“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

26, ఏప్రిల్ 2009, ఆదివారం

జెన్ మహా గురువు బోధి ధర్మ


జెన్ సాంప్రదాయానికి చైనాలో మొదటి గురువుగా బోధిధర్మ ఈనాటికీ నీరాజనాలు అందుకుంటున్నాడు.ఆయన చైనాకు ఈ జ్ఞానాన్ని అందించటం వల్ల ఎన్ని వేలమంది జిజ్ఞాసులు సంసార సాగరాన్ని దాటి బుద్ధత్వాన్ని పొందారో లెక్కలేదు.ప్రపంచానికి గొప్ప మేలు చేసిన వారిలో తప్పక ఈయన పేరు ఉంటుంది.


ఈయన తమిళనాడుకు చెందిన పల్లవరాజు సుగంధుని మూడవ సంతానంగా చరిత్ర కారులు భావిస్తున్నారు.ప్రపంచం మీద విరక్తి చెందిన ఈయన సింహాసనాన్ని త్యజించి ధ్యానబౌద్ధ సాంప్రదాయానికి చెందిన ఇరవై ఏడవ గురువైన ప్రజ్ఞాతారకు శిష్యుడైనాడు. ఎన్నో ఏండ్ల ఏకాంత ధ్యానసాధన తర్వాత బుద్ధత్వాన్ని పొందాడు.తరువాత గురువుగారి ఆజ్ఞమేరకు ధ్యానబౌద్ధాన్ని చైనాలో ప్రచారం చెయ్యడానికి సముద్రమార్గంలో చైనా చేరాడు.

అక్కడ దక్షిణ చైనాను "వు" అనే చక్రవర్తి పరిపాలిస్తున్నాడు. ఆయన బౌద్ధ మతానుసారి. దానధర్మాలు చేసినవాడు.ఎన్నో బౌద్ధ ఆరామాలు కట్టించిన వ్యక్తి. కాని బోధిధర్ముని మాటలు ఆయనకు నచ్చలేదు.అప్పటివరకూ ఆయన చూచిన బౌద్ధ భిక్షువుల తీరుకూ బోధిధర్మ తీరుకూ బోలెడంత తేడా ఉంది.

బోధిధర్మ ఉత్త బౌద్ధపండితుడు కాదు.త్రిపిటకాలను బట్టీపట్టి ఒప్పజెప్పే వ్యక్తి కాదు. బుద్ధత్వాన్ని పొందినవాడు.శాస్త్రచర్చలకూ,ఆచారాలకు,క్రియాకలాపాలకు భిన్నమైన ధ్యానబౌద్ధ శాఖకు చెందినవాడు.వారిద్దరి మధ్యన జరిగిన చర్చ ఇప్పటికీ ఒక శిలా శాసనంలా నిలిచిపోయింది.

బోధిధర్మను ఆహ్వానించటానికి "వు" చక్రవర్తి వచ్చాడు.కాని ఆయన అప్పటి వరకు చూచిన బుద్ధధర్మం కంటే భిన్నమైన ధర్మాన్ని బోధిధర్మలో చూచాడు. చక్రవర్తి అప్పటి వరకూ చేసిన పుణ్యకార్యాలకు,కట్టించిన మఠాలకు,చేసిన దానధర్మాలకు,ఏమాత్రం విలువ లేదని తేల్చిచెప్పాడు బోధిధర్మ.నిర్వాణాన్ని ప్రత్యక్షంగా అనుభూతి చెందకపోతే ఇవన్నీ వృధాపనులని ఖరాఖండిగా చెప్పేశాడు.

బుద్ధుని అత్యున్నత బోధన శూన్యత్వమనీ,దానిలో ఏ ప్రత్యేకతా లేదనీ తేల్చిచెప్పాడు. పిచ్చికోపం వచ్చిన చక్రవర్తి " అంతా శూన్యం అయితే మీరు ఎవరు స్వామీ?" అని బోధిధర్మను అడుగుతాడు.దానికి బోధిధర్మ క్లుప్తంగా "నాకు తెలియదు" అని మాత్రం జవాబు చెబుతాడు.ఈ సంభాషణ అంతా చక్రవర్తికి విపరీతమైన కోపాన్నీ విసుగునూ తెప్పిస్తుంది. బోధిధర్మ ఆయనకు ఒక పిచ్చి వాడిగా, దురహంకారిగా అగుపిస్తాడు.

తన మాటలు చక్రవర్తికి అర్థం కాలేదని గ్రహించిన బోధిధర్మ,నదిని దాటి ఉత్తర చైనాను చేరతాడు.అక్కడ షావోలిన్ మఠంలో తొమ్మిదేళ్ళు ఉండి నలుగురు శిష్యులకు తన బోధనల సారాన్ని తెలిపి అక్కడే మరణిస్తాడు.ఆయనను అక్కడికి దగ్గరలో గల ఒక గుహలో పూడ్చి పెడతారు.

మూడు ఏళ్ల తరువాత,ఒక సరిహద్దు సేనానికి,బోధిధర్మ ఉత్తకాళ్ళతో మంచులో నడుస్తూ భారతదేశానికి పోతూ కనిపిస్తాడు.ఆయన చేతిలో ఒకే ఒక పాదరక్ష ఉంటుంది.సేనానిని త్వరగా వెనక్కు పొమ్మని , తానూ తన దేశానికి పోతున్నానని, చక్రవర్తి త్వరలో మరణించ బోతున్నాడని చెబుతాడు.సేనాని వెనక్కు వచ్చి బోధిధర్మ సమాధిని తెరిపించి చూస్తాడు. అందులో బోధిధర్మ శవం ఉండదు.కాని ఒక పాదరక్ష మాత్రం ఉంటుంది.బోధిధర్మ చెప్పినట్లే చక్రవర్తి త్వరలో మరణిస్తాడు.

బోధిధర్మ బోధనలేమిటో తరువాత పోస్ట్ లలో చూద్దాం.
read more " జెన్ మహా గురువు బోధి ధర్మ "

జెన్ సిద్ధాంతాలు

జెన్ గురించి చెప్పాలంటే వ్యతిరేక పదాలలోనే చెప్ప గలుగు తాము. కారణం, ఏ సత్యమైనా మౌలికంగా సరాసరి చెప్పటానికి వీలు పడదు.పరమ సత్యంఅనేది నిర్వచనములకు అతీత స్థితి కనుక దానిని సూచించ టానికి మాత్రమె వీలవుతుంది. నిర్వచించ టానికి వీలు కాదు.

జెన్ ను చైనాకు పరిచయం చేసిన మొదటి గురువు బోధి ధర్మ జెన్ గురించి కొన్ని మాటలు చెప్పాడు.


1. ఇది శాస్త్రాలతో పని లేకుండా సూటిగా బుద్ధత్వాన్ని ఇచ్చే మార్గం.
2. సరాసరి మానవ మనస్సువైపు వేలు చూపుతుంది.
3. తన స్వభావమును సూటిగా తెలుసుకొనుట ద్వారా బుద్ధత్వ స్థితి కలుగుతుంది.


