వజ్రయాన బౌద్ధంలో చాలామంది ప్రముఖ గురువులున్నప్పటికీ వారిలో ముగ్గురి పేర్లు ప్రముఖంగా మనకు కనిపిస్తూ ఉంటాయి. వారు ఇంద్రభూతి మహారాజు, ఆయన చెల్లెలు లక్ష్మీంకర, ఆయన కుమారుడు పద్మసంభవుడు.
|
Maha Siddha King Indrabhuti |
ఇంద్రభూతి అనేవాడు రాజేగాక తాంత్రిక సిద్ధుడు కూడా. ఈయన అస్సాం ప్రాంతంలో క్రీ.శ. 700-800 మధ్యలో రాజ్యం ఏలాడు. ఈయన వజ్రయోగిని/చిన్నమస్తా ఉపాసన చేసినట్లు ఆధారాలున్నాయి. ఈయన 'జ్ఞానసిద్ధి' అనే తంత్రగ్రంధం వ్రాశాడు. రాజులలో ఈయన జనకమహారాజు వంటివాడు. రాజ్యం చేస్తూ కూడా ఈయన సాధన గావించి సిద్ధిని పొందాడు.
ఈయన చెల్లెలు లక్ష్మీంకర. ఈమెకు శ్రీమతి అని కూడా పేరుంది. ఈమె చిన్నముండావజ్రవారాహి సాధనలో నిష్ణాతురాలని తెలుస్తున్నది. ఈమె బోధలు ఇండియానుంచి నేపాల్, టిబెట్ లకు విస్తరించాయి. మహాసిద్దులలో ఈమె కూడా ఒకరు. 84 మహాసిద్ధులలో నలుగురు స్త్రీలున్నారు. వాళ్ళు లక్ష్మీంకర, మేఖల, కనఖల, మణిభద్ర.
చిన్నముండా వజ్రవారాహి సాధనను మహాసిద్దురాలు లక్ష్మీంకర తన శిష్యులకు ఉపదేశించింది. ఈమె జీవితం సాధకులకు ఎంతో ఉత్తేజకరంగా ఉంటుంది. అందుకే ఆమె జీవితాన్ని క్లుప్తంగా ఇక్కడ ఇస్తున్నాను.
|
Maha Siddha Lakshminkara |
లక్ష్మీంకర రాజకుటుంబానికి చెందిన వనిత. ఈమె ఇంద్రభూతి మహారాజు చెల్లెలు. చిన్ననాటి నుంచీ ఆధ్యాత్మిక భావాలతో ఉండేది.ఎంతో అల్లారుముద్దుగా పెంచబడింది. ఈమెకు పక్క దేశపు రాజైన జలంధరుని కుమారునితో వివాహం నిశ్చయం అయింది. అయితే, ఇంద్రభూతి బౌద్ధుడు. జాలంధరుడు హిందువు. అత్తగారింటికి ఎన్నో బహుమతులతో ఎంతో బలగంతో వెళ్ళిన లక్ష్మీంకర ఆ ఊరికి అనుకున్న దానికంటే కొన్ని రోజులు ఆలస్యంగా చేరుకుంది. ఆ రోజు మంచిరోజు కాదని రాజజ్యోతిష్కులు చెప్పడంతో మర్నాడు రాజప్రాసాదంలోకి అడుగుపెడదామని అనుకుని వారందరూ కోట బయటే మకాం చేశారు.
