“అసమర్ధజాతికి ఆత్మగౌరవ అర్హత ఉండదు"

30, డిసెంబర్ 2012, ఆదివారం

డిల్లీ గ్యాంగ్ రేప్ కేసు-కొన్ని ఆలోచనలు-3

అమ్మాయిల అసభ్య వస్త్రధారణ వల్లే ఈ నేరాలు జరుగుతున్నాయని నా ఉద్దేశం కానేకాదు.కాని ఇది కూడా ఈ రకమైన ఘోరాలకు ఒక కారణం అవుతుంది అన్నది వాస్తవం.నిజానికి ఈ అమ్మాయి ఆరోజున అలాంటి బట్టలు వేసుకుని లేదు.సమయం అర్ధరాత్రి కూడా కాదు.తను బారుకో పబ్బుకో పోయి రావడం లేదు.సినిమా చూచి రాత్రి తొమ్మిది గంటల సమయంలో ఇంటికి పోతున్నది.అది తప్పెలా అవుతుంది?

ఆ సమయంలో ఆ బస్సులో ఉన్న నిందితులు ఒక అమ్మాయి కోసం చూస్తున్నారు.అంతే.ఈ అమ్మాయి ఖర్మకాలి ఆ బస్సులో తన స్నేహితునితో కలిసి ఎక్కింది.అంతేగాని అది ఆ అమ్మాయి వస్త్రధారణ తప్పు కాదు.ఆ సమయంలో ఇంకే అమ్మాయి ఆ బస్సులో ఎక్కినా అదే జరిగి ఉండేది.

కనుక అసలు సమస్య వస్త్రధారణలో లేదు.నేరాలను సమర్ధవంతంగా నివారించే వ్యవస్థ మనకు లేదు.చట్టం అంటే ఎవరికీ భయం లేదు.అదీ అసలు సమస్య.'ఏ నేరం చేసినా ఈ దేశంలో ఏమీ కాదు.ఏదో రకంగా తప్పించుకోవచ్చు' అన్న ధీమాను మనం గత 60 ఏళ్ళుగా ప్రజలలో పెంచి పోషించాం. ఇదీ అసలు సమస్య. కనుకనే 'మాకు రక్షణ కావాలి' అని శాంతియుతంగా డిల్లీలో ప్రదర్శన చేస్తున్న దేశ ప్రజల చుట్టూ 10 కంపెనీల పోలీస్ ఫోర్స్ ను మోహరించవలసి వచ్చింది. ఇది ఈ శతాబ్దపు వింతల్లో ప్రముఖంగా చెప్పుకోదగిన వింత అని చెప్పవచ్చు.

ప్రజలలో చట్టం అంటే భయం లేకుండా పోవడానికి అవినీతి రాజకీయులూ, అవినీతి అధికారులే కారణం.ప్రతి కేసునూ నీరుగారుస్తూ, వాళ్ళ వాళ్ళను శిక్ష పడకుండా తప్పిస్తూ,న్యాయవ్యవస్థ అంటేనే,పోలీస్ వ్యవస్థ అంటేనే ప్రజల్లో అపనమ్మకమూ అసహ్యమూ కలిగేలా గత 60 ఏళ్ళ మన స్వాతంత్ర్య చరిత్ర సాగడానికి కారణం వీరిద్దరే.ఈ సమిష్టి పాపం వీరిమీదే ఉన్నది. 

మనది కాపీ రాజ్యాంగం.కాపీ పీనల్ కోడ్.కాపీ వ్యవస్థ.మన దేశ సమస్యలకు మౌలికంగా ఉపయోగపడే విషయాలు వీటిలో ఎక్కడా లేవు.అందులోనూ వీటికి అతుకుల బొంతలా అనేక చిల్లులు.ఒక న్యాయశాస్త్ర పట్టభద్రుడిగా నేను ఈ విషయం నమ్మకంగా చెప్పగలను.ఇక న్యాయం ఈ దేశంలో ఎలా బతుకుతుంది? ప్రస్తుతం నిందితులు పట్టుబడ్డారు అని చెబుతున్నారు. ఇలాంటి ఎన్నో కేసుల్లో గత అనుభవాల దృష్ట్యా ఇక్కడ ఏమి జరుగబోతున్నదో కొంచం ఆలోచిద్దాం. 

1.అసలు నిందితులు వీరో లేక ఎవరో అనామకులను తెచ్చి వీరే నిందితులని చూపుతున్నారో ఎవరికీ తెలియదు.అమ్మాయి స్నేహితుడు వారిని గుర్తుపట్టాడు అని మీడియాలో చెబుతున్నప్పటికీ, ఈ దేశపు పోలీసుల/న్యాయవ్యవస్థ యొక్క గతచరిత్రను బట్టి ఇలాంటి అనుమానం రాక తప్పదు. ఈ అనుమానం హాస్యాస్పదం గా కనిపించినప్పటికీ,మన వ్యవస్తలమీద  ఉన్న మన అపనమ్మకం వల్ల అలా ఆలోచించడం తప్పు కాదు. 

2.ఒకవేళ వీరే అసలు నిందితులు అనుకుందాం.పౌరుల ఆందోళనను ఇంతటితో ఆపితే మాత్రం ఈ క్షణం నుంచీ వీరిని కాపాడే ప్రక్రియ మొదలౌతుంది.ఇది మనం గత ఎన్నో కేసుల్లో చూచాం.వారు గనక 'కొన్ని' కులాలకు చెందిన వారైతే సమాజంలో అనేక వర్గాలు వీరిని కాపాడేందుకు హటాత్తుగా ముందుకొస్తాయి.

3.వీరిపైన మోపిన సెక్షన్ల ప్రకారం వీరికి ఉరి శిక్ష పడే అవకాశం లేదు. మహా అయితే యావజ్జీవశిక్ష పడుతుంది.అంటే ఒక పదేళ్ళ తర్వాత ఏదో కారణంతో వారు విడుదలై బయటకు వస్తారు. ప్రస్తుతం వీరంతా 20 ఏళ్ళ వారని అంటున్నారు గనుక అప్పటికి వారికి మహా అయితే 35 ఏళ్ళు వస్తాయి.ఈ అనుభవంతో వాళ్ళు మరీ రాటుదేలి,ఈసారి పట్టు బడకుండా ఎలా నేరాలు చెయ్యచ్చో చేసి చూపిస్తారు. అంటే మళ్ళీ ఒక 15 ఏళ్ళ తర్వాత ఇంకో కొందరు నిర్భయలు బలై పోతారు.ఇలాంటి కేసుల్లో శిక్ష పడి బయటకి వచ్చినవారు ఇంకా కసితో మరిన్ని నేరాలు చేస్తారనీ, రెండో సారి పట్టుబడకుండా తెలివిగా చేస్తారనీ గణాంకాలూ,చరిత్రా,మనస్తత్వ శాస్త్రమూ చెబుతున్నాయి.

4. ఒకవేళ వీరికి ఉరిశిక్ష పడింది అనుకుందాం.వెంటనే కొన్ని సంఘాలు ముఖ్యంగా ఆయా నేరస్తుల కులసంఘాలు తలెత్తుతాయి. 'ఉరిశిక్ష అమానవీయం, అమానుషం', 'నిందితులకు బుద్ధి లేకపోతే మనకు లేదా','ఉరిశిక్ష మానవత్వం అనిపించుకోదు' మొదలైన వాదనలు మొదలౌతాయి.ఇలా కొన్నేళ్ళు గడుస్తుంది. ఈలోపు వాదనలు కింది కోర్టు నుంచి సుప్రీం కోర్టు దాకా సాగి సాగి చివరిలో రాష్ట్రపతి యొక్క 'మెర్సీ పిటిషన్' దాకా వెళతాయి. ఈలోపు ఈ నేరస్తులను జైల్లో ఉంచి వారి కోరికలను తీర్చడానికి ఒక 100 కోట్లు ప్రజాధనం ఖర్చు అవుతుంది. ఏం? పరాయి దేశస్తుడైన కసబ్ కోసం 34 కోట్లు ఖర్చు పెట్టిన మనం, మన దేశ పౌరులే అయిన వీరికోసం ఆ మాత్రం ఖర్చు పెట్టలేమా?ఈలోపు ఏకారణంతో అయినా రాష్ట్రపతి కరుణిస్తే వీరికి మరణ దండన తప్పి,జైలు శిక్ష ఖాయం అవుతుంది.మళ్ళీ చరిత్ర పునరావృతం అవుతుంది.

5.కనుక ప్రజలు చేస్తున్న ఈ ఆందోళనను ఈ సమస్యకు సరైన పరిష్కారం వచ్చేవరకూ కొనసాగించవలసి ఉంటుంది.అటువంటి పట్టుదల మన ప్రజల్లో ఉందా?అన్నది ఒక అంతుచిక్కని ప్రశ్న.అది లోపిస్తే మాత్రం,ఈ కేసులో న్యాయం ఎట్టి పరిస్తితిలోనూ జరగదు.

6. పత్రికలూ టీవీలూ కూడా,పై పంధానే అనుసరించాలి.రెండు రోజుల తర్వాత ఈ న్యూస్ మానేసి,దీనిని కోల్డ్ స్తోరేజీలో పెట్టి, వేరే ఏవో న్యూసులు చూపడం కాకుండా,దీనికి పరిష్కారం వచ్చేవరకూ ఈ న్యూస్ ను సజీవంగా ఉంచాలి. ప్రజాగ్రహాన్ని ప్రజ్వరింప చేస్తూనే ఉండాలి.అప్పుడే ప్రభుత్వం కొంత కాకపోతే కొంతన్నా దిగివస్తుంది. ఎందుకంటే నేరస్తులను ఎదో రకంగా కొమ్ముకాసే వ్యాధి మన దేశంలో మొదట్నించీ ఉన్నది.దీనిని ఎత్తి చూపవలసిన మీడియానే అలసత్వ ధోరణి అవలంబిస్తే, ఇక మనకు ఏ దారీ లేదు.మన దేశంలో లెజిస్లేచరూ,జుడిషియరీ,ఎగ్జిక్యూటివూ  ముగ్గురూ ఘోరంగా ఫెయిల్ అయ్యారు.మిగిలిన ఒక్క ఆశాకిరణం మీడియా మాత్రమే.

మన వంతుగా ఏదో ఒక పోస్ట్ వ్రాసి ఊరుకున్నాం అనుకోకుండా, నిజంగా మీరు ఈ విషయంలో సీరియస్ గా ఆలోచించే వారైతే,మీమీ వ్యక్తిగత స్థాయిలోనూ,కుటుంబ స్థాయిలోనూ ఈ సమస్య మీద మీ బాధ్యత ఏమిటో,మీరేం చెయ్యాలో వచ్చే పోస్ట్ లో వ్రాస్తాను. ఆచరించే సత్తా మీలో ఉందా?
read more " డిల్లీ గ్యాంగ్ రేప్ కేసు-కొన్ని ఆలోచనలు-3 "

డిల్లీ గ్యాంగ్ రేప్ కేసు-కొన్ని ఆలోచనలు-2

నేను ఉద్యోగ రీత్యా తరచూ ప్రయాణాలు చెయ్యవలసి ఉంటుంది.కనుక రకరకాల మనుషులను,రకరకాల మనస్తత్వాలనూ చాలా తరచుగా గమనించే అవకాశం నాకు ఉంటుంది.ప్రయాణం చెయ్యకపోయినా ప్రతిరోజూ ఎంతోమందితో మాట్లాడే పరిస్తితి ఉంటుంది.తద్వారా,లోకాన్ని దగ్గరగా పరిశీలించే అవకాశం నాకు కలుగుతూ ఉంటుంది.దానిలోనుంచే నా అభిప్రాయాలు ఏర్పడతాయి.ఎంతో పరిశీలన తర్వాతే నేను నా అభిప్రాయాలు ఏర్పరచుకుంటాను.ఇంట్లో కూచుని ఎటూ కదలకుండా న్యూస్ పేపరూ టీవీ మాత్రమె చూసి ఏదేదో ఊహించుకునే వారికి అందుకే నా భావాలు నచ్చవు.ఎందుకంటే వారికి లోకానుభవం లేదు.ప్రపంచం ఎంత దరిద్రంగా ఉందో వారు ఊహించలేరు.ఇల్లు కదలకుండా ఉండేవారికి అంతా బాగున్నట్లే అనిపిస్తుంది.బావిలో కప్పకి దాని ప్రపంచం స్వర్గంలానే అనిపించడంలో వింత లేదు.

నిన్నటి రోజున నరసరావుపేట వెళ్ళాను.ఆ ఊళ్ళో నేను ఇంటరూ,డిగ్రీ చదివాను.బ్రహ్మానందరెడ్డి కాలేజీ,SSN కాలేజీ ఎలా ఉన్నాయో చూద్దామని ఒకసారి అటు వెళ్ళి వచ్చాను.ఆ సమయంలోనే నాకు ఫోనొచ్చింది.డిల్లీ రేప్ కేస్ అమ్మాయి చనిపోయింది అని ఒక మిత్రుడు ఫోన్ లో చెప్పాడు.అది విని గతంలో జరిగిన ఒక సంఘటన నాకు గుర్తొచ్చింది.

రెడ్డి కాలేజీ పక్కన సత్యనారాయణ టాకీస్ అని ఒక సినిమా హాల్ ఉండేది.ప్రస్తుతం అది లేదు. అసలు రెడ్డి కాలేజీనే ఒక చెరువులో ఉండేది. ఆ చెరువు అంతా ఇప్పుడు మాయమై,అదంతా ఇళ్ళు పడి పెద్ద కాలనీ అయిపొయింది. 1979 లో అనుకుంటాను ఈ సత్యనారాయణ టాకీస్ దగ్గర ఒక దారుణమైన రేప్ కేస్ జరిగింది.హాలు బయట షోడా బండి నడుపుతూ ఒక టీనేజీ అమ్మాయి ఉండేది.పాపం కుటుంబ పరిస్థితులు అన్నీ సరిగ్గా ఉంటే ఏదో కాలేజీలో చక్కగా చదువుకుంటూ ఉండాల్సిన పిల్ల.ఒకరోజున స్నేహితులతో కలిసి నేను సెకండ్ షో సినిమాకు వెళ్ళాను.అంత రాత్రి సమయంలో కూడా ఆ అమ్మాయి షోడాలు అమ్ముతూ ఉన్నది.అక్కడ ఉన్న వెకిలి మనుషులూ,ఆ వాతావరణమూ చూచి ఈ అమ్మాయికి త్వరలో ఏదో జరుగుతుంది,పాపం ఈ పని మానేస్తే బాగుండు అని మేం అనుకున్నాం.తర్వాత ఒకటి రెండు నెలలకు ఆ అమ్మాయి గేంగ్ రేప్ కు గురై దారుణంగా చంపబడింది.

దగ్గరలో ఉన్న ఒక కాలేజీ ప్రాంగణంలో కొందరు వ్యక్తులు రాత్రిపూట తాగుతూ కూచుని ఈ అమ్మాయిని షోడాలు తెమ్మని పిలిచినట్లు,ఈ అమ్మాయి అవి తీసుకుని ఆ చీకట్లో అంత రాత్రి పూట ఆ కాలేజీలోకి వెళ్ళినట్లు,తర్వాత మానభంగానికి గురై శవమై తేలినట్లు అందరూ అనుకున్నారు.సభ్య భాషలో వ్రాయలేనంత దారుణంగా ఆ అమ్మాయిని చెరిచి చంపేశారు.గుట్టు చప్పుడు కాకుండా ఆ అమ్మాయిని పాతి పెట్టారు.స్మశానం SSN కాలేజీ హాస్టల్ పక్కనే ఉన్నది.మా హాస్టల్ టెర్రేస్ పైకి ఎక్కితే స్మశానం అంతా చక్కగా కనిపిస్తుంది.

పదిహేను రోజుల తరవాత,తల్లిదండ్రుల గొడవ వల్లా,విద్యార్ధి సంఘాల చొరవ వల్లా,మళ్ళీ శవాన్ని తవ్వి తీసి పరీక్షలు చేశారు.ఆ తవ్వే సమయంలో మేం హాస్టల్ పైకెక్కి ఆ తంతు అంతా చూచాం. తర్వాత ఆ కేస్ ఏమైందో అతీ గతీ లేదు.ఒక లోకల్ మున్సిపాలిటీ కౌన్సిలరూ అతని అనుచరులూ కలిసి ఆ పని చేశారనీ,వారికి రాజకీయ అండదండలు పుష్కలంగా ఉన్నాయనీ అందుకే వారు తప్పించుకున్నారనీ అప్పట్లో చెప్పుకున్నారు.

మనదేశంలో ఇలాంటి దారుణ రేపులు హత్యలు ప్రతి రోజూ జరుగుతూనే ఉన్నాయి.అయితే బయటకి రావు.అంతే.అక్కడి దాకా ఎందుకు?నిన్న గాక మొన్న జరిగిన ఆయేషా మీరా కేస్ ఏమైంది?ఎవడో అనామకుడిని దోషిగా నిలబెట్టి అసలు నిందితులను తప్పించారని ఆమె తల్లిదండ్రులు ఇప్పటికీ కనిపించిన ప్రతి ఫోరం లోనూ మొత్తుకుంటూనే ఉన్నారు.ఎవరైనా పట్టించుకున్నారా?వారికి ఇప్పటికైనా న్యాయం  జరిగిందా?