బుద్ధునికి అనుత్తర సమ్యక్ సంబోధి అనబడే పూర్ణ జ్ఞానం ధ్యానం వల్లనే కలిగింది.శాస్త్ర పఠనం వల్ల , నియమ పాలన వల్ల కాదు. కనుక బుద్ధుని అనుసరించే వాడు కూడా ధ్యానపు లోతులలో మునిగి తన స్వభావమును, మనస్సు మర్మాలను, ప్రపంచపు ఉనికిని సరాసరి అనుభవ జ్ఞానం ద్వారా తెలుసు కొన్నపుడే అతడూ బుద్ధుడు అవుతాడు. అంతే కాని గ్రంథ పఠనం, నియమ నిష్టల పాలన ఇట్టి ఇతర వ్యాపకాల వల్ల కాలేడు. అని జెన్ చెబుతుంది.

అందుకే దీనిని సరాసరి దీపాన్ని వెలిగించటం తో పోలుస్తారు. ఒక దీపం ఇంకొక దీపాన్ని వెలిగించటం చేస్తుంది. రెండవ దీపం వెలుగును గ్రహించి తానూ వెలగటం ప్రారంభిస్తుంది. అలాగే మంచి సత్యాన్వేషికి సమర్థుడైన గురువు దొరికినపుడు జ్ఞాన తేజస్సు గురువు నుంచి శిష్యునికి సరాసరి ప్రవహిస్తుంది. దీనికి ఉపదేశాలతోనూ, గ్రంథాల తోనూపనిలేదు.

బోధి ధర్మ చైనాకు చేరినపుడు అంతకు ముందే బుద్ధ సందేశం అక్కడ ఉన్నది. క్రీస్తు పూర్వమే బుద్ధుని బోధనలు చైనాకు చేరినవి. కాని అది కలుషితమై పోయిన పరిస్థితి లో ఉంది. బుద్ధుని అసలైన బోధన ధ్యానం. దానిని వదిలి పెట్టి సూత్ర పఠనం, గ్రంథ శోధన ఇట్టి పద్ధతులు అక్కడ వ్యాప్తిలో ఉన్నాయి. జ్ఞానం అంటే బౌద్ధికం గా అర్థం చేసుకునేది అన్న తప్పు భావన అక్కడ ఉన్నది. దీనిని పోగొట్టి సరియైన బుద్ధ ధర్మమును వారికి తెలియ చెప్ప టానికి బోధి ధర్మ అక్కడకు వెళ్ళాడు.

ఆయన ప్రసిద్ధ షావోలిన్ మఠం లో ఉంటూ తొమ్మిది సంవత్సరాలు ఒక గోడను తదేకం గా చూస్తూ ధ్యానం లో ఉన్నాడు. సరియైన శిష్యుని కోసం వేచి చూసాడు. చివరకు హుయికే అనే సచ్చిష్యుడు ఆయనకు దొరికాడు. బుద్ధుడు ఎలాగైతే జెన్ వెలుగును మహా కాస్యపునికి ఇచ్చాడో అలాగే బోధి ధర్మ హుయికే కు ఈ జ్ఞానాన్ని ప్రసారం చేసాడు. హుయికే చైనాలో జెన్ సాంప్రదాయానికి రెండవ గురువు అయ్యాడు.
read more " జెన్ సిద్ధాంతాలు "

25, ఏప్రిల్ 2009, శనివారం

జెన్ పుట్టుక

గౌతమ బుద్ధుడు గృధ్ర కూట పర్వతం మీద ఉన్నప్పుడు ఒకరోజు భిక్షువుల సమావేశం జరిగింది. ఆ సమావేశం లో ఎప్పటి లాగే ఆయన ఏదో ఒక ప్రవచనం చేస్తాడని అందరూ ఎదురు చూశారు. కాని ఆ రోజున ఒక విచిత్రం జరిగింది. బుద్ధుడు ఒక పద్మాన్ని తన చేతిలో పట్టుకొని మౌనంగా ఉండి పోయాడు.

అక్కడ ఉన్న వేలాది భిక్షువులు ఆయన చర్యను అర్థం చేసుకొన లేక పోయారు. కాని మహా కాశ్యపుడు ఒక్కడే ఆయన మౌనాన్ని అర్థం చేసుకొని చిరునవ్వు నవ్వాడు. అప్పుడు బుద్దుడు తన చేతిలోని పద్మాన్ని మహా కాశ్యపుని చేతికి ఇచ్చి ఇలా అన్నాడు.

"నేను ధర్మ నేత్రాన్ని కలిగి ఉన్నాను. నిర్వాణ మనస్సును కలిగి ఉన్నాను. అరూప రూపాన్ని కలిగి ఉన్నాను. ప్రత్యెక ధర్మం నా వద్ద ఉన్నది. ఈ ధర్మం మాటలకు, శాస్త్రాలకు అతీతమైనది. ఇది మాటలతో పని లేకుండా సరాసరి ఇవ్వ బడుతుంది. దీనిని ఈరోజు మహా కాశ్యపునికి ఇస్తున్నాను. "

ఈ విధంగా మొదలైన జెన్ పరంపరలో మొదటి గురువు మహా కాశ్యపుడు, రెండవ గురువు ఆనందుడు, పద్నాలుగవ గురువు నాగార్జునుడు, ఇరవై ఏడవ గురువు ప్రజ్ఞాతార లేక ప్రజ్ఞాధరుడు, ఇరవై ఎనిమిదవ గురువు బోధి ధర్ముడు. తరువాత భారత దేశంలో ఈ జ్ఞానాన్ని పొందే అర్హత ఉన్న వాళ్లు లేక పోవటంతో, బోధిధర్మ చైనాకు వెళ్లి మౌన ప్రచారం చేసాడు.


జెన్ వెలుగు ఈ విధంగా భారత దేశాన్ని విడిచి చైనాకు చేరింది. అక్కడ చాన్ గా పిలవబడి బోధి ధర్మ తరువాత అయిదుగురు మహా గురువులను ఉద్భవింప చేసింది. తరువాత కొన్ని శాఖలుగా చీలి జపాన్ చేరి జెన్ గా మారింది.

మహాయాన బౌద్ధం మరియు యోగాచార సాంప్రదాయముల కలయిక ధ్యాన బౌద్ధం. ఈ ధ్యాన అనే పదం చైనాలో చాన్ గా మారింది. జపాన్ చేరి జెన్ అయింది. ఈ నాటికీ చైనా, జపాన్, హాంగ్ కాంగ్, మలేషియా, బర్మా, థాయిలాండ్, కాంబోడియా దేశాలలో ఈ శాఖలు ఉన్నాయి. దీనిని అనుసరించి ఈనాటికీ జ్ఞానులు ఉన్నారు. నిర్వాణ మహా లాభాన్ని పొందుతూనే ఉన్నారు.
read more " జెన్ పుట్టుక "

24, ఏప్రిల్ 2009, శుక్రవారం

స్ఫురణ శక్తి

జ్యోతిషం అనేది గణితం మీద ఆధార పడిఉన్నశాస్త్రం. దీనికి స్ఫురణ శక్తి తో సంబంధం లేదు. అని కొందరు అంటారు. కాని అది నిజం కాదు. గణితం సహాయం లేకుండా జ్యోతిషం లేదు నిజమే. కాని గణితమే సర్వస్వం కాదు. గ్రహ స్థితులు, బలా బలాలు తెలుసుకునే వరకే గణిత ప్రయోజనం.

