“అసమర్ధజాతికి ఆత్మగౌరవ అర్హత ఉండదు"

27, నవంబర్ 2020, శుక్రవారం

'పిచ్చిగోల' వాట్సప్ గ్రూపు - మైకేల్ ఓ నీల్ రిపోర్ట్

ఒళ్లంతా బద్ధకంగా ఉంది. మనసంతా చిరాగ్గా ఉంది. వెదరంతా ముసురుబట్టింది. ఈ అన్నిటికీ కారణాలున్నాయి.

అసలే పౌర్ణమి ఘడియల్లో ఉన్నాం. ఈ టైమ్ లో పిచ్చోళ్ళ కందరికీ పిచ్చి లేస్తుందని పదేళ్ళనుంచీ చెబుతున్నా. అందులో నవంబర్ లో వచ్చే పౌర్ణమి చాలా పవర్ ఫుల్ గా ఉంటుంది. అందుకే నాకలా ఉందేమో మరి?

అదీగాక రాత్రి నుంచీ టీవీలో చెబుతున్నారు. కొత్త తుపాన్ ట. దానిపేరు నివర్ ట. ఏంటో ఈ పేర్లు? నివ్వర్, సువ్వర్, లవ్వర్, నిరోధ్, విరోధ్ ...  ఛీ ఛీ... చిరాకేసింది. చెత్త న్యూస్.. చెత్త వెదర్.,,చెత్త పేర్లు. పొద్దున్నే లేవాలనిపించక బద్ధకంగా అలా పడుకునుంటే ఫోన్ మోగింది. ఇదొకటి మధ్యలో? అని విసుక్కుంటూ ఫోనెత్తా.

'హలో ! అయాం మైకేల్ ఓనీల్ స్పీకింగ్' అన్నాడు అమెరికా యాసతో.

'వీడెవడు పొద్దున్నే' అనుకుంటూ 'సారీ రాంగ్ నంబర్' అని ఫోన్ పెట్తెయ్యబోతుండగా  '  ఫ్రం ఎఫ్.బీ. ఐ' అన్నాడు.

ఉంకో పౌర్ణమి కేసేమో అనుకుంటూ 'యా టెల్ మీ' అన్నా నేనూ అమెరికా యాసలో.

'మీ గ్రూప్ లోంచి వెళ్ళిపోయిన ఆడంగులందరూ కలసి ఒక కొత్త వాట్సప్ గ్రూప్ పెట్టారని మాకు సమాచారం వచ్చింది' అన్నాడు ఓనీల్.

'ఓ ! నీల్ ! అమెరికానుంచి నాకు ఫోన్ చేసేంత పెద్ద విషయమా అది? అయితే ఏంటి?' అన్నా.

'అదికాదు. దానిపేరు 'పిచ్చిగోల' అని పెట్టుకున్నారు. అది మాకు నచ్చలేదు. అందుకే మీ ఒపీనియన్ కోసం ఫోన్ చేస్తున్నా' అన్నాడు.

'దాందేముంది. పెట్టుకొనీ. వాళ్లకు సెల్ఫ్ రియలైజేషన్ వచ్చేసింది. వాళ్ళేంటో  వాళ్ళకు తెలిసిపోయింది. నీకేంటి బాధ/' అడిగా.

'అందులో వాళ్ళు మాట్లాడుకుంటున్నవన్నీ మేం ట్రాక్ చేస్తున్నాం. వాళ్ళంతా మీ బాధితులే. ఏం మాట్లాడుకుంటున్నారో కేస్ బై కేస్ మీకు చెప్పాలని ఫోన్ చేశా/ అన్నాడు.

'వీడు ఖచ్చితంగా పిచ్చోడే. వదిలేలా లేడు' అనుకుంటూ  'సరే ఏడువ్' అన్నా

సామాన్యంగా ఆడవాళ్ళలో మెంటల్ పోకడలు ఎక్కువగా ఉంటాయన్నది మెడికల్ పరిశోధనలలో తేలిన వాస్తవం. ఎందుకంటే వారి జీవితమంతా  మెన్సస్ సైకిల్ మీద ఆధారపడి ఉంటుంది. అమావాస్యకీ పౌర్ణమికీ వారి మనస్సు బాగా చెదిరిపోతూ ఉంటుంది. దీనికి తోడు ఏవో ఫేమిలీ ప్రాబ్లంస్ ఉండనే ఉంటాయి. ఇవన్నీ కలసి, వాళ్ళు సైకలాజికల్ గా బాగా చెదిరిపోతూ ఉంటారు. వీటికి తోడుగా గుళ్ళూ గోపురాలూ పూజలూ వ్రతాలూ మొదలైన పిచ్చి ఉంటె ఇక చెప్పే పనేలేదు. వారిలో చాలామందికి కావాల్సింది మంచి సైకియాట్రిస్ట్ దగ్గర, మంచి సైకలాజికల్ ట్రీట్మెంట్. అంతేగాని గురువులు సాధనలు కాదు. వీళ్ళంతా మానసికరోగులు. ఇంకా చెప్పాలంటే మెంటల్ పేషంట్లు. ఇవన్నీ మనకు తెలుసు కాబట్టి 'సరే ఏం చెబుతాడో విందాం లే' అనుకుంటూ 'చెప్పు ఒనీల్' అన్నా.

'నేనీయన దగ్గర పదేళ్ళనించీ ఉన్నా. ఎంతో చేశా. కొత్తవాళ్ళని ఎక్కువగా దగ్గరకు తీస్తాడు. పాతవాళ్ళని అస్సలు పట్టించుకోడు. అందుకే విసుగేసి బయటకొచ్చా. ఈ గ్రూప్ పెట్టా' అంటోంది గ్రూప్ ఓనర్ ఒకామె - అన్నాడు ఓనీల్.

'కొత్తనీటిని చూస్తే పాతనీటికి పోటు' అనే సామెత ఊరకే రాలేదు మరి. అంత అసూయ ఉన్నవాళ్ళు ఆధ్యాత్మిక గ్రూప్లో ఎలా ఉండగలరు? వదిలేయ్. నెక్స్ట్.' అన్నా  

'ఈయనకు అమ్మాయిలంటే సాఫ్ట్ కార్నర్ ఉంది. వాళ్ళతోనే ఎక్కువగా మాట్లాడతాడు. అబ్బాయిల్ని పట్టించుకోడు. అందుకే కోపమొచ్చి బయటకొచ్చా' అంటోంది ఇంకొకామె అన్నాడు మళ్ళీ.

'ఆమెకు ఐడెంటిటీ క్రైసిస్ ఉన్నట్లుంది. తను ఏం చెబుతోందో తనకే అర్ధం అవడం లేదు. అబ్బాయిల్ని పట్టించుకోనని కోపమొచ్చి అమ్మాయి బయటకెళ్ళిపోయిందా? అంటే తను అబ్బాయా అమ్మాయా? లేక మధ్యరకమా? ఈ గోల వింటుంటే, నాకే మెంటల్ వచ్చేలా ఉంది. వదిలేయ్. నెక్స్ట్' అన్నా.

'నేనెంత టైట్ టీ షర్టులూ, జీన్స్ పాంట్లూ వేసుకుని ఎన్నిసార్లు ఈయన దగ్గరకి వచ్చినా నన్ను పట్టించుకోలేదు. కనీసం నావైపు ఓరగా కూడా చూడలేదు. ఇంకెందుకు ఇక్కడుండటం? నామీద నాకే నమ్మకం పోతోంది. నేను హర్టయ్యాను. అందుకే విసుగేసి బయటకొచ్చా' అంటోంది ఒకమ్మాయి - అన్నాడు ఓనీల్.

'ఆంజనేయుడి ముందు కుప్పిగంతులా? అని ఒక సామెత తెలుగులో ఉంది తెలుసా నీకు?' అడిగా.

'తెలీదు' అన్నాడు ఓనీల్.

'దానికదే సమాధానం. తనెళ్ళవలసినది ఫేషన్ పెరేడ్ కి. ఒక గురువు దగ్గరకి కాదు. తను ఇప్పటికైనా బయటకెళ్ళడం మాకు చాలా ఆనందంగా ఉందని చెప్పు. వీలైతే ఇంకా కురచ బట్టలున్నాయి వాటిని వేసుకుని వేరేవాళ్ళని ట్రై చేయమని చెప్పు.  నెక్స్ట్' అన్నా.

'నేనుకూడా ఆ సంస్థలో నాలుగేళ్ళున్నాను. నా మాటకి అస్సలు విలువే లేదు. నేను చెప్పినట్లు ఆయన వినాలా? ఆయన చెప్పినట్లు నేను వినాలా? పైగా నన్ను ఒక మనిషిలా కూడా చూడటం లేదు? ఎంతోమంది మీద ఎన్నో చాడీలు చెప్పాను. వాళ్ళలో వాళ్లకి ఎన్నో పుల్లలు పెట్టాలని ఎంతో ప్రయత్నించాను. కానీ నా జిత్తులకి ఆయనా పడటం లేదు. ఆయన ఇన్నర్ సర్కిల్ వాళ్ళూ పడటం లేదు. ఇంకెందుకు నేనక్కడ? వేస్ట్' అందుకే బయటకొచ్చా. మీ గ్రూప్ లో చేరా' అంటోంది ఇంకొకామె - అన్నాడు ఓనీల్.

'ఈమె మహాజ్ఞాని. ఇంత జ్ఞానితో మనం వేగలేం. ఆమె తనంతట తనే బయటకు పోవడం మాకు చాలా మంచిది. మావైపు తిరిగి చూడొద్దని చెప్పండి. థాంక్యూ చెప్పండి తనకి. నెక్స్ట్' అన్నా.

'నేను చాలా అందంగా ఉంటాను. ఈ మాట నా చిన్నప్పటినుంచీ ఎందరో అన్నారు. ఎక్కడికెళ్ళినా అందరూ నా వెంట పడుతూ ఉంటారు. మొన్నటికి మొన్న రిషీకేష్ యాత్ర కెళితే, అక్కడ షాపింగుకనీ ఒక షాపుకెళ్ళాం, ఏవో కొనుక్కుని బయటకొస్తుంటే ఆ షాపువాడు షట్టర్ దించేసి నా వెనుకే మా హోటల్ దాకా వచ్చాడు. నేనంత అందగత్తెని. కానీ మొగగురువులతో నాకు మొహం మొత్తింది. అందరూ అదోరకంగా చూసేవారే. నాకు ఆడగురువు కావాలి. ఈయన్ని ఆడదానిగా ఆపరేషన్ చేయించుకోమని ఎంతో బతిమిలాడాను. వినడం లేదు. ఛీ ఇలాంటి గురువు నాకెందుకని అర్జెంటుగా ఈ ఊబిలోనుంచి బయటపడ్డాను. మన 'పిచ్చిగోల' గ్రూప్ నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకంటే ఇక్కడ నాలాంటివాళ్ళే ఎంతోమంది ఉన్నారు. థ్యాంక్యూ' అంటోంది ఇంకొకామె'. - అన్నాడు ఓనీల్.

పగలబడి నవ్వాను అతని మాటలకి. 'షాపోడు షట్టర్ వేసుకుని వచ్చాడా? బతికిపోయాడు. వేయకుండా వచ్చుంటే షాపు ఖాళీ అయ్యుండేది. పోన్లే కొంచం సెన్స్ లో ఉన్నాడు. ఇంకా నయం స్వెట్టర్ వేసుకోకుండా వచ్చాడనలేదు. ఆ చలికి గడ్డగట్టి చచ్చుండేవాడు. అయినా,  అంత అందగత్తె ఈ లోకంలో ఎందుకు? స్వర్గానికి వెళ్ళమను. డాన్స్ నేర్పించే అప్సరసల పోస్టులు ఖాళీ ఉన్నాయట, ఫుల్ టైమ్ ఇంద్రుడి ఎదురుగా డాన్స్ చెయ్యొచ్చు.  తోచనప్పుడు అడివిలో ఏదో ఒక రుషి ఎదుట డాన్స్ చేసుకుంటూ శేషజీవితం గడపమని చెప్పండి. మా దగ్గరకు రావద్దని నా మాటగా చెప్పండి. నెక్స్ట్' అన్నా.

