“అసమర్ధజాతికి ఆత్మగౌరవ అర్హత ఉండదు"

30, జులై 2021, శుక్రవారం

గోవా రేపులు

ఒకవైపున రాజ్ కుంద్రా కేసు ఎటూ తేలకుండా నానా మలుపులూ తిరుగుతోంది.

23 వ తేదీన వ్రాసిన పోస్టులో సెక్స్ నేరాలు జరుగుతాయని ఊహించాం కదా ! జరుగుతున్నాయి చూడండి మరి !

సరిగ్గా మర్నాడే, 24-7-2021 రాత్రి గోవా బీచిలో ఇద్దరు మైనర్ బాలికలు రేప్ కి గురయ్యారు. తెల్లవార్లూ ఇద్దరు అబ్బాయిలతో కలసి బీచ్ లో గడిపిన వీళ్ళని, పోలీసులమంటూ బెదిరించిన లోకల్ వ్యక్తులు గాంగ్ రేప్ చేశారు.

'ఆ  వయసు ఆడపిల్లల్ని రాత్రంతా అలా బీచ్ లో ఉండనివ్వడం ఏమిటి? ఆ  తల్లిదండ్రులు కాస్తన్నా ఆలోచించుకోరా?' అని అడిగిన గోవా ముఖ్యమంత్రిని అందరూ దుమ్మెత్తి పోశారు. అంటే, బీచ్ లో రాత్రంతా గడిపేవారికి రక్షణగా ఒక్కొక్కరి పక్కనా ఒక్కొక్క పోలీసును పెట్టాలేమో ప్రభుత్వం? చాలా గొప్పగా ఉంది విమర్శకుల అభిప్రాయం !

అసభ్యంగా ఆ బట్టలేంటి? అంటే తప్పు. రాత్రంతా బీచిలో ఎందుకు? అంటే తప్పు. ఆ త్రాగడం ఏంటి? అంటే తప్పు. అలా తిరగడం ఏంటి? అంటే తప్పు. ఏమన్నా తప్పే. నేటి సమాజంలో శ్రీరామ అంటేనే బూతౌతోంది. ఎవరైనా ఏమైనా చెయ్యవచ్చు. కానీ అన్నింటికీ ప్రభుత్వమే జవాబుదారీ వహించాలి. అదికూడా మళ్ళీ కొన్ని ప్రభుత్వాలే. గ్రేట్ !

అందుకే కరోనా వచ్చి అందర్నీ చావగొడుతోంది.

సరే గోవాలో ఇవన్నీ మామూలే అనుకోకండి. మామూలనేది ఏదీ ఉండదు. ఏది ఎప్పుడు జరగాలో అప్పుడు జరుగుతుంది.

26-7-2021 సోమవారం నాడు నార్త్ ఈస్ట్ నుంచి గోవాకు వచ్చిన ఇంకో అమ్మాయిని ఒక ఫ్లాట్ లో బంధించి రెండు రోజులపాటు అత్యాచారానికి గురి చేశారు ఇంకొక ఇద్దరు. ఈ సంఘటన కూడా మళ్ళీ గోవాలోనే.

సముద్రతీరంలోనే ఈ సంఘటనలు జరగడం గమనార్హం. గ్రహప్రభావం స్పష్టంగా ఉందా లేదా మరి?

read more " గోవా రేపులు "

26, జులై 2021, సోమవారం

జ్యోతిష్యం నేర్చుకోవడానికి ఎవరు అర్హులు?

ఈరోజుల్లో జ్యోతిష్యం అనేది ఒక సరదా అయిపొయింది. ఒక బిజినెస్ అయిపొయింది. దానికి తోడు ఇంటర్ నెట్ అనేది వచ్చేసి అన్నింటినీ అందుబాటులోకి తెచ్చింది. ముఖ్యంగా ఇంట్లోనే కూర్చుని జ్యోతిష్యాది విద్యలను నేర్చేసుకోవచ్చనే దురభిప్రాయం జనాలలో వచ్చేసింది. ఇది నిజం కాదు.

నా పుస్తకాలు, బ్లాగు పోస్టులు చదివిన చాలామంది నాకు మెయిల్స్ ఇస్తూ ఉంటారు. 'మీ దగ్గర జ్యోతిష్యం నేర్చుకోవాలని ఉంది. నేర్పిస్తారా?' అంటూ. అందరికీ ఓపికగా జవాబులిస్తూ ఉంటాను. ఈ మధ్య చాలా ఎక్కువమంది అడుగుతున్నారు. అందుకని, ఒక్కొక్కరికీ మెయిల్ ద్వారా అదే విషయాన్నీ చెప్పలేక, బ్లాగు ముఖంగా ఈ పోస్టు ద్వారా వారికందరికి జవాబిస్తున్నాను. గమనించండి.

జ్యోతిష్యశాస్త్రం తేలిక విషయం కాదు

జ్యోతిష్యశాస్త్రమనేది మిగతా సైన్సు, ఆర్ట్స్, కామర్స్ లాగా క్లాసుల్లో కూచుని ఆషామాషీగా నేర్చుకునే విద్య కాదు. ఇది కర్మతో చెలగాటం. తేడావస్తే జ్యోతిష్కుని చేతులు కాలిపోతాయి. దీనికి చాలా లోతుపాతులున్నాయి. వీటిని నేర్చుకోవడమూ కష్టమే, చెప్పడమూ కష్టమే. ఎందుకంటే, నేర్చుకోడానికి ఏళ్లకేళ్లు పడుతుంది. ఇది ఒకటి రెండేళ్లలో వచ్చేసే విద్య కాదు.

ఆ తరువాత, దానిని ఉపయోగించి ఇతరుల కర్మలో జోక్యం చేసుకుని, వారికి రెమెడీలు చెప్పేటప్పుడు, జ్యోతిష్కునికి ఆ ఖర్మలో భాగం చుట్టుకుంటుంది. అందుకే, జ్యోతిష్కుల కుటుంబాలలో తీరని శాపాలుంటాయి. ఆషామాషీగా, లెక్కలేనితనంతో, ఇష్టం వచ్చినట్లు ఈ శాస్త్రంతో ఆడుకుంటే, కుటుంబాలకు కుటుంబాలే సర్వనాశనం అవుతాయి. ఈ విషయం చాలా మందికి తెలీక, జ్యోతిష్యమంటే ఏదో పిల్లాట అనుకుంటారు. ఇది అజ్ఞానపు భావన.

డబ్బుకోసం జ్యోతిష్యాన్ని వాడకూడదు

నేడు చాలామంది ఏదో నాలుగుముక్కలు జ్యోతిష్యంలో ఓనమాలు నేర్చుకుని, మాటకారితనంతో, జనాలను మాయచేస్తూ డబ్బులు సంపాదిస్తున్నారు. వారు ముందుముందు పడే బాధలు భయంకరంగా ఉంటాయి. జ్యోతిష్యమంటే విలువలు లేని వ్యాపారం కాదు. డబ్బుకు ఆశపడేవాడు జ్యోతిష్యాన్ని నేర్చుకుంటే, తన గొయ్యి తానే తవ్వుకున్నట్లు అవుతుంది. గమనించండి.

బ్రాహ్మణులే జ్యోతిష్యాన్ని నేర్చుకోవడానికి అర్హులు

ఇలా అన్నానని నేనేదో మళ్ళీ కులపక్షపాతినని అనుకోకండి. నాకు 'నిజమైన' బ్రాహ్మణత్వమంటే అమితమైన గౌరవం ఉన్నమాట నిజమే. కానీ కులాన్ని గృష్టిలో పెట్టుకుని నేనేమాట చెప్పడం లేదు. ఆ మాటకున్న విస్తృతమైన అర్ధాన్ని దృష్టిలో పెట్టుకుని చెబుతున్నాను.

'బ్రాహ్మణుడు' అంటే, పాతకాలపు అర్ధంలో, ఒక ఋషిలాగా బ్రతికేవాడని అర్ధం. డబ్బుకోసం వెంపర్లాడకుండా, సత్యసంధత, నిజాయితీ, మోసంలేని జీవితం, నిరాడంబరత్వం, తపస్సు మొదలైన విలువలకోసం బ్రతికేవాడని అర్ధం.  అటువంటి వాడు మాత్రమే జ్యోతిష్యశాస్త్రాన్ని నేర్చుకోవడానికి అర్హుడు.

ఎందుకంటే, జ్యోతిష్యం ఇతరుల కర్మతో చెలగాటమని ముందే చెప్పాను కదా ! ఎన్నెన్నో పాపాలు చేసిన, ఎంతో పాపఖర్మను మూటకట్టుకున్న జీవులే ఈ జన్మలో నానాకష్టాలూ పడుతుంటారు.  కష్టాలు పడేవాళ్ళే జ్యోతిష్యశాస్త్ర సహాయం కోరుకుంటారు.  మరి వాళ్ళ ఖర్మలో జోక్యం చేసుకున్నప్పుడు, తప్పకుండా దానిలో కొంత వాటాను జ్యోతిష్కుడు అనుభవించవలసి వస్తుంది. అవి తీరని పెద్దపెద్ద పాపాలైతే, ఆ శాపాలు ఘోరంగా జ్యోతిష్కుడికి తగులుతాయి.

రెమెడీలతో పోతాయి కదా అని మీరు అనవచ్చు. ఈ పిచ్చిపిచ్చి రెమెడీలతో ఏ కర్మా పోదు. మీకు డబ్బులు మాత్రమే వదుల్తాయి. తెలిసీ తెలియని అబద్దాలు చెప్పి, డబ్బుకోసం అక్కర్లేని హోమాలు, రెమెడీలు చేయించినందుకు లేనిపోని కర్మ ఆ జ్యోతిష్కుడిని చుట్టుకుంటుంది. ఈ రోజు కాకపోతే రేపు అతను ఆ కర్మను తప్పకుండా అనుభవించవలసి వస్తుంది.