ఒకే జాతక చక్రాన్ని పది మంది జ్యోతిష్కులు చూస్తె ఒక్కొక్కరు ఒక్కో విధం గా విశ్లేషణ చేస్తారు. దానికి కారణాలు రెండు. ఒకటి వారు నేర్చుకున్న విధానాలు వేరు వేరు కావచ్చు. రెండు వారి స్ఫురణ శక్తి లో తేడాలు ఉంటాయి. ఒకరికి తట్టిన విషయం ఇంకొకరికి తట్టదు. ఇదే ముఖ్య కారణం.

ఉపాసన వల్ల ఏమి జరుగుతుంది? దానివల్ల స్ఫురణ శక్తి పెరుగుతుంది. గ్రహాలకు, భావాలకు, రాశులకు అనేక కారకత్వాలు ఉంటాయి. ఆయా కారకత్వాలలో ఆ సందర్భానికి ఏది సరిగ్గా సరిపోతుంది అనేది టక్కున స్ఫురించటమే దైవ కృప. ఈ శక్తి ఉపాసనా బలం వల్ల పెరుగుతుంది.

చాలా సరియైన ఫలితాలు చెప్ప గలిగిన విద్వాంసుడు అది తన గొప్ప అనుకుంటే పప్పులో కాలేసినట్లే. దైవ కృప వల్ల వచ్చిన స్ఫురణ శక్తి తో, మహర్షుల అనుగ్రహంతో ఇది సాధ్యం అయింది అని భావించే వాడే సరియగు దైవజ్ఞుడు.

కనుక స్ఫురణ శక్తికి జ్యోతిర్ విద్య లో ఎంతో ప్రాముఖ్యత ఉన్నది. అది పని చెయ్యని నాడు ఎంతటి శాస్త్ర జ్ఞానం ఉన్నా ఉపయోగం లేదు. యూరోప్ దేశాలను ఆశ్చర్య పరిచే విధంగా హస్త సాముద్రికం చెప్పిన కీరో తన చేతికి కాశీ పండితులు కట్టిన యంత్ర తాయెత్తు పోయిన తరువాత అదే విధం గా ఫలితాలు చెప్పలేక పోయాడు. ఈ విషయం కీరో భార్య స్వయం గా బీ వీ రామన్ గారికి వ్రాశిన ఉత్తరంలో ఉన్నది.

దైవ శక్తి తోడ్పాటు లేనినాడు మానవ శక్తి, తెలివి పనికి రావు అనేమాట నిజం. జ్యోతిర్ విజ్ఞానం వంటి వేద విద్యలలో ఇది మరిన్ని పాళ్ళు నిజం అనిపిస్తుంది.
read more " స్ఫురణ శక్తి "

21, ఏప్రిల్ 2009, మంగళవారం

టావో తే చింగ్

టావో తే చింగ్- 2
-----------------
కొన్నిటిని అందమైనవి అని తలచినపుడు
కొన్ని వికారం గా కనిపిస్తాయి
కొన్నింటిని మంచివి అనుకున్నపుడు
కొన్ని చెడ్డవి ఆవుతాయి

ఉనికి, లేమి పుడతాయి
ఒకదాని నుంచి ఒకటి
పొడుగూ పొట్టీ కలిగిస్తాయి
ఒకదాని నొకటి
ఉన్నతం హీనం ఆధార పడతాయి
ఒకదాని పై ఒకటి
ముందూ తరువాత అనుసరిస్తాయి
ఒకదాని నొకటి

కనుక జ్ఞాని ఊరకే ఉంటూ
అంతా చేస్తాడు
మౌనం గా ఉంటూ
సర్వం బోధిస్తాడు

విషయాలు వెల్లువలా లేస్తాయి
అతడు వాటిని రానిస్తాడు
అవి మాయమైనపుడు
వాటిని పోనిస్తాడు

అతనికి అన్నీ ఉన్నాయి
కాని దేన్నీ సొంతం అనుకోడు
అతడు కర్మ చేస్తాడు
కాని ఏదీ ఆశించడు

తన పని పూర్తి అయినపుడు
దానిని మర్చిపోతాడు
అందుకే అది నిలుస్తుంది ఎప్పటికీ


ఇది టావో తే చింగ్ లో రెండవ పద్యం. ఇందులో లావో జు ప్రపంచం యొక్క అనిత్యత్వాన్ని, ద్వంద్వ ప్రకృతిని చూపిస్తాడు. మనిషి మనసు ద్వంద్వముల అధీనంలో ఉంది. ఏదైనా ఒక విషయాన్ని నిర్వచన చేశామంటే దాని విరుద్ధ భావన ప్రక్కనే ఉంటుంది. కనుక సృష్టి స్వభావమైన ద్వంద్వ భావనలోకి పోకుండా తన స్వరూప స్థితి లో ఉండమని చెబుతాడు.

జ్ఞాని కర్మ చేస్తూనే ఉంటాడు. కాని దానిపైన ఆసక్తి చూపడు. సహజ కర్మ జరుగుతుంటే తానూ సాక్షీ స్థితిలో చూస్తూ ఉంటాడు. మోహానికి లోను కాడు గనుక కర్మను చక్కగా చెయ్య గలుగుతాడు. ఫలితాన్ని ఆశించడు గనుక చేసిన పనిని గురించి చింత చెయ్యడు.

ఈ పద్యం పూర్తిగా భగవద్ గీత లోని కర్మ యోగాన్ని, స్థిత ప్రజ్నుని స్థితి ని గూర్చి చెప్పిన భావాలకు మక్కీ గా కనిపిస్తుంది. భావ సారూప్యం ఉన్నప్పటికీ, విషయం చాలా ఉన్నతమైన అద్వైత వేదాత తత్త్వం.

జీవితాన్ని బాగా పరిశీలించిన వారికి ఇందులోని సత్యం బోధ పడుతుంది. ఇది ఆదర్శ వాదం కాదు. ఆచరణకు పనికి వచ్చే వేదాంతం. అయితే అర్థం చేసుకోవటం కష్టం. ఆచరించటం ఇంకా కష్టం. ఇది సాధకుని స్థితి కాదు. సిద్ధుని స్థితి. ఇక్కడ చెప్పిన కర్మాచరణ ప్రయత్న పూర్వకంగా చేసేది కాదు. అప్రయత్నం గా జరిగేది. లావో జు తత్త్వం అంతటా ఇట్టి అకర్మ ప్రస్ఫుటం గా కనిపిస్తుంది.
read more " టావో తే చింగ్ "

