 • షోడశీమంత్రమే భోగాన్నీ మోక్షాన్నీ రెంటినీ ఇవ్వగలిగి ఉండగా అది చాలక మళ్ళీ మహాషోడశి అనీ,మహావిద్య అనీ,శుద్ధ విద్య అనీ రకరకాల మంత్రాలను సంపుటీకరించి ఎందుకు తయారు చెయ్యవలసి వచ్చింది? ఈ పని చేసినది ఎవరు?
 • బాలా మంత్రాన్ని ఉపాసించి తరించినవారు ఎందఱో ఉన్నారు.అలాగే మహాషోడశీ మంత్రాన్ని ఏళ్ల తరబడి జపిస్తున్నా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లూ ఉన్నారు కొందరు.దీనికి కారణం ఏమిటి?
 • క్షుద్ర లోహాలనుంచి బంగారాన్ని తయారు చేసే రసవాద రహస్యాలు శ్రీచక్రంలో నిగూడంగా దాగి ఉన్నాయని అవి మహామంత్రవేత్తలకు మాత్రమె తెలుస్తాయనీ కొందరి నుంచి నేను విన్నాను.అవి మీకు తెలుసా?అలా తయారు చేద్దామని నాకేమీ కుతూహలం లేదు.ఊరకే జిజ్ఞాస కొద్దీ అడుగుతున్నాను.

ఇంకా చాలా సందేహాలు నాకున్నాయి.ప్రస్తుతానికి వీటికి మాత్రం జవాబులు మీకుతెలిస్తే నేను మళ్ళీ వచ్చినపుడు చెప్పండి.మరి నేను వెళ్ళి వస్తాను.' అంటూ లేచి బయటకు వచ్చాను.

'సరేనండి.మంచిది.మళ్ళీ కలుద్దాం' అన్నాడాయన నమస్కారం పెడుతూ.

నేనూ ఆయనకు ప్రతినమస్కారం చేసి బయలుదేరాను.

మెయిన్ రోడ్డును కలిపే ఆ సందులో అక్కడక్కడా మాత్రమే దీపాలు వెలుగుతూ కొంత చీకటీ కొంత వెలుతురూ ప్రసరిస్తూ జీవితంలోని వెలుగుచీకట్లను గుర్తుకు తెస్తున్నాయి.వీధుల్లో జనసంచారం బాగా తగ్గింది. దూరంగా మెయిన్ రోడ్డులో మాత్రం వాహనాలు తిరుగుతూ కనిపిస్తున్నాయి. ఆ వీధంతా నిర్మానుష్యంగా ఉన్నది.మెయిన్ రోడ్ నుంచి ఆటో పట్టుకుని రైల్వే స్టేషన్ చేరాలి.అక్కడేదో రైలెక్కి గుంటూరు చేరుకోవాలి.

అప్పటివరకూ మాట్లాడిన విషయాలు మనసులో తిరుగుతున్నాయి. సాలోచనగా పరిసరాలను గమనిస్తూ మెయిన్ రోడ్ వైపు అడుగులు వేస్తూ తలెత్తి చీకటితో నిండిన ఆకాశం వైపు చూచాను.

నల్లటి ఆకాశంలోనుంచి జగజ్జనని ప్రసన్నవదనంతో నవ్వుతూ నన్ను చూస్తునట్లుగా అనిపించింది.

(అయిపోయింది)
read more " కల్యాణానంద భారతీస్వామి స్మృతులు- 10 (యక్షప్రశ్నలు-ఆఖరిభాగం) "

20, జులై 2013, శనివారం

కల్యాణానంద భారతీస్వామి స్మృతులు- 9 (అసలైన శ్రీవిద్య)

'అసలైన శ్రీవిద్య అంటే శివశక్తి తత్వాలను ఆమూలాగ్రం అర్ధం చేసుకుని వాటిలో అనుభవ పూర్వకమైన సిద్ధిని పొందటమే అని మీరు చెప్పిన భావన బాగుంది. దీనిమీద ఇంకొంచం చెప్పగలరా?' అడిగాడాయన.

ఇందాక ప్రతిదానికీ ప్రమాణాలు అడగవద్దని అన్నందుకు ఇలా మార్చి అడుగుతున్నాడని నాకర్ధమైంది.

సరే వినండి.శ్రీచక్రంలో శివునీ శక్తినీ సూచించే త్రికోణాలు ఉన్నాయికదా. అందు శక్తికోణాలు అయిదు,శివకోణాలు నాలుగు.వెరసి నవ త్రికోణాత్మకమైనదే శ్రీచక్రం.లలితాత్రిశతి ఉత్తరపీఠికలో ఈవివరం అంతా ఉంటుంది.మీరు చాలాసార్లు దానిని చదివే ఉంటారు. ఆదిశంకరులు త్రిశతీభాష్యం వ్రాశారు.అంటే ఆ స్తోత్రానికి ఆయన ఎంతటి విలువను ఇచ్చారో గ్రహించవచ్చు.ఆ స్తోత్రానికి అంతటి మహత్యం ఎందుకు వచ్చిందంటే అందులో పంచదశీ మంత్రం ఇమిడి ఉన్నది.దానిని పారాయణ చేస్తే పంచదశీ మంత్రాన్ని జపించినట్లే.దాదాపుగా ఈ స్తోత్రం చెప్పిన భావాలనే భైరవయామళతంత్రం కూడా వివరించింది.

చతుర్భిశ్శివ చక్రైశ్చ శక్తిచక్రైశ్చ పంచభి:
నవచక్రైస్తు సంసిద్ధం శ్రీచక్రం శివయోర్వపు:

అనేది అందరికీ తెలిసిన ప్రసిద్ధశ్లోకం.శక్తిచక్రాన్ని సృష్టిచక్రం అంటారు. శివచక్రాన్ని సంహారచక్రం అంటారు.సంహారచక్రాన్ని అందరూ ఉపాసించలేరు. శుద్ధ జ్ఞానాభిలాషులు మాత్రమె దానిని ఉపాసించగలరు.భోగాన్నీ మోక్షాన్నీ కూడా కోరుకునేవారు సృష్టిచక్రాన్ని ఉపాసిస్తారు.ఇదిగాక స్తితిచక్రమని ఇంకొక విధానం కూడా ఉన్నప్పటికీ అది ఆచరణలో పెద్దగా కనిపించదు.

బిందు త్రికోణ వసుకోణ దశారయుగ్మ 
మన్వస్రనాగదళ సంయుత షోడశారం 
వృత్త త్రయం చ ధరణీసదన త్రయం చ 
శ్రీచక్రమేత దుదితం పరదేవతాయా:

అన్న ఇంకొక ప్రసిద్ధశ్లోకం మీకు తెలిసినదే కదా?

బిందువునుంచి భూపురత్రయం వరకూ శ్రీచక్రంలో తొమ్మిదిభాగము లున్నాయి. వీటికి మళ్ళీ శివశక్త్యాత్మకములుగా విభజన ఉన్నది ఆ సంగతి కూడా మీకు తెలిసే ఉంటుంది.

త్రిశతి నుంచి దీనికి ప్రమాణం వినండి.

త్రికోణ మష్టకోణం చ దశకోణ ద్వయం తధా
చతుర్దశారం చైతాని శక్తిచక్రాణి పంచవై
బిందుశ్చాష్టదళ పద్మం పద్మం షోడశ పత్రకం
చతురశ్రం చ చత్వారి శివచక్రాన్యనుక్రమాత్

త్రికోణం-1,అష్టకోణం-1,దశకోణములు-2,చతుర్దశారం-1ఈఅయిదూ కలసి శక్తి చక్రములు.బిందువు-1,అష్టదళపద్మము-1,షోడశదళపద్మము-1, చతురశ్రము-1ఈనాలుగూ శైవచక్రములు.

ఇక్కడ ఒక ముఖ్యమైన రహస్యం కూడా చెప్పబడింది.శివశక్తి చక్రముల పరస్పర అవినాభావసంబంధాన్ని ఎవడైతే బాగుగా గ్రహించాడో వాడే చక్రవిదుడు.అనగా శ్రీచక్రరహస్యమును తెలిసికొన్నవాడు.ఇందాక నేను చెప్పిన విషయం ఇదే.దీనికి ప్రమాణం తంత్రములలో చాలాచోట్ల ఉన్నది.కాని అందరికీ తెలిసిన లలితాత్రిశతినుంచే మీకు నిదర్శనం చూపిస్తున్నాను.ఆ శ్లోకం వినండి.

శైవానామపి శాక్తానాం చక్రాణాం చ పరస్పరం 
అవినాభావ సంబంధం యో జానాతి స చక్రవిత్ 

ఈ నవవిధచక్రములకు మానవశరీరంలోని నవధాతువులకు సామ్యం ఉన్నది. రక్తము,మాంసము,ఎముకలు,చర్మము,మెదడు అనే ఐదుధాతువులు శక్తి స్వరూపాలు.మజ్జ,వీర్యము,ప్రాణము,జీవము అనేవి శివస్వరూపములు.

అలాగే నవగ్రహాలకూ నవత్రికోణాలకూ సంబంధమున్నది.చంద్ర,కుజ, బుధ,శుక్ర,రాహువులు అయిదూ శక్తిగ్రహాలు.రవి,గురు,శని,కేతువులు నాలుగూ శివగ్రహాలు.చాలామంది నవావరణ పూజలో ఉద్దండులమని చెప్పు కుంటూ ప్రగల్భాలు పలుకుతూ ఉంటారు.వారికి ఒక పరీక్ష ఉన్నది. నిజమైన శ్రీచక్రార్చనపరులు ఆజ్ఞాపిస్తే నవగ్రహాలు ఒక జాతకంలో ఆ జాతకుని కర్మానుసారం ఇవ్వవలసిన తమతమ ఫలితాలు మార్చుకుని వారు చెప్పిన ఫలితాన్ని ఆ జాతకునికి ఇవ్వాలి.సంకల్పమాత్రాన ఇతరుల జాతకాన్ని మార్చగల శక్తి వారిలో ఉండాలి.అదీ అసలైన నవావరణ పూజాఫలం.దీనిని ప్రాక్టికల్గా నిరూపించగలవారూ ఈ పరీక్షలో పాసయ్యే వారూ ఎందరున్నారో మీరే ఆలోచించుకోండి.

శ్రీచక్రంలోని నవావరణలనూ అందులోని దేవతలనూ శక్తులనూ వరుసగా అర్చించే స్తోత్రమే దేవీఖడ్గమాలా స్తోత్రం.ఈ స్తోత్రాన్ని పారాయణం చేసేవారు వారికి తెలియకుండానే శ్రీచక్రార్చన చేస్తున్నట్లుగా లెక్కకు వస్తుంది. త్రైలోక్యమోహన చక్రంనుంచి మొదలుబెట్టి సర్వాశా పరిపూరకచక్రం మొదలైన చక్రాలను దాటుతూ సర్వానందమయ చక్రం వరకూ ఈ నవావరణలూ వరుసగా ఉంటాయి.
  
ఇలా శ్రీచక్రంలోని ప్రతీ ఆవరణా ప్రతి త్రికోణమూ ప్రతి పద్మమూ దాని దళాలూ మూలలూ అన్నీ ఒక్కొక్కటీ ఒక్కొక్క శక్తినీ స్థాయినీ సూచిస్తాయి. Sri Chakra is the symbolic representation of both macrocosmic and microcosmic forces set in their proper places in a most logical and schematic diagram.అందుకే శ్రీచక్రం అంటే విశ్వానికి ప్రతీక అంటారు. అంతేకాదు అది మానవ శరీరానికీ అందులోని నిగూఢశక్తులకూ ప్రతీక కూడా.విశ్వంలో ఉన్న ప్రతిశక్తీ శ్రీచక్రంలో సూచనాత్మకంగా ఇమిడి ఉన్నది.

'బైందవం బ్రహ్మరంద్రంచ మస్తకం చ త్రికోణకం' అనే ప్రసిద్ధశ్లోకం కూడా సాధకుని శరీరానికీ శ్రీచక్రానికీ అభేదాన్ని సూచిస్తుంది. షట్చక్రాలూ, బ్రహ్మ, విష్ణు,రుద్రగ్రంధులనే మూడుగ్రంధులూ కలిసి శ్రీచక్రంలోని తొమ్మిది ఆవరణలలో ఇమిడి ఉంటాయి.  

ఇదేవిధంగా పదిహేను నిత్యలకూ,నవయోగినులకూ,పంచభూతాలకూ, మాతృకావర్ణాలకూ ఇంకా ఎన్నెన్నో వాటికి శ్రీచక్రంలో సంకేతాలున్నాయి. కుండలినీ యోగానికి శ్రీచక్రం ప్రతిరూపం.ప్రపంచంలోని ఏ విధమైన తాత్విక చింతననైనా శ్రీచక్ర సహాయంతో వివరించవచ్చు.ఇది అంతటి సమగ్రమైన యంత్రం.అందుకే దీనిని శ్రీచక్రరాజం అంటారు.ఒక సీనియర్ ఉపాసకునిగా మీకు ఈ విషయాలన్నీ తెలిసే ఉంటాయి. ఇకపోతే ఇంకొక విషయాన్ని వినండి.