అసలు ఈ ఉదంతాలలో మన తప్పుకూడా ఉందని నేనంటాను.రాత్రిళ్ళు అమ్మాయిలు రెచ్చగొట్టే దుస్తులు వేసుకుని రోడ్డుమీద తిరుగుతూ ఉంటే ఈ దేశంలో ఎవడు ఊరుకుంటాడు? అనే ధోరణిలో మొన్న ఒక రాజకీయ నాయకుడు కూడా కామెంట్ చేసాడు.అతన్ని దుమ్మెత్తి పోశారు.అతను చెప్పిన దాంట్లో నిజం ఉన్నది.అతను ప్రాక్టికల్ గా మాట్లాడాడు.'అలాంటి డ్రస్సులు వేసుకుంటే అలా చేస్తారా?అంటే మేం ఎలాంటి డ్రస్సులు వేసుకోవాలో కూడా మీరే నిర్ణయిస్తారా?'అని మహిళాసంఘాలు ఊగిపోయాయి. నిజమే. వారు చెప్పేది ఒక సభ్య సమాజంలో అయితే జరుగుతుంది.అక్కడ మహిళలు ఎలాంటి డ్రస్సులు వేసుకున్నా ఎవరూ పట్టించుకోరు.కాని మనది సభ్యసమాజం కాదు.సభ్యసమాజంలా కనిపిస్తున్న ఒక కుళ్ళిపోయిన సమాజం.మనుషుల రూపాల్లో జంతువులు తిరుగుతున్నాయని నేను ఇంతకు ముందు వ్రాస్తే చాలామంది నన్ను విమర్శించారు.ఇప్పుడు వారే నేనన్నది నిజం అంటున్నారు.

మనం ఉన్నది ఒక sexually repressed society అయినప్పుడు,ఒక కుళ్ళిపోయిన నకిలీ సమాజం అయినప్పుడు మన జాగ్రత్తలో మనం ఉండాలి అని ఆ రాజకీయ నాయకుడి ఉద్దేశ్యం.దానిని వక్రీకరించి,మీకు రక్షణ కల్పించడం చేతకాక,అమ్మాయిలను అంటున్నారంటూ ఏదేదో గొడవ చేస్తే సమస్య ఎలా పరిష్కారం అవుతుంది? ఆదర్శ రాజ్యంలో పోలీస్ వ్యవస్థ అవసరం లేదు అని ప్లేటో కూడా వేల ఏళ్ల క్రితం చెప్పాడు.కాని మనది ఆదర్శ రాజ్యం కాదు.కనుక మనకు పోలీస్ వ్యవస్థా కావాలి.నేడున్నట్లు నామకార్థం ఉత్త పోలీస్ వ్యవస్థ కాదు. సమర్ధవంతమైన వ్యవస్థ కావాలి.దానికి తోడు మన జాగ్రత్తా మనకు ఉండాలి.ఈ కోణాన్ని ప్రస్తుతానికి అలా ఉంచుదాం.

అసలు ఇలాంటి సంఘటనలు జరగడానికి మన వంతుగా మనం ఎలా దోహదం చేస్తున్నామో కొంచం ఆలోచిద్దాం.

మొన్నొక రోజున ఒక జర్నీలో ఉండగా,ఒక అసహ్యకరమైన విషయం గమనించాను.నా పక్కనే,ఒక భర్తా భార్యా ఇద్దరు చిన్న కూతుళ్ళూ ప్రయాణం చేస్తున్నారు.వారితో పాటు ఇంకా కొందరు కూడా ప్రయాణీకులు ఉన్నారు.ఇంతలో ఆ తండ్రి సెల్ ఫోన్ లో పెద్ద హోరుతో 'సక్కుబాయ్' అనే పాట పెట్టి,తన నాలుగేళ్ల కూతురి చేత డాన్స్ చేయిస్తున్నాడు.నాలుగేళ్ల ఆ పిల్లముండ అసభ్యకరమైన భంగిమలతో నడుము ఊపుతూ ఆ పాటకి డాన్స్ చేస్తుంటే ఆ తల్లిదండ్రులూ తోటి ప్రయాణీకులూ చప్పట్లు కొడుతూ ప్రోత్సహిస్తూ ఎంజాయ్ చేస్తున్నారు.నాకు మతిపోయింది.మన పిల్లలకి ఇదా మనం నేర్పించవలసింది? రేపు ఈ పిల్ల పెరిగి పెద్దదై ఎలా తయారౌతుంది అని ఊహిస్తేనే నాకు భయం వేసింది. కాని అసలు కధ ఇక్కడే ఒక ఊహించని మలుపు తిరిగింది.

తర్వాత కొంతసేపటికి,ఆ కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత,వారితో మాట కలిపి,ఆ తల్లి దండ్రులను ఇలా ప్రశ్నించాను.

'మీరు ఇలాంటి పాటలు మీ పిల్లలకి నేర్పుతూ అలాంటి అసభ్య డాన్సులు చేయిస్తున్నారు.రేపు పెరిగి పెద్దయ్యాక వారు ఎలా తయారౌతారో మీరు ఆలోచిస్తున్నారా?'

ఈ ప్రశ్నకు ఆ తండ్రి ఒక విచిత్రమైన ఊహించని జవాబు ఇచ్చాడు.

'మీరు బ్రాహ్మలా"

'అవును' అని నేనన్నాను.

'అందుకే మీరు ఇంకా BC లో ఉన్నారు.ప్రస్తుతం సమాజం వేగంగా ముందుకు పోతున్నది సార్. మన పిల్లలకు మనం అన్నీ నేర్పాలి.ఆ తర్వాత వాళ్ళ బతుకు వాళ్ళు చూసుకుంటారు. మారిన కాలంతో మనం కూడా మారాలి.' అంటూ నాకో లెక్చర్ ఇచ్చాడు. మారడం అంటే ఇదా? అని అతనికి ఎంత నచ్చచెప్పాలని చూచినా వినే పరిస్తితి అతనిలో కనిపించలేదు.ఆ తల్లి కూడా భర్త మాటలకు తలూపుతూ వాదిస్తున్నది కాని నేను చెబుతున్న విషయం ఏమాత్రం అర్ధం చేసుకునే ప్రయత్నం చెయ్యడం లేదు.నాకు విసుగు పుట్టి అక్కణ్ణించి లేచి ఇవతలకు వచ్చేశాను.ఒక విషయాన్ని సరిగ్గా అర్ధం చేసుకోకుండా దానికి కులంరంగు పులిమి వారి కులద్వేషాన్ని అలా ప్రదర్శిస్తుంటే ఏమని చెప్పాలో నాకర్ధం కాలేదు.

ఇదంతా ఎందుకు వ్రాస్తున్నానంటే, సమాజం పాడై  పోతున్నది అని గోల చేస్తున్న మనం,అదలా పాడై పోవడం వెనుక మన పాత్ర ఏమిటి అన్నది మాత్రం విస్మరిస్తున్నాం. ఎవరో ఎదో చెయ్యాలని, మన పాత్ర ఏమీ లేదనే ఆలోచనే అసలు ఈ సమస్యకు ఉన్న మూలకారణాలలో ఒకటి. విషపు విత్తనాలు వెదజల్లుతాం కాని మాకు మధుర ఫలాలనిచ్చే చెట్లు కావాలి అంటే ఎలా కుదురుతుంది? మా పిల్లలకు మేం విషం నూరి పోస్తాం,కాని వారు పెద్దయ్యాక మంచి పౌరులుగా ఉండాలి అనుకోవడం హాస్యాస్పదం. మేం కురచ బట్టలు వేసుకుని ఒళ్లంతా చూపిస్తూ రోడ్డుమీద రాత్రిళ్ళు తిరుగుతాం. మమ్మల్ని రక్షించడం మాత్రం పోలీసుల బాధ్యత అనుకోవడమూ ఇలాంటిదే. సమాజం మంచిది కానప్పుడు, నాయకులకూ,అధికారులకూ ఎవరికీ చిత్తశుద్ధి లేనప్పుడూ, మన జాగ్రత్తలో మనం తప్పకుండా ఉండాలి. ఏదైనా జరిగిన తర్వాత మాటలు మాత్రం అందరూ చెబుతారు.బాధ పడేది ఎవరు?

పరిష్కారాలను చర్చిద్దాం అని నా  మొదటి పోస్ట్లో ముగించాను. దానికి ఒక మిత్రురాలు నాకిచ్చిన ఒక మెయిల్ లో ఆమె ఆవేదన గమనించండి. మిగతా విశ్లేషణ తర్వాత పోస్ట్ లో చూద్దాం. 

ఎవరికి కావాలి సర్ పరిష్కారాలు? ఎవరికోసం? 

తక్కువ బట్టలు వేసుకుని మగపిల్లలతో బజార్లమ్మట తిరగడమనే స్వేచ్చ  అనుకునే ఆడపిల్లలకా?

కెవ్వుకేక అనే పాటకి అసభ్యభంగిమలతో మూడేళ్ళ పిల్లలతో డాన్శ్ చేయించి ఆనందిస్తున్న తల్లితండ్రులకా ?

ఎదిగిన కొడుకుల ముందు షార్ట్స్ వేసుకుని తిరిగే మోడ్రెన్ తల్లులకా ?

కూతుళ్ళు ఒంటిమీద బట్టలు ఎలా వున్నయో,ఎక్కడకి పోతున్నారో పట్టించుకోని తండ్రులకా ?

ఎదిగినపిల్లలముందు తలుపులేసుకుని పడుకునే కామాంధులైన తల్లీతండ్రులకా ?

బూతు తప్ప మరేదీ సమర్ధవంతంగా చూపించలేన్ని సినిమాలకా ? వాటిని పదే పదే చూపిస్తున్న టివి లకా ?

అన్నీ చూస్తూ కూడా నా వరకు రాలేదులే అని ఊపిరి పీల్చుకునే సగటు మనిషికా 

స్వేచ్చ వేరు, విచ్చ్చలవిడితనం వేరు. స్వాతంత్ర్యానికి అర్ధం బాయ్ఫ్రేండ్ లతో అర్ధరాత్రి నడిబజార్లమ్మట తిరగం కాదు. అత్యాచారాలని నేను సమర్ధించట్లేదండి. నాకూ ఆడపిల్ల ఉంది. కానీ ఒక కోతి కనపడితే చేతిలో ఉన్న పళ్ళు జాగ్రత్త పెట్టుకుంటాం. పిచ్చికుక్క కనపడితే ఆ వీధిలోకి వెళ్ళం. ఆ పాటి జాగ్రత్త ఎంతో తెలివైన ఈ చిట్టితల్లులు తీసుకుంటే కోంతమందైనా బతుకుతారు.   

నలువైపులా విషసర్పాలు బుసకొడుతున్న ఈ సమాజంలో ఎవరి జాగ్రత్తలో వారుండటం, ఉండమని చెప్పడం తప్పంటారా?

(మిగతాది వచ్చే పోస్ట్ లో)
read more " డిల్లీ గ్యాంగ్ రేప్ కేసు-కొన్ని ఆలోచనలు-2 "

29, డిసెంబర్ 2012, శనివారం

డిల్లీ గ్యాంగ్ రేప్ కేసు-కొన్ని ఆలోచనలు

సాటి మానవుల రాక్షసత్వానికి బలైపోయి పదమూడు రోజులుగా ప్రాణం కోసం పోరాడుతున్న ఒక అమాయక ప్రాణి ఈరోజు కన్నుమూసింది.ఒక లేత కుసుమం ప్రపంచాన్ని చూడకుండానే అర్ధాంతరంగా నేలరాలిపోయింది.'నాకు బ్రతకాలని ఉంది' అని పరితపించిన ఒక నిండు ప్రాణాన్ని మన చేతులతో మనమే కిరాతకంగా చంపేశాం.మన దేశం మీద మరో మాయని మచ్చ ఏర్పడింది.ఇప్పటికే మనం మోస్తున్న పాపఖర్మం ఒక్కసారిగా వందలరెట్లు పెరిగింది.దీని ఫలితం భవిష్యత్తులో ఎలా ఉంటుందో నేను చెప్పలేను గాని, ఇది మన దేశానికి మంచిది కాదు అని మాత్రం చెప్పగలను.

మనం కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతాం.'చేసిన పాపం అనుభవించక తీరదు' అని మన సంస్కృతి వేలయేళ్ళుగా ఘోషిస్తున్నది.కాని మన దేశంలోనే సమస్త పాపాలూ జరుగుతూ ఉంటాయి.సమస్త ఘోరాలూ నేరాలూ జరుగుతూ ఉంటాయి.నిందితులు చక్కగా తప్పించుకుని తిరుగుతూ ఉంటారు.నాయకులు వారిని సిగ్గులేకుండా సమర్ధిస్తూనె ఉంటారు.రాజకీయపు ముసుగులో సమస్తమూ రెండు మూడు రోజుల్లో మరుగున పడి పోతూ ఉంటుంది. మనం కూడా రేపటికి ఈ న్యూస్ ను మర్చిపోయి ఇంకో కొత్త న్యూస్ కోసం ఎదురు చూడటం మొదలుపెడతాం.

మీడియా బలంగా ఉండబట్టి నేడు ఇలాంటి నేరాలు బయటకు వస్తున్నాయి.అందరికీ తెలుస్తున్నాయి.కాని ప్రతి కాలంలోనూ ప్రతి ఊరిలోనూ ఇలాంటి ఘోరాలు మామూలుగా మన దేశంలో జరుగుతూనే ఉన్నాయి.బాధిత మహిళలు బయటకు చెప్పుకోలేక జీవచ్చవాలుగా బ్రతుకులు ఈడుస్తూనె ఉన్నారు(ఒకవేళ రేపిష్టుల చేతిలో బతికి బట్టకట్ట గలిగితే).లెక్కల ప్రకారమే దాదాపు లక్ష రేప్ కేసులు కొన్నేళ్లుగా కోర్టుల్లో మూలుగుతున్నాయి. ఇక లెక్కా డొక్కా లేని కేసులు,రికార్డుల లోకి ఎక్కని కేసులు దీనికి కనీసం ఏభై రెట్లు ఉండవచ్చు.

దాదాపుగా 15 ఏళ్ల క్రితం గుంతకల్లు లో ఇలాంటిదే ఒక దారుణమైన రేప్ కేస్ జరిగింది.ఆ అమ్మాయికి కూడా పందొమ్మిది ఏళ్ళు ఉంటాయి.కేరళకు చెందిన ఈ అమ్మాయి రైల్వే ఉద్యోగిని.కరాటే వచ్చిన వ్యక్తి.స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం సంపాదించి చక్కగా ఉద్యోగం చేసుకుంటూ ఉన్నది. ఒక రాత్రి తన క్వార్టర్స్ లో దారుణంగా గేంగ్ రేప్ చెయ్యబడి తెల్లవారేసరికి రక్తపు మడుగులో పడి చనిపోయి ఉన్నది.ఆ అమ్మాయి చేతులను భూమిమీద పెట్టి మేకులతో నేలకు సిలువ కొట్టి మరీ చంపేశారు.ఒక కనుగుడ్డు పీకేశారు.కొందరు సైకోలు కలిసి ఈ పని చేసినట్లుగా అనిపిస్తుంది.అదొక మహా ఘోరాతి ఘోరమైన దృశ్యం.విచిత్రమేంటంటే ఇప్పటివరకూ ఆ కేస్ ఎటూ తేలలేదు.ఎవరు ఈ ఘోరం చేశారో ఊరిలో అందరికీ తెలుసు,పోలీసులకూ తెలుసు.కాని నిందితులకు ఇప్పటివరకూ శిక్షలు పడలేదు.అమాయకులను పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పుకుని కేసును పక్కదారి పట్టించి చివరికి ఫైల్ మూసేశారు.నిందితులు ఇప్పటికీ అదే ఊళ్ళో చక్కగా కాలరెగరేసుకుని తిరుగుతున్నారు. ఆ పిల్ల తల్లిదండ్రులు మాత్రం గుడ్ల నీరు కుక్కుకుని శవాన్ని అక్కడే దహనం చేసి ఆ బూడిద తీసుకుని కేరళకు వెళ్ళే రైలెక్కారు.

