“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

22, సెప్టెంబర్ 2023, శుక్రవారం

వినాయక చవితి ఇలాగా జరుపుకునేది?

మొన్న జిల్లెళ్ళమూడిలో ఉన్నాము. కొంతమంది కుర్రాళ్లు వచ్చి వినాయకచవితి చందా అడిగారు. ముఖాలు చూస్తే, అల్లరిచిల్లరగా తిరిగే వాళ్ళలాగా ఉన్నారు.  ఇవ్వను పొమ్మని చెప్పాను.

'ఎందుకివ్వరు?' అడిగాడు ఒక అబ్బాయి.

'మేము వినాయక చవితి చెయ్యం. నాకు నమ్మకం లేదు' అన్నాను.

ఎగాదిగా చూసి వెళ్లిపోయారు వాళ్ళు.

తరువాత తెలిసింది. తాగి తందనాలాడే ఒక బ్యాచ్ ఈ ఊళ్ళో కూడా ఉందని.

పందిళ్లు లేచాయి. మైకులు మొదలయ్యాయి. 'గణ నాయకాయ ధీమహి' అంటూ మొదలై 'ఒసోసి పిల్లకొడి పెట్టా', ' పుట్టింటోళ్లు తరిమేశారు ' అంటూ 'ఆ అంటే అమలాపురం' మీదుగా 'నువ్ కావాలయ్యా' వరకూ సినిమాపాటలు పెద్ద హోరుతో నాలుగురోజుల పాటు నడిచాయి. నిమజ్ఙనం రోజున డీజే తో ఊరంతా దద్దరిల్లింది. కుర్రాళ్ళు పెద్దలు అందరూ తాగి రంగులు చల్లుకుంటూ ఎగురుతూ గోల గోల చేశారు. తెల్లవార్లూ సినిమాలు వేశారు. ఊర్లో ఎవరికీ రాత్రంతా నిద్ర లేదు. 

లోకల్స్ ని అడిగాను, 'ఆ గోల అసలైన హిందూమతం కాదు. అలా సినిమా పాటలు పెట్టి వినాయకుడి ఎదురుగా ఎగరడం చాలా తప్పురా. అలా చెయ్యకండి' అని  మీరు ఆ కుర్రాళ్ళకి చెప్పచ్చు కదా అని. 

'చెప్పినా వాళ్ళు వినరు' అన్నారు పెద్దలు.

ఎందుకంటే ఆ సోకాల్డ్ పెద్దలు కూడా ఇంకొక వినాయకుడి విగ్రహం పెట్టి, తమ వంతుగా వాళ్ళూ ఒక మైకు పెట్టారు. అక్కడ కూడా సినిమా పాటలు మోగుతున్నాయి.

గేదె చేలో మేస్తుంటే దూడ గట్టుమీద ఎందుకుంటుంది?

సోకాల్డ్ పెద్దలకే హిందూమతం అంటే ఏంటో సరియైన అవగాహన లేదు. ఇక పిల్లలకు వీళ్ళేం చెప్పగలరు?

'నాలుగు బజార్లున్న చిన్న ఊరిలో నాలుగు వినాయకుడి బొమ్మలెందుకు? అందరూ సమిష్టిగా చెయ్యచ్చు కదా? పైగా అమ్మగారి  ఆలయం ఉన్న ఊర్లో ఇన్ని గ్రూపు లేంటి? ఒక్కటిగా ఉండొచ్చు కదా?' అడిగాను.

'అది కుదరదు. ఎవరి కులం వారిదే. ఎవరి పూజ వారిదే. ఎవరి సంబరం వారిదే' అని జవాబు వచ్చింది.

'మిమ్మలిని బాగుచెయ్యడం ఆ దేవుడి తరం కూడా కాదురా మూర్ఖుల్లారా' అనుకున్నాను.

చివరిరోజున లడ్డు వేలంపాట జరిగింది. ఖర్చులు పోను తాగుళ్ళకు తందనాలకు ఆర్గనైజర్స్ కి    బానే మిగిలింది.

నాలుగు రోజుల పాటు దాక్కునే ఉన్నాను. మా ఇంట్లో నుండి బయటకే రాలేదు. ఏదైనా పని ఉండి బయటకు వస్తే, వినాయకుడి పందిళ్ళవైపు తల కూడా త్రిప్పి చూడలేదు. అంత చీదరేసింది.

'మీరే ఇంత సౌండుతో మైకులు పెడుతున్నారు. రేపట్నించీ చర్చి, మసీదు  వాళ్ళూ మైకులు పెడతారు. దీనికి అంతెక్కడుంది?' అడిగాను.

'మేం పెట్టకపోయినా వాళ్ళు పెడతారు. ఇక మేమెందుకు తగ్గాలి?' అన్నాడాయన.

పల్లెలంటే ఏవో ప్రశాంతమైన ప్రదేశాలని గతంలో అనుకునేవాళ్లం. ఇప్పుడు పరిస్థితి అలా లేదు.

నేటి పల్లెటూరు అంటే -  సౌండ్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్, ఫుడ్ పాయిజనింగ్, మైండ్ పొల్యూషన్, వెరసి నరకం. ఒక రకంగా పల్లెలకంటే సిటీలే బాగున్నాయి. అక్కడ కొంచెం కాకపోతే కొంచమైనా డీసెన్సీ ఉంటుంది.

అసహ్యంతో జిల్లెళ్ళమూడి నుంచి పారిపోయి, నిన్న పొద్దున్నే దొడ్డవరం వచ్చేశాము.

ఇక్కడ చూస్తే, అక్కడకంటే ఇంకా ఘోరంగా ఉంది.