త్రికోణరూపిణీ శక్తిర్బిందురూపశ్శివస్స్మృతః
అవినాభావసంబంధస్తస్మాద్బిందుత్రికోణయోః
ఏవం విభాగమజ్ఞాత్వా శ్రీచక్రం యస్సమర్చయేత్
న తత్ఫలమవాప్నోతి లలితాంబా న తుష్యతి

'శక్తి త్రికోణరూపిణి.బిందువు శివుడు.బిందుత్రికోణముల పరస్పర అవినాభావ సంబంధం తెలియకుండా ఎవడైతే శ్రీచక్రార్చన గావిస్తాడో అతనికి ఏ విధమైన ఫలమూ రాదు.అతని అర్చనతో లలితాంబ ఎంతమాత్రమూ తృప్తి చెందదు.' అని లలితాత్రిశతిలో హయగ్రీవుడే అగస్త్యునికి ఉపదేశించాడు.

యే చ జానంతి లోకేస్మిన్ శ్రీవిద్యాం చక్రవేదినః
సామాన్యవేదినస్తే వై విశేషజ్ఞో అతిదుర్లభః
స్వయం విద్యావిశేషజ్ఞో విశేషజ్ఞం సమర్చయేత్

శ్రీవిద్యలో సామాన్యజ్ఞానం కలిగినవారు చాలామంది ఉంటారు.కాని విశేషప్రజ్ఞ కలవారు అతిదుర్లభులు.విశేషమైన ప్రజ్ఞ కలవారే అటువంటి విశేషజ్ఞులను గుర్తించగలరు మరియు గౌరవించగలరు.ఏమిటా విశేషప్రజ్ఞ?అంటే, సాధారణమైన శ్రీచక్రార్చనను దానియొక్క మంత్రోచ్చారణా విధానాన్ని తత్సంబంధమైన బాహ్యపూజావిధానాన్ని  ఉపదేశించేవారు సామాన్యమైన జ్ఞానం కల్గినవారు.

శ్రీవిద్యయొక్క అంతరార్ధాలను చక్కగా వివరించగలిగి అంతర్యాగక్రమ సాధనామార్గంలో వాటిని ఎలా అన్వయించుకోవాలి,నిత్య జీవితంలో ఆయా సులువులనూ మెలకువలనూ ఎలా ఆచరించాలి అనేటటువంటి సమన్వయ పూర్వక రహస్యాలను తెలిసినవారు విశేషజ్ఞులు.అలాంటివారు దొరకడం చాలాకష్టం.అందుకనే 'అతిదుర్లభ:' అనేమాట స్వయానా హయగ్రీవస్వామి చేత వాడబడింది.

శ్రీవిద్యలో సామాన్యప్రజ్ఞ కలిగినవారు విశేషప్రజ్ఞ కలిగినవారు వేర్వేరని హయగ్రీవుడే స్వయంగా చెప్పాడుకదా.దీనికి ప్రమాణం ఈ త్రిశతీ శ్లోకమే.

అసలు శ్రీవిద్యయే అనేక సాంప్రదాయములుగా విస్తరించి ఉన్నది. మనువు,చంద్రుడు,కుబేరుడు మొదలైన పన్నెండుమంది ఘనులు ఈవిద్యను ప్రాచీనకాలంలో ఉపాసించారని తంత్రములు చెబుతున్నాయి. అంటే పన్నెండురకములైన ఉపాసనా విధానాలు ప్రాచీనకాలంలో మనకు ఉండేవి.అవన్నీ ఇప్పుడు లుప్తమై పోయి ప్రస్తుతం మనకు మన్మధోపాసిత మైన కాదివిద్య,లోపాముద్రోపాసితమైన హాదివిద్య మాత్రమె లభిస్తున్నాయి.

శ్రీవిద్యలో బహిర్యాగము అంతర్యాగము అని ఉన్నవి.'అంతర్ముఖ సమారాధ్యా బహిర్ముఖ సుదుర్లభా' అని లలితాసహస్రం అంటుంది.ఇందులో బహిర్యాగం అనేది బాహ్యమైన పూజావిదానంతో కూడినటువంటి తంతు.అంతర్యాగం అనేది పూర్తిగా భావనామాత్రమైన ధ్యానం.దీనినే సమయాచారం అని కూడా అంటారు.విచిత్రమేమంటే మీ స్వాములవారు క్షుద్రవామాచారం అని కొట్టివేసిన విధానాన్ని వివరించే వామకేశ్వరతంత్రము,రుద్రయామళ తంత్రము,కులార్ణవ తంత్రము మొదలైన తంత్రాలు అంతర్యాగాన్ని చాలా విశదంగా వివరించాయి.

ఇకపోతే వీటన్నిటికంటే ఇంకా చక్కగా అంతర్యాగాన్ని సమగ్రంగా వివరించిన ముఖ్యగ్రంధం భావనోపనిషత్తు.ఈ ఉపనిషత్తుకూ తంత్రరాజతంత్రానికీ చాలా దగ్గర పోలికలున్నాయి.ఈ రెండూ కూడా కాదివిద్యా సాంప్రదాయానికి చెందినవే. కాముడు లేదా మన్మధుడు ఉపాసించిన విద్యను కాదివిద్య అంటారనీ లోపాముద్రాదేవి ఉపాసించిన విద్యను హాదివిద్య అంటారనీ మీకు తెలుసుకదా.

శ్రీవిద్యలో అతిముఖ్య అంశం 'సామరస్యం' అనే కాన్సెప్ట్.బాహ్యంగా ప్రపంచంలో ఉన్నవాటికీ అంతరికంగా సాధకుని శరీరంలో ఉన్నవాటికీ సామరస్యాన్ని గ్రహించడం చాలా ముఖ్యం.దీనినే 'synchronicity' అనుకోవచ్చు.తంత్రం అంతా ఈ సామరస్యమనే సూత్రం మీదే ఆధారపడి ఉన్నది.విశ్వంలో ఉన్న సర్వమూ మనశరీరంలో కూడా ఉన్నది అనేది ఇక్కడ మూలసూత్రం.

ఈ సూత్రాన్ని సమయాచారపరులు భావనామాత్రంగా అనుసరిస్తే కౌళులు యధాతధంగా స్వీకరించి బాహ్యంగా కూడా అర్చిస్తారు.సమయాచారపరులు తమయొక్క సూక్ష్మశరీరంలోని త్రికోణాన్ని,దక్షిణాచారులు బాహ్యయంత్రం లోని త్రికోణాన్ని అర్చిస్తే,కౌళులు యోనిపూజను ఆచరిస్తారు.తప్పేముంది?ఆ సమయంలో వారిలో కామభావన ఏమాత్రం ఉండదు. కళ్ళుమూసుకుని ధ్యానాన్ని నటిస్తూ కామచింతనను దాటలేని డాంబికుని కంటే కామస్పర్శ లేకుండా కల్మషరహితమైన మనస్సుతో యోనిపూజ చేసే కౌళుడు నిజంగా ఉన్నతుడే.

కనుక నిజమైన కౌళులూ వామాచారపరులూ నకిలీ సమయాచారులకంటే సత్యానికి చాలా దగ్గరగా ఉన్నారని చెప్పాలి.ఎందుకంటే వారికి భయం ఉండదు.అసహ్యం ఉండదు.వారు భౌతికంలో కూడా దైవాన్ని చూస్తున్నారు. అందువల్లనే వారు అష్టపాశాలను తేలికగా దాటగలుగుతారు.డాంబికపు మాటలు చెప్పే కుహనా దక్షిణాచారులూ సమయాచారులూ వాటిని త్వరగా దాటలేరు.వారు మాటలలో కోటలు దాటిస్తారు.కాని ఆచరణలో అడుగడుక్కీ అష్టపాశాలకు బద్ధులై ఉంటారు.శ్రీవిద్యాసాధకులమని చెప్పుకునేవారిని సూక్ష్మంగా పరిశీలిస్తే ఈ సత్యాన్ని మీరు గ్రహించగలరు.

కౌళులూ వామాచారులూ బాహ్యపూజను చేస్తారని అందరూ వారిని విమర్శిస్తారు.ఈ ప్రపంచంలో బాహ్యపూజను చెయ్యనివారు ఎవరున్నారో నాకు కొంచం చూపించండి.శరీరభావాన్ని కలిగిఉన్న ప్రతివాడూ బాహ్య పూజకుడే. రాగిరేకులో దేవిని దర్శించేవాడు గోప్పవాడైతే సాక్షాత్తు ఒక సజీవస్త్రీలో దేవిని దర్శించి ఆమెను ఒక దేవతగా పూజించేవాడు ఆరాధించే వాడూ ఇంకెంత మహనీయుడై ఉంటాడు? మీరు చెబుతున్న చాలామంది దక్షిణాచారపరులు ఇళ్ళలో తమ భార్యలను ఎలా ట్రీట్ చేస్తారో నాకు బాగా తెలుసు.వాళ్ళను వంటింటికీ పడకటింటికీ పరిమితం చేస్తూ బానిసలకంటే హీనంగా చూస్తూ, తిడుతూ,కొడుతూ,హింసపెడుతూ,అమ్మవారి తత్వాన్ని గురించి స్టేజీలెక్కి గొప్పగొప్ప ఉపన్యాసాలు ఇచ్చే దౌర్భాగ్యులు చాలామంది ఉన్నారు.నా దృష్టిలో ఇలాంటివారు శ్రీవిద్యోపాసనకు ఎంతమాత్రమూ తగరు.

అడుగడుగునా డబ్బుకూ అహంకారానికి పేరుప్రతిష్టలకూ దాసులై,స్వార్ద్జ పూరితమైన ఇంద్రియలాలసా జీవితాలు గడిపే మనుష్యులు తాము గొప్ప శ్రీవిద్యాపరులమని గప్పాలు చెప్పుకుంటూ వామాచారాన్ని విమర్శిస్తూ ఉపన్యాసాలిస్తే నాకు అరికాలిమంట తల కెక్కుతుంది.అసలైన వామాచారం ఎంత ఉన్నతమైనదో వీళ్ళు కలలో కూడా ఊహించలేరు.ఎంత చెప్పినా వీరికి అర్ధంకూడా కాదు.

అయితే అసలైన నిజాయితీపరులైన సాధకశ్రేష్టులు సమయాచార దక్షిణాచారా లలో లేరా అంటే ఉన్నారు అనే నేను చెబుతాను.కానీ,వారితో మనకు ఎటువంటి బాధాలేదు.మనం మాట్లాడుకుంటున్నది నకిలీల గురించి గాని అసలైన మహనీయుల గురించి కాదు.

కౌళులూ వామాచారులూ ఇంద్రియభోగ పరాయణులని సామాన్యంగా అందరూ అనుకుంటూ వారిని విమర్శిస్తూ ఉంటారు.నేను దీనినే త్రిప్పి చెబుతాను.ఇంద్రియభోగపరాయణుడైన ప్రతివాడూ క్షుద్రవామాచారుడే అని నేనంటాను.మనలో ఇంద్రియాల పరిధిని దాటినవారు ఎందరున్నారో మీరే ఆలోచించుకోండి.దక్షిణాచారపరులమనీ సమయాచారపరులమనీ పూర్ణదీక్షా పరులమనీ చెప్పుకోవడానికి అసలు మనకు అర్హత ఉన్నదా లేదా అన్న విషయం అప్పుడు మాత్రమే మనకు తెలుస్తుంది.

వారి పూజ అంతా ఆధారచక్రంలోనే అనీ వారి పరిధి మూలాధార స్వాదిష్టాన చక్రాలే అనీ ఇంకొందరు కౌళులను విమర్శిస్తారు.అసలు ఈ రెండుచక్రాలను పూర్ణంగా దాటినవారు ఎందరున్నారని తాంత్రిక సెన్సస్ తీయిస్తే మనదేశంలో చేతివేళ్ళమీద లెక్కపెట్టదగినంతమంది మాత్రమే తేలతారు.గొప్పగొప్ప స్వామీజీలతో సహా ప్రతివాడూ అఘోరిస్తున్నది మొదటి మూడుచక్రాల పరిధిలోనే.మళ్ళీ ప్రతివారూ కౌలాన్నీ వామాచారాన్నీ విమర్శించేవారే.

సత్యమేమిటంటే,తమను తాము గొప్ప జీవన్ముక్తులవలె,శుద్ధ సమయాచార పరులవలె భావించుకున్నంత మాత్రాన సరిపోదు.ఆచరణలోనూ అనుభవంలోనూ ఆవిషయం నిగ్గు తేలాలి.అది మాత్రం ఎక్కడా కనబడదు. ఊరకే విమర్శించడం తేలిక కదా.పైగా నిజమైన కౌళులూ వామాచారులూ ఈ కుళ్ళు సమాజంలో ఉండరు.ఒకవేళ ఉన్నాకూడా వారిని చూచి సమాజం అసహ్యించుకోవడమో లేక భయపడి దూరంగా పారిపోవడమో జరిగే రీతిలోనే వారు ప్రవర్తిస్తారు.

ఇన్నిమాటలెందుకు?మామూలు మాటల్లో చెబుతా వినండి.మంత్రానికీ, యంత్రానికీ,దేవతకూ,ఉపాసకునికీ మధ్య తారతమ్యరహితమైనట్టి అభేదస్థితిని సాధించడమే ఏ సాధనకైనా కీలకం.ఏ ఆచారపరుడైనా ఈస్తితిని పొందినవాడు మాత్రమె మహనీయుడు.ఆస్తితిని పొందకుంటే ఏఆచారాన్ని పాటించేవాడై నప్పటికీ అతడు గమ్యానికి ఇంకా చాలా దూరంగా ఉన్నట్లే లెక్క. నాలుగు, అయిదు,ఆరువిధముల ఐక్యానుసంధానమే దీనికిగల ఏకైకమార్గం.బాలా, పంచదశీ,షోడశీ మంత్రముల యొక్క సజీవరూపమే శ్రీచక్రం.

