“అసమర్ధుని వద్ద ధనము, సుఖము, కీర్తి, ధర్మము ఏవీ నిలచి ఉండవు"

29, డిసెంబర్ 2023, శుక్రవారం

జ్యోతిష్య రిట్రీట్ ఎప్పుడు?

'జ్యోతిష్య రిట్రీట్ ఎప్పుడు? మేము కూడా అటెండ్ అవుదామని అనుకుంటున్నాము' అని అడుగుతూ అనేకమంది మెయిల్స్ ద్వారా, ఇతరత్రా మమ్మల్ని సంప్రదిస్తున్నారు. వారందరికోసం ఈ పోస్ట్.

మిగతా అనేకమంది లాగా జ్యోతిష్య శాస్త్రాన్ని ఒక డబ్బు సంపాదించే మార్గంగా చూడటం మా విధానం కాదు. కనుక, కోర్సులంటూ పెట్టి, కమర్షియల్ అస్ట్రాలజీని మేము నేర్పించము. సమాజంలో ఇప్పుడున్న దొంగలు చాలు. క్రొత్తవాళ్ళని తయారు చేయవలసిన పని మాకు లేదు.

'మరి మీ జ్యోతిష్య విధానాన్ని ఎవరికి నేర్పిస్తారు?' అనే సందేహం చాలామందికి కలుగుతుంది.

పంచవటి సాధనామార్గాన్ని అనువరించేవారికి మాత్రమే మా జ్యోతిష్యవిధానాన్ని నేర్పించడం జరుగుతుంది. మా స్పిరిట్యువల్ రిట్రీట్లలో భాగంగా యోగశాస్త్రం, తంత్రశాస్త్రం, జ్యోతిష్యశాస్త్రం, ఇంకా కొన్ని మార్మికవిద్యలను నేర్పడం జరుగుతుంది.  పంచవటి సాధనామార్గంలో ఇవన్నీ అంతర్భాగాలు. ఆధ్యాత్మికమార్గంలో నన్ను అనుసరించాలనుకునే నా శిష్యులకు మాత్రమే ఇవి నేర్పబడతాయి గాని, సరదాకో, డబ్బు సంపాదించడానికో జ్యోతిష్యాన్ని నేర్చుకోవాలని ఆశించేవారికి నేర్పబడవు. ఈ విద్యలను మేము చూచే కోణం వేరు. ఇది లోకపు తీరుకు పూర్తి భిన్నంగా ఉంటుంది.

మా జ్యోతిష్యవిధానం మీకు, మీ కుటుంబానికి మాత్రమే ఉపయోగపడుతుంది. అది కూడా పూర్తిగా ఆధ్యాత్మికకోణంలో మాత్రమే ఉపయోగిస్తుంది. మూడో మనిషికి మీరు చెప్పకూడదు. చెప్పలేరు. డబ్బుల కోసం అసలే చెప్పకూడదు. డబ్బు కోసం ఈ విద్యను వాడకూడదు.

ఒక్కమాటలో చెప్పాలంటే మాది స్పిరిట్యువల్ అస్ట్రాలజీ. స్పిరిట్యువల్ మార్గంలో నడిచే సాధకులకు మాత్రమే ఇది ఉద్దేశించబడింది. 24 గంటలూ డబ్బు తప్ప ఇంకో ధ్యాసలేని స్వార్ధపరులు, ఆశపోతులైన లౌకికులకోసం ఉద్దేశించినది కాదు.

బయటవాళ్ళకు మా రిట్రీట్స్ లోకి అనుమతి ఉండదు. రిట్రీట్స్ లో కాకుండా మాదైన జ్యోతిష్యవిధానాన్ని నేర్చుకోవడం వేరేవిధంగా వీలుకాదు. కనుక, దానిని నిజంగా నేర్చుకోవాలనుకుంటే, నా శిష్యులుగా  మారి, మా సాధనావిధానంలో నడవడం ఒక్కటే దారి.

