“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

26, ఏప్రిల్ 2009, ఆదివారం

జెన్ సిద్ధాంతాలు

జెన్ గురించి చెప్పాలంటే వ్యతిరేక పదాలలోనే చెప్ప గలుగు తాము. కారణం, ఏ సత్యమైనా మౌలికంగా సరాసరి చెప్పటానికి వీలు పడదు.పరమ సత్యంఅనేది నిర్వచనములకు అతీత స్థితి కనుక దానిని సూచించ టానికి మాత్రమె వీలవుతుంది. నిర్వచించ టానికి వీలు కాదు.

జెన్ ను చైనాకు పరిచయం చేసిన మొదటి గురువు బోధి ధర్మ జెన్ గురించి కొన్ని మాటలు చెప్పాడు.


1. ఇది శాస్త్రాలతో పని లేకుండా సూటిగా బుద్ధత్వాన్ని ఇచ్చే మార్గం.
2. సరాసరి మానవ మనస్సువైపు వేలు చూపుతుంది.
3. తన స్వభావమును సూటిగా తెలుసుకొనుట ద్వారా బుద్ధత్వ స్థితి కలుగుతుంది.


బుద్ధునికి అనుత్తర సమ్యక్ సంబోధి అనబడే పూర్ణ జ్ఞానం ధ్యానం వల్లనే కలిగింది.శాస్త్ర పఠనం వల్ల , నియమ పాలన వల్ల కాదు. కనుక బుద్ధుని అనుసరించే వాడు కూడా ధ్యానపు లోతులలో మునిగి తన స్వభావమును, మనస్సు మర్మాలను, ప్రపంచపు ఉనికిని సరాసరి అనుభవ జ్ఞానం ద్వారా తెలుసు కొన్నపుడే అతడూ బుద్ధుడు అవుతాడు. అంతే కాని గ్రంథ పఠనం, నియమ నిష్టల పాలన ఇట్టి ఇతర వ్యాపకాల వల్ల కాలేడు. అని జెన్ చెబుతుంది.

అందుకే దీనిని సరాసరి దీపాన్ని వెలిగించటం తో పోలుస్తారు. ఒక దీపం ఇంకొక దీపాన్ని వెలిగించటం చేస్తుంది. రెండవ దీపం వెలుగును గ్రహించి తానూ వెలగటం ప్రారంభిస్తుంది. అలాగే మంచి సత్యాన్వేషికి సమర్థుడైన గురువు దొరికినపుడు జ్ఞాన తేజస్సు గురువు నుంచి శిష్యునికి సరాసరి ప్రవహిస్తుంది. దీనికి ఉపదేశాలతోనూ, గ్రంథాల తోనూపనిలేదు.

బోధి ధర్మ చైనాకు చేరినపుడు అంతకు ముందే బుద్ధ సందేశం అక్కడ ఉన్నది. క్రీస్తు పూర్వమే బుద్ధుని బోధనలు చైనాకు చేరినవి. కాని అది కలుషితమై పోయిన పరిస్థితి లో ఉంది. బుద్ధుని అసలైన బోధన ధ్యానం. దానిని వదిలి పెట్టి సూత్ర పఠనం, గ్రంథ శోధన ఇట్టి పద్ధతులు అక్కడ వ్యాప్తిలో ఉన్నాయి. జ్ఞానం అంటే బౌద్ధికం గా అర్థం చేసుకునేది అన్న తప్పు భావన అక్కడ ఉన్నది. దీనిని పోగొట్టి సరియైన బుద్ధ ధర్మమును వారికి తెలియ చెప్ప టానికి బోధి ధర్మ అక్కడకు వెళ్ళాడు.

ఆయన ప్రసిద్ధ షావోలిన్ మఠం లో ఉంటూ తొమ్మిది సంవత్సరాలు ఒక గోడను తదేకం గా చూస్తూ ధ్యానం లో ఉన్నాడు. సరియైన శిష్యుని కోసం వేచి చూసాడు. చివరకు హుయికే అనే సచ్చిష్యుడు ఆయనకు దొరికాడు. బుద్ధుడు ఎలాగైతే జెన్ వెలుగును మహా కాస్యపునికి ఇచ్చాడో అలాగే బోధి ధర్మ హుయికే కు ఈ జ్ఞానాన్ని ప్రసారం చేసాడు. హుయికే చైనాలో జెన్ సాంప్రదాయానికి రెండవ గురువు అయ్యాడు.