'నేనూ ఈ సంస్థలో ఐదేళ్ళ నుంచీ ఉన్నాను. డబ్బులు సంపాదించే సులువులు చెప్పరా మగడా అంటే ఉలకడు పలకడు. వీడేం గురువు? ఎంతసేపూ ఆధ్యాత్మికం అంటాడు. 'నువ్వు మారాలి' అంటాడు. ఏంటి మారేది? డబ్బు లేకపోతే లోకంలో ఎందుకూ పనికిరాము. ఈ ఐదేళ్ళలో బయటైతే కోట్లు సంపాదించేదాన్ని. ఇక్కడ ఏమీ అవకాశాలు లేవు. ఇంకో అయిదేళ్లైనా ఇంతేకదా. అనవసరం అని బయటకొచ్చా' అంటోంది ఇంకొకామె. 

'ఎక్సలెంట్ డెసిషన్ ! సంపాదించుకోమనండి. బోలెడన్ని మార్గాలున్నాయి లోకంలో. బెస్ట్ ఆఫ్ లక్. నేక్ట్' అన్నా.

'ఈలోపల యాస్ట్రల్ వరల్డ్ నించి ఇంకో ఆమె 'ఈయన చెప్పేది సరిగా అర్ధం చేసుకోకుండా, ఆచరించకుండా, పిచ్చిదానిలా తొందరపాటులో సూయిసైడ్ చేసుకుని ఇలా అఘోరిస్తున్నా. వాళ్ళ గ్రూప్ లో ఎలాగూ నన్ను చేర్చుకోరు. అందుకని మీ గ్రూప్ లో కొచ్చా' అంటోంది.  ఇలాంటి కేస్ ఇంతకుముందు ఎప్పుడూ చూడలేదు. ఇదే ఫస్ట్ టైం ఇలా జరుగుతోంది' అన్నాడు ఓనీల్.

'ఆమె పాపం నిజంగా పిచ్చిదే. ఆ పిచ్చోళ్ళ గ్రూప్ లో ఆమెను ఉండనివ్వకండి. వాళ్ళు చాలా డేంజరస్ మనుషులు. ఆత్మలకి కూడా పిచ్చేక్కించగల ఘనులు. ఆమెను తర్వాతి జన్మకు పంపించే పని మొదలైపోయింది. ఎన్నాళ్ళో ఆమె ఆ స్థితిలో ఉండదు. త్వరలోనే అక్కడనుంచి మరో జన్మకు వెళ్ళిపోతుంది. కనుక బాధ పడవద్దని చెప్పండి. ముందా గ్రూప్ నుంచి బయటకు రమ్మని చెప్పండి. నెక్స్ట్' అన్నా.

'నాకు పిచ్చి ఉందని ఈయనకు ముందే చెప్పాను. నాకే కాదు. మా ఆయనకి కూడా కొంచం పిచ్చుంది. నేనూ మా ఆయనా కలసి నెలలో రెండుసార్లు విడాకుల కోసం లాయర్ ని కలుస్తూ ఉంటాం. ఎంతో అరుచుకుని మళ్ళీ కలసిపోతూ ఉంటాం. ఇలా పదేళ్ళనించీ చేస్తున్నాం. ఈ క్రమంలో మాకు తగ్గలేదు కాని మా లాయర్ కి పిచ్చెక్కింది. ఆమె న భర్తనుంచి విడాకులు తీసుకుంది. కానీ మా విడాకుల సంగతి పట్టించుకోవడం లేదు. ఏదైనా రేమేడీ చెప్తాడని ఈయన గ్రూపులో చేరాను. ఎంతకీ మాకు రేమేడీ చెప్పడం లేదు. పిచ్చివేషాలు తగ్గించుకోమంటాడు. ఎలా తగ్గుతుందండి? నాకు పుట్టినప్పుడే పిచ్చుంది. అదెలా పోతుంది? ఏంటీ గోల? విసుగొచ్చి బయటకొచ్చాను. ఈ గ్రూప్ లో చేరాను. ఇక్కడంతా నాలాంటివాళ్ళే ఉన్నారు. ప్రస్తుతం చాలా హాయిగా ఉంది. ఆయన దగ్గరకెళ్ళకండి. ఆయన దొంగగురువు' అంటోంది ఇంకొకామె' అన్నాడు ఒనీల్.

'ఈమెకు సెల్ఫ్ రియలైజేషన్ చాలా ముదిరిపోయింది. మన లెవల్ కాదు. వేరే ఎవరైనా పెద్దగురువుని, సారీ, పెద్దడాక్టర్ని కలవమని చెప్పండి. నెక్స్ట్' అన్నా.

'నేను బ్రాహ్మిన్ని. ముప్పై ఏళ్లనుంచీ ఆమెరికాలో ఉన్నా. అయినా సరే, రోజూ ఆరుగంటలు పూజ చేస్తా. ఆఫీసుకి పట్టుచీరెలో, ఫుల్ నగలతో వెళతా. ఈయనేదో పెద్దగురువని నమ్మి ఈయన గ్రూపులో చేరా. ఈయన బ్రాహ్మనుడై ఉండి బ్రాహ్మలనే తిడుతున్నాడు. ఇలాంటి అప్రాచ్యుడు నాకెందుకు? నేను అప్రాచ్యదేశంలో, అప్రాచ్యంగా ఎన్నేళ్లయినా ఉండవచ్చు కానీ ప్రాచ్యదేశపు అప్రాచ్యగురువు నాకక్కర్లేదు. అసలు నాకు గురువెందుకు? మా ఏరియాలో నేనే గురువుని. నాకేం తక్కువ? నాకన్నీ తెలుసు. ఈయనకు ఆచారం లేదు. సాంప్రదాయం లేదు. అందుకే బయటకొచ్చా. నేనే గ్రూపు పెట్టా' అంటోంది వకామె - అన్నాడు ఒనీల్.

'బ్రాహ్మలు మ్లేచ్చభాషలో చదువులు చదవచ్చా? ఒకరిక్రింద ఉద్యోగం చేయవచ్చా? సముద్రం దాటి బయటకి పోవచ్చా? అక్కడి గాలి పీలుస్తూ, అక్కడి తిండి తింటూ వాళ్ళతో కలసి ఉండవచ్చా? ఏ ధర్మశాస్త్రంలో ఏముందో ముందు తెలుసుకుని ఆ తర్వాత నాతో మాట్లాడమనండి ఆ మహాపతివ్రతని. నెక్స్ట్' అన్నా.     

'నా కూతురికి పిచ్చుంది. దాని పిచ్చి నాకెక్కిస్తోంది. ఈ గురువేమో వద్దంటాడు. ఏం? నా కూతురి పిచ్చి నేనేక్కించుకుంటే తప్పేంటి? మా అమ్మకి కూడా పిచ్చే, అసలు పిచ్చనేది మా వంశంలోనే ఉంది. ఇప్పుడు మా అమ్మకూడా తన పిచ్చిని నాకెక్కిస్తోంది. తప్పేముంది? ఈయన్ని గురువని నమ్మి దగ్గర చేరితే, 'ఇదంతా వద్దు. ఈ పిచ్చిగోల మానుకో' అంటాడు. ఎలా కుదురుతుంది? అందుకే ఆ గ్రూపు నుంచి బయటకొచ్చాను. 'పిచ్చిగోల' గ్రూప్ ఫౌండర్స్ లో నేనూ ఒకదాన్ని. ఇక చూపిస్తా నా తడాఖా' అని గర్జిస్తోంది ఇంకొకామె - అన్నాడు ఓనీల్.

'బాబోయ్ ! ఆ కుటుంబంలో అమ్మమ్మ - అమ్మ - కూతురు మూడు తరాలలో ముగ్గురికీ పిచ్చి ఉన్నపుడు, ఆ విషయం వాళ్లకు తెలిసికూడా ఉన్నపుడు ఇంక మనమేం చేయగలం ఓనీల్ ? వాళ్ళను మాకు చాలా దూరంగా ఉండమని చెప్పండి. మేం తట్టుకోలేం వాళ్ళని. నెక్స్ట్' అన్నాను.

'ఈయన దగ్గర చేరిన్నాటినుంచీ నాకు హింస అయిపొయింది. వారంవారం రిట్రీట్ అంటూ రమ్మని పిలుస్తాడు. అడ్డమైన చాకిరీ చేయించుకుంటాడు. డబ్బులివ్వడు. కళ్ళు మూసుకుని కోచోమంటాడు. నేను ఫ్రీగా ఉండేది ఆ వీకెండ్ లోనే, అప్పుడే తను ఏదో పని చెప్తాడు. ఏం? నాకేం పనుల్లెవా? నా బాయ్ ఫ్రెండ్స్ తో నేను తిరగక్కర్లేదా? నాకు సరదాలుండకూడదా? ఈ వయసు పోతే మళ్ళీ వస్తుందా? నాకేంటీ హింస? ఆధ్యాత్మికం లేదు తొక్కా లేదు. నాకెందుకు? నాకు డబ్బులు ముఖ్యం. నా టాలెంట్ కి బయటైతే ఎంతో సంపాదించేదాన్ని. అందుకే బయటపడ్డా. ఇప్పుడు హ్యాపీగా ఉంది' అంటోంది ఇంకో అమ్మాయి - అన్నాడు ఓనీల్.

'చాలా మంచిది ఓనీల్. అలాంటి కార్యక్రమాలలోనే ఉండమను. పుణ్యం పురుషార్ధం రెండూ వస్తాయి. నెక్స్ట్' అన్నా.

'యాభైఏళ్ళ క్రితం 'స్వామి కోతేశ్వరానంద కొమ్మచ్చి' గారి దగ్గర దీక్ష తీసుకున్నాను. ఇంతవరకూ ఏమీ ఎదుగుదల లేదు. ఈయనేమైనా ఎదుగుదల ఇస్తాడేమో అని ఈ గ్రూప్ లో చేరాను. ఈయనకే ఏ 'దలా' లేదు ఇక నాకేం ఇస్తాడు 'దల'? అందుకే విసుగుపుట్టి బయటకు వచ్చాను. 'పిచ్చిగోల' గ్రూప్ లో నాకు చాలా హాయిగా ఉంది. మొదటిరోజునే ఇక్కడ ఎంతో ఎదుగుదల కన్పిస్తోంది. ఒకే రోజులో మూడుకేజీలు బరువు పెరిగాను. అయాం హ్యాపీ' అంటోంది ఇంకొకామె - అన్నాడు ఓనీల్. 

నవ్వుతో కొరబోయింది నాకు.

ఆధ్యాత్మిక ఎదుగుదలను కొలవడానికి గిన్నెలు, చెంబులు, డ్రమ్ములు లేవేమో ఈమె దగ్గర? ముందవి ఎక్కువగా కొనుక్కోమనండి. లేకపోతే నెక్లెస్ రోడ్డులో ' స్పిరిట్యువల్ బ్రితలైజర్స్' అమ్ముతున్నారు. అందులో ఊదితే మనం ఆధ్యాత్మికంగా ఎంత ఎదిగామో తెలుస్తుందిట. అర్జంటుగా వాటిని కొనేసుకుని దాచుకోమనండి. మళ్ళీ స్టాక్ అయిపోతే కష్టం. ఆ తర్వాత తీరిగ్గా ఊదుకుంటూ కొలుచుకోవచ్చు 'ఎదుగుదల'. నెక్స్ట్' అన్నాను.

'ఇక నేను చెప్పలేను. నా వల్లకాదు. ఈ గ్రూపులో రోజురోజుకీ విపరీతంగా జనం చేరిపోతున్నారు. ఒక్కరోజులోనే లక్షమంది చేరారు వాళ్ళు చెబుతున్నవన్నీ ఒక్క రోజులోనే నేను చదవలేను. మళ్ళీ ఇంకోసారి వస్తా' అన్నాడు ఓనీల్.

'సరే నువ్వు ఎక్కడుండేది అమెరికాలో?' అడిగా.

'అమెరికేందన్న? నేనుండేది తార్నాకల' అన్నాడు ఓనీల్.

మంచం మీద నుంచి ధబ్బున క్రింద పడ్డా.

'వార్నీ. మనూరే ! మరి ఎఫ్. బీ. ఐ అన్నావ్?'

'అంటే, గీ మద్దెనే బెట్టినా. 'ఫేస్ బుక్ ఇనిషియేటివ్' అనీ ఒక సంస్థ. ఆన్లైన్ ల్లున్న వాట్సప్ గ్రూపులన్ని రీసెర్చి జేసి, వాళ్ళకీ వీల్లకీ ఫోన్లు జేసి, టైమ్పాస్ జేస్తుంటా. మళ్ళీ కాసేపట్లో వాల్లోస్తరు గదా పట్కపోడానికి' అన్నాడు.