గాయత్రీ జపం చేస్తే రెమెడీలు చెప్పిన దోషం పోతుంది కదా అని కొంతమంది అంటారు. మొక్కుబడిగా చేసే గాయత్రీ జపంతో ఏ దోషమూ పోదు. 15 సార్లు అక్షరలక్షలు జపం చేసిన విద్యారణ్యస్వామికే గాయత్రీ దర్శనం కాలేదు. తూతూమంత్రంగా, ఆదరాబాదరాగా చేసే జపం ఎందుకూ పనికిరాదని గ్రహించండి. 

ఏతావాతా చెప్పేదేమంటే, ఒక ఋషిలాగా ఆశకు అతీతంగా బ్రతికేవాడే జ్యోతిష్యశాస్త్రం జోలికి పోవాలి. లేదా, నానాబాధలనూ అనుభవించక తప్పదని గుర్తుంచుకోండి. జ్యోతిష్కుని మనస్సులో ఏమాత్రం దురుద్దేశం తలెత్తినా, అతనికి వేటు పడుతుంది.  ఇది తప్పదు.

కనుక, ఒక నిజమైన స్వచ్చమైన బ్రాహ్మణునిలా బ్రతకగలవాడు మాత్రమే ఈ విద్యను నేర్చుకోవడానికి అర్హుడు. అంతేగాని, ఎక్కడబడితే అక్కడ తింటూ, విచక్షణ లేకుండా ఏ పని పడితే ఆపని చేస్తూ, కర్మను నమ్మకుండా 'ఈరోజు దక్కింది చాలు. రేపటి సంగతి రేపు చూచుకుందాం' అనుకుంటూ, అబద్దాలు చెబుతూ, మోసాలు చేస్తూ, విలువలు లేని జీవితం గడుపుతూ ఉన్నవారు, ఈ విద్య జోలికి అస్సలు రాకూడదు.

జ్యోతిష్యాన్ని వాడి ఏమేం చేయవచ్చు?

చాలామంది, ఈ శాస్త్రాన్ని సరదాకి, గొంతెమ్మకోరికలు తీర్చుకునే మార్గాలు తెలుసుకోవడానికి, అత్యాశకు వాడుతూ ఉంటారు. ఇది చాలా తప్పు.

లాటరీలకోసం, షేర్ మార్కెట్ కోసం, అప్పనంగా డబ్బు సంపాదించడం కోసం, ఎదుటి మనిషికి హాని చెయ్యడం కోసం, లేకి విషయాల ప్రశ్నలకోసం, ఈ విద్యను వాడకూడదు. తను శుద్ధంగా బ్రతుకుతున్నా సరే, అనుకోని కష్టమొచ్చినపుడు, దానిని దాటే విధానాన్ని తెలుసుకుని, స్వచ్ఛమైన మనసుతో దానిని ఆచరించి, దానిని దాటాలి.

అంతేగాని - 'నా గర్ల్ ఫ్రెండ్ నాతో మాట్లాడటం లేదు. వేరే ఎవడి వలలోనైనా పడిందా? నేనొక డీల్ చేస్తున్నాను. అది సక్సెస్ అయితే, వేరే వాళ్ళ ఆస్తి మొత్తం నాకొస్తుంది. నేను దీనిలో సక్సెస్ అవుతానా లేదా? నేను దొంగ వ్యాపారం చేస్తున్నాను. ఈ మధ్య నష్టాలొస్తున్నాయి. మళ్ళీ మునుపటిలాగా లాభాలు రావాలంటే ఏం చెయ్యాలి? మా ఫ్రెండొకడు మర్డర్ కేసులో ఇరుక్కున్నాడు. ఎలా బయటపడతాడు?' - ఇటువంటి అనైతిక ప్రశ్నలకు జ్యోతిష్యశాస్త్రాన్ని వాడకూడదు. అలా వాడితే, అడిగేవాడికి, చెప్పేవాడికీ కూడా వేటు పడుతుంది. ఎలా పడుతుందో, ఇప్పటికిప్పుడు తెలియకపోవచ్చు, అది పడినప్పుడు తెలుస్తుంది, అప్పుడు కూడా, తెలుసుకునే తెలివుంటే తెలుస్తుంది.  లేకపోతే, అదీ అర్ధం కాదు.

మంచివాళ్లకు, నిస్వార్ధపరులకు,మానవత్వం ఉన్నవాళ్లకు మాత్రమే జ్యోతిష్యశాస్త్రం వాడి సహాయం చెయ్యాలి. అంతేగాని, డబ్బుకోసం ఆశపడి, ఎవరికీ పడితే వారికి, రెమెడీలంటూ ఉన్నవీ లేనివీ మాయమాటలు చెప్పి జ్యోతిష్యంతో ఆడుకుంటే, అది మన జీవితాలతో ఆడుకుంటుంది.

ఒక నిజమైన బ్రాహ్మణుడు ఎలా బ్రతకాలో అలా మీరు బ్రతకగలరా? అలా అయితే, జ్యోతిష్యశాస్త్రాన్ని నేర్చుకోవడానికి మీకు అర్హత ఉంది.

జీవితాంతం నియమనిష్టలను పాటిస్తూ, సుఖాలకు దూరంగా మీరు బ్రతకగలరా? అలా అయితే, జ్యోతిష్యశాస్త్రాన్ని నేర్చుకోవడానికి మీకు అర్హత ఉంది. 

ఒక ఋషిలాగా, ఆశలకు అతీతంగా, నిరాడంబరంగా, నిర్మలంగా, నిస్వార్ధంగా మీరు బ్రతకగలరా? అలా అయితే, జ్యోతిష్య శాస్త్రాన్ని నేర్చుకోవడానికి మీకు అర్హత ఉంది.

లేకపోతే మాత్రం, దాని జోలికి పోకండి. ప్రమాదం ! దానికంటే నిప్పును చేతితో పట్టుకోవడం మంచిది. ఒకవేళ బ్రాహ్మణకులంలో పుట్టినా సరే, ఈ విధంగా బ్రతకలేనివారు కూడా ఈ శాస్త్రం జోలికి పోకూడదు. దీనికి కులంతో సంబంధం లేదు, జీవనవిధానంతో సంబంధం ఉంది.

ఔత్సాహికులైన జ్యోతిష్య విద్యార్థులను నిరాశపరచడం కోసం నేనీ పోస్టు వ్రాయడం లేదు. ఆపని నాకవసరం లేదు. ఉన్న సత్యాన్ని నేను చెబుతున్నాను. వినడం, వినకపోవడం మీ ఇష్టం.

దానిని బట్టి మీ కర్మ ఉంటుంది మరి !

read more " జ్యోతిష్యం నేర్చుకోవడానికి ఎవరు అర్హులు? "

ఈ పౌర్ణమి ఏమేం చేసింది?

మనిషి జీవితం పౌర్ణమి అమావాస్యల మధ్యన, గ్రహచలనాల మధ్యన అస్వతంత్రంగా గడిచిపోతుందంటే అతిశయోక్తి కాదు. ఎటువంటి వాడైనా సరే, విర్రవీగుడుకి ఏమాత్రం అవకాశం లేదు. మనిషి జీవితం ఖచ్చితంగా పూర్వకర్మను బట్టే నడుస్తుంది. దానిని అమలు చేసేవి గ్రహప్రభావాలు. ఇది నూటికి నూరుపాళ్ళు నిజం. తెలీనివాళ్ళు ఏదైనా అనుకోవచ్చు. కానీ ఇదే వాస్తవం.

ప్రస్తుతం గురు శనులు, కుంభ, మకరాలలో వక్రస్థితిలో ఉన్నారు. కుజశుక్రులు సింహంలో ఉన్నారు. యధావిధిగా ఈ పౌర్ణమి కూడా అనేక గందరగోళాలు చేసింది. మైక్రో లెవల్లో మనుషుల జీవితాలలో ఎన్నెన్నో సంఘటనలు జరిగాయి. ఆటుపోట్లు కలిగాయి. మేక్రో లెవల్లో ఏమేం జరిగాయో చూద్దాం.

హైదరాబాద్ దగ్గర్లో భూకంపం

ఈ రోజు ఉదయం, హైదరాబాద్ కు 156 కి. మీ దక్షిణంగా 4.0 స్థాయి భూకంపం వచ్చింది. కరోనాకు తోడు ఇది కూడా ఉందన్నమాట. ఇన్నాళ్లూ ఉత్తరాదినే అనుకున్నాం. ఇప్పుడు దక్షిణాదిన కూడా కర్మ మొదలైందన్నమాట.

హిమాచల్ ప్రదేశ్ లో వాన్ పై పడిన బండరాళ్లు

లాండ్ స్లైడ్ వల్ల కొండరాళ్ళు దొర్లుకుంటూ వచ్చి టూరిస్ట్ వాన్ ను గుద్దేసి 9 మందిని హతం చేశాయి. దీనిని కాకతాళీయం అనగలమా? ఇంత ఖచ్చితమైన టైమింగ్ కనబడుతుంటే?

మహారాష్ట్రలో పెనువర్షాలకు 150 మంది హరీ.

ఈ 150 కాక, ఇంకో 100 మంది పైన అడ్రస్ తెలియడం లేదు.

