“అసమర్ధుని వద్ద ధనము, సుఖము, కీర్తి, ధర్మము ఏవీ నిలచి ఉండవు"

7, నవంబర్ 2012, బుధవారం

ఈ ఏడాది కూడా తుఫాన్ రావాలి

ఆంద్రప్రదేశ్ లో ప్రతి నవంబర్ లోనూ తుఫాన్ రావడం మామూలైపోయింది. వాతావరణశాఖవారు దీనిని కనిపెట్టలేకపోయినా సామాన్యుడు చెప్పగలుగుతున్నాడు.అయితే, ప్రతి ఏడాదీ తుఫాను రావడమూ ఊళ్లు జలదిగ్బంధనం అవడమూ, లోతట్టు ప్రాంతాలు మునిగి పోవడమూ, ఊరిలోనే మనుషులు పడవలు వేసుకొని తిరగడమూ సర్వ సాధారణం అయిపోయింది. కానీ దీనికి తగిన శాశ్వతచర్యలు ప్రభుత్వం ఏమి తీసుకుంటున్నదో తెలియదు. పోనీ తనకు చేతనైనంతలో ప్రభుత్వం ఏవో కొన్ని చర్యలు చేపడుతున్నదీ అనుకుందాం.రాజకీయ నాయకులు పార్టీలూ మాత్రం ఏమి చేస్తున్నారో ఎవరికీ  తెలియదు.

స్వచ్చందసంస్థలూ,మానవతావాదులూ,వారి స్వల్పస్థాయిలో ఏవో చిన్నచిన్న సహాయశిబిరాలు పెట్టడమూ వరదబాధితులకు తమకు తోచిన సహాయం చెయ్యడమూ ప్రతి ఏడాదీ చూస్తున్నాం.కానీ రాజకీయపార్టీలు ఇలాంటి స్వచ్చందశిబిరాలు పెట్టడం ఎక్కడా చూడలేదు.వారు ఉత్తమాటలు చెప్పెబదులు ఆపని ఎందుకు చెయ్యరు అనేది నాప్రశ్న.ఈ మధ్య ఒక టీవీ చానల్ వారు తుఫాన్ బాధితులకు సహాయకార్యక్రమం ఒకటి చేశారు. అలాంటి పని రాజకీయ పార్టీలు ఎందుకు చెయ్యకూడదు?

రాజకీయ పార్టీల దగ్గర ఆడిట్ కాబడని డబ్బు వందలవేల కోట్లు మూలుగుతోంది. ఎలక్షన్ల సమయంలో ప్రజలకు సారాయీ డబ్బుసంచులూ  పంచేబదులు, ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో సహాయశిబిరాలు నిర్వహించే పని రాజకీయపార్టీలు ఎందుకు చెయ్యవు? అనేది నాకెప్పటినుంచో ఒక సందేహం. బహుశా దానివల్ల వాళ్లకు ఉపయోగం ఏమీ ఉండదు గనుక ఆ పని చెయ్యరు. ఓట్లకోసం డబ్బులు పంచుతారు గాని ఇలాంటి విపత్కరస్తితిలో మాత్రం ప్రజలకు ఏ సాయమూ చెయ్యరు. ఊరకే ఊరూరూ తిరిగి హామీలు మాత్రం గుప్పిస్తారు.ఇక అధికారంలో ఉన్న పార్టీవారు,నివేదికలు పంపి కేంద్రం నుంచి నిధులు తెస్తారు.ఆ నిధుల్లో సింహభాగం ఎక్కడికి చేరుతుందో ఈరోజుల్లో అందరికీ తెలుసు.

రాజకీయపార్టీలకు మహిళావిభాగాలూ, యువసేనలూ ఇలా రకరకాల శాఖలు ఉన్నాయి. వారు ఇలాంటి సమయాల్లో రంగంలోకి దిగి మారుమూల మునిగిపోయిన పల్లెలకు వెళ్లి సహాయకార్యక్రమాలు చెయ్యవచ్చు కదా. అలాంటి చిత్తశుద్ధి మాత్రం ఎవరిలోనూ కనపడదు. 

ఇకపోతే సినిమానటులకు కూడా సేనలున్నాయి. ఈ సేనలు తాగి బజార్లో పడి రౌడీలలాగా వీరంగం చెయ్యడమే గాని ఇలాంటి ఆపత్సమయాల్లో మంచి సేవాకార్యక్రమం ఒక్కటి చేసిన దాఖలాలు ఎక్కడా కనపడవు.వాళ్ళ సంస్కారస్థాయి అలా ఉంటుంది.