నాలుగు గుళ్ళలో నాలుగు మైకులు ఉదయం అయిదు నుండి రాత్రి పదిదాకా మోగుతూనే ఉన్నాయి. ఎక్కడికక్కడ ఒక పందిరి, అందులో ఒక వినాయకుడి బొమ్మ, అక్కడెవరూ ఉండరు. మైకు మాత్రం పక్కఊరికి వినిపించేలాగ మోగుతూ ఉంటుంది.

లవకుశ, భూకైలాస్ ల నుంచి మొదలుపెట్టి అడవిరాముడు, యమగోల, వేటగాడు, ఆటగాడు, డ్రైవర్ రాముడు ఇలా నేటి జైలర్ వరకు అన్నీ పాటలూ మారుమోగుతున్నాయి. దాని పక్కనే కూచున్న పల్లెటూరి మొద్దులు అంతకంటే పెద్దగా అరుస్తూ రాజకీయాలు మాట్లాడుకుంటున్నారు.

ఎక్కడికక్కడ కులగ్రూపులు, రాజకీయ గ్రూపులు, పంతాలు. పట్టింపులు. గొడవలు ఒకడిని మించి మరొకరు గొప్ప చూపించుకోవాలని మైకు ఫుల్ సౌండ్ పెట్టడం. అక్కడ మాత్రం ఎవడూ ఉండడు. సినిమా పాటలను వింటూ వినాయకుడు మాత్రం మౌనంగా కూచుని ఉంటాడు.

ఒక వినాయకుడిని 'ఏంటి ఈ ఘోరం? హిందూమతం అంటే ఇంత ఛండాలమా? ఒక్కడికి కాకుంటే ఒక్కడికి కూడా సివిక్ సెన్స్ లేదా? నీ పూజ ఇంత లేకిగానా చెయ్యవలసింది?' అడిగాను.

ఆయన నవ్వాడు.

'హిందూమతం చండాలం కాదు. ఈ మూర్ఖపు మనుషులు దరిద్రులు. అంతే. అత్యున్నతమైన ఫిలాసఫీ ఉన్న  హిందూమతాన్ని రోడ్లమీద వెకిలి డాన్సులుగా మార్చారు. ఎవరెన్ని చెప్పినా వీళ్లు  మారరు, ఇదింతే' అన్నాడాయన.

'మీరు చెప్పి మార్చవచ్చు కదా?' అడిగాను.

'ఎవరు చెప్పినా వినే స్థితిలో ఈ మూర్ఖులు లేరు. వీళ్లకు సివిక్ సెన్స్ నేర్పడం బ్రహ్మదేవుని తరం కూడా కాదు. ఇక అసలైన హిందూమతం వీళ్లకు ఎక్కడ అర్థమవుతుంది?' అన్నాడాయన.

ఇక్కడ మా ఇల్లు ఒక సెంటర్లోనే ఉంటుంది. ఇంతలో ఒక ఊరేగింపు అటుగా వచ్చింది. వినాయకుడి నిమజ్జనం ఊరేగింపు.

చుట్టూ డప్పులు వాయించేవాళ్ళు నిలబడి పెద్ద సౌండుతో 'కావాలయ్యా నువ్వు కావాలి. రా రా రా' అంటూ డప్పులు వాయిస్తున్నారు. మధ్యలో కొజ్జావాళ్ళు రంగులు పూసుకుని ఎగురుతున్నారు. వాళ్ళ చుట్టూ చిన్నపిల్లలు కూడా రంగులు పూసుకుని వెకిలిగా ఎగురుతున్నారు. దారిన పోయేవాళ్ళకు కూడా పూస్తున్నారు. 

చూస్తేనే ఒళ్ళంతా కంపరం ఎత్తింది. ఒక్క క్షణం కూడా అక్కడ నిలబడలేకపోయాను.

మైకులు, పెద్ద హోరుతో సినిమా పాటలు, వెకిలి డాన్సులు, అర్ధం లేని పూజలు, కొలుపులు, తినడం త్రాగడం, కుల రాజకీయాలు -  ఇదా హిందూమతం.? ఛీ !

చెప్పేవాళ్ళూ లేరు. చెప్పినా వినేవాళ్ళూ లేరు. దొమ్మరిసంత లాగా ఉంది.

ఈ ఊరి మొత్తం మీద 13 వినాయకుడి బొమ్మలు పెట్టారట. 13 పందిళ్ళలో  13 మైకులు మోగుతున్నాయి. ఫుల్ బాటిళ్లు కేసులు కేసులు తెచ్చారట. అన్నీ అయిపోయాయని ఊరివాళ్లు చెప్పారు.

ఇదంతా చూస్తుంటే నాకు ఒకటి అనిపిస్తోంది. తాగటానికి తినటానికి తందనాలకు పండుగలు ఒక సాకులా మారాయి. వీటి అసలైన అర్ధాలు గంగలో కలిసిపోయాయి.

పాపులర్ హిందూమతం ఒక వెకిలిగోల ! ఇక్కడ అసలైన తత్త్వం లేదు. నేలబారు చవకబారు అసహ్యపు గోల, స్వార్ధాలు తప్ప ఏమీ లేదు !

మామూలు మనుషులు జరుపుకునే విధంగా వినాయకచవితి గాని, ఇతర పండుగలు కానీ జరుపుకోవడం నేను మానేసి పాతికేళ్ళు దాటింది. కారణం ఇదే. ఈ పండుగలంటేనే నాకు చీదర పుట్టింది.