ఆఫ్ఘనిస్తాన్ సంక్షోభం

దాదాపు 22,000 కుటుంబాలు ఆఫ్ఘనిస్తాన్ లోని కాందహార్ ప్రాంతాన్ని విడిచి పారిపోయాయి. కారణం, మళ్ళీ తాలిబాన్ అదుపులోకి వస్తున్న ఈ ప్రాంతంలో ఉండి, ప్రత్యక్ష నరకాన్ని చవిచూడలేక. ఇంతకు ముందు వ్రాసినట్లే, ఆఫ్ఘనిస్తాన్ నిప్పుల కుంపటి కాబోతోంది. దీని సెగ ఖచ్చితంగా ఇండియా మీద ఉంటుంది. అంతేకాదు, అంతర్జాతీయంగా కూడా ప్రకంపనలు కలిగిస్తుంది. అనేక దేశాలు ఇందులో భాగస్వాములౌతాయి.

చైనా వరదలు

200 పైన కార్లు చైనాలోని ఒక టనెల్ లో ఇరుక్కుపోయాయి. వరదనీరు టనెల్ ను పూర్తిగా ముంచేసే స్థాయికి వచ్చింది. చైనా తూర్పు ప్రాంతం వరదలతో భీభత్సంగా ఉంది.

ప్రస్తుతానికి ఇవి చాలు. అసలైనవి ముందుముందు జరుగబోతున్నాయి. వేచి చూద్దాం.

read more " ఈ పౌర్ణమి ఏమేం చేసింది? "

24, జులై 2021, శనివారం

Yoga Taravali English E Book విడుదలైంది

ఈ రోజు గురుపూర్ణిమ. 

ఈ సందర్భంగా మరొక పుస్తకాన్ని విడుదల చేస్తున్నాం.
 
'యోగ తారావళి'ని తెలుగులో విడుదలచేసి ఏడాదైంది. అందుకని, అంతర్జాతీయపాఠకుల కోసం ఇప్పుడీ పుస్తకాన్ని ఇంగ్లీష్ భాషలో విడుదల చేస్తున్నాం. మా పుస్తకాలన్నీ తెలుగులోనూ, ఇంగ్లిష్ లోను ఉంటాయి.  ముందు ముందు వేరే భాషలలోకి కూడా వస్తాయి.

శ్రీ రామకృష్ణులిలా అంటారు, 'భగవంతుడే సృష్టికి గురువు. బోధించేది ఆయనే. మానవ గురువులు ఏమి బోధించగలరు? భగవంతుడు వారిద్వారా పనిచేయకపోతే మానవగురువులు అశక్తులౌతారు'.

నిజమైన గురువు భగవంతునితో అనుసంధానమును కలిగి ఉండాలి. నేడు ఎక్కడ చూచినా కనిపిస్తున్న దొంగగురువుల గురించి నేను  మాట్లాడటం లేదు. అలాంటివారిని ఎలా గుర్తించడం? చాలా తేలిక. చెప్పేదొకటి చేసేదొకటి అయినప్పుడు వాడు దొంగగురువు. డబ్బు, అధికారం, సుఖాల వెంట పరుగెత్తుతూ ఉంటె వాడు దొంగగురువు. సాంప్రదాయం నుండి వారిష్టమొచ్చినట్లుగా పక్కకు పోతుంటే వాడు దొంగగురువు. చీప్ గారడీ ట్రిక్స్ చేస్తుంటే వాడు దొంగగురువు. తానే దేవుడి అవతారాన్నని చెప్పుకుంటుంటే వాడు అతి పెద్ద దొంగ గురువు.

ఇలాంటి దొంగగురువులను పక్కనపెట్టి, ఈ రోజున మనం, సృష్టికి ఆదిగురువైన పరమశివుని, మహర్షులైన వ్యాసాదులను, బుద్ధుడు, పతంజలి, శంకరుడు, రామానుజుడు, మధ్వాచార్యుడు, అభినవగుప్తుడు, శ్రీ రామకృష్ణులు, రమణమహర్షి, జిల్లెళ్ళమూడి అమ్మ, మెహర్ బాబా మొదలైన సద్గురువులను స్మరిద్దాం. వీళ్ళు లోకానికి అసలైన గురువులు.

ఆదిశంకరులు అద్వైతజ్ఞానమునకు ప్రాముఖ్యతనిచ్చారు. అందుకని ఆయన యోగమార్గం జోలికి పోలేదు. కానీ యోగసారాన్నంతా ఒకచోటకు చేర్చి  కేవలం 29 శ్లోకములలో 'యోగతారావళి' అనే ఈ పుస్తకాన్ని వ్రాశారు. కంచిమఠం వారు చెప్పేటట్లు ఆదిశంకరుల కాలం BC 1 వ శతాబ్దమైతే, ఈ పుస్తకం వయసు రెండు వేల సంవత్సరాలు. అంతటి ప్రాచీన విజ్ఞానమిది.

జ్యోతిష్యశాస్త్రంలో యోగతారలని ఉంటాయి. నక్షత్రమండలాలలో బాగా కాంతితో వెలిగే తారలనే యోగతారలంటారు. ఆ నక్షత్రమండలాన్ని ఆ తార పేరుతో మనం పిలుస్తాం. అశ్వని అంటే ఒక నక్షత్రం కాదు, మూడు నక్షత్రాల సమూహం. కానీ అందులోని కాంతివంతమైన నక్షత్రాన్ని అశ్వని అని పిలుస్తూ ఆ నక్షత్రమండలాన్ని కూడా అదే పేరుతో పిలుస్తాం. అదే  విధంగా, ఆకాశంలో నక్షత్రాలలాగా, యోగశాస్త్రంలో ఎన్నో సాధనలున్నప్పటికీ, వాటిలో అతి ముఖ్యమైన సాధనలను ఒకచోట వివరిస్తూ దానికి 'యోగ తారావళి' అని పేరు పెట్టారు శంకరులు. దీనికి నా వ్యాఖ్యానంతో ఈ ఇంగ్లీష్ పుస్తకం వ్రాశాను.

హఠ, రాజయోగములలోని ముఖ్యములైన సాధనలు ఇందులో సూచనాప్రాయంగా వివరించబడినాయి.  శ్రద్ధ ఉన్న సాధకులు గురుముఖతా వీటిని ఉపదేశం పొంది సాధన చేస్తే, అవి సూచిస్తున్న అనుభవములను పొందగలుగుతారు.

తెలుగు నుంచి ఇంగ్లీష్ లోకి ఈ పుస్తకాన్ని ఎంతో చక్కగా అనువాదం చేసిన నా శిష్యుడు గణేష్ ఆళ్ల (డెట్రాయిట్) కు ఆశీస్సులు.

ఈ ఇంగ్లీష్ E Book ఇక్కడ దొరుకుతుంది.

read more " Yoga Taravali English E Book విడుదలైంది "

23, జులై 2021, శుక్రవారం

బయట జలప్రళయం - లోపల అగ్ని


చైనా జలమయమైంది. గత వెయ్యేళ్ళలో ఎన్నడూ లేనంత వాన చైనాను ముంచెత్తింది. హెనాన్ ప్రావిన్స్ లోని సిటీలన్నీ నీళ్లలో మునిగి ఉన్నాయి. ఒక సబ్ వే లో ఆగిపోయిన మెట్రో రైల్లోకి నీళ్లు ప్రవేశించి 12 మంది చనిపోయారు. మొత్తం ఈ వరదలలో కేవలం 33 మంది చనిపోయారని చైనా న్యూస్ బయట ప్రపంచానికి చెబుతోంది. అంటే, వినేవాళ్ళు వెర్రివెంగళప్పలని అనుకుంటోంది కదూ !

చైనా రిలీజ్ చేసిన కొన్ని వీడియోల నుంచి, న్యూస్ నుంచి ఈ విషయాలు తెలుస్తున్నాయి. బయటకు వచ్చినది గోరంత, రానిది కొండంత.

కుజశుక్రులు సింహరాశిలోకి ప్రవేశించారు. అక్కడనుంచి కుజుని చతుర్ధదృష్టి వృశ్చికరాశిపైన పడుతుంది. వృశ్చికం చైనాను సూచిస్తుందని గతంలోనే చెప్పాను. అది జలతత్వరాశి, అక్కడ కుజుడిని సూచిస్తున్న ఉచ్ఛకేతువున్నాడు. కేతువు హఠాత్ విధ్వంస సంఘటనలకు కారకుడు. కుజుడేమో విధ్వంసానికి విలయానికి సూచకుడు. లెక్క సరిపోయిందా మరి !

అగ్రదేశాన్నంటూ చైనా ఎంత విర్రవీగినా, తైవాన్ విషయంలో జపాన్ మీద ఆటంబాంబు వేస్తానని బెదిరించినా, ప్రకృతి ముందు చైనాయే కాదు ఏ దేశమూ నిలబడలేదు. అన్నింటినీ అదుపుచేసేది ప్రకృతి అన్నది మనం మర్చిపోకూడదు. అది చల్లగా ఉన్నంతవరకూ  మనం కూడా ఉంటాం. అది కన్నెర్ర చేస్తే మనం ఏమౌతామో ఎవరికీ తెలీదు. చైనా దాకా ఎందుకు, ప్రస్తుతం మన ముంబాయిగాని, హైదరాబాద్ గాని ఎలా ఉన్నాయి? ఈ వానలకు నీటిమయం కాలేదూ? ప్రతిసారీ వానాకాలంలో ముంబాయి జలమయం అవుతూనే ఉన్నది గత ముప్పై ఏళ్లుగా. ఇంత వ్యవస్థా, ఇంత యంత్రాఙ్గమూ పెట్టుకుని మనమేం చెయ్యగలుగుతున్నాం?