'వాళ్ళెవరు?' అన్నా అయోమయంగా.

'అదేన్నా. ఎర్రగడ్డ నించి జంపై మకాన్ కొచ్చిన గదా? కనుక్కున్రు. వస్తున్రు. అమ్మో. అదుగో వచ్చిన్రు. ఏయ్ వదులుండ్రి. నేన్రాను. నేన్రాను' అంటూ అరుస్తున్నాడు. ఫోన్ కట్ అయిపొయింది.

'ఇదాసంగతి? ఛీ ఛీ. అసలే చిరాగ్గా ఉంటె, పొద్దున్నే ఈ పిచ్చోడొకడు? ఇలా లాభంలేదు. అర్జెంటుగా నేనుకూడా 'పిచ్చిగోల' వాట్సప్ గ్రూప్ లో చేరిపోయి ఈ పిచ్చోళ్లని ఒక పట్టు పట్టాలి. తప్పదు ' అనుకుంటూ నేలమీద నుంచి మెల్లిగా లేచి బాత్రూం లోకి దారి తీశా.

read more " 'పిచ్చిగోల' వాట్సప్ గ్రూపు - మైకేల్ ఓ నీల్ రిపోర్ట్ "

25, నవంబర్ 2020, బుధవారం

మకరరాశిలో గురుశనుల గోచార ప్రభావం - ఫలితాలు

read more " మకరరాశిలో గురుశనుల గోచార ప్రభావం - ఫలితాలు "

Online Sri Vidya - 4

రవి ఆ ఫోటోని చూస్తుంటే అంజలమ్మ దగ్గరకొచ్చి "ఏంటి చూస్తున్నారు?' అనడిగింది.

'ఈ ఫోటోలో అమ్మాయి మాకు తెలుసు' అన్నాడు రవి

'ఆ అమ్మాయి మాతో హరిద్వార్ రిషీకేష్ యాత్రకొచ్చింది. మేమంతా కలసి నేపాల్ కూడా వెళ్లాం. అప్పుడే వరదలొచ్చి రిషీకేష్ మునిగిపోయింది' అంది అంజలమ్మ.

'ఓ! మీరు పాదం పెట్టినప్పుడేనా అంత ఉపద్రవం వచ్చింది?' అన్నాడు రవి నవ్వుతూ.

కోపంగా చూసింది అంజలమ్మ.

'అబ్బే! నా ఉద్దేశం అది కాదు. పాపం ఎక్కువైపోతే అలాంటివి జరుగుతాయని అంటారు కదా. అర్ధంకాక అలా అడిగాను.' అన్నాడు రవి.

'పాపం ఎక్కువై కాదు. మేము అక్కడ పాదం పెట్టినందుకు  అక్కడ ఆల్రెడీ ఉన్న పాపం వరదల రూపంలో ప్రక్షాళన అయింది' అందిట అంజలమ్మ.

'పోనీలెండి ఏదో ఒకటి. నాకెందుకు? ఇంతకీ ఆ అమ్మాయి ఇప్పుడెక్కడుందో?' అడిగాడు రవి.

'అమెరికాలో ఉంది. ఈ అమ్మాయి మీకెలా తెలుసు?' అడిగింది అంజలమ్మ

'అప్పట్లో కొన్నాళ్ళు మా ఫ్రెండ్ తో టచ్ లో ఉందిలే. అలా తెలుసు' అన్నాడు రవి.

వీళ్ళిలా మాట్లాడుకుంటూ ఉండగా స్వామీజీ బయటకొచ్చాడు. అందరూ మెల్లిగా బయలుదేరుతున్నారు. వాళ్ళలో బాగా బంగారం దిగేసుకున్న ఒకామెని చూసి స్వామీజీ ' ఏమ్మా ! ఇందాక శ్రీచక్రానికి పూర్ణాహుతి తర్పణం చేయించా కదా? అప్పుడు మీ ఒంటిమీదున్న బంగారం అంతా అక్కడ అర్పించి వెళ్ళాలి. నిలువు దోపిడీ అన్నమాట ! అలా బంగారం వెనక్కు తీసుకెళితే అమ్మవారికి కోపం వస్తుంది' అన్నాడు నవ్వుతూ.

నిజమేనేమో అని ఆమె చాలా కంగారు పడిపోయింది.

అదిచూసి స్వామీజీ విరగబడి నవ్వుతూ 'ఏం భయమేసిందా? ఊరకే జోకేశాలే. ఆ బంగారం అంతా అర్పించమంటే, నువ్వుకూడా 'జంప్ జిలానీ షేక్ సుభానీ' అయిపోతావు. మళ్ళీ రావు'. అన్నాడు.

'ఓరి నీ బంగారం పిచ్చీ!' అనుకున్నాడు రవి మనసులో.

'అంటే కొంతమంది అలా మానేస్తూ కూడా ఉంటారా?' అడిగాడు భయం భయంగా.

స్వామీజీ ఏదో చెప్పబోయేలోపు అంజలమ్మ కల్పించుకుని 'ఆ ! ఎందుకు మానరు? బోలెడుమంది అలా మానేసినవాళ్ళున్నారు. పూర్ణదీక్ష తీసుకున్న తర్వాతకూడా అడ్రస్ లేకుండా పోయినవాళ్ళున్నారు. మెంటల్లో రకరకాలు మరి! మీ ఫ్రెండ్ కూడా అలా మానేసినదే. స్వామీ ! ఈయనకామె తెలుసుట ' అంది.

'మళ్ళీ గతచరిత్ర అంతా చెప్పాలేమో స్వామీజీకి' అని రవికి భయమేసిందిట.

లక్కీగా స్వామీజీ అదేమీ అడక్కుండా, వెళ్ళిపోతున్న వారివైపు చూస్తూ 'అందరూ టచ్ లో ఉండండి మన వాట్సప్ గ్రూపులో' అన్నాడు. ఆయన గోల ఆయనది !

'మీరందరూ 40 రోజులపాటు తర్పణాలు చెయ్యండి మర్చిపోకుండా. ఆ తర్వాత మీకు ఇంకా కొత్త కొత్త మంత్రాలు నేర్పిస్తాను' అన్నాడు మళ్ళీ.

ఈలోపల స్వామీజీ భార్య బయటకొచ్చి, 'ఏమండి రవిగారు! కొంచం మీ ఫోన్ నంబర్ ఇవ్వండి' అనడిగింది. మనవాడు మంచి హై పొజిషన్ లో ఉన్నాడు కదా ! పైగా మినిస్టర్ గారి మరిది కూడా ! అడగరూ మరి !

వెంటనే అంజలమ్మ కల్పించుకుని 'నేను తీసుకున్నాలే. నీకెందుకు?' అని గైమంటూ ఆమెను అరిచింది. అలా అరిచి రవివైపు తిరిగి 'ఆమెని పట్టించుకోకండి. ఇక్కడంతా నేనే. స్వామీజీకి స్క్రిప్ట్ రాసి పెట్టడం దగ్గరనుంచి, ఆయన ప్రోగ్రాం అంతా చూసుకోవడం వరకూ అన్నీ నేనే. ఆమెదేమీ లేదు' అంది చిన్నగా.

'స్క్రిప్టా? అదేంటి?' అడిగా అయోమయంగా.

'స్వామీజీ యూటూబ్ చానల్లో మాట్లాడే స్పీచ్ ఈమె తయారు చేస్తుందట. ఆయన ఊరకే దానిని చదువుతాట్ట. అంతే !' అన్నాడు రవి.

'ఇందులో ఇదొకటా?' అనుకున్నా నీరసంగా.

స్వామీజీ భార్యేమీ తక్కువది కాదు. 'ఏంటే నువ్వు తీసుకునేది? నీ దగ్గరుంటే సరిపోయిందా? నా దగ్గరుండనక్కరలేదా?' అని ఆమె కూడా అరిచింది.

ఆ పాయింట్ మీద ఇద్దరూ అందరి ఎదురుగానే మళ్ళీ కీచులాడుకున్నారు.

'మరి ఇదంతా చూస్తో స్వామీజీ ఊరుకున్నాడా?' అడిగాను.

'అదేంటో మరి? అయన కిమ్మనడం లేదు. కుక్కిన పేనులాగా ఉన్నాడు' అన్నాడు రవి.

మళ్ళీ పగలబడి నవ్వాను.

'శ్రీ విద్యోపాసకులు కదా ! ఆడవారిలో అమ్మవారిని చూస్తారు. అందుకే వాళ్ళలా కొట్టుకుంటుంటే, 'ఆదిశక్తీ పరాశక్తీ కొట్టుకుంటున్నార్లే, మనకెందుకు?' అనుకుని మౌనంగా ఉన్నాడు. నువ్వర్ధం చేసుకోవాలి' అన్నాను.

'ఆహా ! మరి బంగారం మీదా డబ్బులమీదా దృష్టి ఏంటి? అదికూడా శ్రీవిద్యలో భాగమేనా?' అడిగాడు రవి.

'అవును. శ్రీ అంటేనే లక్ష్మి కదా ? శ్రీవిద్య అంటే డబ్బుని ఆరాధించడం. లేదా డబ్బు సంపాదించే విద్య. అంతే, నీ అవగాహనలో లోపానికి వాళ్ళనెందుకు అంటావ్?' అన్నాను.

'అలాగే ఉంది మరి ! సరే, అక్కడే ఉంటే ఇంకేం జాతర చూడాల్సోస్తుందో అని అక్కడనుంచి గబగబా బయటపడ్డాం. ప్రస్తుతం శ్రద్దగా తర్పణాలు చేస్తున్నాను' అన్నాడు రవి.

'మరి కుండలిని లో కదలిక వచ్చిందా?' అడిగా నవ్వు ఆపుకుంటూ.

'నా బొంద వచ్చింది. అలాంటి ఛాయలేమీ కనపడటం లేదు. చూడబోతే నువ్వు చెప్పినదే నిజంలాగా ఉంది' అన్నాడు.

'ఛా ! నేనెందుకు నిజం చెబుతాను? లోకంలో అందరూ చెప్పేది నిజం. నేను నీకు చెప్పేది మాత్రం అబద్దం. నమ్మకు. సరే లేటెస్ట్ న్యూస్ చెప్పు' అన్నా నేను.

'ఏముంది? 40 రోజులు కాకముందే అందరికీ మళ్ళీ ఫోన్లు చేస్తున్నాడు. మెసేజీలు ఇస్తున్నాడు' అన్నాడు.

'ఏమని?' అడిగాను.

'మళ్ళీ హైదరాబాద్ వస్తున్నాను. 40 రోజులు కాకపోయినా పర్వాలేదు. అందరూ మళ్ళీ రండి. మీ మీ అర్హతలు టెస్ట్ చేసి, ఇంకో మంత్రం ఉపదేశం చేస్తాను. దానికి ఇరవై వేలవుతుంది. అందరూ రండి' అని మెసేజీలు వస్తున్నాయి గ్రూప్ లో' అన్నాడు రవి.

'పోన్లే పాపం. డబ్బు అవసరం పడిందేమో? శిష్యులుగా మీరు ఆదుకోకపోతే ఎవరాదుకుంటారు  చెప్పు? ఆయనేమీ ఊరకే డబ్బ్లు అడగడం లేదుగా? మంత్రాలు ఇస్తానంటున్నాడు. ఎందుకాయన్ను తప్పు పడతావు?' అడిగాను.

'నీ జోకులాపు. ఈ లోపల ఏం జరిగిందో తెలుసా?' అడిగాడు రవి.

'ఏంటి?' అడిగాను.

'మా వాట్సప్ గ్రూప్ లో ఒకాయన ఇలా మెసేజి పెట్టాడు'

'డియర్ ఆల్ ! మీ అందరికోసం ఒక విషయం చెబుతున్నాను. మనం ఏ శ్రీచక్రం అయితే పదిహేను, పాతికవేలకి ఈయన దగ్గర కొన్నామో, అవే శ్రీచక్రాలు మరోచోట మూడువేలకు అమ్ముతున్నారు. అవే ఈయన కొని తెచ్చి మనకు ఈ రేటుకు అమ్ముతున్నాడు. ఈ రోజే నేనొక శ్రీచక్రం కొన్నాను. అంతా అదే పీసు. నాకు జ్ఞానోదయం అయింది. నేను ఇక ఈయన దగరకు రాను. గుడ్ బై' అనేది ఆ మెసేజి.

