“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

21, ఆగస్టు 2017, సోమవారం

రాహుకేతువుల రాశి మార్పు - ఫలితాలు

19-8-2017 న రాహుకేతువులు రాశులు మారారు. ఇప్పటిదాకా రాహువు సింహంలో ఉన్నాడు. ఇప్పుడు కర్కాటకంలోకి వచ్చాడు. కేతువు కుంభంలో నుంచి మకరంలోకి వచ్చాడు. ఈ మార్పు జరిగిన మూడు రోజులకే సూర్యగ్రహణం (ఈరోజు) వచ్చింది. సరిగ్గా రాహుకేతువుల మార్పు జరిగిన రోజే ఉత్కల ఎక్స్ ప్రెస్ ప్రమాదం జరిగింది. ఇవన్నీ కాకతాళీయాలని తెలియని వాళ్ళు నమ్మితే నమ్మవచ్చు గాక. కానీ నేనలా నమ్మను. మేజర్ గ్రహాలైన శని, గురువు, రాహుకేతువులూ రాశులు మారేటప్పుడు ఖచ్చితమైన మార్పులు మానవ జీవితంలో కనిపిస్తాయి. దీనిని నేను ఎన్నో వందలసార్లు గమనించాను. మీరు కూడా గమనించండి. మొన్న 19 తేదీనుంచి మీమీ జీవితాలలో కూడా మార్పులు వచ్చే ఉంటాయి. లేదా వస్తూ ఉంటాయి. చూచుకోండి.

రాశులు మారిన ఈ రాహుకేతువులు ఈ రాశులలో ఒకటిన్నర ఏడాది పాటు అంటే ఫిబ్రవరి 2019 వరకూ ఉంటాయి. ఈలోపల ఇవి ఏయే ఫలితాలను ఇస్తాయో గమనిద్దాం.

మేషరాశి

ఉన్నట్టుండి మానసికంగా ఎనర్జీ పెరుగుతుంది. కొందరికైతే వారి వారి జాతకాలను బట్టి మనస్సు అల్లకల్లోలం అవుతుంది. కోపం పెరుగుతుంది. క్రూరత్వం పెరుగుతుంది. ఎక్సర్ సైజులు మొదలైనవి చేస్తారు. జిమ్ కు వెళతారు. ఇంకొందరికి కుటుంబాలలో రకరకాల మార్పులు గొడవలు మొదలౌతాయి.

వృషభరాశి

విపరీతమైన ధైర్యం పెరుగుతుంది. మాట దూకుడు ఎక్కువౌతుంది. కమ్యూనికేషన్ పరిధి పెరుగుతుంది. ఎక్కువైన ఎనర్జీతో కుటుంబ సభ్యులతో గొడవలు పెట్టుకుంటారు. పూర్వకర్మ వేగంగా తగ్గడం మొదలౌతుంది.

మిధునరాశి

కంటిరోగాలు బాధిస్తాయి. మాట దురుసు పెరుగుతుంది. దానివల్ల గొడవలు వస్తాయి. ఇంటిలో పరిస్థితులు విషమిస్తాయి.

కర్కాటక రాశి

మనస్సు పరిపరివిధాలుగా పోతుంది. కంట్రోల్ ఉండదు. దగ్గరివారితో కూడా పెడసరంగా మాట్లాడతారు. దానివల్ల మానవ సంబంధాలు దెబ్బతింటాయి.

సింహరాశి

దీర్ఘరోగాలు తలెత్తుతాయి. ఆస్పత్రి పాలౌతారు. లేదా సందర్శిస్తారు. ఎక్కువమంది డాక్టర్ల చుట్టూ తిరుగుతారు. లేదా రాంగ్ ట్రీట్మెంట్ కు గురౌతారు.

కన్యారాశి

ఉన్నట్టుండి జీవితంలో వెలుగు కనిపిస్తుంది. అప్పటిదాకా దూరం పెట్టినవారు ప్రేమగా చూడటం మొదలు పెడతారు. అనుకున్న పనులన్నీ చకచకా కదులుతాయి. అనుకోకుండా సహాయాలు అందుతాయి. అయితే ఆరోగ్య సమస్యలు కూడా కొత్తవి తలెత్తి బాధించడం మొదలు పెడతాయి.

తులారాశి

అధికారం దర్పం ఎక్కువౌతాయి. మానవ సంబంధాలు విస్తరిస్తాయి. గర్వంతో ఇతరులకు హాని చేస్తారు. ఆ తరువాత చింతిస్తారు. ఇంటిలో చింతలు, ఆలస్యాలు ఎక్కువౌతాయి. మనస్సు డిప్రెషన్ లో పడుతుంది.

వృశ్చిక రాశి

తన చేతిలో ఏదీ ఉండదు. ఏదో శక్తి నడిపిస్తున్నట్లు అన్నీ తోసుకుని వస్తుంటాయి. మాటలో జంకు పెరుగుతుంది. అయితే మనసులో క్లారిటీ ఎక్కువౌతుంది. దేవాలయాలని, పుణ్యక్షేత్రాలని, గురువులని తిరుగుతారు. పూర్వకర్మ వేగంగా అనుభవానికి వస్తుంది.

ధనూరాశి

కష్టాలు పెరుగుతాయి. ఆస్పత్రి ఖర్చులు ఎక్కువౌతాయి. రోగాలు బాధిస్తాయి. మానసిక చింత పెరుగుతుంది. అయితే వృత్తిపరంగా మంచి సపోర్ట్ ఉంటుంది. దానితో అన్నింటినీ సమర్ధించుకోగలుగుతారు.

మకరరాశి

ఎనర్జీ లెవల్స్ ఉన్నట్టుండి పెరుగుతాయి. మానవ సంబంధాలు ఎక్కువౌతాయి. అయితే ఇతరుల నుంచి వత్తిళ్ళు, నష్టాలు కూడా కలుగుతాయి. ఆకస్మాత్తు ఖర్చులు కూడా పెరుగుతాయి.

కుంభరాశి

ఏడాదిన్నరగా బాధపెడుతున్న పరిస్థితులు క్లియర్ అయిపోతాయి. అనారోగ్యాలు తగ్గుముఖం పడతాయి. శత్రువులు అదుపులోకి వస్తారు. ఆధ్యాత్మిక చింతన ఎక్కువౌతుంది. ఖర్చులు పెరుగుతాయి.

మీనరాశి

ఆధ్యాత్మిక చింతన ఒక్కసారిగా ఊపందుకుంటుంది. స్నేహితులు పెరుగుతారు. అకస్మాత్తు లాభాలు కలుగుతాయి. మంత్ర తంత్ర సాధనలు లాభిస్తాయి. మేధోపరమైన కార్యక్రమాలు ఎక్కువౌతాయి.

ఇవి ప్రస్తుతపు సూచనలు మాత్రమే. వచ్చే నెలలో 12-9-2017 న గురువుగారి రాశిమార్పుతో మళ్ళీ అందరి జీవితాలలో మార్పులు సంభవిస్తాయి. అప్పుడు ఎలాగూ మళ్ళీ వాటిని సూచిస్తాను. అంతవరకూ ఇవి చదువుకోండి.