స్వాములవారి ఆవేదనను ఆలోచనను నేను సరిగానే అర్ధం చేసుకున్నాను. పెద్దవాడైన ఆయనను విమర్శించే సాహసం చేసినందుకు నామాటలను తప్పుగా అర్ధం చేసుకోకండి.'మోక్షైకహేతుకీ విద్యా శ్రీవిద్యైవ నసంశయ:(మోక్షమును ప్రసాదించగలవిద్య శ్రీవిద్యయే సంశయము లేదు)' అన్నట్లుగా, సామాన్యుడికి గూడా అందుబాటులో ఉన్న ఇటువంటి మహోన్నత విద్య అనర్హుల చేతులలో బడి వక్రీకరింపబడిన స్తితిలో ఉన్నదని ఆయన ఆవేదన చెందాడు.ఆ ఆవేదనా రూపములే ఆయన వ్రాసిన విమర్శనాత్మక గ్రంధములు.కాని ఈ క్రమంలో భాస్కరరాయలనూ వారి సంప్రదాయాన్నీ ఆయన అతి తీవ్రంగా విమర్శించడమూ వారిని బ్రాహ్మణాధములనీ దుష్ట బ్రాహ్మణులనీ,మపంచకలోలురనీ తిట్టిపోయ్యడం ఎంతమాత్రం సబబు కాదు.

నా భావాలను విని మీ స్వాములవారంటే నాకు గౌరవం లేదని తప్పుగా భావించకండి.పరాయి మతాల మహానీయులనే గౌరవించే నేను మన సాంప్రదాయపు మహనీయులను ఎందుకు ద్వేషిస్తాను.అది ఎన్నటికీ జరుగదు.శ్రీవిద్యా సాంప్రదాయమును ఉద్ధరించి ఎంతోమందికి మహోపకారం చేసినవాడని ఆయనను నేను ఎంతో గౌరవిస్తాను.అయితే కౌళమును వామమును ఆయన ఇంకా బాగా అర్ధం చేసుకుని ఉంటే బాగుండేదని మాత్రమే నా అభిప్రాయం.ఒకవేళ ఆయనకు ఈ మార్గాలు తెలిసి ఉన్నప్పటికీ వాటిని బాహాటంగా సమర్ధిస్తే సమాజంలో దురాచారాలు ప్రబలుతాయని ఆయన భయపడి ఉండవచ్చు.కనుక వీటిని విమర్శిస్తూ శుద్ధ దక్షిణాచారాన్ని ఆయన ప్రచారంలోకి తెచ్చి ఉండవచ్చు.ఈ నా అభిప్రాయం వల్ల ఆయనంటే నాకున్న గౌరవం ఏమాత్రం తగ్గదు.ఈ విషయం స్పష్టంగా అర్ధం చేసుకోండి.

అనర్గళంగా సాగుతున్న వాక్ప్రవాహానికి అడ్డుకట్ట వేస్తూ సమయం ఎంతైందో అని గోడవైపు చూచాను.గడియారం రాత్రి పదిగంటలు సూచించింది.ఇప్పుడు బయలుదేరితే కనీసం అర్ధరాత్రి పన్నెండు గంటలకైనా గుంటూరు చేరవచ్చు అనుకుంటూ 'చాలా సమయం అయింది.ఇక ఉంటానండి' అన్నాను.

(మిగతాది తర్వాత భాగంలో)
read more " కల్యాణానంద భారతీస్వామి స్మృతులు- 9 (అసలైన శ్రీవిద్య) "

17, జులై 2013, బుధవారం

కల్యాణానంద భారతీస్వామి స్మృతులు - 8 (శ్రీవిద్యా చర్చ)

'శర్మగారు.కొన్ని విషయాలు నాకు తెలిసినంతవరకూ చెబుతాను.వినండి. మధ్యలో మీకు అనుమానాలు వొస్తే అడగండి.' అంటూ మొదలు పెట్టాను.

ముఖ్యంగా మీ స్వాములవారి విధానం నాకర్ధమైనంత వరకూ ముందుగా చెబుతాను.ఇది వారి పుస్తకాలనుండి ఏర్పరచుకున్న అభిప్రాయమే గాని నాకు మీ విధానంతో ప్రత్యక్ష పరిచయం లేదు.

శ్రీవిద్యలో వైదికమూ అవైదికమూ అంటూ రెండు మార్గాలున్నవని ఆయన నమ్మారు.గౌడపాదుల వద్దనుండీ శంకరుల ద్వారా తమకు అందివచ్చినది వైదికమార్గమనీ దానికి మూలం వేదమూ,సనకాది మహర్షిప్రణీతమైన శుభాగమపంచకమూ అని,తద్విరుద్ధమైనది అవైదికమనీ దానికి మూలాలు కులార్ణవతంత్రము,వామకేశ్వరతంత్రము మొదలైన ఇతర వామాచార తంత్రములనీ,వాటిని పాటించే బెంగాల్ తాంత్రికులూ,కాశ్మీరశైవమని పిలువ బడే త్రికసాంప్రదాయమూ ఆమార్గపు ప్రముఖులైన అభినవగుప్తాదులూ దారితప్పిన వామాచారతాంత్రికులనీ,నవీన కాలములో,అంటే దాదాపు 300 ఏండ్ల క్రితం నివసించిన భాస్కరరాయలూ,ఆయన శిష్యుడైన జగన్నాధ పండితరాయలూ,వారి శిష్యుడైన రామేశ్వరుడూ అందరూ క్షుద్ర వామాచారులనీ వారు వ్రాసిన వరివస్యా రహస్యము, నిత్యోత్సవము, సేతుబంధము, సౌభాగ్య భాస్కరము మొదలైన గ్రంధములు తాగినమత్తులో వారు వ్రాసిన చెత్తవ్రాతలనీ ఆయన భావించారు.
      
అంతేగాక వారికి అసలైన శ్రీవిద్య తెలియదనీ వారికి తెలిసినదేల్లా ఉపాసన పేరుతో 'మ'పంచకసేవనమే అనీ,కులగోత్రాదులను వావివరసలను మరచి మద్యము మాంసము సేవించి భైరవచక్రమనీ, కులచక్రమనీ, శ్రీచక్రమనీ నేలమీద పెద్దముగ్గు వేసి అందులోకి అడుగుపెట్టి అక్కడ నానాకులాల స్త్రీలూ పురుషులూ కలిసి వివస్త్రులై త్రాగి ముందుగా పంచోపచార దశోపచార లేదా షోడశోపచారపూర్వకంగా ఆయా నగ్నస్త్రీలను అర్చించి తర్వాత వారితో రాత్రంతా సంభోగించడమే వారికి తెలిసిన శ్రీవిద్య అనీ ఆయన అనుకున్నారు.

వైదికులమైన మనకు అశ్వలాయన,బోధాయన,ఆపస్తంబ సూత్రములే ప్రమాణములు గాని,భాస్కరాదులు ఉటంకించినటువంటి పరశురామ కల్పసూత్రము అనేది నిజానికి కల్పసూత్రము కాదనీ అదొక కల్పిత సూత్రమనీ అందులో ఉన్నటువంటి పది అధ్యాయములూ ఆరువేల శ్లోకములూ అన్నీకూడా ఎవడో సంస్కృతం వచ్చిన వామాచార భ్రష్ట బ్రాహ్మణుని కపోలకల్పితములనీ వాటికి వేదప్రామాణికత ఏమాత్రమూ లేదనీ ఆయన నమ్మారు. 

పరశురామ కల్పసూత్రం అనేది కేరళలో ప్రచారంలో ఉన్నది.మనవైపు అంత ప్రచారంలో లేదు.దానిలో చెప్పబడిన విషయం ప్రకారం సృష్టిమొదట్లో సమస్తజ్ఞానాన్నీ పరమశివుడు ఆగమము, రహస్యము, సంహిత,యామళ,ఆర్ణవ,తంత్రములనే భాగములలో లోకానికి అనుగ్రహించాడు.విషయవిస్తృతిలో అనంతంగా ఉండి సామాన్యులకు గ్రహించడానికి అసాధ్యంగా ఉన్నటువంటి ఈ జ్ఞానరాశిని అంతటినీ త్రిమూర్తి స్వరూపుడైన దత్తాత్రేయుడు క్లుప్తీకరించి దత్తసంహితగా లోకానికి అందించాడు.అనేక వేలశ్లోకాలతో అది కూడా అగమ్యగోచరంగా ఉన్నందువల్ల దీనిని కూడా ఇంకా చిన్నదిగా చేసి దత్తాత్రేయుని శిష్యుడైన పరశురాముడు తన శిష్యులకు బోధించాడు.అది కూడా అల్పబుద్ధులైన మనుష్యులకు అర్ధంకాని స్తితిలో ఉంటే పరశురాముని శిష్యుడైన సుమేధుడు దానికి మళ్ళీ క్లుప్తీకరించి పది అధ్యాయములు ఆరువేల శ్లోకములు ఉన్నటువంటి పరశురామ కల్పసూత్రముగా లోకానికి అందించాడని అంటారు.

1775 లో ఉమానందుడనే భాస్కరుని శిష్యుడు ఈ సూత్రాలకు నిత్యోత్సవమనే వ్యాఖ్యానం వ్రాశాడు.ఇతనికే జగన్నాధ పండితరాయలని ఇంకొక పేరు.ఉమానందుడు ఈ సూత్రాలను సరిగా అర్ధం చేసుకోలేదనీ తప్పుగా వ్యాఖ్యానించాడనీ భావించిన రామేశ్వరుడు దీనిపైన 1831 లో సౌభాగ్య సుధోదయమనే ఇంకొక వ్యాఖ్యానాన్ని వ్రాశాడు.ఈ పుస్తకాలన్నీ శ్రీవిద్యపై ప్రమాణాలు కావనీ, వీళ్ళందరూ క్షుద్రులనీ,వామాచారులనీ వీళ్ళు చేసిన చేష్టలూ అద్భుతాలూ అన్నీ విప్రవినోదుల గారడీవిద్యల వంటివనీ  మీ స్వాములవారు వీరిని తీవ్రంగా విమర్శించారు.ఈ పుస్తకాలను ఆయన చెత్త సాహిత్యంగా కొట్టి పారేశారు.అంతేగాదు.అసలైన శ్రీవిద్యను భ్రష్టు పట్టించి సర్వనాశనం చేస్తున్నవి ఈ పుస్తకాలేనని,నిత్యోత్సవం అనే గ్రంధం నిత్యార్చన గ్రంధం అవడం వల్లనే గోదావరీతీర బ్రాహ్మణులు అందరూ వామాచార పరాయణులై భ్రష్టులైనారని ఆయన తిట్టిపోశారు.

దానికి తోడు ఆయన చూచిన కొన్ని తంత్ర గ్రంధాలలో ఆయనకు కనిపించిన 

'పీత్వా పీత్వా పున:పీత్వా యావత్పతతి భూతలే 
ఉద్దాయచ పున:పీత్వా పునర్జన్మ నవిద్యతే

(నేలమీద స్పృహతప్పి పడిపోయెంతవరకూ మళ్ళీమళ్ళీ మద్యం తాగు.స్పృహవచ్చి లేచిన తర్వాత మళ్ళీ తాగు.ఇలా చేస్తే నీకు పునర్జన్మ ఉండదు)'

మొదలైన శ్లోకాలు ఆయనకు పరమఅసహ్యాన్ని కలిగించి ఉంటాయి.ఇదేకాదు.ఇంకా పరమ చండాలమైన పనులు చెయ్యమని ప్రేరేపించే తంత్రసాహిత్యం కూడా ఉన్నది.ఇలాంటివి చదివినమీదట మీ స్వామికి ఇటువంటి జుగుప్స కలగడం సహజమే.అయితే అసలైన తంత్రం ఇదికాదు.తంత్రమంటే అతిగా ఏదిబడితే అదితినే బకాసురత్వమూ (gluttony),వావివరసలు లేని మతాచార విశృంఖల సంభోగమూ(religious sexual orgy) అనుకోవడం శుద్ధతప్పు.ఖర్మకాలి నేడు తంత్రమంటే ఇవే అని చాలామంది విదేశీయులు అనుకుంటున్నారు.ఇక మనవాళ్ళలో చాలామందికి ఈ మాత్రం అవగాహన కూడా లేదు.తంత్రమంటే ఏదో భూత ప్రేతాలకు సంబంధించిన ఒక క్షుద్రవిద్య అని మనలో చాలామంది అనుకుంటారు.ఇదీ పూర్తిగా తప్పు భావనే.

ఈ విధమైన నీచతంత్రాన్ని ఆయన విమర్శించడం చాలా కరెక్ట్.ఇంతవరకూ నేనూ మీ స్వాములవారితో ఏకీభవిస్తున్నాను.ఆయన భావించినట్లుగా కొన్ని కొన్ని యామళ,డామర తంత్రాలలో అటువంటి రహస్యాచారాలు ఉన్నమాట వాస్తవమే.అలాంటి పిచ్చి పోకడలను ఖండించవలసిందే.వాటిని ఖండిస్తూ ఆయన పుస్తకాలు వ్రాసి చాలా మంచిపని చేశారు.కాని ఇంతమాత్రం చేత వామాచారం అంటే ఒక చండాలమైన మార్గమనీ,అక్కడ అంతా పంచమకారాలే తప్ప ఉపాసన అన్నది లేదు అన్నటువంటి ఆయనయొక్క తృణీకారభావనతోనే నేను విభేదిస్తున్నాను.నిజమైన వామాచారం ఇది కాదు.నేడు చాలామంది చేస్తున్నది నిజమైన దక్షిణాచారం కానట్లే మీ ప్రత్యర్ధులు చేస్తున్నదీ నిజమైన వామాచారం కాదు.అదీ దిగజారింది.ఇదీ దిగజారింది.అసలైన ఆచారాలు వాడుకలో భ్రష్టములై నామమాత్రములుగా మిగిలి ఉన్నవన్నది మాత్రమే సత్యం.

