ఆధ్యాత్మికం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
ఆధ్యాత్మికం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

8, నవంబర్ 2026, ఆదివారం

ఉపవాసాలతో చనిపోతే జీసస్ కనిపిస్తాడా? సో వాట్?


వెర్రితలలేసే క్రైస్తవప్రచారాలు  ఎలాంటి దారుణమైన రూపాలు తీసుకుంటాయనేదానికి కెన్యా పాస్టర్ పాల్ మెకంజీ  కేసు ఒక ఉదాహరణ. 

మొన్న 6 వ తేదీన కెన్యా కోర్టు ఇతనికి 200 ఏళ్ల జైలుశిక్ష వేసింది. 28 మంది ఇతని అనుచరులకు కూడా శిక్షలు పడ్డాయి. నేరం? తిండిపెట్టకుండా మాడ్చి, హింసించి, 440 మందిని వీళ్ళు చంపేశారు. వాళ్లంతా ఎవరు? పాపం అమాయక క్రైస్తవభక్తులు. వాళ్లలో 190 మంది చిన్నచిన్న పిల్లలే. 

ఎందుకలా చేశాడు? అలా చనిపోతే స్వర్గానికి పోతారని, జీసస్ ను కలవొచ్చని తన చర్చిలో చేసిన బోధలతో జనాన్ని నమ్మించాడు. పిచ్చిజనం నమ్మారు. చచ్చారు. తవ్వితే ఆ శవాలన్నీ బయటపడ్డాయి. వాళ్లలో కొంతమందిని బ్రతికుండగానే పూడ్చేసినట్లు ఆధారాలు దొరికాయి.

కెన్యాలో పేదరికం ఎక్కువ. ఇతను పెద్దగా చదువుకోలేదు. బాల్యం బాధాకరంగా గడిచింది.  టాక్సీ డ్రైవర్ అయ్యాడు. ఆ కసితో విద్యావ్యవస్థపైనా, వైద్యంపైనా, విదేశీ సంస్కృతిపైనా ద్వేషం పెంచుకున్నాడు. ఒకరకంగా సైకో అయ్యాడు. తన టాక్సీలో ఎక్కిన ప్యాసింజర్లతో మాటలు కలిపి బోధలు చేసేవాడు.

మెల్లిగా ఒక చర్చి పెట్టాడు. దానిపేరు 'గుడ్ న్యూస్ ఇంటర్నేషనల్ చర్చ్'. విదేశీ (బ్రిటిష్, అమెరికా) సంస్కృతిని, వాళ్ళ విద్యా వైద్యవిధానాలను వ్యతిరేకించేవాడు. చదువుకోవద్దని, ఇంగ్లీషు మందులు వాడద్దని ప్రచారం చేసేవాడు. అయితే, విదేశాలలో పుట్టిన క్రైస్తవమతాన్ని మాత్రం స్వీకరించాడు. క్రమేణా వేలాదిమంది అనుచరులు పోగయ్యారు. సొంత టీవీ ఛానల్ పెట్టాడు. 2019 లో ఇతనిపైన ఫిర్యాదులు వెల్లువెత్తాయి. పోలీసులు ఆ చర్చిని మూయించారు.

షకహోలా అనే ఒక అడవిలోకి మకాం మార్చాడు. అందులో 800 ఎకరాలను ఆక్రమించాడు. అక్కడే తన చర్చిని నడిపేవాడు. ప్రయివేట్ ఆర్మీలాంటి దానిని ఏర్పాటు చేసుకున్నాడు.వందలాది గుడిసెలను నిర్మించాడు.

బోధించి, భయపెట్టి, కొట్టి, తన అనుచరులను వారి పిల్లలను వాటిలో బంధించేవాడు. అదొక కాన్సెన్ట్రేషన్ క్యాంప్ లాంటిది. మోడ్రన్ లైఫ్ అంతా సైతాన్ మాయ అనీ, దానినుంచి బయటపడి ఉపవాసప్రార్ధనలు చేస్తూ చనిపోవడం ఒక్కటే జీసస్ ను చేరుకోవడానికి మార్గమని భోధించేవాడు. నెలల తరబడి ఆ ఉపవాసాలు తట్టుకోలేక తన చర్చి ఆవరణలోనుంచి పారిపోవాలని ప్రయత్నించిన పెద్దలను, పిల్లలను, తన అనుచరులతో కొట్టించి, వారిని చంపేసి అక్కడే పూడ్చేసేవాడు. అలాంటి శవాలు 500 పైనే ఉన్నాయని అంటున్నారు. 440 ఇప్పటికి బయటపడ్డాయి.

ఏప్రిల్ 2023 లో విచారణ మొదలైంది. 2026 లో తీర్పు వచ్చింది.

కెన్యాలోనే  కాదు. మనదేశంలో కూడా ఇటువంటి అబద్ధప్రచారాలతో అమాయకులను నమ్మించి మతాలు మారుస్తున్న పాస్టర్లు చాలామంది ఉన్నారు. అయితే, ఈ లెవల్లో ఉపవాసప్రార్ధనలు చేసి చనిపొమ్మని వాళ్ళు చెప్పకపోవచ్చు. కానీ, రకరకాల ఆశలు చూపి, హిందూమతమంటే ద్వేషం ఎక్కించి, మతం మారుస్తున్నారు. ఇదొక పెద్ద లాభసాటి వ్యాపారమై పోయింది. పిచ్చిజనం మోసపోతున్నారు.

ఇతను పుట్టినది 1973 లేదా 1976 అని నెట్ చెబుతోంది. సరియైన జననవివరాలు లేవు.  అది 1973 అని నేనంటాను. కారణం? 1973 లో మాత్రమే అటువంటి నరరూపరాక్షస యోగం ఉంది. చార్టు పైనిచ్చాను చూడండి.

రాహుకేతువులు, గురువు నీచస్థితులలో ఉన్నారు. వక్రగురువుకు గురుఛండాలయోగం పట్టింది. శనికేతుయోగం ఉంది. కుజగురురాశుల సంబంధం ఉన్న కుజునికి, ఉచ్ఛబుధునితో దృష్టి ఉండటం వల్ల మొండితనం, పాస్టర్ వేషం, అతితెలివీ ఏర్పడ్డాయి. ఈ యోగాలు 1976 లో లేవు.  కనుక, ఇతను పుట్టినది 1973 లో మాత్రమే.

14 ఏప్రిల్ 2023 న ఇతను అరెస్టయ్యాడు. సరిగ్గా అది మేషసంక్రాంతి సమయం అయింది. గోచార శనిగురువుల దృష్టి రహస్యాలకు నెలవైన వృశ్చికంపైన ఉంది. అందుకే ఇతని రహస్యాలన్నీ ఆనాడు బయటపడ్డాయి. మూడేళ్ళ విచారణ తర్వాత ఇప్పుడు శిక్ష పడింది.

ఇండియాక్రైస్తవులు, కమ్యూనిస్టులు, కాంగ్రెసువారు ఇలాంటి న్యూసుల గురించి మాట్లాడరు. పేపర్లు కూడా మాట్లాడవు. బ్రాహ్మణులు గుళ్ళలో రేపులు చేస్తున్నారని నేహాబోరా అంటే, పేపర్లన్నీ దాన్ని మొదటిపేజీలో వేస్తాయి. ఇలాంటి వార్తలకు మాత్రం ప్రచారం ఉండదు. ఆమె ఎన్ని రేపులను దగ్గరుండి చూసిందో పాపం ! లేదా బాధితురాలేమో !

ఒకవేళ ఎక్కడైనా ఎవడో ఒక పూజారి అలాంటిపనిని చేస్తే, హిందువులు అతన్నేమీ క్షమించరు. వాళ్లే శిక్షిస్తారు. లేదా, శిక్ష పడాలని నిస్పక్షపాతంగా కోరుకుంటారు. అంతేగానీ, క్రైస్తవులు ముస్లిములు చేసేటట్లుగా అటువంటివాడిని నిస్సిగ్గుగా వెనకేసుకురారు. సమర్ధించరు.

అసలు, క్రైస్తవం, ఇస్లాం బోధించే స్వర్గమూ నరకమూ రెండూ అబద్దాలే. అవి లేవు. వాటి పేరుతో అమాయకులను భయపెట్టి మోసం చేస్తున్నారు. అంతే!

అదేవిధంగా, జీసస్ రెండవరాకడ కూడా అబద్దమే. అది జరగదు. కొన్ని ఇస్లాం శాఖలలో చెప్పేటట్లు 'మెహదీ' మళ్ళీ వస్తాడనే భావన కూడా అబద్దమే. అంతిమతీర్పు అనేది లేనేలేదు. అది అబ్రహామిక్ మతాల మాయ. అదీ అబద్దమే. 

సరే వాళ్ళ అబద్దాలను వాళ్ళు చెప్పుకోనివ్వండి. కానీ ఇతర మతాలపైన, ముఖ్యంగా హిందూమతం పైన, బురదజల్లడం, ద్వేషం రెచ్చగొట్టడం మాత్రం తప్పులే.

స్వర్గనరకాలనేవి పెద్దభ్రమలని  ఉపనిషత్తులలోని వేదాంతభావనలంటాయి. అందుకే నేనంటాను, వేదాంతాన్ని అధ్యయనం చేస్తేనే, అసలైన హిందూమతమేమిటో అర్ధమౌతుందని. పురాణాలను పట్టుకొని కూచుంటే అదెప్పటికీ అర్ధం కాదు. వేదాంతపు కోణం నుండి పురాణాలను చదివినపుడు మాత్రమే అసలైన హిందూమత స్వరూపస్వభావాలు అర్ధమౌతాయి. 

కానీ నేడు ఏ హిందూమత బోధకులూ దీనిని చెప్పడం లేదు. ఉత్తపురాణాలను బోధిస్తున్నారు. వాటిని పట్టుకొని అవే సర్వస్వమైనట్లు జనం  కొట్టుకుంటున్నారు.

సరిగ్గా చెప్పేవారూ లేరు. చెప్పినా వినేవారూ లేరు. అదే మనకు పట్టిన దరిద్రం.

పాల్ మెకంజీ లాంటివాళ్లు చరిత్రలో చాలామందున్నప్పటికీ, అమ్ముడుపోయిన మీడియా, ఇలాంటి న్యూసులకు అంత ప్రాధాన్యతనివ్వదు. ఇస్తే, జార్జి సోరోస్ ఇచ్చే డబ్బులు ఆగిపోతాయి కదా !

క్రైస్తవం నూరిపోస్తున్న ఇలాంటి అబద్ధాలతో ఎంతమంది ఈ విధంగా భ్రమలలో పడిపోతున్నారో మరి? అసలూ, అంతమంది తనను నమ్మిన అమాయకులు అలా దారుణంగా చంపబడుతుంటే, జీసస్ ఏం  చేస్తున్నాడు? మెకంజీకి దర్శనమిచ్చి "ఒరే  అలా  చెయ్యకురా. తప్పురా" అని చెప్పాలి కదా? మరెందుకు చెప్పలేదో?

బైబిలు అబద్ధాలనూ, పాస్టర్ల అబద్ధాలనూ నమ్ముతున్న అమాయక క్రైస్తవులను ఆ జీససే రక్షించాలి. ఆయనంటూ అసలెక్కడైనా ఉంటే !

read more " ఉపవాసాలతో చనిపోతే జీసస్ కనిపిస్తాడా? సో వాట్? "

26, అక్టోబర్ 2026, సోమవారం

బెంగుళూరు యూజీ గ్రూపుతో సమావేశం

నిన్న ఇక్కడున్న  యూజీ గ్రూపుతో I.I.W.C (ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వరల్డ్ కల్చర్) అనేచోట సమావేశం కావడం జరిగింది.

యూజీగారికి బెంగుళూరుతో ఉన్న అనుబంధం గురించి ఆయన జీవితాన్ని చదివినవారికి సుపరిచితమే.

దశాబ్దాలుగా ఆయనను అభిమానిస్తున్నవారు చాలామంది ఇక్కడున్నారు. వారిలో ఆయనను చూచినవారు కలిసినవారు దగ్గరగా మసలినవారు చాలామంది ఉన్నారు. ఒకవిధంగా, వాళ్ళందరూ ఆయన స్మృతులలో బ్రతుకుతున్న భగ్నప్రేమికులు. వాళ్ళను యూజీగారి స్మృతులలో ముంచుతున్నదీ, ఉంచుతున్నదీ వాళ్ళ నాయకుడు చంద్రశేఖరబాబు గారు.

ఆయన యొక్క పురాతనమైన స్మృతిభాండాగారాన్ని తెరచి ఎప్పుడో జరిగిపోయిన సంగతులను కళ్ళకు కట్టినట్లుగా ఆయన చెబుతుంటే, ఆ కాలానికి వెళ్ళిపోయి, ఆ సంఘటనలను నేను కూడా దగ్గరుండి చూస్తున్న అనుభూతి కలిగింది. ఆయనను కలుసుకున్న ప్రతిసారీ మహేంద్రనాధగుప్త గారిని కలుసుకోలేకపోయానన్న నా బాధ కొద్దిగానైనా తీరిపోతూ ఉంటుంది. 

యూజీ వంటి ఒక జీవన్ముక్తుడినీ, అమనస్కస్థితిని పొందిన మహనీయుడినీ, లేదా ఆయన మాటలలోనే చెప్పాలంటే, ఒక 'సహజమానవుడి'నీ కలుసుకుని, ఆ రుచిని ఒక్కసారైనా ఆస్వాదించినవాళ్లు, ఆపైన ఆయనను మరచిపోవడం అసాధ్యమౌతుంది - వాళ్ళ హృదయపు యాంటెనాలు సరిగ్గా ఉంటే !

ఆయన గతించిన 20 ఏళ్ల తర్వాత నేటికి కూడా ఆయనను మరచిపోలేక, ఆయన స్మృతులను నెమరువేసుకుంటూ జీవిస్తున్న ఈ గ్రూపును కలుసుకోవడం నాకు సంతోషాన్నిచ్చింది.

రామకృష్ణులు గతించి 140 ఏళ్ళైనా ఇప్పటికీ ఆయన స్మృతులలోనే జీవిస్తున్న పిచ్చివాళ్ళు లేరూ? అలాంటివాళ్లే వీళ్ళు కూడా !

మంచిమనుషులనేవాళ్ళు కనపడడమే అరుదైపోతున్న ఈ రోజులలో కొంతమందినైనా ఒకేచోట కలవడం చాలా బాగా అనిపించింది.

యూజీ గారు పొందిన స్థితీ, చెప్పిన మాటలూ, వీళ్లకు పూర్తిగా అర్ధం కాకపోవచ్చు. ఆయనలో ఎన్నో పరస్పర విరుద్ధమైన విషయాలు వీరికి గోచరిస్తూ ఉండవచ్చు. వాటికీ, మన శాస్త్రాలలో చెప్పబడిన సాంకేతికభాషకూ పొంతన కుదరకపోతూ ఉండవచ్చు, వీళ్లకు తోచినట్లుగా వీళ్ళు అన్వయించుకుని సంతృప్తిపడుతూ ఉండవచ్చు,  కానీ వీళ్ళందరూ నిస్సందేహంగా ఆయనను ప్రేమిస్తున్నారు. అది చాలు. ఒకనాటికి వీళ్ళుకూడా అక్కడకు చేరుకుంటారు.

ఆ చర్చలో నేనేమీ పెద్దగా పాలుపంచుకోలేదు. మధ్యమధ్యలో  ఒకటి రెండు మాటలను మాట్లాడినప్పటికీ, చాలావరకూ మౌనంగానే వాళ్ళ చర్చను విన్నాను. వాళ్ళ వెదుకులాట నాకు ముచ్చటేసింది.

వాళ్లలో చాలామందికి పాపం చాలా సందేహాలున్నాయి. అందరూ బాగా చదువుకున్నవాళ్ళే. చదివినవాళ్ళే. కానీ ఆధ్యాత్మికప్రపంచం వేరైనది కదా ! లౌకికజ్ఞానమూ, పుస్తకపరిజ్ఞానమూ ఇక్కడ పనిచేయవు. 

కుండలినీ జాగృతి అయిన ఒక వ్యక్తిని వారిలో చూచాను. నేడు ప్రతివారూ కుండలిని గురించి మాట్లాడుతున్నారు. కానీ నిజంగా అది జాగృతి అయిన ఒక్కడంటే ఒక్కడిని కూడా నేను ఇంతవరకూ చూడలేదు. ఈ గ్రూపులో చూచాను. విచిత్రమేమిటంటే, అతనేమీ సాధనలు చేయలేదు. ప్రస్తుతం చేయడమూ లేదు. ఆయన పుట్టిన తేదీని అడిగి, అప్పటి గ్రహస్థితులను ఊహించి అది నిజమే అని నిర్ధారించుకున్నాను. అతను చెబుతున్న అనుభవాలూ లక్షణాలూ కూడా కుండలినీజాగృతి గురించి నాకు తెలిసిన లక్షణాలతో సరిపోతున్నాయి. అతని ఆరా కూడా దానికి అనుగుణంగానే ఉంది.

నకిలీలు ఎక్కడ చూచినా ఉంటారు, అసలైనవాళ్ళు మాత్రం ఎక్కడో అజ్ఞాతంగా ఉంటారన్న విషయం మళ్ళీ ఋజువైంది. 'మీ అడ్రసు యూట్యూబు ఛానల్స్ కి లీక్ చేస్తాన'ని అతడిని బెదిరించాను. 'అమ్మో ఆ  పని  మాత్రం చేయకండి' అని అతనన్నాడు.