హిందూమతం ఎంత దిగజారిన స్థితిలో ఉందో చెప్పడానికి ఈ పండుగలు, వాటిని జరుపుకునే విధానాలే తార్కాణాలు. ఈ లేకిపండుగలు ఎంత త్వరగా మాయమైతే హిందూమతానికి అంత మంచిది.

ఇలాంటివి చూసే ఇతర మతాలవాళ్లు మనల్ని మన ఆచారాలను చాలా అసహ్యంగా విమర్శిస్తున్నారు. మన అసలైన ఆచారాలు ఇవి కావు. వేదాంతపు పునాదులు మాయమైతే, ఆచారాలూ పండుగలు అన్నీ ప్రాణం లేని తంతులై పోతాయి. ప్రస్తుతం అదే జరుగుతోంది.

వినాయకచవితి అనేది కల్పశాస్త్రానికి చెందిన ఒక వ్రతం. నియమనిష్టలతో  దానిని ఆచరించాలి. అంతేగానీ రోడ్లమీద జాతర చెయ్యకూడదు.

వినాయకుడు ఓంకారస్వరూపుడు. ఓంకారోపాసన ద్వారా ఆయన్ను ఆరాధించాలి. అంతేగానీ, ఈ విధమైన వెకిలి సెలబ్రేషన్ తో కాదు.

విఘ్నేశ్వర ఉపాసనను రోడ్ సైడ్ రికార్డింగ్ డాన్స్ గా మార్చకండిరా దరిద్రుల్లారా!

హిందూమతంలోని తాత్వికచింతన సమాజంలోకి రావాలి. అత్యున్నతములైన వేదాంతసత్యాలు సామాన్యులకు కూడా అర్ధం కావాలి. అవి జీవితంలోకి అనువదింపబడాలి. అప్పుడే ఈ వెకిలి పోకడలు మాయమౌతాయి.

అప్పటివరకూ ఈ సమాజం ఇంతే. ఇలాగే చవకబారు వెకిలి ఆచరణలలో కాలం గడుపుతూ, అదే పెద్ద గొప్పగా భావిస్తూ, రోడ్లమీద డాన్సులేసుకుంటూ ఉండవలసిందే.
read more " వినాయక చవితి ఇలాగా జరుపుకునేది? "

19, సెప్టెంబర్ 2023, మంగళవారం

మా క్రొత్త పుస్తకం 'శివ స్వరోదయ శాస్త్రము' విడుదల

అమెరికానుండి వచ్చిన తరువాత, ఆశ్రమ పనులలో పడి, గ్రంథరచనకు, ముఖ్యమైన విషయాలపైన వీడియోలు చేయడానికి అడ్డుకట్ట వేసి ఆరునెలలు అయింది. ప్రస్తుతం ఆశ్రమం పనులు ఒక కొలిక్కి వస్తున్నాయి. కనుక గ్రంథరచనను మళ్ళీ మొదలుపెట్టాను. అందుకోసం కొన్నినాళ్ళబట్టి జిల్లెళ్ళమూడిలో ఉంటూ ఈ గ్రంధమును పూర్తి గావించాను.

స్వరశాస్త్రం పైన గ్రంధాన్ని వ్రాయమని చాలామంది నన్ను గతంలో కోరారు. ప్రస్తుతం కూడా కోరుతున్నారు. అందువల్ల నా కలం నుండి వెలువడుతున్న 61 వ గ్రంధంగా ఈ గ్రంధాన్ని విడుదల చేస్తున్నాను.

ఇది నా అభిమాన టాపిక్స్ లో ఒకటి. చాలా చిన్నవయసులో ఈ సబ్జెక్ట్ ను నేను అధ్యయనం చేయడం జరిగింది. అప్పటినుండి ఇది నా అభిమాన విషయాలలో ఒకటిగా మారింది. దానికి కారణాలున్నాయి.

మార్షల్ ఆర్ట్స్ కు, శ్వాస సాధనకు, ప్రాణనిగ్రహానికి ఉన్న సంబంధము, స్వరశాస్త్రం పైన నాకున్న అభిమానాన్ని పెంచింది. జ్యోతిష్యశాస్త్రానికి స్వరశాస్త్రానికి ఉన్న సంబంధం ఆ అభిమానాన్ని ఇంకా ఎక్కువ చేసింది. శ్వాస పైన అదుపు లేకుండా యోగసాధన లేదు. కనుక, యోగశాస్త్రంలో ఇది కోర్ సబ్జెక్ట్ అని చెప్పవచ్చు.

ఈ గ్రంధం తంత్రసాహిత్యానికి చెందినది. మధ్యయుగాలలో ఈ గ్రంధము రచింపబడినప్పటికీ, దీనిలోని భావనలు, అభ్యాసములు అంతకుముందు ఎన్నో వేలఏండ్ల క్రిందటివి.

మనదేశంలో ముస్లిం దురాక్రమణ దారులు జరిపిన రాక్షస విధ్వంసకాండలో ఇటువంటి ఎన్నో వేలాది గ్రంధాలు నాశనమైనాయి. కోట్లాదిమంది హిందువులు, వేలాదిమంది గురువులు చంపబడ్డారు. గురుకులాలు, ఆశ్రమాలు, లైబ్రరీలు గోరీలదొడ్లుగా మార్చబడ్డాయి. ఆ అరాచక రాక్షస చర్యలనుండి బ్రతికి బట్టగట్టిన అమూల్యములైన గ్రంధాలలో ఇదీ ఒకటి.