మళ్ళీ హాశ్చర్యపోవడం నా వంతైంది.

'గణపతిమంత్రంతోనే అంత పెద్ద జ్ఞానోదయమైతే ఎలా రవి? ఇంకా పైన ఇరవై మంత్రాలున్నాయి? మీరెవరూ తీసుకోకపోతే అవన్నీ ఏం కావాలి? ఎవరి దగ్గరికి పోవాలి? చెప్పు? అసలు మీకు గురువన్నా మంత్రాలన్నా భయమూ లేదు. భక్తీలేదు. తప్పంతా మీదే. ఆయనది కాదు. సరే ఇపుడు నువ్వేం చేద్దామని అనుకుంటున్నావు ఫైనల్ గా చెప్పు?' అడిగా.

'ఈ దెబ్బతో నాకూ జ్ఞానోదయమైంది. ఇక ఆయన దగ్గరకు పోను. యూటూబులో మంత్రాలు నేర్చుకుని మూసుకుని జపించుకుంటా. అంతే' అన్నాడు రవి నీరసంగా.

'హతోస్మి ! నీ మంత్రాల పిచ్చీ నువ్వూనూ ! మొత్తంమీద నీ 'శ్రీవిద్య ఆన్ లైన్ కోర్సు' ఇలా ముగిసిందన్న మాట!' అన్నా.

'అవును. ఏం చేస్తాం? సరైన గురువులు ఎక్కడా దొరకడం లేదు. నీకెవరైనా తెలిస్తే కాస్త చెప్పు' అన్నాడు రవి.

'సరే. వెతుకుతాలే. తెలిస్తే చెబుతా. ఈలోపల యూటూబే నీకు గురువనుకో. సరే నీకు తర్పణాలకు టైమౌతోంది. చేసుకో బుద్ధిగా' చెప్పా నవ్వుతూ.

'అవునుకదా. బాగా గుర్తుచేశావ్ ! ఉంటా మరి. తర్పణాలు చేసుకోవాలి' అంటూ ఫోన్ పెట్టేశాడు తను.

కలిమాయకు నవ్వుకుంటూ నా పని నేను మొదలుపెట్టాను.

(అయిపోయింది)

read more " Online Sri Vidya - 4 "

22, నవంబర్ 2020, ఆదివారం

పంచవటిలో కొన్ని మార్పులు - గమనించండి

శకునం చెప్పే బల్లి కుడితిలో పడిందని సామెతున్నది. పైపైన జ్యోతిష్యం తెలిసినవారు కూడా కర్మకు అతీతులేమీ కారు. అసలైన జ్యోతిష్యం రానంతవరకూ, సాధనాబలం లేనంతవరకూ, వారు కూడా గ్రహప్రభావానికి డామ్మని పడిపోతూనే ఉంటారు.

మకరంలో గురుశనుల గోచారం పంచవటిమీద కూడా ప్రభావం చూపిస్తున్నది. ఎందుకంటే, పంచవటిలో కొన్ని కీలకస్థానాలలో ఉన్న వ్యక్తుల జీవితాలను అది ఊహించని మార్పులకు గురిచేస్తున్నది గనుక.

అవేంటంటే - 'పుస్తకం. ఆర్గ్', 'సత్యజ్యోతిష్' ఈ రెండు యాప్స్ ను డెవలప్ చేసి, వాటిని మేనేజ్ చేస్తున్న వ్యక్తి ఆ పనులనుంచి హఠాత్తుగా విరమించుకున్నాడు. ఏం చేస్తున్నాడో తెలీనంతగా విచక్షణాశక్తిని కోల్పోవడం ఆ వ్యక్తి తప్పు.  ఒక వ్యక్తిని నమ్మి అతనిమీద ఎక్కువగా ఆధారపడటం మేం చేసిన తప్పు. ఈ తప్పును దిద్దుకుంటున్నాం.

గత పదేళ్ళ ప్రయాణంలో ఈ విధమైన పరిస్థితులు చాలాసార్లు ఎదురయ్యాయి. ప్రతిసారీ ఒక క్రొత్త పాఠాన్ని నేర్చుకుంటూ మా ప్రయాణం సాగుతోంది. ఈ సారి కూడా అంతే !

ఈ క్రింది మార్పులను గమనించవలసిందిగా మా పాఠకులు, అభిమానులను  కోరుతున్నాము.

>> ఇకమీద 'పుస్తకం. ఆర్గ్' నుంచి మా పుస్తకాలు లభించవు. అందుకోసం వేరే యాప్ ను డెవలప్ చేస్తున్నాము. ఇకపై, పరాయివాళ్ళ యాప్స్ మీద ఆధారపడటం జరగదు. మా సొంత యాప్ వచ్చేవరకూ వేరే అడ్రస్ నుంచి మా ప్రింట్ పుస్తకాలు మాత్రమె లభిస్తాయి. 'ఈ బుక్స్' లభించవు. ఆ అడ్రస్ త్వరలో ఇదే బ్లాగ్ లో ఇవ్వబడుతుంది. యాప్ రెడీ అయ్యాక, అందులో మా పుస్తకాలన్నీ ఇంతకుముందులాగే లభిస్తాయి. 

>> అట్టహాసంగా ప్రారంభించిన 'సత్యజ్యోతిష్ సాఫ్ట్ వేర్' అర్ధాంతరంగా మూతపడింది. దానికి కారణాలు - మా దగ్గర బిజినెస్ యాటిట్యూడ్ లేకపోవడం, మనుషులను మేము అతిగా నమ్మడం, పనిచేస్తున్నవారికి తగినంత చిత్తశుద్ధి లేకపోవడం మాత్రమే. వ్యక్తులకు చిత్తశుద్ధి ఉండకపోవచ్చు. వాళ్ళు మమ్మల్ని మోసం చెయ్యవచ్చు. కానీ మా ప్రయాణం ఆగదు. మా ఆలోచనకు మరణం లేదు. ఈ సాఫ్ట్ వేర్ ను మళ్ళీ మొదటినుంచీ తయారుచేసి అందిస్తాం. దానికి కొంత సమయం పడుతుంది.

ఈ అసౌకర్యానికి మన్నించమని కోరుతున్నాం.

read more " పంచవటిలో కొన్ని మార్పులు - గమనించండి "

20, నవంబర్ 2020, శుక్రవారం

గురువుగారి మళ్ళీ మకరప్రవేశం - ఫలితాలు

ఈరోజు మళ్ళీ గురువుగారు మకరంలోకి నీచస్థితిలోకి వస్తున్నాడు. దాని ఫలితాలు మళ్ళీ మళ్ళీ వ్రాసి ఊదరపెట్టడం నా ఉద్దేశ్యం కాదు. కాకపోతే గతవారం నుంచీ జరుగుతున్న విషయాలు గమనిస్తే ఈ గోచారం ఎలా ఉండబోతోందో అర్ధమౌతుంది.

జాతీయ అంతర్జాతీయ గొడవల జోలికి పోకుండా రెండు చిన్న విషయాలు మాట్లాడుకుందాం.

గురువు నీచస్థితిలో ఉన్నపుడు దొంగగురువులు, దొంగజ్యోతిష్కులు, మతాధికారులు బయటపడతారని ఎన్నోసార్లు గతంలో చెప్పాను. ఇది ఎన్నోసార్లు రుజువైంది కూడా. గతవారంగా జరుగుతున్న ఒక జ్యోతిష్కుని ఉదంతం దీనికి తాజా ఉదాహరణ.

అతని ఇద్దరు భార్యలూ పోలీసు కంప్లెయింట్ ఇచ్చి టీవీలకెక్కారు. ఇంకా చాలామంది గర్ల్ ఫ్రెండ్స్ క్యూలో ఉన్నారట. వాళ్ళు ముగ్గురూ మాట్లాడేది వింటుంటే అమాయకత్వమా, అతితెలివా అర్ధం కాలేదు. అతని ఆధ్యాత్మికతను చూచి పెళ్లి చేసుకున్నానని ఆ డాక్టర్ భార్య అంటోంది. చాలామంది ఇదే భ్రమల్లో ఉంటారు. ఆధ్యాత్మికమంట్టే పూజలు, పునస్కారాలు, హోమాలు, తంతులు, గుళ్ళూగోపురాల వెంట తిరగడం అనుకుంటారు. ఒకడు నాలుగుమాటలు బట్టీపట్టి చెప్పగానే పడిపోతారు. అసలైన ఆధ్యాత్మికత అది కాదని నేను పదేళ్ళ నించీ చెబుతున్నాను.

సరే! మోసపోయేవాళ్ళు అమాయకులు. మరి మోసం చేసేవాళ్ళు? వారికి భయంకరమైన కర్మ చుట్టుకుంటుంది. అది పక్వానికి వచ్చినపుడు వాళ్ళు పడే బాధలు దేవుడు కూడా పట్టించుకోడు. ఇది ఎన్నోసార్లు జరిగింది. రుజువైంది. అయినా కొత్తకొత్త స్వార్ధపరులు పుడుతూనే ఉంటారు. కొంతమంది రాజకీయనాయకులు, కొన్ని టీవీ చానల్స్ అదేపనిగా వారిని పెంచుతూ ఉంటాయి. ఇదంతా పెద్ద విషవలయం. కర్మ ఎవరినీ వదిలిపెట్టదు. ఎవరి సమయం వచ్చినపుడు వారికి వడ్డన జరుగుతుంది.

ఇక కెనడా అబ్బాయి ఉదంతం !

ఇలాంటి గోచారఘడియలలో సెంటిమెంటల్ ఫూల్స్ పిచ్చిపనులు చేస్తారని కూడా ఎన్నోసార్లు చెప్పాను. కెనడాలో ఒక తెలుగబ్బాయి ఆత్మహత్య చేసుకున్నాడట. కారణం? తను ప్రేమించిన అమ్మాయికి H1B వచ్చేసి అతన్ని వదిలేసి అమెరికా వెళ్ళిపోయిందట. అందుకని ఇతను ఈ పని చేశాడు. ఇంతా చేస్తే ఆ అమ్మాయికి ఇంకా చాలామందితో సంబందాలున్నాయట. చెడు అలవాట్లున్నాయట. ఈ గోలంతా చూస్తుంటేనే చీదరపుట్టింది. ఎంత చండాలంగా తయారౌతున్నారో మనుషులు !

ఈ రెండూ గతవారంగా టీవీలలో యూ ట్యూబు చానల్స్ లో గోలగోల అయ్యాయట. ఎవరో నాకు పంపిస్తే చూశా. సామాన్యంగా ఇలాంటి చెత్త నేను చూడను. పట్టించుకోను. ఎవరో నాకు పంపించారు. ఇవేవీ జాతీయ అంతర్జాతీయ ఇష్యూస్ కాదు. ఒకటేమో మతపరమైన మోసం. ఇంకొకటేమో ఎమోషనల్ బాలెన్స్ లేకపోవడం.

జ్యోతిష్యరంగంలో చాలా మోసాలు జరుగుతున్నాయి. దీనివల్ల అసలైన శాస్త్రానికి  ఏమీ ప్రమాదం లేదుగాని, అమాయకులు తమ నమ్మకాన్ని పోగొట్టుకుని పిచ్చిపిచ్చిగా మాట్లాడే ప్రమాదం ఉన్నది. కొంతమంది కుహనా జ్యోతిష్కులు నాలుగు మాటలు నేర్చుకుని, కొన్ని టీవీ చానల్స్ ని ఆశ్రయించి, ఈ శాస్త్రాన్ని చాలా ఖరీదైన వ్యవహారంగా మార్చి బిజినెస్ చేసుకుంటున్నారు. అమాయక గొర్రెలు నమ్ముతున్నారు. నిజానికి జ్యోతిష్యం అంత ఖరీదైన విషయం కాదు. చాలా సింపుల్ రెమెడీస్ దీనిలో ఎన్నో ఉన్నాయి. కానీ జనానికి మోసపోవడమే కావాలి. జనమూ సరైనవాళ్ళు కారు. ఈ మోసగాళ్ళూ సరేసరి. ఒకరికొకరు సరిపోయారు.

