“అసమర్ధజాతికి ఆత్మగౌరవ అర్హత ఉండదు"

26, అక్టోబర్ 2021, మంగళవారం

మీ ప్రశ్నలు - నా జవాబులు

'ఈ మధ్య అన్నీ కరెంట్ ఎఫైర్స్ అందులోనూ గ్లోబల్ ఎఫైర్స్ మాత్రమే రాస్తున్నారు. సామాన్యుడిని పట్టించుకోవడం లేదు. మీ బ్లాగ్ ఒక క్రైమ్ న్యూస్ ఛానల్ అయిపొయింది. తెరవాలంటేనే భయంగా ఉంది. ఒక సరదా లేదు పాడూ లేదు' అంటూ కొందరు సన్నిహితులు కినుక వ్యక్తం చేస్తున్నారు. 

ఇందులో భయానికేముంది? లోకంలో జరుగుతున్నవాటికి, గ్రహాలకు ఉన్న సంబంధాలనే నేను వెలుగులో చూపిస్తున్నాను. పోన్లే మీరు కోరినట్లే ఒక లైట్ టాపిక్ రాస్తాలే అని ఓదార్చాను. అందికే ఇది !

నాకొచ్చే బోలెడు ఈ మెయిల్స్ లో నుంచి ఏరి కూరి, ఆర్నెల్లకోసారి ఇలాంటి పోస్టులు రాస్తేగాని, సీరియస్ సినిమాలో కామెడీ ట్రాక్ లాగా సరదాగా ఉండదు మరి ! ఇక చదవండి.

చదవబోయే ముందు ఒక చిన్న సవరణ. చదివేవాళ్ళని 'పాఠకులు' అంటాము. చొప్పదంటు ప్రశ్నలు వేసేవాళ్ళని నేను 'పాతకులు' అంటాను. పాతకులంటే పాపులు అనేకదండీ అర్ధం? అంటూ మళ్ళీ ఇంకొక చొప్పదంటు ప్రశ్న అడగకండి. అదే అర్ధం. మనందరమూ ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక పాపం చేసియున్నవారమే గనుక, నాతో సహా మీతో సహా మనందరమూ పాతకులమే (బైబిల్ ప్రకారం). కాబట్టి ఈ పదప్రయోగం తప్పుకాదనీ, ఎవరి హార్టునీ హర్టు చేయడానికి ఉద్దేశించబడలేదనీ గమనించ మనవి !

------------------------------------------------------------

ఒక పాతకుడు ఈ విధంగా మెయిలిచ్చాడు.

'గురువుగారు ! నాకీ మధ్యన తరచుగా వినాయకుడు కలలో కనిపిస్తున్నాడు. ఏం చెయ్యమంటారు?'

నా జవాబు

'ఆయనకు గుండ్రాళ్ళు నైవేద్యం పెట్టి, నువ్వు ఉండ్రాళ్ళు మెక్కు. అంతకంటే ఇంకేమీ చేయనక్కరలేదు'

------------------------------------------------------------------

ఒక పాతకురాలు ఇలా అడిగింది.

'గురూజీ ! కాళీమాతకు, కాళరాత్రికి తేడా ఏమిటి?'

నా జవాబు.

'అమ్మా ! పగటిపూట కనిపించే ఆమెను కాళీమాత అంటారు. రాత్రిపూట కనిపించే ఆమెను కాళరాత్రి అంటారు. మధ్యలో కనిపిస్తే ఏమంటారో నాకు తెలీదు. కావాలంటే, నాక్కొంచెం టైమివ్వు. వాళ్లకు ఫోన్ చేసి కనుక్కుని చెబుతా'.

------------------------------------------------------------------

మరో పాతకుడు ఇలా అడిగాడు.

''సిద్ధాంతిగారు ! మీరు జాతకాలు చూస్తారని తెలిసింది. నాకు ప్రస్తుతం డబ్బుకు చాలా ఇబ్బందిగా ఉంది.  చూసి రెమెడీలు చెప్పండి'

ఆయనకు ఇలా జవాబిచ్చాను.

'అయ్యా ! నేను జాతకాలు చూస్తాను గాని, మీరనుకునే టైపు సిద్ధాంతిని కాను. ప్రస్తుతం నేనే చాలా డబ్బు ఇబ్బందుల్లో ఉన్నాను. మీకు నేనేం రెమెడీలు చెప్పగలను? మీకెవరైనా మంచి జ్యోతిష్కుడు తెలిస్తే చూడండి. మనిద్దరం కలిసి జాతకాలు చూపించుకోడానికి ఆయన దగ్గరకెళదాం'.

---------------------------------------------------------------

ఇంకొక పాతకురాలు ఇలా అడిగింది.

'సార్ ! ప్రపంచంలో ఉన్న అన్ని ఆశ్రమాలూ తిరిగాను. అన్ని దీక్షలూ తీసుకున్నాను. అన్నీ చేశాను. అంతా అయిపోయింది. ఎక్కడా  ఏమీ దొరకలేదు. ఎక్కడా ఏమీ లేదని, అంతా మోసమేనని తెలుసుకున్నాను. మీ మార్గంలో అడుగుపెట్టి  నడుద్దామనుకుంటున్నాను. ఏమంటారు?'

నా జవాబు.

