“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

18, ఫిబ్రవరి 2022, శుక్రవారం

శ్రీమద్రామానుజాచార్యుల వారి జాతక విశ్లేషణ - 8

1045 AD నుండి 1095 AD వరకు అంటే, ఏభై ఏళ్లపాటు ఆయన శ్రీరంగం కేంద్రంగా ఉంటూ ఇతర క్షేత్రాలను తిరుగుతూ ధర్మప్రచారం చేస్తూ గడిపారు. ఈ క్రమంలో వైష్ణవమతాన్ని బాగా ప్రచారం లోకి తీసుకుని వచ్చారు. చాలామందిని తన మార్గంలోకి మార్చారు. వీరిలో కొందరు అద్వైతులు కూడా ఉన్నారు.

ఈ సమయంలో వీరి జీవితంలో శని, బుధ, కేతు, శుక్ర దశలు నడిచాయి. 1061 AD లో శనిదశ అయిపోయింది. 1078 AD వరకూ బుధదశ నడిచింది. ఉచ్ఛసూర్యునితో కలసి ఉన్న బుధదశ గనుక ఈ దశలో ధర్మప్రచారం బాగా సాగింది. తరువాత, 1085 AD వరకూ సాగిన కేతుదశలో పంచమంలోని ఉచ్చకేతువు వల్ల తపోపరమైన అంతరిక జీవితం ఊపందుకుని  ఉంటుంది . శిష్యవర్గం పెరిగి ఉంటుంది. తరువాత మొదలైన 20 ఏళ్ల శుక్రదశ ఈయన జీవితాన్ని ఊహించని మలుపులు త్రిప్పింది.

అది 1095 AD. అప్పటికి ఆచార్యులవారికి 78 ఏళ్ళు వచ్చాయి. ఆ వయసులో ఆయనకు కరికాలచోళుడనే రాజుతో విరోధం ఏర్పడింది. కరికాలుడు శైవుడు. ఆయనకు వైష్ణవంగిట్టదు. కనుక వైష్ణవులను అణచివేశాడు. ఆ అణచివేతను తట్టుకోలేక, రామానుజులు శ్రీ రంగాన్ని వదలి కర్ణాటక రాష్ట్రానికి పారిపోయారు.

అది 1096 వ సంవత్సరం. అప్పుడాయన జీవితంలో శుక్ర/గురుదశ నడిచింది. శుక్రుడు ఉచ్ఛసూర్యునితో కలసి ఉంటూ రాజులను సూచిస్తున్నాడు. చతుర్ధాన్ని చూస్తూ సొంత ఊరిలో ఉండలేకపోవడాన్ని సూచిస్తున్నాడు. గురువు షష్ఠాధిపతిగా  రాజులతో శతృత్వాన్నిస్తున్నాడు. కనుక శ్రీ రంగాన్ని వదలి కర్ణాటక రాష్ట్రానికి పారిపోయాడు.  

ఆ తరువాత ఆయన జీవితంలో 1097 AD నుండి 1101 AD వరకు శుక్ర/శనిదశ జరిగింది. మీకు గుర్తుందా? 32 ఏళ్ల వయసులో శని/శుక్ర దశలో ఆయన సన్యాసాన్ని స్వీకరించి, తన సొంతఊరైన కంచివీధులలో భిక్షాటనం చేశారు. తరువాత 79 ఏళ్ల వయసులో శుక్ర/శనిదశలో, శ్రీరంగంలో తన వైభవాన్ని విడచిపెట్టికర్ణాటకకు పారిపోయి అక్కడ తలదాచుకుని మళ్ళీ క్రొత్త జీవితాన్ని మొదలుపెట్టవలసిన పరిస్థితి ఎదురైంది. చూశారా గ్రహప్రభావం ఏ విధంగా పనిచేసిందో?