దానిలో నడుస్తామంటే సరే. కాదంటే మాత్రం, మా జ్యోతిష్య విధానం మీకోసం కాదని గ్రహించండి.

ఆధ్యాత్మిక సాధనామార్గంలో జ్యోతిష్య శాస్త్రం విడదీయరాని భాగం. లౌకిక బాధలను పోగొట్టడానికి దానిని తప్పకుండా వాడవచ్చు. కానీ పునాది మాత్రం ఆధ్యాత్మికమై ఉండాలి. ఇది మా విధానం.

మా సాధనామార్గంలో నడుస్తామంటే రండి. జ్యోతిష్యశాస్త్రాన్ని నాదైన వేగవిధానంలో నేర్చుకోండి. సాధన వద్దంటే, మా జ్యోతిష్యం మీకు పనికి రాదు.

మమ్మల్ని సంప్రదిస్తున్న అనేకమందికి సరియైన స్పష్టతను ఇవ్వడం కోసమే ఈ పోస్ట్ ను వ్రాస్తున్నాను.

గ్రహించండి.

read more " జ్యోతిష్య రిట్రీట్ ఎప్పుడు? "

26, డిసెంబర్ 2023, మంగళవారం

First spiritual retreat in our Ashram

డిసెంబర్ 23, 24, 25 తేదీలలో మొదటి ఆధ్యాత్మిక సాధనాసమ్మేళనం మా ఆశ్రమంలో జరిగింది.  ఆంధ్రా. తెలంగాణా, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలనుండి సభ్యులు హాజరయ్యారు. దుబాయ్ నుండి ఒక సభ్యుడు రాగలిగాడు.

మూడురోజుల పాటు జరిగిన ఈ సమ్మేళనంలో పంచవటి సాధనామార్గంలో వీరిని ప్రవేశపెట్టి  మా సాధనావిధానాన్ని పరిచయం చేయడం, ప్రాధమిక  దీక్షలను ఇవ్వడం జరిగింది.  ఇది గత 40 ఏళ్లుగా నేను నడచి, సర్వసమగ్రంగా రూపొందించిన ధన్యజీవన మార్గం. నన్ను అనుసరించాలని నిర్ణయించుకున్నవారికి ఈ రహస్యాలను ప్రాక్టికల్ గా నేర్పించడం జరుగుతుంది. ఈ రిట్రీట్ తో ఆ ప్రాసెస్ మొదలైపోయింది. యోగ వేదాంత తంత్రమార్గంలో నడిచే సాధకుల మొదటి బ్యాచ్ మొదలైపోయింది.

జ్యోతిష్యశాస్త్రంలో నాదైన విశ్లేషణా విధానాన్ని వీరికి నేర్పడం కూడా మొదలైంది. ఇది గత 30 ఏళ్లుగా నేను పరిశోధించి, ఫలితాలు రాబట్టి, తయారుచేసిన సులభమైన మార్గం. వందలాది గ్రంధాలను చదివి, వేలాది జాతకాలు చూచి, నేను స్థిరపరచిన సులభమైన విధానాన్ని డైరెక్ట్ గా పళ్లెంలో పెట్టి వీరికి అందిస్తున్నాను.

కులాలకు, వర్గాలకు, ఆస్తులకు, అంతస్తులకు, కుళ్ళుకుత్సితాలకు అతీతంగా, హృదయసంబంధంతో, ప్రేమతో ఒకే కుటుంబంలా 'పంచవటి' ఉండాలన్నది నా చిరకాల సంకల్పం. అది నేటితో సాకారం కావడం మొదలైపోయింది.