'అలాగేనమ్మ ! అన్నీ అయిపోయిన నీకు, ఇక నేను చెప్పేదేముంది? ముందు నా మార్గమేంటో నాకు అర్ధం అయితే, ఆ తర్వాత నీవు కూడా అందులో నడవొచ్చు.  గత 40 ఏళ్లుగా అదేంటో తెలుసుకోవాలనే నేనూ ప్రయత్నిస్తున్నాను. ముందు నాకొక క్లారిటీ వచ్చాక, అప్పుడు నువ్వు కూడా ఇందులో అడుగు పెడుదువుగాని. అంతవరకూ నీ అడుగులు జాగ్రత్త చేసుకో. ప్రస్తుతం మాత్రం నా వైపు నీ అడుగులు వెయ్యకు'.

---------------------------------------------------

ఇంకొక పాతకురాలు ఇలా వ్రాసింది.

'మీ పుస్తకాలు కొన్ని చదివాను. మీ తపన నాకర్ధమైంది. మాది ఫలానా మిషన్. ఇందులో ధ్యానం చాలా బాగుంటుంది. ఊరకే కూచుంటే చాలు. మా ప్రిసెప్టార్ నుంచి ఒకటే ట్రాన్స్ మిషన్ వస్తూ ఉంటుంది.  ఒక్కసారి ట్రై చెయ్యండి. ఇక మీరు వెనక్కు పోలేరు. మీకిందులో తప్పకుండా శాంతి దొరుకుంటుంది.'

నా జవాబు.

'నా తపన అర్థమైందా? మా తల్లే ! ఇప్పటిదాకా నా తపనను అర్ధం చేసుకున్న ఏకైక వ్యక్తివి నువ్వేనమ్మ ! నేను కూడా గతంలో చాలా మిషన్లు వాడాను. ప్రస్తుతం కుట్టుమిషన్ వాడుతున్నాను. దాన్ని తొక్కుతుంటే నాకు తెలీకుండానే దానిమీదకు వాలిపోయి ధ్యానంలోకి జారిపోయి నాలుగ్గంటల  తర్వాత మెలకువొస్తోంది.నువ్వూ ట్రై చెయ్యి. ఆన్లైన్ బుక్ చేసుకుంటే హోమ్ డెలివరీ ఇస్తారు. కావాలనుంటే మీ గురువూ నీవూ ఇద్దరూ కలసి నా దగ్గరకు రండి. మీకు మిషన్ ఉపదేశం  ఇచ్చి ఎలా తొక్కాలో నేర్పిస్తాను.. ఇకపోతే శాంతి అంటావా? ఇప్పటికే నా దగ్గర చాలామంది శాంతులున్నారు. ఇక చాలమ్మ. శాంతి ఎక్కువైతే వాంతి అయ్యే ప్రమాదం ఉంది.  ఆ ప్రమాదం నాకొద్దులే. నీ శాంతిని నీ దగ్గరే ఉంచుకో.

--------------------------------------------------------- 

ఇంకో పాతకురాలు ఇలా అడిగింది.

'మీరు తరచుగా నా కలల్లోకి వస్తూ ఉంటారు. మా ఇంట్లో మీ ఫోటో పెట్టి పూజ కూడా చేస్తున్నాను. ఇది కరెక్టేనా?'

నా జవాబు.

'చాలా చక్కని ప్రశ్న అడిగావమ్మ. విను. నేను నీ కలలోకి రావడం వరకూ కరెక్టే, కానీ నువ్వు నా ఫోటోకి దండ వేసి పూజ చెయ్యడం మాత్రం కరెక్ట్ కాదు. ఎందుకంటే నేనింకా బ్రతికే ఉన్నాను మరి ! అయినా పూజ చెయ్యాలంటే  నీకు స్తోత్రాలుండాలి కదా ! నీలాంటి వీరభక్తుల బాధ తీర్చడానికే, నా శిష్యులు కొంతమంది నా సహస్రనామావళి వ్రాస్తున్నారు. సగం అయింది. మిగతా సగం కూడా అయ్యాక, నీకు పంపిస్తాను.  దానితో చేసుకో నీ పూజ, కాకపోతే ఫోటోకి నువ్వేసిన దండను తీసేసి చెయ్యి. అదొక్కటే నా రిక్వెస్ట్. 

------------------------------------------------------------------- 

ఒక పాతకుడు మాత్రం మంచి ప్రశ్న అడిగాడు.

'అందరూ యూ ట్యూబ్ చానల్స్ పెడుతున్నారు. 'స్నానం చేసేటప్పుడు ఒళ్ళెలా రుద్దుకోవాలి?' అంటూ  మా గర్ల్ ఫ్రెండ్ ఒక వీడియో చేస్తే పదికోట్ల మంది వ్యూయర్స్ చూశారు. 'మొగుణ్ణి ఎలా రాచి రంపాన పెట్టాలి?' అంటూ మా సీనియర్ యు ట్యూబర్ ఒక ఫెంటాస్టిక్ వీడియ= చేసింది. దానిని వందకోట్లమంది వీక్షించారు. 'కుక్కకు ఎలా స్నానం చేయించాలి? పిల్లికి పాలెలా పట్టాలి? ఎలుకకు ఎండ్రిన్ ఎలా పెట్టాలి? పొద్దున్నే పళ్ళు ఎలా తోముకోవాలి? సాయంత్రం సాక్స్ ఎలా తొడుక్కోవాలి? రాత్రి నిద్రపోయేటప్పుడు దుప్పటి ఎలా కప్పుకోవాలి? మళ్ళీ పొద్దున్నే టాయిలెట్ ఎలా క్లిన్ చెయ్యాలి?' ఇలాంటి ఎన్నో  అద్భుతమైన వీడియోలను మా ఫ్రెండ్స్ చేసి కోట్లు సంపాదించారు. మీ దగ్గర ఇంత నాలెడ్జి ఉంది కదా? మీరూ ఒక ఛానల్ పెట్టవచ్చుగా?'