కాళిదాసు చెప్పిన సూత్రం మళ్ళీ ఈ విధంగా నిజమైంది. ఎన్ని సార్లైనా ఇది నిజమౌతూనే ఉంటుంది.  ఎంతమంది జీవితాలలోనైనా రుజువౌతూనే ఉంటుంది. ఇదే కాదు. ఇలాంటివే ఎన్నో జ్యోతిష్యశాస్త్రసూత్రాలు, అర్ధం చేసుకుంటే నిత్యసత్యాలుగా ప్రతిరోజూ కళ్ళముందు కనిపిస్తూనే ఉంటాయి. అందుకే, నేను బోధించే సాధనామార్గంలో చెబుతాను. "మీ కర్మ మ్యాప్ ను అర్ధం చేసుకోవాలంటే రెండు దారులున్నాయి. ఒకటి, సాధన. రెండు, జ్యోతిష్యశాస్త్రం. రెండింట్లో ఏదో ఒకటి తీసుకోండి. చేతనైతే రెండూ తీసుకోండి. మీ జీవితాన్ని అర్ధం చేసుకోండి, మిమ్మల్ని మీరు మార్చుకోండి, ఎదగండి" అని. ఎందుకంటే, మీ కర్మను జయించాలంటే ఈ రెండూ తప్ప వేరే దారులు లేవు.

కర్ణాటకరాష్ట్రంలో నివాసం ఏర్పరచుకున్న ఆయన, 1098 AD లో 'మేల్కొటే' అనే ఊరిలో ప్రసిద్ధమైన విష్ణు ఆలయాన్ని నిర్మింపజేశారు. 1099 AD లో 82 ఏళ్ల వయసులో బిట్టిదేవుడనే హొయసల రాజును వైష్ణవునిగా మార్చి ఆయనకు 'విష్ణువర్ధనుడ'ని నామకరణం చేశారు. ఈ సమయంలో శుక్ర/శని దశలలో సూర్య అంతర్దశ నడిచింది. ఉచ్ఛసూర్యుడు ఈ సారి కర్ణాటక రాజును ఈయన శిష్యునిగా చేశాడు. 

1101 AD లో 84 ఏళ్ల వయసులో ఈయనకు శుక్ర/శనిదశ అంతమైంది. 1105 AD నుండి 1111 AD వరకూ జరిగిన సూర్యమహాదశలో కర్ణాటక రాష్ట్రంలో ధర్మప్రచారం చేసి గొప్ప పేరును పొందారు.  1111 AD నుండి మొదలైన చంద్ర మహర్దశ, గజకేసరీ యోగం వలన మంచి ఫలితాలను ఇచ్చింది. 1117 AD లో చంద్ర/బుధ దశలో బేలూర్ ఆలయ నిర్మాణం జరిగింది.

1117 AD లో 100 ఏళ్ల వయసులో ఆయన బేలూర్ ఆలయాన్ని నిర్మింపజేశారు. దీని శిల్పకళ ఈనాటికీ ఒక అద్భుతంగా పరిగణింపబడుతున్నది. తురక రాక్షసుల దుర్మార్గాలకు బలి కాకుండా నిలిచిన అద్భుతమైన ఆలయాలలో ఇదీ ఒకటి. 

1118 AD లో 101 ఏళ్ల వయసులో మేల్కొటే, బేలూర్ లలో జరిగిన ఆలయఉత్సవాలలో ఒక క్రొత్త ఆచారాన్ని మొదలుపెట్టారు. ఆలయాల రథయాత్రలో పంచములకు ప్రవేశం కల్పించడమే గాక, రధాన్ని లాగే ఉత్సవంలో వారికి అవకాశాన్ని కల్పించారు. అంటే, వెయ్యేళ్లనాడే నేటి SC/ST లకు ఆలయప్రవేశాన్ని, ఉత్సవాలలో ప్రవేశాన్ని ఆయన మొదలుపెట్టారు. ఇదెంత గొప్ప విషయమో గమనించండి ! ఆ కాలంలో ఆయన మొదలుపెట్టిన ఆచారం, ఆగకుండా ఆ ఆలయాలలో నేటికీ కొనసాగుతూనే ఉంది.