12, ఏప్రిల్ 2009, ఆదివారం

తావో తే చింగ్


లావో జు వ్రాసిన టావో తే చింగ్ కు తెలుగులో నా స్వేచ్చానువాదం నేటినుంచి వరుసగా ఇస్తాను. లావో జు గురించి ఇంతకూ ముందు వ్రాసి ఉన్నాను. ఆయన క్రీస్తు పూర్వం ఆరవ శతాబ్దం లో చైనాలో నివసించిన తాత్వికుడు. చైనా సంస్కృతిని గొప్పగా ప్రభావితం చేసిన గ్రంథాలలో టావో తే చింగ్ మరియు దీని తరువాత అనలేక్త్స్ ఆఫ్ కన్ఫూషియస్ ముఖ్యమైనవి. తావో తే చింగ్ మార్మిక భాషలో ఉన్నటువంటి గ్రంధం. దీని ఆధారంగా తాత్విక చింతనా ధోరణులు, తై ఛి మొదలగు వీర విద్యలు, ఇంకా కొన్ని క్షుద్ర విద్యలు కూడా పుట్టు కొచ్చాయి. ఇక చదవండి.
------------------------------------------------------------------------------
తావో తే చింగ్- ఒకటి

తావో ను గురించి చెబితే అది తావో కాదు
పేరు పెట్టామంటే అది నిజమైన పేరు కాదు.
పేరు లేనిదే నిత్యమైనది
పేరు తోనే అన్నిటికీ మొదలు కలిగింది

తృష్ణ లేకుంటే నీకు రహస్యం తెలిసిపోతుంది
తృష్ణ లో చిక్కుకుంటే నువ్వు సృష్టినే చూస్తావు

అయినా రహస్యమూ సృష్టీ రెండూ
ఒకే మూలం నుంచి ఉద్భవిస్తాయి.
ఈ మూలమే చిమ్మ చీకటి.

ఈ చీకటిలోని చీకటి
అన్ని ఆశ్చర్యాలకూ నెలవు.

బ్రహ్మమొక్కటే ఎంగిలి పడనిది అంటారు శ్రీ రామకృష్ణులు. అంటే నిర్వచనానికి అతీత మైనది. దేన్నైనా నిర్వచించ గాలిగా మంటే అది మన నోటిలో ఎంగిలి అవుతుంది. బ్రహ్మమొక్కటే అనిర్వచనీయం. అదే జగత్తుకు మూలం. వాక్కుకు అతీత మైనది గా దానిని వేదములు వర్ణించాయి. ఇదే బ్రహ్మం. దీనినే లావో జు తన భాషలో టావో అన్నాడు. దీనినే వేదాంతము బ్రహ్మము అని, పురాణములు భగవంతుడు అని, తంత్రములు పరమ శివుడు అని పిలిచాయి. ఇది బుద్ధికి అతీత మైన అనిర్వచనీయమైన, అనుభవైక వేద్యమైన ఒక స్థితి.

పేరు పెట్టి దానిని పిలిచినా మరు క్షణం అది ఎంగిలి అవుతుంది. అప్పుడది నిజమైన టావో కాదు. మాటల స్థాయికి దిగి వచ్చిందంటే అది తన స్వ స్వరూపం నుంచి ఒక మెట్టు దిగినట్లే. కనుక అది అసలైన టావో కాదు. అందుకనే జ్ఞానులు మౌన బోధ చేశారు. బుద్ధుని దేవుని గురించి అడిగితె మౌనం వహించాడు. రమణ మహర్షి కూడా అదే పని చేశాడు. శ్రీ రామకృష్ణుడూ అదే చేశాడు.

నిర్వచనకు మూలం కోరిక. ఏదో చేయాలని తపన. దానితో అనేక భావాలలోచిక్కుకొనుట జరుగుతుంది. ప్రతి దానినీ నిర్వచించి అర్థం చేసుకోవాలని తపన కలుగుతుంది. సత్యము ఈ తపనకు అతీత మైనది. కనుక కోరిక తో సృష్టి మొదలైనది. కోరిక లేకపోతే సృష్టి మూలం ఎరుకలోకి వస్తుంది.

కాని ఈ అతీతమూ అనిర్వాచ్యమూ అయిన స్థితీ సృష్టీ రెండూ ఒకే చీకటి నుంచి ఉద్భవించాయి. సృష్టి ఉనికి అయితే, ఉనికి లేమి దాని నీడలా ఉందనే ఉంటుంది. ఈ రెంటికీ మూలమే చిమ్మ చీకటి. ఆ చీకటికి మూలమైన చీకటి లో సర్వం ఉంది. అన్ని ఆశ్చర్యాలూ అక్కడ కలసి మెలసి ఉన్నాయి. అది అద్భుతాలకు నెలవు.

ఇది చదువుతుంటే వేదంలోని సృష్టి సూక్తం గుర్తుకు వస్తుంది. ఇవే భావాలు అక్కడా కనిపిస్తాయి. అదలా ఉంచితే ఈ పద్యం నుంచి తాయి జి అనే ప్రతీక పుట్టుకొచ్చింది. తావోఇజం లో దీనిని యిన్ యాంగ్ అనే ప్రతీకగా చూపుతారు. యాంగ్ పురుష శక్తి యిన్ ప్రక్రుతి. యాంగ్ తెల్లని భాగం, యిన్ చీకటి. సృష్టి సమస్తం ఈ రెండు శక్తుల కలయిక. దేనికీ మూలం వు జి. దీనిని ఒక శూన్య వృత్తం తో చూపిస్తారు. ఇవన్నీ మన తంత్ర శాస్త్రం లో గల యంత్రాల వంటివి. ప్రతీ గీతకూ అర్థం ఉంటుంది. ఈ భావం నుంచి తాయి ఛి అనబడే వీర విద్య పుట్టింది. తరువాతి పద్యాలలో దాని గురించి వివరంగా చూద్దాము.

నేటి మోడరన్ ఫిజిక్స్ కూడా దీనికి దగ్గరిగా వచ్చింది. ప్రపంచంలో మేటర్ మరియు ఏంటి మేటర్ ఉన్నాయి. వీటినే యాంగ్ మరియు యిన్ అనవచ్చు. ఈ రెంటికీ మూలమైన దాన్ని డార్క్ మేటర్ అని ఫిజిక్స్ నేడు చెబుతోంది. దానినే లావో జి చిమ్మ చీకటి అన్నాడు. ఆ చీకటికి మూలమైన చీకటి అంటే, డార్క్ మేటర్ కు మూలం ఏదైతే ఉందొ అది అన్ని అద్భుతాలకూ నెలవు అంటాడు.

సమస్త సృష్టికీ మూల పదార్థం కనుక అది సమస్త అద్భుతాలకు నెలవు. ఇంత వైవిధ్య భరిత మైన సృష్టి ని మూల స్థితిలో కలిగి ఉన్నా శూన్యం మరి అద్భుతమెగా.

