6, అక్టోబర్ 2026, మంగళవారం

8 ఏళ్ల అమ్మాయి పాప్ స్టారా? పని ఒత్తిడితో చనిపోయిందా? ఏమిటీ ఘోరం?

హిరాటా రునా అనే జపాన్ అమ్మాయి 8 ఏళ్ల పాప్ స్టార్. తనలాగే స్టార్లు కావాలనుకునే తన వయసు పిల్లలకు ట్రెయినర్ కూడా. ఈ అమ్మాయి సెప్టెంబర్ 25 న గుండెజబ్బుతో చనిపోయింది. ఆ సమయానికి ఈ అమ్మాయికి కేవలం 8 ఏళ్ళు మాత్రమే. వినడానికి వింతగా లేదూ?

వెర్రితలలేస్తున్న మోడరన్ నాగరికతకూ, పిల్లలపైన పెరుగుతున్న విపరీతమైన పని ఒత్తిడికీ ఇదొక నిదర్శనం. ఈ అమ్మాయి జాతకాన్ని చూద్దాం.

16-4-2018 న జపాన్ లోని నగోయాలో ఈ అమ్మాయి పుట్టింది. జననసమయం తెలియదు గనుక చంద్రలగ్నాన్ని తీసుకుందాం. ఆరోజున చంద్రుడు మీన, మేష రాశులలో సంచరించాడు. జాతకసంస్కరణ చేయడం ద్వారా, చంద్రుడు అశ్వినీ నక్షత్రంలో ఉన్నాడని నేను ఊహిస్తున్నాను. అదంతా ఎలా చేశానో ఇక్కడ వివరించను.

12 ఏళ్ల లోపు ఇటువంటి సంఘటన జరిగితే, దానిని బాలారిష్ట దోషమంటారు. దీనిలో మళ్ళీ మూడు విభాగాలున్నాయి.

పుట్టిననాటి నుండి 4 ఏళ్ల లోపు తల్లియొక్క కర్మవల్ల జరుగుతుంది. 5 నుండి 8 ఏళ్ల లోపైతే తండ్రి యొక్క కర్మ కారణమౌతుంది. 9 నుండి 12 ఏళ్ల లోపైతే, జాతకుని కర్మయే కారణమౌతుంది.

బాలారిష్టాలు తప్పాలంటే జాతకంలో కొన్ని యోగాలుండాలి. చంద్ర బలమూ, గురు బలమూ, లగ్నబలమూ ఉంటే ఇవి తప్పుతాయి.

జననతిధి అమావాస్య గనుక చంద్రబలం లేదు. లగ్నాధిపతి కుజుడు భాగ్యభావంలో బద్ధశత్రువైన శనితో కలసి  ఉన్నాడు.కనుక బలహీనుడైనాడు. గురువు మారకస్థానంలో వక్రించి బలహీనుడుగా ఉన్నాడు. మూడు బలాలూ లేవు. కనుక, బాలారిష్టం తప్పలేదు.

చతుర్ధాధిపతి చంద్రుడే గుండెకు సూచకుడు. చతుర్దంలో రాహువున్నాడు. అది గ్రహణయోగం. కనుక పుట్టుకతో ఈ అమ్మాయికి గుండె బలహీనంగా ఉందని చెప్పవచ్చు. పంచమాధిపతి సూర్యుడు ఉచ్ఛస్థితిలో ఉన్నందున, జీవితంలో ఎదగాలని, ఏదో సాధించాలని తపన మాత్రం అధికంగా ఉంటుంది. కళలకు కారకుడూ, మారకుడూ అయిన శుక్రుడు కూడా అక్కడే ఉన్నందున, స్టేజి షోలు, సినిమాలు మొదలైన రంగాలు ఆకర్షిస్తాయి. కానీ అది కుదరదు. ఇంకాపైగా, అదే ప్రాణాంతకమౌతుంది.