1119 AD లో 110 ఏళ్ల వయసులో చంద్ర/శుక్ర/గురుదశలో 'మేల్కొటే' లో యతిరాజమఠాన్ని స్థాపించారు. 1120 AD లో 111 ఏళ్ల వయసులో చంద్ర/శుక్ర/శనిదశలో కర్ణాటక రాష్ట్రాన్ని వీడి, శ్రీరంగానికి తిరిగి వచ్చారు. ఈ సంఘటన జరిగినప్పుడు కూడా అంతర్దశ, విదశలలో శుక్ర శనులు కనిపించడాన్ని గమనించండి ! కనుక ఆ సమయంలో, 25 ఏళ్లుగా నివసిస్తున్న కర్ణాటక రాష్ట్రాన్ని శాశ్వతంగా వదలిపెట్టి మళ్ళీ సొంత ఊరికి తిరిగి రావడం జరిగింది. సూత్రం మళ్ళీ రుజువైంది చూచారా మరి !

ఆ తరువాత 17 ఏళ్లపాటు శ్రీరంగంలో ఉన్నారు.  ఆ సమయంలోనే 7 ఏళ్ల కుజదశ ఆయన జీవితంలో జరిగింది. ఆ సమయంలో, సంస్ధాగతమైన గొడవలు, మఠశాఖలను చక్కదిద్దడము, శిష్యుల మధ్యన ఆధిపత్యపోరు ఇలాంటివన్నీ ఆయన చూచారు. కారణం ! లగ్నంలో ఉన్న పంచమాధిపతియైన నీచకుజుని దశ జరగడమే. చివరకు, 1137 లో 120 ఏళ్ల వయసులో శ్రీరంగంలోనే దేహత్యాగం చేశారు.

ఆ సమయంలో ఆయనకు మళ్ళీ రాహుదశ మొదలైంది. ఆయన పుట్టినది రాహుదశలోనే. 120 ఏళ్ల వింశోత్తరీ దశ ఒక పరిభ్రమణాన్ని పూర్తిచేయగా, మళ్లీ రాహుదశ ఆయన జీవితంలో మొదలైంది. రాహు/బుధ/ చంద్ర/ శని దశలో 11-2-1137 న మాఘశుక్ల దశమి నాడు తన సుదీర్ఘ జీవనయాత్రను పరిసమాప్తం గావించి నారాయణుని పాదసన్నిధికి ఆయన చేరుకున్నారు.

చంద్రలగ్నాత్ రాహువు ద్వాదశంలో ఉచ్చస్థితిలో ఉన్నాడు. ఇది ఉత్తమమైన మరణానికి సూచన. బుధుడు లగ్నాధిపతిగా తననే సూచిస్తున్నాడు. చంద్రుడు మారకునిగా లగ్నంలో ఉన్నాడు.  శని అష్టమాధిపతిగా సప్తమ మారకస్థానంలో ఉంటూ చంద్రలగ్నాన్ని చూస్తున్నాడు.  కనుక ఖచ్చితమైన ఆ దశాంతర్దశలలో మరణం సంభవించింది.

ఈ సందర్భంగా ఒక అద్భుతాన్ని చెప్పుకోకపోతే ఈ కధ సమాప్తం కాదు.