తంత్రం దీనినే శివ శక్తులుగా పిలిచింది. వీటికి అతీత మైన స్థితిని పరమేశ్వర తత్త్వం అన్నది. దానిని మించిన స్థితి పేరు పెట్టలేని స్థితి. మౌనం అని కూడా దానిని అనలేము. ఎందుకంటే మౌనం అని ఒక పేరు పెట్టిన క్షణంలో దానిని ఒక మెట్టు కిందికి లాగినట్లు అవుతుంది.
read more " తావో తే చింగ్ "

10, ఏప్రిల్ 2009, శుక్రవారం

చలం గారి జాతక విశ్లేషణ


చలం గారు 19-5-1894 వైశాఖ పూర్ణిమ రోజున జన్మించారు. జనన సమయం దొరకలేదు. కాని జనన కాల సవరణ చేయబడినది. అది ఎలా చేశాను అనేది తరువాత వ్రాస్తాను. ఆయన పుట్టిన సమయానికి గ్రహ స్థితి ఈ విధంగా ఉంది. నా అంచనా ప్రకారం చలంగారి లగ్నం కన్యాలగ్నం  కావచ్చు. శని వారం. నక్షత్రం అనూరాధ-1 పాదం. లాహిరి అయనాంశ వాడాను.

ఫలిత విశ్లేషణ:



పూర్ణిమ రోజు గాని దాని దగ్గరలో గాని పుట్టిన వారికి దాంపత్య జీవితం బాగుండదు అనటానికి అనేక ఉదాహరణలు ఇవ్వవచ్చు. వారి వైవాహిక జీవితంలో ఏదో విధమైన లోపము, దిగులు, కష్టాలు లేదా వెలితి తప్పక ఉంటుంది. దానికి కారణం ఏమనగా, జీవితానికి వెలుగు ఇవ్వ వలసిన సూర్య చంద్రులు ఒకరి కొకరు సమ సప్తకంలో ఉండటమే. అనేక జాతకాలలో ఈ కాంబినేషన్ గమనించటం జరిగింది.

భార్యాభర్తలు శారీరికంగా కానీ మానసికంగ కానీ దూరంగ ఉంటారు. వైవాహిక జీవిత ఆనందానికి ఇది మంచి గ్రహస్థితి కాదు. కొందరు సన్యాసులు, సాధువుల జీవితాలలో ఇది చూడవచ్చు. చలంగారి జీవితం కూడా అలాగే గడిచింది. భార్య రంగనాయకమ్మ గారితో జీవితాంతం కలిసి ఉన్నప్పటికీ వారి మధ్య మానసికఅగాధం ఉండేది. చలంగారి వివాహేతర సంబంధాలు ఆవిడకు అసహ్యం కలిగించేవి. వారి మధ్య మొదట్లో ఉన్నఅనుబంధం చివరివరకు ఉందా అనేది అనుమానమే.

రెండవది రాహుశుక్రుల కలయిక జలతత్వరాశి యగు మీనంలో జరిగింది. వీరికి ఎదురుగా శనికేతువులు కన్యారాశిలో ఉన్నారు. ఇది ఈజాతకానికి సంబంధించిన అతిముఖ్యయోగం.రాహుశుక్రుల కలయిక అతికామయోగాన్ని ఇస్తుంది.అందులోను జలతత్వరాశి గనుక,శుక్రునికి ఇది ఉచ్చస్తితిగనుక విపరీతమైన శృంగారభావములు ఈజాతకుని జీవితాంతం వేధిస్తాయి. అలాగే జరిగింది కూడాను. వీరికి ఎదురుగా  కన్యారాశిలో శనిదృష్టితో నిమ్నజాతికి చెందిన అనేకమంది అమ్మాయిలతో జాతకునికి సంబంధాలు ఉంటాయి.కన్యారాశి ద్విస్వభావ రాశి,భూతత్వపు రాశి కనుక స్త్రీలంటే చలించే మనస్తత్వం బలంగా ఉంటుంది.

చందురుడు వృశ్చికరాశిలో స్థితితో, ప్రతీదాన్ని ప్రశ్నించటం,విమర్శించటం, తర్కించటం ఉంటుంది. చంద్రుని నీచస్థితి తద్రాసి నాదుడగు కుజుని చతుర్థ కేంద్రస్థితితో నీచభంగం జరిగింది. చంద్రదశ ఈయనకు 1963-1973 మధ్యలో జరిగింది. తరువాత మరణం వరకూ కుజదశ జరిగింది. కనుక చంద్ర కుజ దశలోనే ఈయన కామప్రవృత్తి తొలగి దాని స్థానే ఆధ్యాత్మికప్రవృత్తి కలగటం ఈయోగం ద్వారా సూచింప బడింది. అంటే 1950 లో రమణ ఆశ్రమానికి చేరినా దాదాపు పదమూడు వత్సరాలు ఈయన తన అధమప్రవృత్తిని జయించటానికి శ్రమించవలసి వచ్చింది.

రవి, బుధ, గురువులు వృషభరాశి స్థితివల్ల తీవ్రమైన భౌతిక వాంఛలతో జీవితం సతమతమయ్యింది. దీనివల్ల రచనానైపుణ్యం, ప్రభుత్వఉద్యోగం, ఉన్నతవ్యక్తులతో పరిచయాలు కలిగాయి. కుంభంలో కుజునివల్ల సంసార సుఖం నాశం, అతికామం, ఆరోగ్యం చెడిపోవటం కలిగాయి.

శనికేతువుల స్థితి ఆధ్యాత్మికచింతనను, ఆలోచనాపరత్వాన్ని ఇచ్చింది. చంద్రునిపైన శని దృష్టి వల్ల కూడా ఈ ధోరణి ఎక్కువ అవుతుంది. రవి బుధ గురువుల మీద కుజ దృష్టితో ఈయన రచనలలో సమాజాన్ని తీవ్రంగ విమర్శించటం, ఎవరినీ లెక్క చేయకపోవటం, సమాజ ధోరణులకి ఎదురు నడవటం జరిగాయి.

శనిమీద గురుదృష్టి వల్ల జీవితంలో ఆర్ధికపరంగా ఎదుగులేకపోవటం, కష్టాలు, కలిగాయి. కానీ ఇదే కాంబినేషన్ ఈయనమీదగల సద్గురు అనుగ్రహాన్ని చూపిస్తున్నది. అందువల్లనే ఈయన అనేకమంది  మహానీయుల అనుగ్రహానికి పాత్రుడు కాగలిగాడు. శని వక్రత వల్ల తీరని అనేక కర్మబందాలు ఈయనను పట్టి బంధించాయని చెప్పవచ్చు.

చంద్ర లగ్నాత్ పంచమంలో రాహుస్థితివల్ల కొడుకు రవి చిన్న వయసులోనే మరణించాడు. కాని అదే పంచమంలో శుక్రుని ఉచ్చస్థితి వల్ల మహానీయురాలైన కూతురు సౌరిస్ జన్మించింది.

ఈయన జాతకం స్థూలంగా కొద్ది మాటలలో చెప్పవలెనంటే కామప్రవృత్తికీ ఆధ్యాత్మికప్రవృత్తికీ జరిగిన సంఘర్షణ. చలం ఒక మనిషికాదు. ఆయనలో అనేక కోణాలు ఉన్నాయి. చలంలో ఒక సౌందర్యపిపాసి ఉన్నాడు, ఒక కాముకుడు ఉన్నాడు, ఒక సున్నిత హృదయుడు దాగున్నాడు, ఒక మానవతావాది ఉన్నాడు, ఒక ఆధ్యాత్మిక అన్వేషి కూడా ఉన్నాడు.