నా జవాబు.

'చాలా మంచి సూచన ఇచ్చావు నాయన ! కొంచం ఓపిక పట్టు. ఒక్క తొమ్మది నెలలాగు. డెలివరీ అవుతుంది. జూలై 2022 తర్వాత మావి నాలుగు చానల్స్ ఒకేసారి మొదలై మీ దుమ్ము దులపబోతున్నాయి. యోగా, జ్యోతిష్యం, మార్షల్ ఆర్ట్స్, ఆధ్యాత్మికం ఇలా నాలుగు చానల్స్ మొదలు పెట్టబోతున్నాను. ఇవిగాక, రకరకాల సబ్జెక్ట్ ల మీద నేను తియ్యబోయే షార్ట్ ఫిలిమ్స్ ఒక వరదలాగా వస్తాయి. కొంచం ఓపిక పట్టు. నెక్స్ట్ ఇయర్ నుంచి నీ మెయిల్స్ ని చూచే తీరిక కూడా నాకుండదు. ఇక జవాబులు అసలే కుదరవు. అన్నీ ఛానల్ లోనే. సరేనా, మీ అభిమానానికి థాంక్స్.'

----------------------------------------------------------------- 

ఇలాంటివే ఇంకా చాలా మెయిల్స్ ఉన్నాయి. అన్నీ ఒకేసారి వ్రాస్తే మీరు తట్టుకోలేరు గనుక, సాంపిల్ గా ఇవి మాత్రం ఇస్తున్నాను. సీరియస్ టాపిక్స్ మధ్యలో బాగా బోరు కొట్టినప్పుడు మళ్ళీ మరికొన్ని ఇస్తాను.  ఈ లోపల ఇవి చదూకోండి. రేపటినుంచీ మళ్ళీ గ్లోబల్ క్రైమ్ న్యూస్ తో మళ్ళీ కలుసుకుందాం.  బై.

read more " మీ ప్రశ్నలు - నా జవాబులు "

24, అక్టోబర్ 2021, ఆదివారం

దుష్టత్రయం కుట్రలు

గత రెండు వారాలుగా చాలా దేశాలు అల్లకల్లోలమయ్యాయి.  దానికి కారణం శని గురువుల వక్రత్యాగం. శని అక్టోబర్ 12 న, గురువు అక్టోబర్ 19 న ఋజుగతి (direct motion) లోకి వచ్చారు. ఇక, మనదేశంపైన, చైనా, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్థాన్ల దొంగనాటకాలు తీవ్రస్థాయికి చేరుకున్నాయి. ఇస్లాం ముసుగులో పాకిస్తాన్ ఆఫ్ఘనిస్థాన్లు చేస్తున్న రాక్షస పైశాచిక చర్యలకు అనేకదేశాలు అట్టుడికాయి.

శనిగురువులు మకరంలో ఉండటం వల్ల గ్రహదృష్టి భారతదేశం మీద ఉంది. చైనా రెచ్చిపోవడానికి కారణం వృశ్చికంలోని ఉచ్చకేతువు. ఆఫ్ఘనిస్తాన్, మిడిల్ ఈస్ట్ లు అట్టుడుడకడానికి కారణం ధనుస్సుకు పట్టిన పాపార్గళం. అమెరికాలోని అల్లర్లకు కారణం మిధునానికి పట్టిన పరోక్ష పాపార్గళం.

ఆరునెలలక్రితం నేను వ్రాసిన పోస్టులను మీరు గమనిస్తే నేటి గందరగోళాన్ని అంతా ముందే హెచ్చరించానని గమనించవచ్చు.  ఆఫ్ఘనిస్తాన్ లో పని అయిపోయాక పాకీదేశం ఇండియావైపు చూస్తుందని, కాశ్మీర్ మళ్ళీ అల్లకల్లోకమౌతుందని ఆరునెలలక్రితమే చెప్పాను. అదే జరుగుతూ ఉండటాన్ని గమనించవచ్చు. 

ప్రస్తుతం మోదీగారి ప్రభుత్వంలో లా అండ్ ఆర్డర్ చాలా  గట్టిగా ఉంది. ఇస్లామిక్ కుట్రదారుల ఆటలు సాగడం లేదు. అందుకే, వీళ్ళ ఆటలు సాగే అవకాశం ఉన్న కాశ్మీర్లో, బాంగ్లాదేశ్ లో అరాచకాలు రెచ్చగొడుతోంది పాకిస్తాన్. దానికోసం ఇస్లాం మూర్ఖపు సిద్ధాంతాలను పావులుగా వాడుతోంది.