నా ఉద్దేశ్యం వినండి.ఎవనికైతే సరియైన దక్షిణాచారమూ సరియైన వామాచారమూ కూడా తెలుస్తాయో అతడే నిజమైన సంపూర్ణమైన తాంత్రికుడు.ఏదో ఒకటి తెలిసినవానికి పూర్ణత్వం లేదు.దక్షిణాచారం అంటే శివతత్వం అనీ వామాచారం అంటే శక్తితత్వం అనీ వాటియొక్క అసలైన ప్రాచీనార్ధంలో నేను ఈపదాలను గ్రహించాను.శివశక్తి తత్వాలను ఆమూలాగ్రం అర్ధం చేసుకుని అనుభవంలో వాటిని సంపూర్తిగా గ్రహించినవాడే నిజమైన పరమయోగి.అతడే తాంత్రిక చక్రవర్తి.శ్రీ రామకృష్ణులే దీనికి పరమప్రమాణం.తంత్రంలో ఆయనతో సమానమైన శిఖరాలను అందుకున్నవాడు ఇప్పటివరకూ సృష్టిలో ఒక్కడుకూడా లేడు.ఒక్క పరమశివుణ్ణి మాత్రమె ఆయనకు పోలికగా చెప్పవచ్చు.ఇంకెవరూ ఆయన స్థాయికి కనుచూపు మేరలోకి కూడా రాలేరు.

అంతటి అవతారపురుషుడు కూడా తన గురువైన భైరవీబ్రాహ్మణి ఆధ్వర్యంలో వామాచార సాధనలు చేశాడు.అయితే వాటిని సాత్వికరీతిలో చేశాడు.దానికి కారణం ఆయనకున్నటువంటి పరమశుద్ధమైన మనస్సు. 'సురా' అన్న పదం వినడంతోనే ఎవని మనస్సు అయితే ఇంద్రియాలను అధిగమించి సమాధిలో లయమైపోతున్నదో అతనికి ప్రత్యక్ష సురాపానం యొక్క ఆవశ్యకత ఏముంటుంది?అదీ ఆయన యొక్క మహోన్నతమైన స్తితి.మామూలు మనుష్యులకు ఈ స్తితి ఊహకు కాదుకదా,కలలోకి కూడా అందదు.అంతటివాడే వామాచార సాధనలు ఆచరించాడు.కనుక వామాచారం తప్పు కాదు.

బెంగాల్లో ఉన్న ఇంకొక వామాచారసిద్ధుడు తారాపీఠనివాసి బామాఖేపా. బెంగాలీలు 'వా' అన్న పదాన్ని 'బా' అని పలుకుతారు. ఆయన అసలు పేరు వామాఖేపా.ఖేపా అంటే పిచ్చివాడు అని అర్ధం.ఆయన ఒక మహోన్నతుడైన తారాసిద్ధుడు.తారాదేవికి ఆయన పరమభక్తుడు.శరీరస్పృహకు అతీతుడై నిత్యం నగ్నంగా సంచరించేవాడు.ఎన్నో అతీతశక్తులు కలిగిన సిద్ధపురుషుడు.ఎన్నో మహిమలు ప్రదర్శించాడు.ఈయన కూడా వామాచార పరాయణుడే.

కాశీలోని కాళీపీఠంలో ఎందఱో మహనీయులైన వామాచార సిద్దులున్నారు. వారెవరూ దురాచారపరులు కారు.డొల్ల ఆచారపరులూ డాంబికులూ కారు. వారందరూ నిజమైన మహనీయులు.
       
మీ స్వాములవారు క్షుద్ర వామాచారాన్నీ,వామాచారం పేరుతో జరుగుతున్న మోసాన్నీ,అసహ్యకరములైన తప్పుడు పద్ధతులనీ ఖండించి తూర్పారబట్టారు.దానికి ఆయనకు నమోవాకాలు అర్పించవలసినదే.కాని అదే సమయంలో అసలైన వామాచారం అనేది ఒకటి ఉన్నదని ఆయన మరచిపోయారు.బహుశా దానిగురించి ఆయనకు కూడా తెలిసి ఉండకపోవచ్చు.ఎందుకంటే,అందరికీ అన్నీ తెలియాలని ఎక్కడా వ్రాసిపెట్టి లేదు. కాకపోతే,తనకు తెలియని దానిని కూడా తీవ్రభాషలో విమర్శించడమే వారు చేసిన పొరపాటు.

అదే సమయంలో,ఒక్క లలితాఉపాసన మాత్రమే సాత్వికమనీ,మిగతా ఉపాసనలైన కాళీ ఉపాసన,తారా ఉపాసన,భైరవీ ఉపాసన మొదలైనవన్నీ అవైదికములూ తుచ్చములూ అని ఆయన విమర్శించారు.కాశ్మీర త్రిక సాంప్రదాయులు ఘోరమైన కౌళికులనీ(కాళీ ఉపాసకులనీ) అదే విధంగా బెంగాల్లో కూడా ఈ కాళీ ఉపాసన అనే చెడు సాంప్రదాయం ప్రబలిందనీ ఆయన విమర్శించారు.ఇది పొరపాటు.కాళీ ఉపాసన చెడుమార్గం కాదు.కాళీక్రమం,సుందరీక్రమం,భైరవీక్రమం అనేవి శ్రీవిద్యలో ఉన్నాయి.కాని ఒక్క లలితా ఉపాసనమే ఉత్తమం అని మీ స్వాములవారు నమ్మారు.ఇది తప్పు.

ఏ శక్తినైతే లలితా అంటున్నామో ఆమెనే కాళీ, త్రిపురా, తారా, ఉమా, శాంభవీ,బగళా,భైరవీ అనీ ఇంకా ఎన్నో పేర్లతో పిలుస్తున్నాం.శాక్తతంత్రాలలో ఈ భావన చాలాచోట్ల కనిపిస్తుంది. అజ్ఞానులు మాత్రమె వీరందరూ వేర్వేరు దేవతలని భావిస్తారు.తెలిసినవారు వీరందరూ ఒక్క శక్తి యొక్క వివిధ రూపాలే అని తెలుసుకుంటారు.అంతేకాదు ఆ శక్తి ఏ రూపంలో పిలిస్తే ఆ రూపంలో పలుకుతుందనీ, అంతేగాక ఆ శక్తి నిరాకార కూడా అనీ వారికి తెలుసు.

మహాభక్తుడైన బెంగాల్ తాంత్రికుడు 'కమలాకాంత' --'సాకారె ఆకార్ నిరాకార్ మా త్వంహి తారా-'(అమ్మా.నీవు సాకారవు.నిరాకారవు కూడా.సకలాన్ని తరింపచేసే శక్తివి నీవే)' అని కీర్తించాడు.తంత్రాలలో ఈ భావన అసంఖ్యాకమైన చోట్లలో చెప్పబడింది.ఇంకా మనం అర్ధం చేసుకోలేక పోతే ఎలా?  

ఆమాటకొస్తే అసలు వేదాలలో ఎక్కడా శక్తి ప్రస్తావనే లేదు.అక్కడ త్రిమూర్తులే లేరు.శివ విష్ణు బ్రహ్మ మొదలైన పదములు వేదాలలో ఉన్నాయి.కాని ఈనాడు మనం ఊహించి పూజిస్తున్న రూపములు వారికి ఆనాడు లేవు. ఒకే ఒక్క పరబ్రహ్మము యొక్క గుణాలుగా ఈ మాటలు వేదములలో వాడబడ్డాయి.పురాణకాలంలో మాత్రమె వీరికి ప్రత్యెక రూపాలను ఇచ్చి వీరిని వేర్వేరు దేవతలుగా భావించే దుష్ట సాంప్రదాయం మొదలైంది.ఒక్క కేనోపనిషత్తులో మాత్రం 'ఉమా' అంటూ శక్తిప్రస్తావన ఉన్నది.కాని ఆ ఉపనిషత్తును తర్వాత తర్వాత వ్రాయబడినదిగా కొందరు భావిస్తారు.అందరూ దీనిని అంగీకరించరు.

శంకరుల పరమగురువైన గౌడపాదులు 'సుభగోదయ స్తుతి' అన్న స్తోత్రాన్ని వ్రాశారు.అందులో వేదప్రతిపాదితమైన అద్వైతాన్ని సమయాచారమైన కుండలినీతంత్రంతో సమన్వయము చేసిన భావనలు కనిపిస్తాయి. పరమాద్వైతులైన వీరు శక్తిఉపాసనను వారి అద్వైతవిధానానికి ఎలా అన్వయించుకున్నారో,అనుసరించారో అర్ధంకాదు.కాశ్మీరంలో అప్పటికే శక్తి ఉపాసన ఉన్నది.శంకరులు కాశ్మీరంలో పర్యటించినప్పుడు అక్కడి తాంత్రిక శక్తిఉపాసనా రహస్యాలు నేర్చుకున్నారనీ అందుకే అప్పటినుంచే ఆయన అద్వైతానికి శక్తిఉపాసనను జోడించారనీ,కనుకనే వారి మఠాలలో అన్నింటిలోనూ ఇప్పటికీ శ్రీచక్రార్చనమూ శక్తిపూజనమూ ఉందనీ కాశ్మీర త్రిక సాంప్రదాయులు అంటారు.

గౌడపాదులు ఎక్కడివారో నాకు తెలియదు.కాని పూర్వకాలంలో బెంగాల్ రాష్ట్రాన్ని గౌడదేశం అనేవారు.కనుక పేరును బట్టి ఆయన బెంగాల్ వాడే అయి ఉండవచ్చు అనుకుంటాను.శక్తిఉపాసన అక్కడిదే గనుక ఆ మూలాలను ఆయన అనుసరిస్తూ 'సుభగోదయ స్తుతి' వ్రాసి ఉండవచ్చు. వారినుంచి వారి అనుయాయి అయిన ఆదిశంకరులు ఈ భావనలను అందిపుచ్చుకుని ఉండవచ్చు.జన్మత: కేరళ బ్రాహ్మణుడైన ఆది శంకరులకు శక్తిపూజ సహజంగానే అలవాటు అయి ఉంటుంది.  

మీ స్వాములవారు శంకరసాంప్రదాయాన్ని సమర్ధిస్తూ కాశ్మీరత్రికాన్ని క్షుద్రం అన్నారు.వారేమో శక్తి ఉపాసనను శంకరులు మావద్దనే నేర్చుకున్నారని అంటారు.శంకరాద్వైతం త్రికం కంటే తక్కువది అని వారి భావన.వేదాన్ని అతి తక్కువ చేసి ఆ తర్వాత వైష్ణవమూ శైవమూ ఇలా క్రమేణా ఒకదానికంటే ఒకటి గొప్పవనీ అన్నింటి కంటే గొప్పది త్రిక సాంప్రదాయమని కొందరు శ్లోకాలు వ్రాసుకున్నారు.ఇంకొందరేమో అన్నింటి కంటే వామాచారం గొప్పదనే అర్ధం వచ్చేలా శ్లోకాలను వ్రాసుకున్నారు.ఈ విధంగా ఎవరికి వారు డప్పు కొట్టుకోవడం తప్ప విషయాన్ని సరిగ్గా అర్ధం చేసుకుందామని ఎవరూ ప్రయత్నం చెయ్యలేదు.

అసలు విషయం ఏమంటే,వీటిలో ఏ ఒక్కటీ సంపూర్ణమూ పరిపూర్ణమూ కాదు.అన్నింటినీ సమన్వయం చేసి అర్ధం చేసుకునే భావమే సరియైనది. విశ్వంలో అన్నీ ఇమిడి ఉన్నాయి.దేని స్థానం దానికుంది.మనం దేనినీ తృణీకరించలేము.దైవమె దానిని ఒప్పుకుని దానికంటూ ఒక స్థానాన్ని తన సృష్టిలో ఇచ్చింది.కాదనడానికి మనమెవరం? విశ్వప్రణాళికలో దాని స్థానం ఏమిటి అన్నది మాత్రమె మనం సరిగ్గా అర్ధం చేసుకోవాలి.శ్రీరామక్రిష్ణులు వివేకానందులూ చెప్పినది ఇదే.

ఒకసారి వివేకానందుడు ఇంకా నరెంద్రునిగా ఉన్న సమయంలో ఒక సంఘటన జరిగింది.అప్పుడు ఆయనకు పదిహేడు పద్దెనిమిది ఏళ్ళు ఉంటాయి.అప్పుడే ఆయన రామకృష్ణుని వద్దకు వచ్చి ఉన్నాడు.కాని అప్పటికే ప్రాచ్య పాశ్చాత్య వేదాంతములు అన్నీ చదివి ఉన్నాడు.బెంగాల్లో తంత్ర సంప్రదాయాలు ఎక్కువ.రామకృష్ణులవారి గదిలో తరచుగా వేదాంతచర్చలు జరిగేవి.భావి మహనీయులైన యువకశిష్యుల మధ్య వేదాంతచర్చలను ఆయన ప్రోత్సహించి వారు ఎలా వాదిస్తారా అని తాను మౌనంగా వింటూ ఉండేవారు.ఒకరోజున నరేంద్రుడు కూడా మీ స్వాములవారి వలె వామాచారతంత్రాన్ని అతి తీవ్రభాషలో విమర్శిస్తూ ఒక రెండుగంటల పాటు మాట్లాడాడు.అదొక చండాలమైన మార్గమనీ దానిని అనుసరిస్తే అధోగతే అనీ తీవ్రమైన పదజాలంతో దూషించాడు.అంతా మౌనంగా విన్న రామకృష్ణులు చివరకు ఒకే ఒక్క మాట అన్నారు.