విజయవాడ శ్రీలక్ష్మి కేసూ,గుంటూరు ప్రసన్నలక్ష్మి కేసూ ఏమై పోయాయో ఇప్పుడు ఎవరికైనా గుర్తుందా అసలు? చిలకలూరిపేట బస్సుదహనం కేసు ఏమైపోయిందో ఎవరికైనా పట్టిందా? ఇలాంటి కేసులు ప్రతి నగరంలోనూ ఎన్నో జరిగాయి.ఈనాడూ జరుగుతున్నాయి.అందుకే మన దేశంలో న్యాయం అనేది ఎప్పుడో చచ్చిపోయింది, మన దేశంలో న్యాయంలేదు,అర్హులకు న్యాయం ఎప్పుడూ జరగదు అని నేనెప్పుడూ వ్రాస్తూనే ఉంటాను. నా వ్రాతలు చూచి నాది పెసిమిస్టిక్ యాటిట్యూడ్ అని చాలామంది,ముఖ్యంగా సోదరీమణులు,  నన్ను విమర్శిస్తుంటారు.వారికి తెలియని ఒక్క విషయం ఏమిటంటే, నేను వ్రాసే ప్రతిదీ అనుభవంలో నుంచీ పరిశీలనలోనుంచీ వ్రాస్తాను.ఉత్త ఊకదంపుడు గాసిప్ ఊహించి ఎప్పుడూ వ్రాయను.మన అదృష్టం బాగుండి మనం ఈ దేశంలో ఏమీ కాకుండా బతికి బట్టకడుతూ ఉన్నాం గాని,చట్టాల గొప్పదనం వల్లో,వ్యవస్థయొక్క పటిష్టత వల్లో మాత్రం కానేకాదు. నూకలుంటే మనం బతికుంటాం.లేకుంటే మనకు కూడా ఏమైనా కావచ్చు.అదీ ఘనత వహించిన మన దేశపు గొప్పదనం.

మన సమాజం ఒక మేడిపండు అని ఓషో వంటి ప్రవక్తలు ఎప్పుడో చెప్పారు.ఇది పైకి చూడటానికి చాలా అందంగా కనిపిస్తుంది.కాని లోపల అన్నీ పురుగులే.ఈ పురుగులు తయారు కావడానికి ఎన్నో కారణాలు మన సమాజంలో ఉన్నాయి.ఒక కారణం అయితే దానిని బాగు చెయ్యగలం.ఎన్నో కారణాలు ఉంటే ఎలా బాగుచేయ్యాలి? అసలు బాగుచేసుకోవాలన్న స్పృహ కూడా మనకు లేదే?ఒకవేళ ఉన్నా మంచి రాజకీయ నాయకులు లేరే? ఇక 'బాగు' ఎలా సాధ్యం? మల్టిపుల్ ఆర్గాన్ ఫెయిల్యూర్ స్త్తితిలో ఉన్న సమాజాన్ని ఎలా బాగు చేసుకోవాలి?

ప్రతి నాయకుడూ నాయకురాలూ అధికారం లేనప్పుడు నీతులు చెప్పడం,ప్రజల కోసమే తాము జీవిస్తున్నామన్న భ్రమ కల్పించడం,అది నమ్మి ప్రజలు అధికారం కట్టబెట్టగానే విచ్చలవిడిగా దోపిడీ మొదలుపెట్టడం.ఆ నాయకుడి కులంవాళ్ళూ అనుచరులూ కూడా ఆదోపిడీలో భాగం పంచుకోవడం,నిస్సిగ్గుగా సమర్ధించడం.ఇదేగా మన దేశ వ్యవస్థ.కాదని ఎవరైనా అనగలరా? ఇలాంటి సమాజం అసలెలా బాగుపడుతుంది?

ఎన్ని చెప్పినా ఎంత తిట్టుకున్నా మన ప్రజలు చాలా మంచివారు.మానవత్వం ఉన్నవారు అని ఒప్పుకోక తప్పదు.ఈ దేశం మంచిదే.ప్రజలూ మంచివారే. కాని నాయకులే దేశాన్ని సర్వనాశనం చేస్తున్నారు.వేల ఏళ్లుగా మనది బానిస మనస్తత్వం.రాజుని దేవుడిగా కొలిచే బానిస బతుకులు మనవి. నాయకులు ఎలా ఉంటే మనం అలా అనుసరిస్తాం.మనది గొర్రె జాతి.కనుక నాయకుడు నీతిగా ఉండి ప్రజలని నీతిగా నడిపిస్తే మనమూ నీతిమంతులుగా జీవిస్తాం.నాయకులే అవినీతిపరులుగా మారి,అవకాశవాదంతో దేశాన్ని దోచుకుంటూ ఉంటే మనం కూడా అదే చేస్తాం.ఎందుకంటే గొర్రెలకు మెదడు ఉండదు కదా. 'యధారాజా తదా ప్రజా' ఒక్కటే వాటికి తెలిసిన సూత్రం.ఇప్పుడు మన సమయంలో జరుగుతున్నది అదే. ఖర్మ ఏమిటంటే ఎన్నుకోడానికి మంచి నాయకులే కరువైన స్తితి మన దేశపు దౌర్భాగ్యం.ఎక్కడో ఒకరో ఇద్దరో 'మోడీ' వంటి మంచి సమర్ధులైన నాయకులు ఉంటే, వారికి చస్తే అవకాశం ఇవ్వం. వారికి మెజారిటీ రాదు. కనుక వారు మనకు ఏమీ చెయ్యలేరు.మనల్ని బాగుచేసే అవకాశం అలాంటివారికి మనం చస్తే ఇవ్వం.ఇలాంటి జాతి మనది.

మన దేశం ఏమై పోయినా మనకు అనవసరం.ప్రపంచ దేశాలు మనల్ని చూచి చీదరించుకుని నవ్వుతున్నా మనకు అనవసరం.మన ఆడపిల్లలు ఇలా గ్యాంగ్ రేపులకు గురై చనిపోతున్నా మనకు అనవసరం.భ్రస్టు పట్టిన మన విధానాలవల్ల దేశం రోజురోజుకూ ఆర్ధిక సంక్షోభం దిశగా ప్రయాణిస్తున్నా మనకు అనవసరం. మనకు సమర్ధుడైన నాయకుడు అక్కర్లేదు.మనం తీసుకున్న ప్రభుత్వ రుణాలు మాఫీ చేసేవాడు మనకు కావాలి.మన నేరాలనుంచి మనల్ని కాపాడేవాడు మనకు కావాలి.వాడు ఎంత వెధవైనా మన కులంవాడు మనకు కావాలి.మనకు కాంట్రాక్టులూ ఉద్యోగాలూ దొంగదారిన కట్టబెట్టేవాడు మనకు కావాలి.ఈ క్రమంలో పక్కవాడికి ఎలాంటి అన్యాయం జరిగినా మనకు పట్టదు.ఇదీ మన వ్యవస్థ.ఇలాంటి వ్యవస్థలో అసలు న్యాయం అనేది బతికుంటుంది అనీ,జరుగుతుంది అనీ ఎలా విశ్వసించగలం?

ఇదంతా అలా ఉంచి,ప్రస్తుత డిలీ గ్యాంగ్ రేప్ కేస్ నేపధ్యంలో అసలంటూ ఈ సమస్యకు పరిష్కారాలు ఏమైనా ఉన్నాయా?అన్న విషయం తర్వాతి పోస్ట్ లో చూద్దాం.
read more " డిల్లీ గ్యాంగ్ రేప్ కేసు-కొన్ని ఆలోచనలు "

24, డిసెంబర్ 2012, సోమవారం

ప్రణవనాదము సప్తస్వరములై బరగ

'త్యాగరాజ సాంస్కృతిక సంఘం' అని ఒకటి గుంటూరులో ఉన్నది.దాని కార్యవర్గ సభ్యులు అందరూ మంచి సంగీత ప్రియులు.నాకు మంచి మిత్రులు.దాని ఉపకార్యదర్శి గిరిజాశంకర్ గారు ఒక సంగీత నిధి.ఆయన దగ్గర ఉన్నంత క్లాసికల్ మ్యూజిక్ కలెక్షన్ ఆంధ్రదేశంలోనే అతి తక్కువమంది దగ్గర ఉంటుంది.శాస్త్రీయ సంగీతం గురించి ఆయన అనర్గళంగా గంటలు గంటలు మాట్లాడగలడు. ఆయన నాకు మంచి మిత్రుడు కావడంతో నిన్న ఆ సంస్థలో జరిగిన అయ్యగారి సత్యప్రసాద్ 'వీణ కచేరి'కి నన్ను ముఖ్య అతిధిగా ఆహ్వానించాడు.

'అయ్యగారి' వంశం వీణ వాయించడంలో పేరుగాంచిన వంశం. సత్యప్రసాద్ గారి తండ్రి అయ్యగారి సోమేశ్వరరావు గారు, సోదరుడు అయ్యగారి శ్యామసుందర్ గారు,మేనమామ పప్పు చంద్రశేఖర్ గారు అందరూ వీణావాదనలో అఖండమైన ప్రజ్ఞ కలిగిన విద్వాంసులు.సంగీతం అలా కొన్ని కొన్ని వంశాలలో పరంపరగా వస్తూ ఉంటుంది.అది వారి రక్తంలోనే ఉన్నదా అనిపిస్తుంది.అలాంటి వంశంలో 'నల్లాన్ చక్రవర్తుల' వంశం కూడా ఒకటి. 

సత్యప్రసాద్ గారి కచేరి నేను ఎప్పుడూ వినలేదు. అద్భుతమైన వీణావాదన ప్రజ్ఞతో ముక్కోటి ఏకాదశి రోజున శ్రోతలను సంగీతప్రపంచంలో ఓలలాడించారు. కొంతమంది వీణను వారిపైన వేసుకుని,వారు వీణమీద పడిపోయి,నానా హైరానా అయిపోతారు. సత్యప్రసాద్ గారు అలాకాకుండా చాలా అనాయాసంగా సునాయాసంగా వీణను వీణగా వాయించి రక్తికట్టించారు.త్యాగరాజ కృతులను,అన్నమయ్య కీర్తనలను,శంకరుల భజగోవింద శ్లోకాలను వారు సునాయాసంగా వీణపైన వాయించిన తీరు అద్భుతంగా ఉన్నది.

మిత్రుడు గిరిజాశంకర్ మంచి హాస్యప్రియుడు. ఆయనిలా అన్నాడు.'కొందరు వీణ వాయిస్తారు.ఇంకొందరు వీణతో వాయిస్తారు.సత్యప్రసాద్ గారు మొదటి కోవకు చెందిన విద్వాంసుడు.' ఈ జోక్ కు చాలాసేపు నవ్వుకున్నాము.

కదనకుతూహల రాగంలో వినవచ్చే 'గిటార్ నోట్స్' ను వీణపైన పలికించిన తీరు శ్రోతలను మైమరపింప చేసింది.వీణ మీద గిటార్ నోట్స్ పలికించడం ఎంత కష్టమో,దానికి ఎంత సాధన కావాలో? అలాగే 'చారుకేశి' రాగాన్ని తీసుకుని రాగమాలికా పద్దతిలో ఏడెనిమిది రాగాలను స్పృశిస్తూ మళ్ళీ చివరికి 'చారుకేశి' రాగంలోనికి తీసుకువచ్చి ముగించిన అంకం వారి సంగీత ప్రజ్ఞకు నిదర్శనం.

వీణకు మన వాయిద్యాలలో ప్రత్యెక స్థానం ఉన్నది. నారదుడు,తుంబురుడు వంటి దేవర్షుల చేతిలో ఉండే ప్రత్యేకత దీని సొంతం.అంతేగాక చదువులతల్లి కరసీమను అలంకరించగల అదృష్టం కూడా వీణ సొంతం.కనుక ఇది దేవతా వాయిద్యం అని చెప్పవచ్చు.ఇదేగాక వీణకూ అంతరిక యోగసాధనకూ సంబంధం ఉన్నది.వెన్నెముకను కూడా వీణాదండం అంటారు.అందులోని సప్తచక్రాలలో ప్రాణసంచారం జరిపి సప్తస్వరాలను పలికిస్తూ ఆరోహణా అవరోహణాక్రమంలో సమస్త రాగాలనూ లోలోపల వినగలిగే విద్య నాదోపాసన.

శ్రీరామకృష్ణులు తమ సాధనాకాలంలో వీణానాదాన్ని లోలోపల విని సమాధి నిమగ్నులయ్యేవారు. తర్వాతి కాలంలో కూడా ఆయన సమక్షంలో వీణ వాయించబడితే వెంటనే ఆయనకు సమాధిస్తితి కలిగేది.అభినవగుప్తుడు కూడా వీణావాదన తత్పరుడే.యోగులకు వీణకు సంబంధం ఉన్నది.తెలిసినవారికి వీణావాదన మోక్షప్రసాదిని అయిన ఒక యోగం. తెలియని వారికి ఇతర వాయిద్యాలవలె అదికూడా ఒక వాయిద్యం. మహాభక్తుడూ సంగీతనిధి అయిన  త్యాగయ్య కూడా పరమేశ్వరుని వీణానాద లోలునిగా కీర్తిస్తాడు.  

ఇదే విషయాన్ని నా ప్రసంగంలో క్లుప్తంగా చెప్పాను.వెంటనే సత్యప్రసాద్ గారు 'సారమతీ'  రాగంలో సద్గురు త్యాగరాజ విరచితమైన 'మోక్షము గలదా? భువిలో జీవన్ముక్తులుగాని వారలకు' అనే కీర్తనను అందుకొని అద్భుతంగా వీణపైన వాయించి వినిపించారు. మహానందం కలిగింది.

పల్లవి 
మోక్షము గలదా ? భువిలో జీవన్ముక్తులుగాని వారలకు
అనుపల్లవి 
సాక్షాత్కార నీ సద్భక్తి - సంగీతజ్ఞాన విహీనులకు
చరణము 
ప్రాణానల సంయోగము వలన
ప్రణవ నాదము సప్తస్వరములై బరగ
వీణావాదన లోలుడౌ శివమనో
విధ మెఱుగరు, త్యాగరాజ వినుత!    

ఈ కీర్తనలో సద్గురుత్యాగరాజు నాదోపాసనకు-యోగసాధనకు-మోక్షప్రాప్తికి గల సంబంధాన్ని సూక్ష్మంగా వివరిస్తూ సాక్షాత్తూ పరమశివుని 'వీణావాదన లోలుడు' అంటాడు. నిజమే. అంతరిక వీణానాదమైన ప్రణవాన్ని వింటూ తన్మయ స్థితిలోనే ఎల్లప్పుడూ ఉంటాడు యోగేశ్వరుడగు పరమేశ్వరుడు.

అసలు మన భారతీయ సంగీతంలోనే ఒక గొప్ప మహత్తు ఉన్నది.పాశ్చాత్య సంగీతంలాగా మనస్సును బహిర్ముఖం చేసి,ఇంద్రియ చాపల్యాన్నీ,మనో చంచలత్వాన్నీ పెంచేది కాదు భారతీయసంగీతం.తద్విరుద్ధంగా ఇంద్రియాలనూ మనస్సునూ అంతర్ముఖం చేసి భగవదనుభూతిని కలిగించ గలశక్తి మన సంగీతానికి ఉన్నది.అయితే దానిని యోగంగా అభ్యసించాలి. అప్పుడే ఆ స్థాయికి అది చేరుస్తుంది.అలాంటి దివ్యమైన సాధనను సంగీత త్రిమూర్తులైన త్యాగరాజు,శ్యామశాస్త్రి,దీక్షితులు ఇంకెందరో మహనీయులు ఆచరించారు.జీవన్ముక్తిని పొంది నాదాకాశంలో ద్రువతారల వలె వారు వెలుగు తున్నారు.వారి సాహిత్యంలో వేదమూ,వేదాంతమూ,నాద యోగమూ,భక్తీ,వైరాగ్యమూ,జ్ఞానమూ మొదలైన ఎన్నో అమూల్యమైన నిధులు నిండి ఉంటాయి.ఆ కీర్తనలను శుద్ధంగా నేర్చుకుని త్రికరణశుద్ధిగా పాడేవారికి వ్యక్తిత్వమే ఉదాత్తంగా మారిపోతుంది.అలాంటి శక్తి మన సంగీతానికి ఉన్నది.ఇటువంటి వెలలేని నిధిని మనం విస్మరిస్తూ పిచ్చిదైన విదేశీసంగీతంవైపు వెర్రిగా పరిగెత్తుతున్నాం.విలువలూ వ్యక్తిత్వమూ ఏమాత్రంలేని సినీ క్షుద్రజీవులు సృష్టిస్తున్న రొచ్చుసంగీతం ఒకపక్క సమాజాన్ని సర్వనాశనం చేస్తూ తనపాత్ర తాను చక్కగా పోషిస్తున్నది.అమృతం అందుబాటులో ఉంచుకుని రోడ్డుపక్కన కుళ్ళుకాలువలో నీళ్ళు తాగుతున్న దౌర్భాగ్యుని వలె ఉన్నది మన స్తితి.