వినాయకుడి విగ్రహం కాళ్లదగ్గర ఖురాన్ ను పెట్టి అది ఫెస్ బుక్ వీడియోగా మార్చి వందలాది హిందువుల ఇళ్ళు, దేవాలయాలను ధ్వంసం చేసింది ఎవరు? ఒక ముస్లిం కుట్రదారుడు ఈ పని చేశాడు. బాంగ్లాదేశ్ ముస్లిమ్స్ ని రెచ్చగొట్టి ఎంతోమంది హిందువులను చంపేసింది ఈ చర్య. ఇస్కాన్ భక్తుడైన పార్ధా దాస్ ని అన్యాయంగా చంపేశారు రెండొందలమంది ముస్లిమ్స్ జంతువుల గుంపు. ఢాకా రామకృష్ణా మిషన్ స్వామీజీకి డెత్ థ్రెట్ లెటర్ వచ్చింది. 'మాది ఇస్లామిక్ దేశం, ఇక్కడ మీ ఉదారబోధనలు ఆపకపోతే నిన్ను చంపేస్తాం' - అంటూ. ఈ మాట అనాల్సింది ప్రభుత్వం కదా? ముస్లిం రాక్షస గ్రూపులు అనడమేంటి? అలాంటి అన్యాయపు పనులు, దొంగ పనులు చేయడాన్ని ఖురాన్ సమర్ధిస్తుందా? మహమ్మద్ బోధించిన నీతి ఇదేనా? ఇలాంటి పనులను దేవుడు మెచ్చుతాడా? ఊరకే గడ్డం పెంచి సల్వార్ కమీజ్ వేస్తే దేవుడికి దగ్గరైపోతారా? జీవితంలో నీతీనియమాలు అక్కర్లేదా? శాంతీ సహనాలు అక్కర్లేదా? మీ మతం కానంతమాత్రాన సాటిమనిషిని చంపమేనా? ఇదేం రకమైన శాంతిమతం? ఇదేనా శాంతి అంటే? ఇండియన్ ముస్లిమ్స్ ఈ విషయాలపైన ఆలోచించుకోవాలి. 1400 ఏళ్లనాటి బూజుపట్టిన హింసాత్మక ఖురాన్ బోధలలో ఉంటారో, మారుతున్న కాలంతో విశాలంగా ఆలోచించడం నేర్చుకుని, మనుషులుగా మారి ముందుకు ఎదుగుతారో వాళ్ళ విజ్ఞతకే వదిలేద్దాం.

బంగ్లాదేశ్ లోని మైనారిటీ మతాలైన - హిందూ, బుద్ధిష్ట్, క్రైస్తవ ప్రజలు ఒకటయ్యారు. ఇస్లాం హింసావాదానికి వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నారు. ఈ పరిణామం మంచిదే. ఏవి హింసాత్మక ముఠాలో ఏవి నిజమైన శాంతి మతాలో ప్రపంచానికి తెలుస్తుంది కనీసం. ! 

అదృష్టవశాత్తూ ప్రపంచదేశాలన్నీ పాకిస్తాన్ నీ బాంగ్లాదేశ్ నీ తప్పుపట్టాయి. పాకిస్తాన్ తో సహా, ఇంకొక తీవ్రవాద దేశంగా మారుతున్న టర్కీని కూడా FATF గ్రే లిస్ట్ లో ఉంచింది అంతర్జాతీయ సమాజం. దీనితో ఈ దేశాలకు డాలర్ల సరఫరా ఆగిపోతుంది. అప్పులు పుట్టవు. గ్రాంట్స్ రావు. అందవు, అబద్దాలు చెప్పి అమెరికా దగ్గర అడుక్కుని ఆ డబ్బుల్తో ఇండియాలో చిచ్చు పెట్టడం  తప్ప పాకిస్తాన్ లో ఏ ఇండస్ట్రీ ఉందసలు? పాకిస్తాన్ లో దాదాపు 70% ప్రజలకు చదువు లేదు. ఉగ్రవాద తండాల్లో రిక్రూట్ అయ్యి సాటిమనుషులను చంపడం తప్ప వారికి పనీపాటా లేవు. ఏ పని చెయ్యాలన్నా చేతులో డబ్బులుండాలికదా మరి ! దాన్ని కట్ చేస్తే అన్ని ఆటలూ ఆగిపోతాయి. ఇప్పటికే ఆఫ్ఘనిస్తాన్ లో దరిద్రం తాండవిస్తోంది. పాకిస్తాన్ బెగ్గర్ కంట్రీ అయి కూచుంది. పాకీ PM ఇమ్రాన్ ఖాన్ తనకొచ్చిన బహుమతులని అమ్ముకుని సొమ్ము చేసుకునే దుస్థితిలో ఉన్నాడు. ఇస్లాం ముసుగులో వీళ్ళ అరాచకాలు, కుట్రలు, రాక్షసచర్యలు ఆపకపోతే వీళ్ళ అగచాట్లు ముందుముందు చాలా ఘోరంగా ఉంటాయి.

ఇండియాలో, పాకిస్తాన్ కు మరోపావు  బెంగాల్ రాష్ట్రం. ప్రస్తుతం అక్కడ యాంటీ హిందూ యాంటీ ఇండియా  ప్రభుతం నడుస్తోంది. నేను కలకత్తా వెళ్ళినపుడు చూచాను. అధికార పార్టీ హయాంలో అక్కడ జరుగుతున్న హత్యలు, దౌర్జన్యాలు ఇంకెక్కడా జరగడం లేదు.మమతా బెనర్జీ పార్టీ ఎమ్మెల్యేలలో ఎక్కువమంది ముస్లిములన్నది గమనార్హం.

ఇకపోతే, అంతర్జాతీయ రౌడీ దేశం చైనా ఒక ప్రక్క తైవాన్ని బెదిరిస్తూ, మరోపక్క అరుణాచల ప్రదేశ్ లో ఇండియాలోకి చొచ్చుకు రావాలని ప్రయత్నిస్తోంది. QUAD పేరుతో ఏర్పడిన క్రొత్త కూటమి ఒక్కటే చైనాను ప్రస్తుతం ఎదుర్కోగల శక్తి.