'నాయనా.నరేన్.ప్రతి ఇంటికీ ఒక దొడ్డిదారి కూడా ఉంటుంది.మరచిపోకు.'

అనుభవంతో చెప్పబడిన ఈ ఒక్క మాటతో నరేంద్రుని రెండుగంటల వాగ్దాటీ ఆయన లాజిక్కూ అంతా ఎక్కడికో కొట్టుకుపోయింది.ఆయన ఎంతో ఉత్తమసాధకుడు కారణజన్ముడూ గనుక వెంటనే గురుదేవుల మాటలోని సత్యాన్ని గ్రహించాడు.మౌనంగా గురుదేవుల పాదాలపై బడి ప్రణామం చేసాడు.తర్వాత ఎన్నో ఏళ్ళకు విదేశాలలో ఇచ్చిన 'My Master' అన్న ఒక అద్భుతమైన ఉపన్యాసంలో ఈ సంఘటనను ఆయన ఉటంకించాడు.

కనుక నేను చెప్పేది ఒకటే.దారిలో తప్పుగా నడిచేవారు ఉండవచ్చు.అసలు దారే తప్పంటే ఎలా? అన్ని దారులూ చివరకు చేర్చేది ఒక్క చోటికే అని రామకృష్ణులు ఎప్పుడూ అనేవారు.ఈ విశాలమైన భావం ఉంటే ఏ బాధా లేదు.అసలైన తంత్రాన్ని అర్ధం చేసుకోవాలంటే అందుకే రామకృష్ణుని జీవితాన్ని చదవాలని,అర్ధం చేసుకోవాలనీ నేనంటాను.ఇప్పుడు చెప్పండి.మీ సంశయాలు తొలగిపోయాయా ఇంకా ఉన్నాయా?' అడిగాను.

(మిగతాది తర్వాతి భాగంలో)
read more " కల్యాణానంద భారతీస్వామి స్మృతులు - 8 (శ్రీవిద్యా చర్చ) "

14, జులై 2013, ఆదివారం

కల్యాణానంద భారతీస్వామి స్మృతులు-7 (శ్రీవిద్యా చర్చ)

ఇప్పటిదాకా సరదాగా తేలికమాటలు నడిచాయి.ఇక సీరియస్ గా అసలైన చర్చ మొదలు పెట్టక తప్పదని,సబ్జెక్ట్ లోకి దిగాలని అనుకున్నాను.

'సరే చెబుతాను వినండి.ఆమ్నాయములు ఊర్ధ్వ అధోమార్గములతో కూడిన చతుర్విధదిశల పేర్లతో షడామ్నాయములుగా ఉన్నవని మీకు తెలుసనుకుంటాను.తంత్రమూ,అందులో మళ్ళీ శ్రీవిద్యాతంత్రమూ వామాచారం,దక్షిణాచారం అని రెండు స్థూలమార్గాలుగా ఉన్నదని కూడా మీకు తెలుసును కదా?' అడిగాను.

'అవును.కొంత తెలుసు.మాది దక్షిణాచారం ' అన్నాడాయన.

సరే కానివ్వండి.'శ్రీవిద్యాస్త్రపరంపర' అనే పుస్తకంలోనూ ఇంకా అనేక వ్యాసాలలో మీ గురువుగారు వామాచారాన్ని తీవ్రంగా విమర్శించారు. బహుశా వామాచారం అంటే నింద్యములైన దూషితములైన ద్రవ్యములతో దురాచారపూరితముగా ఆచరింపబడే విధానమనీ,దక్షిణాచారం అంటే వేదోక్తమైన సదాచార విహితమైన ద్రవ్యములతోనూ పద్దతులతోనూ ఆచరింపబడే విధానం అనీ ఆయన ఉద్దేశ్యం అయి ఉండవచ్చు.అంతేనా?' అడిగాను.

'అంతే' అన్నాడాయన.

'తంత్రశాస్త్రములన్నీ పరమశివుని యొక్క సద్యోజాతాది పంచముఖముల నుండి పుట్టినవే కదా?మరి వామం నింద్యమైన మార్గం అయితే,అసలు ఆ మార్గం పరమేశ్వరుని ముఖత: ఎందుకు ఉద్భవించింది? పరమేశ్వరుని ముఖ స్పర్శ కలిగినది నింద్యం ఎలా అవుతుంది? 'వామదేవాయ నమో జ్యేష్టాయ...' అనే మంత్రముతో ఆయన్ని ఎందుకు పూజిస్తున్నాం?' అడిగాను.  

'సృష్టిలో అన్నీ ఉంటాయి.మంచి ఉన్నట్లే చెడు కూడా ఉంటుంది.కాని అది మనం ఎందుకు అనుసరించాలి?' అన్నాడాయన.

'మంచీ చెడూ అన్నది చాలావరకూ మన దృక్కోణాన్ని బట్టి ఉంటుందని ఇందాకటి నుంచి చెబుతూనే ఉన్నా కదా?పైగా మనం మాట్లాడుకుంటున్నది మామూలు మంచీచెడూ గురించి కాదు.సాధనా మార్గాల గురించి.వాటిలో అధికార భేదాలేగాని మంచీచెడూ ఎలా ఉంటాయి?' ప్రశ్నించాను.

'కావచ్చు.కాని వాటిని మనం అనుసరించవలసిన పని లేదుకదా?' అన్నాడు.

'మనం అనుసరించక పోయినంత మాత్రాన అది చెడనీ,మనం అనుసరించి నంత మాత్రాన అదే మంచి అనీ ఎలా చెప్పగలం?' మళ్ళీ ప్రశ్నించాను.

జవాబు లేదు.

'ఇంకొక విషయం వినండి.వామాచారం దుష్టమార్గం అని నేననుకోవడం లేదు.అర్ధనారీశ్వరతత్వంలో శక్తి వామభాగస్థ.శక్తిఉపాసకులైన శ్రీవిద్యా అనుష్టానపరులు శక్తికి ప్రతిరూపం అయిన వామమార్గాన్ని ఎలా ద్వేషించ గలరు? చెప్పండి.' అడిగాను.

జవాబు లేదు.

ఆయన ముఖం చూస్తే నా ప్రశ్నలవల్ల ఆయనలో కొంత ఆలోచన మొదలైందని అనిపించింది.

'వామాచారం యొక్క అసలైన అర్ధం శక్తిసాధన.అది శక్తిమార్గం.శక్తికి మంచీ చెడూ విచక్షణ ఉండదు.ఉదాహరణకి కరెంట్ ని తీసుకోండి.మీరనుకునే మంచీ చెడూ దానికి తెలియవు. అలాగే ప్రకృతిలోని ఏ శక్తినైనా తీసుకోండి.దానికి కూడా మంచీ చెడూ తెలియవు.ఆ స్పృహే దానికి ఉండదు.అది ప్యూర్ ఎనెర్జీగా ఉంటుంది.

ప్రపంచాన్ని శక్తి నడుపుతున్నది.శక్తిని ఉపాసించేవాడు వామాచారి అయి ఉండాలి.వేరు మార్గం లేదు.ఈ స్తితి నుంచి కొంచం కిందికి వస్తే అప్పుడు మీరన్న మంచీ చెడూ పోలరైజేషన్ జరుగుతుంది.కరెంట్ లో కూడా పాజిటివ్ నెగటివ్ ఉన్నట్లుగా అన్నమాట.వీటిలో మీరు పాజిటివ్ కరెంట్ ఒక్కటే కరెంట్ అంటున్నారు.నేను అది తప్పు అంటున్నాను.నెగటివ్ కూడా కరెంటే.అంతే కాదు.నెగటివ్ కరెంటే నిజానికి అసలైన కరెంట్ అని కూడా అంటున్నాను.అదే వామాచారం.

పంచపూజలలో 'వం' అమృతబీజం కదా.అంటే చనిపోయినవానిని బ్రతికించగల శక్తి.సమాధినిష్టుడైన పరమశివుని మనస్సులో కామాన్ని రగల్చాలని ప్రయత్నించి ఆయన మూడవకంటి చూపులో భస్మమైన కామునికి జాలితో తిరిగి జన్మనిచ్చినది ఈ శక్తియే.కనుకనే అమ్మవారిని 'హరనేత్రాగ్ని సందగ్ధ కామసంజీవనౌషధి:' అని కీర్తిస్తుంది లలితాసహస్ర నామం.అవునా?' అడిగాను.

'అవును'

అలాంటప్పుడు శక్తిని ఉపాసించే సాధకులు'వం'బీజాత్మకమైన వామాచారాన్ని ద్వేషించడం సమంజసమేనా?' అడిగాను.

'దీనికి ఏదైనా ప్రమాణం ఉన్నదా?' అడిగాడు.

'ఉన్నది.మీరు ప్రమాణాలు అడుగుతున్నారు.అవి విన్న తర్వాత వాటిని దాటవేసి మళ్ళీ మీ ధోరణిలోకి మీరు పోతున్నారు.ఇందాక భగవద్గీత లోనుంచి ప్రమాణం చెప్పాను.మీరు నమ్మలేదు.ఇలా అయితే నన్ను ప్రమాణాలు అడగడం ఎందుకు? పోనీ మీరడిగారు కనుక ఇప్పటికి చెబుతాను.ఇకమీదట ప్రమాణాలు అడగకండి.నాకిష్టంవస్తే చెప్తాను.కాని మీరడిగితే మాత్రం చెప్పను.' అన్నాను సీరియస్ గా.

'సరే అలాగే' అన్నాడాయన.

'ఉపాసనాక్రమౌ ద్వౌ మార్గౌ దృశ్యతే 
వామమార్గౌ దక్షిణ మార్గశ్చేతి'

అని ఉన్నదికదా.ఇది చెప్పినది 'సౌభాగ్య భాస్కరం' అనే లలితాభాష్యం వ్రాసిన భాస్కరరాయలు.కాని ఆయనను మీ స్వాములవారు పరమ చండాలమైన భాషలో తిట్టిపెట్టారు.ఆయన ఒక ఛండాలపు వామాచారి అని మీ స్వాములవారి నిరాధార నమ్మకం.ఆ విషయానికి తర్వాత వస్తాను. అలాగే "సామం పాడగలవాడే వైదికుడు.వామం తెలిసినవాడే తాంత్రికుడు." అనీ సామెత ఉన్నది. 

'శాక్తతంత్రాలలో కౌలాచారము,మిశ్రాచారము,సమయాచారము అని మూడు ఆచారాలున్నవి కదా.' అడిగాను. 

'అవును'

వీటిలో సమయాచారం ఒక్కటే మంచిదనీ మిగిలిన రెండూ పనికి రానివనీ మీ గురువుగారి అభిప్రాయం లాగా తోస్తున్నది.అలాగైతే అసలు ఆ రెండూ ఎందుకు పుట్టాయి? గీతలో గుణత్రయ విభాగయోగం మీరు చదివే ఉంటారు.అందులో,అధికారభేదాన్ని బట్టి సాత్విక రాజసిక తామసిక గుణాలు జీవిని దేహానికి ముడివేస్తాయని ఉన్నది.వాటి ప్రకారం ఆయా దేవతలను ఆయా మనుషులు పూజిస్తారని ఉన్నదికదా.ఈ మూడు ఆచారాలు కూడా అవే అని మీకు ఎప్పుడూ తోచలేదా?' అడిగాను.

జవాబు లేదు.

'అసలు విషయం వినండి.ప్రతి మనిషీ తానున్న స్తితినుంచే పైకి ఎదగగలడు.తామసిక స్తితిలో ఉన్న వ్యక్తి సాత్విక ఉపాసన చెయ్యలేడు.అతని స్వభావం దానిని తీవ్రంగా వ్యతిరేకిస్తుంది.అందులో ఇమడలేడు.నానా యాతనా పడతాడు.కనుక అతనికి అనువైన ఉపాసనను అతనికి ఇచ్చాయి మన శాస్త్రాలు.అతని స్వభావానికి సరిపడే ఉపాసన అతను మొదలు పెట్టాలి.క్రమేనా ఒక్కొక్క మెట్టుగా పైకేక్కుతూ సాత్విక ఉపాసనను చేరుకోవాలి.అదే ఆచరణాత్మకమైన మతం.' అన్నాను.

'ఆ విధంగా కౌలాచారంతో మొదలుపెట్టి మెట్టుమెట్టుగా ఎదిగిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? పంచమకార సాధనలో తాగుడుకీ మాంసం తినడానికీ సెక్స్ కీ అలవాటుపడి ఆ మెట్టుమీదే అందరూ ఆగిపోయేవారే గాని పైకి ఎదిగినవారు లేరుకదా?' అడిగాడు.

'లేదండి.చాలామంది ఉన్నారు.తంత్రసాధకులు బయటకు కనిపించరు. అక్కడిదాకా ఎందుకు?ఇన్నేళ్ళ సాధన కలిగిన మీరే,నేను చెప్పేవరకూ నన్ను గుర్తించలేకపోయారు.ఇలాగే ఉంటుంది.