అంతా తన చేతిలోనే ఉందని మనిషి అనుకోవచ్చు గాక, కానీ అలా లేదన్నది వాస్తవం. రెండేళ్ళనుండి వెంటాడుతున్న కరోనా అయినా, నేటి వరదలైనా మనిషికి నేర్పుతున్న గుణపాఠం ఇదే. నేర్చుకోవడమా లేదా అన్నది అతనిష్టం మీద ఆధారపడి ఉంది.

కుజశుక్రులు ప్రస్తుతం అగ్నితత్వరాశి అయిన సింహంలో ఉన్నారు. దీనివల్ల, లోకులలో సెక్స్ పరమైన నేరాలు ఘోరాలు ఎక్కువగా జరుగుతాయి. ఈ ట్రెండ్ ఇంకో నెలరోజులుంటుంది. ఒకవైపున ప్రపంచం నీళ్లలో మునిగిపోతూ ఉంటే, సందట్లో సడేమియా అన్నట్లు ఇంకోపక్క ఈ రకం పిచ్చి వెర్రితలలేస్తోంది. గ్రహప్రభావం విచిత్రంగా లేదూ?

కుజశక్రులు సింహరాశిలో అడుగు పెట్టీ పెట్టకముందే, బ్లూ సినిమాలు తీస్తున్నాడన్న నేరం మీద శిల్పాశెట్టి మొగుడు రాజ్ కుంద్రాను అరెస్ట్ చేశారు.  ఆధారాలు చాలా గట్టిగా ఉన్నాయని, ఇది చాలాపెద్ద నెట్ వర్క్ అని  పోలీసులంటున్నారు. ఇది కుట్ర, మమ్మల్ని బద్నాం చేస్తున్నారని యధావిధిగా వీళ్లంటున్నారు. ఈ పాట ఎప్పటినుంచో మనం వింటూనే ఉన్నాం కదా ! పెద్దవాళ్ళ గోత్రాలు పోలీసులకెరుక ! కానీ ఈగోలలో ఎవరెవరి పేర్లు బయటపడతాయో నని ముంబాయి సినీఫీల్డులో చాలామంది వణికి చస్తున్నారు.

తన కొడుకుతో అశ్లీల డాన్స్ వేసిన ఒక తల్లి, ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. 'ఏం? లైకులు లేకపోతే చస్తావా? మరీ ఇంత దిగజారుడా?' అని, దాన్ని చెడామడా తిడుతున్నారు నెటిజెన్స్. సోషల్ మీడియా అనేది డ్రగ్స్ ను మించిన వ్యసనమైందన్నది వాస్తవం.  డబ్బు సంపాదించడానికి ఇదొక మార్గమని తెలిసేసరికి, ఇక నానా గడ్డీ తింటున్నారు జనం.

పాకిస్తాన్ లో ఆఫ్ఘనిస్తాన్ రాయబారి కూతురు కిడ్నాప్ కు గురైందన్న కొద్దీ రోజులకే, మొన్న మంగళవారం నాడు, పాకిస్తాన్ లోనే పాతరాయబారి కూతురు ఇంకొకామె హత్యకు గురైంది. దీనివెనుక ఏయే కుట్రలున్నప్పటికీ బలౌతున్నది మాత్రం అమ్మాయిలే నన్నది ఇక్కడి పాయింట్ ! సింహరాశిలో కుజశుక్రులు దీనినే సూచిస్తున్నారు.

ఇంకొక నెలరోజులపాటు మన్మధుడు ప్రపంచాన్ని శాసించబోతున్నాడు. సెక్స్, డ్రగ్స్, మాఫియా సంబంధిత సంఘటనలు వెల్లువెత్తబోతున్నాయి. వేచి చూడండి మరి !
read more " బయట జలప్రళయం - లోపల అగ్ని "

ఒకటి పోతే ఇంకొకటి

హమ్మయ్య ! కుజుని సింహరాశి ప్రవేశంతో శనికుజ ప్రభావం అయిపొయింది కదా, 50 రోజుల శాపం అయిపోయింది. ఇక ఒడ్డెక్కాం అనుకోకండి. ఇది పోతే దీని తాతలాంటిది ఇంకోటొస్తుంది. ఇప్పటికే వచ్చింది కూడా ! అందుకే వేరే రకమైనవి జరుగుతున్నాయి.

కాలచక్రం అనంతంగా తిరుగుతూనే ఉంటుంది. పెద్దవో చిన్నవో జరిగేవి జరుగుతూనే ఉంటాయి. మనుషులకు మాత్రం బుద్ధి రాదు. నేర్చుకోరు. ఎదగరు. అదే రొంపిలో పడి దొర్లుతూనే ఉంటారు. అదే మాయంటే, అదే సృష్టినియమం, కర్మనియమం అంటే.

అనంతమైన కాలచక్రంలో గ్రహగమనం నిరంతరం జరుగుతూనే ఉంటుంది. దాని ఫలితంగా రకరకాల గ్రహయోగాలు నిరంతరం వస్తూనే ఉంటాయి, రకరకాల సంఘటనలు తలెత్తుతూనే ఉంటాయి. ఈ భూమ్మీద మానవజీవితం విచిత్రాతి విచిత్రాలుగా  నడుస్తూనే ఉంటుంది. ఒక తరం పోతే, ఇంకొక తరమొస్తుంది. మారిన పరిస్థితులలో, కొత్తగా వచ్చిన వసతులు, టెక్నాలజీల ఆసరాతో మళ్ళీ ఇదే డ్రామా నిరంతరంగా సరికొత్తగా మొదలౌతూనే ఉంటుంది. నడుస్తూనే ఉంటుంది.

క్రొత్తసీసాలో పాతసారా. అంతే !

ప్రపంచం మారదు. మనం మారాలి. సృష్టి నియమాలను, జీవిత నియమాలను అర్ధం చేసుకుంటూ ఎదగాలి. ఈ డ్రామానుంచి బయటపడాలి.

ముళ్ళదారిలో నడుస్తూ, ముళ్ళు తొక్కుకుంటూ, ఒక ముల్లుతో ఇంకొక ముల్లును తీసుకుంటూ, మళ్ళీ అవే ముళ్ళను తొక్కుకుంటూ - ఈ విధంగా నడుస్తూ ఉండటం కాదు మనం చేయవలసింది. ఏ ముళ్ళూ తొక్కకుండా ఎలా నడవాలో నేర్చుకోవాలి. అసలు నడకే ఆపేసి హాయిగా ఉండటం నేర్చుకోవాలి. అవసరమైతే, అదే దారిలో తెలివిగా ఎలా నడవాలో నేర్చుకోవాలి.

ఈ విషయాన్ని స్పష్టంగా అర్ధం చేసుకోవడమే నేను బోధించే స్పిరిట్యువల్ అస్ట్రాలజీలో మొదటి మెట్టు.
read more " ఒకటి పోతే ఇంకొకటి "

18, జులై 2021, ఆదివారం

శని కుజుల ప్రభావం - 15 (యూరోప్, అమెరికా, సౌత్ ఆఫ్రికాల పరిస్థితి)

మొన్నటివరకూ అమెరికా వెస్ట్ కోస్ట్ అంతా హీట్ వేవ్ అదరగొట్టింది. ఆరిగాన్ ప్రాంతంలో అడవులు తగలబడి పొగమేఘాలు కమ్మేశాయి. నేడు యూరోప్ లో ముఖ్యంగా జెర్మనీలో వరదలు ముంచెత్తుతున్నాయి. ఒక్క 15 నిముషాలలో ఊళ్లకు ఊళ్లు మునిగిపోయాయి. సిటీలు జలమయమయ్యాయి. ఈ అకాల వరదల దెబ్బకు  జర్మనీ, బెల్జియం లలో, 170 మంది హరీమన్నారు. వాతావరణ మార్పులవల్లనే ఇదంతా జరుగుతోందని నిపుణులు అంటున్నారు. ఎప్పటినుంచో అందరూ అంటున్నారు. కానీ అందరూ వాతారణాన్ని పాడు చేస్తూనే ఉన్నారు గాని బాగు చెయ్యడం లేదు. అందుకే ఈ అకాల వరదలు. హీట్ వేవ్ లు. గట్రాలు.

సౌత్ ఆఫ్రికా కుంభరాశిలో ఉందని వ్రాశాను. ఇది మిధునానికి కోణరాశి కావడంతో దానికి కూడా ప్రస్తుత 50 రోజుల వేడి సోకింది. అందుకే డర్బన్ లో అల్లకల్లోలంగా ఉంది. అక్కడి ఇండియన్స్ కూ, నల్లవాళ్లకూ కొట్లాటలు జరుగుతున్నాయి. షాపులు లూటీ అవుతున్నాయి. సివిల్ వార్ వచ్చినట్లు, అరాచకంలా పరిస్థితి ఉంది.

లోకం గురించి చెప్పుకుని, మన ముంబాయిని మరచిపోతే ఎలా?

ముంబాయిలో కురుస్తున్న వర్షాలకు అక్కడ కూడా ఒక లాండ్ స్లైడ్ జరిగింది. 22 మంది హరీమన్నారు. సిటీ అంతా నీళ్ళమయమైంది. జనాలు పడవలలో తిరుగుతున్నారు.

గత వారంగా చిన్నా చితకా సంఘటనలు కొన్ని వందలు జరిగాయి. అవన్నీ వ్రాస్తూ పోతే న్యూస్ పేపర్లు బాధపడతాయి. పాపం వాటినేందుకు బాధపెట్టడం? అందుకని ఇంతటితో ఆపేద్దాం.