ఇన్ని పరస్పర విరుద్ధభావాలు ఆయనను ఊపి వేశాయి. జీవితమంతా శాంతి లేకుండా చేసాయి. చివరకు కూడా ఆయనకు శాంతి దొరకలేదు. అవధూత మాలపిచ్చమ్మగారు చెప్పినట్టు అది బహుశా తరువాతి జన్మలో దొరుకుతుందేమో. భగవత్ గీత ప్రకారం మరణ సమయంలో ఉన్న మానసికస్థితి బట్టి తరువాతి జన్మ ఉంటుంది. చలం చివరిలో పరమ సత్యాన్ని తెలుసుకోవాలని చాలా తపించాడు. తన మనస్సుతో తానె దాదాపు మూడుదశాబ్దాలు యుద్ధం చేసాడు. కనుక తరువాతి జన్మలో అతడు తన గమ్యాన్ని చేరగలడని ఆశిద్దాం.

చలం నవీన మానవుని సంఘర్షణాత్మక జీవితానికి ప్రతీక. అతడొక నిరంతర అన్వేషి. అందుకే నేటి తరాన్ని కూడా ఆకర్షించ గలుగుతున్నాడు. చలాన్ని గురించిన కొన్ని నమ్మలేని నిజాలు తరువాతి వ్యాసంలో చూద్దాం.

చలం నిజాయితీని, సత్యసంధతని చెప్పకపొతే అతని వ్యక్తిత్వం సంపూర్ణం కాదు. ఆయనకీ న్యాయం చేసినట్టు కూడా అనిపించదు. కనుక ఇంకా వ్రాస్తున్నాను. మనస్సు కారకుడైన చంద్రుడు అనూరాధ నక్షత్రంలో ఉన్నాడు అది విమ్శోత్తరి దశ విధానంలో శని అధీనంలో ఉంటుంది. ఆ శని ఆధ్యాత్మిక చింతనకు కారకుడైన కేతువుతో కలసి ఉన్నాడు. శని దృష్టి చంద్రుని మీద ఉంది. ఇంకా చంద్రుని మీద గురువు యొక్క సప్తమ దృష్టి ఉంది. కనుక చలం మోసగాడు కాదు. నిజాయితీ మరియు సత్య సంధత కలిగినవాడు. తను నమ్మినదాన్ని నిజంగా భావించి దాన్నే ఏ అరమరికలూ లేకుండా వ్రాస్తూ వచ్చాడు.ఏ స్త్రీతో సంబంధం పెట్టుకున్నా దాన్ని బాహాటంగా ఒప్పుకున్నాడు. తను పెద్ద పవిత్రుడిగా చలామణీ కావాలని తలచలేదు. ఒక వేళ అలా నాటకాలాడి ఉంటే చలంలోని శృంగార పరత్వం లోకానికి ఎన్నటికీ తెలిసేది కాదు.తన రాసలీలల గురించి తనే వ్రాసుకున్నాడు.చలం లోని నిజాయితీని నిరూపించటానికి ఈ ఒక్క రుజువు చాలు. 

బుద్ధి కారకుడైనటు వంటి బుధుని స్థితి చూద్దాం. ఈ బుధుడు రవితో చాలా దగ్గిరగా ఉంటూ, గురువుతో కూడా కలసి ఉన్నాడు. కనుక ఈయన బుద్ధిబలం కలిగిన వాడే కాకుండా, ధార్మికబుద్ధి కలిగిన వాడు. చంద్రుని మీద గురు, శనుల దృష్టుల వల్ల డబ్బు మీద ఆశ, కోరికా లేకుండా పోయాయి. ఈ కారణాల వల్లనే తనకు పదహారు ఏళ్ళు వచ్చేవరకు అప్పటి బ్రాహ్మణకుటుంబాలలో సహజమైన నియమయుతజీవితం గడిపాడు. అప్పటికి దాదాపు అతని శనిమహాదశ అయిపొయింది. బుధదశలో రఘుపతి వెంకటరత్నం నాయుడుగారి శిష్యరికం బ్రహ్మసమాజభావాలు ఆయన్ను ప్రభావితం చేసాయి. దీనికి కారణం బుధునితో కూడిన రవి గురులు వీరిపైన కుజ దృష్టి. ఈ కుజదృష్టి ఈయనను సంప్రదాయబద్ధమైన బ్రాహ్మణజీవితం నుండి అన్నింటినీ ప్రశ్నించి ఎదిరించే తిరుగుబాటు ధోరణి వైపు లాగింది.

దాదాపుగా ముప్పై మూడోఏట ప్రారంభమైన కేతుదశ ఈయన జీవితాన్ని ఊహించని మలుపు తిప్పింది. అప్పుడే ఈయనకు భగవాన్ రమణమహర్షి దర్శనం కలిగింది. దాంతో అప్పటివరకూ ఇంద్రియసుఖాలలో వెతుకుతున్న పరమసుఖం అక్కడ లేదు అనే సత్యం ఆయనకు బౌద్ధికంగా అర్థం అయింది. కాని రాహుశుక్రుల బలం ఆయన్ను గట్టిగా పట్టింది. జీవితంలో సంఘర్షణ తీవ్ర స్థాయికి చేరింది.

శుక్ర దశలో ఆయన రమణ మహర్షి సన్నిధికి చేరాడు. రవి చంద్ర దశలలో సాధన కొనసాగించాడు. కుజ దశలో మరణం ఆయన్ను ఈ ప్రపంచం నుండి ఆయన ఆశించిన మరో ప్రపంచానికి తీసుకు పోయింది.

ఆయన ప్రాధమికంగా అత్యంత నిజాయితీపరుడు. ఏ మాత్రం మోసం ఎరుగని వ్యక్తి. మరి భార్యకు చేసింది మోసం కాదా అని అనుమానం రావచ్చు. కోరికలు బలంగా ఆయన్ను ఈడ్చుకు పోయాయి. రాహుశుక్రుల కలయిక దానిమీద శనిదృష్టి ఎంత బలమైన కామోద్రేకాన్ని ఇస్తుందో అది అనుభవించిన వాళ్ళకే తెలుస్తూంది. కాని ఆ విషయాలను వేటినీ దాచకుండా తానె లోకానికి వెల్లడి చేసాడు. తన అంతర్మథనాన్ని మొత్తం అక్షరబద్ధం చేసాడు. 

సౌందర్యపిపాస, కామం ఒకప్రక్క, తీవ్ర ఆధ్యాత్మిక తృష్ణ ఒకప్రక్క ఆయన్ను చీల్చి ముక్కలు చేసాయి. ఈ ఆంతరిక యుద్ధంలో ఎంతో సంఘర్షణకు గురయ్యాడు. ప్రతి సాధకుడూ ఇటువంటి సంఘర్షణకు లోనవక తప్పదు. కాని కోరికలబలం తక్కువగా ఉన్నవాడు యుద్ధాన్ని తేలికగా గెలుస్తాడు. అదే చలంలాంటి వానికి విజయం చాలా గట్టి ప్రతిఘటన తరువాత మాత్రమె సిద్ధిస్తుంది. 