'భక్తేర్ జోతి నోయ్' (భక్తులలో కులం లేదు) అనిన శ్రీరామకృష్ణుల వారి మహోన్నత భావనను ఆచరణలో పెడుతూ, అన్ని కులాలవారిని సమానంగా ఒకేచోట కూచోపెట్టి, ఎటువంటి భేదభావమూ లేకుండా, ఒకే విధమైన సాధనావిధానాలను అందరికీ నేర్పడం, చేయించడం మొదలైంది. బ్రాహ్మణులు, దళితులు, ఇంకా ఇతర కులాల వారు పక్కపక్కనే కూర్చుని యోగ - వేదాంత - తంత్ర సాధనలను చెయ్యడం మీరు మా ఆశ్రమంలో చూడవచ్చు. కానీ వారిలో ఎవరికీ 'మాది ఈ కులం' అన్న విషయం గుర్తే ఉండదు. అదసలు ఒక విషయమే కాదు. అలాంటి స్థితిని వారు ఇక్కడ అందుకుంటున్నారు.

ఇక్కడ కోటీశ్వరుడు, కూలిపని చేసుకునేవాడు ఇద్దరూ పక్కపక్కనే కూర్చుని మాట్లాడుకుంటూ భోజనం చేస్తారు. ప్రభుత్వంలో ఉన్నతోద్యోగి ఇక్కడ లెట్రిన్స్ కడుగుతాడు. అదే సమయంలో, సామాన్య మానవుడు ఇక్కడ ముఖ్యమైన పనిలో ఉండవచ్చు. అహంకారానికి ఇక్కడ మొట్టికాయలు పడతాయి. నిజాయితీకి, వినయానికి పెద్దపీట ఇవ్వబడుతుంది. వెరసి, గ్రంథాలలో మీరు చదివిన సమానత్వం ఇక్కడ కార్యరూపం దాల్చి కళ్ళెదురుగా కనిపిస్తుంది.

కుటుంబాలలో, రక్తసంబంధాలలో కూడాలేని ప్రేమాభిమానాలను పంచవటి సభ్యుల మధ్యన మీరు చూడవచ్చు. ఇలాంటి విశాలమైన స్వచ్ఛమైన మనస్సులున్నవారిని అందరినీ ఒక పందిరి క్రిందకు చేర్చాలని, ఒకే కుటుంబంగా వారిని చూడాలన్న నా చిరకాల స్వప్నం నేడు సాకారమౌతున్నది.

ఇది ఎందరో ప్రాచీన యోగుల, సిద్ధుల, మహనీయుల స్వప్నం. దీనిని మేము సాకారం చేస్తున్నాం.

నీచమైన మానవ మనస్తత్వాలకు అతీతులైన నిజమైన మానవులను తయారుచేసే ప్రాసెస్ ఇక్కడ మొదలైంది. మూడు రోజుల ఇంటెన్సివ్ స్పిరిట్యువల్ రిట్రీట్ లో పాల్గొని, కలసి మెలసి ఉండి, సాధనామార్గాలు నేర్చుకుని, తృప్తి నిండిన నిండు మనసులతో, నిన్న రాత్రి అందరూ తిరుగుప్రయాణానికి బయలుదేరి, ఈరోజు తెల్లవారేసరికి వారి వారి ఊర్లకు చేరుకున్నారు.

ఆశ్రమాన్ని మమ్మల్ని వదలలేక కన్నీళ్లు కార్చిన ఎంతోమంది కన్నులే, 'మా ఈ ప్రయత్నం మహోన్నతమైనది' అనడానికి నిదర్శనాలు. ఆస్తులను, అంతస్తులను, లౌకిక జీవితాల రొచ్చును, స్వార్ధపూరిత కుళ్ళు బ్రతుకులను, కపటాన్ని, కల్లోలాలను అన్నింటినీ  మరచిపోయి, కనీసం మూడురోజులైనా స్వచ్ఛమైన స్వర్గంలాంటి ఒక లోకంలో నివసించామన్న ఆత్మతృప్తి అందరిలోనూ వ్యక్తమైంది.

ఇది నా చిన్ననాటి కల ! నేటికి సాకారమౌతున్నది !

ఆ సందర్భంగా తీసిన కొన్ని ఫోటోలను ఇక్కడ చూడండి. మరిన్ని ఫోటోల, వీడియోల కోసం  మా పేస్ బుక్ పేజీని, యూట్యూబ్ ఛానల్ ను సందర్శించండి.