నాకు సంగీతంలో లోతుపాతులు తెలియవు.నేను సంగీత అజ్ఞుడనే గాని, సంగీతజ్ఞుడను కాను.కాని ఏమాత్రం సంగీతజ్ఞానం లేనప్పటికీ ఒక పసిబాలుడు తన తల్లి జోలపాటకు మైమరచి ఎలా నిద్రలోకి జారుకుంటాడో,ఆ రీతిలో సంగీతాన్ని ఆస్వాదించగలను.తెలిసినవారికి సంగీతం ధ్యానస్తితిని అందిస్తుంది.తెలియనివారికి కాసేపు కాలక్షేపంగా ఉంటుంది.ఒక ధ్యానిగా నేను నాదంలో నిమగ్నం కాగలను.ఒక రాగపు ఆత్మతో తాదాత్మ్యం చెందగలను.ఆ విధంగా నేను సంగీతాన్ని ఆనందించగలను.కాని సంగీతంలోని శాస్త్రీయపు లోతులు,దాని technicalities నాకు తెలియవు.

నాకు తెలిసినంతవరకూ,సంగీతంలో మూడు స్తాయిలున్నాయి.ఒకటి ఇంద్రియాలను రేగజేసి మనిషిని పశువుస్తాయికి తీసుకుపోయే సంగీతం.నేడు మనకు లభిస్తున్న పాశ్చాత్యసంగీతమూ,మన సినీరొచ్చు సంగీతమూ సమస్తమూ ఇలాంటిదే.ఇది పశుస్తాయి.రెండవది, మానవునిలో  ప్రేమ,దయ, కరుణవంటి ఉదాత్తమైన భావనలను రేకెత్తించగల సంగీతం. ఇది మానవస్థాయి.ఇదే స్థాయిలో ప్రకృతిశక్తులను కదిలించగల ప్రజ్ఞకూడా ఒక ఉన్నతభాగం.ఆలాపనతో కూడిన హిందూస్తానీ రాగాలకు ఈశక్తి ఉన్నది.తాన్సేన్ వంటి మహా విద్వాంసులకు మాత్రమె ఇదిసాధ్యం.ఇక మూడవది అయిన దివ్యసంగీతానికి మనిషి మనస్సును ఇంద్రియాతీత స్థితికి లేవనెత్తి సరాసరి దైవదర్శనాన్ని కలిగించగల శక్తి ఉన్నది. త్యాగయ్య వంటి పరమభక్తాగ్రేసరులకూ,నారదుడు,తుంబురుడు వంటి దేవర్షులకే ఈ స్థాయికి చెందిన సంగీతం సాధ్యం.ఇది మానవులకు చేతనయ్యే స్థాయి కాదు.

సంగీతపు పరమప్రయోజనం ధ్యానస్తితిని అలవోకగా అందించడమే.నిజంగా చెప్పాలంటే లయసిద్ధి నెరిగిన యోగులే సంగీతాన్ని శుద్ధంగా ఆస్వాదించ గలరు.నిజమైన సంగీతసాధకులు యోగులు అందుకునే స్తితినే అందుకుంటారు.అలా అందుకోలేకపోతే వారిది ఉత్త కాలక్షేపసంగీతమే కాని నాదయోగం కాలేదు.మానవ మనస్సును భగవదున్ముఖం గావించి  రససిద్ధిలో లయాన్ని సిద్ధింపజేయడమే సంగీతం యొక్క అంతిమలక్ష్యం.

సత్యప్రసాద్ గారిలో ఏళ్ళ తరబడి వీణను ఒక తపస్సుగా అభ్యసించిన దీక్ష కనిపించింది.కనుకనే ఆయన వీణను వాయించినప్పుడు కూడా తన్మయత్వంతో కళ్ళు మూసుకుని తానే ముందుగా ఆ నాదాన్ని ఆస్వాదిస్తూ కనిపించారు.చక్కని శాస్త్రీయ సంగీతాన్ని ఎలాంటి పక్కదారులూ పట్టకుండా రెండున్నర గంటలు వినిపించి మాకు ఆనందాన్ని కలిగించారు.ఆయన ఇంకాఇంకా ఉన్నతమైన శిఖరాలను అధిరోహించాలని 'వీణావాదనలోలుడౌ శివుని' పరమకటాక్షానికి పాత్రుడవ్వాలనీ కోరుకుంటున్నాను.

మొత్తమ్మీద నిన్నటి ముక్కోటిఏకాదశి పర్వదినపు సాయంత్రం వీణానాదపు అద్భుతలోకంలో విహరింపచేసి దివ్యమైన భావలహరితో కూడిన ఆనందానుభూతిని మిగిల్చింది.ఈ అవకాశాన్ని నా స్నేహితుల రూపంలో నాదలోలుడైన ఆ పరమేశ్వరుడే నాకు అందించాడు.ఇదే విషయం మిత్రులకు చెప్పాను.
read more " ప్రణవనాదము సప్తస్వరములై బరగ "

20, డిసెంబర్ 2012, గురువారం

21-12-2012 మహాప్రళయం

దాదాపుగా ఏడాది ముందునుంచే 21-12-2012 న యుగాంతం అనీ మహాప్రళయం ముంచుకోస్తున్నదనీ,ఇంకా ఏమేమో పుకార్లు ప్రపంచవ్యాప్తంగా వెల్లువెత్తాయి.భూమి మొత్తం బద్దలైపోతుందనీ, గ్రహాంతరవాసులు దండెత్తి వస్తారనీ,రేడియేషన్ కు భూమి గురౌతుందనీ ఇలా రకరకాలైన ఊహాగానాలు ఎవరిష్టమొచ్చినట్లు వారు చేసారు.మాయన్ కేలండర్ ఈ తేదీన అంతం అయిందనీ అందుకని సృష్టే అంతం అవుతుందనీ కొందరి వాదన.

ఒక జాతి సృష్టించుకున్న కేలండర్ అంతం అయినంత మాత్రాన సృష్టికి ఏమీ కాదు.నిజానికి ఇలాంటి తేదీలు ఇంతకుముందు కూడా చాలా వచ్చాయి. 1962 లో అష్టగ్రహకూటమి వచ్చినపుడు కూడా యుగాంతం అని చాలామంది భయపడ్డారు.రమణాశ్రమంలో ఉన్న చలంగారైతే ప్రపంచం మునిగిపోతుందనీ ఒక్క అరుణాచలమే మునగకుండా మిగులుతుందనీ భావించి స్నేహితులను అందరినీ అరుణాచలం వచ్చి ప్రాణాలు కాపాడుకొమ్మని ఉత్తరాలు కూడా వ్రాశారు.ఆయన అలా నమ్మడానికి సౌరిస్ కూడా ఒక కారణం.మహాప్రళయం వస్తున్నదని ఆమెకూడా నమ్మింది. చలాన్ని కూడా నమ్మించింది. కానీ ఆరోజు వచ్చింది పోయింది.లోకానికి మాత్రం ఏమీ కాలేదు.ఇలాంటి ఒక మూఢనమ్మకాన్ని నమ్మి ఇలా మోసపోయానని చలం చాలా బాధపడి ఎందుకిలా చెప్పావని సౌరిస్ ను నిలదీశాడు కూడా. సరే అదొక కధ.

ప్రస్తుతానికి దానిని అలా ఉంచి,1999 కి వద్దాం.ఆ ఏడాది కలియుగాంతం కాబోతున్నదని వేదవ్యాస్ గారు ఒక సిద్ధాంతగ్రంధమే వ్రాసి జనం మీదకు వదిలాడు.అందులో భూమి ఇరుసు తల్లకిందులౌతుందనీ,దిక్కులు మారిపోతాయనీ, ధ్రువాల చోట్లు మారిపోతాయనీ,శుక్రగ్రహం వచ్చి భూమిని గుద్దుకుంటుందనీ ఏమేమో వ్రాసి పారేశాడు. అందులో ఒక్కటీ జరగలేదు. ఆ పుస్తకం మాత్రం తెగ అమ్ముడుపోయింది. ఈలోపల 1999 రానూ వచ్చింది పోనూ పోయింది.భూమి నిక్షేపంగా ఉంది.వేదవ్యాస్ గారు మాత్రం వెళ్ళిపోయాడు.

ప్రస్తుతం కూడా అదే జరగబోతున్నది. అన్ని రోజులలాగే రేపూ వస్తుంది. పోతుంది.భూమికి ఏమీ కాదు.ఏ విధమైన ప్రళయమూ రాదు.యుగాంతం అసలే కాదు.అంతా నిక్షేపంగా ఉంటుంది.

అసలు మనుషులకు ఇదొక జబ్బు అని నాఊహ.ఏదొ జరిగి అంతా సర్వనాశనం అవుతుంది అని అతి ప్రాచీనకాలం నుంచీ మానవజాతికి ఒక నమ్మకం అంతచ్చేతనలో పాతుకొని పోయింది. దీనికి కారణం మానవుల సమిష్టి అంతచ్చేతన(collective sub-conscious)లో ఉన్న తీవ్రమైన అపరాధభావన మాత్రమె.మనుషులకు తాము చేస్తున్న తప్పులు తెలుసు.వారు కళ్ళు మూసుకున్నా వారి అంతరాత్మ కళ్ళు మూసుకోదు. పొద్దున్న లేచిన దగ్గరనుంచీ,రాత్రి పడుకోబోయేవరకూ,తప్పులు చెయ్యని మనిషంటూ ఈ భూమిమీద ఉండడని నా నమ్మకం. ఈ సంగతి ఎవరికీ వారికి వారి లోలోపల తెలుసు. 

కనుక తాము చేస్తున్న తప్పులకు తమకు ఏదో ఘోరమైన శిక్ష ఎప్పుడో పడుతుంది అని ప్రతివాడూ తన మనస్సు లోతుల్లో విశ్వసిస్తూనే ఉంటాడు. అంటే ప్రతివాడూ తీవ్రమైన అపరాధ భావనతో దొంగలాగా బతుకుతున్నాడు. కనుక ఏదో ప్రళయం ఎప్పుడో వస్తుందని,దేవుడో ప్రక్రుతో తమకు ఏదో భయంకరమైన శిక్ష విధిస్తుందని ప్రతివాడూ నమ్ముతూ ఉంటాడు.ఈ భావన ప్రాచీనకాలం నుంచీ మానవజాతిలో పెంచి పోషించబడుతూ ఉన్నది. ఈ అపరాధ భావన (guilt) లేకుండా పోయినప్పుడు ఈ భయమూ పోతుంది.  దానితోబాటు చావంటే భయమూ,నరకం అంటే భయమూ,ప్రళయం అంటే భయమూ కూడా పోతాయి.మనుషులు చేసే దొంగపూజలూ,దొంగదీక్షలూ, దేవుడికి వస్తువుల రూపంలో లంచాలివ్వడమూ కూడా ఈ అపరాధభావన ఫలితాలే.

అయితే అసలంటూ ఏమీ జరగదా? అంటే జరుగుతుంది అనే చెబుతాను.  అయితే లోకం అనుకుంటున్నట్లు జరగదు.1962 లో అష్టగ్రహకూటమి వల్ల ప్రళయం రాకపోయినా, ప్రళయాన్ని సృష్టించగల వికృతమనస్తత్వం ఉన్న జీవులు అనేకమంది ఆ తర్వాత ఈ భూమ్మీద జన్మ ఎత్తారు. ఆ తర్వాత పుట్టిన తరాన్ని ఒకసారి గమనిస్తే ఇది నిజం అని తెలుస్తుంది.2000 తర్వాత పుట్టిన తరం 1960 లలో పుట్టిన తరంకంటే చాలా విభిన్నమైనది.అలాగే ఇప్పుడూ జరుగుతుంది. ఇకముందు పుట్టబోయే తరం ఇంకా వికృత స్వభావాలతో ఉంటుంది. ప్రస్తుత తల్లిదండ్రులు ఎంత వికృత మనస్తత్వాలతో ఉన్నారో గమనిస్తే ఇది తేటతెల్లం అవుతుంది. ఒక ఘట్టం మారినపుడు ఈవిధంగా ప్రకృతిగతిలో మార్పు వస్తుంది. కాని దానిప్రభావం మనం అనుకున్న రీతిలో మహాప్రళయం లాగా కనిపించదు.ఆ మార్పులు సూక్ష్మంగా ఉంటాయి.ప్రకృతి అంతా ఒక కాస్మిక్ ప్లాన్ ప్రకారం నడుస్తున్నది.దానిని మనం అర్ధం చేసుకోవాలి.అంతేగాని మన భయాలను,మూఢ నమ్మకాలను ప్రకృతిమీద రుద్దితే ఆరుద్దుడు భరించాల్సిన ఖర్మ ప్రక్రుతికేమీ లేదు.ప్రకృతి మనం చెప్పినట్లు నడవదు.

భవిష్యత్తులో విధ్వంసం జరిగే పరిస్తితులకు ఇప్పుడు బీజాలు పడతాయి. కొన్నికొన్ని నిత్య నైమిత్తిక ప్రళయాలు జరుగుతాయి.జనహననం జరుగుతుంది.కాని అది యుగాంతమూ, ప్రళయమూ మాత్రం కానేకాదు.

ప్రస్తుతం నీచలో ఉన్న రాహుకేతువులు గత ఏడాదిన్నరగా సృష్టిస్తున్న విధ్వంసం ప్రళయం కాకపోతే మరేమిటి? ప్రళయాలలో నిత్య,నైమిత్తిక,మహా ప్రళయాలని తేడాలున్నాయి. మహాప్రళయం అప్పుడే రాదు.దానికి ఇంకా ఎంతో సమయం గడవాలి. కాని నిత్య,నైమిత్తిక ప్రళయాలు మాత్రం చక్కగా వస్తూనే ఉంటాయి.అక్కడక్కడా జనసమూహాలను తుడిచి పెడుతూనే ఉంటాయి.ఎంతోమందిని దుర్మరణం పాలు చేసి పరలోకానికి తీసుకుపోతూనే ఉంటాయి.ఇవి నిత్యమూ జరుగుతూనే ఉన్నాయి.కాకుంటే కొన్నికొన్ని గ్రహస్తితులలో ఎక్కువ వేగంగా జరుగుతాయి.ఆ స్తితులు మారినప్పుడు నిదానంగా జరుగుతాయి.

కనుక భూగోళానికి ఇప్పట్లో వచ్చిన భయం ఏమీలేదు.ఈ పుకార్లు నమ్మకండి.ప్రళయం రాదు.మానవజాతికి ఇప్పట్లో ఏమీకాదు.అన్ని రోజులలాగే రేపు కూడా వస్తుంది.పోతుంది. మనం మళ్ళీ ఇంకో ప్రళయడేట్ కోసం వెతుక్కుందాం.దాన్ని ఉపయోగించుకుని మళ్ళీ సినిమాలు తీద్దాం.పుస్తకాలు రాద్దాం.ప్రళయబూచిని చూపించి అర్జెంటుగా మతాలు మారుద్దాం.ఈ సాకును ఉపయోగించుకొని రకరకాల వ్యాపారాలు చేసి జనానికి బాగా టోపీలు వేసి సంపాదిద్దాం. మిలియన్ల డాలర్లు సర్కులేట్ చేద్దాం. 

అయినా మీపిచ్చిగాని,ప్రళయం వచ్చేటంతగా మనపాపం ఇంకా పండలేదు.ప్రళయాన్ని ఆహ్వానించడానికి మన పాపాల బలం ప్రస్తుతానికి చాలదు.కనుక అర్జెంటుగా మరిన్ని పాపాలు,కొత్తకొత్త వెరైటీ పాపాలు ఇంకాఇంకా చేసి భూభారం బాగా పెంచుదాం.అప్పుడుగాని ప్రకృతికి కోపం రాదు,అప్పుడుగాని ప్రళయం రాదు.ఇప్పట్లో ఆచాన్స్ లేదు కనుక, అప్పటిదాకా -- సర్వే ప్రాణినా స్సుఖినో భవంతు.
read more " 21-12-2012 మహాప్రళయం "

17, డిసెంబర్ 2012, సోమవారం

తెలుగు వారోత్సవాలు- లెట్స్ స్పీక్ ఇన్ టేల్గూ ఓన్లీ

మొన్నొకరోజు ఒక స్నేహితుని నుంఛి ఫోనొచ్చింది.

'తెలుగు వారోత్సవాలలో భాగంగా సభలు జరుగుతున్నాయి.మీ ఫ్రెండ్ మాంత్రిక స్వామి కూడా వస్తున్నాడు.నువ్వూ అటెండ్ అవుతావా?'

సామాన్యంగా ఇలాంటి తూతూ మంత్రపు తంతులు నాకిష్టం ఉండవు. ఎందుకంటే ఇలాంటివి జరిపే వారికీ,హాజరయ్యేవారికీ చిత్తశుద్ధి ఎక్కడా ఉండదు.అంతా అహంకార ప్రదర్శనకోసమో,లేకపోతే నెట్ వర్కింగ్ ద్వారా గుంపును పోగేసుకోవడం కోసమో చేస్తుంటారు.ఇలాంటివి పాతికేళ్ళ క్రితమే చూచీ చూచీ విసుగు పుట్టింది.కాని ఏదో స్నేహితుడు పిలిచాడుకదా అని సరే అనుకున్నాను.

'అటెండ్ అవను.వస్తాను.నువ్వు వెళుతున్నది తెలుగు వారోత్సవాలకు. కనీసం ఇప్పుడైనా చక్కని తెలుగు మాట్లాడరా.అటెండ్ ఏమిట్రా నీ బొంద.' అన్నాను.