నిన్న విజయవాడలో ఒక సంఘటన జరిగింది. ఊరిలో లోతట్టు ప్రాంతం కొంత భాగం వర్షాలకు మునిగిపోయింది. ఆ పేటలో నివసిస్తున్న ఒక గృహిణి మంచినీటి కోసం బిందె తీసుకుని మోకాలిలోతు నీళ్ళలో వెళుతూ రోడ్డుమీద ఉన్న ఒక గుంతలో కాలేసి మునిగి చనిపోయింది. నీటిలో మునిగిన రోడ్డులో ఎక్కడ గుంతలున్నాయో కనపడవు కదామరి. బజారుకెళ్ళిన భర్త ఇంటికి వచ్చేసరికి భార్యశవం వరద నీళ్ళలో తేలుతూ కనిపించింది.ఈ పాపం ఎవరిదీ?

స్వతంత్రం వచ్చి అరవైఏళ్ళైనా సిటీలలో కూడా ఇప్పటికీ మంచినీరు సప్లై చెయ్యలేని ప్రభుత్వానిదా? టౌన్ ప్లానింగ్ అనేది పేరుకే గాని అసలంటూ ఎక్కడా ఏ ప్లానింగూ లేని మునిసిపాలిటీ శాఖదా? వాడవలసిన పాళ్ళలో కంకరా సిమెంటూ వాడకుండా సగం పైగా బొక్కేసి పైపైన నాసిరకం రోడ్లు వేస్తున్న రాజకీయ కాంట్రాక్టర్లదా? దానిని చూచీ చూడనట్లు ఊరుకుంటూ మామూళ్ళతో జేబులు నింపుకుంటున్న అధికారులదా? ఒక ప్లానింగ్ అంటూ లేకుండా దేశాన్ని సర్వనాశనం చేస్తున్న రాజకీయులదా? సామాన్యుడి  ఉసురు వీరిలో ఎవరికి తగలాలి?

తుఫాన్ వొచ్చినా దానిని తమ జేబులు నింపుకోడానికి మాత్రమె నాయకులూ అధికారులూ ఉపయోగించుకుంటున్నారు అన్నది ఒక చేదునిజం. నిన్న ఒక రాష్ట్ర ప్రభుత్వోద్యోగి ఒక మాట చెబితే విని నివ్వెరపోయాను."పోయినేడాది ఒచ్చినట్లే ఈ ఏడాది కూడా తుఫాన్ రావాలి దేవుడా"--అని మొక్కుకునే ఉద్యోగులు రాష్ట్రప్రభుత్వంలో ఉన్నారట.రాజకీయ నాయకులు కూడా కొందరు ఇలా మొక్కుకుంటారట.ఎందుకంటే,తుఫాన్ వస్తే మళ్ళీ కేంద్రనిధులు వస్తాయి.కాంట్రాక్టులు వస్తాయి.రోడ్లు వేసుకోవచ్చు,గుంటలు పూడ్చుకోవచ్చు, అసలే వెయ్యని కొన్ని రోడ్లను తుఫాన్ ఎకౌంట్లో కొట్టుకు పోయినట్లు చూపించవచ్చు,అసలు పంటేవెయ్యని పొలాలలో కూడా పంట మునిగి నష్టపోయినట్లు చూపించి పరిహారం బొక్కేయ్యవచ్చు, ఇలా ఎన్నో ఇంకేన్నో రకాలుగా ఈ తుఫాన్ను వాడుకుని నిధులు రాజమార్గంలో స్వాహా చెయ్యవచ్చు.అందుకని అలా మొక్కుకుంటారట. తుఫాన్ ను నమ్ముకుని కోటీశ్వరులైనవారు ఎందఱో ఉన్నారట.