మధ్యాహ్నభోజనాలయ్యాక పెద్దగా కార్యక్రమమేమీ లేదు. యూజీగారి అరుదైన వీడియోలను ప్లే చేసి కొంతమంది చూచారు. నేనవన్నీ యూట్యూబులో ఇప్పటికే చూచాను గనుక, బయటకొచ్చి చెట్లకింద నడుస్తున్నాను. అక్కడున్న ఇంకా కొంతమందిమి అదీఇదీ మాట్లాడుకుంటూ గడిపాము.

మీటింగు అయిపోయాక, నేను, కుండలిని, ఇంకొక ఇద్దరం కలసి జయనగర్ నుంచి లాల్బాగ్ వరకూ అనేకవిషయాలు ముచ్చటించుకుంటూ నడిచాము. చివరికి అక్కడ మెట్రో రైలెక్కి ఎవరి ఇళ్లకు వారు చేరుకున్నాము.

ఆ విధంగా ఈ గ్రూపుతో నా మొదటి మీటింగు ముగిసింది. బహుశా ఇదే ఆఖరిది కూడా కావచ్చు.

read more " బెంగుళూరు యూజీ గ్రూపుతో సమావేశం "

20, అక్టోబర్ 2026, మంగళవారం

భక్తులను దేవుడు నిజంగా రక్షిస్తాడా?

చర్చిలో మాస్ ను నిర్వహిస్తున్న కేథలిక్ పాస్టర్ పైన, వెనుకనుండి శిలువా, దానిపైనున్న ఏసుక్రీస్తు విగ్రహమూ పడి, ఆ పాస్టర్  చనిపోయిన సంఘటన ఈక్వడార్ లో నిన్న జరిగింది.

ఆ చర్చి పేరు Our Lady of Perpetual Help Church.

ఈ సంఘటన అనేక చర్చలను రేకెత్తించింది.

జీసస్ నిజంగా ఉంటే, ప్రార్ధనలు చేసేవారిని రక్షిస్తూ ఉంటే,  ఇలా ఎలా జరుగుతుంది? అని  కొందరంటున్నారు. నిజమే !

దీనికి సపోర్టుగా పోప్ లియో కూడా ఈ మధ్యనే ఆపరేషన్ చేయించుకున్నాడు. ఆయనకు కుడి ఊపిరితిత్తిలో గడ్డ ఉందని, ఊపిరితిత్తి కొంతభాగాన్ని తొలగించారు.

ఆయననెందుకు జీసస్ కాపాడలేకపోయాడు? కొబ్బరినూనెలూ, మోకాళ్ళ ప్రార్ధనలూ పోప్ కు చేతకావా? చేసినా పనిచెయ్యలేదా? లేక పోపుకి జీసస్ పైన గట్టి విశ్వాసం లేదా?

సాక్షాత్తు పోపుకే దిక్కులేకపోతే, ఇక సామాన్య క్రైస్తవుడెలా రక్షింపబడతాడు? పోపునే రక్షించని జీసస్ సామాన్యక్రైస్తవుడినెలా రక్షిస్తాడు? అసలు, రక్షణే బూటకమా? మొదలైన ప్రశ్నలు సహజంగానే తలెత్తుతాయి.

ఎందుకంటే, ఇవే నమ్మకాలపైన ఆధారపడి కోట్లాదిమంది క్రైస్తవుల జీవితాలు నడుస్తున్నాయి మరి !

ఇలా ప్రశ్నించినవారిని, "ఏం? మీ గుళ్ళలో ఇలా ఎప్పుడూ జరగలేదా?" అని క్రైస్తవులు ఎదురు ప్రశ్నిస్తున్నారు?

ప్రశ్నకు ప్రశ్న జవాబు కాదు. కాబోదు.

లాజిక్కు లేని మొండిచర్చలవల్ల విషయంలో స్పష్టత ఎప్పటికీ రాదు. ఉత్తనమ్మకం వల్ల ఏదీ తేలదు.

ఏ మతమైనా, ఏ ప్రార్థనామందిరమైనా, అడిగిన అన్నింటినీ ఏ దేవుడూ ఇవ్వడు. మరి అడగటం ఎందుకు? అంటే, మన మనశ్శాంతి కోసం అంటారు. ఆ మనశ్శాంతిని కూడా దేవుడే ఇవ్వచ్చు కదా. మనమెందుకు అడగాలి? అంటే, 'అడగనిదే అమ్మైనా పెట్టదు' అంటారు. అమ్మకీ దేవుడికీ పోలికేంటసలు? మనం అడగకపోతే అమ్మకు తెలియకపోవచ్చు. దేవుడికి కూడా తెలీదా?

జవాబులుండవు.

'ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే' అని క్రైస్తవులు పాడుతుంటారు. ఇక అడగటం ఎందుకు, పనిలేకనా?

నువ్వడిగినా అడగకపోయినా జరిగేది జరుగుతుంది. దేవుడు ఇచ్చేదానిని ఇస్తాడు. ఇక ప్రార్థన ఎందుకు? మనిషి మనిషిగా బ్రతికితే పోలా?

అదే అత్యంత కష్టమైన పని. అది చేయలేకనే మనిషి మతాన్ని సృష్టించాడు. కానీ, మతానుయాయులకు కూడా మంచీ చెడూ తప్పవు.

ఆ మాటకొస్తే, అన్ని మతాల ప్రార్ధనామందిరాలలోనూ, అంటే గుడులు, చర్చిలు, మసీదులు, గురుద్వారాలు, బౌద్ధారామాలు మొదలైన అన్నింటిలోనూ ఇలాంటి సంఘటనలు గతంలోనూ జరిగాయి. ఇప్పుడూ జరుగుతున్నాయి.

రోడ్డుపక్కన దర్గాల దగ్గరనుండి, పెద్ద పెద్ద మందిరాల వరకూ అన్నింటిలోనూ మిరకిల్సూ ఉన్నాయి, ఫెయిల్యూర్సూ ఉన్నాయి. వీటిలో ఉత్త నమ్మకాలూ ఉన్నాయి, నిజంగా జరిగినవీ ఉన్నాయి. సంఘటనలు వాటంతట అవే జరిగినపుడు, దేవుడికి ఆపాదించి భక్తులు నమ్ముతున్నవీ ఉన్నాయి.

ఉదాహరణకు, దేవీనవరాత్రుల తొక్కిసలాటలో భక్తులు చనిపోయిన సంఘటన మొన్న 17 వ తేదీన కలకత్తాలో జరిగింది.

18 వ తేదీన గ్వాలియర్ లో శీతలాదేవి ఉత్సవసందర్భంలో అయితే, లోడుతో ఉన్న ఒక ట్రక్కు భక్తులపైకి దూసుకురావడంతో చాలామంది చనిపోయారు.

గతంలో తిరుమలలోనూ, శబరిమలలోనూ, పుష్కరాలలోనూ, ఇతర సందర్భాలలోనూ ఇలాంటి సంఘటనలు చాలా జరిగాయి.

ఇంకొక కోణంలో చూస్తే, ఇజ్రాయెల్ విమానప్రమాదంలో 180 మంది రక్షింపబడ్డారు. పైలట్ మచ్చర్, హనుమాన్ చాలీసా చదువుకుంటూ హనుమంతుని ధ్యానించడం వల్ల ఇది జరిగిందని అంటున్నారు. ఆంజనేయస్వామి వల్ల జరిగిన మహిమలు కోకొల్లలుగా ఉన్నాయి. నేటికీ ఎన్నో జరుగుతున్నాయి.

అదేవిధంగా 11 వ తేదీన ఇల్లినాయ్ రాష్ట్రంలోని అరోరా వెంకటేశ్వరస్వామి ఆలయంలో గుమిగూడిన భక్తులపైన కాల్పులు జరుపుదామని ఒక అమెరికన్ టీనేజర్ అబ్బాయి ప్రయత్నించగా, రైఫిల్ జామ్ అవడం వల్ల ఆ ప్రమాదం తప్పిపోయింది. దీనిని స్వామి మహిమగా ఆయన భక్తులు అంటున్నారు. కావచ్చు !

అయితే, "మా దేవుడొక్కడే ప్రమాదాలనుంచి కాపాడగలడు, మీ దేవుడు కాపాడలేడు" అని ఎవరూ చెప్పలేరు. చెప్పకూడదు కూడా. ఎందుకంటే, ప్రమాదాలూ, రక్షణలూ రెండూ, అన్ని మతాలవారికీ, అందరు దేవుళ్ళ భక్తులకూ జరిగాయి. జరుగుతున్నాయి. 

దేవుడిని నమ్మని నాస్తికులకు కూడా ఇదే విధంగా రెండూ జరుగుతాయి.

అయితే, నమ్మిన ప్రతిసారీ మిరకిల్స్ జరగవు. జరిగినదానిని మిరకిల్ అనుకుంటారంతే !

సైన్సును నమ్మేవారు దీనిని "ఛాన్స్ ఫేక్టర్" అంటారు.

"నమ్మకం" అనే కోణాన్ని ప్రక్కన పెట్టి వీటిని నిస్పాక్షికంగా పరిశీలిస్తే, అసలైన కారణాలు అర్ధమౌతాయి.

తొక్కిసలాట వల్ల  జరిగే ప్రమాదాలకేమో నిర్వాహకుల అజాగ్రత్తా, భక్తుల దురాశా, సివిక్ సెన్సు లేకపోవడాలే కారణాలు.

టెర్రరిస్టు సంఘటనలకేమో, "మన మతమే గొప్ప. మన దేవుడే గొప్ప. వేరేవాళ్లను చంపండి" అని ప్రేరేపించే ఎడారి రాక్షసమతాలు కారణాలు.

దేశదేశాలలో రేగుతున్న అశాంతికీ, అల్లర్లకూ, మతమార్పిడులు కారణాలు.

చంపుతున్నదీ, విధ్వంసం సృష్టిస్తున్నదీ సైతాను, రక్షిస్తున్నది మాత్రం దేవుడు అనే వాదన కూడా శుద్ధతప్పే. ఆ సైతాను దేవుడి సృష్టిలో ఎందుకుంది? దేవుడెందుకు దానిని ఉండనిస్తున్నాడు? అనే ప్రశ్నకు ఒక్క హిందూమతంలో తప్ప ఇతరమతాలలో జవాబులు  లేవు.

ఆఫ్కోర్స్! మన మతం ప్రకారం అసలు సైతానే లేదు. అది అబ్రహామిక్ మతాల సృష్టి మాత్రమే.

ఇంకా చెప్పాలంటే, ఏ దేశంలో చూచినా,  శాంతిమతాలుగా చెప్పుకునే క్రైస్తవమూ ఇస్లాముల వల్ల ద్వేషాలూ, అల్లర్లూ, గొడవలూ, హింసా, రక్తపాతమూ తప్ప ఇంకేం జరుగుతున్నాయి? అవి నిజంగా శాంతిమతాలే  అయితే ప్రపంచవ్యాప్తంగా ఇన్ని యుద్దాలెందుకు?

జవాబులు ఉండవు.

సైతాను, దేవుడు అనే భావనలు నిజాలైతే, చర్చిలో ఇలాంటి సంఘటనలెందుకు జరుగుతున్నాయి? అక్కడకూడా సైతాను ఉంటాడా? లోనికి రాగలడా? అన్న ప్రశ్న తలెత్తుతుంది.

ఇక మసీదులలో అయితే, వాళ్లలో వాళ్లే బాంబులు పెట్టుకుంటారు గనుక బయటనుండి సైతాను కొత్తగా లోపలి రావల్సిన అవసరం ఏమీ ఉండదు. వాళ్లలోనే ఉంటాడు.

'నా సన్నిధి నీకు తోడుగా వచ్చును' అని బైబిలు చెబుతోంది. మరి ఈక్వడార్ చర్చిలో ఆ సన్నిధి ఏమైపోయింది? అంతమంది భక్తులు అంత విశ్వాసంతో ప్రార్థిస్తున్న చోట దేవుని సన్నిధి ఎందుకు లేదు? ప్రార్థనను లీడ్ చేస్తున్న పాస్టరే ఆ విధంగా చనిపోవడమేంటి?

ఆ పాస్టర్ భక్తుల డొనేషన్లను దుర్వినియోగం చేస్తున్నాడనీ, ఖరీదైన కార్లలో తిరుగుతున్నాడనీ, ఇంకా అటువంటి పనులను చేస్తున్నాడని కొంతమంది అంటున్నారు. అందుకని దేవుడు అలా శిక్షించాడట. కానీ ఈ లాజిక్కు నిలబడదు. ఎందుకంటే, శిక్షించేది యహోవా మాత్రమే. జీసస్ ఎన్నటికీ శిక్షించడు. ఎటువంటి పాపాన్నయినా క్షమించడానికే జీసస్ వచ్చాడని క్రైస్తవం చెబుతుంది. అలాంటప్పుడు, ఒకవేళ పాస్టర్ అవినీతిపరుడైనప్పటికీ, శిక్షించడానికి జీసస్ కు పర్మిషన్ లేదు. యహోవానే ఆయనను ప్రశ్నిస్తాడు, " క్షమించమని నేను నిన్ను భూలోకానికి పంపిస్తే నువ్వు శిక్షిస్తున్నావేమిటి?' అని. కనుక ఈ లాజిక్ చెల్లదు.

ఒకవేళ సైతానే శిలువలో దూరి, వెనుకనుండి పాస్టర్ మీద పడి అతన్ని చంపేశాడని అనుకుందామంటే, అంతమంది గుమిగూడి ప్రార్థిస్తున్న చర్చిలోకి సైతాన్ ఎలా రాగలడు?  అది కుదిరేపని  కాదు. అప్పుడు జీసస్ శక్తిలేనివాడైపోతాడు. ఏ విధంగా చూసినా ఈ సంఘటనను సమర్ధించడం వీలుకాదు.

మరి అసలేం జరిగింది? ఎలా దీనిని వివరించాలి? ఎలా అర్ధం చేసుకోవాలి?   

నిజాయితీ ఉన్నవారు ఆలోచించాలి. ఆత్మపరిశీలన చేసుకోవాలి.

కనుక లాజికల్ గా చూస్తే, ఈ సంఘటనలలో ఈ క్రింది కారణాలు మాత్రమే కనిపిస్తాయి.

మన నిర్లక్ష్యమూ, అజాగ్రత్తలవల్ల జరిగేవి కొన్ని. మనలో మానవత్వం మాయమై, రాక్షసత్వం పెరగడం వల్ల జరిగేవి కొన్ని. అంతా మంచిగా ఉన్నప్పటికీ, మన పరిధిని దాటి జరిగేవి మరికొన్ని.

ఇవి తప్ప, ఒకరు రక్షింపబడినా, మరొకరు శిక్షింపబడినా, ఇందులో దేవుడిపాత్ర ఏమీ లేదని నేనంటాను. ఉందని అనుకుంటున్నంతవరకూ మీకు కర్మరహస్యాలు, సృష్టిరహస్యాలు అర్ధం కాలేదని కూడా నేనంటాను.

నేనే కాదు, బుద్ధుడు కూడా ఇదే అన్నాడు.

వీటిని అర్ధం చేసుకోవడమంటే, యూట్యూబు వీడియోలూ, రీల్సూ చూసినంత సులభం కాదు.

హిందూమతంలో వీటికి అసలైన లాజికల్ వివరణలున్నప్పటికీ, అవి వేదాంతంలోకి తొంగిచూస్తే తప్ప, పురాణాలను పట్టుకుని కూచున్నవారికి ఏమాత్రమూ అర్ధంకావు. వేదాంతమంటే వేదంయొక్క జ్ఞానభాగమని వేరే చెప్పనక్కరలేదు కదా !

పురాణాలను దాటి, వేదాంతభాగంలో అడుగుపెట్టినవారికి మాత్రమే కర్మరహస్యాలూ, సృష్టిరహస్యాలూ, కనీసం మేధోపరంగానైనా, అర్ధమౌతాయి.

నిన్న ఈక్వడార్లో చనిపోయిన పాస్టర్ కూడా, స్వర్గానికి డైరెక్ట్ గా పోయాడని కేథలిక్కులంటుంటే, విగ్రహారాధన చేయడం వల్ల ప్రభువు శిక్షించాడని ప్రొటెస్టెంట్లూ, ఇతర డినామినేషన్లూ అంటున్నారు. రెండూ నిజాలు కావు. వీళ్ళ ఊహలు మాత్రమే.

దాడులలో చనిపోయిన టెర్రరిస్టులు కూడా డైరెక్టుగా స్వర్గానికే పోతారని ఇస్లామిక్ టెర్రరిస్టులంటారు. "ఘాజీ" అని వాళ్లకు బిరుదులిస్తారు. అదీ నిజం కాదు. ఊహ మాత్రమే.

మనం ఊహించిన ప్రతిదీ నిజం కావాలని  రూలేమీ ఎక్కడా లేదు.

అసలూ, సృష్టిలో ఎన్ని స్వర్గాలున్నాయి? ఎక్కడున్నాయి? అవి శాశ్వతాలా? అశాశ్వతాలా? కల్పితాలా? నిజాలా? ఎవరైనా చెప్పగలరా?

ఒక్క వేదాంతం తప్ప, వీటికి జవాబులను ఎవరూ చెప్పలేరు.

అసలు విషయమేంటంటే,  

కర్మరహస్యాలు అందరికీ  అర్ధమైపోతే సృష్టి నడిచేదెలా?