అనుకున్న సమయానికి వాళ్ళింటికి వెళ్ళాను.వాడి శ్రీమతి ఎదురొచ్చింది.

'ఏడమ్మా వీడు?' అడిగాను.

ఆమె నవ్వుతూ 'గంట నుంచీ పంచె కట్టుకొవడంతో కుస్తీ పడుతున్నారు' అంటూ టీ తేవడానికి వంటింట్లోకి వెళ్ళింది.ఇదొక గోల.తెలుగు భాష అంటే చాలామందికి ముందుగా పంచె గుర్తుకొస్తుంది.

నేను హాల్లో కూచుని ఉండగా కాసేపటికి పంచెని సర్దుకుంటూ బెడ్రూమ్ లోంచి బయటకి వచ్చాడు. 

వాడి అవతారం చూస్తె నాకు నవ్వాగలేదు.'ఎక్కడన్నా కోలాటం ప్రోగ్రాం ఉందేమిట్రా?ఎవరు కట్టార్రా ఈ పంచె' అడిగాను. ఇంతలో వాడి వెనుక నుంచి ఒక బక్కపలచని శాల్తీ బయటకొచ్చింది.

'ఈయన పేరు కొండల్రావు. కోలాటం స్పెషలిస్టు.మన 'నైబర్.' చెప్పాడు వాడు.

'అందుకని నీకూ కోలాటం పంచె కట్టాడా? నీ చేతిలో రెండు కోలాటం కర్రలూ,చెవులో ఒక నెమలి పించెం పెడితే వేషం సరిగ్గా ఉంటుందిరా.' అన్నాను నవ్వుతూ.

'బాలేదంటావా?' అన్నాడు.

'ఎందుకు బాలేదు.ప్రాంగణంలో సరాసరి వెళ్లి కోలాటం గుంపులో కలిసిపోవచ్చు. ఒరేయ్. పంచె కట్టులో చాలా రకాలున్నయిరా.వెళ్లి సరిగ్గా కట్టుకొని రా.'అన్నాను.

'మరి నాకు రాదుగా.నా జన్మలో ఒకటో రెండో సార్లు మాత్రమె పంచె కట్టాను.అదికూడా ఎవరో కట్టారు.' అన్నాడు.

'సరే మామూలుగా పేంటూ షర్టూ లో రా.'అన్నాడు.

'అలా వస్తే తెలుగు వేషంలా ఉండదురా. ఈ రోజన్నా కొంచం నటించాలిగా' అంటూ నిజం ఒప్పుకున్నాడు.

'సరే పద నే కడతాను'.అంటూ వాడిని బెడ్ రూమ్ లోకి తీసికెళ్ళి చక్కగా పంచె కట్టి తీసుకోచ్చేసరికి అరగంట పట్టింది. ఎంత కట్టినా ఆ పంచె ఊడిపోతుంటే చివరికి బెల్ట్ పెట్టి దానిని బిగించి కట్టవలసి వచ్చింది.

వాడి శ్రీమతి ఇచ్చిన టీ తాగి ప్రాంగణానికి చేరుకున్నాం. అప్పటికే పెద్ద పెద్ద వాళ్ళందరూ అక్కడకు చేరుకుంటున్నారు. 'హలో' 'హాయ్' 'గుడ్మానింగ్' అంటూ చేతులెగరెయ్యడాలు తప్ప చక్కగా చేతులు జోడించి 'నమస్కారం'అన్న మాటే ఎక్కడా వినిపించడంలేదు.వీడు VIP ల గుంపులో చేరిపోయాడు.నేను ప్రేక్షక సీట్లలో కూచుని అందరి వాలకాలూ చక్కగా చూస్తున్నాను.

ఎక్కణ్ణించో కాలేజీ అమ్మాయిలను పరికిణీ ఓణీలు కట్టి తీసుకొచ్చారు.ఆ డ్రస్సులు పాపం వాళ్ళు మర్చిపోయి చాలా ఏళ్ళయినట్లుంది ఎంతో ఇబ్బంది పడుతున్నారు.తోరణాలు బేనర్లూ అన్నీ అట్టహాసంగా కట్టి ఉన్నాయి.సన్నాయి సీడీ మైకులో చక్కగా మోగుతోంది.

ప్రార్ధనా గీతాలూ గట్రాలు అయిపోయాక ఉపన్యాసాలు మొదలయ్యాయి. ప్రధాన వక్త మైకందుకున్నాడు.

'టుడే వి హావ్ గేదర్డ్ హియర్ టు సెలబ్రేట్ తెలుగు వారోత్సవాలు.' అని సంకర భాషలో ఉపన్యాసం మొదలు పెట్టాడు. ఆ దెబ్బకి నేను భావాతీత స్తితికి చేరుకొని ఏ విధమైన స్పందనా లేనట్టి స్తితిలో కెళ్ళిపోయాను.

'మన భాష తెలుగు భాష.టుడే ఇట్ ఈజ్ ఇన్ గ్రేట్ డేంజర్.దీనిని మనం ప్రోమోట్ చెయ్యాలి.ICU లో ఉన్న ఈ యాన్షిఎంట్ లాంగ్వేజీని డ్రాగ్ చేసి తీసుకొచ్చి ప్రౌడ్ గా నడిరోడ్డుమీద నిలబెట్టాలి' అన్నాడు.ఆయన భావం ఏమిటో నాకస్సలు అర్ధం కాలేదు.'బట్టలతోనా బట్టలు లేకుండానా' అని అడుగుదామని నోటిదాకా వచ్చింది.

'మన లాంగ్వేజీలో మంచి పోయెట్స్ చాలామంది ఉన్నారు. తిక్కన, ఎర్రన, కాళిదాసూ,శ్రీనాధుడూ,విశ్వనాధ సత్యనారాయణ,వేమనా,సిపీ బ్రౌన్ ఇంకా చాలామంది.' అన్నాడు.

నాకు చుక్కలు కనిపించాయి.కాళిదాసూ,వేమనా,బ్రౌనూ తెలుగు కవులు ఎప్పుడయ్యారా అని తెగ ఆలోచించాను.కానీ ఏమీ అర్ధం కాలేదు.నన్నయ ఏమైపోయాడో కూడా తెలీలేదు.నిలువు గుడ్లేసుకుని అలా చూస్తున్నాను.

'ఈనాడు మన తెలుగువాళ్ళు అమెరికాలో వేగంగా ముందుకెళుతున్నారు. అక్కడ డాక్టర్లుగా ఇంజనీర్లుగా రాణిస్తున్నారు.ఈవెన్ దే ఆర్ ఎంటరింగ్ పార్లమెంట్ ఇన్ అమెరికా' అని చప్పట్ల మధ్య ఉద్ఘోషించాడు.

అమెరికాలో పార్లమెంట్ ఎక్కడుందో మళ్ళీ నాకేమీ అర్ధం కాలేదు.'మనవాళ్ళ కులగజ్జినీ, అమెరికాలో కులసంఘాలనూ,వారి మధ్య ఉన్న కుళ్ళు రాజకీయాలనూ కూడా చెబితే బాగుంటుంది కదా' అనుకున్నాను.

'మన పొరుగునున్న తమిళ సోదరులను చూసైనా వి హావ్ టు వేకప్. అదర్వైజ్ వి హావ్ నొ ఫ్యూచర్.లెట్ట్ అజ్ మార్చ్ ఫార్వార్డ్ టు మేక్ తెలుగు ఎ రియల్ గ్లోబల్ లాంగ్వేజ్.' అంటూ ముగించాడు. ప్రాంగణం చప్పట్లతో మార్మోగిపోయింది.

ఇంకొకాయన మైకందుకున్నాడు.

'తెలుగు లేనిదే భారత దేశం లేదు.' అంటూ ప్రసంగం మొదలు పెట్టాడు. ఎలా చెబుతాడా అని చూస్తున్నాను.

'మన జాతీయ జెండా 'డిజైన్' చేసిన పింగళి వెంకయ్య తెలుగువాడు. పెన్సిలిన్ 'డిస్కవర్'చేసిన సుబ్బారావు తెలుగువాడు.మనకు ప్రైమ్మినిష్టర్ చేసిన నరశింహారావు తెలుగువాడు. ఆర్బీఐ గవర్నర్ తెలుగువాడు. అమెరికాలో కేన్సర్ స్పెషలిస్ట్ నోరి దత్తాత్రేయుడు తెలుగువాడు.'అంటూ ఏమేమో చెబుతున్నాడు. 

నాకు మళ్ళీ కళ్ళు బైర్లు కమ్మాయి.వారి వారి రంగాలలో వాళ్ళు ఉన్నత స్థాయికి చేరుకోడానికి వాళ్ళ కృషీ,పట్టుదలా,అదృష్టమూ కారణాలవుతాయి. అంతేగాని అందులో వాళ్ళ మాతృభాష యొక్క పాత్ర ఏమిటో మళ్ళీ ఎంత ఆలోచించినా అర్ధం కాలేదు. ఇక అక్కడ కూచోవడం అనవసరం అనిపించింది.

ఇలా కాదని, లేచి ప్రాంగణం లోనుంచి బయటపడ్డాను.మెల్లిగా ఇంటిదారిన నడక మొదలు పెట్టాను.

ఇది ప్రభుత్వ నిధులతో జరపబడుతున్న తంతు గనుక ఎదో మొక్కుబడిగా ఈ సమావేశాలు పెట్టారు. ఇందులో ఒక్కడికీ చక్కని తెలుగు మాట్లాడదామని లేదు. సగం ఇంగ్లీష్ మాటలూ సగం తెలుగు మాటలూ కలిపి మన టీవీలలో,రేడియోలలో కులికే వగలాడి యాంకరమ్మల పుణ్యమా అని సంకర భాష సమాజం మొత్తాన్నీ కలుషితం చేసి పారేసింది. ఇంగ్లీషు వాడు వెళ్ళిపోయిన 60 ఏళ్ళ తర్వాత టీవీల ద్వారా మళ్ళీ ఇలా భాషాపరంగా దండెత్తి మనమీదకు వస్తున్నాడు. వాళ్ళు మన దేశాన్ని పాలించినప్పుడు కూడా ఇంత ఇంగీషు పిచ్చి మనలో లేదేమో అని నా సందేహం. అప్పుడు కూడా విదేశాలకు వెళ్లి చదువుకున్నవారున్నారు. కాని వారు ఇంగ్లీషును ఇంగ్లీషుగా చక్కగా మాట్లాడేవారు. తెలుగును తెలుగుగా మాట్లాడేవారు. రెండూ మంచి భాషలే. కాకపోతే కలగాపులగంగా కలిపి కాకుండా దేనిని దానిగా స్వచ్చంగా మాట్లాడితే వినడానికి ఇంపుగా ఉంటాయి. అదే ప్రస్తుతం లోపిస్తున్నది.ప్రస్తుతం మంచి తెలుగు మాట్లాడేవాడూ లేడు. మంచి ఇంగ్లీషు మాట్లాడేవాడూ లేడు.అంతా సంకరమయం.

ముందుగా ప్రతివాడూ తెలుగును తెలుగుగా మాట్లాడే ప్రయత్నం చెయ్యాలి. ఒక్క ఇంగ్లీషు ముక్క కూడా మధ్యలో రాకుండా అచ్చతెలుగు మాట్లాడే పట్టు పట్టాలి. అప్పుడే మన భాష మళ్ళీ బ్రతుకుతుంది. లేకుంటే ఇలా చిత్తశుద్ధి లేని చెత్త సమావేశాలు ఎన్ని పెట్టుకున్నా అవి వేదికలెక్కి ఒకరినొకరు ఉబ్బెసుకునే ఉత్త తంతులేగాని వీటివల్ల ఏమీ ప్రయోజనం ఉండదు.  

అలా నడుస్తూ ఒక సందులోనుంచి వస్తున్నాను.ఒక పాత కాలం ఇల్లు ముందుగా వస్తుండగా ఒక సన్నివేశం కనిపించింది.ఇంటి ముందు బాగా ఖాళీ చోటు ఉన్నది. అందులో ఒక నులక మంచంలో ఒక పెద్దాయన పడుకొని ఉన్నాడు. ఆయనకీ దాదాపు 65-70 ఏళ్ళు ఉండవచ్చు. పక్కలో ఒక చిన్న పిల్లవాడు కూడా ఉన్నాడు.వాడికి మూడో నాలుగో ఉంటుంది.'శ్రీరాముని దయచేతను' అంటూ ఆ పిల్లవాడికి పద్యం నేర్పిస్తున్నాడు ఆ ముసలాయన.

కాసేపు ఆయన పద్యం ఎలా నేర్పిస్తున్నాడా అని వింటూ అక్కడ ఆగిపోయాను. రెండు సన్నివేశాలు నా కళ్ళముందు కనిపించాయి. ఒకపక్క చిత్తశుద్దిలేని సమావేశాలు,మైకుల్లో అరుపులు,కాని నిత్యజీవితంలో ఆచరణ శూన్యం. ఇంకో పక్క చడీచప్పుడు లేకుండా,లోకం మెప్పు ఏమాత్రం కోరకుండా,సహజంగా మాతృభాషతో బాటు నైతిక విలువలను రంగరించి అతి చిన్నతనంలోనే ఒక భవిష్యత్ పౌరుణ్ణి తీర్చిదిద్దుతున్న నిరాడంబర ప్రయత్నం. చాలా ముచ్చటేసింది.

లోకంలో విలువైన సంఘటనలన్నీగుర్తింపుకు దూరంగా,ఏ పటాటోపమూ లేకుండా, మౌనంగానే జరుగుతాయేమో అని అనుకుంటూ ఇంటివైపు నడక సాగించాను.  
read more " తెలుగు వారోత్సవాలు- లెట్స్ స్పీక్ ఇన్ టేల్గూ ఓన్లీ "

14, డిసెంబర్ 2012, శుక్రవారం

నీకు తెలీదు నేను చెప్పింది విను

మొన్నొక అల్లోపతి డాక్టర్ క్లినిక్లో కూచుని ఉన్నాను.ఆ డాక్టర్ నా స్నేహితుడు.ఎప్పుడైనా ఆవైపు వెళితే ఒకసారి అతన్ని పలకరించి వస్తుంటాను.నేను వెళ్లేసరికి ఆయన ఒక పేషంట్ ని చూస్తున్నాడు. అప్పటికే రూమ్ లో ఒక పదేళ్ళ పిల్లా ఆమె తల్లీ ఒకపక్కగా నిలబడి ఉన్నారు. బహుశా అప్పుడు చూస్తున్న పేషంట్ అయిపోయాక వీరి టర్న్ కోసం వేచి ఉన్నారనిపించింది.సరే నేనూ ఎదురుగా కూచుని నాధోరణిలో హోమియోపతిక్ కోణంలో వారిని గమనిస్తున్నాను.

నేను ఒక వ్యక్తిని చూచేటప్పుడూ,మాట్లాడేటప్పుడూ అనేక కోణాలలో వారిని సూక్ష్మంగా పరిశీలిస్తాను.అలా పరిశీలిస్తున్నట్లు వారికి తెలీకుండా చేస్తాను.హోమియోపతిక్ పరంగా,జ్యోతిష్య పరంగా, పంచతత్వపరంగా, ఆధ్యాత్మిక,యోగ/తంత్ర పరంగా ఇలా చాలా కోణాలలో చూస్తాను. దానివల్ల ఆ వ్యక్తిలోని విభిన్న వ్యక్తిత్వఅంశాలు,వారి అలవాట్లూ, మనస్తత్వాలూ, ఉద్దేశాలూ,వారి జాతకంలోని దోషాలూ,వారి పూర్వీకులు చేసిన పాపాలూ అన్నీ తేటతెల్లంగా ఎక్స్-రే లో చూచినట్లు కనిపిస్తుంటాయి.

ఆ అమ్మాయి కొంచం ఆయాసపడుతున్నట్లు కనిపిస్తున్నది. అప్పుడప్పుడు ముక్కులు ఎగబీలుస్తున్నది.అమ్మాయి బొద్దుగా పొట్టిగా ఉన్నది. తల్లి కూడా బొద్దుగా పొట్టిగానే ఉన్నది.డిస్నియా అని చూస్తేనే అర్ధమౌతున్నది.కానీ వారిద్దరిలోనూ అసహనం లేదు. ప్రశాంతంగా ఉన్నారు. ఫాన్ దగ్గరగా జరగడం చూసి వారికి గాలికావాలని అర్ధమౌతున్నది.వాళ్ళను చూస్తేనే "పల్సటిల్లా" తత్త్వం కనిపిస్తున్నది. 

పేషంట్ ను ఇంకొంచం పరీక్షిద్దామని "కూచోండమ్మా" అని కుర్చీ చూపించాను.

"పరవాలేదండి" అంటూ వాళ్ళు నిలబడే ఉన్నారు. 

"ఓహో అయితే 'సల్ఫర్' ఇండికేట్ కావడం లేదన్నమాట." అని మనసులోనే అనుకున్నాను. 