ఉన్నట్టుండి వారు కోలాహలంగా వస్తున్న ఒక పెద్ద సైన్యాన్ని చూచారు. ఆ సైన్యం - యువరాజు (ఈమెకు కాబోయే భర్త) తో బాటు వేటకు వెళ్లి నానా జంతువులనూ వేటాడి తిరిగి వస్తున్న గుంపు. తను చంపిన జంతువును నిర్లక్ష్యంగా భుజాన వేసుకుని రక్తం ఓడుతూ గర్వంగా వస్తున్న తనకు కాబోయే భర్తను చూచి ఆమె భరించలేకపోయింది. సున్నితమైన ఆమె మనస్సు ఇలాంటి క్రూరాత్ములైన దురహంకార రాజుల కుటుంబంలో కోడలు కావడం తట్టుకోలేకపోయింది. వేటకు వెళ్లి నానా జంతువులను చంపి తెచ్చి వాటిని వండుకుని తినడమూ, కరుణ, దయ, ధ్యానసాధన మొదలైన మంచి లక్షణాలు ఏవీ లేని ఆ రాజునీ అతని కొడుకునీ చూచి ఆమె సున్నిత హృదయం తట్టుకోలేక పోయింది. ఆధ్యాత్మికత అంటే ఏమాత్రమూ తెలియని ఇటువంటి కుటుంబానికి కోడలుగా వచ్చినందుకు ఆమె మానసికంగా చాలా నలిగిపోయింది.
అక్కడికక్కడే ఆమె ఒక కఠోరనిర్ణయం తీసుకుంది. వెంటనే తను తెచ్చిన వజ్ర వైడూర్యాల పెట్టెలన్నీ తెరిపించి అక్కడ చేరిన ప్రజలకు ఆ సంపదనంతా పంచి పెట్టేసింది. తన నగలన్నీ తన చెలికత్తెలకు ఇచ్చేసింది. తనతో వచ్చిన వారినందరినీ వెనక్కు పంపేసింది.
మర్నాడు, ఆమెను రాజభవనంలోకి ఆహ్వానించారు. ఏ మందీ మార్బలమూ లేకుండా ఒక్కతే లోపలకు వెళ్ళిన ఆమె తన గదికి లోపల గడియ పెట్టుకుని ఎవరితోనూ పలక్కుండా వింతగా పిచ్చిదానిలా ప్రవర్తించసాగింది. దగ్గరకు వచ్చిన వాళ్ళమీద వస్తువులు విసిరేసి, జుట్టు విరబోసుకుని, బట్టలు చించేసుకుని, ఒంటికి దుమ్మూ బురదా పూసుకుని పిచ్చిగా మాట్లాడుతూ నిజంగానే 'పిచ్చిది' అని ముద్ర వేయించుకుంది. ఈ గోలంతా చూచి కాబోయే భర్త ' ఈ పిచ్చిది నాకొద్దు' అని పెళ్లిని రద్దు చేశాడు. సరిగ్గా ఈమెకు కావలసింది కూడా అదే !!
ఆ పెళ్లి పెటాకులైనందుకు లక్ష్మీంకర సంతోషంతో ఉప్పొంగిపోయింది. ఒకరోజున రాత్రి బుద్ధునివలె అకస్మాత్తుగా రాజభవనాన్ని వదిలేసి బయటకొచ్చిన ఈమె, పిచ్చిదానిలా నటిస్తూ ఊరిబైట ఒక స్మశానంలో నివశించసాగింది. ఒక రాణిగా రాజభోగాలను అనుభవించే అవకాశం వచ్చినా దానిని త్రోసిపారేసి జ్ఞానసిద్ధి కోసం అలాంటి కఠోరమైన నిర్ణయం తీసుకుంది. అదికూడా ఈ సంఘటన జరిగినది వెయ్యి సంవత్సరాల క్రితం రాజరిక సమాజంలోనన్న విషయం గుర్తుంచుకోవాలి !! ఇదెంత గొప్ప త్యాగమో ఒక్కసారి ఆలోచించండి !!