అందుకని, భక్షణలూ, శిక్షణలూ, రక్షణలూ అన్నీ జరుగుతూనే ఉండాలి. ఎవరిమటుకు వారు "ఇదంతా మా దేవుడే చేస్తున్నాడు" అనుకుంటూనే ఉండాలి. ఎవరి భ్రమలలో వాళ్ళు బ్రతుకుతూనే ఉండాలి. కొట్టుకుచస్తూనే ఉండాలి.

అప్పుడే ఈ ప్రపంచం నడుస్తూ ఉంటుంది.

ఎవరిష్టానుసారం వాళ్ళు ఇదేవిధంగా అనుకుంటూ  ఉండండి. సృష్టిసూత్రాలను అర్ధం చేసుకునే ప్రయత్నాన్ని, తెలివితో జీవించే ప్రయత్నాన్నీ ఎవరూ చేయకండి. ఇలాగే ఉండండి. ఇలాగే ముందుకెళ్లండి. ఎటువెళ్ళినా చివరకొచ్చేది సముద్రమేగా !

హ్యాపీ విజయదశమి !
read more " భక్తులను దేవుడు నిజంగా రక్షిస్తాడా? "

18, అక్టోబర్ 2026, ఆదివారం

వాయిదా పడిన మైసూరు ట్రిప్పు

నవరాత్రుల చివరిరోజులు.

బెంగుళూరుకు మైసూరు దగ్గరే కదా, మైసూరెళ్లి చాముండేశ్వరీ అమ్మవారి దర్శనం చేసుకొద్దామని మా బృందంలోని కొందరన్నారు.

'ఇప్పుడొద్దు. కావాలంటే నవరాత్రులయిపోయాక వెళ్ళొద్దాం. అయినా అక్కడకెళ్ళేది దేవుడికోసమా? లేక కొండనీ, గుడినీ, అక్కడి హడావుడినీ, జనాన్నీ చూడటం కోసమా?

మొదటిదానికైతే ఎక్కడికీ పోనక్కరలేదు. రెండోదానికోసమైతే అంతదూరం పోవడం వృధాపని. ఒకవేళ సైట్ సీయింగ్ కోసమే అనుకుంటే, పండుగరోజులలో దానిని కూడా ఆస్వాదించలేం. కనుక ఎలా చూచినప్పటికీ, ఇప్పుడు మైసూరు వెళ్లడం తెలివిలేనిపనే అవుతుంది. అమ్మవారెక్కడికీ పోదు. మైసూరు కూడా ఎక్కడికీ పోదు. నాలుగురోజులాగండి." అన్నాను.

ఏ పుణ్యక్షేత్రానికైనా సరే, పండుగరోజులలో వెళ్లడం మా విధానం కాదు. జనం తక్కువగా ఉన్నపుడు మాత్రమే అలాంటి చోట్లకు వెళ్ళాలి. అప్పుడు మాత్రమే అక్కడి ఆరాను మనం అందుకోగలుగుతాం.

పండుగ రోజులలో వెళితే ఏముంటుంది, చవకబారు గోల తప్ప?

నేలబారు మనుషులూ, వాళ్ళ అసహ్యకరమైన పోకడలూ, తొక్కిసలాటలూ, లంచాలూ, రికమెండేషన్లతో దర్శనాలు చేసుకోవడమూ, ఏదో పుణ్యం సంపాదించేశామని భ్రమపడుతూ, పొంగిపోతూ వెనక్కు రావడమూ, మళ్ళీ మన నకిలీబ్రతుకులు బ్రతకడమూ తప్ప ఎక్కడికెళ్లొచ్చినా వేరే ఏముంటుంది?

మనకు నచ్చనివే ఇవి !

పండుగలను మామూలు మనుషులు జరుపుకునే విధానం ఒకలాగా ఉంటుంది. నిజంగా ఆధ్యాత్మికమార్గంలో నడుస్తున్నవాళ్ళు జరుపుకునే విధానం ఇంకోలా ఉంటుంది. 

మొదటిది అందరికీ తెలిసినదే. అందరి ఎదురుగా కనిపించేదే. రెండోది బజార్లో దొరకదు. బయటకు కనిపించదు. చాలామందికైతే అదొకటుందని తెలియదు కూడా ! 

"మాకు తెలుసు" అనుకునేవాళ్లకు కూడా తెలియదని నేనంటాను.

పాపులర్ మతంగాని, దాని ఆచరణలుగాని, అన్నీ బూటకాలే. ఇవన్నీ "నేను సరిగానే ఉన్నాను" అన్న భ్రమలో మనిషిని ఉంచుతున్నాయంతే.

అన్నీ సరిగానే ఉంటే, మనుషుల జీవితాలెందుకు ఇలా ఉన్నాయి మరి? అన్న ప్రశ్నకు జవాబు ఎక్కడా లేదు.

ఎక్కడైనా సరే, మతాచరణలూ తంతుల భ్రమలనుండి కొద్దిమంది మాత్రమే నిజంగా బయటపడతారు. మిగతావాళ్లంతా, ఆ ఊబిలో ఉంటూ, అదే సత్యమని భ్రమిస్తూ ఉండవలసిందే. వేరే మార్గం లేదు.

"ఈరోజున ఇక్కడికెళ్ళండి. ఇలా మొక్కండి. అలా చెయ్యండి. ఇక మీకు ఎదురుండదు. మీ పాపాలన్నీ పోతాయి. మీరు పట్టిందల్లా బంగారమౌతుంది." మొదలైన అబద్ధాలతో కొందరు జనాన్ని నమ్మిస్తున్నారు. పిచ్చిజనం నమ్మి   మోసపోతున్నారు.

ఇంతా చేస్తే, ఇదంతా బంగారం కోసమా?

ఇవన్నీ రెలిజియస్ టూరిజంను పెంచుకునే బిజినెస్ ట్రిక్స్ తప్ప ఇంకేమీ కావు. ఇదంతా టీవీ ఛానెల్స్, యూట్యూబు చానల్స్ చేస్తున్న మాయ.

అలా ఎప్పటికీ జరగదు. ఊర్లు తిరిగినంత మాత్రాన పాపాలూ పోవు. బ్రతుకులూ మారవు. ఆ మార్గాలు వేరే ఉంటాయి.

ఇవాళా రేపూ పండుగల అంతరార్ధాలన్నీ మరుగునపడ్డాయి. కేవలం సరదాలుగా, వినోదాలుగా, పైపై నాటకాలుగా అవి మారిపోయాయి. వినాయకచవితైనా, దీపావళైనా, దసరా అయినా, శ్రీరామనవమైనా, కృష్ణాష్టమి అయినా, శివరాత్రి అయినా, ఇంకొకటైనా అన్నింటినీ అలా మార్చేశాం  మనం.

హిందూమతానికి ఎంత దురవస్థ పట్టింది ? అవున్లే, అందరూ సత్యాన్వేషకులూ, సత్యద్రష్టలూ అయిపోతే, సృష్టి ఆగిపోదూ మరి ! 

ఈ ప్రపంచం ఇలా ఉండటమే కరెక్టు !

ఏదేమైనా, ప్రస్తుతానికి మా మైసూరు ట్రిప్  మాత్రం కొంతకాలంపాటు వాయిదా పడింది.

read more " వాయిదా పడిన మైసూరు ట్రిప్పు "

10, అక్టోబర్ 2026, శనివారం

కుండ చేసిన కుండలినీ సాధన

వారం రోజులనుండీ బెంగుళూరులో మకాం.

ఇవాళ మహాలయ అమావాస్య. 

మహాలయ అమావాస్య అంటే ఏమిటి? ఈ రోజున మనమేం చెయ్యాలి? మొదలైనవన్నీ వివరించే కుతూహలం నాకు లేదు.

అమావాస్యా, పౌర్ణమీ ఛాయలలో నన్ను కదిలించకుండా కొంతమంది ఉండలేరు. అలా జరిగిన సంఘటనలను వ్రాయకుండా నేనూ ఉండలేను.

నిన్నొక కుండ దగ్గరనుంచి ఫోనొచ్చింది. కుండంటే ఏమీ లేదు. ఈ మధ్య కుండలిని ఫ్యాషన్ అయిపోయింది కదా. కుండలినీ సాధన చేయాలనీ, చేస్తున్నామనీ చెప్పుకునే అర్భకులను అలా పిలవడం నాకలవాటు. 

'నేనొక గురువుగారి దగ్గర కుండలినీ సాధన చేశాను. కుండలిని కొద్దిగా లేచింది. మళ్ళీ పడుకుంది. ఇప్పుడు మీ దగ్గర నేర్చుకుందామని అనుకుంటున్నాను. గైడ్ చేయగలరా?' అనేది దాని సారాంశం.

ఇలాంటివాళ్లకు ఎలా సమాధానం చెబుతానో మీకు గతంలో చాలాసార్లు తెలిసినా, మళ్ళీ  వినక మీకు తప్పదు. ఏమంటే, జీవితం నిత్యనూతనం కదా ! కొత్త కొత్త మనుషులు తగులుతూనే ఉంటారు. సంఘటనలు జరుగుతూనే ఉంటాయి.

'నిద్రపోయేవారిని లేపడం మంచిది కాదు. నాకిష్టం ఉండదు. నువ్వూ ఆ పనిని చేయకు' అని జవాబిచ్చాను.

కుండకు అహం దెబ్బతింది.

'మీరు యోగామీద చాలా పుస్తకాలు వ్రాశారని మిమ్మల్ని అప్రోచ్ అవుతున్నాను. మీరేమో ఎగతాళిగా మాట్లాడుతున్నారు. మీకసలు కుండలిని తెలుసా?' అడిగింది కుండ.

'చిన్నప్పుడు తెలుసు' అన్నాను.

'అంటే?' అడిగింది కుండ.

'ఏభై ఏళ్ల క్రితం' అన్నాను.

'ఎవరి దగ్గర మీరు నేర్చుకున్నారు?' అడిగింది.

'వాళ్ళెవరూ మీకు తెలియదు. వాళ్లిప్పుడు లేరుకూడా. నేటి కార్పొరేట్ జోకర్లు కారు వాళ్ళు' అన్నాను.

కాసేపు మౌనంగా ఉంది కుండ.

'మరి మాకు నేర్పిస్తారా?'అడిగింది చివరకు.

'నేర్పిస్తాను. కానీ అందరికీ నేర్పించను' చెప్పాను.

 'అంటే?' మళ్ళీ సందేహం వచ్చింది కుండకి.

'నాకు నచ్చినవాళ్లకు, నా పరీక్షలు పాసయినవాళ్లకు మాత్రమే నేర్పిస్తాను' అన్నాను.

'మీ దగ్గర నేర్చుకుంటే ఏమౌతుంది?' అడిగింది.

'కుండ పగులుతుంది' అన్నాను.

మళ్ళీ మౌనం.

'గురువుగారు ! నేను సీరియస్ గా సిన్సియర్ గా అడుగుతున్నాను' అన్నది కుండ.

'నువ్వు సీరియసో కాదో నీకు తెలియాలి. సిన్సియరో కాదో నేను నిర్ణయిస్తాను' అన్నాను.

'ఇంతకీ నా సమస్యకు పరిష్కారం?' అడిగింది.

'నేర్పించిన మీ గురువుగారున్నారు కదా. ఆయన్నెందుకు అడగవు?' అన్నాను.

'ఆయనకు బ్రెయిన్ ఆపరేషనైంది. అప్పటినుంచీ పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నాడు. అందుకని ఆయనంటే నమ్మకం పోయింది' అన్నది కుండ.

'లోపల ఖాళీగా ఉందని మళ్ళీ కుట్లేశారా?' అడిగాను నవ్వుతూ.

'అవును. ఆయనకూడా అదే అన్నాడు' అంది కుండ తనుకూడా నవ్వుతూ.

'పోన్లే. ఒకటన్నా నిజం చెప్పాడు. పాతకాలంలో 'పిచ్చి తలకెక్కింది' అనేవాళ్ళు. ఇప్పుడు మిమ్మల్నీ, మీ గురువుల్నీ చూస్తుంటే, 'కుండలిని తలకెక్కింది' అనవలసి వస్తోంది. అంటే, కుండలిని తలకెక్కితే బ్రెయిన్ ఆపరేషన్ చేయిస్తారా మీ గురువుగారి ఆశ్రమంలో?'అడిగాను.

'ఏమో మరి ! ఆయనంటే డబ్బులున్నాయి గనుక చేయించుకున్నాడు. అందరికీ ఎందుకు చేయిస్తారు?' అంది కుండ.

'మరి మీకు తలకెక్కితే మీ గతేంటి? పెరుగు పట్టించి పడుకోబెట్టడమేనా?' అడిగాను.

'తెలీదు' అంది. 

'సరే ! నువ్వింతగా అడుగుతున్నావు కాబట్టి ఒక విషయం చెప్పు. మీ  గురువుకైనా, నీకైనా, లేచింది ఏ కుండలిని?' అడిగాను.

కుండకు అర్ధం కాలేదు.

'అదేంటి? మీరు మాట్లాడేది నాకర్ధం కావడం లేదు' అన్నది.

'కుండలినిలో ఎన్నిరకాలున్నాయో మీ గురువుగారు నీకు చెప్పలేదా?'అడిగాను.

'అదేంటి? దానిలో రకాలున్నాయా? మాకలా చెప్పలేదే?' అంది.

'మరి ఏం చెప్పారు?  కపాలభాతి నేర్పించి కొట్టుకోమన్నారా?' అడిగాను నవ్వుతూ.

'గురువుగారు ! మాకవన్నీ తెలియదు. పోనీ మీరు చెప్పచ్చుగా' అడిగింది కుండ. 

'మీరు ట్రై చేస్తున్నది ప్రాణకుండలిని. ఇదిగాక చిత్ కుండలిని, పరా కుండలిని అని ఇంకా రెండున్నాయి' అన్నాను.

కుండ మౌనం వహించింది.

జాలేసింది.

'ఇంకావిను. ప్రాణకుండలినిలోనే, సుప్త, అర్ధ, జాగృత, కుల, ఊర్ధ్వ, అధోకుండలినులని ఆరు విభాగాలున్నాయి, ముందు వీటిని తెలుసుకో. మిగిలిన రెండూ తర్వాత తెలుసుకుందువుగాని' అన్నాను.

'మీరు చెప్పేవన్నీ కొత్త కొత్తగా ఉన్నాయి. నేనెప్పుడూ వినలేదు' అన్నది కుండ.

'నువ్వు విననంత మాత్రాన ఉండకుండా పోవు' అన్నాను.

ఇంత మాట్లాడిన తర్వాత కుండకు అర్ధమైంది, ఇది ఆన్లైన్ షాపింగ్ లాంటి ఈజీ వ్యవహారం కాదని. ఫోన్ పే చేస్తే కుండలిని లేవదని.

'మీ దగ్గర నేర్చుకోవాలంటే నేనేం చెయ్యాలి?' అడిగింది చివరకు.

'ఇప్పుడు నువ్వు సరైన మాటను మాట్లాడుతున్నావు. విను చెప్తా. ముందుగా, కుండలినీ సాధన ఎందుకు చేయాలనుకుంటున్నావో నీకు స్పష్టత ఉండాలి. ఇది ఒకళ్ళను చూసి ఇంకొక్కళ్ళు వాతలు పెట్టుకోవడం కాదు. ముందుగా నువ్వూ నీ వ్యక్తిత్వమూ నాకు నచ్చాలి. నీలో కపటం లేదనీ, నిజాయితీ ఉందనీ నాకనిపించాలి. తరువాత, నువ్వు మా ఆశ్రమంలో కనీసం రెండువారాలు ఉండి సాధనలు నేర్చుకోవాలి. ఇంటికెళ్లి దీక్షగా సాధన చెయ్యాలి. ఆ తరువాత నీ జీవనవిధానాన్ని మార్చుకోడానికి సిద్ధపడాలి. అంటే, నీ తిండీ, నీ స్నేహాలూ, వ్యాపకాలూ, హాబీలూ, లైఫ్ స్టయిలూ అంతా మార్చుకోవాలి.  అప్పుడప్పుడూ వచ్చి, నీ సాధనను నాకు చూపించి, దిద్దుకుంటూ, క్రొత్తవి నేర్చుకుంటూ ఉండాలి. ఆ విధంగా ఉంటుంది ఈ సాధన. నీ కిష్టమైతే, తట్టుకోగలిగితే, రా నేర్పిస్తాను' అన్నాను.

'ఎన్నాళ్ళు పడుతుంది?' అన్నది కుండ.

'ఒక జీవితకాలం పడుతుంది, ఇంకా చెప్పాలంటే అదీ చాలదు.' అన్నాను.

'ఎంత ఛార్జి చేస్తారు?' అడిగింది కుండ.

ఈ ప్రశ్నను చాలామంది నుండి వినీవినీ నాకు విసుగెత్తింది.

'నీ కెపాసిటీని బట్టి నువ్వు ఛార్జ్ కావచ్చు' అన్నాను.

'అదికాదు. నేనడిగేది కోర్సు ఫీజు గురించి' అంది.

'ఫీజూ లేదు, గ్రీజూ లేదు. నీకు ఫ్యూజు ఎగిరిపోవడమే నా ఫీజు. సాధనలో నీ ప్రోగ్రెస్ నచ్చితే నేనే నీకు ఎదురు డబ్బులిస్తాను' అన్నాను.

ఆలోచనలో పడింది కుండ.