ఈ గ్రంధం ఈనాడు మనకు లభిస్తూ ఉండటం మన అదృష్టమని చెప్పుకోవాలి. ఇన్నేళ్లకు దీనికి వ్యాఖ్యానమును వ్రాయగలగడం నా సుకృతమని భావిస్తున్నాను.

ఈ గ్రంధంలో చెప్పబడిన కొన్ని విధానములు నా సుదీర్ఘ ఉద్యోగపర్వంలో నన్ను ఎంతో ఆదుకున్నాయి. అవినీతితో నిండి, అడుగడుగునా నక్కలు తోడేళ్ళ వంటి మనుషులున్న రైల్వేవ్యవస్థలో, కులపిచ్చితో, వ్యక్తిగత దురహంకారాలతో నన్ను హింసపెట్టి నా రికార్డ్ పాడుచేయాలని చూచిన పై అధికారులతో వ్యవహరించేటపుడు ఈ స్వరశాస్త్ర విధానములను ఉపయోగించి సత్ఫలితములను పొందాను. 

అదేవిధంగా, చిన్నాపెద్దా అనారోగ్యములు కలిగినపుడు, కలుగబోతున్నపుడు, స్వరశాస్త్రమును ఉపయోగించి వాటిని తేలికగా నివారించుకోగలిగాను. 

కనుక ఇది నిత్యజీవితంలో ఆచరణాత్మకంగా ఎంతో ఉపయోగపడే శాస్త్రమని నేను అనుభవపూర్వకంగా చెప్పగలను.

ఈ గ్రంథరచనలో నాకు చేదోడువాదోడుగా సహకరించిన నా శ్రీమతి సరళాదేవికి, శిష్యురాళ్ళు శ్రీలలిత, అఖిలలకు, శిష్యులు ప్రవీణ్, శ్రీనివాస చావలి లకు నా ఆశీస్సులు.

మా 'పంచవటి పబ్లికేషన్స్' నుండి వచ్చిన మిగిలిన గ్రంధములను ఆదరించినట్లే దీనిని కూడా ఆదరిస్తారని భావిస్తున్నాను.

త్వరలో మా ఆశ్రమంలో జరుగబోయే రిట్రీట్స్ లో ఈ స్వరశాస్త్రము యొక్క ప్రాక్టికల్ ఉపయోగాలను నా శిష్యులకు ఆచరణాత్మకంగా నేర్పించడం జరుగుతుంది.

read more " మా క్రొత్త పుస్తకం 'శివ స్వరోదయ శాస్త్రము' విడుదల "

4, సెప్టెంబర్ 2023, సోమవారం

సనాతన ధర్మాన్ని నిర్మూలిస్తారా? ఓకే ! కలలు కంటూ ఉండండి

అసలీ టాపిక్ మీద మా ఛానల్లో ఒక వీడియో చేద్దామని అనుకున్నాను. కానీ దానికి ఇంకా టైముంది. ప్రస్తుతం ఆశ్రమపనులు ఇంకా పూర్తికాలేదు. అందుకని వీడియో చేసేంత వెసులుబాటు లేదు. త్వరలో ఇలాంటి టాపిక్స్ పైన పవర్ ఫుల్ వీడియోలు చేస్తాను.

ప్రస్తుతానికి ఈ పోస్ట్ మాత్రం చదవండి.

సెప్టెంబర్ 2 వ తేదీన చెన్నైలో ఒక కాన్ఫరెన్స్ జరిగింది. దానిపేరు Eradicate Sanatanam Conclave. దీనిని The Tamil Nadu Progressive Writers and Artistes Association అనే సంస్థ నిర్వహించింది. 2021 లో ఇలాంటిదే Dismantling Global Hindutva అనే కాన్ఫరెన్స్ అమెరికాలో జరిగింది. దానిని ఇండియా వ్యతిరేక లెఫ్ట్ లిబరల్ ఇస్లామిక్ క్రిస్టియన్ సంస్థలు స్పాన్సర్ చేశాయి. దానికి ఇండియన్స్ నుండి, హిందూసంఘాల నుండి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. ఇప్పుడు దీనికి కూడా ఎదురౌతోంది.

ఈ సమావేశంలో మాట్లాడుతూ ఉదయనిధి స్టాలిన్ అనే తమిళ DMK మంత్రి చాల తీవ్రమైన పదజాలంతో హిందూమతాన్ని విమర్శించాడు. హిందూమతం దోమలు, డెంగు, ఫ్లూ, మలేరియా, కరోనాల లాగా ప్రమాదకరమని దానిని ఊరకే ఎదుర్కొంటే సరిపోదని, దానిని నిర్మూలించాలని అన్నాడు. తను ఒక ప్రౌడ్ క్రిస్టియన్ అని కూడా చివరలో అన్నాడు.

హిందూమతాన్ని విమర్శిస్తూ అతను కొన్ని పాయింట్స్ లేవనెత్తాడు. ఒకటేమో బాల్యవివాహాలట, ఇంకొకటి భర్త చనిపోతే మంటలలో వేసి కాలుస్తారట, మరొకటి గుండు చేసి తెల్లచీర కట్టి కూచోబెడతారట, ఇంకొకటి కులవ్యవస్థ అట.

ఇవి ఉదయ-నిధి-స్టాలిన్ అనే సంకరపేరుగల వ్యక్తి చేసిన కామెంట్స్. ఉదయానికి, నిధికి, స్టాలిన్ కి అసలు సంబంధమేదైనా ఉందా? వీడి పేరులోనే అయోమయం కనిపిస్తోంది. ఇతని కామెంట్స్ కూడా చరిత్ర ఏమీ తెలియని, హిందూమతమంటే కనీసపు నాలెడ్జి కూడా లేని పరమ అజ్ఞానిని, అవకాశవాదిని  చూపిస్తున్నాయి. ఈ పాయింట్స్ ని విడివిడిగా చూద్దాం.