ఆరుబయట Warmup  వ్యాయామాలతో దినచర్యకు సిద్ధమౌతూ



యోగవ్యాయామ సాధనలో శరీరాన్ని తీర్చిదిద్దుతూ













ప్రాణాయామ సాధనలో




ధ్యాన సాధన చేస్తూ






కలసి మెలసి తోటపనిని చేస్తూ











జ్యోతిష్య రహస్యాలను నేర్చుకుంటూ






భోజన దృశ్యాలు





read more " First spiritual retreat in our Ashram "

24, డిసెంబర్ 2023, ఆదివారం

మా 62 వ పుస్తకం 'స్వర చింతామణి ' విడుదల

వైకుంఠ ఏకాదశి పర్వదినం నాడు మొదలై, నిన్నటి నుండి మా ఆశ్రమంలో మొదటి  స్పిరిట్యువల్ రిట్రీట్ జరుగుతున్నది. ఇది మూడు రోజులపాటు జరిగే కార్యక్రమం. ఇంతకు ముందు పంచవటి సంస్థలో ఎన్నో రిట్రీట్స్ జరిగినప్పటికీ, ఆశ్రమం మొదలైన తరువాత జరుగుతున్న మొదటి రిట్రీట్ మాత్రం ఇదే.

ఈ రిట్రీట్ లో భాగంగా ఈ రోజున మా క్రొత్తపుస్తకం 'స్వర చింతామణి' ని విడుదల చేస్తున్నాము. ఇది శ్వేతకేతుయోగిచే రచించబడిన ప్రాచీన స్వరశాస్త్ర గ్రంధము. దీనికి నా వ్యాఖ్యానమును నేడు విడుదల చేస్తున్నాము. ఇది నా కలం నుండి వెలువడుతున్న 62 వ గ్రంధము.

కఠినములైన జ్యోతిష్య శాస్త్ర సూత్రముల జోలికి పోకుండా, కేవలం రెండు స్వరములు, అయిదు తత్త్వముల ఆధారంగా త్రికాలజ్ఞానమును పొందే విధానములు ఈ గ్రంధంలో చెప్పబడినాయి. మానవ జీవితంలో జరిగే సమస్తమునూ ఈ విధానం ద్వారా తేలికగా అర్ధం చేసుకోవచ్చు. అంతేగాక, ప్రశ్న విధానమును ఉపయోగించి భవిష్యత్తును గ్రహించవచ్చు. దూరంగా జరుగుతున్న సంఘటనలను  కూడా తెలుసుకోవచ్చు.

ఆయుర్వేదము, వశీకరణము, వాజీకరణము, అనేక రోగములకు పనికి వచ్చే మూలికా యోగములు మొదలైనవి ఈ గ్రంధపు ప్రత్యేకతలు.

పురుషార్ధములైన ధర్మ, అర్ధ, కామ, మోక్షములను శ్వాస ద్వారా పొందే విధానములను ఈ గ్రంధం తేటతెల్లం చేస్తున్నది. మానవజీవితానికి ఉపయోగపడే అత్యుత్తమములైన గ్రంధములలో ఇది ఒకటి. అందుకే దీనికి నా వ్యాఖ్యానమును వ్రాశాను.

ఈ గ్రంధం వ్రాయడంలో, ప్రచురించడంలో నాకు తోడ్పడిన సరళాదేవి, అఖిల. లలిత,  ప్రవీణ్, చావలి శ్రీనివాస్ లకు నా ఆశీస్సులు.