భౌతికంగా కూడా ఆయనను వదలి ఉండలేని శిష్యులు, ఆయన అనుమతితో, ఆయన దేహాన్ని కర్పూరం, పసుపు మొదలైన ద్రవ్యాలతో తాపడం చేసి, శ్రీరంగంలోని ఆలయంలో భద్రపరచారని అంటారు. ఆ విగ్రహం ఈ నాటికీ ఉన్నది. దానిని నీటితో కడగరు, ఏడాదికి రెండుసార్లు కేవలం కర్పూరం పసుపులతో అద్దుతారు. అంతే ! బయటకు విగ్రహంగా కనిపించే దానిలోపల రామానుజులవారి దేహం నిక్షిప్తమై ఉన్నదంటారు. అంటే, ఆయుర్వేద పద్ధతుల ద్వారా మమ్మీగా మార్చిన ఆయన దేహమే ఈనాడు శ్రీరంగం ఆలయంలోని 'యతిరాజాలయం' లో మనకు కనిపిస్తున్న రామానుజుల విగ్రహంలోపల ఉన్నది !  వెయ్యేళ్ళనుంచీ అది చెడిపోకుండా భద్రంగా ఉన్నదంటే అది  అద్భుతం కాదా మరి !

ఎంతో ఉత్తములైన వారికి మాత్రమే ఇంతటి పూర్ణాయుర్దాయం పడుతుంది. అయితే, నేడుకూడా  100 ఏళ్ళు దాటి బ్రతుకుతున్నవారు జపాన్ వంటి ఎన్నో దేశాలలో ఉన్నారు. జీన్స్ గట్టివైతే, ఆహారనియమం పాటిస్తూ, సరియైన వ్యాయామం చేస్తూ ఉంటే నూరేళ్లు ఆరోగ్యంగా బ్రతకడం సాధ్యమే. కానీ ఆ బ్రదుకు ఎలా బ్రతికామన్నదే అసలైన విషయం.  ఎంతసేపూ, తిండి, ఆస్తులు, సరదాలు, సుఖాలు ఇవే పరమావధిగా నూరేళ్లు బ్రతికినా వెయ్యేళ్ళు బ్రతికినా  అది వృధాబ్రతుకే అవుతుంది. దైవధ్యానంలో ఉంటూ, లోకాన్ని మంచిమార్గంలో నడిపిస్తూ, పవిత్రమైన జీవితాన్ని గడుపుతూ, అన్నేళ్లు బ్రతకగలిగితే అది ధన్యమైన పూర్ణమైన జీవితమౌతుంది. అటువంటి దివ్యమైన జీవితం ఆయనకు లభించింది !

ఆయన గతించిన వెయ్యేళ్లకు, హైదరాబాద్ నగరంలో ఆయన యొక్క అతిపెద్ద విగ్రహం ఏర్పాటు ద్వారా లోకానికి మళ్ళీ ఆయనను గురించి తెలుసుకునే అదృష్టం కలిగింది ! హైదరాబాద్ కు ధన్యత్వం పట్టింది !

యాభై ఏళ్ల క్రిందటి వరకూ హైదరాబాద్ అంటే, చార్మినార్ ను, గోల్కొండ శిధిలాలను, సాలార్ జంగ్ మ్యూజియాన్ని చెప్పేవారు. తరువాత కాలంలో బిర్లా మందిర్ ను, బుద్ధవిగ్రహాన్ని చెబుతున్నారు. ఇన్నాళ్లకు రామానుజుల విగ్రహంతో హైదరాబాద్ ను రామానుజుల వారి పేరుతో గుర్తించే మంచిపని జరిగింది. ఇదొక మంచి పరిణామం !

మన దేశం పైన దండెత్తి, లక్షలాది మంది భారతీయులను చంపి, మన దేవాలయాలను ధ్వంసం చేసి, మన గ్రంధాలను తగలబెట్టి, మన సంస్కృతిని నాశనం చేసిన, చేస్తున్న, ముస్లిం కిరాతకుల పేర్లు మనకెందుకు? మన దేవతల పేర్లతో, మన దేవాలయాల పేర్లతో, మహనీయులైన మన గురువుల పేర్లతో, మన రాజుల పేర్లతో మన ఊర్లను గుర్తుంచుకునే పని ఎంత త్వరగా జరిగితే అంత మంచిది ! ఇది మన దేశంలోని ప్రతి రాష్ట్రంలోనూ, ప్రతి ఊరిలోనూ జరగవలసిన అవసరం ఉన్నది.