1. బాల్యవివాహాలు : ఈ ఆచారం వేదకాలంలో లేదు. మధ్యయుగాలలో, అంటే 1000 CE తర్వాత  ముస్లిం కిరాతకుల దండయాత్రల వల్ల వచ్చింది. ఎందుకని? వయసు వచ్చిన ఆడపిల్లలను వాళ్ళు ఎత్తుకుపోతున్నారు కనుక, దారుణంగా రేపులు చేసి చంపేస్తున్నారు లేదా జనానాలో కలిపేస్తున్నారు గనుక వారిని కాపాడుకోడం కోసం చిన్నప్పుడే పెళ్లి చేసేవారు. కనీసం ఆ విధంగా నైనా ఆడపిల్లకు రక్షణ ఉంటుందని. అంతేగాని, హిందూమతంలో బాల్యవివాహాలు లేవు. వేదకాలంలో ఆడపిల్లలు కూడా మగపిల్లలలాగా 20 ఏళ్ళు వచ్చేవరకూ గురుకులాలలో చదువుకునేవారు. వేదాధ్యయనం చేసేవారు. వీరవిద్యలు నేర్చుకునేవారు. కనుక స్టాలిన్ కు చరిత్ర తెలియదని స్పష్టమౌతోంది.

2. సతీ సహగమనం : ఇది కూడా ముస్లిం పాలకుల సైనికుల అరాచకాల నుండి తమను తాము కాపాడుకోడానికి హిందూ స్త్రీలు వాలంటరీగా తీసుకున్న నిర్ణయమే. భర్త పోయాక, స్త్రీకి రక్షణ ఉండేది కాదు. ఏ ముస్లింగాడి కన్ను ఆ స్త్రీ పైన పడినా, ఆమె జీవితం అంతటితో నరకంగా మారేది. ఆ నరకం నుండి తప్పించుకోడానికి వాలంటరీగా భర్త చితిలోనే దూకి ఆ స్త్రీ చనిపోయేది. సతీదేవిగా మారేది. రాణి పద్మిని వంటి అనేకమంది మహారాణుల చరిత్రలే దీనికి ఉదాహరణ. హిందూ స్త్రీలు చావును కోరుకునేవారు గాని, ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టేవారు కారు. కనుక ఈ విమర్శ కూడా అర్ధరహితమైనదే.

3. తెల్లచీర కట్టి, గుండు చేసి కూచోబెట్టడం - ఈ ఆచారం కూడా వేదకాలంలో లేదు. మధ్యయుగాలలో సుల్తానుల పాలనాకాలంలో వచ్చింది. ముస్లిం కిరాతకులు భర్త చనిపోయిన ఆడపిల్లలను కూడా వదిలేవారు కారు. వెయ్యేళ్ళ తర్వాత ఇప్పుడు కూడా, లవ్ జిహాద్ పేరిట అనేకమంది హిందూ అమ్మాయిలను మోసం చేసి వాళ్ళను చంపేస్తునారు. లేదా వాళ్ళ జీవితాలను నరకంగా మారుస్తున్నారు. ఇప్పుడే ఇలా ఉంటే, ఇక వెయ్యేళ్ళ క్రితం, ఇస్లామిక్ పరిపాలన ఉన్న ఇండియాలో ఎలా ఉండేదో ఊహించుకోవచ్చు. కనుక అందవిహీనంగా కనిపిస్తేనైనా వదులుతారేమో అన్న ఆలోచనతో పెట్టిన ఆచారమే గాని ఇది ప్రాచీనకాలం నుండి హిందూమతంలో లేదు.

బాల్యవివాహాలు, గుండుచేసి కూచోబెట్టడం, సతీసహగమనాలు ఇప్పుడు లేవు. వాటిని ప్రస్తుతం ఎవరూ పాటించడం లేదు. ఎందుకంటే ఇస్లామిక్ కిరాతక పాలన ఇండియాలో లేదు, ఎప్పుడో పోయింది గనుక. దానితోనే ఆ ఆచారాలూ పోయాయి. ఆ ఆచారాలను వ్యతిరేకించిన సంఘసంస్కర్తలు ఎవరో తెలుసా? రాజా రామ్మోహన్ రాయ్, వీరేశలింగం పంతులు వంటి బ్రాహ్మణులు. రఘుపతి వెంకటరత్నం నాయుడు వంటి అగ్రవర్ణాల ప్రజలు.

ఎందుకింకా ఇలాంటి అబద్దాలను చెబుతూ, బ్రాహ్మణులను అగ్రవర్ణాలను తిడుతూ జనాన్ని మోసం చేస్తున్నారు? డబ్బుకోసం అధికారంకోసం ఇంత దిగజారాలా? వాస్తవాలను వక్రీకరించాలా? ఎంతకాలం ఇంకా ఈ అబద్దాలు. గతం గతించింది. మీరు చెప్పే దురాచారాలేవీ ఇప్పుడు లేవు. ఇంకా ఎంతకాలం భూతకాలంలో భూతాల్లాగా బ్రతుకుతారు?

4. కులవ్యవస్థ - కులం లేని సమాజం ప్రపంచంలో ఏ దేశంలోనూ లేదు. కులం అనే పేరు ఉండకపోవచ్చు. కానీ అదే విధమైన వ్యవస్థలు అన్ని దేశాలలోను ఉన్నాయి.