ఈ పుస్తకం కూడా మా వెబ్ సైట్ నుండి ఇక్కడ లభిస్తుంది.
read more " మా 62 వ పుస్తకం 'స్వర చింతామణి ' విడుదల "

18, డిసెంబర్ 2023, సోమవారం

ఆశ్రమం ప్రారంభోత్సవ వీడియోలు

'పంచవటి యోగాశ్రమం' ప్రారంభోత్సవ వీడియోలను మా యూ ట్యూబ్ ఛానల్లో ఇక్కడ చూడండి

https://youtu.be/Y1wEuYu4SOc

https://youtu.be/fzfEJCy1zlY


read more " ఆశ్రమం ప్రారంభోత్సవ వీడియోలు "

7, డిసెంబర్ 2023, గురువారం

వరద కళ్ళాపి

వరదగాలి 
కడలినీటిని
కళ్ళాపి జల్లి పోయింది

రెండ్రోజులు
ఆశ్రమం జలమయం
మనసు నీటిపై నావయింది

చీకట్లో వరదలో
ఒంటరిగా మేము
ఆనందం వెల్లువయింది

ఉత్తదైన ఉనికి
కేవలం తానై మిగిలింది

యుగాల గతం
నేనంటూ ఎదురైంది

వరద వెల్లువలో
వ్యక్తిత్వం సమాధి అయింది

ప్రపంచం ఉందో లేదో?
ఎవరిక్కావాలి?

మేమున్నామో లేమో?
ఎందుకడగాలి?

అసహజప్రకృతి
సహజస్థితిని
సన్నిధికి చేర్చింది
read more " వరద కళ్ళాపి "

2, డిసెంబర్ 2023, శనివారం

మీకు నాగబంధం వచ్చా?

'విజ్ఞాన భైరవ తంత్రం', 'మాలినీ విజయోత్తర తంత్రం', 'తంత్రసారం' మొదలైన గ్రంధాలను వ్రాసినందుకేమో నన్ను ఒక మాంత్రికుడినని చాలామంది అనుకుంటూ ఉంటారు. ముఖ్యంగా  ఆధ్యాత్మికత లోతుపాతులు తెలియనివారు అలా అనుకోవడం సహజం కూడా. ఇక పల్లెటూరి మొద్దులు అలా అనుకోవడం ఆశ్చర్యమేముంటుంది?

నిన్న సాయంత్రం ఒక ఫోనొచ్చింది.

'నాగబంధం, శూలాలు గురించి పుస్తకాలు మీ దగ్గరున్నయ్యా? మేము గుంటూరుకు వచ్చి తీసుకోవచ్చా?' అని డైరెక్ట్ గా ఒకాయన అడిగాడు.

'మీకు నా నంబర్ ఎలా దొరికింది?' అని అడగడం ఈ మధ్యన మానేశాను. పాత పుస్తకాలలో ఉంటుంది కదా !

భాషను, యాసను బట్టి మాట్లాడుతున్నది పక్కా పల్లెటూరి మనిషని అర్ధమైంది.

'మేము గుంటూరు వదిలేశాము. ప్రస్తుతం ఒంగోలు దగ్గర ఆశ్రమంలో ఉంటున్నాం' అన్నాను.

'మాది అద్దంకి గ్రామం. మాకు దగ్గర్లోనే మీరున్నారు' అన్నాడు

'అవును' అన్నాను.

'అమ్మ చెబుతోంది. వేరే వాళ్ళది ఉంది. వచ్చి తీసుకో' అంటోంది' అన్నాడు.

'ఎవరా అమ్మ?' అడిగాను.

'పోలేరమ్మ' అన్నాడు.

'ఏం తీసుకోమంటోంది?' అడిగాను.

'అదే. పెద్దోళ్ళు భూమిలో దాచిపెట్టినవి ఉంటాయి కదా. అవి' అన్నాడు.

'అంటే నిధులా?' అన్నాను.

'ఆ. అవే ! నాకు వెండి వస్తువులు దొరుకుతూ ఉంటాయి. అంతవరకే. పెద్దవాటిని నేను తియ్యలేను. మీరొస్తానంటే చోటు చూపిస్తాను. అయితే నాగబంధం వెయ్యాలి. అందుకే మీకు తెలుసేమో అని ఫోను చేస్తున్నాను. నిధిలో మీ పావలా మీరు తీసుకోండి. మిగతాది మాకు' అన్నాడు.