'సీరియస్ గా సిన్సియర్ గా డౌట్ లో పడ్డావా?' అడిగాను నవ్వుతూ.

'అంటే, ఇంత చెయ్యడం కుదరదేమో అని ఆలోచిస్తున్నాను' అన్నది.

'అదే నేను చెప్పింది. ఎంతమందిని ఇప్పటికి చూసి ఉంటానంటావు నీవంటివాళ్ళని?' అడిగాను.

కుండ మౌనంగా ఉండిపోయింది.

'పోనీ ఒక పనిచెయ్యి. తేలికమార్గం చెప్తాను' అన్నాను.

'చెప్పండి' అంది.

'కుండలో నీళ్లు తాగి, ఒళ్ళు కదలకుండా ఇంట్లో పడుకొని, యూట్యూబు చూసుకుంటూ ఉండు. ఈసారి కుండలిని పూర్తిగా లేస్తుంది' అన్నాను.

ఫోన్ కట్ అయిపోయింది. మళ్ళీ వస్తుందేమో అని కాసేపు చూశాను. రాలేదు.

అర్ధమైంది. నవ్వుకుంటూ ఫోన్ పక్కన పెట్టాను.

అమావాస్య పిచ్చోళ్ళకి కుండలిని కావాలట ! అదేదో రోడ్డుపక్కన కుండలో కుల్ఫీ అనుకుంటున్నారేమో కొనుక్కుని తినడానికి !

ఏదేమైనా, ఒక అమాయకుడిని మోసం చెయ్యకుండా, నిష్టూరంగా ఉన్నప్పటికీ నిజాన్ని మాత్రమే చెప్పి పంపినందుకు నాపైన నాకే తృప్తి కలిగింది.

ఫోన్ పెట్టేసి, కనీసం నేనైనా కుండలో మంచినీళ్లు త్రాగుదామని కిచెన్లోకి దారితీశాను.

read more " కుండ చేసిన కుండలినీ సాధన "

28, సెప్టెంబర్ 2026, సోమవారం

సెప్టెంబరు - 2026 సాధనాసమ్మేళనం విజయవంతం














గత మూడురోజులుగా ఆశ్రమంలో జరిగిన సెప్టెంబరు 2026 సాధనాసమ్మేళనం (retreat) విజయవంతంగా ముగిసింది. దీనికి హైద్రాబాదు, బెంగుళూరు, చెన్నై, నెల్లూరు, విజయవాడ, ఖమ్మం, దుబాయ్, USA ల నుండి శిష్యులు హాజరయ్యారు. ఆ సందర్భంగా తీసిన ఫోటోలలో కొన్నింటిని ఇక్కడ చూడవచ్చు.

25 వ తేదీన అనంత పద్మనాభవ్రతం వచ్చింది. అది మా అమ్మగారు పుట్టినరోజు. తల్లిని మించిన దైవం లేదు గనుకా, లేదా, దైవమే తల్లిరూపంలో ప్రత్యక్షమౌతుంది గనుకా, ప్రతి ఏడాదీ ఆ రోజునుండి మూడురోజులపాటు మా ఆశ్రమంలో సాధనాసమ్మేళనం జరుగుతుంది. ఈ ఏడాదికూడా జరిగింది. అన్ని పండుగలలోకీ అదే మాకు ముఖ్యమైన పండుగ.

రాశి కంటే వాసికే ప్రాధాన్యతనిచ్చే మా విధానంలో, కులమత వర్గ విభేదాలను పక్కనపెట్టి, మానవత్వాన్ని పెంపొందిస్తూ, మనుషులను మనుషులుగా తీర్చిదిద్దుతూ, దైవత్వాన్ని అందుకునే సాధనామార్గాన్ని నేర్పిస్తూ, ఈ సమ్మేళనం జరిగింది. ఈ సందర్భంగా కొన్ని తంత్రసాధనా ప్రక్రియలను శిష్యులకు ఉపదేశించడం జరిగింది.

శిష్యులు ఆశ్రమానికి వచ్చినపుడు ఉండటానికై కట్టించిన 'సాధనా నివాస్' భవనం ఈ సందర్భంగా ప్రారంభించబడింది. ఈ భవనంతో ఆశ్రమానికి క్రొత్త నిండుదనం వచ్చింది.

రాబోయే నెలలలో, హైదరాబాద్, విజయవాడ, తిరుపతి బుక్ ఫెస్టివల్స్ లో పెట్టబోయే పంచవటి స్టాల్లో శిష్యులందరూ కలుసుకోవడం జరుగుతుంది. ఆ తరువాత, మార్చిలో జరుగబోయే వేసవి విషువత్ సాధనా సమ్మేళనంలో మళ్ళీ ఆశ్రమంలో అందరం కలుసుకుందామన్న సంకల్పంతో ఈ కార్యక్రమం ముగిసింది.

read more " సెప్టెంబరు - 2026 సాధనాసమ్మేళనం విజయవంతం "

4, సెప్టెంబర్ 2026, శుక్రవారం

కృష్ణ కృష్ణా !

ఇవాళ కృష్ణాష్టమి.

మరి తెలుగురాష్ట్రాలలో చడీచప్పుడూ లేదేంటి?

హిందువుల ఇళ్లూ, గుళ్ళూ అన్నీ మౌనంగా ఉన్నాయేంటి?

ఓ సారీ ! మర్చేపోయాను.

మనకు పొరుగింటి పుల్లకూరే రుచి కదా !


అయినా  నా పిచ్చిగానీ,

సాయిబాబాలకూ, బోయబాబాలకూ, పీర్లకూ, ఫకీర్లకూ అభిషేకాలూ, పూజలూ చేసేవాళ్లకు పరిపూర్ణావతారమైన శ్రీకృష్ణుడెలా నచ్చుతాడు? అసంభవం ! 

మహా అయితే ఆయననొక ద్వారపాలకుడిగా పెట్టేద్దాం !

అప్పయ్యస్వామి ఆధార్ కార్డునే.  తెలుగునాడుకు మార్చేసి, ఆ నీడన చక్కని వ్యాపారాలు చేసుకుంటున్నవాళ్లకు శ్రీకృష్ణుడెలా నచ్చుతాడు? నిజమే సుమీ ! 

కేరళం కంటే గుజరాత్ ఇంకా దూరం కదా ! మరి గురువాయూర్ని మర్చిపోయారేంటో?

ఛిన్నమస్త చిన్నబోయినచోట, ప్రత్యంగిర పట్టించుకోని వేళ, రాధాదేవి మాత్రమే రక్షిస్తుంది. ఆ క్షణానికి ఆమె కావలసి వస్తుంది. మరుక్షణమే ఆమె పనికిరాకుండా పోతుంది. మళ్ళీ భయంకర హోమదేవతలే మనకు కావాలి. అవున్లే రాధాదేవి మన వ్యాపారానికి పనికిరాదు కదా !

మన బ్రతుకులింతే !

వ్రేలాడే శవమంటే వేలంవెర్రిగా పరిగెత్తేవాళ్లకు, జగన్మోహనుడైన శ్రీకృష్ణుడెలా నచ్చుతాడు? నిజమే. 

ఆయనేమీ బిర్యానీ పెట్టి, ఖర్చులకు డబ్బులివ్వడు కదా ! రాత్రిపూట కూడికలూ, తీసివేతలూ నేర్పించడు కదా !  

గుండు సాధువులనూ, బండస్వాములనూ, 'ళ' కీ, 'ల' కీ తేడా తెలియని మహాయోగులనూ పూజించేవాళ్లకు శ్రీకృష్ణుడెలా నచ్చుతాడు? సహజమే కదా ! 

ఆయనేమీ వీళ్ళలాగా నైటీ వేసుకోడుగా !

అర్ధరాత్రిళ్ళు క్షుద్రదేవతలకు బొగ్గులూ ఎండుమిర్చిలతో హోమాలు చేసే క్షుద్రులకు చిన్నికృష్ణుని చిరునవ్వులెలా నచ్చుతాయి? అర్ధం చేసుకోగలం ! 

90 వచ్చినా, మాకింకా వయసుడిగి పోలేదుగా? కోరికలు చావలేదుగా? చిన్నికృష్ణుడిని పూజించడానికి?

మళ్ళీ నోరుతెరిస్తే అందరూ చెప్పేది భగవద్గీతా శ్లోకాలే ! కానీ శ్రీకృష్ణుడెవరికీ అక్కర్లేదు.

ఆయన ఎనిమిదేళ్ల వయసులోనే రాసలీలలు చేశాడంట ! గోపికలు స్నానాలు చేస్తుంటే బట్టలు కాజేసి చెట్టుపైన కూర్చున్నాడంట ! ఇదొక్కటే మనకు కనిపిస్తుంది. మనకు కావలసింది కూడా అదే కదా !

మనం చెయ్యాలనుకుంటూ, చేయలేకపోతున్న పనులన్నీ ఆయనెప్పుడో అయిదువేల ఏళ్ళక్రితమే చేసేశాడు. లక్కీ ఫెలో ! దీన్నే 'అసూయ' అంటారేమో? సర్లే ఏదో ఒకటి !

కానీ, అంతకు ముందే, గోవర్ధన పర్వతాన్ని చిటికెనవ్రేలితో ఎత్తి తనవారిని కాపాడాడు. నెలలపిల్లవాడుగా ఉన్నపుడే ఎంతోమంది రాక్షసులను సంహరించి, లోకపీడను వదిలించాడు. బోసినోటిలో విశ్వాన్ని చూపించాడు. అవెలా చేశాడు? మనకనవసరం ! అవన్నీ యశోదాదేవి భ్రమలు !

ఆ తర్వాత ఎన్నో మానవాతీతపు పనులను కూడా చేశాడు. రాజ్యాలేలాడు. రాజకీయాలు చేశాడు. మహాభారతయుద్ధాన్ని కూడా నడిపించాడు. 

ఆగండాగండి ! ఈ పాయింట్ మాకు బాగా నచ్చింది.

మేము కూడా మా ఆశ్రమం పై ఫ్లోరులో, అమ్మాయిలతో అర్ధరాత్రి, శివరాత్రి, డాన్సులెయ్యచ్చు. మేమూ కృష్ణుని అంశలమే. వాళ్లేమో గోపికల అంశలతో పుట్టారు.

మేముకూడా రాజకీయులతో పొత్తులు పెట్టుకుని వాళ్ళ బ్లాక్ మనీని మా భూగృహాలలో దాచిపెట్టి, రాజకీయం చెయ్యవచ్చు. మేమూ కృష్ణుని అంశలమే. కాకపోతే మా తర్వాత లారీలలో ఆ బంగారమంతా ఎక్కడికో తరలిపోతుంది. పోతేపోనీ. బ్రతికున్నన్నాళ్లు మా పబ్బం గడిచిందిగా !

మేముకూడా విద్యార్థులను స్థంభాలకు కట్టేసి కాల్చిపారెయ్యొచ్చు. మేమూ  కృష్ణుని అంశలమే. కేసులేమీ ఉండవు. ఏం? భారతయుద్ధాన్ని దగ్గరుండి నడిపించిన కృష్ణుడిపైన ఉన్నాయా?

కృష్ణుడు శివుడిని ఆరాధించాడట. మేముకూడా చేస్తాం. మాటమాటకూ 'షివా షివా' అంటాం. లేదా 'చెంబో చెంబో' అంటాం. కానీ ఆ చెంబెక్కడుందో మాకైతే తెలీదు. కైలాసయాత్రకని పోయి, దారితప్పి సరాసరి కైలాసానికే పోతాం. లేదా 'కైలాస' అని ఒక ద్వీపాన్నే కొనేస్తాం. దానికి మా ప్రధానగోపికని, సారీ శిష్యురాలిని, ప్రధానమంత్రిగా చేసేస్తాం. కృష్ణుడెప్పుడైనా ఇలాంటి పనులు చేశాడా? చేయగలిగాడా? కనుక ఆయనకంటే మేమే గొప్పవాళ్ళం.

'కృష్ణుడు సాక్షాత్తూ భగవంతుడే' అని మా శాస్త్రాలంటున్నాయి. కానీ మేమాయనను పూజించము. మాకు భగవంతుడెందుకు? ఈరోజు మందుకెవడు డబ్బులిస్తే వాడే మా దేవుడు.

ఆయన మాకర్ధం కాడు. 

గౌడీయమఠానికీ, ఇస్కానుకే ఆయన అర్ధం కాలేదు. ఇక మాకెలా అవుతాడు?

అయినా మా పూజామందిరాలూ, పందిళ్ళూ ఖాళీగా లేవు. వాటిల్లో ఎక్కడ చూసినా పీర్లూ, ఫకీర్లూ, వ్రేలాడుతున్న శవాలూ, క్షుద్రదేవతలూ, గుండుగురువులూ, బండబాబాలూ, గడ్డం స్వాములూ, అజ్ఞాతసిద్ధులూ, విదేశీదేవుళ్ళూ, గురువులూ ఉంటారు. 

మా టేబిల్ మీదా, హాల్లోనూ, ప్రతిరాత్రీ యముడితో డిన్నర్ చేసి, మార్కింగ్ బ్రేక్ ఫాస్ట్ హిమాలయ బాబాజీతో చేసి, సాయంత్రానికి సిద్ధాశ్రమం దొడ్లో రెస్టు తీసుకునే పిరమిడ్లూ,  క్రియాయోగ గృహిణులూ, కళ్ళు మూసుకుంటే లోకలోకాలు తిరిగే NRI మహిళలూ, కాళికాదేవితో కబుర్లు చెప్పేవాళ్ళూ, లలితాదేవితో లంచ్ చేసేవాళ్ళూ, సహజయోగంతో మిమ్మల్ని అసహజంగా మార్చేసేవాళ్లూ, ఆ మిషనూ, ఈ మిషనూ అంటూ మిషన్లతో మిమ్మల్ని కుట్టేసేవాళ్ళూ, ఆత్మలతో మాట్లాడేవాళ్లూ, యక్షిణీలను ఎదుటకు రప్పించేవాళ్లూ, వీళ్ళ ఫొటోలే ఉంటాయి.

వీరి మధ్య కృష్ణుడికి చోటేది?

ఆయన పరిపూర్ణ అవతారమైతే మాకేంటి? కాకపోతే మాకేంటి? వితంతువులకూ, అనాదులకూ డబ్బులిస్తాడా లేదా? నిద్రపోతున్న మా కుండలినిని అయిదే అయిదునిమిషాలలో లేపుతాడా లేదా? మా మతవ్యాపారానికి పనికొస్తాడా లేదా? అది చెప్పండి !

మనల్ని ఆ శ్రీకృష్ణుడే రక్షించాలి. మనల్నే  కాదు. భూమి మొత్తాన్నీ ఆయనే రక్షించాలి.

రక్షిస్తాడా? మనలాంటి వాళ్ళని? ఒకవేళ ఏదైనా బలహీనక్షణంలో ఆయన ముందుకొస్తే మాత్రం, మనం రక్షించనిస్తామా?

ఏమో నాకైతే సందేహమే !

read more " కృష్ణ కృష్ణా ! "

31, ఆగస్టు 2026, సోమవారం

నేపాల్ దుర్ఘటన - నేర్చుకోని నిజాలు

నేపాల్ దుర్ఘటన జరిగింది.

850+ మంది చనిపోయారు. 2500+ మంది ఆచూకీ లేరు. 

నిత్య, నైమిత్తిక ప్రళయాలకు ఇదొక ఉదాహరణ. 

కాకపోతే, ఇంటర్నెట్ గురువులెవ్వరికీ ఈ విషయం చూచాయగా కూడా ముందస్తుగా తెలియలేదు.

----------------------

వీరిలో ప్రతిరాత్రీ శంభలాకు చెంబుతీసుకొని పోయి వచ్చేవాళ్ళున్నారు. 

సిద్ధాశ్రమంలోనే పుట్టిపెరిగామని చెప్పుకునే హిమాలయయోగులున్నారు. 

కైలాసపర్వతంలో వారంవారం జరిగే సీక్రెట్ మీటింగులకు హాజరయ్యేవాళ్లున్నారు.

సాక్షాత్తూ శివుడితోనే సరాసరి హాట్ లైన్లో మాట్లాడేవాళ్లున్నారు. 

శివుడి భుజాలపైనే ఎప్పుడూ కూర్చుని ఉండే సద్గురువులున్నారు. 

మాటమాటకీ 'షివా షివా' అని 'షో' చేసేవాళ్లున్నారు. 

అతీతలోకాలన్నీ అలా అలా సరదాగా ధ్యానంలో తిరిగొచ్చే యో/రోగులున్నారు.

కుండలినిని అలా లేపి ఇలా పడుకోబెట్టే సిద్ధులున్నారు.

గడ్డాలు పెంచినవాళ్ళూ, పెంచనివాళ్ళూ, గుండు చేయించుకున్నవాళ్లూ, జుట్టు పెంచినవాళ్ళూ, కొప్పు కట్టుకున్న వాళ్ళూ, విప్పుకున్నవాళ్ళూ, ఇలా రకరకాల వేషాలతో ఎంతో వినోదాన్ని పంచుతున్నవారున్నారు.

అతితెలివితేటల ఉపన్యాసాలతో, చర్చలతో, గొఱ్ఱెప్రజలకు "గ్నానాన్ని" పంచుతూ  అదరగొట్టేవాళ్లున్నారు.

సినీనటుల అక్రమసంబంధాల దగ్గరనుంచీ, వాళ్ళ కాపురాలు నిలుస్తాయా లేదా అన్నదానివరకూ ప్రతిదానినీ చెప్పే కమెడియన్ జ్యోతిష్కులున్నారు.