-----------------------------------------------------

ఈ సీరీస్ ఇంతటితో అయిపోయింది. దీనిని చదువుతున్న కొందరు, 'విశిష్టాద్వైతాన్ని గురించి, దాని మూలసిద్ధాంతాల గురించి వ్రాయండి' అని నన్ను కోరుతున్నారు. మొదట్లో అలాగే వ్రాద్దామని అనుకున్నాను.  కానీ, ఇదే టాపిక్ మీద వ్రాస్తున్న పుస్తకం ఒకటి శరవేగంతో రూపుదిద్దుకుంటున్నందున, మళ్ళీ బ్లాగులో వ్రాయడమెందుకని ఆగాను.

'త్రిమత సమన్వయము' అనే పేరుతో, ద్వైతాద్వైత విశిష్టాద్వైత సిద్ధాంతములను సమగ్రంగా సమన్వయము గావిస్తూ ఒక గ్రంధాన్ని ప్రస్తుతం వ్రాస్తున్నాను. అది త్వరలో విడుదల అవుతుంది. దానిలో విశిష్టాద్వైత సిద్ధాంతాన్ని ఒక అధ్యాయంలో పొందుపరచాను. దానిని చదవమని వారిని కోరుతున్నాను.

శ్రీరామకృష్ణుల వారి బోధనల వెలుగులో త్రిమతాలనూ సమన్వయపరుస్తూ ఇటువంటి గ్రంథమొకదానిని వ్రాయాలని వివేకానందస్వాముల వారికి ఒక కోరిక ఉండేది. ఆయన ఇంకా కొన్నేళ్లు బ్రదికి ఉన్నట్లయితే ఆ పనిని చేసి ఉండేవారు. కానీ ఆ కోరిక తీరకుండానే ఆయన కన్నుమూశారు. రామకృష్ణామిషన్ స్వామీజీలు ఎవరైనా ఈ పనిని చేశారేమో నాకైతే తెలియదు. నాకు తెలిసినంతవరకూ అయితే ఎవరూ చేయలేదు.  ఈ పనిని ప్రస్తుతం నేను తలపెట్టాను. దీనిని చేయడం ద్వారా వివేకానందస్వాములవారి చివరి కోరికలలో ఒకదానిని నేను నేరవేర్చాలని భావిస్తున్నాను.

నేను స్వతహాగా అద్వైతాభిమానిని అయినప్పటికీ, ద్వైతాన్ని, విశిష్టాద్వైతాన్ని కూడా సమానంగా గౌరవిస్తాను. అభిమానిస్తాను. దీనికి కారణం? సర్వ సాంప్రదాయాలనూ సమన్వయము చేసిన శ్రీరామకృష్ణులవారి సరళములైన బోధనలే. చిన్నప్పటినుంచీ వాటి వెలుగులో పెరిగిన నేను, మూడు సాంప్రదాయాలనూ  అర్ధం చేసుకున్నాను గనుకనే, వాటిని సమానంగా గౌరవిస్తాను.

త్రిమతాల మధ్యన ద్వేషాలు గొడవల రోజులు పోయాయి. 'శివుడే గొప్ప, నారాయణుడే గొప్ప' అంటూ కొట్టుకునే చీకటియుగాలలోకి మనం మళ్ళీ వెళ్ళకూడదు. ఇద్దరూ ఒకే దైవం యొక్క రెండు రూపాలన్నది అసలైన సత్యం. ఈ సత్యం అర్ధమైతే ఏ గొడవా లేదు. ఆధ్యాత్మిక సాధనాక్రమంలో ఈ ద్వైతాద్వైత విశిష్టాద్వైతాలు మూడూ మూడు మెట్లవంటివన్న సత్యం అర్ధమైతే, ఏ గొడవా ఉండదు. దీనినే నా పుస్తకంలో వ్రాయబోతున్నాను.