సరే రాణి పదవిని తృణప్రాయంగా త్యజించి శ్మశానంలో నివాసం ఏర్పాటు చేసుకుంది. పిచ్చిదానికి, అందులోనూ శ్మశానంలో ఉండేదానికి తిండి ఎవరు పెడతారు? అందుకని, కుక్కలకు వేసిన ఆహారాన్ని ఆ కుక్కలతో కలసి తినసాగింది.
|
Maha Siddha Kambala |
ఆ సమయంలో ఈమెను చూచిన ఒక మహాసిద్ధుడు ఈమెకు దీక్షను అనుగ్రహించి సాధనామార్గాన్ని ఉపదేశించాడు. అతని పేరు మహాసిద్ధ కంబళుడు. ఇతనికి లవపాదుడు అనే పేరు కూడా ఉంది. ఇతను ఒక కంబలి మాత్రమె కట్టుకుని ఒక గుహలో ఉంటూ సాధన చేసేవాడు. ఇతని చరిత్ర కూడా చాలా అద్భుతమైనది. ఇతనే 'స్వప్నసాధన' కు ఆద్యుడు. ఈయననుంచి ఈ సాధనను టిబెటన్ గురువైన తిలోపా నేర్చుకున్నాడు.
ఆ రకంగా శ్మశానంలో ఉంటూ కుక్కలతో కలసి పారేసిన తిండి తింటూ ఎడతెగని సాధనను ఏడేళ్ళపాటు ఈమె కొనసాగించి తంత్రసిద్ధిని పొంది మహాసిద్ధులలో ఒకరుగా స్థానం సంపాదించింది.అందుకే మహాసిద్ధులలో ఒకరైనప్పటికీ ఈమెకు 'పిచ్చిరాణి' అని పేరుంది. ఈమె జీవితం బుద్ధుని జీవితానికి ఏమీ తీసిపోదు. అంతటి త్యాగమూర్తి ఈమె.
ఈమె ఆ విధంగా స్మశానంలో ఉంటూ సాధన చేసిన ఏడేళ్ళూ ఈమెను తరచుగా దర్శిస్తూ సేవ చేస్తూ దుఖండి అనే ఒకతను నమ్మకంగా ఉండేవాడు. అతను రాజభవనంలో పాకీవాడు. ఈమె మొదటి శిష్యుడు అతడే. కాలక్రమేణా అతనూ సాధన గావించి మహాసిద్దులలో ఒకడైనాడు.
ఈమె ఉపదేశాల నుంచి ఒక మచ్చు తునక.
నీ తలను ఒక వెన్న ముద్దపైన ఉంచి దానిని నరికి పారెయ్
ఆ తర్వాత గొడ్డలిని కూడా ధ్వంసం చెయ్
ఆ తర్వాత పిచ్చిగా నవ్వు
కప్ప ఏనుగును మ్రింగుతుంది చూడు
ఓ మేఖలా ! ఇది చాలా ఆశ్చర్యకరమైన సాధన
నీకింకా అర్ధం కాలేదా?
నీ ఆలోచనలను తీసి పక్కన పెట్టు
నా గురువు నాకేమీ చెప్పలేదు
నేనేమీ నేర్చుకోలేదు
కానీ ఆకాశంలో పూలు వికసించాయి
ఓ మేఖలా ! ఇది చాలా ఆశ్చర్యకరమైన సాధన
నీకింకా అర్ధం కాలేదా?
నీ సందేహాలను విసరి అవతల పారెయ్
ఈమె ఎప్పుడైతే సిద్ధిని పొంది అతీత శక్తులను ప్రదర్శించడం సాగించిందో అప్పుడు లోకం ఈమెకు పాదాక్రాంతమై ఈమెను గౌరవించసాగింది. పిచ్చిలోకానికి మహిమలే కదా కావలసింది ! 'ఈ పిచ్చిది నాకొద్దు' అని తిరస్కరించిన రాజు కూడా చివరకు ఈమె నివసిస్తున్న కొండ గుహకు వచ్చి, తనను శిష్యునిగా స్వీకరించమని ప్రార్ధిస్తూ దీక్షకోసం ఈమెను అర్ధించాడు. కానీ ఈమె అతన్ని చాలాకాలం పాటు నమ్మలేదు. పరీక్షిస్తూ వచ్చింది. చివరకు అతని నిజాయితీని మెచ్చుకుని 'నీ గురువు నేను కాదు. అతను నీ దగ్గరే ఉన్నాడు. అతను నీకు దీక్ష ఇస్తాడు. స్వీకరించి సాధన చెయ్యమని చెప్పింది.' నాదగ్గరే ఉన్నాడా? ఎవరతను?' అని ఆశ్చర్యపోయిన ఆ రాజుకి ' అతను ఎవరో కాదు. దుఖండి అనే పేరుతో నీ లెట్రిన్ క్లీన్ చేస్తున్న పాకీవాడే నీ గురువు' అని చెప్పి అతని చేత రాజుకు దీక్ష ఇప్పించింది. ఆ రోజులలో ఇలాంటి విప్లవాత్మకములైన పనులను చెయ్యడం ఎంత అసాధ్యమో ఒక్కసారి ఆలోచించండి. నేటి సో కాల్డ్ సంఘసంస్కర్తలు ఇలాంటి జీవితాలను చదివి సిగ్గుతో తలలు దించుకోవాలేమో !