ఇంకా ఎంతోమంది ఆన్లైన్ విదూషకులున్నారు.

ఎవరికీ ఈ ప్రమాదం గురించిన ముందస్తు సూచన కొంచెం కూడా లేదు.

ఎన్నో లోకాలలో ఏమి జరుగుతోందో చూడగలిగే జ్ఞానులకు, ఈ లోకంలో ఇంకాసేపట్లో ఏం జరుగుతుందో తెలీదు !

ఈషా భక్తబృందమైతే అదేదో ఎపాయింట్ మెంట్ తీసుకున్నట్టు సరిగ్గా పదినిముషాల  ముందు ఠంచన్ గా అక్కడకు చేరుకొని 'రామ్మా ! వరదా ! వచ్చి  మమ్మల్ని ముంచెయ్యి' అన్నట్టు సామాన్లు సర్దుకొని మరీ రెడీగా ఉంది.

కాబట్టి వాళ్ళకొక్కరికే, కైలాసం నుండి కరెక్ట్ గా ముందస్తు సమాచారం ఉందని నేననుమానిస్తున్నాను. లేకపోతే సరిగ్గా పదినిమిషాల ముందుగా అక్కడికెలా చేరుకుంటారు వాళ్ళు?

ఇప్పుడంతా అయిపోయాక,  మళ్ళీ వేరే రకం 'షో' లు, "షివా షివా" అంటూ షంతాప షభలు, విశ్లేషణలు, సమర్ధింపులు, నాటకాలు.

-------------------

వైకుంఠద్వారం టికెట్ల త్రొక్కిసలాటలో పడి సరాసరి వైకుంఠానికే పోయారు గతంలో కొందరు.

ఇప్పుడు కైలాసయాత్ర చేసొస్తూ, కైలాసానికే డైరెక్ట్ గా చేరుకున్నారు మరికొందరు.

బ్రహ్మలోకానికి మాత్రం ఎవరూ పోవడం లేదు ! పాపం ఆయనని పూజించేవారు లేరుకదా !

పిచ్చిభక్తులు నిజంగా వైకుంఠానికీ, కైలాసానికీ పోతున్నారో లేదో తెలియదు గానీ, వీళ్ళ డబ్బులు మాత్రం చేరవలసినవారికి చేరుతున్నాయి.

రెలిజియస్ వ్యాపారాలూ, రెలిజియస్ టూరిజం వ్యాపారాలూ బ్రహ్మాండంగా నడుస్తున్నాయి.

---------------------

అసలూ, హిమాలయాలతో మనకెందుకు?

ఎవరుండవలసిన చోట వాళ్ళుండాలి.

మనకు దూరంగా ఎక్కడో ఉన్న మంచుకొండలలోకి మనం పోయి, అక్కడ మన చెత్తా చెదారమూ, సారాసీసాలూ, ప్లాస్టిక్ జంకూ పడేసి కాలుష్యం నింపడం అవసరమా?

అక్కడెవరో పాపం ముక్కులు మూసుకుని, గోచీలు పెట్టుకుని కూర్చుని ఉంటే, మనం పోయి, వాళ్ళనింకా లోతట్టు కొండల్లోకి తరిమికొట్టడం అవసరమా?

స్వచ్ఛమైన హిమాలయాలను టూరిస్టు సెంటర్లుగా మార్చేసి, హోటళ్లు, రెస్టారెంట్లు, బార్లు, క్లబ్బులు, పబ్బులు కట్టి, మబ్బుచాటు వ్యాపారాలు చెయ్యడం అవసరమా?

అక్కడకూడా డ్యాములు, బ్రిడ్జీలు కట్టి, కొండలను తొలిచి సొరంగాలు త్రవ్వడం అవసరమా?

ప్రకృతిని ఈ విధంగా పాడు చెయ్యడం అసలంటూ అవసరమా?

చేస్తే, అది చూస్తూ ఊరుకుంటుందా?

---------------------

గత మూణ్నెళ్లుగా వర్షాలెందుకు లేవు?

ఎక్కడచూచినా ఈ వేడీ, ఉడకా, కొనసాగుతున్న ఈ వేసవీ ఏమిటి?

యూరప్ లో ఎండవేడికి వేలాదిమంది చావడమేమిటి?

ఉత్తర అమెరికాలో కూడా పెరుగుతున్న ఉష్టోగ్రతలేమిటి?

ఇవన్నీ ఎందుకో, గ్లేషియర్లు కరగడమూ అందుకే.

కానీ, మనుషులేమీ నేర్చుకోరు. నేర్చుకోకండి. ఇలాగే ఉండండి.

---------------------------- 

సర్లే, ఈ న్యూసు ఇప్పటికే పాతబడిపోయింది.

బోరుకొడుతోంది. ఇంకో క్రొత్త న్యూసు రాదేంటి?

ఎవరైనా ఒక రేపో, ఒక మర్డరో, ఇంకొకటో, ఇంకొకటో కాస్త వెరైటీగా చెయ్యండ్రా బాబూ !

ఇంకెన్ని రోజులీ నేపాల్ గోల?

ఇవన్నీ చూస్తుంటే గతంలో వ్రాసుకున్న ఒక కవిత గుర్తుకొస్తోంది.

------------------------

కొందరు బాధాపీడితులు
కొందరు మాయామోహితులు.

కొందరు మాయగాళ్లు.
కొందరాశ్చర్య చకితులు.

కొందరు ఆపకుండా వాగేవాళ్ళు
కొందరు లేవకుండా వినేవాళ్ళు

కొందరు  నాటకాలేసేవాళ్ళు
కొందరు నవ్వుకుంటూ చూసేవాళ్ళు

కొందరు తీర్పులు తీర్చేవాళ్ళు
కొందరు తిరిగిరాకుండా పోయేవాళ్లు.

చివరికందరూ,
ఎవరు తీసుకున్న గోతిలో వారే పడేవాళ్లు !

ఓ జీవితమా ! అర్థంకాని నీ ఆట జరుగుతూనే ఉంటుంది !
ఓ విశ్వమా ! అంతులేని నీ పయనం సాగుతూనే ఉంటుంది !!
read more " నేపాల్ దుర్ఘటన - నేర్చుకోని నిజాలు "

9, ఆగస్టు 2026, ఆదివారం

గడపలో దీపం

మొన్నామధ్యన కాలేజీరోజుల నాటి ఒక స్నేహితుడు ఆశ్రమానికి వచ్చాడు.

కుశలప్రశ్నలయ్యాక, "ఆశ్రమం నిర్మించావని తెలిసింది. చూద్దామని వచ్చాను" అన్నాడు.

"మంచిది. చూడు" అన్నాను.

"నీ ఇంటర్వ్యూ తీసుకుని మా ఛానల్లో వేస్తాము. అందుకని కెమెరాలతో సహా వచ్చాను. కార్లో ఉన్నాయి. నువ్వు సరేనంటే మొదలుపడదాం." అన్నాడు.

"అవసరం లేదు" అన్నాను.

ఆశ్చర్యంగా చూచాడు.

"పబ్లిసిటీ అవుతుంది. ఇంకా చాలామంది వస్తారప్పుడు" అన్నాడు.

"ఏం చేస్తారు చాలామంది వచ్చి?" అడిగాను.

"ఏవో బాధలుంటాయిగా వాళ్లకు" అన్నాడు.

"వాళ్ళ బాధలను తీరుస్తూ, నాకు బాధలను సృష్టించుకోమంటావా?" అడిగాను. 

"మరి బ్లాగు, బుక్సు, ఆన్లైన్ మీటింగ్స్ ఇవన్నీ చేస్తున్నావుగా" అడిగాడు.

"అవి లోకుల కష్టాలను తీర్చడంకోసం కాదు. జనం పెరిగితే గోలతప్ప ఇంకేదీ ఉండదు. లోకపు కర్మబరువును మొయ్యడం అవతారపురుషులకే సాధ్యం కాలేదు. మనమెంత? ఛానల్స్ చూసేవాళ్ళు కాలక్షేపానికి మాత్రమే ఆ పని చేస్తారని నీకూ తెలుసు. నాకూ తెలుసు. ఎందుకలాంటి వాళ్లంతా ఇక్కడికొచ్చేది? " అన్నాను.

"మరి ఇదంతా ఎందుకు?" అడిగాడు చుట్టూ చూస్తూ. 

"దీపాన్ని వెలిగించి గడపలో ఉంచాను. నాలుగురోడ్ల కూడలిలో ఉంచవలసిన పని లేదు" అన్నాను.

సాయంత్రం వరకూ ఉండి, అదీఇదీ మాట్లాడి, సెలవు తీసుకున్నాడు.

కారులోని కెమెరాలు  కారుతోబాటే వెళ్లిపోయాయి.

గడపలో దీపం వెలుగుతూనే ఉంది.

read more " గడపలో దీపం "

5, ఆగస్టు 2026, బుధవారం

మా 80 వ పుస్తకం "వెలుగుదారులు - రెండవభాగం" విడుదల

ఇవాళ నా 63 వ పుట్టినరోజు. 63 పూర్తై 64 లోకి అడుగుపెడుతున్నాను.

ఈ సందర్భంగా, నా కలం నుండి వెలువడుతున్న 80 వ పుస్తకంగా "వెలుగుదారులు" రెండవభాగాన్ని నేడు విడుదలచేస్తున్నాము.

ఇది "మ్యూజింగ్స్ - II" కు తెలుగు అనువాదం. "ఈ-బుక్" కనుక ఒకే పుస్తకంగా విడుదలౌతోంది. ప్రింట్ లో  రెండు పుస్తకాలుగా వస్తుంది.

ఇందులోకూడా 360 ఆధ్యాత్మిక టాపిక్స్ మీద నేను చెప్పిన విషయాలు, సంభాషణలు, సన్నివేశాలు ఉన్నాయి. దీనిని, దీని మొదటిభాగాన్ని దగ్గర ఉంచుకుని వీటిలో ఉన్న 720 టాపిక్స్ ను చదువుతూ ఉంటే, ఆధ్యాత్మికప్రపంచంలో మీకొచ్చే ఎటువంటి సందేహమైనా పటాపంచలైపోతుందని నేను  చెప్పగలను. 

పంచవటి శిష్యులకు "వెలుగుదారులు", ఒక భగవద్గీత వంటిదని చెప్పడం అతిశయోక్తి కాబోదు.

మొదటిభాగంలాగే ఇదికూడా జిజ్ఞాసువులకు అభిమానపాత్రమౌతుందని భావిస్తున్నాము.

ప్రచురణలో పాలు పంచుకున్న అందరికీ ఆశీస్సులందిస్తున్నాను.

ఈ పుస్తకం ఇక్కడ లభిస్తుంది.

read more " మా 80 వ పుస్తకం "వెలుగుదారులు - రెండవభాగం" విడుదల "

30, జులై 2026, గురువారం

సత్యం - అసత్యం

దూరపు ఊళ్లలో ఉన్న శిష్యులను గురుపూర్ణిమ కోసం ఆశ్రమానికి రావద్దనే నేను చెబుతాను. ఈ ఇంటర్నెట్ యుగంలో అసలెక్కడికీ పోనవసరం లేదు. ఎక్కడవాళ్ళు అక్కడే ఉండి, అన్నీ చేయవచ్చు.

ఇక్కడున్నా, ఎక్కడున్నా, ఉండవలసిన విధంగా ఉంటే అన్నీ జరుగుతాయి. అది లేనప్పుడు, ఎక్కడికొచ్చినా ఏమీ ఒరగదు.

కానీ, దగ్గర ఊళ్లలో ఉన్న శిష్యులు కొంతమంది, వద్దన్నా వస్తూ ఉంటారు. భౌతికంగా వచ్చి ఇక్కడ కాసేపైనా ఉంటే, వాళ్లకు బాగుంటుంది. అదేవిధంగా, విజయవాడ, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు, హైదరాబాదులనుండి కొంతమంది నిన్న ఆశ్రమానికి వచ్చారు.

మాటలసందర్భంలో, ఒక శిష్యురాలు ఇలా అన్నది. 

'ఒంగోలు నుండి వస్తుంటే దారిపొడుగూతా  పందిళ్లు, బాబా కటౌట్లు. రోడ్డుపక్కన పందిళ్ళేసి గురుపౌర్ణమంటూ భోజనాలు చేస్తున్నారు. చాలా జాలేసింది వాళ్ళని చూస్తుంటే'.

నవ్వాను.

'కానీ నాకు మాత్రం, బాబా కటౌట్ చూసిన ప్రతిసారీ మీరే గుర్తుకు వచ్చారు' అన్నది.

'మంచిదేగా. అలాగైనా ఒక మంచిపని జరిగింది బాబావల్ల' అన్నాడొక శిష్యుడు.

అందరూ నవ్వేశారు.

'అంతే ! అసత్యాన్ని చూచినా సత్యం గుర్తుకురావడమే హిందూమతవిధానం' అన్నాను.

'వాళ్లకూ మాకూ తేడా ఏమిటి?' అని ఒక శిష్యుడడిగాడు.

'సత్యమేదో ఆసత్యమేదో తెలుసుకోలేని స్థితిలో వాళ్ళున్నారు, సత్యాన్ని సత్యంగా గుర్తించగలిగే స్థితిలో మీరున్నారు. అదే తేడా' అన్నాను.

ఆర్భాటాలకు, అన్నసంతర్పణలకు, అతిచేష్టలకు, అనవసరపుగోలకు అతీతంగా, అసలైన గురుపౌర్ణమి వేడుక మా ఆశ్రమంలో అద్భుతంగా జరిగింది.

read more " సత్యం - అసత్యం "

29, జులై 2026, బుధవారం

గురుపూర్ణిమ సందర్భంగా మా 79 వ పుస్తకం MUSINGS - Part II విడుదల

2021 లో నా కలంనుండి MUSINGS - Part I అనే పుస్తకం విడుదలైంది. అది వెయ్యిపేజీల పుస్తకం. దానిలో 360 టాపిక్స్ చర్చించబడ్డాయి. అది విడుదలై నేటికి ఐదేళ్లు గడిచాయి. ఆ పుస్తకం ఎంతో పాఠకాదరణను పొందింది.

ప్రపంచవ్యాప్తంగా అనేకమంది జిజ్ఞాసువులను కదిలించింది. ఆలోచింపజేసింది. చాలామంది జీవితాలను మార్చివేసింది.

తరువాత దాని తెలుగు అనువాదం 'వెలుగుదారులు' అనే పేరుతో విడుదలై, తనపేరును సార్ధకం చేసుకుంటూ, ఎంతోమందికి వెలుగుదారులను చూపించింది.

ఈ ఐదేళ్లలో ఎన్నో జరిగాయి. ఆశ్రమాన్ని స్థాపించడం జరిగింది. పంచవటిని విస్తృతపరచడం జరిగింది. నేను చూపిస్తున్న సాధనామార్గాన్ని ఎంతోమందికి పరిచయం చెయ్యడం జరిగింది. ఈ మధ్యలో అనేకమంది జ్ఞానార్థులు, శిష్యులు, సందర్శకులు, ఔత్సాహికులతో ఎన్నో విషయాలపైన నేను మాట్లాడాను. వారి ప్రశ్నలకు సమాధానాలిచ్చాను. ఆ సంభాషణలలో నుండి ఇంకొక 360 టాపిక్స్ ను ఏర్చికూర్చి ఇప్పుడు గురుపూర్ణిమ సందర్భంగా ఈ పుస్తకం యొక్క  రెండవభాగంగా విడుదల చేస్తున్నాము. ఇదికూడా వెయ్యిపేజీల పుస్తకమే.

మొదటిభాగంలోలాగే ఇందులోకూడా, అన్నీ నిత్యజీవితంలో జరిగిన సంఘటనలనుండి, ఇతరులు అడిగిన ప్రశ్నలనుండి  తీసుకున్నవే. ఊహించి వ్రాసినది ఒక్కటికూడా లేదు. కనుక, మీ జీవితంలో జరుగుతున్న అనేకవిషయాలకు, మీకొస్తున్న అనేక ఆధ్యాత్మికసందేహాలకు ఈ  పుస్తకం అద్దాన్ని పడుతుంది. వాటికి స్పష్టములైన జవాబులనిస్తుంది.

ఒక్కవారంలో రాబోతున్న నా 63 వ పుట్టినరోజు సందర్భంగా దీని తెలుగు అనువాదం "వెలుగుదారులు-రెండవభాగం" గా విడుదల అవుతుంది. అనువాదం ఇప్పటికే పూర్తయింది. అదికూడా వెయ్యిపీజీలను దాటిపోయింది. దానిని ఒకే పుస్తకంగా ముద్రించడం కష్టం కనుక,  రెండుభాగాలుగా ముద్రించి, 'వెలుగుదారులు' - 3 మరియు 4 భాగాలుగా, డిసెంబర్లో జరుగబోయే హైదరాబాద్ పుస్తకప్రదర్శన నాటికి మీకు అందుబాటులోకి తెస్తాము.

అజ్ఞానంలో పడి, ఎవరేది చెబితే దాన్ని నిజమని నమ్ముతూ, నానారకాల గురువులతో, గుడులతో, దేవుళ్లతో, దీక్షలతో, మతవ్యాపారాలతో దిక్కుతెలియకుండా పోతున్న నేటి హిందువులకు జ్ఞానజ్యోతిని చూపిస్తూ, సరియైనదారిలో వారిని నడిపించేదిశగా మేము చేస్తున్న ఈ జ్ఞానయజ్ఞాన్ని సఫలం చేయమని, సమస్తసృష్టికీ పరమగురువైన పరమేశ్వరుని ప్రార్ధిస్తూ ఈ ఉద్గ్రంధాన్ని నేడు విడుదల చేస్తున్నాను.