మహనీయుల చరిత్రలను అధ్యయనం చేయడం, వారి అడుగుజాడలలో నడవడం - ఇవేగా మనలాంటి సామాన్యులు చేయవలసినది ! మానవజీవితానికి ఇంతకంటే ఉత్తమమైన గమ్యం ఏముంటుంది గనుక?

(అయిపోయింది)

read more " శ్రీమద్రామానుజాచార్యుల వారి జాతక విశ్లేషణ - 8 "

16, ఫిబ్రవరి 2022, బుధవారం

శ్రీమద్రామానుజాచార్యుల వారి జాతక విశ్లేషణ - 7

1049 AD లో 32 ఏళ్ల వయసులో సన్యాసం స్వీకరించిన తర్వాత కొంతకాలం పాటు ఆయన శ్రీరంగంలోనే ఉన్నారు. సమయంలో జరిగిన ముఖ్యమైన సంఘటనలలో ఒకటి, ఒకప్పటి తన గురువైన యాదవప్రకాశుడు వైష్ణవమతాన్ని స్వీకరించి రామానుజులవారి శిష్యుడుగా మారడం.

సన్యాసం స్వీకరించిన అతి త్వరలోనే రామానుజులవారి కీర్తి దేశమంతటా వ్యాపించడం మొదలైంది. కులభేదాలను, వర్గభేదాలను చూడకుండా విష్ణుభక్తిని అందరికీ సమానంగా బోధించడం ఆయన ప్రత్యేకత. ఇది కొందరి కినుకకు కారణమైనప్పటికీ, నిజమైన జిజ్ఞాసువులకు మాత్రం అమృతప్రాయంగా తోచింది. వారి చుట్టూ అనేకమంది శిష్యులు పోగవ్వడం మొదలుపెట్టారు. ఆయన చెప్పే బోధలను వింటూ,  శాస్త్రచర్చలను చేస్తూ, జీవితాలను పునర్నిర్మించుకుంటూ వారు ఉండేవారు.

ఇదిలా ఉండగా, ఒకరోజున యాదవప్రకాశుడు వరదరాజస్వామి ఆలయానికి వచ్చినపుడు, అక్కడ రామానుజులు తన శిష్యులకు జ్ఞానబోధ చేయడం గమనించాడు. యాదవప్రకాశుడు స్వతహాగా మంచివాడే, కానీ పండితాహంకారమూ, గురువుననే అహంకారమూ ఆయన కళ్ళకు పొరలను కమ్మించాయి. అయితే, చీకటిజాడలు మానవుని హృదయంలో  ఎల్లకాలం ఉండలేవు. మానవుడు వెలుగు వైపు ప్రయాణించవలసిందే. అది ఈరోజు కాకపోతే రేపు. కానీ ఏదో ఒక రోజున అతడా పనిని చేయక తప్పదు. ఇది  ప్రకృతిశాసనం.  ఆధ్యాత్మిక ప్రయాణాన్ని మనం ఎన్నాళ్లయినా వాయిదా వేస్తూ పోవచ్చు, కానీ దానిని పూర్తిగా తప్పించుకోలేము. అదెవ్వరికీ సాధ్యం కాదు. యాదవప్రకాశునిలో అంతర్మధనం మొదలైంది. ప్రస్తుతం పశ్చాత్తాపం ఆయనను దహిస్తోంది. దానికి తోడుగా, వారి తల్లిగారు కూడా, రామానుజుల బాటలో నడవమని ఆయనకు హితబోధ చేయసాగింది.

ఒకరోజున ఆయన కాంచీపూర్ణుని కలుసుకుని విధంగా అన్నారు.