50 రోజుల ప్రభావం కొనసాగుతూనే ఉంది.

read more " శని కుజుల ప్రభావం - 15 (యూరోప్, అమెరికా, సౌత్ ఆఫ్రికాల పరిస్థితి) "

13, జులై 2021, మంగళవారం

మా సిద్ధాంత సారమైన 'మ్యూజింగ్స్' E Book విడుదలైంది

ఈ మధ్యన మా సంస్థ నుండి క్రొత్త పుస్తకాలేవీ రాలేదని అనుకుంటున్నారా? ఆగండి! మీ జీవితాన్ని సమూలంగా మార్చేసే ఉద్గ్రంథమొకటి విడుదలకు సిద్ధంగా ఉంది.

దానిపేరే - 'మ్యూజింగ్స్'. ఈ పుస్తకాన్ని E Book గా  ఈరోజున విడుదల చేస్తున్నాము. ఏమిటి ఈ రోజు ప్రత్యేకత? అంటే, తేదీలప్రకారం, నేడు నేను పుట్టినరోజు. అఫీషియల్ రికార్డ్స్ ప్రకారం ఈరోజున నాకు 59 నిండి 60 లోకి అడుగుపెడుతున్నాను. అందుకే ఈ పుస్తకాన్ని ఈరోజున విడుదల చేస్తున్నాము.

ఈ ప్రపంచంలో  నాకు నచ్చనిదేదైనా ఉందంటే అది, ఏ పనీ చెయ్యకుండా సోమరిగా కూర్చోవడం ఒక్కటే. నిరంతర కృషీవలత్వం నా సిద్ధాంతం. నేను మౌనంగా ఉన్న ఈ సమయంలో మహా ఉద్గ్రంథమొకటి నిశ్శబ్దంగా రూపుదిద్దుకుంటోంది. ఈ ఉద్గ్రంధం నా అనుభవాల ఆలోచనల సమాహారం, నా మార్గం, సిద్ధాంతం, తత్త్వం. అసలీ పుస్తకమెలా రూపుదిద్దుకుంది? తెలియాలంటే, కొంచెం చరిత్రలోకి వెళ్ళాలి.

2010 లో పంచవటి గూగుల్ గ్రూప్ మొదలైంది. అప్పటినుంచి  అనేకమంది మెంబర్స్ అడిగిన లెక్కలేనన్ని ఆధ్యాత్మికప్రశ్నలకు గ్రూపులో జవాబులిస్తూ వచ్చాను. నా మార్గంలో నడుస్తున్నవారికి కావలసిన ఆధ్యాత్మిక మార్గదర్శనం చేస్తూ వచ్చాను. ఈ విధంగా ఇప్పటికి పదేళ్లు గడిచాయి. ఈ క్రమంలో దాదాపుగా వెయ్యిపేజీల విలువైన మెటీరియల్ తయారైంది. ఇవన్నీ 'ఆలోచనాతరంగాలు' బ్లాగ్ లో దొరకని లోతైన అవగాహనా విశేషాలు.

ఎందుకంటే, బ్లాగ్ లో పైపై లోకాభిరామాయణం మాత్రమే నడుస్తుంది. అసలైన విషయాలను గ్రూప్ లో మాత్రమే చర్చిస్తాను. ఇంకా లోతైన విషయాలను వ్యక్తిగతంగా ఎవరివి వారికి మాత్రమే చెప్పే అలవాటు నాది. ఇవిగాక నేను నడిచిన ఆధ్యాత్మికమార్గాన్ని స్పష్టంగా వివరిస్తూ గ్రూపు సభ్యుల కోసం నేను వ్రాసిన వ్యాసాలు ఎన్నో ఉన్నాయి.  వాటిలో 360 వ్యాసాలను ఒకచోటకు చేర్చి 'మ్యూజింగ్స్' అనే పేరుతో ఈ ఇంగిలీషు "ఈ-బుక్" ను విడుదలచేస్తున్నాము. ఇది దాదాపుగా వెయ్యిపేజీల పుస్తకం. వేయిపడగలవంటి ఉద్గ్రంధం. దీని రచనాకాలం పదేళ్లు. విలువ అమూల్యం.

ఇవన్నీ ఇంగిలీషులో వ్రాసిన వ్యాసాలు గాబట్టి, అంతర్జాతీయ పాఠకులకోసం ఇది మొదటగా ఇంగిలీషులో విడుదలౌతోంది.

విశ్వనాధ సత్యనారాయణగారు 'వేయిపడగలు' వ్రాశారు. చలంగారు 'మ్యూజింగ్స్' వ్రాశారు. అసలు, మ్యూజింగ్స్ అనే పదాన్ని మొదటగా సామ్యూల్ టేలర్ 1794 లో తన 'స్పిరిట్యువల్ మ్యూజింగ్స్' లో వాడాడు. చలంగారు ఇంగ్లీషు చదువులు చదివారు గాబట్టి ఆ పేరుతో తన జ్ఞాపకాలను, భావాలను వ్రాశారు. రెంటినీ కలిపి నేనీ ఆధ్యాత్మిక వేయిపడగలను 'మ్యూజింగ్స్' అంటూ వెయ్యిపేజీలలో వ్రాశాను.

సూర్యోపాసనలో నాకున్న అనుభవాన్ని బట్టి ఈ మ్యూజింగ్స్ సంఖ్యను 360 వ్యాసాలుగా నిర్ణయించాను. ఇవి సూర్యభగవానుని వెలుగు కిరణాలు. సావన సంవత్సరంలో ఉండే రోజులు. 'మహాసౌరం' పుస్తకంలో కూడా 360 పద్యములే వ్రాశానన్నది గమనార్హం.

ఈ పుస్తకం మా వేదం, మా భగవద్గీత, మా ఉపనిషత్తు.

వేదాంతం, యోగం, తంత్రం, జ్యోతిష్యం, సాధనామార్గంలో నా అనుభవాలు, అన్నింటినీ మించి, ఎన్నో ఆధ్యాత్మిక సాధనా రహస్యాల సమాహారమే ఈ 'మ్యూజింగ్స్'. ఇది నా లైఫ్ టైం పుస్తకమని సగర్వంగా చెబుతున్నాను. ఈ పుస్తకంలో ఉన్న 360 వ్యాసాలను మీరు చదివి అర్ధం చేసుకుంటే, భారతీయ ఆధ్యాత్మిక చింతనాశిఖరాలన్నీ మీకు అర్ధమౌతాయి.  ఇకపై మీరు చదవాల్సినవి ఏవీ ఉండవు.

'యన్నభారతే తన్నభారతే' - అని సూక్తి ఉన్నది.  అంటే, భారతంలో లేనిది  భారతదేశంలో లేదు అని. అదే విధంగా, ఈ పుస్తకంలో లేని ఆధ్యాత్మికత ప్రపంచంలో ఇంకెక్కడా లేదని సగర్వంగా చెబుతున్నాను. ఇందులోని ఒక్కొక్క వ్యాసమూ మిమ్మల్ని చాలా ఆలోచింపజేస్తుంది. కనుక, ఒక నవలను చదివినట్లుగా మీరు దీనిని గబగబా చదవలేరు. అలా చదవకూడదు కూడా. రోజుకొక్క వ్యాసాన్ని చదివి అర్ధం చేసుకుంటూ ముందుకు సాగుతుంటే మీరీ పుస్తకాన్ని పూర్తి చేసేటప్పటికే ఏడాది పడుతుంది. ఇదొక సాధన అవుతుంది. ఒక ధ్యానమౌతుంది. దాని ఫలితంగా మీ జీవితం మారిపోతుంది. అందుకే ఇది జీవితాన్ని మార్చే పుస్తకమని చెబుతున్నాను.

నేనేంటో, నా అంతరంగమేమిటో, ఈ పుస్తకం మీకు స్పష్టంగా వివరిస్తుంది. ఈ పుస్తకాన్ని చదివాక నా మిత్రశత్రువుల చిరకాలపు తపన చల్లారుతుందని ఆశిస్తున్నాను.

నా మిత్రశత్రువులు తరచుగా చేసే ఫిర్యాదొకటుంది. 'మీరస్సలు అర్ధం కారు' అనేదే అది. 'ఒకసారి ఒకమాటంటారు, ఇంకోసారి ఇంకోమాటంటారు. ఒకసారి చెప్పినది ఇంకోసారి చెప్పరు. ఎలా మిమ్మల్ని అర్ధం చేసుకోవాలి? ' అని చాలామంది నన్నడిగారు.

వారందరికీ ఒకటే జవాబు.

'సూర్యుడు పన్నెండు నెలలలోనూ ఒకే విధంగా ఉండడు. అంతమాత్రాన సూర్యుడు సూర్యుడు కాకపోడు. సూర్యుడిని సంపూర్ణంగా అర్ధం చేసుకోవాలంటే పన్నెండు నెలలలోనూ అతడిని చూడాలి. మీ కళ్ళద్దాలను తీసేసి చూడాలి. దానివల్ల మీ కళ్ళకేమీ ఇబ్బందిరాదు. సత్యదృష్టి మీకలవడుతుంది. అతడేమిటో అర్ధమౌతుంది. అప్పుడు గాని చీకటిని వదలిపెట్టి, మీరు వెలుగులోకి రాలేరు' - అనేదే ఆ జవాబు.