తృతీయం ఆయుస్థానం. అధిపతి బుధుడు 12 వ భావంలో నీచస్థితిలో ఉన్నాడు. కనుక ఆయుష్షు దెబ్బతిన్నది. అష్టమాధిపతి కుజుడు శనితో కలసి బలహీనుడయ్యాడు. అష్టమభావం పాపార్గళానికి గురయ్యింది. వక్రించి, శత్రుస్థానంలో ఉన్న గురువు బలహీనుడే. కనుక పాపార్గళం అవుతుంది. శనికుజులతో కలసి ప్లూటో ఉన్నాడు. ఈ ముగ్గురూ ఆయుస్థానమైన మిధునాన్ని చూస్తున్నారు. ప్లూటో యముడని మనకు తెలుసు.

25-10-2026 న ఈ అమ్మాయికి  శుక్ర శుక్ర శని శుక్ర శుక్ర దశ నడిచింది. ఈ చంద్రలగ్నానికి శుక్రుడు మారకుడు. శని బాధకుడు, పైగా ప్లుటోతో కలసి లగ్నాధిపతి కుజుడిని నిస్సహాయుడిని చేశాడు.

గోచారాన్ని గమనిద్దాం. 

25-10-2026 న గ్రహస్థితులు ఇలా ఉన్నాయి. ఏలినాటి శని నడుస్తున్నది. చతుర్దంలో నీచకుజుడు, ఉచ్ఛగురువు ఉన్నారు. గుండెసమస్య స్పష్టంగా కనిపిస్తున్నది. సప్తమ మారకస్థానంలో రవి, బుధ, శుక్రులున్నారు. వీరిలో బుధ శుక్రులు వక్రించి ఉన్నారు. శుక్రుడు తీవ్రంగా అస్తంగతుడైనాడు. నవాంశలో గమనిస్తే అష్టమభావంలో నీచరాహువున్నాడు. 

పెద్దగా వివరణ అవసరం లేదు. ఇవన్నీ కలసి, ఈ పాపకు బాలారిష్టాన్ని కలిగించాయి.

జపాన్ స్కూళ్లలో మోడలింగ్ ని కూడా ఒక క్రీడలాగా పిల్లలకు నేర్పిస్తారు. దానికోసం లోషన్లు, క్రీములు, సౌందర్య సాధనాల వాడకాన్ని చిన్నప్పటినుండే  నేర్పిస్తారని వేరే చెప్పనవసరం లేదు. వాటిల్లో ఏయే కెమికల్స్ ఉంటాయో ఎవరికీ తెలీదు.

25 తేదీన ఉదయం 4 గంటలకు హార్ట్  ఎటాక్ తో నిద్రలోనే ఈ అమ్మాయి చనిపోయింది. తెల్లవారుజామనేది హార్ట్ ఎటాక్స్ కు ఎంతో ఇష్టమైన సమయం. చెప్పడం మాత్రం, న్యుమోనియా వల్ల, మయోకార్డయిటిస్ వచ్చి చనిపోయిందని చెబుతున్నారు. మయోకార్డయిటిస్  అంటే, గుండె కండరాల వాపు. ఇది తీవ్రమైన శరీరశ్రమవల్లా, అనవసరమైన మందుల వాడకం వల్లా వస్తుంది. జెనెటిక్ కారణాలు కూడా ఉంటాయి. ఈ జాతకంలో ఈ వ్యాధి తల్లివైపునుండి వచ్చిందని అర్థమౌతోంది.

ఈ పాపను 5 ఏళ్లనుంచే మోడలింగ్ లో పెట్టారట. ఇక చెప్పుకోడానికేముంది? పెద్దల ఇష్టాలను పిల్లలపైన రుద్ది, వాళ్ళ ఆరోగ్యపరిస్థితిని గమనించకుండా విపరీతమైన ఒత్తిడికి వాళ్ళను గురిచేస్తుంటే ఇలా జరగక ఇంకెలా జరుగుతుంది?

'బుద్ధి కర్మానుసారిణి' అని ఊరకే అనలేదు మరి ! 

బుద్దీ, కర్మా రెండూ వెర్రితలలేస్తున్న నేటికాలంలో ఎవరికైనా సరే, ఏం చెప్పగలం?