Spiritual ignorance is harder to break than ordinary ignorance

19, సెప్టెంబర్ 2023, మంగళవారం

మా క్రొత్త పుస్తకం 'శివ స్వరోదయ శాస్త్రము' విడుదల

అమెరికానుండి వచ్చిన తరువాత, ఆశ్రమ పనులలో పడి, గ్రంథరచనకు, ముఖ్యమైన విషయాలపైన వీడియోలు చేయడానికి అడ్డుకట్ట వేసి ఆరునెలలు అయింది. ప్రస్తుతం ఆశ్రమం పనులు ఒక కొలిక్కి వస్తున్నాయి. కనుక గ్రంథరచనను మళ్ళీ మొదలుపెట్టాను. అందుకోసం కొన్నినాళ్ళబట్టి జిల్లెళ్ళమూడిలో ఉంటూ ఈ గ్రంధమును పూర్తి గావించాను.

స్వరశాస్త్రం పైన గ్రంధాన్ని వ్రాయమని చాలామంది నన్ను గతంలో కోరారు. ప్రస్తుతం కూడా కోరుతున్నారు. అందువల్ల నా కలం నుండి వెలువడుతున్న 61 వ గ్రంధంగా ఈ గ్రంధాన్ని విడుదల చేస్తున్నాను.

ఇది నా అభిమాన టాపిక్స్ లో ఒకటి. చాలా చిన్నవయసులో ఈ సబ్జెక్ట్ ను నేను అధ్యయనం చేయడం జరిగింది. అప్పటినుండి ఇది నా అభిమాన విషయాలలో ఒకటిగా మారింది. దానికి కారణాలున్నాయి.

మార్షల్ ఆర్ట్స్ కు, శ్వాస సాధనకు, ప్రాణనిగ్రహానికి ఉన్న సంబంధము, స్వరశాస్త్రం పైన నాకున్న అభిమానాన్ని పెంచింది. జ్యోతిష్యశాస్త్రానికి స్వరశాస్త్రానికి ఉన్న సంబంధం ఆ అభిమానాన్ని ఇంకా ఎక్కువ చేసింది. కనుక, యోగశాస్త్రంలో ఇది కొర్ సబ్జెక్ట్ అని చెప్పవచ్చు.

ఈ గ్రంధం తంత్రసాహిత్యానికి చెందినది. మధ్యయుగాలలో ఈ గ్రంధము రచింపబడినప్పటికీ, దీనిలోని భావనలు, అభ్యాసములు అంతకుముందు ఎన్నో వేలఏండ్ల క్రిందటివి.

మనదేశంలో ముస్లిం దురాక్రమణ దారులు జరిపిన రాక్షస విధ్వంసకాండలో ఇటువంటి ఎన్నో వేలాది గ్రంధాలు నాశనమైనాయి. కోట్లాదిమంది హిందువులు, వేలాదిమంది గురువులు చంపబడ్డారు. గురుకులాలు, ఆశ్రమాలు, లైబ్రరీలు గోరీలదొడ్లుగా మార్చబడ్డాయి. ఆ అరాచక రాక్షస చర్యలనుండి బ్రతికి బట్టగట్టిన అమూల్యములైన గ్రంధాలలో ఇదీ ఒకటి.

ఈ గ్రంధం ఈనాడు మనకు లభిస్తూ ఉండటం మన అదృష్టమని చెప్పుకోవాలి. ఇన్నేళ్లకు దీనికి వ్యాఖ్యానమును వ్రాయగలగడం నా సుకృతమని భావిస్తున్నాను.

ఈ గ్రంధంలో చెప్పబడిన కొన్ని విధానములు నా సుదీర్ఘ ఉద్యోగపర్వంలో నన్ను ఎంతో ఆదుకున్నాయి. అవినీతితో నిండి, అడుగడుగునా నక్కలు తోడేళ్ళ వంటి మనుషులున్న రైల్వేవ్యవస్థలో, కులపిచ్చితో, వ్యక్తిగత దురహంకారాలతో నన్ను హింసపెట్టి నా రికార్డ్ పాడుచేయాలని చూచిన పై అధికారులతో వ్యవహరించేటపుడు ఈ స్వరశాస్త్ర విధానములను ఉపయోగించి సత్ఫలితములను పొందాను. 

అదేవిధంగా, చిన్నాపెద్దా అనారోగ్యములు కలిగినపుడు, కలుగబోతున్నపుడు, స్వరశాస్త్రమును ఉపయోగించి వాటిని తేలికగా నివారించుకోగలిగాను. 

కనుక ఇది నిత్యజీవితంలో ఆచరణాత్మకంగా ఎంతో ఉపయోగపడే శాస్త్రమని నేను అనుభవపూర్వకంగా చెప్పగలను.

ఈ గ్రంథరచనలో నాకు చేదోడువాదోడుగా సహకరించిన నా శ్రీమతి సరళాదేవికి, శిష్యురాళ్ళు శ్రీలలిత, అఖిలలకు, శిష్యులు ప్రవీణ్, శ్రీనివాస చావలి లకు నా ఆశీస్సులు.

మా 'పంచవటి ప్రచురణల' నుండి వచ్చిన మిగిలిన గ్రంధములను ఆదరించినట్లే దీనిని కూడా ఆదరిస్తారని భావిస్తున్నాను.

త్వరలో మా ఆశ్రమంలో జరుగబోయే రిట్రీట్స్ లో ఈ స్వరశాస్త్రము యొక్క ప్రాక్టికల్ ఉపయోగాలను నా శిష్యులకు ఆచరణాత్మకంగా నేర్పించడం జరుగుతుంది.