కులమంటే ఒకేవిధమైన పనిని చేసే వ్యక్తుల సమూహం. డివిజన్ ఆఫ్ లేబర్ కు మరో పేరు అది. కులవ్యవస్థ మంచిదే. ఎవరి కులం వారికి  గొప్ప. అందులో ఎక్కువ తక్కువలు లేవు. వేదఋషులలో అన్ని కులాలవారు ఉన్నారు. వేదం చదువుకుంటే ఈ విషయం తెలుస్తుంది.

బ్రిటిష్ వాడు రానంతవరకూ కులవ్యవస్థ చాలా చక్కగా సాగింది. దానివల్ల ఎటువంటి సమస్యలు లేవు. కులాలమధ్య చిచ్చును పెట్టి పోయినది బ్రిటిష్ వాళ్లే.

సోకాల్డ్ నిమ్నకులాలలో కూడా మళ్ళీ ఎక్కువ తక్కువలున్నాయి. వాళ్ళు కూడా పెళ్లిళ్లు ఎవరిని పడితే వారిని చేసుకోరు. తెల్లవారి దేశాలలో కూడా క్లాస్ అనే పేరుతో కులం ఉంది. తక్కువ క్లాస్ వారిని ఎక్కువ క్లాస్ వారు చేసుకోరు. వారితో కలవరు. వాళ్లలో కూడా లార్డ్స్ వేరు. కామనర్స్ వేరు. 

కనుక కులవ్యవస్థ మంచిదే. చెడ్డది కాదు. దానిని చెడ్డగా మార్చినది బ్రిటిష్ తొత్తు పార్టీలే.

క్రైస్తవంలో 36 డినామినేషన్స్ ఉన్నాయి. ఒకరి బైబిల్ ఒకరికి పడదు. ఇస్లాంలో అనేక శాఖలున్నాయి. సున్నీలు షియాలు బద్ధ శత్రువులు. ఒకళ్ళను మరొకళ్ళు చంపుకుంటూ ఉంటారు. ఇద్దరూ కలిసి అహమ్మదియాలను చంపుతూ ఉంటారు. సూఫీలను దారితప్పిన ముస్లిములుగా ఛాందసముస్లిములు పరిగణిస్తారు. ఈ రకంగా సమానత్వం గురించి బయటకు కబుర్లు చెప్పే క్రైస్తవం ఇస్లాంల లోలోతుల్లో అనేక విభేదాలు లొసుగులు లుకలుకలు ఉన్నాయి.

ఇకపోతే సోకాల్డ్ లిబరల్స్ అనేవాళ్ళు కులద్వేషగాళ్లు, అవకాశవాదులు, విదేశీ తొత్తులు, హిందూ రిజర్వేషన్ వాడుకుంటూ హిందూ మతాన్ని తిట్టే హిపోక్రిట్స్ అనేది అందరికీ తెలుసు. కమ్యునిస్టులేమో సామాన్యప్రజలను రెచ్చగొట్టి, వాళ్ళ సమాధుల పైన కోట్లు సంపాదించారని అందరికీ తెలుసు 

ఇలాంటివాళ్ళు అందరూ కలసి మీటింగులు పెట్టి సనాతనధర్మాన్ని గురించి మాట్లాడతారు! ఒక్క ఇండియాలో మాత్రమే ఇది చెల్లుబాటు అవుతుంది. ఇది మన ప్రజాస్వామ్య వ్యవస్థ, మన రాజ్యాంగం చేసిన పుణ్యం !

ఉదయనిధి స్టాలిన్ అనేవాడు ఒక పిల్లకాకి.  అతను మాట్లాడిన విషయాలపైన అతనికి కనీసపరిజ్ఞానం కూడా లేదు. అతనికి హిందూమతంలో ఓనమాలు కూడా తెలియవు. అసలైన హిందూమతం వేదాంతంలో, యోగశాస్త్రంలో, తంత్రశాస్త్రం లో ఉంది. వాటిని అధ్యయనం చేసినవాడికి మాత్రమే హిందూమతం యొక్క లోతుపాతులు అర్ధమౌతాయి గాని, పైపై ఆచారాలు, పూజలు, విగ్రహారాధన మొదలైనవాటిని చూచి విమర్శించే అజ్ఞానులకు సనాతనధర్మపు లోతులు ఏనాటికీ అర్ధం కావు.

సనాతనధర్మాన్ని నిర్ములించాలని స్టాలిన్ అన్నాడు. సనాతనం అంటేనే ఎటర్నల్ అని అర్ధం. అంటే, ఎప్పుడూ ఉండేది, మరణం లేనిది, నిత్యమైనది అని. ఎప్పుడూ ఉండేదానిని ఎలా నిర్ములించడం సాధ్యమౌతుంది? అన్న కనీసపు ఇంగితం కూడా ఇతనికి లేదు.

ఇలాంటివాళ్ళు మన మంత్రులు ! హిందూ మతాన్ని, దాని పద్దతులను, కుటుంబవ్యవస్థను విమర్శించే వీళ్లకు అధికారం ఎలా వచ్చింది? కుటుంబపాలనతో కాదా? డీఎంకే ది కుటుంబపాలన కాదా? తన తండ్రి ప్రభుత్వంలో ఒక మంత్రిగా స్టాలిన్ ఉన్నాడు. తన సొంత కష్టంతో తెలివితో ఆ పదవి వచ్చిందా? లేక కుటుంబపాలనతో వచ్చిందా?