గురుశనుల వక్రత్యాగంతో రామ్ రహీం లాంటి దొంగగురువులకు శిక్షలు ఖాయం కాబోతున్నాయి. పాకిస్తాన్  రాయబారి కూతుర్ని రేప్ చేసి చంపేసిన పాక్ అమెరికన్ కి కూడా శిక్ష పడబోతున్నది. ఈ విధంగా ఎప్పటినుంచో వాయిదా పడుతున్న నేరాలకు ముగింపు రాబోతున్నది. మేషంలో యురేనస్ స్థితివల్ల బ్రిటన్ MP ని ఒక దుండగుడు పొడిచి చంపేశాడు. బ్రిటన్ పరిస్థితి కూడా అల్లకల్లోలంగా ఉంది.

ఈ విధంగా ప్రపంచ రంగస్థలం మీద అనేక నాటకాలను ఈ గ్రహాలు ఆడిస్తున్నాయి. వీటి రుజుగతి ఫలితంగా వ్యక్తిగత జీవితాలలో కూడా అనేక సంఘటనలు వేగంగా జరుగుతున్నాయి. కుహనా పునాదులమీద కట్టుకున్న జీవితాలు కూలిపోతున్నాయి. వ్యక్తిగత జీవితాల గురించి అనుకునేదేముంది? డబ్బు వెంట పరుగులు, ఈగోలు, కపటపు జీవితాలు - ఎక్కడ చూచినా ఇంతగాక ఇంకేముంది?

ఏదేమైనా, చైనా, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ లే ప్రస్తుత ప్రపంచ దుష్టత్రయం. కమ్యూనిజం, ఇస్లాం వీటివెనుక ఉన్న విధ్వంసకారక శక్తులు. వీటి ఆట కట్టించనిదే ప్రపంచశాంతి అనేది దరిదాపులలో కనపడటం లేదు.

ఈ దుష్టత్రయం కుట్రలకు బలికాకుండా, మోదీగారి నేతృత్వంలో మన భారతదేశం క్షేమంగా ఉండాలని దైవాన్ని ప్రార్ధిద్దాం.

read more " దుష్టత్రయం కుట్రలు "

7, అక్టోబర్ 2021, గురువారం

అక్టోబర్ 2021 అమావాస్య ఏం చేసింది?

నిన్న అమావాస్య. నేటి నుండి దేవీ నవరాత్రులు మొదలు. గ్రహప్రభావంతో గత ఐదురోజుల్లో ఏం జరిగిందో గమనిద్దాం.

ఊహించినట్లే మళ్ళీ కాశ్మీర్లో చిచ్చు మొదలైంది. ఆఫ్ఘనిస్తాన్ టెర్రరిస్టుల చేతుల్లోకి వచ్చేసరికి, పాకిస్తాన్ దృష్టి కాశ్మీర్ మీద పడుతుందని అనుకున్నాం కదా, అదే జరుగుతోంది.

ఈలోపల పాకిస్తాన్లో భూకంపం వచ్చింది.  మకరం సున్నా డిగ్రీలలో వక్రత్వంలో ఉన్న ప్లూటో ఋజుత్వం లోకి వచ్చాడు. భారతదేశాన్ని, భారత ఉపఖండాన్ని చాలా వరకూ సూచించే భూతత్వరాశి మకరం కావడంతో పాకిస్తాన్ లో భూకంపం వచ్చింది. గట్టిగా చెప్పాలంటే ఆ దేశంలో ఇంకా పెద్ద భూకంపం రావాలి. ప్రపంచం మొత్తానికీ పాకిస్తాన్ అనేది ఒక రోగ్ నేషన్ గా మారింది. 7 వ శతాబ్దంలో పుట్టిన ఒక రాక్షసమతం అండతో, అమాయకులను చంపుతూ, విధ్వంసం సృష్టిస్తున్న ఆ దేశం నామరూపాలు లేకుండా పోయినప్పుడే ప్రపంచానికి ఊరట కలుగుతుంది. పాకిస్తాన్నీ, పాకిస్తాన్ని సపోర్ట్ చేసేవాళ్ళనీ, అయ్యోపాపం అనుకోవడం కూడా అవసరం లేదు.

ఇదిలా ఉంటె, ఆఫ్ఘనిస్తాన్ లో, తాలిబాన్ లీడరొకడు మహమ్మద్ గజినీ సమాధిని చూడ్డానికి పోయి, 'సోమనాధ్ ఆలయాన్ని ధ్వంసం చేసిన ఈ హీరో మాకు ఆదర్శం ' అంటూ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. కరెక్ట్ ! మక్కా కూడా ఒక ఆలయమే కదా? దానిని కూడా ధ్వంసం చెయ్యండి మరి ! ఏ ఆలయమైనా ఒకటే కదా? మీ ఆలయాన్ని పూజిస్తూ, వేరే ఆలయాలను ధ్వంసం చెయ్యమని ఒకవేళ మీ గ్రంధం చెబుతుంటే, అలాంటి గ్రంధాన్ని గుడ్డిగా పాటించవలసిన అవసరం ఏముంది ? వివాదాస్పదమైన శ్లోకాలున్నాయని మనుస్మృతిని రోడ్డుమీద తగలబెడుతున్నారు. ఇస్లాంని నమ్మనివారిని చంపమని చెప్పే గ్రంధాన్ని ఎందుకు వదిలేస్తున్నారు? మనుస్మృతి కంటే ఖురాన్ ప్రమాదకరమైనది కాదా మరి? అదెట్లా శాంతిగ్రంధమౌతుంది? దీనికేం సమాధానం చెబుతారు? మీ మతం కానంతమాత్రాన సాటిమనిషిని చంపడమేనా? ఇది ఏ రకమైన 'దైవ' బోధన?

