
ఇది ప్రేమవివాహం. ఆ తరువాత, పెద్దలు అంగీకరించిన వివాహం.
ఆశ్రమంలో నిరాడంబరంగా జరిగిన వివాహం.
కేవలం నలభైఅయిదు నిముషాలలో పెళ్లి అయిపోయింది.
మంత్రాలు లేవు. హంగులు లేవు. ఆర్భాటాలు లేవు. మేకప్పులు, వీడియోలు, ఫోటోషూట్ల అనైతికపోకడలు లేవు. ఎరువుతెచ్చుకున్న సంగీత్ లు, బారాత్ లు లేవు. మైకులగోల లేదు. అరుపులు, పిల్లలగోల, సంతమార్కెట్ లాంటి వాతావరణం, అహంకారధోరణులు, అలుగుళ్ళు, అరుచుకోవడాలు, కోపతాపాలు, వస్తువులు పోవడాలు, ఏడుపులు, పెడబొబ్బలు, గొడవలు, ఒళ్లలిసిపోయేలా, కళ్ళు తిరిగిపోయేలా కష్టపడిపోవడాలు, కట్నకానుకలు, పెట్టుపోతల గొడవలు, తొంభయి రకాల ఐటమ్స్ తో భోజనాలు, అందులో సగంపైన వృధాకావడం -- ఇవేవీ భూతద్దంతో వెతికినా ఎక్కడా లేవు.
మౌనంగా, నిశ్శబ్దంగా ఉన్న ఆహ్వానితులు.
మంద్రమైన సన్నాయి మేళం.
హడావుడీ, తొక్కిసలాటా లేని ఆహ్లాదమైన ఆశ్రమవాతావరణం.
చేస్తున్న తంతుకు అర్ధాన్ని తెలుసుకుంటూ అరగంటలో అయిపోయిన పెళ్లి.
అది - పంచవటి నేర్పిన సంస్కారం.
అసలైన సనాతన హిందూధర్మ జీవనవిధానం.
మంత్రాలు లేకపోవచ్చు. కానీ, వాటి అర్ధాలను వివరించడం జరిగింది.
విసుగుపుట్టే తంతులు లేకపోవచ్చు. కానీ, హిందూధార్మిక వివాహంలోని ముఖ్యఘట్టాలన్నీ ఉన్నాయి.
ఉదయం 11.30 కి కార్యక్రమం మొదలైతే, మధ్యాన్నం 1.30 గంటకి ఉపనయనం, పెళ్లి, భోజనాలు అన్నీ అయిపోయి, అతిధులు తిరిగి బయలుదేరడం కూడా జరిగిపోయింది.
ఇదే అసలైన 'ఎలైట్ మేరేజి' అని మావాళ్లతో అన్నాను.
ఎలైట్ అంటే, కులీన, ఉన్నతవర్గానికి చెందిన అని అర్ధాలున్నాయి. 'క్లాస్' అని అర్ధం చెప్పుకోవచ్చు.
పంచవటి శిష్యులందరూ ఈ చీకటిప్రపంచంలో వెలుగుతున్న దీపాలవంటివారు. అంటే లైట్లన్నమాట.
మనలో 'లైట్' ఉన్నపుడు, మనచుట్టూ 'ఎలైట్' లేకుండా ఎలా ఉంటుంది?
ఈ లైటూ, ఎలైటూ, కులంతో, డబ్బుతో, అధికారంతో, హోదాతో, దర్పంతో వచ్చేవి కావు.
ఉన్నతమైన సంస్కారపు విలువలతో, ధర్మబద్ధమైన ఆధ్యాత్మిక జీవనంతో వస్తాయి.
ఇది కులాంతర వివాహం.
'మేము గుణానికి మాత్రమే విలువనిస్తాము. కులానికి కాదు' అని నేను ఎన్నోఏళ్లుగా చెబుతున్నదానికి ఋజువే ఈ వివాహం.
'మేము ఊరకే మాటలను చెప్పము. చెప్పినది చేసి చూపిస్తాము' అనడానికి కూడా ఇదే నిదర్శనం.
పంచవటిలో అన్నికులాలూ ఉన్నాయి. పేదలనుంచి, కోటీశ్వరులవరకూ అన్ని తరగతులవారూ, వర్గాలవారూ ఉన్నారు. కానీ మేమంతా ఒకే కుటుంబం.
దానిపేరు 'పంచవటి' కుటుంబం.
ఇక్కడ అసలైన ఆధ్యాత్మికత ఆచరణాత్మకంగా దర్శనమిస్తుంది.
ఎంతోమంది సంస్కర్తల, మహనీయుల భావాలు ఇక్కడ కార్యరూపం దాలుస్తాయి.
ప్రపంచపు వెకిలితనానికి భిన్నమైన ఉదాత్తమైన, ఉన్నతమైన, సంస్కారపూరితమైన జీవనవిధానం ఇక్కడ అడుగడుగునా కనిపిస్తుంది.
అందుకే అంటున్నాను ఇది 'ఎలైట్ మేరేజ్' అని.
'వర్గం లేనిదే స్వర్గం' అని జిల్లెళ్ళమూడి అమ్మగారన్నారు.
'భక్తేర్ జోతి నోయ్' (భక్తులలో కులం ఉండదు) అని శ్రీరామకృష్ణులన్నారు.
దానిని నిజం చేసి చూపిస్తున్నాం.
స్వర్గాన్ని భూమిపైన ఆవిష్కరించే ప్రయత్నాన్ని చేస్తున్నాం.
ఇటువంటి కార్యక్రమాలు భవిష్యత్తులో ఇంకా ఎన్నో ఇక్కడ జరగాలని, ఎంతోమంది జీవితాలలో అవి 'లైట్' ను నింపాలని ఈ సందర్భంగా ఆశిస్తూ, ఈ 'ఎలైట్ మేరేజి' లో పాలుపంచుకున్న అందరికీ, ముఖ్యంగా లండన్, దుబాయ్, అమెరికాల నుండి వచ్చి మరీ ఈ వివాహంలో పాలుపంచుకున్నవారికి, రాగలిగినవారికి, రాలేకపోయినవారికి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అందరు పంచవటిశిష్యులకు ఈ సందర్భంగా నా ఆశీస్సులందిస్తున్నాను.
అర్ధంలేని ప్రహసనాలుగా నడుస్తున్న నేటి పెళ్లిళ్లన్నీ ఈ 'ఎలైట్ మేరేజి' ని చూచి ఎంతో నేర్చుకోవాల్సిన అవసరం ఉంది.