స్టాలిన్ కామెంట్స్ ను అమిత్ షా, నిర్మలా సీతారామన్, హిమంత్ బిశ్వాస్ శర్మ వంటి నాయకులు త్రిప్పికొట్టారు. హిమంత్ బిశ్వాస్ శర్మ చాలా పరిపక్వ కామెంట్ ఇచ్చాడు. 'స్టాలిన్ అన్నాడు సరే. దీనికి రాహుల్ గాంధీ ఏమంటాడు? తమ పార్ట్ నర్ అయిన DMK వ్యాఖ్యలను కాంగ్రెస్ సమర్ధిస్తోందా? కాంగ్రెస్ అభిప్రాయం కూడా ఇదేనా?' అని సూటిగా ప్రశ్నించాడు. కాంగ్రెస్ నాయకులకు గొంతులో వెలక్కాయ అడ్డం పడింది. ఏం చెప్పాలో అర్ధం కాక నోళ్లు మూసుకున్నారు.

స్టాలిన్ చేసిన ఈ నీతిమాలిన కామెంట్స్ ను, తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై తీవ్రంగా తిప్పికొట్టాడు. DMK భావజాలమంతా పెరియార్ ఎక్కడనుంచి ఎరువు తెచ్చుకున్నాడో అతను స్పష్టంగా చెప్పాడు. అన్నామలై, కర్ణాటక కేడర్ కు చెందిన ఒక నిజాయితీపరుడైన  IPS ఆఫీసర్. అతను సర్వీస్ లో ఉన్నపుడు రాజకీయనాయకుల గుండెల్లో  సింహస్వప్నంగా నిద్రపోయాడు. స్టాలిన్ లాగా కుటుంబవారసత్వంతో స్టేజి ఎక్కి తెలిసీ తెలియకుండా వాగే మనిషి కాదు. చాలా నాలెడ్జి ఉన్నవాడు.

ఈ కాన్ఫరెన్స్ లో తమిళనాడు దేవాదాయ శాఖ మంత్రి శేఖర్ బాబు కూడా ఉన్నాడు. ఏమీ మాట్లాడకుండా ఆత్మగౌరవాన్ని అమ్ముకుని మౌనంగా కూర్చున్నాడు. ప్రమాణస్వీకార సమయంలో చేసిన ప్రమాణం గుర్తుందో లేదో?

తమిళనాడు కాంగ్రెస్ ప్రతినిధి లక్ష్మీ రామచంద్రన్ కూడా హిందూమతాన్ని విమర్శించింది. DMK ఎమ్మెల్యే నాగనాధన్, CPI(M) మదురై MP వెంకటేశన్, తిరుమావలన్ అనే ఇంకొక MP, మైనర్ వీరమణి అనే ఇంకొక యూట్యూబర్ వీళ్లంతా హిందూమతాన్ని తీవ్రపదజాలంతో స్టేజిపైనుండి విమర్శించారు. వీళ్లంతా మళ్ళీ హిందువులే.

సిగ్గులేని హిందువులంటే వీళ్ళే. పేర్లేమో హిందూ పేర్లు. కక్కేదేమో హిందూమతంపైన విషం. వీళ్లకు ఏమైనా సిగ్గుశరం ఉంటే ముందు ఆ పేర్లు మార్చుకుని అప్పుడు మాట్లాడాలి. అసలు వీళ్లకు హిందూమతమంటే ఏమి తెలుసని ఇలా వాగుతారో? డబ్బు కోసం పదవులకోసం కన్నతల్లిని ఇంతగా అమ్ముకోవాలా? ధూ !

అసలు ఇలాంటి కాన్ఫరెన్స్ లకు ఎలా పర్మిషన్ ఇస్తారు? ఈరోజు అధికారం చేతిలో ఉందని కళ్ళు నెత్తికెక్కి ఇలా మాట్లాడినవాళ్లు, ఎందరో నాయకులు దిక్కులేకుండా కాలగర్భంలో కలిసిపోయారు. ధర్మద్రోహం చేస్తే దాని ఫలితాలు చాలా ఘోరంగా ఉంటాయి. వెంటనే కనపడక పోవచ్చు. కానీ పడేటప్పుడు చాలా దారుణంగా ఉంటాయి.

అరబ్బులు, తుర్కులు, మొఘల్స్, నవాబులు ఎందరో 800 ఏళ్ళు ఇండియాను దోచుకున్నారు. ఆ తరువాత మిషనరీలు విషప్రచారం సాగిస్తున్నారు. కానీ వెయ్యేళ్ళుగా ప్రయత్నిస్తున్నా హిందూమతాన్ని వీళ్ళు ఏమీ కదిలించలేకపోతున్నారు. ఈ విషయాన్ని స్టాలిన్ వంటి వ్యక్తులు గుర్తుపెట్టుకోవాలి.

సూర్యచంద్రులున్నంతవరకూ సనాతన ధర్మం ఉంటుంది. నిన్నగాక మొన్న పుట్టిన మతాలు ఉంటాయి పోతాయి కానీ సనాతనధర్మం ఎక్కడికీ పోదు. హిందువులు చవటలై నోర్మూసుకుని కూచున్నా సరే, సనాతనధర్మం బ్రతికే ఉంటుంది.

ఉదయనిధి  స్టాలిన్ తనను తాను ఒక ప్రౌడ్ క్రిస్టియన్ అని చెప్పుకున్నాడు. ఒరిజినల్ స్టాలిన్ అసలు క్రిస్టియనే కాదు. అతనొక రష్యా కమ్యూనిస్ట్. కమ్యూనిస్ట్ లకు మతం ఉండకూడదు. ఉదయనిధి అంటే సూర్యుడు. హిందూమతం ఈయనను దేవునిగా పూజిస్తుంది. అంటే, హిందూ, కమ్యూనిస్ట్ సంకరపేరును పెట్టుకుని,  తన మూలాలని మర్చిపోయి, మూడోది అయిన క్రైస్తవమతంతో మమేకం చెందుతున్న స్టాలిన్ కు ఒక భావపరిపక్వత గాని, ఒక వ్యక్తిత్వ పరిశుద్ధత గాని ఉంటాయని అసలెలా ఆశించగలం?