ఆధ్యాత్మికం, యోగం, లౌకికం, సామాజికం, వ్యక్తిగతం, రాజకీయాలు, కళలు, పాటలు, పద్యాలు,  జ్యోతిష్యం, వీరవిద్యలు, హోమియోపతి, మర్మవిద్యలు ఇలా ఎన్నో విషయాల మీద నా భావాలను గత పన్నెండేళ్లుగా వ్రాస్తూ వస్తున్నాను. అవన్నీ చదివిన బయటివారు 'ఏంటి? ఒక మనిషిలో ఇన్ని విద్యలా? ఇన్ని కోణాలా?' అంటూ గందరగోళానికి గురయ్యే అవకాశం ఉన్నది. అయితే, నా ఆత్మీయులకు మాత్రం ఆ బాధ ఉండదు. ఎందుకంటే వారికి నా బహుముఖమైన అంతరంగం  బాగా తెలుసు కాబట్టి !

నేను ఏది వ్రాసినా ఆధ్యాత్మికవాసన లేకుండా వ్రాయలేదు. ఇది నా వ్రాతలన్నింటిలో అంతర్లీనంగా ఉంటుంది. ఒక్కమాటలో చెప్పాలంటే నేనేమిటో నా భావజాలమేమిటో మీకు స్పష్టంగా తెలియాలంటే మీరు 'మ్యూజింగ్స్' చదవాలి. ఎందుకంటే, నా మనసు లోతులను  స్పష్టంగా ప్రతిబింబించే పుస్తకమిది.

ఈ ఇంగిలీషు పుస్తకాన్ని తెలుగులోకి అనువాదం చేసే పని వెంటనే మొదలౌతున్నది. దీని అనువాదం చేస్తామని నా శిష్యులు కొందరు ముందుకొస్తున్నారు. అనుకున్నట్లు అంతా అయితే, ఈ తెలుగు పుస్తకాన్ని 'వెలుగు దారులు' అనే పేరుతో వచ్చే ఏడాది జూలైకి విడుదల చేస్తామని భావిస్తున్నాను. 

అప్పటికి మా 'పంచవటి' కార్యక్రమాలు కూడా బహుముఖాలుగా విస్తరించబోతున్నాయి. మా యూట్యూబ్ ఛానల్సన్నీ ఒక్కసారిగా క్రియాశీలమౌతాయి. మా ఆశ్రమం సాకారమౌతుంది. నిజమైన ఆధ్యాత్మికత ఏమిటో లోకానికి క్రియాత్మకంగా బహుముఖంగా వెదజల్లబడుతుంది. ఇంకా ఎన్నెన్నో అద్భుతాలు జరుగబోతున్నాయి.

గతంలో నా శిష్యులు చాలామంది ఇలా అడిగేవారు.

'ఎవరైనా మమ్మల్ని 'మీ మార్గమేమిటి? మీ గురువుగారు ఏమి బోధిస్తారు?' అని అడిగితే మేమేమి చెప్పాలి?

ఇంతకు ముందైతే చెప్పడం కష్టమయ్యేది. ఎందుకంటే సర్వతోముఖమైన మా సాధనామార్గాన్ని కొద్ది మాటలలో చెప్పడం అసాధ్యం. చెప్పేవారికీ అది కుదరదు, వినేవారికీ అర్ధం కాదు. కానీ ఇప్పుడది సులభమయ్యింది.

క్లుప్తంగా ఇలా చెప్పండి చాలు. 

'మ్యూజింగ్స్ చదవండి, మా దారేంటో  అర్ధమౌతుంది'.

అదన్నమాట !

ఇకపోతే, ఈ పుస్తకాన్ని వ్రాయడంలో విసుగూ విరామమూ లేకుండా సహకరించిన నా శ్రీమతి సరళాదేవికి, శిష్యురాళ్ళు అఖిల, శ్రీలలితలకు నా కృతజ్నతలు, ఆశీస్సులు. వీరి సహకారం లేనిదే ఈ పుస్తకం వెలుగు చూచేది కాదు. అదే విధంగా, చక్కటి ముఖచిత్రాన్ని చేసి ఇచ్చిన శిష్యుడు ప్రవీణ్ కు మళ్ళీ ఇంకోమారు ఆశీస్సులు.

ఈ పుస్తకానికి ముందుమాట వ్రాసిన శ్రీ ఆనంద్ కుమార్ (డెట్రాయిట్) గారికి నా ధన్యవాదములు. నన్నెంతగానో అభిమానించేవారిలో ఆయన  మొదటి వరుసలో ఉంటారు.

అదే విధంగా, ఈ  పుస్తకం రూపుదిద్దుకోవడంలో ప్రోత్సాహకులైన ఇండియా, అమెరికా శిష్యులకు, పంచవటి స్పిరిట్యువల్ ఫౌండేషన్ సభ్యులకందరికీ నా ఆశీస్సులు.

ఈ పుస్తకం గూగుల్ బుక్స్ నుంచి ఇక్కడ లభిస్తుంది.

మా మిగతా పుస్తకాలను ఆదరించినట్లే దీనిని కూడా ఆదరిస్తారు కదూ !

read more " మా సిద్ధాంత సారమైన 'మ్యూజింగ్స్' E Book విడుదలైంది "

10, జులై 2021, శనివారం

శనికుజుల ప్రభావం - 14 (అమావాస్య ఎలా పనిచేసింది?)

నిన్న అమావాస్య. 50 రోజుల శాపం కొనసాగుతోంది. ఏమేం జరిగాయో చూడండి మరి.

ఇండోనేషియాలో 6.2 స్థాయి భూకంపం

శనికుజుల దుర్ఘటనా యోగం మళ్ళీ రుజువైంది. 6. 2  స్థాయి భూకంపం ఇండోనేషియా తూర్పు తీరాన్ని కుదిపేసింది. సౌత్ ఈస్ట్ ఏషియా మొత్తం కర్కాటకరాశి అధీనమే.

బంగ్లాదేశ్ ఆహార ఫెక్టరీలో అగ్నిప్రమాదం.

మొన్నసాయంత్రం మొదలైన మంటలు ఈ ఫెక్టరీలో 24 గంటలు గడిచినా ఇంకా మండుతూనే ఉన్నాయి.  52 మంది ఈ మంటలలో కాలిపోయి చనిపోయారు. కుజుడు అగ్నితత్వగ్రహమని, నీచస్థితి అతన్ని మరీ చికాకు చేస్తుందనీ,  బాంగ్లాదేశ్ కూడా మకరంలోనే ఉంటుందనీ. చంద్రుడు ఆహారకారకుడనీ గుర్తుంటే ఈ సంఘటన ఎందుకు జరిగిందో అర్ధమౌతుంది.

ఇండియాలో ఘోర రైలు ప్రమాదం

మధ్యప్రదేశ్ లోని బిలాస్ పూర్ దగ్గర ఒక బొగ్గు లోడుతో వెళుతున్న గూడ్స్ పట్టాలు తప్పింది. ఈ తప్పడం ఒక అలాన్ అనే నదిపైనున్న బ్రిడ్జిపైన జరిగింది. ఆ దెబ్బకు 16 కోల్ లోడు ఉన్న బోగిలు పల్టీలు కొట్టి క్రింద నదిలోకి పడిపోయాయి. ఇది ప్యాసింజర్ ట్రెయిన్ కాదు కాబట్టి సరిపోయింది. అదే మనుషులున్న రైలైతే మహా ఘోర ప్రమాదమే జరిగి ఉండేది.  ఇది సరిగ్గా నిన్న అమావాస్య ఘడియలలో సాయంత్రం మూడు గంటల ప్రాంతంలో జరిగింది.

అమెరికాను  బెంబేలెత్తించిన రష్యా సైబర్ దాడులు

రాన్సమ్ వేర్ అంటే విలువైన సమాచారాన్ని నెట్లోనుంచి దొంగిలించి, బ్లాక్ మెయిల్ చెయ్యడం. రష్యాలోని సైబర్ క్రిమినల్స్ ఈ విధంగా అమెరికాలోని అనేక కంపెనీల రహస్య సమాచారాన్ని కాజేసి వారిని  వణికించారు. ఎన్నో అమెరికా కంపెనీలు తమ బిజినెస్ కార్యకలాపాలను ఆపేయవలసిన పరిస్థితి తలెత్తింది. జో బైడెన్ ఈ విషయమై పుతిన్ కు మెత్తని వార్నింగ్ ఇచ్చాడు.

ఈ అమావాస్య ఇలా పనిచేసింది మరి !

read more " శనికుజుల ప్రభావం - 14 (అమావాస్య ఎలా పనిచేసింది?) "

9, జులై 2021, శుక్రవారం

శనికుజుల ప్రభావం - 13 (రెండురోజులలో జరిగిన విభిన్న సంఘటనలు)

శనికుజుల సమసప్తక యోగఫలితంగా గత రెండు రోజులలో జరిగిన సంఘటనలను గమనిద్దాం.

హైతీ అధ్యక్షుని హత్య

హైతీ అనే ద్వీపం, కరీబియన్ దీవులలో ఉన్న ఒక చిన్న దేశం. దీవులన్నీ కర్కాటకరాశి ఆధిపత్యంలోనే ఉంటాయని చెబుతున్నాను. శని కుజుల యోగం హింసాత్మక దుర్ఘనటనలకు కారణమౌతుంది. దీనికి నేను దుర్ఘటనా యోగమని పేరు పెట్టడమే గాక నా  జ్యోతిష్యపుస్తకాలలో వ్రాశాను కూడా. ఈ పేరును నిజం చేస్తూ హైతీ అధ్యక్షుడైన జొవెనెల్ మోసీ అనేవాడిని హత్య చేశారు. ఈ కేసులో ఉన్న 28 మందిలో ఇప్పటికి 17 మందిని అరెస్ట్ చేశారు. ఇతను నల్లజాతివాడుగా శనీశ్వరుని అధీనంలో ఉన్నాడని గమనించండి.