తనకు ఆనందాన్ని ఇచ్చిన, తానె పెంచి పోషించుకున్న ప్రతి కోరికనూ త్రుష్ణనూ తానే నిర్దాక్షిణ్యంగా నరుక్కుంటూ ఉందొ లేదో తెలియని గమ్యం వైపు సాగిపోవాలి.అదే నిజమైన సాధన. మాటలలో చెప్పినంత తేలిక కానేకాదు. రమణాశ్రమ జీవితంలో ఆయన వ్రాసిన సాహిత్యాన్ని చదివిన వాళ్లకు ఇది తేటతెల్లం అవుతుంది. ఎన్నో చోట్ల తన ఆంతరిక సంఘర్షణను వ్రాస్తాడు. అదొక నరకయాతన. రావణుడు తన పొట్ట చీల్చి పేగులతో రుద్రవీణ మ్రోగించాడని అంటారు.ఇది కూడా అటువంటిదే.ఈ సంఘర్షణను ఊహించటం వల్లే రమణాశ్రమంలో ఉన్నపుడూ చలంగారు గుర్తోచ్చినపుడూ నాకు కన్నీరు ఉబికింది.

చలం జీవితం ఆంతరిక స్థాయిలలో పరిణతి చెందుతూ వచ్చింది. బహుశా అంత త్వరగా ఇవాల్వ్ అయిన జీవితాలు చాలా తక్కువగా ఉంటాయి. మన జీవితాలు చలనం లేని మడుగుల్లా స్తబ్డుగా ఉండిపోతాయి. అంతరికంగా మనబోటివారికి ఎదుగూ బొదుగూ ఉండదు. చలం ఆర్థికంగా ఎదగలేదు. కాని మానసికంగా, బౌద్ధికంగా, ఆత్మపరంగా అతి వేగం తో ఎదిగాడు. 

అందుకనే ఆయన జీవితంలో డబ్బుకోసం వెంపర్లాట కనిపించదు. ఇతరులను మోసంచేసి తాను పైకి ఎదుగుదామనే తపన కనిపించదు. రచయితలకు సహజమైన కీర్తి కండూతి మచ్చుకైనా ఈయనలో కనపడదు. దానికి లోతైన మార్మిక కారణాలు ఉన్నాయి. అవి అందరూ నమ్మలేరు. అయినా వచ్చే వ్యాసంలో వాటి గురించి వ్రాస్తాను.
read more " చలం గారి జాతక విశ్లేషణ "

1, ఏప్రిల్ 2009, బుధవారం

గుడిపాటి వెంకట చలం గారి జాతకం

గుడిపాటి వెంకటచలం. పేరు ఒకప్పుడు ఆంద్రదేశాన్ని కుదిపేసింది.ఎంతోమంది తిట్లకు గురయ్యింది. ఇంకెంతో మంది అభిమానుల్ని సంపాదించుకుంది. ఒక మిత్రుడు నిన్ననే చెప్పాడు చలంగారు మీకు దూరపు బంధువే కదా. ఆయన మీద చాలా చర్చలు జరుగుతున్నై బ్లాగుల్లో. ఆయన జాతకం ఒకసారి విశ్లేషణ చెయ్యకూడదూ అని.నేనూ చలం గారి అభిమానినే కాబట్టి చూద్దాం అనుకున్నా. ఆయన పుట్టిన సమయం దొరకలేదు.అందుకని మనకు తెలిసిన ఇతర విధానాలలో ప్రయత్నం చేద్దాంలే అని చూశాను.

చలం గారిని అర్థం చేసుకోటం ఒక రకంగా అతికష్టం, ఒక రకంగా అతి తేలిక.నేను మొదటగా చలం గారిని గురించి విన్నది 1976 లో అనుకుంటా.అప్పటికే ఆయన రమణాశ్రమ వాసి అయ్యారు.పదోతరగతి చదివే రోజుల్లో ఆయన పుస్తకాలు చదివాను.ఆయనలో నాకు నచ్చిన అంశాలు చాలా ఉన్నా, వెంటనే ఆకట్టుకున్నవి మాత్రం కొన్ని.

ఉదారస్వభావం,స్త్రీ సమస్యలపైన ఆయన భావాలు, భావుకత్వం,నిర్మొహమాటంగా మనసులో మాట చెప్పటం,మానవత్వం,సౌందర్యారాధన మొదలైనవి నన్ను ఆయన అభిమానిని చేశాయి.ఆయన స్త్రీల బాధలను గురించి వ్రాసిన విషయాలు, సంఘటనలు మా ఇళ్ళలో నేను మక్కీకి మక్కీగా చూచాను.బహుశ అందుకే ఆయనంటే అభిమానం కలిగిందేమో చెప్పలేను.

ఆయన
గురించిన చర్చలు అప్పుడప్పుడు పెద్దల మధ్య జరుగుతూ ఉండేవి. మేము పిల్లలుగా పక్కన నిలబడి వింటుండేవాళ్ళం.అప్పటి నుంచి ఆయన పుస్తకాలు ఎక్కడ దొరికినా చదివేవాడిని.ఆయన ఇంటర్వ్యూ రేడియోలో వచ్చింది.చాలా నిదానంగా మెల్లిగా విషయాలు మర్చిపోయిన మనిషిలాగా మాట్లాడారు.అదే ఆయన ఆఖరి ఇంటర్వ్యూ.తరువాత 1979 లో ఆయన పోయినట్టు రేడియోలో వార్తల్లో చెప్పారు.

1987
లో బళ్లారిలో ఉంకి సణ్ణరుద్రప్ప లా కాలేజిలో లా చదువుతున్న రోజులు. రోజంతా బళ్ళారి లైబ్రరీలో మకాం. సాయంత్రం కాలేజీ. లైబ్రరీలో చలంగారి సాహిత్యం మొత్తం ఉండేది.క్లాసుల సంగతి దేవుడెరుగు.రోజంతా విందు భోజనంలా ఉండేది పరిస్థితి.ఆయన మీద అభిమానం పెరిగి పెరిగి ఆయన హాస్పేటలో పని చేసారని చదివాక, ఒకరోజు ఒక మిత్రుడు నేను కలిసి హాస్పేట్ వెళ్లి ఆయన నివశించిన ఇంటి కోసం వెతికాం. దొరకలేదు. 

ఆయనకు
తుంగభద్రలో తారానాధ్ గారు మిత్రుడు. ఇప్పటి మంత్రాలయం రైల్వే స్టేషన్ ప్రాంతాన్ని అప్పట్లో 'తుంగభద్ర'అనేవారు.ఇప్పటి మంత్రాలయం స్టేషన్ దగ్గిరలో తారానాధ్ గారి బంగళా చింతతోపుల్లో దూరంగా విసిరేసినట్లు ఉంది. ఒకరోజు అక్కడకు పోయి వచ్చాం. అప్పుడు తారానాధ్ గారి కూతురు అక్కడ తేనెటీగల పెంపకం చేస్తున్నారు. ఆమె మెడికల్ డాక్టర్.ఆమె చిన్నప్పుడు చలంగారు వారింటికి రావటం ఆమెకు గుర్తుంది. ఆవరణ అంతా తిరిగి చలంగారు తిరిగిన చోట మనమూ తిరుగుతున్నాం అని ఆనందపడ్డాం. అప్పటికే నేను తాంత్రికదేవత అయిన తారాదేవి ఉపాసన మొదలుపెట్టి ఉండటంతో తారానాద్ గారి ఇంటికి పోవడం ఎందుకో భలే నచ్చింది.