ఈ పుస్తకం ఇక్కడ లభిస్తుంది.

read more " గురుపూర్ణిమ సందర్భంగా మా 79 వ పుస్తకం MUSINGS - Part II విడుదల "

27, జులై 2026, సోమవారం

రాములవారు

మొన్న ఒంగోలుకు వెళుతూ దారిలోని ఒక వెల్డింగ్ షాపుదగ్గర ఆగాను.

అక్కడ ఇనుపపైపులతో ఒక రధాన్ని తయారు చేస్తున్నారు. తయారు చేయిస్తున్నది మనకు తెలిసినవాళ్ళే.

అక్కడ నా పనిని ముగించుకుని ఒంగోలుకు బయలుదేరబోతుండగా, అడగకపోయినా రధం గురించి చెబుతూ ' మా ఊళ్లో రామాలయానికి, ఊరేగింపుకి' అన్నాడతను.

'అలాగా. బాగుంది' అన్నాను.

'ఒకసారి రాండి. మా రాములవారిని చూద్దురుగాని' అని ఆహ్వానించాడతను.

 'సరే వీలైనప్పుడు వస్తాలే' అన్నాను.

'అట్టా అనుకుంటే ఎప్పుడొచ్చేది? రేపు పౌర్ణమికి రధం ఊరేగింపు. భలే ఉంటుంది. రాండి' అన్నాడు.

'చిన్నప్పటినుంచీ చాలా చూశాను. ప్రస్తుతం ఆసక్తి లేదు' అన్నాను.

'పోనీ రాములవారిని చూడండి' అన్నాడు.

ఒక్కక్షణం అతనివైపు చూచి, 'చూస్తున్నాను' అన్నాను.

'ఎక్కడా?' అన్నాడు ఆశ్చర్యంగా చుట్టూ చూస్తూ.

'ఇక్కడ' అంటూ ఛాతీపైన చేయివేసుకున్నాను.

ఈసారి అయోమయంగా చూస్తున్నాడు.

'రాములవారు ఇక్కడే ఉన్నారు. ఆయన్ని చూట్టానికి గుడికెందుకు? అయినాసరే, మీరు మంచిగా పిలిచారు కదా. వీలైనప్పుడు తప్పకుండా వస్తాను మీ ఊరికి' అన్నాను.

అతనికర్ధమైంది. ఇంకేమీ అడగలేదు.

నా దారిన ఒంగోలుకు బయల్దేరాను.

read more " రాములవారు "

పేలపిండి

చాలామందిలో ఒక జబ్బును గమనిస్తున్నాను. 

ఆశ్రమంలో మేమేం చేస్తున్నాము? మా ఆదర్శాలేమిటి? మా గమ్యాలేమిటి? వాటిని అందుకోవడానికి మేమనుసరిస్తున్న మార్గమేమిటి? ఇవేవీ వారికి ఆవసరం లేదు. దానిబదులు, వాళ్ళిష్టప్రకారం గానూ, వాళ్ళు ఊహించుకున్నట్లుగానూ మేమున్నామా లేమా? అన్నదానిని మాత్రమే చూస్తున్నారు. 

నన్ను కలుస్తున్నవారిలో, మాట్లాడుతున్న వారిలో అందరూ ఇలాగే ఉన్నారు.

వాళ్ళెలా ఉన్నప్పటికీ,  యధాప్రకారం నాకు మాత్రం నవ్వూ, జాలీ, ఈ రెండే కలుగుతున్నాయి.

మొన్నొకరోజున ఒకాయనతో ఫోన్లో మాట్లాడుతున్నాను.

మాటలసందర్భంలో 'ఈరోజు తొలి ఏకాదశి' అన్నాడాయన.

నేనేమీ మాట్లాడలేదు.

'ఇవాళ విష్ణుదేవునికి పేలపిండి నైవేద్యం పెట్టాలి' అన్నాడు.

'అవునా !' అన్నాను.

'మీరు చేస్తున్నారా ఆశ్రమంలో?' అడిగాడు.

'మీరన్నది పేలపిండా లేక పేలాలపిండా?' అడిగాను.

అంత సున్నితంగా చెబితే ఈ జనానికెక్కడ అర్ధమౌతుంది?

'అదేలెండి. పేలాల పిండే. మా పల్లెటూళ్ళలో ఇలా కూడా అంటాము' అన్నాడు నవ్వుతూ.

నేనేమీ అనలేదు.

'ఏకాదశినాడు విష్ణుదేవునికి ఈ నైవేద్యం పెడిదే మంచిది' అన్నాడు మళ్ళీ.

యూట్యూబ్ యూనివర్సిటీలో బాగానే చదువుకుంటున్నాడు. ముచ్చటేసింది.

'విష్ణువు అనే పదానికి అర్ధమేమిటి?' అడిగాను.

'ఏముంది? విష్ణువే' అన్నాడు.

ఇంకేం మాట్లాడగలం?

నాకీమాత్రం కూడా తెలీనందుకు అతనికి నామీద చాలా జాలేసినట్టుంది.

'చెయ్యండి గురువుగారు. చేస్తే మంచిది' అన్నాడు మళ్ళీ.

'నాకు బట్టతలుంది. పేలు పడే అవకాశం లేదు.' అన్నాను.

పెద్దగా నవ్వి, 'అయితే ఏమైంది? నాకూ ఉంది, ప్రతి మొగాడికీ కొద్దో గొప్పో ఉంటుంది' అన్నాడు.

'పేలే లేనప్పుడు పేలపిండితో పనేముంది?' అన్నాను.

'అర్ధం కాలేదు' అన్నాడు నీరసంగా.

'కొన్ని అర్ధం కాకపోవడమే మంచిది' అని ఫోన్ పెట్టేశాను.

read more " పేలపిండి "

26, జులై 2026, ఆదివారం

తెలివిలేని సంత

మొన్న పనుండి ప్రక్కఊరికెళ్ళాను.

మైకులో సాయిబాబా భజన వినవచ్చింది.

కావలసిన వస్తువులు కొంటూ ఉండగా, తెలిసిన ఒకతను కనిపించి, 'సాయిబాబా సప్తాహం జరుగుతోంది. గుడికి రండి' అని పిలిచాడు.

'ఎందుకది?' అన్నాను.

' నాలుగురోజులలో గురుపౌర్ణిమ కదా ! అందుకని చేస్తున్నాం' అన్నాడు.

జాలికలిగింది.

'గురుపూర్ణిమ అయితే, సాయిబాబాకి భజనెందుకు? అసలు సాయిబాబాకి భజనేంటి? మీరు చేయడమేంటి?' అన్నాను.

ఈ పల్లెటూరి జనానికి ఏమి చెప్పినా ఎక్కదు.

'భజన బాగుంటుంది. వచ్చి చూడండి' అన్నాడు నా మాట వినిపించుకోకుండా.

'తెలివిలేని సంతలోకి తెలివితో ఉన్నవారెందుకు?' అని, నాకు కావలసిన వస్తువులను తీసుకొని ఆశ్రమానికి బయలుదేరాను.

read more " తెలివిలేని సంత "

9, జులై 2026, గురువారం

U.G గారి 108 వ పుట్టినరోజు

ఇవాళ జూలై తొమ్మిది. 

యూజీగారి 108 వ పుట్టినరోజు.

యూజీగారి సన్నిహితులలో ఒకరైన చంద్రశేఖర్ బాబుగారు (బెంగుళూరు) నాకు పంపించిన యూజీగారి మాట ఒకటి మనకోసం.

"The absence of imagination, the absence of will, the absence of effort, the absence of any movement in any direction, on any level, in any dimension - that is the thing."

" ఊహ లేకపోవడం, ఇచ్ఛ లేకపోవడం, ప్రయత్నం లేకపోవడం, ఎటువైపూ, ఏ స్థాయిలోనూ, ఏ భూమికలోనూ, ఏ విధమైన కదలికా లేకపోవడం - అదీ అసలైన విషయం. "

read more " U.G గారి 108 వ పుట్టినరోజు "

22, జూన్ 2026, సోమవారం

యోగా డే - 2026


నిన్న అంతర్జాతీయ యోగదినోత్సవం గనుక, ఆ సందర్భంగా దేశవిదేశాలలో ఉన్న "పంచవటి" సభ్యులు, నా పోరును భరించలేక మొక్కుబడిగా  యోగాసనాలను అభ్యాసం చేసినట్టు కాసేపు నటించి ఫోటోలకు ఫోజులిచ్చారు.

నరేంద్రమోదీగారి ప్రయత్నం వల్ల జూన్ 21 International Yoga Day గా నిర్ణయించబడింది. యోగా అనేది ప్రపంచానికి భారతదేశం ఇచ్చిన బహుమతి అనిన విషయం అధికారికంగా నిర్ధారణ అయింది. లేకపోతే, యోగాను కూడా "ఇది మాదే" అనడానికి ఇతర దేశాలు మతాలు గతంలో ప్రయత్నాలను చేశాయి. కొన్నిదేశాలలో అయితే కొన్ని ఆసనాలకు కాపీరైట్ ను కూడా కొంతమంది తీసుకున్నారు. 

అయితే, నిన్న యోగా చేసినవాళ్లు, ఫోటోలకు పోజిచ్చినవాళ్లు ప్రతిరోజూ చేస్తున్నారా అంటే, సందేహమే. వాళ్ళ దేహాలను, అవి వంగలేక అవస్థపడుతున్న తీరులను చూస్తుంటే వాళ్ళు యోగాను ఎంత రెగ్యులర్ గా చేస్తున్నారో ఎవరికైనా అర్థమౌతోంది.

కాకపోతే ఒకటి ! పూర్తిగా మర్చిపోవడం కంటే, ఎప్పుడో కాసేపైనా చెయ్యడం కొంతలో కొంత మంచిది కదా ! ఇదొక్కటి తప్ప ఈ మొక్కుబడి యోగాకు విలువేమీ లేదు.

మోదీగారికి మాత్రం ప్రణామమే ! నెహ్రూలాంటి ప్రధానమంత్రులు మన దేశపు సంస్కృతిని, మతాన్ని, పక్కనపెట్టే ప్రయత్నము, ఇంకా చెప్పాలంటే నాశనం చెయ్యాలనే ప్రయత్నమూ  చేస్తే, మోదీగారు స్వయంగా కలకత్తావీధులలో కొచ్చి, యోగా చేస్తున్న వారి మధ్య తిరుగుతూ, వారిని ప్రోత్సాహపరిచారు. ఇదెంత గొప్పవిషయం !  అంతేగాక, రామకృష్ణులు, వివేకానందస్వామి, అరవిందులు, లాహిరీమహాశయులను తన మెసేజిలో ప్రస్తావించారు. ఈ దేశపు ప్రధానమంత్రి అంటే ఇలా ఉండాలి ! నెహ్రూలాగా, ఇందిరాగాంధీలాగా ఉండకూడదు.

ఇప్పుడు కూడా యోగా చేయనివాళ్ళు, ఈ పండుగలో పాలుపంచుకోనివాళ్ళు చాలామంది ఉన్నారు. కాంగ్రెస్, కమ్యూనిస్టులు, ముస్లిములు,  ప్రతిపక్షాలు దీనికి దూరంగా ఉన్నారు. ఎక్కడో కొద్దిమంది చేసి ఉండవచ్చు. కానీ అందరూ చేయలేదు. వాళ్ళుంటున్న దేశసంస్కృతి గురించిన కనీసగౌరవం అంటూ ఏమైనా వీరికి ఉందా అని సందేహం కలుగుతోంది. వాళ్ళ భావజాలం ఎంత లోలెవల్లో ఉందో అర్థమౌతోంది.

మంచి అలవాట్లు తేలికగా రావు. అప్పుడప్పుడూ చెయ్యగానైనా కొన్నాళ్ళకో  కొన్నేళ్లకో అలవాటౌతాయి. ఈలోపల మనల్ని పట్టుకుని ఉన్న బద్దకం అనే రాక్షసిని వదిలించుకోవాలి. కనీసం ప్రయత్నం చేయాలి. అప్పుడే ఆరోగ్యమైనా, ఏదైనా మనకు దక్కుతుంది.

జిమ్ములు చేసి హార్ట్ ఎటాక్స్ తెచ్చుకుని కుప్పకూలి పోకండి. ఇంట్లోనే యోగాభ్యాసం చేసి నూరేళ్లు ఆరోగ్యంగా జీవించండి.

ప్రస్తుతానికి ఇంతే చెప్పగలం !

read more " యోగా డే - 2026 "

16, జూన్ 2026, మంగళవారం

U.G - 11 (అమనస్కస్థితి)

9-7-1963 నుండి 9-7-1967 వరకూ జరిగిన నాలుగేళ్ళ కాలంలో యూజీగారి జీవితం గొప్ప మలుపులు తిరిగింది.

ఆ సమయంలో ఆయన జాతకంలో శుక్ర శుక్ర బుధ దశనుండి శుక్ర కుజ శని దశ వరకూ నడిచింది.

1963 సెప్టెంబర్ లో లండన్ రామకృష్ణా మిషన్ సెంటర్ నుండి బయటకు వచ్చిన తర్వాత ఆయన పారిస్ చేరుకున్నాడు. ఒక గమ్యమంటూ లేకుండా తిరుగుతూ ఉండేవాడు. ఇండియాకు ఉన్న తన తిరుగుప్రయాణపు టికెట్టును అమ్మివేయగా 350 పౌండ్లు వచ్చాయి. ఘనానందస్వామి ఇచ్చిన 50 పౌండ్లు ఉన్నాయి. ఆ డబ్బుతో పారిస్ లోని ఒక చిన్నహోటల్ రూములో ఉంటూ, డిసెంబర్ వరకూ కాలక్షేపం చేశాడు. రోజుకొక్క ఛీజుముక్కను మాత్రం తినేవాడు. అదే ఆయన ఆహారం.

అప్పట్లో ఫ్రాన్స్ అధ్యక్షుడైన చార్లెస్ డి గాల్ "360 రకాల ఛీజులను చేసే దేశాన్ని పాలించడం చాలా కష్టం' అనేవాడు. ఈ మాటను వినిన యూజీగారు ఫ్రాన్స్ లో అన్ని రకాల ఛీజులుంటాయా? అనిన సందేహంతో రోజుకొక కొత్తరకం ఛీజును తింటూ ఉండేవాడు.  నిజంగానే రోజుకొక కొత్తరకం ఛీజు చొప్పున ఏడాదికి 365 రకాల ఛీజులను అక్కడ తయారు చేస్తారు. ఆ విధంగా ఆ మూడునెలలు గడిచాయి.

ఆ సమయంలో ఆయనకు శుక్ర శుక్ర శని నుండి శుక్ర శుక్ర బుధ దశ వరకు నడిచింది. శుక్రుడంటే కేతువని, శుక్ర - శని అంటే శుక్ర - కేతువులేనని ముందే చెప్పి ఉన్నాను. వాళ్ళేం చేస్తారో కూడా గత పోస్టులో చెప్పాను.  ఇక, బుధుడు బుద్ధికారకునిగా ఈయన యొక్క బుద్ధిని సూచిస్తున్నాడు. 12-3 భావాల అధిపతిగా అంతచ్చేతనను, భావవ్యక్తీకరణను సూచిస్తాడు. కనుక శుక్ర శుక్ర బుధ దశలో భావవ్యక్తీకరణ తగ్గిపోయింది. దానికసలు అవకాశమే లేదు.

లండన్ వీధులలో తిరిగినట్లే పారిస్ వీధులలో కూడా గమ్యరహితంగా తిరుగుతూ ఉండేవాడాయన. ఆ తిరగడానికి ఒక అర్ధమేమీ ఉండేది కాదు. కాసేపిక్కడ, కాసేపక్కడ, ఈ విధంగా అన్నిచోట్లకూ గాలికి ఎగురుతున్న ఎండుటాకులా ఆయన పరిస్థితి ఉండేది.

కుండలిని ఒక మనిషిలో నిద్రలేచిందంటే ఊరకే కూచోదు. ఆ మనిషి మెదడు, సెంట్రల్ నెర్వస్ సిస్టం, హార్మోన్ సిస్టం, ఎండోక్రిన్ గ్రంధులు అన్నీ సమూలమైన మార్పులకు లోనౌతాయి. ఈ రోజున్నట్లుగా రేపు ఆ మనిషి ఉండడు. రోజురోజుకూ మారిపోతూ ఉంటాడు. అతని మనసుకూడా అతని అదుపులో ఉండదు. అతని భావజాలమంతా సమూలమైన మార్పులకు లోనౌతుంది. చివరకు మనసే లేకుండా పోతుంది. అలాంటి మార్పులను తెస్తుంది కుండలిని. ఒక్కొక్కసారి ఈ ప్రక్రియలో గుండె ఆగిపోయి ప్రాణాలకే ప్రమాదం వస్తుంది.

అందుకే కుండలిని అంటే ఆటలు, మాటలు కాదు. కుండలిని నిజంగా నిద్రలేస్తే ఇక నీ ఒళ్ళు నీ అదుపులో ఉండదు. ప్రతిరోజూ ఎన్నో మార్పులు నీ దేహంలో జరిగిపోతూ ఉంటాయి. అవి సుఖంగా ఏమీ  ఉండవు. వాటిని నువ్వు ఆపలేవు. కేవలం ప్రేక్షకపాత్రగా చూస్తూ ఉండటం తప్ప, ఆ నరకం అనుభవించడం తప్ప, నువ్వు ఏమీ చేయలేవు. అవధూతస్థితికి ముందు స్థితి అలా  ఉంటుంది.