అందుకే అన్నామలై అన్నాడు, 'మీ అమ్మగారు పొద్దున్న ఒక గుడిని, సాయంత్రం ఒక గుడిని సందర్శించి దేవుళ్ళకు మొక్కుకుంటూ ఉంటారు. మీరేమో హిందూమతాన్ని ఈ విధంగా విమర్శిస్తున్నారు, ముందు గుళ్లకు తిరగకుండా మీ అమ్మగారిని కట్టడి చేసుకుని తరువాత మాట్లాడండి' అని మీడియాలో ఓపెన్ గా అన్నాడు. కనీసం ఈ మాటకైనా సిగ్గుండాలి !

ఇంట్లో అందరూ గుళ్ళలో పూజలు చేస్తుంటారు. స్టేజీలపైన మాత్రం ఇలా మాట్లాడుతూ ఉంటారు. హిపోక్రసీ అంటే ఇదేనా లేక ఇంకేమైనా ఉంటుందా? ఇది ప్రజలను మోసం చేయడం కాదా?

Eradicate Sanatanam Conclave అనే పేరుతో కాన్ఫరెన్స్ పెట్టుకున్నారు. అదే విధంగా Eradicate Christianity అనో లేదా Eradicate Islam అనో ఈ దేశంలో కాన్ఫరెన్స్ లు పెట్టగలరా? దమ్ముందా? మరి హిందూమతానికి మాత్రమే ఎందుకిన్ని అవమానాలు? అది కూడా హిందూదేశంలో?

ఇది రాజ్యాంగకర్తల తప్పా? లేక దేశానికి స్వాతంత్య్రం తెచ్చిన సోకాల్డ్ మహాత్ముల తప్పా? లేక అతిస్వతంత్రం చేసిన తప్పా? లేక హిందువుల వెన్నెముక లేనితనమా? ఆలోచనాపరులు ఆలోచించాలి.

'క్రైస్తవం లెప్రసీ వంటిది', 'ఇస్లాం ఎయిడ్స్ వంటిది' అని ఏ హిందువూ నోరు జారి అనడు. హిందువులకు ఆ మాత్రం విచక్షణాజ్ఞానం ఉంటుంది. మరి వీళ్లెందుకు హిందూమతాన్ని ఈ విధంగా  నీచంగా దూషిస్తున్నారు? కనీసం ఎవరూ ఖండించడం లేదేంటి? ఎక్కడకి పోతున్నాం మనం?

I.N.D.I అలియన్స్ లో  వీళ్ళ పార్దనర్ అయిన కాంగ్రెస్ ఈ విషయాన్ని ఎందుకు ఖండించడం లేదు? అంటే కాంగ్రెస్ తనను తానొక హిందూవ్యతిరేక పార్టీ అని ఒప్పుకున్నట్టేనా? ఇలాంటి పార్టీలకు హిందువులు ఓట్లేసి గెలిపించి తమ గోతులు తామే ఇంకా తవ్వుకోవాలా?

ఆలోచించండి !

సౌత్ లో క్రైస్తవం, ఇస్లాం మతాలు చాపక్రింద నీరులా వ్యాపిస్తున్నాయి. హిందూమతం పైన విషాన్ని చిమ్ముతున్నాయి.  ఈ కాన్ఫరెన్స్ లాంటివే దీనికి రుజువులు. పల్లెపల్లెల్లో విషంలాగా వ్యాపిస్తున్న క్రైస్తవమే ఇంకో ఉదాహరణ. దేశంలో అల్లకల్లోలం రాకుండా ఉండాలంటే, సివిల్ వార్ రాకుండా ఉండాలంటే,  ఈ పరిస్థితులు మారాలి.

సౌత్ లోని నాలుగురాష్ట్రాలలో బీజేపీ అధికారంలోకి వచ్చినపుడే దేశం భద్రంగా ఉంటుంది. హిందువులారా ఇప్పటికైనా కళ్ళు తెరవండి. దేశద్రోహ పార్టీలకు ఓటెయ్యకండి. మీ పిల్లల భవిష్యత్తును నాశనం చెయ్యకండి.

ప్రస్తుతం దక్షిణాదిలో అన్నామలై వంటి నిజాయితీ కలిగిన దేశభక్తులు ఇంకా ఎంతోమంది రావాలి. వాస్తవాలు ప్రజలకు తెలియాలి. హిందూమతం ఎంత గొప్పదో అర్ధమయ్యేలా వివరించేవారు ఇంకా ఇంకా తయారు కావాలి. అప్పుడే ఇండియా అగ్రరాజ్యం అవుతుంది. దేశం కూడా అభివృద్ధి అవుతుంది. అందరి బ్రతుకులూ బాగుంటాయి.

లాంగ్ లివ్ అన్నామలై.

దగ్గరి భవిష్యత్తులో ఇతనిని తమిళనాడు ముఖ్యమంత్రిగా చూద్దాం.

ఎవరు దోమలో, ఏది కరోనానో అప్పుడు తెలుస్తుంది !

read more " సనాతన ధర్మాన్ని నిర్మూలిస్తారా? ఓకే ! కలలు కంటూ ఉండండి "