ఈ లోపల ఆ పేషంట్ సరిగ్గా మందులు వేసుకోవడం లేదని విసుక్కుంటూ అతన్ని బెదరగోడుతూ ఏదో మాటలు చెబుతూ కొన్ని కొత్త మందులు రాసిచ్చాడు మా ఫ్రెండ్. అవి వాడి మళ్ళీ ఒకవారం తర్వాత రమ్మని చెప్పి అతన్ని పంపేశాడు. ఈ తల్లీ పిల్లల వైపు తిరిగి కూచోమని సైగ చేశాడు.

"ఏంటమ్మా బాధ?" అడిగాడు. 

"నాక్కాదండి అమ్మాయికి" చెప్పింది తల్లి.

"ఏమైంది" అడిగాడు.

"అమ్మాయికి ఆయాసం అండి"

సరే అమ్మాయిని కూచోబెట్టి స్టేత్ తో లంగ్స్ పరీక్ష చేసాడు. వీజింగ్స్ ఎలాగూ ఉంటాయి. తలపంకిస్తూ "ఎప్పటి నుంచి?" అడిగాడు.

"పుట్టినప్పటినుంచీ ఉందండి.చలికాలంలో ఎక్కువగా  వస్తుంటుంది." చెప్పింది తల్లి.

"మందులు రాసిస్తున్నాను.అవి వాడి మళ్ళీ వారం తర్వాత కనిపించండి." అంటూ ఒక చీటీ మీద మందులు రాసిచ్చి కొనుక్కుని తెచ్చి చూపించమన్నాడు.

"జాగ్రత్తలు చెప్పవా?" అని గుర్తు చేశాను.

"దుమ్ము తగలకుండా చూచుకొండి.చలిగాలికి తిరగనివ్వవద్దు. ఫ్రిజ్ లో ఉంచిన పదార్ధాలు పెట్టవద్దు. చలికాలం పోయేవరకూ పెరుగు పెట్టవద్దు. రాత్రిళ్ళు ఫెన్ కింద పడుకోరాదు.దూరంగా పడుకోవాలి.రూమ్ లో డస్ట్ లేకుండా శుభ్రంగా ఉంచండి." మొదలైన జాగ్రత్తలూ అన్నీ చెప్పాడు.

"అన్నీ పాటిస్తామండి.కాని అమ్మాయి ఫాన్ లేనిదే పడుకోదు. గాలి కావాలని గొడవ చేస్తుంది" చెప్పింది తల్లి. 

డాక్టర్ కి కోపం వచ్చింది. 

"అయితే అనుభవించండి.నేనేం చెయ్యగలను? చెప్పడం వరకే మా వంతు.వినమూ మా ఇష్టం అంటే బాధపడక తప్పదు." అంటూ నా వైపు తిరిగి "ఇలా ఉంటారు పేషంట్లు" అన్నాడు.

నేనేమీ మాట్లాడలేదు."డాక్టర్లుకూడా ఇలాగే ఉంటారు"మనసులో అనుకున్నాను.

"మరేలాగండి?అమ్మాయి దుప్పటి కప్పితే ఊరుకోదు. తనకి గాలి బాగా కావాలి" అన్నది తల్లి.

"చూడమ్మా.నీకు తెలీదు నేను చెప్పింది విను. డాక్టర్నినేనా నువ్వా?.నేను చెప్పినట్లు వింటే మీ అమ్మాయికి తగ్గుతుంది.చిన్నపిల్ల తనకు తెలీదు. మీరు నచ్చచెప్పాలి" అన్నాడు.

వారు మందులు తీసుకుని వెళ్ళిపోయారు. వారు బయటకి వెళుతూ ఉండగా ఆమెను నేను ఒక ప్రశ్న అడిగాను.

"చూడమ్మా. మీ వైపు గాని మీ వారి వైపుగాని ఎవరికైనా ఉబ్బసం ఉందా?"

"ఉన్నదండి. మా మామగారు అత్తగారు ఇద్దరూ ఉబ్బసం పేషంట్లే" చెప్పింది ఆమె.

నాకు పరిస్తితి అర్ధం అయింది. అది అనవసర ప్రశ్న అన్నట్లు మా ఫ్రెండ్ అసహనంగా ముఖం పెట్టాడు.నాకు నవ్వొచ్చింది.కొద్దిసేపు కూచుని ఇక సెలవు తీసుకుని బయలుదేరాను. అసలు మందు రోగికి కాదు,మా ఫ్రెండ్ కి వెయ్యాలి అనిపించింది.

హన్నేమాన్ దృష్టిలో ఇది డయాగ్నైసిసూ కాదు.ప్రిస్క్రిప్షనూ కాదు.ఎందుకంటే ఇతను మందిచ్చింది రోగానికే గాని రోగికి కాదు.కనుక ప్రస్తుతానికి ఈ మందులకు ఆ అమ్మాయికి బాధ తగ్గినా పూర్తిగా రోగం నయం అవదు. పై ఏడాది వచ్చె చలికాలంలో ఇంకా ఉధృతంగా ఎటాక్ వస్తుంది. అప్పుడు ఏ కార్టిజానో వాడవలసి వస్తుంది. ఈలోపల ఆ అమ్మాయి  రోగనిరోధక శక్తి వేగంగా క్షీణిస్తుంది. ఇక ఆ అమ్మాయి మందులకు బానిస అయిపోతుంది. కానీ రోగం ఉపశాంతినిస్తుందే గాని పూర్తిగా తగ్గదు. నేను 1990-1995 మధ్యలో హోమియో నేర్చుకుని విజయవాడలో మా స్టడీ సర్కిల్ క్లినిక్ లో పనిచేసినప్పుడు ఇలాంటి కేసులు ఎన్నో చూచాను. ఈ అమ్మాయికి ఈ ట్రీట్మెంట్ లో ఏళ్ళు గడిచే కొద్దీ రోగం ముదిరి ఇతర అవయవాలకు వ్యాపిస్తుంది గాని తగ్గదు.ఎందుకిలా జరుగుతుంది? అనే ప్రశ్నకు అల్లోపతి లో జవాబు లేదు. ఒక్క హోమియోపతి మాత్రమే దీనికి జవాబు ఇవ్వగలదు.

రోగపరంగా ఆ డాక్టర్ చెప్పినది కరెక్టే. కాని రోగి యొక్క తత్వాన్ని (constitution) అతను లెక్కలోకి తీసుకోలేదు. కనుక అతని ట్రీట్మెంట్ వల్ల రోగి తత్వంలో మార్పు రాదు.అలా తత్వపరంగా మార్పు రాకుండా జరిగే క్యూర్ అణచివేత అవుతుంది గాని, రోగ నిర్మూలనం అవదు.రోగం ఏడాది నుంచి ఏడాదికి ముదురుతూ పోతుంది.లేదా సుగరూ బీపీ వంటి కొత్త బాధలు మొదలౌతాయి. అంటే రోగం శరీరంలో ఇంకా లోతుకు పాకిపోతున్నది అని అర్ధం. అది సైంటిఫిక్ క్యూర్ అనిపించుకోదు.

అందుకే హన్నేమాన్ రోగి లక్షణాలనూ, రోగ లక్షణాలనూ, ఉద్రేక ఉపశమనాలనూ, రోగి యొక్క మనస్తత్వాన్నీ, అతని కోరికలనూ,అసహ్యాలనూ, ఉద్వేగాలనూ, అన్నింటినీ పరిగణనలోకి తీసుకొమ్మని 'ఆర్గనాన్' లో చెబుతాడు. అలా అన్ని లక్షణాలకు సరిపోయిన మందే రోగికి తత్వపరంగా నయం చెయ్యగలుగుతుంది.అదే సైంటిఫిక్ క్యూర్ అవుతుంది.అప్పుడు రోగం లోపలనుంచి బయటకు నెట్టబడుతుంది. ప్రాణాధార అవయవాలు కోలుకుంటాయి. హోమియోపతిలో ట్రీట్మెంట్ సరియైన దారిలో నడుస్తుంటే,ఉన్న రోగం ముదరదు,కొత్తరోగాలు రావు. అయితే హోమియో మాత్రలు ఇచ్చిన ప్రతిడాక్టరూ హోమియో సిద్ధాంతాలు పాటిస్తూ ట్రీట్మెంట్ చేస్తున్నట్లు కాదు.దీంట్లో కూడా మాయ ఉన్నది.ఇది మళ్ళీ వేరే కోణం. దీని గురించి ఇంకొక పోస్ట్ లో వ్రాస్తాను. 

అల్లోపతిలో ఉబ్బసం అంటే అందరికీ అవే మందులు ఉంటాయి. కాని హోమియోపతిలో ఏ ఇద్దరు ఉబ్బసం పేషంట్లకూ ఒకే మందు ఉండదు.రోగి యొక్క తత్వాన్ని బట్టి మందు మారిపోతుంది. ఈ అమ్మాయికి అంత ఉబ్బసం లోనూ, చలిగాలి కావాలి. అదే విచిత్ర లక్షణం. ఈ లక్షణాన్ని విస్మరించడం వల్ల ట్రీట్మెంట్ మొత్తం పక్కదారి పడుతుంది. కాని అలా అన్ని లక్షణాలనూ పరిగణన లోకి తీసుకోవడం అల్లోపతీ లో ఉండదు.ఇక్కడ క్లినికల్ టెస్ట్ చూపించే రీడింగ్ ఒక్కటే ప్రధానం.అందులో రోగిని మనిషిగా కాకుండా ఒక పశువుగా మాత్రమె ట్రీట్ చేస్తారు.పేషంట్ చెబుతున్నది వినిపించుకోరు.ఇలాంటి కేసులు చూచే,మా గురువుగారు అల్లోపతీని 'పశువైద్యం'అనేవారు.ఎందుకంటే వెటరినరీ మెడిసిన్ లో కూడా పశువు ఇష్టాఇష్టాలు లెక్కలోకి తీసుకోరు. అలాగే అల్లోపతీ చికిత్స లో కూడా పేషంట్ చెబుతున్న సూక్ష్మ వివరాలు అస్సలు వినరు. అది వాళ్ళతప్పు కూడా కాదు. వాళ్ళ సిస్టం అంతే. తత్వపరమైన చికిత్స అల్లోపతి లో ఉండదు.అంటే అల్లోపతిని నేను తక్కువ చెయ్యడం లేదు.కొన్నికొన్ని సీరియస్ సందర్భాలలో,కొన్ని కొన్ని రోగాలలో అదీ చాలా అవసరమే. కాని క్రానిక్ డిసీజెస్ తగ్గించడం ఒక్క హోమియోపతిలోనే సాధ్యం అవుతుంది అని నా అనుభవం చెబుతున్నది.అల్లోపతీ విధానంలో ఇలాంటి పరిశీలనా, పొటెన్సీ డ్రగ్స్ తో చికిత్సా ఉండదు.ఒక పేషంట్ ను వారు చూచే విధానం వేరుగా ఉంటుంది.హోమియోలో చూచే విధానం వేరుగా ఉంటుంది.

ఈ అమ్మాయికి పల్సటిల్లా, కార్బోవెజ్ ప్రస్తుతానికి సరైన మందులు. వాటిని వాడితే తనకి రోగం పూర్తిగా నయం అయిపోతుంది. వచ్చె చలికాలానికి ఇంత తీవ్రపు ఎటాక్ రాదు. క్రమేనా ఒకటి రెండు సంవత్సరాలలో తనకి పూర్తిగా తగ్గవచ్చు. ఎందుకంటే పుట్టినప్పటినుంచే ఉన్నది గనుక వంశపారంపర్యంగా జీన్స్ లో వచ్చింది. అమ్మాయి తాతయ్యకూ నానమ్మకూ అదే రోగం ఉన్నది. కనుక తండ్రి జీన్స్ ద్వారా ఈ అమ్మాయికి సంక్రమించింది.వివాహం అయ్యేలోపు ఈ అమ్మాయికి హోమియో ట్రీట్మెంట్ ద్వారా తగ్గించకపోతే రేపు ఈ అమ్మాయి పిల్లలకు కూడా వస్తుంది. దానికి constitutional treatment ఇవ్వాలి. అది అల్లోపతీలో ఉండదు.వీళ్ళకు అర్ధం అయ్యేటట్లు చెప్పేవారు లేరు. చెప్పినా చాలామంది వినరు. కర్మ అనుభవించవలసి ఉన్నపుడు మంచి చెప్పినా అర్ధం కాదు.

లోకంలో చాలామంది ఇలాగే అజ్ఞానంలో ఉంటారు.అది వారి తప్పుకూడా కాదు.అంతా కర్మప్రభావం.ప్రారబ్ధకర్మ బలంగా ఉన్నపుడు ప్రతిదీ తప్పుదారిలో తీసుకెళుతుంది.అది తప్పుదారి అనికూడా వారికి ఆ సమయంలో తోచదు. వారు చేస్తున్నది కరెక్టే అనిపిస్తుంది.అదే మహామాయ. రోగికి కర్మ తీరే సమయం వచ్చినపుడే సరియైన హోమియో వైద్యుడు దొరుకుతాడు.ఇది వినడానికి వింతగా నవ్వొచ్చే మాటలా వినిపిస్తుంది. కాని సత్యం.అలాగే మనిషికి కూడా నిజంగా కర్మ తీరే సమయం వచ్చినపుడే సరియైన గురువూ దొరుకుతాడు. ఇదీ వినడానికి వింతగా అనిపిస్తుంది. కాని ఇది కూడా సత్యమే.

రెండు వందల ఏళ్ల క్రితమే హన్నేమాన్ చేసిన పరిశోధనకూ ఆయన మేధాశక్తికీ సునిశిత పరిశీలనకూ ఆశ్చర్య పోతూ, ఆయన పోయి ఇన్నాళ్లైనా ఆయన రీసేర్చిని అర్ధం చేసుకోలేని లోకాన్ని చూచి జాలిపడుతూ మౌనంగా ఇంటి దారి పట్టాను.
read more " నీకు తెలీదు నేను చెప్పింది విను "

13, డిసెంబర్ 2012, గురువారం

పండిత రవిశంకర్ జాతకం-నివాళి

ఈసారి కార్తీక అమావాస్య ప్రభావం పండిత రవిశంకర్ ను తీసుకు పోయింది.రాహుకేతువుల నీచ స్తితివల్ల గత ఏడాదిన్నరగా ఎందరు ప్రసిద్ధ వ్యక్తులు పరలోకం దారి పట్టారో లెక్కిస్తే ఆ లిస్టు చాలా పెద్దది అవుతుంది.రాహువుకు వృశ్చికం నీచస్థానం కావడమూ అది సహజ జ్యోతిశ్చక్రంలో అష్టమస్థానం కావడమే దీనికి కారణం.ఇంకో రెండువారాల్లో రాహుకేతువులు రాశి మారబోతున్నారు. పోతూపోతూ ఒక ప్రసిద్ధ సంగీత విద్వాంసుణ్ణి తీసుకుపోయారు.అంతేకాదు ఈ రెండువారాల్లో ఇంకా కొందరిని కూడా తీసుకుపోతారు.ఎందుకంటే ఒకసారి రాశి మారితే ఈ చాన్స్ మళ్ళీ 18 ఏళ్ళకు గాని వారికి రాదు.అదలా ఉంచితే,ఈ సందర్భంగా ఒకసారి పండిత రవిశంకర్ జన్మ కుండలి పరిశీలిద్దాం.

పండిత రవిశంకర్ చౌధురీ 7-4-1920 న వారణాసి లో పుట్టాడు.ఖచ్చితమైన జనన సమయం తెలియదు.కనుక మనకు తెలిసిన ఇతర పద్దతులతో చూద్దాం.నక్షత్రం విశాఖ గాని అనూరాధ గాని అవుతున్నది.కాని విశాఖ కంటే కూడా అనూరాధ నక్షత్రమే సంగీతం వంటి లలిత కళలలో ప్రఖ్యాతిని ఇస్తుంది. కనుక ఈయన నక్షత్రం అనూరాధ అయి ఉండవచ్చు. ఆ రోజు ఉదయం తెల్లవారుజాము 3 నుంచి అనూరాధ నక్షత్రం ఉన్నది. కనుక ఆయన ఆ తర్వాత పుట్టి ఉండవచ్చు. ఉదయం 9.30 సమయంలో అయితే లగ్నం వృషభం అవుతుంది. శుక్రుడు ఉచ్ఛ స్త్తితిలో సూర్యునితో కలిసి లాభస్తానంలో ఉండటం చూడవచ్చు.దీనివల్ల లలితకళలలో మంచి పెరు ప్రఖ్యాతులు వస్తాయి. చంద్రుడు కూడా ఆ సమయంలో వృశ్చికం 6 డిగ్రీలలో ఉన్నాడు. ఈ డిగ్రీలు అనూరాధ ఒకటో పాదాన్ని సూచిస్తాయి.అప్పుడు నవాంశ లో చంద్రుడు సింహరాశిలోకి వస్తాడు. సింహ నవాంశ వారికి జుట్టు పలచగా ఉంటుంది. చివరి దశలో ఆయన ముఖం చూస్తే కూడా సింహాన్ని గుర్తుకు తెస్తుంది.ఈ కారణాల వల్ల ఆయన ఉదయం 9.30 ప్రాంతంలో పుట్టి ఉండవచ్చు అనుకుందాం.