కాశ్మీర్లో మందులషాపు నడుపుకుంటూ, సాటి మనుషులకు ఎంతో సాయం చేస్తూ, మంచి మనిషిగా పేరుపొందిన  70 ఏళ్ల కాశ్మిర్ పండిట్ మక్కన్ లాల్ బింద్రూని షూట్ చేసి చంపేశారు. ఇలా చెయ్యమని ఖురాన్ చెప్పిందా? లేక మహమ్మద్ చెప్పాడా? ఒకవేళ చెబితే అది దైవమతం అవుతుందా రాక్షసమతం అవుతుందా? అమాయకులని, నిరపరాధులని చంపమని చెప్పేవాడు ప్రవక్త ఎలా అవుతాడు? అలాంటి వాటిని గ్రుడ్డిగా పాటించడం 21 వ శతాబ్దంలో అవసరమా?

ఇస్లాం అనేది 7 వ శతాబ్దపు అరేబియాలోని ఆటవిక యుద్ధతెగలలో, దోపిడీదొంగల గుంపులలో, పుట్టిన ఆటవిక మతం. అదెక్కడ ఉంటే అక్కడ హింసా, దౌర్జన్యమూ, అరాచకమూ, అన్యాయమూ తప్పవు. అది నాగరిక సమాజానికి పనికొచ్చే మతం ఎంతమాత్రం కాదన్నది వాస్తవం. మక్కన్ లాల్ బింద్రూ కూతురు ఇచ్చిన స్టేట్మెంట్ చాలా బాగుంది.  ఆ అమ్మాయి ఎంతో ధైర్యంతో, విజ్ఞతతో మాట్లాడింది. దమ్ముంటే ఓపెన్ డిబేట్ కు రమ్మంది. పిచ్చిది ! చదువూ సంస్కారమూ లేని ఇడియట్స్ కి లాజిక్ ఎలా పనిచేస్తుంది? వాళ్లకు వాళ్ళ భాషలోనే జవాబు చెప్పాలి. ఆ హంతకులను పట్టుకుని శిక్షించాలి.  దెబ్బకు దెబ్బగా ఒకరికి ఇరవై మంది టెర్రరిస్టులను ఏరి పారెయ్యాలి. అప్పుడే మక్కన్ లాల్ వంటి దేశభక్తుల ప్రాణత్యాగానికి విలువ ఉంటుంది.

ఫరూక్ అబ్దుల్లాలూ, ఒమర్ అబ్దుల్లాలూ, మెహబూబా ముఫ్తిలూ మొసలి కన్నీరులు కారుస్తున్నారు. ఇన్నాళ్లూ ఇస్లామిక్ రాక్షస మూకల్ని  కాశ్మీర్లో పెంచి పోషించింది ఎవరు? మీరు కారా? ఇప్పుడెందుకీ దొంగ నాటకాలు? ఇంకా ఎంతకాలమీ మాయ ముసుగులు?

పాకిస్తాన్లో ISI చీఫ్ మారాడు. దానిని బహుమతిగా కాశ్మీర్లో ఈ పని చేశారట. ఏమైనా అర్ధముందా? కాశ్మీర్ ఎక్కడిది? పాకిస్తాన్ ఎక్కడిది? ఒకప్పుడు ఆఫ్ఘనిస్తాన్ కూడా మనదే కదా? మెత్తనివాడిని చూస్తే మొత్తబుద్ధి అన్నట్లు మనం ఊరుకుంటుంటే వాళ్లలాగే రేగిపోతుంటారు. దెబ్బకు దెబ్బ తీస్తే గాని పరిస్థితి అదుపులోకి రాదు. ఆరెస్సెస్ రంగంలోకి దిగాలి. కాశ్మీర్లో మళ్ళీ కాశ్మీర్ పండిట్స్ సుఖంగా, శాంతిగా, బ్రతికేలా చెయ్యాలి. దానికోసం, వాళ్ళ పద్ధతిలోనే వాళ్లకు బుద్ధి చెప్పాలి. అప్పుడే ఈ సమస్య  పరిష్కారం అవుతుంది.

పాకిస్తాన్ ప్రస్తుతం ఏకాకి అయ్యింది. ఏ దేశమూ దానిని నమ్మడం లేదు. అదొక రోగ్ కంట్రీ అని అందరికీ స్పష్టంగా తెలిసిపోయింది. అమెరికా కాంగ్రెస్ కమిటీ ముందు మాట్లాడుతూ మాజీ రక్షణ వ్యవహారాల సలహాదారు జెనరల్ మెక్ మాస్టర్, 'పాకిస్తాన్ కు ఎలాంటి సహాయమూ చెయ్యకూడదు, ఎన్నో ఏళ్లుగా అది డబల్ గేమ్ ఆడింది' అన్నాడు. కనుక పాకిస్తాన్ కు డాలర్ల సరఫరా కట్ అవుతుంది.  ఆ కసితో కాశ్మీర్లో మళ్ళీ అమాయకులను చంపుతూ విధ్వసం సృష్టించే ప్లాన్ వేస్తుంది పాకిస్తాన్. దానికి సపోర్ట్ చేసే స్లీపింగ్ సెల్స్, మదరసాల పేరుతో మన దేశం నిండా కుప్పలున్నాయి. ఈ కుతంత్రాన్ని ఎదుర్కోవడానికి, తెలివైన ప్లాన్ తో మన ప్రభుత్వం ముందుకెళ్లాలి. అప్పుడే పాకిస్తాన్ ఆట కట్టించగలుగుతాం.