వామాచారంలో కూడా పంచమకారాలను విధివిధాన సహితంగా కొద్ది కొద్దిగా మాత్రమె స్వీకరించాలనీ దానిని ఒక సాధనగా ఉపాసనగా గురువుయొక్క పర్యవేక్షణలో మాత్రమె ఆచరించాలనీ, తద్భిన్నంగా ఆశతో ఇంద్రియతృప్తి కోసం ఆబగా వాటిని స్వీకరిస్తే అది మహాపాతకమనీ సిద్ధిని ఇవ్వకపోగా మనిషిని పతితుడిని చేస్తుందనీ స్పష్టంగా చెప్పబడి ఉన్నది.

మీరన్న సాత్విక సమయాచారంలో కూడా, దాని పరమ ప్రయోజనం అయిన బ్రహ్మైక్యసిద్ధిని పొందినవారు ఎందరున్నారు?ఇంతవరకూ నాకు ఒక్కరు కూడా కనిపించలేదు.దక్షిణాచారపరులు నాకు చాలామంది తెలుసు.వారిలో అందరూకూడా-'అమ్మదయవల్ల మా అమ్మాయికి పెళ్లయింది,మా అబ్బాయికి ఉద్యోగం వచ్చింది,ఫలానా ఆవిడకి దయ్యం పడితే నేను మంత్రించి నీళ్ళు చల్లితే వదిలిపోయింది,ఫలానా ఆయనకీ నేను తీర్ధం ఇస్తే ఆయనకున్న కేన్సర్ రోగం తగ్గింది.ఫలానా వ్యక్తి కోర్టు కేసులో చిక్కుకుంటే నేను మహావిద్య పారాయణ చేస్తే అతను కేసు గెలిచాడు.ఇంకొకడికి చేతబడి జరిగితే నేను ఇంకేదో మంత్రం చదివి బూడిద పూస్తే అ చేతబడి చేసినవాడే చచ్చాడు.'-ఇలాంటి సోదిమాటలు చెప్పేవారే గాని, 'శ్రీవిద్యాసాధనవల్ల నాకు బ్రహ్మజ్ఞానం కలిగింది.నేను ద్వంద్వాలను అతిక్రమించి అనిర్వచనీయమైన అద్వితీయమైన పరబ్రహ్మానుభవాన్ని పొందాను.నేను జననమరణ చక్రాన్ని దాటాను.నాజన్మ ధన్యం అయింది'-అని చెప్పినవారుగాని,కనీసం ఆ స్థాయికి చేరినవారుగాని ఒక్కరూ నాకు కనిపించలేదు' చెప్పాను.

'అలాంటివారు కూడా బయటకు కనిపించరేమో మీరన్నట్లు.' అన్నాడు.

'కావచ్చు.కాని అలాంటివారిని నేను గుర్తు పట్టగలను.'చెప్పాను.

'ఎలా గురుతు పడతారు?' అడిగాడు.

'దానికి కొన్ని కిటుకులున్నాయి.దొంగని ఇంకో దొంగ వెంటనే గుర్తు పట్టగలడు.మాఫియాని ఇంకొక మాఫియావాడు వెంటనే పట్టేస్తాడు.అలాగే పోలీసుని పోలీసు వెంటనే గుర్తు పడతాడు.వాళ్లకు కొన్ని సంకేతాలుంటాయి. బయటవాళ్లకు అది అర్ధం కాదు.' అనిమాత్రం చెప్పాను.

'సరే మీరన్న దారిలోకే వస్తాను.ప్రయత్నం చెయ్యడం తప్పులేదు కదా? చేస్తూ ఉంటే ఎప్పటికో చేరుతాము' అన్నాడు.

'ఆ ప్రయత్నమే సక్రమమైన రీతిలో చెయ్యమని శాస్త్రాలు చెబుతున్నాయి. ఎవరికి వీలైన ఉపాసన వారు చెయ్యడమే సక్రమం. మీకు సరిపోయే ఉపాసన నేను చెయ్యడం అక్రమం.నా స్వభావానికి తగిన ఉపాసన నాకు సక్రమం.one man's meat is another man's poison' కదా.కనుక వామాచారం తప్పు కాదు.కౌలాచారం అంతకంటే తప్పు కాదు.ఆయా విధానాలు సరిపోయే వారికి అవి మంచివే.కనుక మీ గురువుగారు కౌలాచారాన్ని విమర్శించడం కరెక్ట్ కాదు.అంటే నేనింతకు ముందు చెప్పినట్లుగా ఆయనకు శ్రీవిద్యపైన పూర్తి అవగాహన లేదు.' చెప్పాను.

'చండాలమైన ఉపాసన ఎందుకు? మంచిదే చెయ్యవచ్చు కదా?' మళ్ళీ మొదటికి వచ్చాడాయన.

'అయ్యా.మంచి అంటే 'ఇది' అని మీరు ఒక నిశ్చితమైన అభిప్రాయాన్ని మీ మనసులో ఏర్పరచుకుని ఉన్నారు.కనుక మీరు దానిని దాటి చూడలేకపోతున్నారు.మీ మంచి నాకు మంచి కాకపోవచ్చు.' అన్నాను.

'పంచ మకారాలు ఉపయోగించే కౌలాచారం కరెక్ట్ ఎలా అవుతుంది?' మళ్ళీ అడిగాడు.

ఇక ఇలా లాభం లేదని అనిపించింది.

'సరే.శ్రీవిద్యోపాసకులుగా మీరు లలితా సహస్రనామాలు ప్రతిరోజూ జపిస్తారు కదా?' అడిగాను.

'అవును' అన్నాడాయన. 

'సరే.అందులోని కొన్ని నామాలకు అర్ధాలు నాకు తెలియడం లేదు.కొంచం వివరించండి' అంటూ ఈ క్రింది నామాలు వల్లించాను.

'కురుకుళ్ళా కులేశ్వరీ కుల కుండాలయా కౌలమార్గ తత్పర సేవితా'

'కులోత్తీర్ణా భగారాధ్యా మాయా మధుమతీ మహీ'

'కార్య కారణ నిర్ముక్తా కామకేళీ తరంగితా'

'యోనినిలయా కూటస్థా కులరూపిణీ'

'కౌళినీ కేవలానర్ఘ కైవల్య పదదాయినీ'

'కులామృతైక రసికా కులసంకేత పాలినీ'  

'మహాశక్తి ర్మహారతి:'

'రతిరూపా రతిప్రియా'

'మేధోనిష్టా మధుప్రీతా'

'కౌలినీ కులయోగినీ'

'సవ్యాపసవ్య మార్గస్థా'

ఆయన కొంచం సేపు ఆలోచించాడు.

'మా స్వాములవారు లలితా నామాలకు 'శ్రీకళ' అనే భాష్యం వ్రాశారు.అది చూడాలి.' అన్నాడు.

'తీరికగా దానిని తర్వాత చదువుకోండి.ప్రస్తుతానికి నేనడిగినది చెప్పండి.ఈ నామాలన్నీ శాక్తతంత్రం లోని కౌలమార్గానికి చెందినవే కదా?' అడిగాను.

'అవును'

'మరి లలితా సహస్రనామాలు కూడా కౌలమార్గాన్ని సమర్దిస్తున్నట్లా లేనట్లా?' అడిగాను.

'అంటే ఆయా నామాలకు గూడార్ధాలు ఉంటాయి.వాటినే మా స్వాములవారు తన భాష్యంలో వివరించారు' అన్నాడు.

'ఇదే మనతో వచ్చిన అసలైన చిక్కు.సంస్కృత భాషలో ఉన్న వెసులుబాటు కూడా అదే.అందులో ఒక్కొక్క పదానికి ఏభై అర్దాలుంటాయి.కనుక ఎవరి ఇష్టం వచ్చిన అర్ధాన్ని వారు స్వీకరించవచ్చు.వేదాలకు ఉపనిషత్తులకు భాష్యాలు కూడా ఇలాగే ఎవరిష్టం వచ్చినట్లు వారు వ్రాసుకున్నారు.లేకుంటే త్రిమతాచార్యులకు అవే ఉపనిషత్తులలో అవే మంత్రాలలో వారివారికి కావలసిన అర్ధాలే ఎలా కనిపించాయి?

చాదస్తులతో వచ్చిన చిక్కే ఇది.వారికి కొన్ని కొన్ని ఊహలు మనసులో స్థిరంగా ఉంటాయి.ఇక వాటికి అనుగుణంగా ప్రతిదాన్నీ దిద్దబోతారు. ఉన్నదాన్ని ఉన్నట్లు చూడలేరు.ఉదాహరణకు 'రతిప్రియా' అన్న నామాన్నే తీసుకుందాం.'మైధునమును ఇష్టపడేదానా' అని ఆ పదం యొక్క అర్ధం. అతిసంస్కారం ఎక్కువగా నిండిపోయిన మన కుళ్ళుమనస్సులకు ఈ అర్ధం పరమబూతుగా తోస్తుంది.కనుక దానిని వక్రీకరించి "జీవాత్మ పరమాత్మతో సంయోగం చెందటమే రతి అన్న పదానికి అసలైన అర్ధం.కనుక ఆ విధమైన సంయోగం అంటే ఇష్టం కలిగినదానా" అన్న అర్ధాన్ని మాత్రమె మనం చెబుతాం.లేదా 'రతీదేవికి ఇష్టమైనదానా' అన్న అర్ధం చెబుతాం. శరీరస్తాయిలో బూతు అయినది ఆత్మస్థాయిలో కాకుండా ఎలా పోతుంది? నేను మీ స్వాములవారి భాష్యం ఇంకా చదవలేదు.కాని అందులో ఈ పదాలకు ఇలాంటి అర్ధాలే చెప్పి ఉంటారని ఊహించగలను.' అన్నాను.

ఆయనేమీ మాట్లాడలేదు.

ఒక పదాన్ని ఉన్నది ఉన్నట్లుగా ఎందుకు మనం చూడలేక పోతున్నాం? 'రతిప్రియా'అన్న పదంలో మనకు బూతు ఎందుకు కనిపించాలి?దాన్ని దాటవేయ్యడానికి ఏదో గూడార్ధం ఎందుకు కల్పించి చెప్పాలి?ఆ పదం యొక్క అసలైన అర్ధాన్ని ఒప్పుకోలేనంత హిపోక్రసీ మనకెందుకు? రాసినవాళ్ళకు లేని బాధ చదివే మనకెందుకు?ఆడపిల్లలకు హరిప్రియ అనో శివప్రియ అనో విష్ణుప్రియ అనో పేర్లు పెడతారు.కాని రతిప్రియ అని ఎందుకు పెట్టరు? అదికూడా అమ్మవారి నామమే కదా.పైగా రోజూ మీరు పారాయణం చేస్తున్న నామమే.' అడిగాను.

జవాబు లేదు.

'ప్రాచీనుల మనస్సులు మనంత కుళ్ళిపోయినవి కావు.ఆరోజులలో ఉన్నదానిని ఉన్నట్లుగా చూచేవారు స్వీకరించేవారు.అందుకే మన దేవాలయాల మీద ఉండే సంభోగచిత్రాలు ఇప్పుడు మనకు బూతుగా కనిపిస్తాయి.కాని అప్పటివారికి మనకున్నంత ఛండాలపు దృష్టి లేదు.వారి దృష్టిలో అది తప్పుకాదు.ఖజురాహో శిల్పాలలోని కళాత్మకతను చూడలేని వారికే అవి బూతుగా కనిపిస్తాయి.సరియైన దృష్టితో చూడగలిగితే అవి అద్భుతమైన కళాఖండాలు.ఇంకా చెప్పాలంటే కామాన్ని ఒక శాస్త్రంగా మలచి యోగసూత్రాల వలె కామసూత్రాలు రచించిన ఘనత మన సొంతం.

'ఏమైనా బూతు బూతే గదండీ' అంటూ దీర్ఘం తీశాడాయన.

నాకు తిక్క రేగింది.

'అవునండీ.మనం చాలా మర్యాదస్తులమండీ.నక్కవినయాలు మన సొంతం కదండీ.రోజూ మీరు చూస్తున్న టీవీ ప్రోగ్రాములలో కనిపిస్తున్న పాటలూ, డాన్సులూ,యాంకర్ల కులుకులూ,బ్రోతల్ వేషాలూ ఏమిటండీ?ప్రతిరోజూ పొద్దుటినుంచీ అర్ధరాత్రి వరకూ ముసలయ్యలూ ముసలమ్మలతో సహా అందరూ చొంగకార్చుకుంటూ చూస్తున్న ప్రోగ్రాములలో ఉన్నది ఏమిటండీ?సినిమాలలోనూ,పత్రికలలోనూ,ఎఫ్ఫెం రేడియో పోసుకోలు మాటల్లోనూ ఎక్కడ చూచినా ఉన్నది ఏమిటండీ?అందులో మీకు బూతు కనిపించ లేదాండీ?ఒక్క దేవాలయాల మీదే కనిపించిందాండీ?బూతు బూతే అయితే పైన చెప్పిన నామాలలో ఉన్నది బూతు గాక నీతాండీ?వాటిని మీరు రోజూ భక్తిగా చదూతున్నారు కదండీ?అది బూతు కాదాండీ?' నేనూ ప్రతి పదానికీ దీర్ఘం తీశాను. 

ఆయన పకపకా నవ్వేశాడు.

'మీతో కష్టమేనండీ శర్మగారు' అని మాత్రం అన్నాడు.