తర్వాత ఉద్యోగరీత్యా విజయవాడలో 1991 లో ఉన్నపుడు ఒకరోజు దారిన పోతుంటే ఒక మిత్రుడు చూపాడు ఇది రచయిత్రి లతగారి ఇల్లు,ఇందులో కొంత కాలం చలంగారు ఉన్నారు అని. నేను నరసరావుపేటలో బ్రహ్మానందరెడ్డి కాలేజీలో ఇంటర్ చదివే రోజుల్లో లతగారు మా కాలేజీ ఫంక్షన్ కి గెస్ట్ గా వచ్చారు.అప్పటికే ఆమె వ్రాసిన కొన్ని నవలలు(దెయ్యాలు లేవూ? నవల అందులో ఒకటి) నేను చదివి ఉండటమూ ఆమె రంగనాయకమ్మనూ ఆమె వ్రాసిన విషవృక్షాన్నీ ఆ ఫాక్షన్ లో ఏకి పారెయ్యడమూ నాకు గుర్తొచ్చాయి.చలంగారికి విజయవాడలో చాలామంది మిత్రులు ఉన్నారుట. ఇల్లు చూస్తె నాకు చలంగారి మాటలు గుర్తు వచ్చాయి.ఆయన విజయవాడ ఒదిలి శాశ్వతంగా తిరువన్నామలై పోయే రోజున ప్లాట్ఫారం మీద ఆయనకు సెండాఫ్ ఇవ్వటానికి ఒక్కడూ రాలేదుట. సంగతి ఆయనే రాసుకున్నాడు నిర్వేదంగా.

చలంగారు పెనమలూరు రోడ్డులో అప్పుడు ఉన్న మాలపిచ్చమ్మగారనే అవధూతను అప్పుడపుడు దర్శించేవాడు. ఆమె దిగంబరి. రోడ్డు పక్కనే దుమ్ములో కూచొని ఉండేది. ఎవర్నీ పట్టించుకునేది కాదు. కాని చలం బస్సు దిగుతూనే ప్రేమగా నవ్వేది. అతన్ని దగ్గిరికి తీసుకుని ముద్దు చేసేది. ఆమె ఎప్పుడూ సమాధిస్థితిలో ఉండేది.కాని లోకులు ఆమెనొక పిచ్చిది అనుకునేవారు. ఒకరోజు మాలపిచ్చమ్మ గారి ఆలయం దర్శించాను. ఆమె కూచుని ఉండే చోటులోనే కట్టారు. బందరు రోడ్డులో ఉంది. ఆమె ఒకరోజున చలంగారిని భ్రూమధ్యంలో తాకి ఏదన్నా వెలుగు కనిపించిందా అని అడిగింది. చలం లేదన్నాడు. ఆమె నిరాశగా,'నీకీ జన్మకి ఇంతేరా నువ్వు కోరుకుంటున్నది వచ్చే జన్మకే' అంది. సంగతి ఆయనే వ్రాసుకున్నాడు.

తరువాత రమణాశ్రమం దర్శించినప్పుడు, రమణస్థాన్ లో చలంగారున్న ఇల్లు, ఆయన సమాధి చూచాను. మహర్షి పోయిన తరువాత అందరూ ఆశ్రమం ఖాళీచేసి పొతే, చలం ఒక్కడే మహర్షి సమాధి దగ్గర అలా కూచుని ఉండేవాడు. ఎంత మానసిక సంఘర్షణకి లోనయ్యాడో ఆ రోజుల్లో. అది గుర్తొచ్చి కళ్ళలో నీళ్లు ధారలుకట్టాయి.ఆశ్రమంలో ఉన్న మూడురోజులు చలంగారు అనుక్షణం గుర్తోచ్చేవారు. చలంగారిని నేను చూడలేదు.కాని ఆయనకు నాకు తెలియని ఏదో అనుబంధం ఉంది అనిపించింది చాలాసార్లు.

సౌరిస్ గారు భీమిలీలో ఉంటున్నారని తెలిసి వెళ్లి కలుద్దామని ఎన్నోసార్లు అనుకున్నా.ఎందుకో వీలవలేదు. విశాఖపట్నం వరకు వెళ్లికూడా ఎందుకో భీమిలీ వెళ్ళలేక పోయేవాణ్ని.కాని మిత్రుడు చంద్రశేఖర్ ఒకటి రెండు సార్లు వెళ్లి వచ్చాడు. పోయి వద్దాం అనుకుంటూ ఉంగానే సౌరిస్ గారి మరణవార్త తెలిసింది.జిల్లెళ్ళమూడి అమ్మగారి విషయంలో కూడా ఇలాగే జరిగింది.
మిత్రుడు చరణ్ తండ్రి చెరుకుమిల్లి సత్యనారాయణగారుచలం గారు, మంచి ఫ్రెండ్స్. వారిద్దరి మధ్యా ఉత్తరాలు సాగేవి.సత్యనారాయణ గారు జిల్లెళ్ళమూడి అమ్మగారి ప్రియభక్తుడు.చలానికి అమ్మగారిని చూడాలని ఆశ.కాని అశక్తుడు, తిరువన్నామలై నుంచి బాపట్ల రాలేడు.ఈ సంగతి సత్యనారాయణ గారు అమ్మగారి చెవిని వేశారు.

అమ్మగారి ఆరోగ్యం కూడా బాగాలేదు. విపరీతమైన దగ్గు. అయినా సరే
జిల్లెళ్ళమూడి అమ్మగారు చలం కోసమే తన భక్తులు అందరితో కలిసి బాపట్ల నుంచి అరుణాచలం వెళ్లి రమణస్థాన్లో చలాన్ని దగ్గిరికి తీసుకుని ముద్దుచేసి వచ్చింది. అప్పుడు చలం పసి పిల్లాడిలా భోరున ఏడ్చాడు 'నా కోసం నువ్వే వచ్చావా అమ్మా' అంటూ. 'నేనిక్కడ ఆశక్తుడనై పడి ఉన్నాను, నాకోసం నువ్వే వచ్చావు. ఏడిరా నీ ఈశ్వరుడు?అని ఎవరైనా అడిగితె ఇప్పుడు చూపగలను ఇదుగో చూడండి అంటూ' అంటూ సత్యనారాయణగారికి వ్రాసిన ఉత్తరం ఇప్పటికీ చరణ్ దగ్గిర భద్రంగా ఉంది.

చలంగారు మొదట్లో జాతకాలు నమ్మేవారు కాదు. అదే చలంగారు చివరిలో భగవత్ గీతకు భాష్యం వ్రాశాడు. వచ్చే వ్యాసంలో చలం గారి జాతకం చూద్దాం.
read more " గుడిపాటి వెంకట చలం గారి జాతకం "