'మహానుభావా ! నీవు పిలిస్తే నారాయణుడు పలుకుతాడని అందరూ అనుకుంటారు. రామానుజులకు నేను చేసిన ద్రోహం నన్ను లోలోపల  కాలుస్తున్నది. నాకు నిద్ర పట్టడం లేదు. బాధనుంచి బయటపడే మార్గమేంటో నాకు ఉపదేశించండి'

శూద్రుడంటూ ఒకప్పుడు తానే దూరం ఉంచిన కాంచీపూర్ణుని దగ్గరకు స్వయానా ఒక సాంప్రదాయానికి గురువైన యాదవప్రకాశుడు వెళ్లి, విధంగా వినయపూర్వకంగా ఆయనను అడగడమే, ఆయన పైన దైవానుగ్రహం వర్షించడం మొదలైందనడానికి గుర్తు !

ఆయనతో కాంచీపూర్ణుడిలా అన్నాడు.

'అయ్యా ! మీ బాధ నాకర్ధమైంది. ప్రస్తుతం మీరు ఇంటికి వెళ్ళండి. నేను వరదరాజస్వామిని ప్రార్ధిస్తానుఆయన కరుణామయుడు. నీకు సమాధానం దొరుకుతుంది'

అదే రోజు రాత్రి చాలాసేపు నిద్రపోకుండా గతాన్ని గురించి, తన కుట్ర గురించి, రామానుజులవారి సత్ప్రవర్తన గురించి ఆలోచిస్తూ, కుమిలిపోతూ గడిపిన యాదవప్రకాశునికి మాగన్నుగా నిద్ర పట్టింది. కలలో ఆయనకు నారాయణుని దర్శనమైంది. రామానుజులవారి శిష్యునిగా మారమనిన మార్గనిర్దేశం ఆయనకు లభించింది.

నిద్రలేచిన యాదవప్రకాశుడు రోజంతా ఆలోచించి, సాయంత్రానికి రామానుజుల వారి దర్శనానికి వచ్చాడు. శాస్త్రాలపరంగా తనకున్న సందేహాలను ఆయన ముందుంచాడు. అప్పుడు రామనుఁజులవారు వినయంగా ఇలా అన్నార్థు.

'ఈ సందేహాలను నేను తీర్చనవసరం లేదు. ఇతను కూరేశుడనే నా శిష్యుడు. ఇతను మీ సందేహాలను తీరుస్తాడు'

అప్పుడు కూరేశుడు, వేదోపనిషత్తుల నుంచీ, పురాణేతిహాసాల నుండీ యుక్తి యుక్తములైన ప్రమాణాలను పుంఖానుపుంఖాలుగా వల్లిస్తూ, భక్తిమార్గం యొక్క ఔన్నత్యాన్ని గురించి మాట్లాడి, ఆయన సందేహాలను పటాపంచలు గావించాడు. యాదవప్రకాశులకు విషయం అర్ధమైంది. ఆయనకు పట్టి ఉంచిన పండితాహంకారం పటాపంచలైంది.

తన తప్పులను ఒప్పుకుని, రామానుజులవారి పాదాలపైన పడి ఏడుస్తూ యాదవ ప్రకాశుడిలా అన్నాడు.

' యతిరాజా ! గర్వం తలకెక్కి విధంగా ప్రవర్తించాను. తప్పు చేశాను. నీకు ద్రోహం తలపెట్టాను. ప్రతిరోజూ నిన్ను నా ముందు చూస్తూ కూడా నీ ఔన్నత్యాన్ని తెలుసుకోలేకపోయానునీచేత సేవలను చేయించుకున్నాను. ప్రస్తుతం నా కళ్ళు తెరుచుకున్నాయి. పశ్చాత్తాపం నన్ను దహిస్తోంది. నన్ను నీ శిష్యునిగా స్వీకరించు. నాకు దారిని చూపించు, నన్నుద్ధరించు'.