చాలామందికి ఈ విషయాలన్నీ తెలీక, కుండలిని అంటే ఏదో పిల్లచేష్టలనుకుంటూ ఉంటారు. రోజూకాసేపు ముక్కు మూసుకుని అనులోమ విలోమ ప్రాణాయామం చేస్తే చాలు కుండలిని నిద్రలేస్తుంది, వెంటనే మన ఇష్టదేవత మన ఎదురుగా ప్రత్యక్షమై వరాలిచ్చేస్తుంది. లేదా మోక్షం వచ్చి ఒళ్ళో కూచుంటుంది. అనుకుంటారు. అలా ఏమీ జరగదు. జరుగుతుందని ఎవరైనా చెబితే అది పక్కా మోసమే.    

సరే, చేతిలో ఉన్న 400 పౌండ్లు ఆ విధంగా అయిపోయాక, మళ్ళీ సమస్య మొదటికొచ్చింది. ఏం చెయ్యాలి? అన్న ప్రశ్న ఎదురైంది. చెయ్యటానికేమీ లేదు. చెయ్యాలని మనసూ లేదు. చివరికా స్థితిలో, జెనీవాలో ఉన్న ఇండియన్ కాన్సులేట్ కు వెళ్లి, తన పరిస్థితిని వివరించి, తనను ఇండియా పంపించెయ్యమని వారిని అడిగాడాయన. వాళ్ళు కుదరదన్నారు.

ఈ సంభాషణనంతా అక్కడున్న వాలెంటైన్ డి కెర్విన్ అనే ఒక స్టాఫ్ మెంబర్ వింటూ ఉన్నది. నిజానికి ఎంబసీలో ఆమె ఒక భాషా అనువాదకురాలుగా పనిచేస్తున్నది. ఆ రోజున ఫ్రంట్ డెస్కులో ఉండవలసిన స్టాఫ్ సెలవు పెడితే, ఆ స్థానంలో ఆమె పనిచేస్తున్నది. యూజీగారు ఎంబసీవారితో మాట్లాడుతూ ఉండటమంతా ఆమె విన్నది. యూజీగారి నిజాయితీ ఆమెకు నచ్చింది. ఆయనపైన ఆమె జాలిపడింది. వెంటనే ముందుకొచ్చి, ఈ సమస్య తేలేవరకూ తనతో బాటు తన ఇంట్లో ఉండవచ్చని యూజీగారిని ఆహ్వానించింది.

వాలెంటైన్ గారి జాతకాన్ని ఆమె జీవితాన్ని ఇంకొక సీరీస్ లో పరికిద్దాం. ప్రస్తుతానికి ఒక చిన్నమాటను మాత్రం చెప్తాను. వాలెంటైన్ ఒక మామూలు వనిత కాదు. ఆమె ఒక కారణజన్మురాలు. అమ్మవారి అంశ ఆమెలో ఉంది. కనుకనే ముక్కూ ముఖం తెలియకపోయినా, నమ్మి యూజీగారికి ఆమె ఆశ్రయాన్ని కల్పించింది. అంతేకాదు, ఒకసారి ఆయనేమిటో అర్ధమయ్యాక, తనకు తండ్రినుండి సంక్రమించిన ఆస్తిని, తన పెన్షన్ ను, అంతటినీ కలిపి ఒక ట్రస్ట్ ను ఏర్పరచి, తనున్నా లేకపోయినా, యూజీగారికి నెలఖర్చులకు జీవితాంతం ఎటువంటి ఇబ్బందీ లేకుండా ఆమె ఏర్పాటు చేసింది. ఆ విధంగా 1963 లో మొదలైన వారి విచిత్రబంధం 1991 లో తన 90 వ ఏట ఆమె బెంగుళూరులో చనిపోయేవరకూ నిరాఘాటంగా కొనసాగింది.

ఆమె చనిపోయాక, ఆమె డైరీలను వెతుకుతుంటే, అందులో యూజీగారిని గురించి ఆమె వ్రాసుకున్నది బయటపడింది. యూజీగారిని ఆమె ఎలా అర్ధం చేసుకున్నదో ఆమె మాటలలోనే చూద్దాం. ఆమె ఫ్రెంచి భాషలో వ్రాసుకున్న మాటలకు ఇంగ్లీషు అనువాదం  ఇది.

"Where can I find a man like him? I have at last met a man, a man the like of whom can be met very rarely"

ఇది తెలుగు అనువాదం.

"ఇటువంటి మనిషి ఎక్కడ దొరుకుతాడసలు? ఎట్టకేలకు నేనొక నిజమైన మనిషిని కలుసుకున్నాను. ఇటువంటి మనుషులను చాలా అరుదుగా మాత్రమే మనం కలుస్తాం".

ఇంకొక సందర్భంలో, యూజీగారి గురించి హిందీనటి పర్వీన్ బాబీతో మాట్లాడుతూ వాలెంటైన్ ఇలా అన్నారు, 

"I have known a lot of men in my life; he is the kindest man I have known in my life."

(నా జీవితంలో ఎంతోమందిని నేను చూచాను.  నేనెరిగిన అందరిలోకీ ఈయన అత్యంత దయాహృదయుడు).

యూజీగారిని ప్రపంచానికి అందించే నాటకంలో ఒక ముఖ్యపాత్ర వాలెంటైన్ కు ఇవ్వబడింది. అది ఆమె అదృష్టం. జగజ్జనని ఆ పాత్రకు ఆమెను ఎన్నుకుంది.

ఎలాగైతే, 1893 సంవత్సరంలో, చేతిలోని పత్రాలు పోగొట్టుకుని, దిక్కులేని పరిస్థితిలో శోషవచ్చి చికాగోలో రోడ్డుపైన పడిపోయే స్థితిలో ఉన్న వివేకానందస్వామిని మేరీ హేల్ అనే అమెరికన్ వనిత రక్షించి, తన ఇంటిలోనికి తీసుకెళ్లి మంచినీళ్ళిచ్చి ఆదుకున్నదో, అదేవిధంగా 1963 డిసెంబర్లో యూజీగారికి కూడా వాలెంటైన్ అనే యూరోపియన్ వనిత  ఆసరాగా నిలబడి ఆదుకుని సంరక్షించింది. 

70 ఏళ్ల తర్వాత మళ్ళీ అదే సంఘటన పునరావృతమైంది. ప్రాంతాలు వేరు కావచ్చు, వ్యక్తులు వేరు కావచ్చు, కానీ స్పందించిన ఇద్దరూ స్త్రీమూర్తులే కావడం, అందులోనూ నిస్వార్ధప్రేమమూర్తులు కావడం వింతలలో వింత ! కాళికామాత లీలలంటే ఇలాగే ఉంటాయి మరి !

చొక్కాలో దాచిపెట్టిన బూడిదను గాల్లోంచి తీసినట్టు నటిస్తూ బయటకు తియ్యడం,  రాళ్లముక్కలను మింగి, తెముల్చుకుని, లింగాలంటూ వాటిని కక్కడం, బూడిదతో అద్భుతాలు చెయ్యడం, కీబోర్డు వాయించి రోగాలు తగ్గించడం, గ్రానైట్ రాయితో వీపుమీద ఇస్త్రీచేసి కేన్సర్ తగ్గిస్తాననడం, నెత్తిమీద చెయ్యిపెట్టి శక్తిపాతం చేస్తానని డబ్బులు కాజెయ్యడం, చిన్నమస్త, ప్రత్యంగిర మొదలైన పేర్లు చెప్పి, దయ్యాలని, భూతాలని, చేతబడులు, హోమాలు అని మాయమాటలు చెప్పి జనాన్ని బురిడీ కొట్టించడం ఇలాంటి పిచ్చిచేష్టలు అసలైన అద్భుతాలు కావు. 

పిచ్చిజనాల్లారా ! అసలైన అద్భుతాలంటే ఇవి ! కాస్త కళ్ళు తెరిచి చూడటం నేర్చుకోండి !

మనకధలో ముందుకెళదాం !

ఆ విధంగా వాలెంటైన్ సంరక్షణలోకి యూజీగారు వచ్చారు. ఒక వారం తర్వాత, "మేము మా ఖర్చులతో మిమ్మల్ని ఇండియాకు పంపించలేము. అది సాధ్యం కాదు" అని ఎంబసీ వాళ్ళు చెప్పేశారు. ఇక ఆయన వాలెంటైన్ తోనే ఉండిపోయాడు. మిగిలిన కథ అంతా చంద్రశేఖర్ బాబు, మహేష్ భట్, ముకుందరావు, మొదలైనవారు వ్రాసిన యూజీగారి జీవితం గురించిన పుస్తకాలలో చూడండి. వాళ్ళు ఆయనను బాగా ఎరిగినవాళ్లు, ఆయనతో ఎన్నో ఏళ్ళు జీవించినవాళ్లు. అదంతా వివరించి చాలా బాగా వ్రాశారు.

ఇకపోతే, నిద్రలేచిన కుండలినీశక్తి, ఆయన దేహంలో తనపనిని తాను చేసుకుంటూ పోతోంది.

కుండలిని ముఖ్యంగా పెద్దమెదడు, చిన్నమెదడు, కేంద్రనరాల వ్యవస్థ, గ్రంధుల వ్యవస్థలపైన పనిచేసి వాటి పనితీరులలో సమూలమైన మార్పులు తెస్తుంది. ఈ ప్రక్రియలో దేహం అతలాకుతలమై పోతుంది. మెడికల్ సైన్సుకు అంతుబట్టని అనేక విచిత్రమార్పులు ఆ వ్యక్తిలో జరుగుతాయి.

మన దేహంలో పినియల్, పిట్యూటరీ, హైపోతాలమస్ అనే గ్రంధులు మెదడులో ఉంటాయి. ఇవి సహస్రార ఆజ్ఞాచక్రాలకు స్విచ్చుల వంటివి. థైరాయిడ్, పారాథైరాయిడ్ గ్రంధులు గొంతుభాగంలో ఉంటాయి. ఇవి విశుద్ధచక్రానికి సంబంధించబడినవి. థైమస్ గ్రంధి ఛాతీమధ్యలో గొంతుభాగం క్రిందుగా ఉంటుంది. ఇది అనాహతచక్రానికి సంబంధపడి ఉంటుంది. పాంక్రియాస్ గ్రంధి మణిపురచక్రంతో ముడిపడి ఉంటుంది. గోనాడ్ గ్రంధులు స్వాధిష్టానచక్రంతో ముడిపడి ఉంటాయి. ఎడ్రినల్ గ్రంధులు మూలాధారచక్రానికి చెందినవి.

కుండలిని నిద్రలేచిందంటే ఈ గ్రంథుల పనితీరులో సమూలమైన మార్పులొస్తాయి.

జాగృతకుండలిని వల్ల యూజీగారి దేహంలో అనేకమైన మార్పులు జరుగుతూ ఉండేవి. ఆయా గ్రంధులు ఉబ్బి ఆయన చర్మంపైన రకరకాల రంగులలో కనిపించేవి. అర్ధనారీశ్వర తత్వాన్ని ప్రతిబింబిస్తూ ఆయన దేహంలోని ఎడమభాగం స్త్రీలాగాను, కుడిభాగం పురుషునిలాగాను మారిపోయింది. ఆయన ఛాతీ కూడా ఎడమవైపు స్త్రీ కున్నట్లు, కుడివైపున పురుషుని లాగాను ఉండేదట. రెండుకళ్ళల్లో కూడా కుడికన్ను ఒక విధంగా, ఎడమకన్ను మరొక విధంగా ఉండేదట. ఈ విధంగా యోగగ్రంధాలలో చెప్పబడిన మార్పులన్నీ ఆయన దేహంలో స్పష్టంగా బయటకే కనిపిస్తూ ఉండేవి. అమావాస్య పౌర్ణమి రోజులలో ఆయన దేహం అతలాకుతలమై పోతూ ఉండేది. ఇతరులకూ తనకూ భేదం ఆయనకు తెలిసేది కాదు. తన దేహమే తనకు కనిపించేది కాదు. అసలు తను బ్రతికున్నానా, చనిపోయానా కూడా తెలిసేది కాదు.

ఆయన దేహమంతా విద్యుత్తు ప్రవహించడం మొదలైంది. ఆయన తన రెండు అరచేతులను రుద్దుకుంటే చక్కుమని మెరుపులు వెలిగేవి. నిద్రలో పక్కమీద దొర్లితే ఆ గదిలో మెరుపులు మెరిసేవి. తన పక్కమీద ఉన్న నైలాన్ బట్టవల్ల అలా స్టాటిక్ విద్యుత్తు ఏర్పడుతున్నదేమో అనిన అనుమానంతో పక్కగుడ్డలను మార్చేసి, కాటన్ దుప్పట్లను వేసినప్పటికీ అదే విధంగా జరుగుతూ ఉండేది. కాళ్లలోనుంచి విద్యుత్తు ఎర్త్ అవుతుంటే, దానిని ఆపడానికి ఆయన ఇంట్లో కూడా చెప్పులేసుకుని నడిచేవాడు. స్నానం చేద్దామని షవర్ కింద నిలబడితే, నీళ్ళు తగలడంతోనే ఒళ్ళంతా కరెంట్ షాకు కొట్టేది.

ఆయన ప్రతిరోజూ చనిపోతూ ఉండేవాడు. ఒళ్ళంతా క్రమంగా బిగుసుకుపోయి, ఎగశ్వాస మొదలై, ఊపిరి ఆగిపోయేది. సరిగ్గా 48 నిమిషాల తర్వాత మళ్లీ ఆయన దేహం మామూలుగా పనిచెయ్యడం మొదలుపెట్టేది. ఇలా ప్రతిరోజూ జరిగేది.

ఈ మార్పులన్నీ ఈ నాలుగేళ్ళ కాలంలో అంచెలంచెలుగా ఆయన దేహంలో వచ్చేశాయి.

మనకు తెలిసి, ఇటువంటి స్థితులను పొందినవాళ్ళు చరిత్రలో ఇంకా ఇద్దరున్నారు.  రామకృష్ణులకు కూడా ఇదేవిధంగా జరిగేది. మళ్ళీ, 'ఆనందమయి మా' కు కూడా ఇవే మార్పులు జరిగినట్లు మనం ఆమె జీవితంలో చూడవచ్చు.

కుండలిని అంటే ఇలా ఉంటుంది.

ఇదంతా ఆయన యొక్క యూరోపియన్ స్నేహితులు, సన్నిహితులు దగ్గరగా గమనించి చూచారు. ఎందరో డాక్టర్లు, శాస్త్రవేత్తలు వీటిని పరిశీలించారు. వారికేమీ అర్ధం  కాలేదు.

ఈయనలోని ఈ మార్పులను గమనించిన నవీనకాలపు యోగపితామహుడు తిరుమలై కృష్ణమాచార్య, 'ప్రస్తుతం జీవించి ఉన్న అత్యున్నతుడైన యోగి' గా యూజీగారిని గురించి చెప్పేవారు.

"మీలో జరుగుతున్న మార్పులు నా ఊహకు అనుభవానికి మించి ఉన్నాయని" కృష్ణమాచార్యగారి తనయుడు మరియు హఠయోగంలో పండిపోయిన ఆచార్యుడు దేశికాచారి గారు అనేవారు.

యూజీగారిలో జరిగిన మార్పులను గురించి వినిన కంచి పరమాచార్యులవారు "ఇది జీవన్ముక్త స్థితి" అని  అన్నారు.

శృంగేరి శంకరాచార్యులైన అభినవ విద్యాతీర్ధులవారు యూజీగారి స్థితిని చూచి, "ఈ స్థితులను మా గురువుగారైన చంద్రశేఖర భారతీస్వామివారిలో చూచాము. మరలా మీలో చూస్తున్నాము" అన్నారు. అంతేగాక,  ఇలా అంటూ యూజీగారికి ఆయన సాష్టాంగనమస్కారం చేశారని చంద్రశేఖర్ గారు నాతో అన్నారు.

కనుక, అలాంటివారికి మాత్రమే ఆయన యొక్క స్థితి ఏమిటో తెలుస్తుంది. మనబోటివారికి అటువంటి స్థితులు ఎలా అర్ధమౌతాయి? 

ఇప్పుడు కొద్దిగా జ్యోతిషశాస్త్రం వైపు దృష్టి సారిద్దాం.

సాధనాపరంగా చూచినపుడు గ్రహాలను గురువర్గం శుక్రవర్గం అని రెండువర్గాలుగా విభజించవచ్చు. ఒకటేమో దేవతావర్గం, రెండవది దానవవర్గం. శుక్రాచార్యుడు దానవగురువు. ఆయనకు మృతసంజీవినీవిద్య తెలుసు. దేవగురువుకు కూడా అది తెలియదు. మృతసంజీవని అంటే కుండలినీవిద్యనే. అజ్ఞానంలో పడిఉన్నవాళ్ళు చచ్చినవాళ్ళకిందే లెక్క. జ్ఞానులైనవాళ్లు బ్రతికినవాళ్లు. అజ్ఞానిని జ్ఞానిగా మార్చేది కుండలిని. అంటే, చనిపోయినవాడిని బ్రతికిస్తుంది.