దురాశ, స్వార్ధం, అడ్డదారుల్లో ఏదో సంపాదించేసేయ్యాలన్న దుర్బుద్ధి జనంలో ఉన్నంతవరకూ, దొంగజ్యోతిష్కులు, దొంగస్వామీజీలు పుడుతూనే ఉంటారు. ఈ అనైతికవ్యాపారంలో ఒకపక్క జనమూ, ఇంకోపక్కన మోసపూరిత జ్యోతిష్కులూ లేదా స్వామీజీలూ ఇద్దరూ పాత్రధారులే. ఇద్దరిదీ తప్పుంది. అసలైన శాస్త్రం మాత్రం, ఈ గోలతో సంబంధం లేకుండా, ఏ మచ్చా లేకుండా వెలుగుతూనే ఉంటుంది. అర్హత ఉన్నవాళ్లకే అది దక్కుతుంది గాని ఇలాంటి చెత్త జనానికి, చెత్త గురువులకి దక్కదు.

ఆత్మహత్య చేసుకున్న కెనడా అబ్బాయికి బ్రతుకు విలువ తెలీదు. తల్లిదండ్రులు గుర్తు రాలేదు. ఆఫ్టరాల్ ఒక అమ్మాయికోసం చనిపోయాడు. వద్దని వెళ్ళిపోయిన అమ్మాయి కోసం అంత గోలెందుకు? అసలా అమ్మాయి ఎందుకు పారిపోయిందో? ఇతని ఎమోషనల్ గోల భరించలేకే అలా చేసిందేమో? ఎవరికి తెలుసు? ఇంత ఓవర్ పొసెసివ్ నెస్ ను ఎవరూ భరించలేరు. 

అతను మానసికంగా బాలెన్స్ తప్పాడని క్లియర్ గా తెలుస్తోంది. ప్రపంచంలో అమ్మాయిలే లేరేమో ఇక? అతనొక మానసిక అస్థిరరోగిలా ఉన్నాడు. మొన్నీ మధ్యన నా శిష్యురాలు కూడా ఒకమ్మాయి సూయిసైడ్ చేసుకుంది. ఇలా చనిపోయేవాళ్ళు ఎమోషనల్ గా చాలా గందరగోళంలో పడతారు. వాళ్లకు బ్రతుకు విలువ అర్ధం కాదు. జీవితం అనేది దేవుడిచ్చిన వరమన్నది వాళ్లకా క్షణంలో గుర్తుండదు. ఎవరు చెప్పినా వినరు. అలాంటివాళ్లకి బ్రతికే అర్హత లేదు. వాళ్ళని గురించి బాధపడటం అనవసరం.

కొన్ని కులాలలో చాలామందికి లోకాన్ని వోల్ సెల్ గా మోసం చేసే తెలివి ఉంటుంది. దీనిని తెలివి అనడం సమంజసం కాదు. కానీ ప్రస్తుతం ఇదే పదం చెలామణీలో ఉన్నది కనుక అనవలసి వస్తోంది. మరికొన్ని కులాలలో చాలామంది ఎమోషనల్ ఫూల్స్ గా ఉంటారు.  కొన్ని కులాలు ఎన్ని మోసాలు చేసినా కులసపోర్ట్ తో నెగ్గుకొస్తారు. మరికొన్ని కులాలు తేలికగా బయటపడి బద్నాం అవుతుంటారు. కొన్ని కులాలు చాలా ప్రాక్టికల్ గా ఉంటాయి. కొన్ని సెంటిమెంటల్ గా ఉంటాయి. ఈ రెండూ కలవకూడదు. కలిస్తే ఇలాగే అవుతుంది.

నిప్పు నీరు దూరంగా ఉండాలి. నిప్పు ఎక్కువైతే నీరు వేడెక్కుతుంది. నీరు ఎక్కువైతే నిప్పు ఆరిపోతుంది. నీరు పారిపోతుంది. అదే ఈ కేసుల్లో జరిగింది. అతియాజమాన్య మనస్తత్వం ఒక రోగం. దీనిని ఎవరూ ఎక్కువకాలం భరించలేరు. ఎవరి స్వేచ్చ వారికుండాలి. అది లేకపోతే పారిపోతారు. సహజమే !

నేటి రోజుల్లో కేరెక్టర్ అనేది ఒక బూతుమాటైపోయింది. 'తిరిగితే తిరిగావు నాతో ఈ గదిలో ఉన్నంతవరకూ సక్రమంగ్గా ఉండు చాలు. ఆ తర్వాత నీ ఇష్టం' అని ఆడామగా ఇద్దరూ అంటున్న రోజులివి. పిల్లలకు చదువులు నేర్పిస్తున్నారు గాని, నిబ్బరంగా ఎలా బ్రతకాలో నేర్పించడం లేదు. అమెరికా పంపించినంత మాత్రాన సరిపోదు, కోట్లు సంపాదించినంత మాత్రాన సరిపోదు. సక్రమంగా, ప్రణాలికాబద్ధంగా ఎలా జీవించాలో నేర్పించనంతవరకూ అవన్నీ వృధానే. 

అతి పేదరికంలో ఏళ్ళపాటు భయంకరమైన బాధలు పడుతూ కూడా మొండిగా నిలబడి ఎదురీది జీవితంలో గెలిచిన మనుషులను నేను చూచాను. అన్నీ ఉండి, చిన్నచిన్న వాటికి ఆత్మహత్యలు చేసుకునే అల్పులను కూడా చూస్తున్నాను. జీవితం ఎంత విచిత్రమైందో !

గురుగోచారం ఇలాంటి సంఘటనలను చాలావాటిని రేపుతుంది. ఇంకా చూద్దాం ఏమేం జరుగుతాయో !

read more " గురువుగారి మళ్ళీ మకరప్రవేశం - ఫలితాలు "

17, నవంబర్ 2020, మంగళవారం

Online Sri Vidya - 3

'త్వరలో నేను హైదరాబాద్ వస్తున్నాను. అప్పుడు ఫలానా వాళ్ళింట్లో ఉంటాను. అక్కడ కలుద్దాం. అందరం' అన్నాడు స్వామీజీ.

'ఓ అలాగే గురూజీ' అని అందరూ అరిచారు.

'అప్పటికప్పుడే 'శ్రీవిద్య కోర్స్' అంటూ ఒక వాట్సప్ గ్రూపు మొదలైపోయింది.  అందరూ అందులో జాయినయ్యారు. సమాచారం అంతా అందులో పెడదామని నిశ్చయించుకున్నారు అందరూ.

అందరూ పసుపుముద్దలని చేసుకుని రోజూ లక్ష్మీగణపతి మంత్రంతో దానికి తర్పణాలు వదలడం మొదలుపెట్టారు.

అసలు లక్ష్మీగణపతిమంత్రం అంత ఘోరమైన స్వార్ధపూరిత మంత్రం ఇంకొకటి లేదు నా దృష్టిలో. స్వార్ధం బాగా కరుడుగట్టిన మనుషులే దానిని జపిస్తారని నా నమ్మకం. నా నమ్మకానికి వెనుక చాలా గట్టి  ఆధారాలున్నాయి.  ఇది వ్రాస్తూ ఉంటె, గతంలో జరిగిన ఒక సంఘటన గుర్తొచ్చింది.

కొన్నేళ్ళ క్రితం కొంతమంది పెద్దమనుషులు నా దగ్గరకు వచ్చి లక్షీగణపతి మంత్రం ఉపదేశం కావాలని అడిగారు.

'ఎందుకు?' అని నేనడిగాను.

'అది చేస్తే డబ్బులు తేరగా వస్తాయట కదా ! మనుషులు వశమౌతారట కదా !' అని ప్రశ్నించారు ఆ ఆశపోతులు.

వాళ్ళలా అనుకోడంలో తప్పు లేదుమరి. అందులో - 'సర్వ జనం మే వశమానయ స్వాహా  స్వాహా' అని ఉంటుంది. అంటే - 'అందరు జనాల్నీ నాకు వశం చెయ్యి' అని అర్ధం. అంతకంటే దరిద్రమైన ఆలోచన ఇంకొకటి ఉండదని నేనంటాను.  అది స్వార్ధానికి పరాకాష్ట. 'స్వార్ధం తగ్గించుకోండి' అని చెప్పే నేను అలాంటి మంత్రాలు ఎందుకు ఉపదేశం చేస్తాను?

నాకు చీదర పుట్టింది.

'మీమీ పెళ్ళాలు మీరు చెప్పిన మాట వినరు. మీకు లోకమంతా వశం కావాలా? దురాశకైనా అంతుండాలి. అసలు లక్ష్మిని గణపతినీ కలిపిన దరిద్రుడెవరో ముందు నాకు చెప్పండి. ఆ తర్వాత ఆ మంత్రం సంగతి ఆలోచిద్దాం' అన్నాను.

వాళ్లకు నేనొక వింతమనిషిలా కనిపించాను. సరే మనం కాదంటే ఆ హోమాలు చేసేవాళ్ళు బొచ్చెడుమంది ఉన్నారు కదా లోకంలో. ఎవడినో ఒక చీప్ పూజారిగాడిని పట్టుకున్నారు. ఆ హోమాలూ గట్రా చేసుకుంటున్నారు. లోకమంతా వాళ్లకు వశమౌతుందన్న భ్రమలో, తాము మహాభక్తులమన్న భ్రమలో బ్రతుకుతున్నారు.

ఎప్పుడో జరిగిన ఈ సంఘటనను పక్కనపెట్టి 'మరి వచ్చాడా హైదరాబాద్ కి?' అడిగాను.

'ఇది జరిగిన ఒకవారం తర్వాత వీకెండ్లో హైదరాబాద్ కి వచ్చాడు. ఆయన చెప్పినట్లే ఒక శిష్యుడి ఇంట్లో అందరం కలిశాం' అన్నాడు రవి.

'ఆ ఎపిసోడ్ ఏమైందో చెప్పు మరి?' అడిగాను.

ఒక సూపర్ పోష్ లొకాలిటీలో గేటెడ్ కమ్యూనిటీ లో ఉంది ఆ ఇల్లు. అక్కడ సమావేశమైన వారిలో అందరూ బాగా రిచ్ గా కనిపిస్తున్నారు. ఆడాళ్ళయితే ఒంటినిండా బంగారం దిగేసుకుని గంగిరెద్దుల్లా ఉన్నారు. అదీఇదీ మాట్లాడాక స్వామీజీ భార్య లోపలనుంచి ఒక కేజీ పసుపు తెచ్చి అక్కడ గుట్టగా పోసింది. దానితో అందరిచేతా పసుపుముద్దలు చేయించి గణపతి తర్పణాలు ఆయన ఎదురుగా చేసి చూపించమని ప్రాక్టికల్ క్లాసు పెట్టాడు స్వామీజీ.

'అందులో నువ్వు పాసయ్యావా లేదా?' అడిగాను.

'ఏముంది? అదేమన్నా పెద్ద పరీక్షా ఏంటి? చిన్నప్పుడు చూశాం ఇలాంటివన్నీ' అన్నాడు రవి.

'ఆ తర్వాతేమైంది?'

'అందరికీ బాలామంత్రం, వారాహిమంత్రం ఉపదేశించి జపించమన్నాడు. అప్పటికే అక్కడున్న ఆడాళ్ళు ఆ మంత్రాలన్నీ గడగడా చదివేస్తున్నారు. ఆ బీజాక్షరాలూ అవీ వింటుంటే ఏవో క్షుద్రమంత్రాల లాగా ఉన్నాయి. ఆ ఆడాల్లందరూ అలా వేషాలేసుకుని ఆ భయంకరమైన మంత్రాలు చదువుతూనే నాకు భయమేసింది. బిక్కమొహమేసుకుని చూస్తుంటే,  మధ్యమధ్యలో వాళ్ళ గురువుగారి గురించి చెప్పాడు'

'ఓహో ఈయనకు ఇంకొక గురువా?' అన్నాను.

'అవును. ఆయనను ముచ్చటగా గుగ్గురువు అని పిలుచుకుందాం' అన్నాడు రవి.

'ఒకే ప్రొసీడ్' అన్నా.

'ఇప్పుడు విను జోకు. 'గుగ్గురువు గారు చూసే చూపు ఎంత పవర్ ఫుల్ గా ఉండేదో తెలుసా?' అని మమ్మల్ని అడిగాడు. తెలీదని అందరం గేదెల్లా తలలూపాం. నేను మొదటిసారి ఆయన్ను చూడ్డానికి వెళ్ళినప్పుడు ఆయన చూసిన చూపుతో 'చూపుల్తో గుచ్చి గుచ్చి చంపకే మేరె హాయ్' అన్న పాట నా మనసులో మెదిలింది' అన్నాడు గురూజీ. అనడమేకాదు రాగయుక్తంగా పాడి మరీ చూపించాడు' అన్నాడు రవి.

