“అసమర్ధజాతికి ఆత్మగౌరవ అర్హత ఉండదు"

29, అక్టోబర్ 2020, గురువారం

'యోగశిఖోపనిషత్' ప్రింట్ పుస్తకం విడుదలయ్యింది.

'పంచవటి పబ్లికేషన్స్' నుంచి మరొక్క మహత్తరమైన గ్రంధం 'యోగశిఖోపనిషత్' ను ప్రింట్ పుస్తకంగా ఈరోజున విడుదల చేశామని చెప్పడానికి చాలా సంతోషిస్తున్నాము. ఈ కార్యక్రమం హైదరాబాద్ లోని మా ఇంటి నుండి నిరాడంబరంగా జరిగింది.

ఈ పుస్తకం వ్రాయడంలో నాకు చేదోడువాదోడుగా ఉంటూ సహకరించిన నా శ్రీమతి సరళాదేవికి, శిష్యురాళ్ళు అఖిల, శ్రీలలితలకు, కవర్ పేజీని అద్భుతంగా చేసి ఇచ్చిన నా శిష్యుడు ప్రవీణ్ కు, నా కృతజ్ఞతలు ఆశీస్సులు తెలియజేస్తున్నాను.

read more " 'యోగశిఖోపనిషత్' ప్రింట్ పుస్తకం విడుదలయ్యింది. "

21, అక్టోబర్ 2020, బుధవారం

Online Sri Vidya - 1

మొన్నొక రోజున ఫోన్ మ్రోగింది. యధాలాపంగా ఫోన్ వంక చూశా.

మా ఫ్రెండ్ రవి ఫోన్ చేస్తున్నాడు.

మేమిద్దరం మూడు దశాబ్దాలుగా స్నేహితులం. తన జీవితం ఏ మలుపు తిరిగినా, ఏ సంఘటన  జరిగినా నాకు చెబుతూ ఉంటాడు. నా సలహా అడుగుతాడు. కానీ నేను చెప్పినది వినడు. తనకు లోపల ఉన్నదే చేస్తూ ఉంటాడు.

నేనేదీ పూర్తిగా చెప్పనని తనకు అనుమానం. ఆ విషయం నాకు తెలుసు. నాకు తెలుసని తనకూ తెలుసు.  చెప్పేది వింటాడు, కానీ నన్ను నమ్మడు, ఈ క్రమంలో రకరకాల స్వాముల చుట్టూ తిరుగుతూ ఉంటాడు. ఈ సరదా గత ఇరవై ఏళ్ళనుంచీ జరుగుతూనే ఉంది.

'మళ్ళీ ఏమొచ్చిందో?' అనుకుంటూ ఫోన్ ఎత్తాను.

ఫోనెత్తుతూనే ఉపోద్ఘాతం అంటూ ఏమీ లేకుండా 'అరుణానందస్వామి మీద నీ అభిప్రాయం ఏమిటి?' అన్నాడు.

'అదేంటి 'అరుణ' అని ఆడపేరు పట్టుకుని స్వామి అంటావు?' అన్నా కుతూహలంగా.

'ఏమో నాకూ తెలీదు. అలా ఉంది పేరు నెట్లో' అన్నాడు.

'ఓహో ! స్వామీజీల కోసం నెట్లో వెతుకుతున్నావా?' అనుకుంటూ - 'ఇంతకీ ఏం చేస్తాడాయన?' అడిగా, మనవాడి హాబీలు తెలుసు గనుక.

'ఆన్ లైన్ శ్రీవిద్య నేర్పిస్తాట్ట.  నేర్చుకుందామని అనుకుంటున్నా' అన్నాడు.

నవ్వుతో కొరపోయింది నాకు.

'ఏం? అంత ఎగతాళిగా ఉందా? ఆయనకు పెద్ద సంస్థ ఉంది' అన్నాడు.

'సరే ఉంటే ఉండనీయ్ గాని, నీకు ఉన్నట్టుండి శ్రీవిద్య మీద మనసు మళ్ళిందేమిటి?' అడిగాను.

'కొత్తగా మళ్ళింది ఏమీ లేదులే. ఎప్పటినుంచో ఉంది. నువ్వేమో నేర్పమంటే నేర్పవు, మరి నేనేం చెయ్యాలి?' అన్నాడు నిష్టూరంగా.

నాకు మళ్ళీ నవ్వొచ్చింది.

