Love the country you live in OR Live in the country you love

21, ఏప్రిల్ 2009, మంగళవారం

టావో తే చింగ్

టావో తే చింగ్- 2
-----------------
కొన్నిటిని అందమైనవి అని తలచినపుడు
కొన్ని వికారం గా కనిపిస్తాయి
కొన్నింటిని మంచివి అనుకున్నపుడు
కొన్ని చెడ్డవి ఆవుతాయి

ఉనికి, లేమి పుడతాయి
ఒకదాని నుంచి ఒకటి
పొడుగూ పొట్టీ కలిగిస్తాయి
ఒకదాని నొకటి
ఉన్నతం హీనం ఆధార పడతాయి
ఒకదాని పై ఒకటి
ముందూ తరువాత అనుసరిస్తాయి
ఒకదాని నొకటి

కనుక జ్ఞాని ఊరకే ఉంటూ
అంతా చేస్తాడు
మౌనం గా ఉంటూ
సర్వం బోధిస్తాడు

విషయాలు వెల్లువలా లేస్తాయి
అతడు వాటిని రానిస్తాడు
అవి మాయమైనపుడు
వాటిని పోనిస్తాడు

అతనికి అన్నీ ఉన్నాయి
కాని దేన్నీ సొంతం అనుకోడు
అతడు కర్మ చేస్తాడు
కాని ఏదీ ఆశించడు

తన పని పూర్తి అయినపుడు
దానిని మర్చిపోతాడు
అందుకే అది నిలుస్తుంది ఎప్పటికీ


ఇది టావో తే చింగ్ లో రెండవ పద్యం. ఇందులో లావో జు ప్రపంచం యొక్క అనిత్యత్వాన్ని, ద్వంద్వ ప్రకృతిని చూపిస్తాడు. మనిషి మనసు ద్వంద్వముల అధీనంలో ఉంది. ఏదైనా ఒక విషయాన్ని నిర్వచన చేశామంటే దాని విరుద్ధ భావన ప్రక్కనే ఉంటుంది. కనుక సృష్టి స్వభావమైన ద్వంద్వ భావనలోకి పోకుండా తన స్వరూప స్థితి లో ఉండమని చెబుతాడు.

జ్ఞాని కర్మ చేస్తూనే ఉంటాడు. కాని దానిపైన ఆసక్తి చూపడు. సహజ కర్మ జరుగుతుంటే తానూ సాక్షీ స్థితిలో చూస్తూ ఉంటాడు. మోహానికి లోను కాడు గనుక కర్మను చక్కగా చెయ్య గలుగుతాడు. ఫలితాన్ని ఆశించడు గనుక చేసిన పనిని గురించి చింత చెయ్యడు.

ఈ పద్యం పూర్తిగా భగవద్ గీత లోని కర్మ యోగాన్ని, స్థిత ప్రజ్నుని స్థితి ని గూర్చి చెప్పిన భావాలకు మక్కీ గా కనిపిస్తుంది. భావ సారూప్యం ఉన్నప్పటికీ, విషయం చాలా ఉన్నతమైన అద్వైత వేదాత తత్త్వం.

జీవితాన్ని బాగా పరిశీలించిన వారికి ఇందులోని సత్యం బోధ పడుతుంది. ఇది ఆదర్శ వాదం కాదు. ఆచరణకు పనికి వచ్చే వేదాంతం. అయితే అర్థం చేసుకోవటం కష్టం. ఆచరించటం ఇంకా కష్టం. ఇది సాధకుని స్థితి కాదు. సిద్ధుని స్థితి. ఇక్కడ చెప్పిన కర్మాచరణ ప్రయత్న పూర్వకంగా చేసేది కాదు. అప్రయత్నం గా జరిగేది. లావో జు తత్త్వం అంతటా ఇట్టి అకర్మ ప్రస్ఫుటం గా కనిపిస్తుంది.