ఈ పోస్ట్ వ్రాశాక కొద్దిసేపటికే ఇంకో వార్త తెలిసింది. శ్రీనగర్ లోని ఒక పాఠశాలలో ఇద్దరు టీచర్స్ ని కాల్చి చంపారు ఇస్లామిక్ రాక్షసులు. ఆ టీచర్స్ చేసిన నేరమేంటి? వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళు చేసుకోవడం, పిల్లలకు చదువు చెప్పడం మాత్రమే. ఇస్లామిక్ షరియా ప్రకారం ఆడపిల్లలు చదువుకోకూడదట, షరియా (ఇస్లామిక్ చట్టం) లో పండిపోయిన తాలిబాన్స్ చెప్పినట్లు, ఆడవాళ్ళు పిల్లలని కనే యంత్రాలు మాత్రమేనట. వాళ్ళు మోడరన్ చదువులు చదవకూడదు. ఇంట్లోనుంచి బయటకు రాకూడదు. ఉద్యోగాలు చెయ్యకూడదు. ఇదీ ఘనత వహించిన ఇస్లామిక్ చట్టం. ఇదీ ఇస్లాంలో ఆడదాని గతి !

అందుకని ఆడపిల్లలకు పాఠాలు చెబుతున్న ఉపాధ్యాయులను కాల్చి చంపారు. ఇలాంటి చర్యలను ఇస్లాం సమర్ధిస్తుందా? ఒకవేళ సమర్ధిస్తే అదొక మతమా అసలు? దాన్ని కనిపెట్టిన వాళ్లకు తలకాయ ఉందా అసలు? పోనీ, ఎవడో కనిపెట్టాడు, ఈ పాటించే వాళ్ళ బుద్ధి ఏమైంది? సాటి మనిషిని, ఏ నేరమూ చెయ్యని వాడిని, నిరాయుధుడిని ఎలా చంపాలనిపిస్తుందో అసలు? ధూ ! పాకిస్తాన్ అన్నా, ఆఫ్ఘనిస్తాన్ అన్నా, ఇస్లాం అన్నా, చీదర పుడుతోంది. బూజు పట్టిన ఇస్లాం పద్ధతుల్ని మన దేశంలో ఎందుకు పాటించాలసలు? అది పుట్టకముందు కనీసం పదివేల ఏళ్ల నుంచీ ఘనచరిత్ర మనకుంది. ఎంతో గొప్పవైన గ్రంధాలున్నాయి. శాస్త్రాలున్నాయి. దాన్నెందుకు మన దేశంలో పాటించాలి? 1300 సంవత్సరాల నుంచీ ఈ దరిద్రం ప్రపంచాన్ని కబళిస్తోంది. ఇంకెన్నాళ్లీ గోల?

ఖచ్చితంగా ఇది దౌర్జన్యమూ, అమానుషమే గాక, రాక్షసత్వం కూడా. రాక్షసులతో చర్చలు పనికిరావు. వాళ్ళకేది చెయ్యాలో అది చేస్తేనే మిగతావాళ్లకు బుద్దొస్తుంది గాని అమ్మాబాబూ అంటే పనులు జరగవు.

మోడీగారి ప్రభుత్వంలో ఇలాంటి పరిస్థితులని ఎన్నింటినో ఎదుర్కొన్న మెరికల్లాంటి యోధులున్నారు. ఆరెస్సెస్ వ్యూహకర్తలున్నారు. సరైన ప్లాన్ తో పాకిస్తాన్ తాట తీస్తారు. వాళ్ళ సమర్ధ సంరక్షణలో కాశ్మీర్ కి, కాశ్మీర్ పండిట్స్ కి, ఇండియాకి న్యాయం జరగాలని, ఇస్లాం అరాచకాలు నశించాలని కోరుకుందాం.

read more " అక్టోబర్ 2021 అమావాస్య ఏం చేసింది? "

1, అక్టోబర్ 2021, శుక్రవారం

బ్రిటన్ లో పెట్రోల్ సంక్షోభం - గ్రహాలపాత్ర

1970 దశకంలో ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్ కొరత ఏర్పడింది. 1973 లో, 1979 లో ఇది తీవ్రరూపం దాల్చింది. మళ్ళీ ఇప్పుడు బ్రిటన్ లో తీవ్రమైన పెట్రోల్ కొరత వచ్చిపడింది.

అయితే, అప్పటికీ ఇప్పటికీ తేడాలున్నాయి. అప్పుడొచ్చింది ప్రపంచవ్యాప్త కొరత అయితే, ఇప్పుడొచ్చింది బ్రిటన్ వరకే. అప్పుడు ఆయిల్ లేక కొఱతైతే, ఇప్పుడు బ్రిటన్ లో ట్రక్కు డ్రైవర్లు లేని కొరత.