ఈమె జీవితానికీ దాదాపు అదే కాలానికి చెందిన శైవయోగిని అక్కమహాదేవి జీవితానికీ పోలికలున్నాయి.
ఈమె శిష్యుడు విరూపుడు. ఇతను 'చిన్నముండా సాధన నామ' అనే తంత్ర గ్రంధం వ్రాశాడు. ఇతని నుంచి ఈ సాధన టిబెట్ కు పాకింది.
కులవ్యవస్థను పెంచి పోషించినది అగ్రవర్ణాలైన రాజులూ బ్రాహ్మణులూ అని కులవిషం తలకెక్కిన మనుషులు నేడు ఇష్టం వచ్చినట్లు తెలిసీ తెలియని మాటలు మాట్లాడుతున్నారు. తంత్ర/ పురాణ యుగంలో కులవ్యవస్థను బ్రేక్ చేసిన వాళ్ళు రాజులూ బ్రాహ్మణులే. అయితే వీరి భావాలు లౌకికమైనవి కావు. ఆధ్యాత్మిక కోణంలో దీనిని వాళ్ళు బ్రేక్ చేశారు. నిజమైన తపనా, జిజ్ఞాసా ఉన్న వారికి కులంతో పనిలేకుండా ఆయా మహాసిద్ధులూ గురువులూ దీక్షలిచ్చారు. సాధన చేయించారు. వారిని కూడా తమంతటి మహాసిద్దులుగా గురువులుగా మార్చారు. ఈ విషయాలు నేటి కులపిచ్చి గాళ్ళకు ఏమాత్రం తెలియవు. వారు చరిత్రను తెలుసుకోవలసిన అవసరం ఉన్నది. అందుకే దీనిని ఇంత వివరంగా వ్రాస్తున్నాను.
'భక్తేర్ జోతి నోయ్' అని శ్రీ రామకృష్ణులు తరచుగా అనేవారు. 'సాధకులలో కులం లేదు' అని దీని అర్ధం. అయితే దీనిని నేటి ఆయన భక్తులే పాటించడం లేదు. అది వేరే విషయం అనుకోండి.
పోయినేడాది మా అబ్బాయికి పెళ్లి సంబంధం చూద్దామని, నేను ఒక వ్యక్తిని కలిశాను. ఆయనా రామకృష్ణుల భక్తుడే. వాళ్ళ అమ్మాయికి సంబంధాలు చూస్తున్నారో లేదో అడుగుదామని ఆయన్ను కదిలించాను. వాళ్ళూ రామకృష్ణుల భక్తులన్న ఒక్క విషయమే నేనాయన్ని అప్రోచ్ కావడానికి గల ఒకే ఒక్క కారణం. స్టేటస్ ను కూడా పక్కన పెట్టి నేనా పని చేశాను. కానీ ఆయనిలా అన్నాడు - ' మేము వైదీకులము. మీ నియోగులలో మేం సంబంధం చేసుకోము.' నాకు మతిపోయినంత పనైంది. ఆయనతో ఇలా చెప్పాను - 'మీరు రామకృష్ణుల భక్తుడినని చెప్పుకోవడం సిగ్గుచేటు'. 'భక్తేర్ జోతి నోయ్' అని ఆయన బోధ. మరి మీరేమో బ్రాహ్మణులలోనే ఇంకొక శాఖతో సంబంధం కలుపుకోమని అంటున్నారు. మీ హృదయం ఇంత సంకుచితమని తెలీక మిమ్మల్ని ఈ విషయం కదిపినందుకు నేను సిగ్గుపడుతున్నాను. సారీ ! ఇప్పుడు మీరడిగినా సరే, మీ సంబంధాన్ని నేనే ఒప్పుకోను'.