అందుకే, యూజీగారి జాతకంలో కూడా శుక్రదశలోనే కుండలినీజాగృతి జరిగింది. కుండలినీశక్తిని సూచించే రాహుకేతువులు కూడా, మన పురాణాల ప్రకారం రాక్షసులేనని మనం గుర్తుంచుకోవాలి.

ఈ  విధంగా నాలుగేళ్లు గడిచాయి. 1967 సంవత్సరం వచ్చేసింది. జూలై నెల 9 వ తేదీ యూజీగారి పుట్టినరోజు. ఆరోజున సానెన్ లో తన ఇంటిని ముందున్న ఒక చెస్ట్ నట్ చెట్టుక్రింద ఒక బెంచీమీద ఆయన కూచుని  ఊరకే శూన్యంలోకి చూస్తున్నాడు. ఆ సమయంలో ఒక పెద్ద విస్ఫోటనం ఆయన దేహంలో జరిగింది. అది ఒక ఆటంబాంబు పేలుడు లాంటిది. ఆ రోజునుంచీ ఏడురోజులపాటు ఆయనలో అనేక మార్పులు చకచకా జరుగుతూ వచ్చాయి. ఏడవనాటికి అవి పూర్తయ్యాయి. అప్పటివరకూ ఆయనకున్న మనస్సు నాశనమైపోయింది. ఆలోచన పూర్తిగా అంతరించింది.

బుద్ధునికి రావిచెట్టు క్రింద జ్ఞానోదయమైంది. రావిచెట్టు బ్రహ్మ-విష్ణు-శివుల సమ్మిళిత స్వరూపం. యూజీగారికి చెస్ట్ నట్ వృక్షం క్రింద అమనస్కస్థితి సిద్ధించింది. మహనీయులకు అటువంటి స్థితులను అందించిన వృక్షాలకు కూడా చాలా ప్రాముఖ్యతలుంటాయి. అయితే అవి అందరికీ అర్ధం కావు.

ఈ చెట్టును సంస్కృతంలో నాగకేసర వృక్షమంటారు. నాగాహ్వ, అహిపుష్ప అనికూడా  అంటారు. నాగకేసరమనే మాట కుండలినీశక్తికి, వికసించిన యోగచక్రాలకు సూచిక. ఆ చెట్టు క్రిందనే యూజీగారికి అటువంటి స్థితి కలగడం కాకతాళీయం ఏమాత్రం కాదు. అది ప్రకృతి చేసిన ఒక మార్మిక ఏర్పాటు మాత్రమే.

ఇక్కడ మరొక్క విషయాన్ని చెప్తాను. రామకృష్ణులు నాగకేసరపుష్పాలను చాలా ఇష్టపడేవారు.

అప్పటివరకూ యూజీగారిని ఆయన మనస్సు నడుపుతూ వచ్చింది. ఆ క్షణంనుంచి అది నశించిపోయింది. విశ్వమంతా నిండి ఉన్న ఏదో ఒకశక్తి ఆయన దేహాన్ని తన అదుపులోకి తీసుకొని, సూటిగా దానిని నడపడం మొదలుపెట్టింది. దాని పనిముట్లు దేహంలోని ఎండోక్రిన్ గ్రంధులు. ఆయనలోని పినియల్, పిట్యూటరీ గ్రంధులు పూర్తిగా ఉత్తేజితాలై, విశ్వశక్తికి ప్రతిస్పందిస్తూ, ఆయన  దేహాన్ని తమ కంట్రోల్ లోకి తీసుకుని నడపడం మొదలుపెట్టాయి. ఇన్నాళ్లూ ఆ పనిని మనసు చేస్తూ ఉండేది. ఇప్పుడు విశ్వశక్తి, గ్రంధుల వ్యవస్థ దానిని తమ చెప్పుచేతలలోకి తీసుకున్నాయి.

యోగపరిభాషలో ఈ రెండుగ్రంథులను 'ఆజ్ఞాచక్రం (పిట్యూటరీ గ్రంధి), సహస్రారచక్రం (పినియల్ గ్రంధి)' అంటారు. ఆజ్ఞాచక్రానికి రెండుదళాలున్నాయని యోగశాస్త్రం అంటుంది. ఆ దళాలే పిట్యూటరీగ్రంథిలోని రెండు లోబ్స్ (యాంటీరియర్ లోబ్ లేదా ముందుభాగం, పోస్టిరియర్ లోబ్ లేదా వెనుక భాగం). ఇవి ఒక గింజలోని రెండు పప్పులలాగా ఉంటాయి. పిట్యూటరీ గ్రంధి దేహంలోని మాస్టర్ గ్లాండ్. అంటే దేహంలోని ప్రతిభాగాన్నీ, ప్రతిగ్రంథినీ ఇది కంట్రోల్ చేయగలదు. ఆజ్ఞాపించి నడిపించగలదు. అందుకే దీనిని "ఆజ్ఞాచక్రం" అన్నారు.

ఆజ్ఞాచక్రం జాగృతమైతే దేహంలో ఇదంతా జరగాలి. కానీ, క్రియాయోగులమని, కుండలినిని సాధించామని, లోకలోకాలు సూక్ష్మశరీరంతో తిరుగుతామని గప్పాలు కొట్టుకునే నేటి జోకర్లలో ఎవడిలోనూ ఈ మార్పులు కనిపించవు. అందుకే ప్రతివాడూ, "నాకు ఆజ్ఞాచక్రం యాక్టివేట్ అయింది, కుండలిని లేచింది" అని చెబుతుంటే నాకు చచ్చే నవ్వొస్తూ ఉంటుంది. "మీ కర్మ ! అనుభవించండి" అనుకుంటూ ఉంటాను.

మన కధలోకొద్దాం.

దేనికోసమైతే దాదాపు 40 ఏళ్లుగా తాను వెదుకుతున్నాడో ఆ జ్ఞానోదయం అనేదేమీ అసలు లేనేలేదని యూజీగారికి అర్ధమైపోయింది.  తన మనసే తనకు అడ్డు అని అర్ధమైంది. ఆ మనసే ధ్వంసమైపోయింది. ఆ క్షణంలోనే ఆయన యొక్క వెదుకులాట అంతమైపోయింది. అమనస్కస్థితి ఆయనకు సిద్ధించింది.

చాలామంది "రాజయోగం" అనేమాటను తెలిసీ తెలియకుండా వాడేస్తూ ఉంటారు. సాంఖ్య, తారక, అమనస్కయోగాల కలయికకే రాజయోగమని పేరు. వీటిల్లో ఒకదానికంటే మరొకటి పైమెట్లలో ఉంటాయి. అమనస్కయోగాన్ని సాధించినవాడే రాజయోగి అనిన పదానికి అర్హుడు.

కనుక, యూజీగారు ఒక రాజయోగి అని చెప్పాలి. అందుకే ఆయన ఒక రాజులాగానే బ్రతికాడు. రాజులు సంపాదించరు. సేవకులు  మాత్రమే సంపాదిస్తారు. రాజులకు సంపాదనతో అవసరం ఉండదు. కానీ, దేనికీ వారికి లోటుండదు. యూజీగారి జీవితమే దీనికి సజీవతార్కాణం.

ఉన్నమాటను ఉన్నట్లుగా చెప్పాలంటే,  పరమహంస తోతాపురి, త్రైలింగస్వామి,  రామకృష్ణులు, రమణమహర్షి, జిల్లెళ్ళమూడి అమ్మగారు, యూజీగారు మొదలైనవారే నిజమైన రాజులు, చక్రవర్తులు. వీరిముందు, ప్రపంచపు రాజులు, రాజ్యాధినేతలు, కేవలం సేవకులు మాత్రమే.

ఇకపోతే, జ్ఞానోదయమైనవాడికి అది జ్ఞానోదయమని తెలియదు. ఆత్మజ్ఞానికి తాను ఆత్మజ్ఞానినని తెలియదు. అదే ఆ స్థితియొక్క విచిత్రం. అందుకే జిల్లెళ్ళమూడి అమ్మగారు తరచూ "నాది తెలిసీ తెలియని స్థితి" అంటూ  ఉండేవారు.

యూజీగారైతే ఇంకొక అడుగు ముందుకేసి అసలు ఆత్మజ్ఞానమనేదే లేదు పొమ్మన్నారు. నిజమే కదా ! ఆత్మలయమైనవాడికి ఆత్మజ్ఞానమెలా మిగిలి ఉంటుంది?

ఇంకా చెప్పాలంటే, సాధనామర్గంలో ఉన్నది మనోలయం, మనోనాశాలు మాత్రమే. అప్పుడు మిగిలేదానిని 'ఆత్మ' అనుకుంటే అభ్యంతరమేమీ లేదు. కానీ ఆ ఆత్మ అనేది ఒక ఆకారమూ కాదు, ఒక స్థితీ కాదు. మరేమిటది? అదేంటో దానికే  తెలుసు. లేదా, దానిక్కూడా తెలీదేమో? మనకు మాత్రం దానిసంగతి ఏమీ తెలియదు. తెలుసుకోవడం సాధ్యం కాదు కూడా !

స్థూలంగా చెప్పాలంటే, మనల్ని నడిపించేది మన మనస్సు. మనస్సంటే ఏమిటి? జ్ఞాపకాల గుట్ట. జ్ఞాపకాన్ని నియంత్రించే మెదడు భాగం ఏమిటి? ఒకటి కాదు. చాలా ఉంటాయి. అవన్నీ కలసి జ్ఞాపకాలను దాచిపెడతాయి, మళ్ళీ గుర్తు చేస్తాయి, అదే దారిలో మనల్ని నడిపిస్తాయి. ఆ భాగాలేంటి? Hyppocampus, Amygdala, PFC, Cerebellum లు ఈ పనిని చేస్తాయి. వాటికి కావలసిన స్రావాలను పినియల్, పిట్యూటరీ గ్రంధులు విడుదల చేస్తాయి. అప్పుడు జ్ఞాపకాల పరంపర మనల్ని నడిపిస్తూ ఉంటుంది. దీనికే మనసు అని పేరు.

అయితే, ఈ వ్యవస్థ అంతా మన జీన్ కోడ్ ను బట్టి నడుస్తుంది. దానికే సంస్కారాలని పేరు. గతజన్మలలో మనం చేసిన పనులు, ఆలోచించిన ఆలోచనలే జీన్ కోడ్ రూపంలో ఉంటాయి. వాటికి తగిన తల్లిదండ్రులకే మనం పుట్టడం జరుగుతుంది. మన జీవితాలు కూడా ఈ జీన్ కోడ్ ను బట్టే నడుస్తుంటాయి. దీనినే గతజన్మసంస్కారాలని వేదాంత - యోగ పరిభాషలో పిలుస్తారు. 

ఈ విధంగా, కోటానుకోట్ల జీవులకు ఎక్కడా పొల్లుపోకుండా వారివారి జన్మజన్మాంతరాలలో జరుగుతూ ఉంటుంది. దీనినంతా కొంచెంకూడా తేడా రాకుండా  కోట్ల ఏళ్లనుంచీ నడిపిస్తున్న మహాశక్తినే జగన్మాత, జగజ్జనని, ఆదిశక్తి అని మనం పిలుస్తున్నాము.

మామూలు మనుషులకైతే ఇదంతా ఈ విధంగా జరుగుతూ ఉంటుంది. కుండలినీశక్తి నిజంగా జాగృతమైన యోగులలో అయితే, ఈ వ్యవస్థ అంతా తారుమారౌతుంది. వారి మెదడులోని అన్నిభాగాలు, కేంద్రాలు, గ్రంధులు అన్నీ పూర్తిగా నిద్రలేచి పనిచేయడం మొదలుపెడతాయి. ఒక క్రొత్తవ్యవస్థ వారి దేహాన్ని తన చెప్పుచేతలలోకి తీసుకుంటుంది. ఇక, వారి దేహంపైన వారికి నియంత్రణ ఉండదు. వారి మనస్సు ఆగిపోతుంది గనుక, విశ్వశక్తి వారిదేహాన్ని నడిపించడం మొదలుపెడుతుంది.

మనస్సు లేదు గనుక, లోకాన్ని వారు చూచేతీరు మారిపోతుంది. వారి ఇంద్రియానుభూతులు మారిపోతాయి. వారి జీవనవిధానం అంతా ఒక క్రొత్తపంథాను అనుసరిస్తుంది. వారి గతం అంతరిస్తుంది. ప్రతిక్షణం వారికి క్రొత్తగానే ఉంటుంది. ఒక అప్పుడే పుట్టినపిల్లవాడు చూచినట్లు లోకాన్ని వారు చూస్తుంటారు. వారి సంగతి వారికే అర్థంకాకుండా ఉంటుంది.  కుండలినీ జాగృతి మనిషిలో ఇన్ని మార్పులను తీసుకొస్తుంది.

ఆ రోజున యూజీగారికి ఇదే జరిగింది. ఇప్పుడు దీనివెనుక ఉన్న జ్యోతిష్యకోణాలను పరికిద్దాం.

9-7-1967 న యూజీగారి జాతకంలో శుక్ర కుజ శని బుధ శని దశ నడిచింది. చతుర్ధాధిపతిగా శుక్రుడు మనస్సును సూచిస్తాడు. కేతువుతో కలసినందువల్ల మనస్సు ధ్వంసమైపోయింది. కుజుడు పంచమాధిపతి. అంటే  బుద్ధిని సూచిస్తాడు. అక్కడున్న నీచరాహువు వల్ల బుద్ధి నాశనమైపోయింది. శని సప్తమ, అష్టమాధిపతి. మనస్సును బుద్ధిని సూచించే చంద్రబుధులతో కలసి నీచరాహువుచేత చూడబడుతున్నాడు. రాహువంటే కుండలినీశక్తి గనుక దాని జాగృతివల్ల అవి రెండూ మాయమయ్యాయి. 

అంటే, పైన చెప్పిన మెదడులోని భాగాలన్నీ  ఆజ్ఞాచక్రం (పినియల్/ పిట్యూటరీ గ్రంధుల) కంట్రోల్ లోకి వెళ్లిపోయాయి. ఇక బుధుడేమో బుద్ధికారకుడు, పైగా 12-3 భావాల అధిపతిగా భావవ్యక్తీకరణ లోపించడాన్ని సూచిస్తున్నాడు. తనలో ఏమి జరుగుతున్నదో దానిని ఏ యోగీ బయటకు చెప్పలేడు. చెప్పినా, అది వాళ్ళ అనుభవంలో లేదు గనుక, వినేవాళ్లకు అది అర్ధం కాదు.

కనుక, ఆనాటి దశ యూజీగారిలో జరిగిన కుండలినీజాగృతిని, తత్ఫలితంగా ఆయనకు సిద్ధించిన అమనస్కస్థితిని స్పష్టాతిస్పష్టంగా సూచిస్తున్నది.

ఆనాటి (9-7-1967) గోచారగ్రహాలను పరికిద్దాం.

చతుర్ధమైన తుల రాహుకేతువులచేత కొట్టబడుతూ, మనోనాశాన్ని సూచిస్తున్నది. జననచంద్రునిపైన ఉచ్ఛగురువు సంచరిస్తూ ఉత్తమగజకేసరీయోగాన్నిస్తున్నాడు. జాతకంలో ఉచ్ఛగురువు ఉండటం ఒక అదృష్టయోగం. ప్రస్తుతం కూడా గోచారగురువు ఉచ్చస్థితిలోనే ఉన్నాడు. రవిబుధులు 12 వ భావంలో పడి, బుద్ధినాశనాన్ని సూచిస్తున్నారు. 9 వ భావమైన మోక్షరాశిలో శని ఉంటూ, సిద్ధిని సూచిస్తున్నాడు. యూజీగారి జాతకంలో సర్వాష్టకవర్గులో  మీనమేషాలకు అత్యధికంగా 37 మరియు 40 బిందువులొచ్చాయి. అక్కడే గోచార శనిరాహువులున్నారు.

పై విశ్లేషణను బట్టి, ఆనాడు యూజీగారికి అమనస్కసిద్ధి కలిగిందని స్పష్టంగా గోచరిస్తున్నది. అందుకే ఆయన చెప్పినదంతా కుదించి కొద్దిమాటలలో చెప్పాలంటే, ఆయన మాటలలోనే Mind is a myth అని చెప్పవలసి వస్తుంది.

అయితే ఆయనలాంటి మనుషులు ఆమాటను చెబితే ఒక అర్ధముంటుంది. మనలాంటి వాళ్లూ, 24 గంటలూ మనసులో పడి కొట్టుకుంటున్నవాళ్లూ ఆ మాటను అంటే బాగోదు. హాస్యాస్పదంగా ఉంటుంది.

అందుకే ఆయన మనకు అర్ధం కాడు. మనస్సు పరిధిలో మాత్రమే  బ్రతకడానికి అలవాటు పడినవాళ్లకు, మనస్సును దాటిన భూమికలో నిరంతరం ఉండేవాళ్ళు ఎలా అర్ధమౌతారు?

అసలు మనం ఆయనను అర్ధం చేసుకోవలసిన అవసరమేముంది? మనం అర్ధం చేసుకోకపోతే ఆయనకొచ్చిన నష్టం మాత్రం ఏముంటుంది?

అటువంటి మనుషులకు, ఒకళ్ళు వారిని అర్ధం చేసుకుంటే ఎంత? అర్ధం చేసుకోకపోతే ఎంత? ఎవడెట్లా పోతే వాళ్లకేంటసలు?

read more " U.G - 11 (అమనస్కస్థితి) "