విధంగా తపిస్తూ, తన పాదాలపైన పడి క్షమార్పణ కోరిన ఆయనను రామానుజులవారు ప్రేమగా లేవనెత్తి దగ్గరకు తీసుకుని ఓదార్చారు. వైష్ణవధర్మమంటే ఆయనకున్న ఇతర సందేహాలను  తీర్చి, 'గోవిందదాసుడ'ని నామకరణం చేసి, వైష్ణవమార్గంలోకి ఆయనను స్వీకరించారు. క్రొత్త జీవితాన్ని మొదలుపెట్టిన యాదవప్రకాశుడు , అతి త్వరలోనే తన తప్పులను అధిగమించి ఆధ్యాత్మికమార్గంలో శరవేగంతో పురోగమించసాగాడు. నిజాయితీగా ప్రయత్నిస్తే అంతరికమార్గంలో అడ్డంకులన్నీ క్షణాలలో దూదిపింజలలాగా తేలిపోతాయి. తన భక్తులను ఉద్ధరించకుండా భగవంతుడు మాత్రం ఎలా ఉండగలడు?

ఇదంతా, శని/శుక్ర/కేతుదశలో 1051 AD లో నవంబర్, డిసెంబర్ నెలలలో జరిగింది. చంద్ర లగ్నాత్ శని, గురువును సూచిస్తున్నాడు. శుక్రుడు పంచమాధిపతిగా శిష్యునికి సూచకుడు. కేతువు లగ్నాత్ పంచమంలో ఉచ్ఛస్థితిలో ఉన్నాడు.  శని, వక్రియై ఆయనను కలుస్తున్నాడు. ఈ కారణాల వల్ల ఈ దశలో గురువే శిష్యుడయ్యాడు.

కాలక్రమంలో గోవిందదాసుని అంతరిక పురోగతిని గమనించిన ఆచార్యులు ఇలా అన్నారు.

'గోవిందదాసా ! నీ మనస్సు ఇప్పుడు అత్యంత పరిపక్వమైంది. పరిశుద్ధతను పొందింది. నీలో కల్మషాలు  మాయమయ్యాయి. కానీ, నీవు గతంలో చేసిన పాపాలు మొత్తం మాయం కావాలంటే, వైష్ణవధర్మాలను వివరిస్తూ నీవొక గ్రంధాన్ని వ్రాయి. అప్పుడు నీ గతకర్మ కూడా భస్మమౌతుంది'

మాటలను శిరసావహించిన గోవిందదాసుఁడు, 'యతిధర్మ సముచ్ఛయము' అనే ఒక అద్భుతమైన గ్రంధాన్ని రచించాడు. వైష్ణవసాధువులకు ఈనాటికీ వారి ఆశ్రమ విధులలో ఒక కరదీపికలాగా ఈ గ్రంధం ఉపయోగపడుతున్నది.

సమయానికి యాదవప్రకాశులకు 80 ఏళ్ళు దాటాయి. తరువాత కొంతకాలానికే, రామానుజులవారి సమక్షంలో ఆయన ప్రశాంతంగా దేహత్యాగం చేసి నారాయణుని పాదసన్నిధికి చేరుకున్నాడు.

విధంగా, రామానుజులవారి ఒకప్పటి గురువే, చివరకు ఆయనకు శిష్యుడయ్యాడు. ఇటువంటి అద్భుతాన్ని మళ్ళీ శ్రీ రామకృష్ణుల వారి జీవితంలో మాత్రమే మనము గమనించవచ్చు. ఆయనకు  గురువులైన వారందరూ, చివరకు ఆయన దగ్గరే నేర్చుకుని,  ఆధ్యాత్మిక జీవితంలో మరింత ఔన్నత్యాన్ని పొందారు. ధన్యులయ్యారు.

(ఇంకా ఉంది)

read more " శ్రీమద్రామానుజాచార్యుల వారి జాతక విశ్లేషణ - 7 "