'ఇతరుల సొమ్మును అలా తీసుకోకూడదు. మనం కష్టపడినదే మనకు మిగులుతుంది. ముందు ఇది అర్ధం చేసుకోండి. పోలేరమ్మ మాట వినకండి' అన్నాను.

'అమ్మ మాట వినొద్దా? బలే చెబుతున్నావే? కష్టపడితేనే కదా నిధి దొరికేది' అన్నాడు పల్లెటూరి వితండవాదంతో.

'తేరగా అలా దొరికే సొమ్ము మంచిది కాదు. అది దొంగతనంతో సమానం. నేనిలాంటి పనులు చెయ్యను. ఆ చెప్పేది పోలేరమ్మ కాదు. నీ మనసులో ఉన్న దురాశ' అన్నాను.

'మీకు నాగబంధం వచ్చా రాదా చెప్పండి' అన్నాడు సూటిగా.

'వచ్చు. మూలబంధం, మహాబంధం కూడా వచ్చు. కానీ ఇలాంటి పనులకు వాడను. మీకూ ఇటువంటి పనులు మంచివి కావు.  చెయ్యొద్దు. కుటుంబాలు నాశనమౌతాయి' అన్నాను.

'సారీ సార్. మాకు నీతులు అక్కర్లేదు. పని జరగడం కావాలి. సారీ. మీకు ఫోన్ చేసి విసిగించాం' అన్నాడు.

ఫోన్ కట్ అయ్యింది.

అద్దంకి ప్రాంతం కూడా ఒకవిధంగా వెనుకబడిన ప్రాంతమే. అందుకే ఇక్కడ ఇలాంటి మంత్రతంత్రాలు  మొదలైనవి ఎక్కువ. ఇటు నెల్లూరు, తమిళనాడు బార్డర్ లోను, అటు విజయనగరం, శ్రీకాకుళం, ఇచ్చాపురం ప్రాంతాలలోను, కడప జిల్లా లోను ఇలాంటి మాయమంత్రగాళ్ళు ఎక్కువగా తగులుతూ ఉంటారు.

ఈ ఫోన్ చూస్తే,  కొన్నేళ్ల  క్రితం నల్లమల అడవులలో నిధికోసం రమ్మని ఒక మాఫియా ముఠా చేసిన ఫోన్ గుర్తొచ్చింది. తంత్రమంటే వీళ్లకు అర్ధమైంది ఇదా?

లోకులు ఎంత అజ్ఞానంలో బ్రతుకుతున్నారో మరొక్కసారి అర్ధమైంది.

దురాశ అనే అగ్నిగుండంలో కోట్లాది జీవులు కాలిపోతున్నాయి. కానీ కాలుతున్నామనే స్పృహ కూడా వాటికి లేదు. ఎంత మాయ !

నాగుపామును మంత్రంతో కట్టేసే నాగబంధం కంటే, మనుషులను ప్రేమతో కట్టేసే ఆత్మబంధం మంచిది కదూ ! తేరగా వచ్చి, కొన్నాళ్ళకు కరిగిపోయే ఇతరుల సొమ్ము కంటే, సాధనతో వచ్చి ఎప్పటికీ నిలిచి ఉండే ఆత్మసిద్ధి ఉత్తమం కదూ !

ఒకళ్ళ సొమ్ము తేరగా వస్తే బాగానే ఉంటుంది. తరువాత నానా రకాల జన్మలెత్తి ఆ ఋణాలు తీర్చుకునేటప్పుడు నరకం  అంటే ఏమిటో అర్ధమౌతుంది.

తాత్కాలికంగా వచ్చే లాభాల కంటే, శాశ్వతంగా నిలిచి ఉండే ఆనందాలు ఎంత విలువైనవి !

ఎప్పుడు అర్ధమౌతుందో ఈ గొర్రెలకు?

read more " మీకు నాగబంధం వచ్చా? "