నిన్న ఇక్కడున్న బెంగుళూరు యూజీ గ్రూపుతో సమావేశం కావడం జరిగింది.
యూజీగారికి బెంగుళూరుతో ఉన్న అనుబంధం గురించి ఆయన జీవితాన్ని చదివినవారికి సుపరిచితమే.
దశాబ్దాలుగా ఆయనను అభిమానిస్తున్నవారు చాలామంది ఇక్కడున్నారు. వారిలో ఆయనను చూచినవారు కలిసినవారు దగ్గరగా మసలినవారు చాలామంది ఉన్నారు. ఒకవిధంగా, వాళ్ళందరూ ఆయన స్మృతులలో బ్రతుకుతున్న భగ్నప్రేమికులు. వాళ్ళను యూజీగారి స్మృతులలో ముంచుతున్నదీ, ఉంచుతున్నదీ వాళ్ళ నాయకుడు చంద్రశేఖరబాబు గారు.
ఆయన యొక్క పురాతనమైన స్మృతిభాండాగారాన్ని తెరచి ఎప్పుడో జరిగిపోయిన సంగతులను కళ్ళకు కట్టినట్లుగా ఆయన చెబుతుంటే, ఆ కాలానికి వెళ్ళిపోయి, ఆ సంఘటనలను నేను కూడా దగ్గరుండి చూస్తున్న అనుభూతి కలిగింది. ఆయనను కలుసుకున్న ప్రతిసారీ మహేంద్రనాధగుప్త గారిని కలుసుకోలేకపోయానన్న నా బాధ కొద్దిగానైనా తీరిపోతూ ఉంటుంది.
యూజీ వంటి ఒక నిజమైన జీవన్ముక్తుడినీ, అమనస్కస్థితిని పొందిన మహనీయుడినీ, లేదా ఆయన మాటలలోనే చెప్పాలంటే, ఒక 'సహజమానవుడి'నీ కలుసుకుని, ఆ రుచిని ఒక్కసారైనా ఆస్వాదించినవాళ్లు, ఆపైన ఆయనను మరచిపోవడం అసాధ్యమౌతుంది - వాళ్ళ హృదయపు యాంటెనాలు ఉంటే !
ఆయన గతించిన 20 ఏళ్ల తర్వాత నేటికి కూడా ఆయనను మరచిపోలేక, ఆయన స్మృతులను నెమరువేసుకుంటూ జీవిస్తున్న ఈ గ్రూపును కలుసుకోవడం నాకు సంతోషాన్నిచ్చింది.
రామకృష్ణులు గతించి 140 ఏళ్ళైనా ఇప్పటికీ ఆయన స్మృతులలోనే జీవిస్తున్న పిచ్చివాళ్ళు లేరూ? అలాంటివాళ్లే వీళ్ళు కూడా !
మంచిమనుషులనేవాళ్ళు కనపడడం అరుదైపోతున్న ఈ రోజులలో కొంతమందినైనా ఒకేచోట కలవడం చాలా బాగా అనిపించింది.
యూజీ గారు పొందిన స్థితీ, చెప్పిన మాటలూ, వీళ్లకు పూర్తిగా అర్ధం కాకపోవచ్చు. ఆయనలో ఎన్నో పరస్పర విరుద్ధమైన విషయాలు వీరికి గోచరిస్తూ ఉండవచ్చు. వాటికీ, మన శాస్త్రాలలో చెప్పబడిన సాంకేతికభాషకూ పొంతన కుదరకపోతూ ఉండవచ్చు. కానీ వాళ్ళందరూ నిస్సందేహంగా ఆయనను ప్రేమిస్తున్నారు. అది చాలు. ఒకనాటికి వాళ్ళుకూడా అక్కడకు చేరుకుంటారు.
ఆ చర్చలో నేనేమీ పెద్దగా పాలుపంచుకోలేదు. మధ్యమధ్యలో ఒకటి రెండు మాటలను మాట్లాడినప్పటికీ, చాలావరకూ మౌనంగానే వాళ్ళ చర్చను విన్నాను. వాళ్ళ వెదుకులాట నాకు ముచ్చటేసింది.
వాళ్లలో చాలామందికి పాపం చాలా సందేహాలున్నాయి. అందరూ బాగా చదువుకున్నవాళ్ళే. చదివినవాళ్ళే. కానీ ఆధ్యాత్మికప్రపంచం వేరైనది కదా ! లౌకికజ్ఞానం ఇక్కడ పనిచేయదు.
కుండలినీ జాగృతి అయిన ఒక వ్యక్తిని వారిలో చూచాను. నేడు ప్రతివారూ కుండలిని గురించి మాట్లాడుతున్నారు. కానీ నిజంగా అది జాగృతి అయిన ఒక్కడంటే ఒక్కడిని కూడా నేను ఇంతవరకూ చూడలేదు. ఈ గ్రూపులో చూచాను. విచిత్రమేమిటంటే, అతనేమీ సాధనలు చేయలేదు. చేయడమూ లేదు. ఆయన పుట్టిన తేదీని అడిగి, అప్పటి గ్రహస్థితులను ఊహించి అది నిజమే అని నిర్ధారించుకున్నాను. అతను చెబుతున్న అనుభవాలూ లక్షణాలూ కూడా కుండలినీజాగృతి గురించి నాకు తెలిసిన లక్షణాలతో సరిపోతున్నాయి. అతని ఆరా కూడా దానికి అనుగుణంగానే ఉంది.
నకిలీలు ఎక్కడ చూచినా ఉంటారు, అసలైనవాళ్ళు మాత్రం ఎక్కడో అజ్ఞాతంగా ఉంటారన్న విషయం మళ్ళీ ఋజువైంది. 'మీ అడ్రసు యూట్యూబు ఛానల్స్ కి లీక్ చేస్తాన'ని అతడిని బెదిరించాను. 'అమ్మో ఆ పని మాత్రం చేయకండి' అని అతనన్నాడు.
మధ్యాహ్నభోజనాలయ్యాక పెద్దగా కార్యక్రమమేమీ లేదు. యూజీగారి అరుదైన వీడియోలను ప్లే చేసి కొంతమంది చూచారు. నేనవన్నీ యూట్యూబులో చూచాను గనుక, బయటకొచ్చి చెట్లకింద నడుస్తున్నాను. అక్కడున్న ఇంకా కొంతమందిమి అదీఇదీ మాట్లాడుకుంటూ గడిపాము.
మీటింగు అయిపోయాక, నేను, కుండలిని, ఇంకొక ఇద్దరం కలసి జయనగర్ నుంచి లాల్ బాగ్ వరకూ అనేక విషయాలు ముచ్చటించుకుంటూ నడిచాము. చివరికి అక్కడ మెట్రో రైలెక్కి ఎవరి ఇళ్లకు వారు చేరుకున్నాము.