మనుషుల రూపంలో సమాజంలో తిరుగుతున్నది జంతువులే అని నేను ఎప్పుడూ అనుకుంటాను. అది నిజమే అని రోజురోజుకూ రుజువులు లభిస్తుంటాయి.నాది పెసిమిస్టిక్ యాటిట్యూడ్ అని కొందరు నాతో అన్నారు. కాని నా ఈ అభిప్రాయం వెనుక బలమైన అనుభవాలున్నాయి.ఆ మధ్య నేను లక్నో వెళ్లి ఒస్తున్నపుడు ఒక సంఘటన జరిగింది. మధ్యలో భోపాల్ లోనో ఏదో ఒక పెద్ద స్టేషన్లో ట్రెయిన్ ఆగినపుడు టిఫిన్ తిందామని దిగినప్పుడు ఒక హృదయ విదారకమైన సంఘటన చూచాను. ఆ ప్లాట్ఫారం మీద ఒక బట్టలు లేని స్త్రీశవం పడి ఉంది. సన్నగా స్కెలిటన్ లాగా అయిపోయి ఉంది ఆమె. ఈగలు భయంకరంగా ముసురుతున్నాయి. అన్ని వేలమందీ ఆ ప్లాట్ఫారం మీద బిజీగా తిరుగుతూ కూడా ఆ శవాన్ని  చూడనట్లుగా నటిస్తూ వెళ్లి టిఫిన్లు కొనుక్కోచ్చుకుని తింటున్నారు గాని ఒక్కరూ ఆ శవాన్ని పట్టించుకోవడం లేదు.ఆ శవాన్ని చూడలేక వెనక్కితిరిగి నా బోగీ దగ్గరికి వచ్చి, సూట్కేస్ లోని దుప్పటి తీసి ట్రెయిన్ దిగి ఆ శవానికి కప్పివస్తుంటే  నన్నొక పిచ్చివాణ్ని చూసినట్లు చూచారు జనమంతా. పైగా ఒక ప్రయాణీకుడు " ఆమెకు ఎయిడ్స్ ఉందేమో ఎందుకు అలా రిస్క్ తీసుకున్నారు? అది రైల్వే పోలీసుల పని. మన పని కాదు" అని ఇంగ్లీషులో చాలా గొప్ప సలహా ఇచ్చాడు. అప్పటిదాకా దేశసమస్యల గురించీ రాజకీయాల గురించీ అనర్గళంగా చర్చిస్తున్న పెద్దమనిషి అతగాడు.ఆపైన వాడితో మాట్లాడాలంటేనే నాకు అసహ్యం కలిగింది. ఈ సంఘటన చూచాక, ట్రెయిన్ విజయవాడ చేరేవరకూ నేను మామూలు మనిషిని కాలేకపోయాను. 

ఇలాంటి వెధవలతో నిండిఉన్న దేశం మనది.శవాలమీద డబ్బులేరుకునే నాయకులూ అధికారులూ ప్రజలూ ఉన్న ఈ దేశం అసలు బాగుపడుతుందని ఊహించడమే తప్పు.మంచివాళ్ళు అసలు లేరా?మీకేవరూ ఎక్కడా కనిపించలేదా అని అనుమానం చదివేవారికి రావచ్చు. కనిపించారు. మన చుట్టూ ఎందఱో మంచివాళ్ళు ఉన్నారు. కానీ వారి సంఖ్య అతిస్వల్పం. సముద్రంలో కాకిరెట్ట లాగా, నల్లటి బ్లాక్ బోర్డ్ మీద చిన్న తెల్లటిచుక్కలాగా ఉంది మన సమాజంలో హృదయమున్న మంచివాళ్ళ సంఖ్య.ఉన్న కొద్దిమందీ 'ఆ మనకెందుకులే' అనుకుంటూ సజీవశవాలుగా బతుకుతున్నారు.

పై సంఘటనకు పూర్తి కాంట్రాస్ట్ గా నేను చూచిన ఇంకొక సంఘటన చెప్తాను. కొన్నేళ్ళ క్రితం అరుణాచలం వెళ్ళాను.లేచి నడవలేక రోడ్డుమీద ఈడ్చుకుంటూ వెళుతున్న ఒక అడుక్కుతినే స్త్రీని అక్కడ చూచాను. ఆమెకు నడుములు పడిపోయినట్లు ఉన్నాయి. ఆమె కొంత దూరం అలా పాకి,చివరకు  పాకడానికి కూడా శక్తి లేక రోడ్డుపక్కనే పడిపోయింది. మొఖం చూస్తే,తిండి తిని కనీసం రెండు మూడు రోజులైనట్లు ఉన్నది. మర్యాదస్తులైన భక్తులూ  నగరపౌరులూ షరా మామూలుగా ఏమీ పట్టనట్లు వారిదారిన వారు అలా పోతూనే ఉన్నారు. ఇంతలో ఇంకొక సాధువు ఆ దారిన పోతున్నాడు. అతనూ అడుక్కు తినేవాడే. తన దగ్గరున్న చిల్లర పోగేసి రోడ్డుపక్క బండి దగ్గర అప్పుడే ఇడ్లీ కొనుక్కున్నాడు.నేనూ అదే బండి దగ్గర ఒక బల్లమీద కూచుని ఉన్నాను. ఇడ్లీని నోటి దగ్గర పెట్టుకోబోతూ ఈ దృశ్యాన్ని అతను చూచాడు.వెంటనే చెమర్చిన కళ్ళతో "భగవంతుడా ఏమిటి నీ సృష్టి" అని తమిళంలో అంటూ తన చేతిలోని ఇడ్లీలు ఆమెకు ఇచ్చి తనదారిన తాను వెళ్ళిపోయాడు. ఇది నేను కళ్ళారా చూచిన సంఘటన.