నవ్వీ నవ్వీ నాకు దగ్గొచ్చింది.

'అదేంటి మీ గురువు మొగాడే. గుగ్గురువు కూడా మొగాడే. ఒక మొగాడిని ఇంకొక మొగాడు అలా చూశాడంటే ఇద్దర్లో ఒకడు ఖచ్చితంగా తేడాగాడై ఉండాలి' అన్నా.

'ఏమో నాకూ అలాగే అనిపించింది అది విన్నప్పుడు' అన్నాడు రవి.

'గుగ్గురువు ఎక్కడున్నాడు' అడిగా.

'హార్ట్ ఎటాక్ వచ్చి పోయాట్ట కొన్నేళ్ళ క్రితం'  చెప్పాడు.

'అంతలా అందర్నీ చూసేవాడి హార్ట్ ఎన్నాళ్ళు పనిచేస్తుందిలే పాపం ! అయినా, మీరు వెళ్ళిన పనేంటి? ఆ పాటేంటి? ఏమైనా మ్యాచ్ అవుతోందా అసలు?' అడిగా నేను.

'అదే నాకూ అర్ధం కాలేదు. స్వామీజీకి చిన్నవయసు కూడా కాదు. ఏదో ముచ్చట పడుతున్నాడులే అనుకోడానికి. ఆయనకు డబ్బై పైనే ఉంటాయి' అన్నాడు రవి.

'హతవిధీ' అనుకున్నా మనసులో.

'ఇదిలా జరుగుతూ ఉండగా ఇంట్లోనుంచి ఇంకొకామె వచ్చి అయన చెవిలో 'గురూగారు ! వాళ్ళు లైన్లో ఉన్నారు. వస్తారట. మీరిచ్చిన క్యాష్ ఇమ్మంటారా వాళ్లకి?' అని అడిగింది.

'ఈ క్రొత్త క్యారెక్టర్ ఎవరు? అడిగా. 

'అంజలి అని స్వామీజీకి ప్రధానశిష్యురాలట. అక్కడ మొత్తం ఈమెదే హవా నడుస్తుంది. అంతేకాదు ఈమెకీ స్వామీజీ భార్యకీ అస్సలు పడదు. ఒక చిన్న ఇష్యూమీద, మా ఎదురుగానే 'నువ్వేంటే, నువ్వేంటే' అని ఇద్దరూ కీచులాడుకున్నారు' అన్నాడు రవి.

పడీ పడీ నవ్వా మళ్ళీ.

'కలబడ్డారా?' అడిగా.

'ప్రస్తుతానికి లేదు. ఊరకే తిట్టుకున్నారు. ఆ సీన్ కూడా చూస్తానేమో ముందుముందు' అన్నాడు. 

'అదంతా చూసి కూడా అక్కడే కూచున్నావు చూడు. నువ్వసలు గ్రేట్' అన్నా నేను.

'నేనే కాదు. అక్కడేదో పెద్ద తతంగం ఉంటుందని మా ఆవిడని కూడా తీసుకెళ్లా చూడు అక్కడ పోయింది నా పరువు. ఆమెకేమో ఈ రకమైన లేబర్ గోల అస్సలు నచ్చదు. నాకోసం నాలుగుగంటలు భరిస్తూ కూచుంది. చివర్లో లేవబోతే లేవలేక కాళ్ళు పట్టుకుపోయాయి మా ఇద్దరికీ' అన్నాడు రవి.

'అదేంటి? నేలమీద కూచున్నారా అంతసేపు? మరి స్వామీజీ?' అడిగాను.

'ఆయన హాయిగా సోఫాలో కూచున్నాడు. చేరోపక్కనా భార్యా, అంజలమ్మా కూచున్నారు' అన్నాడు.

పడీ పడీ నవ్వాను మళ్ళీ.

'నా మాట వినకుండా వెళ్ళినందుకు బాగా శాస్తి జరిగింది నీకు. నువ్వు వెళితే వెళ్లావు, సిస్టరెందుకు నీకు తోడు?' అన్నా.

'నా ఖర్మ ! ఏవో మంత్రాలు చెబుతాడని వెళ్ళా. నేన్రాను అంటున్నా వినకుండా తనని కూడా తీసికెళ్ళా' అన్నాడు.

'ఆ మంత్రాలన్నీ నెట్లో శుభ్రంగా దొరుకుతాయి. ఎవరినీ అడగక్కరలేదు. పోనీ ఉపదేశం చేశాడా?' అడిగాను.

'ఏమీ లేదు. ప్రింటెడ్ మెటీరియల్ ఇచ్చి, మంత్రాలన్నీ అందులో ఉంటాయి. జపించుకోండి అన్నాడు'

'మరి నాలుగ్గంటల పాటు నేలమీద కూచొని ఏం చేశారు?' అడిగాను.

'ఒక పళ్ళెంలో శ్రీచక్రం పెట్టి రకరకాల మంత్రాలతో దానికి పసుపు కుంకుమలతో పూజ చేయించాడు . ఆ తర్వాత ఆ శ్రీచక్రాలు మమ్మల్ని కొనుక్కోమన్నాడు'

'ఎంతట?'

'మామూలుది 15,000 ట, వెండిది 25,000 ట, ఎనర్జీ నింపినది 50,000 ట'.

'మరి కొనుక్కున్నావా?' అడిగా

'అంత అప్పారావులాగా కనిపిస్తున్నానా?' అన్నాడు రవి.

'మొన్నేమో వెంకట్రావన్నావ్ ఇప్పుడు అప్పారావంటున్నావ్ ఏంటి?'

'ఇంకా చాలామంది వస్తార్లె సమయాన్ని సందర్భాన్ని బట్టి, ఇంకోజోకు విను. శ్రీచక్ర పూజ అయ్యాక - 'ఇప్పుడు శివుడికీ అమ్మవారికీ పెళ్లి జరిగింది. అందుకని బూబంబంతి ఆడించాలి వాళ్ళని. ఆడాళ్ళు ఎవరన్నా ఒక పాట పాడండి' అన్నాడు స్వామీజీ'

ఈ సారి నవ్వి నవ్వి నాకు కడుపులో నొప్పి మొదలైంది.

'నాయనా ! నేనిక నవ్వలేను. ఏంటీ? శివుడికీ పార్వతికీ పెళ్ళిచేసి బూబం బంతి ఆడించారా మీరు? దానికొక పాటా? దీనిని శ్రీవిద్య అంటారా? సర్లే ఏదో ఒకటి, చివరికి నువ్వే పాడావా పేరంటం పాట?' అడిగాను నవ్వుతూనే.

'అదే విచిత్రం. అంతమంది ఆడాళ్ళున్నారుకదా అక్కడ. ఒక్కదానికీ పేరంటం పాటలు రావు. అదేంటో మరి?' అన్నాడు.

'ఇప్పుడవన్నీ ఎవరికీ గుర్తున్నాయి? టీవీ సీరియల్స్ లో వచ్చే జింగిల్స్ పాటలు చెప్పమంటే చెప్తారు నేటి ఆడాళ్ళు. వాళ్లకి పెళ్లిపాటలూ, పేరంటంపాటలూ ఎక్కడ గుర్తున్నై?' అన్నా నేను.

'ఏ ఆడదీ పాడకపోతుంటే, చివరకు స్వామీజీనే పాడాడు ఒక పాట. అదేంటో ఊహించు?' అడిగాడు రవి.

'ఏముంది? 'పార్వతీ కళ్యాణవైభోగము చూడరే సతులాల! పరగయందరి యుల్లములే రంజిల్లగా ' అనే పాటేగా, చాలాసార్లు విన్నాలే' అన్నా నేను.

'అదికాదు. ఓల్డ్ హిందీ సాంగ్ అందుకున్నాడు ! 'ఆధా హై చంద్రమా రాత్ ఆధీ, రేహన్ జాయే తేరీ మేరీ బాత్ ఆధీ ములాకాత్ ఆధీ ఆధాహై చంద్రమా ' అని పాడాడు' అదిట శివపార్వతుల బూబం బంతి పాట !' అన్నాడు రవి నీరసంగా.

నాకు వాయిస్ రాలేదు.

'అదేంటి? ఆపాటా? నిజంగానా?' అనడిగాను ఆశ్చర్యపోతూ.

'అవును. పైగా, మేం అడుగుతామని ఊహించి, 'ఏం? ఇదేం తప్పు పాట కాదు. ఫస్ట్ నైట్ కి ఈ సాంగ్ చాలా బాగుంటుంది' అని ముక్తాయింపు కూడా ఇచ్చాడు' అన్నాడు.

ఈసారి నాకు నవ్వు రాలేదు. ఏడుపొచ్చింది.

'పాపం జాలిపడు. తీరని కోరికలేమో స్వామీజీకి? అయితే, శ్రీవిద్యలో భాగంగా ఆ మంత్రాలతో పాటు ఆ పాటని కూడా కంటస్తం చేయ్యమన్నాడా మిమ్మల్ని?' అడిగాను.

'అదొక్కటే తక్కువ ఈ జన్మకి? ఎందుకెళ్లాన్రా దేవుడా? అని తిట్టుకోని క్షణం లేదు' అన్నాడు మళ్ళీ నీరసంగా.

'సరే అలా అయిందన్నమాట నీ ఉపదేశ ప్రహసనం?'

'అవును. చివర్లో కాళ్ళు పట్టుకుపోయి లేవలేకపోతే, ఎవరో పట్టుకుని నన్నూ నా భార్యనీ పైకి లేపారు. అంతసేపు క్రింద బాసింబట్లు వేసుకుని కూచోడం అలవాటు లేదుగా మనకి' అన్నాడు.

'ఇక ఇంటికి బయల్దేరావా?' అడిగా

'ఆ ! కుంటుకుంటూ బయటకొస్తుంటే గోడకున్న ఫోటోలలో ఒక ఫోటో కనిపించింది. అయిదేళ్ళ క్రితం రిషీకేష్ యాత్ర గ్రూప్ లో ఆ అమ్మాయి కూడా ఉంది. ఆ ఫోటో వాళ్ళదగ్గర చూశా' అన్నాడు.

'ఓహో ! అప్పట్లో నాకు చెప్పిందిలే. ఎవరో ఒక గురువుతో హిమాలయయాత్ర కెళ్లానని. ఈయనేనా ఆయన? అయితే ఆ గ్రూపులో కంటిన్యూ అవుతోందా? అప్పుడే అనుకున్నా ఎవడో ఒక దొంగగురువు చేతులో ఖచ్చితంగా ఇరుక్కుంటుందని' హాశ్చర్యపోయా మళ్ళీ.

(ఇంకా ఉంది)

read more " Online Sri Vidya - 3 "

13, నవంబర్ 2020, శుక్రవారం

Online Sri Vidya - 2

ఆ తర్వాత పదిరోజులదాకా రవి మళ్ళీ ఫోన్ చెయ్యలేదు. నేనూ తనకి ఫోన్ చేసి అడగలేదు. మనవాడు అంతటితో ఆగడని, ఏదో ఒకటి చేస్తాడని నాకు తెలుసు గనుక నేనూ గమ్మునున్నాను.

నేనూహించినట్లుగానే మళ్ళీ ఒకరోజున ఫోన్ మోగింది.

'ఏమైందో తెలుసా ఈ మధ్యకాలంలో?' అడిగాడు రవి.

' కొంపతీసి పోయాడా ఏంటి కరోనా దెబ్బకి?' అడిగా.

'ఛీ ఛీ, అంతమాటనకు. బ్రతికే ఉన్నాడు. ఆన్లైన్ లో దీక్షకూడా ఇచ్చాడు నాకు' అన్నాడు.

'శుభం, అయితే, పెద్దమనిషి వయ్యావన్నమాట' అన్నా నవ్వుతూ.

'ఇప్పుడు కొత్తగా అయ్యేదేముంది? నన్నుచూసి చాలా మందయ్యారు పెద్దమనుషులు' అన్నాడు తనూ నవ్వుతూ.

'సరే ఏం జరిగిందో చెప్పుము?' అన్నా.

తను చెప్పడం మొదలెట్టాడు.