'వినండి.నేను ఎన్నోసార్లు గమనించాను.ఆడవాళ్ళు అందరూ పధ్ధతిగా కూచుని లలితాసహస్ర నామాలు పెద్ద గొంతుతో అరుస్తూ పారాయణం చేస్తూ ఉంటారు.ఇలాంటి నామాలు వచ్చినప్పుడు మాత్రం చాలామంది అసంకల్పితంగా సౌండు తగ్గిస్తారు.లేదా చదివినట్లు ఊరకే పెదవులు ఆడిస్తారు, లేదా ఆ సమయానికి ఏదో దగ్గు వచ్చినట్లు నటించి ఆ నామం స్కిప్ చేసి తర్వాత నామాన్ని అందరితో కలిసి అందుకుంటారు.అందుకే అలాంటి నామాలు వచ్చినప్పుడు ఉన్నట్టుండి పారాయణం హోరు తగ్గిపోతుంది.నిజమా కాదా?' అడిగాను.

'అందరూ సౌండు తగ్గించరు.కొందరే తగ్గిస్తారు'నవ్వుతూ ఒప్పుకున్నా డాయన.

'ఆ కొందరూ ఎవరంటే ఆయా పదాలకు ప్రతిపదార్ధాలు తెలిసినవారు.అర్ధాల గోల లేనివారు గబగబా చదువుకుంటూ వెళ్ళిపోతారు.వారితో సమస్య లేదు. మిడిమిడి జ్ఞానం ఉన్నవారూ,హిపోక్రసీతో నిండినవారూ మాత్రం ఆ సమయానికి అలా గొంతులు తగ్గిస్తారు.దొంగచూపులు కూడా చూస్తారు.' చెప్పాను.

'నిజమే.' నవ్వుతూ అన్నాడాయన.

లలితాసహస్రనామాలు తంత్రశాస్త్రానికి చెందినవి.అష్టపాశాలైన కామం,క్రోధం, అసూయ,అజ్ఞానం,ఆశ,సిగ్గు,భయం,జుగుప్సవంటి వాటిని మన మనస్సుల లోనుంచి పెకలించి అవతల పారవేయ్యడమే తంత్రం యొక్క ప్రధానసూత్రం.

వీటినే జాతి,కుల,శీల,ఘ్రుణ,లజ్జా,భయ,జుగుప్సా,క్రోదాలని కూడా అంటారు. ప్రతివాడినీ ఈ అష్టపాశాలు పట్టుకుని పీడిస్తూ ఉంటాయి.వీటిని వదిలించు కోవడమే వామాచారంలో ప్రధానం.అలాంటి తాంత్రికస్తోత్రాలు చదువుతూ అవి 'వద్దు' అని చెబుతున్న వాటినే మనస్సులో గట్టిగా అంటి పెట్టుకుంటే ఆయాస్తోత్రాల ఫలితం ఎలా వస్తుంది?' అడిగాను.

'మీ భావాలు చాలా విప్లవాత్మకంగా ఉన్నాయండి' అన్నాడాయన.

'కాదు సార్.సత్యాత్మకంగా ఉన్నాయని చెప్పండి.ఎందుకంటే నా పేరులోనే సత్యం ఉన్నది' నేనూ నవ్వుతూ చెప్పాను.

(మిగతాది తరువాతి భాగంలో)
read more " కల్యాణానంద భారతీస్వామి స్మృతులు-7 (శ్రీవిద్యా చర్చ) "

13, జులై 2013, శనివారం

కల్యాణానంద భారతీస్వామి స్మృతులు-6(From their fruits,you shall know them)

'ఏదేమైనా ఈ విషయం మామూలు మనుష్యులకు మింగుడు పడటం కొంచం కష్టమే శర్మగారు.' అన్నాడాయన.

'అవును.నిజమే.పోనీ మన శాస్త్రాలనుంచి ప్రమాణం చూపిస్తే అప్పుడు ఒప్పుకుంటారా?' అడిగాను.

తలూపాడు.

'ఉదాహరణకి భగవద్గీతనే తీసుకోండి.గీత ఉపనిషత్సారం కదా.అందుకే దీనిని గీతోపనిషత్ అని కూడా అంటారు.అందులోని ఈ శ్లోకం యొక్క అర్ధం చెప్పండి.'అంటూ శ్లోకాన్ని ఉదహరించాను.

యస్య నాహం కృతో భావో బుద్ధిర్యస్య న లిప్యతే 
హత్వాపి స ఇమాన్ లోకాన్నహంతి న నిబధ్యతే 

ఆయన కొంచం ఆశ్చర్యంగా చూచాడు.

'మీరే చెప్పండి.అయినా మీకు సంస్కృతం రాదన్నారు కదా.శ్లోకాలు ఎలా గుర్తుంటాయి?' అన్నాడు.

'ఏమో నాకు తెలీదు.దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం.అదలా ఉంచండి.ప్రస్తుతానికి ఈ శ్లోకం యొక్క అర్ధం వినండి.ఎవని బుద్ధి అహంస్పర్శతో కలుషితం కాదో అతడు లోకంలోని అందరినీ చంపినా సరే ఎవరినీ చంపనివాడే అవుతున్నాడు.అతనికి ఆ హత్యాదోషం ఎంతమాత్రమూ అంటదు.'అని గీతాశ్లోకం చెబుతున్నది. దీనికేమంటారు?' అడిగాను.

ఆయనేమీ మాట్లాడలేదు.

'ఇంకా వినండి.కౌషీతకీ ఉపనిషత్తులోనూ,చాందోగ్యోపనిషత్తులోనూ ఇంకా మీరు ఆశ్చర్యపోయే అనేక నిజాలున్నాయి.వాటిలోని శ్లోకాల ప్రకారం 'జ్ఞాని తన తల్లిదండ్రులను తానే చంపినా,దొంగతనం చేసినా,భ్రూణహత్య చేసినా, లేక వ్యభిచారి అయినా కూడా అతనికి ఏ పాపమూ అంటదు.అసలు వాటి స్పృహే అతనికి ఉండదు.ఆ పాపాల ఫలితాన్ని అతడు ఏమాత్రమూ అనుభవించడు.' అని ఉన్నది.మీ స్వాములవారు శృంగేరీ సంప్రదాయపు స్వాములే కదా.ఈ సంప్రదాయపు అత్యంత మహనీయుడూ విజయనగర సామ్రాజ్యపు రాజగురువూ అయిన విద్యారణ్యస్వామి రచించిన 'వేదాంత పంచదశి' ఎనిమిదో అధ్యాయంలో బ్రహ్మజ్ఞాని యొక్క స్తితిని వర్ణిస్తూ ఈ విషయాలన్ని వివరంగా వ్రాశారు.ఒకసారి చూడండి' అన్నాను.  

'అంటే ఈ ఛండాలపు పనులన్నీ జ్ఞాని చేస్తాడని మీ ఉద్దేశ్యమా?' ఆయన అడిగాడు.

నవ్వాను.

'కాదు.జ్ఞాని వరకూ ఎందుకు? కొద్దిపాటి సంస్కారం ఉన్నవాడే ఇలాంటి పనులను అసహ్యించుకుంటాడు.కాని ఇక్కడ విషయం ఏమంటే,జ్ఞాని అయినవాడు ఒకవేళ ఇటువంటి పనులు చెయ్యవలసి వచ్చినా కూడా,ఒకవేళ చేసినా కూడా,ఆ పాపాలు అతన్ని ఏమీ అంటలేవు.జ్ఞాని ఎవరెస్ట్ శిఖరం వంటివాడు.అది ఎప్పుడూ ఉజ్జ్వలమైన సూర్యరశ్మిలో స్నానం చేస్తూ ఉంటుంది.దానిపైన కూడా కొన్ని సార్లు వర్షం కురవవచ్చు. ఆ వర్షానికి అది కూడా తడవవచ్చు.కాని ఆ నీరు అక్కడ ఏమాత్రం నిలబడలేదు.పడిన నీరు పడినట్లు పల్లానికి జారిపోతుంది.చివరికి అక్కడ తడి అంటూ ఏమీ మిగలదు.ఆ వర్షం తర్వాత అది ఇంకా ఉజ్జ్వలంగా ప్రకాశిస్తుంది.జ్ఞాని స్తితి కూడా ఇలాంటిదే.అతని యొక్క అత్యున్నతమైన అనూహ్యమైన స్తితిని మనం కొద్దిగానైనా అర్ధం చేసుకోవడానికి చెప్పబడిన శ్లోకాలే ఇవి. అంతేగాని,ప్రతివారినీ నిస్సిగ్గుగా ఈ పనులు చెయ్యమని వాటి ఉద్దేశ్యం కాదు.' చెప్పాను.

'ప్రతి వెధవా ఈ పనులు చేసి నేను జ్ఞానిని అంటూ దాక్కోవచ్చు కదా?' అన్నాడాయన.

నాకు మళ్ళీ నవ్వొచ్చింది.

'అయ్యా.నేను చెబుతున్నది నిజమైన జ్ఞానియొక్క స్తితిని గురించి.వెధవల గురించి కాదు.మన చుట్టూ దొంగనోట్లు చెలామణీలో ఉన్నంత మాత్రాన అసలు కరెన్సీయే లేదని ఎలా అనుకుంటాం?మీరు చెప్పిన వెధవలు అన్ని చోట్లా ఉంటారు.ఎవరెలా దాక్కున్నా,ఎవరిఖర్మ వారిని వదలకుండా పట్టి పీడిస్తుంది.అది అనుభవించేటప్పుడు మనిషి యొక్క నిజస్వరూపం బయటకి వస్తుంది.మనుషుల నుంచి దాక్కోవచ్చు.చేసిన కర్మనుంచి ఎలా దాక్కోగలం?అది సాధ్యం కాదు.నాణెం నిజమైనదా కాదా చూడాలంటే వేలితో చిటికెవేసి దానిని పైకి ఎగురగొట్టి చూడాలని రామకృష్ణులు అనేవారు. అప్పుడు 'టంగ్' మంటూ అసలైన చప్పుడువస్తే అది అసలైన నాణెం అని,లేకుంటే దొంగనాణెం అని అర్ధం.అలాగే వేషాలు వేసేటప్పుడు ఎలా ఉన్నా,ఫలితాలు అనుభవించే సమయంలో ఎవరు ఎవరన్నది తేటతెల్లంగా తెలిసిపోతుంది.

వెధవలు ఎప్పటికీ జ్ఞానులు కాలేరు.ఒకవేళ వారు జ్ఞానుల్లా నటించినా వారికి ఎన్నటికీ జ్ఞానం అనేది అందదు.జ్ఞాని వెధవపనులు చెయ్యడు.ఒకవేళ సరదాకో ఇంకా దేనికో వాటిని చెయ్యవలసి వచ్చినా వాటివల్ల అతని జ్ఞానస్తితికి భంగం అంటూ ఉండదు.ఇక్కడ అర్ధం చేసుకోవలసిన విషయం ఏమంటే,కర్మలను బట్టి లోకులను అర్ధం చేసుకోగలం.కాని జ్ఞానులను అలా అర్ధం చేసుకోలేము.వారు కర్మాతీతులు.వారిని తెలుసుకోవడానికి కర్మల కొలబద్ద సరిపోదు.' అన్నాను.   

'జ్ఞానికి సరదా ఏమిటి? ఆయనకీ సరదాలుంటాయా?అదెలా కుదురుతుంది?' అడిగాడాయన.పాపం ఆయనకు ఇంకా ఏదో సందేహం పీడిస్తూనే ఉన్నది. 

'ఉంటాయి.కాని మనకున్న సరదాలూ పరదాలూ ఆయనకు ఉండవు.అసలు దీనిలో అంతగా ఆశ్చర్యపోవలసిన వింత అంటూ ఏముంది?నిజం చెప్పాలంటే,జ్ఞాని ఒక్కడే లోకాన్ని సరదాగా ఎంజాయ్ చెయ్యగలడు. ఎందుకంటే, నిజానికి ఇక్కడేమీ లేదని ఇదంతా ఒక ఆట అని,ఇక్కడ పొందేదీ కోల్పోయేదీ ఏమీ లేదని అతనికి స్పష్టంగా తెలుసు.కనుక ఏ భయమూ లేకుండా సరదాగా జీవితాన్ని నవ్వుతూ గడపగలడు.కనుక అతను సరదాకోసం కొన్నిసార్లు ఇతరులమీద ప్రాక్టికల్ జోక్స్ కూడా వెయ్యవచ్చు.ఏ మహనీయుడి జీవితాన్ని చూచినా నేనన్నది నిజమని మీరు గ్రహిస్తారు.కృష్ణుని జీవితమే దీనికి పరమ ప్రమాణం.' చెప్పాను.

'దీనికి కూడా శాస్త్త్ర ప్రమాణం ఉన్నదా?' అడిగాడాయన.

'ఎందుకు లేదు? జ్ఞానులైనవారు 'బాలోన్మత్త పిశాచవత్',చిన్నపిల్లలవలె ప్రవర్తిస్తారనీ,కొన్నిసార్లు పిచ్చిపుట్టిన వారివలె,పిశాచాలవలె సంచరిస్తారని శాస్త్రాలు చెబుతున్నాయి.ఉదాహరణకి దత్తాత్రేయ వజ్రకవచం చూడండి. "కదాయోగీ కదాభోగీ కదానగ్న: పిశాచవత్ దత్తాత్రేయో హరి: స్సాక్షాత్ భుక్తి ముక్తి ప్రదాయక: బాలోన్మత్త పిశాచీభి:క్వచిద్ యుక్త పరీక్షిత:త్యాగీ భోగీ మహాయోగీ నిత్యానందో నిరంజన:" అని ఉంటుంది.దత్తాత్రేయ ఉపనిషత్ కూడా ఆయనను 'బాలోన్మత్త పిశాచ వేషాయ' అంటూ పిలుస్తుంది. 