మన ఎడ్యుకేటెడ్ యానిమల్స్ కంటే, రాజకీయ కుష్టురోగులకంటే, అవినీతి కేన్సర్ ముదిరిన ఉద్యోగులకంటే, ఒక పూట డిన్నర్ కు పదివేలు ఖర్చుపెట్టే మనుషుల కంటే, ఎంతో ఉన్నతంగా ఎదిగిపోయిన ఒక మహర్షిలా ఆ బిచ్చగాడు నా కంటికి కనిపించాడు.ఎందుకంటే, ఎందరిలోనో లేని స్పందించే హృదయం అతనిలో ఉంది. తానూ అడుక్కుతినేవాడై ఉండీ, తన నోటి దగ్గర తిండిని ఆకలితో ఉన్న ఇంకొక జీవికోసం ఇవ్వగలిగాడంటే మనలాంటి జంతువుల మధ్యన అతనే అసలైన మానవుడు అని నాకనిపించింది. భగవంతుని కరుణకు అతనే అసలైన పాత్రుడు అనిపించింది.

అవసరం ఉన్నా లేకున్నా వేల కోట్లు పోగేసి, అదీ చాలక 'ఇంకా ఇంకా' అని దాహంతో కొట్టుకుంటున్న నేటి నాయకులు, అవినీతి అధికారులు,వ్యాపారుల కంటే తన నోటిదగ్గర ఆహారం ఇంకొకరికి ఇచ్చిన ఆ బిచ్చగాడు ఎంతో ఉన్నతమైన 'మహా మనీషి' అని నేనంటాను. ప్రతి ఏడాదీ తుఫాన్ రావాలని మొక్కుకునే మన ఆంధ్రాజంతువులతో పోలిస్తే ఆ అడుక్కుతినేవాడు ఒక మహర్షి అని నా అభిప్రాయం. "ఆ శవాన్ని ఎందుకు తాకావు? ఆమెకు ఎయిడ్స్ ఉందేమో?" అని నన్ను ప్రశ్నించిన 'ఏసీక్లాస్ ఎడ్యుకేటెడ్ బ్రూట్' కంటే అరుణాచలం బిచ్చగాడు ఎన్నో వేలరెట్లు ఉన్నతుడే.కాదని ఎవరైనా అనగలరా? 

ప్రకృతి విలయాన్ని కూడా తమ స్వప్రయోజనాలకు అనుగుణంగా మలచుకుని,పక్కవాడి నోటి దగ్గర కూడు లాగేసుకుంటున్న నేటి మనుషుల కంటే , తాను ఆకలితో ఉండి కూడా తన తిండిని ఇంకొక జీవికి ఇచ్చిన అతను నిశ్చయంగా ఉత్తమోత్తముడే. ఇందులో ఏమీ అనుమానం లేదు.'మంచి మనుషులు సమాజంలో ఉన్నారు అని నాకు తెలుసు' అని చెప్పడానికే ఈ ఉదాహరణ ఇచ్చాను. కానీ వారి సంఖ్య చాలడం లేదు. వారికున్న వనరులూ స్వల్పమే. కానీ ఒక మంచిపని చెయ్యడానికి ఆర్ధిక స్తోమతతోనూ వనరులతోనూ పని లేదు. స్పందించే హృదయం ఒక్కటే కావలసింది. అదుంటే,ఆపదలో ఉన్న మనిషికి తమ పరిధిలో తాము సాయం చెయ్యవచ్చు. ఈ ఆలోచన మన రాజకీయ పార్టీలకూ, సోది సంఘాలకూ ఎందుకు రాదు? అన్నదే నా ప్రశ్న.

ఆ బిచ్చగాడికి ఉన్న మానవతా హృదయం మనకు కూడా కలిగే అదృష్టం ఆ దేవుడు కలిగిస్తే ఎంత బాగుంటుంది? అప్పుడీ భూమి స్వర్గంగా మారదూ? ఒక నిరాడంబరమైన పర్ణశాలలో ఉండే ప్రశాంతత, సంపన్నుల విలాస భవనాలలో కూడా ఉండాలని ఆశించడం నాదే పొరపాటంటారా? సరే అలాగే కానివ్వండి. కాదని నేను మాత్రం ఎలా అనగలను?