'నాలాగా ఆయన్ను సంప్రదించిన ఒక అరవైమందికి ఆన్లైన్ లో దీక్షనిచ్చాడు మొన్ననే. ఒక్కొక్కరం ఆరువేలు కట్టాం'

'భలే ఉందే ఈ బిజినెస్! అంటే ఒక్కరోజులో అతని ఆదాయం మూడులక్షల అరవైవేలన్న మాట' అన్నా నేను.

'అవును. చెప్పేది విను. మధ్యలో డిస్టర్బ్ చెయ్యకు. అందరం స్కైప్ మీటింగ్ లో కలిశాం. మాలో కొందరు ఇండియానుంచి, మరి కొందరు అమెరికా నుంచి, ఇంకా రకారకాల దేశాల నుంచి ఉన్నారు. అయితే అందరూ ఇండియన్సే. మొదటి రోజు ఏం నేర్పించాడో తెలుసా?' అడిగాడు.

'నువ్వేగా మాట్లాడొద్దన్నావ్? మళ్ళీ ప్రశ్నలేంటి?' అన్నా.

'సరే విను. పసుపుముద్దతో గణపతిబొమ్మ చెయ్యడం నేర్పించాడు ముందుగా.' అన్నాడు. 

నవ్వుతో పొలమారింది నాకు. నవ్వి నవ్వి తమాయించుకుని 'మంచిదేలే. నేర్చుకో. అలాంటివి నేర్పుకుంటే, రిటైరయ్యాక ఖాళీగా ఉండకుండా, పౌరోహిత్యం చేసుకోవచ్చు. ఆ తర్వాత తమలపాకులలో వక్కలు పెట్టడం, దీపారాధన కుందులలో నూనె పొయ్యడం, వత్తులు వెలిగించడం, నేర్పించి చివరాఖరికి తద్దినాలు పెట్టడం నేర్పించి ఇదే శ్రీవిద్య అంటాడేమో చూస్కో మరి? ' అన్నా.

'అలాగే ఉంది చూడబోతే' అన్నాడు తనూ నవ్వుతూ.

'మరి నీ ర్యాంక్ ఏంటో చెప్పావా?' అడిగా.

తను కలెక్టర్ కంటే పై ర్యాంక్ లో ఉన్నాడు ప్రస్తుతం. అదీగాక ప్రస్తుతం పవర్లో ఉన్న ఒక సెంట్రల్ మినిష్టర్ గారికి తను చాలా దగ్గరి బంధువు అవుతాడు.

'దానికే వస్తున్నా. పరిచయాల కార్యక్రమం మొదలైంది. అందరం పరిచయం చేసుకున్నాం. ఒకాయన కేసి ఆర్ ప్రభుత్వంలో ఒక మంత్రిగారికి పీయే. నేనేమో ఇది. అందుకని మా ఇద్దరి బయోడేటా వినగానే వాళ్ళ మైండ్ బ్లాంకైంది. మా ఇద్దరికీ స్పెషల్ ట్రీట్మెంట్ మొదలైపోయింది.' అన్నాడు.

'అంతేగా మరి? లోకమంతా డబ్బు చుట్టూ పవర్ చుట్టూ గిరగిరా తిరుగుతోంది. వాటి ముందు అమ్మవారైనా బలాదూరే' అన్నాను.

'అదేంటి అంతమాటనేశావ్?' అడిగాడు.

'మరేంటి చెప్పు? అమ్మవారితో డైరెక్ట్ గా మాట్లాడతాడని ప్రచారాలు. ఆయనేమో మీ వివరాలు విని మిమ్మల్ని కాకా పడుతున్నాడు. ఇంకేమనాలి మరి?' అన్నాను.

'అవున్లే. అలాగే ఉంది. అందుకేనేమో మా వివరాలు విన్నాక  - 'చూశారా అమ్మవారి దయ ! నాకు ఇన్ కంటాక్స్ ఇష్యూస్ ఉన్నాయి. అందుకని మినిస్టర్ లెవల్లో ఉన్న మీ ఇద్దరినీ నా దగ్గరికి తెచ్చింది అమ్మవారు' అన్నాడు. మేమేం మాట్లాడలేదు. పరిచయాలయ్యాక స్వామీజీ భార్య లైన్లో కొచ్చి, అందరం డబ్బులు కట్టామా లేదా తీరికగా లెక్క చూసుకుంది' అన్నాడు.

నాకు మళ్ళీ నవ్వుతో పొలమారింది.

'అదేంటి స్వామీజీకి భార్యా? ఇదేంటి కొత్తగా వింటున్నాను' అన్నా.

'అంత ఆశ్చర్యపోకు. ఇంకా చాలా ఉంది కధ. స్వామీజీ మంచి జోకులు కూడా పేలుస్తాడు. అంటే, మంచి జోకులని తననుకుంటాడుగాని, ఆవేమో కుళ్ళుజోకులు, ఇలా డబ్బులు లెక్క చూసుకుంటుపుడు, ఒకామె అమరికా నుంచి లైన్లో ఉంది. ఆమె ఒళ్ళో ఒక చిన్న బాబున్నాడు. ఆమెని చూచి స్వామీజీ ' ఏంటమ్మ ! ఒకరికని ఆరువేలు కట్టి, మీ అబ్బాయిని కూడా తెచ్చావా దీక్షకి? ఆ బేబీకి కూడా డబ్బులు కట్టావా మరి, హాఫ్ టికెట్ కింద మూడువేలు?' అంటూ కుళ్ళు జోకు పేల్చాడు' అన్నాడు.

'నవ్వావా ఆ జోకుకి?' అడిగా.

'నవ్వొకటి? ఏడుపు మొదలైంది ఎందుకు డబ్బులు కట్టానా అని" అన్నాడు.

'అప్పుడే ఏమైంది? ముందుంది నీకు ముసళ్ళపండగ. మొత్తం ఒక ఇరవైలక్షలదాకా వదిల్తే గాని నిన్ను వదలడు చూడు' అన్నా.

'అంత వెంకట్రావులాగా కనిపిస్తున్నానా నేను?' అన్నాడు.

'అబ్బే అంతమాట నేనేందుకంటాను గాని, తర్వాత ఏం నేర్పాడు? అడిగా.

'గణపతిపూజ నేర్పి, లక్ష్మీగణపతి మంత్రం చెప్పి, ఒక నలభైరోజులపాటు ఆ మంత్రంతో గణపతికి తర్పణాలు వదలమని చెప్పాడు. అలా చేస్తే కుండలిని రైజ్ అవుతుందట' అన్నాడు

'ఎవరికి గణపతికా? నీకా?' అడిగా సీరియస్ గా గొంతు పెట్టి.

'అదే మరి ! నీ జోకులు ! ఆ విధంగా తర్పణాలు నేర్చుకున్నాను' అన్నాడు.

'తర్పణాలు కూడా నేర్చుకున్నావా? మా నాయనే ! ఆ తర్వాత పిండప్రదానం ఉంటుందేమో ఖర్మ? ఇదా శ్రీవిద్య అంటే? అసలు తనకైందా కుండలిని రైజ్?' అడిగా నేను నవ్వుతూ.

'ఏమో నాకు తెలీదు' అన్నాడు తను.

'అసలీయన స్వామీజీ ఎలా అయ్యాడు? ఎవరి దగ్గర సన్యాసం తీసుకున్నాడు? తీసుకుంటే పెళ్ళాం ఎందుకుంది? తీసుకోకపోతే మీరు స్వామీజీ అని ఎలా పిలుస్తున్నారు?' ప్రశ్నలు సంధించా నేను.

'ఏమో అవన్నీ నాకు తెలీదు, మాకు మంత్రాలు కావాలి. ఆయన ఉపదేశిస్తున్నాడు. అందుకని వెళుతున్నాం' అన్నాడు.

తనలా అంటుంటే నాకు 'గాలిస్వామి' గుర్తొచ్చాడు. ఈ గాలిస్వామికి చాలామంది భక్తగణం ఉన్నారు. ఆయన ముఖం చూస్తే మోషన్ అయ్యి ఆర్నెల్లు అయిన ఫేస్ కనబడుతుంది. ఈయన భక్తులలో ఒకడి కూతురికి ఏదో తీరని జబ్బు చేసిందట. ఆమెను ఒక గదిలో ఉంచారు. ఎక్కడో వేరే చోట ఉన్న ఈ స్వామి, ఒకరోజు రాత్రి గాలిరూపంలో ఈమె గదిలోకి వచ్చి ఏదో చేశాడట. ఆ తర్వాత ఆ పిల్లకి రోగం తగ్గిపోయిందట. ఈ కధని ఒక మూఢభక్తుడు నాకు చెప్పాడు. నాకు నవ్వాలో ఏడవాలో అర్ధం కాలేదు. ఇలాంటి దొంగలందరూ స్వాములంటూ పేర్లు పెట్టుకుని సొసైటీని మోసం చేస్తున్నారు.

అసలీ గోలంతా, సత్యసాయిబాబా పోయాక మొదలైంది. అప్పుడేర్పడిన ఖాళీని పూరించడానికి పుట్టగొడుగులలాగా ఎక్కడపడితే అక్కడ ఛోటాబాబాలు వెలిశారు. వాళ్ళలో కొందరిని హవాలాకోసం రాజకీయనాయకులే పుట్టించారు. కొందరిని కులసంఘాలు పుట్టించాయి. స్వామీజీలకు కులాలకు ఏమిటి సంబంధమని మీకు హనుమానం రావచ్చు. ఇనుకోండి మరి !

కొన్ని కులాలలో ఆధ్యాత్మికత అస్సలుండదు పాపం. వాళ్ళకు తెలిసిన ఆధ్యాత్మికత అంతా కూడా గుళ్ళు, గోపురాలు, పూజలు, మొక్కులు ఇంతవరకే. వాళ్ళలో ఎవరైనా రెండు పుస్తకాలు చదివి ధ్యానం, కుండలినీ, ఆత్మసాక్షాత్కారం వంటి నాలుగుమాటలు నేర్చుకుంటే చాలు - 'అబ్బ1 మనలో ఇలాంటోడు ఇప్పటిదాకా లేడు, వీడిని మనం ప్రోమోట్ చేసి కొత్త బిజినెస్ స్టార్ట్ చేద్దాం' - అంటూ కొందరు కులగులగాళ్ళు బయలుదేరతారు ! వాళ్ళకి తోడుగా ఎవడో ఒక రాజకీయనాయకుడుంటాడు. అందరూ కలసి ఆధ్యాత్మికవ్యాపారం పెట్టి, లోకాన్ని మోసం చేస్తూ ఉంటారు. గొర్రెలు మోసపోతూ ఉంటారు. ప్రస్తుతం ఉన్న స్వామీజీలలో చాలామంది ఇలాంటి ఫ్రాడ్ గాళ్లే.

అయితే, ఎల్లకాలం జనాన్ని మోసం చేయడం కుదరదు కదా ! అందుకని వాళ్ళలో చాలామంది కాలగమనంలో చప్పబడిపోయారు. వాళ్ళలో ఒకాయనైతే తాగితాగి లివర్ ఫెయిలై చచ్చేపోయాడు. కులస్వామీజీలు, రాజకీయస్వామీజీల హవా నడుస్తోందిప్పుడు. కలికాలమంటే ఇదేగా మరి !

అమెరికాలో ఉండే ఒకామె, ఇలాగే పనీపాటా లేక, ధ్యానమంటూ ఏదో కొన్నేళ్లపాటు చేసి ఏకంగా ఒక పుస్తకమే రాసింది. ఆమెకు ఆత్మలు, దేవతలు కనిపిస్తారట. వాళ్ళాయన ఆఫీసుకి వెళ్ళగానే సాక్షాత్తూ అమ్మవారే ప్రత్యక్షమై పక్కన కూర్చుని, మళ్ళీ వాళ్ళాయన ఆఫీసునుంచి వచ్చేవరకూ కబుర్లు చెబుతూ ఉంటుందట. అమెరికాలో పనీపాటా లేకుండా ఇంట్లో ఉండే ఆడాళ్ళకి ఇలాంటి భ్రమలతో కూడిన పిచ్చిఎక్కే ఛాన్సులు చాలా ఎక్కువగా ఉంటాయి., హైదరాబాద్ లో జరిగిన ఆ పుస్తకం ప్రారంభోత్సవానికి రమ్మని నాకూ మెయిల్ ఇచ్చింది. మళ్ళీ నాకు నవ్వాలో ఏడవాలో అర్ధం కాలేదు. 'నువ్వు భ్రమల్లో ఉన్నావు. నువ్వు అనుకుంటున్నవి ఆధ్యాత్మిక అనుభవాలు కావు. అవి భ్రమలు. నీకు సైకియాట్రీ ట్రీట్మెంట్ కావాలి. త్వరలో నీకు పిచ్చిపుట్టడం  ఖాయం' అని చెప్పి నేనా ఫంక్షన్ కి పోలేదు.