'ఇదేమైనా 'బగారా బైగన్' అనుకున్నావా ఆన్ లైన్లో నేర్పడానికి? శ్రీవిద్యను ఆన్లైన్ లో నేర్పడం అసంభవం' అన్నాను ఈ మధ్యనే వచ్చిన ఒక మెయిల్ ను గుర్తు చేసుకుంటూ.

పాపం ఒక యువకుడు ఈ మధ్యనే నాకు మెయిల్ ఇచ్చాడు.

'నమస్తే గురూజీ ! నేను శ్రీవిద్య నేర్చుకుందామని అనుకుంటున్నాను. మీరు నేర్పగలరా? మీ ఫీజు ఎంతో చెబితే నేను చెల్లించడానికి సిద్ధం. కాకపోతే ఒక్క విషయం. నేను ఇంకా విద్యార్ధినే. మేముండేది తమిళనాడులో. మా అమ్మా నాన్నా నన్ను వేరే రాష్ట్రానికి పంపరు. నేను మీ దగ్గరికి రాలేను. మీరు ఆన్లైన్  క్లాసులు ఏమైనా పెడితే నేను చేరడానికి సిద్ధం. ఏ సంగతీ వెంటనే చెప్పండి'.

దానికి క్లుప్తంగా ఇలా జవాబిచ్చాను.

'చూడు నాయన. శ్రీవిద్యను ఆన్లైన్ లో నేర్పడం కుదరదు. అది జరిగేపని కాదు. అలా నేర్పడానికి అదొక వొకేషనల్ కోర్సు కాదు. నీ డబ్బులు నాకక్కర్లేదు. సారీ'.

ఆ విషయం గుర్తొచ్చింది. అదే విషయం రవితో చెప్పాను.

'ఇలా అయితే ఎలా? నువ్వేమో చెప్పవు. పోనీ మేమే వెతుక్కుంటుంటే 'వాడు దొంగగురువు. వీడు మంచివాడు కాదు. మోసపోతావు. వద్దు' అంటూ వెనక్కు లాగుతావు. ఎలా నీతో?' అన్నాడు.

నవ్వాను.

'నా పుస్తకాలు శ్రీవిద్యారహస్యం, లలితాసహస్రనామ రహస్యార్ధప్రదీపిక ఉన్నాయా నీ దగ్గర?' అడిగాను.

గతంలో నేనే ఆ పుస్తకాలు రెండూ తనకిచ్చాను చదవమని.

'ఎక్కడో అటక మీద పడేశాను. ఉన్నట్టే గుర్తు' అన్నాడు నిరాసక్తంగా.

'అవి చదువు ముందు. విషయం అర్ధమౌతుంది' అన్నాను.

'అంత ఓపిక మనకులేదులే. నాకు పుస్తకాలు వడవు. డైరెక్ట్ గా శ్రీవిద్య కావాలి' అన్నాడు.

'అయితే నేర్చుకో' అన్నా నవ్వుతూ.

'అదే! నేర్పెవాడికోసం వెతుకుతున్నా. ఈయన మంచిగురువేనా?' అడిగాడు.

'ఏమో నాకేం తెలుసు? నువ్వే వెళ్లి కనుక్కో. వదిలేది వదిల్తేగాని తత్త్వం బోధపడదు మరి' అన్నాను తననింకా ఉడికిస్తూ.

'నీతో పెట్టుకుంటే కాదులేగాని, ఈయన దగ్గర నేర్చుకుంటాను. మొదట్లో ఆరు వేలు కట్టాలిట. అప్పుడు బాలామంత్రం నేర్పిస్తానంటున్నాడు' అన్నాడు.

'ఆ విధంగా మంత్రానికింత అని రేట్లుంటే చేరకు. అది అసలైన శ్రీవిద్య కాదు, మోసపోతావ్' అన్నాను.

'అమ్మ పెట్టాపెట్టదు, అడుక్కు తినానివ్వదు' అన్నట్టుంది నీ సంగతి. నా తంటాలేవో నేనే పడతాలే' అంటూ ఫోన్ పెట్టేశాడు రవి.

నాకు మళ్ళీ నవ్వొచ్చింది.

'దొడ్లో చెట్టు మందుకు పనికిరాదని ఊరకే అనలేదు' అని నవ్వుకుంటూ నా పనిలో నేను తలదూర్చాను.

(ఇంకా ఉంది)

read more " Online Sri Vidya - 1 "