కాలిఫోర్నియా నెవాడా సరిహద్దులో 5.9 స్థాయి భూకంపం

శనికుజ యోగం భూకంపాలనిస్తుందని గత పదేళ్లలో ఎన్నో సార్లు రుజువు చేశాను. మళ్ళీ జరిగింది చూడండి.  అదికూడా మిధునరాశి సూచించే  అమెరికాలో.

తజీకిస్తాన్ లో నాలుగు భూకంపాలు

గత నాలుగు రోజులలో తజికిస్తాన్ లో నాలుగు భూకంపాలొచ్చాయి. ఇది ఆఫ్ఘనిస్తాన్ దగ్గరలో ఉంటుంది. ధనూరాశి ప్రారంభడిగ్రీలని ముందే వ్రాశాను.  

పెరూలో రెండు భూకంపాలు

గత మూడు రోజులలో పెరూలో రెండు భూకంపాలొచ్చాయి. ఇది లాటిన్ అమెరికాలో ఉన్నది.

స్వీడన్ లో విమానం కూలుడు - 9 మంది హరీ (?)

స్టాక్ హోమ్ కు 160 కి. మీ పశ్చిమాన ఉన్న ఒరిబ్రో ఎయిర్ పోర్ట్ దగ్గర ఒక చిన్న విమానం కూలిపోయింది. అందులో పైలట్, 8 మంది స్కై డైవర్స్ ఉన్నారు. ఎంతమంది పోయారో చెప్పడం లేదు. యూరోప్ అంతా ధనుస్సేనని చెబుతూ వస్తున్నాను. ఆర్గలదోషం ఎలా పనిచేస్తోందో చూడండి మరి ! 

దుబాయ్ పోర్టులో పేలుడు

జెబెల్ ఆలీ పోర్ట్ లో ఆగిఉన్న ఒక నౌకలో పెద్ద పేలుడు జరిగింది. ఈ పేలుడు దెబ్బకు 25 కి. మీ దూరంలో ఉన్న ఇళ్ళు కూడా ప్రకంపనలకు గురయ్యాయి. అంత శక్తివంతమైన పేలుడు ఇది. నౌకలు, సముద్రం మొదలైనవి ఏ రాశిచేత సూచింపబడతాయో ఈపాటికి మీకర్ధమయ్యే ఉండాలి కదా !

ఇరాక్ సిరియాలలో అమెరికా దళాలపైన రాకెట్ దాడులు

మిధునరాశి అంటే అమెరికా దేశమే కానక్కరలేదు. అమెరికా అధికారులు కూడా. అందుకేనేమో,  ఇరాక్ సిరియాలలో ఉన్న అమెరికన్ డిప్లొమాట్స్ మీదా వారి దళాల మీదా రాకెట్ దాడులు జరిగాయి. రగులుతున్న రావణకాష్టానికి ఇదొక ఉదాహరణ.

50 రోజుల యోగం కొనసాగుతోంది !

read more " శనికుజుల ప్రభావం - 13 (రెండురోజులలో జరిగిన విభిన్న సంఘటనలు) "

7, జులై 2021, బుధవారం

శనికుజుల ప్రభావం - 12 (ఇంకొన్ని సంఘటనలు)

ఎల్లుండి అమావాస్య. శనికుజుల ప్రభావం ఎలాగూ కొనసాగుతోంది. ఏమేం జరిగాయో చూడండి మరి !

రష్యాలో విమాన ప్రమాదం - 28 మంది హరీ

నిన్న తూర్పు రష్యాలో ఒక విమానం కూలిపోయింది. మంచుతో కూడిన వాతావరణంలో దిగబోతూ ఒక కొండకొమ్మును ప్రమాదవశాత్తు ఢీకొట్టి అది కూలిపోయింది. ఇందులో 22 మంది పాసింజర్లు, 6 గురు  సిబ్బంది ఉన్నారు. మొత్తం హరీమన్నారు. వీరిలో ఆ ఊరి మేయర్ ఓల్గా అనే ఆమె కూడా ఉంది.

రష్యా దేశం వృశ్చికానికి ధనుస్సుకు మధ్యలోనే, కానీ ధనుస్సు మొదటి డిగ్రీలలో ఉంటుంది. ప్రస్తుతం ఈ రాశులన్నీ గందరగోళ పరిస్థితిలో చిక్కుకుని ఉన్నాయి. భయంకరమైన అర్గలదోషంలో చిక్కుకుని ఉన్నాయి. కనుకనే ఇవన్నీ జరుగుతున్నాయి.

అమెరికా వీకెండ్ అల్లర్లలో 150 మంది హరీ

జూలై నాలుగు అమెరికా స్వతంత్రం వచ్చినరోజు. ఈ వీకెండ్ లో అమెరికా మొత్తంలో జరిగిన అల్లర్లలో 400 కాల్పులు జరిగాయి. ఆ కాల్పులలో 150 మంది మరణించారు. ఈ కాల్పులు చికాగో లో ఎక్కువగా జరిగాయి. ఇందులో అయితే ఒక నాలుగేళ్ల చిన్నపిల్లకు కూడా గన్ షాట్ గాయాలయ్యాయి. మిధునరాశికి పట్టిన అర్గలదోషమే దీనికి కారణం.  

నటుడు దిలీప్ కుమార్ మృతి

98 ఏళ్ల వయసులో పాతతరం నటుడు దిలీప్ కుమార్ చనిపోయాడు. ఇది అమావాస్య పరిధిలో జరిగింది గమనించండి. సినీనటులు శుక్రుని ఆధీనంలో ఉంటారు.  శుక్రుడు కర్కాటకరాశిని దాటేలోపు, అంటే ఇంకో రెండు వారాలలోపు, మరికొంతమంది సినీమనుషులు పోబోతున్నారు.

50 రోజుల చిట్టా కొనసాగుతోంది !

read more " శనికుజుల ప్రభావం - 12 (ఇంకొన్ని సంఘటనలు) "

6, జులై 2021, మంగళవారం

శనికుజుల ప్రభావం - 11 (మచ్చుకు మరికొన్ని)

జపాన్ బురదలో 80 మంది గల్లంతు

శనివారం నాడు జపాన్ లోని ఆటామి అనే సముద్రతీర రిసార్ట్ లో లాండ్ స్లైడ్ జరిగింది. ఒక బిల్డింగ్ మొత్తం కప్పుపడిపోయింది. 80 మంది అడ్రస్ తెలియడం లేదు. కుజుడంటే మట్టి, శుక్రుడంటే నీరు. ఈ రెండూ కలిస్తే బురదౌతుంది. అదే ఇప్పుడు జపాన్ లో కొంప ముంచింది.

ద్వీపముల సమూహంగా ఉండే జపాన్ కర్కాటకరాశిలోనే ఉంటుంది. ఇంకా చెప్పాలంటే కర్కాటకం 16 డిగ్రీ జపాన్ ను సూచిస్తుందని నా రీసెర్చిలో తేలింది. సౌత్ ఈస్ట్ ఏషియా అంతా కర్కాటకరాశి అధీనమే. దానికి రుజువు అటామీలో కనిపించింది కదా.

క్యూబాను వణికించిన ట్రాపికల్ తుఫాను ఎల్సా

ఎల్సా తుఫాన్ దెబ్బకు క్యూబాలో 1,80,000 మందిని ఇల్లు ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించారు.  ఎందుకో వారిని కరుణించిన ఆ తుపాన్ ఇప్పుడు ఫ్లోరిడా దిశగా మళ్లింది. ఇదికూడా కర్కాటక రాశి ప్రభావమే.

ఫిలిప్పైన్స్ లో మిలిటరీ విమానం కూలుడు

ఒక మిలిటరీ విమానం కూలిపోయి ఫిలిప్పైన్స్ లో 50 మంది చనిపోయారు. కొన్ని డజన్లమంది గాయపడ్డారు. ఈ ప్రదేశం కర్కాటకరాశి అధీనమని చెప్పాను. మిలిటరీకి కుజుడే కారకుడు. విమానాలు శుక్రుని అధీనంలో ఉంటాయి. శుక్రకుజులిద్దరూ ప్రస్తుతం కర్కాటకరాశిలోనే ఉండటం గమనించండి.

హర్యానాలో భూకంపం

హర్యానాలోని జజ్జర్ అనే ప్రాంతంలో 3.7 భూకంపం వచ్చింది. శనికుజుల ప్రభావం భూకంపాలను ఇవ్వడం ఎన్నోసార్లు గమనించాం. శనీశ్వరుడు ప్రస్తుతం ఇండియాకు సూచికైన మకరంలో ఉండటం చూడవచ్చు.

ఆఫ్ఘనిస్తాన్ సంక్షోభం ముదురుతోంది

అమెరికా దళాల ఉపసంహరణతో ఆఫ్ఘనిస్తాన్ లో ప్రమాదఘంటికలు మోగుతాయని గతంలో వ్రాశాను. దీనిని నిజం చేస్తూ తాలిబాన్ పుంజుకుంటోంది. ఆఫ్ఘనిస్తాన్ లో అనేక ప్రాంతాలను ఆక్రమిస్తోంది. విధ్వంసం ముందుంది. ఆఫ్ఘనిస్తాన్ అనేది ధనుస్సు, మకరరాశుల మధ్యలో ఉంటుందని ముందే వ్రాశాను. అందుకే అక్కడ సంక్షోభం ముదురుతోంది.