ఆధ్యాత్మిక లోకంలో ఇలాంటివి ఎన్ని మాయలో !

గాలిస్వామి భక్తులు కొందరు నన్ను పరీక్ష చేద్దామని గతంలో నా దగ్గరకి వచ్చారు.

ఏం కావాలని వారిని అడిగాను.

'మాకు ఆత్మసాక్షాత్కారం కావాలి' అని వాళ్ళు తెలివిగా జవాబు చెప్పారు.

వాళ్ళని చూస్తే ఆత్మసాక్షాత్కారం కోసం ప్రయత్నం చేసే ముఖాలలాగా నాకనిపించలేదు. రియల్ ఎస్టేట్ మాఫియా లాగా ఉన్నారు.

'అది చాలా చిన్న పని. నా మార్గంలో ఆత్మసాక్షాత్కారం చాలా తేలికగా వస్తుంది' అని వాళ్ళతో సిన్సియర్ గానే చెప్పాను. కానీ వాళ్ళు నన్ను నమ్మలేదు. నమ్మడానికి నా దగ్గర వేషంలేదు కదా మరి? మందీమార్బలం, మహిమలు కూడా లేకపాయె ! చూట్టానికి వాళ్ళకంటే సాదాసీదాగా ఉంటిని. నన్నెలా నమ్మగలరు వాళ్ళు? కనుక మళ్ళీ తిరిగి చూస్తే ఒట్టు !

'అతనిదగ్గరేమీ సరుకు లేదు. మనలాంటోడే. కాకపోతే కాస్త ఇంగ్లీషు బాగా మాట్లాడగలడు, ఏవో నాలుగు పుస్తకాలు చదివాడు, రెండు పుస్తకాలు రాశాడు. అంతే' -- అని గాలిస్వామికి నాగురించి చెప్పి ఉంటారు.

ఈ గాలి(మలబద్ధక)బాబా వుంకొక భక్తుడికి ఒక కూతురుంది. ఆ కూతురు తన క్లాస్ మేట్ ని ప్రేమించింది. ఆ అబ్బాయిది తెలంగాణా. అమ్మాయిది ఆంధ్రా. ఇంతలో అమ్మాయికి ఒక కెనడా సంబంధం వచ్చింది. తెలంగాణా అబ్బాయి పాపం నిజంగానే ఈ అమ్మాయిని ప్రేమించాడు. ఇద్దరూ డాక్టర్లే. పెళ్లి చేసుకుని హాయిగా ఉండవచ్చు. కానీ వీళ్ళ ప్రేమ గాలిమలబద్ధకబాబాకి నచ్చలేదు. 'తెలంగాణా అబ్బాయి వద్దు. కెనడా సంబంధం చెయ్యి. వాళ్ళనూ నా భక్తులను చెయ్యి. వాళ్ళ దగ్గర కూడా డబ్బులు బాగా గుంజుతాను' అని బాబా చెప్పాడు. ఇప్పుడా అమ్మాయి కూడా మనసు మార్చుకుని కెనడా వైపు మొగ్గుతోంది. ఇవీ బాబాల భాగోతాలు !

వీళ్ళున్నది ఆధ్యాత్మికత నేర్పడానికా? లేకపోతే కుటుంబపంచాయితీలు చెయ్యడానికా? ఓ అయాం సారీ ! నేర్పాలంటే, ముందుగా వాళ్లకు తెలియాలిగా ? ఈ పాయింట్ మర్చే పోయాను సుమీ !

ఈ గాలిబాబా దగ్గర పెద్ద సబ్జెక్ట్ కూడా ఏమీ లేదు. ఏదేదో సొల్లు వాగుతూ ఉంటాడు. పిచ్చిజనం నమ్ముతూ ఉంటారు  ఇతని కులం వాళ్ళందరూ కలసి ఇతన్నొక గురువుగా ప్రోమోట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఇలాంటి కులగోల ఎక్కువగా సాగుతోంది.

ఇలాంటి గాలిబాబాలు, ధూళిబాబాలు అనేకమంది కాకమ్మకబుర్లు చెబుతూ జనాన్ని పిచ్చోళ్లని చేస్తున్నారు. అలాంటివాళ్ళలో ఈ ఆన్లైన్ శ్రీవిద్యస్వామి కూడా ఒకడని నాకనిపించింది.

అదంతా గుర్తు చేసుకుంటూ ' తర్వాతేమైంది చెప్పు' అడిగాను.

చెప్పడం సాగించాడు రవి.

(ఇంకా ఉంది) 

read more " Online Sri Vidya - 2 "

9, నవంబర్ 2020, సోమవారం

పతంజలిమహర్షి విరచిత యోగసూత్రములు 'ఈ - బుక్' విడుదలైంది

మన ప్రాచీన జ్ఞానసంపదను సులభమైన భాషలో అందరికీ అందుబాటులోకి తేవాలన్న సంకల్పయాత్రలో భాగంగా ప్రాచీన ప్రామాణిక గ్రంధములను మా 'పంచవటి' నుండి ప్రచురిస్తూ వస్తున్నాం. ఈ యాత్రలో భాగంగా ఈరోజున 2400 సంవత్సరముల నాటి 'పతంజలిమహర్షి విరచిత యోగసూత్రములు' ఈ - బుక్ ను విడుదల చేస్తున్నామని చెప్పడానికి చాలా సంతోషిస్తున్నాను.

ఆధ్యాత్మికప్రపంచంలో మనకున్న వారసత్వ జ్ఞానసంపద ఏ ఇతరదేశానికీ ఏ ఇతరజాతికీ లేదు. కానీ మన దురదృష్టమేమంటే, మన ప్రాచీన గ్రంధాలలో ఏముందో మనకే తెలియదు. దీనికి కారణాలు అనేకం. సంస్కృతం పరాయిభాష అయిపోవడం ఒకటి, మన మతంపైన మనకే నమ్మకం లేకపోవడం మరొకటి, ఒకవేళ నమ్మకం ఉన్నప్పటికీ, అందులో ఎంతెంత విజ్ఞానసంపద ఉన్నదో తెలుసుకోవాలన్న జిజ్ఞాస లేకపోవడం మరొకటి, ఉన్నదానిని ఉన్నట్లుగా శుద్ధంగా చెప్పే గురువులు లేకపోవడం ఇంకొకటి, పరాయిమతాల దుష్టప్రచారం ఇంకొకటి - ఇలా కారణాలు చాలా ఉన్నాయి. ఈ క్రమంలో ఎవరేది చెబితే దానిని గుడ్డిగా నమ్ముతూ దొంగగురువుల వలలో పడుతున్న అభాగ్యులు వేలూ లక్షలలో ఉన్నారు. పరాయిమతాల ప్రచారాలు నమ్ముతూ మతం మారుతున్న వారు కూడా అలాగే ఉన్నారు. నా దృష్టిలో వీరందరూ దురదృష్టవంతులు. మనకున్న జ్ఞానసంపద ఏమిటో అర్ధమైతే ఈ దురవస్థ ఉండదు. అలాంటి సంపదలో ఈ గ్రంధం తలమానికమైనట్టిది.

వ్యాసమహర్షి, శంకరులు, వివేకానందస్వామి, ఇంకా ఎందరో మహనీయులు, పండితులు, ఈ ప్రాచీన గ్రంధమునకు వ్యాఖ్యానం చేసి ఉన్నారు. నా గురువుల అనుగ్రహమును బట్టి , సాధనామార్గంలో నా అనుభవములను బట్టి, దీనికి నేను వ్యాఖ్యానం వ్రాశాను. అతి గహనమైన ఈ గ్రంధమునకు ఇంత సరళమైన, సమగ్రమైన వ్యాఖ్యానం ప్రపంచ చరిత్రలోనే  ఇంతవరకూ  రాలేదని సవినయంగా చెబుతున్నాను. జగజ్జనని కాళి అనుగ్రహమే ఈ అదృష్టానికి కారణం.

నాకు 13 ఏళ్ల వయసులో, వివేకానందస్వాముల వారి రాజయోగోపన్యాసముల ద్వారా, మొదటిసారిగా పతంజలి యోగసూత్రములను నేను చదివాను. ఆ తరువాత ఎన్నిసార్లు చదివానో లెక్కలేదు. నా గురువులలో ఒకరైన నందానందస్వాములవారు నాకిచ్చిన బహుమతి వివేకానందస్వాముల వారి రాజయోగోపన్యాసములున్న పుస్తకమే.

యోగసూత్రములు చాలా చిక్కటి సంస్కృతభాషలో ఉంటాయి. వీటిలో ఎన్నో యోగరహస్యములున్నాయి. సామాన్యులకు అవి అంత సులభంగా అర్ధం కావు. ఎప్పటికైనా వీటి సరియైన అర్ధములను, నా అవగాహనను, అనుభవాలను రంగరించి, సరళమైన భాషలో లోకానికి తెలిసేలా చెప్పాలన్న సంకల్పం నాకు చిన్నప్పుడే కలిగింది. ఆ సంకల్పం నేటికి నెరవేరినది.

ఆయా సూత్రములను వివరించే చోట్లలో, సందర్భానుసారంగా, ఉపనిషత్తుల నుండి, భగవద్గీత నుండి, ఇతర గ్రంధముల నుండి శ్లోకములను ఉటంకించి నా వ్యాఖ్యానమునకు ఒక పరిపూర్ణతను తెచ్చాను. నేటి దొంగగురువులందరూ ఈ పుస్తకమును చదివి, కనీసం ఇప్పటికైనా మంచిబుద్ధి తెచ్చుకుంటారని, అసలైన హిందూమతం ఏమిటో గ్రహిస్తారని, వారి దొంగవ్యాపారములను మానుకుని సరియైన ఆధ్యాత్మికమార్గంలోకి వస్తారని ఆశిస్తున్నాను. అమాయకహిందువులు అసలైన హిందూత్వమంటే ఏమిటో, అసలైన ఆధ్యాత్మికమార్గం ఎలా ఉంటుందో, తెలుసుకుంటారని ఆశిస్తున్నాను.

దేశవిదేశాలలో ఉన్న నా అభిమానుల కోసం, త్వరలోనే ఈ పుస్తకం ఇంగ్లీష్ 'ఈ బుక్' గా వస్తుంది. ఇంగ్లీష్ అనువాదపు పని మొదలైపోయింది. ఆ తర్వాత త్వరలోనే  తెలుగు ఇంగ్లీషు భాషలలొ ప్రింట్ పుస్తకంగా విడుదల అవుతుంది.

యోగశాస్త్రమును సక్రమంగా అర్ధం చేసుకోవాలన్న జిజ్ఞాస ఉన్నవారికి ఈ పుస్తకం ఎడారిలో సెలయేరు లాంటిదని వేరే చెప్పనవసరం లేదు.

ఈ పుస్తకం వ్రాయడంలో నా శ్రీమతి సహకారం అమూల్యం. నా శిష్యురాళ్ళు అఖిల, శ్రీలలితల పాత్ర చిరస్మరణీయం. కవర్ పేజీ డిజైన్ చేయడంలో నా శిష్యుడు ప్రవీణ్ తోడ్పాటు శ్లాఘనీయం. 'పంచవటి ఫౌండేషన్' సెక్రటరీ రాజు సహాయం ప్రశంసనీయం. నిరంతరం సాగుతున్న ఈ మహాయజ్ఞంలో తెరవెనుక పాత్రధారులైన అదృష్టవంతులు వీరే.

యధావిధిగా ఈ పుస్తకం కూడా pustakam.org నుంచి లభిస్తుంది. చదవండి. భారతీయులుగా పుట్టినందుకు, ఇంతటి జ్ఞానసంపదకు వారసులైనందుకు గర్వించండి. యోగమార్గంలో నడిచే ప్రయత్నం చెయ్యండి. మానవజన్మను సార్ధకం చేసుకోండి.

read more " పతంజలిమహర్షి విరచిత యోగసూత్రములు 'ఈ - బుక్' విడుదలైంది "