తెల్లనివన్నీ పాలని అమాయకంగా మనం అనుకుంటాము. కానీ అవి నీళ్ళు కూడా కాదనీ, పాల రూపంలో ఉన్న ఫినాయిలనీ మనకు తరచుగా తెలుస్తూ ఉంటుంది. ఫినాయిలు కూడా తెల్లగానే ఉంటుంది కదా మరి !! భక్తులమని బడాయిలు చెప్పుకునే వారి నిజస్వరూపాలు ఇలా ఉంటాయి. వారి భక్తి, మాటల వరకేగాని, చేతలలోకి రాదు. ఇలాంటి భక్తి ఆ పేరుకు తగదు. దీనిని నేనస్సలు ఒప్పుకోను.
ఈరోజుల్లో దీక్షలిచ్చే గురువులూ వాటిని స్వీకరించే శిష్యులూ కుప్పలు తెప్పలుగా ఉంటున్నారు. కానీ వీరిలో ఎవరూ కూడా ఈ మహాసిద్ధుల స్థాయికి కనుచూపు మేరలో కూడా చేరుకోలేకపోతున్నారు.కారణం ఏమిటి? కారణం ఒకటే. నేటి మనుషులలో నిజాయితీ లేదు. శ్రద్ధ లేదు. నమ్మకం లేదు. మనసులో ఏవేవో ఆలోచనలు కోరికలు పెట్టుకుని ఇలాంటి వేషాలు వెయ్యబోతారు. అందుకే వీరికి ఆ స్థాయి రావడం లేదు.
నిజమైన జ్ఞానాన్నీ, సిద్ధినీ పొందాలంటే ఎంత కష్టపడాలో లక్ష్మీంకర వంటి మహాసిద్ధుల జీవితాలు మనకు నిరూపిస్తాయి. మనింట్లో మనం ఉంటూ హాయిగా సినిమాలు షికార్లు తిరుగుతూ ఎప్పుడో ఏమీ తోచనప్పుడు కాసేపు ధ్యానం అంటూ కళ్ళు మూసుకుని, అయిదు నిముషాలకంటే కూచోలేక లేచిపోయి - ' గురువుగారూ నాకు ఆలోచనలు కంట్రోల్ కావడం లేదు. నాకు మోకాళ్ళు నెప్పిగా ఉన్నాయి. నాకు నడుము నెప్పి పుడుతోంది.' అని నంగినంగిగా మాట్లాడే వారికి ఎన్ని జన్మలకి సిద్ధి కలిగేను?
చక్కని ఉపదేశం ఇచ్చినా సాధన చెయ్యకుండా ఏవేవో కాకమ్మ కబుర్లూ కుంటిసాకులూ చెబుతూ కాలక్షేపం చేస్తూ, నానారకాల గ్రూపు రాజకీయాలు చెయ్యాలని చూసేవారికి సిద్ధి ఎలా వస్తుందో? ఇలాంటి వాళ్ళు లక్ష్మీంకర వంటి మహనీయుల జీవితాలను ప్రతిరోజూ పొద్దున్నే పారాయణం చేస్తేనైనా వారికి బుద్ధి వచ్చి, సాధన అంటే ఎంత కష్టపడాలో, ఎన్నింటిని తమంతట తాము వదులుకోవాలో తెలుస్తుందో లేదో మరి??
(ఇంకా ఉంది)