ఇవి అంతర్జాతీయ ఫలితాలు. వ్యక్తిగతం వ్రాయదలుచుకోలేదు. ధనుస్సు, మకరం, మిధునం, కర్కాటక రాశులవారు గమనించుకోండి మీమీ జీవితాలలో మీకు మీకే తెలుస్తాయి.

read more " శనికుజుల ప్రభావం - 11 (మచ్చుకు మరికొన్ని) "

4, జులై 2021, ఆదివారం

కెనడాలో ఒక్కరోజులో 12000 ఉరుములు మెరుపులు , 170 కార్చిచ్చులు - ఏమిటిదంతా?

ఒక్క శుక్రవారం నాడు కెనడాలో 12,000 ఉరుములు మెరుపులు కలిగాయి. 170 కార్చిచ్చులు అక్కడి అడవులలో చెలరేగాయి. దీనికితోడు 50 డిగ్రీల ఎండ మాడ్చేస్తోంది. పశ్చిమ కెనడాలోని బ్రిటిష్ కొలంబియాలో ఇది జరిగింది. ఈ పిడుగులన్నీ వాంకోవర్ కు ఈశాన్య దిక్కులో ఉన్న కాంలూప్స్ ప్రాంతంలోనే పడ్డాయి. ఈ ప్రాంతమంతా ఖాళీ చెయ్యమని ప్రభుత్వం ప్రజలకు ఉత్తర్వులు జారీ చేసింది. లిట్టన్ అనే ఊరిలో 50 డిగ్రీల సెల్సియస్ లేదా 120 ఫారంహీట్ ఉష్ణోగ్రత నమోదైంది. ఆ ఊరంతా ఖాళీ చేసి జనం ప్రాణాలు అరచేతులతో పెట్టుకుని పారిపోయారు. గతతరానికి చెందిన వృద్ధులు వందలాదిమంది సరియైన వెంటిలేషన్ లేని ఇళ్లలో ఉంటూ ఊపిరాడక చనిపోయారు. ఈ ప్రాంతం పైన హెలికాఫ్టర్లు చక్కర్లు కొడుతున్నాయి. మిలిటరీ రంగంలోకి దిగింది. సహాయకార్యక్రమాలు మొదలయ్యాయి.

కాంలూప్స్ అనే పేరు వింటుంటే ఏదైనా గుర్తొస్తున్నదా? రెండు నెలల క్రితం ఇక్కడే వందలాది  చిన్నపిల్లల సమాధులు ఒక స్కూల్ ఆవరణలో బయటపడ్డాయి. ఆ స్కూల్ పేరు కాంలూప్స్ ఇండియన్ రెసిడెన్షియల్  స్కూల్. గుర్తొచ్చిందా? అక్కడే ఈ ప్రకృతి విధ్వంసం ప్రస్తుతం జరుగుతోంది మరి ! ఈ ప్రాంతంలో చర్చీలను ప్రజలే తగలబెడుతున్నారు. బ్రిటిష్ రాణి శిలావిగ్రహాలను ప్రజలే కూల్చేస్తున్నారు. వాళ్ళ బాధ వాళ్ళది పాపం !

ఈ కర్మకారకులు - యురేనస్, ప్లూటో, శని, కుజుడు, శుక్రుడు. వీరందరి సమిష్టి ప్రభావం కర్కాటక రాశిపైన పడింది. ఆ రాశి కెనడాకు సూచిస్తున్నది. అర్థమైందా?

కర్మ ఇలా పనిచేస్తుంది. కళ్ళున్నవాళ్ళు చూడండి. అర్ధం చేసుకోగలిగినవాళ్లు అర్ధం చేసుకోండి.

ఆమెన్ !

read more " కెనడాలో ఒక్కరోజులో 12000 ఉరుములు మెరుపులు , 170 కార్చిచ్చులు - ఏమిటిదంతా? "

కెనడా అమెరికాలలో అత్యధిక ఎండలు

కెనడా అంటేనే మంచుప్రాంతమని ఒక ఊహ. అమెరికాలో చాలా చోట్లు, ముఖ్యంగా నార్త్ లో  అలాగే ఉంటుంది. కానీ గత నాలుగురోజులనుంచీ అక్కడ ఎండలు మండుతున్నాయి. 50 డిగ్రీల సెల్సియస్ వచ్చిందట, అంటే 122 ఫారెన్ హీట్ అన్నమాట. ఇవి గుంటూరు విజయవాడ వేసవి ఎండలు. గుంటూరు వాసులకు ప్రతేడాదీ 50 డిగ్రీలు మామూలే. మే నెలాఖరులో గుంటూరు వాసులు ఈ ఎండలు చూస్తూనే ఉంటారు ఒక వారం పాటు. మనమే తట్టుకోలేం ఇంత ఎండల్ని, ఆ వేడికి అమెరికన్లు కెనడియన్లు ఏం తట్టుకుంటారు పాపం ! 

ఈ హీట్ వేవ్ దెబ్బకు కెనడాలో 716 మంది హరీమన్నారు. అమెరికా ఆరిగన్ లో 95, వాషింగ్టన్ లో 35 మంది పోయారని అంటున్నారు. కూలింగ్ సెంటర్లనేవి ఎడాపెడా వెలిశాయి. జనాలంతా అక్కడికెళ్లి చెడ్డీలేసుకుని బోర్లాపడుకుని బ్రతికిపోతున్నారు.

గత వెయ్యి సంవత్సరాలలో ఇలాంటి పరిస్థితి రాలేదని అంటున్నారు. అసలింత వేడికి కారణమేంటి? హీట్ డోమ్ అని సైన్స్ వాదులంటున్నారు. కావచ్చు. ఈ హీట్ డోమ్ ఇదే ప్రాంతాన్ని హింసించడానికి కారణం? అది సైన్స్ వాదులకర్ధం కాదు.

కెనడాలో వందలాది పిల్లల సమాధులు బయటపడిన బ్రిటిష్ కొలంబియాలోనే ఇది జరుగుతోంది. అక్కడి సస్కచ్ఛవాన్ ప్రావిన్స్ వైపు ఈ హీట్ వేవ్ పోతోంది. ఈ సూచన ఏమి చెబుతోంది? గత తరం చేసిన ఘోరాలకు ఈ తరం మూల్యం చెల్లిస్తోందని చెబుతోంది. ఈ హీట్ వేవ్ దెబ్బకు ఎవరెవరు పోయారో వాళ్ళందరి కుటుంబ మూలాలు తరచి చూస్తే, గతకాలపు ఘోరాలకు లింకులు దొరుకుతాయి. కానీ అంత స్టాటిస్టికల్ స్టడీ ఎవరు చెయ్యగలరు? డాటా ఎక్కడ దొరుకుతుంది? దొరికినా ఉపయోగమేముంది? మనకు ముందే తెలుసుకదా ఇది కర్మఫలితమని.

అందుకే మన పూర్వీకులనేవారు - 'ఈరోజు విర్రవీగి పిచ్చిపనులు చెయ్యకండిరా ముందుముందు పడాల్సి వస్తుంది అని' - ఎవరు వింటారు?

సరే కెనడా సంగతి, మరి నార్త్ వెస్ట్ అమెరికా వాసులెందుకు పడుతున్నారు హింస? అంటే, వాళ్ళ కారణాలు వాళ్ళకుంటాయి. ఒక్కొక్కళ్ళకీ విడివిడిగా కూచోబెట్టి వడ్డించడం కుదరదు కదా ప్రకృతికి, అందుకే ఒకే రకమైన మనుషులనందర్నీ ఒకే గాటన కట్టి ఒకేసారి బంతిభోజనం వడ్డిస్తోంది. ఇదిలాగే ఉంటుంది.

వ్యక్తిగతంగా, కుటుంబపరంగా, సామూహికంగా ఎక్కడికక్కడే వడ్డన జరుగుతూ ఉంటుంది మానవజీవితంలో . అర్ధం కావాలంటే, చూచే చూపుండాలి మరి !

గత మూడు రోజులుగా కుజుడు, శని యురేనస్ లతో ఖచ్చితమైన డిగ్రీ దృష్టిలోకి వచ్చాడు. ఇదే సమయంలో కెనడా అమెరికాలలో ఈ భయంకర ఎండలు వాయించాయి. కుజుడు ప్రస్తుతం కర్కాటక రాశిలో ఉన్నాడు, ఈ రాశి కెనడాకు సూచిస్తుందని వ్రాశాను. యురేనస్ అగ్నితత్త్వ రాశి అయిన మేషంలో ఉంటూ  తీవ్రమైన వేడిని సూచిస్తున్నాడు. శని వాయుతత్త్వగ్రహం గనుక వేడిగాలులను సూచిస్తాడు. యురేనస్ శని ఇద్దరూ నిదానంగా నడుస్తారు. ఎప్పుడైతే కుజుడు వీరిద్దరితో డిగ్రీ దృష్టిలోకి వచ్చాడో, ఈ రెండు దేశాలలో ఈ పరిస్థితి ఏర్పడింది.

కెనడాలో బయటపడింది 741 మంది పిల్లల సమాధులు. ఈ హీట్ వేవ్ లో చనిపోయింది కూడా దాదాపు 716 మందే. అంటే, వందేళ్లక్రితం చంపబడిన చిన్నపిల్లల ఆత్మలకు యిప్పటికి శాంతి దొరికిందన్నమాట. కర్మ ఇలా పనిచేస్తుంది మరి !

మరీ ఎక్కువగా ఊహిస్తున్నట్లు అనిపిస్తోందా? పోనీ అలాగే అనుకోండి నాదేం పోతుంది?

read more " కెనడా అమెరికాలలో అత్యధిక ఎండలు "