1973 సంక్షోభం

1973 లో అరబ్ దేశాలకూ, ఇజ్రాయెల్ కూ యుద్ధం జరిగింది. దీనిని యోమ్ కిప్పూర్ యుద్దమంటారు. ఈ యుద్ధంలో ఇజ్రాయెల్ కు అమెరికా సహాయం చేసిందని, అమెరికాకు ఆయిల్ సరఫరా ఆపేశాయి అరబ్ దేశాలు. ఇది మొదటి ఆయిల్ సంక్షోభం. ఆ సమయంలో శని మిధునంలో ఉన్నాడు. నీచ రాహుకేతువుల ఇరుసు ధను-మిథున రాశులలో ఉంటూ మిడిల్ ఈస్ట్ నుండి అమెరికాను సూటిగా కొట్టింది.కనుక అమెరికాకు సమస్య వచ్చిపడింది.  గురువు నీచలో ఉన్నాడు. కనుక అరబ్ దేశాల కుట్రకు అమెరికా బలైంది.  అంతేగాక, నెప్ట్యూన్, వృశ్చికం 12 డిగ్రీలలో ఉన్నాడు. రాశిచక్రంలోని మూడు జలతత్వ రాశులలో వృశ్చికరాశి మాత్రమే పెట్రోల్ డీజిల్ మొదలైన  ఆయిల్స్ ను సూచిస్తుంది. అక్కడ నెప్ట్యూన్ ఉండటం ఈ సంక్షోభానికి మూలకారణం.

1979 సంక్షోభం 

అయితే, 1979 పరిస్థితి వేరు. 1978-79 మధ్యలో ఇరాన్ విప్లవం జరిగింది. పహ్లవి శకం అంతమై ఆయతొల్లా ఖొమైనీ అధికారంలోకి వచ్చాడు. అమెరికాకు ఆయిల్ సప్లై తగ్గింది. సౌదీ అరేబియా వంటి దేశాలు ఆ లోటును పూడ్చినా, సంక్షోభం మాత్రం ఏర్పడింది. ఆ సమయంలో, శని, గురు, రాహువులు సింహంలో ఉన్నారు.  నెఫూన్ వృశ్చికం 25 డిగ్రీలలో ఉంటూ, సింహం లో ఉన్న మూడు మేజర్ గ్రహాలతో కేంద్రదృష్టిలో ఉన్నాడు. అదీగాక, ఇంకొక జలతత్వరాశి అయిన కర్కాటకంలో కుజుడు నీచస్థితిలో ఉన్నాడు. ఇవన్నీ కలసి, అమెరికా కొంప ముంచాయి. మిడిల్ ఈస్ట్ లో జలుబు చేస్తే, అమెరికా తుమ్ముతోందంటే, ఆయిల్ వల్లే కదా మరి ! లేదంటే, వీళ్ళనెవరు పట్టించుకుంటారు?


2021 సంక్షోభం

ఇప్పుడు ప్రపంచవ్యాప్త సంక్షోభం కాదు. ఒక్క బ్రిటన్ కే  వచ్చింది. దీని కారణాలేంటి?

1. యూరోపియన్ యూనియన్ నుండి బ్రిటన్ తప్పుకోవడం (బ్రెగ్జిట్) తో దాదాపు 2 లక్షలమంది కార్మికులు బ్రిటన్ ను వదలి వెళ్లిపోయారు. వీరిలో రెండు మూడు వేలమంది ట్రక్కు డ్రైవర్లు కూడా ఉన్నారు. ట్రక్కులు నడిపేవారు లేక ఆయిల్ సప్లై ఆగింది.

2. కరోనా దెబ్బ కూడా దీనికి కారణం. పాత తరం ట్రక్కు డ్రైవర్లు రిటైర్ అవుతున్నారు. క్రొత్త వాళ్లకు లైసెన్సులు ఇవ్వాలంటే కరోనా అడ్డుకుంటోంది. ఈ లోపల సంక్షోభం ముదురుతోంది.

ఈ కొరత వల్ల, బ్రిటన్ లో పెట్రోల్ బంకుల దగ్గర అల్లర్లు, దౌర్జన్యాలు జరుగుతున్నాయి.  దొరకదేమోనన్న భయంతో జనం ఎగబడి పెట్రోల్ కొనేస్తున్నారు. అలా కొనద్దని, బ్రిటన్ ప్రధానమంత్రి మొత్తుకుంటున్నాడు. అయినా ఎవరూ వినడం లేదు. పరిస్థితి గందరగోళంగా ఉంది. జనాన్ని అదుపు చెయ్యడానికి, సైన్యాన్ని రంగంలోకి దించే పరిస్థితి వచ్చేసింది.

బ్రిటన్ కు మేషరాశి సూచిక. ప్రస్తుతం యురేనస్ మేషం 19 డిగ్రీలలో ఉన్నాడు. వృశ్చికంలో కేతువే ఉన్నాడు. ఇద్దరికీ షష్టాష్టక దృష్టి ఉంది.  అందుకే ప్రస్తుతం ఒక్క బ్రిటన్ లోనే ఈ సంక్షోభం తలెత్తింది.

అర్ధమౌతోందా, గ్రహస్థితులు దేశదేశాలను ఎలా ప్రభావితం చేస్తాయో? మనుషుల బ్రతుకులను ఎలా నిర్దేశిస్తాయో?

read more " బ్రిటన్ లో పెట్రోల్ సంక్షోభం - గ్రహాలపాత్ర "