ఈయన జాతకంలో కుజుడు శనీ వక్రించి ఉన్నారు. కుజుడు రాహునక్షత్రంలో ఉన్నాడు. పైగా రాహువుతో కలసి ఉన్నాడు. వీరికి ఆత్మశక్తి,మొండితనమూ చాలా ఎక్కువగా ఉంటాయి. బహుముఖమైన ప్రజ్ఞ కూడా వీరికి ఉంటుంది.వీరిద్దరూ శుక్ర రాశిలో ఉండటంతో వీరికి స్త్రీలంటే ఆకర్షణా బలహీనతా ఉంటాయి.కళారంగంలో ఇలాంటి బలహీనతలు చాలావరకూ మామూలే.దీనిని బలహీనతగా తీసుకోకూడదు.రసాస్వాదనాపరులకు మన్మధ మిత్రత్వం సహజంగా ఉంటుంది. దానినే దైవం వైపు తిప్పగలిగితే వాళ్ళు త్యాగరాజస్వామి వంటి మహనీయులు అవుతారు.అయితే ఆ అదృష్టం కోటిమందిలో ఒక్కరికే ఉంటుంది.మిగిలినవారు పుష్పబాణుని సేవలో పునీతులు కావలసిందే.ఈ కోణాన్ని అలా ఉంచితే,శని కేతునక్షత్రంలో వక్రించి ఉన్నాడు.కనుక లోకంతో చాలా ఋణానుబంధమూ తద్వారా ఎన్నో బాధలూ మానసిక చికాకులూ కూడా వీరికి తప్పవు. ఇవన్నీ ఆయన జీవితంలో జరిగాయని ఆయన గురించి తెలిసినవాళ్ళకు ప్రత్యేకంగా చెప్పనక్కర లేదు.మనిషి జీవితం 100% జాతకచక్రం ప్రకారమే  జరుగుతుంది. ఇందులో ఏమీ అనుమానం లేదు.

ఈయన జాతకంలో శుక్రుడూ గురువూ ఉచ్ఛ స్తితిలో ఉన్నారు.కనుక శుక్రుడు సంగీతంలో మంచి ప్రజ్ఞనూ,గురువు ప్రయత్నాలలో విజయాన్నీ ఇచ్చారు.అయితే శుక్రుడు బాల్యావస్థలో బలహీనంగా ఉన్నాడు.కనుక భార్యల వైపునుంచి సమస్యలు తప్పలేదు. గురువు సరిగ్గా భావమధ్యంలో బలంగా ఉన్నాడు. కనుక నడివయస్సు నుంచే ఈయనకు బ్రహ్మాండమైన ఖ్యాతి లభించింది. ఉచ్ఛశుక్ర సూర్యులపైన ఉన్న ఉచ్ఛగురు దృష్టి ఈయన జీవితంలో ఒక బ్రహ్మాండమైన యోగాన్ని ఇచ్చింది. ఈయన జాతకంలో ఇదే అతి ముఖ్యమైన యోగం. 

ఇకపోతే ఈయన నక్షత్రనాధుడైన శని విద్యాస్తానంలో ఉన్నాడు.కనుక వాయిద్యవిద్యలో ఆరితెర్చాడు.వక్రస్తితివల్ల గురువుతో కలిసి ఇంకా అదృష్టాన్ని ఇచ్చాడు. తృతీయం తీగ వాయిద్యాలకు సూచన. కనుక సితార్ పట్టుబడింది. అయితే శనిగురువుల కలయిక మంచిది కాదు కనుక దానివల్ల కష్టాలనూ చవిచూచాడు.

ఆయు:కారకుడైన శని నాడీవిధానం ప్రకారం ఉచ్ఛ గురువుతో కూడి ఉండటంతో పూర్ణాయుర్దాయం కలిగింది.ఒకవేళ మన లెక్క ప్రకారం లగ్నం వృషభమే అయితే,అష్టమాదిపతి తృతీయంలో ఉచ్చస్తితి వల్ల కూడా పూర్ణాయుజాతకం అవుతుంది. అందుకే 92 ఏళ్ల పూర్ణమైన జీవితాన్ని జీవించాడు.

రాహువు గురునక్షత్రంలో ఉండటం వల్ల, విదేశీ సంబంధాలూ, భారతదేశ సంగీతాన్ని విదేశీసంగీతంతో మేళవించి 'సింఫనీలు' సృష్టించడమూ, బీటిల్స్ మొదలైన విదేశీ కళాకారులను అమితంగా ప్రభావితం చెయ్యడమూ జరిగింది.ఎందఱో విదేశీయులకు 'సితార్' నేర్పించి వారికి గురువయ్యాడు.

ఆత్మకారకుడైన బుదునివల్ల సంగీతరంగంలో తెలివైన ప్రయోగాలు చేసి లక్షలాది జనాలను మంత్రముగ్ధులను చెయ్యగలిగాడు.కారకాంశ వాయుతత్వ రాశి అయిన మిథునం కావడం కూడా తీగవాయిద్యం మీద ప్రావీణ్యం రావడానికి ఒక కారణం.

అమాత్యకారకుడైన శుక్రుడు దారాకారకుడైన సూర్యునితో కలిసి ఉచ్ఛ స్తితిలో ఉండటం వల్ల సంగీతరంగంతో అనుబంధం ఉన్న సూ జోన్స్ తో వివాహం కలిగింది.అంతేగాక ఆయన భార్యలందరూ ఏదో రకంగా సంగీతంతో సంబంధం ఉన్నవారే అయ్యారు. 

ఇకపోతే 11-12-2012 న మరణకాలచంద్రుడు,దాదాపుగా జననకాల చంద్రుని పైన సంచరించడం చూడవచ్చు.ఈయన మానసికంగా బాగా అలసిపోయాడు అనడానికి ఇదొక సూచన.అంతేగాక రవి,బుధ,శుక్రులూ,రాహువూ కూడా జననకాల చంద్రునిపైన సంచరించారు. దానికి తోడు,అమావాస్య ముందురోజు కావడం అగ్నికి ఆజ్యం పోసింది. ఈ విధంగా కాలం మూడినప్పుడు,కర్మ ముంచుకొచ్చినపుడు,  గ్రహాలన్నీ ఎదురు తిరుగుతాయి. 

ఈయన జాతకంలో ఇంకొక వింత ఏమంటే,జననకాల గురువూ శనీ, మరణకాల గురువూ శనులకు ఖచ్చితమైన అర్ధకోణ దృష్టిలో ఉన్నారు. అంటే గురువు గురువుతోనూ,శని శనితోనూ sextile aspect కలిగి ఉండటం చూడవచ్చు. ఈజన్మకు అనుభవించవలసిన కర్మ తీరిందని చెప్పడానికి ఇదొక సూచన. 6-12-2012 న ఇతని ఆత్మకారకుడైన బుధుడు రాశిమారి వ్రుశ్చికంలోకి వచ్చి నీచరాహువు పరిధిలో ప్రవేశించాడు. ఆరోజే ఈయన శ్వాస ఇబ్బందితో ఆస్పత్రి లో చేరాడు. అప్పుడు సింహంలో ఉన్న చంద్రుడు ఐదురోజుల్లో దగ్గరగా వచ్చి 11-12-12 న సరిగ్గా జనన కాల చంద్రునితో కూడటమే గాక రాహువు నోటిలో పడ్డాడు.అంతేగాక ఈయన జాతకంలో యోగకారకుడైన శుక్రుడు కూడా రాశి మారి రాహువు నోటిలోకి వచ్చి పడ్డాడు.అలా అంత్యకాలం సమీపించింది.

ఒకసారి నన్నొకరు అడిగారు."అదృష్టవంతుల,ప్రముఖుల జాతకాల్లో చూడగానే కొట్టొచ్చినట్లు ఏవైనా కనిపిస్తాయా?" అని. "అవును అదృష్ట యోగాలు కనిపిస్తాయి." అని చెప్పాను. "మరి దురదృష్టవంతుల జాతకాలోనో?" అని ప్రశ్నించారు. "వారి జాతకాల్లో దరిద్రయోగాలు కనిపిస్తాయి." అన్నాను.

పై విశ్లేషణను బట్టి పండిత రవిశంకర్ ఒక గొప్ప అదృష్ట జాతకుడని వెంటనే కనిపిస్తుంది. అలా సరస్వతీ లక్షీ కటాక్షాలు ఉన్న జాతకాలు చాలా కొన్నే ఉంటాయి.అందులోనూ శుద్ధమైన చక్కనిసంగీతంతో మనస్సుకు ఆహ్లాదాన్ని కలిగించేవారు కొందరే ఉంటారు.పైగా గాత్రం కంటే ఒక వాయిద్యాన్ని వాయించడం చాలాకష్టం. పండిత రవిశంకర్ అటువంటి ప్రజ్ఞ కలిగిన మంచి విద్వాంసుడు.ఆయనకు సరస్వతీ లక్ష్మీ కటాక్షాలు పుష్కలంగా ఉన్నాయి. ఆయనకు నివాళి అర్పిద్దాం.
read more " పండిత రవిశంకర్ జాతకం-నివాళి "

10, డిసెంబర్ 2012, సోమవారం

ఆర్ట్ ఆఫ్ లీవింగ్

మొన్నీ మధ్య ఒక స్నేహితుడు 'ఆర్ట్ ఆఫ్ లివింగ్ క్లాసుకు రాకూడదూ' అని నన్ను అడిగాడు.

తను కొంత కాలంగా ఆ మార్గాన్ని అనుసరిస్తున్నాడు. అంతేగాక కనిపించిన అందరికీ దాని మహత్యం గురించి ఊదరగొట్టి అందులో చేరమని వేధిస్తూ ఉంటాడు.అలాగే నన్నూ అడిగాడు. 

నేను నవ్వి ఊరుకున్నాను. 

తర్వాత కొన్ని రోజులకు పట్టు వదలని విక్రమార్కుడిలా మళ్ళీ వచ్చి అదే ప్రశ్న అడిగాడు. అంతే గాక ఈసారి ఊరకే అడిగి ఊరుకోకుండా,దాని వల్ల కలిగే లాభాలూ ఉపయోగాలూ ఏకరువు పెట్టడం మొదలు పెట్టాడు. అంటే మార్కెటింగ్ మొదలైందన్న మాట.ఈసారి నేను నవ్వి ఊరుకోలేదు. అతనితో కొంచం మాట్లాడదామని అనుకున్నాను.

'బయటకు వెళ్లి టీ తాగుతూ ఎక్కడైనా కూచుని మాట్లాడుకుందామా?' అన్నాను.

'సరే' అన్నాడు. ఎలాగూ నన్ను ఒప్పించగలను అన్న నమ్మకం అతనికి కలిగింది. ఒక కొత్త కేండిడేట్ ను ఆ సంస్థకు పరిచయం చేయ్యబోతున్నానన్న సంబరం అతని ముఖంలో అగుపించింది.అప్పుడు మాత్రం మనసులో నవ్వుకున్నాను.

కూచున్న కాసేపటికి టీ వచ్చింది. తాగుతూ అతన్ని ఒక ప్రశ్న అడిగాను.

' మీ క్లాసులో చేరడానికి నాకేమీ అభ్యంతరం లేదు. కాకపోతే నాకు కావలసింది మీ దగ్గర దొరికితే అలాగే చేరుతాను.'

'నీక్కావలసింది ఏంది' అడిగాడు మిత్రుడు.

'నాకు 'Art of living' వద్దు. 'Art of leaving' కావాలి. మీ క్లాసులో అది ఎవరైనా నేర్పించగలరా?' చాలా సీరియస్ గా ముఖం పెట్టి అడిగాను.

'అదేంటి?' సందేహం వచ్చింది మిత్రునికి.

'అంటే స్వచ్చందంగా శరీరాన్ని వదిలిపెట్టి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆత్మగా బయటకు వెళ్లడం.ఇచ్చామరణం అనుకో. ఆ విద్య మీలో ఎవరికైనా తెలుసా? నాకది నేర్పించే పనైతే మీ క్లాసులో చేరుతాను'.

'బతకడం ఎలాగో తెలుసుకుంటే చాలు. చావడం ఎందుకు?' అడిగాడు ఫ్రెండ్.

నేను చిన్నగా నవ్వాను.

'మరణించడమే అసలు తెలుసుకోవలసిన విద్య. బ్రతకడం కాదు.' అన్నాను.

'నువ్వు నేర్చుకున్న నేర్చుకోక పోయినా చావెలాగూ ఏదో ఒకరోజు వస్తుంది. దాన్ని ఇప్పట్నించే ప్రత్యేకంగా నేర్చుకోవడం ఎందుకు?' స్నేహితుడు వితండవాదం మొదలు పెట్టాడు.

'లోకంలో లక్షలాది జీవులు మీ క్లాసులు అటెండ్ కాకుండానే చక్కగా బతుకుతున్నాయి. బతకడం ఎలాగో తెలుసుకోవడమూ దానికి ప్రత్యేకమైన క్లాసులూ మాత్రం ఎందుకు?' అడిగాను.

'అలాకాదు.మామూలుగా బతకడం వేరు.మా క్లాసులు అటెండ్ అయినాక బతకడం వేరు. చాలా తేడా ఉంటుంది.'అన్నాడు.

'నేనూ అదే చెబుతున్నాను. మామూలుగా అందరిలాగా ఏడుస్తూ చావడం వేరు. నీ అంతట నీవు స్వచ్చందంగా రాజులాగా శరీరాన్ని విసిరి పారేసి పోవడం వేరు. ఇందులో తేడా నీకు అర్ధం కావడం లేదా?'అడిగాను.

'అది సాధ్యమేనంటావా?' అడిగాడు అనుమానంగా.

'బతికే విద్య ఉన్నప్పుడు చచ్చే విద్య ఎందుకుండదు?' ఎదురు ప్రశ్నించాను.

'మా క్లాసులో ఈ విషయం ఎక్కడా చెప్పలేదు' అని చివరికి ఒప్పుకున్నాడు.

'సరే మీ క్లాసులో ఈ విషయం అడిగి మీవాళ్ళు ఏమంటారో అప్పుడు చెప్పు.' అన్నాను.

'అయినా నీకిదేం పాడు ఆలోచన? చావు గురించి ఆలోచన ఎందుకు?' అడిగాడు.

'మీకు మాత్రం ఈ పాడు ఆలోచన ఎందుకు? బతకడం గురించి క్లాసులు ఎందుకు? హాయిగా బతికేస్తే పోలా? అది కూడా క్లాసుల్లో నేర్చుకోవాలా? కొన్నాళ్ళు పోతే పుట్టిన పిల్లాడికి తల్లి పాలు ఎలా తాగాలో కూడా నేర్పించేలా ఉన్నారు మీరు?' నేనూ ఎదురు ప్రశ్నించాను.

'నీ వితండవాదానికి  నేను చెప్పలేను' అన్నాడు మిత్రుడు.

'నీవు చెప్పినదానికి గంగిరేద్దులాగా తలూపి ఆ క్లాసులో చేరితే నేను మంచివాణ్ణి. లేకపోతే నాది వితండవాదం అంతేనా?' టీ సిప్ చేస్తూ అడిగాను.

'అలాకాదు.సరే మా క్లాసులో అడిగి చూస్తాలే.' అన్నాడు.

'త్వరలో నేనూ క్లాసులు మొదలు పెట్టబోతున్నాను. దాని పేరు 'Art of leaving' నీకిష్టమైతే చేరు. అడ్మిషన్ ఫీజు అక్షరాలా లక్ష రూపాయలు మాత్రమె.నువ్వు నా ఫ్రెండ్ వి కాబట్టి నీకు ఒక వంద తగ్గిస్తాను. మీ క్లాసులో ఉన్న 'బతకడం నేర్చుకునే వాళ్లకి' మాత్రం నో కన్సెషన్.' నవ్వుతూ చెప్పాను.  

'నిన్ను అర్ధం చేసుకోడం కష్టంరా బాబు' అన్నాడు.

'చిన్న పిల్లల్ని అర్ధం చేసుకోవాలంటే చిన్న పిల్లల్లా మారాలి. అప్పుడు చాలా తేలిక. లేదంటే చాలా కష్టం.అయినా నన్ను అర్ధం చేసుకోమని నేనేమన్నా నిన్ను దేబిరించానట్రా. లేకపోతే దానికీ ఒక క్లాసు పెట్టుకుందాం. The art of understanding అంటూ' అన్నాను.

'ఇంతకీ Art of leaving నిజంగా ఉందా?' అనుమానంగా అడిగాడు.

'ఏమో నాకు మాత్రం ఏం తెలుసు? ఏదో నా నోటికొచ్చింది చెప్పాను' అన్నాను గుంభనంగా నవ్వుతూ.