"బాలుడు త్రిగుణాలకు అతీతుడు కనుక అతనికి ఏ బంధమూ అంటదు.ఏ పాపమూ అంటదు.' అని రామకృష్ణులు కూడా అన్నారు. 

'మీరెన్ని చెప్పినా సరే. జ్ఞాని అయినవాడు ఇలాంటి పనులు అసలు ఎందుకు చేస్తాడో నేను అర్ధం చేసుకోలేక పోతున్నాను.ఎక్కడో ఏదో తేడా ఉన్నది.నాకు సరిగ్గా అర్ధం కావడం లేదు.' అన్నాడాయన.

ఆయన చాదస్తానికి నాకు మళ్ళీ నవ్వొచ్చింది.

'పోనీ జీసస్ చెప్పిన మాట ఒకటి చెబుతాను.వినండి.అప్పుడైనా మీకు అర్ధమౌతుందేమో చూద్దాం.From their fruits,you shall know them అన్నాడు జీసస్.ఒక చెట్టు మంచిదా కాదా అనే విషయం దాని ఫలాల నుంచే మీకు అర్ధమౌతుంది.అన్నాడు. అఫ్కోర్స్ అదికూడా మన గ్రంధాలలో కాపీ కొట్టినదే. మీరన్నట్లు ఒకడు వెధవా లేక నిజమైన జ్ఞానియా అనేది అతనితో మీరు కాసేపు మాట్లాడితే తెలిసిపోతుంది.' అన్నాను.  

'మనం చర్చిస్తున్న విషయానికీ జీసస్ చెప్పిన సూక్తికీ సంబంధం ఏమున్నది?' అన్నాడు.

'పోనీ మీకలా అనిపిస్తే వదిలెయ్యండి.సమస్యేమీ లేదు.కాని ఒక్క విషయం వినండి.జ్ఞాని మనకంటే చాలా ఉన్నతమైన మానసిక స్తితిలో ఉంటాడు. అతని స్తితి మనకెలా అర్ధం అవుతుంది?ఒక స్పూనుతో పెద్ద చెరువులోని నీటిని ఎలా కొలవగలం? మన మనస్సులు అనే పంజరంలో కూచుని చూస్తున్నంతవరకూ అతను అర్ధం కాడు.మన ఆలోచనల పరిధిలో మనం ఉంటూ అతన్ని అర్ధం చేసుకోవడం అసాధ్యం.ఆ పరిధి దాటి బయటకు వచ్చె విద్య మీకు తెలిస్తే అప్పుడు మీరాపని సులభంగా చెయ్యగలుగుతారు.కనుక మీ గురువుగారు వాడిన భాషను బట్టి ఆయన యొక్క జ్ఞానాన్ని మీరు అంచనా వెయ్యకండి.దానివల్ల ఆయన స్తితికి ఏమీ తక్కువ కాదు.'

'ఇంతకు ముందు కూడా ఇదే చెప్పాను.మనకు జ్ఞాని అంటేనో లేక ఒక మహానీయుడంటేనో కొన్ని అభిప్రాయాలుంటాయి.ఆ కళ్ళద్దాలలోనుంచే మనం చూస్తూ ఉంటాం.కనుక మన అద్దాలరంగులోనే విషయం కూడా మనకు కనిపిస్తుంది.అతను ఏ పనులు చెయ్యాలో ఏవి చెయ్యకూడదో నిర్ణయించడానికి మనం ఎవరం? మన కళ్ళద్దాలు తీసి చూస్తే విషయం ఉన్నది ఉన్నట్లు కనిపిస్తుంది.కాని ఆపని చాలా కష్టం.' అన్నాను.

అప్పటికి సమయం రాత్రి ఎనిమిది దాటింది.

'విషయం ఏదో కాస్త అర్ధం అయినట్లే అనిపిస్తున్నది.మళ్ళీ పూర్తిగా అర్ధం కానట్టూ అనిపిస్తున్నది.ఏదేమైనా మా గురువుగారి మీద సందేహమూ మీరే కలిగించారు.మళ్ళీ దానిని పోగొట్టడం కూడా మీరే పోగొట్టారు.చాలా సంతోషం.' అన్నాడాయన.

విషయం ఈయనకు పూర్తిగా అర్ధం కాలేదనీ,ఊరకే నాతృప్తి కోసం ఆయన అలా అంటున్నాడనీ నాకు అర్ధమైంది.ఇంత చెప్పినా అర్ధం చేసుకోకుండా చాదస్తంగా మాట్లాడుతుంటే,లేట్ అయితే అయింది,కొంచంసేపు ఈయనను ఆట పట్టిద్దామని అనుకున్నా.

'అప్పుడే ఏమైంది? ఇంకా వినండి.మీ గురువుగారికి అంతా చాదస్తమే గాని శ్రీవిద్య అంటే పూర్తి అవగాహన ఆయనకు లేదు.' అన్నాను.

ఆయన మళ్ళీ నిర్ఘాంత పోయాడు.

'ఇదేంటి శర్మగారు?కాసేపు అలా చెప్తారు.కాసేపు ఇలా చెప్తారు.ఏంటి ఇదంతా?అసలు మీరేం చెప్పాలనుకుంటున్నారో స్పష్టంగా చెప్పండి.' అడిగాడు అయోమయంగా.

ఆయన అయోమయం చూచి నాకు భలే నవ్వొచ్చింది.

'ఉండండి.చెబుతాను.' అంటూ మొదలు పెట్టాను.

(మిగతాది తరువాతి భాగంలో)..
read more " కల్యాణానంద భారతీస్వామి స్మృతులు-6(From their fruits,you shall know them) "

11, జులై 2013, గురువారం

మానవుని అహంకారం-మరికొన్ని పద్యములు

ఈరోజు ఆశువుగా వచ్చిన కొన్ని పద్యాలు ఇక్కడ ఇస్తున్నాను.'కందం చెప్పగలవాడే కవి' అన్న సామెత వల్లనో ఏమో చాలావరకూ కందపద్యాలే పలికాయి.చివరలో రెండు మాత్రం ఆటవెలది పద్యాలు.అర్ధం సులభగ్రాహ్యమే అయినప్పటికీ ఒక మిత్రురాలి విజ్ఞప్తి మేరకు దానిని కూడా వ్రాశాను.

1.
అహమున జిక్కిన మనుజుల
బహుపూజల ఫలితమెల్ల బూదిని గలియున్  
ఇహపరముల జెడిపోదురు
మహనీయత నందబోరు మహిలో సత్యా

అహంతో విర్రవీగే మనుషులు ఎన్నెన్ని పూజలు చేసినా వారికి ఫలితం అంటూ ఏమీ ఉండదు.వాటి ఫలితం అంతా బూడిదలో కలిసిపోతుంది. అహంకారులు ఇహంలోనూ పరంలోనూ కూడా ఏమీ సాధించలేరు. మహనీయులు కాలేరు.

2.
యాత్రలు కల్లలు వినుమా
పాత్రత లేనట్టి పాట్లు పాడగు వెతలున్
గాత్రమ్మున శుద్ధి మరచి
ఆత్రమ్ముగ పాడబోవు యాతన సత్యా

అహంకారంతో యాత్రలు చెయ్యడం వృధాప్రయాస.పాత్రతను బట్టి మనకు ఫలం దక్కుతుంది గాని,అది లేకపోతే మనం పడే పాట్లన్నీ చివరికి ఏమీ ఫలితాన్ని ఇవ్వలేక అగచాట్లుగా మారతాయి.పాత్రత లేకుండా యాత్రలు చేసేవారు గాత్రశుద్ది లేకుండా గానం చెయ్యాలని ఆశపడే ఆత్రగాళ్ళ మాదిరి ఉంటారు.

3.
సతులందరు మాయయనెడి
సుతులందరు ఋణము లనెడి సత్యము వినుమా
మితిమీరిన యాశ విడచి
మతిచెదరని యోగనిష్ట మరుగర సత్యా

భార్యాపిల్లలు బంధువులు స్నేహితులు ఋణానుబంధాలన్న సంగతి గ్రహించు.ఆశను బొత్తిగా విడచిపెట్టు.స్థిరమైన మనస్సుతో యోగనిష్టుడవై ఉండు.

4.
ఆశల రుచులను మరగుచు
పాశంబుల బద్ధుడౌచు పడియుండు నరున్
ఆశల బాపును కర్మము 
పాశంబుల దీర్చు మిత్తి పరుగున సత్యా

ఆశల రుచిని మరగి,అష్టపాశములలో చిక్కి కదలలేని మనుష్యులకు వారివారి కర్మమే బుద్ధి గరపుతుంది.చివరకు మరణమే వారి బంధాలను విడదీస్తుంది.

5.
అహమున జిక్కెను సర్వము
అహరహమును నందులోనె యమరుచు నడచున్ 
అహమన్న మిధ్య జూడగ 
ఇహమందున నిదియె వింత నెరుగర సత్యా 

లోకం మొత్తం 'అహం' అనే ఉచ్చులో చిక్కి నిత్యమూ అందులోనే అఘోరిస్తూ ఉన్నది.ఇంతా చూస్తె 'అహం' అనేది అసలు లేనేలేదు.అదొక ఎండమావి. ప్రపంచంలో ఇదే పెద్ద వింత.దీనిని మించిన వింత లేనేలేదు.

6.
ఇహమందున పరమందున
అహమే యసలైన శత్రువనుటను వినుమా
అహమంత విచ్చిపోవగ
అహమే మిగులును జివరకు ననువుగ సత్యా

ఈలోకంలోగాని పరలోకంలోగాని మనిషికి అహంకారమే అతి పెద్ద శత్రువు. ఈ అహంకారం మొత్తం నాశనమైతే చివరికి సత్యమైన తానే మిగులుతాడు.

7.
ఒరులెవ్వరు లేరిచ్చట 
పరులను మదినెంచి జూడ పాపము గలుగున్ 
గురిగా జూచెడి చూపున 
సరియగు యాత్మగనె దోచు సర్వము సత్యా

ఈ ప్రపంచంలో పరాయివారంటూ ఎవ్వరూ లేరు.పరులు అనుకోవడం పాపమే.గురిగా సరిగా చూచితే సర్వం ఆత్మమయంగానే కనిపిస్తుంది.

8.
యమ నియమపు నీమమ్ముల
సమయోచితముగ దెలియుచు సాధన రీతుల్
అమనస్కపు మార్గమ్మున
విమలాత్మను బొంది జూడు వింతను సత్యా

యమనియమాది విధులను చక్కగా పాటిస్తూ,సాధనా రీతులను సరిగ్గా అనుసరిస్తూ, అమనస్క యోగాన్ని సాధించి,కల్మషం లేని ఆత్మను అనుభవంలో పొంది, అప్పుడు కనిపించే అసలైన వింతను చూడాలి.

9.
ఒడలంతయు బూదినలది 
మడిగట్టుక బూజ సేయు మనుజుని మదిలో .
దడవుచు వాసనలుండిన
అడుగున బురదల చెరువగు నతడిక సత్యా

ఒకడు ఒళ్లంతా బూడిద పూసుకుని మడి కట్టుకుని పూజలు చేసినా,అతని అంతరంగంలో వాసనలు ఉంటే ఆ పూజల ఫలితం సున్నాయే.అడుగున బురద ఉంచుకుని పైపైన మాత్రం మంచి నీరు కలిగిఉండే చెరువు మాదిరి ఈ వ్యవహారం ఉంటుంది.

10.
లోకాచారము లెల్లను
నాకటముగ మీరవలయు నీభువి యందున్
లోకుల మాటలు జూడగ
వాకిట దివ్వెలు కడమను జీకటి సత్యా 

సాధకులు లోకాన్ని ఎప్పుడూ లెక్క చెయ్యకూడదు.దానిని సునాయాసంగా అధిగమించాలి.కారణం ఏమంటే,వాకిటిలో మాత్రం దీపం ఉండి,ఇంటి లోపల అంతా చీకటి ఉన్నట్లుగా లోకుల మాటలు ఉంటాయి.అవి పైపై పూతలు. కనుక వాటిని లెక్కించ పనిలేదు.

11.
వదరుబోతులెల్ల నొకచోట గుమిగూడి 
శాస్త్ర చర్చయనుచు సాగదీయ 
ఎవనికైనగాని యనుభవమ్మది లేక
రచ్చ యగును గాని రక్తి నిడదు

అనుభవం లేని వాగుడుకాయలందరూ ఒకచోట చేరి శాస్త్రచర్చ చెయ్యబోతే అది చివరికి రచ్చ అవడమే గాని ఫలితం ఉండదు.ఏకాభిప్రాయమూ రాదు.

12.
తిండి కొరకు నేల దిరిగేటి జీవుండు
మూడునాళ్ళ కొరకు మోహమంది
తానె ఘనుడ నంచు తైతక్క లాడంగ
పంచభూత చయము పక్కుమనియె

ప్రపంచంలో ఎంతటి మానవుడైనా విర్రవీగవలసిన అవసరం ఏమాత్రమూ  లేదు.ఎందుకంటే,ప్రతి మనిషీ బతుకుతున్నది తిండికోసం మాత్రమే.తినితిని చివరికి చావడం తప్ప ఇక్కడ ఎవరైనా ఉద్దరిస్తున్నది ఏమీలేదు. ఒకవేళ ఎవడైనా అలా అహంకరిస్తే పంచభూతాలు వాడిని చూచి పక్కుమని నవ్వుతాయి.ఎందుకంటే,వాటి కళ్ళముందు ఇలాంటి అల్పులైన నరులు కోటానుకోట్లు గతించారు.అవి శాశ్వతములు.మానవులు కాదు.
read more " మానవుని అహంకారం-మరికొన్ని పద్యములు "