'ఇదేరా నీదగ్గర. ప్రతి దానికీ ఆట పట్టిస్తావు. నువ్వు చెబుతున్నది నిజమో అబద్దమో తెలీదు. సీరియస్ గా చెబుతున్నావో లేక నవ్వులాటకి చెబుతున్నావో తెలీదు.ఇక నావల్ల కాదుగాని. పోదాం పద. బుద్ధుంటే మళ్ళీ నిన్ను మా క్లాసులో చేరమని అడగను' అంటూ లేచాడు.

'బుద్ధునికి రావిచేట్టు కింద జ్ఞానోదయం అయింది. నీకు కాఫీ హోటల్లో జ్ఞానోదయం అయింది. ఆయనకంటే నీవే గ్రేట్ రా బాబు. పోదాం పద' అంటూ నేనూ లేచాను.
read more " ఆర్ట్ ఆఫ్ లీవింగ్ "

4, డిసెంబర్ 2012, మంగళవారం

సేవ చెయ్యి సవాళ్లు ఎదుర్కో

నిన్న ఒక ISB కేంపస్ ప్రారంభిస్తూ ఒక మంత్రివర్యులు చక్కని సలహా ఒకటి పారేశారు.విదేశాల్లో ఉన్న భారతీయులు తిరిగి మన దేశానికి వచ్చి సేవలందించాలట. ఈ జోక్ చదివి భలే నవ్వొచ్చింది.ఇదేకాక ఇంకో జోక్ కూడా ఆయన చెప్పారు.మనదేశంలో ఉన్నన్ని సవాళ్ళు ఇంకే దేశంలోనూ లేవట.కనుక సవాళ్లు ఎదుర్కోవడానికీ అలా ఎదుర్కోవడంలో ఉన్న ఆనందం పొందటానికీ వాళ్ళు ఇండియాకు రావాలట. ఇదీ ఘనత వహించిన మంత్రిగారి ఉద్ఘాటన.

ఈ వార్త చదివి నవ్వాలో ఏడవాలో లేక ఈ రెండూ ఒకేసారి చెయ్యాలో అర్ధం కాలేదు. వారు చెప్పిన ఉపన్యాసంలో రెండు పాయింట్లు చెప్పారు. ఒకటి సేవలందించడం, రెండు సవాళ్లు ఎదుర్కోవడం.

విదేశాలలో స్థిరపడిన,పడుతున్న మేధావులను వెనక్కి వచ్చి ఈ దేశంలో  సేవలు అందించమని వారి ఊహ కావచ్చు.ఇదెంత హాస్యాస్పదమో అర్ధం కాదు.సేవ అన్న పదం మన దేశంలో అర్ధం కోల్పోయింది.ఇక్కడ సేవ లేనే లేదు,ఉన్నది దోపిడీ మాత్రమే. సేవ,విలువలు,పవిత్రత ఇత్యాది పదాలు మన దేశపు నిఘంటువులో నుంచి తొలగించబడి చాలా ఏళ్ళయింది. ప్రస్తుతం మన సొసైటీ లో ఉన్నది ఏకసూత్ర పధకం.'నీ చేతనైనంత నువ్వు దోచుకో,నాతో పనుంటే అందులో నా వాటా ఎంతో చెప్పు'- ఇదొక్కటే మన దేశంలో ప్రస్తుతం చెలామణీ లో ఉన్న సూత్రం. మిగతా రూల్సూ రెగ్యులేషన్సూ ఇత్యాదులన్నీ సంపాదించడం చేతగాని వారి కోసం ఉద్దేశించబడినవి. 'సమైక్య దోపిడీ' అనే సూత్రం ఒక్కటే మన దేశపు ఏకైక సూత్రం. నిజాన్ని నిక్కచ్చిగా మాట్లాడే ప్రతి ఒక్కరూ ఇది నిజం అని ఒప్పుకోక తప్పదు.

ఇంతకంటే ఎక్కువ దేశభక్తి భావజాలంతో మన దేశానికి వచ్చి ఏదో సేవ చేద్దామని ఆశించిన కొందరు NRI లు తలబొప్పి కట్టి తిరుగు టపాలో పారిపోయిన వాళ్ళు నాకు కొంతమంది తెలుసు. వాళ్ళు చెప్పినది ఏమంటే, "ప్రస్తుత వ్యవస్థలో ఈ దేశంలో ఏమీ చెయ్యడం సాధ్యం కాదు. సదరు ప్రక్రియలో మా జీవితాలు ఆహుతి చేసుకోవడం ఎందుకు? హాయిగా మా బతుకు మేం బతకడం మంచిది." అని వాళ్ళు చెప్పారు.
  
ఇకపోతే సవాళ్లు ఎదుర్కోవడం గురించి చూద్దాం.ఒక రంగంలో వినూత్నమైన పంధాలో ఆలోచించి ఒక ఆవిష్కరణను సాధించడం దగ్గరనుంచీ,దానిని ప్రజలకు చేరువ చేసే ప్రక్రియలో భాగాలైన,పేటెంట్ తెచ్చుకోవడమూ, బిజినెస్ పర్మిట్ పొందటమూ,లార్జ్ స్కేల్ ప్రోడక్షనూ, మార్కేటింగూ, తద్వారా సమాజానికి ఉపయోగ పడటమే కాక, వందలాది వేలాది మందికి ఉపాధి కల్పించడమూ ఇత్యాదులన్నీ ఇతర దేశాలలో చాలా సులువు కావచ్చు. కాని మన దేశంలో మాత్రం కాదు. ఎందుకంటే ఈ ప్రక్రియల్లో అడుగడుగునా మన దేశంలో అధిగమించలేనన్ని అడ్డంకులు ఎదురౌతాయి. ఎవరైనా ఇలాంటి ఒక ప్రయత్నం చేస్తే, వారికి అతి త్వరలోనే ఒక విషయం అర్ధమౌతుంది. అదేమిటంటే, మన సొసైటీ బయటకు కనిపించేటంత మంచిదీ అమాయకపు సమాజమూ కానే కాదు. ఇది కుళ్ళిపోయిన,స్వార్ధపూరితులైన మనుషులతో నిండిన సమాజం. ఇక్కడ ఏమి చెయ్యాలన్నా ప్రతి వాడూ మొదట అడిగే ప్రశ్న -- "నాకేంటి?". న్యాయంగా ఆ పని తన బాధ్యతగా చెయ్యవలసిన వాడు కూడా ఇదే ప్రశ్న అడుగుతాడు.

ఒక మేనేజర్ అయినవాడు ఒక చక్కని నిర్దుష్టమైన వ్యవస్థలో పని చేస్తున్నపుడు తన పనిలో సహజంగా ఎదురయ్యే సవాళ్లు అవి ఎంత క్లిష్టమైనవైనా వాటిని సమర్ధవంతంగా ఎదుర్కోగలుగుతాడు. అలా ఎదుర్కొని వాటిని అధిగమించడంలో ఆనందం ఉంటుంది కూడా. కాని అతను పని చెయ్యవలసిన వ్యవస్థలోనే మౌలికమైన లోపాలు దారుణంగా ఉండి,వాటిని చక్కదిద్దవలసిన వారే వాటిని పెంచి పోషిస్తూ,అవే అతని పురోగతికి ఘోరమైన ప్రతిబంధకాలుగా మారుతున్నప్పుడు,వాటిని అధిగమించలేకా, మరోపక్క తను నమ్మిన విలువలను త్యాగం చేసి రాజీ పడలేకా అతను భయంకరమైన సంఘర్షణను ఎదుర్కోవలసి వస్తుంది.అలాంటప్పుడు అతనికి ఒక ప్రశ్న ప్రతిరోజూ ఎదురౌతుంది.'ఎందుకోసం నేను ఇదంతా చెయ్యాలి? ఎవరి కోసం చెయ్యాలి? హాయిగా ఇంకో దేశంలో నా బతుకు నేను చక్కగా బతకొచ్చు కదా?' అని ప్రతిక్షణమూ అనిపిస్తుంది.  

విదేశాలలో కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది.ఇంటలిజెన్స్ కీ, హార్డ్ వర్క్ కీ విలువ ఉంటుంది.మన దేశంలో మాత్రం అదే ఘోరంగా లోపించింది. ఇక్కడ ఈ రెండింటి ఫలమూ ఎవరో వేలిముద్రగాడి దోపిడీకి బలై,వాడి ఎకౌంట్ లోకి చేరిపోతుంది.అంతే కాదు. విదేశాలలో ఒక స్పష్టమైన సమాజవ్యవస్థ ఉంది. 'రూల్ ఆఫ్ లా' ఉన్నది.మనకు ఈ రెండూ ఉన్నట్లు కనిపిస్తున్నాయి. కాని నిజానికి లేవు. మన సొసైటీ ఒక మేడిపండు.

ఒక 'నాన్ ప్రాఫిట్ సంస్థ' ప్రారంభించాలని ఈ మధ్యనే ప్రయత్నం చేస్తూ కనుక్కుంటే ఒక విషయం తెలిసింది. రిజిస్ట్రేషన్ స్థాయిలోనే కనీసం అయిదు వేలు లంచం ఇవ్వాల్సి ఉందట.అదే విదేశాలలో అయితే ఇల్లు కదలకుండా,లంచం ఇవ్వకుండా,ఒక్కరోజులో ఈ ప్రక్రియ పూర్తవుతుంది.ఇదీ మన దేశపు దౌర్భాగ్యం. ఈ ఒక్క సంఘటనను జనరలైజ్ చేసో లేక డీలా పడిపోయో నేను ఇది చెప్పడం లేదు. మరి ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే, మనవాళ్ళు స్టేజీలు ఎక్కి చెప్పే నీతులు భలేగా ఉంటాయి. కాని ఆచరణలో అంతా డొల్లే అన్నది చేదు వాస్తవం. మన సమాజంలో ప్రతివాడూ ఇతరులకు భలే సలహాలు ఇస్తాడు.కాని ఆ నీతులను ఆ చెప్పేవాడు ఎంతవరకు ఆచరిస్తున్నాడో అందరికీ తెలుసు. వారి అతి చిన్న లాభాన్ని కూడా ఎవరూ ఒదులుకోరు. కాని ఇతరులకు మాత్రం ఏకంగా వారివారి జీవితాలనే త్యాగం చెయ్యమని సలహాలు ఇస్తారు. ఇలాంటి మాటలు ఎవరూ నమ్మరు. ఒకవేళ నమ్మితే వారి పని అధోగతే.

విదేశాలలో స్థిరపడిన భారతీయులు ఎందుకు మన దేశానికి రావాలో నాకైతే అర్ధం కాదు.ఇక్కడ ఉన్న దుమ్మూ, ధూళీ, మురికీ, అవినీతీ, దోపిడీ, వ్యవస్థలేమీ,తెలివికి గుర్తింపులేకపోవడమూ,లాంటి మురికి గుంటల్లోపడి ఈత కొట్టాలని ఉంటే నిరభ్యంతరంగా రావచ్చు.లేదా వారికి కూడా ఏవైనా 'హిడెన్ అజెండాలు' ఉంటే అలాగే రావచ్చు.కానీ సదరు మంత్రి మహాశయులు చెప్పినట్లు మాత్రం -- దేశానికి సేవ చెయ్యడం కోసమో, సవాళ్లు ఎదుర్కోవడం కోసమో -- అయితే మాత్రం అస్సలు రానక్కరలేదు అనే నా అభిప్రాయం.

కొన్నేళ్ళ క్రితం మన రాష్ట్రంలో మెడికల్ పీజీ ఎంట్రన్స్ లో స్టేట్ ఫస్ట్ వచ్చిన ర్యాంకర్ కు తను కోరుకున్న 'రేడియాలజీ' సీటు దక్కక తీవ్రమైన నిరాశకు లోనయ్యాడన్న విషయం మరొక్కసారి చదువరులకు గుర్తు చెయ్యదలుచుకున్నాను.ఇదీ మన వ్యవస్థ. మన వ్యవస్థ ఎంత చక్కగా ఉందో ఈ ఒక్క ఉదాహరణ తేటతెల్లం చేస్తుంది.మన దేశంలో ఇలాంటి ఉదాహరణలు కోకొల్లలుగా చూపగలను.కాని వేరే దేశాలలో ఇలాంటివి ఊహకు కూడా దొరకవు. మరి అలాంటి మెరిట్ స్టూడెంట్స్ ఈదేశంలో ఎందుకు ఉండాలి? ఉండి ఎవర్ని ఉద్ధరించాలి?

నన్నెవరైనా అడిగితే మాత్రం తెలివీ,కష్టపడి పనిచేసే తత్వమూ ఉన్న ప్రతివారినీ ఈ దేశం వదిలి వెళ్ళమనే చెబుతాను.ఎందుకంటే ప్రస్తుతం మనం చెబుతున్న - 'సేవ చెయ్యి సవాళ్ళు ఎదుర్కో' అనేది పచ్చి బూటకం.ఇది ఎదుటి వాడికోసం మనం ఇస్తున్న ఉచితసలహా.కాని ప్రతివారూ ఆచరిస్తున్నది మాత్రం '(ఏదో రకంగా) సేవ్ చెయ్యి, (అదేమని) సవాల్ చేసినవాడిని ఎదుర్కో'. 

అందుకే విదేశాలలో స్తిరపడిన భారతీయులు ఇక్కడికి ఎంతమాత్రం తిరిగి రానవసరం లేదు. వచ్చినా వారు ఈ వ్యవస్థలో  బతకలేరు. అంతే కాదు ఏమాత్రం అవకాశం ఉన్నా, ప్రతివాడూ విదేశాలకు పోయి అక్కడ స్తిరపడటమే మంచిది అనేది ప్రస్తుత పరిస్థితుల్లో నా నిశ్చితాభిప్రాయం. దేశాన్ని ఉద్ధరించడం తరువాయి, కనీసం వాళ్ళ తెలివికీ కష్టానికీ తగిన గుర్తింపూ చక్కని జీవితమూ అయినా వారికి దక్కుతాయి.ఎవరైనా ఆశిస్తున్నవి అవేగా మరి. తమ జీవితం పాడు చేసుకొని దేశాన్ని ఉద్ధరించడం ఎలా కుదురుతుంది? అయినా విదేశాలలో స్తిరపడ్డ వారు వచ్చి మన దేశానికి అందించవలసిన సేవలు ఏమున్నాయి? అసలు ఇక్కడున్నవారు ఏమి చేస్తున్నట్లు? వీళ్ళు దేశానికి సేవ చెయ్యలేరా? లేక వీరి సేవలు దేశానికి చాలవా? లేక NRI ల సేవలే కావాలని దేశమాత రోదిస్తున్నదా? లేక వీరు పాడు చేస్తుంటే వారోచ్చి బాగు చెయ్యాలా?

ఏంటో అన్నీ అర్ధంకాని చిక్కుప్రశ్నలే. పొయ్యేవాణ్ణి వాడిదారిన పోనివ్వక వెనక్కు లాగటం ఎందుకో అర్ధం కాదు. మనం ఒక్కరమే ఎందుకు బాధలు పడాలి? వాళ్ళను కూడా ఈ ఊబిలోకి లాగుదాం అన్న ఆలోచన కావచ్చు. హతోస్మి. భ్రష్టానాం కావా గతి:?
read more " సేవ చెయ్యి సవాళ్లు ఎదుర్కో "

28, నవంబర్ 2012, బుధవారం

కాలజ్ఞానం -17

మొదలు నందనమ్ము మార్గశీర్షమ్ములో   
తుదిని  జయము యాషాఢసీమ వరకు    
బాధలెన్నో రేగి తలకిందు చేసేను 
వేషాలు జనులలో హెచ్చు మీరేను 
ఎవరి గోతిని వారు తవ్వుకొబోతారు  

విప్లవం రేగేను రాజ్యాలు కూలేను 
యుద్ధాలు ముప్పులు ప్రకృతి భీభత్సాలు 
సాధారణమ్ముగా జరిగేను
ఏలికలు పయనమ్ము కట్టేరు

మార్గశిర ద్వాదశి మార్పులను తెచ్చేను 

కళ్ళు మూసినా గట్టి రుజువులగుపించేను  
పెంచుకున్నపాపమ్ము బద్దలై పగిలేను 
వికటాట్టహాసమ్ము కాళికయే చేసేను

రానున్న వత్సరమున  భూలోక స్వర్గమున 

గడ్డుకాలమ్మొకటి వచ్చేను కలి ప్రభావమ్ము చూపేను
విపరీత బుద్ధులే వెలిగేను విధ్వంసమే జూడ పెరిగేను 
మ్లేచ్చవర్గాలలో చిచ్చులే రేగేను మృత్యువే నాట్యమ్ము చేసేను  
   
విర్రవీగేవారు వెర్రివారౌతారు బుద్ధి నిలిచేవారు ఒడ్డెక్కి వస్తారు
తప్పదీ మాట తధ్యమింకను జూడ తెలివి తోడను జూచి తేటబడుము 
read more " కాలజ్ఞానం -17 "